Sruthi Sourabham    Chapters    Last Page

9. పరమ తపస్సు

''మనసశ్చేంద్రియాణాఞ్చహ్యైకాగ్ర్యం పరమం తపః'' అని స్మృతి వచనం.

(మనస్సుకు ఇంద్రియాలకు ఏకాగ్రత పరమ తపస్సు.)

యజ్ఞ ప్రక్రియలో నోటితో మంత్రాలనుచ్చరించడం, మనస్సుతో అర్థాన్ని భావించడం, శరీరంతో ఆ ప్రక్రియ నాచరించడం వల్ల ఒక పరమ తపస్సు జరుగుతుంది.

యోగీశ్వరుల సంకల్ప మాత్రంచే వస్తు సమృద్ధి కలుగుతుందని యోగీశ్వరుల జీవితాలు నిరూపిస్తాయి. భగవాన్‌ శ్రీ సత్యసాయి బాబావారి జీవిత చరిత్రలో ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. 1950 లో దసరా ఉత్సవాలలో పల్లకీ ఊరేగింపులో భగవాన్‌ సత్యసాయిబాబా పూలరేకులను ప్రజలపై వెదజల్లారు. అవి వెండి నాణాలుగా మారి జనం పైన పడ్డాయి.

శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపది యింట ఒక చిన్న శాకాన్ని తిని దుర్వాసుని శిష్యులు పదివేల మందికి కడుపు నిండునట్లు చేసిన వృత్తాంతం మహాభారతంలో ఉంది. వేదంలో కూడా ఈ పద్ధతి కనబడుతుంది.

బర్హిరాహరణ ప్రకరణంలో ''దేవేభ్యోజుష్టమిహ బర్హిరాసద ఇత్యాహ. బర్షిష స్సమృద్ధ్యై, కర్మణోనపరాధాయ''

'దేవేభ్యోజుష్టమిహ బర్హిరాసదే' అనే మంత్రం చెప్పాలి.

బర్హిస్సు సమృద్ధి అవడం, కర్మకు లోపం ఏర్పడకుండా ఉండడం ఈ మంత్ర పఠనం ప్రయోజనాలు.)

ఆసాదయితవ్య మిత్యుక్తే యావద్వేద్యాస్తరణస్య యుక్తం పర్యాప్తం తావతః సూచితత్వాదేతత్పదోచ్చారణం సమృద్ధ్యై సంపద్యతే తతోన్యూనత్వ లక్షణః కర్మణోపరాధో న భవిష్యతి''

(మంత్రంతో బర్హిస్సును పరచాలి అని చెప్పి వేదిపై పరచడానికి తగినంత బర్హిస్సు పరచాలని సూచింపబడడం వల్ల, మంత్రోచ్చారణం వల్ల బర్హిస్సు సమృద్ధిగా ఉంటుంది. బర్హిస్సు తక్కువవడం వల్ల దోషం కలుగదు.)

- తైత్తిరీయ సంహితా భాష్యం - 138 పుట

ఇచ్చట ఋత్విక్కు ఆ మంత్రం ఉచ్చరించడం చేత ఒకవేళ కొన్ని దర్భలు తగ్గినా ఆసాదనం చేయవలసినన్ని దర్భలు ఆసాదనం చేసినట్లవుతుంది. అంటే మంత్రోచ్చారణ సామర్థ్యం వల్ల దర్భలు సమృద్ధిగా పరచిన ఫలం లభిస్తుందన్నమాట.

ఇది 'ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోను ధావతి' (ఆద్యులయిన ఋషుల వాక్కును అనుసరించి అర్థం పరుగెడుతుంది.) అనే భవభూతి మహాకవి వచనాన్ని గుర్తుకు తెస్తుంది. షిర్డీసాయిబాబావారు 'దిగువకు పొమ్ము' అంటే విషం దిగిపోవడం. (శ్రీ సాయిబాబా జీవితచరిత్రము -194 పుట) శాంతించుము అంటే ఉద్ధృతంగా మండే మంట శాంతించడం. (పై గ్రంథం - పుట 108) ఆగు, ఆగు అంటే వర్షం ఆగడం (పైగ్రంథం- పుట 108)

ఇవన్నీ యోగ సిద్ధుల వచనాలకుండే ప్రభావాన్ని వెల్లడిస్తాయి. వేదసిద్ధుని వేదమంత్రోచ్చారణ కటువంటి ఫలం కల్గుతుంది. అందుకే వేదాశీర్వచన ముత్తమ సంప్రదాయ మయ్యింది. కాని వేదసిద్ధిని సంపాదించడమే కష్టతమం. అన్ని యోగాలు అంతే.

Sruthi Sourabham    Chapters    Last Page