Sri Jayendravani    Chapters    Last Page

47. వివాహ వ్యవస్థ-కొన్ని అభిప్రాయాలు

(పెండ్లికుమార్తెల విషయంలో వస్తుమార్పిడి విధానం దూష్యం)

మన సృష్టి క్రమ సిద్ధాంతం ప్రకారం ప్రపంచానికి సృష్టి, స్థితిలయాలు క్రమపద్ధతిలో జరుగుతుంటాయి. సృష్టి లయాలు మాత్రమే చాలును గదా. సృష్టించినవాడే పోషక బాధ్యతను వహించునుగదా, పోషక నిర్వహణకు ప్రత్యేకంగా మరొకరు ఉండాల్సిన అవసరమేమి ?

ఈ ప్రశ్నకు సమాధానమే శక్తితత్వానికి మూలాధారం. ఈ సందర్భంలో చాలా విశేష ధర్మాల వివరణ వుంది. ప్రపంచం సృష్టింపబడింది. తర్వాత రక్షింపబడింది. చివరకు లయింపబడింది. ఉపనిషత్తులలో ఈ విషయాన్ని విశదీకరించే ఒక ఆసక్తికరమైన ఇతిహాసం ఒకటి వుంది. శిష్యుడు గురువుని ఈ విధంగా ప్రశ్నిస్తాడు. ''ప్రపంచంలో చాలమంది ప్రజలున్నారు. వారు ఎక్కణ్ణుంచి వస్తారు. మరణానంతరం వారి గమ్యం ఏమిటి ? ఈ ఘటనల వల్ల ప్రపంచం ఏ విధమైన మార్పులకు లోను గాదా ? కొంతకాలం తర్వాత ప్రపంచం అంతా దుష్టశక్తుల మయం కాదా ?'' వీటికి సమాధానం ఇలా ఈయబడింది. ''ప్రజలందరు సార్వకాలికంగా ఒకే ప్రదేశంలో వుండరు. ఒక ప్రదేశంలో క్షీణిస్తే మరొకచోట సహజరీతిలోనే జనాభా పెరుగుదల సంభవిస్తుంది. యాబది సంవత్సరాలకు పూర్వం మనం ఈ రోజు సమావేశ##మైన ఉత్తర స్వామిమలై దేవాలయ స్థానంలో చెట్లు చేమలు, జంతుజాలం వుండేవని మీరందరూ ఎరింగినదే. కాని ప్రస్తుతం మానవులు నివసించటం ప్రారంభించారు. ఇచ్చటి వృక్షజాలం పడగొట్టబడింది. జంతువులు ఈ ప్రదేశాన్ని వదలి మరొక నిర్జన ప్రదేశానికి తరలివెళ్లి వుంటాయి. కనుక ఏదీ నశించినట్లే.

ప్రపంచం యొక్క సృష్టి స్థితిలయాల కొరకు మూడు శక్తుల ఆవశ్యకత వుంది.

రజోగుణ ఆశ్రితమైన చర్యకు సంబంధించినదే సృష్టి. రక్షకత్వం, లేక పరిపోషణ కార్యక్రమం సత్వగుణంపై ఆధారపడిన చర్య. అలాగే లయవిషయిక కార్యక్రమం తమోగుణ ప్రవృత్తి. సృష్టి కర్తయైన బ్రహ్మ రజోగుణవంతుడు. రజస్సు యొక్క రంగు ఎరుపు, కనుక బ్రహ్మను రక్తవర్ణంలో సూచిస్తారు. ఆయన రక్తవర్ణం కల్గిన కమలంపై ఆసీనుడవుతాడు. తద్వారా సృష్టికి అవసరమైన శక్తిని పొందుతాడు.

ప్రపంచానికి పోషకకర్త విష్ణువు. పోషకత్వం సత్వగుణానికి సంబంధించినది. సత్వం తెలుపురంగు కాని విష్ణువు నీలమేఘశ్యాముడు.

లయకారకుడు శివుడు. లయత్వం తమోగుణానికి చెందినది. తమస్సు యొక్క వర్ణం నలుపు. కాని శివుడు నలుపు కాదు. శ్వేతవర్ణుడు. ఆయన ధరించే విభూతి తెలుపు. ఆయన నివసించే కైలాసం మంచుచే కప్పబడి ధవళవర్ణంలో భాసిస్తుంది. ఆయన వాహనమైన ఎద్దు కూడ తెలుపే. అలాంటి శివుడు తమోగుణంతో ఉండటం విచిత్రంగా కన్పిస్తుంది. అంతేగాదు ధవళవర్ణుడైన శివుడు సత్వగుణ ప్రవృత్తి కలవాడని ఆయన తన దక్షిణామూర్తి మరియు శంకరుని రూపాల్లో విజ్ఞానాన్ని ప్రసాదించటం దృష్ట్వా వెల్లడవుతుంది.

శివుడు లయకారకుడైనప్పటికి, ఆయన శ్వేతవర్ణుడనే సత్యం ఆయన సత్వగుణ సంబంధమైన పోషణ చర్యలను కూడ నిర్వర్తిస్తాడనే తలంపు మనకు స్ఫురింపచేస్తుంది. మానిక్యవాచగర్‌, శైవమతావలంబియైన మహాత్ముడు. ఆయనకొకసారి మండుటెండలో వైగైనది వద్ద నిలబడుటకు శిక్షవిధింపబడింది. వెంటనే నదికి వరదవచ్చి అతనిని చల్లబరచినది. కవి ఆ సన్నివేశాన్ని ఈ క్రింది శ్లోకంలో కీర్తించాడు.

శ్లో|| ''త్రాణ యోఘికృతః సమస్త జగతాం తస్యాంబురాశే సుఖం |

నిద్రాణస్య తధావిఘ్నే పి సమయే ప్రుష్ఠౌవన లక్ష్యతే |

విష్టి కృవంతి తామ్యతి శ్రమభరాద్ధే త్రాహతిస్తవ్యభూత్‌ |

కస్యాగ్రే కథయిష్యామి మమనయం స్వామిన్న నాధో హ్యసి ||''

(21-88 శివలీలార్ణవ ః)

''ప్రపంచం యొక్క పరిరక్షణ బాధ్యత మహా విష్ణువు దైయున్నది. వైగైనదికి అత్యధికమైన వరదతాకిడి తగిలినది. దానివలన మొత్తం నగరం తుడిచిపెట్టుకు పోవచ్చును. సంరక్షణా కర్తవ్యాన్ని నిభాయించవలసిన విష్ణుమూర్తి శేషపాన్పుపై సుఖంగా నిద్రిస్తుండగా అందుకు భిన్నంగా లయకారకుడైన పరమేశ్వరుడు నన్ను రక్షించుటకు విచ్చేసినాడు.'' శివలీలను కవి ఆ విధంగా స్తుతించాడు.

తమోగుణ సంబంధితుడైన శివుడు ఆ విధంగా పరిరక్షణ బాధ్యతను స్వీకరించటాన్ని గమనిస్తాం. అలాగే సత్వ గుణంతో సంబంధంగల విష్ణువు సంహార కార్యక్రమాన్ని చేపట్టటం పరికిస్తాం. ఉదాహరణకు విష్ణువు అనేక అవతారాలు ధరించి రావణుడు, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, కంసుడు మొదలైన రక్కసులను వధించాడు.

కనుక విష్ణువు, శివుని విషయాల్లో వారి విధులకు, గుణాలకు మధ్య పరస్పర వైరుద్ధ్యం చూస్తాము. కాని విష్ణుమూర్తి సంహార కార్యక్రమం ఆచరిస్తే అది కేవలం రక్షణకార్యక్రమంలోని భాగమే. శిష్టజనుల సంరక్షణార్థమై మాత్రమే ఆయన దుష్టజన సంహారాన్ని నిర్వహిస్తాడు. కనుక ఆయన ఒక వ్యక్తిని సంహరించినను మిగతా ప్రపంచాన్ని రక్షించటానికే అలా చేస్తాడు.

విష్ణువు విషయంలో మరొక విచిత్ర అంశాన్ని కూడ మనం గమనిస్తాం. కవి ఈ విధంగా చెప్తాడు.

''త్రాణఃఘికృతః సమస్తజగతాం తస్యాంబురాశో సుఖం! నిద్రాణస్య తధా విఘ్నోపి సమయే పృష్టైవ న లక్ష్యతే''||

దుష్టసంహారం నిర్వర్తించేటప్పుడు విష్ణువు చర్యలు తమోగుణ సంబంధితమైన సంహార ప్రకృతిని నిర్దేశిస్తాయి. కనుక ప్రజారక్షణ బాధ్యత నిర్వహణలో సత్వగుణాన్ని, దుష్టసంహార క్రియలో తమోగుణఛాయల్ని కల్గియుంటాడు.

బ్రహ్మను గురించి విచారించినప్పుడు ఆయన చర్య, గుణములలో వైరుద్ధ్యభావంలేక సమైక్యతే కన్పడుతుంది.

ఇక శివుని విషయానికొస్తే ఇక్కడ కూడ కొంత పరస్పర అనైక్యతాభావం పొడసూపుతుంది. శివునిది సంహార కార్యక్రమం. కాని ఆయన చర్యవల్ల లభించే ఫలితం మాత్రం కష్టజీవులైన మానవ కోటిని రక్షించటం పట్ల వహించే దయాగుణ ప్రదర్శనయే. సత్త్వ గుణప్రకృతికి సంబంధించినదే. నాశన క్రియ పూర్తియైన తర్వాత పరమాత్మలో ఐక్యమైన బాధిత ప్రజానీకం అంతా ఆనందమయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఒక దయామయుడైన తండ్రివలె, శివుడు కరుణను ప్రదర్శిస్తూ ఇలా అంటాడు. 'ఈ ప్రపంచంలో సుఖ దుఃఖాలతో జనన మరణాలతో బహుకాలంగా పరిభ్రమిస్తున్నారు. ఇప్పుడు సుఖనిద్ర ననుభవించండి.' శివుడు మనకు నిద్రప్రాప్తిని కలుగజేసి, మనలను పరమాత్మతో సంయోగించుట ద్వారా కలిగే సౌఖ్యాన్ని కూడ ప్రసాదిస్తున్నాడు. కనుక పరమేశ్వరుడు కూడ తమో గుణ సత్వగుణముల కలియికగా భాసిస్తాడు

ఈ మూడు మూర్తులతో అనుసంధింపబడిన శక్తుల స్వభావాన్ని విశ్లేషిద్దాం. పార్వతి శివుని యొక్క పట్టమహిషి. రుద్రుడు సంహారమూర్తియైతే, పార్వతి మహిషాసుర మర్దిని.

ఆ విధంగా పార్వతికూడ సత్వతమోగుణముల కలయికే. పార్వతి నలుపువర్ణం కలది. ఈ విషయంలో ఈమెకు మూర్తితో సామ్యం ఉంది.

బ్రహ్మయొక్క, సతీమణియైన సరస్వతి శుద్ధసత్వమై ధవళవర్ణంతో వుంటుంది. ఆమె తెల్లచీర ధరించి తెల్లటి పద్మంపై ఆసీనురాలవుతుంది. సరస్వతి మనకు విజ్ఞానాన్ని యిస్తుంది. కనుక అది కూడ సత్వగుణ సంబంధితమైనదే. సృష్టియే తన విధిగా పాలించునటువంటి, రజోగుణ సంబంధితుడైనట్టి బ్రహ్మ యొక్క సతీమణి సరస్వతి.

విష్ణువు యొక్క సహధర్మచారిణి యైన లక్ష్మి స్వచ్ఛమైన రజస్సు. ఆమె యొక్క చర్య కూడ సృష్టియే. బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించినట్లే ఆమె సంపదను సృష్టిస్తుంది. ఆమె రక్తవర్ణంగల చీరెను ధరిస్తుంది. రక్తవర్ణం కల పద్మంపై ఆసీనురాలవుతుంది.

ఈ శక్తులన్నీ ఒకే ఒక శక్తి నుండి ఆవిర్భవించాయి. దాని పేరే మాయాశక్తి. మాయ యీ మూడు రూపాల్ని ధరించింది. జీవికి జాగ్రత్‌నిద్రావస్థలు రెండూ చాలుగదా, సుషుప్త్యవస్థ ఎందుకనే ప్రశ్నవలెనే, సృష్టి, లయాలు రెండూ చాలవా, స్థితిలో పనియేమి అనే ప్రశ్న చాలమంది అడుగుతారు.

ఈ మూడు క్రియలు జరిగితేనే జగత్తులో స్థిరత్వం నెలకొని వుంటుంది. రెండు గుణాలు మాత్రమే ప్రవర్తిల్లితే వింతగానూ హాస్యాస్పదంగానూ వుంటుంది.

బ్రహ్మ, లక్ష్మి, యిరువురు రజోగుణతత్వంగలవారు కనుక, వారిరువురు రక్తవర్ణులు. ఇరువురు రక్తవర్ణం కల్గిన పద్మాన్ని ఆసనంగా కలవారు; ఇరువురు సృష్టి కార్యక్రమంలో పాల్గొంటారు. ఒకరు ప్రపంచాన్ని సృష్టిచేస్తే, మరొకరు సంపదను సృష్టిస్తారు. అందుచే వారిరువురుని సోదర సోదరీమణులుగా భావింపవచ్చు. కాని లక్ష్మి బ్రహ్మ సోదరి అనటానికి శాస్త్రబద్ధమైన సాక్ష్యాధారలు లేవు.

అలాగే విష్ణువు, పార్వతి యిరువురు సంహారం, రక్షణ క్రియలను నిర్వర్తిస్తున్నట్లు మనకు కన్పిస్తుంది. వారిరువురిది నలుపు వర్ణమే. నలుపువర్ణం తమస్సును సూచిస్తుంది. తమస్సుకు సంబంధించిన సంహార కార్యక్రమాన్ని యిరువురు నిర్వహిస్తారు. అంతేగాదు, సత్వగుణ సంబంధమైన రక్షణ విధిని కూడ వారిరువురు నిర్వర్తిస్తారు. పార్వతి యథార్థంగా జగన్మాత కనుక సర్వజనుల రక్షణ బాధ్యత ఆమెదే. కనుక విష్ణువు, పార్వతి సోదర సోదరీమణులని భావించవచ్చు.

విష్ణువునకు సంబంధించిన శంఖ, చక్రగదలతో దుర్గ యొక్క విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఆమె యింకా యితర ఆయుధాల్ని కూడ ధరిస్తుంది. ఆమె సంహారమూర్తి కూడ అనే అంశాన్ని పై విషయం మనకు గుర్తు చేస్తుంది. పార్వతిని, పద్మనాభ సహోదరి, అని తరచుగా మనం చెప్పుకుంటాం. పార్వతిని యీ బిరుదులతో కీర్తిస్తూ వ్రాయబడిన పాటలు చాలా ప్రచారంలో వున్నాయి. కనుక క్రియ, గుణముల ఆధారంగా పార్వతిని విష్ణువు యొక్క సోదరిగా భావించవచ్చు.

తర్వాత, పరమేశ్వరుడు, సరస్వతి, యిరువురు సత్వగుణ సంబంధమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. పరమేశ్వరుడు దక్షిణామూర్తి, శంకరుల రూపంలో విజ్ఞానాన్ని ఇస్తాడని లోగడ చెప్పాను. కనుక పరమేశ్వరుడు, సరస్వతి సోదరసోదరీమణులని మనం తలంచవచ్చు.

ఈశ్వరునకు మూడు రూపాలున్నాయి. అలాగే శక్తికి మూడు రూపాలున్నాయి. ఇవి చాలవా ? కాని ఇక్కడ కూడ వివాహ బంధానికి సంబంధించిన ఉత్కృష్టమైన నియమం ఒకటి సూచింపబడింది.

త్రిమూర్తుల విషయంలో వస్తుమార్పిడి విధానంలో పెండ్లి కుమార్తెల మార్పిడి జరిగిందని కొందరు అప్పుడప్పుడు వాదన లేవనెత్తుతారు. ఉదాహరణకు శివుడు విష్ణుమూర్తి యొక్క సోదరియైన పార్వతిని పెండ్లియాడాడని అంటారు. వారి వాదనే సరియైంది అయితే విష్ణువుసోదరి పరమేశ్వరుని పాణిగ్రహణం చేసినది కనుక పరమేశ్వరుని సోదరి సరస్వతి విష్ణువును వివాహం చేసికొని యుండాలి. కాని అది జరుగలేదు కదా. శివుని సోదరి సరస్వతి బ్రహ్మను వివాహమాడింది. బ్రహ్మ సోదరి లక్ష్మి విష్ణువుని పెండ్లి చేసుకుంది.

త్రిమూర్తులు, వారి శక్తులు పై విధంగా వారి మధ్య వివాహ సంబంధాలను ఏర్పాటు చేసుకొన్నారు. 'లలితోపాఖ్యానం' అనే గ్రంథంలో ఈ విషయాలు అతి మనోహరంగా చిత్రీకరింప బడ్డాయి. మనకు సంబంధించి నంతవరకు వస్తు మార్పిడి విధానంలో పెండ్లి కుమార్తెల మార్పిడిని మన ధర్మశాస్త్రాలు నిషేధించాయి. సూక్ష్మ పరిశీలన చేసినప్పుడు అటువంటి నిషిద్ధాంశం త్రిమూర్తుల విషయంలో లేదని తెలుస్తుంది.

Sri Jayendravani    Chapters    Last Page