Sri Seshadri swamy jevitam    Chapters    Last Page

11. స్వామి వైద్యమహిమలు

స్వామి ఈ విధముగా తన మహిమలను చూపి, ప్రజలకు దైవమునందు నమ్మకము పుట్టించి వారి బాధలను తొలగించేవారు. వైద్యులు చేయివదలు కొన్న రోగములన్నీ స్వామి చేతిలో చిటుకలో నివారణ అయ్యేవి. అందు మందు కాదు ప్రధానము. వారి అనుగ్రహమే. ఒకొక్కప్పుడు తాను తినుచున్నది వచ్చినవారి చేతిలో బెట్టగా, అదే ముందుగా పనిచేసేది. ఒక్కొక్కప్పుడు ఆకులు, మూలికలు పేర్లను చెప్పి వానిని సేవించమ నేవారు. ఈ వైద్య కాండలోని అనుభవములు కొన్ని.

తాండ్ర గ్రామములోని కృష్ణస్వామి భార్యకు పాండు రోగము. ఒళ్ళువాచి వాంతులగుచుండెను. వమనములో పురుగులు పడెడివి. ఎందరు వైద్యులకు చూపినను ప్రయోజనము కనపడలేదు. ఈ బాధ చూడలేక భార్యను గుఱ్ఱపు బండిలో పిలుచుకొని వచ్చెను. స్వామి ఏదీచూదమని బండి ఎక్కి అవ్యాధిగ్రస్తురాలి కాళ్ళను కడుపును గొంతును త్రొక్కుకొనుచు బండి ముందుకు జరిగి, గుఱ్ఱపు బండిని వడి వడిగా సత్రము వఱకు తోలి, దడాలున దుమికి రెండు పిడికెళ్ళ మన్నును బండిలోనికి విసిరిరి. పిడికెడు మన్ను ఆమె నోటిలో పోసిరి. రెండు పిడికెళ్ళ మన్ను ఇచ్చి మూడు రోజులు వరుసగా ఒంటికి పూసుకొనమనిరి. ఈ చికిత్స చేసిన నాలుగవరోజున ఆమెకు వ్యాధి నిమ్మళించి స్వస్థురాలయ్యెను.

చెంగల్వరాయుడు తిరువణ్ణామలె క్రిమినల్‌ కోర్టులో ప్లీడరు. కొంతకాలమునకు ఈయన సన్యాసము కూడ పుచ్చుకొన్నాడు. రావుబహుదూరు శివచిదంబం పిళ్ళె ఈయనకు స్నేహితుడు. పిళ్ళె కుమార్తెకు సన్నిపాతజ్వరము. వైద్యులు బ్రతుకుట కష్టమనిరి. పిళ్ళె చెంగల్వ రాయనితో ఈ విషయం చెప్పుకొన్నాడు. స్వామి ఇలయనార్‌ గుడిలో ఉండగా చెంగల్వరాయుడు స్వామితో పిళ్ళెకుమార్తె దేహస్థితిని చెప్పి మీరు అనుగ్రహించవలెనని ప్రార్థించెను. స్వామి ఆలయమందున్న మూర్తిని చూపి, ''అక్కడ చెప్పుకో, నాతో చెప్పి ఏమి ప్రయోజనం?' అని అన్నారు.

వెంటనే చెంగల్వరాయుడు ఒక వెణ్బావృత్తమును (వెణ్బా అనునది ద్రావిడ భాష ఛందస్సులో ఒక వృత్తజాతి) నాలుగైదు మార్లు సుబ్రహ్మణ్యశ్వరుని ముందు పఠించి కర్పూరహారతినిచ్చి స్వామివద్దకు రాగా 'పోపో' 'సాయంత్రం లోపుగా గుణమౌతుంది' అని అన్నారట. ఆ రోజు సాయంత్రమే ఎదురుచూడని రీతి ఆ అమ్మాయకు నయమయినది.

మరొక సమయంతో పిళ్లె రెండవ కుమార్తెకు వదలక వాంతులగుచుండెను. స్వామిని అడుగగా ఉసరిక కాయ, మిరప కాయలనూ వాడితే నమమౌతుందన్నారు. మూడేళ్ల పసిపాపకు ఈ వైద్యం చేయుట ఎట్లు అని ప్రశ్నించగా భస్మము చేసి ఇస్తే సరిపోతుందని స్వామి అన్నారు. ఈ చికిత్సతో పిళ్ళె కుమార్తెకు పూర్తిగా నయమయినది.

చెంగల్వరాయనికే ఒకమారు వాయువునొప్పులు వచ్చి కాళ్ళువాచి నడువలేకుండెను. స్వామి అతని కాళ్ళను తడివి 'సరిఐపోతుందిలే' అని అన్నారు. సాయంత్రం అయ్యేసరికి కాళ్ళ వాపుతీసి సులభముగా అతడు నడువకల్గెను.

కృష్ణమూర్తి గ్రామమున్సీఫ్‌, ప్రతిసంవత్సరమూ అతడు గజ్జితో బాధపడేవాడు. ఈ గజ్జి ఒకనాటిది కాదు. పదేళ్లుగా ఉంది. స్వామివ్యాధులను అన్నిటినీ తీరుస్తున్నాడు అన్న వార్తవిని తిరువణ్ణామలె వచ్చినాడు. అతడు స్వామిని చూచినది లేదు. హోటలులో అతడు సర్వరును కాఫీ తెమ్మనెను. సర్వరు మేజాపై కాఫీ ఉంచినాడోలేదో, ధూళి ధూసరితుడైన ఒక వ్యక్తి ఆలోటాను లాగుకొని తననోట పోసుకొన్నాడు. కృష్ణమూర్తికి కోపం వచ్చింది. ఎట్లాగో అణచుకొన్నాడు. ఆమనిషి - 'గజ్జియా? పాపం చాలబాధ కదూ? కుంకుమపూవు పూయరాదూ? పోతుంది.' అని వెళ్ళి పోయాడు., తర్వాత సర్వరు ఆమనిషి శేషాద్రిస్వామి అని కృష్ణమూర్తితో చెప్పాడు. 'అయ్యో! మనం ఆయనను పూర్తిగా కాఫీత్రాగమని కూడ చెప్పలేదే?' అని కృష్ణమూర్తి నొచ్చుకున్నాడు. కాని ఈ చికిత్సతో అతని వ్యాధి శాశ్వతంగా నయమైంది.

సుబ్రహ్మణ్యయ్యరు మరదలుపిల్లకు నిషేకమాది పది సంవత్సరములు ఒక పిశాచము ఆవహించి యుండెను. సంతతి లేదు. వికారపు నవ్వులు, ఆకారణ రోదనము, దేహకార్శ్యము తీర్థయాత్రలు సేవలు చేసిరి. ప్రయెజనము కనుపించలేదు. మంత్రవైద్యులూ చేయి వదులుకొన్నారు. స్వామివద్దకు ఆ పిల్లను పిలుచుకొని పోయిరి. స్వామి ఐదారు పసుపుకొమ్ములు తెమ్మని చెప్పి వానిని తనరొమ్మునకు రాచుకొని వానిని ఇచ్చి వానినిరాచి గంధపుపూత ఒంటికి పూయమనిరి. అట్టుచేయగా ఆపిల్ల ఒక పెద్ద గావు కేకపెట్టి. 'ఆకలి, ఆకలి' అని అరచినదట. ఆహారము తీసుకొనిన పిదప ఆ పిల్ల స్మృతికి వచ్చెను. ఆనాటి నుండి ఆరోగ్యము కోలుకొని అచిరకాలములో స్వస్థురాలు కాగలిగెను.

ఎచ్చమ్మ రమణభక్తురాలు. ప్రతిరోజూ రమణమహర్షికి ఆహారము పంపుట ఆమె నియమము. ఒకపుడు ఆమెకు ఒక నెల దినములు జ్వరము కాచినది. స్వామి తరచు ఆమె ఇంటికి వెళ్లుటకద్దు. ఆ నెలరోజులు స్వామి వెళ్ళనందున ఎచ్చమ్మ పెంపుడు కూతురు చెల్లమ్మ స్వామిని దర్శించి 'అమ్మకు, నా పాపకు ఒళ్ళుబాగాలేదు. అమ్మ మిమ్ములను ఒకమారు రమ్మన్నది' అని చెప్పినది. 'రేపు వస్తానుపో, అన్నారు స్వామి.

మరుసటిరోజు ఉదయం ఆరుగంటలకు స్వామి ఎచ్చమ్మ ఇంటికి వెళ్ళారు. ఎచ్చమ్మ పడకలో ఉన్నది. స్వామి ఎచ్చమ్మా! పెరుగన్నము తింటావా?' అని అడిగి చెల్లమ్మను పెరుగన్నము చేసి తెమ్మనెను. చెల్లమ్మ పెరుగన్నము తీసుకొని రాగా ఒక కబళము తననోట వేసుకొని మిగిలినది ప్రసాదముగా నిచ్చెను. ఆనాటినుండి ఎచ్చమ్మకు ఆమె మనుమనికి రుగ్మత తొలుగుటకు ప్రారంభించెను.

ఎచ్చమ్మ మనుమడు రమణునికి కాలుబెణకినది. పిల్లవాడు లేవకుండెను. వానినెత్తుకొని ఎచ్చమ్మ ఆసుప్రతికి బయలుదేరెను. స్వామి త్రోవలో కనపడి రెండు చేతులతో మన్ను తీసి బాలుని కాలుపై పోసి, అమట్టినే బాలునినొసట బొట్టుపెట్టిరి. 'ఆసుపత్రికి పోవుచున్నావా? పోపో' అనిరి. ఆసుపత్రిలో డాక్టరు పిల్లవానిని నడువమనగా, ఏ బాధయూలేక నడువసాగెను. పిల్లవానికి ఏమీ లేదని డాక్టరు అనగా స్వామి మృచ్చికిత్సతో పిల్లవానికి నయమైనదని ఎచ్చమ్మ గ్రహించెను.

తాలూకా బోర్డు ప్రెసిడెంటు వెంకటసుబ్బయ్య బావమరిదికి దేనియందును నమ్మకము లేదు. మొరటుతనము, వితండవాదము చేసే స్వభావము కలవాడు. స్వామి అనిన భక్తి కాని గౌరవము కానీ లేదు. ఒకరోజు మధ్యాహ్నము అతనికి చేతిలో తేలుకుట్టినది. బాధకు కుయ్యెమొఱ్ఱో అని ఏడ్చుచుండగా స్వామి ఎచ్చటనుండియో వెంకటసుబ్బయ్య ఇంటికివచ్చిరి. స్వామిని చూడగానే - అందరూ మిమ్ములను 'స్వామి, స్వామి అంటున్నారుకదా? నా బాధ పోగొట్టండి చూద్దాం' అని స్వామి చేతులు పట్టుకొన్నాడు. స్వామి నవ్వుచూ 'సరే, ఎడమ చేతితో మన్నుతీసి కుట్టినచోట పోయి' అని అన్నారు. అతడు మన్నుతీసుకొని 'ఊ మంత్రం చెప్పండి.' అన్నాడు. స్వామి 'శేషాద్రి - అని నా పేరు చెప్పు' అన్నాడు. స్వామి 'శేషాద్రి - అని నా పేరు చెప్పు' అని నవ్వుతూ అన్నారు. అతడట్లు చేయగానే చిత్రముగా అతని బాధ తగ్గిపోయెను. ఆనాటి నుండి అతనికి స్వామిపై నమ్మకము కుదిరి అత్యంత సన్నిహితుడాయెను.

విషబాధ స్వామి ఇతరులకు తొలగించటమే కాదు, స్వవిషయమునకూడ ఆయన విషజయము కలిగి యుండెను. ఒకపుడు పై చెప్పిన వెంకటసుబ్బయ్యరు అలమారు తెరచి, ఒక సీసా క్లోరోడైన్‌, మరొకసీసా టించర్‌ అయోడిన్‌ ఉండగా వానినెత్తి గుటగుట త్రాగి వేసెను. వెంకటసుబ్బయ్య ఏమగునో యని తత్తరపడుచుండగా మరొక సీసా తెరచి, దానిని నెత్తిమీద పోసుకొని పులుముకొని తనదారిని వెళ్ళిపోయెను. త్రాగిన మందులు వారిని ఏమీచేయజాలక పోయెను.

Sri Seshadri swamy jevitam    Chapters    Last Page