Sri Padma Mahapuranam-I    Chapters   

ఏకచత్వారింశత్తమోధ్యాయః

పులస్త్య ఉవాచ :c

ఆదిత్యావసవో రుద్రా అశ్వినౌ చ మహాబలౌ | సబలాః సానుగాశ్చైవ సంనహ్యన్త యధాక్రమమ్‌ || 1

పురూహూతశ్చ పురతో లోకపాలః సహస్రదృక్‌ | గ్రామణీః సర్వ దేవానాం ఆరురోహ వరద్విపమ్‌ || 2

సవ్యే చాస్య రథః పార్శ్వే పక్షిప్రవరకేతనః | సుచారుచక్రచరణో హైమచ్ఛత్ర పరిష్కృతః || 3

దేవగంధర్వ యక్షౌఘైరనుయాతః సహస్రశః | దీప్తిమద్భిశ్చ స్వర్గస్థైర్బ్రహ్మర్షిభిరభిష్టుతః || 4

వజ్రవిస్ఫారితోద్భూతైర్విద్యుదింద్రాయుధప్రభైః | యుక్తమ్‌ బలాహకగణౖః పర్వతైరివ కామగైః || 5

యమారూఢః స భగవాన్‌ పర్యేతి సకలం జగత్‌ | హవిర్దానేషు గాయంతి విప్రా మఖముఖే స్థితాః || 6

స్వర్గసంగ్రామయాతేషు దేవతూర్యనినాదిషు | సేంద్రం తముపనృత్యంతి శతశోహ్యప్సరోగణాః || 7

కేతునా నాగరాజేన రాజమానో యథా రవిః | యుక్తో హయసహస్రేణ మనోమారుతరంహసా || 8

సమ్యగ్రథవరో భాతి యుక్తో మాతలినా తదా | కృత్స్నః పరివృతో మేరుర్భాస్కరస్యేవ తేజసా || 9

పులస్త్యుడిట్లు చెప్పెను :- ఆదిత్యులు, వసవులు, రుద్రులు, మహాబలులగు అశ్వినులు, వారి వారి బలములతో, అనుచరులతో యథాక్రమముగా సన్నద్ధులైరి. సహస్రాక్షుడగు ఇంద్రుడు. వారి నాయకుడుగా శ్రేష్ఠమగు గజము నధిరోహించెను. అతనికి కుడి వైపు పక్షిరాజును పతాకముపై గలిగినది. అందమైన చక్రములే చరణములుగా గలిగి, బంగారు గొడుగుతో నున్న రథముండెను. వేలకొలదిగా యక్షులు దేవ గంధర్వులు అనుసరించిరి. స్వర్గముననున్న అమిత తేజస్కులగు బ్రహ్మర్షులతని స్తుతించిరి. వజ్రమును విదుల్చుటచే (ఝుళిపించుటచే) ఏర్పడు మెరుపు, ఇంద్రాయుధ కాంతులతో ఆ రథము స్వేచ్ఛగా విహరించు మేఘ సమూహముతో నున్న పర్వతము వలె నుండెను. దాని నధిరోహించి భగవానుడు జగత్తునంతా పర్యటించెను. యజ్ఞము యొక్క ముఖమున నిలిచిన విప్రులు హవిస్సుల నిచ్చునప్పుడు గానము చేయుచుండిరి. స్వర్గ సంగ్రామ సమయాన దేవ వాద్యములు నినదించుచుండగా వందలకొలది అప్సరసల గణములు ఇంద్రుని చెంత నర్తించుచుండిరి. నాగరాజుగల కేతువుతో (ధ్వజముతో) సూర్యుని వలె వేయి గుర్రములతో కూడి ప్రకాశించుచుండెను. మనోవేగము గల ఆ రథము మాతలిని గలిగి, భాస్కరుని తేజస్సు అంతటా అలుముకొనగా ప్రకాశించుచున్న మేరువు వలె నుండెను. 9

యమస్తు దండముద్యమ్య కాలయుక్తం చ ముద్గరమ్‌ | తస్థౌ సురగణానీకే దైత్యానాం చైవ దర్శయన్‌ || 10

చతుర్భిః సాగరైర్యుక్తో లేలిహానైశ్చ పన్నగైః | శంఖముక్తాంగదధరో బిభ్రత్తోయమయం వపుః || 11

కాలపాశాన్‌ సమావిధ్య హయైః శశికరోపమైః | వామ్వీరిత జలాకారైః కుర్వన్‌ లీలాః సహస్రశః || 12

పాండురోద్ధూత వసనః ప్రవాళరుచిరాంగదః | మణిశ్యామోత్తమవపుర్హారకేణార్చితోదరః || 13

వరుణః పాశధృఙ్మధ్యే దేవానీకస్య తస్థివాన్‌ | యుద్ధవేళామభిలషన్‌ భిన్నవేళ ఇవార్ణవః || 14

యక్షరాక్షససైన్యేన గుహ్యకానాం గణౖరపి | యుక్తశ్చ శంఖపద్మాభ్యాం నిధీనామధిపః ప్రభుః || 15

రాజరాజేశ్వరః శ్రీమాన్‌ గదాపాణి రదృశ్యత | విమానయోధీ ధనదో విమానే పుష్పకే స్థితః || 16

స రాజరాజః శుశుభే యక్షేశో నరవాహనః | పూర్వపక్షే సహస్రాక్షః పితృరాజశ్చ దక్షిణ || 17

వరుణశ్చ పశ్చిమే పక్ష ఉత్తరే నరవాహనః | చతుః పక్షాశ్చ చత్వారో లోకపాలా మహాబలాః || 18

యముడు దండము నెత్తి, కాలపాశముతో ముద్గరమును దైత్యులకు చూపించుచూ సురగణ సైన్యమున నిలిచెను. వరుణుడు నాలుగు సముద్రములతోయుండి, సర్పములతో, శంఖమును, ముత్యపు నగను ధరించి, జలమయమగు శరీరమును దాల్చి, కాలపాశముల నెక్కు పెట్టి, వాయువుచే ప్రేరితమైన జలము వంటి తెల్లని గుర్రములతో, అనేక లీలల జేయుచూ, తెల్లని వస్త్రముల దాల్చి ప్రవాళములచే అందమైన అంగదములతో, మణులతో అందమైన హారముతో దేవ సైన్యము మధ్య పాశము దాల్చి నిలిచెను. యుద్ధ సమయమునకై వేచి చూస్తూ కట్ట తెగిన సముద్రము వలె నుండెను. యక్ష రాక్షస సైన్యముతో, గుహ్యకులతో నున్న కుబేరుడు శంఖ పద్మాది నిధుల ప్రభువగు రాజరాజేశ్వరుడు, గదను ధరించి కనిపించెను. విమానమున నిలిచి యుద్ధము చేయు కుబేరుడు పుష్పక విమానమున నిలిచి, నరవాహనుడై ప్రకాశించెను. తూర్పు వైపు ఇంద్రుడు, దక్షిణాన యముడు, పశ్చిమమున వరుణుడు, ఉత్తరమున కుబేరుడు మహాబలులుగా నిలిచిరి. 18

ఆత్మదిక్షు చరంతశ్చ తస్య దేవబలస్య తే | సూర్యః సప్తాశ్వయుక్తేన రథేనానిలగామినా || 19

శ్రియా జాజ్జ్వల్యమానేన దీప్యమానైశ్చ రశ్మిభిః | ఉదయాస్తమ¸° చక్రే మేరుపర్యంతగామినా || 20

త్రిదివద్వారచక్రేణ తపసా లోకమవ్యయమ్‌ | సహస్రరశ్మియుక్తేన భ్రాజమానేన తేజసా || 21

చచార మధ్యే దేవానాం ద్వాదశాత్మా దివాకరః | సోమః శ్వేతహయో భాతి స్యందనే శీతరశ్మిమాన్‌ || 22

హిమతోయప్రపూర్ణాభిర్భాభిరాహ్లదయన్‌ జగత్‌ | తమృక్షయోగానుగతం శిశిరాంశుం ద్విజేశ్వరమ్‌ || 23

శశచ్ఛాయాంకిత తనుం నైశస్యతమసః క్షయమ్‌ | జోతిషామీశ్వరం వ్యోమ్ని రసదం ప్రభుమవ్యయమ్‌ || 24

ఓషధీనాం పవిత్రాణాం నిదానమమృతస్య చ | జగతః పరమం భాగం సౌమ్యం సర్వమయం రసమ్‌ || 25

దదృశుర్ధానవాః సోమం హిమప్రహరణం స్థితమ్‌ | యః ప్రాణః సర్వభూతానాం పంచధా భిద్యతే నృషు || 26

సప్తస్వరగతా యస్య యోనిర్గీర్భిరుదీర్యతే | యం వదంతి చలం భూతం యం వదంత్యశరీరిణమ్‌ || 27

సప్తస్కంధగతో లోకాంస్త్రీన్దధార చకార చ | యమాహురగ్నికర్తారం సర్వప్రభవమీశ్వరమ్‌ || 28

వారు తమ తమ దిక్కులలో చరిస్తూ దేవ బలమును పెంచిరి. ఏడు గుర్రాలు పూన్చిన దానిని, వాయువేగముగల రథమును, ప్రకాశించు దానిని ఎక్కి సూర్యుడు మేరుపర్యంత గమనము గలిగి, స్వర్గ ద్వారమునకు చక్రమగు దానితో లోకమును నాశనములేనిదిగా జేయుచూ, ఉదయాస్తమయముల జేసెను. సహస్ర కిరణములు గల తేజస్సుతో దేవతల మధ్య ద్వాదశాత్ముడగు సూర్యుడు చరించెను. ఇక చంద్రుడు తెల్లని గుర్రాల రథముపై మంచునీటితో నున్న చల్లని కాంతితో జగత్తు నాహ్లాదపరుస్తూ శోభిల్లెను. నక్షత్రములతో నున్న హిమకరుడు, ద్విజేశ్వరుడు, శశాంకుడు, రాత్రి చీకటిని పారదోలువాడు, నక్షత్రరాజు, ఆకాశమున కాంతి వెదజల్లువాడగు చంద్రుని, పవిత్ర ఓషధుల నిధిని, అమృత నిధిని, జగత్తు యొక్క ఇతర భాగమగు వానిని హిమమునే ఆయుధముగా ధరించి నిలవగా దానవులు చూచిరి. ఇక, ఎవరు అన్ని ప్రాణుల ప్రాణమో, నరులయందు ఐదు విధములుగా భిన్నమైనవాడో, ఏడు స్కంధముల చేరినవాడో, ముల్లోకముల ధరించువాడో, అగ్నికి కర్తయో, అన్నిటి నెలవు, ప్రభువో, ఎవరి సప్తస్వరగతమైన యునికి వాక్కుచే చెప్పబడునో, చలభూతమని, అశరీరియని ఎవరి నందురో అతను వాయువు. 28

యమాహురాకాశగమం శీఘ్రగం శబ్ధయోనిజం | సవాయుస్సర్వభూతాయురుద్దతః స్వేన తేజసా || 29

వవౌ ప్రవ్యథయన్‌ దైత్యాన్‌ ప్రతిలోమం స తోయదః | మారుతో దేవగంధర్వైర్వి ద్యాధరగణౖః సహ || 30

చిక్రీడ రశ్మిభిశ్శుభ్రైర్నిర్ముక్తైరివ పన్నగైః | సృజంతః సర్పపతయస్త్రీవ్రం రోషమయం విషమ్‌ || 31

శరభూతా విలగ్నాశ్చ చేరుర్వ్యాత్తాననా దివి | పర్వతాశ్చ శిలా శృంగైః శతశాఖైశ్చ పాదపైః || 32

ఉపతస్థుః సురగణాన్‌ ప్రహర్తుం దానవం బలమ్‌ | యః స దేవో హృషీకేశః పద్మనాభస్త్రివిక్రమః || 33

యుగాంతే కృష్ణవర్త్మా చ విశ్వస్య జగతః ప్రభుః | సర్వయోనిః స మధుహా హవ్యభుక్‌ క్రతుసంస్థితః || 34

భూమ్యంబువ్యోమభూతాత్మా శ్యామః శాంతికరో7రిహా | అవిఘ్నమమరాదీనాం చక్రే చక్రగదాధరః || 35

సవ్యేనాలమ్య మహతీం సర్వాయుధ వినాశినీమ్‌ | కరేణ కాళీం వపుషా శత్రుకాలప్రదాం గదామ్‌ || 36

శేషైః భుజైః ప్రదీప్తాభైర్భుజగారిధ్వజః ప్రభుః | దధారాయుధజాలాని శారాజ్గదీని మహాబలః || 37

ఆకాశమున గమనమును గలిగి, శీఘ్రముగా కదలువాడు, శబ్దమునకు కారణమగు వానినుండి (ఆకాశము) జన్మించినవాడు, అగు ఆ వాయువు తన తేజస్సుతో పైకెగసి, అన్ని ప్రాణుల ఆయువై, దైత్యులను బాధించుచూ మేఘములతో గూడి వీచెను. దేవ విధ్యాధరాది గణములతో మారుతము శుభ్రమగు కిరణములతో కుబుసము విడిచిన పామువలె క్రీడించెను. తీవ్రముగా, రోషముతో గూడినదగు విషమును వదులుచూ సర్పరాజులు నోరు తెరచి ఆకాశమున శరముల వలె విడిగా చరించిరి. పర్వతములు శిలాశృంగములతో, వందలకొలది శాఖలున్న చెట్లతో దానవుల బలమును దెబ్బతీయుటకు సుర గణముల జేరిరి. పద్మనాభుడు, త్రివిక్రముడు, యుగాంతమున నల్లని మార్గము గలవాడు, జగత్తుకు ప్రభువు, అన్నింటి కారణము, హవ్యమును భుజించువాడు, మధువను రాక్షసుని చంపినవాడు, క్రతువులయందుండువాడు, భూమి, నీరు, ఆకాశముగా రూపు దాల్చినవాడు, నల్లనివాడు, శాంతిని నెలకొల్పువాడు, శత్రువుల చంపువాడగు విష్ణువు దేవతాదులకు అవిఘ్నమగునట్లు చేసెను. కుడిచేత అన్ని ఆయుధముల నశింపజేయునది, గొప్పది, శత్రువులకు మృత్యువు నొసగు కాలరూప గదను ధరించి, ఇతర చేతులతో శారజ్గము మొదలగు ఆయుధ జాలమును ధరించెను. 37

స కశ్యపస్యాత్మభవం ద్విజం భుజగభోజనమ్‌ | భుజగేంద్రేణ వదనే నివిష్టేన విరాజితమ్‌ || 38

అమృతారంభసంయుక్తం మందరాద్రిమివోచ్ఛ్రితమ్‌ | దేవాసురవిమర్దేషు బహుశో దృష్టవిక్రమమ్‌ || 39

మహేంద్రేణామృతస్యార్థే వజ్రేణ కృతలక్షణమ్‌ | విచిత్రపత్రవసనం ధాతుమంతమివాచలమ్‌ || 40

స్ఫీతక్రోధావలంబేన శీతాంశుసమతేజసా | భోగిభోగావసక్తేన మణిరత్నేన భాస్వతా || 41

పక్షాభ్యాం చారుపత్రాభ్యామావృతం దీవి లీలయా | యుగాంతే సేంద్రచాపాభ్యాం తోయదాభ్యామివాంబరమ్‌ || 42

నీలలోహితపీతాభిః పతాకాభిరలంకృతమ్‌ | అరుణావరజం శ్రీమానారుహ్య సమరే ప్రభుః || 43

సువర్ణవర్ణపుష్పం సుపర్ణం ఖేచరోత్తమమ్‌ | తమన్వయుః సురగణా మునయశ్చ సమాహితాః || 44

గీర్భిః పరమమంత్రాభిస్తుష్టువుశ్చ గదాధరమ్‌ | తద్వైశ్రవణ సంశ్లిష్టం వైవస్వతపురఃసరమ్‌ || 45

వారిరాజపరిక్షిప్తం దేవరాజవిరాజితమ్‌ | పవనాబద్ధనిర్ఘోషం సంప్రదీప్తహుతాశనమ్‌ || 46

విషోర్జిష్ణోః సహిష్ణోశ్చ భ్రాజిష్ణోస్తేజసా వృతమ్‌ | బలం బలవదుద్రిక్తే యుద్ధాయ సమవర్తత || 47

అట్టి విష్ణువు, కశ్యప సంతానమగు పక్షిరాజు నధిరోహించెను. గరుత్మంతుడు సర్పములే భోజనముగా గలవాడు, నోట వున్న సర్పరాజుతో విలసిల్లువాడు, అమృతారంభముతో ఉన్నతమగు మందర పర్వతము వలె నున్నవాడు, దేవాసుర యుద్ధాలలో అనేక పర్యాయములు పరాక్రమము చూపించినవాడు, అమృతమునకై మహేంద్రునిచే వజ్రపాత చిహ్నముపొందినవాడు, విచిత్ర పత్రములే వస్త్రములై ధాతువులు గల పర్వతము వలె నున్నవాడు, మిక్కిలి క్రోధముచే, చంద్రుని వంటి కాంతిచే, సర్ప ఫణములతో కూడిన కాంతివంతమగు మణిరత్నముతో భాసించువాడు, అందమైన ఈకలు గల రెక్కలతో ఆకాశమును లీలగా కమ్ముకొని యుగాంతమున ఇంద్రధనుస్సుతో కూడిన మేఘములతో నున్న ఆకాశము వలె నుండెను. నీలలోహితపీత వర్ణముల పతాకములతో అలరారుచుండెను. అట్టి అరుణువి అనుజుడగు గరుత్మంతుని అధిరోహించి విష్ణువు సమరమున నిలువ, సురగణములు, మునులు సమాహిత మనస్కులై ఆతని ననుసరించిరి. ఉత్తమ మంత్రముల వాక్కులచే స్తుతించిరి. వరుణ యమ కుబేరాదులు, గరుడుడు చుట్టూ నిలిచి రక్షించుచుండగా, ఇంద్రుడు ముందు విరాజిల్లుచుండగా, జయించు, సహించు, భాసించు శీలముగల విష్ణు తేజస్సుతో కూడుకొనిన దేవబలము యుద్ధము చేయుటకై సిద్ధముగా నుండినది. 47

స్వస్త్యస్తు దేవేభ్య ఇతి బృహస్పతిరభాషత | స్వస్త్యస్తు దైత్యేభ్య ఇతి ఉశనా వాక్యమాదదే || 48

తాభ్యాం బాలాభ్యాం సంజజ్ఞే తుములో విగ్రహస్తథా | సురాణామసురాణాం చ పరస్పరజయైషిణామ్‌ || 49

దానవా దైవతైః సార్ధం నానాగ్రహరణోద్యమాః | సమీయుర్యుధ్యమానా వై పర్వతా ఇవ పర్వతైః || 50

తత్సురాసురసంయుక్తం యుద్ధమత్యద్భుతం బభౌ | ధర్మాధర్మసమాయుక్తం దర్పేణ వినయేన చ || 51

తతో హయైః ప్రజవితైర్వారణౖశ్చ ప్రచోదితైః | ఉత్పతద్భిశ్చ గగనే సాసిహసై#్తః సమంతతః || 52

క్షిప్యమాణౖశ్చ ముసలైః సంపతద్భిశ్చ సాయకైః | చావైర్విస్ఫార్యమాణౖశ్చ పాత్యమానైః సుదారుణౖః || 53

తద్యుద్ధమభవద్‌ ఘోరం దేవదానవసంకులమ్‌ | జగతస్త్రాసజననం యుగసంవర్తకోపమమ్‌ || 54

స్వహస్తముక్తైః పరిఘైః ముద్గరైశ్చైవ పర్వతైః | దానవాస్సమరే జఘ్నర్దేవానింద్రపురోగమాన్‌ || 55

తే వధ్యమానా బలిభిర్దానవైర్జితకాశిభిః | విషణ్ణవదనా దేవా జగ్మురార్తిం పరాం మృధే || 56

తే చాస్త్రశూలముత్థితాః పరిఘైర్భిన్నమస్తకాః | భిన్నోరస్కా దితిసుతైః స్రవద్రక్తా రణ బహు || 57

దేవతలకు స్వస్తియగు గాక యని బృహస్పతి, దైత్యులకు స్వస్తి యగు గాక యని శుక్రాచార్యుడు పలికిరి. అపుడా రెండు బలాల మధ్య ఘోర యుద్ధము జరిగెను. పరస్పరము జయించు కోరికతో దేవ దానవులట తలపడిరి. అనేక విధముల ఆయుధములు చేబూని, పర్వతములు పర్వతములతో ఢీ కొనినట్లు దైత్యులు దేవతలతో తలపడిరి. ఆ యుద్ధమత్యద్భుతముగ భాసించెను. దర్పము ఒక వైపు, వినయము మరొక వైపు వుండి ధర్మా ధర్మములతో కూడినదిగా ఆ యుద్ధ ముండెను. మిక్కిలి జవముగల గుర్రములతో, ప్రేరితములైన గజములతో వారు చేత కత్తుల బూని అన్ని వైపుల నుండి ఆకాశమున ఎగిసి పడుచుండిరి. నాగలి వంటి ఆయుధములు విసరబడుచుండెను. బాణములు విడువబడుచుండెను. చాపములు వెదజల్ల బడుచుండెను. వీనితో ఆ యుద్ధము ఘోరముగ నుండెను. జగత్తుకు భయమును గొల్పుచూ, యుగసమాప్తి వలె నుండెను. పరిఘలను, ముద్గరములను పర్వతములను విడుచుచూ దానవులు ఇంద్రాది దేవతలను బాధించిరి. బలవంతులగు దానవులట్లు బాధించగా, వాడిన ముఖాలతో దేవతలు ఆర్తి నొందిరి. అస్త్ర శూలములతో, పరిఘలతో తలలు తెగి, ఎదలు చీలి, రక్తము కారుతుండగా రణమున దేవతలు నేలకూలిరి. 57

సూదితాః శరజాలైశ్చ నిర్యత్నాశ్చ శ##రైః కృతాః | ప్రవిష్టా దానవీం మాయాం న శేకుస్తే విచేష్టితుమ్‌ || 58

ఉత్తంభితమివాభాతి నిష్ప్రాణసదృశాకృతి | బలం సురాణామసురైర్నిష్ప్రయత్నాయుధం కృతమ్‌ || 59

దైత్యచాపచ్యుతాన్‌ ఘోరాంశ్ఛిత్వా వజ్రేణ తాన్‌ శరాన్‌ | శక్రో దైత్యబలం ఘోరం వివేశ బహులోచనః || 60

స దైత్యప్రముఖాన్‌ సర్యాన్‌ హత్వా దైత్యబలం మహత్‌ | తామసేనాస్త్రజాలేన తమోభూతమథాతరోత్‌ || 61

తేనాన్యోన్యం నావబుధ్యంత దైత్యానాం వాహనాని చ | ఘోరేణ తమసా విష్టాః పురుహూతస్య తేజసా || 62

మాయాపాశ్చైర్విముక్తాస్తు యత్నవంతః సురోత్తమాః | శిరాంసి దైత్యసంఘానాం తమోభూతాన్యపాతయన్‌ || 63

అపధ్వస్తా విసంజ్ఞాశ్చ తమసా నీలవర్చసా | పేతుస్తే దానవాస్సద్యశ్ఛిన్న పక్షా ఇవాద్రయః || 64

తత్రాభిభూత దైత్యేంద్రమంధకారమివాంతరమ్‌ | దానవం దేహసదనం తమోభూతమివాభవత్‌ || 65

తథా7సృజన్మహామాయాం మయస్తాం తామసీం దహన్‌ | యుగాంతోద్యోతజననీం సృష్టామోర్వేణ వహ్నినా || 66

స దదాహ చ తాం శాక్రీం మాయా మయవికల్పితా | దైత్యాశ్చాదిత్యవపుషా సద్య ఉత్తస్థురాహవే || 67

బాణ పరంపరచే బాధింపబడి, శరములతో ప్రయత్న ముడుగునట్లు చేయబడి దానవ మాయను పొందిన దేవతలు కదలుటకు కూడా అశక్తులైరి. అసురులచే దెబ్బతిని ఆయుధములు కదల్చలేని సురసేన స్తంభించినట్లు, ప్రాణము లేని ఆకృతివలె యుండెను. సహస్రాక్షుడగు ఇంద్రుడు దైత్యుల బాణములను తస వజ్రాయుధముతో ఛేదించి దైత్య బలమును ప్రవేశించెను. దైత్య ప్రముఖుల నందరినీ వధించి దైత్య బలమును తన తామసమగు అస్త్రజాలముతో చీకటి మయముగా చేయగా దైత్యులు ఒకరి నొకరు తెలియలేక పోయిరి. ఇంద్రుని తేజస్సుతో ఘోరమగు తమస్సుతో కూడిన వారైరి. ఇక సురోత్తములు మాయా పాశములనుండి విడివడి, యత్నము గలవారై దైత్యుల తమోభూతమైన తలలను నేల పడదోసిరి. నాశముపొంది, నీలమగు తమస్సుతో చేష్టలుడిగిన దానవులు వెంటనే రెక్కలు తెగిన గుట్టల వలె నేల కూలిరి. అపుడక్కడ దానవుల దేహముల నెలవు అంధకార మయమూ, తమోమయము ఆయెను. అపుడు మయుడు ఆ తమస్సును దహించుచూ మహామాయను సృజించెను. యుగాంతమున పుట్టిన అగ్నివలె నున్న ఆ ఉర్వుని మాయ ఇంద్రుని మాయను నశింపజేసెను. అపుడు దైత్యులు ఆదిత్యుని రూపుచే మరల యుద్ధమున వెంటనే లేచిరి. 67

మాయామౌర్వీం సమాసాద్య దహ్యమానా దివౌకసః | భేజిరే చంద్రవిషయం శీతాంశుసలిలహ్రదమ్‌ || 68

తే దహ్యమానా ఔర్వేణ వహ్నినా నష్టచేతసః | శశంసుర్వజ్రిణం దేవాః సంతప్తాః శరణౖషిణః || 69

సంతప్తే మాయయా సైన్యే హన్యమానే చ దానవైః | చోదితో దేవరాజేన వరుణో వాక్యమబ్రవీత్‌ || 70

పురా బ్రహ్మర్షిజః శక్ర తపస్తేపే సుదారుణమ్‌ | ఉర్వః స పూర్వం తేజస్వీ సదృశో బ్రహ్మణో గుణౖః || 71

తం తపంతమివాదిత్యం తపసా జగదవ్యయమ్‌ | ఉపతస్థుర్మునిగణా దేవా దేవర్షిభిః సహ || 72

హిరణ్యకశిపుశ్చైవ దానవో దానవేశ్వరః | ఋషిం విజ్ఞాపయామాస పురా పరమతేజసమ్‌ || 73

ఊచుర్బ్రహ్మర్షయస్తే తు వచనం ధర్మసంహితమ్‌ | ఋషివంశేషు భగవంశ్ఛిన్న మూలమిదం కులమ్‌ || 74

ఏకస్త్వమనపత్యశ్చ గోత్రాయాన్యో న విద్యతే | కౌమారం వ్రతమాస్థాయ క్లేశమనువర్తసే || 75

బహూని విప్రగోత్రాణి మునీనాం భావితాత్మనామ్‌ | ఏకదేహాని తిష్ఠంతి ఇవిక్తాని వినా ప్రజాః || 76

ఆ ఔర్వి మాయచే దేవతలందరూ దహింపబడుచూ, చంద్రుని చల్లని కిరణాల జలముగల కొలను చేరిరి. ఆ ఔర్వుని అగ్నిచే దహింపబడుచూ, భిన్నులై దేవతలు శరణుగోరి దేవేంద్రునికి విన్నవించిరి. మాయచేత దేవసైన్యము దహింపబడుట, దానవులచే చంపబడుట చూచి ఇంద్రుడడుగగా, వరుణుడిట్లు విన్నవించెను. 'ఇంద్రా! పూర్వము బ్రహ్మర్షికి జన్మించిన ఉర్వుడను బ్రహ్మసదృశుడు దారుణ తపస్సును చేసెను. తపించుచున్న సూర్యునివలె నున్న అతని మునిగణములు, దేవర్షులు, దేవతలు వచ్చి చేరిరి. దానవేశ్వరుడగు హిరణ్యకశిపుడను దానవుడు పరమ తేజస్వియగు ఋషిని చేరి పూర్వమిట్లు విన్నవించెను. 'భగవాన్‌! బ్రహ్మర్షులు ధర్మసంహితమగు వచనమునిట్లు చెప్పెదరు. ఋషివంశములలో ఈ కులము యొక్క మూలము భిన్నమైనది. నీ వొక్కడివి సంతతి లేనివాడవు. గోత్రమునకు వేరొకడు లేడు. కౌమారవ్రతమును పాటించుచూ క్లేశము ననుభవించుచుంటివి. ఉత్తములగు మునుల గోత్రములనేకము. ప్రజలు లేక అవి విడిగా యున్నవైననూ ఏకదేహముగలవానివలె యున్నవి. 76

ఏవం భూతేషు సర్వేషు పుత్రైర్మే నాస్తి కారణమ్‌ | భవాంశ్చ తాపసశ్రేష్ఠః ప్రజాపతిసమద్యుతిః || 77

తత్ర్పవర్తస్య వంశాయ వర్ధయాత్మానమాత్మనా | సమాధత్స్వోర్జితం తేజో ద్వితీయాం కురు వై తనుమ్‌ || 78

స ఏవముక్తో మునిభిర్మునిర్మనసి తాడితః | జగర్హ తానృషిగణాన్వచనం చేదమబ్రవీత్‌ || 79

యథా హి విహితో ధర్మో మునీనాం శాశ్వతః పురా | ఆర్షం హి కేవలం కర్మ వన్యమూలఫలాశినః || 80

బ్రహ్మయోనౌ ప్రసూతస్య బ్రాహ్మణస్యాత్మ వర్తినః | బ్రహ్మచర్యం సుచరితం బ్రహ్మాణమపి చాలయేత్‌ || 81

జనానాం వృత్తయస్తిస్రో యే గృహాశ్రమవాసినః | అస్మాకం చ వనే వృత్తిర్వనాశ్రమనివాసినామ్‌ || 82

అభ్భక్షా వాయుభక్షాశ్చ దంతోలూఖలినస్తథా | అశ్మకుట్టాదయో యత్ర పంచాగ్ని తపసశ్చ యే || 83

ఏతే తపసి తిష్ఠంతో వ్రతైరపి సుదుశ్చరైః | బ్రహ్మచర్యం పురస్కృత్య ప్రార్థయంతి పరాం గతిమ్‌ || 84

బ్రహ్మచర్యాద్బ్రాహ్మణస్య బ్రాహ్మణత్వం విధీయతే | ఏవమాహుః పరే లోకే బ్రహ్మచర్యవిదో జనాః || 85

అందరూ ఇట్లుండగా, నా పుత్రులతో నేమి కారణము? లేదు కదా!

ఇక నీవు తాపసశ్రేష్ఠుడవు, ప్రజాపతితో సమానమగు కాంతి గలవాడవు. కనుక, వంశముకై ప్రయత్నించుము. ఆత్మ వృద్ధిని గావించుకొనుము. నీ గొప్ప తేజస్సును కేంద్రీకృతము చేసి రెండవ శరీరమును నిర్మించుము. అని మునులనగా ఆ ముని మనసున దెబ్బతిని ఆ ఋషి గణముల గర్హించుచూ ఇట్లనెను :- 'పూర్వము మునులకు విహితమైన శాశ్వత ధర్మమిది. వన్యమూల ఫలముల దిను మునికి ఋషిప్రోక్తమైన కర్మయే ఆచరణీయము. బ్రహ్మ యోనియం దుద్భవించిన ఆత్మవర్తి యగు బ్రాహ్మణుడికి బ్రహ్మచర్యమే శ్రేయస్కరము. దీనిని సరిగా పాలించినచో ఈ బ్రహ్మచర్యము బ్రహ్మను కూడా కదిలించగలదు. గృహస్థాశ్రమమున నున్న జనుల వృత్తి మువ్విధము. వనాశ్రమమున నివసించు మాకు వనమున నుండుటే విహితము. ఏ వనమున జలభక్షులు, వాయుభక్షులు, యజ్ఞ కర్మల నాచరించువారు, పంచాగ్నుల మధ్య తపస్సు చేయువారు నివసింతురో, అనుసరించుటకు కష్టమగు వ్రతముల నాచరించువారుందురో అక్కడే మా నివాసము. బ్రహ్మచర్యము ద్వారానే పరమగతిని ప్రార్థించుదురు కదా! 'బ్రహ్మచర్యము ద్వారా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడనబడును.' అని బ్రహ్మచర్యము తెలిసిన ఉత్తమ లోకవాసులగు జనులనెదరు. 85

బ్రహ్మచర్యే స్థితో ధర్మో బ్రహ్మచర్యే స్థితం తపః | యే స్థితా బ్రహ్మచర్యే తు బ్రాహ్మణా దివి తే స్థితాః || 86

నాస్తి యోగం వినా సిద్ధిర్నాస్తి యోగం వినా యశః | నాస్తి లోకే యశోమూలం బ్రహ్మచర్యాత్పరంతప || 87

యో నిగృహ్యేంద్రియగ్రామం భూతగ్రామం చ పంచకమ్‌ |

బ్రహ్మచర్యం సమాధత్తే కిమతః పరమం తపః || 88

అయోగకేశధరణమసంకల్పవ్రతక్రియా | అబ్రహ్మచర్యాచర్యా చ త్రయం స్యాద్దంభసంజ్ఞితమ్‌ || 89

క్వ దారాః క్వ చ సంయోగః క్వ చ భావవిపర్యయః |

నన్వియం బ్రహ్మణా సృష్టా మనసా మానసీ ప్రజా || 90

యద్యస్తి తపసో వీర్యం యుష్మాకం విజితాత్మనామ్‌ |

సృజధ్వం మానసాన్‌ పుత్రాన్‌ ప్రాజాపత్యేన కర్మణా || 91

మనసా నిర్మితా యోనిరాధాతవ్యా తపస్విభిః | నో దారయోగం బీజం చ వ్రతముక్తం తపస్వినామ్‌ || 92

యదిదం లుప్తధర్మాఖ్యం యుష్మాభిరిహ నిర్భయైః | వ్యాహృతం సద్భిరత్యర్థమసద్భిరివ సంమతమ్‌ || 93

వపుర్దీప్తాంతరాత్మానమేష కృత్వా మనోమయమ్‌ | దారయోగం వినా స్రక్ష్యే పుత్రమాత్మతనూరుహమ్‌ || 94

ఏవమాత్మానమాత్మా మే ద్వితీయం జనయిష్యతి | ప్రాజాపత్యేన విధినా దిధక్షంతమివ ప్రజాః || 95

బ్రహ్మచర్యమున ధర్మమున్నది, తపస్సున్నది. బ్రహ్మచర్యమును పాటించు బ్రాహ్మణులు స్వర్గమున నున్నట్లే. యోగము లేక సిద్ధి లేదు, ఉత్తమ కీర్తి లేదు. ఓ ధీరుడా! బ్రహ్మచర్యము దప్ప కీర్తిమూలము లోకమున లేదు. పంచేంద్రియాలను, పంచభూతాలను నిగ్రహించి బ్రహ్మచర్యమును మనసు నిలుపువానికి ఇంతకంటే తపస్సేమి? సంస్కారము లేని కేశములతో నుండుట. సంకల్పించక వ్రతక్రియను చేయుట, బ్రహ్మచర్యములేని ఆచరణ ఇవియన్నీ దంభము అని చెప్పబడును. ఎక్కడ భార్య? ఎక్కడ సంయోగము? ఎక్కడిదీ భావ విపర్యయము? ఈ ప్రజ బ్రహ్మ మానసపుత్రికదా! ఆత్మను జయించిన మీరు తపశ్శక్తివున్నచో ప్రాజాపత్యకర్మతో మానసపుత్రులను సృజించండి. తపస్విజనులు తపోనిర్మిత యోనిని గ్రహించవలెను. తపస్వులకు దారయోగము (భార్యతో కలియుట) బీజమనిగానీ, వ్రతమనిగానీ చెప్పబడలేదు. ఇక మీరు నిర్భయంగా, సత్పురుషులైననూ అసత్పురుషులవలె ధర్మము లోపించినట్లు అంటిరో, దానికి నేను మనస్సుచే, జ్వలించు దేహముగల పుత్రుని భార్యతో కలియకనే నాశరీరమునుండి సృజించెదను. నా ఆత్మ ప్రాజాపత్యవిధిచే మరియొక ఆత్మను జనింపజేయును. ప్రజలను దహింప కోరుచున్నట్లు ఉండును.

వరుణ ఉవాచ :- ఉర్వస్తు తపసా7విష్టో నివేశ్యోరుం హుతాశ##నే |

మమంథైకేన దర్భేణ పుత్రస్య ప్రసవారణిమ్‌ || 96

తస్యోరుం సహసా భిత్వా వరో7సౌ హ్యగ్నిరుత్థితః | జగతో దహనాకాంక్షీ పుత్రో7గ్నిస్సమపద్యత || 97

ఉర్వస్యోరుం వినిర్భిద్య ఔర్వో నామంతకో7నలః | దిధక్షురివ లోకాంస్త్రీన్‌ జజ్ఞే పరమకోపనః || 98

ఉత్పద్యమానశ్చోవాచ పితరం దీనయా గిరా | క్షుధా మే బాధతే తాత జగద్భక్షే త్యజస్వ మామ్‌ || 99

త్రిదివారోహిభిః జ్వాలైః జృంభమాణో దిశో దశ | నిర్దహన్‌ సర్వభూతాని వవృధే సో7ంతకోపమః || 100

ఏతస్మిన్నంతరే బ్రహ్మా మునిముర్వం సమాగతః | ఉవాచ వార్యతాం పుత్రో జగతస్త్వం దయాం కురు || 101

అస్యాపత్యస్య తే విప్ర కరిష్యే సాహ్యముత్తమమ్‌ | తథ్యమేతద్వచః పుత్ర శ్రుణు త్వం వదతాం వర || 102

ఔర్వ ఉవాచ :- ధన్యో7స్మ్యనుగృహీతోస్మి యన్మే త్వం భగవాన్‌ శిశోః |

మతిమేతాం దదాసీహ పరమాత్మన్‌ హితాయ వై || 103

ప్రభాతకాలే సంప్రాప్తే కాంక్షితవ్యే సమాగమే | భగవంస్తర్పితః పుత్రః కైః హవ్యైః ప్రాప్య్సతే సుఖమ్‌ || 104

కుత్ర చాస్య నివాసః స్యాద్భోజనం తు కిమాత్మకమ్‌ | విధాస్యతీహ భగవాన్‌ వీర్యతుల్యం మహౌజసః | 105

వరుణుడు చెప్పసాగెను. -

అట్లు ఉర్వుడు తపస్సుగ నుండి తన తొడను అగ్నియందుంచి పుత్రుని కలిగించు అరణిని ఒక దర్భతో మధించెను. అపుడతని తొడను చీల్చుకొని ఈ శ్రేష్ఠమైన తేజస్సు జగత్తును దహించకోరి బయల్వెడలెను. ఉర్వుని తొడను చీల్చుకొని వచ్చినందున ఔర్వమని ఈ అగ్నికి పేరు. పరమ కోపముగలిగి ముల్లోకములను దహింపగోరినట్లుండెను. పుట్టగానే దీనముగా తండ్రి నిట్లడిగెను :- 'నాయనా ! నన్ను ఆకలి బాధించుచున్నది. నన్ను విడువుము. ముల్లోకముల భక్షించెదను' అని స్వర్గమున కెగియు జ్వాలలతో అన్ని దిక్కుల విస్తరించుచూ ఆ అగ్ని అన్ని ప్రాణుల దహించుచూ పెరిగిపోయెను. ఇంతలో బ్రహ్మ ఉర్వుడను ఆ ముని వద్దకు వచ్చి 'నీ పుత్రుని నివారించుము. జగత్తు పట్ల దయ చూపుము. ఈ నీ కుమారునికి సహాయము చేసెదను. పుత్రా ! ఇది నిజము. నామాట వినుము.' అనగా ఔర్వుడు 'ధన్యుడను. అనుగ్రహింపబడితిని. శిశువునైన నాకు భగవాన్‌ నీవే. ఈ బుద్ధిని హితముకై ఇచ్చుచుంటివి. ప్రొద్దుననే సమాగమము కోరబడినపుడు ఈ పుత్రుడు ఏ హవ్యములతో సుఖము నొందును? ఇతని నివాసమెక్కడ? గిప్ప తేజస్సు గల ఈతనికి భగవాన్‌ నీవే భోజన మివ్వగలవు. 105

బ్రహ్మోవాచ :- బడవా ముఖే చ వసతిః సముద్రే వై భవిష్యతి |

మమ యోనిర్జలం విప్ర తచ్చామేయం వ్రజత్వయమ్‌ || 106

తత్రాయమాస్తే నియతం పిబన్‌ వారిమయం హవిః | తద్వారివిస్తరం విప్ర విసృజామ్యాలయం చ తమ్‌ || 107

తతో యుగాంతే భూతానామేష చాహం చ పుత్రక | సహితో విచరిష్యావో నిష్పురాణకరావిహ ||108

ఏషో7గ్నిరంతకాలే తు సలిలాశీ మయా కృతః దహనః సర్వభూతానాం స దేవాసురరక్షసామ్‌ || 109

ఏవమస్త్వితి తం సోగ్నిః సంవృతజ్వాలమండలః | ప్రవివేశార్ణవముఖం నత్వోర్వం పితరం ప్రభుమ్‌ || 110

ప్రతియాతస్తతో బ్రహ్మా తే చ సర్వే మహర్షయః |

ఔర్వస్యాగ్నేః ప్రభావజ్ఞాః స్వాం స్వాం గతిముపాగతాః || 111

హిరణ్యకశిపుః దృష్ట్వా తదా తన్మహదద్భుతమ్‌ | ఉర్వం ప్రణతసర్వాంగో వాక్యమేతదువాచ హ || 112

భగవన్నద్భుతమిదం సంవృత్తం లోకసాక్షికమ్‌ | తపసా తే మునిశ్రేష్ఠ పరితుష్టః పితామహః || 113

అహం తు తవ పుత్రస్య తవ చైవ మహావ్రత | భృత్య ఇత్యవగంతవ్యః శ్లాఘ్యస్త్వమిహ కర్మణా || 114

తన్మాం పశ్య సమాపన్నం తవైవారాధనే రతమ్‌ యది సీదేన్ముని శ్రేష్ఠ తవైవ స్యాత్‌ పరాజయః || 115

అనగా బ్రహ్మ అతనితో 'సముద్రమున బడబ ముఖమున ఈ అగ్ని నివసించగలదు. నాకు కారణము జలము. దానినమేయముగా ఇతను పొంది నియతముగా జలరూపమగు హవిస్సును గ్రోలుచూ అక్కడనే వుండును. ఆ నీటి మొత్తమునితనికి ఆలయముగా చేసెదను. పిదప యుగాంతమున ఇతను, నేను కలసి పాతదన్నది లేకుండా చేయుచూ తిరిగెదము. ప్రళయమున ఈ అగ్ని జలమును భక్షించునట్లు నేను చేసితిని. దేవాసుర రాక్షసులతో అన్ని ప్రాణులనితడు దహించును.' అనగా ఆ అగ్ని సరేనని తండ్రియగు ఉర్వునికి నమస్కరించి, జ్వాల మండలముతో కూడి సముద్ర ముఖమును ప్రవేశించెను అటుపై బ్రహ్మ వెనుదిరిగెను. ఋషులందరూ ఔర్వాగ్ని ప్రభావమునెఱిగి తమ తమ గతులను పొందిరి. ఆ మహాద్భుతమును జూచి హిరణ్యకశిపుడు ఉర్వునకు సాష్టాంగప్రణామము చేసి ఇట్లనెను. 'భగవాన్‌! లోకాల సాక్షిగా జరిగిన ఇది మహాద్భుతము. నీ తపస్సుచే పితామహుడు సంతసించెను. మహావ్రతా ! నేను నీ పుత్రునికి, నీకు భృత్యుడనని తెలియుము. నీ కర్మచే గొప్పవాడవైతివి. నీ ఆరాధనమున ఆసక్తిగల నేను ఆపదనొందుట చూడుము. నేను కష్టమొందినచో నీకే పరాజయము కాగలదు. 115

ఉర్వ ఉవాచ:- ధన్యోస్మ్యనుగృహీతోస్మి యస్యతేహం గురుర్మతః |

నాస్తి తే తపసానేన భయం చైవేహ సువ్రత || 116

తామేవ మాయాం గృహ్ణీష్వ మమ పుత్రేణ నిర్మితామ్‌ | నిరింధనామగ్నిమయీం దుఃస్పర్శాం పావకైరపి || 117

ఏషా తే స్వస్య వంశస్య వశగారివినిగ్రహే | రక్షిష్యత్యాత్మపక్షం చ విపక్షం చ వ్రధక్ష్యతి || 118

వరుణ ఉవాచ :- ఏషా దుర్విషహా మాయా దేవైరపి దురాసదా |

ఔర్వేణ నిర్మితా పూర్వం పావకేనోర్వసూనునా || 119

తస్మింస్తు వ్యథితే దైత్యే నిర్వీర్యైహా న సంశయః | శాపో హ్యస్యాః పురా దత్తః నృష్ఠా యేనైవ తేజసా || 120

యద్యేషా ప్రతిహంతవ్యా కర్తవ్యో భగవాన్‌ సుఖీ | దీయతాం మే సఖే శక్ర తోయయోనిర్నిశాకరః || 121

తేనాహం సహ సంగమ్య యదోభిశ్చ సమావృతః |

మాయామేతాం హనిష్యామి త్వత్ప్రసాదాన్న సంశయః || 122

ఏవమస్త్వితి సంహృష్టః శక్రస్త్రిదశవర్ధనః | సందిదేశాగ్రతః సోమం యుద్ధాయ శిశిరాయుధమ్‌ || 123

గచ్ఛ సోమ సహాయం త్వం కురు పాశధరస్య వై | అసురాణాం వినాశాయ జయార్ధం త్రిదివౌకసామ్‌ || 124

అనగా ఉర్వుడు అతనితో ఇట్లనెను:- 'నన్ను నీవు గురువుగా భావించుటచే నేను ధన్యుడనై అనుగ్రహింపబడినాను. ఈ తపస్సుచే ఇక నీకు భయము కలుగదు. సువ్రతా ! నా పుత్రుడు నిర్మించిన మాయనే అవలంబించు. ఇంధనములేని అగ్నితో కూడినది, అగ్నులు కూడా తాకలేనటువంటిది నీ వశమున నుండి నీ వంశ శత్రువుల అణచగలదు. నీ పక్షమును రక్షించగలదు. శత్రుపక్షమును దహించివేయగలదు.' అనెనని వరుణుడు చెప్పి 'పూర్వము ఉర్వుని పుత్రడగు ఔర్వుడు నిర్మించిన మాయ ఇది. సహించ శక్యముగానిది. దేవతలూ చేరరానిది. ఆ దైత్యుడు వధింపబడినచో ఈ మాయశక్తి లేనిదగును. ఎవరి తేజస్సుతో ఈ మాయ సృజింపబడెనో, అట్టి ఈ మాయకు పూర్వము శాపమివ్వబడెను. ఈ మాయ నశించి భగవంతుడు సుఖముగ నుండవలెనన్న నాకు చంద్రుని ఇవ్వుము. అతనితో కలిసి, జల జంతువులతో కూడి నీ ప్రసాదముచే ఈ మాయను వధించెదను. సంశయము లేదు' అనగా దేవతలకు వృద్ధిని కలుగజేయు ఇంద్రుడు అలాగేనని సంతోషముగా పలికి మంచే ఆయుధమైన చంద్రుని యుద్ధమునకై ఇట్లాదేశించెను. 'చంద్రా! నీవు వెళ్ళి అసురుల వినాశానికై, దేవతల జయానికై వరుణునికి సహాయము చేయుము. 124

త్వ మతః ప్రతివీర్యశ్చ జ్వోతిషామపి చేశ్వరః | త్వన్మయాన్‌ సర్వలోకేషు రసాన్‌ వేదవిదో విదుః || 125

త్వయా సమో న లోకేస్మిన్‌ విద్యతే శిశిరాయుధః | క్షయవృద్ధీ తవావ్యక్తేసాగరే చైవ చాంబరే || 126

ప్రవర్తయస్యహోరాత్రాత్కాలం సంయోహయన్‌ జగత్‌ |

లోకచ్ఛాయామయం లక్ష్మ తవాంకః శశవిగ్రహః || 127

న విదుః సోమ తే మాయాం యే చ నక్షత్రయోనయః | త్వమాదిత్యపథాదూర్ధ్వం జ్యోతిషాం చోపరిస్థితః || 128

తమః ప్రోత్సార్య సహసా భాసయస్యఖిలం జగత్‌ | శీతభానుర్హిమతనుః జ్యోతిషామధిపః శశీ || 129

అపి తత్కాలయాగాత్మా ఇజ్యో యజ్ఞరథ్యోవ్యయః | ఓషధీశః క్రియాయోనిరపాం యోనిరనుష్ణగుః || 130

శీతాంశురమృతాధారశ్చపలః శ్వేతవాహనః | త్వం కాంతిః కాంతవపుషాం త్వం సోమః సోమపాయినామ్‌ || 131

సౌమ్యస్త్వం సర్వభూతానాం తిమిరఘ్న స్త్వమృక్షరాట్‌ | తద్గచ్ఛ త్వం మహాసేన వరుణన వరూధినా || 132

నీవు తగిన జోడీయగు వీరునవని అభిప్రాయము. నక్షత్రాల రాజువు కూడా. వేదవేత్తలు అన్ని లోకములందు రసములన్నీ నీవేనని తెలియుదురు. నీతో సమానమగు శిశిరాయుధుడు (మంచే ఆయుధముగా గలవాడు) లోకమున లేడు. సాగరమున, ఆకాశమున కూడా నీ ఈ క్షయము, వృద్ధి అవ్యక్తమైనవి. అహోరాత్రములచే కాలమును ప్రవర్తింపజేయుచూ జగత్తును మోహపరచుచుంటివి. నీయందున్న ఈ మచ్చ కుందేలువలె నున్నది లోకముయొక్క ఛాయయే. చంద్రుడా! నీ మాయను నక్షత్రకారకులగువారునూ తెలియజాలరు. ఆదిత్య మార్గమునకు, నక్షత్రములకు పైన నున్నాను. చీకటిని పారదోలి అఖిల జగత్తులో వెలుగు నింపుచున్నావు. చల్లని కిరణములు గలవాడవు, మంచు శరీరము గలవాడవు, నక్షత్రరాజువు. ఆయా కాలయోగరూపుడవు, యజింప బడదగువాడవు. యజ్ఞమును వహించువాడవు, నాశములేని వాడవు. ఓషధులకు ప్రభువువు. క్రియలకు కారణము జలకారణము, అనుష్టకిరణుడవు. శీతాంశువు, అమృతమునకాధారమువూ చపలుడవు. శ్వేత వామనుడవు, నీవే కాంతిమయ శరీరుల కాంతివి. సొమము ద్రావువారి సోమము. అన్ని ప్రాణులయందు సౌమ్యుడవు, చీకటిని చీల్చువాడవు, నక్షత్రరాజువు. కనుక ఓ చంద్రా! నీవు వరుణునితో వెళ్ళి మమ్మలను రణమున దహించుచున్న అసురీ మాయను శమింపజేయుము. 132

శమయస్వాసురీం మాయాం యయా దహ్యామహే రణ |

సోమ ఉవాచ-యన్మాం వదసి యుద్ధార్థం దేవరాజ వరప్రద || 133

ఏష వర్షామి శిశిరం దైత్యమాయాపకర్షణమ్‌ | ఏతాన్మే శీనిర్ధగ్ధాన్‌ పశ్యస్వ హిమవేష్టితాన్‌ || 134

తథా హిమకరోత్సృష్టాః సహసా హిమవృష్టయః | వేష్టయంతి చ తాన్‌ దైత్యాన్‌ వాయుర్మేఘగణానివ || 135

తౌ పాశశీతాంశుధరౌ వరుణందూ మహాబలౌ | జఘ్నతుర్హిమ పాతైశ్చ పాశపాతైశ్చ దానవాన్‌ || 136

ద్వావంబునాథౌ సమరే తౌ పాశహిమయోధినౌ | మృథే చేరతురంభోభి క్షుబ్ధావివ మహార్ణవౌ || 137

తాభ్యామాపూరితం సర్వం తద్ధానవబలం మహత్‌ | జగత్సంవర్తకాంభోదైః ప్రవర్షైరివ సంవృతమ్‌ || 138

తావుద్యతావంబునాథౌ శశాంకవరుణావుభౌ | శమయామాసతుస్తాం తు మాయాం దైత్యేంద్రనిర్మితామ్‌ || 139

శీతాంశుజాలనిర్ధగ్ధాం పాశైశ్చాస్కందితా రణ | న శేకుశ్చలితుం దైత్యా విశిరస్కా ఇవాద్రయః || 140

శీతాంశు నిహతాస్తే తు దైత్యాస్సర్వే నిపాతితాః | హిమప్లావిత సర్వాంగా నిరూష్మాణ ఇవాగ్నయః || 141

తేషాం తు దివి దైత్యానాం నిపతంతి శుభాని వై| విమానాని విచిత్రాణి నిపతంత్యుత్పతంతి చ || 142

అనగా అపుడు చంద్రుడిట్లనెను. 'దేవరాజా! యుద్ధముకొరకు నీవు చెప్పుచున్నట్లే నేను దైత్యులమాయను తొలగించునట్లు మంచును కురిపించెదను. మంచుతో కప్పబడి, చలితో దెబ్బతినువారిని చూడుము. అట్లే మంచుకిరణములనుండి వెడలు పాశములతోని హిమవర్షములు దైత్యులను వాయువు మేఘములను కమ్మినట్లు కమ్మివేయును, అపుడు పాశములను, శీతకిరణములను దాల్చి మహాబలుడైన వరుణుడు, చంద్రుడు హిమముతో, పాశములతో దానవుల వధించసాగిరి. వారిద్దరూ యుద్ధములో, క్షోభిల్లిన సముద్రాల వలె చరించిరి. మహద్బలము గల ఆ దానవసైన్యము, వారు చుట్టు ముట్టడంతో సంవర్తక మేఘములు కురియుచూ చుట్టుముట్టగా జగత్తువలె తల్లడిల్లినది. వారిద్దరూ ఆయుధములనెత్తి దైత్యేంద్రుడు నిర్మించిన ఆ మాయను శమింపజేసిరి. రణమున శీతకిరణములతో దెబ్బతిని, పాశములతో కప్పబడి దైత్యులు తలలుతెగి, పర్వతాల వలె కదలకుండిరి. శీతకిరణముల దెబ్బతిని దైత్యులందరూ నేలకూలి, అవయవములపై హిమము కమ్ముకోగా వేడిలేని అగ్నులవలెనుండిరి. ఆకాశమున ఆ దైత్యుల విమానములు విచిత్రములుగా పైకెగియుచూ, నేల కూలుచూ వుండెను. 142

తాన్పాశహస్తగ్రథీతాన్‌ ఛాదితాన్‌ శీతరశ్మిభిః | మయో దదర్శ మాయావీ దానవాన్‌ దివి దానవః || 143

స శైలజాలాం వితతాం ఖడ్గపట్టసహాసినీమ్‌ | పాదపోత్కరకూటస్థాం కందరాకీర్ణకాననామ్‌ || 144

సింహవ్యాఘ్ర గణాకీర్ణం నదద్భిర్ధేవయూథపై | ఈహామృగగణాకీర్ణం పవనాఘార్ణితద్ద్రుమామ్‌ || 145

నిర్మితాం స్వేన పుత్రేణ కూజంతీం దివి కామగామ్‌ | ప్రధితాం పార్వతీం మాయాం నసృజే స సమంతతః || 146

సాసిశ##బ్దైశ్శిలావర్షైః సంపతద్భిశ్చ పాదపైః | జఘాన దేవసంఘాంస్తే దానవానభ్యజీవయత్‌ || 147

నైశాకరీ వారుణీ చ మాయే అంతర్హితే తదా | అభవద్‌ ఘోరసంచారా పృథీవీ పర్వతైరివ || 148

న చారుద్ధో ద్రుమగణౖర్ధేవోదృశ్యత కశ్చన | తదపధ్వస్తధనుషం భగ్నప్రహరణావిలమ్‌ || 149

నిష్ప్రయత్నం సురానీకం వర్జయిత్వా గదాధరం | స హి యుద్ధ గతః శ్రీమానీశో నస్మ వ్యకంపత || 150

సహిష్ణుత్వాజ్జగత్‌స్వామీ న చుక్రోధ గదాధరః | కాలజ్ఞః కాలమేఘాభః సమీక్షన్‌ కాలమాహవే || 151

దానవుడగు మయుడు దానవులు పాశములచే కట్టబడుటను, చల్లని కిరణములచే కప్పబడుటను చూచి మాయావియై పేరొందిన పార్వత మాయను అంతటా సృజించెను. ఆ మాయ గుట్టలతో విస్తరించి ఖడ్గపట్టములతో వెలుగుచుండెను. వివిధ వృక్షముల కూటమిని గలిగి, గుహలు మిక్కుటంగా నున్న అడవులతో, సింహ, వ్యాఘ్ర గణములతో ఈహామృగగణములతో నిండియుండెను. అందు వృక్షములు గాలి వీచుటచే తిరుగుచుండెను. తన ఇష్టముననుసరించు వెళ్ళు ఆ మాయ మెల్లని ధ్వని చేయుచుండెను. శిలా వర్షముతో, వృక్షముల ఎల్లెడల పడవేయుచూ ఆ మాయ దేవ సంఘములను బాధించుచూ దానవులను పునరుజ్జీవింప జేసెను. అపుడు చంద్రుని మాయ, వరుణుని మాయ మాయమాయెను. అపుడు పృథివి ఘోరమైన సంచారముగల దాయెను. వృక్షములతో కప్పబడని దేవుడొకడైననూ కనబడకపోయెను. విష్ణువు దప్ప మిగిలిన దేవగణమంతా ధనుస్సులు విరిగి, ఆయుధములు విరిగి చేష్టలుడిగియుండెను. యుద్ధమున నిలిచిన విష్ణువు మాత్రము చలించక యుండెను. సహించు శీలముగలవాడు కనుక విష్ణువు యుద్ధమున ఇట్టి కాలమును గమనించి కాలము తెలిసిన వాడైనందున కోపించలేదు. 151

దేవాసురవిమర్దం చ ద్రష్టుకామస్తదా హరిః | తతో భగవతాదిష్టౌ రణ పావకమారుతౌ || 152

చోదితౌ విష్ణువాక్యేన తతో మాయాం వ్యకర్షతామ్‌ |

తాభ్యాముద్భ్రాన్త వేగాభ్యాం ప్రబుద్దాభ్యామ్మహాహవే || 153

దగ్ధా సా పార్వతీ మాయా భస్మీభూతా ననాశ హ | సోనలోనల స్సో7నిలశ్చానిలాకులః || 154

దైత్యసేనాం దదహతుర్యుగాంతేష్వివ మూర్ఛితౌ | వాయుః ప్రజవితస్తత్ర పశ్చాదగ్నిశ్చ మారుతాత్‌ || 155

చేరతుర్దానవానీకే క్రీడంతావనలానిలౌ | భస్మీభూతేషు భూతేషు ప్రపతత్సూత్పతత్సు చ || 156

దానవానాం విమానేషు నిపతత్సు సమంతతః | వాతస్కంధాపవిద్దేషు కృతకర్మణి పావకే || 157

మాయావధే పవృత్తే తు స్తూయమానే గదాధరే | నిష్ప్రయత్నేషు దైత్యేషు త్రైలోక్యే ముక్తబంధనే || 158

ప్రహృష్టేషు చ దేవేషు సాధుసాధ్వితి జల్పిషు | జయే దశశతాక్షస్య దైత్యానాం చ పరాజయే || 159

దిక్షు సర్వాసు శుద్ధాసు ప్రవృత్తే ధర్మవిస్తరే | ఆపావృత్తే చంద్రపథే స్వస్థానస్థే దివాకరే || 160

అపుడు శ్రీహరి దేవాసురయుద్ధమును చూడగోరెను. ఆపుడు విష్ణువు మాటచే ప్రేరితులై అగ్ని, వాయువు ఆ మాయను లాగివేసిరి. మిక్కిలి వేగముతో వారెగిసిపడగా ఆ యుద్ధమున పార్వత మాయ దహింపబడి, భస్మమై నశించెను. అగ్ని, వాయువు, యుగాంతమున పెచ్చరిల్లునట్లు, దైత్య సేనను దహించిరి. ముందు వాయువు వేగముగా వీచగా, తరువాత అగ్ని వర్ధిల్లెను. వారిద్దరూ యుద్ధమున క్రీడించునట్లు తిరగసాగిరి. అన్ని ప్రాణులు భస్మముగా చేయబడెను. దానవుల విమానాలు ఎల్లెడల నేల కూలసాగెను. గాలి వాని రెక్కలు విరవసాగెను. అగ్ని వానిని దహించుచుండెను. ఇట్లు మాయ వధ మొదలవగా, విష్ణువునందరూ స్తుతించిరి. దైత్యులందరూ చేష్టలుడిగినవారు కాగా, ముల్లోకములు వారి బంధనము నుండి బయటపడెను. దేవతలందరూ సంతసించి 'బాగు బాగు' అని అనుచుండిరి. ఇంద్రునికి విజయము, దైత్యులకు పరాజయము కలుగగా దిక్కులన్నీ ప్రసన్నము లాయెను. ధర్మము విస్తరించగా చంద్ర పథము నుండి తొలిగి సూర్యుడు తన స్థానమున నుండెను. 160

ప్రవృత్తిస్థేషు భూతేషు నృషు చారిత్రవత్సు చ | అభిన్నం బంధనే మృత్యౌ హుయమానే హుతాశ##నే || 161

యజ్ఞశోభిషు దేవేషు స్వర్గమార్గం దిశత్సు చ | లోకపాలేశు సర్వేషు దిక్షు సంధానవర్తిషు || 162

భావే తపసి సిద్ధాంనామభావే పాపకర్మణామ్‌ | దేవపక్షే ప్రముదితే దైత్యపక్షే విషీదతి || 163

త్రిపాదవిగ్రహే ధర్మేధర్మే పాదపరిగ్రహే | ఆపావృత్తే మహాద్వారే వర్తమానే చ సత్పథే || 164

లోకేషు ధర్మవృత్తేషు ప్రవృత్తేష్వాశ్రమేషు చ | ప్రజారక్షణయుక్తుషు రాజమానేషు రాజసు || 165

ప్రశాంతేషు చ లోకేషు శాంతే తమసి దాననే | అగ్నిమారుతయోస్తస్మిన్‌ వృత్తే సంగ్రామకర్మణి || 166

తన్మయా విమలా లోకాస్తాభ్యాం జయకృతక్రియాః |

తీవ్రం దైత్యభయం శ్రుత్వా మారుతాగ్నికృతం మహత్‌ || 167

కాలనేమీతి విఖ్యాతో దానవః ప్రత్యదృశ్యత | భాస్కరాకారమకుటః శింజితాభరణాంగదః || 168

మందరాద్రిప్రతీకాశో మహారజతసంవృతః | శతప్రహరణోదగ్రః శతబాహుః శతాననః || 169

శతశీర్షః స్థితః శ్రీమాన్‌ శతశృంగ ఇవాచలః | కక్షే మహతి సంవృద్ధో నిదాఘ ఇవ పావకః || 170

అన్ని భూతములు తమ ప్రవృత్తి ననుసరించి యుండెను. పాలకులు చరిత్ర గలవారిగ నుండిరి. భేదము లేక మృత్యువు బంధించుచుండెను. నిత్యము అగ్నికి హవనము చేయుచుండిరి. యజ్ఞములచే శోభించు దేవతలు స్వర్గమార్గమును చూపుచుండిరి. లోకపాలురందరు తమ తమ దిక్కులందు సంధానించుచుండిరి. తపస్సు యుండగా సిద్ధిని పొందుచుండిరి, అది లేక పాపము నాచరించువారైరి. దేవ పక్షము సంతోషముతో, దానవ పక్షము విషాదముతో నుండెను. ధర్మము మూడు పాదములలో, అధర్మము ఒక పాదములో నుండెను. మహాద్వారము తొలిగి, మంచి మార్గము మాత్రమే వుండెను. లోకములన్నీ ధర్మము ననుసరించుచుండెను. ఆశ్రమములను పాటించుచుండెను. రాజులు ప్రజారక్షణ చేయుచుండిరి. దానవ తమస్సు శాంతించి లోకములు ప్రశాంతమాయెను. ఆ విధంగా అగ్ని, వాయువు యుద్ధ కర్మ యందుండగా జయము నొందిన లోకములన్నీ విమలములయ్యెను. వారిద్దరి నుండి దైత్యులు పొందిన భయాన్ని విని కాలనేమియను దైత్యుడు యుద్ధమున ప్రత్యక్షమయ్యెను. ప్రకాశించు మకుటముతో, చిరుగజ్జల ఆభరణాలతో, మందర పర్వతము వలె నుండి, మహా రజతముతో కప్పబడి యుండెను. నూరు చేతులు, ముఖాలుగలిగి, నూరు తలలు, ఆయుధాలతో నూరు శిఖరాలు గల పర్వతము వలె నుండి ఒకమూల గ్రీష్మ కాలంలో అగ్ని వలె పెరిగెను. 170

ధూమ్ర కేశో హరిశ్మశ్రుర్ధంతురో వికటాననః | త్రైలోక్యాంతరవిస్తారం ధారయన్‌ విపులం వపుః || 171

బాహుభిస్తులయన్‌ వ్యోమ క్షిపన్‌ పద్భ్యాం మహీధరాన్‌ |

ఈరయన్‌ ముఖనిఃశ్వాసైః వృష్టికారాన్‌ బలాహకాన్‌ || 172

తిర్యగాయతరక్తాక్షం మందరోదగ్రవర్చసమ్‌ | దిధక్షమివాయాంతం సర్వాన్‌ దేవగణాన్‌ మృధే 173

తర్జయంతం సురగణాన్‌ ఛాదయంతం దిశో దశ | సంవర్తకాలే హృషితం దృష్టం మృత్యుమివోత్థితమ్‌ || 174

సుతలేనోచ్ఛ్రయవతా విపులాంగులిపర్వణా | లంబాభరణపూర్ణేన కించిచ్చలితకర్మణా || 175

ఉచ్ఛ్రితేనాగ్రహస్తేన దక్షిణన వపుష్మతా | దానవాన్ధేవనిహతాన్‌ బ్రువంతం తిష్ఠవేతి చ || 176

తం కాలనేమిం సమరే ద్విషతాం కాలనేమినమ్‌ | వీక్షంతే స్మ సురాః సర్వే భయవిహ్వలలోచనాః || 177

తం వీక్షంతే స్మ భూతాని గ్రసంతం కాలనేమినమ్‌ | త్రివిక్రమం విక్రమంతం నారాయణమివాపరమ్‌ || 178

సోభ్యుచ్ఛ్రయం పునః ప్రాప్తో మారుతాఘార్ణితాంబరః | ప్రాక్రామదసురో యోద్ధుం త్రాసయన్‌ సర్వదేవతాః || 179

ఆ కాలనేమి ధూమ్రవర్ణ కేశములు గలిగి, శ్మశ్రువులు గలిగి, దంతములతో, వికటమగు ముఖముతో నుండెను. ముల్లోకముల మధ్య వ్యాపించు విపుల శరీరమును ధరించుచూ, చేతులతో ఆకాశాన్ని కొలుచుచూ, కాళ్ళతో భూమిపై పర్వతముల తన్నుచూ, ముఖముల నుండి వచ్చు గాలులతో వర్షిచు మేఘముల తోసివేయుచూ వెడల్పైన కన్నులతో కాంతితో మందరపర్వతము వలె నిలిచెను. దేవగణముల నన్నింటినీ యుద్ధమున దహింపకోరి వచ్చినట్లు, సురగణముల బెదిరించుచూ, అన్ని దిక్కులనూ కప్పివేయుచూ, సంవర్తకాలమున హర్షముతో పైకెగిసిన మృత్యువు వలె అతనుండెను. చక్కని తలము, ఎత్తు గలిగి విపులమైన వేళ్ళు గలిగి, వేలాడుచున్న కదలుచూ వున్న ఆభరణములతో తన కుడిచేతినెత్తి దెబ్బతిని యున్న దానవులను 'నిలు'మని యనుచున్న కాలనేమిని దేవతలు చూచిరి. యుద్ధమున శత్రువుల కాలము నాపివేయు ఆ కాలనేమని చూచి వారు భయవిహ్వలులైనారు. భయముతో విప్పారిన కళ్ళతో వారు ప్రాణుల కబళించు కాలనేమిని చూచిరి. ఆపరనారాయణుని వలె త్రివిక్రముడై పరాక్రమిస్తున్న కాలనేమి వస్త్రములు గాలికి కదలాడుచుండినవి. అట్లు అభ్యుదయమును పొందిన ఆ దానవుడు దేవతలందిరినీ భయపెట్టుచూ, యుద్ధమున కుపక్రమించెను. 179

సమేయివాన్‌ సురేంద్రేణ సర్వత్ర చ భ్రమన్‌ రణ | కాలనేమిర్భభౌ దైత్యః సవిష్ణురివ మందరః || 180

ఆథ వివ్యథిరే దేవాః సర్వే శక్రపురోగమాః | కాలనేమినమాయాంతం దృష్ట్వా కాలమివాపరమ్‌ || 181

దానవాననుపిప్రీషుః కాలనేమిర్మహాసురః | వ్యవర్థత మహాతేజాస్తపాంతే జలదో యథా || 182

తం త్రైలోక్యాంతరంగతం దృష్ట్వా తే దానవేశ్వరాః | ఉత్తస్థురపరిశ్రాంతాః పీత్వేవామృతముత్తమమ్‌ || 183

తే వీతభయసంత్రాసా మయాతారపురోగమాః | తారకామయసంగ్రామే సతతం జితకాశినః || 184

రేజురాయోధనగతా దానవా యుద్ధకాంక్షిణః | మంత్రమభ్యసతా తేషాం వ్యూహం చ పరిధావతామ్‌ || 185

ప్రేక్షతాం చాభవత్‌ ప్రీతిర్ధానవం కాలనేమినమ్‌ | యే తు తత్ర మయస్యాసన్‌ ముఖ్యా యుద్ధపురస్సరాః || 186

తే తు సర్వే భయం త్వక్త్వా హృష్ట్వా యోద్ధుముపస్థితాః | మయస్తారో వరాహశ్చ హయగ్రీవశ్చ దానవః || 187

విప్రచితిసుతః శ్వేతః ఖరలంబావుభావపి | అరిష్టో బలిపుత్రశ్చ కిశోరాఖ్యస్తథైవ చ || 188

సుర్భానుశ్చామరప్రఖ్యశ్చక్రయోధీ మహాసురః |

రణమున అటు నిటు తిరుగుచూ దేవేంద్రునితో తలపడిన ఆ కాలనేమి యను దైత్యుడు విష్ణువుతో నున్న మందరము వలె భాసించెను. అపుడు ఇంద్రాది దేవతలు అపర మృత్యువు వలె వచ్చి పడుచున్న ఆ కాలనేమిని చూచి వ్యథ నొందిరి. దానవులకు ప్రీతిని కలిగించగోరి ఆ మహా సురుడు గ్రీష్మ కాలము చివర మేఘము వలె గొప్ప తేజస్సుతో వర్ధిల్లెను. ముల్లోకముల వ్యాపించిన అతనిని చూచి అమృతమును ద్రావిన వారి వలె దానవరాజులు విశ్రాంతి లేక లేచి నిలిచిరి. భయము లేక వారు మయతారాది దైత్యులతో తారకామయ సంగ్రామమున, యుద్ధము కోరి వెళ్ళిన ఆ దైత్యులు విరాజిల్లిరి. మంత్రము నుచ్ఛరించుచున్నవారికి, వ్యూహమున పరుగులిడువారికి, ఆ దానవుని చూచువారికి ప్రీతి కలిగెను. మయుని ముఖ్యయుద్ధవీరులు హర్షమునొంది భయము వీడి యుద్ధముచేయుటకు సిద్ధపడిరి. మయుడు, తారుడు, వరాహుడు, హయగ్రీవుడను దానువుడు, విప్రచితిసుతుడు శ్వేతుడు, ఖరుడు అంబుడు ఇరువురు, రిష్టుడను బలపుత్రుడు, కిశోరుడు సుర్భానుడు, అమరప్రఖ్యుడను గొప్ప యోధుడు - వీరంతా అస్త్రములందు నేర్పరులు. 188

ఏతేస్త్రవేదినః సర్వే సర్వే తపసి సుస్థితాః |

దానవాః కృతినో జగ్ముః కాలనేమినమద్భుతమ్‌ | తే గదాభిస్సుగుర్వీభిశ్చక్రైరథ పరశ్వధైః || 190

కాలకల్ఫైశ్చ ముసలైః క్షేపణీయైశ్చ ముద్గరైః | ఆశ్మభిశ్చాస్త్రసదృశైస్తథా శైలైశ్చ దారుణౖః || 191

పదృసైర్భిండిపాలైశ్చ పరిఘ్తెశ్చోత్తమాయసైః | ఘాతినీభిశ్చ గుర్వీభిః శతఘ్నీ భిస్తథైవ చ || 192

యుగైర్యcత్రైశ్చ నిర్ముక్తైర్లాంగలైరుగ్రతాడితైః | దోర్భిరాయతమానైశ్చ పాశైశ్చ పరిఘాదిభిః || 193

భుజంగవక్త్రైర్లేలిహానైర్విసర్పద్భిశ్చ సాయకైః | వజ్రైః ప్రహరణీయైశ్చ దీప్యమానైశ్చ తోమరైః || 194

వికోశైరసిభిస్తీక్ష్నైః శూలైశ్చ శితనిర్మలైః | దైత్యైః సందీప్యమానైశ్చ ప్రగృహీతశరాసనైః || 195

తతః పురస్కృత్య తదా కాలనేమినమాహవే | సా దీప్తశస్త్రప్రవరా దైత్యానాం రురుచే చమూః || 196

యైర్నిమీలితసర్వాంగా వనాళీవాంబుదాగమే | దైవతానామపి చమూర్ముముదే శక్రపాలితా || 197

ఈ దానవులంతా తపస్సునాచరించువారు. అస్త్రవిద్య చక్కగా తెలిసినవారు. అట్టి ఈ ధన్యులు కాలనేమిని చేరిరి. వారు బరువైన గదలతో, చక్రములతో, గొడ్డళ్ళతో, మృత్యువువంటి నాగళ్ళతో, విసరగలగు ముద్గరములతో, అస్త్రములవంటి రాళ్ళతో, దారుణ శైలములతో, సదృసములతో, భిండిపాల, పరిఘ, ఆయసవంటి ఆయుధములతో, వధించునవి, బరువైనవైన శతఘ్నులతో, యంత్రములచే విడువబడిన పదునైన ఆయుధములతో, పాశములతో, సర్పమువంటి నోరుగలిగిన ఆవేశముతో శరాసనాలను గ్రహించిన దైత్యులలో కాలనేమిని చేరగా, ఆ దైత్యసేన మిగుల శోభిల్లెను. మేఘముల రాకచే పూర్తిగా మరుగున పడిన వనపంక్తివలె అవయవములన్నీ మరుగనపడగా ఇంద్రునిపాలనలోనున్న దేవతల సేన కూడా మోదమునొందినది. 197

ఉపేతా శిశిరాష్ణాభ్యాం తేజోభ్యాం చంద్రసూర్యయోః | వాయువేగవతీ సౌమ్యా తారాగణపతాకినీ || 198

తోయదాబద్ధవసనా గ్రహనక్షత్రహాసినీ | యమేంద్రధనుదైర్గుప్తా వరుణన చ ధీమతా || 199

సా ప్రదీప్తాగ్నిపవనా నారాయణపరాయణా | సా సముద్రౌఘసదృశీ దీప్యమానా మహాచమూః || 200

రరాజజాస్త్రవతీ భీమా యక్షగంధర్వశాలినీ | తయోశ్చమ్వోస్తదానీం తు బభూవ స సమాగమః || 201

ద్యావాపృథివ్యోస్సంయోగో యథా స్యాద్యుగపర్యయే | తద్యుద్ధమభవద్ఘోరం దేవదానవసంకులమ్‌ || 202

క్షమాపరాక్రమపరం సదర్పవినయస్యదమ్‌ | నిశ్చక్రముర్బలాభ్యాం తు భీమాభ్యాం చ సురాసురాః || 203

పూర్వాపరాభ్యాం సంరబ్ధాః సాగరాభ్యామివాcబుదాః | తాభ్యాం బలాభ్యాం సంహృష్టాశ్చేరుస్తే దేవదానవాః || 204

వనాభ్యాం పార్వతీయాభ్యాం పుష్పితాభ్యాం యథా నగాః | సమాజఘ్నస్తథా భేరీః శంఖాన్‌ దధ్మురనేకశః || 205

బ్రహ్మాండం చ భువం చైవ దిశశ్చ సమపూరయన్‌ | జ్యాఘాతతలనిర్ఘోషో ధనుషాం కూజితాని చ || 206

ఆ దేవసేన చంద్ర సూర్యుల తేజస్సులతో, శిశిరము, ఉష్ణములతో కూడి వాయువేగమును, తారాగణపతాకమును కలిగి ప్రకాశించెను. మేఘములే వస్త్రములై, గ్రహనక్షత్రములే హాసములై యమేంద్రకుబేరులు వరుణుడు రక్షించుచుండగా, అగ్ని వాయువులు ప్రకాశించుచుండగా ఆ సేన వెలుగుచుండెను అస్త్రములు గలిగి భయంకరముగా నుండిన దేవసేన, రాక్షససేన అప్పడు యుద్ధమున ఎదురుపడెను. యుగసమాప్తి జరుగునపుడు ఆకాశము, పృథివి కలిసిన ఎంత ఘోరముగా నుండునో, దేవదానవుల యుద్ధమూ అంత ఘోరముగా నుండెను. క్షమ, (ఓర్పు) పరాక్రమమొకవైపు, దర్పము వినయము మరొకవైపు, దైత్యులు, దేవతలలో నుండెను. సురాసురులపుడు తమ బలములతో బయల్వెడలిరి. పూర్వాపర సముద్రజలములతో బయల్వెడలిన మేఘమువలె వారు తమతమ బలములతో హర్షము నొందిరి. పుష్పించిన పర్వతప్రదేశాలలోని వనములతో పర్వతాలవలె వారు హర్షించిరి. అపుడు భేరీవాద్యాలను అనేక విధాలుగా మ్రోగించిరి. శంఖాలను పూరించిరి. బ్రహ్మాండమును, భూమిని, దిక్కులనన్నింటిని పూరించుచూ ధనుష్టంకారధ్వని, ధనస్సుల అవ్యక్త మధురధ్వని బయల్వెడలెను. 206

దందుభీనాం చ నిర్హ్రాదైర్దైత్యమంతరధ్దుః స్వనమ్‌ | తేన్యోన్యమభిసంపేతుర్యాతయంతః పరస్పరమ్‌ || 207

బభంజుర్బాహుభిర్బాహుయుద్ధమన్యే యుయుత్సవః | దేవానామశనీర్ఘోరాః పరిఘాంశ్చోత్తమాయుధాన్‌ || 208

నిస్త్రింశాన్‌ ససృజుః సంఖ్యే గదా గుర్వీశ్చ దానవాః | గదానిపాతైర్భగ్నాంగా బాణౖశ్చ శకలీకృతాః || 209

పరిపేతుః భృశం కేచిత్పునః కేచిత్తు జఘ్నిరే | తతో రథైశ్చ తురగైర్విమానైశ్చ గజాదిభిః || 210

సమీయుస్తేతిసంరబ్ధా రోషాదన్యోన్యమాహవే | సంవర్తమానాస్సమరే సందష్టౌష్టపుటాననాః || 211

రథా రథైర్నియుధ్యంతే పాదాతాశ్చ పదాతిభిః | తేషాం రథానాం తుములః స శబ్ధః శబ్దవాహినామ్‌ || 212

నభోనిబద్ధానయథా నభ##స్యే జలదస్వనైః | బభంజిరే రథాన్‌ కేచిత్‌ సంమృదితా రథైః పరే || 213

సంబాధమన్యే సంప్రాప్తా న శేకుశ్చలితుం రథాః | అన్యోన్యమధ్యే సమరే దోర్భ్యాముత్ష్కిప్య దంశితాః || 214

సంహ్రాదమాణాస్సబలా జఘ్నస్తత్రాసిచర్మిణః | ఆసై#్త్రరన్యే వినిర్భిన్నా రక్తం వేముర్హతా యుధి || 215

దుందుభుల నాదముతో దైత్యులశబ్దము అంతర్హితమాయెను. అట్టి ఆ సేనలు ఒక్కమారుగా పరస్పరము ఎదుర్కొనిరి. యుద్ధము చేయగోరిన కొందరు బాహుయుద్ధములో బాహువులతో దేవతల ఘోరమైన ఆయుధములను భగ్నముచేసిరి. బరువైన గదలు సృజించిరి. కొందరు గదల దెబ్బలు తిని అవయవములు విరిగి బాణములతో ముక్కలై నేలకూలిరి. కొందరు ప్రాణములు విడిచిరి. అపుడు వారు రథములను, గుర్రములను, వేగముగా వెళ్ళు విమానములనెక్కి రోషముతో ఎదర్కొనిరి. కోపముతో పెదవుల కొరుచుచూ యుద్దమున తిరుగుచున్నవారు, రథములు రథములతో, సైనికులు సైనికులతో తలబడిరి అపుడు ఆ శబ్దము పెద్దదాయెను. ఆ శబ్ధము వర్షర్తువున మేఘముల ధ్వనివలె నుండెను. కొందరు రథముల విరుగగొట్టిరి. కొందరు రథములచే తొక్కబడిరి. కొందరు చేతులతో పైకెత్తి కొరుకుచుండిరి. మరికొందరు అస్త్రముల దెబ్బతిని యుద్ధమున నేలగూలుచూ రక్తమును కక్కుచుండిరి. 215

క్షరజ్జలానాం సదృశా జలదానాం సమాగతాః | అన్యోన్యబాణవర్షేణ యుద్ధదుర్ధినమాబభౌ || 216

ఏతస్మిన్నంతరే క్రుద్ధః కాలనేమిస్స దానవః | అవర్ధత సముద్రౌఘైః పూర్యమాణ ఇవాంబుదః || 217

తస్య విద్యుల్లతాపీడాః ప్రదీప్తాశనివర్షిణః | గాత్రైర్నగగిరిప్రఖ్యైర్వినిపేతుర్బలాహకాః || 218

క్రోధాన్నిశ్వసతస్తస్య భ్రూభేదస్వేదవర్షిణః | సాగ్నిస్ఫులింగాః ప్రతతా ముఖాన్ని శ్చేరురర్చిషః || 219

తిర్యగూర్ధ్యం చ గగనే వవృధుస్తస్య బాహావః | పర్వతాదివ నిష్క్రాంతాః పంచాస్యా ఇవ పన్నగాః || 220

సోస్త్రజాలైర్బహువిధైః ధనుర్భిః పరిఘైరపి | దివ్యమాకాశగా వవ్రే పర్వతైరుచ్ఛ్రితైరివ || 221

సోనిలోద్ధూతవసనస్తస్థౌ సంగ్రామలాలసః | సంధ్యాతపగ్రస్తశిలః సాక్షాన్మేరురివాచలః || 222

ఊరువేగప్రమథితైః శృంగశైలాగ్రపాదపైః || అపాతయద్దేవగణాన్‌ వజ్రేణవ మహాగిరీన్‌ || 223

బాహుభిశ్చ సనిస్త్రింశైశ్ఛిన్నభిన్నశిరోరుహః | న శేకుశ్చలితం దేవాః కాలనేమిహతా యుధి || 224

నీటిని విడుచుచున్న మేఘములవలెనున్న వారి బాణవర్షముతో మేఘఛన్నమై ఆ యుద్ధము దుర్దినము వలె భాసించెను. ఇంతలో మిగుల కోపించిన కాలనేమి సముద్రజలముతో నిండిన మేఘమువలె వర్ధిల్లెను. మెరుపుతీగలతాకిడిని, పిడుగుల వర్షమును గల మేఘములు పర్వతములవంటి అతని అవయవాల తాకిడికి నేలరాలినవి. కోపముతో నిశ్వాసముతీయుచున్న అతని కనుబొమముడినుండి చెమటబిందువులు రాలుచుండెను. అప్పుడతని ముఖమునుండి అనేక మంటలు నిప్పురవ్వలతో బయల్వెడలినవి. అతని చేతులు ఆకాశమున ఎల్లెడలా వ్యాపించినవి. పర్వతము నుండి బయల్వెడలుచున్న ఐదుతలల పాములవలె ఆ చేతులుండెను. అట్టి కాలనేమి అనేక అస్త్రజాలములతో, ధనస్సులతో, పరిఘలతో నిలవగా ఎత్తైన పర్వతములతో కప్పబడినట్లు ఆకాశగంగ (పాలపుంత) యుండెను. గాలి తన వస్త్రములను రెపరెపలాడించుచుండగా సంగ్రామముచేయు లాలసగల కాలనేమి సంధ్యాకాలమున ఎండలోని శిలలతో మేరుపర్వతమా యన్నట్లుండెను. తొడల వేగముతో పర్వతశిఖరములపై నున్న చెట్లను రాల్చుచూ దానితో కాలనేమి వజ్రముతో పర్వతములను పడవేసినట్లు దేవగణములను నేలకూల్చెను. కాలనేమియొక్క కత్తులవంటి చేతులతో దెబ్బలుతిన్న దేవతలు తలవెంట్రుకలు తెగి, చిందరవందరగా మారి యుద్ధమున కదలలేకపోయిరి. 224

ముష్టిభిర్నిహతాః కేచిత్‌ కేచిచ్ఛ విదశీకృతాః యక్షగంధర్వపతగాః సమహోరగకిన్నరాః || 225

తేన విత్రాసితాః పేతుః సమరే కాలనేమినా | న శేకుర్యత్నవంతోపి యత్నం కర్తుం విచేతసః || 226

తేన శక్రః సహస్రాక్షోస్పందితః శరబంధనైః | నిష్ప్రయత్నః కృతః సంఖ్యే చలితుం న శశాక హ || 227

నిర్జలాంబోదసదృశో నిర్జలార్ణవసప్రభః | నిర్వ్యాపారః కృతస్తేన విపాశో వరుణో మృధే || 228

రణ వైశ్రవణస్తేన పరీతః కాలరూపిణా | విలసన్‌లోకపాలేశ స్త్యాజితో ధనదః క్రియామ్‌ || 229

యమః సర్వహరస్తేన మృత్యుప్రహరణో రణ | యామ్యామవస్థాం సంత్యజ్య భీతః స్వాం దిశమావిశత్‌ || 230

న లోకపాలానుత్సార్య హృత్వా తేషాం చ కర్మ తత్‌ | దిక్షు సర్వసు దేహం స్వం చతుర్థా విదధే తథా || 231

స నక్షత్రపథం గత్వా దివ్యం స్వర్భానుదర్శితమ్‌ | జహార లక్ష్మీం సోమస్య యచ్చాస్య విషయం మహత్‌ || 232

చాలయామాస దీప్తాంశుం ధర్మద్వారా స భాస్కరమ్‌ | శాసనం చాస్య విషయం జహార దినకర్మ చ || 233

దేవతలు కొందరు పిడికిలి దెబ్బలతో నేలకూలగా మరికొందరు దళమునుండి వేరైరి. కాలనేమినుండి భయము నొంది యక్షరాక్షస్యగంధర్వులు కిందబడి ప్రయత్నించగలిగియూ మనసుచెదరి ప్రయత్నించలేకపోయిరి. సహస్రాక్షుడగు ఇంద్రుడు కూడా ఆ బాణపరంపరచే బంధింపబడి ప్రయత్నమును కోల్పోయి కదలలేకుండెను. వరుణుడు కాలనేమిచే నీరులేని మేఘమువలె, సముద్రమువలె వ్యాపారములేనివాడుగా చేయబడెను. ఆ కాలరూపుడగు కాలనేమి ఎదర్కొనగా లోకపాలుడగు కుబేరుడు కూడా సామాన్యుని వలె ఆక్రోశించుచూ కదలకుండెను. సర్వహరుడు, మృత్యువే ఆయుధముగా గలవాడగు యముడు ఆ యుద్ధమున యముడను అవస్థను విడిచి దక్షిణ దిక్కుకు చేరెను. ఈ విధంగా కాలనేమి లోకపాలురను పారద్రోలి, వారి కర్మనపహరించి అన్ని దిక్కులయందు తన శరీరమును నాలుగువిధములుగా చేసేను. అతను నక్షత్రమార్గమును చేరి చంద్రుని కాంతి, కర్మను అపహరించెను. జ్వలించు సూర్యుని చలింపజేసి అతని శాసనమును దినకర్మను హరించెను. 233

సోగ్నిం దేవముఖం జిత్వా చకారాత్మముఖాశ్రయమ్‌ | వాయుం చ తరసా జిత్వా చకారాత్మవశానుగమ్‌ || 234

స సముద్రాత్సమానీయ సమస్తాః సరితో బలాత్‌ | చకారాభిముఖా వీర్యా దేహాభూతాశ్చ సింధవః || 235

అపః స్వవశగాః కృత్వా దివి జాయాశ్చ బూమిజాః | ఛాదయామాస జగతీం సుగుప్తాం ధరణీధరైః || 236

స స్వయంభూరివాభాతి మహాభూతపతిర్మహాత్‌ | సర్వలోకమయో దైత్యః సర్వలోకభయావహః || 237

సలోకపాలైకవపుశ్చంద్ర సూర్యగ్రహాత్మవాన్‌ | పావకానిలసంభూతో రరాజ యుధి దానవః || 238

పారమేష్ఠ్యే స్థితఃస్థానే లోకానాం ప్రభవోపమే | తం తుష్టువుర్దైత్యగణా దేవా ఇవ పితామహమ్‌ || 239

పంచ తం నాభ్యవర్తంత విపరీతేన కర్మణా | వేదో ధర్మః క్షమా సత్యం శ్రీశ్చ నారాయణాశ్రయా || 240

స తేషామనుపస్థానాత్‌ సక్రోధో దానవేశ్వరః | వైష్ణవం పదమన్విచ్ఛన్‌ స గతో దేవతాయతః || 241

స దదర్మ సువర్ణస్థం శంఖచక్రగదాధరమ్‌ | దానవానాం వినాశాయ భ్రామయంతం గదాం శుభామ్‌ || 242

దేవతల ముఖమగు అగ్నిదేవుని జయించి అతను తన ముఖమునాశ్రయించునట్లు చేసెను. వాయుమును త్వరగా జయించి తన వశముననుండునట్లు చేసెను. బలవంతముగా ఆతను సముద్రమునుండి వీర్యవంతములగు నదులను తెచ్చి తన అభిముఖమున దేహములుగ నుండునట్లు చేసెను. నీటిని తన వశముననుంచుకొని జగత్తును పర్వతములతో కప్పివేసెను. అన్ని లోకములకు వ్యాపించి భయముకలిగించు ఆ దైత్యుడు స్వయంభువు వలె నుండెను. లోకపాలురు, చంద్రసూర్యులు, అగ్ని వాయువులు తన శరీరముగా నుండగా అతను యుద్ధమున రాజిల్లెను. లోకముల కారణమైన పారమేష్ఠ్యస్థానముననున్న కాలనేమిని, దేవతలు పితామహుని స్తుతించినట్లు దైత్యులు స్తుతించిరి. విపరీత కర్మచేత ఐదు అతనిని చేరలేదు. అవి వేదము, దర్మము, ఓర్పు, సత్యము నారాయణుని ఆశ్రయించియుండు లక్ష్మి. ఇవి తనవద్దయుండనందుచేత ఆ దానవరాజు కోపముతో వైష్ణవ పదమును కోరుతూ వెళ్లెను. అపుడతను శంఖచక్రముల ధరించి, దానవుల వినాశనానికి గదను తిప్పుచూ గరుత్మంతుడిపై కూర్చునిని విష్ణువును చూచెను. 242

సజలాంభోదసదృశం విద్యుత్సదృశవాసనమ్‌ | ఆరూఢం స్వర్ణపత్రాఢ్యం ఖేచరం కాశ్యపం ఖగమ్‌ || 243

దుష్టదైత్యవినాశాయ దృష్ట్వా ఖస్థమివస్థితమ్‌ | దానవో విష్ణుమక్షోభ్యం బభాషే క్షుబ్ధమానసః || 244

అయం స రిపురస్మాకం పూర్వేషాం ప్రాణనాశనః | అర్ణవావాసినశ్చైవ మధోశ్చ కైటభస్య చ || 245

ఆయం స రిపురస్మాకమసమః కిల కథ్యతే | అనేకసంయుగేనేన దానవా బహవో హతాః || 246

అయం స నిర్ఘృణో లోకే స్త్రీబాల నిరపత్రపః | యేన దానవనారీణాం సీమంతోద్ధరణం కృతమ్‌ || 247

అయం స విష్ణుర్దేవానాం వైకుంఠశ్చ దివౌకసామ్‌ | అనంతో భోగినాం మధ్యే స్వయంభూశ్చ స్వయంభువః || 248

ఆయం స నాథో దేవానామస్మాభిః విప్రకృష్యతే | అస్య క్రోధం సమాసాద్య హిరణ్యకశిపుర్హతః || 249

అస్య చాయాముపాశ్రిత్య దేవా మఖముఖే స్థితాః | ఆజ్యం మహర్షిభిర్దత్తమశ్రువంతి త్రిధా హుతమ్‌ || 250

ఆయం స నిధనే హేతుః సర్వేషామమరద్విషామ్‌ | అస్య చక్రప్రవిష్టాని కులాన్యస్మాకమాహవే || 251

ఆ విష్ణువు నీటితోనున్న మేఘమువలె నుండి, మెరుపువంటి పచ్చని వస్త్రముల ధరించి కశ్యపసంతానమైన పక్షిరాజును బంగారు రెక్కలు గల దాని నెక్కియుండెను. దుష్టులగు దైత్యులను నశింపజేయుటకు ఆకాశమున నిలుచునట్లున్న ఆ క్షోభింప శక్యముగాని విష్ణువును క్షోభనొందిన హృదయముతో కాలనేమి ఇట్లనెను. ''ఇతనే మా శత్రువు. మా పూర్వికుల ప్రాణము తీసినవాడు. సముద్రమున వసించు మధు, కైటభులను చంపినదితనే. మాకు అసమానమైన శత్రువందురు కదా! పెక్కు యుద్ధములలో పెక్కు దానవులు ఇతని చేతిలో అసువులు బాసిరి. లోకమున దయలేనివాడు. స్త్రీలన్ననూ, పిల్లలన్ననూ సిగ్గులేనివాడు. దానవస్త్రీల సీమంతమును తొలగించినవాడు. దేవతల విష్ణువు, వైకుంఠుడు, సర్పములలో అనంతుడు, స్వయంభువుకు స్వయంభువుడు, దేవతలకు నాథుడైన ఇతను మాచే విడిగా చూడబడువాడు. (నుండువాడు) ఇతని కోపముచే హిరణ్యకశిపుడు మరణించెను. ఇతని ఛాయనాశ్రయించిన దేవతలు యజ్ఞముఖమున నిలిచి మహర్షులచే నివ్వబడినది, మూడు విధాలుగా వ్రేల్చబడినదియగు ఆజ్యమును గ్రహింతురు. దేవశత్రువులకితను మరణకారకుడు. మా కులాలు యుద్ధమున ఇతని చక్రమునే ప్రవేశించినవి. 251

అయం స కిల యుద్ధేషు సురార్థే త్యక్త జీవితః స విభుస్తేజసా యుక్తం చక్రం క్షిపతి శత్రుషు || 252

అయం స కాలో దైత్యానాం కాలభూతే మయి స్థితే | అతిక్రాంతస్య కాలస్య ఫలం ప్రాప్స్యతి కేశవః || 253

దిష్ట్యేదానీం సమక్షం మే విష్ణురేష సమాగతః | నిష్పిష్టో బాహునా సంఖ్యే మయ్యేవ ప్రణశిష్యతి || 254

యాస్యామ్యపచితిం దిష్ట్యా పూర్వేషామద్య సంయుగే ఇమన్నారాయణం హత్వా దానవానాం భయావహమ్‌ || 255

క్షిప్రమేవ హనిష్యామి రణమరగణానహమ్‌ | జాత్యంతరగతోప్యేష బాధతే దానవాన్‌ మృధే || 256

ఏషోనంతః పురా భూత్వా పద్మనాభ ఇతి శ్రుతః | జఘానైకార్ణవే ఘోరే తావుభౌ మధుకైటభౌ || 257

ద్విధా భూతం వపుః కృత్వా సింహార్థం నరస్య చ | పితరం మే జఘానైకో హిరణ్యకశిపుం పురా || 258

శుభం గర్భమధత్తైనమదితిర్దేవతారణిః | త్రీన్లోకానాజహారైకః క్రమమాణస్త్రిభిః క్రమైః || 259

భూయస్త్విదానీం సంప్రాప్తో సంగ్రామే తారకామయే | మయా సహ సమాగమ్య స దేవో వినశిష్యతి || 260

ఇతనే యుద్ధములలో దేవతలకొరకు ప్రాణము లివ్వడానికి సిద్ధముగానున్నవాడు కదా! శత్రువులపై ఇతను తేజస్సుతోనున్న చక్రమును విడుచును. దైత్యులకు మృత్యువువంటి ఈ విష్ణువు, మృత్యువై నేను నిలిచినపుడు గడిచిన కాలానికి ఫలాన్ని తప్పక పొందును.' నా అదృష్టవశాత్తు ఆ విష్ణువే నా ఎదుట నిలిచాడు. ఇతనిని బాహువుతో పిండిచేసిన నశించును. ఈనాడీ యుద్ధమున నేను నా పూర్వీకుల ఋణమునుండి విముక్తిని పొందెదను. ఈ దానవులకు భయముగొల్పు నారాయణుని దేవగణములను త్వరగా యుద్ధమున వధించెదను. వేరొక జాతికి చెందిన ఇతను యుద్ధమున దానవులను బాధించును. పూర్వము అనంతుడై, పద్మనాభుడని పేరొందెను. ఏకార్ణవమున మధుకైటభుల వధించెను. శరీరమును ముందు (పై) భాగము సింహముగా, క్రిందిభాగము నరునిగా చేసి పూర్వము నా పూర్వుడైన హిరణ్యకశిపుని వధించెను. దేవతల ఆరణియగు అదితి శుభుడగు ఇతనిని తనగర్భమునదాల్చగా మూడు అడుగులతో ముల్లోకముల హరించెను. మరల ఇప్పుడీ తారకామయమైన యుద్ధమునందు దాపురించాడు. ఇక నాతో తలపడి ఇతను నశించగలడు. 260

ఏవముక్త్వా బహువిధం క్షిప్రం నారాయణం రణ | వాగ్భిరప్రతిరూపాభిర్యుద్ధమేవాభ్యరోచయత్‌ || 261

క్షిప్యమాణోసురేంద్రేణ న చుకోప గదాధరః | క్షమాబలేన మహతా సస్మితం చేదమబ్రవీత్‌ || 262

ఆల్పం దర్పబలం దైత్య స్థిరమక్రోధజం బలమ్‌ | హతస్త్వం దర్పజైర్దోష్హైరి త్వా యో భాషసే క్షమామ్‌ || 263

అధమస్త్వం మమ మతో ధిగేతత్తవ వాగ్బలమ్‌ | కే తత్ర పురుషాః సన్తి యత్ర గర్జంతి యోషితః || 264

అహం త్వాం దైత్య పశ్యామి పూర్వేషాం మార్గగామినమ్‌ | ప్రజాపతికృతం సేతుం త్యక్త్వా కః స్వస్తిమాన్‌ భ##వేత్‌ || 265

అద్య త్వాం నాశయిష్యామి దేవవ్యాపారఘాతకమ్‌ | స్వేషు స్వేషు చ స్థానేషు స్థాపయిష్యామి దేవతాః || 266

ఏవం బ్రువతి వాక్యం తు మృధే శ్రీవత్సధారిణి | జహాస దానవః క్రోధాద్దస్తాంశ్చ క్రేణ సాయుధాన్‌ || 267

స బాహుశతముద్యమ్య సర్వాయుధగణాన్రణ | క్రోధాద్ధ్విగుణరక్తాక్షో విష్ణోర్వక్షస్యపాతయత్‌ || 268

దానవాశ్చాపి సమరే మయతారపురోగమాః | ఉద్యతాయుధనిస్త్రింశా విష్ణుమభ్యుద్రవన్‌ రణ || 269

ఇట్లనేక విధములుగా పలికి, నారాయణుడు రణమున సరిలేని మాటలతో యుద్ధమునే కోరెను. అసురేంద్రుడు తనను అవమానించిననూ విష్ణువు కోపించలేదు. గొప్ప క్షమాబలముతో, నవ్వుతో ఇట్లనెను. ''దైత్యుడా! దర్పముచే కలిగిన బలము అల్పమైనది. కానీ క్రోధమునుండి జనించని బలము స్థిరమైనది. దర్పమునుండి కలిగిన దోషాలతో నీవు చంపబడినట్లే. ఓరిమిని వదలి పలుకుచుంటివి. నా అభిప్రాయములో నీవధముడివి. నీ వాగ్బలము తుచ్ఛమైనది. స్త్రీలు గర్జించుచోట పురుషులుందురా? నీ పూర్వీకుల మార్గమును నీవనుసరించునట్లు చూచెదను. ప్రజాపతి నిర్మించిన సేతువును వదలి క్షేమము నెవడు పొందును? దేవతల కర్మలను పాడుచేయు నిన్నీనాడు నశింపజేసెదను. దేవతలను వారివారి స్థానములయందు నిలిపెదను.'' అని విష్ణువు పలుకుచుండగా దానవుడు క్రోధముతో నవ్వెను. అన్ని ఆయుధములను రణమున పైకెత్తి కోపముతో మిక్కిలి ఎరుపెక్కిన కళ్ళుగల ఆ దానవుడు విష్ణువు వక్షస్థలముపై పడవేసెను. మయుడు తారుడు మొదలగు దానవులు కూడా రణమున ఖడ్గములబూని విష్ణువునెదిరించిరి. 269

స తాడ్యమానోతిబలైర్దెత్యైః సర్వాయుధోద్యతైః | న చచాల తతో యుద్ధేకంప్యమాన ఇవాచలః || 270

సంయుక్తశ్చ సుపర్ణేన కాలనేమిర్మహాసురః సర్వప్రాణన మహతీం గదాముద్యమ్య బాహుభిః || 271

ఘోరాం జ్వలంతీం ముముచే సంరబ్ధో గరుడోపరి | కర్మణా తేన దైత్యస్య విష్ణుర్విస్మయమాగమత్‌ || 272

తదా తేన సుపర్ణస్య పాతితా మూర్ద్ని సా గదా | సుపర్ణం వ్యథితం దృష్ట్వా క్షతం చ వపురాత్మనః || 273

క్రోధసంరక్తనయనో వైకుంఠశ్చక్రమాదదే | వ్యవర్ధత చ వేగేన సుపర్ణేన సమం విభుః || 274

భుజాశ్చాస్య వ్యవర్ధంత వ్యాప్తవంతో దిశోదశ | విదిశ##శ్చైవ ఖం చాపి గాం చైవ ప్రతిపూరయన్‌ || 275

వవృధే స పునర్లోకాన్‌ క్రాంతుకామ ఇవౌజసా | తం జయాయ సురేంద్రాణాం వర్ధమానం సభస్తలే || 276

ఋషయః సహ గంధర్వాస్తుష్టువుర్మధుసూదనమ్‌ | స ద్యాం కిరీటేన లిఖన్‌ శిరసా భాస్వరేణ చ || 277

పద్భ్యాం ఆక్రమ్య వసుధాం దిశః ప్రచ్ఛాద్య బాహుభిః | సహస్రకరతుల్యాభం సహస్రారమరిక్షయమ్‌ || 278

దీస్తాగ్నిసదృశ్యం ఘోరం దర్శనేన సుదర్శనమ్‌ | సువర్ణరేణుపర్యంతం వజ్రనాభం భయావహమ్‌ || 279

అన్ని ఆయుధములనెత్తి తనతో తలబడిన ఆ దైత్యవీరులను చూచియూ, విష్ణువు స్థిరమగు పర్వతమువలె కదలక నిలిచియుండెను. సుపర్ణునితో తలపడిన కాలనేమి పెద్దగదను చేతులతో నెత్తి గరుడునిపై వేసెను. జ్వలించు ఆ గద గరుడునిపై పడగా విష్ణువు విస్మయమునొందెను. గరుడుడు వ్యధనొందుట, తన శరీరము గాయపడుటను జూచి విష్ణువు కోపముతో ఎరుపెక్కిన కళ్ళతో చక్రమును గ్రహించెను. సుపర్ణునితో సమానముగా వేగముగా పెరిగెను. అపుడతని భుజములు వ్యాపించి అన్నివైపుల పెరిగిపోయినవి. తన శక్తిచే లోకముల నాక్రమించదలిచినట్లు విష్ణువు వర్ధిల్లెను. దేవతల జయమునకై ఆకాశతలమున వర్థిల్లుచున్న విష్ణువును చూచి దేవగంధర్వాదులు, ఋషులు స్తుతించిరి. ఆ విష్ణువపుడు తెల్లని కిరీటముతో ఆకాశమున చిత్రించునట్లుండెను. పాదాలతో భూమినాక్రమించి, చేతులతో దిక్కులను కప్పి, సూర్యునివంటి కాంతిగలిగి వేల ఆకులతో శత్రువులదునుమాడునట్లుండెను. జ్వలించు అగ్నివలె భయంకరముగా చూచుటకు మనోహరముగా అణువువరకూ నిలిచి వజ్రనాభుడై భయముగొల్పునట్లు యుండెను. 279

మేదోస్థిమజ్జరుధిరైః సిక్తం దానవసంభ##వైః | అద్వితీయం ప్రహరణం క్షురపర్యంతమండలమ్‌ || 280

స్రగ్దామమాలానిచితం కామగం కామరూపిణమ్‌ | స్వయం స్వయంభువా సృష్టం భయదం సర్వవిద్విషామ్‌ || 281

దధార రోషేణావిష్టం నిత్యమాహవదర్పితమ్‌ || క్షేపణాద్యస్య ముహ్యంతి లోకాః సస్థాణుజంగమాః || 282

క్రవ్యాదాని చ భూతాని తృప్తిం యాంతి మహామృధే | తమప్రతిమకర్మాణం సమానం సూర్యవర్చసా || 283

చక్రముద్యమ్య సమరే కోపదీప్తో గదాధరః | ప్రణష్టం దానవం తేజః కుర్వాణం స్యేన తేజసా|| 284

చిచ్ఛేద భాహూంస్తేనైవ సమరే కాలనేమినః | తచ్చ వక్త్రశతం ఘోరం సాగ్ని చూర్ణాట్టహాసి వై || 285

తస్య దైత్యస్య చక్రేణ ప్రమమాథ బలాద్ధరిః | సచ్ఛిన్న బాహుర్విశిరా న ప్రాకంపత దానవః || 286

కబంధావస్థితః సంఖ్యే విశాఖ ఇవ పాదపః : తం వితత్య మహాపక్షౌ వాయోః కృత్వా సమం జపమ్‌ || 287

ఉరసా తాడయామాస గరుడః కాలనేమినమ్‌ | స తస్య దేహోభిముఖో విబాహుః ఖాత్‌ పరిభ్రమన్‌ || 288

దానవులు మరణించుటచే వారి మెదడు, ఎముకలు, మూలుగ, రక్తము వీనితో తడిసిన అద్వితీయ ప్రహరణము దాల్చియుండెను. పూలదండను గలిగి, కామగమనమును కామరూపమును గలిగియుండెను. స్వయంభువుచే స్వయముగా సృష్టింపబడిన విష్ణువు శత్రువులకు భయమోగొల్పు నట్లుండెను. రోషముతోనున్న, నిత్య యుద్ధముతో దర్పించిన రూపమును దాల్చెను. ఆ మూర్తిని విడుచుటచే స్థావరజంగమలోకములన్నీ మోహమునొందును. రాక్షసులు మొదలగు భూతములు మహాయుద్ధమున తృప్తిని పొందును. అట్టి అసమానకర్మగలవానిని, సూర్యసమానకాంతిగలవానిని దేవతలు, ఋషులు స్తుతించిరి. కోపముచే వెలుగు విష్ణువు, చక్రమునెత్తి యుద్దమున రాక్షసతేజస్సును తన తేజస్సుతో నశింపజేసెను. ఆ చక్రము కాలనేమి బాహువుల ఛేదించెను. ఆ నూరు తలలు ఘోరముగా అగ్నిచూర్ణములు వెడలు అట్టహాసములతో నుండెను. వానిని చక్రముతో హరి ఖండించగా, చేతులు, తలలు తెగిననూ కాలనేమి మొండెము నిలిచియుండెను. అపుడు గరుడుడు రెక్కలు విప్పార్చి కొమ్మలులేని చెట్టువలెనున్న ఆ మొండెము వక్షమున గొట్టసాగెను. అపుడు భూతలమును క్షోభ##పెట్టుచూ ఆ మొండము నింగినివీడి నేలగూలెను. 288

నిపపాత దివం త్వక్త్వా క్షోభయన్‌ ధరణీతలమ్‌ ||

తస్మిన్నిపతితే దైత్యే దేవాః సర్షిగణాస్తథా || 289

సాధు సాధ్వితి వైకుంఠం సమేతాః ప్రత్యపూజయన్‌ | ఆపరే యే తు దైత్యా వై యుద్ధే దృష్టపరాక్రమాః || 290

తే సర్వే బాహుభిః వ్యాప్తా న శేకుశ్చలితం రణ | కాంశ్చిత్కేశేషు జగ్రాహ కాంశ్చిత్కంఠేష్వపీడయత్‌ || 291

చకర్త కస్యచిద్వక్త్రం మధ్యేగృహ్ణత్తథా పరమ్‌ | తే గదాచక్రనిర్ధగ్థాః గతసత్త్వా గతాసవః || 292

గగనాద్భ్రష్టసర్వాంగా నిపేతుర్ధరణీతలే | తేషు సర్వేషు దైత్యేషు హతేషు పురుషోత్తమః || 293

శక్రప్రియం తతః కృత్వా కృతకర్మా గదాధరః | తస్మిన్విమర్ధే సంవృత్తే సంగ్రామే తారకామయే | 294

తం చ దేశం జగామాశు బ్రహ్మా లోకపితామహః | సర్వైర్భ్రహ్మర్షిభిః సార్ధం గంధర్వాప్సరసాం గణౖః || 295

దేవదేవం హరిం దేవః పూజయన్వాక్యమబ్రవీత్‌ | కృతం దేవ మహత్కర్మ సురాణాం శల్యముద్ధృతమ్‌ || 296

నిధనేన చ దైత్యానాం వయం చ పరితోషితాః | యోయం త్వయా హతో విష్ణో కాలనేమిర్మహాసురః || 297

త్వామేతస్య ఋతే హ్యస్మిన్‌ శాస్తా కశ్చిన్న విద్యతే | ఏష దేవాన్పరిభవన్‌ లోకాంశ్చ సచరాచరాన్‌ || 298

ఋషీణాం కదనం కృత్వా మామపి ప్రతిగర్జతి ||

ఆ దైత్యులు నేలగూలగా దేవతలు, ఋషులు కలిసి బాగు, బాగ'ని హరిని పూజించిరి. మిగిలిన దైత్యులు యుద్ధమున కదలలేకపోయిరి. చేతులను సర్వత్ర విప్పార్చిన హరి కొందరిని జుట్టుపట్టుకొని, మరికొందరి కుత్తుకలు బట్టుకొని బాధించెను. కొందరి తలలు నరికెను. గదలు, చక్రములతో దహింపబడిన దానవులు సత్త్వమును, ప్రాణములనూ కోల్పోయిరి, అన్ని అవయవముల గోల్పోయి భూతలముపై పడిపోయిరి. వారందరూ అట్లు నశించగా విష్ణువు ఇంద్రునికి ప్రియమగునది చేసి తన కర్మ నిర్వర్తించిన వాడాయెను. తారకామయమైన ఆ యుద్ధమట్లుకాగా లోకపితామహుడగు బ్రహ్మ అక్కడకు వచ్చెను. దేవదేవుడగు హరిని పూజించుచూ ఇట్లనెను. ''దేవా! గొప్పకార్యము నాచరించితివి. దేవతలకు శల్యమగు దైత్యుడు నశించెను. దైత్యనాశముచే మేము సంతోషించితిమి. నీవు వధించిన ఈ కాలనేమియనువాడు మహాసురుడు - నీవు దప్ప ఇతనిని వధించు శాసకుడెవడూలేడు. ఈ కాలనేమి దేవతలను లోకములను చరాచరములతో సహా పరిభవించుచూ, నేల దొక్కి నన్నుగూడా యుద్ధమునకు ఆహ్వానించుచున్నాడు. 298

తదనేన త్వదీయేన పరితుష్టోస్మి కర్మణా |

యదయం కాలకల్పస్తే కాలనేమిర్నిపాతితః తదా గచ్ఛస్వ భద్రం తే గచ్ఛామ దివముత్తమామ్‌ || 299

బ్రహ్మర్షయస్త్వాం తత్రస్థాః ప్రతీక్షంతే సదో గతాః | కం చాహం తవ దాస్యామి వరం వరభృతాం వర || 301

స్వస్థానస్థేషు దేవేషు తేషాం చ వరదో భవాన్‌ | నిర్యాతమేతత్రైలోక్యం స్ఫీతం నిహతకంటకమ్‌ || 302

ఆస్మిన్నేవ మృధే విష్ణో శక్రాయ సుమహాత్మనే | ఏవముక్తో భగవతా బ్రహ్మణా హరిరవ్యయః || 303

దేవాన్‌ శక్రముఖాన్‌ సర్వాన్‌ ఉవాచ శుభయా గిరా |

విష్ణురువాచ :- శ్రూయతాం త్రిదశాస్సర్వే యావంతోత్ర సమాగతాః || 304

సువర్ణ సహితైస్తత్ర పురస్కృత్య పురందరమ్‌ | అస్మాభిః సమరే సర్వై కాలనేమిముఖా హతాః || 305

దానవా విక్రమోపేతాః శక్రాదపి మహత్తరాః | అస్మిన్నహతి సంగ్రామే ద్వావేవ తు వినిస్మృతౌ || 306

విరోచనస్తు దైతేయః స్వర్భానుశ్చ మహాబలః | స్వాం దిశం భజతాం శక్రో దిశం వరుణ ఏవ చ || 307

అట్లు యమునివంటి కాలనేమిని వధించిన నీ ఈ కర్మచే నేను సంతోషించితిని. ఇక రమ్ము. నీకు శుభమగు గాత! ఉత్తమస్వర్గమునకు వెళ్ళెదము. బ్రహ్మర్షులు అక్కడనుండి నీ రాకకై ఎదరుచూచుచుండిరి. ఓ శ్రేష్ఠదేవా! నీకే వరమిచ్చెదను? స్వస్థానములనున్న దేవతలందరికి నీవే వరములనిచ్చువాడవు. ఈ మూడులోకములు దైత్యబాధ తొలగి వర్ధిల్లును. ఇంద్రునికై జరిగిన ఈ యుద్ధములో దైత్యబాధతొలగినది. శ్రీహరీ!'' అనగా విష్ణువు ఇంద్రాది దేవతల నుద్దేశించి కల్యాణమగునట్లు పలికెను. ''ఇక్కడకు వచ్చిన దేవతలారా వినుడు. ఇంద్రుడిని ముందిడుకొని మనమందరమూ కాలనేమి మొదలగు రాక్షసుల వధించితిమి. దానవులు పరాక్రమము గలవారు. ఇంద్రునికంటెనూ గొప్పవారు. ఈ గొప్పయుద్ధమున ఇందరు వధింపబడగా విరోచనుడు, స్వర్భానువు మాత్రమే మిగిలారు. ఇక ఇంద్రుడు, వరుణుడు, తమ తమ దిక్కులను పాలించుదురుగాక!

యామ్యాం యమః పాలయతాముత్తరాం చ ధనాధిపః | ఋక్షైః సహ సదా యోగం గచ్ఛతాం చంద్రమాస్తథా || 308

అయమృతుముఖం సూర్యో భజతామయనైః సహ | ఆజ్యభాగాః ప్రవర్తతాం సదసై#్యరభిపుజితాః || 309

హూయంతామగ్నయో విపై#్రర్వేదదృష్టేన కర్మణా | దేవాశ్చ బలిహోమేన స్వాధ్యాయేన మహర్షయః || 310

శ్రాద్ధేన పితరశ్చైవ తుష్టిం యాంతు యథాసుఖమ్‌ | వాయుశ్చరతు మార్గస్థస్త్రిధా దీప్యతు పావకః || 311

త్రయో వర్ణాశ్చ లోకాంస్త్రీన్‌ తర్పయంత్వాత్మజైర్గుణౖః | ఋతవః సంప్రవర్తంతాం దీక్షణీయైర్ద్విజాతిభిః || 312

దక్షిణాశ్యోపపద్యంతాం యాజ్ఞికైశ్చ పృథక్‌ పృథక్‌ | గాశ్చ సూర్యో రసాన్‌ సోమో వాయుః ప్రాణాంశ్చ ప్రాణిషు || 313

తర్పయంతః ప్రపర్తంతామేతే సోమైః స్వకర్మభిః | యధావదనుపూర్వేణ మహేంద్రమలయోద్భవాః || 314

త్రైలోక్యమాతరః సర్వాః సముద్రం యాంతు సింధవః | దైత్యేభ్యస్త్యజ్యతాం భీశ్చ శాంతిం వ్రజత దేవాతాః || 315

యముడు దక్షిణదిక్కును, కుబేరుడు ఉత్తరదిక్కును పాలించుగాక ! చంద్రుడు నక్షత్రములతో ఎల్లప్పుడూ కలిసియుండుగాక! అయనములతో సూర్యుడు ఋతుముఖమును సేవించుగాక! యాజ్ఞికులచే పూజింపబడిన ఆజ్యభాగములు ప్రవర్తించుగాక! విప్రులు వేదదృష్టకర్మచే అగ్నులను వ్రేల్చుదురు గాక! బలిహోమముతో దేవతులు, స్వాధ్యాయముతో మహర్షులు, శ్రాద్దముతో పితృదేవతలు సుఖముగా తృప్తినొందెదరు గాక! అగ్ని మూడు విధములుగా జ్వలించుగాక! తమ గుణములతో మూడు వర్ణములు ముల్లోకములను తృప్తి నొందజేయుదురు గాక! దీక్షగైకొనిన ద్విజాతులచే ఋతువులు ప్రవర్తించుగాక! యజ్ఞములనొనరించినవారు విడివిడిగా దక్షిణలచే యజ్ఞముల సంపన్నమొనరించెదరు గాక! తమ సౌమ్య కర్మలచే సూర్యుడు లోకములను, చంద్రుడు రసములను, వాయువు ప్రాణులయందలి ప్రాణములను తృప్తినొందజేయుగాక! మహేంద్ర, మలయపర్వతములందు పుట్టినవి, ముల్లోకములకు తల్లులవంటివియగు నదులు సముద్రమును చేరుగాక! దైత్యుల నుండి కలుగు భీతి విడవబడుగాక! దేవతలారా! శాంతించుడు-మీకు స్వస్తి అగుగాక! సనాతనమగు బ్రహ్మలోకమునకు వెళ్ళెదను. 315

స్వస్తివోస్తు గమిష్యామి బ్రహ్మలోకం సనాతనమ్‌ |

స్వగృహే స్వర్గలోకే వా సంగ్రామే వా విశేషతః || 316

విశ్వసై#్తశ్చ న గంతవ్యం నిత్యం క్షుద్రా హి దానవాః | ఛిద్రేషు ప్రహరంత్యేతే న తేషాం సంస్థితిః ధృవా || 317

సౌమ్యానాం నిజభావానాం భవతామార్జవే మనః | ఏవముక్త్వా సురగణాన్‌ విష్ణుస్సత్యపరాక్రమః || 318

జగామ బ్రహ్మణా సార్ధం బ్రహ్మలోకం మహాయశాః | దేవానాం మహతీం ప్రీతిముత్పాద్య భగవాన్‌ ప్రభుః || 319

ఏతదాశ్చర్యమభవత్‌ సంగ్రామే తారకామయే | దానవానాం చ విష్ణోశ్చ యన్మాం త్వం పరిపృచ్ఛసి || 320

ఇతి శ్రీ పాద్మపురాణ ప్రథమే సృష్టిఖండే

పద్మోద్భవదేవాసురయుద్ధో నామైకచత్వారింశత్తమోధ్యాయః ||

స్వగృహమునగానీ, స్వర్గమునగానీ, విశేషముగా యుద్ధమునగానీ నిర్భయంగా విశ్వాసంతో వెళ్ళరాదు. దానవులు క్షుద్రులు గదా! ఏ ఒక్క బలహినత లభించిననూ దెబ్బతీసెదరు. వీరి స్థితి స్థిరమైనది కాదు. మీ సౌమ్యమగు నిజభావముల ఋజుతయందే మీ మనస్సుండును.' అని సత్యవిక్రముడగు విష్ణువు దేవగణాలతో పలికి, మహాయశస్సుగలవాడై బ్రహ్మతో కలిసి బ్రహ్మలోకమునకు వెళ్ళెను. భగవాన్‌ విష్ణువు దేవతలకు గొప్ప ప్రీతిని కలుగజేసెను. నీవు నన్నడిగిన ఈ అద్భుతము దానవులకు, విష్ణువుకు మధ్య జరిగిన తారకామయయుద్ధమున జరిగినది. 320

ఇది శ్రీ పాద్మపురాణమున మొదటిదగు సృష్టిఖండమున పద్మోద్భవము, దేవాసురయుద్దమను నలుబదియొకటవ అధ్యాయము.

Sri Padma Mahapuranam-I    Chapters