Sri Seshadri swamy jevitam    Chapters    Last Page

9. మండలి మాట

జ్యోతిర్మాత్ర స్వరూపాయ నిర్మలజ్ఞాన చక్షుషే,

నమః శివాయ శాంతాయ బ్రహ్మణ లింగమూర్తయే||

ప్రస్తుతము పరమశాక్తేయులైన మహనీయుల చరిత్ర మీ ఆదరాభిమానముల అండలో మండలి ప్రచురింప గలుగుట ఈశ్వరునికృప. ఇతర ప్రచురణలవలెనే సాధకలోకము ఈ పుస్తకమును గూడ ఆస్వాదించి ఆనందించెదరని మా ఎన్నిక.

జ్ఞానప్రాప్తికి మూడుమార్గము లున్నవి. అవి దైవము, అర్షము, పౌరుషములు. పంచకోశపరిజ్ఞానము భృగువు వరుణుని వద్దనుండి నేర్చుకొనెను. యమునివద్ద నచికేతుడు నాచికేతవిద్యలో విబోధితుడ య్యెను. ఈ జ్ఞానము దైవదత్తము.

రెండవది ఆర్షము లేక ప్రతిభ . సప్తఋషులు బంది పోటుదొంగను ఒకనిని అనుగ్రహించిరి. ఆ అనుగ్రహస్వరూపమే ఆదికవి వాల్మీకి. వారు ప్రసాదించిన రసోంబుధియే రామాయణము.

మూడవది పౌరుషము. మానవమాత్రుడైన ఒక గురువును చేరి తత్త్వాన్వేషణమో, దైవానుగ్రహప్రాప్తికి ధ్యాన, మంత్ర, జపాదులు చేయుటయో పౌరుషము. అందులకే స్కాందము;

ఉపదిష్టః సద్గురుణా జప్తః క్షేత్ర చ పావతే,

సద్యో యధేప్సితాం సిద్ధిం దదాతీతి కి మద్భుతం.

అతః సద్గురు మాశ్రిత్య గ్రాహ్యో 7యం మంత్రనాయకః,

పుణ్యక్షేత్రేషు జప్తన్యః సిద్ధిం ప్రయచ్ఛతి.

గురవో నిర్మలాః శాంతా సాధవో మితభాషిణః,

కామక్రోధ వినిర్ముక్తాః సదాచారా జీతేంద్రియాః.

ఏతైః కారుణ్యతో దత్తో మంత్రః క్షిఘ్ర ప్రసిద్ధ్యతి,

క్షేత్రాణి జపయోగ్యాని సమాసా త్కథయామ్యహం.

ప్రయాగం పుష్కరం రమ్యం కేదారం సేతుబంధనం,

గోకర్ణం నైమిశారణ్యం సద్యః సిద్ధికరంనృణాం.

అని, గురువు అవశ్యకత, మంత్రోపదేశవిధి, పుణ్య క్షేత్రములలో మంత్రపురశ్చరణ, గురువు లక్షణముల విశదీకరించుచున్నది. మహనీయుల చరిత్రలను చదువుటవలన, మనకు కర్తవ్యము జ్ఞప్తికి వచ్చి తత్త్వ నిష్టుల మగుటకు అవకాశ మేర్పడుచున్నది. అందుచే శ్రీ శేషాద్రి చరిత్ర మనకొక సాధనప్రణాలికగా భాసించ గలదు.

ఈ గ్రంథము ద్రావిడమాతృకకు విశాఖగారిచే స్వేచ్ఛానువాదము. ఈ పుస్తకమును ప్రచురించుటకు అనుమతించిన శ్రీశేషాద్రిస్వామి అధిష్ఠానమువారికిని, ఆంధ్రానువాదము చేసిన విశాఖగారికిని, సుమాంజలియు, శ్లోకార్థములను, ఆంగ్ల వ్యాసానువాదమును వ్రాసి ఇచ్చిన మిత్రులు, పండితులు శ్రీభగవతుల కుటుంబరావుగారికిని మండలి కృజజ్ఞత. కృతి భర్తలైన కామకోటి సరస్వతులకు మండలి నమోవాకములు. ఆస్తికులైన పఠితల ఆదరణ అభిమానము లున్న, త్వరలోనే విఖాఖగారిచే వ్రాయబడిన జగద్గురు శృంగేరి శంకరాచార్యులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వాములవారి చరిత్ర, బోధలు కూడ మండలి ప్రచురించగలదని విన్నవిస్తున్నాము.

సాధన గ్రంథమండలి, ఇట్లు, విధేయుడు

తెనాలి బులుసు సూర్యప్రకాశ శాస్త్రి

తేది 6-7-1976 వ్యవస్థాపకుడు

Sri Seshadri swamy jevitam    Chapters    Last Page