Sanathana Dharmamu    Chapters    Last Page

VII. కర్మమార్గము

1. బాహ్యకర్మ, అంతరంగ ధ్యానం

నేను ఎన్నో విధాలైన కర్మానుష్ఠాలను గూర్చి చెబుతుంటాను. పరోపకారము, ఈశ్వరారాధనలాంటి కార్యాలు మనంచేసినపుడు, బాహిరంగా అని ఇతరులకోసం చేసినట్లు కనిపించినా, వాస్తవంగా అవి మనచిత్తశుద్ధికి, ఆత్మతృప్తికీ, సాహాయ్యకంగా వుంటాయి. మనం చేసే ఉపకారము ఇతరులకు లాభిస్తుందో లేదో, వారికి ఆ ఉపకారం అవసరమోలేదో, ఆకార్యాల వలన మనకు కలిగే తృప్తీ సంతుష్టీచేత అది పరోపకారమేకాక స్వోపకారంగా పరిణమిస్తున్నదని కొంచెం ఆలోచిస్తే తెలుసుకోగలం. అట్టికార్యాలు చేసేటపుడు శ్రమదాయకంగా వున్నా, పిదప కలిగే ఒక అవ్యక్తానందము అందరి అనుభూతిలో వున్న విషయమే. ఈ అనుభూతి దేవకార్యాలలోనూ క్షేత్రాటనంలోనూ కూడా కద్దు. ఆత్మపై మనకున్న ప్రీతికారణంచేతనే అన్ని కఎn్టాలనూ ఓర్చుకొని ఈ కార్యాలలో ఒక కృతకృత్యమును పొందడానికి మనమందరమూ ప్రయత్నం చేస్తాం.

భార్యయందు, పుత్రులయందు మిత్రులయందు మనం ఉంచే ప్రేమ కూడ ఇలాంటిదే. వారిని మనం ప్రేమించడం వారికోసం కాదు. ఆ ప్రేమ ఆత్మప్రేమగా పరిణమించడంవల్లనే మనం వారిని ప్రేమిస్తున్నాము అనే విషయాన్ని ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి ఉపదేశిస్తున్నాడు. అన్ని కార్యాలకు కారణం మనయందు మనకున్న ప్రేమయే. ఆ ప్రేమకోసం ఎన్ని కష్టాలైనా పడతాం. ఎట్లాంటి త్యాగానికైనా వెనుదీయం. ఒక పూర్ణత ననుసరించి, ఆత్మార్ధమే మనం కార్యవ్యగ్రులమౌతున్నాం. ఆ తృప్తీ, ఆ సంతుష్టీ చివర లేకపోతే మనం ఏ కార్యమూ చేయలేము.

స్వార్థం కోసం చేసే ధనార్జనం మనకు నెమ్మది నివ్వటంలేదు. అట్లే ఇంద్రియాల తృప్తికోసం చేసే కార్యాలు చివఱకు అశాంతికరంగానే వున్నాయి. దుఃఖాంతంగానే ముగుస్తున్నవి. అద్దంలో మనం మన ముఖాన్ని చూస్తాం. ఆ బింబానికి బొట్టు పెడదామని పూనుకొంటే అద్దాన్ని నలుపేచేయటమేకాని బింబానికి బొట్టు అంటదు. అదే బింబమునకు మూలమైన మన నుదిటిన బొట్టుపెట్టుకుంటే, అద్దంలోని ప్రతిబింబపు నుదుటి పైననూ బొట్టు వుంటుంది. మన కోసమని చేసుకొనే కార్యాలన్నీ అద్దంలో కనబడే బింబానికి బొట్టుపెట్టడం లాంటిదే. మనస్సనే మాయాదర్పణంలో ప్రతిబింబించే పరమాత్మను, 'నేను' అని భావిస్తున్నాం. ఆ బింబమును అలంకరించడమంటే వాస్తవంగా పరమాత్మనే అలంకరించాలి. ఈ ప్రపంచం విష్ణుమయం. లోకానికి చేసే సేవ పరమాత్మకు సేవ. అట్టి సేవయే అత్యంత తృప్తికరంగా వుంటుంది.

మీరు నాకు పుష్పహారములు తెచ్చి సమర్పిస్తూ వుంటారు. మీకంటే నేను గొప్ప అనే భక్తి భావంతో మీరిట్లా చేస్తున్నారు. నాకిస్తే కానీ అది అలంకారమవదు అన్న అభిప్రాయంతో మీరు వానిని నాకు సమర్పిస్తున్నారు. దీనిని నేను ధరిస్తే అది అలంకారం కాదు. అహంకారమే. కాని మీరు భక్తితో తెచ్చి ఇస్తున్నందువలన నేను తిరస్కరించడం సబబుకాదు. మీరునన్ను అమ్మవారికి సమర్పించి, ఆమెను అలంకరించి ఆనందిస్తున్నాను.

ప్రపంచం పరమాత్మ స్వరూపమని అంటే మనమూ పరమాత్మ స్వరూపమనే అర్ధం. మనస్సు అనే అద్దాన్ని తొలగిస్తే, ఆ పరమాత్మ స్వరూపమే మనము అన్న భావన అనుభూతికి వస్తుంది. దానినే ధ్యానమని అంటారు. మనం చేసే ఇన్ని కార్యాలూ కట్టకడపట ఆ కర్మరహితమైన స్వరూపస్థితిని, ఆత్మధ్యాననిరతిని తెచ్చిపెడుతుంది. నేను మీకు చెబుతున్న అనుష్ఠానాల కన్నిటికి అంతిమస్థితి అదే.

మనం పలురకముల కార్యములు చేసి సంతోషించినా కార్యరహితమైన సుషుప్తిలోని శాంతి వీనిలో లేదు. ఒక్కరోజు మనం నిద్ర పోకపోతే ఎంత చికాకుగా వుంటుంది? నిద్రా సౌఖ్యం అంటే అటువంటిది. అందుచేత ఏకార్యం లేకుండా కూచోవడమే పరమసౌఖ్యమని తేలుతున్నది. అట్లా ఏ కార్యమూ లేక పరమాత్మ స్వరూపమైన తన నిజరూపములో నిలవడమే ధ్యానము. నిద్రలో సుఖముగా ఉన్నామన్న ఎరుకలేదు. కానీ నిద్రనుంచి లేచిన పిదప నిద్రాస్థితి పరమసౌఖ్యప్రదముగానున్న విషయము గుర్తిస్తున్నాం. అట్లుకాక బ్రహ్మానందములో ఉన్నామన్న ప్రాజ్ఞయుక్తమైన ఆంతర్య శాంతస్థితిని భజించేవారికి బయట ఎన్ని కార్యములున్నా అంతరంగ శాంతికి భంగముండదు.

దక్షిణామూర్తి యొక్క శాంతము పూర్ణ ప్రజ్ఞాయుక్తమైన ఆనందస్థితి సుషుప్తిలో మనస్సు అణిగిననూ, అది మన ప్రయత్నం చేతకాక అస్వాధీనంగా జరిగే అవస్థ. అట్లా అస్వాధీనంగా అణిగిన మనస్సు మళ్ళా స్వప్నావస్థలోనూ, జాగ్రదావస్థలోనూ యధాప్రకారం విజృంభిస్తున్నది. మరణం కూడా ఒక విధంగా నిద్రయే, అది దీర్ఘనిద్ర. అప్పుడు కూడ మనస్సు అణగి పోతున్నది. కాని మరొక జన్మ సిద్ధంకాగానే మనస్సు మళ్ళా పనిచేయ ప్రారంభిస్తుంది. అందుచేత మనస్సు స్వాధీనంగా, బుద్ధియుక్తంగా అణగాలి. అపుడే మనకు స్థిరమైన ఆనందం లభించగలదు.

స్థిరతరానందస్థితిలో, వటవృక్షంక్రింద కూర్చున్న దక్షిణామూర్తియే, ఆనందతాండవమూర్తిగను, భిక్షాటనమూర్తిగనూ, భక్తజనులకు అనుగ్రహమూర్తిగనూ విలసిల్లుతున్నాడు. త్రిపురములను దహిస్తున్నాడు. ఎన్ని కార్యాలు చేస్తున్నా ఆయన కార్యములు చేయనివాడే. దక్షిణామూర్తివలెనే మనమూ అంతరంగ శాంతిని సాధించామంటే బయట ఎన్ని కార్యములు చేస్తున్నా మనఃస్థిమితము కలిగి ఆనందంగా శాంతిగా, నిర్లిప్తులమై ఉండగలము. ఇంద్రియములను నిర్వ్యాపారంగాచేసి మనస్సు ధ్యానమగ్నమయ్యేటట్లు మనం చేయకలిగితే అవసరములైన కార్యములు చేసినప్పటికీ, మనస్సు ఉద్విగ్నంకాక, ఇచ్ఛా ద్వేషములకు అతీతమైన మానసిక స్థితిని మనం సాధించగలం. మనకు ధ్యానసిద్ధి కలిగితేకానీ మనం అన్ని దేశాలలోనూ అన్ని కాలాల్లోనూ పరమేశ్వరదర్శనం చేయలేము. ఆ స్థితి లభించాలంటే మనం దక్షిణామూర్తి ధ్యానం చేయాలి.

2. సౌశీల్యం

మనకు శీలసంపత్తి కలుగవలెనంటే వేదోక్తములైన ఆచారఅనుష్ఠానములను పాటించాలి. సదాచారము, సద్గుణములు అలవరచుకోవాలి. మంచి మనస్సున్న వాడే శీలవంతుడు కాగలడు. అందరూ సుమనస్కులుగా ఉండుటకు వీలు కావటంలేదు. మనసులో ఏ సందర్భములోనూ చెడుతలంపులు తలెత్తకుండా ఉంటేగానీ, సౌజన్యం ఏర్పడదు. అందరి మనస్సులలో సద్భావం కలగుటకొరకే శాస్త్రవిధులు, అనుష్ఠానాలూ మనమతం నిర్దేశించినది. పూజా పునస్కారములు, నైశ్వదేవం అతిథి సత్కారము, మొదలైనవన్నీ చిత్తశుద్ధి కలగడానికీ, సౌజన్యం సౌశీల్యం పెంపొందించుట కొరకూ ఏర్పడినవే. వీనికి అలవాటు పడితే మనస్సులో దురాలోచనలు ప్రవేశించుటకు సమయముకానీ, అవకాశముకానీ ఉండదు.

రెండవది మనం కర్మానుష్ఠానములను చేయునప్పుడు అహంకారానికి దారితీసే కర్తృత్వభావము అసలే ఉండరాదు. కర్మానుష్ఠానము చేయవలెననే సంకల్పమూ, చేసే శక్తీ, వసతులూ అన్నీ ఈశ్వరునివే. ఈ విధంగా మన పూర్వ వైదిక మతాచార్యులు తాము ఆచరించి మనకు మార్గనిర్దేశనం చేశారు.

ఒక అద్దంలో మన బింబం చూచుకోవాలంటే, అది శుభ్రంగా ఉండాలి. అది మకిలితో ఉంటే బింబం మసకమసకగా ఉంటుంది. అంతేకాదు అద్దం నిశ్చలంగా ఉండాలి. కదలుతూ ఉంటే బింబమూ చెదరుతూ ఉన్నట్లు అగపడుతుంది.

మన చిత్తం దర్పణం లాంటిది. ఆ చిత్త దర్పణంలో పరమాత్మను దర్శించాలంటే, చిత్త చాంచల్యం లేక స్థిరంగా, మాలిన్యరహితమై స్వచ్ఛంగా ఉండాలి.

మనింట్లో ఒకపాతరాగి పాత్ర ఉందనుకొందాం. అది బావిలో పడింది. కొన్ని ఏండ్లు నీళ్ళలోనే ఉంది. బయటకు తీసి దానిని శుభ్రపరచవలనంటె ఎంత శ్రమపడాలి? అట్లే అనేక జన్మలనుంచి మనం తెచ్చుకొన్న మలిన సంస్కార దూషితమైన ఈ చిత్తాన్ని ఎంత శ్రమపడితే శుభ్రం చేయగలం? అనేక జన్మసంపర్గమైన చిత్తమాలిన్యాన్ని ఎన్నో సత్కార్యములు చేస్తేకాని పోగొట్టుకొనలేము. అంతేకాదు. ఒక్కరోజు సత్కార్యం చేసి ఊరకుంటే చాలదు. ఈ సదాచారములను అనుదినం అనుష్ఠించాలి. అపుడే చిత్తనైర్మల్యం స్థిరంగా ఉండగలదు. ఇట్లు చేస్తూచేస్తూ రాగా ఒకరోజు ఈ చిత్తమనేది పలాయనమౌతుంది. ఆత్మ ఒక్కటే మిగిలిపోతుంది.

అందుచేత ఆత్మ సాక్షాత్కారం కావాలంటే అమనస్కమైన చిత్తరాహిత్యం, ఆ చిత్తరాహిత్యానికి సౌశీల్యం, సౌశీల్య సంపాదనకు వైదిక కర్మానుష్ఠానం, సదాచారా సంపత్తీ ఉండాలి. ఆత్మలాభానికి శీలం ఎంతో ముఖ్యమైనదన్న విషయం ఏనాడూ మరువరాదు.

3. దుఃఖ వియోగమే యోగం

యోగమంటే శ్వాసను బిగపట్టి నిశ్చలంగా శిలవలె కూచోవటం అని కొందరు భావిస్తారు. కానీ యోగమంటే కలయిక. జీవితం గడవాలంటే ఎన్నో వస్తువులు మనతో కలవాలి. కానీ ఈ కలయిక నిరంతరంగా ఉండటంలేదు. గృహం, ధనం, భార్య, పుత్రులు మిత్రులు కలుస్తూ ఉంటారు. విడివడుతూ ఉంటారు. యోగం, వియోగం ¸°గ పద్యంగా జరుగుతూనే ఉంటుంది. ఇట్లుకాక ఒకానొక వస్తువుతో కలసి, దానినుండి ఎడబాటనేది లేకపోతే అదే యోగం. ఆ వస్తువే పరమాత్మ. మనస్సును మూలమునకు చేర్చడానికే యోగులు ప్రాణాయామం చేస్తారు. సంకల్పములు ఎక్కడనుంచి ఉద్భవిస్తున్నవో, అక్కడనే శ్వాసకూడా పుడుతున్నది. శ్వాస, మూలంలో నిలకడ చెందితే మనస్సున్నూ ఆ మూలంలోనే అణగుతుంది.

యోగమనే పదానికి వ్యతిరేకపదం వియోగం. వియోగం అంటే విడచిపోయేది. మనిషి చనిపోయినపుడు దేహవియోగమైంది అని అంటాం. మనం ఒక విధంగా వియోగం సాధించినామంటే అదే యోగమౌతుంది! మనం దుఃఖం వదలిపెట్టామంటే అదే యోగం. గీతలో భగవంతుడు 'తం విద్యాత్‌ దుఃఖ సంయోగ వియోగం యోగ సంఙ్నితం', దుఃఖ సంయోగాన్ని వియోగం చేసేదే యోగం అని చెప్పమన్నాడు.

లోకరీతిలో మనం కొన్ని విషయాలను సుఖమని అనుకొంటాం. కానీ 'సర్వందుఃఖం వివేకినః' వివేకమున్న వానికి అన్నీ దుఃఖప్రాయంగా ఉంటవి. మనం దేనిని సుఖమనుకొంటామో దానికి నిలకడలేదు. ఆ సుఖం అంతరించగానే దుఖం కలుగుతున్నది. పరమాత్మను తప్పించి తదితర అనుభవములన్నీ దుఃఖప్రాయములే. చిత్తం భ్రమిస్తూ ఉండటంచేత సుఖ దుఃఖములు సంభవిస్తున్నాయి. చిత్తం స్థిరపడినచో సుఖదుఃఖములకు అతీతంగా ఉంటాం. చిత్త చాంచల్యం లేక ఏకాగ్రత మనకు సిద్ధిస్తే, చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో యోగసిద్ధి లభిస్తున్నది. ఈ చిత్తస్థైర్యం కార్యంలో నిమగ్నమైనపుడు మనకు కలుగుతూ ఉంటుంది. సత్కార్యాలు చేస్తూ అందులో పూర్ణంగా నిమగ్నమైపోతే, మన మనస్సు తానుగ అణగిపోతుంది.

అనేక నియమములచే చేసేది యజ్ఞం. బ్రహ్మాండమైన ఆలయాలను నిర్మించడం, మంటపములను కట్టడం తటాకనిర్మాణం - ఈలాంటి ఇష్టాపూర్తములను మనపూర్వీకులు చేసేవారు. ఈ కార్యాలు చిత్తశుద్ధి కోసమే వారు చేసేవారు. ఈ కార్యాలు చేసేటపుడు ఎన్నోతొందరలు, ఇబ్బందులు, మనోవ్యధలు, దేహశ్రమవుండినా ఒకే ఏకాగ్రతతో వానిని పూర్తిచేసేసరికి మనకు ఒక ఆనందం కలుగుతున్నది. చిత్తశుద్ధి ఏర్పడుతున్నది. వీని పిదపనే, శ్వాసబంధనం, ధ్యానం మొదలైనవి వారు అభ్యసించారు. ఈ మధ్య ఇవన్నీ మారిపోయినవి. అందుచేత ఇష్టాపూర్తముల ఉద్దేశంకానీ, ప్రయోజనముకానీ మనకు అర్థంకావటంలేదు. యోగమంటే చిత్తవృత్తుల నిరోధం. ఆ నిరోధం ఒక్కప్రాణ బంధనం చేతనేకాదు. పరోపకార ప్రయోజనాన్ని ఉద్దేశించి చేసే ఇష్టాపూర్తముల వలనకూడా ఏకాగ్రత, తితీక్ష ఏర్పడి మనకు యోగసిద్ధి కలిగేటట్లు చేస్తుంది.

Sanathana Dharmamu    Chapters    Last Page