Sri Jayendravani    Chapters    Last Page

పరిచయము

సంఘ సంస్కరణ కొరకై సాక్షాత్తు పరమేశ్వరుడే కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామంలో శంకరాచార్యుడుగ అవతరించుట సర్వజన విదితమే.

ఆయన తనకు ముప్పదిరెండు ఏండ్లు నిండకమునుపే ధర్మాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని పునరుజ్జీవింప చేయుటకై భారతదేశం నలుమూలల పలుమార్లు పర్యటించారు. అప్పటికే దేశంలో ప్రచారంలో వున్న దుష్టసాంప్రదాయ సమన్వితమైన డెబ్డదిరెండు మతాలను నిషేధించి ఆరు ప్రధాన మతాల రూపంలో సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారు. వీటిని సజీవంగా సముద్ధరించటానికి ఆ సేవలో నియుక్తులు కావటానికి చాలా పీఠాల్ని నెలకొల్పారు. వారు నిత్యం అర్చించిన యోగలింగాన్ని సాల గ్రామాన్ని పూజ నిమిత్తం తన శిష్యుడైన సర్వజ్ఞ ఆత్మముని యను వారిని నియోగిస్తూ వెనుకటి పూజావిధానాన్ని కొనసాగించమనీ తాను నిలిపిన ధర్మాన్ని, అద్వైత సిద్ధాంతాల్ని పరిరక్షించమని సూచనలు చేశారు.

ఈ విధి నిర్వహణకై కాంచీపురంలో ఒక పీఠాన్ని స్థాపించి దానికి కామకోటి పీఠం అని నామకరణం చేశారు. ఆ దినము నుండి ఇప్పటి వరకు ఈ పీఠాన్ని నిరంతరాయంగా అరవైయేడుగురు ఆచార్యులు అధిష్టించారు. పూజావిధానంలోను ధర్మ ప్రచార విషయంలోను వారందరూ ఆదిశంకరుల ఆదేశాల్నే పాలిస్తున్నారు. ఈ పీఠానికి అరవైయెనిమిదవ ఆచార్యులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి స్వామివారు వారి 13వ ఏట సన్యాసాశ్రమాన్ని స్వీకరించి పీఠాన్ని అధిరోహించారు. వారు కూడ పూజాసేవలలో గాని, ధర్మ ప్రచార బాధ్యతలలో గాని వారి ముందు వారినే అనసరించారు. వారికిప్పుడు 80 సంవత్సరాల వయస్సు. వారు కంచీపురాన్నే స్థావరంగా చేసికొని వారి శుభాశీస్సులను భక్త జనులకు అక్కడి నుంచే ప్రసాదిస్తారు.

ఈ పీఠం యొక్క ప్రస్తుత మఠాధిపతి అనగా అరవైతొమ్మిదవ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు. వీరు వారి సన్యాసాశ్రమాన్ని శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నుండి తమ పందొమ్మిదవ ఏట స్వీకరించారు. వీరు పూజావిధానాన్ని, శాస్త్రాల్ని కూడ పరమాచార్యుల వద్దనే అభ్యసించి ఎల్లప్పుడు వారితోనే ఉంటూ వారితోనే ప్రయాణించేవారు.

శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ఆరాధనా దేవతల విగ్రహాలతో సహ తమ విజయయాత్రను వసంత పంచమీ పుణ్యకాలంలో (1973 ఫిబ్రవరి) ఉపక్రమించారు. 1973 జూన్‌ 7వ తేదీన న్యూఢిల్లీలోని రామకృష్ణా పురమందున్న ఉత్తర స్వామిమలై ఆలయంలో వేంచేసియున్న భగవాన్‌ కార్తికేయుని కుంభాభిషేకం నిర్వహించారు. ఈ చిన్ని పుస్తకంలో ఢిల్లీలో వారు వేంచేసియున్న సమయంలో వారిచ్చిన ఉపదేశాల్ని ఇమిడ్చటం జరిగింది.

ఉపదేశములతో కూడిన ఆయన ప్రవచనాలు తమిళ, సంస్కృత, తెలుగు, హిందీ భాషల్లో వున్నాయి. అవి యస్‌. బాల సుబ్రహ్మణ్యం గారిచే షార్టుహాండ్‌లో ఆంగ్ల భాషలో తీసుకోబడగా తర్వాత వాటిని ఈ పుస్తకరూపంలో సమకూర్చటం జరిగింది. ఆస్తికులందరూ ఈ ఉపదేశాల్ని అనుసరిస్తూ తమ జీవితాల్ని ఆ మార్గాల్లో నడుపుకుంటూ త్రిపురసుందరీ సమేత శ్రీ చంద్ర మౌళీశ్వరుని యొక్క శుభాశీస్సులకు, శ్రీశ్రీశ్రీ ఆచార్యుల యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఆశిద్దాం.

- ప్రచురణ కర్తలు

Sri Jayendravani    Chapters    Last Page