Sanathana Dharmamu    Chapters    Last Page

VIII. భక్తి

ఒక ఇంటిని చూచామంటే, ఈ ఇంటిని నిర్మించినవాడెవడు? అని యోచిస్తాం. ఇంటిని కట్టడానికి ఎన్నో వస్తువులు కావాలి. వాటినన్నిటినీ సేకరించి, ఇంటిని కట్టడానికి ఒక పథకం వేసుకోవాలి. దానిని కట్టడానికి ఒక ఉద్దేశమూ ప్రయోజనమూ ఉండాలి. ఇన్ని ఉంటే కాని ఒక ఇల్లు తయారు కావటంలేదు.

ఐతే ఎన్నో నియతులకు కట్టుబడిన ఈ ప్రపంచమునకు కూడా ఒక కర్త ఉండవలసిందే కదా? ఈ ప్రపంచములో ఎన్నో విధములైన సృష్టులున్నవి. నదీనదములు, పర్వతములు, వనములు, నక్షత్రములు, గ్రహములు- వీనికన్నిటికీ ఒక నియతి ఉన్నది. వీనినంతా సృష్టించిన వానికి జ్ఞానం అపారంగా ఉండాలి. శక్తియూ అనంతంగా ఉండాలి. మనిషి తన్ను మేధావిగ భావిస్తున్నాడు. అట్టి మేధావియైన మనిషి, ఈ ప్రపంచాన్ని సృష్టించి ఊరుకోలేదు. దీనిని పాలిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. మనకున్నమేధయూ, అతడిచ్చిన భిక్షయే అని తెలుసుకొని అతనిని ప్రార్థిస్తే ఆ పరమకరుణాళువు మనకు సకల శ్రేయస్సులనూ ఇవ్వగలడు. స్వామి అనగా అతడే. ఆ స్వామి మన హృదయకుహరములలో ఉన్నాడని వేదాలు చెబుతున్నవి.

స్వామి అనగా ఏమి? స్వం అనగా సొత్తు. తెలుగులో స్వం-సొమ్ముఐనది. సొమ్ము మనకు స్వంతమైనది. కేరళ##దేశములో ఆలయములను, 'దేవస్వం' అని అంటారు. సొమ్ముకు స్వంతదారుడు స్వామి. స్వామికి మనం సొమ్ముగా ఉన్నాము. ఈ ప్రపంచమంతా అతని 'స్వం' సొత్తుగా ఉన్నది. మనం ఎన్నో వస్తువులను క్రొత్తక్రొత్తగా నిర్మిస్తున్నాం. విజ్ఞానం పెరిగే కొద్దీ నిర్మాణ ప్రణాళికలూ వృద్ధిఔతున్నవి. కానీ వీనికంతా మూల వస్తువులను మనకు ఎవరు నిర్మించి ఇచ్చారు? ఆ ముడి పదార్థముల ఆధారంచేతనే కదా మనం వీనిని తయారు చేస్తున్నాం. మనం నిర్మిస్తున్న ఈ పదార్థజాలమునకంతా నిజమైన నిర్మాత ఎవడు? భగవంతుడే.

'నేను నేను' అని మనం వ్యవహారంలో మాట్లాడుకుంటాం. 'నేను' ఎవరు? ఈ 'నేను' ఎవరిసొత్తు? ఈ'నేను' ఎక్కడనుంచీ వచ్చింది? దీనిని తెలుసుకున్నామంటే, అనగా మనం ఎవరి సొమ్మో తెలుసుకున్నామంటే, అపుడు మనకని స్వంతముగా ఒక ఆశయూ, ద్వేషమూ లేకుండా పోతుంది. అప్పుడు అలసట అనేమాట లేదు. అంతా శాంతియే. ఆనందమే.

స్వామితత్త్వమంటే అదే. ఆ తత్త్వమే శరణాగతి. నేను అనే వస్తువు లేదు. సర్వమూ నీవే అన్న భావన ఆధ్యాత్మిక మార్గంలో భక్తికి పరమావధి.

మనం చూస్తున్న ప్రపంచములో సర్వమూ క్షరమూ పరిణామశీలముగనూ ఉన్నవి. వీనిలో హెచ్చుతక్కువలున్నవి. వీటినన్నిటినీ పరిణామరహితుడునూ, అక్షరుడునూ ఐన భగవంతుడు సృష్టించియున్నాడు. మనం కొరతలతో నిండియున్నాము ఆయనకు ఏ కొరతయూ లేదు. మన శక్తి అల్పముగా నున్నది. ఆయన పరమ శక్తివంతుడుగా నున్నాడు. అట్టి స్వామి అనుగ్రహం మనయందు కల్గితే, మనకున్న కొరతలన్నీపోయి, శాంతినీ, ఆనందాన్నీ మనం సులభంగా పొందగలం.

1. వేదోనిత్యమధీయతాం

శంకరభగవత్పాదులు విదేహముక్తిపొందుటకు ముందు సామాన్యశిష్యులందరూ చేరి ఆయనను సమీపించి, ''మీరు వేదాంతపరములైన ఉపదేశాలెన్నో చేశారు. వానిలో చాల విషయములు మాకు బోధపడలేదు. మేము కడతేరుటకు సులభ##మైన త్రోవ ఏదైన ఉంటే చెప్పండి'' అని అడిగారట. అపుడు భగవత్పాదులు, సోపాన పంచకమని ఐదు శ్లోకాలు వారికి ఉపదేశించారు.

వేదములను నిత్యమూ అధ్యయనం చేయండి. అని చెప్పిన వైదిక కర్మలను అనుష్ఠిస్తూ, ఆ కర్మలే ఈశ్వర ప్రణిధానంగా భావించండి. లోకోపకారానికై మీకు విధించిన కర్మలను చేయండి. కామ్యకర్మలను వదలిపెట్టండి. ఇలా క్రమక్రమంగా వారు ఐదు శ్లోకాలలో ముక్తికి సోపాన మార్గాన్ని చూపారు.

కర్మలను చేయాలి. ఆ కర్మలు ఈశ్వర స్మరణతో చేయాలి. ఆ కర్మఫలాన్ని ఈశ్వరార్పణ చేయాలి. ఈ పనులు చేసేటపుడు కర్తృత్వభావముండరాదు. అట్టికర్మలే భగవదారాధన. భగవంతునికి ప్రీతికరములు. మనం చేసే కర్మలు శ్రధ్ధగా చేయాలి. అందులో ఏ విధమైన లోపమూ ఉండరాదు. ఇట్టి మానసిక శ్రద్ధ ఉన్నవానికి భక్తి తానుగ వస్తుంది.

2. దేవతామూర్తులు; అవతారపురుషులు

జీవాత్మ పరమాత్మల సంయోగమే యోగము. ప్రతిఫలాపేక్షలేని నిష్కామకర్మచేస్తూ, చిత్తశుద్ధిని సంపాదించి, ఉపాసనామూలముగ ఏకాగ్రమైన మనస్సుతో ఈశ్వరానుగ్రహమును పొందినచో, పరమాత్మకూ జీవునికీ అభేదమైన యోగసిద్ధి లభిస్తుంది. వేదముల పరమ తాత్పర్యమూ, అర్జునునికి కృష్ఱపరమాత్మ ఉపదేశించిన యోగమూ ఇదియే.

కాలక్రమేణా పరంపరాగతమైన ఈ యోగ విద్య శిధిలమైనది. దానిని ఉద్ధరించుటకే తాను అవతరించినట్లూ శ్రీ కృష్ణపరమాత్మ చెబుతున్నాడు. విశ్వరూపదర్శన సందర్భములో 'పశ్యమే యోగమైశ్వరమ్‌' అని కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు. లోకాన్ని సంహారంచేసే రుద్ర స్వరుపాన్నే ఆయన అప్పుడు అర్జునుడికి చూపాడు.

'కృష్ణం వందే జగద్గురుం' అన్న శ్లోకపాదము మనమందరమూ ఎరిగినదే. కాలగమనంలోని నష్టమైన ఈ యోగాన్ని పూర్వము జగద్గురువులైన కృష్ణుడు సూర్యునికి ఉపదేశించాడు. ధర్మము క్షీణించినపుడల్లా ధర్మోద్ధారణకు అవతరించే భగవంతుడు, దేవకీనందనుడై' వాసుదేవునిగా పుట్టి ద్వాపరాంతములో అర్జునుడికి యోగాన్ని ఉపదేశిస్తున్నట్లు గీతలో చెప్పబడింది.

కలికాలంలో 72 దుర్మతములు ప్రబలినవి. వైదికమతమునకు అవి విరుద్ధముగా ప్రచారం చేయడానికి పూనుకొన్నవి. వీనిని ప్రతిఘటించడానికి సర్వవిద్యలకు ఈశ్వరుడైన పరమేశ్వరుడే ఆదిశంకరభగవత్పాదుల రూపంలో అవతరించాడు.

ఆదిశంకరులు వేద ప్రామాణ్యాన్ని పూర్తిగా గ్రహించారు. వేదోక్తములైన దేవతామూర్తులనూ, వేద విహితములైన కర్మలనూ అంగీకరించారు. వేద శీర్షములైన ఉపనిషత్తులకు పరమతాత్పర్యమైన, జీవబ్రహ్మైక్య సిద్ధాంతమును, అద్వైతమును పునఃప్రతిష్ఠించినారు. శ్రీ కృష్ణులకు పిదప వైదికమతమును పునఃస్థాపనము చేసిన ఆదిశంకరులకూ జగద్గురువులన్న బిరుదు ఏర్పడినది.

వైశాఖ శుక్లపంచమి శ్రీ శంకరుల అవతార దినము. ఆ రోజు ఆరుద్ర లేక పునర్వసు నక్షత్రముంటుంది. ఆరుద్ర రుద్రసంబంధమైన నక్షత్రం. పునర్వసు శ్రీ రామచంద్రమూర్తి జన్మనక్షత్రము. వారు భారతదేశమంతా పర్యటించి దిగ్విజయం కావించారు. ప్రస్థాన త్రయానికి భాష్యములు వ్రాశారు. ఎన్నో స్తోత్రరచనలు గావించారు. అందరకూ అర్ధమయ్యే విధంగా, భజగోవింద స్తోత్రం వ్రాసారు. అందు 'భజగోవిందం మూఢమతే- అని వారు ప్రబోధిస్తున్నారు. అస్తిక్యం ప్రబలుటకు వారి రచనలు అమోఘములు. చిరస్మరణీయులైన ఆచార్యపాదుల జయంతులను మనం శ్రద్ధగా జరుపుకోవాలి. ఆ రోజు మనము వారి స్వరూపాన్నీ బోధనలనూ, భక్తి శ్రద్ధలతో భావించాలి. వారి పాదుకలను మనమందరమూ సేవించాలి. వారి అనుగ్రుహం వలన మనకు సకల విధములైన సౌఖ్యములూ కలుగుటవనుటలో సందేహము లేదు.

3. మనమతానికి మూలపురుషుడు

శ్రీకృష్ణ నిర్యాణాంతరం లోకంలో చీకట్లు అవరించినవి. ఈ అంధకార బంధురమైన ప్రపంచంలో వేదమనే జ్యోతిని వెలగించాలని ఒక మహాపురుషుడు సంకల్పించాడు. వేదములనంతములు. ఈ కృత్స్నవేదరాశిని కలికాలంలోని అల్పమేధస్సులు అధ్యయనం చేయుటకు వీలుపడేటట్లు ఆ వేదములను నాలుగు భాగములుగ విభజించి పైలునికి ఋగ్వేదము, వైశంపాయునునికి యజుర్వేదము, జైమినికి సామవేదము, సుమంతునికి అధర్వణవేతదమును ఉపదేశించారు. ఈ అమూల్య వేదరాశి శిష్యపరంపరామూలముగా మనకు నేటికీ సంక్రమించియున్నది. కలియుగారంభములో, ఈ వేదములు విస్మృతములు కాకుండా రక్షించి వేద విభజన చేసిన మూలపురుషుడే- కృష్ణ ద్వైపాయన వ్యాసులు. ద్వీపములో జన్మించిన కారణములన వారు ద్వైపాయనులయ్యారు. వారి వర్ణము శ్యామలము. అందుచే కృష్ణద్వైపాయనులయ్యారు. వేద విభజన కారణముగా వారికి వ్యాసులని పేరు వచ్చింది.

వేదవ్యాసులు విష్ణు అవతారమే. వారి ప్రశస్తి 'వ్యాసాయ విష్ణురూపాయ, వ్యాసరూపాయ విష్ణవే, నమోస్తు బ్రహ్మనిధయే వాశిష్ఠాయ నమోనమః' అన్న ధ్యాన శ్లోకం చాటుతుంది. మన అద్వైత వేదాంతస్మార్త సాంప్రదాయమునకు ఆది గురువు నారాయణుడే. ఆయన పిదప పద్మభువుడైన బ్రహ్మ. తర్వాత బ్రహ్మపుత్రుడు వశిష్ఠుడు, వశిష్ఠుని పిదప అతని పుత్రుడు శక్తి. తర్వాత శక్తి పుత్రుడు పరాశరుడు. పరాశరుడు విష్ణుపురాణకర్త, పరాశరుని పుత్రుడు వ్యాసులు. వారి పుత్రులు శుకులు. పరమ బ్రహ్మనిష్ఠలు. పెళ్ళిచేసుకోనందువలన వారికి పుత్ర సంతతిలేదు. శుకుల పిదప, పితృ పుత్ర పరంపర నిలచిపోయి గురుశిష్యపరంపర మొదలైనది. శుకాచార్యుల శిష్యులు గౌడపాదులు. గౌడపాదులు సన్యాసాశ్రమమును స్వీకరించిన వారు. వీరితో సన్యాస పరస్పరలో వేదాంత సంప్రదాయ ఆచార్యులు రావడం ప్రారంభ##మైనది.

గౌడపాదుల శిష్యులు, గోవిందభగవత్పాదులు, వీరిశిష్యులే మన ఆచార్యులు భగవత్పాద శంకరాచార్యులు. శంకరులకు నల్గురు శిష్యులు. పద్మపాదులు, హస్తామలకులు, తోటకాచార్యులు, సురేశ్వరులు. ఒక్కొక్క శంకరపీఠమునకు చెందినవారు చెప్పవలసిన గురుపరంపర శ్లోకము ఇది.

నారాయణం పద్మభువం వశిష్ఠం

శక్తించ తత్పుత్ర పరాశరం చ

వ్యాసం శుకం గౌడపదం మహాంతం

గోవింద యోగీంద్ర మధాస్య శిష్య

శ్రీ శంకరాచార్య మధాస్యపద్మ

పాదంచ హస్తామలకంచ శిష్యం

తం తోటకం వార్తిక కాద మన్యా

అస్మద్గురూ సంతతమానతోస్మి||

ఇందులో పద్మబవుడంటే బ్రహ్మ; వార్తికకారులు అంతే సురేశ్వరాచార్యులు.

వ్యాసులు ఒక్క విష్ణు అవతారమేకాదు. త్రిమూర్తుల స్వరూపము కూడా. ఒక్క శ్లోకములో - ''అచతుర్వదనో బ్రహ్మా, ద్విబాహు రపరోహరిః అఫాలలోచన శ్శంభు ర్భగవాన్‌ బాదరాయణః'' నాలుగు ముఖములు లేక పోయిననూ ఈయన బ్రహ్మ, నాలుగు చేతులులేని రెండుచేతుల విష్ణువు ఈయన. ఈయనకు ఫాలనేత్రములేదు కానీ మహేశ్వరుడే - అన్న భావమున్నది.

వేదములను అందరూ అధ్యయనము చేయడానికి వీలుకాదు. ఎవరో కొందరే కఠిన నియమములతో కూడిన అధ్యయనం చేయగలరు. వేదములకు మౌలిక సత్యములైన అహింసా, సత్య, అస్తేయ, అపరిగ్రహ ధర్మములు అందరూ ఆచరించవలెనని వ్యాసులవారు పదునెనిమిది పురాణములూ, పంచమ వేదమని ప్రసిద్ధి చెందిన అష్టాదశ పర్వములతో కూడిన మహాభారతమునూ వ్రాశారు. అంతేకాక బ్రహ్మతత్త్వనిరూపణార్థము బ్రహ్మ సూత్రములను అసమాన కౌశల్యముతో గ్రంధీకరించారు.

బ్రహ్మసూత్రములకు భగవత్పాదులు అద్వైతపరంగానూ, రామానుజులు విశిష్ఠాద్వైతపరంగానూ, వల్లభాచార్యులు కృష్ణపరంగానూ, తమతమ సిద్ధాంతములను ప్రతిపాదిస్తూ భాష్యరచనలు చేసారు. బ్రహ్మసూత్రములు పండితలోకములో ఒక విశిష్ఠతరమైన స్థానాన్ని సంతరించుకొన్నవి. ఈ రోజు మనమందరమూ ఆస్తికులముగా ఉన్నామంటే దానికి కారకులు వేదవ్యాసులే.

అటువంటి మనమతానికి మూలపురుషుడునూ, మహాతపస్వియూ, మన గురువూ ఐన వేద వ్యాసమహర్షిని ఉద్దేశించి మనం వ్యాసపూజలు జరుపుకుంటున్నాం. హిందువులలో శాఖలూ, మతభేదములున్నా, అందరికి ఆయన చిరస్మరణీయుడు. మనమందరమూ ఆయన చేసిన మహూపకారాన్ని ఎన్నడూ మరువరాదు.

4. భక్తికి మించిన భాగ్యలక్ష్మి లేదు

భగవంతుడు ముందు మనం సాధారణంగా అదికావాలనీ, ఇదికావాలనీ కామ్యార్థంగా ప్రార్థిస్తూ ఉంటాం. కొంచెం యోచించి చూస్తే మనం ప్రార్థించవలసిన అవసరమే కనిపించదు. భగవంతుడు మనకు తండ్రియేకాదు, తల్లి కూడా. మన యోగ్యత ననుసరించి మనకు ఏది ఏ కాలంలో ఇవ్వాలో స్వయంగా ఆ జగన్మాత ప్రసాదిస్తుంది. కాని ఈ వివేకం మనకు ఏ కారణంచేతనో ఉండటంలేదు.

అయితే ఈ విధంగా కామ్యార్థం ప్రార్థించడం పూర్తిగా తప్పు అని చెప్పడానికి వీలు లేదు. గీతలో కృష్ణపరమాత్మ తన భక్తులను నాలుగు విధములుగా విభజించినాడు. కష్టములలో చిక్కుకొని దైవసహాయమును ఆపేక్షిస్తూ ప్రార్థించేవాడు ఆర్తుడు. ఇహలోక సౌఖ్యములను ఆపేక్షిస్తూ ధనసహాయం కోరేవాడు అర్థార్ధి. శాస్త్రములు, కళలు, దివ్యజ్ఞానము మొదలైనవానిని తెలుసుకోవాలని కోరేవాడు జిజ్ఞాసువు. నాలుగవ తరగతికి చెందినవాడు జ్ఞాని. అతడు నిష్కాముడు. భగవతత్త్వమును తెలుసుకున్నవాడు. ఈ విధంగా నాలుగు రకముల భక్తులను భగవంతుడు పేర్కొన్నాడు.

ప్రప్రధమంలోనే కర్మసన్యాసం చేయడమనేది కాని పని. అందరూ మొదటనే మోక్షకాములు కాలేరు. కోరికలున్న స్థితిలో కూడ, అంతా మన చేతులలోనే ఉందని భావించకుండా, మనకుపైన ఈ ప్రపంచాన్ని నడిపే ఒక మహాశక్తి ఉందని గ్రహించి, ఆ అనుగ్రహ శక్తికి వినమ్రులై ప్రార్థించటం వివేకమున్నవారి లక్షణం. అలాంటపుడే అహంకారము నుంచి విముక్తులం కాగలం. మొదట కామ్యార్థం ప్రార్థించటం, పిదప చిత్తశుద్ధికొరకూ, జ్ఞానప్రాప్తికొఱకూ స్తోత్ర, ధ్యాన, నుతి ప్రదక్షిణాదులు చేయడం - అట్లాచేస్తే క్రమంగా మనకు వైరాగ్యం కలుగుతుంది. అందులకే లక్ష్మీ కటాక్షాన్ని అర్థించే వారిని భగవానుడు అర్థార్థులని నిర్వచనం చేశాడు. వారినీ భగవంతుడు భక్తవర్గంలోనే చేర్చినాడు.

మన ఆశలకు ఒక అవధిలేదు. అందులో దుర్జయమైనది ఐశ్వర్యం కావాలనే ఆశ. కానీ అర్థం అనర్థమని గ్రహించడానికి ఎంతో కాలం పట్టుతుంది. ఐహిక విషయాలపై పోయే మనస్సుకు, మోక్షార్థం ప్రార్థించాలన్న ఉద్దేశం కూడా మాయమౌతుంది. మంచి సంస్కారాలుంటే కాని మోక్షకాములము కాలేము. ఆ సంస్కారం వర్థిల్లాలంటే, జ్ఞానం అంటే విద్య ఉండాలి. విద్యాస్వరూపిణి, భాగ్యలక్ష్మీ, మోక్షలక్ష్మీ- అన్నీ ఆ పరాశక్తియొక్క వివిధరూపములే. అనన్య భక్తికి మించిన అర్థం లేదు. అట్టి భక్తియే మన పాలిట భాగ్యలక్ష్మి.

Sanathana Dharmamu    Chapters    Last Page