Neetikathamala-1    Chapters    Last Page

27

దైవస్తుతి

బాలా పర్వత వర్ధనీ భగవతీ బాలార్క కోటిప్రభా

కల్యాణీ నిఖిలేశ్వరీ శుభకరీ గౌరీ శివా పార్వతీ,

సర్వజ్ఞా సకలాగమాంతవినుతా సౌభాగ్య సంపత్ప్రదా

దుర్గాంబా నవకోటిమూర్తి సహితా మాంపాతు మాహేశ్వరీ.

- కల్యాణ కనకదుర్గ నుండి

---

భర్తృహరి

చెలవౌ రత్నఘటంబునం దతcడు సుశ్రీఖండఖండంబులం

దిలపిణ్యాకము వండె, నారుగల కర్థిన్‌ సప్తపర్ణావృతుల్‌

నిలిపెన్‌, జిల్లెడు దూదికై పుడమి దున్నెన్‌ బైcడి నాcగేళ్ళ ని

మ్ములcగర్మక్షితిc బుట్టి యెవ్వcడు దపంబుల్‌ సేయcడ ప్రాజ్ఞతన్‌,

కర్మభూమి అయిన ఈ భరతఖండమున జన్మించియు ఎవడు తపము నాచరింపడో అట్టి భాగ్యహీనుడు వైదూర్యమణిచేత నిర్మింపబడిన వంటకుండయందు మంచిగందపు కట్టెలతో తెలికపిండిని వండువానితోడను, జిల్లేడు దూదికొఱకు బంగారునాగలితో భూమిని దున్ను నానితోడను, కర్పూరపు టరటుల నఱికి వానితో ఆళ్ల చేనికి కంచెవేయువానితోడను సమాను డగును. అనగా శ్రేయస్సు కోరువాడు సర్వవిధముల సత్కర్మమును అనుష్ఠింపవలయు నని భావము.

---

ప్రహ్లాదుడు

''ప్రహ్లాద నారద పరాశర పుండరీక.............'' అను భాగవతొత్తొముల పంక్తిని ప్రహ్లాదునికే అగ్రస్థాన మీయబడెను. ప్రహ్లాదుడు హిరణ్యకశివుడను దానవేంద్రుని కనిష్ఠ కుమారుడు. వయసునందు చిన్నవాడైనను హరిభక్తి, జితేంద్రియత్వము, సమస్త ప్రాణులందు సమదృష్టి, ఆత్మభావములను శ్రేష్ఠగుణములందు అందరికంటే మిన్న. లలిత మర్యాదుడైన ఆ ప్రహ్లాదుడు మాతృ గర్భస్థుడై ఉండగానే దేవర్షి అయిన నారదుని హరిభక్తిబోధను, ఆకళించి జన్మించిన తర్వాత ఆ వాసుదేవుని యందు సహజ సంవర్థమాన నిరంతర ధ్యానరతుండైనాడు. సంతత హరభక్తి సంకీర్తనల వలన ప్రహ్లాదుడు హరిభక్తికి సాకారరూపుడైనాడు. అట్లు దానవ కుల సంజాతుడైన ప్రహ్లాదుడు దానవవైరి అగు హరికి సేవకు డయినాడు.

హిరణ్యకశిపుని ఆజ్ఞచే గురువులు చండామార్కులు వానిచేతి వేద, శాస్త్రములను చదివించిరి. అతడు చదువులలోని మర్మములను అన్నింటిని చదివెను. శ్రీహరిసేవకు ఉపయోగించని శరీరము ఒక తోలుతిత్తి; వైకుంఠ వాసుని కీర్తించని నోరు ఢమ ఢమ శబ్దములు చేయు ఢక్క; హరిపూజ చేయని చేతులు తెడ్లవంటివి. కంజాక్షుని చూడని కన్నులు శరీరమందలి రంధ్రములు; విష్ణుభక్తిలేని మానవుడు ద్విపాదపశువు. అందుచేత నవ విధ భక్తి మార్గముల సర్వాత్ముడైన శ్రీహరిని సేవించి సజ్జనుడై ఉండుటయే అన్ని చదువులలోని మర్మము అని ప్రహ్లాదుడు గ్రహించెను. తనకు ఆగర్భశత్రువు, దానవ కులవైరి అయిన హరికి భక్తుడగుట వలన ప్రహ్లాదుని అనేక విధముల హింసించి, చివరకు చంపించటానికికూడా హిరణ్యకశివుడు ప్రయత్నించెను. ఇటువంటిది అని నిర్ణయించలేనిది. సర్వాత్మ రూపమైనది అగు ఆ పరబ్రహ్మము తానై విష్ణుపాద పద్మములందు తన మనస్సును నిలిపిపన ప్రహ్లాదుని ఆ మారణ ప్రయత్నములు ఎట్టిహాని చేయలేక పోయినవి. ప్రహ్లాదునకు కాలకుట విషము అమృతప్రాయ మయ్యెను. భయంకరమైన అగ్ని చందనశీతల మయ్యెను. జలధి పాన్పయ్యెను. శూలగదా ఘాతములకు అతని కుసుమ కోమల శరీరము కంద దయ్యెను. యక్ష, కిన్నర, గంధర్వ, విద్యాధర, దేవగణములు, లోకపాలురు, తనకు భయపడుచుండగా, బాలుడైన తన కుమారుడే తన ఆజ్ఞ లెక్కచేయక శ్రీహరిని సేవించుట హిరణ్యకశివుడు సహింపలేక పోయెను. రక్తారుణ లోచనుడై - ''నాతో వాదించనేల? నాకంటె జగన్నాథుడు మరొకడు లేడు. నా సోదరుని చంపిన నారాయణుని కొరకు వెదకితిని. అతడీ విశ్వమందు లేనేలేడు. వాని సేవకునివలె నీవు వానిని స్తుతించుచున్నావు. వాడు ఎక్కడున్నాడో చూపుము '' అని అడిగినాడు. హర్షపులకిత శరీరంతో శ్రీహరిని మనస్సులో స్మరించి ఏ మాత్రమూ సంశయించకుండా -''తండ్రీ! ఇందు ఉన్నాడు; అందు లేడు - అనే సందేహం వద్దు. హరి ఈ సకల సృష్టియందు వ్యాపించి ఉన్నాడు. ఎచ్చట వెదకినా కన్పడతాడు'' అని ప్రహ్లాదుడు పలికెను. సృష్టియందు సర్వా కృతులతో సర్వత్ర నిండి యున్నాడన్న ప్రహ్లాదుని మాటలను సార్థకం చేయడానికి తన భక్తుని మాటలు వ్యర్థములు కాకుండుటకు ఆ పురుషోత్తముడు ఆక్షణముననే నరసింహ రూపంతో అన్ని ప్రదేశములందలి నానా స్థావర జంగమములందు మహా ప్రభావంతో ఉపస్థితుడై నాడు. మహోద్రేకంతో సింహాసనంనుండి ఉరికి- ''ఏడీ !ఈ స్తంభమందు నీ బోడి హరి? చూపు'' మని తన చేతితో హిరణ్యకశిపుడు సభామండపంలోవున్న స్తంభమును గ్రుద్దాడు.

ఆ ముష్టి ఘాతమునకు ఆ స్తంభమునుండి ప్రళయకాల సమయంలో వెలువడే భయంకర శబ్దము త్రిభువనములను క్రమ్మివైచి బ్రహ్మాండ భాండము పగిలి పరస్ఫోటితమైనదా? అన్నట్లనిపించింది. కొంత నరాకృతి, కొంత సింహాకృతితో ఆవిర్భవించిన ఆ భగవానుని అలౌకిక రూపం భయంకరంగా ఉంది. ఆవులించిన మాత్రాన మెడయందుండే వెండ్రుకలు ఇటు అటు చిమ్మబడుతున్నాయి. భ్రుకుటి విక్షేపమాత్రం చేత ముఖం భయావహమై ఉంది. చెవులు, తెరువబడిన నోరు మందర పర్వత గుహవలె భయాన్ని కల్గిస్తున్నది. ఉచ్ఛ్వాస నిశ్వాస మాత్రంచేత సప్తసముద్రాలు కల్లోలమౌతున్నాయి. మహాభయంకరములై ఆయుధాలవలె ఉన్న గోళ్ళుచూస్తే లోకైక వీరులు సహితం భయకంపితు లౌతున్నారు. వజ్ర సదృశ##మైన విశాల వక్షస్థ్సలం, సహస్ర భీమ బాహువులు, తప్త కాంచనములాగా మెరసే కళ్ళు, తీవ్రక్రోధ ప్రేరితమైన గర్జనలతో కూడిన అట్టహాసంతో ఆ నృసింహావతారం మహాభీకరంగా ఉంది. గరుడుడు పామును పట్టి చీల్చినట్లుగా నరసింహస్వామి హిరణ్యకశిపుని పట్టి తన ఊరువులపై ఉంచిచీల్చెను. హిరణ్యకశిపుని వధానంతరం కుడా ఆ భీషణాకృతి ఉపసంహరింప బడలేదు. ఆయన క్రోధం ఇంకా పెరుగుతూనే ఉంది. క్రోధావేశ వశుడై స్వామి ఆ సభయందున్న హిరణ్యకశిపుని సింహాసనాన్ని అధిష్ఠించెను. ఆయన పాదఘట్టనతో భూమి కంపించి పోతున్నది. ఆయన వికటాట్టహాసంతో దేవదానవు లందరూ భయకంపితులై దిగంతాలకు పారిపోయారు. దేవతలు స్తోత్రం చేస్తూ మాటి మాటికి పుష్పవర్షం కురిపించసాగారు. అయినా స్వామి శాంతించలేదు. బ్రహ్మ, శంకరుడు, ఇంద్రుడు వినుతించారు. స్వామి శాంతించలేదు. స్వామిని శాంతింపజేయుమని వారందరూ లక్ష్మీదేవిని కోరారు. దంష్ట్రాకరాళ వదనంతో, క్రోధారుణనయన దీప్తితో, వికటాట్ట హాసంతో గర్జిస్తూన్న స్వామి సన్నిధికి పోవడానికి కూడ లక్ష్మీదేవి భయ కంపితురాలై ప్రక్కకు వెళ్ళింది. మరోమార్గం, లేక బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని సమీపించి '' భక్తశేఖరా ! నీ తండ్రి కారణంగా నీ రక్షణకు శ్రీహరి ఈ భయంకర రూపాన్ని ధరించాడు. నీవే వెళ్ళి ఆ నరహరిని శాంతింపచేయుము'' అని కోరిరి. భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు నరసింహ మూర్తిని నిర్భయంగా సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తవశంకరుడైన స్వామి అభయ హస్తాన్ని ప్రహ్లాదుని శిరస్సు మీద ఉంచాడు. అతనిని లేవనెత్తి స్వామి అతని వదనమును తిలకిస్తూ ఆనందబాష్పములు వదిలాడు.

ఒక్క ప్రహ్లాద రక్షణకు మాత్రమే శ్రీహరి నృసింహావతారాన్ని ధరించాడు. బ్రహ్మాది దేవతల వలన శాంతించని నరహరి ప్రహ్లాదుని వలన శాంతించి క్రోధాన్ని విడచి లోక కల్యాణ రూపాన్ని ధరించాడు. అందువలననే పరమ భాగవతోత్తముల పంక్తిని ప్రహ్లాదునిది ప్రథమస్థానం. అందుకే ''ప్రహ్లాదఖేద పరిహార పరావతార లక్ష్మీనృసింహ! మమదేహి! కరావలంబమ్‌'' అని మనం ప్రార్థిస్తుంటాము.

ప్రశ్నలు

1. ప్రహ్లాదుడు శ్రీహరిని ఎట్లు సేవించెను?

2. నృసింహస్వామి ఎట్లు ఆవిర్భవించెను?

3. స్వామిని ఎవరు శాంతింప జేసిరి? ఎట్లు?

Neetikathamala-1    Chapters    Last Page