Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page

సంధ్యావందనము

అస్త్రశస్త్రాలనే రెండురకాలైన ఆయుధాలు ధనుర్వేదం చెప్పింది. మంత్రపూర్వకంగా చేసే ప్రయోగమే అస్త్రం. దానివల్ల నాశం కావాలని అనుకొన్నవస్తువు నాశమవుతుంది. అనుదినమూ ప్రయోగంచేయవలసిన అస్త్రమొకటివున్నది. అసురనాశనార్థం అనుదినమూ బ్రాహ్మణులు చేయవలసిన అస్త్రప్రయోగమే సంధ్యావందనం. ఆ అస్త్రప్రయోగం చేసినామంటే మనబుద్ధిని ఆశ్రయించుకొన్న ఆసురశక్తులన్నీ సమసిపోతవి. ''నేను ప్రతిరోజూ ఎన్నోపాపాలు చేస్తున్నాను. అబద్ధాలు చెప్పుతున్నాను. ఇవన్నీ నా హృదయసీమలో జ్ఞానభాస్కరుని ప్రకాశానికి ప్రతిబంధకాలై ఉన్నాయి. ఇవితొలగిపోవాలి. జ్ఞానసూర్యుడు నాలోని తమస్సు పోగొట్టి సహస్ర కిరణాలతో ఒక్కుమ్మడి ఉజ్జ్వలంగా ప్రకాశించాలి'' అన్న భావంతో మిగతాకార్యాలను చేసినా, చేయకపోయినా ప్రాణాయామపూర్వకంగా అర్ఘ్యప్రదానమనేఈఅస్త్రప్రయోగాన్ని మనం అనుదినమూ త్రికాలాలలోనూ విధిగా చేయాలి.

ఒక దుర్ఘటమైన కార్యంఉంది. ఎంతో శ్రమపడితే కాని అదిసాధ్యంకాదు. దానిని ఒకరికి అప్పగించి 'నాయనా! ఈ పని కాస్త ముక్కుపట్టుకొని అయిందని అనిపిస్తే చాలు, నీకు, పుణ్యం ఉంటుంది' అని అంటాము. అంతశ్వత్రువులు అంతరించిపోవడానికి చేసే ఈసంధ్యావందనం అనే అస్త్రప్రయోగమూ అదేవిధంగా ముక్కుపట్టుకొని చేయవలసినదే. దీనిని ఊపిరి బిగబట్టి చేయాలి. వ్యవహారార్థం ముక్కుపట్టుకొని అంటాము కాని, నిజంగా అది ఊపిరిబిగబట్టడమే, అది నాసికాయామంకాదు, ప్రాణాయామమే.

ఏకార్యం చేయదలచుకొన్నా మనస్సు ఓర్మివహించడం ప్రధానం. జలం గ్రహించి చేసే ఈ అస్త్రప్రయోగానికి మనస్సు ఓర్మిగా వుండాలి. అందుకొరకే ప్రాణాయామం. మనస్సునకూ, అవిరామంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాస వ్యాపారాలకూ ఏమి సంబంధం? ఊపిరి బిగబట్టితే మనస్సు నిలుస్తుందా? ఒకపెద్ద ఆశ్చర్యం వేస్తుంది. హా! యని నిలిచిపోతాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కట్టిపోతవి. గొప్పకష్టం. మితిలేని దుఃఖం అపరిమితానందం; ఇవి కలిగేటపుడు మనస్సు లయించిపోయి ఏకాంతమైపోతుంది. ప్రాణం స్తంభించిపోతుంది. తర్వాత మళ్ళీ ఈవ్యాపారాలు ద్విగుణీకృతవేగంతో నడుస్తాయి. విన్నవార్తచేతనో మరే ఇతరకారణంచేతనో మనస్సు, లయించిపోయి ప్రాణాయామం తానుగా సిద్ధిస్తుంది. అట్లుగాక ఇచ్ఛాపూర్వకంగా ప్రాణాయామం చేస్తే అది చిత్తవృత్తి నిరోధానికి కారణమవుతుంది.

ఆర్ఘ్యం మనం చిత్తైకాగ్రతతో వదలాలి, అది ప్రాణాయామంతోనే సిద్ధిస్తుంది. అధికప్రమాణాంలో ప్రాణాయామంచేయడం యోగం. అది కష్టం. దానిని ఉపదేశానుసారం సాగించాలి. మనం ప్రాణాయామం చేస్తే రోజుకుఏపదిమార్లో చేస్తాము. మూడుమార్లు చేయడం కొందరికి నియమం. చిన్ననాట జరిగిన ఉపనయనమాది క్రమంగా ప్రాణాయామం నియామకంగా చేస్తూవచ్చి ఉండినట్లయితే ఈసరికి మనం మోగీశ్వరులమైపోయి ఉండాలి, చేసే ఏపనినైనా సరిగాచేస్తే కదా కృతకృత్యత? అరనిముషంప్రాణాయామంచాలు, అధికం అక్కరలేదు. వారివారి శరీరానుకూలంగానూ చేయవచ్చు. ప్రాణం నిలచిందంటే మనం వదిలే జలం అస్త్రమౌతుంది. సంధ్య ఆద్యంతాలను పరమేశ్వరార్పణచేయాలి. అర్ఘ్యమనే అస్త్ర ప్రయోగానంతరం గాయత్రీజపం, కూడినంతవరకూ ప్రాణాయామం, ఊపిరి కొంచెం బిగబట్టి వదిలితేచాలు. అధికం అనవసరం. సంకల్పం, మార్జన, ప్రాశన, అర్ఘ్యప్రదానం, జపం, స్తోత్రం, అభివాదం - అన్నిటినీ పరమేశ్వరానుగ్రహ ప్రాప్తికోసం చేస్తున్నానని చెప్పిచేయడమే సంకల్పం. తర్వాత మార్జన మంత్రంచెప్పి తీర్థం ప్రోక్షించుకోవాలి. వీని అన్నిటికీ ప్రాణాయామం ముఖ్యమైన అంగం. త్రికాలాలలోనూ స్వల్ప ప్రాణాయామం చేయాలి. అధికంగా చేస్తే ఉపద్రవమూ, గురువుయొక్క ఆవశ్యకతా కలుగుతుంది. అనుదినమూ స్వల్పంగా-రోగిష్టులు సహితం ప్రాణాయామంచేస్తే ఏవిధమైన ఉపద్రవమూ ఉండదు.

''ఋషయో ద్దీర్ఘ సంధ్యత్వా దీర్ఘమాయు రవాప్నుయుః,

ప్రజ్ఞాం యశశ్చ కీర్తిం చ బ్రహ్మవర్చస మేవచ||''

మనము మనోవాక్కాయాలచేతపాపాలుచేస్తున్నాము. దీనికి విరుగుడు సంధ్యోపాసన. వాక్కుద్వారా మంత్రోచ్చారణం. మానసికంగా గాయత్రీజపం. మార్జనం - ఇవి మనోవాక్కాయ శుద్ధి చేస్తవి. ఇవేకాక కర్మయోగ భక్తియోగ జ్ఞానయోగ రూపముగాకూడా సంధ్యవందన మున్నది. ఎవరికి వారు ఒక ప్రత్యేకమైన పాత్రను అమర్చుకొని, ప్రాణాయామ పూర్వకంగా ఈశ్వరార్పణబుద్ధితో సంధ్యోపాసన తొందర తొందరగా కాక తీరికగా చేయాలి.

సరియైన కాలంలో ఉచిత సంధ్యానుష్ఠానం చేసినందువల్లనే పలువురు ఋషులైనారు. అభివాదనలో ఒకానొక మహరి గోత్రం చెప్పుకొంటాం ఎంచేత? ఆమహరి గోత్రంలో పుట్టాం. కనుక అప్పటినుండికూడాగాయత్రి జపింపబడుతూ రావడంచేత, ఈమాత్రం కర్మానుష్ఠానం చేయడం మనకు అవశ్యకర్తవ్యం. మొదటిఋషి తర్వాతఎంతో మంది ఆసంతతిలోనే ఋషులైనారు. త్రయారేయమనీ, పంచారేయమనీ, సప్తారేయమనీ ఏకారేయమనీ చెప్పుకొంటారు. దీనివల్ల ఆయాగోత్రాలలో, ఆయా ఋషులు ఉన్నారని తెలుస్తున్నది, శ్రీవత్సగోత్రం పంచారేయం.

ఎంతోకాలంనుంచీ వస్తున్న ఈ ధారను మనం త్రుంచి వేయరాదు. అందుచే ప్రాణాయామపూర్వకంగా చిత్తైకాగ్రతతో, మంత్రలోపం లేకుండా పరమేశ్వరార్పణచేసి సంధ్యను మనం తప్పక అనుష్టించాలి. భక్తిశ్రద్ధలతో కర్మకలాపంతో అర్థం తెలుసుకొని సంధ్యను అనుష్టిస్తే పుట్టుక సార్థకమవుతుంది.


Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page