Neetikathamala-1    Chapters    Last Page

12

దైవస్తుతి

ప్రాతస్స్మరామి లలితా వదనారవిన్దం

బింబాధరం పృథుల మౌక్తి కశోబి నాసమ్‌,

ఆకర్ణదీర్ఝ నయనం మణికుండలాఢ్యం

మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌.

---

దాశరథీ

వాసవ రాజ్యభోగ సుఖ వార్ధిని దేలు ప్రభుత్వ మబ్బిన

న్నాసకు మేరలేదు కనకాద్రిసమాన ధనంబుc గూర్చినం

గాసును వెంటరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్‌

నీసరcబోవ నీవు పదివేలకుc జాలు భవంబు నొల్ల నీ

దాసుని గాcగ నేలుకొను దాశంథీ! కరుణాపయోనిధీ!

ఇంద్రరాజ్య భోగ సుఖముల తేల్చునట్టి రాచరికము కల్గినా, ఆశకు అంతులేదు. బంగారు కొండంత ధనము చేకూరినా, కాసైనా వెంటరాదు. చూచి చూడక చేసిన పాపములు ఉరక బోవు. వేలాది జన్మలు నే నాశించను. నీ దాసునిగా నన్నేలుకొనుము.

* * *

గోదాదేవి

విష్ణుచిత్తుడు తన చిత్తమును విష్ణువునందు లగ్నముచేసిన సార్థకనాముడు. శేషశాయి మందిర ప్రాంగణమున తులసి మొక్కలు, వివిధ పుష్పజాతులను పెంచాడు. ప్రతి దినము వివిధ పుష్పములతో అందంగా మాలలు కట్టి విష్ణుమూర్తికి సమర్పించి ఆనందించేవాడు. ఒకనా డాతడు తులసి మొక్కకు త్రవ్వి పాదుచేయుచుండగా అపరంజి బొమ్మవంటి ఒక బాలిక దొరికింది. ఆబాలికకు ''గోదాదేవి'' యని నామకరణ మొనర్చి పెంచసాగినారు. భూదేవి అంశమున జన్మించినదిగా భావించి వారు గోదాదేవిని గౌరవప్రేమలతో పెంచుచుండెడివారు. ఆమె అందాల బొమ్మ. సుగుణాల ఖని.

స్త్రీలు సహజంగా అలంకారప్రియలుగదా! గోదాదేవికి కూడా తన సహజసౌందర్యమును ఇనుమడింపజేయు పూలమాలలు ధరించుట చాల ఇష్టము. పుష్పములు కోసి తెచ్చి మాలలు గట్టుట కొంత శ్రమతో గూడిన పనే. తండ్రి ఎట్లాగో ఆశేషశాయికొరకై మాలలు కట్టి సిద్ధము చేయుమన్నాడుగదా! ఆమాలనే తా నెందులకు ధరించరాదు అన్న ఆలోచన ఆమె మనస్సున మెరసింది. అంతే ! ఒక మాలను తన సిగలో దురుముకొని నిలువుటద్దమున తన సౌందర్యమును చూచుకొన్నది. తన సొగసునకు తానే మురిసిపోయింది. తన సౌందర్యమును పంచుకొను సొగసుకా డెవరోనన్న ఆలోచన ఆమగువకు గిలిగింతలు పెట్టింది. ప్రతిదినము ఆమె అట్లే ఆ పూలమాలలను ధరించుచుండెడిది. పిదప తన సిగలోని మాలను తీసి యథాస్థానంలో ఉంచెడిది. ఈ రహస్యం ఎంత కాలం దాగుతుంది? ఒకనాడు విష్ణుచిత్తుడు మాలలు తీసుకుని పోవుచుండగా ఆ మాలలందు ఒక శిరోజము వారి కంటబడెను. తండ్రి అనుమానించి కుమార్తెను అడుగగా గోదాదేవి వాస్తవము చెప్పివైచెను. కుమార్తెయెడ విష్ణుచిత్తునకు కోపము గల్గెను. కాని ఆమె భూమ్యంశ సంభూత యని జ్ఞాపకము రాగా నిగ్రహించుకుని ఆమెను గట్టిగ మందలించెను. తన కుమార్తె విసర్జించిన నిర్మాల్యమును వటపత్రశాయికి సమర్చించడానికి ఇచ్చగించక ఆయన చింతతో శయ్యపై మేను వాల్చెను.

అంత స్వప్నములో శ్రీహరి దర్శన మిచ్చి- '' భట్టనాథా! స్వహస్తగ్రథిత సుమమాలను నేడు ఏల నాకు అర్పించలేదు? అని ప్రశ్నించెను. విష్ణుచిత్తుడు భయపడుచు ''స్వామీ! నా కుమార్తె అపరాధమే దానికి కారణము'' అని తన కుమార్తె అకృత్యమును విన్నవించెను. అది విని భక్తవత్సలుడు మందహాస వికసిత వదనముతో ''ఇదియా! నీ భయకారణము? నీవు సమర్పించు మాలలు నీ కుమార్తె ముడిచి విడిచిన వని నేను చిరకాలము క్రిందటనే ఎరుగుదును. అందువలననే నేను వాటిని ఎంతో ప్రేమతో స్వీకరించి ధరించుచుంటిని. రేపటినుండి నీవు నీ పుత్రిక ధరించిన మాలలు నాకై తీసుకురాక తప్పదు సుమా'' అని గట్టిగా చెప్పి అంతర్హితు డాయెను. విష్ణుచిత్తుడు తత్తరపడి మేల్కొనెను. స్వప్నవృత్తాంతము స్మరణకువచ్చి అమందానందకందళిత హృదయారవిందు డయ్యెను. ''నే నెంత ధన్యాత్ముడను. నా చిట్టితల్లి శ్రీమహావిష్ణువునకు ఎంత ప్రీతిపాత్రురాలు! ఆమెకు జనకుడనైనందుకు నా జన్మ తరించినదిగదా!'' అని ఆనందముతో తన స్వప్న వృత్తాంతమును అందరకు చెప్పెను. నాటినుండి ఆమె మహాలక్ష్మి అనే భావంతోనే ఆమెను చూడసాగిరి. అప్పటినుండి గోదాదేవికి ఆముక్తమైన (తాను ముడిచి విడిచిన) మాల్యములను భగవంతుని కిచ్చినది అను అర్థమువచ్చు ''ఆముక్తమాల్యద'' అను పేరు సార్థక మయ్యెను. గోదాదేవికి క్రమక్రమముగా శ్రీహరియందు ప్రేమ అధికమయ్యెను. ఆమె గోపికలవలె విష్ణువుకోసము తహతహ చెందసాగెను.

విష్ణుచిత్తుడు కుమారై హృదయపరితాపము నెరిగి పూర్వము గోపికలు శ్రీకృష్ణుని పొందుటకు ఆచరించిన ధనుర్మాస వ్రతమును ఆచరింపు మని గోదాదేవికి చెప్పిరి. గోదాదేవి మనస్సు త్రిభువన సుందరాకారుడగు శ్రీరంగనాథుని రూపమందు లగ్న మయ్యెను. ఆయననే పతిగా వరించెను. ప్రాంతఃకాలముననే లేచి గడ్డకట్టు చలిలో కూడ శీతలజల స్నానము చేసి స్వామికి భోగముచేసి ఆ శేషమును మాత్రమే తాను భుజించెడిది. తాను రచించిన పాశురములు భక్తితో పాడి స్వామికి వినిపించెడిది. ఇట్లు వ్రాయబడిన ముప్పది పాశురముల దివ్య ప్రబంధమే తిరుప్పావు. వ్రత నియమములవలన శుష్కించిన కుమార్తెనుచూచి కుందుచున్న విష్ణుచిత్తునికి స్వప్నములో శ్రీరంగనాథుడు సాక్షాత్కరించి గోదాదేవిని వెంట నిడుకొని శ్రీరంగమనకు వచ్చిన ఆమెను శాస్త్రవిధిగా వివాహము చేసుకొందునని తెల్పెను. ధనుర్మాసాంతమున గోదాదేవికి శ్రీరంనాథడు కలలో కన్పించి ''బాలా! నీ తపస్సునకు, హృదయపరిపక్వతకు సంతసించితిని. నీ కోరిక నెరవేర్తును. వ్రతనియమములను వీడి సర్వభోగముల ననుభవింపుము'' అని పల్కెను. అనాడే శ్రీరంగేశుడు ఆలయాధికారులకు-''మంగళ వాద్యములతో, ఛత్ర చామరాదులతో విష్ణుచిత్తుల కుమారై గోదాదేవిని గొనితెండు. నే నామెను వివాహమాడెదను'' అని చెప్పిరి.

శ్రీరంగక్షేత్రము వైకుంఠమువలె అలంకరింపబడెను. ఎల్లెడ ఆనందమే వెల్లివిరిసెను. ఒక సుముహూర్తమున శ్రీరంగపతి గోదాదేవి పాణిగ్రహణముచేసి అతులితానందమును పొందెను. శ్రీరంగేశుని అర్ధాంగియయిన గోదాదేవి శేషతల్పమున శయనించియున్న మూలవిరాట్టును చేరి సేవింప కుతూహలపడెను. స్వామికి ప్రదక్షిణముచేసి, అధిరోహించి స్వామి పాదముల చెంత చేరెను. అంతే. ఆమె మరల కనుపించలేదు.

భక్తికి అసాధ్యమైన దేమి?

ప్రశ్నలు

1. విష్ణుచిత్తునకు గోదాదేవి ఎచ్చట లభించెను?

2. ''ఆముక్తమాల్యద'' అనగా నేమి?

3. ఆముక్తమాల్యద ఎవరు? ఆమె ఎవరిని వివాహమాడెను?

Neetikathamala-1    Chapters    Last Page