Sruthi Sourabham    Chapters    Last Page

2. ప్రవృత్తి నిమిత్తం . . .

భారతదేశ చరిత్ర తొలి పుటలలో 'తొంభైఅయిదు శాతం హిందువులు అయిదు శాతం విదేశీయుల చేతిలో పరాజితులయి వారిచేత పాలింపబడినారనేది ప్రపంచంలోనే ఒక వింత' అనే వాక్యం కనబడుతుంది. నిజమే. అనైకమత్యం, ఉపేక్షాభావం వంటి అవలక్షణాలున్నచోట ఎన్ని వింతలయినా సంభవించవచ్చు.

భారతదేశంలో, ఆంధ్రప్రదేశంలో ఊరూరా వేదసభలు జరుగుతూంటాయి. వేదపండిత సమ్మానాలు చేయడం సామాన్యుని స్థాయి నుండి రాష్ట్రపతి స్థాయి వరకు ఉంది.

కాని వైదిక సాహిత్య చరిత్ర, భారతదేశ చరిత్రలకు చెందిన గ్రంథాలలో వేదాన్ని గురించి చాలా హీనభావాలు కనబడతాయి. పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయాల్లో పరిశోధన స్థాయి వరకు ఆ భావాలనే హిందూ విద్యార్థుల చేత అధ్యయనం చేయిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో ఏ మతానికీ ఇటువంటి దుస్థితి పట్టి ఉండదు.

ఒక విషయం సత్యమయినపుడు మనకు ఇష్టమయినా కష్టమయినా అంగీకరించక తప్పదు. కాని ఒక సత్యం కాని విషయాన్ని సత్యంగా భావించి, దానిని విద్యార్థులచే అధ్యయనం చేయిస్తూ వారిలో న్యూనతా భావాన్ని పెంపొందింప జేయడం మన చరిత్ర గ్రంథాలు చేస్తున్న ఘన కార్యం.

ఇంతకీ చరిత్ర గ్రంథాలలో వేదాలను గురించి కనబడే హీనభావాలేవి? అని ప్రశ్న.

ఆర్యులు ప్రకృతి శక్తులను చూచి భయపడి చేసిన ప్రార్థనలే వేదాలని ఒక భావం. పురోహితులు వాళ్ళ వృత్తికోసం పెంచిన నిరుపయోగ కర్మకాండతో వేదాలు నిండి ఉన్నాయని మరొక భావం. క్రీ.పూ. 1500 ప్రాంతాల్లో భారతదేశాన్ని ఆక్రమించిన ఆర్యజాతివారు ఆ తరవాత రచించినవి వేదాలనేది ఒక వాదం.

ఈ భావాల వల్ల వేదాలు పల్లెల్లో పాడుకునే పాటల వంటివనే భావం ఏర్పడుతోంది. వేదం తర్వాత బయలుదేరిన శ్రీమద్రామాయణ మహాభారతాదులు సత్యదూరాలయి కల్పనలుగా భావించబడుతున్నాయి. ఎందుకంటే క్రీ.పూ. 1500 నుండి వెయ్యి సంవత్సరాల కాలం చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం అంధయుగం. శ్రీమద్రామాయణ భారతాదులు క్రీ.పూ. 500 తరవాత ఏర్పడినవని వీరు భావిస్తారు. ఆ కాలం నుండి మనకు చరిత్ర తెలుస్తోంది. ఆ కాలంలో శ్రీరామకథ, శ్రీకృష్ణకథ జరిగినట్లు ఆధారాలు లేవు. లోగడ ప్రామాణికంగా భావించబడిన హిందూ వాఙ్మయం ఒట్టి కల్పిత వాఙ్మయంగా చరిత్రకారులు సాధిస్తున్నారు.

హిందువులకు లిపి లేదు. గ్రీకు లిపి నుండో, అరమీన్‌ లిపి నుండో వారు లిపిని ఎరవు తెచ్చుకొన్నారని ఒక వాదం.

గంగ అనే పదం సంస్కృత పదం కాదు. ఆస్ట్రిక్‌ భాషా పదం. దానిని ఆర్యులు సంస్కృతీకరించుకొని సంస్కృతంలో చేర్చుకొన్నారని ఒకరి వాదం. దీని వల్ల శ్రీమద్రామాయణం, మహాభారతం, పురాణాలు, వేదాలు మొదలైన చోట్ల ఉన్న గంగ ప్రస్తావనలన్నీ నిరాధార కల్పనలని చెప్పినట్లే గదా!

స్త్రీలకు వేదాలలో సరియయిన స్థానం లేదు. భర్త మరణిస్తే ఆ స్త్రీలను బలవంతంగా నిప్పులోకి తోసి చంపేసేది వేద సంస్కృతి అనేది మరొక విమర్శ.

ఈస్టిండియా కంపెనీ వారు భారతదేశంపై పెత్తనం సాగించే కాలంలో భారతదేశంలో ఉద్యోగం చేయదలచిన ఇంగ్లీషు వారికి లండన్‌లో శిక్షణ ఏర్పాటు చేసేవారు. ఆ శిక్షణలో భారతీయులు అనాగరకులు-అడవి మనుష్యుల వంటివారు, వారికి మతం, సంస్కృతి వంటి వుండవు. వారితో చాలా జాగ్రత్తగా మెలగాలని హెచ్చరించేవారు.

చరిత్ర గ్రంథాలలో పై విమర్శలు చదివినపుడు ఈస్టిండియా కంపెనీ వారు చేసిన హెచ్చరికలు నిజమే అనే భావం కలుగుతుంది.

వేదాభిమానులకు, సత్యాన్ని గ్రహించాలనే జిజ్ఞాసువులకు వేదాలకు సంబంధించిన యథార్థ విషయాలను చెప్పాలని యీ ప్రయత్నం. సద్గురు సాయినాథుని దయవలన నా అన్వేషణకు లభించిన సమాధానాలే ఈ గ్రంథం. శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహం వల్ల ఈ గ్రంథం వెలుగు చూడడానికి నోచుకుంటోంది.

మొదట శ్రుతి సౌరభం ప్రథమ, ద్వితీయ భాగాలు ఒకే గ్రంథంగా ముద్రిద్దా మనుకున్నాము. కాని ఒక ప్రముఖ పండితులు 'ప్రథమ భాగం చరిత్రకు సంబంధించింది' అని, దానికి వేదంతో సంబంధం లేదని సూచించారు. నిజానికీ గ్రంథంలో చాలా భాగం చరిత్రలో వేదంపై ఉన్న విమర్శలకు సమాధాన రూపమే. అయినా వారి సూచనకు విలువనిచ్చి దీనిని రెండు భాగాలుగా విభజించడం జరిగింది.

వేదాలపైన విమర్శలు ఇంకా చాలా ఉన్నాయి. వేదాలలో విశేషాలు వెల్లడించవలసినవి మరికొన్ని ఉన్నాయి. అందులో కొన్ని వ్యాసరూపాలను పొందాయి. స్వామి అనుగ్రహించి పాఠకులాదరిస్తే శ్రుతి సౌరభం మూడవ భాగంగా అది గూడా త్వరలో ముద్రణ భాగ్యం పొందవచ్చు.

భ్రమ ప్రమాదాలవల్ల ఏవైన దోషాలు దొరలితే సహృదయులు చెప్పితే కృతజ్ఞతాభివందనములతో సవరించుకొంటానని మనవి.

-రచయిత

Sruthi Sourabham    Chapters    Last Page