SARA SUDHA CHINDRIK    Chapters   

ఓం తత్‌సత్‌

శ్రీగణశాయనమః శ్రీరామచంద్రపరబ్రహ్మణనమః

బ్రహ్మసూత్రములు - చతుర్ధ అధ్యాయము (ఫలము)

ప్రధమ పాదము

మూడవ అధ్యాయమున పరమాత్మ ప్రాప్తికి భిన్నభిన్‌ సాధనములను తెలుపు శృతి వాక్యముల విచారణజరిపి, అట్టి ఉపాసనలయొక్క ఫలప్రాప్తి విషయక శృతి వాక్యముల విచారణతో ''ఫలాధ్యాయ'' నామక నాల్గవ అధ్యాయము ప్రారంభింపబడుచున్నది. బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి చేయు ఉపాసనలు గురుముఖతః చేసిననే ఫలప్రాప్తి కలుగునా? ఆసాధకులు పదేపదే అభ్యాసము చేయవలెనా? సూత్రకారుని వివరణ -

4-1-(1-2):- పరమాత్మయే దర్శన, మనన, ధ్యానములకు యోగ్యుడు. విశుద్ధ అంతఃకరణగల సాధకుడు నిరవయవ పరమాత్మను నిరంతర ధ్యానముచే నిర్మల జ్ఞానముచే పొందును. కోరికలు లేని సాధకుడు పరమాత్మనుపాసించి శరీరమున తిక్రమించును. కావున ఆచార్యుని వద్ద బాగుగా బ్రహ్మ విద్య నభ్యసించి, నిరంతర ధ్యాన మననములచే పరమాత్మ యందు సంలగ్నము కావలెను. భగవద్గీత యందు కూడ సర్వకాలములందునన్నే స్మరించుము. నిరంతర చింతనాపరుడగు సాధకుడు పరమ పురుషుని పొందును. అనన్య భక్తితోనిరంతర నామస్మరణచేయు వారికి నేను సులభుడను మొదలగు వాక్యముల ద్వారా బ్రహ్మవిద్య నిరంతరము అభ్యసించవలెను.

4-1-3:- శృతుల యందు పరబ్రహ్మ పరమాత్మ అంతర్యామి ఆత్మ యని భావించి ఉపాసించు విధాన మేర్పరుపబడెను. గీతాదుల యందు కూడ బ్రహ్మ హృదయకుహరమందు జీవాత్మను గూడి యుండునని చెప్పబడెను. కావున అంతర్యామి ఆత్మనే పరబ్రహ్మగా ఉపాసించవలెను.

4-1-(4-5):- మనస్సు, ఆకాశము, ఆదిత్యాది ప్రతీకల యందు భగవానునుద్ధేశించి చేయు ఉపాసనను భగవానుడు తన ఉపాసననగా స్వీకరించి భావానుకూలఫలమునిచ్చును. కాని ప్రతీకాత్మకవస్తువులను అంతర్యామి ఆత్మగా యెంచరాదు. పరమాత్మ తత్వము తెలియవేలనివారు. మనస్సు, సూర్యచంద్రాది పదార్ధములను భగవానుని ప్రతీకగా భావించి ఉపాసించిన పరమాత్మ అది తన ఉపాసనగా యెంచును.

4-1-6:- కర్మయొక్క అంగీ భూతమగు ఉద్గీధయందు ఆదిత్యాది భావనాపూర్వక ఉపాసనచే కర్మ సమృద్ధి రూప ఫలముకలుగును. ఆత్మ భావనాఫలము దక్కదు. నిమ్నవస్తువులయందు శ్రేష్టభావమునే ప్రతీకోపాసనయందురు.

4-1-(7-10):- పరమాత్మ స్వరూపమును తైలధారవలె నిరంతరము చింతించునే ఉపాసన, ఉపాసన కదలుచు, ఇతర కార్యములు చేయుచు, నిద్రించుచు చేయరాదు. ఆయా సమయములలో మనస్సు విక్షిప్త విఘ్నములు పొందును. స్ధిరాసనమున కూర్చుండి నిర్విఘ్నముగా ఉపాసించవలెను. ఇష్టదైవ ద్యానమే ఉపాసన. చిత్త ఏకాగ్రతే ధ్యానము. ఇది స్థిరముగా కూర్చుండి చేయవలెను. శిరము, మెడ, ఛాతీని బారుగా నుంచి, సమస్త ఇంద్రియములను అంతర్గతము చేసి ఓంకారమను నావద్వారా భయ దాయకమగు జన్మాంతర రూప నదిని దాట వలెను. భగవద్గీత యందు (6-(13-14) కూడ పరమాత్మ యొక్క నిరంతర చింతనాపరమగు ధ్యానము స్థిరముగా కూర్చుండి చేయవలెనని చెప్పబడెను.

4-1-11:- సరళముగా మనస్సు ఏకాగ్రత పొందునట్టి పవిత్రస్ధానము ఉపాసనానుకూలము. కావున అధిక ప్రయాసలేక నిర్విఘ్న అనుకూల స్ధానమందు కూర్చుని ధ్యానము నభ్యసించవలెను.

4-1-12:- ఆ జీవనము, నిత్యము, నిరంతరము ఉపాసనచేయవలెను. యోగభ్రష్టుడైన పునర్జన్మ పొందలసియుండును. జీవన కాలములోనే పరమాత్మ సాక్షాత్కారము పొందినవారుకూడ అన్యకర్మలవలె లోక సంగ్రహార్ధము ఉపాసన చేయుదురు.

4-1-(13-15):- శృతులు స్మృతులలో కూడ బ్రహ్మజ్ఞానము పొందిన వారు లోక సంగ్రహార్ధము చేయుకర్మలు వ్యావహారిక చేష్టల యందు అనుషంగిక పాపములు వారి నంటవు. పూర్వకృత పాపములు కూడ నశించును. జీవన్ముక్తుడగు జ్ఞానికి కర్మ సంబంధము లేకపోవుటచే పూర్వకర్మ పాపములు నశించుటయే గాక ఆగామి కర్మ ఫలము కూడ అంటదు. అట్టి జ్ఞాని ప్రారబ్ధ కర్మలునశించు వరకు శరీర స్ధితిపొంది పిమ్మట పరమాత్మలో విలీనమగును.

4-1-(16-17):- జ్ఞానులను మహాపురుషులుకూడ శృతి విధానము ననుసరించి ఆశ్రమధర్మ పరమగుకర్మలను జీవ పర్యంతము చేయవలెను. వారు కర్మ లొనరించుట కేవలము కర్మ పరిరక్షణకు, సాధారణ నులకాదరశము కొరకు, లోక సంగ్రహార్ధము చేయవలెను. జనకుడు, అశ్వపతి, యాజంఞవల్క్యాదులు లోక సంగ్రహార్ధమేకర్మలు చేసిరి. జ్ఞానులగు మహాపురుషులు కర్తృత్వ భోక్తృత్వ ఫలాసక్తి రహితముగా నిష్కామ భావనతో లోక సంగ్రహార్ధము కర్మలు చేయవలెను.

4-1-18:- శృతులలోచెప్పబడిన కర్మ విద్యలయందు కర్మ అనుషంగిక ఉద్గీధ బ్రహ్మ విద్యకాదు. జ్ఞానులకు దనితో సంబంధము లేదు.

4-1-19:- జ్ఞానులగు మహాపురుషుల సంచితకర్మలునశించును. ఆగామికర్మలు అంటవు. ప్రారబ్ధ కర్మలు (శుభాశుభ) ననుభవించుట ద్వారా నశించుటచే జ్ఞానులగు పురుషులు పరమపదము పొందెదరు.

చతుర్ధ అధ్యాయము - ద్వితీయ పాదము

బ్రహ్మ విద్యోపాసకులు బ్రహ్మలోకమునకు చేరు ప్రకారము మార్గము. మరియు సాధారణ మనుష్యులు, బ్రహ్మవిద్‌ఆయపాసకుల మార్గమున ఎంత వరకు సమానతకలదు. స్పష్టము చేయుటకు సాధారణ మనుష్యుల గమన వర్ణతో ప్రారంభింపబడుచున్నది.

4-2-(1-4):- బ్రహ్మవిద్యాపాసకులు ఏగతిని పొందెదరు? మనుష్యుడు మరణించి ఒకశరీరము నుండి వేరొక శరీరముపొందినపుడు వాక్కు మనస్సులోను, మనస్సు ప్రాణము లోను, ప్రాణము తేజస్సులోను తేజస్సు పరదేవతయందు స్ధితిని పొందును. కావుననే మరణకాలమున వాగింద్రియకార్యము ఆగిపోవును. ఇతర ఇంద్రియములు కూడ మనస్సులో చేరును. కావున మనస్సు ఇంద్రియములతో గూడి ప్రాణమునందు స్థితిని పొందును. మరణకాలమున జీవాత్మ నేత్రముల ద్వారాగాని, బ్రహ్మ రంధ్రము ద్వారా గాని లేదా శరీరము లోని ఏ ఇతర మార్గము ద్వారా గాని, ఇంద్రియసహితప్రాణము తోగూడి బయలువెడలును. కావున ఇంద్రియ మనస్సుల తోగూడిన ప్రాణము జీవాత్మయందు స్థితినిపొందును.

4-2-(5-6):- జీవాత్మ మనస్సు, సర్వ ఇంద్రియములు, సూక్ష్మభూత సముదాయమందు స్థితిని పొందును. ఏలనన సమస్త సూక్ష్మ భూతములు తేజముతోకలసియుండును. ప్రాణము, మనస్సు, ఇంద్రియములతో గూడిన జీవాత్మ తో తేజోరూపము నందే గాక పంచ భూతముల యందు సూక్ష్మరూపమునుండును.

4-2-7:- ప్రాణము, మనస్సు, ఇంద్రియములగూడిన జీవాత్మ సూక్ష్మభూతసముదాయమునందుండి సూక్ష్మ శరీరమును పొందును. ఇంతవరకు సామాన్యమానవుడు, బ్రహ్మలోకమును పొందు జ్ఞానుల యొక్క మార్గము సమానము. సూక్ష్మ శరీరము సురక్షితముండుటచేతనే బ్రహ్మజ్ఞాని బ్రహ్మలోకమును పొందును. అమృత స్వరూపుడగును. ఇతర లోకములకు వెళ్లు జీవాత్మ సూక్ష్మ శరీరము ద్వారానే వెళ్లును.

4-2-8:- జీవాత్మ పరదేవత యందు స్థితిని పొందుననగా ప్రళయ కాలమునందువలె కర్మ సంస్కారములు, సూక్ష్మ శరీరముతో అజ్ఞాన పూర్వక స్ధితి యందే ఉండును. ఈజగత్తంతయు పరమకారణ పరబ్రహ్మ యందున్నటులే ఉండును. కర్మ ఫల భోగాను యోగ్యమగు ఇతర శరీరములభించనంతవరకు జీవాత్మ సూక్ష్మస్థితి యందేఉండును. ముక్తి పొందువరకు సూక్ష్మ శరీర సంబంధముండును.కావున ముక్త పురుషులవలె పరమాత్మలో విలీనముకారు.

4-2-(9-11):- మరణకాలమందు జీవాత్మ సూక్ష్మ భూతసముదాయ మందుండును. కాని స్ధూల భూతములందుకాదు. జీవాత్మ హృదయ ములో 101 నాడులుకలవు. అందు సుషుమ్నానాడి కపాలముచేరును. జీవాత్మ సుషుమ్నానాడి ద్వారా సహస్రారమును చేరిన అమృత భావమును పొందును. ఇతర నాడులు మరణకాలమందుజీవుల ఇతరయోనుల జేర్చును. జీవాత్మ సూక్ష్మ రూపమున బయలు వెడలును. జీవాత్మ సూక్ష్మ శరీరముతో బయలు వెడలుటచే స్ధూల శరీరము దహించినను జీవాత్మకు ఎట్టి కష్టముకలుగదు. సూక్ష్మ శరీరముతో బయలువెడలగనే శరీరమున వేడి ఉండదు. చల్లబడును. శరీరమందలివేడి జీవాత్మదే.

4-2-(12-16):- జీవన్ముక్తులకు ఈ శరీరమందే పరబ్రహ్మ సాక్షాత్కార మగుటచే బ్రహ్మలోక గమన ముండదు. జీవాత్మ నుండి ప్రాణము వేరు పడుట నిషేధము గాన జీవాత్మ ప్రాణముతో బ్రహ్మ లోకమును పొందును అను పూర్వ పక్షమును ఖండించును - అన్ని శాఖల శృతుల యందును ఆత్మ కామపురుషులు ప్రాణమువిడువరు అచటనే విలీనముపొంది బ్రహ్మరూపమును పొంది బ్రహ్మను పొందెదరు. కావున అట్టి పురుషుల లోకాంతర గమన ముండదు. స్మృతుల యందు కూడ మహాపురుషులు జీవన కాలమందే పరమాత్మను పొందుటచే వారు ఏ ఇతర లోక గమనము చేయరు. అట్టి మహాపురుషులు పరమలోకమునకు వెళ్లనచో శరీర పతాననంతరము ఎచట నుందురను జిజ్ఞాసకు సమాధానము - అట్టి మహాపురుషులు దేహపసతనము జరుగుటతోడనే 15 కళలు. మనస్సుతో కూడ సమస్త ఇంద్రియముల దేవతలు అందరు వారి అభిమాన దేవతలలో కలయుదురు. వానితో జీవన్ముక్తునికి సంబంధములేదు. పిదపవిజ్ఞానమయ జీవాత్మ సమస్త కర్మలు పైన చెప్పబడిన దేవతలతో సహా పరబ్రహ్మలో విలీనము పొందెదరు. నదులు తమ నామరూపముల విడచి సముద్రములో విలీనమగునటుల జ్ఞానులగు మహాత్ములు నామరూపరహితులై ఉత్తమోత్తమ దివ్యపరమపురుష పరమాత్మను పొందెదరు.

4-2-(17-18):- సూక్ష్మ శరీరస్థితుడైన విద్వాంసుడు ఏవిధముగా బ్రహ్మలోకమునకు వెళ్లును? మరణ కాలమందు మహాపురుషులు హృదయాగ్రభాగమందుకల ప్రకాశిత బ్రహ్మరంధ్ర మార్గము (సుషుమ్న) ద్వారా శరీరము నుండి బయలువెడలి బ్రహ్మవిద్యా ప్రభావముచే బ్రహ్మలోక ప్రాప్తికి సూర్యరశ్మి యందు చేరి, సూర్యుని ఆశ్రయముచే సూర్యలోకము ద్వారా బ్రహ్మలోకము పొందును.

4-2-(19-21):- శృతులననుసరించి శరీరము న్నంతవరకు ఎల్లపుడు సూర్యరశ్మి నాడులలో వ్యాపించి యుండును. కావునరాత్రి సమయ మందు మరణించినను మహాపురుషుల జీవాత్మ సూక్ష్మశరీరముతో నాడులు ద్వారా సూర్యరశ్మిని పొంది, సూర్యలోకము ద్వారా బ్రహ్మ లోకమునే పొందెదరు. అటులనే దక్షిణాయనమున మరణించిన మహాపురుషులు బ్రహ్మలోకమునే పొందెదరు. భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలము వరకు వేచి యుండు సందర్భమున భీష్ముడువసుదేవతయగుటచే దక్షిణాయనమున దేవలోకమున రాత్రియగుట చేతను ఉత్తరాయణము వచ్చువరకు వేచియుండవలసినవచ్చెను. గీతయందు చెప్పబడిన ఉత్తరాయణ, దక్షిణాయనాది కాలవిశేషములు కాలవిశేషము గ్రహించు వారికే గాని బ్రహ్మవేత్తలకుకాదు.

చతుర్ధ అధ్యాయము - తృతీయపాదము

బ్రహ్మలోక గమన మార్గము ఒక్కటా, అనేకమా? మార్గమున వచ్చు దేవతలు ఎవరు, ఓలకములు ఏవి? వర్ణనాభేదము సంగతమా అను విషయ నిర్ణయము ఈ పాదమునచే యబడెను.

4-3-1:- బ్రహ్మలోక గమన మార్గము ఒక్కటే, అనేకముకాదు. దాని ప్రసిద్ధనామము. 'అర్చి' మార్గము, దేవయాన, ఉత్తరాయణ మొదలగు నామములు అధ్యాహారములు.

4-3-2:- బ్రహ్మవిద్యావేత్త అర్చి, దినము, శుక్లపక్షము, సూర్యుడు చంద్రుడు, విద్యుత్‌ మార్గముల పయనించి, అమానవపురుషుని ద్వారా బ్రహ్మ లోకమును పొందును. దీనినే దేవయానమందురు. బ్రహ్మలోక గమనము చేయు మానవుడు (జీవాత్మ) వాయువు, సూర్యుడు చంద్ర మార్గాన బ్రహ్మలోకము పొందును. మరి యొక శృతిలో దేవయాన మార్గమున అగ్ని, వాయు, సూర్య, వరుణ, ఇంద్ర, ప్రజాపతి, లోకముల గుండా బ్రహ్మలోకము చేరునని చెప్పబడెను. ఇట్లు వివిధమార్గములు చెప్పబడెను.

4-3-3:- వరుణుడు జలమునకు స్వామి, విద్యుతీనకు జలమునకు దగ్గర సంబంధముకలదు. కావున విద్యుత్‌, వరుణ, ఇంద్ర, ప్రజాపతి లోకములు కలవనుటలో విరోధములేదు.

4-3-4:- అర్చి, అహః, పక్ష, అయన, సంవత్సర, వాయు, విద్యుత్‌ మొదలగునవి జడములా చేతనములాయను ప్రశ్నకు సమాధానముగా అర్చి మొదలగు లోకముల అభిమాన దేవతలు మానవాకృతి కలిగి యుందురు. ఆరు ఒకలోకమునుండి వేరొక లోకమునకు పంపుదురు. విద్యుల్లోకము చేరినపిదప అమానవపురుషుడు జ్ఞానికి బ్రహ్మ లోకప్రాప్తి కలిగించును.

4-3-5:- దేవయాన, పితృయానముల పయనించు జీవాత్మకు ఆయా మార్గముల పరిచయములేదు. కావున మార్గము తెలిసిన అర్చి మొ|| అధిష్ఠానదేవతలు చేతనములే, డములు మార్గదర్శకత్వముచేయ జాలరుకదా? కావున వానిని అభిమాన దేవతలుగా అంగీకరించ వలెను. కావున మార్గమందు ఏయే లోకముల వర్ణన వచ్చిన అచట ఆయా లోకముల అధిష్టాన దేవతలుగా తెలుసుకొనవలెను. తమ లోకముల నుండి పైలోకములకు పంపుటే వారి పని.

4-3-6:- విద్యుల్లోకానంతరము. అమానవ పురుషుడు బ్రహ్మ లోకము చేర్చును. అయినచో మధ్యవచ్చు వరుణ, ఇంద్ర, ప్రజాపతి లోకముల అధిష్టానదేవతల పని ఏమి? ఈ సందేహనివారణ చేయుచు విద్యుల్లోకానంతరము అమానపురుషుడు విద్వాంసుని వరుణాది లోకముల గుండా తీసుకు వెళ్లినను ఆయా లోకముల అధిష్టాన దేవతలు కేవలము తమ మార్గముగుండా వెళ్లుటకు వలయు సహకారము నిచ్చుట యే వారి పని.

4-3-(7-11):- బ్రహ్మలోకమున కార్య బ్రహ్మప్రాప్తి జరుగనని బాదరాయణుడు తెలుపుచు - పరబ్రహ్మ పరమాత్మ సర్వవ్యాపకుడుగుటచే బ్రహ్మప్రాప్తికై లోకాంతరమునకు వెళ్లవలసిన అవసరమేమి? కావున బ్రహ్మ విద్యను పాసించినవారు పొందునని కార్యబ్రహ్మనే గాని పరబ్రహ్మనుకాదు. కార్య బ్రహ్మను పొందుటకే లోకాంతర గమనము. అమానవ పురుషుడు బ్రహ్మ లోకమునకు తీసుకు వెళ్లునను శృతి వాక్యములో బ్రహ్మ లోకమునుచోట బహువచన ప్రయోగము జరిగెను. బ్రహ్మ లోకమునకు తీసుకువెళ్లుననియే చెప్పబడెను. కాని బ్రహ్మప్రాప్తి కలుగునని చెప్పలేదు. భోగ్యలోకములు అనేకముగలవు. అట్టి లోకముల స్వామి కార్యబ్రహ్మయే. పరబ్రహ్మ పరమాత్మ తొలుత బ్రహ్మనురచించి అతనిని సర్వవేదములు నిచ్చును. కావున సృష్టి రర్మయగు బ్రహ్మను. బ్రహ్మయనుట యుక్తి సంగతము గీతాదులలో బ్రహ్మ ఆయువు పూర్తి యైన పిమ్మట అచటకు వెళ్లిన వారు తిరిగి వస్తురా అనుప్రశ్నకు - ప్రళయకాలమున బ్రహ్మలోకము నాశనమైను దాని స్వామియైన బ్రహ్మతోపాటు అచటికి వెళ్లిన బ్రహ్మ విద్యోపాసకులు కూడ పరబ్రహ్మను పొంది ముక్తి నొందెదరు. వారికి పునరావృత్తి లేదు కావున బ్రహ్మలోకమును చేరినవారు కార్యబ్రహ్మను పొందెదరనుట ఉచితము.

4-3-(12-14):- జైమిని మహర్షి ఇట్లు చెప్పెను - అమానవపురుషుడు బ్రహ్మవేత్తను బ్రహ్మవద్దకు చేర్చును. అనగా పరబ్రహ్మ అని యేకాని కారణ బ్రహ్మయనికాదు. పరబ్రహ్మ పరమాత్మ సర్వత్ర పరిపూర్ణుడైనను ఆయన యొక్క పరమధామము పరబ్రహ్మలోకము. బ్రహ్మాపాసకులు ఆలోకమునే పొందెదరు. లోక విశేషగమనము కార్య బ్రహ్మద్యోతకము కాదు. బహువచనము ఆదరసూచకము. పరమాత్మ అనేకలోకముల రచియించుటకూడ అసంభవముకాదు. కావున పరమధామమును చేరిన వారు పరబ్రహ్మనే పొందెదరు. కాని కారణ బ్రహ్మనుకాదు. దేవ యాన మార్గమున వెళ్లు బ్రహ్మ విద్యోపాసకుడు పరబ్రహ్మనేపొందును. కారణబ్రహ్మనుకాదు. బ్రహ్మాపాసనచేయు సాధకునిలక్ష్యము. పరబ్రహ్మను పొందుటేకాని కారణ బ్రహ్మనుకాదు. ప్రజాపతి లోకప్రసంగము ఉపాసకుని లక్ష్యము ప్రజాపతిలోకమున నుండుటకాదు. పరబ్రహ్మ లోకము పరమధామమును పొందుటే.

4-3-(15-16):- ఉపాసకుని సంకల్పానుసారము బ్రహ్మలోకభోగముల ననుభవించవలెనను. కార్యబ్రహ్మాపాసకులు కార్యబ్రహ్మను, పరబ్రహ్మ పరమాత్మను పొంద కోరిక గలవారు పరబ్రహ్మను పొందెదరు. అమానవ పురుషుడు వారిని వారి వారి సంకల్పానుసారము ఆయా లోకముల చేర్చును. పరబ్రహ్మ లోకముచేరుటకు ప్రజాపతి బ్రహ్మలోకముగుండా వెళ్లవలెను. ఎవరు ఆయా లోకముల చరించుటకు సంకల్పింతురో వారిని అక్కడకే చేర్చును. దేవయాన మార్గమున వెళ్లిన బ్రహ్మపాసకులు తిరిగిరారు. వాణి మొదలగు ప్రతీకోపాసనల వేరు వేరు ఫలితములు కలవు. కావున అట్టి ప్రతీకోపాసకులు దేవయాన మార్గమున కార్యబ్రహ్మ లోకమును గాని, పరబ్రహ్మ లోకమునుగాని పొందరు, కావున అట్టి వారిని దేవతలు అర్చిమార్గమున తీసుకువెళ్లరు.

చతుర్ధ అధ్యాయము - చతుర్ధపాదము

బ్రహ్మాపాసకులు సంకల్పాను సారము బ్రహ్మలోకమును పొందిన పిమ్మట వారి స్థితి యందు గలభేదము ఇట వర్ణింపబడెను. పరబ్రహ్మను పొంద గోరు సాధీకుల విషయమున నిర్ణయించుచు అట్టి వారు పరబ్రహ్మయొక్క అప్రాకృత దివ్య పరమధామము పొందెదరు.

4-4-(1-3):- పరబ్రహ్మ పదమును పొందగోరు ఉపాసకులు బ్రహ్మ లోకమున ఏ స్థితిని పొందెదరు? పరమధామమును పొందుసాధకుడు తనవాస్తవిక స్వరూపమును పొందును. అనగా ప్రాకృత సూక్ష్మ శరీర రహితముగా, పుణ్య - పాప, జరా - మృత్యు, వికారరహిత సత్యకామ, సత్యసంకల్ప, శుద్ధ, అర అమర రూపముపొందును. అట్టి వారు అన్నిలోకములందు ఇచ్ఛాను సారగమనముకలిగియుందురు. అట్టిసాధకులు సమస్త బంధములనుండి విముక్తులై పరమాత్మవలె పరమదివ్య శుద్ధ స్వరూపమును పొందెదరు.

4-4-(4-6):- శృతుల యందలి వర్ణనానుసారము ముక్తాత్మ పరమాత్మ యందు అవిభక్త రూపమును పొందును. ఆచార్య జైమిని కూడ శృత్యానుసారము అట్టి వారు దివ్య స్వరూప సంపన్నులగుదురని చెప్పెను. గీతయందు కూడ జ్ఞానాశ్రయులు నాదివ్యగుణ సమత్వము నుపొంది సృష్టికాలమున ఉత్పన్నమగుట, ప్రళయ కాలమందు వ్యధితులగుట ఉండదు. అనగా పరమాత్మునివలె దివ్య స్వరూపమును పొందెదరు. జౌడలోమి ఆచార్యుని అభిప్రాయముకూడ పరమధామమును చేరిన ముక్తాత్మ తన వాస్తవిక చైతన్య మాత్ర స్వరూపమును పొందును.

4-4-7:- బాదరాయణులవారు ముక్తాత్మ యొక్క భావానుసారము (1) అభిన్న రూపమున బ్రహ్మలో విలీనమగుట (2) వేరుగా ఉండి పరమాత్మ సమానముగా దివ్యస్వరూప సంపన్నుడగుట (3) కేవలము చైతన్య మాత్ర స్వరూపమునొదుట అను మూడు విధముల ముక్తాత్మ ఉండవచ్చును. ఇందు విరోధములేదు.

4-4-(8-9):- ప్రజాపతి బ్రహ్మలోకమును పొందిన సాధకునకు బ్రహ్మలోక భోగప్రాప్తి ఎట్లుకలుగును? ముక్తాత్మ మనోదివ్యనేత్రముల ద్వారా బ్రహ్మ లోకమునందలి సమస్త భోగములను చూచుచురమించును. అనగా సంకల్ప మాత్రముచే ఉపాసకునకు బ్రహ్మలోక దివ్య భోగాను భవముకలుగును. బ్రహ్మకాక వేరెవ్వరికి అతనిపై ఆధిపత్మముండదు. కావున పూర్వ సూత్రానుసారము అతడు మనస్సు ద్వారా సంకల్ప మాత్రముచే అన్ని దివ్యభోగములు పొందును.

4-4-10:- కార్య బ్రహ్మలోకమునకు వెళ్లిన ముక్తాత్మకు స్ధూలశరీర ముండదు గావున శరీరము లేక పోయినను కేవలము మనస్సుచే అన్ని భోగములు అనుభవించును.

4-4-11:- ఆచార్య జైమిని ముక్తాత్మనానాభావముల ప్రకారము ఉండుట శృతులలో చెప్పబడుటచే స్ధూలశరీరమునుపొందును. లేనిచో శృతి వచనము అసంగతమగును.

4-4-12:- వేదవ్యాసులవారు ముక్తాత్మ స్ధూలశరీరమును పొంది దివ్య భోగములను భవించుననియు, దేహరహితముగా కేవలము మనస్సుతోడనే దివ్య భోగము లనుభవించుట సంభవమనియు కావున రెండును ఉచితమే, విరోధములేదు.

4-4-(13-14):- స్వప్నావస్ధలోవలె శరీరములేకపోయినను మనస్సుచే సకల భోగానుభవము. బ్రహ్మలోకమున పొందునని వ్యాసమతము జాగ్రదావస్ధలో శరీరముతో భోగానుభవము రతి బ్రహ్మలోకమున భోగాను భవము కలుగునను జైమిని మతము రెండును అంగీకార యోగ్యములే. ఇందు ఆపత్తిలేదు.

4-4-(15-16):- ఒక విద్యుత్‌ అనేక బల్బులతో వ్యాపించి అన్నటిని ప్రకాశింపజేయునటుల ముక్తాత్మ తన సంకల్ప బలముచే రచించిన సమస్త శరీరములయందు ప్రవేశించి దివ్యలోక భోగములు పొందునని, ఒకేశక్తి అనేక రూపములు పొదునని శృతి వచనము. లయ అవస్ధను పొందు ప్రాణులు. ప్రళయకాలమందు సుషుప్తి అవస్ధను పొందును. కాని బ్రహ్మలోకమును పొందు అధికారులు దివ్య భోగాను భవముకొరకు అనేక శరీరములుపొందుట యధేచ్ఛగా ఇతర లోకము లందుచరించుట శృతులయందు చెప్పబడుటచే ఎట్టి విరోధము లేదు.

4-4-(17-18):- జడ చేతనాత్మక సమస్త జగత్తును సృష్టించి, పాలించి, లయించుశక్తి పరమాత్మదేకాని ముక్తాత్మదుకాదు. కావున ముక్తాత్మ కేవలము బ్రహ్మలోక దివ్య భోగాను భవమునకు యధేష్టసామర్ధ్యము కలిగి యుండును. పరమాత్మచే నీయబడినశక్తులు, అధికారము కేవలము. ఆయా లోకము లందలి భోగాను భవమునకు మాత్రమే స్వతంత్రముకలిగియుండును.

4-4-(19-20):- కర్మాధికారులు దేవలోక ములు పొందినట్లు బ్రహ్మవాదులు కూడ బ్రహ్మ లోకమును పొందినచో భేద మేమున్నది? అను సందేహమునకు కర్మ ఫలములు వికార యుక్తములు, భోగాను భవము పూర్తి కాగానే మర్త్యలోము పొందెదరు. కాని బ్రహ్మలోకమును పొందు బ్రహ్మివాదులు జనన మరణ రహిత పరమ పదమునొందెదరు. ముక్తాత్మ అమృత స్వరూపమును పొంది పర బ్రహ్మలో లీనమగును. అట్టి ఆత్మలు ఇతర లోకములకు వెళ్లుట, అచటి భోగముల ననుభవించుట కేవలము లీలామాత్రము. బంధనకారక పునర్జన్మ హేతువుకాదు.

4-4-21:- పరబ్రహ్మ సమస్తదివ్య కళ్యాణమయ భోగములనను భవించుచున్నను వానిచే లిప్తుడు కానట్లే ముక్తాత్మకూడ స్వప్నా వస్ధయందువలె అశరీరముగాగాని, జాగ్రదావస్ధలోవలె సశరీరముగా గాని ఆయా లోకముల యందలి భోగములనను భవించినను వానిచే లిప్తుడుకాడు. కావున భోగవిషయమందే బ్రహ్మతో సమానత్వము కలదుకాని సృష్టి, స్థితి, లయాదుల యందుకాదు.

4-4-22:- శృత్యానుసారము బ్రహ్మలోకమును పొందిన ముక్తాత్మ మర్త్యలోకమునకు తిరిగిరాదు. జన్మమరణ రహిత శాశ్వత పరబ్రహ్మపదము నొందును.

----

బ్రహ్మసూత్రముల లఘటీక సమాప్తము.

ఓం తత్‌సత్‌, ఓం తత్‌సత్‌, ఓం తత్‌సత్‌.

ఓం. శాంతిః శాంతిః శాంతిః.

----*-----

SARA SUDHA CHINDRIK    Chapters