Sri Seshadri swamy jevitam    Chapters    Last Page

ఓం

10. శ్రీశేషాద్రిస్వామి జీవితము

మూకోపి జటిల దుర్గతి శోకోపి స్మరతి యః క్షణం భవతీం |

ఏకోభవతి సజంతు ర్లోకోత్తర కీర్తి రేవ కామాక్షి ||

ఆర్యాశతకము.

కంచీమండలము భారతదేశములో ఆధ్యాత్మానికి పుట్టినిల్లు. దీని విస్తీర్ణము నాలుగువందల మైళ్ళు. ఈ ప్రదేశమునకు తొండమండల మని కూడ పేరు. నాలుగు దిక్కులలో నాలుగు పుణ్యస్థలములు - విరించిపురము, మహాబలిపురము, దేవకీపురము, దేవపురము. ఈ మండలమందే వెలసినవి. ఒక వంక పయస్విని, (పాలారునది) మరొక వంక దక్షిణపినాకిని (దక్షిణపెన్న) కాంచీమండలములో ప్రవహిస్తూ జనులకు భౌతిక సంపద నేకాక, పారమార్థిక ఐశ్యర్యంకూడా కల్గిస్తున్నది. ఈ స్రోతస్వినుల మధ్య ముత్యాలహారము నడిమిలో మణిపూస వలె కంచీపురము విలసిల్లుతున్నది.

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా |

పురీ ద్వారవతీ చైవ సపై#్తతే మోక్షదాయికాః||

అన్న శ్లోకం ముక్తిప్రదములైన సప్తక్షేత్రములలో కంచి ఒక్కటి అని ఉద్ఘాటిస్తున్నది.

పురాణములు కంచిని బ్రహ్మపురమనీ, ధర్మక్షేత్రమనీ వర్ణించినవి. కంచిలో వేలకొలది శివలింగ ప్రతిష్ఠ లున్నవి. ఎన్నో పుణ్యతీర్థము లున్నవి. ఏకామ్రనాథుడు వెలసిన క్షేత్రము ఇదే. ఈ ఆమ్రవృక్షము మహాప్రళయమందుకూడ నష్టము కాక మార్కండేయ మహర్షిని రక్షించినదని పురాణ ములు చెబుతున్నవి. ఏకామ్రనాథుని అర్థాంగి - శ్రీచక్ర రాజ దేవత - త్రిపురసుందరి. కామాక్షి ఆలయము ఈ క్షేత్రమందే కలదు. అంతేకాదు. అసంఖ్యాక జీవకోటి రక్షణభారము వహించిన వరదరాజ పెరుమాళ్ళు వాసస్థానమూ ఇదే. ఈ పురనిర్మాణమూ శ్రీ చక్రాకృతిలో ఉన్నదని తెలిసినవారు అంటారు.

బిందుస్వరూపము, గురుమండలము, దాని చుట్టూ నవా వరణలు కల ఆకృతియే శ్రీ చక్రము. కామరాజపీఠము. లేక భూయోని అని పిలువబడే శ్రీ కామకోటి పీఠమే కంచిని బిందు స్థానము. బిందుస్థానము చుట్టు ఏకామ్రనాథుడు, బ్రహ్మహస్తివరదుడు, హయగ్రీవుడు, భృగువు, అగస్త్యులు వ్యాసులు, మార్కండేయులు మొదలైన దేవతలు, ఋషులూ గురుమండలముగా ఏర్పడి ఉన్నారు. వికటచక్కవినాయకుడు కుమారస్వామి, కృష్ణభగవానులు, ఆవరణ దేవతలు, అవతార పురుషులు, యోగులు, జ్ఞానులు, సిద్ధులు, ఈ క్షేత్రాన్ని అన్వేషించి ఇక్కడే స్థిరంగా ఉండి పోదామని కోరుకొనుట వింత కాదు. శ్రీ శంకర భగవత్పాదులు సైతము దిగ్విజయానం తరము ఈ పట్టణమందే చాలరోజులు వసించిరని ప్రతీతి. ఆసమయమున కామరాజపీఠమున కళాకర్షణ చేసి ఉపశాంతి చేసిరట; వివిధ మార్గగామియైన హైందవమును వైదికముచేసి తద్రక్షనకై గురుపీఠమును ఆచార్యులు ఏర్పరచిరి. వారి వీక్షణతో ఈ క్షేత్రము మరింత వాసికెక్కి ముముక్షువులకు ఆశ్రయణీయమైనది.

గురుమండల మనగా సద్గురుమూర్తుల సమూహము. పూజాక్రమములో గురువులును మండలాకృతిగ అమర్చి అరాధించుటయే గురుమండలము. 'ఆచార్యదేవోభవ' అన్న వాక్యము శ్రుత్యనుశాసనము. కాలావసరమునుబట్టి అవతార పురుషులు, ఋషులు జన్మిస్తున్నారు. శ్రీమన్నారాయణుడు, బ్రహ్మ, వసిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసులు, శుకులు గౌడపాదులు, గోవిందభగవత్పాదులు, శంకరులు, పద్మపాదలు, హస్తామలకులు, తోటకాచార్యులు, సురేశ్వరులు, ఆనందగిరి, వాచస్పతి, అమలానందులు, అప్పయ్యదీక్షితులు, మధుసూదనసరస్వతి, రామానందులు, భాస్కరులు, సదాశివ బ్రహ్మేంద్రులు గురుపరంపరకు చేరినవారు.

గురుమండలము దివ్యౌఘము, సిద్ధౌఘము, మానవౌఘము అని మూడు తెగలు. బ్రహ్మనారాయణుడు దివ్యౌఘమునకు చేరినవారు. వసిష్టులాది శంకరులపర్యంతము సిద్ధౌఘ మునకు చేరినవారు. ఇతరులను మానవౌఘమునకు చేరినవారని చెప్పుటవాడుక. ఈ విభాగము శ్రీ విద్యోపాసనా సంప్రదాయము.

ఈ గురుమండలములో శంకరభగవత్పాదులు సుప్రసిద్ధులు. వారు కంచిలో వాసమేర్పరచుకొని లోక క్షేమార్ధము శ్రీవిద్యాక్రమమును నెలకొల్పిరి. అద్వైతాచరణకు శ్రీవిద్య మొదటి మెట్టు. అందుచే శిష్యులకు శ్రీవిద్యారహస్యములను స్వయముగా ఉపదేశించి మంత్ర యంత్రముల వ్యాప్తి తమ పర్యవేక్షణ క్రింద జరుగునట్లు చూచిరి. వారు స్వయముగ ప్రపంచసారము. సౌందర్యలహరి, లలితాత్రిశతీభాష్యము వ్రాసిరి. శ్రీకామాక్షియందు ప్రజలకు భక్తి కుదురుటకై కొన్ని ఉపాసనాక్రమములను ఏర్పరచి; అర్హతకలవారిని నిష్ణాతులను జేసిరి. శ్రీ విద్యోపాసన అవిచ్ఛిన్నముగా జరుగుటకు తగిన జనులు కంచిలో లేకపోగా, నర్మదాతీరమునుండి పరంపరగా శ్రీవిద్యోపాసన చేయుచూవచ్చిన, ముప్పది కుటుంబములను కంచికి తరలించుకొనివచ్చి, కామాక్షిదేవి క్రియాయోగమును వారికి ఉపదేశించి, అనుష్ఠించునట్లు చేసిరి.

ఆచార్యుల ఆజ్ఞప్రకారము ఈ ముప్పది కుటుంబముల వారు శ్రీకామాక్షీదేవిని శ్రద్ధాభక్తులతో ఆరాధింప సాగిరి కర్ణా త్కర్ణోపదేశేన సంప్రాప్తం అవనీతలం' పుత్ర పారం పర్యగ శిష్యపారంపర్యగా శ్రీవిద్య సంప్రాప్తించి వ్యాప్తి చెందినది. ఇట్లు శ్రీవిద్యా ఉపాసకులైన కుటుంబములకు కామకోటి వారన్న బిరుదుకూడ ఏర్పడినది.

కామకోటి వంశములో పుట్టిన వారందరూ పాంగో పాంగ వేదాభ్యాసం చేసినవారు. పురాణతిహాసములను ఆకళించుకొన్నవారు. వైదికాచరణ, శ్రీవిద్యోపాసన, త్రిపుర సుందరీపూజ వీరి నిత్యాచరణయై యుండెను. ఈ ముప్పది కుటుంబములలో పదికుటుంబములు పౌరకుత్ప గోత్రులు. పది కుటుంబములు కౌండిన్య గోత్రులు, తక్కిన పదికుటుంబములు కౌశిక గోత్రులు. అనగా సగముమంది అష్టసహస్ర శాఖీయులు. తక్కినసగము పడమశాఖీయులు. కాలక్రమమున ఈ పరంపర క్షీణించి పౌరకుత్సులలో ఒక కుటుంబము, కౌండిన్యులలో ఒక కుటుంబము మాత్రము మిగిలెను. ఈ రెండు కుటుంబములు లోకమున అధర్మము ప్రబలినను, పూర్వ సంప్రదాయములను వదలక పాటించుచూ వచ్చినవి.

ఆ కాలమునందు విజయనగరము, వేలూరు, ఆర్కాటు, తంజావూరులలో రాయలవంశమువారు, నాయక వంశమువారు మహారాష్ట్రీయులు మండలాధిపతులై యుండిరి. ఈ సంస్థాన ములలో పై చెప్పిన కుటుంబముల వారు మంత్రులుగను, పూజారులుగను, ఆస్థానవిద్వాంసులుగను, ప్రశస్తినొందిరి. శ్రీ విద్యా దీక్షులగుటచే వారు నిగ్రహానుగ్రహదక్షులేకాక, గణితము, హోర జ్యోతిషము, జాతకము మొదలగు శాస్త్రములలో చక్కని పాండితికలవారై యుండిరి.

ఇట్లు ప్రసిద్ధి చెందిన వారిలో ముఖ్యులు, జోస్యము సుబ్బరాయలు, దేవరాయజోస్యులు, శేషాద్రిజోస్యులు, వెంకటరమణశాస్త్రి, కామకోటిశాస్త్రి, కీ. వె. 1500 సంవత్సరముల పిదప ఈ వంశమువారు కొన్ని సంస్థానాధిపతుల వేడుకోళ్ళను మన్నించి శ్రీవరదరాజస్వామి పెరుమాళ్ళ సన్నిధిలో పంచాంగపఠన కైంకర్యమునకు ఒప్పుకొనిరి. దాని ఫలితముగ భూగృహవసతులు, వాహనములు, బిరుదులు, మాన్యములు వీరికి సంక్రమించెను. పైగా వీరు వైష్ణవోచితమైన కొన్ని సంప్రదాయములను అంగీకరింపవలసి వచ్చెను. ఇటు లౌకిక వాసనలు అధికమైనను, పరంపరగా లభించిన శ్రీవిద్యాసిద్ధీ, అద్వైతానుభవమూ వీరికి కొరవడలేదు. ఇట్లు కొన్ని సంవత్సరములు గడచెను.

కలిప్రాబల్యము చేత శైవవైష్ణములకు వైషమ్య మేర్పడెను. కొందరు వీరవైష్ణవులు, తపముద్రాంకములేని కామకోటి వంశమువారికి వరదరాజసన్నిధిలో కైంకర్యమునకు అర్హత ఏదని ప్రశ్నించిరి. తప్తముద్రాంకణము, వేదమార్గ బాహ్యమనియు, తమ పూర్వీకులకు అనభిమతమనియు, దానిని తా మొల్లమని కామకోటివారు మాన్యములను వదులకొనిరి అందుచె వారి కలిమితగ్గెను. కొందరు సంపదలు సంకట హేతువులని బీదలకు దానమిచ్చిరి. శికంచి, విష్ణు కంచిలో నుండిన రెండు ఇళ్ళను మాత్రము విక్రయించక స్వాధీనములోనే యుంచుకొని, సాంసారికులైనను, బంథరహితులై, యదృచ్ఛా లాభ సంతుష్ఠులై జ్ఞానవైరాగ్య సంపన్నులై జీవితము కామ కోటివారు గడపరి.

ఈ సమయ మున మతవిషయిక కలహములు హెచ్చెను. దైవభక్తి ప్రజలలో అంతరించెను, ఆచారానుష్ఠానాదుల క్షీణించుచూ వచ్చెను. దీనిని ఆకట్టుటకు దైవానుగ్రహ సంపన్నుడైన ఆచార్యుని అవసరము కలిగెను. ఈ లోపమును పూర్తిచేయుటకో అనునట్లు కామకోటి వంశమున క్రీ.శ. 1790 లో కామాక్ష్యానుగ్రహమున కామకోటిశాస్త్రి జన్మించెను. బాల్యముననే ఆయన కులవిద్య శ్రీవిద్యలో సిద్ధిపొందెను. వేదములు పురాణతిహాసస్మృతులు, మీమాంసా తర్క వ్యాకరణములను మథించి, ఆయన చక్కని వ్యుత్పత్తి సంపాదించెను. వేదాంత విషయములలో ఏ ప్రశ్ననైనను అవలీలగా చెప్పగల దక్షుడాయన.

కామకోటిశాస్త్రి అహితాగ్ని. ఉదయము స్నానవిధులను పూర్తిచేసి, సహస్రగాయత్రి జపించి, అగ్ని కార్యముల జేయును. అనుష్ఠానములందు ఏమరిక అనుట ఎరుగడు. ఆయనకు లెక్కలేని శిష్యులు, ఆయన కుటీరము ప్రాచీన గురుకుల వాసమును తలపింప జేయును. ఆధార్మకమూర్తి ఊరివారికి ఆదర్శప్రాయుడు.

కామకోటి శాస్త్రికి గాంధర్వకళలో ఎనలేని ప్రవేశము. అది కామాక్షి అనుగ్రహము. దేవీ సమక్షమున శాస్త్రి రాగ తాళలయముక్తముగా స్వకీయమైన కీర్తనలు పాడేవారు. ఆ రాగసుధలో శాస్త్రి తన్మయులై, సమాధ్యవస్థలను భవించే వారు. విష్ణుపరముగాను, అమ్మవారిపైనను, ఎన్నో కీర్తనలను శాస్త్రి వ్రాసిరి. ప్రతికీర్తనలోను, భక్తి జీవనాడి. ఈ క్రింద శాస్త్రిగారి కీర్తనలు కొన్ని;

కేదారగౌళం - రూపకతాళం

పల్లవి

చిత్సభానాయకం చిత్త భజసాంబం

అనుపల్లవి

భర్జితాంతసమసం నిజభవ్యనటన జీతదుర్గం

పాలితసర్గం భర్గం చిత్సభా ||

చరణం

దివ్యరత్నహారిణం దీనతాపహారిణం భు కిముక్తి కారణం

భవ్యచారిణం కల్పషాపహారిణం కవ్వభీష్ట స్మరణం

కామకోటి సన్నుత శుభచరణం విలస త్కరణం

మునిజనహృదయ విహరణం - చిత్సభా ||

భైరవి రూపకతాళం

పల్లవి

రమాపతే సదాంనతే దయాంమయి ప్రదిశ ||రమా||

అనుపల్లవి

సుమానసాభిరామ మామవానిశం సదమహృదయ ||రమా||

చరణం

సామోద హృషీకేశ చిదానంద మురారే హృది

భూమోదయ మాపాదయ దామోదర భీమార్చిత ||రమా||

సామజ పరదామలగుణ సోమవదన కామఫలద రామ

సుమరదనఘనాఘనాపజయ రమా||

సాధిత దిక్పాల మదప్రాభవ సంరావణ విద్రావణ

హృద్భేద శిరశ్ఛేదన ధౌరేయ విభో - ||రమా||

ఇలా జలా నిలా నలాంబరేందు భానుమండలో జ్జ్వలకలాప

భావితశ్రిత కామకోటినుత శ్రీరమణ కరుణాలయ సుధా

సద్రుచ మృదువచన పురాదిముఖవినుతాపార కృపా కరాచ్యుత

సుగుణ

సరోరుహేక్షణ సుజనసదాశ్రయ అసురదమన

నిరుపమ సుచరితా పరమవ మామకంఠ గరుడగమన ||రమా||

మధ్యమావతి - ఆదితాళం

అంబశివే భవతీ ముపాసే

శంబరవైరి హరాంకనివాసే-

అంబుజ భవనిష్ణు పూజితాసి దిగంబర మపిసాంబ రమాకలయసి

తుంబురముఖ గానలోలే బాలకుచాంబ శంకరినిపీత కాదంబరి

సిద్ధనిచయ మానసాంబుజాత నిబద్ధపతే సురతే పరదే-

సందిగ్ధ మపి యధార్థ మాశు భాసయ వర్ధయ మమబుద్ధీ

మమృత సంభాషిణి - ||అంబ||

సామరనర సంగమత్ర దూరయ శ్రీమదంఘ్రి సేవిసం సుశీలయ

తామరసదళాక్షి కామేశ్వరి కామకోటి వాక్కదంబ సద్గేహిని

||అంబ||

కామకోటిశాస్త్రి భవ్యజీవనము గడుపుచూ ఊరి వారి కందరికి తలమానికమై యుండెను. ఈయన సచ్చరిత్ర. ఆధ్యాత్మిక నిరతి బోధనాపటిమలను చూచి వెలియూరివారు ముగ్ధులై అప్పుడప్పుడు తమ ఊరికి శాస్త్రిని ఆహ్వానించేవారు. వళూరు గ్రామస్థులు, శాస్త్రిగారి వసతికి తగిన కుటీరమును నిర్మించి, ఆహ్వానించిరి. వారి వారి వేడికోలును మన్నించి, శాస్త్రిగారు కంచిని వదలి యావజ్జీవము వళూరునందే స్థిరపడి పోయిరి.

శాస్త్రిగారిది కౌండిన్యస గోత్రము. వారికి పుత్రసంతతి లేదు. శేషమ్మ యనే ఒక పుత్రికమాత్రము కల్గెను. అందుచేత అన్నగారి సంతతినే తన పిల్లలవలె చూచుకొనేవారు. అన్నగారైన చిదంబరశాస్త్రిగారికి వెంకటరమణశాస్త్రి, నరసింహ శాస్త్రి అని ఇరువురు పుత్రులు, సుందరాంబ, మరకతము అని ఇరువురు పుత్రికలు కల్గిరి. వెంకటరమణశాస్త్రి వేదవేదాంతములలో గొప్పవాడనిపించుకొనెను. కొన్ని రోజులు నిర్బంధముతో గృహస్థజీవితము గడపి, అటుపై కాశికి వెళ్ళి సన్యసించి, 1904 లో సిద్ధి పొందెను. మిగతమువ్వురు కన్నవారి ఆదరణలోనే యుండిరి.

మరకతము అందగత్తె, కుశాగ్రబుద్ధి. కామకోటి శాస్త్రికి మరకతమన్న చాల ప్రేమ. అందుకు కావ్యనాటకము లను ఆమెకు చెప్పించిరి. అచిరకాలములో ఆమెకు దీనియందు మంచిప్రవేశము కల్గెను. వివాహోచితమైన వయస్సు రాగా విద్యావినయ సంపన్నుడును, రూపసియు, శ్రీవద్యోపాసకుడును, పౌరకుత్స గోత్రజుడును అగు వరదరాజు అనే యువకున కిచ్చి మరకతమునకు పెళ్ళి చేసిరి.

వరదరాజు మరకతముల కాపురము అన్యోన్యప్రేమా శ్రయమై వెలిగెను. సంస్కారవతి యగుటచే, సహధన్మచారిణియై దైవభక్తి కలిగి మరకతము త్వరలో బంధువుల మెప్పు సంపాదించెను. సౌందర్యలహరి, మూకపంచశతి ఆమెకు కంఠస్థము. తండ్రివ్రాసిన కీర్తనలు ఆమెకు చాలవరకు వచ్చి యుండెను. భగవత్సన్నిధిని స్తోత్రధ్యాన పరాయణమై ఆధ్యాత్మిక చింతనలో ఆమె కాలము గడుపు చుండెను.

వివిధ గ్రామములనుండి శిష్యులనేకులు శాస్త్రములను చదువునిమిత్తము వరదరాజును ఆశ్రయించి గురుకులవాస ముండిరి. జ్యోతిషములో వరదరాజు పెద్ద చేయి. పాఠములను ఫలములను చెప్పుటలో అద్వితీయుడు. కామకోటి వంశీయులు సత్యభాషణులు. వారేమి చెప్పినను ఫలించెడిది. ఆ వంశపు వారికి జోస్యులను పేరు వ్యవహారనామము. వరదరాజులను కూడా జోస్యులనే పిలిచేవారు. వరదరాజు తమ్ముడు రామస్వామి యోగ్యతలో గుణములో అన్నకు ఏ విధముగను తీసిపోడు. ఇరువురికీ అన్యోన్య సౌహార్ద మెక్కువ.

వరదరాజుల దాంపత్యములో అనపత్యత ఒక్కటే పెద్దలోటు. దంపతులకు ఇది క్లేశకారణ మాయెను. 'వంశము ఇంతటితో విచ్ఛిన్న మగునా? పూర్వకర్మ అపరిహార్యమా' అని దిగులు తోచెను. దానహోమములు, సేతుస్నానము, షష్ఠీవ్రతము, క్షేత్రాటనము వరుసగా శ్రద్ధతో చేసిరి. కాని ఫలము కనుపించలేదు.

కామకోటిశాస్త్రులు తన ఆరాధ్య దేవత కామాక్షిని ఈ దంపతుల విషయముగా ప్రార్థించెను. ఒక రోజు శాస్త్రిగారికి కల. 'నీవు నాకు వెన్నను నైవేద్యము పెట్టిన, నా జ్ఞాన కళ##యే మరకతమునకు పుత్రుడై పుట్టును' అని కామాక్షి అనుగ్రహించినది. ఉదయము శాస్త్రి తనస్వప్న వృత్తాంతము దంపతుల చెవిని వేసెను. వారికి ఈ వార్త అమృత సూచనమాయెను.

దేవతార్చన సమయములో శాస్త్రి నవనీతమును అమ్మవారికి నివేదించి మరకతమునకు ప్రసాదముగా నెచ్చెను. ఇది జరిగిన కొన్ని దినములకు మరకతమునకు గర్భసూచన లగుపించెను. క్రీ. శ. 1870 సంవత్సరము జనవరి 22వ తేది శనివారము హస్తానక్షత్రయుక్త కన్యారాశిలో మరకతము ఒక బాలకుని ప్రసవించెను. జన్మదినము, కులదైవమయిన శ్రీనివాస మూర్తికి ప్రియమైన రోజు. పిల్లవానికి శేషాద్రి అని పేరు పెట్టిరి, లేక లేక పుట్టిన వాడు, అల్లారుముద్దు, ప్రతినెల శిశువు పుట్టినతిధి వారు పండుగ చేసుకొని ఆనందించుచుండిరి. మొదటి సంవత్సరము పుట్టినరోజు బంధుమిత్రులతో వైభవముగా వరదరాజులు చేసెను. దంపతుల పుత్రోత్సాహము పున్నమి నాటి వెన్నెలవలె వెల్లివిరసెను.

రెండవ ఏడు పసిపాపడు తప్పటడుగులు వేయ సాగినాడు. ఒక్కటే దుడుకు. మిట్టపల్లములు చూడక బాలుడు పరుగెత్తును. ఈ గుణము అతని భావి జీవితమున ఏర్పడిన సమదర్శి త్వమునకు ఛాయవలె యుండెను. తండ్రి దేవతార్చనలో పాల్గొనును. ధ్యానములో కూరుచున్న వరదరాజు ప్రక్క శేషాద్రియు పీట వేసుకొని కూర్చొనును. ధ్యానమును నటించును.

మూడవ ఏడు బాలునికి కొన్ని శ్లోకములు గురుస్తుతి మూకపంచశతిలోని కొన్ని స్తవములు నేర్పిరి. శిశువు అక్షర పదభ్రంశ##లేక మధురోచ్చారణతో శ్లోకములను చదువును. చదివినంతసేపు మనస్సు దానియందే లగ్నము. ఏడుపు, మొండితనము అను మాట లేదు. ఆ బాలుని ప్రపంచమే వేరు.

తల్లి ప్రతిదినము ఆలయమునకు వెళ్ళును. శేషాద్రికి నాలుగేండ్లు. వరదరాజస్వామివారికి వైశాఖోత్సవము జరుగుచుండెను, ఉత్సవములకు వాడుకగా వచ్చు వర్తకులు తమ సామగ్రులతో వచ్చి చేరిరి. ఎక్కడ చూచిననూ అంతళ్లె. ఒక అంగడిలో రెండంగుళముల ప్రమాణంలో బాలకృష్ణుని కంచువిగ్రహములు ఒకడు అమ్ముచుండెను. తల్లి చేతిని పట్టుకొని నడుచుచుండిన శేషాద్రి చేతిని వదలి, ఆ విగ్రహములను చూడగానే పరుగెత్తి, ఒక విగ్రహమును ఎత్తుకొని 'నాకు పూజకు కావాలి' అని అమెను. వర్తకుడు పసివానిని చూచి ముచ్చటపడి, అమ్మపిల్లవాడు ప్రియపడుచున్నాడు. ఇప్పుడే అంగడి తెరచినాను. మీదే బోణీ. వెల రెండు అణాలు మాత్రమే. తీసి ఇవ్వండి.' అని అన్నాడు. మరకతము సరేయని శేషాద్రికి ఒక బొమ్మకొని ఇచ్చి ఆలయమునకు వెళ్ళి ఇంటికి తిరిగి వెళ్ళెను.

మరుసటి రోజు మరకతము శేషాద్రీ ఆ వీధిలో గుడికి పోవుచుండగా అంగడి వాడు మరల కనబడినాడు. శేషాద్రిని చూడగానే వానిని జవిరి ఎత్తుకొని, చేతులను ముద్దులాడి 'తండ్రీ! నీది బంగారు చేయిరా, బాబూ! నీవు బొమ్మలను తాకితివో లేదో అన్నీ నిన్ననే అమ్ముడు పోయినవి' అని ఉత్సహముతో అనెను. శేషాద్రికి ఆనాటినుండి 'హిరణ్య బాహువు' అన్న బిరుదు అమరిపోయింది. ఆ బాలకృష్ణ విగ్రహము చాలరోజులు శేషాద్రి దేవతార్చనలో ఉండిపోయినది. ఇప్పటికిని శేషాద్రిస్వామి వంశీయులచేత అది పూజింప బడుచున్నది.

ఐదవ ఏడు పిల్లవానికి అక్షరాభ్యాసం చేశారు. దానికై వరదరాజు గురుశుక్రుల అస్తమయము లేని ఒక మంచిరోజు నిర్ణయించెను. ఆయుష్య హోమము జరిపి శ్రీవిద్యాసిద్ధులయిన కామకోటి శాస్త్రులచేత కుశాగ్రముతో బాలుని నాలుక పై సారస్వత మహాబీజమును సారస్వత దశశో%్‌లక మంత్రమును ఉల్లేఖింప చేసిరి. ఆ మంత్రములచే అభిమంత్రించిన గోక్షిరములను ప్రాశన చేయించిరి. పంచాక్షరి, అష్టాక్షరి కాగితముమీద వ్రాసి బాలునికి మూడుమార్లు అనుశ్రావిక పద్ధతిని ఉపదేశించిరి. విద్వాంసులకు బహుమతుల నిచ్చి పిల్లవానిని ఆశీర్వదింపుడని కోరిరి. అటుపై శేషాద్రిని పాఠశాలకు పంపిరి. చదువులో శేషాద్రి అతిచురుకు. అమరకోశము కాండత్రయమును అతడు ఒకే మాసములో కంఠస్థము చేసెను. మంచిధారణ, క్లిష్టమైన విషయములను అతడు అవలీలగా గ్రహించును. మూడు సంవత్సరములలో కావ్యములు, చంపువు, నాటకాలంకారములు అన్నిటిలో అసాధారణ పాండిత్యమును సంపాందించెను. తమిళ గ్రంథములు, కంబరామాయణము, తిరుకురళ్‌, నాలడియార్‌, మొదలగు గ్రంథములను కూడ పరిశీలించి వానిలో వ్యుత్పత్తిని గడించెను.

శేషాద్రి ప్రతిభ విద్వత్సభలలో విదిత మాయెను. విషయ మేదైనను సరియే ధారాళముగా శ్రవ్యపేయముగా అతడు చెప్పును. కవిత్వము వచ్చును. ఉపనయనానంతరము తర్కవ్యాకరణములను పూర్తిచేసి, కామకోటి శాస్త్రులవద్ద కొన్ని మంత్రరహస్యములను, ప్రస్థానత్రయమును, అభ్యసించెను. కోవెల వేదపాఠవాలలో క్రయాంత వేదాధ్యయనము పూర్తి చేసెను. న్యాయశాస్త్రమును చదివెను.

శేషాద్రికి అనుదినమూ తండ్రికి నమస్కరించి పాఠశాలకు వెళ్ళుట వాడుక. ఒకరోజు వాడుక ప్రకారము శేషాద్రి నమస్కరించెను. వరదరాజుకు భావోద్రేకము కల్గెను. 'నాయనా! ఈ అనుదిననమస్కారమేల? నీ తల్లికి నమస్కరించుము. అది చాలును' అని అనగా, శేషాద్రి 'నాకు మీరు ఇరువురూ ఒక్కటే. భక్తి ప్రీతులలో నేను వ్యత్యాసము చూపలేను.' అని చెప్పి తనదారిని వెళ్ళెను.

శేషాద్రి వెళ్ళిన వెనుక వరదరాజు తన భార్యను పిలిచి 'ఎంతటి వారికైనను ఇహలోకపు వాంఛలు పూర్తిగా పోవు. నీవు దేవ్యనుగ్రహమున నాకు భార్యవైతివి. నలుగురు మెచ్చుకొనే పుత్రుడున్నాడు. తమ్ముడు రామస్వామి సంతతి లేదు. మన నరసింహుని అతడు దత్తత తీసుకొన ఇష్ట పడుచున్నాడు. అతని కోరిక తీర్చుట మంచిది. శేషాద్రి కొలది కాలములో ప్రఖ్యాతి వహించును. నాకు ఇహలోక యాత్ర చాలించుటకు దేవి అనుజ్ఞ ఐనది. నేడో రేపో నేను దేహము చాలింతును. నీవు కొంతకాలము శేషాద్రి పేరు ప్రతిష్ఠలను చూచిన పిదప కైవల్యప్రాప్తి నొందుదువు' అని పలికెను.

ఈ మాటవినగనే మరకతము దుఃఖభారముచే మూర్చిల్లెను. మూర్ఛతేరిన పిదప వరదరాజు - 'ఎంత ఆపదలోనైన ధైర్యము వదలరాదు. అన్నీ ఈశ్వరేచ్ఛ ప్రకారము జరుగును' అని భార్యను ఆశ్వాసించెను.

మరుసటిరోజు వరదరాజు వాడుక ప్రకారము నియమ నిష్ఠలను తీర్చుకొని భోజనానంతరము ఉపనిషత్తులను చదివెను. ప్రదోష సమయమున ఏకామ్రనాథుని దర్శించెను. ఇంటికి వచ్చిన పిదప ఆహారము పుచ్చుకొనలేదు. కొంత సేపటికి ఆయనకు అతిసార విరోచనము లారంభించెను.

వరదరాజు వాక్కు ఫలించునట్లున్నదే యని అందరూ గాబరాపడిరి. శేషాద్రియు కన్నుల నీరు గ్రుక్కుకొనుచూ తండ్రి సమీపమునకు వచ్చి నిలుచుండెను. బిడ్డా! విచారపడకు. అతిసారములో కొన ఊపిరివరకు జ్ఞాపకశక్తిపోదు. 'అతిసారేతు మరణం యోగినామపి దుర్లభం' నా అదృష్టం కొద్ది ఈ వ్యాధి వచ్చింది. ఇక నామనస్సు తత్త్వముపై లగ్నము చేయ యత్నించెదను. నెనే చెప్పవలసినది ఏమియు లేదు. కాని ఒక్కమాట. శాస్త్రము లెన్ని చదివినను, అనుభవ జ్ఞానము మించినదిలేదు. అన్ని జ్ఞానములలోను అనుభవ జ్ఞానమే గొప్ప. ఈ మాట గుర్తు ఉంచుకో. అని తన చరమ సందేశము తెలిపి, ధ్యాన మగ్నుడై వరదరాజు తన పాంచభౌతిక శరీరమును వదలిపోయెను. తండ్రి మరణముతో శేషాద్రికి దుఃఖముతో బాటు అపార వైరాగ్యముప్పతిల్లెను.

వరదరాజులు చనిపోగా మరకతమును, పిల్లలనూ కామకోటిశాస్త్రి తనతో బాటు వళూరునకు తీసుకొని పోయెను. శేషాద్రికి పదునాలుగేళ్ళు. తాతగారివద్ద ఈ సమయముననే ఆయన ప్రస్థానశ్రయమును పూర్తి చేసెను.

కామకోటిశాస్త్రియందు దేవికి అపారకృప. ఆయన శమదమాది గుణపంపన్నుడు. వైరాగ్యం కలవాడు. ఈ యన వద్ద చాలమంది మంత్రోపదేశం పొందారు. సర్‌.పి.టి. త్యాగరాజు చెట్టిగారి తండ్రి పొట్టి మహాదేవ చెట్టి, శాస్త్రివద్ద మంత్రోపదేశమును పొంది విశేష ధనలాభమును కాంచెను. గురుదక్షిణగా చెట్టి నాలుగు వేల రూపాయలు శాస్త్రికి ఇవ్వబోయెను. శాస్త్రిగారు చిరునవ్వునవ్వి వద్దని త్రిప్పివేసిరి. శాస్త్రిగారికి ఎనభై ఏళ్ళయినది. సర్‌.సి.పి. రామస్వామయ్యరు మాతామహుడు భాగవత ప్రవచనము చేయవలసినదని కోరిరి. తనకు ఆరోగ్యము సరిగా లేనందున తనకు బదులు శేషాద్రి ప్రవచనము చేయునని, శాస్త్రిబదులు పంపిరి. వెంకటసుబ్బయ్యరు దీనికి సమ్మతించెను. మరకతము శేషాద్రితో బాటు శాస్త్రి వందూసికి వెళ్ళిరి. సుమారు ఒక్క సంవత్సర కాలము శ్రోథలకు ఆశ్చర్యకరముగా శేషాద్రి ప్రవచనము చేసెను.

ఈ సమయమున శాస్త్రిగారికి ఆరోగ్యము బాగా చెడిపోయినది. రెండు మూడు నెలలు మంచము పట్టెను కొంత స్వస్థతరాగా, కంచికి మరలి అచట ఉపనిషద్భ్రహ్మము అని పేరొందిన శ్రీకృష్ణానందస్వామిని ఆశ్రయించి తన సన్యాసదీక్ష ఇవ్వమని ప్రార్థించిరి. ఆయన శాస్త్రికి దీక్ష నిచ్చెను. విధ్యుక్తముగా శాస్త్రి గురువు వద్ద వేదాంత శ్రవణ చేసిరి. దేహదార్ఢ్యము లేనందున పరివ్రాజకోచితమైన మాధుకర వృత్తిని ఆయన అవలంబింపలేదు. మరకతము తన ఇరువురి కొమరుల సహాయముతో ఆయన భిక్షకు ఏర్పటు చేసెను. మూడు నెలలు గడిచిన పిదప దామల్‌ అను గ్రామమునకు వెళ్ళి అచ్చట బ్రహ్మానంద సరస్వతి అన్న పరివ్రాజక నామముతో కామకోటిశాస్త్రులు విదేహముక్తి నొందిరి.

భర్తమరణముతో మరకతమునకు జీవితములో గొప్ప ఔదాసీన్య మేర్పడెను. ఎప్పడూ మౌనమే, ముప్పొద్దుల స్నానము, అధిక కాలము జపధ్యానములతో చెల్లుచుండెను. ఏక భుక్తము, పుత్రునిపై మాత్రము వాంఛ అధికముగా నుండెను. దానికి శేషాద్రి గుణాతిశయమే కారణము.

శేషాద్రికి ఇపుడు పదహేడవ సంవత్సరము. వివాహము చేయవలెనని మరకతమునకు ఆశకల్గెను. దామల్‌ గ్రామమున శేషాద్రి మేనత్త వెంకటలక్ష్మమ్మకు కాకిని అను అమ్మాయి వున్నది. పిల్ల గుణవతి, కులశీలములను ఎన్న పని లేదు. శేషాద్రికి ఇవ్వవలెనని అమెకూ కోరిక కలదు. ఒకరోజు ఆమె కంచికి ప్రయాణ మాయెను. అన్న రామస్వామి జోస్యులతో కాకిని శేషాద్రికి ఇవ్వవలెనని నా కోరిక. అన్నకూ నాయన గారికీ ఇరువురికీ సమ్మతమే. కానీ వారి సమక్షమున ఈ కార్యము జరుగుటకు మనం ఇచ్చి పెట్టలేదు. నీవు శీఘ్రముగా ముహూర్తము పెట్టిన బాగుండును,'' అని చెప్పెను.

''లక్ష్మీ! నీదగ్గర దాపరిక మెందుకు? శేషాద్రి జాతకములో పరివ్రాజక యోగ మున్నది. అతడు సన్యాసి అగుట నిశ్చయము. నీకుమార్తెకు వేరే సంబంధము చూచుట ఉత్తమం'' అని రామస్వామి బదులు చెప్పెను. అన్నగారి మాటలకు వెంకటలక్ష్మమ్మవిన్నబోయెను. విఫలమై ఇంటికి మరలిపోయెను.

అప్పుడే జపమునకు కూర్చున్న మరకతము చెవిలో ఈ మాటలు పడెను. రామస్వామి ఏమి చెప్పిన అది జరుగును అని ఆమెకు నమ్మకము. పది రోజులలో కాకిని వెళ్ళి జరిగెనని వార్త వినవచ్చెను. దీనితో మరింత విచారము పుట్టెను. ఆమె ఏక భుక్తమును వదలి ఉపవసించ సాగెను. దేహము చిక్కి శల్యమాయెను. ఈ సమయమున తమ్ముడు నరసింహ శాస్త్రి మరణించెనని వార్త వచ్చెను. ఇవి అన్నియూ చేరి ఆమెకు మంచమెక్కించెను, సన్నిపాతజ్వరము ఒక నెల వదలక కాచినది. మందుమాకులు లేవు. కార్తిక మాసము శుక్ల పక్ష దశమి, మరకతము శేషాద్రిని పిలిచెను. 'నాయనా! నేను ఇక ఉండునట్లు కనిపించటం లేదు. నీవు నన్ను వదలి ఎక్కడకు వెళ్ళకు' అని హెచ్చరించెను. మరుసటిరోజు ఏకాదశి గడియలు, మరకతము శేషాద్రిని పిలిచి

సత్సంగత్వే ని స్సంగత్వం ని స్సంగత్వేని ర్మోహత్వంః

నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వై జీవన్ముక్తి ||

దర్శనా దభ్ర నదసి జననాత్‌ కమలాలయే|

కాశ్యాంతు మరణా న్ముక్తిః స్మరణా దరుణాచలే||

అని రెండు శ్లోకములు శేషాద్రిరొమ్ము మూడు మారులు చరచి చెప్పెను. శేషాద్రిని అంబశివే అన్నకీర్తను పాడమని, అతనితో బాటు తానును పాడెను. కడపట అరుణాచలా అరుణాచలా యని అరుణాచలేశ్వర స్మరణతో శేషాద్రిపై ఒరిగి ఆమె ప్రాణములను విడచెను.

శేషాద్రికి దుఃఖము సముద్రమువలె పొంగినది. మాతృశోకము దావానలమువలె దీపించెను. కాని శేషాద్రి ధీరో దాత్తుడు. శోకమును జ్ఞానముచే అతడు ఉపశమింప చేసుకొనెను. మాతృయజ్ఞమును, తమ్ముడు నరసింహునితో కలసి పూర్తి చేసెను.

రామస్వామి జోస్యులు అతని భార్య కల్యాణి తల్లి దండ్రులను పోగొట్టు కొన్న సేషాద్రిని నరసింహునీ ఆదరముగా చూచుచుండిరి. రామస్వామికి కొంచెము పిత్రార్జితము కలదు. దానితో బాటు జోస్యము మంచిరాబడి యుండెను. గృహనిర్వహణకు వలసిన ఆర్థికస్తోమతకు ఏ విధమైన లోపమును లేదు. అందుచే శేషాద్రికి కుటుంబభారము తెలియలేదు: ఐనను శేషాద్రికి ఇంటనుండుటకు మనసొప్పలేదు. తల్లి చరమ సందేహము, ఎకొద్ది ఈషణత్రయములు ఉండెనో, వానిని తలఎత్తనట్లు చేసెను. శేషాద్రి ప్రకృతి విరక్తితో నిండి పోయెను.

అంతేకాదు, తల్లి అరుణాచల అరుణాచల అని ప్రాణము విడచినది. శేషాద్రికి అరుణాచల స్మరణ అధికమాయెను. అదివఱకు అతడు తిరువణ్ణామలై చూచినదిలేదు. పంచశిఖరముల గోపురములతో శేషాద్రి చిత్తరువు నొకటి వ్రాసెను. భక్తి మహిమమో సంస్కార బలమో తెలియదు. అది అరుణాచలమునకు ప్రతిరూపమై అమరెను. దెవీపూజ రామసేవ పారంపర్యముగా సిద్ధించియే యున్నది. ప్రత్యేకముగా తన కొక పూజాగృహమును శేషాద్రి నియమించు కొనెను. అందు కామాక్షి, రామచంద్రమూర్తి, తాను గీచిన అరుణాచల చిత్తరువూ ఉంచి ధూపదీప నైవేద్యములతో పూజప్రారంభించెను. ఉదయము 5 గంటలకు స్నానము చేసి లోన కూర్చున్న మధ్యాహ్నము పండ్రెండు గంటలకు కానీ తలుపు తెరచుట లేదు. వేళకు భోజనము చేయడు. కొన్ని రోజులు శుష్క ఉపవాసమే. తాతగారు ఉపదేశించిన షోడశాక్షరిని ఉగ్రముగా జపించును. ఉచ్చస్వరమున అరుణాచలేశా, శోణాద్రినాథా యని పిలుచును. రాత్రులలో దుర్గా సూక్తమును పఠించును, బ్రహ్మముహూర్తమున నాలుగు గంటలకు స్నానమునకు బయలుదేరును. పినతండ్రియు పిన తల్లియు ఈ తీవ్రసాధనలు కొంత తగ్గించి ఆరోగ్యమును గమనించుకొనుమని చెప్పిన ఆ మాట చెవిని పెట్టడు. ఇంట్లో వీరి పోరు అధికము కాగా గుళ్ళలో ఎక్కువ కాలము ఆయన ఉపాసన చేయుటకు ప్రారంభించెను.

శేషాద్రికి సహజముగనే శాస్త్రవాసన అధికము. శాస్త్ర విచారణ, చర్చలు వాక్యార్థములు విద్వాంసులతో కౌతుకముతో చేసెడివాడు. ఇప్పుడో వాని నన్నిటిని నిలిపి వేసెను. ప్రస్తుత దివచర్య ముప్పొద్దుల స్నానము. మధ్యలో ఏదో అశుద్ధి యని మరల స్నానము. చక్రత్తాళ్వారు సన్నిధిలో అభిముఖముగనో, ఉత్తరదిశనో కూర్చుండి జపము చేయును. ఈ కార్యక్రమము మధ్యాహ్నము పండ్రెండు గంటల వఱకు. తరువాత కామాక్షి సన్నిధానమునకు వచ్చును. పలు పర్యాయములు ఆలయ ప్రదక్షణము చేయును. దానితో బాటు నమస్కారములు మూకపంచశతిని పారాయణ చేయును. చీకటిపడి ఊరిలోని వారందరు నిదురపోయిన పిదప ఇంటికి మరలును. రాత్రి ఆహారమేదియు లేక ఉపవాస ముండును. కుంకుమను విభూతివలె నుదుట పులుముకొనును. సూర్యుని చూచి సాగిలపడును. తనలో తానే మాట్లాడుకొనును. వీధిలో కన్య లెవరైన పోవుచుండిన వారికి సాగిలపడును. తెలిసిన పెద్దలు ఎవరైన కనబడిన వారి పాదములను కండ్ల కొత్తుకొనును. శేషాద్రీ ఏమిది?' అని వారు అడిగిన, బ్రాహ్మణుని పాదములూ భగవత్పాదములూ ఒకటి అని బదులు ఇచ్చును.

స్వామి వీధిలో ఊరేగింపుకు వచ్చిన, ముందు పోయి త్రోవలోని రాళ్ళనూ కాగితములనూ తీసి పారవేయును రాత్రింబగళ్లు ఒకటే తిరుగుడు. నిర్దిష్ఠస్థలము లేదు. అందరి ఇళ్ళూ తనవే. తైలాభ్యంగనము కాని. క్షురకర్మగాని ఎరుగడు రాత్రిళ్లు ఎక్కువ నిద్రింపడు.

ఎవరైననూ శేషాద్రీ ఏమి చేయుచున్నావు? అని అడిగిన 'కర్మనాశమునకు జపము చేయుచున్నాను. కర్మ పోవలెనుకదా?' అని బదులు చెప్పును. 'ఏమి జపము?' అని మరల అడిగిన, 'అంభస్యపారే. - ఇది నారాయణోపనిషత్తు లోనిది. కామోకార్షీత్‌ మన్యురకారషీత్‌ కామః కరోతి నాహం కరోమి- లక్ష ఆవృతులు ఐనవి. ఇంకను ఏబది వేలు ఉన్నవి. కర్మక్షయము కాక మోక్ష మెట్లు సాధ్యము?'' అని శేషాద్రి ప్రశ్నించును. శేషాద్రికి పిచ్చి బాగాపట్టినదని ఊరి వారు తీర్మానించిరి.

ఊరి వారి ఉపద్రవము, ఇంటివారి పోరు ఎక్కువ కాగా ఆలయములు వదలి శేషాద్రి ఏకాంత ప్రదేశములకై వెదుకసాగెను. ఏదియూ దొరకక పోగా శ్మశానమునకు వెళ్ళి అచ్చట తన ఉపాసన ప్రారంభించెను. ఇంటిలో జపము సాయంసంధ్య పూర్తి చేసుకొని వేగవతీ నదీ తీరములోని శ్మశానము చేరుకొని మరుసటి ఉదయమువరకు జపించి, ఇంటికి మరలును. ఈ విషయము పదిదినముల వరకు ఎవరికిని తెలియలేదు. తెలిసిన పిదప అశుద్ధప్రదేశములో ఈ జపమేల? అని ఆక్షేపించిరి. 'శ్మశానము రుద్రభూమి. అచట చేయు సాధనలకు రుద్రుడు అనుకూలుడు. ఇతర ప్రదేశములలో వేయిమార్లు జపించిన ఎంతఫలమో శ్మశానములో ఒక్కమారు జపించిన అంతఫలము' అని శేషాద్రి బదులిచ్చెను.

ఒకప్పుడు బంధువులు శేషాద్రి ఒకగదిలో ఉండగా బయట గొళ్ళెము పెట్టిరి. మనసు మార్చుకొనునేమో అని. వారి ఆశ. శేషాద్రియో, ఇదే సాకు అనుకొని లోపల గొళ్ళెము పెట్టి నిర్విచారముగా నాలుగు రోజులు ధ్యానములో మునిగి పోయెను. బంధువులకు అతడు తలుపు తెరిచిన చాలనిపించెను. నిర్బంధము అధికము కానుకాను జపసంఖ్య యూ వృద్ధి అయ్యెను. ఉపవాసములతో జపసాధనలతో ఆయన ముఖమున అలౌకిక మైన దీప్తి ప్రకాశింప సాగెను శేషాద్రి శాస్త్రవైదుష్య మెరిగిన వారు అగుటచే ఆయన ఆధ్యాత్మికోన్మాదమును ఎవ్వరును అరికట్ట పూనుకోలేదు.

ఒకరోజు శనివారము. ఇంటివారి కందరికి తైలాభ్యం గన దినము. శేషాద్రి పదిగంటలకు శ్మశానమునుండి తిరిగి వచ్చెను. పినతండ్రి ఇతని తీరుచూచి నాకు తలంటు వద్దని విసుగుకొచెను. పినతండ్రికి తైలమర్దనము, వస్త్రములను ఉదుకుట శేషాద్రివంతు. ఆధ్యాత్మిక విషయములందు తక్క శేషాద్రి పినతండ్రిమాట జవదాటడు. జపతపములు లేని సమయములలో అతిచనువుతో మెలుగును. చమత్కారములు ఎక్కువ. నరసముగా మాట్లాడును. సాధన విషయము తప్పించి శేషాద్రి సరసుడే.

'ఈ రోజు మీ చిన్నాయన తలంటుకోరట' అని కల్యాణి అనెను.

'కారణము?'

'నీవు ఇట్లా ఉన్నావని వారు అలిగి ఉంటారు.'

'నాపై అలుగుట ఎందుకు? ఎవరిత్రోవ వారిది. వారి వారి స్థితిలో వారువారున్న కలహానికి కారణ మెక్కడ?''అని శేషాద్రి పినతండ్రిని అభ్యంగమునకు పిలిచెను. ఎదురు చెప్పిన బాగుండదని పినతండ్రియు ఒప్పుకొనెను. తలపై నూనెపెట్టి మర్దన చేయుచూ మధ్యలో ఆపి వీధిలోనికి వెళ్ళి ఆకాశమువంక ఐదు నిమిషములు చూచి శేషాద్రి మరల తిరిగి వచ్చెను.

''ఆకాశంలో ఏమి చూచావు;''

'దేవతలను'

'వట్టిదేవతలేనా? లేక గంధర్వులు కూడానా?''

'ఆ ! గంధర్వులూ ఉన్నారు'

'ఓహో, వాళ్ళు ఆలాపిస్తున్న రాగం ఏమి?

'బిలహరి'

'సరి నీకు పిచ్చి బాగాముదిరినట్లున్నది.

వారు పోతుంటే నాకంటికి కనబడరేమి?

'వారు కర్మిష్ఠులకండ్ల బడరు. స్వస్థులుగా ఉన్న వారికే వారి దర్శనం'

'సరి. సరి. నీ వెఱ్ఱి రోజురోజుకూ వేయితలలు వేస్తున్నది.' అని పినతండ్రి స్నానమునకు లేచెను.

సాధనా కాలములో శేషాద్రికి ప్రోత్సాహమునకు బదులు నిరోధమే ఎదురైనది. ఆయన ప్రవర్తన లోకవిరుద్ధము. దానితో ఆయనకు లేనిపిచ్చిని అంటగట్టిరి. ఉన్మాదు డన్న పేరురూఢి అయ్యెను. బంధువులూ స్నేహితులూ కలసి, 'పెళ్ళి చేయండి పిచ్చికుదురుతుంది' అని లోకసహజమైన సలహా నిచ్చారు. కానీ శేషాద్రి పిచ్చి ఇప్పటికే జగద్వ్యస్తమై పోయెను. ఇతనికి పిల్లనిచ్చు వారెవరు? పినతండ్రికి శేషాద్రితో బాటు తనకే పిచ్చిపట్టునేమో అని అనిపించెను.

రామస్వామి ఒకరోజు ఖిన్నుడై కూరుచుండెను. శేషాద్రి ఆయనకు సమీపించి' మీకు విచార మెందుకు? వివాహేచ్ఛ నాకు ఉన్న నేను మీకు చెప్పనా? మీరు ఊరక ఇట్లు నిర్బంధము చేసిన నేను ఊరువిడిచి పోవుదును' అని తెలియచెప్పెను. ఈ మాటతో పినతండ్రి కొన్ని రోజులు ఊరకుండెను. శేషాద్రియు తనకు అంతరాయములు తొలగిన పని సంతోషించెను. కానీ ఈశ్వరేచ్ఛ వేరుగా నుండెను.

కామకోటి శాస్త్రుల పిదప శాస్త్రవిషయములలో పరశురామశాస్త్రి పేరుపొందెను. ఆయనకు బంధుకోటిలోనూ గౌరవముకలదు. ఒకరోజు హఠాత్తుగా పరశురామశాస్త్రి రామస్వామి ఇంటికి వచ్చెను. అతనిని చూచి, రామస్వామి 'పోనీ నీవైనా శేషాద్రికి నాలుగు మంచిమాటలు చెప్పరాదా?' అని బ్రతిమలాడెను. 'శేషాద్రిని సరిదిద్దుటకే నారాక' అని శాస్త్రి గంభీరముగా అనెను.

అపుడే తన జపతపములు పూర్తి చేసుకొని శేషాద్రి ఇంట అడుగు పెట్టుచుండెను. వచ్చీరాకముండే శాస్త్రి శేషాద్రిని ఆక్షేపించెను. 'నీవు శ్మశానమందు జపిస్తున్నావటనే? అది శాస్త్ర విరుద్ధము' అని పరుశురామ శాస్త్రి అనెను. శేషాద్రి చేయవచ్చుననెను. ఇరువురికి తర్క మారంభమాయెను. శేషాద్రి 'నేను నైష్ఠిక బ్రహ్మచారిని. ఉపాసకుడను. ఉపాసనకు దేశకాల నియమము లేదు' అని శాస్త్రాధారములను చూపి శాస్త్రిని నిరుత్తరుని చేసెను. 'ఐనచో నీవు గృహస్థులున్న చోటికి శ్మశానము నుండి రాకూడదు. అని శాస్త్రి అనెను' అట్లైనచో మంచిది. అని శేషాద్రి వెంటనే తిరిగి పోయెను. ఆనాటినుంచి శేషాద్రి ఇంటివైపు తిరిగి చూడలేదు. ఏ చెట్టు క్రిందనో, ఏ కోవెలలోనో అతడు కాలము గడుపసాగెను. రామస్వామియు గుండె దిట్టము చేసుకొనెను.

సాధకునకు గురులాభ##మైనకాని సాధన స్థిరమవదు. ఒకరోజు వాడుక ప్రకారము శేషాద్రి కోవెలకు పోయెను. అచ్చట నలువురు శిష్యులచే పరివేష్ఠితుడై అపరదక్షిణా మూర్తి వలె తోపించు ఒక గౌడసన్యాసిని శేషాద్రి చూచెను. చూచినంతనే శేషాద్రికి భావోద్రేకముతో కంఠము రుద్ధమాయెను. నమస్కరించిన పిదప సన్యాసియు 'మాశుచః ఉపవిశ' యని సంజ్ఞచేసెను. శేషాద్రి అరుగుమీద కూర్చొనెను. సన్యాసి చూపులే నయనదీక్ష అయెను. సన్యాసి వృత్తాంత మరసిన పట్టన్న అను యువకుడు శేషాద్రికి సన్యాసి పరిచయము చేసెను. ఆయన పేరు బాలాజీ స్వాములు. హరిద్వారము నుండి రాక. రామేశ్వరం వెళ్ళుతూ కంచికి వచ్చారు. పట్టన్న దైవభక్తి, సత్సాంగత్యములో ప్రియము కలవాడు. బాలాజీ స్వాముల ఇరువురి వృత్తాంతమును అడిగి తెలుసుకొన్నారు. కొంతసేపు శాస్త్రసంభాషణ చేశారు. వారు ఉన్నంతవరకు వీరు ఇరువురూ పరిచర్య చేయుచు వచ్చిరి. కడపటి రోజు పట్టన్నకు దేవీ మంత్రమునూ, శేషాద్రికి సన్యాసిదీక్షయూ ఆయన ఇచ్చెను. స్వామి సాధన ఇట్లుసన్యాస దీక్షలో, తత్త్వమసి వాక్యోపలబ్ధిలో ముగిసెను.

శేషాద్రి తండ్రి ఆబ్దికము సమీపించెను. శేషాద్రి సన్యాసియై తిరుగుచుండెను. ఆబ్దికము చేయువారెవరు? శేషాద్రిని బలవంతపఱచియైనను పిలుచుకొని వచ్చెదమని రామస్వామి బయలుదేరెను, వెదుకగా వెదుకగా ఒకచోట శేషాద్రి కనపడెను. ఆబ్దికమునకై శేషాద్రిని రామస్వామి రమ్మనెను, 'నేను సన్యాసిని, నాకు కర్మలు ఎన్నడో పోయినవి. నన్ను బలవంతము చేయకుడు' అని చెప్పిననూ రామస్వామి చెవినిపెట్టక బలవంతముగా తీసుకొనివచ్చి ఒకగదిలో త్రోసి బీగము వేసిన శ్రాద్ధానంతరము, పితృశేషమును తినిన పిదప వెళ్ళ వచ్చునని బీగము చెవి మొలలో దోపుకొనెను. శేషాద్రి తమ్ముడు నరసింహము శ్రాద్ధకర్మలను చేసెను. బ్రాహ్మణుల భోజనములైనవి. పితృదేవతలకు ప్రదక్షిణమే చేసి ఆశీర్వచనము లందు సమయము. రామస్వామి గది తలుపు తీసెను. గదిఖాళీ. శేషాద్రి అందులేడు. ఊరుమొత్తము గాలించిరి. శేషాద్రి యోగశక్తితో గదినుండి మాయమయ్యెనని గ్రహించిరి. సాధారణునిగా అతనిని తలచినందులకు తమ బుద్ధిమాంద్యమునకు నొచ్చుకొనిరి.

కొంతకాలమునకు కంచికి ఇరవైమైళ్ళ దూరమున నున్న కావేరీపాకములో శేషాద్రి ఉన్న వార్త వినవచ్చెను.

ఆ ఊరిలో శేషాద్రి పెద్దమ్మ సుందరమ్మాళ్‌ ఉండెను. ఆమెకు పదేళ్ళ పిల్లవాడు. పేరు శేషు. శేషాద్రిని శేషు చూచి తల్లితో చెప్పెను. ఆమె ఆలయమునకు వెళ్ళి శేషాద్రిని ఇంటికి రమ్మనెను. శేషాద్రి వచ్చుటకు నిరాకరించెను. అందుచేత ఆమెయె అతనికి ఉన్న చోట ఆహారము తెచ్చి పెట్టెను.

ఒకరోజు ఉదయము ఆరుగంటలపుడు శేషాద్రి, శేషు గుడిచుట్టూ ప్రదక్షిణము చేయుచుండగా, ప్రకారము ఉత్తర దిశలో గోడచేరువున నున్న పొన్న చెట్టుక్రింద నుండి ఒక పెద్ద పాము వెలికి వచ్చెను. పిల్లవాడు భయపడి పాము, పాము అని అరచెను. కాని శేషాద్రి నిశ్చింతగా పామువద్దకు వెళ్ళెను. పాము అతనిపై ప్రాకి, మెడచుట్టు మూడుమార్లు చుట్టుకొని అతని శిరస్సును పడగతో కప్పెను. శేషు వీధి లోనికి పరుగెత్తి శేషాద్రిని పాముకరచినదని గోలచేసెను. జనులు గుమిగూడి లోనికివచ్చిరి. శేషాద్రి నిశ్చలముగా సదాశివునివలె భుజంగభూషణుడై కూరుచుని యుండెను.

శేషాద్రి కావేరిపాకమునందున్న సంగతి తెలిసి కల్యాణియు, రామస్వామియు ఆయనను చూడవచ్చిరి. సమాధిలో ఏడు భూమికలు. అవి శుభేచ్ఛ, విచారణ, తనుమానసీ, సత్వాపత్తి, సంసంక్తి, పదార్థభావని, తుర్యగ అనునవి. నాలుగవ భూమికలోని వారిని బ్రహ్మవిదు లనియు, ఐదు, ఆరు, ఏడు, భూమికలలో నున్న వారిని క్రమముగా బ్రహ్మ విద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ఠు లని వ్యవహరించుదురు. సమాధిలోనికి సంకల్ప మాత్రమున వెళ్ళి తిరిగి వచ్చుట పంచమ భూమిక. సమాధిలోనికి స్వేచ్ఛగా వెళ్ళి ఇతరుల సాయముతో తిరిగి జాగృతిలోనికి వచ్చిన అది ఆరవ భూమిక. అట్లు కాక స్వేచ్ఛగా కాని, ఇతరుల సాయముతో కాని జాగృతికి రాకపోవుట ఏడవభూమిక. శేషాద్రి స్వామి ఆరవభూమిక సమాధిలో నుండెను.

చుట్టూ చేరినవారు 'నమః పార్వతీపతయే హరహర మహాదేవ' యని ఉచ్చస్వరమున నమోవాకములు పల్కిరి. స్వామి కనులు తెరచెను. పినతల్లియు, పిన తండ్రియు, 'నాయనా! నీమహిమ తెలియక అపచారము చేసితిమి. నీ కేమి కొరతయూ చేయము, నీవు ఇంటికి మరలిన చాలుననిరి. స్వామి వారిని ఓదార్చి ఇంటికి పంపిరి.

ఆనాటినుండి స్వామిది అత్యుత్తమ ఆధ్యాత్మికస్థితి. అది జీవన్ముక్తస్థితి. స్వామి అందరికిని సొంతమే. పశుపక్షులు సహితము ఆప్రేమస్రవంతిలో ఓలలాడినవే. ఆయన పాదధూళి భవబంధములను నిర్మూలింప దగియుండెను.

కావేరిపాకమున స్వామినెల రోజులుండెను. జనసమర్దం అధికము కానుకాను, స్వామి ఒకరోజు ఎవరికినీ చెప్పక కావేరి పాకము వదలిపోయెను.

రెండు మూడు నెలలు స్వామి ఉన్న చోటు తెలియ లేదు. వందవాసిలో ఉన్నారు, కాదు చెంగల్పట్టులో అన్న వదంతులు పుట్టెను. నిజానిజములు ఎవరికిని తెలియదు. తరువాత స్వామిని కొందరు తిండివనములో చూచిరి. స్వామి మౌనదీక్షలో నుండెను. శివాలయములోని యాగశాలలో ఒకగదిని స్వామికి ఇచ్చిరి. ఒక నెలరోజులు తాను నిష్ఠలో నుందుననియు, గదితలుపులు బీగము వేసుకొని వెళ్ళవచ్చునని స్వామి వ్రాతమూలకముగా తెలిపెను. స్వామిని లోన ఉంచి బీగమువేసిరి. ఐదారు రోజులగు సరికి అర్చకునకు దిగులు తోచెను. స్వామి గతించిన, ఆలయమునకు ప్రోక్షణ చేయవలసి వచ్చునని అతడు భయపడి తెగించి గది తలుపులు దీసెను. స్వామి తీవ్రనిష్ఠలో నుండెను. సందడికి సమాధి నుండి మేల్కొని, అర్చకుని కలవరముచూచి, ఆ చోటు వదిలి తీరువణ్ణామలైకు బయలు దేరెను. వాలాజామీదుగా వేలూరు, అంబూరు, తిరువత్తూరు, జవ్వాజిమలె, కన్నియంబాడి, పోళూరు మొదలగు ఊర్లను చూచుకొని 1888 లో తిరువణ్ణామలై వచ్చి చేరెను. ఇది పంచలింగ క్షేత్రములలో నొకటి. స్మరణ మాత్రమున ముక్తినిచ్చు క్షేత్రమిది. స్వామి తిరిగి తిరిగి అరుణాచలమున స్థిరపడెను.

లలాటే త్రైపుండ్రీ నిటలధృత కస్తూరితిలకః

స్ఫురన్మాలాధారః స్ఫురితకటికౌపీనవసనః|

దధానో దుస్తారం శిరసి ఫణిరాజం శశికలాం

ప్రదీప స్సర్వేషాం అరుణగిరి యోగీ విజయతే||

ఈ శ్లోకం వ్యాసమహర్షి అరుణాచలక్షేత్రము వర్ణిస్తూ వ్రాసినది. అనుదినమూ ఈ శ్లోకం పారయణ చేసియే ముక్తి పొందవచ్చునని స్వామి అనేవారు.

వరుణాది సురార్చ్యాయ తరుణాదిత్య వర్చసే|

అరుణాచలనాథాయ కరుణామూర్తయే నమః||

అరుణాచల దీపదర్శనం చేసేటప్పుడు పఠించవలసిన శ్లోకం ఇది.

అరుణాచలపదికము వ్రాయుచూ రమణ భగవానులు ఇట్లు వ్రాసిరి.

కనితి ప్రాణులలాగికొని కాంతిశిఖర

మనుక్రొత్తదాని దీనినొక మారెంచు

ప్రాణిచేష్టనణచి వాని లాగికొని

దానికభిముఖముగా నొనరించి

తనవలెయచలముగా నదిచేసిబలి

గొనునా యర్హజీవుని నిది యేమొ

మెలకువమనుడి జీవుల హృదిలోన

అలరు జీవహరి ఘనారుణగిరియె.

'అసౌయస్తమ్రో అరుణ' అని రుద్రాధ్యాయము. 'స్వామీ! ఎన్నో ఊర్లు ఉండగా మీరు అన్నిటినీ వదలి అరుణాచలం ఎందుకు వచ్చి చేరారు?' అని శేషాద్రిస్వామిని అడుగగా, 'ఈ ఊరిలోనే కదా శివశక్తులు మోక్షం మేమిస్తామంటే మేమిస్తామని పంతాలు వేసుకొంటున్నారు. అని స్వామి బదులిచ్చారట.

అరుణాచలేశ్వరుని ఆలయము వెనుక వేణుగోపాలుని గుడి ఒకటి యున్నది. వంశీమోహనుని వేణుగానలహరిలో చొక్కి అరుణాచలుడు అచలుడైనట్లు ఊహించుటకు అవకాశ మున్నది.

అరుణాచలక్షేత్రమున శేషాద్రిస్వామికి ఒక చోటు లేదు. ఎచట చూచిననూ ఆయనే. విరామము లేనినడక, అనడకలో నిదానముండదు. పరుగులే. రాత్రిళ్ళు నిదురలేదు. అప్పుడూ సంచారమే. సన్నిధి వీధిలో మొదటి ఇల్లు సూర్యనారాయణశాస్త్రి గారిది. ఆయనకు స్వామి వివరములు తెలుసును. కాని స్వామి తిరువణ్ణామలెకు వచ్చినది తెలియదు. ఆ విషయము చెవిని పడగానే వెదకుటకు ప్రారంభించెను. ఒకరోజు స్వామి మండపము వద్ద ఉండగా శాస్త్రి సంధించెను. సమీపమున ఏడుగాడెదలు మేయుచుండెను. స్వామి గాడిదలను తాకి, తాకి కన్నుల కద్దు కొనుచుండెను. ''ఏమి? శేషాద్రి ! గాడిదలను కళ్ళకు అద్దుకొనుచున్నావు' అని శాస్త్రి అడుగగా, 'ఇవి గాడిదలు కావు సప్తృషులు, ఇది వసిష్ఠుడు. ఇది అగస్యుడు' అని స్వామి గాడిదలకు సాగిలబడెను. శాస్త్రి స్వామిని ఇంటికి పిలిచెను. స్వామి శాస్త్రిని పో పో అని అదిలించి వేసెను. స్వామి 'బాలోన్మత్త పిశాచవత్‌' - స్థితి. కాని ఎవరును ఆయన ఉన్మాదుడని అనుకోలేదు. జ్ఞాని అనియే అనుకొనిరి.

స్వామి పొడుగరియూ కాదు. కురుచుగా కాదు సాధారణమైన ఎత్తు, ముఖము సంతత దరహాసదీపితము కన్నులు అర్ధనిమీలితములై దృష్టి ఏవస్తువుపైనను ఉండక ఎక్కడో దవ్వులను చూచినట్లుండును.

స్వామికి గుడ్డలపై అమిత ఉదాసీనము. ఒక గుడ్డను మొలకు చుట్టుకొని మరియొకదానిని ఉపవీతమువలె ధరించుచు అవి దుర్భగములై ధూళిధూసరితములై యుండును. క్రొత్త గుడ్డ లెవరైనా ఇచ్చిన అవికూడ మరుసటిక్షణము మురికికూడి యుండును. శౌచమును లెక్కింపడు. ఏ చోటైనను సరియే కూరుచుండును. ఏదైనను తినిన పిదప చేతులను కట్టుకొన్న బట్టలకే తుడుచుకొనును. బిచ్చగాండ్రు యాచించిన వస్త్రములను వారికిచ్చి వారి గుడ్డలను తాను ధరించును దేహాభిమానము లేనివానికి వస్త్రాభిమాన మెక్కడిది?

స్వామి నడక జంఘాలుని పోలినది. గాలిలో తూలికవలె లఘువుగా నడుచును. నడుచునపుడు శబ్డముండదు. ఉండుటకు ఒక చోటు లేదు. 'అని కేత శ్శుచిర్దక్షః!' ఆయనను వెదకి పట్టుట శ్రమతోడిపని. పదినిమిషములలో పదిచోటులలో నుండును. స్వామి కూరుచుండుట విచిత్రముగానుండును వృష్ఠము నేలమీద ఆనక మోకాళ్ళను మడుచుటచే మడమలపై ఆనియుండును. యోగశాస్త్రము దీనిని స్వస్తి కానన మనును.

స్వామిమధురభాషి. స్వరము మంద్రము. కాని మాటలలో పూర్వాపర సంబంధముండదు. కొన్ని వేళల అడిగిననూ ఉత్తరముండదు. బదులిచ్చిన రెండుమాటలలో ముక్తసరిగ సరిపుచ్చును. ఎవరైననూ పాడమన్న అంబశివే అని పల్లవిని మాత్రము పాడి నిలిపివేయును. ఇది కామకోటి శాస్త్రి వారి పాట అని చెప్పును. పాడినది అరనిముసమైననూ శ్రావ్యసుందరమై మొప్పును. కూరుచున్న స్థలమునందే మంచముపైననో, స్తంభము పైననో చేతివ్రేళ్ళతో తాళము వేయును. ఎవరైనా సమీపించిన తాళగతిని నిలిపివేయును.

స్వామి దొక విచిత్రప్రకృతి. అరక్షణము ఊరక కూరుచొనడు. ఏదైన వస్తువును భూమిమీద ఉంచిన దానిని వెంటనే తీసుకొనును. మరల క్రిందపెట్టును. మరల తీసికొనును. ఇట్లు పలుమారులు చేయును. తూర్పు ముఖముగా కూరుచుండి వెంటనే పడమటకు తిరుగును. మరల ఉత్తర మునకు తిరిగి చేతులపై ఊని ముందునకు జరుగును. ఉన్నట్టుండి లేచి ఆకసమువంకకు చూచును. లేనిచో స్తంభమును పట్టుకొని ఉన్న పాటునలేచును. చేతులను వెనుక కట్టుకొని మరొక స్తంభము వద్దకు వెళ్ళి క్రిందా పైనా చూచును. ఆకాశమువంక చూచుచూ ఏబదిమారులు తిరుగును. అర చేతులను కన్నుల కద్దుకొనును. లేదా హఠాత్తుగా ఆశ్చర్యకరమయిన విషయమును చూచినట్లు పెద్ద పెట్టున నవ్వును. అరగంటకు కాని ఆనవ్వుకు అంతముండదు. ఏమి నవ్వుచున్నారని అడిగిన బదులుండదు. కొన్ని సమయములలో పిల్లియో ఉడతయో పరుగెత్తిన దాని వెంట పరుగెత్తును. అది బొరియలో దూరిననూ, చెట్టు ఎక్కిననూ ఆచోట అరగంట సేపు స్వామియూ నిలుచుండును. జట్కా బండి వీధులో పోవుచుండిన చెంగున ఎగిరి దానిలో కూరుచుండును. ఎదురుగా మునిసిపాలిటీ కుప్పబండి వచ్చిన, జట్కా నుండి దానిలోకి మారి, 'చూచితివా? కోచి బండి' అని తమాషా చేయును.

కాఫీ హోటళ్ళు, మిఠాయి అంగళ్ళు, దిన వెచ్చపు కొట్టము, ఏవైననూసరే స్వామి నిరాటంకముగా వెళ్ళును సామానులను తీసి క్రిందచల్లును. లేదా డబ్బు పెట్టె తెరచి నాణములను పేర్చి పిల్లవానివలె ఆడుకొనును. ఏమిచేసిననూ స్వామిని పల్లెత్తు మాట అనరు. వీధులలో స్వామి కనబడిన అందరూ నమస్కరింతురు. స్వామియు తనపాదములను తాకి నమస్కరించుటకు అనుకూలుడై యుండును. వచ్చినవారి గుణశీలములు మంచివి కానిచో ఆచోటునుండి పరుగెత్తును. బలవంతముగా వారు దాపునకు వచ్చిన దుష్టుడా పోపో అని తరిమివేయును. లేదా రాళ్ళెత్తి రువ్వును. అట్లుకాక వచ్చిన వారు మంచివారైనచో వారిని కౌగిలించుకొని మాట లాడును. నఖశిఖపర్యంతము తడివినట్లు చేతులను త్రిప్పును. ఆయనకు స్త్రీ పురుష ఖేదము లేదు. స్త్రీలమీద చేతులు వేసుకొని వారిని త్రోసికొని పోవును. లేదా వారిని కూర్చొనమని, ఒక దాని కొకటి సంబంధము లేని మాట లాడును. మన్నెత్తి వారిచేతులలో పోసి, తన చేతులలోకి తీసుకొనును. వారి ఒడిలో తలపెట్టుకొని పండుకొనును. ఉన్న పాటున వారికి నమస్కరించును. 'నీవు మా అమ్మ కల్యాణివలె ఉన్నావే?' అని అనును, 'కల్యాణీ!, అని వారిని పిలుచును. వారికిని స్వామియందు సంకోచముండదు. ఆయన యందు శిశుభావమే. అందరి ఇండ్లలోనూ స్వామికి స్వేచ్ఛయే.

స్వామికి ఎండలేదు, వానలేదు. ఎప్పుడూ ఒకటే నడక. పిల్లలతో పందెములు వేసి పరుగులు తీయును. అపరాహ్ణ సమయములో సూర్యుని చూచుచు నిలుచుండును. లేదా రాత్రిచంద్రునిచూచి మంత్రములను వల్లెవేయును. వానవచ్చి నచో స్వామికి పండుగయె. వాననిలిచిన కానీ స్వామి అరుగు మీదకు రాడు. వర్షము కురిసినంతసేపు వాననీటిలో అభిషేకమే, వీథులలో నీరు ప్రవహించిన ఆనీటిలో ఎగురుచు, డుముకుచు పిల్లవానివలె ఆడుకొనును. గుడ్డలను పిండుకొనడు. అవి ఎండువరకు ఆ గుడ్డలనే ధరించును. స్వామి నిర్లిప్తుడు. వాన, గాలి, మంచు, ఎండ, చలి ఏదియు ఆయనకు లెక్క లేదు.

ఏచోట పెళ్ళి జరిగిననూ స్వామి హాజరు. వధువరులకు సమీపమున కూర్చుండి వారిని మాటి మాటికి తాకినవ్వుచుండును గంధపుగిన్నె తెచ్చిన దోసిలి గంధము తీసుకొని నెత్తిమీద పులుముకొనును. దంపతులు నమస్కరించి ఆశీర్వచనము లడిగిన, 'నూరేండ్లు, నూరేండ్లు' అని ఆ చోటునుండి పరుగెత్తును. ఊరేగింపులోనూ స్వామి ఉండవలసినదే. ఎవరి ఇంటనైనా పీనుగవెళ్ళిన, అచ్చటా స్వామి హాజరే. ఆశవమునకు ముందు వెళ్ళి దానికి నమస్కరించును. అశౌచము, ఎంగిలి. మైల, మడుగు, ఏదీలేదు.

కొన్ని సమయములలో స్వామికి బలవంతముగ కొందరు తైలాభ్యంగనము వేయుటకద్దు. అదొక ఉత్సవము. టన్నుల కొద్దీ ఆయనకు నూనె తెచ్చి దేహమునకు పూయుదురు. స్వామి మధ్యలో లేచిపోవును. తైలాంజనమే కానీ అభ్యంగన ముండదు. ఆవేషముతో స్వామి పదిరోజులు తిరుగుచుండును. మొదలే స్వామి దేహముపై మురికిని లెక్క లేదు. ఇక తైలాంజనముతో వీధిలోని దుమ్మంతయు స్వామి దేహముపైననే. దేహవిస్మరణలో ఆయనకు ఆయనే సాటి.

తిరువణ్ణామలె వాసులలో రామయ్య ఒకడు. స్వామి అన్నచో అతనికి చాల భక్తి. దాదాపు పదేళ్ళుగా స్వామితో పరిచయము. కానీ స్వామికి మాత్రము రామయ్య నిత్యనూతనుడే. రామయ్య రాగానే స్వామి అతనిని ''మీరెవరూ? మీదే యూరు?'' అని ప్రశ్నించును. రామయ్య స్వతంత్రించి పరిచయమును చూపిన - 'ఛీ పోపో' అని స్వామి కసరుకొనిన రామయ్య పిక్కబలము చూపవలసినదే. స్వామి వ్యవహారము ఈ విధముగా నుండును. కాని ఊరివారందరికి స్వామిపట్ల ప్రేమా, గౌరవమూ, ఆయనను చూచిన కాని వారికి దినము గడువదు.

స్వామి ఒకమారు ముఖము చూచిన అగంతుకుని పుట్టు పూర్వోత్తరము లాయనకు తెలిసి పోవును. ఒక్కొక్క మారు చూచీ చూడనట్లుండును. లేదా వారి ప్రచ్ఛన్న పాపములను బయటబెట్టి అవమానము చేసిననూ చేయును. అందుచే జనులు సాధారణముగా ఆయన ముందు వచ్చుటకు భయపడే వారు.

స్వామి ఒకరోజు వీధి తిన్నెమీద కూరుచుని యుండిరి. పొరుగూరునుండి ఐదారుగురు తిరువణ్ణామలెకు వచ్చి వీధీలో పోవుచూ, స్వామిని చూచి దర్శనార్థము దాపునకు వచ్చిరి స్వామి అందులో ఒకనిని చూచి, హఠాత్తుగా 'మహాపాపి. మహాపాపి. ఏమి ? సొంతకోడలే భార్యయా?' ఛీ పోపో!' అని మొగము దిప్పికూరుచుండెను. వచ్చినవారు నిర్విణ్ణులైరి. దూషితుడు గిఱ్ఱున తిరిగిపోయెను. తరువాత స్వామి చెప్పినది నిజమే నని తెలిసినది.

స్వామి ఎవరినీ పేరుపెట్టి సాధారణముగా పిలువరు. యోగక్షేమములను విచారించుట ఉండదు. 'కూర్చో రేపురా' అన్న మాట లేదు. ఉదాసీనము గా నుండును. అపకారి ఉపకారి అన్యవ్యత్యాస ముండదు. ధనికూడూ దరిద్రుడూ సమానులే. 'యస్సర్వత్రానభిస్నేహ' అను గీతావాక్యమునకు స్వామి ప్రతీకము.

వారి ఆహారవిహారములూ అంతే - యుక్తాహార విహారములు వారికి ఏకోశముననూ లేదు. ఆకలిదప్పులు దాదాపు ఆయనకు లేవనే చెప్పవలెను. ఒక నెలరోజులు ఉపవాసముండును. మరికొన్ని వేళల రెండు గంటలసేపు ఐదారు గురు తినగల అన్నమును దినును. ఆహారమునకు నియమమైన వేళ లేదు. ఎవరు ఏది ఇచ్చిననూ తినును. తినునపుడు ముఖమున ఏ విధమైన భావనయూ ఉండదు.

విస్తరివేసి ఎవరైనా వడ్డించిన అన్ని అరువులూ కలిపి ఒక ముద్ద చేయును. కొని పిడికెళ్ళు విస్తరికి అటూ ఇటూ చల్లి రెండుమూడు కబళములను మాత్రము నోట వేసుకొనును. లేనిచోవడ్డనపూర్తి కాగానే లేచి పారిపోవును. ''అన్నమును ఎందుకు ఇట్లు చల్లెదరు?'' అని ఎవరైనా ప్రశ్నించిన 'యోభూతాః ప్రచర్తని దివానక్తం బలిమిచ్ఛంతో' - బలి వేయక పోయిన రుద్రునకు కోపమువచ్చును. అని బదులిచ్చును. ఒకమారు అరుణాచలయ్యరు ఇంటికి స్వామి వెళ్ళెను. యధాప్రకారము విస్తరి చుట్టూ మెతుకులు చల్లెను. 'ఇది భూతములకు బలి. ఇది దేవతలకు బలి దేవలకు బలి యేయనిచో వారి కాహార మెట్లు?' అని అరుణాచలయ్యరును అడిగెను. 'నాకనులకు కనపడలేదే' అని అయ్యరు. 'చక్కగా చూడు. స్తంభము ప్రక్కనే నిలుచుని వున్నారు' అని స్వామి. స్వామితినునపుడు రుచిని గమనింపరు. ఏదో నిర్బంధముతో వ్యాధి గ్రస్తుడు మందుపుచ్చుకొన్నట్లు ముఖము పెట్టి అహరించును. కొందరు స్వామికని కడుశ్రద్ధతో పాలను కాచి తీసుకొని వచ్చుటకద్దు. ఆయన ఏ చోటులోను అగుపడడు. వెదకుట పెద్దపని. కంబత్తి లయనారు గుడికి రాత్రి వచ్చును కనుక పాలతో జనులు అచటికి హాజరయ్యేవారు. స్వామి రాగానే వారిని పోపో అని కసరివేయును. బ్రతిమాలి జనులు లోటాలను అందింతురు. స్వామి లోటాను తీసుకొని పాలను క్రింద పోయును. లేదా పాలను చేతితో కలియబెట్టి క్రిందపోయును. లేదా నోట పాలను పోసుకొని పుక్కిలించి ఉమ్మివేయును. క్షీరముతో దంతధావన, ముఖప్రక్షాపళనము చేయును. తెచ్చిన పాలకు ఇది వినియోగము. చుట్టూ, ఎనిమిది గంటలైనచో భైరవ మూర్తులు హాజరు. ప్రతిరోజు శ్వాస సంతర్పణ జరుగును. పాలు కానీ పంచామృతముకానీ సరే స్వామికి జిహ్వా చాపల్యము లేదు.

ఇలయనార్‌ అనగాచిన్నవాడు. కంబత్తిల్‌ ఇలయనార్‌ అనగా స్తంభములో కనిపించిన చిన్నవాడు; సుబ్రహ్మణ్యుడు ప్రౌఢ దేవరాయలు విజయనగర సామ్రాజ్యము పాలించు సమయమున అరుణగిరినాధుడన్న సుబ్రమణ్య స్వామి భక్తుడు, అరునాచలవాసియై యుండెను. తమిళమున ఇతడు వేలకొలది కీర్తనలు పాడెను. వానిని. తిరుప్పుగళు లని అందురు. ఇవి త్యాగరాజు కీర్తనలవలె ద్రావిడ భాషలో శాశ్వతగౌరవము కలవి. రాయలకు అరుణగిరి అన్న అభిమానము, భక్తి సంబంధ అండా అను జైనునికి ఈ సఖ్యము ఈ సుపుట్టించెను. రాజు అరుణగిరిని ఒకరోజు పొగడగా, 'అరుణగిరి అంత మహనీయుడైనచో తన దైవమును నీకు చూపలేడా?' అని సంబంధుడు ప్రశ్నించెను. రాయలు స్వామిని చూడవలెనని, అరుణగిరిని ప్రార్థించెను. 'నీవు ఐహిక జీవివి. స్వామి దర్శనము నీవు భరింపలేవు' అని అరుణగిరి అనెను. 'కండ్లు పోయిననూ సరే స్వామిని నేను చూడవలసినదే అని' రాయలు పట్టుబట్టెను. అరుణగిరి ప్రార్థనను మన్నించి, ఇలయనార్‌ కంబమున గోచరించెను. అందుచే క్షేత్రమూర్తి కంబత్తి లయనారయ్యెను.

రామనాథపురం మాణిక్యస్వామి కావికట్టిన పరదేశి, అతనికి స్వామి అతనచో ప్రేమ. భిక్షమెత్తి భిక్షాన్నమును స్వామికి సమర్పించును. స్వామి ఆహారము తీసుకొన్న కానీ తాను తీసుకొనడు. నాలుగు రోజులు స్వామి కనిపించనిచో మాణిక్యస్వామికి నిరాహారమే. అతనికి ఇదొక వ్రతము. స్వామి కనడనిచో, భిక్షమెత్తిన అన్నమును భద్రపరచునే కాని మరల భిక్షమునకు వెళ్ళడు. ఒకరోజు కంబత్తిలయనారు గుడిలో స్వామి ఉండగా, తాను నాలుగురోజుల క్రితము సేకరించిన అన్నమును స్వామి ముందుంచెను. పాత్రపై మూత తీయగానే గుప్పు మనెను. వాసన, వానిలో క్రిమిసంతతియు కలదు. ఐదారు రోజులుగ నిలువ చేసిన అన్నము. దానిని తాకుటకు కూడ మనస్సు ఒప్పదు. కాని స్వామి మాణిక్య స్వామి భిక్షనంగీకరించి ఆకులో వేసుకొని తినుటకు ప్రారంభించెను. ఇతరులు వద్దన్ననూ వినలేదు. మాణిక్య స్వామినీ తినమని ప్రోత్సహించెను. ముఖము మృష్ణాన్నము తినుచున్నట్లుండెను. స్వామి జిహ్వాజయ మట్టిది.

ప్రాణికోటికి నిద్రఅవసరము... కాని అది మితిలోనే ఉండవలెను. కాయకష్టము చేసిన వారికి, మితిమీరి తినిన వారికి నిద్ర అధికము. మితిమీరిన తామసికయే. స్వామి నిద్రాజయము గొప్పది. మధ్యాహ్నమైనను సరే, నడిరేయి ఐననూసరే. ఆయన నిదురపోడు. అర్థరాత్రి ఆసనమున కూరుచుండి సమాధిష్ఠుడై యుండును. ఎవడైన తూగుచుండెన - 'నిద్రపోకు. యముడు నిన్ను పట్టుకొని పోవును' అని బెదిరించును.

స్వామి అనుగ్రహమున నొకనికి పదివేల రూపాయల నష్టము తప్పెను. తన కృతజ్ఞత చూపుటకు, స్వామికి భూశయ్యతక్క వేరేమియు లేదే యని, ఒక దూది పరుపు తయారు చేసి కంబత్తిలయనారు గుడికి తెచ్చెను. స్వామియు నిరాకరించక దానిని వాడుకొనుచుండిరి. ఆ పడక పడుకొనుటకే కాదు - కూర్చొనుటకు కూడ, భోజనమూ దాని మీదనే - వారము రోజులలో ఆపడకలో చేరిన మురికికి అంతులేదు గుడికి వచ్చినవారు ఈ శయ్యకు కూడా కలిపి ఒకనమస్కారము పెట్టుదురు. ఈ శయ్యాగాధ 1921 నుండి, 1925 వఱకు జరిగినది.

మధ్యాహ్నము సాధుసత్రము పెరటిలో స్వామికి విశ్రాంతి. చీపురు, చేట, బుట్ట, తట్ట, గంప, గడ్డపార ఎక్కడి వక్కడ ఉన్న వాని మధ్య స్వామి సేదతీరును. చుట్టూ ప్రాకుతున్న చీమలకూ స్వామిసొంతమే వానిమధ్య - ''అలవైకుంఠ పురంబులో నగరిలో ఆమూల సౌధమ్ములో' అనునట్లు స్వామి హాయిగా పండుకొనును.

స్వామి చుట్టూ ఎప్పుడూ జనమే. ప్రాపంచిక విషయములతో అక్కరలేని స్వామి, వీరి బాధ తప్పించుకొనుటకు ఒక విచిత్ర సంభాషణ సాగించును. ఆ సంభాషణకు ముందు వెనుక లుండవు. అర్థమూ, అన్వయమూ ఉండదు. ఉదాహరణకు :

'వాడెవరు? వీడెవరు ? సొంతమనుష్యులా మాట్లాడుతున్నారు. కాలమూ గీలమూ ఉంటే మాత్రం ఏమి? అవసరమా? అబ్బ అని నిట్టూర్చి, ఇల్లు చక్కబెట్టుకొని ఉద్యోగం చేయవలె. ఊరు చేరితే వివాహమే. గుడీగంటా, కోతీకుక్కా అన్నీ ఒకటేనా? నిద్రపోతే వడలూ, వడియాలూ, బండ్ల బండ్లగా పీనుగలు, దేశాంతరం పోతే గార్దభ మేమి చేయగలదు. స్వామీ? తెల్లచీరకట్టుకొని సొగసుగా, అక్కా చెల్లెలు మామా మరిదీ, రైలుబండిపోగా తెల్లవాడుకదా చేసినది. బేమాని వదులుతాడా? ఉస్తికాయ ఉస్తికాయనే కాని ఉద్యోగం మాత్రం గొప్ప, రాత్రీ పగలూ కొక్కొరోకో. నూలు వడికితే కాలణా సంపాదన. నూనె రాచుకొని బదులిస్తే వాడు వింటాడా? వంకాయ, గుమ్మడి కాయా, కడపటికి అంగడికే వచ్చింది. పూజారి ఉడుక కొట్టి నాడు, అరరే దేవ విమానం, విశ్రాంతియా తీరుబడియా? ఏమి చెప్పటం ఏత్రోవా కనబడదు. అభిసారిక కచ్చేరికిపోయి ఔపాసన వేస్తే విధవ ఉయ్యాల లూగుతుందా? పట్టణత్తు స్వామి తాయు మానవరు. ఆదిశంకరులు. ఏమి చేసాం? రేపురా అని చెప్తే బోడిముండ మాటవింటుందా? రావణుడు సీతను ఎత్తుకొని పోయాడు. వానకురిసి ఆకలెత్తితే తిరుపతి వెంకటాచలపతి ఏడుకొండలపైననే తిష్ఠ బాడుగ బండి రైలు స్టేషనుకు. కుప్పదిబ్బమీద కాపురం. చీపురుకట్టా కోచి బండీ ఇంటికి వస్తుందా? ఆమె ఊరకే వదులుతుందా? నాగతి ఏమి అని అడుగుతుంది. మీరు భోజనము చేస్తున్నారా? ఎలుకను పిల్లి పట్టుకొంది. రాక్షసీ అని వాడు పిలుస్తున్నాడు. మీ ఇంటిలోనూ అంతేనా? ఎందుకు వినడు స్వామీ? మగవానికి ఆడది కావాలి. ఇక్కడ పదిమంది అక్కడ పదిమంది అక్కడ ఏనుగు వచ్చి నిలిచింది. ఊ ఊ కాశికి పోయినవాడు తిరిగి వస్తే మాత్రం ఏమి? రాముడు ధీరోదాత్తుడు. ఆక్షేపమేమి? అందుచేత తిరునాళ్ళకుపోనక్కర లేదు. కాళిదాసు మహాకవి.''

స్వామి సంభాషణ ఈ విధంగా సాగేది.

భగవాన్‌ రమణమహర్షులు శేషాద్రిస్వాములూ సమకాలికులు. వయస్సులో శేషాద్రిస్వామి పెద్ద. అపరోక్షాను భూతిలో ఇరువురూ సమానులే. వారికి పరస్పరము గౌరవ భావ మెక్కువ. తరచు అవినాభావ సంబంధముతో వాడు మాట్లాడుకొనే వారు. వారిస్థితి అద్వైతస్థితి అందు భేదమునకు తా వెక్కడిది.?

భక్తులు ఒకప్పుడు ఒక క్రొత్త సోఫాను తెచ్చి రమణులకు సమర్పించారు. దానిని ఉపయోగించవలసినదని ప్రార్థించారు. అందులకు భగవానులు అన్నారట, ఎదురుగా వేసియున్నది సోఫా అనీ, అందులో నేను కూచోవలెననీ, నాకు తెలియదా ఏమి? దేహమును మరచుటకు నేను శేషాద్రి స్వామినా?'

లక్ష్మీ అమ్మాళ్‌ కు రమణులయందు గాఢమైన భక్తి. ఆశ్రమములో పరిచర్య చేసేటప్పుడు కూడ భగవానులపైననే ధ్యానము. ఆమె శేషాద్రి స్వామిని చూచినది లేదు. ఒకరోజు ఆయన దర్శనం చేయవలెనని బయలు దేరినది. ఎంత వెదకిననూ స్వామి కనుపించలేదు. ఏడవరోజు స్వామి కనపడ్డారు. రమణులనే ధ్యానించుచూ స్వామి ముందు లక్ష్మీ అమ్మాళ్‌ నిలబడ్డది. అక్కడైతే నేమి? ఇక్కడైతేనేమి ; రెండూ ఒక్కటే అని స్వామి అన్నారట.

ఈ అభేద భావానికి మరొక దృష్టాంతము. సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ఆస్తికులు. వారికి ధ్యానము చేయవలెనని తోచినది. 'పూర్ణాది లేహ్యమును సేవించిన ధ్యానసిద్ధి అగునని అందురే? దీని నిజమేమి? అని ఆయన భగవాన్లను ప్రశ్నించెను.' ''అదేమీ అక్కరలేదు. అయోచన కూడ వద్దు'' అని భగవాన్లు బదులిచ్చారు. శాస్త్రి ఇంటికి వెళ్ళిన పిదప, భగవానుల హెచ్చరికను లెక్కచయక లేహ్యం సేవించారు. వెంటనే ఆయనకు విపరీతపు టాలోచనలు మొదలు పెట్టి, తలచుట్ట నారంభించెను. ఆ బాధ భరింప రాకుండెను. రాత్రి తొమ్మిది గంటలకు శేషాద్రి స్వామిని చూడవలెనను సంకల్పం కల్గింది. శాస్త్రి స్వామిని అన్వేషిస్తూ ఇలయనారు గుడికి రాగా, అక్కడ ఆయన తన విచిత్ర సంభాషణ చేస్తున్నారు, శాస్త్రిని చూడగానే 'నేను ఆ లేహ్యం తినవద్దని చెప్పానుగదా? బుద్ధిలేక ఎందుకు దానిని తినినావు?' అని అడిగారు. శాస్త్రి, 'రమణులు కదా లేహ్యం తినవద్దన్నారు, పోనీ ఎవరు చెప్పితే ఏమి? మహనీయుల వాక్కులంగా ఒక్కటే'అని సరిబుచ్చుకొన్నారు.

కాన్యకంఠ గణపతిముని సిద్ధకవి. రమణులు సుబ్రహ్మణ్య అంశయనీ, గణపతిముని గణపతి అంశయనీ ప్రతీతి గణపతి ముని భగవానులకు శిష్యుడు. బాల్యముననే పంచాక్షరి తారామంత్రము ఆయనకు ఉపదేశ##మై యుండెను. ఆయన లక్షల కొలది జపము చేసెను. నవద్వీపమందు పండిత సభలో ఆయనకు కావ్యకంఠు డన్న బిరుదు నిచ్చిరి. అచ్చట గణపతి రితి కవికులపతి రతిదక్షో దాక్షిణాత్యోహం' అని దర్పముగా ఆయన సభలో చెప్పుకొనెను. 1903 లో తిరువణ్ణామలెకు వచ్చి రమణులను గురువుగా స్వీకరించి భగవానుల ఉపదేశము లను ఛందోబద్ధము చేసి రమణగీత అను పదునెనిమిది అధ్యాయముల పుస్తకము నొకటి వ్రాసెను. కావ్యకంఠులకు భగవానులు కులదైవమైనచో, శేషాద్రి స్వామి ఇష్టదైవము.

స్వామిని గూర్చి ఆయన తరచు సంభాషించును. పొరుగు ఊరు వారు ఎవరైనావచ్చి స్వామిని గూర్చి అడిగిన, ''శేషాద్రి స్వామియా? ఆయనకు పిచ్చికదా? ఆ పిచ్చివానిని చూడనేల?'' అని అడుగును. అందులకు వారు నొచ్చుకొని స్వామిపక్షమున తీవ్రముగా వాదించిన, వారి భక్తికి మెచ్చుకొని సమాధానపడును. కుండలినీ ప్రసాదలబ్ధమైన దివ్యశక్తి స్వామికి కలదని గణపతిశాస్త్రు లందురు.

ఒకప్పుడు శాస్త్రిగారు శక్తి తత్వముపై వరుసగా పదిరోజులు ఉపన్యాసమిచ్చిరి. వారికుమారుడు మహాదేవునికి పెళ్ళి నిశ్చయమై యుండెను. కడపటిరోజు ఆయనకు బహూకృతిగా ఏబది రూపాయలు వసూలుచేసిరి. ఉపన్యాసము జరుగుచుండగా స్వామి హఠాత్తుగా అక్కడకు వచ్చెను. వివరములను ఏవియు తెలుపక, ఆడబ్బును వారి చేతిలో ఉంచిరి. స్వామి ఎందులకిది? అని అడుగగా మీ ఇష్టమొచ్చిన వారికి ఇవ్వండి - అని అన్నారట. వెంటనే గణపతి ముని చేతిలో ఆ పైకమును వేసి స్వామి;

వాగర్థా వివ సంపృక్తౌ వాగర్ఘ ప్రతిపత్తయే |

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ||

అని శ్లోకముచదివిరి. దీనిలో మహాదేవుని కల్యాణము సూచితమైనది.

మరొకమారు శాస్త్రి రామస్వామి శాస్త్రులతో కలిసి 'రమణ సమితి' అన్న సంఘము స్థాపించదలచిరి. ఈ విషయము భగవానులకు తెలుపవలెనని బయలుదేరిరి. దారిలో స్వామి కనబడి - సంఘము స్థాపించ బోవుచున్నారా? మంచి కార్యమే. అని వారితో అన్నారట ! అరగంటకు ముందు తీర్మానించిన ఈ విషయము స్వామి కెట్లు తెలిసినదని ఆశ్చర్యపడిరి.

స్వామి వత్తురని అంగడి వారందరూ కాచుకొని వుందురు. ఆయన అంగడిలో అడుగు పెట్టిన, ఆ నాడు లాభము ద్విగుణీతముగా నుండును. కాని స్వామి చిత్తవృత్తి ఆయనకే ఎఱుక. ఏదో తోచిన అంగడిలోనికి వెళ్ళును. సామానులను దోసిళ్ళతో ఎత్తి క్రిందపోయును. ధాన్యమును క్రింద చల్లును. సాధారణముగా ప్రతి అంగడిలోనూ స్వామి పటముండును. ఆ పటమునకు కర్పూరహారతి ఇచ్చినగాని వ్యాపారము ప్రారంభించరు.

ముత్యాలు చెట్టిగారి అంగడికి మాత్రము స్వామి పిలువకనే వెళ్ళుదురు. స్వామికి చెట్టిగారన్న ప్రీతి. చెట్టి గారికి జవిళీ, దినవెచ్చపుకొట్టు - రెండూ కలవు. ఆయన సిబ్బందియూ అధికము. చెట్టిగారికి దైవభక్తి ఎక్కువ కర్పూరమును మాత్రము చెట్టి తన చేతి క్రిందనే ఉంచుకొని స్వయముగా అమ్మును. కాలణాకర్పూర మడిగిన కాలురూపాయ కర్పూర మిచ్చును. కర్పూరము అరుణాచలుని సన్నిధికి పోవును. అందుచే చెట్టి నష్టమునకే అమ్మును. సిబ్బందిలో కొందరు డబ్బునూ వస్తువులనూ కాజేయుదురు. చెట్టి వారిని మందలించును. కాని పనినుండి తొలగింపడు. చెట్టి అంగడిలో స్వామికీ అమిత స్వాతంత్య్రము. చెట్టిగారి డబ్బు పెట్టె తెరచి నాణములను క్రిందకుమ్మరించిన చెట్టి ఊరకుండును. స్వామి అనుగ్రహమున వ్యాపారములో చెట్టికి ఏడెనిమిది లక్షల లాభము వచ్చినది. ఒకరోజు స్వామి నిండిన నేతి డబ్బాను బయటకు తీసుకొనిపోయి వీధిలో కుమ్మరించి తన దారిని పోయెను. మరుసటిదినము రాదని నిరాశ చేసుకొన్న ఖాతా ఏడువందల రూపాయలు చెట్టిగారికి జమ అయెను. మరొకమారు చెట్టి జవిళీ అంగడినుండి వెలగల ఒక పట్టు దుప్పటము స్వామి గ్రహించి దానిని పేలికలు పేలికలుగా చించి ఎచ్చమ్మగారి బఱ్ఱ కొమ్ములకూ కాళ్ళకూ తోకకూ, కట్టిరి, ఆ రోజు చెట్టిగారికి వ్యాపారమున రెండు వేలరూపాయలు లాభము వచ్చెను.

తిరువణ్ణామలెలో ఒక మామిడి పళ్ళ వర్తకుడు వెలకలిగిన నాలుగైదు పండ్లదినుసులను వ్యాపారమునకై కొని ఉండెను. ఉదయమున త్రోవలో పోవుచూ స్వామి ఒకపండు నెత్తుకొనెను. దుకాణదారుడు ఆ సమయమున లేడు. సేవకునికి స్వామిని గుఱించి తెలియదు. అతడు కోపించి చేతిలో ఉన్న పండును లాగుకొని బుట్టలో పడవేసెను. ఇరుగు పొరుగు వారు చెప్పిననూ వినలేదు. అంతే మరుసటి దినమునుండే ఆ పళ్ళలో ఒక్కటియు విక్రయము కాలేదు. అన్నీ కుళ్ళినష్టమాయెను. దుకాణాదారుడు సేవకుని చీవాట్లు వేసెను.

మురుగ& బండితోలేవాడు. వాని తల్లిపేరు ఉణ్ణామలె. వీధిపై మురుగడు నిద్రపోతూ వుండగా స్వామి అతని ఇంటికి వెళ్ళారు. ఉణ్ణామలె స్వామిని ఆహ్వానించింది. గంజి ఉన్నదా? అని స్వామి ఉణ్ణామలెను అడిగిరి. వెంటనే ఒకలోటా గంజి తెచ్చి ఉణ్ణామలె స్వామి ముందుంచి కొడుకును లేపినది. మురుగడు 'స్వామీ క్షమించవలె నిద్రపోయాను. అని వచ్చి నమస్కరించెను.

'ఏమి ! బండి తోలడము లేదా?'

'లేదు. గిరాకీ ఏమీ దొరకడము లేదు'

'ఇంకేం. ఐతే బండినీ ఎద్దునూ అమ్మివేయి' అని స్వామి బయలుదేరినారు.

మరుసటివారము మురుగనికి అదృష్టము తన్నుకొని వచ్చినది. మురుగని దూరపుబంధువు చెన్నపురి చింతాద్రి పేటలో ఉండెను. పదివేల రూపాయల ఆస్తి కలవాడు. ఒక్కతే కూతురు. వేరుసంతతి లేదు. ఆ పిల్లను మురుగనికిచ్చి పెళ్ళి చేసెదనని కబురంపెను. స్వామి చెప్పిన విధముగనే మురుగడు బండినీ ఎద్దునూ అమ్మి చింతాద్రిపేటలో తల్లితో బాటు శ్రీమంతుని ఇల్లరికపు టల్లుడుగా స్థిరపడెను. !

చొక్కలింగము మంగలి. ఈ నాపితునికి స్వామిని చూచిన రోజు పంట. స్వామికి క్షవరము చొక్కలింగమే చేయును. స్వామిక్షవరము చేసుకొనుచూ, ఒక చెంప ఒక వంక మీసము తీయగానే దడాలున లేచి వెళ్ళిపోదురు. ఆ వేషముతో ఒక పక్షము రోజులు స్వామి వీధులలో పచార్లు చేయును. క్షవరమునకు వలసిన శుల్కము, దుకాణాదారుడు కుప్పుస్వామియో, చిన్న గురుకులో ఇచ్చుట వాడుక.

ఒకనాడు స్వామి, 'చొక్కలింగమూ! క్షవరము చేయుదువా?' అని అడిగిరి. 'సాంతము చేకుకొన్నచో చేసెదువా?' అని అడిగిరి. 'సాంతము చేసుకొన్నచో చేసెదను' అని చొక్కలింగ మనెను. స్వామి కట్టుబడి ఆరోజు పూర్తిగా వపనము చేయుంచుకొనిరి. కానీ ఆ రోజు చొక్కాలింగమునకు డబ్బు ఇచ్చువారు కనపడలేదు. సాయంత్రము ఇంటికి వెళ్ళుచుండగా స్వామి సేవా ఫలితమో అన్నట్లు చొక్కలింగమునకు ఐదురూపాయల నోటు దొరికినది.

అలుమేలు తిరువణ్ణామలెలో దాసీవృత్తిచేసి జీవించేది. స్వామి ఒకనాడు ఇప్పచెట్టుక్రింద సుఖాసీనులై కూరుచుని యుండగా అలుమేలు వెళ్ళి నమస్కరించెను. స్వామి తనముందు పడివుండిన ఎండిన చామంతి పువ్వునుదీసి గణిక శిరస్సుపై వాసనచూసి వేసెను. ఆవారములో ఒక ధనికుని మూలమున ఆగణికకు గొప్ప ధనలాభము కలిగెను.

స్వామికి అన్ని వృత్తులూ సమానమే. అందరి ఎడలనూ అనుకంపయే. స్వామిని సేవించిన వారికి, వారి వారి వృత్తులలో ఏదో ఒక విధముగా అభివృద్ధి కలిగేది. స్వామికృపచే చాలమందికి ధనలాభమూ పై పదవులూ కలుగుట సాధారణ ముగా నుండెను.

దివాన్‌ బహదూరు సుందరశెట్టి, 1909 - 1910 లో తిరువణ్ణామలెలో న్యాయాధికారిగా నుండెను. స్వామివారి యోగసిద్ధినిగూర్చి చెట్టిగారికి తెలిసెను.... స్వామిని దర్శించ వలెనని ఆయన అనుకొనెను. స్వామి తనంతట చెట్టి ఇంటికి వెళ్ళెను. స్వామిని చూడగనే, తన ఇష్టదైవమే స్వామి రూపమున వచ్చినట్లు చెట్టిగారికి తోచినది. ఆసనమిచ్చి ఆతిధ్యమును స్వీకరించవలసినదని వేడుకొనిరి. స్వామియు అంగీకరించి విస్తరిముందు కూర్చుండెను. స్వామి యధా ప్రకారము మెతుకులను ఇటూ అటూ చల్లి, భోజనము చేసెను. భోజనానంతరము ఒక క్రొత్త పంచను తెచ్చి స్వామికి చెట్టి సమర్పించెను. స్వామి దానిని కట్టుకొని తన వస్త్రమును స్వయముగా చెట్టికి అంగవస్త్రముగా వేసెను దానిని తీసి మరల వేసి, మరలతీసి మరలవేసెను. తర్వాత చెట్టి ఇంటినుండి బయలు దేరెను.

1927 లో చెట్టి దక్షిణ ఆర్కాటు జిల్లాలో జిల్లాజడ్జీగా పనిచేయుచుండెను. విశ్రాంతి కొరకు కొన్ని రోజులు సెలవుతీసుకొని ఊరికి పోవుచూ తిరువణ్ణామలెకు వచ్చెను. స్వామి వద్దకు నమస్కరించపోగా స్వామి అటు ఇటు పరుగెత్తెను. చెట్టిగారున్నూ స్వామిని వదలలేదు కొంతసేపటికి స్వామి చెట్టిని చేతులు చాచమని చెప్పి. తన చేతులతో గ్రహించి పైకీ క్రిందికి ఎత్తి దింపెను. కొంతసేపు తన విచిత్ర ధోరణిని మాటలాడి బయలుదేరెను.

జడ్జి అంతక్రితమే సేవకుని ఒక నూతన వస్త్రమును తెమ్మని చెప్పిపంపియుండెను. 'అయ్యో ! వస్త్రము వచ్చుటకు ముందే స్వామి వెళ్ళిపోయరికాదా అని చెట్టి విచారించు చుండగా స్వామికి సేవకుడు ఎదురు పడెను. స్వామి స్వయముగా సేవకుని వద్ద నుండి వస్త్రమును దీసుకొని మెడపై వేసుకొనెను. చెట్టి చూచిసంతోసించెను. తిరువణ్ణామలెనుండి అనుకొనినరీతి చెట్టి విశ్రాంతికై స్వగ్రామమునకు వెళ్ళెను. సెలవుపూర్తి అగులోపల ఆయనను హైకోర్టు జడ్జీ పదవికి నియమించినట్లు వార్త వచ్చెను.

శివప్రకాశము పోలీసు శాఖలో సబ్‌ ఇన్సెపెక్టరుగా పనిచేయుచుండెను. నెలకు డెబ్బది రూపాయల వేతనము. ఒకనాడు ఏదో పనిమీద అతడు సర్కిల్‌ ఇన్స్‌పెక్టరు ఇంటికి బయలుదేరెను. దారిలో స్వామి ఎదురై 'నీకు పదిరూపాయలిచ్చెదను తీసుకొందువా? అని అడిగిరి.' పై అధికారి ఉన్న ఉద్యోగము ఊడబీకకున్న చాలురు, హెచ్చు జీతము కూడనా?' అని ఎదురు ప్రశ్న వేసెను. 'అధికారి ఇచ్చిన ఏమి? ఇవ్వకున్ననేమి? నేను ఇచ్చెదను తీసుకో అని స్వామి అతని టోపిని తనతలపై ఉంచుకొని తన ఉత్తరీయమును అతని మెడపై వేసి ఆవేషముతో ఇరువురూ కలసి సర్కిల్‌ ఇన్స్‌పెక్టరు ఇంటికి వెళ్ళిరి.

ఇన్స్‌పెక్టరు భార్య శివప్రకాశమును చూచి 'మీకు మంచికాలం వచ్చినట్లున్నది. ప్రమోషన్‌ అవుతుంది లెండి' అని చెప్పినది. దానికి స్వామి నవ్వుచూ, 'ఔను, ఔను' అని తన ఊపిరి. పిదప మొదలియారు వేదాంత విషయముగా స్వామిని ఏదో ప్రశ్నించెను. అంతటితో స్వామి తటాలున లేచి అతని తలపాగను అతని తలమీద ఉంచి, తన ఉత్తరీయమును తీసుకొని- 'ఇదో ఇందుకే పోలీసువారి సహవాసం కూడదు అని చెప్పటం. నయవంచకులవలె గ్రుచ్చి గ్రుచ్చి ప్రతివిషయమూ అడిగి, తెలుసుకొంటారు' అని వెళ్ళిపోయెను.

ఆదినమే అతనికి జీతము, 70 రూపాయలనుండి 80 రూపాయలకు అధిక మయినట్లు వార్త అందెను. Dsp, శివప్రకాశమునకు ప్రమోషను ఇవ్వకూడదని ఉండగా Asp, శివప్రకాశము పక్షమున మాట్లాడి Dsp ని వేతనాభివృద్ధికి సుముఖముగా ఒనర్చినట్లు తర్వాత తెలిసినది.

వెంకటరామయ్యరు డేనిష్‌విషను స్కూలులో ఉపాధ్యాయుడు. ఏ కారణముచేతనో పై అధికారులు తాత్కాలికముగా అతనిని పనినుండి తొలగించి మూడు మాసముల జీతమును ఇవ్వకుండిరి. అధికారులలో కొందరు అతనిని ఉద్యోగమునుండియే తీసివేయవలెనని పట్టుబట్టియుండిరి. పాపము అతనికి నిత్యగండము, పూర్ణాయుస్సుగ నుండెను. స్వామి భూత నారాయణుని ఆలయమువద్ద ఉండగా, వెంకట్రామయ్యరు తన పాదరక్షలను వదలి స్వామికి నమస్కరించిరి. నమస్కారముచేసి లేచెనోలేదో, స్వామి అతని పాదరక్షలలో నొకటితీసుకొని వెంకట్రామయ్యరు నెత్తిమీద బలముగా కొట్టిరి. వెంకట్రామయ్యరు ప్రాణములు విలవిలలాడెను.

అన్నీ మంచిదే అని ఆయన తన పాఠశాలకు పోయి చేరగా మేజాపై ఒక కవరు ఉండెను. దానిని చూడగనే వెంకట్రామయ్యరుకు ముచ్చెమటలు పోసెను. కవరును తెరచుటకు కూడ భయపడెను. ఎటో గుండె ధైర్యము చేసుకొని కవరును చించిచూడగా వెంకట్రామయ్యరును ఆ బడికే హెడ్‌ మాష్టారుగా నియమించినట్లు దానిలో ఉండెను. ఉద్యోగమే పోవునని భయపడిన వానికి ప్రమోషను ఆకాశము నుండి ఊడిపడినట్లుండెను. స్వామి తనకు చేసిన పాదరక్ష పూజ, ప్రధానోద్యోగ పదవి తెచ్చి పెట్టెనని వెంకట్రామయ్యరు నలుగురితో చెప్పుకొనెను.

ఐరావతమయ్యరుకు వేలూరిలో స్కూలు మాష్టరు ఉద్యోగం. ఆయనకు చాలరోజులుగా శ్రీవిద్యాదీక్ష పొందవలెనని ఆశ. ఒకమారు రమణమహర్షినీ, కావ్యకంఠులనూ దర్శించి వచ్చెదమని ఆయన తిరువణ్ణామలెకు వచ్చెను. అయ్యరు హోటలులో కాఫీ త్రాగుచుండగా స్వామి వచ్చెను. అయ్యరు హోటలులో కాఫీ త్రాగుచుండగా స్వామి గబగబ వచ్చి తినుబండారములున్న అలమారు సమీపించి రెండు మూడు మిఠాయి తునకలను తీసుకొని, ఒకటి నోటిలో వేసుకొని మిగత ఐరావతమయ్యరు చేతిలో వేసెను. అయ్యరు అక్కడనే సాగిలబడెను. అచ్చటినుండి కావ్య కంఠులున్న చోటికి పోగా ఆయన ఇంటిలోనే వుండిరి. అదొక శుభసూచనగా అయ్యరుకుతోచెను. కావ్యకంఠులకు నమస్కరించి లేవగానే, ఆయన స్వయముగా - 'నీకు, పంచదశాక్షరి ఉపదేశించెదను. దాని వలన నీకు మేలు కల్గును' అనిరి. తన చిరకాలాభిలాష సులభముగా నెరవేరినందులకు శేషాద్రి స్వామి దర్శనమే కారణమని అయ్యరు అనుకొనెను. వేలూరు చేరిన వెనుక ఆయనకు ఒకవారములో వేతనాభివృద్ధియు కల్గెను.

వైష్ణవు లొకరు తిరువణ్ణామలెలో పోలీసు ఇన్స్‌పెక్టరుగా ఉండిరి. స్వామి అన్నచో చాల భక్తి. ఒకరోజు తనచేతి బెత్తముతో ఎవరినో గద్దించు చుండిరి. స్వామి వెళ్ళి ఆయనచేతిలోని బెత్తమును లాగుకొని దానితో ఇన్స్‌పెక్టరుగారికే నాలుగు వడ్డించిరి. ఏమి అపచారమో అని ఇన్స్‌పెక్టరు నమస్కరించి దూరముగా నిలుచుండెను. ఇది జరిగిన కొద్దిరోజులకు మైసూరు సంస్థానమున ఆయనకు ఒక పెద్దపదవి లభించెను.

సబ్‌మేజస్ట్రీటుగారికి ఒకరికి ఉద్యోగము పోయినది. పై అధికారులకు అప్పీలు చేసుకొని స్వామి దర్శనార్ధము ఆయనవచ్చెను. ఏడురోజులైనను స్వామి కనిపించలేదు. ఎనిమిదవరోజు స్వామి శివగంగతీర్థమున ఉండగా మేజస్ట్రీట్‌ ఆదారిని పోవుచుండెను. ఆయనను చూడగానే స్వామి తన ఉత్తరీయమును నీటిలో తడిపి, తడిగుడ్డను ఆ మేజస్ట్రీటు నెత్తి మీద పిండిరి. మంచి కాలముకనుక మేజిస్ట్రీటుకు కోపము రాలేదు. ప్రక్క నున్నవారు అయనే స్వామి యని తెల్పిరి. ఆయన స్వామిని అనుగమింప యత్నించెను. కాని స్వామి చిక్కలేదు. మేజిస్ట్రీటు ఊరికి తిరిగిపోయెను. రెండు రోజులలో పై అధికారులు ఆయన అప్పీలును ఆమోదించి తిరిగి ఉద్యోగమిచ్చినట్లు వార్త వచ్చెను.

శ్రీ బి. వి. నరసింహస్వామిగారు సేలము నగరములో ఒక పెద్ద న్యాయవాది. ఒకప్పుడు మద్రాసు శాసనసభలో ఆయన సభ్యులుకూడ. దేశ సేవలో కూడ పాల్గొనినారు. ఒకేరోజు వీరు పుత్రులిద్దరు ఆడుకొనుచు ఇంటి వెనుక నున్న నూతిలోపడి మరణించిరి. ఆ నాటి నుండి నరసింహస్వామి గారిలో ఒక విచిత్ర పరివర్తన ఏర్పడెను. లౌకిక జీవితము కై విరక్తి, వైరాగ్యము కలిగెను. ఆయనకు శ్రీరామచంద్ర మూర్తిపై, భక్తి, గృహవిషయములలో నిర్లిప్తుడుగా నుండెను.

రమణమహర్షులను దర్శించవలెనని కోరికపుట్టి ఆయన తిరువణ్ణామలెకు వచ్చెను. ఒక్కమారు శేషాద్రి స్వామిని కొన్ని క్షణములసేపు చూడగల్గిరి. రమణాశ్రమము కొంత కాలముండి రమణమహర్షి జీవితాంశములను సేకరించి వారి జీవితచరిత్ర వ్రాసెను. హరి ద్వారమువరకు ఉత్తర దేశ యాత్రలు సహితము చేసిరి. సాయిబాబ బోధలను సాయి భక్తిని బహుళ ప్రచారము చేసినవారు వీరే.

ఒకమారు నరసింహస్వామి తనకు శేషాద్రిస్వామిని దర్శించి కొంతసేపు ఇష్టాగోష్టి జరుపవలెనని ఆశగా ఉన్నది అని నారాయణశాస్త్రితో అన్నారట. ''మీరు రామభక్తులుకదా రామానామజపం చేయండి. మీ కోరిక సిద్ధించక పోదు' అని నారాయణశాస్త్రి అన్నారు. అటుపైన నరసింహ స్వామి, స్వామిని దర్శించే అవకాశం ఏర్పడ్డది. స్వామి మాటలాడలేదు. కాని, 'పూర్ణమైన భక్తి భగవంతుని యందుంచిన అన్నియు సమకూరును' అన్న భావము సంజ్ఞలచే తెలిపిరట.

టి.వి. సుబ్రహ్మణ్యయ్యరు తిరువణ్ణామలె తాలూకా బోర్డు ఆఫీసులో గుమాస్తా. సూర్యోదయము ముందేలేచి ఆయన ప్రతిదినము గాయత్రీ జపము చేయును. దైవభక్తి కలవాడు. స్వామి అన్నచో పరమభక్తి. స్వామియు సుబ్రహ్మణ్యయ్యరు ఏదైనా ఇచ్చిన స్వీకరించును. ఒకరోజు అయ్యరు తాలూకా బోర్డు ప్రసిడెంటు ఇంటి అరుగుమీద కూర్చుండి ఏదో పని చూచుకొనుచుండెను. సుబ్రహ్మణ్యయ్యరు చాల రోజులగ కాశీయాత్ర చేయుటకు ఆరునెలల సెలవు ప్రెసిడెంటును అడుగుచుండెను. కాని ప్రెసిడెంటుకు సెలవు ఇచ్చుటకు ఇష్టము లేదు. పైగా బోర్డు ధనమును కాజేసి నందువల్ల అయ్యరు సెలవు అడుగుచున్నాడని అపవాదును కల్పింప నిశ్చయించెను. అంతేకాక అభియోగమును తెచ్చుటకు ప్రయత్నించుచుండెను.

స్వామి ఎచ్చట నుండియె విసవిస నడచివచ్చిరి. 'ఒరేయ్‌ ! తిన్నెమీద కురుచున్నవాడు సాధు బ్రాహ్మణుడు. వానికి అపకారం చేయాలని చూస్తున్నావు. నీవే మైనా అతనికి చేసినావంటే, నీ ఇంట పీనుగు పడును. జాగ్రత్త !' అని హెచ్చరించి వెళ్ళిపోయెను.

స్వామి మాటలు విన్నంతనే ప్రెసిడెంటుకు గుండెలాగి పోయెను. వణుకుపుట్టి ఏడురోజులవరకు జరగ్ర్వస్తుని వలె మంచముపట్టెను.

కొన్నిరోజులకు స్వామి అయ్యరును చూచి, 'ఈ ఉద్యోగం తప్పిస్తే, వేరే ఉద్యోగం దొరకదా? ఈ ప్రెసిడెంటు నీకు ఏసహాయమూ చేయడు. వేరే ఉద్యోగము, చూచుకో. వాడు నీకు ఏదైనా అపాయం తలపెట్టితే వాని ఇంటిలో పీనుగు పడుట నిశ్చయం. భయ పడకు పో !' అని అన్నారు. కొంతకాలమునకు అయ్యరు తిరుచినాపల్లిలో మరొక ఉద్యోగములో స్థిరపడెను.

భానుకవి తిరువణ్ణామలెలో ఒక విద్వాంసుడు, కొందరు సారస్వతాభిమానులు అతనిని 'యోగము, యోగి' అను విషయముపై ఉపన్యసింప గోరిరి.

భానుకవికి ముందు ఒకరిద్దరు ఉపన్యసించారు. రాబో యేది భానుకవివంతు. ఆ సభకు చిందబరములోని మహామహోపాధ్యాయ దండపానణీ దీక్షితులు అధ్యక్షుడు. దీక్షితులు ఏదో చులకనగా ప్రక్కనున్నవారితో 'ఎవ్వరో భానుకవి అట యోగము యోగినిగూర్చి ఉపన్యసించునట. ఒక యోగము చాలదా? ఇక యోగికూడ ఎందులకు?' అని పరిహాసముగా మాట్లాడెను. ఇది వినగానే భానుకవికి ఉన్న ధైర్యముపోయెను. సభలో లేచినిలుచున్నాడే కానీ నోట మాట రాలేదు. కొందరు భానుకవి పాటును చూచి, ఇంటికి వెళ్ళుటకు సన్నాహపడిరి.

ఇంతలో ఎచ్చటనుండియో స్వామివచ్చిరి, స్వామిని చూడగానే భానుకవికి పోయిన ప్రాణములు లేచి వచ్చెను. స్వామి పాదములకు మానసికముగా నమస్కరించి ఉపన్యాసము మొదలు పెట్టెను. విషయముతో బాటు భావము, భావముతోబాటు ధార- ఉపన్యాసము శ్రోతలకు రంజకముగా నుండెను. దీక్షితులు భానుకవి ఉపన్యాసధోరణికి ఆశ్చర్యపడెను. సభికుల ఆమోదమును, భానుకవి స్వామి పాదములకు సమర్పించెను.

పరశురామయ్యరు కొమార్తె ప్రసవించినట్లు అపాయ స్థితిలో ఉన్నట్లు, కడపటి చూపులకు రావలసినదని, అల్లుని వద్దనుండి తంతి వచ్చెను. అయ్యరుకు ఏమియు పాలుపోలేదు. స్వామివద్దకు తంతితో పరుగెత్తిరి. స్వామి ఇలయనార్‌ కోవిలలో నుండిరి. అయ్యరును చూడగానే - 'పోపో అపాయమేమీ లేదు. నీ భార్య ఏడుస్తూ ఉన్నదా? భయంలేదని చెప్పు' అని అన్నారట. దానితో అయ్యరు ప్రాణములు కుదుట బడెను. రెండు రోజుల తర్వాత అల్లుని వద్దనుండి నెమ్మదిగా ఉన్నట్లు వార్త వచ్చెను.

కృష్ణస్వామి కంట్రాక్టరు. అతనికి దాపున ఉన్న తిరుక్కోవిలూరులో కంట్రాక్టుపని. కాని మధురాంతకం అన్న చోటుకు వెళ్ళి ఏదైనా పనిచూచుకొందామని అనుకొని స్వామిని అడిగినాడు. 'అంతదూర మెందుకు? ఇక్కడ ఉన్నపని చాలదా? చూచుకో' అని అన్నారట. కాని కృష్ణస్వామికి ఆ మాటలు రుచించలేదు. అతడు మధురాంతకము వేలూరు మొదలైన ఊరులు తిరిగి కడపటకు తిరువణ్ణాలెకే వచ్చి చేరినాడు. 'ఔను, వానివాని కే స్వయంగా అనుభవం ఐతేకాని తెలియదు.' అని స్వామి అన్నారట.

ఒకరోజు కంట్రాక్టు విషయంగా ఉద్యోగులు తనికీకి వచ్చి ఏవిధముగా నైనా ఇతనిపనిలో లోపము కనిపెట్ట వలె నని తీర్మానించియుండిరి. కృష్ణస్వామి వీధిలో పోతువుండగా స్వామి - 'పోరాపో నిలువకుండాపో' అని అన్నారట. కృష్ణస్వామి త్వరపడి సకాలములో చేరుకొని అధికారుల ప్రశ్నలకు సరియైన ఉత్తరముల నిచ్చి వారిని మెప్పించ గలిగెను. లేనిచో అతనికి నష్టము కలిగియుండెడిది.

కృష్ణస్వామి శాస్త్రులు స్వామి దగ్గర బంధువు. అతడు సుబ్రహ్మణ్యస్వామి భక్తుడు. సనాతన ధర్మము పాటించే నిష్ఠగలవాడు, ఒకరోజు స్వామిని దర్శనము చేసుకోగా ఆయన కుంకుమను నొసటపూసి. విభూతిని దేహమంతాపూసి 'కాశీ రామేశ్వర యాత్రలు చేయిపో' అని అన్నారట. 'యాత్రలు చేయడానికి డబ్బు లేదు స్వామీ' అని శాస్త్రులు అనగా 'అంతా దొరుకుతుందిలే పో' అని స్వామి అన్నారు.

తిరిగివెళ్ళుతూ ఒకచోట నిలిచి మాట వరుసకు స్వామి చెప్పినది ఒకరితో చెప్పగా, అతడు వెంటనే యాత్ర లకు అగు ఖర్చు తాను భరించెదనని ఒక నూరు రూపాయల నోటు కృష్ణ స్వామి చేతిలో ఉంచెను. శాస్త్రి భార్యతో యాత్రలు చేసెను. స్వామిని దర్శించి ఈ మాట చెప్పగా 'నీవు బాగా ఉంటావు. లేపో - నీకు ధనప్రాప్తి సంతానమూ వున్నది.' అని అన్నారట. ఈ ఆశీర్వచనఫలితముగా కృష్ణ శాస్త్రికి పుత్రసంతానమూ, ఎప్పుడో కట్టిన లాటరీ చీటీలో మొదటి బహు మానమూ కొంతకాలమునకు కలిగినది.

ఒకరోజు స్వామివీధిలో పోవుచు రెండురాళ్ళను తీసి రోడ్డుకు ఒక ప్రక్కగా వేసెను. త్రోవలో పోవుచున్న ఒక పిల్లవాడు ఆరాళ్ళలో ఒకటి ఎత్తుకొన్నాడు. స్వామి వాని కొక లెంపకాయ వేయగా వాడు చెంపతడుము కొనుచూ, 'స్వామీ నేను ఈ సంవత్సరము ప్యాసవుతానా?' అని అడిగి నాడు. స్వామి నవ్వి - ఖండితముగా ప్యాసవుతావు అని అన్నారట.

వానికి పరీక్షలో సున్నామార్కులు, చదువులలో మందకొడి. కాని అతని ఆర్థికదుస్థితిని చూచి పరీక్షాధికారులు ఆ సంవత్సరము అతనిని పై తరగతిలో వేసిరట.

ఒకప్పుడు సూర్యనారాణయ్యరు అనే ఆయన స్వామి వేపచెట్టు క్రింద ఉండగా వెళ్ళిచూచిరి. 'అందరూ మిమ్ములను మహనీయులని చెప్పుకొంటారే? మీరు నాకు ఏదైనా ఆశ్చర్యకరమయిన విషయమును చూపి మీ మహత్యమును ప్రకటింపరాదా యని అడిగిరి.' స్వామి క్రిందపడి ఉన్న ఒక వేపాకు రెమ్మను అయ్యరు చేతిలో వేసి తినమన్నారు. అయ్యరు జంకుతూ రెండు ఆకులు నోటిలో వేసుకొని నమలగా అవి తియ్యగా నుండెను. ఆనాటినుండి అయ్యరుకు స్వామియందు నమ్మకము కుదిరెను.

Sri Seshadri swamy jevitam    Chapters    Last Page