Sri Seshadri swamy jevitam    Chapters    Last Page

16. మహాపమాది

స్వామి నలువది సంవత్సరముల కాలము ఈ విధముగా శ్రితజనరక్షాధురీణులై తిరువణ్ణామలెలో జీవితం గడిపినారు. ఇట్లుండగా ఆయనకు విదేహకైవల్యంపై మనసు పోయింది. ఈ విషయం చూచాయగా సుబ్బలక్ష్మమ్మకు తెలుపవలెనని స్వామి ఒకరోజు,

'చాలాకాలంగా నిన్ను ఒక విషయం అడగాలని అనుకొన్నాను. ఏదో ఒకటి కచ్చితంగా చెప్పినావంటే ఆ విధంగా చేయాలని ఉన్నాను. జనం నాకు ఒకటే తొందరకలిగిస్తున్నారు. నేను ఇప్పుడు ఉండే విధంగానే ఉండనా? లేదా ఏదో క్రొత్తకుటీరమో పర్ణశాలనో వేసుకొని అక్కడ యోగాభ్యాసం చేయడమా? అని పాలుపోవటం లేదు. నీవు ఏమంటావు?' అని అడిగినారు.

సుబ్బలక్ష్మమ్మకు ఆ ప్రశ్నలోని సంకేతం తెలియలేదు. అందుచేత ఆమె, 'మీకు పైన వేసుకొన్న అంగవస్త్రం జారిపోయినా తెలియదే? మీకు ఒక కుటీరం తక్కువైనది కాబోలు! ఉన్నచోటనే ఉండి యోగాభ్యాసం చేయండి.' అని బదులిచ్చింది.

కాని స్వామి సుబ్బలక్ష్మమ్మను వదలలేదు. చూచి నప్పుడంతా అదే ప్రశ్న వేసేవారు. ఒకమారు విసిగి - 'మీకు క్రొత్తకుటీరంపై అంత అభిలాష ఉంటే - అట్లాగే ఒకటి నిర్మించుకొని యోగం ఆరంభించండి' అని చివరకు అంగీకరించింది.

''ఔను ఔను. నేనూ అదే చాలకాలంగా అనుకొంటూ ఉన్నాను. నీవూ అదేమాట చెప్పినావు.'' అని దరహాసంతో ఏదో పెన్నిధి దొరికినవానివలె స్వామి వెళ్లపోయారు. ఆనాటి నుంచి ఆ ప్రశ్నను వేయటం నిలిపివేశారు. స్వామి విదేహకైవల్యం కోరినట్లూ సుబ్బలక్ష్మమ్మ వాక్కే పరమేశ్వరి అనుజ్ఞవలె భావించినట్లూ అర్ధమౌతుంది.

ఈ ఉదంతం జరిగిన కొన్నినాళ్ళకు పొరుగూరివారు కొందరు వచ్చి స్వామికి అభిషేకం చేయవలెనని సంకల్పించారు. ఆసన్నాహంతో స్వామికి కేశసంస్కారం కావించి, అభిషేకానికి పూనుకోగా స్వామి, 'నాకు స్నానం వద్దు. జ్వరం రావచ్చును' అని అన్నారట. భక్తికూడ ఒకపుడు మౌఢ్యంగా పరిణమిస్తుంది. వారు ఆయన చెప్పినమాట వినలేదు. తెచ్చిన పన్నీరు బుడ్లన్నీ ఆయన శిరస్సుపై కుమ్మరించి, శివలింగానికి అభిషేకం చేసినట్లు బిందెలతో బావినుండి నీరు తెచ్చి తలపై కుమ్మరించసాగినారు. పోరుగు ఊరి వారికే స్వామి ఇంత సొంతమైతే ఉన్న ఊరివారు అవకాశాన్ని వదలుకొంటారా? వారూ ద్విగుణీకృతోత్సాహంతో పాల్గొన్నారు. అభిషేకం కోసం కాచుకొన్న జనం లంకాదహనం నాటి హనుమంతుని తోకవలె పెరిగినది. ఈ అభిషేకము స్వామి వారికి నిజముగానే కైవల్యమైనది. అభిషేకోత్సవం పూర్తి అయ్యేసరికి నూతిలోని నీరు పూర్తిగా వినియోగమైంది. దాని తర్వాత ఒంటిని తుడిచి విభూతి పూసి నూతనవస్త్రములతో స్వామిని అలంకరించి ఒక ఫోటోకూడ భక్తులు తీసిరి.

ఆనాటి సాయంత్రమే స్వామికి జ్వరం ప్రారంభించినది. ఎట్టి మహనీయులకైనా దేహత్యాగమునకు ఒక కారణం ఉండవలెనుకదా! ఎంతజ్వరమున్ననూ స్వామి దినచర్యలో మాత్రం మార్పు లేదు. వరుసగా నలుబదిరోజులు జ్వరం వదలకుండా కాచినది. స్వామి చిక్కి శల్యమైపోయారు. జ్వరోద్ధతికి తాళుకోలేక, ఒకరోజు చిన గురుక్కులు ఇంటి అరుగుమీద పడిపోయారు. గురుక్కులు స్వామికి పరిచర్య చేయసాగాడు. ఊరివారికి ఈ విషయం తెలియగానే తండోపతండముగా జనం రాసాగారు. తిరువణ్ణామలె కృత్తికోత్సవమునకు వచ్చే జనమును మించి పోయిన దీజనం. స్వామి అనునేయులలో వైద్యులు చాలమంది కలరు. వైద్యం ఏమయినా ఉపకరించునేమో అని వారు ఉత్సాహపడ్డారు. కాని మందుపుచ్చుకోరు. ఆహారం తీసుకొనరు.

ఇట్లుండగా శ్రీ బి.వి. నరసింహస్వామి, నారాయణ శాస్త్రికి స్వామివిషయంగా ఒక ఉత్తరం వ్రాసిరి. ఉత్తర మందినదే తడవు నారాయణశాస్త్రి తిరువణ్ణామలె వచ్చి చేరెను. అంతవరకు కండ్లు కూడ తెరవక పడుకొన్న స్వామి నారాయణశాస్త్రిని తనకరుణాపాంగ వీక్షణములతో చూచెను. శాస్త్రి ఒక నారింజపండును స్వామికి సమర్పింపగా నలుపది రోజులుగా ఏ ఆహారమునూ తీసుకోని స్వామి, దానిని ఒలిచి ఒక తొనను వ్రేలితో చిదిమి వాసనచూచి వదలిపెట్టిరి.

వానచినుకులు, తడిగాలి. గురుక్కులు శాలువను తెచ్చి స్వామికి కప్పెను. స్వామి ఏమియు చెప్పక ఊరకుండిరి. కొంతసేపటికి స్వామి లేచి ఆశాలువతోనే ఆలయమువైపు తూలుతూ నడచి వెళ్ళిరి. ఎక్కడ క్రింద పడిపోవునో అని వెంట నారాయణశాస్త్రి, మాణిక్యస్వామియు వెళ్ళిరి. త్రోవలో ఒక గుంటలో వాననీరు నిలిచియుండెను. స్వామి చూడగానే అందులోదిగి మోకాలిలోతు నీటిలో కూర్చుండిరి. స్వామిని చూచుటకు జనం రాసాగిరి. ఈ సందడిని భరించలేక, ఆ గుంటలొనే పడుకొనిరి. రాత్రి ఎనిమిది గంటలవఱకు ఊరి వారందరూ దూరముగా నిలుచుకొని స్వామిని వదలక యుండిరి. రాత్రికాగానే వారితో బాటు మాణిక్య స్వామియు వెళ్ళి పోయెను.

నారాయణశాస్త్రి మాత్రము స్వామివద్దనే నిలుచుని ఉండిరి. తెల్లవారుఝామున మూడుగంటలకు స్వామి గుంట వదలి బయటకు వచ్చి తడిగుడ్డలతో గురుక్కులు ఇంటికి నడచివచ్చి, మరల పడకలో అట్లే పడుకొనిరి. బి.వి. నరసింహస్వామి సుందరకాండ పారాయణ చేసిన ఉపకరించునేమో అని సలహానిచ్చిరి. వెంటనే నారాయణశాస్త్రి పారాయణ ప్రారంభించెను. కాని స్వామి దేహస్థితిలో ఏ విధమైన మార్పునూ లేదు. సుబ్బలక్ష్మమ్మ స్వామిని దర్శించినపుడు 'సుబ్బలక్ష్మీ! చూచినావా?' అని ప్రశ్నించిరి. అప్పటికి కాని, సుబ్బలక్ష్మమ్మకు తన్ను అడిగిన ప్రశ్నలో సంకేతము తెలియలేదు. 'నేను చెప్పినకుటీరమూ యోగాభ్యాసమూ ఇది కాదని ఆమె వాపోయెను.

అది విభవసంవత్సరము. మార్గశీర్షమాసము. స్వామి జననకాలమందు గురుశని శుక్రులు మేషవృశ్చిక కుంభరాసులలో ఉన్నట్లే, స్వామి విదేహ కైవల్యమునకు నిశ్చయించుకొన్న శుక్రవారము ఉదయమునకూడ అదేరాసులలో ఆసన్నులైరి. స్వామి పద్మాసనమున కూరుచుండిరి. నలుపది సంవత్సరములు కాలము తన మహత్త్వ ప్రదర్శనమునకు క్రీడారంగ ముగా చేసుకొన్న అరుణాచల క్షేత్రములోని ఆదిదంపతులను స్వామి తన హృదయమున నిలిపి, ఆనందస్ఫురణతో రోమాంచితులై భ్రువోర్మధ్యమున ప్రాణమావేశింప జేసి, సనాతనుడును, విశ్వనీయంతయు, జ్యోతిర్మయుడును, సర్వపోషకుడును అగు పరమేశ్వరుని విభూతిలో తన ప్రాణవాయువులను కలిపెను.

నలువదేళ్ళ కాలము స్వామి కరుణాస్రవంతిలో నోలలాడిన జనానీకమునకు అరుణాచలము రాముడు లేని అయోధ్యయైనది. వారి హృదయములు మూగవోయినవి. వారి ముఖముల చింతా మేఘము లావరించినవి. చీటుక మాటుకకూ పసి పిల్లలు తల్లి ఒడిని చేరినట్లు స్వామి పజ్జను చేరే జనమునకు ఇపుడు ప్రావులేక పోయినది. జ్ఞానియై మౌనియై జీవన్ముక్తుడై తిరువణ్ణామలె వీథులలో దిరిగిన స్వామి ఇపుడెక్కడ?

అరుణాచల సానువులలో అమ్మవారు ఈశ్వరుణ్ణి ఉద్దేశించి తపస్సు చేసి అర్థనారియై అపీతకుచాంబయని ప్రఖ్యాతి బడిసినది. స్వామి సంవత్సరములకాలము తపస్సు చేసి ఆ తపఃఫలితముగా ఈశ్రుని అర్ధాంగముకాక పూర్ణాంగముగా మారిపోయెనా?

ఏమైననేమి? స్వామి భవ్యజీవితము మనకొక మార్గదీపిక. ఆయన బోధలు మనకు అనుసంధానము చేయతగినవి.

''ఈశానః సర్వవిద్యానా మీశ్వరః సర్వభూతానాం

బ్రహ్మాధి పతి ర్బ్రహ్మణోధిపతి

ర్బ్రహ శివోయే అస్తు సదాశివోయ్‌ ||''

Sri Seshadri swamy jevitam    Chapters    Last Page