Neetikathamala-1    Chapters    Last Page

5

దైవస్తుతి

మయూరిధిరూఢం మహవాక్య గూఢం

మనోహరి దేహం మహచ్చిత్త గేహమ్‌,

మహీదేవ దేవం మహా వేద భావం

మహాదేవ బాలం భ##జే లోకపాలమ్‌.

------- -------

భర్తృహరి

జనకునిc బూజలం గడుc బ్రసన్నుని జేయు నతండు పుత్రుc; డే

వనితమెలంగు భర్తృవశవర్తి నియై యది సత్కళత్ర; మే

జనుcడు విపత్తి సౌఖ్య సదృశ క్రియుc డాతcడు మిత్రుcడీ త్రయం

బును జగతిన్‌ లభించుc గడుc బుణ్యముcజేసిన యట్టివారికిన్‌.

మంచి నడవడిచేతc దండ్రిని సంతోష పెట్టువాడే పుత్రుడు; భర్తకు హితము గోరునదే పెండ్లము; ఆపత్సమయమునందును సంపదలందును సమానముగ స్నేహము చేయు నతడే మిత్రుడు. ఇట్టి పుత్రుడును, భార్యయు, స్నేహితుడును పుణ్యాత్ములకుగాని లభించరు.

--- ---

ద్రౌపది

ద్రౌపది ద్రుపదరాజనందన. పాండవ పట్టమహిషి ఆమె. వీరనారీ శిరోమణియే కాదు. ధర్మాధర్మ వివేకశీలి . కరుణామయి.

మహభారత రణభూమిలో భీముని గదాఘాతముచే రారాజు దుర్యోధనుడ తొడలు విరిగి కూలిపోయినాడు. గురుపుత్రుడైన అశ్వత్థామ దుర్యోధనునికి ప్రియము సేయగోరి, గాఢ నిద్రలోనున్న ఉపపాండవుల శిరములను ఖండించి తెచ్చి సమర్పించినాడు. పుత్ర మరణవార్త విని ద్రౌపది కన్నీరు మున్నీరుగా విలపించుచుండగా, అర్జునుడు ''ద్రౌపదీ! మహారాజ పుత్రివైన నీవు ఈ విధంగా దుఃఖించుట తగదు. ద్రోణపుత్రుడు నిష్కరుణుడై బాలకులను చంపినాడు. నా గాండీవముచే వాని శిరస్సు ఖండించి తెస్తాను. ఆ శిరమును త్రొక్కిన అనంతరమే స్నానము కావింపుము'' అని ప్రతిజ్ఞచేసి, శ్రీకృష్ణుడు మేలు మేలనుచుండగా రథమును గురుసుతుని వెంట నడిపించాడు. గురు సుతుడు భయభ్రాంతుడై ప్రాణ రక్షణార్థమై అర్జునునిపై బ్రహ్మశిరో నామకాస్త్రమును ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రము ప్రచండ తేజముతో విజృంభింపగా శ్రీకృష్ణుని అనుజ్ఞపై అర్జునుడు తిరిగి తన బ్రహ్మాస్త్రమును ప్రయోగించినాడు. ఆ రెండు బ్రహ్మాస్త్రములు త్రిభువనములను భయసంభ్రాంతము లొనర్పగా మాధవుని అనుజ్ఞతో విజయుడు వానిని ఉపసంపహరించి, అశ్వత్థామను తరిమి పట్టుకొని యాజ్ఞికుడు రజ్జువుచే పశువును గట్టినట్లు బంధించి శిబిరము కడకు గొని తెచ్చినాడు. అంత హరి ''అర్జునా! భయపడిన వానిని, దీనుని, నిద్రలోనున్న వానిని, మద్యము ద్రావిన వానిని, రక్షింపుమని ప్రార్థించువానిని చంపుట ధర్మము గాదు. ప్రాణభయంతో పారిపోవు ఈ పాపాత్ముని రక్షింపుము'' అని పలికెను.

ద్రౌపదికి చేసిన ప్రతిజ్ఞ గుర్తుకువచ్చి అర్జునుడు గురునందనుని ఆమెకడకు తీసుకొనిపోయి పాశములచే బంధింపబడిన వానిని చూపెను. బాలవధ జనిత లజ్జా పరాజ్ముఖుడైన గురుని కొడుకుని చూచి మ్రొక్కి సుస్వభావయగు ద్రౌపది ఇట్లనెను. గురునందనా! నీవు పుత్రాకృతిలో ఉన్న ద్రోణుడవు. నాభర్తలందరు బాణవిద్య లన్నింటిని ద్రోణుని దగ్గరే అభ్యసించిరి. నీ హృదయంలో లేశ##మైన కరుణలేక శిష్యసుతులను చంపుట న్యాయమేనా? శిశుమారణము రాక్షస కృత్యము. ఇది నీకు తగునా తండ్రీ! శస్త్రములు ధరించి యుద్ధరంగములో లేరే! నీకు కించి ద్ద్రోహముచేయలేదే! కటిక చీకటిలో నిద్రాసక్తులైన చిట్టిపాపలను సంహరించుటకు నీ చేతు లెట్లాడినవి? పుత్రశోకముతో దుఃఖించుచున్న నావలెనే, నిన్ను కిరీటి బంధించి ఇక్కడికి ఈడ్చి తెచ్చినాడన్న వార్తవిని, నీ తల్లి ఎంత దురపిల్లుచున్నదో?'' అని పలికి కృష్ణార్జునులను చూచి ''ద్రోణునితోపాటు సహగమన మొనర్పక ఆమహాముని భార్య ఇంటిలోనే ఉన్నది. నావలెనే ఇప్పుడామె ఎంత దుఃఖించుచున్నదో ఏమో! వీనిని హింసింపకుడు'' అని పలికెను. దర్మయుక్తములు, కరుణాయుతములు సమంజసములైన ద్రౌపది పలుకులకు ధర్మనందనుడు ఎంతో సంతోషించినాడు. నకుల సహదేవులు, సాత్యకి ధనంజయకృష్ణులు సమ్మతించినారు. కాని సమ్మతింపక భీముడు ''కొడుకులను పట్టి చంపెనని కోపము చెందక, బాలéఘాతుకుడైన, వీనిని విడువుమని పల్కు ద్రౌపది ఎంత వెఱ్ఱిది? వీనిని మీరలు చంపకున్నచో నాపిడికిటి పోటుతో వీని శిరస్సును భిన్నము చేసెదను'' అని పలుకగా ద్రౌపది అడ్డమువచ్చి అశ్వత్థామను రక్షించినది. భీముని సంరంభము చూచి శ్రీకృష్ణుడు చతుర్భుజుడై రెండు చేతులతో భీముని, కడమ రెండు చేతులతో ద్రౌపదిని తొలగించి, '' బ్రాహ్మణో న హంతవ్య'' అను ధర్మ దృష్టితో వీనిని రక్షింపు మని పలికెను.

అనంతరము శ్రీకృష్ణుని అనుమతితో అర్జును అశ్వత్థామ శిరోజములను ఖండించి, వాని శిరమున నుండు చూడామణిని పుచ్చుకొని పంపివేసెను.

తన పుత్రులను చంపినను, వానిని సంహరించుటకై అవకాశమున్నను మాతృహృదయముతో కృష్ణార్జునులను ప్రార్థించి గురుపుత్రుని ప్రాణమును ద్రౌపది కాపాడినది. సజ్జనులు తమకు అపకారము చేసిన వారికి కూడా అపకారమును తలపెట్టరు.

ప్రశ్నలు

1. అశ్వత్థామ ఉపపాండవులు నేల వదించెను?

2. ద్రౌపది అశ్వత్థామను ఏల విడువు మనెను?

3. అశ్వత్థామ ఎట్లు శిక్షింప బడెను?

Neetikathamala-1    Chapters    Last Page