Sri Naradapuranam-I    Chapters    Last Page

అథ పంచమోధ్యాయః అయిదవ అధ్యాయము

మార్కండేయ వర్ణనమ్‌

నారద ఉవాచ:-

బ్రహ్మన్కథం స భగవాన్‌ మృకండోః పుత్రతాం గతః, కిం చకార చ తద్బ్రూహి హరిర్భార్గవవంశజః. 1

శ్రూయతే చ పురాణషు మార్కండేయో మహామునిః, అపశ్యద్వైష్ణవీం మాయాం చిరంజీవ్యస్య సంప్లవే. 2

నారదుడు పలికెను:- ఓ బ్రహ్మణోత్తమా! భగవానుడగు శ్రీమన్నారాయణుడు మృకండు మహర్షికి ఎట్లు పుత్రుడాయెను? భార్గవ వంశమున పుట్టిన శ్రీహరి ఏమి చేసెను? ఈ విషయమునంతటిని నాకు తెలుపుము. చిరంజీవియగు మార్కండే మహాముని ప్రళయకాలమున శ్రీమహావిష్ణు మాయను చూచెనని పురాణములలో వినబడుచున్నది. 1, 2

సనక ఉవాచ :-

శృణు నారద వక్ష్యామి కథామేతాం సనాతనమ్‌, విష్ణుభక్తిసమాయుక్తాం మార్కండేయమునిం ప్రతి. 3

తపసోన్తే మృకండుస్తు భార్యాముద్వాహ్య సత్తమః గార్హ్యస్థమకరోద్ధృష్టః శాన్తో దాన్తః కృతార్థకః. 4

తస్య భార్యా శుచిర్దక్షా నిత్యం పతిపరాయణా, మనసా వచసా చాపి దేహేన చ పతివ్రతా. 5

కాలే దధార సా గర్భం హరితేజో ంశసంభవమ్‌ , సుషువే దశమాసాన్తే పుత్రం తేజస్వినం పరమ్‌. 6

స ఋషిః పరమప్రీతో దృష్ట్వా పుత్రం సులక్షణమ్‌, జాతకం కారయామాస మంగళం విధిపూర్వకమ్‌. 7

స బాలో వవృధే తత్ర శుక్లపక్ష ఇవోడుపః, తతస్తు పంచమే వర్షే ఉపనీయ ముదాన్వితః. 8

శిక్షాం చకార విప్రేన్ద్ర వైదికీం ధర్మసంహితామ్‌, నమస్కార్యా ద్విజాః పుత్ర సదా దృష్ట్వా విధానతః. 9

త్రికాలం సూర్యమభ్యర్చ్య పలిలాంజలిదానతః, వైదికం కర్మ కర్తవ్యం వేదాధ్యయనపూర్వకమ్‌. 10

బ్రహ్మచర్యేణ తపసా పూజనీయో హరిస్సదా, నిషిద్దం వర్జనీయం స్యాద్దుష్టసంభాషణాదికమ్‌. 11

సాధుభిస్సహ వస్తవ్యం విష్ణుభక్తిపరైస్సదా, న ద్వేషః కస్యచిత్కార్యం స్సర్వేషాం హితమాచరేత్‌. 12

ఇజ్యాద్యయనదానాని సదా కార్యాణి తే సుత !ఏవం పిత్రా సమాదిష్టో మార్కండేయో మునీశ్వరః. 13

సనకమహర్షి పలికెను:- ఓ నారదమహర్షీ !విష్ణుభక్తితో కూడినది సనాతనమైనది అయిన మార్కండేయ మహర్షి కథను చెప్పెదను వినుము. మృకండుమహర్షి తపస్సు పూర్తిచేసి వివాహము చేసుకొని శాంతుడై దాంతుడై కృతార్థతనొంది గృహస్థాశ్రమము నాశ్రయించి ఉండెను. మృకండు మహర్షి భార్య పరమ పవిత్రురాలు, సమర్థురాలు; ఎపుడూ పతిభక్తి కలిగియుండెను. కర్మతో మనస్సుతో మాటతో త్రికరణశుద్ధిగా భర్తను సేవించు పరమ పతివ్రత. సరి అయిన సమయమున మృకండు మహర్షి భార్య హరితేజోవంశమును కలిగించు గర్భమును ధరించెను. పదినెలలు గడచిన తరువాత పరమ తేజస్వియగు పుత్రుని ప్రసవించెను. మంచి లక్షణములతో నున్న పుత్రుని చూచి మృకండు మహర్షి సంతోషించెను. విధిపూర్వకముగా శుభకరమైన జాతకర్మను చేయించెను. శుక్లపక్షమున చంద్రుడువలె ఆ బాలుడు పెరుగుచుండెను. తరువాత అయిదవ ఏట మృకండు మహర్షి ఆనందముతో ఉవనయనము చేసి ధర్మసంహితయగు వైదిక శిక్షము బోధించెను. ఓ పుత్రా! ఎప్పుడూ విధిపూర్వకముగా బ్రహ్మణులకు నమస్కారము చేయవలయును. మూడుమార్లు ఆర్ఘ్యప్రదానముచే సూర్యుని పూజించి వేదాధ్యయన పూర్వకముగా వైదిక కర్మను ఆచరింవలయును. ఎప్పుడూ బ్రహ్మచర్యముచే తపస్సుచే శ్రీహరిని పూజించవలయును. దుష్టులతో మాట్లాడుట మొదలగు నిషిద్ధ కర్మలను వదలవలయును. ఎపుడూ విష్ణుభక్తి పరులగు సజ్జనులతో కలిసి ఉండవలయును. ఎవరినీ ద్వేషించరాదు. అందరికి హితమునే ఆచరించవలయను. యజ్ఞములను, వేదాధ్యయనమును, దానములను ఎపుడూ చేయవలయును. ఇట్లు మార్కండేయమహర్షికి తండ్రి వైదిక శిక్ష నుపదేశించెను.

చచార ధర్మం సతతం సదా సంచిన్తయన్‌ హరిమ్‌, మార్కండేయో మహాభాగో దయావాన్ధర్మవత్సలః. 14

ఆత్మవాన్సత్యసంధశ్చ మార్తాండసదృశప్రభః, వశీ శాన్తో మహాజ్ఞానీ, సర్వతత్త్వార్థకో విదః. 15

తపశ్చచార పరమమచ్యుత ప్రీతికారణమ్‌, ఆరాధితో జగన్నాథో మార్కండేయేన దీమతా. 16

పురాణసంహితాం కర్తుం దత్తవాన్వరమచ్యుతః మార్కండేయో మునిస్తస్మాన్నారాయణ ఇతి స్మృతః. 17

చిరంజీవీ మహాభక్తో దేవదేవస్య చక్రిణః, జగత్యేకార్ణవీభూతే స్వప్రభావం జనార్దనః. 18

తస్య దర్శయితుం విప్రాస్తం న సంహృతవాన్హరిః. మృకండుతనయో ధీమాన్విష్ణుభక్తిసమన్వితః. 19

తస్మిన్జలే మహాఘోరే స్థితవాన్‌ శీర్ణపత్రవత్‌, మార్కండేయ స్థ్సతస్తావద్యావచ్ఛేతే హరిస్స్వయమ్‌. 20

మహానుభావుడైన మార్కండేయమహర్షి ధర్మము నందు ప్రీతికలవాడై అన్ని ప్రాణులయందు దయగలవాడై ఎప్పుడూ శ్రీహరిని ధ్యానించుచు ధర్మము నాచరించుచుండెను. ఆత్మజ్ఞానము కలవాడు, సత్యసంధుడు, సూర్యుని వంటి కాంతి గలవాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, శాంతుడు, గొప్పజ్ఞానము కలవాడు, అన్ని తత్త్వములు అర్థమును బాగుగా తెలిసినవాడు కావున శ్రీమన్నారాయణుని ప్రీతి కొఱకు ఉత్తమమైన తపస్సును చేసెను. జ్ఞానియైన మార్కండేయునిచే ఆరాధించబడిన జగన్నాథుడగు శ్రీహరి పురాణ సంహితను రచించు వరమునిచ్చెను. పురాణసంహితను చేసినవాడు కావుననే మార్కండేయ మహర్షి నారాయణుడని చెప్పబడినది. దేవదేవుడైన శ్రీమన్నారాయణుడు ప్రళయకాలమున ప్రపంచమంతా జలమయమైనను మార్కండేయ మహర్షిని మాత్రము సంహరించక అట్లే మిగిల్చెను. విష్ణుభక్తి కలవాడు, జ్ఞానయగు మృకండు పుత్రుడు మహాభయంకరమైన ఆ జలముతో రాలిన ఆకు వలె శయనించి ఉన్నంత వరకు అట్లేయుండెను. 14-20

తస్య ప్రమాణం పక్ష్యామి కాలస్య వదత శ్శృణు, దశభిః పంచభిశ్ఛైవల నిమేషైః పరికీర్తితా. 21

కాష్ఠా తత్త్రింశతో జ్ఞేయా కలా పద్మజనందన , తత్త్రింశతో క్షణో జ్ఞేయసై#్త ష్పడ్భిర్ఘటికా స్మృతా. 22

తద్ద్వ యేన ముహుర్తం స్సాత్‌ దినం తత్త్రింశతో భ##వేత్‌, త్రింశద్దినైర్భవేన్మాసః పక్షద్వితయసంయుతః. 23

ఋతుర్మాసద్వయేన స్యాత్తత్త్రయేణాయనం స్మృతమ్‌. తద్ద్వయేన భ##వేదబ్దస్య దేవానాం దినం భ##వేత్‌. 24

ఉత్తరం దివసం ప్రాహు రాత్రిర్వై దక్షిణాయనమ్‌, మానుషేణౖవ మాపేన పితౄణాం దినముచ్యతే. 25

తస్మాత్సుర్యేందుసంయోగే జ్ఞాతవ్యం కల్పముత్తమమ్‌, దివ్యైర్వర్షసహసై#్ర ర్ద్వాదశభిర్దైవతం యుగమ్‌. 26

దైవే యుగసహస్రే ద్వే బ్రహ్మః కల్పస్తు తౌ నృణామ్‌, ఏకసప్తతిసంఖ్యాతైర్దివ్యైర్మన్వన్తరం యుగైః. 27

చతుర్దశభిరేతైస్చ బ్రహ్మణో దువసం మునే, యావత్ప్రమాణం దివసం తావద్రాత్రిఃప్రకీర్తితా. 28

నాశమాయాతి విప్రేన్ద్ర తస్మిన్కాలే జగత్త్రయమ్‌, మానుషేణ సహస్రేణ యత్ప్రమాణం భ##వేచ్ఛృణు. 29

చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణౌ దివసం మునే! తద్వన్మాసో వత్సరశ్చ జ్ఞేయస్తస్యాపి వేధసః. 30

పరార్ధద్వయకాలస్తు తన్మతేన భ##వేద్ద్విజాః, విష్ణోహరస్తు విజ్ఞేయం తావద్రాత్రిః ప్రకీర్తితా. 31

మృకండుతనయస్తావత్థ్సి తస్సంజీర్ణరపర్ణవత్‌, తస్మిన్ఘోరే జలమయే విష్ణుశక్త్యుపబృంహితః. 32

ఆత్మానం పరమం ధ్యాయన్థ్సితవాన్హరిసన్నిధౌ.

ఓ నారదమునీంద్రా !మార్కండేయ మహర్షి శ్రీమహావిష్ణువు సమీపమున ఉన్న కాలప్రమాణమును చెప్పెదను వినుము. పదునైదు నిమేషములు ఒక కాష్ఠ అనబడును. ముప్పదికాష్ఠలు ఒక కల. ముప్పది కలలు ఒక క్షణము. ఆరుక్షణములు ఒక ఘటిక. రెండు ఘటికలు ఒక ముహుర్తము. ముప్పది ముహుర్తములు ఒక దినము. ముప్పది దినములు ఒక మాసము. ఈ మాసము రెండు పక్షములతో కూడినది యగును. రెండు మాసములు ఒక ఋతువు. మూడు ఋతువులు ఒక ఆయనము. రెండు ఆయనములు ఒక సంవత్సరము. ఈ సంవత్సరము దేవతలకు ఒక దినము. ఉత్తరాయణము పగలు, దక్షిణాయనము రాత్రి . మానవుల ఒక మాసము పితృ దేవతలకు ఒక దినము, ఆ ప్రమాణము ననుసరించి సూర్య చంద్ర సంయోగము జరిగినచో ఉత్తమ కల్పమని తెలియవలయును. దేవతల మాసమున పన్నెండు వేల సంవత్సరములు దైవత యుగము. రెండువేల దేవయుగములు ఒక బ్రహ్మయుగము. అవే రెండు మనుష్యకల్పములు డెబ్బది యొక్క దివ్యయుగములు ఒక మన్వన్తరము. పదునాలుగు మన్వన్తరములు బ్రహ్మకు పగలు. రాత్రి కూడా పగటి ప్రమాణముగానే యుండును. 28 మన్వన్తరకాలములు గడిచిన పిదప మూడు లోకములు నశించును. మానవ కాలమానప్రకారము కాలప్రమాణము చెప్పెదను. వినుము. నాలుగు వేలయుగములు బ్రహ్మకు ఒక దివసము. ఈ ప్రమాణము ననుసరించి మాసము సంవత్సరము తెలియవలయును. రెండు పరార్థముల కాలము విష్ణువునకు పగలు. అంతయే కాలము రాత్రి. మృకండు పుత్రుడగు మార్కండేయుడు విష్ణుశక్తిచే మహాభయంకరమైన జల ప్రళయమున ఎండుటాకువలె ఇంతకాలముండెను. ఇంత కాలము పరమాత్మను ధ్యానించుచుండెను. 21-32

అథ కాలే సమాయాతే యోగనిద్రావిమోచితః, పృష్టవాన్బ్రహ్మరూపేణ జగదేతచ్చరాచరమ్‌. 33

సంహృతః తు జలం వీక్ష్య సృష్టం విశ్వం మృకండుజః, విస్మితః పరమప్రీతో వవన్దే చరణౌ హరేః. 34

శిరస్యంజలిమధామ మార్కండేయో మహామునిః, తుష్టావ వాగ్భిరిష్టాభిస్సదానందైకవిగ్రహమ్‌. 35

సమయము రాగానే శ్రీమన్నారాయణుడు యోగ నిద్రను విడిచి బ్రహ్మరూపమున చరాచరమైన ఈ ప్రపంచమును సృష్టించెను. జల ముపసంహరించబడుటను, జగత్తు సృష్టించబడుటను చూచిన మార్కండేయ మహర్షి ఆశ్చర్యమును చెంది పరమానందముతో శ్రీహరి పాదపద్మములను నమస్కరించెను. మార్కండేయ మహర్షి శిరసున దోలిసి యొగ్గి ఇష్టమైన వాక్కులతో సదానన్దరూపుని స్తోత్రము చేసెను. 33-35

మార్కండేయ ఉవాచ:-

సహస్రశిరసం దేవం నారాయణమనామయమ్‌, వాసుదేవమనాధారం ప్రణత్యోస్మి జనార్దనమ్‌. 36

పురాణం పురుషం సిద్ధం సర్వజ్ఞానైకభాజనమ్‌, పరాత్పరతరం రూపం ప్రణతోస్మి జనార్దనమ్‌. 37

పరం జ్యోతిః పరంధామ పవిత్రం పరమం పదమ్‌, సర్వైకరూపం పరమం ప్రణత్యోస్మి జనార్దనమ్‌. 38

అమేయమజరం నిత్యం సదానన్దైకవిగ్రహమ్‌, అప్రతర్క్యమనిర్దేశ్యం ప్రణత్యోస్మి దనార్దనమ్‌. 39

అక్షరం పరమం నిత్యం విశ్వాక్షం విశ్వసంభవమ్‌, సర్వతత్త్వమయం శాన్తం ప్రణత్యోస్మి జనార్గనమ్‌. 40

తం పదానన్దచిన్మాత్రం పరాణాం పరమం పదమ్‌, సర్వం సనాతనం శ్రేష్ఠం ప్రణతోస్మి జనార్దనమ్‌. 41

సగుణం నిర్గుణం శాన్తం మాయాతీతం సుమాయినమ్‌, అరూపం బహురూపం తం ప్రణతోస్మి జనార్దనమ్‌. 42

యత్ర తద్భగవాన్విశ్వం సృజత్యవతి హన్తి చ, తమాదిదేవమీశానం ప్రణతోస్మి జనార్దనమ్‌. 43

పరేశ పరమానన్ద శరణాగతవత్సల! త్రాహి మాం కరుణాసింధో! మనో తీత నమోస్తుతే . 44

ఏవం స్తువన్తం విప్రేంద్రం మార్కండేయం జగద్గురుః , ఉవాచ పరయా ప్రీత్యా శంఖచక్రగదాధరః. 45

మార్కండేయ మహర్షి పలికెను:- వికారమును చెందనివాడు, వేయి, శిరస్సులు కలవాడు, ఆదిదేవుడు, ఇతరము ఆధారముగా లేనివాడు, వాసుదేవుడు అయిన శ్రీమన్నారాయణునికి నమస్కరించుచున్నాను. ఇంతటివాడు అని కొలుచుటకు వీలులేనివాడు, తిరుగులేనివాడు, ఎప్పుడూ సదానన్దస్వరూపుడు, ఊహకందనివాడు, నిర్దేశించరానివాడు అయిన జనార్దనునికి నమస్కరించుచున్నాను. నాశములేనివాడు, పరముడు, నిత్యుడు, ప్రపంచమును చూచువాడు, ప్రపంచమునకు కారణభూతుడు, సర్వతత్త్వ స్వరూపుడు, శాంతుడు అయిన జనార్దనునికి నమస్కరించుచున్నాను. పురాణ పురుషుడు, సిద్ధస్వరూపుడు, అన్ని జ్ఞానములకు ఆదారభూతుడు పరములన్నింటి పరరూపుడు అయిన జనార్దనునికి నమస్కరించుచున్నాడు. పరంజ్యోతి పరంధాముడు, పవిత్రుడు, పరమస్థానభూతుడు పర్వైకరూపుడు, పరముడు అయిన జనార్దనునికి నమస్కరించుచున్నాడు. సదానన్ద చిన్మాత్రుడు, పరముకంటే పరముడు, సర్వరూపుడు, సనాతనుడు, శ్రేష్ఠుడు అయిన జనార్దనుని నమస్కరించుచున్నాను. సగుణుడు, నిర్గుణుడు, శాన్తుడు, మాయాతీతుడు, గొప్పమాయ కలవాడు, రూపములేనివాడు బహురూపుడు అయిన జనార్దనుని నమస్కరించుచున్నాను. ఈ ప్రపంచమును సృష్టించి, రక్షించి సంహరించు ఆదిదేవుడగు జనార్దనుని నమస్కరించు చున్నాను. ఓ పరేశా! పరమానన్ద స్వరూపా! శరణాగత వత్సల! కరుణా సముద్రమా, మనస్సుకందనివాడా! నన్ను కాపాడుము. నీకు నమస్కారము. ఇట్లు స్తోత్రము చేయుచున్న మార్కండేయ మహర్షిని గూర్చి జగద్గురువైన శంఖచక్రగదాధరుడు మిక్కిలి ప్రీతితో ఇట్లు పలికెను. 36-45

శ్రీ భగవానువాచ:-

లోకే భాగవతా యే చ భగవద్భక్తమానసాః, తేషాం తుష్టో న సందేహో రక్షామ్యేతాంశ్చ సర్వదా. 46

అహమేన ద్విజశ్రేష్ఠ! నిత్యం ప్రచ్ఛన్న విగ్రహః, భగవద్భక్తరూపేణ లోకాన్రక్షామి సర్వదా. 47

శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను:- ఈ లోకమున భగవంతుని యందు మనసు నిలిపిన వారు పరమభాగవతులు. వారి విషయమున నేనెపుడూ సంతోషముతో నుండి వారికి సర్వకాలములలో కాపాడుచుందును. ఓ బ్రహ్మణోత్తమా !నేనే నా స్వరూపమును మరుగుపరచి ఎపుడా భగవద్భక్తుల రూపముతో ఈ లోకములను కాపాడు చుందును. 46-47

మార్కండేయ ఉవాచ:-

కిం లక్షణా భాగవతా జాయన్తే కేన కర్మణా, ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం కౌతూహలపరో యతః. 48

మార్కండేయ మహర్షి పలికెను:- భగవదభక్తులెట్లుందురు? ఏ పని చేసినచో భగద్భక్తులు (భాగవతులు) అగుదురు ?ఈ విషయమున నాకు చాలా కుతూహలమున్నది కావున వినగోరుచున్నాను. 48

శ్రీ భగవానువాచ:-

లక్షణం భాగవతానాం శృణుష్వ మునిసత్తమ! వక్తుం తేషాం ప్రభావం హి శక్యతె నాబ్దకోటిభిః. 49

యే హితాః సర్వ జంతూనాం గతాసూయా అమత్సరాః. వశినో నిస్స్పృహాః శాన్తాస్తే భాగవతోత్తమాః. 50

కర్మణా మనసా వాచా పరపీడాం న కుర్వతే, అపరిగ్రహశీలాశ్చ తే వై భాగవతా స్స్మృతాః . 51

సత్కథాశ్రవణ యేషాం వర్తతే సాత్త్వికీ మతిః, తద్భక్తా విష్ణు భక్తాశ్చ తే వై బాగవతోత్తమాః. 52

మాతా పిత్రోశ్చ శుశ్రూషాం కుర్వన్తి యే నరోత్తమాః గంగా విశ్వేశ్వరదియా తే వై భాగవోత్తమాః. 53

యే తు దేవార్తనరతా యే తు తత్సాధకా స్స్మృతాః, పూజాం దృష్ట్వానుమోదన్తే తే వా భాగవతోత్తమాః. 54

వ్రతినాం చ యతీనాం చ పరిచర్యాపరాశ్చ యే, విముక్తపరనిన్దాశ్చ తే వై భాగవతోత్తమాః. 55

సర్వేషాం హితవాక్యాని యేవదన్తి నరోత్తమాః యే గుణగ్రాహితో లోకే తే వై భాగవతా స్స్మతాః 56

ఆత్మవత్సర్వభూతాని యే పశ్యన్తి నరోత్తమా, తుల్యాః శత్రుషు మిత్రేషు తే వై భాగవతోత్తమాః 57

ధర్మశాస్త్రప్రవక్తారః సత్యవాక్యరతాశ్చ యే, పతాం శుశ్రూషనో యే చ తే వై భాగవతోత్తమాః 58

వ్యాకుర్వతే పురాణాని తాని శృణ్వన్తి యే తథా, తద్వక్తరి చ భక్తయే తే వై భాగవోత్తమాః 59

యే గోబ్రహ్మణశుశ్రూషాం కుర్వతే సతతమ నరాః తీర్థయాత్రాపరా యే చ తేవై భాగవతోత్తమాః 60

అన్యేషా ముదయం దృష్ట్వా యే భినన్దన్తి మానవాః హరినామపరా యే చ తే వై భాగవతోత్తమాః. 61

అరామారోపణరతాస్తదాగపరిరక్షకాః, కాసారకూపకర్తారస్తే వై భాగవతోత్తమాః. 62

యే వై తడాగకర్తారో దేవసద్మాని కుర్వతే, గాయత్రీనిరతా యే చ తే వైభాగవతోత్తమాః. 63

యే భినన్దన్తి నామాని హరేః శ్రుత్వాతి హర్షితాః, రోమాంచిత శరీరాశ్చ తేవై భాగవతోత్తమాః. 64

తులసీకా వనం దృష్ట్వా యే నమస్కుర్వతే నరాః, తత్కాష్ఠాకిత కర్ణా యే తేవై భాగవతోత్తమాః. 65

తులసీ గంధమాఘ్రాయ సంతోషం కుర్వతేతు యే, తన్మూలమృత్తికాం యే చ తావై బాగవతోత్తమాః. 66

ఆశ్రమాచార నిరతా స్తధైవాతిథిపూజకాః, యేచ వేదార్థ వక్తార స్తేవై భాగవతోత్తమాః. 67

శివప్రియా శ్శివాసక్తా శివపాదార్చనే రతాః, త్రిపుండ్రధారిణో యే చ తేవై భాగవతోత్తమాః. 68

వ్యాహరన్తి చ నామాని హరే శ్సంభోర్మహాత్మనః, రుద్రాక్షాలంకృతా యే చ తేవై భాగవతోత్తమాః 69

యే యజన్తి మహాదేవం క్రతుభిర్భహు దక్షిణౖః, హరిం వా పరయా భక్త్యా తేవై భాగవతోత్తమాః. 70

విదితాని చ శాస్త్రాణి పరార్థం ప్రవదన్తి యే, సర్వత్ర గుణ భాజో యే తేవై భాగవతోత్తమాః. 71

శివే చ పరమేశే చ విష్ణౌ చ పరమాత్మని, సమబుద్ధ్యా ప్రవర్తన్తే తేవై బాగవతాః స్మృతాః. 72

శివాగ్నికార్య నిరతాః పంచాక్షర జపే రతాః, శివధ్యాన రతా యే తేవై భాగవతోత్తమాః. 73

పానీయదాన నిరతా యే న్నదానరతాస్తధా, ఏకాద శీవ్రతపరా స్తేవై భాగవతోత్తమాః. 74

గోదాన నిరాత యే చ కన్యాదానరతాశ్చయే ,మదర్ధం కర్మ కర్తార స్తేవై భాగవతోత్తమాః. 75

ఏతే భాగవతా విప్ర తే చిదత్ర ప్రకీర్తితాః మయాపి గదితుం శక్యా నాబ్దకోటిశ##తైరపి. 76

శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను:- ఓ మార్కండేయ మహామునీ! భాగవతుల లక్షణమును చెప్పెదను, వినుము. భాగవతోత్తముల ప్రభావమును నూరు కోట్ల సంవత్సరములలో కూడ చెప్ప శక్యముకాదు. అన్ని ప్రాణులకు హితమును కోరువారు, అసూయలేనివారు, మాత్సర్యములేనివారు, ఇంద్రియ నిగ్రమును కలవారు, ఆశ##లేనివారు, శాంతస్వభావులు భాగవతు లనబడుదురు. పనితో మనసుతో మాటతో ఇతరులను పీడించనివారు, ఇతరునుండి దేనినీ గ్రహించనివారు భాగవతులనబడుదురు. సత్కథలను వినుటలో సాత్త్విక బుద్ధి కలవారు, సత్కథా భక్తులు, శ్రీమహావిష్ణుభక్తులు భాగవతోత్తములనబడుదురు. తల్లిదంత్రులను గంగా పరమేశ్వర బుద్ధితో సేవించువారు భాగవతోత్తము లనబడుదురు. దేవుని ఆర్చించుటలో ప్రీతి కలవారు. దేవతార్చనను సాధించువారు. దేవతార్చనను చూచి ఆమోదించువారు భాగవతోత్తమలనబడుదురు. యతులను సన్యాసులను సేవించుటలో ఆసక్తి గలవారు పరులను నిందించువారు భాగవతోత్తములనబడుదురు. అందరికి హితమును బోధించువారు, గుణములను మాత్రమే గ్రహించువారు భాగవతోత్తములనుబడుదురు. తనవలె అన్ని ప్రాణులను చూచువారు శత్రువులను మిత్రులను సమముగా చూచువారు భాగవతోత్తములనబడుదురు. ధర్మశాస్త్రములను బోధించువారు , సత్యవాక్యములనే చెప్పువారు, సత్పురుషులను సేవించువారు భాగవతోత్తములనబడుదురు. పురాణములను వ్యాఖ్యానము చేయువారు పురాణములను వినువారు పురాణములను చెప్పువారియందు భక్తికలవారు భాగవతోత్తములనబడుదురు. గోవులను బ్రహ్మణులను సేవించువారు, తీర్థయాత్రలయందాసక్తి కలవారు బాగవతోత్తములు. ఉద్యానవనములను నిర్మించువారు , తటాకములను రక్షించువారు, సరస్సులను బావులను ఏర్పరచువారు, పరమ భాగవతోత్తములు. తటాకములను దేవాలయములను నిర్మించువారు, గాయత్రీ మంత్రజపమునందు ప్రీతి కలవారు పరమభాగవతోత్తములు. శ్రీహరినామములను విని అబినందించి, ఆనందించి శరీరమున పులకలు వచ్చువారు పరమ భాగవతోత్తములు. తులసీవనమును చూచి సమస్కరించువారు, తులసీ కాష్ఠములను చెవులలో ధరించువారు భాగవతోత్తములు. తులసీ గంధమును వాసన చూచి ఆనందించువారు , తులసీ మూల మృత్తికను వాసన చూచి ఆనందించువారు భాగవతోత్తములు ఆశ్రమాచారములయందు శ్రద్ధ కలవారు, అతిథులను పూజించువారు, వేదార్థమును చెప్పువారు బాగవతోత్తములు. శివుని యందు ప్రీతి కలవారు, శివుని యందు మనసును లగ్నము చేసినవారు, శివపాదార్చనలో ఆనందించువారు, త్రిపుండ్రములను ధరించువారు పరమభాగవతోత్తములు. మహానుభావుడైన శ్రీహరి నామములను, శంకరుని నామములము కీర్తించువారు, రుద్రాక్షలను అలంకరించుకొనువారు భాగవతోత్తములు. బహుదక్షిణలిచ్చి యాగములతో శివుని ఆరాధించువారు. ఉత్తమమైన భక్తితో శ్రీమన్నారాయణుని గూర్తి చేసిన యాగములతో అతనిని ఆరాధించువారు భాగవతోత్తములు. తమకు తెలిసిన శాస్త్రములను ఇతరుల కొఱకు చెప్పువారు, అంతటా గుణములను మాత్రమే చూచువారు. భాగవతోత్తములు. పరమేశ్వరుడైన శివుని యందు, పరమాత్మయగు శ్రీమన్నారాయణుని యందు సమబుద్ధితో ప్రవర్తించువారు భాగవతోత్తములు. శివుని గూర్చి అగ్నికార్యములను, యాగములను, చేయుటయందు ఆసక్తికలవారు, పంచాక్షరని జపించుటలో ఆసక్తిని పొందువారు, అన్నదానమును చేయువారు. ఏకాదశీవ్రతములు ఆచరించువారు. భాగవతోత్తములు. గోదానము చేయువారు, కన్యాదానమును చేయువారు నా ప్రీతి కొఱకు పనిచేయువారు భాగవతోత్తములు. ఇచట కొందరు భాగవతోత్తములను గూర్చి చెప్పి యుంటిని. నేను కూడా నూరు కోట్ల సంవత్సరములలో నైనను భాగవతోత్తములను గూర్చి సంపూర్ణముగా చెప్పలేను. 49-76

తస్మాత్త్వమపి విప్రేన్ద్ర! సుశీలో భవ సర్వదా, సర్వభూతాశ్రయో దాన్తో మైత్రో ధర్మపరాయణః. 77

పునర్యుకాన్తపర్యంతం ధర్మం సర్వం సమాచరన్‌, మన్మూర్తిధ్యాననిరతః పరం నిర్వాణమాప్య్ససి. 78

ఏవం మృకండుపుత్రస్య స్వభక్తస్య కృపానిధిః, దత్వా వరం స దేవేశస్తత్రైవాన్తరధీయత. 79

మార్కండేయో మహాభాగో హరిభక్తిరతస్సదా, చచార పరమం ధర్మమీజే చ విధివన్మఖైః. 80

శాలగ్రామే మహాక్షేత్రే తతాప పరమం తపః, ధ్యానక్షపితకర్మా తు పరం నిర్వాణమాప్తవాన్‌. 81

తస్మాజ్జంతుషు సర్వేషు హితకృద్ధరిపూజకః, ఈ ప్సితం మనసా యద్యత్తత్తదాప్నోత్య సంశయమ్‌. 82

ఓ బ్రాహ్మణోత్తమా !కావున నీవు కూడా ఎప్పడు సుశీలుడవు కమ్ము. అన్ని భూతములకు ప్రాణులకు ఆశ్రయుడవై, ఇంద్రియ నిగ్రహము నలవర్చుకొని అందరియెడ మైత్రి కలవాడవై, ధర్మమునందే మనసును నిలుపుము. మళ్ళీ వచ్చు ప్రళయము వఱకు సర్వవిధ ధర్మముల నాచరించుచు, నా సర్వరూపమును ధ్యానించుటలో ఆసక్తుడవై పరమపదమును పొందెదవు. ఇట్లు దేవదేవశుడు దయానిధియైన శ్రీమన్నారాయణుడు మృకండుమహర్షి పుత్రుడు, తన భక్తుడు అయిన మార్కండేయ మహర్షికి వరమునిచ్చు అక్కడనే అంతర్థానము చెందెను. మహానుభావుడైన మార్కండేయమహర్షి కూడా ఎల్లప్పుడూ హరి భక్తిచే ఆనందించుచు పరమ ధర్మము నాచరించెను. విధిపూర్వకముగా యజ్ఞములచే శ్రీమహావిష్ణువును పూజించెను. పరమ పవిత్రమైన శాలగ్రామ క్షేత్రమున ఉత్తమమైన తపస్సు నాచరించెను. శ్రీమహావిష్ణువును ధ్యానించుచు కర్మలను క్షీణింపచేసుకొని పరమ పదమును పొందెను. కావున అన్ని ప్రాణులకు హితమును కలిగించుచు శ్రీమహావిష్ణువును పూజించువాడు మనసులో కోరిక లన్నింటిని పొందగలడు. ఈ విషయమున ఏ మాత్రము సంశయము లేదు. 77-82

సనక ఉవాచ:-

ఏతత్సర్వం నిగదితం త్వయా పృష్టం ద్విజోత్తమ! భగవద్‌ భక్తి మహాత్య్మం కిమన్యచ్ఛోతుమిచ్ఛసి. 83

ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణ పూర్వభాగే

ప్రథమపాదే మార్కండేయ వర్ణనం

నామ పంచమోధ్యాయః

సనక మహర్షి పలికెను- ఓ బ్రహ్మణోత్తమా! నీవు అడిగిన భగవద్భక్తి మహాత్య్మమునంతటిని చెప్పితిని. ఇంకనూ ఏమి వినగోరుచుంటివో తెలుపుము.

ఇది శ్రీ బృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున మొదటిపాదమున

మార్కండేయ వర్ణనము అను అధ్యాయము సమాప్తము.

Sri Naradapuranam-I    Chapters    Last Page