Neetikathamala-1    Chapters    Last Page

39

దైవస్తుతి

ప్రహ్లాద నారద పరాశర పుండరీక

వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్‌,

రుక్మాంగ దార్జున వసిష్ఠ విభీషణాదీన్‌

పుణ్యా నిమాన్‌ పరమభాగవాతాన్‌ స్మరామి.

* * *

భర్తృహరి

ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు

శ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకంబు నందుండి య

స్తోకాంబోధిc, బయోధినుండి పవనాంధోలోకముం జేరె గం

గా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్‌.

గంగానది ప్రథమమున ఆకాశమునుండి ఈశ్వరుని తలమీదకు, అచటనుండి హిమవత్పర్వతము మీదకు, దానినుండి భూమిమీదకు, భూమినుండి సముద్రమునకు, అచటనుండి పాతాళమునకు వచ్చెను. గొప్పస్థితి నుండి పతనమగు వారికి ఇదే విధముగా వివిధములగు పాట్లు సంభవించును.

* * *

సులోచన

సులోచన నాగరాజు కుమార్తె. లంకాధీశ్వరుడైన రావణ ప్రభువు కోడలు. మహావీరుడైన మేఘనాదుని అర్ధాంగి. లక్ష్మీజగన్నేతలకు సాధ్యము కాని పనిని ఆత్మ బలముతో సాధించిన మహాపతివ్రత సులోచన.

రామ రావణయుద్ధము భయంకరముగా సాగుచున్నది. వానరులకు రాక్షసులకు మధ్య సమరము సంకులముగా నున్నది. రావణ కుమారుడైన ఇంద్రజిత్తు మాయా యుద్ధముచేత రామ లక్ష్మణులను బంధించాడు. సుగ్రీవుడు హనుమదాది వీరు లందరు వారిని జూచి మిగుల శోకించిరి. ఇంద్రజిత్తు రాఘవులు తన చేతిలో మరణించినారని నిశ్చయించి ''నిర్జరేశ్వరా! నేడు నా నాగపాశములచేత రామలక్ష్మణులను హతమార్చాను'' అని రావణుని కెరిగించినాడు. కుమారుని పరాక్రమమునకు సంతసించిన రావణుడు జయజయ ధ్వనులు చెలరేగుతుండగా అంతఃపుర మందిరంవైపు వెళ్ళినాడు. రామ లక్ష్మణులు మూర్ఛిల్లిన విషయ మెరిగి సుగ్రీవాదులు హనుమంతుని పంపి సంజీవని తెప్పించడానికి యత్నించుచుండగా, ఇంతలో గరుత్మంతుడు వచ్చి రామలక్ష్మణులను నాగపాశబంధవిముక్తులను గావించాడు.

సులోచనకు నాటి రాత్రి భయంకర స్వప్నము వచ్చినది. ''ఒకానొక భయంకరాకృతి మహోగ్రముగా కను గ్రుడ్లుత్రిప్పుతూ, దిక్కులు పిక్కటిల్లే ధ్వనులుచేస్తూ తన శయ్యమీదనే ఉన్న భర్తను ఘోర దంష్ట్రలతో కాటు వేసినది-'' ఆ దుస్స్వప్నము తలచుకొని సులోచన పట్టరాని దుఃఖమున కుమిలి పోవుచున్నది; ఆమె తెల్లవారగనే, జగజ్జనని భవానిని భక్తి పూర్వకముగా ఆరాధించి ''దేవీ! భవానీ! నాకు నిరంతరము పతిచరణ సాన్నిధ్యము ప్రసాదించు. నన్ను నిత్య సుమంగళిగా దీవించు'' అని ప్రార్థించినది.

ఇంతలో విజయగర్వముతో విచ్చేశాడు ఇంద్రజిత్తు. పతికి నమస్కరించి స్వప్నవార్త ఎరిగించినది. యుద్ధములో పాల్గొనవద్దని బతిమాలినది. లంకేశ్వరుడు అకారణముగా శ్రీరామచంద్రునితో యుద్ధమును తెచ్చి పెట్టుకున్నాడని సీతా మహాదేవిని అశోకవనంలో బంధించుట సర్వ వినాశ కారణమని చెప్పినది. సులోచన పలుకులు విని ఇంద్రజిత్తు ''మహారాణీ! ఇంద్రాది దేవతల చేతనే సేవలు చేయించుకున్న రావణ ప్రభువు కోడలివి. అపజయ మెరుగని ఈ ఇంద్రజిత్తు ధర్మపత్నివి. నీ కెందుల కీ మానసిక ఆందోళనము!'' అని పలికెను.

సులోచన ''కాదు నాథా! నాకేదో మనస్సు వికలమై పోవుచున్నది. ఎందులకో దుస్స్వప్నము అపశకునముగా భాసించుచున్నది'' అన్నది. ఇంద్రజిత్తు వికటముగా నవ్వి ''జగదేక పరాక్రముడైన ఈ ఇంద్రజిత్తును ఒక్క రాముడు కాదు-కోటిమంది రఘురాములైనా ఏమీ చేయలేరు. సులోచనా! భయం వీడు. పితృదేవుని ఆజ్ఞయే నాకు శిరోధార్యము'' అని పలికెను. ఇంతలో సులోచన మందిరమునకు రమ్మని రావణ ప్రభువు వార్తాహరుని పంపినాడు.

తండ్రి ఆజ్ఞ ననుసరించి ఇంద్రజిత్తు రణాంగణములో ప్రవేశించి కుప్ప తెప్పలుగాశత్రు సైన్యమును కూల్చి వేసినాడు. ఒక్క హనుమంతుడు తప్ప మిగిలిన వానర సైన్యము ఆతని ధాటికి తాళజాలక వెనుదిరిగి పారిపోవుచున్నారు. ఇంతలో రామచంద్రుని ఆశీర్వాదబలముతో, విభీషణాదుల మంత్రాంగబలముతో, హనుమదంగదాదుల బాహుబలముతో లక్ష్మణ కుమారుడు సమరరంగమున ప్రవేశించాడు. లోకోత్తర ధనుర్విద్యాప్రవీణుడైన లక్ష్మణుని మహాప్రతాపము ముందు ఇంద్రజిత్తు అస్త్రములు విచ్ఛిన్నములై పోయాయి. కోపోద్విగ్నుడై ఇంద్రజిత్తు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించాడు. ఆ ఆగ్నేయాస్త్రమును లక్ష్మణుడు వారుణాస్త్రముతో వారించాడు. మేఘనాదుడు నాగాస్త్రము ప్రయోగించాడు. లక్ష్మణుడు గరుడాస్త్రముతో దానిని వ్యర్థముకావించి తలపడ్డాడు. సుమిత్రానందనుని ఐంద్రాస్త్రము ఇంద్రజిత్తు గుండెను చీల్చివైచింది. నిఖిలాస్త్రనిపుణుడైన ఇంద్రజిత్తు రణరంగమున ఒరిగి పోయాడు.

సులోచన పతిమరణవార్త నెరింగి శోక విహ్వలయైపోయింది. ''ప్రభూ! నే నేమి చేయుదును? మిమ్ములను వీడి నేనెట్లు శోకాకులమైన ఈ లోకములో బ్రతుకగలను? ఎక్కడ ఉన్నను నేను మీ అర్ధాంగినే కావలయును. కాని శత్రుసేనాభీలమైన రణభూమిలో మీ సన్నిధికి ఎట్లు వత్తును?'' అని పరిపరి విధముల దుఃఖించినది. పుత్రమరణ శోకముతో కుందుచున్న రావణునికడ కరిగి'' ప్రభూ! నా ప్రాణనాథుని నాకు తెప్పించియిండు'' అని ప్రార్థించెను. రావణుడు తన కా కార్యము అసాధ్య మని తెలిపెను.

అంత సులోచన ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుని సన్నిధి కరిగి ''రామా! కారుణ్యధామా! పతిపాదసేవా నిరతనైన నాకు రణరంగములో పడిపోయిన నా పతిని తెచ్చి యిండు. నా పతి దేవులను నేడు కడసారిగా సందర్శింప వలెనని వచ్చితిని'' అని విన్నవించెను. శ్రీరాముడు ఆ సాధ్వీరత్నము కోరికను విని ''అమ్మా! సులోచనా! నీ ఆవేదన నా కర్థమైనది. లక్ష్మణుని ఐంద్రాస్త్రముతో కూలిపోయిన నీభర్త శవ మెక్కడ ఉన్నదని గుర్తింపగలవు? ఆతడి శవ మెప్పుడో జంతుసంతతుల కాహారమై యుండును'' అని పలికెను. ''కాదు ప్రభూ! నాభర్త నన్ను కడసారి చూడకుండ మరణింపరు. ఆయన కొన ఊపిరితోనైన నా కొరకు బ్రతికియే యుందురు'' అని ఆమె పలికెను.

శ్రీరాముడు ఆమె పతిభక్తికి మెచ్చుకొని ''లక్ష్మణా! భర్త కోసరమై మన సన్నిధికి వచ్చిన ఈ పతివ్రత మనోభీష్టమును తీర్చుట మనకు అవశ్యకర్తవ్యము. వెళ్ళు తల్లీ! సౌమిత్రి వెంటవెళ్ళు. నీ ఆత్మశక్తి మహామహిమోపేత మైనది. నీ సంకల్పసిద్ధి మహోదాత్తమైనది. నీ మనోభీష్టం సిద్ధిస్తుంది'' అని దీవించి పంపాడు.

ధనుష్పాణియై లక్ష్మణుడు తనవెంట రాగా ఆ భీకర రణభూమిలో తిరిగి తిరిగి ఎట్టకేలకు, కొనయూపిరితోనున్న ఇంద్రజిత్తును ఆమె దర్శించింది. భార్యను దీవించి కన్నుమూశాడు ఇంద్రజిత్తు.

పాతివ్రత్య మహిమతో, ఆత్మబలముతో ఆర్తజన శరణ్యుడైన రామచంద్రుని ప్రార్థించి పతిభిక్షను పొందిన సాధ్వీరత్నము సులోచన.

ప్రశ్నలు

1. సులోచన ఎవరు? ఆమె గుణగణములను దెల్పుడు?

2. ఇంద్రజిత్తు, లక్ష్మణుల యుద్ధమును వర్ణింపుము.

3. సులోచన ఆత్మశక్తి ఎట్టిది?

Neetikathamala-1    Chapters    Last Page