Neetikathamala-1    Chapters    Last Page

3

దైవస్తుతి

ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ

మన్యేన సిన్థుతనయా మవలంబ్య తిష్ఠన్‌,

వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం

లక్ష్మీ నృసింహ! మమ దేహి! కరావలంబమ్‌.

- - -

దాశరథీ

పాతకులైనమీ కృపకుc బాత్రులు కారె తలంచి చూడc

ట్రాతికిc గల్గెc బావన మరాతికి రాజ్య సుఖంబు గల్గె దు

ర్జాతికిc బుణ్య మబ్బెc గపి జాతి మహత్త్వము నొందె గావునం

దాతవ యెట్టి వారలకు దాశరథీ! కరుణాపయోనిధీ!!

దయాసముద్రుడవైన ఓ రామా! ఆలోచించి చూడగా పాపులు కూడా మీ దయకు పాత్రులేగదా! బండ రాతికి పవిత్రత చేకూర్చితివి. విరోధులకు జెందిన విభీషణునకు రాజ్యసుఖము గల్గించతివి. నీచ జాతులకు పుణ్యము కల్గించితివి. (శబరి, గుహుడు). కపి జాతికి మహత్త్వము కల్గెను. కావున ఎట్టి వారలకై నను నీవు కృపాదాతవు గదా శ్రీరామా!

జనమేజయుడు

 

జనమేజయుడు పరీక్షిన్మహారాజు పుత్రుడు. పరీక్షీత్తు మరణించిన పిదప అతని కూమారుని రాజుగా చేశారు. సర్వ శత్రు సంహార సమర్థుడని వానిని జనమేజయ నామంతో పిలిచేవారు. కాశీరాజు పుత్రి వపుష్టమ అతని భార్య. అనురూపవతి, అనుకూలవతి. ఒకనాడు జనమేజయుడు తన తండ్రియగు పరీక్షిన్నరేంద్రుని గుణగణాలను, ధర్మనిరతిని మంత్రుల ముఖతః విన్నాడు. అంతేగాక తన తండ్రి మరణకారణాన్ని, కారకులను గురించి కూడ వారినడిగి తెలుసుకున్నాడు. జనమేజయుని మనస్సు విచార క్రోధాలతో నిండి పోయింది. తన తండ్రి మరణానికి ప్రధాన కారకుడైన తక్షకునిపై ప్రతీకారం తీసుకుని ఆ దుష్టునికి తగిన శాస్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రిని విషాగ్నికీలలతో భస్మం చేసిన తక్షకుని బంధుజన సోదరులతో సహా భస్మం చేసే మార్గం నిర్దేశించ వలసినదిగా పురోహితులను, ఋత్విజులను కోరాడు. వారు తక్షణమే సర్పయాగం నిర్వహింపుమని పలికారు. జనమేజయుడు సర్పయాగం చేయుటకు నిశ్చయించి యజ్ఞ మండపాన్ని నిర్మించి, యజ్ఞ సంభారములను సేకరించమని ఆజ్ఞ యిచ్చాడు.

శాస్త్రప్రకారం ఋత్విక్కులు నల్లని దుస్తులు ధరించి యజ్ఞకుండం ముందు కూర్చుని యాగం ప్రారంభించారు. అనేకమంది ముని శ్రేష్ఠులు వచ్చారు. వారిలో చండ భార్గవుడు, జై మిని, శిష్యసహితుడైన వ్యాసభగవానుడు మొదలయినవారు ముఖ్యులు. మంత్రోచ్చారణతో ఒక్కొక్క సర్పాన్నీ ఆహ్మానిస్తున్నారు. ఆ ఆహ్వానం అందటంతోటే సర్పాలు దీన ముఖాలతో వచ్చి అగ్ని కుండంలో పడిపోతున్నాయి. అనేక రకాల పాములు, అనేక ఆకారాలు కలవి బుసలు కొట్టుతూ లక్షల కొలది ఆ యజ్ఞంలో నశిస్తున్నాయి. ఋత్విక్కులు జనమేయుడు సర్పజాతి నాశనాన్ని కోరుతూ స్థిరసంకల్పంతో యజ్ఞం కొనసాగిస్తున్నారు. సర్పకులాన్నంతా భస్మం చేస్తున్న యీ యజ్ఞం తక్షకునికి విపరీతమైన భయాన్ని కల్గించింది. తనవల్ల జరిగిన అపరాధం వల్లనే ఇంత స్వజాతి మారణహోమం జరుగుతోందని తక్షకుడు గుర్తించాడు. ఇంద్రలోకం చేరి ఇంద్రునికి సర్వ వృత్తాంతము నివేదించి అతని శరణు వేడాడు. ఇంతకు మునుపే బ్రహ్మవలన సర్పజాతి శ్రేయోమార్గం ఆలోచించానని చెప్పుతూ ఇంద్రుడు తక్షకునికి అభయ ప్రధానం చేశాడు. ఇంద్రుని అభయచ్ఛాయలలో తక్షకుడు సుఖంగా వున్నాడు. మరోప్రక్క సర్పాలు అర్బుద సంఖ్యలో నాశన మౌతున్నాయి. నాగరాజు వాసుకి దుఃఖానికి అంతులేదు.

యజ్ఞ మండపంలో ఋత్విక్కులు మంత్ర పురస్సరంగా తక్షకుని ఆహ్వానించారు. అతడు రాలేదు. మళ్లీ ఆహ్వానించారు. రాలేదు. తిరిగి మళ్లీపిలిచారు. కాని ఆతని జాడ కనిపించలేదు. అప్పుడు జనమేజయుడు ''మహాత్ములారా! తక్షకుడు నాకు పరమశత్రువు. అతడు ఈఅగ్నికుండంలో వచ్చిపడే ప్రయత్నం తీవ్రంగా చేయండి. అప్పుడే ఈ యాగం సంకల్పించిన నా ముఖ్యోద్దేశం నెరవేరుతుంది'' అనిహెచ్చరించాడు. వారు ''మహారాజా! తక్షకుడు మహేంద్రుని శరణువేడి ఆయన అభయరక్షణలో నున్నాడని శాస్త్రజ్ఞానం చెపుతోంది. అగ్నిదేవుడూ ఆమాటే అంటున్నాడని తెలిపారు. జనమేజయుడు కొంచెం బాధపడి హోతల నుద్దేశించి ఇంద్రసమేతంగా తక్షకుని ఆహ్వానించండి అన్నాడు. మరుక్షణమే వారు ''సహేంద్ర తక్షకాయ స్వాహా'' అన్నారు. ఇంద్రుడు తన పరివారంతో రాసాగాడు. అతని ఉత్తరీయంలో తక్షకుడు దాగియున్నాడు. జనమేజయుడు అసహనంతో తక్షకుడు ఇంద్రుని విమానంలో దాగివుంటే ఇంద్రునితో సహా తక్షకుని యజ్ఞ కుండంలోనికి రప్పించండి అన్నాడు. మరుక్షణంలో ఆ మంత్రం పఠించారు. భయభీతుడైన ఇంద్రుడు తక్షకుని యజ్ఞకుండ సమీపంలో వదలి వెళ్లిపోయాడు.

మన శత్రువు ఎంతటి బలవంతుని ఆశ్రయించినా జంకు లేక ఇద్దరిని నిర్జించే శక్తిని మనం సముపార్జించి ఆయత్తం చేసుకోవాలి. అప్పుడే జాతిశ్రేయస్సు ధర్మరక్ష జరుగుతుంది.

ప్రశ్నలు

1. జనమేజయడు సర్పయాగము చేయుటకు కారణమేమి?

2. తక్షకుడు హోమకుండమున పడకుండుటకు హేతువేమి?

3. ఆస్తీకుడు సర్పయాగము నెందుల కాపెను?

Neetikathamala-1    Chapters    Last Page