Neetikathamala-1    Chapters    Last Page

11

\®µ…ª«sxqsVò¼½

నమశ్శివాభ్యాం పశుపాలకాభ్యాం

జగత్త్రయీ రక్షణ బద్ధహృద్భ్యామ్‌

సమస్త దేవాసుర పూజితాభ్యాం

నమో నమ శ్శంకర పార్వతీభ్యామ్‌.

(ఉమామహేశ్వరస్తోత్రం)

---- ----

భర్తృహరి

విద్యచే భూషితుండయి వెలయుచున్నc

దొడరి వర్జింపనగుc జుమీ దుర్జనుండు

చారు మాణిక్య భూషిత శస్తమస్త

కంబయిన పన్నగము భయంకరముగాదె?

పాము శిరమునందు రత్నము కలదైనను భయంకరమగుటచేత దూరముగా వదలదగినది. అట్లే దుర్జనుcడును విద్యావంతుcడైనను దూరముగ విడువదగినవాడు.

* * *

శ్రీరాముడు

దశరథ నందనుడైన శ్రీరామచంద్రుడు సకల సద్గుణసాంద్రుడు; ఆయన సత్యపరాక్రముడు. శరణాగత రక్షకుడు. ఏకపత్నీ వ్రతుడు. సర్వభూత హితుడు. దృఢవ్రతుడు. కృతజ్ఞుడు. ధర్మస్వరూపుడు. శ్రీరాముడు స్వధర్మ నిర్వహణము చేయుటలోనే కాదు, ఇతరులు ధర్మమార్గమును వీడునప్పుడుకూడా వారికి ధర్మస్వరూపమును వివరించి ధర్మదూరులు కాకుండ వారిని రక్షించినవాడు.

శ్రీరామునకు ¸°వరాజ్య పట్టాభిషేకము చేయడానికి సర్వము సంసిద్ధం చేశారు. అయోధ్యానగర మంతా అపూర్వంగా అలంకరించారు. పౌరు లందరు మహోత్సాహంతో కానుకలు తీసుకొనివచ్చి రామదర్శన కుతూహలంతో నిల్చుని ఉన్నారు. వివిధ దేశాలనుండి పెక్కుమంది రాజన్యులు విచ్చేశారు. రామభవనం కైలాసపర్వతమువలె, కుబేరభవనమువలె, ఇంద్రభవనమువలె రత్న మాణిక్యాలంకృతమై పుష్పహారాలతో అలంకృతమై ఉన్నది. ఏ నోట విన్నా రామ పట్టాభిషేక వార్తయే! ఏమూల చూచిన సంతోషసంరంభ##మే! రాముడు రథారూఢుడై మహారాజ భవనంలో ప్రవేశించాడు.

దశరథమహరాజు పాన్పుమీద పడుకొని ఉన్నాడు. ఆయన ముఖము కాంతివిహీనమై ఉన్నది. వినయవిధేయతలతో రాముడు తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత ప్రక్కనే ఉన్న కైకేయికి వందన మాచరించాడు. ధశరథ మహారాజు''రామా'' అన్నాడు. ఆయన కంటివెంట బొటబొట నీళ్లు కారాయి, నోట మాట రాలేదు. ఆయన కంపించిపోతున్నాడు. రాహుగ్రస్తమైన సూర్యబింబంవలె ఉన్న తండ్రిని చూచి విషణ్ణుడై ''అమ్మా! నాయనగారు నన్ను చూచి ఎందుకు దుఃఖపడుతున్నారు? నేనేమైనా తెలీక అపరాధము చేశానా? నన్ను ఎందుకు పలుకరించలేకపోతున్నారు? నాకు తండ్రే ప్రత్యక్షదైవము. ఆయనకు కోపము వస్తే క్షణమైనా జీవించి ఉండలేను'' అని అడిగాడు తల్లిని. కైక ''రామా! మీ తండ్రకి కోపమూ లేదు. దుఃఖమూ లేదు. మనోగతాభిప్రాయాన్ని నీకు స్వయంగా చెప్పలేక బాధపడుతున్నారు. మీ నాయనగారు నాకు పూర్వం రెండు వరాలిచ్చారు. ఇచ్చిన వరాలు చెల్లించడానికి పామరుడివలె బాధపడుతున్నారు. సత్యమే ధర్మానికి మూలమైనది. వారు ధర్మహాని చేయకుండా కాపాడుతానని నువ్వు ప్రమాణం చేస్తే అవి చెపుతాను'' అన్నది.

రాముడు ''అమ్మా! నన్ను శంకిస్తున్నావా! నాయనగారి కోసం నన్ను నిప్పులలో దూకమన్నా దూకుతాను. విషపానం చేయమంటే చేస్తాను. తండ్రే నాకు ఆచార్యుడు, గురువు. ఈరామునకు రెండు నాలుకలు లేవమ్మా! చెప్పు'' అన్నాడు.

కైక ''రామా! పుర్వం దేవాసుర యుద్ధంలో బాణోపహతుడైన మీతండ్రిని కాపాడాను. అప్పుడు మీ తండ్రిగారు నాకు రెండు వరాలు ఇచ్చారు. ఆ రెండువరాలలో మొదటిది భరతుడికి పట్టాభిషేకం చేయడం - రెండవది నువ్వు పదునాలుగేండ్లు దండకారణ్య సీమలలో వనవాసం చేయడం. నీవు నీ తండ్రి సత్యవ్రతులని నిరూపింప దలిస్తే నీ అభిషేక సంరంభాలతో భరతుడికి రాజ్యాభిషేకం చేయించి నువ్వు జటాజినాలు ధరించి అడవికి పోవాలి. ఆర్ద్రహృదయుడైన నీ తండ్రి ఈ విషయం చెప్పలేక బాధపడుతున్నాడు. అందువల్ల రామా! మీ తండ్రి వాగ్దానం చెల్లించి ఆయనను తరింపజేయి. అప్పుడుగాని ఆయనకు ధర్మహాని వుండదు'' అని వివరంగా చెప్పింది.

రాముడు చలించలేదు. ఆయిన నిశ్చలంగా ''అమ్మా! తండ్రి ఆజ్ఞను శిరసావహించి వనవాసం చేస్తాను. నా తండ్రిని సంతోషపెట్టడమే నాధర్మము. పుత్రుడైనవాడికి పితృసేవ చేయిడంకన్నా కావలసినదేమున్నది? నాకు పితృవాక్య పాలనము కంటే మించిన ధర్మము లేదు. అమ్మా! నాయనగారు స్వయంగా చెప్పకపోయినా వా రాజ్ఞాపించారని చెప్పావు. వారేకాదు, దేవతవంటి నువ్వు చెప్పినా నీ అజ్ఞను పాటించే వాణ్ణి. నేను ఇప్పుడే తల్లి కౌసల్యకు చెప్పి దండకారణ్యానికి బయలు దేరుతాను'' అన్నాడు. దశరథమహారాజు శోకాగ్నితో తప్తుడై తల్లడిల్లి మూర్ఛపోయినాడు.

ఒక్కసారి రాజభవనమంతా చీకట్లుక్రమ్మినవి. అంతటా విషాదము అలముకొన్నది. ''రాముడు అడవులకు వెళ్ళిపోతాడా! అని అంతఃపురాంగనలు ఒక్క పెట్టున ఏడువసాగారు. రాముడు మాత్రం మనోవికారములేకుండా ఆ అప్రియవార్తను చెప్పడానికై కౌసల్యమందిరానికి వెళ్ళాడు. అమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు. కౌసల్య ఆనందంతో కుమారుణ్ణి కౌగిలించుకొన్నది. శిరస్సు ఆఘ్రాణించి''రామ, పరమ ధార్మికులైన ఇక్ష్వాకువంశ మహారాజు లందరివలె నీవు కీర్తిమంతుడవై శోభిల్లు. నీ పట్టాభిషేక సమయం ఆసన్నమైంది. ఇప్పుడే వెళ్ళి మీ నాయనగారిని చూడాలి'' అన్నది.

రాముడు చేతులు జోడించి ''అమ్మా! నీ కేమి తెలియదు. నే నేమి చెప్పేది? మహారాజు భరతుడికి రాజ్యాభిషేకం చేయాలని నిశ్చయించాడు. నన్ను దండకారణ్యానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు'' అని విషయమంతా చెప్పాడు. కౌసల్య రాముడి మాటలు విని గొడ్డలితో తెగగొట్టిన మద్ది కొమ్మలాగా నేలకూలింది. ''రామా, చంద్రబింబంవంటి నీముఖం చూడకుండా నే నెట్లాబ్రతికేది? ఒక్కగా నొక్క కుమారుడవు. నీకోసం ఎన్ని పూజలు చేశానో! ఎన్ని వ్రతాలు ఆచరించానో! తండ్రి! నేను దరిద్రురాలను, నాకేల మరణం సంభవించదు'' అని పరిపరి విధాల దుఃఖించింది.

ప్రక్కనే ఉన్న లక్ష్మణుడు కోపఘూర్ణిత నేత్రుడై ''అమ్మా! ఒక స్త్రీమాటకు కట్టుబడి రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళడం నాకు సమ్మతంగాలేదు. మహారాజు వార్థక్యంవల్ల మనస్తిమితం లేక ఏదో ఆజ్ఞాపించి ఉంటాడు. అయినా కామాతురుడై కార్యాకార్య విచక్షణజ్ఞానం లేకుండా చెప్పిన వాక్యాలను పాటంచ నవసరంలేదు'' అని పలికి, అన్నవైపుతిరిగి ''రాజశాసనం లోకానికి తెలిసేలోపుగా రాజ్యం స్వాధీనం చేసుకుందాము. ధనుర్థారివై నీవు నిల్చుంటే, దండధరుడివలె నీ ప్రక్క నేనుంటే ఈ రాజ్యంలో మన కెదురునిల్చేవాడు ఎవడున్నాడు'' అన్నాడు. తిరిగి కౌసల్యవంకకు మరలి ''అమ్మా! నేను త్రికరణుశుద్ధిగా రామానుచరుణ్ణి. వాడు అడవికి వెళ్ళితే, వాడివెంట నేనూ వెడతాను'' అన్నాడు.

శోకవిహ్వలయై సంచలించిపోతూ కౌసల్యాదేవి ''రామా తమ్ముడి వాక్యాలే నాకు సమ్మతంగా తోస్తున్నవి. నా సవతి చెప్పినది ధర్మంగా కనిపించడంలేదు. నాయనా, నీకు సకల ధర్మాలు తెలుసు. నీవు ధర్మాన్నే అనుసరించదలచుకుంటే నువ్వు నాకు సేవ చేయవలె. మాతృసేవకంటె మించింది లేదు. తండ్రి ఆజ్ఞప్రకారం వనవాసం చేయడానికి వెళ్ళుతున్నానంటున్నావు. తల్లిగా నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు అడవికి వెళ్ళకుండా ఇక్కడే వుండు '' అన్నది.

రాముడు ఆమె మాటలు విన్నాడు. ''అమ్మా! నాయనగారి ఆజ్ఞను నేను జవదాటను. ఈ భూమిమీద పిత్రాజ్ఞాపరిపాలనమే ముఖ్యధర్మము. కాబట్టి అడవులకు వెళ్లక తప్పదు. తల్లీ! తండ్రి ఆజ్ఞను నేనొక్కడినే కాదు. నువ్వూ పాటించాలి. దశరథుడు నాకు తండ్రేకాదు- నీకు భర్తకూడా, భర్త ఆజ్ఞను పాటించడం భార్య ధర్మం. ఆశీర్వదించు తల్లీ! నేను పోయివస్తాను'' అన్నాడు రాముడు.

ధర్మబద్ధమైన శ్రీరాముడి మాటలు విని తల్లి '' రామా, నీవు ఏకాగ్రచిత్తంతో అడవులకు వెళ్లు. సుఖంగా తిరిగివచ్చి నీ మధుర భాషణములతో నన్ను సంతోషపెట్టు'' అని ఆశీర్వదించింది.

అనంతరం మునివేషాలు ధరించి సీతా రామ లక్ష్మణులు దశరథమహారాజు కడకు అనుజ్ఞ తీసుకున్నారు. శోకహత చిత్తులయియున్న అందరినీ వీడి సీతా లక్ష్మణులతో పాటు శ్రీరాముడు అడవికి ప్రయాణమైనాడు. రాముడు రథము వెళుతున్న మార్గమంతా ''రామా, సీతా, లక్ష్మణా'' అనే ఆర్తనాదాలతో నిండిపోయింది.

ఈ విధంగా పితృవాక్య పరిపాలన మన్న స్వధర్మాన్ని నిర్వహించడమే కాక, పుత్రవ్యామోహంతో అధర్మమార్గంలో పడకుండా కౌసల్యాదేవికి సముచితంగా సతీధర్మం ప్రబోధించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. అందుకే ''రామో విగ్రహవాన్‌ ధర్మః'' అన్నాడు వాల్మీకి మహర్షి.

ప్రశ్నలు

1. శ్రీరాముడు ఎట్టివాడు?

2. శ్రీరాముడు అడవికి వెళ్ళుటకు కారణ మేమి?

3. కౌసల్య శ్రీరామునితో ఏమనెను? రాముడు ఆమెకు ఏమి సమాధాన మిచ్చెను?

Neetikathamala-1    Chapters    Last Page