Sri Seshadri swamy jevitam    Chapters    Last Page

14. స్వామి అతీంద్రియశక్తి

చిన్న గురుకులు తల్లి కడువృద్ధ. అతని అత్తగారూ వృద్ధురాలే. పైగా ఆవిడకు కనులు తెలియవు. తల్లి రుజాపీడితయై నేడో రేపో కనులుమూసే స్థితిలో ఉన్నది. తల్లి పేరు మీనమ్మ. అత్త పేరు స్వర్ణాంబ. ఒక రోజు స్వర్ణాంబ భుజము లపై ఒరిగి ఉన్నపుడు మీనమ్మ శాశ్వతముగా కనులుమూసినది. దృష్ఠిలేని స్వర్ణాంబ ఆభారాన్ని అలాగే రెండుమూడు గంటలసేపు మోసుకొని ఉన్నది. మీనమ్మ గతించిన విషయము అంధయైన ఆ వృద్ధురాలికి తెలియదు.

ఏ నిమిషములో మీనమ్మ ప్రాణములను వదలినదో ఆ సమయములో స్వామి ఆకాశం చూస్తూ ''అదో మీనమ్మ స్వర్గం పోతున్నదే'' అని చుట్టుప్రక్కల వారితో అన్నారట. ఎవరో ఈవార్తను చిన్న గురుకులు చెవిలో వేశారు. ఆయన త్వరపడి ఇంటికి వెళ్లగా, అత్తగారి భుజములపై ప్రాణములు వదలిన తల్లికనపడింది.

ఇట్లే మరొక సమయములో తిరువణ్ణామలె సమీపము లోని ఊరులో ''విఠోబా'' అనే ఒక పుణ్యాత్ముడు సిద్ధిపొందినాడు. స్వామి వీథులలో తిరుగుతూ - ''అదో విఠోబా పోతున్నాడే. జోరుగా పోతున్నాడే'' అని నాలుగైదుసార్లు గట్టిగా అన్నారట. తర్వాత విఠోబా కాలమయినవిషయం ఊరివారికి తెలిసింది.

స్వామి సూక్ష్మదృష్టికి ఇవన్నీ యధాతథంగా కనిపించేవి కాబోలు.

తిరువణ్ణామలెలో ఎండలు ఎక్కువ. వర్షాకాలంలో కూడ ఎక్కువ వానలుండవు. నీటికి కష్టం. వర్షాభావం కల్గిఎండలు ఎక్కువైనపుడు భక్తులు స్వామిని వానకోసం ప్రార్థించడం కద్దు. ఒకమారు అర్ధనారి అనే శిష్యుడు, ''స్వామీ ఎండలు మండిపోతున్నవి. నీళ్లులేక ప్రజలు చచ్చిపోతున్నారు. వానపడితేకానీ దేహమూ, దేశమూ చల్లపడదు. అనుగ్రహించాలి.'' అని అన్నాడు. స్వామి పైనచూచి, ''ఆకాశం నిర్మలంగా ఉంది. వాన వస్తుందిలే'' అని అన్నారట. అన్నారో లేదో, పదినిముషములకు, మబ్బు లేసింది. మహావిష్ణువు దేహచ్చాయలను అనుకరించే వలాహకమాలికలు తిరువణ్ణామలెకు, ఛత్రంపట్టినవి. చిటచిటమని చినుకులు. పన్నెండుగంటల నుండి మూడు గంటలసేపు అంగ దేశంలో దుర్భిక్షం వచ్చినపుడు ఋష్యశృంగుని రాకచే వచ్చిన వర్షంవలె వర్షంకురిసింది.

నారాయణస్వామిశాస్త్రులు 1921లో తిరుచునాపల్లి నుండి తిరువణ్ణామలె పోయి స్వామి దర్శనం చేసుకొంటూ కొంతకాలం అక్కడ ఉండి పోయారు. ఒక రోజు భాగవతం చదువుతున్నారు. స్వామి వచ్చారు. భాగవతం తటాలున తెరచి, పుస్తకం చూడకుండానే, ఒకశ్లోకం చూపి ఈ శ్లోకం చదువు అని అన్నారట. చూడగా అది దశమస్కంధం, పంచమాధ్యాయంలో ''నందస్వాత్మజ ఉత్పన్నే'' అనే మొదటిశ్లోకం సాంప్రదాయంగా ఉపదేశించే శ్లోకం. స్వామితనకు ఉపదేశ మిచ్చారని శాస్త్రి సంతోషించారు.

ఆయన తెచ్చుకొన్న డబ్బు ఐపోయింది. తిరుచినాపల్లికి వెళ్ళవలెనంటే టిక్కట్టుకు కూడ డబ్బులేదు. ఏమిచేసేది తెలియక స్టేషనుకు వెళ్ళారు. అక్కడ మొగమెరుగని ఒక పెద్దమనిషి విల్లుపురమువరకు టిక్కెట్టుతీసి పెట్టారు. విల్లు పురమునుండి టిక్కట్టులేక ప్రయాణం చేయవలసి వచ్చినది. పెట్టెలో కూరుచున్నజనం అంతా దారిలో దిగిపోయారు. స్వామి ఇచ్చిన కొబ్బరికాయ, తనభాగవతము ఉంచిన సంచిని ఎవరో తస్కరించినారు. శాస్త్రి సంచిపోయినందుకు దుఃఖిస్తూ కూరుచున్నారు. ఇంతలో ఎవరో రుద్రాక్షలు విభూతి ధరించిన సాధువు. మంచివర్చస్వి. పెట్టెలో ఎంతో చోటు ఉన్నా శాస్త్రిప్రక్కనే వచ్చి కూరుచున్నాడు. శాస్త్రిని చూచి, ''ఎందుకు ఈవ్యసనం? చిదంబరంలో ఉన్న నటరాజును దర్శిస్తే ఎంత విచారమైనా పారిపోతుంది.'' అని వీపుతట్టి అన్నారు. శాస్త్రి అశ్చర్యపడి, తన సంచీ అందులో స్వామి ఇచ్చిన కొబ్బరికాయ, భాగవతమూ పోయినవిషయం సాధువుతో చెప్పారు.

''అనుగ్రహం భాగవతంలో ఉందా? కొబ్బరికాయలో ఉందా? అది కంటికి తెలియరానిది. మీకు స్వామి అనుగ్రహం ఇచ్చి ఉంటే అది ఉండనే వుంటుంది. అది ఎక్కడికీ పోదు.'' అని చెప్పి మరుసటి స్టేషనులో దిగిపోయాడు. శాస్త్రికి స్వామియే అరూపులో వచ్చి తన్ను ఓదార్చినట్లు మనస్సుకు తోచింది. ఇంతలో చిదంబరము వచ్చింది. అక్కడదిగి నటరాజదర్శనం చేసుకొన్నారు. విచార మేఘములన్నీ శాస్త్రి మనోకాశంనుంచీ దూరమైనవి. నటరాజ తాండవసుఖం శాస్త్రి కొన్ని క్షణాలు అనుభవించాడు.

వెంకటాచలమొదలి సుబ్బలక్ష్మి అనే ఇద్దరు దంపతులు. స్వామియందు చాలభక్తి. ఒకరోజు సాయంత్రం స్వామి మొదలి ఇంటికి వెళ్ళెను. మొదలి ఇంటి వెనుక నాలుగైదు చెట్లుండెను. ''సుబ్బలక్ష్మీ! నీకొక వేడుక చూపిస్తాను రా!'' అనిరి. అంతే ఎక్కడినుండియో నూర్ల కొలది పక్షులు - చిలుకలు, గోరువంకలు, కోయిలలు, కాకులు - నానాజాతుల పక్షులు చెట్లపై వచ్చి వాలినవి. స్వామి వానితో ఆడుకోడానికి ప్రారంభిచారు. ''ఇవన్నీ వానిచోట్లకు పోపనిలేదా? వానిపిల్లలు కాచుకొని ఉండవా?'' అని సుబ్బలక్ష్మి ప్రశ్నించింది. ''అట్లనా? ఐతేసరి'' అని స్వామి ఒక నూలుపోగు తన ఉత్తరీయం నుంచి తీసి విసిరి పోపో అని అన్నారట. అంతే. ఎక్కడిపక్షులు అక్కడకు జారుకున్నవి.

సుందరేశం చెట్టి భార్యను స్వామి చూచినపుడంతా, నీవు యమపట్నం చూచినావా? అని అడిగేవారట. 'ఏమైనా మనం చనిపోతామా?' అని ఆమెకు దిగులుతోచింది. మరొక మారు వెళ్ళినపుడు స్వామి అదే ప్రశ్న అడిగినారు. 'లేదు స్వామీ. చూడలేదు' అని బదులు చెప్పింది.' ఐతే యమపట్నం చూపుతాను చూస్తావా?' అని బదులు చెప్పింది.' ఐతే యమపట్నం చూపుతాను చూస్తావా?' అని అడిగారు. ఆమె తల ఊపింది. స్వామి ఆమె ఎడమచేతిని గ్రహించి, తన నోరు తెరచి 'ఇదో చూడు' అని అన్నారు. స్వామినోట్లో చెట్టి భార్యకు ఘోర నరకము, వికృతాకారులు, నానావిధములైన రోదనలు, ఒడలుకంపించే దృశ్యాలు కనవిన వచ్చెను. ఇక చూడలేక చెట్టిభార్య మూర్ఛపోయినది. ఐదు నిముషములవఱకు స్మృతి రాలేదు. స్వామి తన ఉత్తరీయంతో ఆమె ముఖముపై విసిరి నారు. ఆమె తర్వాతలేచి ఇంటికిపోయి ఈ విషయం చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయారు.

కొన్ని రోజుల తర్వాత మద్రాసులో ఒకపెళ్ళికి ఆహ్మానం వచ్చింది. స్వామి ఉత్తరువు తీసుకొని వెడుదామని స్వామిని అడిగింది 'నీవు వెళ్లవద్దు' అని అన్నారు. వెళ్ళకూడదనే మొదట తీర్మానించు కొన్నది. కాని పెళ్ళికి రెండు మూడు రోజులముందు బంధువులతో మనస్తాపం వస్తుందేమో అని స్వామిమాటత్రోసి మదరాసు వెళ్ళింది. వెళ్ళిన మరుసటి దినమే కలరా తగిలి మరణించింది. యమలోకదర్శనముచే స్వామి ఆమెకు రాబోవు విపత్తును సూచించారు. తిరువణ్ణామలెలోనే ఉండివుంటే స్వామి రక్షించేవారేమో. విధిబలీయం. స్వామి మాట ఆమె చెవికి ఎక్కలేదు.

వెంకటాచలం మొడలి ఒకమారు చెన్నపట్టణం వెళ్ళ వలసివచ్చింది. ఊర్లో అపుడు దొంగలభయం. 'స్వామీ ఐదారురోజులు నేను ఊళ్లోవుండను. ఇంట్లో భార్యవంటరిగా వుంటుంది. మీరు ఆమెక్షేమాన్ని గమనించవలసినది' అని ప్రార్థించినాడు. స్వామి సరే అన్నారు.

ఒకరోజు రాత్రి సుబ్బలక్ష్మితో - 'రేపురాత్రి ప్రక్క యింట్లో దొంగతనం జరుగుతుంది. నీవేమీ భయపడవద్దు. నేను తోడుగా ఇక్కడే అరుగుమీద పడుకొంటాను- ' అని అన్నారు. ప్రక్క ఇంట్లోని పెద్దమనిషి, తనకున్న బంగారునంతా కరగించి, మూసపోసి ఆ బంగారుకడ్డీని తనతలగడలో దాచి వుంచాడు. ఈ కిటుకు తెలిసిన మరొక పెద్దమనిషి దానిని మరుసటిరోజు తస్కరించాడు. దొంగతనము జరిగిన పిదప అతడు లబో దిబో అని ఏడుస్తుంటే - స్వామి 'సుబ్బలక్ష్మీ ! చూచినావా? దొంగ రానూ వచ్చాడు పోనూపోయాడు. నీవు దిగులుపడకు. నేను వున్నానుకదా!' అని అభయవాక్కులు పల్కినారట.

ఇది జరిగిన మరుసటిరోజు పదుకొండు గంటలకు రాత్రి స్వామి సుబ్బలక్ష్మి యింటికి వచ్చిరి. ఇంట్లో స్వామి అంటే అందరికీ భక్తి. భక్తి విషయంగా సుబ్బలక్ష్మికూడ ఏవైన ప్రశ్నలు వేస్తూ వుండేది. స్వామి సుబ్బలక్ష్మితో - 'నీకు బ్రహ్మ విష్ణుమహేశ్వరులను అమ్మవారిని, ఇంద్రాదిదేవగణాన్ని అందరినీ చూపుతాను. పడుకో' అని ఆమె ఎదపై తనకుడిచేతి నుంచి - 'ఇపుడు చూడు' అని అన్నారట.

ఆమెకు మగతకప్పినది. ఏవో శంఖధ్వనులు, ఘంటా రావములూ వినవచ్చినవి. అమృతప్రవాహము, విద్యుత్కాంతులు, రసమయగోళములు కనపడినవి. వానిమధ్య ఒక తెల్లని ఏనుగు. దానిపై ఒక సుందరాకారుడు. ఇదో చూడు. రుద్రుడు, పార్వతి, విష్ణువు, - అని స్వామి అంటూ ఉన్నారు. ఆమె చూడలేక మూర్ఛపోయింది. వెంటనే స్వామి తనచేయి తీసివేసి, 'ఊ! నీకు చూచే భాగ్యం లేదు. కర్మ క్షయం కాలేదు. బాగా గురకపెట్టి నిద్రపో' అని వెళ్లి పోయారు. ఆ రాత్రి అంతా సుబ్బలక్ష్మికి నిద్రపట్టలేదు. దివ్య దర్శనంతో రెండు కళ్ళకూ చూపు పోయింది, క్రిందాపైనా పడుతూ, తడుముకొంటూ నడుస్తూ ఉంటే, మరుసటిదినము 11 గంటలకు స్వామి వచ్చి, సుబ్బలక్ష్మిని చూచి 'భయపడకు. నీ దృష్టి మరలవస్తుంది.' అని తన ఉత్తరీయముతో ఆమె కండ్లు తుడిచినారు. ఆమెకు పోయన చూపు తిరిగివచ్చింది.

&. సుబ్రహ్మణ్యయ్యరు శ్రీవిద్యోపాసకులలో ప్రసిద్ధులు, ఉపాసనా విధులపైనా శ్రీవిద్యారహస్యములనుగూర్చీ ఆయన ఎన్నో పుస్తకాలను వ్రాశారు. శ్రీనగరవిమర్శ, గురుతత్త్వవిమర్శ అను గ్రంథములు వారివే. మంత్రశాస్త్రములో ఆరితేరిన చేయి. కర్మానుష్ఠానములను అనుసరిస్తూ, శిష్యులకు మార్గదర్శిగా ఉండేవారు. శేషాద్రిస్వామిపై చాల భక్తి.

అయ్యరు ఒక సందర్భములో స్వామిని దర్శించుటకు వచ్చారు. 'రేపు ఉదయం ఇలయనార్‌ కోవెలకురా' అని స్వామి ఆదేశించారు. బ్రాహ్మముహూర్తంలో అయ్యరు స్వామి దర్శనానికి వెళ్ళారు. అప్పుడొక విశేషం జరిగింది. స్వామిని అయ్యరు చూస్తుండగా, స్వామి వారికి పరాశక్తి రూపంలో దర్శనమిచ్చారట. శ్రీ విద్యోపాసకుడైన అయ్యరుకు బ్రహ్మానందమైనది. స్వామి అప్పుడే వారి కేదో ఉపదేశముకూడ చేసిరట.

నటేశయ్యరు స్వామికి బంధువు. అతని కుమారునకు విషజ్వరమూ దానితో బాటు మసూచియు శోకెను. మసూచితో బాలునికి కనులు గవ్వలవలె పైకిలేచి దృష్టి పొయెను. వైద్యమెంతచేసిననూ ఫలము కనపడలేదు. ఒకరోజు అయ్యరు స్వామివద్ద మొరపెట్టుకొన్నాడు. 'సరే పిల్లవానిని నావద్దకు తీసుకొనివచ్చి వదిలిపో'' అని అన్నారట. 'ఇప్పుడే తీసుకొని వస్తాను' అని అయ్యరు బయలు దేరాడు. 'నా వద్దకు అనగా ఇక్కడకు కాదు - అమ్మవారి సన్నిధిలో వదలిపెట్టు' అని స్వామి అన్నారు.

అయ్యరు అమ్మవారి ఆలయానికి పిల్లవానిని తీసుకొని వెళ్ళి, అర్చకులతో స్వామిమాటలు చెప్పాడు. అర్చకులు రాత్రి పూజాదికములుకాగానే పిల్లవానిని గర్భగుడిలో వదలి తలుపులుమూసుకొని వెళ్ళిపోయిరి. ఉదయము గర్భగుడి తలుపులు తెరవగానే పిల్లవాని కనులు చిత్రముగా నయమై యుండెను. చాలరోజులు ఊరివారు ఈ అద్భుతమును గూర్చి చెప్పుకొనుచుండిరి.

వెంకటరామనుకు పదహారేళ్ళు. సంధ్యావందనం పూర్తికాగానే అమ్మవారిగుడికి వెళ్లి దర్శనం చేసుకొనే అలవాటు. గర్భాలయమువద్ద వానికి స్వామి కనపడ్డారు. 'ఎక్కడకు వెడుతున్నావు?' అని స్వామి ప్రశ్న. 'అమ్మవారిదర్శనం కోసం.' 'అమ్మవారిదర్శనం ఇక్కడే చేస్తావా?' 'ఆ. మీరు చూపగల్గితే.' స్వామి వానికడ్డంగా నిలుచుని కండ్లుమూసి, 'ఇపుడు చూడు' అని అన్నారు. వాని మనోనేత్రాలను ఆపీతకుచాంబ దర్శనమిచ్చింది. 'అమ్మవారు ఏరంగు చీరకట్టుకొని ఉన్నది.' అని స్వామి ప్రశ్నించారు. 'పసుపు చీర' అని వెంకటరామను. 'కంఠంలో వున్నది ఏమిమాల' 'మల్లెమాల' 'అమ్మ వారి ఆభరణాలో?' ''శిరస్సులో కిరీటం. ఒడిలో వడ్యాణం, కాళ్ళకు గొలుసులు.'' ''ఇక లోపలికి పోయి చూడు'' అని స్వామి అన్నారు. ఆపిల్లవాడు లోపలికిపోయి చూచేసరికి, తాను బయట ఏవిధంగా అమ్మవారిని చూచాడో, ఆదే విధమైన చీరతో, అలంకారాలతో, అభరణాలతో, ఆమె వున్నది. వాని ఆశ్చర్యం ఇంతా అంతా కాదు. తన అనుభవాన్ని గర్వంగా స్నేహితులతో చెప్పుకొన్నాడు.

మధురలో ఒక సౌరాష్ట్ర కుటుంబం. వారికి పిల్లలు లేరు. క్షేత్రదేవత మీనాక్షిపై ఆ దంపతులకు ఐకాంతిక భక్తి. తమ అనపత్యమునుగూర్చి మీనాక్షితో మొరపెట్టుకొన్నారు. ఒకరోజు కలలో మీనాక్షి కనపడి తిరువణ్ణామలెకు పోయి శేషాద్రిస్వామిని దర్శించండి. అని ఆ దేశ మిచ్చింది.

మరుసటిరోజే వారు తిరువణ్ణామలె వచ్చి చేరారు. స్వామికి నమస్కరించి నిలుచున్నారో లేదో, స్వామి - ''మిమ్ములను నావద్దకు మీనాక్షి పంపినదా?'' అని అడిగారు. వారు చకితులైరి. ఇరువురిని దగ్గరకు పిలిచి కొంగుముళ్ళు వేసి ''ఇక పోయి రావచ్చును'' అని అన్నారట. వాళ్ళు సెలవుతీసుకొని నాలుగు అడుగులు వేసేసరికి స్వామి వారి దగ్గరకు పోయి కొంగుముళ్ళు విప్పి, ''మీఅభీష్టం సిద్ధిస్తుంది. పుత్రప్రాప్తి ఔతుంది'' అని అన్నారట. ఇదిజరిగిన సంవత్సరానికి ఆ దంపతులకు ఒక మగపిల్లవాడు పుట్టినాడు. పిల్లవానికి శేషాద్రి అని పేరుపెట్టుకొన్నారు.

పై సంభవములవల్ల, శేషాద్రిస్వామికీ, పరదేవతకూ అభేదమని తెలుస్తున్నది. అందులకే తెలిసిన కాళిదాసు - 'దయమాన దీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయాం' అని వ్రాసినది. అమ్మ గుణనిధియే కాదు, గురుమూర్తి కూడ.

Sri Seshadri swamy jevitam    Chapters    Last Page