Neetikathamala-1    Chapters    Last Page

40

దైవస్తుతి

శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేర్థినామ్‌,

శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌.

శ్రీ వేంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసమ్‌,

శ్రిత చేతన మందారం శ్రీనివాస మహం భ##జే.

* * *

భర్తృహరి

రాతిరి మూషికంబు వివరం బొనరించి, కరండ బద్ధమై

భీతిలి చిక్కియాస చెడి పెద్దయు డప్సిక పాము వాత సం

పాతముc జెందె, దానిc దిని పాము దొలంగె బిలంబుత్రోవనే

యే తఱి హాని వృద్ధులకు నెక్కటి దైవమ కారణం బగున్‌.

ఒక రాత్రి ఎలుక ఆహారము కొరకు ఒక పెట్టెకు రంధ్రముచేసి అందులో దూరెను. అంతకుముందె అందున్న పాము బయటకు వెళ్ళుటకు వీలులేక ఆకలిచేత డస్సి కృశించుచుండెను. ఎలుక లోపలికి ప్రవేశించగానే పాము దానిని భుజించి ఎలుక చేసిన రంధ్రము ద్వారానే బయటకు పాఱిపోయెను. అటులనే వృద్ధిక్షయములకు దైవమే కారణము గదా?

* * *

యక్షప్రశ్నలు

సోదర సహితుడై ధర్మరాజు అర్థియైన ఒక బ్రాహ్మణుని కోర్కె నెరవేర్చుటకు ఒక మృగాన్ని వెంబడించాడు. పాండవులు ఎన్ని అస్త్రాలు విడచినా, ఏ మాత్రం క్లేశం పొంద కుండా ఆ మృగం పారిపోయింది. దాహపీడితులై వారు ఒక మఱ్ఱిచెట్టు నీడను చేరారు. ధర్మజుని ఆజ్ఞానుసారం నకులుడు ఒక సరోవరాన్ని చేరాడు. దాహపీడితుడై ఆ స్వచ్ఛజలాలను త్రాగబోగా అతనికి ఆకాశంనుండి ''ఆర్యా! ఈ సరోవరం నా అధీనంలో ఉంది. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేవరకు ఇందులో నీరుత్రాగే అధికారం నీకులేదు'' అను మాటలు వినబడ్డాయి. ఆ మాటలు లక్ష్యపెట్టక నీరు త్రాగుతూనే అతడు అచేతనుడై పడిపోయాడు. సహదేవునికి కూడా ఆ స్థితే పట్టింది. అర్జునుడు వచ్చాడు. ఆ యక్షుని మాటలు అపహసించి నీరుత్రాగి అచేతనుడై పడ్డాడు. భీమసేనునికి అదే గతి సంభవించింది. తుదకు ధర్మరాజు వచ్చాడు. తన సోదరుల దుఃస్థితికి విచారించాడు. ఆ యక్షుని ప్రశ్నలను నిర్లక్ష్యం చేయక తగు సమాధానా లిచ్చాడు. తృప్తుడైన యక్షుడు యమధర్మరాజు, తన నిజరూపంలో దర్శన మిచ్చాడు. ధర్మస్వరూపుడైన యముని ప్రశ్నలకు ధర్మజ్ఞుడైన యుధిష్ఠిరుడు ఇచ్చిన సమాధానాలు మనకు విజ్ఞానదాయకాలు. వీటిని చదివి, అర్థం చేసుకుని మననం చేసుకోవడం వివేకలక్షణం.

ప్రశ్న ః ధీమంతుడు, సర్వప్రాణిలోక పూజితుడూ ఇంద్రియ విషయజ్ఞుడూ అయిఉండి మృతకల్పుడుగా ఉండే వా డెవడు?

జవాబు ః అతిథులను, దేవతలను, పితరులను, పోషించవలసిన కుటుంబ జడులనూ ఎవడు నిర్లిప్తంగా చూస్తాడో వాడు మృతకల్పుడు.

ప్రశ్న ః భూమికంటె భారమైనదీ, ఆకాశంకంటె ఉన్నతమైనదీ వాయువుకంటె వేగంగా పోయేదీ, గడ్డిపరకలకంటె అధిక సంఖ్యలో ఉండేది ఏది?

జవాబు ః మాతృగౌరవము పృథ్వికంటె భారమైనది. తండ్రి ఆకాశం కంటె ఉన్నతమైనవాడు; మనస్సు వాయువుకంటె వేగంగా పోయేది; అసంఖ్యాక మైనది చింత.

ప్రశ్న ః ధర్మస్థాన మేది? యశస్స్వర్గ సురాస్థానము లేవి?

జవాబు ః దక్షత ధర్మస్థానం; దానం యశస్సుకు, శీలం, సత్యం స్వర్గానికి ముఖ్యస్థానాలు.

ప్రశ్న ః ఏ గుణాలు అభినందనీయాలు? ధనికుల ఉత్తమ ధనమేది? లాభాలలో ప్రముఖమైన వేవి? మహాసుఖ మేమి?

జవాబు ః దక్షతయే ఉత్తమ గుణం. శాస్త్రజ్ఞానమే ప్రధాన ధనము. ఆరోగ్యమే మహాలాభం; సంతోషమే ఉత్తమసుఖము.

ప్రశ్న ః దేనిని వశం చేసుకుంటే మానవునికి శోకం కలుగదు? ఎవనితో మైత్రి నాశం లేకుండా ఉంటుంది?

జవాబు ః మనస్సును వశంచేసుకుంటే ఏ శోకం ఉండదు. నాశనం లేనిది సత్పురుష సాంగత్యము.

ప్రశ్న ః దేనిని పరిత్యజిస్తే మానవుడు శోకరహితుడై సుఖప్రియ వంతుడై ధనవంతు డౌతాడు?

జవాబు: మానవరహితుడు ఇష్టార్థములను పొందుతాడు. క్రోధరహితుడు విచారహీను డౌతాడు. కామరహితుడు ధనవంతు డౌతాడు. లాభరహితుడు ధనవంతు డౌతాడు.

ప్రశ్న ః తపస్సుకు లక్షణ మేమిటి? దమ క్షమా లజ్ఞ లన నేమి?

జవాబు ః స్వధర్మ నిర్వహణమే తపస్సు. మనోవిగ్రహమే దమము; శీతోష్ణాది ద్వంద్వాలను సహించడమే క్షమ; అకృత్యాలకు దూరంగా ఉండడమే లజ్ఞ.

ప్రశ్న ః జ్ఞానమంటే ఏమిటి? శమమేది? దయ అనగా నేమి? సరళ స్వభావ మని దేని నంటారు?

జవాబు ః పరమాత్మతత్త్వ గ్రహణమే జ్ఞానము. ప్రశాంత చిత్తతయే శమము. అందరు సుఖంగా ఉండాలని కోరుటయే దయ. సర్వసమభావమే సరళత.

ప్రశ్న ః మనుష్యునికి లొంగని శత్రువేది? వీడని వ్యాధి యేది? ఏ మానవుడు సాధుజనుడు? ఎవ డసాధువు?

జవాబు ః క్రోధము అజయ్యమైన శత్రువు. లోభము వీడని వ్యాధి. సర్వప్రాణి హితాన్ని కోరేవాడు సాధువు. దయారహితుడు అసాధువు.

ప్రశ్న ః ఋషులు దేనిని స్థిరత్వ మంటారు? దేనిని ధైర్యమంటారు? ఉత్తమ స్నాన మేది? దేనిని దాన మని పిలుస్తారు?

జవాబు ః ఎవడు స్వధర్మమందు ప్రవర్తిస్తూంటాడో వానిని స్థిరు డంటారు. ఇంద్రియ నిగ్రహమే ధైర్యము. మనో మాలిన్యాన్ని విడిచి పెట్టడమే పరమ స్నానము. భూతదయాబుద్ధియే దానము.

ప్రశ్న ః పండితు డెవరు? నాస్తికు డెవరు? మూర్ఖు డెవడు? కామ మత్సరా లంటే ఏమిటి?

జవాబు ః ధర్మజ్ఞుని పండితునిగాను, మూర్ఖుని నాస్తికునిగాను గ్రహించాలి. జననమరణ రూపమైన సాంసారిక వాసనలే కామము. హృదయ తాపమే మత్సరము.

ప్రశ్న ః అహంకార దంభా లంటే ఏమిటి? దైవ మంటే యేమిటి? పైశున్యం అంటే యేమిటి?

జవాబు ః అజ్ఞానమే అహంకారము. తనకు తానై ధర్మాత్ముడని ప్రచారం చేసుకోవడమే దంభము. దానఫలమే దైవము. పరదోష ప్రచారమే పైశున్యము.

ప్రశ్న ః శాశ్వత నరకము ఏ పురుషునికి ప్రాప్తిస్తుంది?

జవాబు ః భిక్షాటనం చేస్తూ జీవించే బ్రాహ్మణుని పిలిచి రిక్తహస్తం చూపించేవాడికి, వేదాలను ధర్మశాస్త్రాలను అమరులను మిథ్యాబుద్ధితో చూసేవారికి, ఐశ్వర్యం ఉండి దానం చేయకుండా భోగించకుండా లుబ్ధుడై చరించేవానికి శాశ్వత నరకం ప్రాప్తిస్తుంది.

Neetikathamala-1    Chapters    Last Page