Neetikathamala-1    Chapters    Last Page

25

దైవస్తుతి

శ్రీమాతా లలితా ప్రసన్నవదనా శ్రీరాజరాజేశ్వరీ

విష్ణు బ్రహ్మ మహేంద్ర సేవితపదా విశ్వేశ్వరీ శాంభవీ,

కారణ్యామృతవాహినీ రసమయీ కైవల్య సంధాయినీ

దుర్గాంబా నవకోటి మూర్తి సహితా మాం పాతు మాహేశ్వరీ.

-- కల్యాణ కనకదుర్గనుండి

--- --- ---

భర్తృహరి

తెలియని మనుజుని సుఖముగ

దెలుపందగు సుఖతరముగc దెలుపగ వచ్చున్‌

దెలిసిన వానిం దెలిసియుc

దెలియని నరుc దెల్ప బ్రహ్మదేవుని వశ##మే.

తెలియని వానికి సులభముగc దెలుపవచ్చును . చక్కగ తెలిసిన వానికి చెప్పుట మఱింత సులభము. కాని స్వల్పజ్ఞానము కలిగి సర్వజ్ఞుడనని భావించువానిని సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు కూడ రంజింపజేయులేడు.

- - -

వ్యాసుడు

వ్యాసుడు సత్యవతీ నందనుడు. వేద విభాగ మొనర్చి పంచమ వేద మనబడు మహాభారతామును రచించిన జ్ఞానమూర్తి. ఆ కారణముననే ఆయనకు ''వేద వ్యాసు'' డను పేరుకూడ వచ్చింది.

వ్యాస మహర్షి కవీశ్వరులగు జైమిని, పైల, సుమంతాది శిష్యగణము వెంటరాగా తీర్థయాత్రలకై బయలుదేరినాడు. అనేక క్షేత్రములు దర్శించి వారు భక్తిభావయుతులై పుణ్య రాశియైన కాశీ క్షేత్రము చేరినారు . ఎట్టి దుర్ముహూర్తమున వారు కాశిలో అడుగిడినారో గాని ఏడు రోజుల వరకు ఉపవాసమే వారికి శరణ్యమయింది. విశ్వేశ్వరునికి స్థానమై, ధర్మమునకు ఆటపట్టయిన ఆకాశికాపురిలో వారికి పట్టెడన్నమేకరువయింది. ఏగృహమున ''భవతి! భిక్షాం దేహి!'' అన్ననూ ఒక్క ఇల్లాలు కూడ ప్రేమతో గరిటె డన్నము పెట్టదయ్యె. అదేమి పాపమో వైశంపాయను డాదిగాగల శిష్యులు దుఃఖితులై కటకట పడిరి. ఇట్లు ఉపవాసములతో వారు పవిత్ర గంగా జలమే స్వీకరించి గంగానదీ సైకతంబుల కాలక్షేపము జేసిరి.

ఎనిమిదవనాడు ఉదయమున పవిత్ర మణికర్ణికా ఘట్టమున అఘమర్షణ స్నానము చేసి, సైకత లింగములకు అభిషేకము లొనర్చి, దేవతలకు ప్రణతు లర్పించి, విశ్వేశ్వరునకు మ్రెక్కి కడుపులో జఠరాగ్ని భగ భగ మండుతుండగా సూర్య తాపమునకు పరితాపము నొందుచూ భిక్షాపాత్రల గ్రహించి ఇంటింటికి జని ''జనని! భిక్షాం దేహి''అని అర్ధించారు. నాడు కూడ ''ముందుకు వెళ్ళండి! వెళ్ళి రండు,'' అన్న మాటలేగాని పిడికెడు అన్నముకూడ వారికి లభ్యము కాలేదు. వ్యాసునకు నీరసము వలన కండ్లు చీకట్లు కమ్మెను. క్షుద్బాధవలన కోపమతిశయించెను. ఆగ్రహోదగ్రుడై భిక్షాపాత్ర శతధా భిన్నమగునట్లు నేలకు విసిరికొట్టాడు. భిక్షాపాత్రవలె కోపాగ్నికి అతని బుద్ధికూడ శతధాభిన్నమయింది. అతని కోపోద్రిక్తతను చూచి శిష్యులు అడలిపోయారు. భ్రూకుటి ముడివడింది. పవిత్ర గంగను గాని, కాలభైరవునిగాని, డుంఠి విఘ్నేశుని గాని, జగత్పితరులగు శ్రీ విశాలక్షీ విశ్వనాథులనుగాని దలంపక క్రోధోపహతుడై వ్యాసుడు మోక్షనిలయమైన కాశిని తిండిలేని కారణమన శపించుటకు కమండలువు అందుకొన్నాడు.

''మా భూత్త్రెపూరుషీ విద్యా మా భూత్త్రెపూరుషం ధనమ్‌,

మా భూత్త్రెపూరుషీ భక్తిః కాశ్యాం నివసతాం సదా.''

అని కాశిని శపించుటకు ఉద్యుక్తుడయ్యాడు. చేతులు వణకునే కాని శపించుటకు ముందుకు రావయ్యె. ఆసమయమున సోమవీథి మధ్యనున్న ఒక ఇల్లాలు తొట్రుపాటుతో గృహ సింహద్వారము తెరచి ఒక కాలు ముందునకు వేసి -''ఓ మునీంద్రా! శాపము ఉపసంహరించి యిటు రమ్ము!'' అని పిలిచింది. అప్పుడు వ్యాసుడు శాపజలమును పారబోసి కల్యాణ రూపిణియగు ఆ పెద్దముత్తయిదువును భక్తి భావముతో సమీపించాడు. ఆ అమ్మ - ''బిచ్చము లేదని కాశిని శపింతురటయ్యా! నీ మనము పరీక్షింప విశ్వేశ్వరు డిట్లుచేసెను. కాశిలో మధ్యాహ్నవేళ అన్నపూర్ణ బంగారుతెడ్డుతో అభ్యాగతులకు అమృతపాయసము వడ్డించు ననుట ఎరుగవా, ఏడురోజలు అన్నము లేనంత మాత్రాన ఏడ్చుచు పుణ్యరాశి విశ్వనాథుని ప్రియపత్నియగు కాశిని శపింపపూనితివి. ఆకలి వేసిన వా డే పాపము చేయడు? అన్నది నీపట్ల నిజమయ్యెగాదా? ఇందుకెంతగా శివుడు కోపించునో గదా! బ్రాహ్మణుని నేరము లెన్నరాదు. వచ్చి భిక్ష గైకొనుము'' అని పలికెను. ఆమె మాటలు వ్యాసునకు అమృతప్రాయము లయ్యెను. ''అమ్మా! నేనొక్కడనే రానా ? అందరనూ రమ్మందువా? అందరివీ ప్రాణమలే కదా! నీవు పెట్టు భిక్షను అందరము పంచుకొని తిందుము'' అని వ్యాసుడు ఆమెతో పల్కెను. ఆమె ''స్నానములు చేసి రండు. నేను వడిగా మీ కందరకు మృష్టాన్నము కడుపార పెట్టెదను'' అని చెప్పగా వ్యాసుడు శిష్యులతో స్నానములకై గంగ కేగెను.

స్నానము ఆచరించి వ్యాసుడు తన మూడువందలమంది శిష్యులతో వేదపారాయణ చేయుచు వచ్చి అరుగులపై కూర్చుండెను. వారి రాక ఎరిగి ఆ సాధ్వి బంగారుగొడుగు, పావకోళ్ళు ధరించి తాంబూలపాత్ర వహించిన మరొక తరుణి భుజముపై చేయి వేసుకొని వచ్చి వారిని లోపలకు ఆహ్వానించెను . అగరుధూపము, కర్పూరపు ముగ్గులు, కస్తూరి ఘుము ఘుమలతో గుబాళించు చంద్రకాంత శిలా నిర్మితమైన మండువాలో వారిని క్రమానుసారముగా కూర్చుండబెట్టెను. వెడల్పు అయిన అరటిఆకులు వేసిరి. ఆసాధ్వి పంక్తి పంక్తికి వచ్చి అతిథులకు పూజచేసి గంధము, ధూపము కర్పూర నీరాజనము నిచ్చెను. అంత ఆమె ''అయ్యా! శివునకు అభిషేకం చేయండి. శాంతి మంత్రములు పఠించి కాశీవిశ్వేశ్వరుని ప్రసాదము ప్రీతిగా తృప్తిగా భజించండి'' అని చెప్పిఆపోశన పోయుటకు సిద్ధమయ్యెను. అచట పదార్థములు లేవు. వంట పాత్రలు అసలే లేవు. పొపు గుబాళింపు లేదు. వడ్డించువారు, పాత్రాభిఘారము చేసిరి. ఆమె కల్యాణ రూపిణి. ప్రసన్న గంభీరమూర్తి. ప్రియభాషిణి. అదంతా మాయగా ఉంది. వారు తికమక పడుచుండిరి. అంతలో ఆసాధ్వి ''-అందరకు ఆపోశన వడ్డించిరా? అమృతవస్తు, స్వీకరించండి'' అనుచూ చేయెత్తి మ్రోక్కింది. తతక్షణమే మృష్టాన్నములతో భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములతో విస్తళ్ళు నిండివవి. ఆమె సాక్షాత్తు అన్నపూర్ణాదేవియే, మరొకతె కాదని భావించి, వారు తృప్తిగా భుజించిరి. ఎవరు ఏది కోరితే అది వారికి లభించింది.

భోజనానంతరము ఆమె అజ్ఞానుసారము వార అచ్చటనే విశ్రమించిరి. ఆ సమయమున ఎట్టి సంరభము లేక అన్నపూర్ణా విశ్వేశ్వరులు రత్నపాదుకలు తొడిగికొని చెట్టాపట్టాలు పట్టుకొని ఒయ్యారముతో అటకు విజయము చేసిరి. గౌరి మొగంబున దయారసము, శంకరుని మొగమున క్రోధమును గనిన వారికి సంతోషము, భయము ఒక్కసారిగ కల్గినవి. తన భార్యయగు కాశిని శపింప పూనినందులకు శివునకు కోపము, తన సవతిపై కోపింప బూనినందులకు గౌరికి సంతోము కల్గెను. ''ఓరీ దురాత్మా! వృథాగా వేదములు చదివినవాడవు. భారతము వ్రాసితినన్న గర్వము హెచ్చుగా కల్గిన నీవు మోక్షము నిచ్చు నా భార్యయైన కాశిని నిష్కారణముగా శపింప బూనినావు. నీకు ఎంతటి అహంకారము! నీవు నీ శిష్యులు వెంటనే ఈ ప్రదేశము వదలి పొండు '' అని శివుడు కఠినముగా పల్కెను. అప్పుడు వ్యాసుడు వారిపాదములపై బడెను. అంత అంబ ''కుమారా ! భయపడవలదు. నిన్ను నేను మరువను. నీవు మరెచ్చటికి పోవద్దు. దక్షవాటి కేగుము. భీమేశ్వరుడు అరమరిక లేని దేవుడు. నీకు శుభమగును'' అని ఓదార్చి వెళ్ళిపోయెను.

ఎంతవానికైనను కోపము పరమ శత్రువే. కోపము వలన సర్వఅరిష్టములు ప్రాప్తించును. కోపమును జయించినవాడు మహాత్ముడు.

ప్రశ్నలు

1. వ్యాసుడు కాశిని శపింప బూనుటకు కారణమేమి?

2. కాశిని శపింప ఉద్యుక్తుడైన వ్యాసునకు ఏమి జరిగెను?

3. శంకరుడు వ్యాసున కేమి శిక్ష విధించెను?

Neetikathamala-1    Chapters    Last Page