Neetikathamala-1    Chapters    Last Page

36

దైవస్తుతి

వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది

మునీంద్ర దేవార్చిత శేఖరాయ,

చంద్రార్క వైశ్వానర లోచనాయ

తసై#్మ వకారాయ నమశ్శివాయ.

----

దాశరథీ

నీసతి పెక్కు గల్ములిడనేర్పరి, లోక మకల్మషంబుగా

నీ సుతసేయుc బావనము, నిర్మితకార్య ధురీణదక్షుcడై

నీ సుతుcడిచ్చు నాయువును, నిన్ను భజించనcగల్గకుండునే

దాసుల కీప్సితార్థములు; దాశరథీ! కరుణాపయోనిధీ!

దయాసముద్రుడవైన ఓ రామా! నీ భార్య లక్ష్మీదేవి సిరిసంపద లిస్తుంది. నీ కూతురు గంగ లోకాన్ని పవిత్రం చేస్తుంది. నీ కుమారుడు సృష్టికార్య నిర్వహణమునందు నేర్పరియై ఆయుర్దాయమును ఇస్తాడు. నిన్ను పూజిస్తే భక్తుల మనోరథాలు నెరవేరకపోవునా! శ్రీరామా!

- - -

అగస్త్యుడు

అశేష జలరాశిని అరనిముసంలో ఆపోశనం చేసిన మహోగ్రతేజ స్సంపన్నుడు, ప్రాతఃస్మరణీయుడు-అగస్త్యమహర్షి. లోపాముద్రా ద్వితీయుడై కై వల్య లక్ష్మి కుల గృహమైన పుణ్యౖకరాశి-కాశియందు నివసించుచుండెను. మోక్షపదప్రకాశియైన కాశియందు అతడు నిర్మలహృదయాంతరంగుడై జాహ్నవిని, కాలభైరవుని, డుంఠివిఘ్నేశుని, శ్రీ విశాలాక్షితో గూడిన విశ్వనాథుని సేవించుచు ఆనందంతో కాలంగడుపుతున్నాడు.

ఒకనాడు బృహస్పతి పురస్సరంబుగా అమరులు, మునులు వచ్చి తెల్లని విభూతిని ఫాలభాగంబున, రుద్రాక్షలను కంఠసీమను ధరించి అపరశంకరుని రూపులో ''త్వ మేవాహం'' అని చింతించు అగస్త్యుని దర్శించిరి. వారినిచూచి నహుషగర్వాపహారి ఎదురేగి వారిని ఆహ్వానించి అతిథిసత్కారం చేశాడు. అంత బృహస్పతి లోపాముద్రాదేవిని కుశల ప్రశ్నాదులతో సంభావించి మహర్షినిచూచి- ''ఓ మహర్షీ! నీవు ధన్యాత్ముడవు, పూజనీయుడవు, బ్రహ్మ తేజోవిరాజమానుడవు. నీ సతి పరమ పతివ్రత. ప్రణవ పంచాక్షరీ బ్రహ్మ విద్య నీకు కరతలామలకము. ప్రతాపమునందు ప్రభావమునందు, ఔదార్యమునందు నీకు నీవే సాటి. లోక కంటకుడైన వాతాపిఖల గర్వ మణచినది నీవేగదా! నహుషుని అహంకారమును మట్టుపెట్టినదీ నీవే. నేడు భువన సంక్షోభము కల్గించు ఒక ఉపద్రవం వాటిల్లినది. అందువలన బ్రహ్మదేవుని ఆజ్ఞప్రకారం మేము నిన్ను ప్రార్థింప వచ్చాము. ఈతడు అగ్ని, ఇతడు వాయువు, ఇతడు ఇంద్రుడు, ఇతడు కిన్నరపతి'' అని తన వెంటవచ్చిన సిద్ధ, సాధ్య, మరుత్కిన్నర, కింపురుష, గంధర్వ, విద్యాధర, మౌనులను పరిచయం చేశాడు. నేడు కల్గిన లోకసంక్షోభ కారణ మేమనగా వింధ్యపర్వతం మేరుపర్వతంతో పోటీపడి తన శిఖరములను విపరీతంగా పెంచి లోకాధారంబైన సూర్యుని రథమును అడ్డగించినది. నక్షత్రగ్రహచక్ర మంతా చీకాకు పడి పోయినది. ధ్రువనక్షత్రము దాటి, ఆకాశగంగ నతిక్రమించి, త్రివిక్రమావతారంవలె వింధ్యుడు ఆకస మంతను ఆక్రమించాడు. సూర్యగమనము ఆగిపోవుటవలన కాలచక్రము స్తంభించి పోయినది. నిత్యనైమిత్తిక కార్యకలాపాలు లోపించాయి. భూమండలమున, కొన్ని దేశములు అంధకార బంధురము లయ్యెను. ఈ కారణములవలన భువనములకు అకాల ప్రళయము ఏర్పడెను. ఈ సంక్షోభ నివారణకై బ్రహ్మదేవుని ప్రార్థింపగా, అతడు ఈ ఉపద్రవమును వారించుటకు హుంకారమాత్రంచే నిముసంలో దేవ రాజ్యలక్ష్మీ మదాంధుడైన నహుషుని గర్వ మడంచిన నీవు దక్క మరొకడు అశక్తుడని తెల్పెను. అందువలన మే మందరము నీ సాయము వేడుచున్నామని'' చెప్పెను. బృహస్పతి పలుకులు ఆలకించిన అగస్త్యమహర్షి ''నాశక్తికొలది ప్రయత్నము చేయుదును. మనందరికి అర్థులకు కల్పతరువువలె ఉమామహేశ్వరు లున్నారుగదా! మీరు మీ మీ నివాసములకు వెళ్ళండి'' అని ఆశ్వాసించి పంపాడు. వారునూ ఉచిత రీతిని మహర్షికి వీడ్కోలు చెప్పి వెళ్ళి పోయారు.

తనకు కాశీ వియోగ మన్నది అగస్త్యునికి కడు విచారము కల్గించెను. తానొక్కటి తలచిన దైవమొకటి తలచును గదా! తాను కాశిని విడువరాదని అచట నివసించుచుండ కాశియే తనకు దూర మయ్యెను. నిజమాలోచింపగా యుగసంధిలో సమస్తమును ఉఱ్ఱూత లూగించు పవనునకు, సర్వభూతములను శాసించెడు యమునకు, సర్వమును నశింపజేయు అగ్నికి, కామధేను కల్పవృక్షములకు నిలయుడైన ఇంద్రునకు వింధ్యగిరి గర్వము నడచుట అసంభవమా? కాశిని విడిచి వెళ్ళవలసి వచ్చినందులకు తన దురదృష్టమునకు దురపిల్లుతూ - ''వచించినమాటకు కట్టుబడవలె గదా, ఫలితమే మైననూ, మాట నిలబెట్టుటకే గదా మధుకై టభులు మరణించారు. ఆ మాటకొరకే గదా గరుత్మంతుడు శ్రీహరికి వాహనమైనాడు; అట్లే మాటయిచ్చిన కారణంగానే బలి పాతాళవాసం చేస్తున్నాడు. అప్రియం చేకూరు నను శంక లేక ఇతరులకు ఉపకారం చేసిన మేలు కల్గును. మనం చేసిన ధర్మమే మనలను కాపాడును'' అని తలచెను. అశ్రుపూరిత నయనములతో సర్వపాపహారియైన జాహ్నవికి, జగత్పితరులైన శ్రీ విశాలాక్షీ విశ్వనాథులకు, డుంఠివిఘ్నేశునకు, కాలభైరవాది దేవతలకు ప్రణతు లర్పించి వీడ్కోలు చెప్పాడు. ''వాతాపి ఇల్వలులను ఎందుకు నేను జీర్ణంచేసుకున్నాను? నహుషుని స్వర్గంనుండి నేను ఎందుకు పతనం చేశాను? ఈ ప్రభావయుతమైన అదిరిపాటు పనులే కాశినుండి నన్ను పంపివేస్తున్నాయి'' అని దుఃఖిస్తూ వెనుకకు తిరిగి పుణ్యరాశియైన కాశిని చూస్తూ విడువలేక కాశి వీడి నిష్క్రమించాడు ఆ పుణ్యమూర్తి.

నెమ్మది నెమ్మదిగా అరుగుదెంచు అగస్త్యమహర్షిని, వింధ్య నగేంద్రుడు అల్లంతదూరములో నుండగా చూచినాడు. తన కాంచన శిరశ్శృంగ శృంగాటకముల వలన సూర్యుని అడ్డగించిన తన పొడవును ఉపసంహరించి నేలమట్టమునకు వంగి ఆ మహర్షికి అభివాదము చేశాడు. అప్పుడు సూర్యుని రథం సాగింది. గ్రహములు యథాస్థానము చేరి చరింపసాగాయి. కాలచక్రము నిరాటంకమై అంతయు యథాపూర్వంగా జరుగ ప్రారంభించింది. తెల్లని విభూతి రేఖలతో ప్రకాశించు ఫాలభాగముతో, రుద్రాక్షమాలికలు వక్షమున ధరించి, కాశీనగర నిర్గమనక్లేశ క్రోధాగ్నిచే ఈ ధరిత్రిని దహించగల ఆగస్త్యునికి ఆ వింధ్య నగాధిరాజు అతిథిపూజచేసి చేతులు జోడించి ''మహానుభావా! నీవు ఆజ్ఞాపించి నన్ను కృతార్థుని చేయు''మని ప్రార్థించాడు. అంతట ''ఓ వింధ్యాచల శ్రేష్ఠా! నేను దక్షిణా పథమునకు తీర్థయాత్రలకై సతీయుతుడనై వెళ్ళుచున్నాను. వయసుమీరిన కారణాన, వార్ధక్య బలహీనతవలన మే మీ ఉత్తుంగ శిశరముల నెక్కజాలము. నేను తిరిగి వచ్చువరకు నీవు ఈ భూమియందు ఒదిగియుండుము'' అని పలికెను. అంతట వింధ్యపర్వతము వినయముగా ''మహాత్మా! ఈ చరాచర ప్రపంచమందు నీ యాజ్ఞను నిర్వహింపని వా రెవరు? తమరు తిరిగి వచ్చువరకు ఇట్లే యుండెదను'' అని పలుకగా ఆ పుణ్యాత్ముడగు అగస్త్యుడు దక్షిణాపథమునకు వెళ్ళెను.''

లోకకళ్యాణమునే మహాత్ముల జీవితాదర్శనముగా నెంచుదురు. అందువల్లనే సకల కైవల్య కల్యాణరాశియగు కాశిని వీడి అగస్త్యమహర్షి దక్షిణాపథయాత్రా మిషతో వింధ్యగర్వాపహరణము కావించినాడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణకు శక్తి అవసరం, అట్టి లోకకల్యాణ కృషిలో ''బలము పాస్మహే'' అన్నదే నేటి మన ప్రథమ కర్తవ్యం.

ప్రశ్నలు

1. దేవతలకు సంభవించిన దుఃస్థితి ఎట్టిది?

2. అగస్త్య మహర్షి ప్రభావ మెట్టిది?

3. అగస్త్యు డెట్లు లోకరక్షణ మొనరించెను?

Neetikathamala-1    Chapters    Last Page