Neetikathamala-1    Chapters    Last Page

31

దైవస్తుతి

నానాయోగి మునీంద్ర హృన్నివసతిం నానార్థ సిద్ధప్రదాం

నానాపుష్ప విరాజితాంఘ్రి యుగళాం నారాయణ నార్చితామ్‌,

నాద బ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థ తత్త్వాత్మికాం

మీనాక్షీం ప్రణతోస్మి సంతత మహం కారుణ్య వారాంనిధమ్‌

- మీనాక్షీ పంచరత్నం

- - -

భర్తృహరి

ఖలునిన్‌ సజ్జనుగాcగ, మూర్ఖజను సంఖ్యావంతునిం గాcగ, దా

యల సన్మిత్రులుcగా, నగోచరముc బ్రత్యక్షంబుగాc, బ్రాణహృ

త్కలనం భైన మహావిషం బమృతముంగాc జేయు సత్కర్మము

జ్జ్వల నిష్ఠానిధివై భజింపుము వయస్యా!వాంఛితార్థాప్తికిన్‌.

ఓయి నేర్పరీ! నీవు కోరిన కోర్కెలను పొంద దలచితివేని దుర్జనులను సజ్జనులుగను, మూర్ఖుని విద్వాంసునిగను, శత్రువులను మిత్రులుగను, ఇంద్రియా గోచరమైన దానిని గోచరించుదానిగను, విషము నమృతముగను జేయంజాలిన సత్కర్మ నారాధింపుము. ఇతర విషయములకై పాటుపడకుము.

- - -

చంద్రహాసుడు

చంద్రహాసుడు కేరళ##దేశాధీశ్వరుని కుమారుడు. సౌభాగ్యలక్షణసంపన్నుడు. కందర్ప సదృశ రూప రేఖా విలాసభాసురుడు. తేజోవిరాజమానుడు. కాని ఆతడు బాల్యము నందే తల్లి దండ్రులను కోల్పోయాడు. పౌర నారీజనులచే పెంచబడి, అయిదేండ్లు వచ్చుసరికి ఒకనాడు అటనట నాట లాడుచు ''దుష్టబుద్ధి'' అనే పేరుకలిగిన మంత్రి గృహానికి వెళ్లాడు. మంత్రి కొలువులో ఉన్న దైవజ్ఞులు వానిని చూచి భూమండలాన్ని ఏలగలడని చెప్పారు. ఆ మాటలు విని దుష్టబుద్ధి ఈర్ష్యాసూయా పరవశుడైనాడు. ఋషుల వాక్యములు అసత్యములని నిరూపింపదలచి వెంటనే యమభటులవంటి చండాలురను పిలిచి, వానిని సమీపారణ్యములో ఖండించి రండని ఆజ్ఞాపించాడు. మద్యపాన మదోన్మత్తులైన వారు భీకరారణ్యములోనికి తీసుకువెళ్లి ఆ ముక్కుపచ్చలారని ముద్దుపిల్లవానిని చంపుటకు చేయాడక పాదమునందలి చిటికెన వ్రేలిని కోసికొని పోయి దుష్టబుద్ధికి చూపించారు.

మునుల వాక్యాలను భగ్న మొనర్చాను గదా యని దుష్టబుద్ధి ఉబ్బిపోతున్నాడు. మహారణ్యంలో అంగుళిచ్ఛేదన వల్ల వేదనతో పొరలుతున్న సమయంలో, ఆ ప్రాంత కాంతారమునందలి బోయలఱడు పుళిందు డనేవాడు దైవవశాన అక్కడికి వచ్చాడు. అపుత్త్రకుడైన పుళిందుడు ఆ బాలుని తీసికొనిపోయి భార్యకిచ్చి ఈతడు శ్రీహరి కరుణవలన లభించిన కుమారుడని తెల్పాడు. చంద్రుని పరిహసింపగల ముఖము కలిగిన ఆ బాలునకు చంద్రహాసుడని నామకరణం చేశాడు.

శుక్ల పక్ష సుధాకరుడులాగా పెరిగి పెద్దవాడయి చంద్రహాసుడు వేదవేదాంగరహస్యాలు, అశ్వారోహణ గజారోహణ రథారోహణాదులు, విలువిద్య, ఖడ్గ విద్యాదులలో సంపూర్ణ నైపుణ్యం గడించాడు. పుళిందుడు చంద్రహాసునికి ¸°వరాజ్య పట్టాభిషేకం చేశాడు. అవక్ర పరాక్రమంతో చంద్రహాసుడు నానాదేశాలను గెలిచి, రత్నమణి హేమరాసులను గైకొని మహేంద్రవైభవంతో తిరిగివచ్చి తల్లి దండ్రులకు ప్రణామంచేశాడు. పుళిందుడు పులకించిపొయి ''నాయానా! మన ఏలిక కుంతలాధీశ్వరులు. మనకు ప్రాపకులైనవారు, మంత్రివర్యుడు దుష్టబుద్ధి, తత్పురోహితుడు గాలవుడు. ఆ మువ్వురకు వరుసగా పదివేలు, ఐదువేలు, రెండువేలు బంగారు నాణములు పంపుమని చెప్పాడు. తండ్రి ఆజ్ఞానుసారం చంద్రహాసుడు వెంటనే సువర్ణ నాణములు వారికి పంపాడు. దుర్మంత్రి అయిన దుష్టబుద్ధి ఆ ధనం స్వీకరించి పుళిందునికి ఇంతసంపద కలుగుటకు కారణమేమని అసూయామలీమస హృదయుడై, పుళిందుని బంధించుటకు చక్రవర్తి అనుజ్ఞవడసి అపారసేనా నివహంతో చందనావతీపురం వెళ్లాడు. అసలు విషయమెరుగని పుళిందకుడు కుమారునితో పాటు దుష్టబుద్ధికి ఎదురుగావెళ్లి స్వాగతమిచ్చి నిజమందిరంలో విడిది చేయించినాడు. కుశల ప్రశ్నాదికముల అనంతరం కపటమైత్రి నటిస్తూ ''పుళిందకా! పున్నమచందురుని వంటి నందనుడు నీ కెట్లా లభించాడు?'' అని ప్రశ్నించాడు. పుళిందుడు సమీపవనంలో చంద్రహాసుడు దొరికిన వృత్తాంతం ఎరిగించాడు. దుష్టబుద్ధి తన భృత్యులు చేసిన మోసం గుర్తించి క్రుద్ధుడైనాడు. ఎట్లాగో కోపం మనసులోనే అణచిపెట్టుకొని అక్కడేదైనా చేస్తే తనకే కీడు సంభవిస్తుందని ఒక ఉపాయం ఆలోచించాడు. స్వహస్తంతో ఒక లేఖ వ్రాసి, దానిని స్వయంగా మరుక్షణమే రాజధానిలో ఉన్న తన కుమారునికి అందించాలని చంద్రహాసునికి చెప్పాడు.

చంద్రహాసుడు వాయువేగ మనోవేగాలను మించిన అశ్వమును అధిరోహించి కుంతల దేశానికి వెళ్లి తత్పుర ప్రాంతంలో ఉన్న ఉద్యానవనంలో మార్గాయాసం తీర్చుకోవడానికై వెళ్లి ఒక ఫలపుష్ప భరితమైన మామిడిచెట్టు నీడలో పడుకొని నిదురింపసాగాడు. ఇంతలో రాజకుమార్తె చంపకమాలిని, దుష్టబుద్ధి కుమార్తె 'విషయ' మన్మథపూజకై ఆ వనానికి వచ్చారు. మంత్రికుమార్తె తియ్యమామిడిచెట్టు నీడలో నిద్రిస్తున చంద్రహాసుని చూచి ఈ రూపజిత మన్మథుడెవడా అని ఆతని రూపరేఖాసౌందర్యాలకు పరవశురాలై పోయింది. అతని ప్రక్కనే సంచిలో ఉన్న లేఖ చూచి, తండ్రి చేవ్రాలును గుర్తించి తండ్రి దుర్మార్గపు బుద్ధికి ఎంతో చింతించింది. ''రూపరేఖా విలాసుడైన ఈ రాజకుమారునకు తక్షణమే విషము నొసంగుము'' అని వ్రాసి ఉండగా, వెంటనే 'విషము' అన్న అక్షరాలలో 'ము' స్థానంలో ''య'' అని వ్రాసి యథాపూర్వంగా సంచిలో పెట్టింది. చంద్రహాసుడు నిదురలేచి ప్రక్షాళిత పాణి పాదవదనుడై పురంలో ప్రవేశించి లేఖను మంత్రి కుమారునికి అందజేశాడు. మంత్రి తనయుడైన మదనుడు మరుక్షణమే దైవజ్ఞులను పిలిపంచి ఆ రాత్రికే శుభలగ్నమని చంద్రహాసునికి విషయ నిచ్చి మహావైభవంగా వివాహం చేశాడు.

దుష్టబుద్ధి చంద్రహాసుని మరణముతో పీడవదలి పోయినదని, మునుల వాక్యములు అబద్ధము లయిన వని సంతోషించి, పుళిందకుని బంధించి మూడవనాటి వేకువజామునకు కుంతల పురానికి కదలివచ్చాడు. రాజ వీథులన్నీ అలంకరింపబడి ఉండటం చూచి జరిగిన వృత్తాంతము విని కాలుగాలిన పిల్లివలె ఎగిరిపడుచు కుమారునితో ''ఓరీ! దురాత్మకా! ఎంతపని చేసితి'' వని పండ్లు గొఱుక దొడగెను. కుమారుడు స్వహస్త లిఖితమైన లేఖ చూపించగా ఆశ్చర్యచకితుడై చంద్రహాసుని అంతమొందించుటకై మరియొక ఉపాయమును ఆలోచింప సాగెను.

మఱునాటి వేకువనే పదిమంది కటికవాండ్రను పిలిచి, సాయం సమయమున పురమునకు బయటనున్న కాళికాదేవి ఆలయంలో పొంచి ఉండి లోపలికి అడుగుపెట్టిన వ్యక్తిని రెండు ఖండములు కావింపుడని, ఆదేశించెను. మధ్యాహ్నమే చంద్రహాసుని పిలిచి ''అల్లుడా! మా యింటిలో కొత్తఅల్లుండ్రు సాయం సమయంలో కాళికాదేవిని పూజింపవలయును. ఇది మా కులాచారాము. నీవును అట్లే చేయుము'' అని చెప్పాడు. సాయంకాల మయ్యెను. చంద్రహాసుడు పూజా ద్రవ్యములు గైకొని దేవ్యారాధనమునకై ఆలయమునకు వెళ్లుచుండెను. ఇంతలో దుష్టబుద్ధి కుమారుడైన మదనుడు వచ్చి వెంటనే రాజు సమ్ముఖమునకు వెళ్ళవలసినదని చెప్పి తాను ఆలయమునకు వెళ్ళెను. మంత్రిపుత్రుడు కాలు లోని కిడెనో లేదో ఆతని శరీరము ఖండఖండములయ్యెను.

చంద్రహాసుడు రాజుసన్నిధి కరిగి ప్రణామంచేసి నిల్చున్నాడు. గాలవ సంయమీంద్రుని ఆజ్ఞతో కుంతలాధీశుడు తన కుమారైయగు చంపకమాలను చంద్రహాసుని కిచ్చి వివాహమొనర్చి రాజ్యాభిషిక్తుని గావించి తపోవనమునకై వెళ్ళెను.

అనంతరము దుష్టబుద్ధి కుమారుని వధను విని మిక్కిలి సంతాపముతో కాళికాదేవి ఆలయమునకు వెళ్లి బలిపీఠముపై శిరమును గొట్టుకొని భగ్న శిరస్కుడై మరణించెను.

చంద్రహాసుడు దుష్టబుద్ధి దుర్మంత్రమువల్ల సంభవించిన కీడును తెలుసుకొని తనకు అపకీర్తి వచ్చునని కాళికాలయమున కరిగి దేవిని ప్రార్థించి వారిని పునర్జీవితులను చేసెను. చంద్రహాసునిపై పుష్పవృష్టి కురిసెను.

''ఋషి వాక్యములు అసత్యములు ఎన్నడును కావు - దుష్టబుద్ధి అనేక దుష్ఫలితములను ఇచ్చును'' అనుటకు చంద్రహాసుని వృత్తాంతమే నిదర్శనము:

ప్రశ్నలు

1. చంద్రహాసుడు అను పేరు వానికెట్లు వచ్చెను?

2. దుష్టబుద్ధి చంద్రహాసుని చంపించుటకు ఏల ప్రయత్నము చేసెను?

3. ఇతరులను నాశనము చేయవలెనని తలంచిన కలుగు ఫలితమేమి?

Neetikathamala-1    Chapters    Last Page