SARA SUDHA CHINDRIK    Chapters   

ఓం తత్‌సత్‌

శ్రీగణశాయనమః శ్రీరామ చంద్రపరబ్రహ్మణనమః

3. కఠోపనిషత్తు

కఠోపనిషత్తు కృష్ణ యజుర్వేదము లోని కఠశాఖలోనిది. ఇందున చకేత యమధర్మరాజుల సంవాద రూపమున పరమాత్మయొక్క రహస్యతత్వము యొక్క విస్తారవర్ణనము కలదు.

శాంతి పాఠము:- హేపరమాత్మా! నీవు మాగురుశిష్యు లిరువురికి సర్వవిధములరక్ష, పాలన పోషణచేయుము. సర్వవిధముల బలము పొంది అధ్యయనము చేసిన విద్య తేజోపూర్ణమై పరాజయము పొందకుండుగాక. ఇరువురము జీవనపర్యంతము స్నేహ సూత్రమున బంధింపబడి, ద్వేషము లేకుండ ఉండుగాక. మాత్రితాపనివృత్తి కలుగు గాక. (ఓం సహనావవతు, సహనౌభునక్తు, సహవీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు. మావిద్విషావహై || ఓం శాంతిః శాంతిః శాంతిః)

ప్రథమాధ్యాయము - ప్రధమవల్లి.

1. పరమాత్మను మంగళకర ఓంకారముతో స్మరించి ఈ ఉపనిషత్తు ప్రారంభింపబడెను. గౌతమ వంశీయ వాజస్రవాత్మజుడగు అరుణపుత్రుడు ఉద్దాలకుడు విశ్వజిత్‌ యజ్ఞమాచరించి తన సర్వస్వముదానము చేసెను. ఆతని పుత్రుడే ప్రసిద్ధ నచికేతుడు.

2. ఆరోజులలో గోధనమే ప్రధానము. ఉద్దాలగుడు హోత, అధ్వర్యు, బ్రహ్మ, ఉద్గాత అను ప్రధాన ఋత్విజులకు ఎక్కువగును; ప్రతిప్రస్థాత, ప్రస్థాత, బ్రాహ్మణాచ్ఛంసి, ప్రస్థోత అనుగౌణ ఋత్విజులకు అందు సగము; అచ్ఛివాకి, నేష్టా, అగ్రీఢ, ప్రతిహర్త అను గౌణ ఋత్విజులకు మూడవవంతు గ్రావస్తుత్‌, నేత, హోత, సుబ్రహ్మణ్య అను గౌణ ఋత్విజులకు నాల్గవవంతు గోవుల నీయ గోవుల రావించెను.

3. ఆగోవులు బలహీనమై శక్తిలేక యుండెను. అట్టివానిని దానమిచ్చుటచే దాతకు అనిష్టము కలుగును. దాని నుండి తప్పించుటకు తండ్రీ! నేను కూడా మధనమునే, నన్నెవరికి దానమిత్తురని ప్రశ్నించెను. ముమ్మారు ప్రశ్నింపగా విసుగు చెందిన ఉద్దాలకుడు నిన్ను మృత్యువు కిత్తునెనును.

4. శిష్యులు, పుత్రులు మూడు విధములు. ఉత్తమ, మధ్యమ, అధమశ్రేణులు. తండ్రి మనోరధము తెలిసికొని ఆజ్ఞకొరకు ఎదురు చూడక అభిరుచికి అనుకూలముగా ప్రవర్తించువారు ఉత్తములు. ఆజ్ఞనుపొంది కార్యమాచరించు వారు మధ్యములు. ఆజ్ఞయైనను తదనుసారముగా కార్యమాచరించనివారు అధములు. తాను ఉత్తమ పుత్రునిగా తండ్రి మనోరధము ననుసరించి నడచు కొందుననుకొనెను.

5. సాధుపురుషులు అసత్యమాడరు. అసాధుపురుషులు అసత్యాచరణము చేయుదుట. మనుష్యుడు మరణధర్మము కలవాడు. అనిత్య జీవనము కొరకు కర్తవ్యము వొదలి మిధ్యాచరణము చేయరాదు. కావున సత్యపాలనకై నాకు యమధర్మరాజు వొద్దకు వెళ్లుటకు అనుమతించము. తండ్రిని కోరెను. తండ్రి యాతని సత్యపారయణతకు మెచ్చి వల్లెయనెను. నచికేతుడు వెళ్లు సరికి యమధర్మరాజు బైటకు వెళ్లుటచే మూడు దినములు అన్ని జలములులేక యమధర్మరాజుకొరకు ఎదురు చూచెను.

6-29) యమరాజు నచికేతుని అర్ఘ్యపాద్యాదులచె పూజించి ఆతనికి మూడు వరములు ప్రసాదించెను. మొదట వరమున తండ్రికి శాంతి సౌఖ్యములు. తిరిగి వెళ్లిన తనను నచికేతుని రూపములో చూచునట్లు వరము పొందెను. రెండవ వరమున స్వర్గసుఖకారకమగు అగ్ని విద్యను పొందెను. మూడవ వరమున మరణానంతరము ఆత్మ యొక్క అస్థిత్వముండునా? లేదా అని ప్రశ్నించెను. ఇది నిగూఢమగు విషయమగుటచే యమరాజు నచికేతునకు ఎన్నియో ప్రలోభములు చూపినను వైరాగ్య భావముతో తత్వ బోధకోరిన నచికేతుని పరీక్ష నంతరము బ్రహ్మవిద్య తెలుసుకొనుటకు యోగ్యునిగా గుర్తించెను.

ప్రథమఖండము - ద్వితీయ వల్లి

1. మనుష్య శరీరము కర్మఫల భోగము నకేకాక భవిష్యత్తులో సుఖప్రాప్తి సాధనముకూడా. సుఖసాధనము రెండు విధములు. (i) శ్రేయము, (ii) ప్రేయము. శ్రేయసుఖము సర్వ దుఃఖముల నుండి విడివడి పరబ్రహ్మ పురుషోత్తముని పొందుమార్గము. ప్రేయోమార్గమున స్త్రీ, పుత్ర ధనాది ఇహలోక స్వర్గలోక సుఖములు పొందుమార్గము. ఇది మానవుని ఆకర్షించి బంధించును. పైకి సుఖకరముగా నున్నను దుఃఖభాజనము. ఈశ్వర కృపాపాత్రులే శ్రేయోమార్గమున పరమపద సుఖమొందెదరు.

2. పునర్జన్మయందు విశ్వాసములేనివారు భోగాస్తకులై దేవదుర్లభ మానవ జీవనమున పశుభోగముల అంతమొందదించెదరు. పునర్జన్మయందు విశ్వాసము కలవాడు కూడా కేవలము బుద్ధిమంతులు మాత్రమే శ్రేయోమార్గమునవలంబించి శాశ్వత సుఖప్రద పరమ పదము నొందెదరు. తదితరులు ఇహలోక సౌఖ్యములు పొందుటలో జీవితము వృధాచేయుదురు. పుణ్య కర్మల నాచరించి స్వర్గ సుఖములునొంది అదిక్షీణము కాగానే మరల కర్మ ఫలభోగమునకు మానవ జన్మమునెత్తి జన్మమరణ చక్రమునపడిదరు.

3. హేనచీకేతా! నిన్ను పరీక్షించి నీవు బుద్దిమంతుడవు, వివేకివి, వైరాగ్యసంపన్నుడవు. నాచే చూపబడిన సమస్త ప్రలోభములను తిరస్కరించుటచే పరమాత్మ తత్వము తెలిసికొనుటకు సర్వోత్తమ అధికారివి.

4. ఈ తత్వ జ్ఞానము అవిద్య, విద్యయను వేరు వేరు ఫలములనిచ్చు రెండు సాధనామార్గములు. భోగాసక్తుడు కళ్యాణ సాధనమున ముందుకు పోజాలడు. కళ్యాణ సాధకునకు భోగముల యందాసక్తి యుండదు. భోగాసక్త ప్రలోభములు నిన్ను ఏమాత్రము లోభపరచలేదు. కావున నీవు విద్యాభిలాషివి.

5. అంధుడు అందుని సహాయమున నడచుట త్రోవ లోని వస్తువులను ఢీకొనుచు గమ్యమును చేరని విధమున అవిద్యా పరుడగు మానవుడు భోగాసక్తుడై భోగవస్తు ప్రాప్తికి పాటుపడుచు తన గమ్యమైన పరమ పదము పొందలేడు విద్వాంసులు బుద్ధి మంతులుకూడా మిథ్యాభిమానము కలిగి యుండుటచే మహాపురుషుల యొక్కయు శాస్త్రముల యొక్క వచనముల అవహేళన చేసి ప్రత్యక్ష సుఖరూపముగా కనపడు భోగముల ననుభవించుచు మనుష్య జీవనము యొక్క అమూల్యసమయము నష్టపరచెదరు.

6. మనుష్య జీవనము యొక్క మహత్వము తెలియని దురభిమానులు పరలోకమునెవరుచూచిరి? ఇది కేవలము కల్పనా మాత్రము. ఈ లోకములో అనుభవించినదే సుఖమను భ్రాంతిలోపడి జన్మమరణ చక్రమున రగుల్కొందురు.

7. దుర్లభ##మైన ఆత్మ తత్వమును తెలిసికొనవలెనను కోరిక లేక కొందరు విషయ చర్చలలో మునిగి యుందురు. వారికి విషయసేవనచే సమయము చిక్కదు. ఆత్మ తత్వమును వినినను తెలిసికొన గలవారు అరుదు. తెలిసికొన్నను ఆచరించు వారు బహుస్వల్పము. ఆత్మతత్వమును గురుమంత్ర తెలిసికొని మనన నిధిధ్యాసనల ద్వారా తత్వ సాక్షాత్కారము పొందువారు విలక్షణ సత్సురుషులు. ఇందు సర్వము దుర్లభ##మేకదా?

8. ప్రకృతి పర్యంతముగల సూక్ష్మాతిసూక్ష్మ తత్వముల కంటె ఆత్మతత్వము అత్యంత సూక్ష్మము. సాధారణ జ్ఞానముచే చింతన చేసి, ఆత్మ జ్ఞానమును గూర్చి తెలిసి కొన్నను అది అసంపూర్ణము. తత్వవేత్తయగు మహాపురుషుని యను గ్రహము చేతనే ఇది తెలియదగును. ఇది తర్కాతీతవిషయము.

9. ఎట్టి ప్రబోభములకు లొంగని పవిత్రనిర్మలనిష్ఠతో భగవత్కృపచే మహాపురుషుల సాన్నిధ్యమున సదాపరమాత్మ తత్వ విశద వివేచన చేయు సౌభాగ్యము నీవంటి వారికే లభ్యము.

10. అనిత్యసాధనలచే నిత్యపదార్థము లభించదు. యజ్ఞాది కర్మలకూడా ఫలాపేక్ష రహితముగా కర్తవ్యబుద్ధితో నిష్కామ భావమున యొనరించి నిత్య సుఖరూప పరమాత్మను పొందవచ్చును.

11. స్వర్గాది సుఖముల మహత్వము తెలిసినను నీవు దృఢమగు నిశ్చయముతో ఆత్మ తత్వమును తెలిసికొనగోరితివి.

12. పరబ్రహ్మ పరమాత్మమ పరిపూర్ణుడు, సర్వవ్యాపి, అందరి యొక్క హృదయకుహరమున యున్నప్పటికి యోగమాయయను తెరచేకప్పబడి సహజముగ కనిపించడు. శుద్ధ బుద్ధి రసంపన్‌ఉలగు సాధకులు నిత్యనిరంతర చింతనలో సంలగ్నులై దుర్లభుడైన సనాతన పరబ్రహ్మను దర్శించి హర్షశోకరహితులగుదురు.

13. ఈ ఆధ్యాత్మిక విషయమును దర్మవేత్తయగు మహాపురుషుని ద్వార విని మననము చేయవలెను. తదుపరి ఏకాంతమున విచారించి బుద్ధి యందు స్థిరపరచుకొని ఆత్మ తత్వమును తెలిసికొని ఆనంద స్వరూప పరబ్రహ్మ పరమాత్మను పొందవలెను. ఆ ఆనంద సాగరమున నోల లాడవలెను. నీవు బ్రహ్మ ప్రాప్తికి ఉత్తమ అధికారివగుటచే ఆపరమధామద్వారములు నీకొరకు తెరచి యున్నవి. నిరాటంకముగా ప్రవేశింపుము.

14. హేభగవాన్‌! మీరు నాయందు ప్రసన్నులైనచో ధర్మాధర్మరహిత, భూత భవిష్యత్‌ వర్తమాన కాలా తీత కార్యకారణ ప్రకృతి కంటె భిన్నుడగు పరమ తత్వమును నాకు పదేశింపుడని నచికేతుడు ప్రార్థించెను.

15. సమస్త వేదముల యందు ప్రతిపాదితము, తపాది సాధనల చే ఏక మాత్ర పరమ లక్ష్యముగా పొందుటకు నిష్ఠా పూర్వకముగా బ్రహ్మ చర్యము నాచరించుచు పొందగోరు పరమ తత్వము ఏకాక్షర 'ఓం' కార స్వరూపము.

16. ఈ అవినాశి ప్రణవ ఓంకారము బ్రహ్మయొక్క నిర్విశేష స్వరూపము. ఇది స్వయం సమగ్ర బ్రహ్మ పరమపురుషోత్తమ. అనగా బ్రహ్మ పరబ్రహ్మ లిరువురికి ఓంకారనామవిశేషము.

17. ఈ ఓంకారము పరబ్రహ్మ పరమాత్మప్రాప్తికి ముఖ్యసాధనము. ఇంతకు మించిన సాధనము లేదని శ్రద్ధాప్రేమపూర్వకముగా శరణు పొందినవారు. నిస్సందేహముగా పరమాత్మ ప్రాప్తి పొందెదరు.

18, 19) ఆత్మ (జీవాత్మ), అజన్మ, నిత్య, సనాతన పురాతన బ్రహ్మతత్వమగుటచే శరీరము మరణించినను దీనికి మరణము లేదు. దీనిని చంపువాడు, చంపబడునది కాని నిత్య సత్య బ్రహ్మ స్వరూపము.

20. జీవాత్మ పరమాత్మతో కూడి హృదయ కుహరమందున్నను భోగాసక్త జంతుసమముగా పరమాత్మను తెలిసికొనలేదు. పరమాత్మ కృపచేతనే ఆయన అణువుకంటె అణువు మహత్తుల లో మహత్తుని తెలిసికొనుము.

21) పరమాత్మ అచింత్యశక్తియుతుడు. సర్వవ్యాపకుడగుటచే భక్తులమొర విని వారికి ప్రత్యక్షమగును.

22) ప్రాణులశరీరము అనిత్యము, వినాశమగునది. అయినను పరమాత్మ ఈ శరీరములో అశరీరుడుగా నిత్యఅచట స్వరూపమున నుండును. ఇట్టి సర్వవ్యాపియగు పరబ్రహ్మ పరమేశ్వరుని తెలిసికొనిన మహాత్ములు ఏకారణముచేతను ఏమాత్రము శోకమును పొందట.

23) శాస్త్ర జ్ఞానము, తర్కవితర్కముల ద్వారా సర్వజ్ఞులమను కొను మిధ్యాభిమానులకు పరమాత్మలభించడు. పరమాత్మ విషయిక శ్రవణ, మనన, చింతనల ద్వారా ఆయనను స్వీకరిందచి మిక్కుటమగు భగవత్‌ సాక్షాత్కారేచ్ఛ కలవారికే పరమాత్మ దర్శన మిచ్చును. ఇది పరమాత్మ కృపచేతనే సాధ్యము.

24) దురాచారులు, సంసారిక భోగలంపటులు కేవలబుద్ధి మాత్రముచే ఆత్మ విచారము చేసినను, అవహేళనాపూర్వకముగా వ్వయమరించుటచే పరమాత్మ కృపా పాత్రులు కాలేరు.

25) దర్మశీలురగు బ్రాహ్మణులు, క్షత్రియులు కాలగ్రసితు లగుచుండ ఇతరుల మాట ఏమి? మనస్సు, బుద్ధి, ఇంద్రియ ముల ద్వారా అన్య జ్ఞేయవస్తువులవలె పరమాత్మను ఎవరు తెలిసికొనలేరు. పరమాత్మ కృపా పాత్రులు మాత్రమే. ఆయన తత్వమును తెలిసికొనగలరు.

ప్రథమఖండము - తృతీయవల్లి.

1. పూర్వజన్మ సుకృతము వలన దుర్లభ##మైన మానవ జన్మ లభించును. మానవ హృదయమందు పరమాత్మ జీవాత్మ కూడి యుండినను పరమాత్మ అసంగుడు. ఫలభోక్తాగా కనిపించడు. జీవాత్మ ఫల భోగ మను భవించుచు భోగ సాంగత్యమునకలిగి యుండును. పరమాత్మ పూర్ణ ప్రకాశము. జీవాత్మ ఛాయ.

2) యజ్ఞాది శుభకర్మల నిష్కామ భావము తోనాచరించుచు పరమాత్మను తెలిసికొనుటకు, పొందుటకు సరళ సాధనము ప్రసాదింప మని పరమాత్మనే వేడుకొనవలెను. పరమాత్మ కృపచేతనే ఆయనను పొందగలము.

3, 4) మానవ శరీరమగు సుందర సర్వసాధన సంపన్నరథము నీకు ఇంద్రియములు గుర్రములు, మనస్సు కళ్లెము. దానిని బుద్ధి యను సారధికి అప్పజెప్పి జీవాత్మనందు కూర్చుండజేసిన నిరంతర బుద్ధి ప్రేరణచే పరమాత్మయొక్క నామ, రూప లీలాధామముల శ్రవణ, కీర్తన, మననాదులచే సహజముగా శీఘ్రముగా జీవాత్మ పరమాత్మను చేరును. ఇంద్రియములను గుర్రములను మనస్సను కళ్ళెము బిగించి బుద్ధియను సారధి సరియైన మార్గమున రధమును నడిపి జీవాత్మయను రధికుని పరమాత్మ సన్నిధికి చేర్చును.

5) చంచలములైన గుర్రములను, కళ్లెముతో బిగబట్టి సారధి రథమును సరియైన త్రోవను నడుపునట్లు విషయవాంఛాచంచలమైన ఇంద్రియములను బలవత్తర గుర్రములను, మనస్సను కళ్లెము తోబిగించి బుద్ధియను సారధి రధమును సిరయైన త్రోవనునడుప వలెను. అట్లుకాదేని ఇంద్రియములు విశృంఖలముగా పరుగిడి సారథితో కూడ రథమును రథికుని గోతులో త్రోయును.

6) ఇంద్రియములు నిశ్చయాత్మిక బుద్ధి అధీనమున నుండి భగవత్సంబంధ పవిత్ర విషయ సేవనచే జీవాత్మను పరమాత్మ సన్నిధికి చేర్చును.

7) ఎవని బుద్ధి వివేక, కర్తవ్యాకర్తవ్యరహితముగా మనస్సును వశమందుంచుకొనదో అట్టి వాని భావములు చెడుమార్గమున పయనించి ఇంద్రియముల దురాచారములందు ప్రవృత్తమగును. అట్టివారు పరమ పదముపొందలేరు. దుష్ర్మల ఫముగా నీచ జన్మల నెత్తుచు. జన్మ మరణ చక్రమున తిరుగాడును.

8) వివేకశీలమగు బుద్ధి కలవారు ఈశ్వరాజ్ఞానుసారము పవిత్ర కర్మలు నిష్కామ భావముతో నాచరించుచు, భగవదర్పణ చేసిన పదార్ధములను నిష్కామ భావమున శరీర నిర్వహణకు మాత్రమే సేవించి పరబ్రహ్మ పదము పొందెదరు.

9) పరమాత్మ కృపచే దుర్లభ##మైన మానవ శరీరముపొంది అనిత్యము, అశాశ్వతము, దుఃఖమయమగు ఈ జీవనము పశుప్రాయముగా గడపక జీవిత పరమార్థ సాధనకై నిష్కామ భావమున కర్మల నాచరించుచు, మనస్సు, దానికి, నేత్ర కర్ణాదులను భగవంతుని తత్వ చింతన, గుణకీర్తన, దివ్యదర్శన, శ్రవణాదుల యందు సర్వదా నియోగించి భగవంతుని కృపా పాత్రుడై మనుష్య జన్మ సార్ధకము చేసుకోవలెను.

10) ఇంద్రియములకంటె శబ్దాది విషయములు, వానికంటె మనస్సు, మనస్సుకంటె బుద్ధి, బుద్ధికంటె గొప్పదగు ఆత్మ (జీవాత్మ) శ్రేష్ఠతరము. కావున ఇంద్రియములను విషయ వాంఛలనుండి దూరముగానుంచి, మనస్సును వానివైపు ఆకర్షితము కాకుండా చూచి, బుద్ధి ద్వారా విచారించి, రాగద్వేషరహితముగా నొనరించి, ఆత్మయొక్క మహత్వముచే పరమాత్మను పొందవలెను.

11) జీవాత్మకంటె అవ్యక్త మూలప్రకృతి, అంతకంటె పరమాత్మ బలవంతులు. పరమాత్మను మించిన శక్తి ఏదియు లేదు. మూలప్రకృతి జీవ సముదాయమును మోహింపజేసి వశమందుంచుకొనును. ఇది జీవాత్మకు పరమాత్మకు మధ్య నుండు తెరవంటిది. ఈ తెరను పరమాత్మ కృపచే మాత్రమే. తొలగించవీలగును. కావున సర్వ భావేన పరమాత్మను వరణుజొచ్చి ఆయన కృపాకటాక్షముచే మాయయను తెరను తొలగించి పరమాత్మ దివ్యదర్శనము పొందవలెను.

12) అంతర్యామియగు పరబ్రహ్మ ప్రాణుల హృదయములలో విరాజిల్లుచున్నను మాయ అను తెరచే కప్పబడి ఎవరికి కనబడడు. భగవ దాశ్రయముపొంది సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే చూడగలము.

13) ఇంద్రియములను బాహ్యవిషయములనుండి మరల్చి, మనస్సునందు విలీనము చేయవలెను. విషయస్ఫురణ రహిత మనస్సును, జ్ఞాన స్వరూప నిశ్చయాత్మిక బుద్ధి యందు విలీనము చేయవలెను. అట్టి బుద్ధిని జీవాత్మ శుద్ధ స్వరూపమున విలీనము చేసి ఆత్మరూప పరబ్రహ్మయందు విలీనము కావలెను.

14) దుర్లభమానవ జన్మపొంది, క్షణకాలమైనను వృధా చేయక, శీఘ్రముగా శ్రేష్ఠమహాపురుషుల సేవించి వారి ఉపదేశామృతముచే కల్యాణకర మార్గమున పరమాత్మతత్వ జ్ఞానము పొందుము. ఇది నిగూఢము, గహనము, మరియు అసిధారాచలనము. భగవత్కృపచే సుగమముగా సరళముగా పరమ పదము పొందుము.

15) పరబ్రహ్మ పరమాత్మ శబ్ద, స్పర్వ, రూపరస, గంధాది ప్రాకృత విషయములచే గ్రహింపబడడు. నిత్య, అనాది, అసీమ పరమాత్మను శ్రేష్ఠ సత్య సాధనచే జీవాత్మపొందనగును.

16) ఈ అధ్యాయమునందు నచికేతునకు, యమధర్మరాజు యొక్క ఉపదేశము పరంపరాగతము. దీనిని శ్రవణ, మననము చేయువారు బ్రహ్మ లోకమును పొందెదరు.

17) ఏ మనుష్యుడు విశుద్ధుడై సావధాన పూర్వకముగా ఈ రహస్యప్రసంగమును. తత్వవివేచనా పూర్వకముగా భగవత్ర్పేరితులగు బ్రాహ్మణసభలోగాని, శ్రాద్ధకాలమందు భోజనము చేయు భోక్తలకుగాని వినిపించిన అనంత ఫలమును పొందును.

ద్వితీయ అధ్యాయము - ప్రధమవల్లి

1) పంచ జ్ఞానేంద్రియములు బహిర్ముఖములై విషయ జ్ఞాన ప్రాప్తికి నిర్మింప బడినవి. అవివేకులు అశాశ్వతములు, నాశకారకములు, పతన హేతువులగు విషయ వాంఛా గ్రహణమున వీని నుపయోగింతురు. వివేకశీలురగు విలక్షణ మహాపురుషులు సత్సంగము, స్వాధ్యాయము మొదలగు సాధనములచే భగవత్కృపచే పరమాత్మ ప్రాప్తికి ఇంద్రియములను బాహ్యవిషయముల నుండి మరల్చి భగవత్సంబంధ విషయము లందు మాత్రమే వినియోగించి అంతర్యామియగు పరమాత్మను దర్శింతురు.

2) జన్మ మృత్యు సంసార చక్రమున పడద్రోయ బాహ్యవిషయ చింతనలయందు మానవుడు సంలగ్నుడై తన అమూల్య దుర్లభ మానవశరీరమును వృధాచేయుచున్నాడు. ఇంద్రియసుఖములు ఇతర జీవులయందు గూడ పొందవచ్చును. దుర్లభ మానవ జీవితము అమృతస్వరూప నిత్యపర బ్రహ్మ ప్రాప్తికై యున్నదని క్షీణ భంగుర భోగాసక్తి విడచి విరక్తుడై పరమార్థ సాధనా తత్పరుడు కావలెను.

3) శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదుల విషయ సుఖము, స్త్రీ సాంగత్యాది శాశ్వత సుఖముల ననుభవించు శక్తి ఏపరమాత్మ యొసగెనో ఆ పరమాత్మ యే వాని క్షణ భంగురతాది అశాశ్వతమను జ్ఞానముకూడా ప్రసాదించెను. ఇవి అన్నియువినాశము పొందునవియే. కావున వీటన్నిటికి పరమకారణమగు నిత్య సత్య పరమేశ్వరుని తెలిసికొనుటయే బ్రహ్మతత్వము. ఇదియే పరమావధి పరమగతి.

4) స్వప్న జాగ్రదావస్థల జరుగు సమస్త కార్యములు తెలిసికొను శక్తి పరమాత్మనుండియే లభించినది. అటులనే భగవత్కృపచే సదాసర్వదా సర్వత్రవ్యాపింత పరమాత్మను తెలిసికొను ధీపురుషుడు శోకము పొందడు.

5) సమస్త జీవులకు జీవన ప్రదాత, వానికి కర్మ ఫలమొసగువాడు, భూత, భవిష్యత్‌ వర్తమానముల శాసించువాడు నగు పరమాత్మను సర్వాంతర్యామిగా తన హృదయ కుహరమున సమీపమున నున్నట్లు అనుభూతి చెందుసాధకుడు సర్వజీవులలోను పరమాత్మను దర్శించుటచే ఎవరిని ద్వేషించడు, నిందించడు.

6) పంచమహాభూతములనుండి మొదట హిరణ్య గర్భ బ్రహ్మ రూపమున ప్రకటితమై సంకల్ప మాత్రమున సమస్త జీవులహృదయ కుహరమందు ప్రవేశించెను. అతని నుండియే సంపూర్ణ జగత్తు ఉత్పన్నమై ప్రకాశించుచున్నది. ఆయనే అంతర్యామి పరమేశ్వరుడు సర్వ హృదయవ్యాపి.

7) సర్వదేవతామయ భగవతి అదితి దేవి పరబ్రహ్మయొక్క సంకల్పముచే జగత్తునందలి సర్వ జీవనశక్తి సహితము ఉత్పన్నమైనది. సర్వప్రాణులు బీజరూపమున తనయందు ఇముడ్చుకొని హృదయ కుహరమున నుండు పరమాత్ముని %్‌చింత్య శక్తి భగవంతుని కంటె సర్వధా అభిన్నము. ఇరువురికి తేడా లేదు.

8) గర్భిణీ స్త్రీయొక్క గర్భస్థ శిశువు అన్న పానాదులకే పరిపుస్టుడై, ప్రసవకాల క్లేశరూపక మంధనచే ప్రకటితమగు రీతి, అధోత్తర అరణియందు దాగియుండు అగ్ని ఏకాగ్రత శ్రద్ధా, ప్రీతిస్తుతులచే అరణి మంధనద్వారా ప్రకటితమగును. తదుపరి ఆజ్యాది హవన సామగ్రిచే సంతుష్టునిచేయు అగ్ని దేవతపరమాత్మప్రతీక.

9) పరమేశ్వరుడు సూర్యుదేవునియందు ప్రకటమై, అందువిలీనమై సూర్యూదయ సూర్యాస్తమయాది కార్యములు నియమపూర్లకోముగా నొనరించుచు సర్వాత్మక, సర్వమయ, ఆది అంత ఆశ్రయమగు పరమేశ్వరుని వ్యవస్థను ఎవరు ఉల్లంఘించలేరు. సర్వులు సర్వదా ఆయన అనుశాసనాధీనులు. ఆయన మహిమ అపారము.అతడే సర్వశక్తి సంపన్న పరబ్రహ్మ పురషోత్తముడు.

10) సర్వశక్తివంతుడు, సర్వాంతర్యామి పరబ్రహ్మ ఈ పృధ్విలోకమున, దేవగంధర్వాని పరలోకమున కలడు. సర్వబ్రహ్మవ్యాపక పరబ్రహ్మ ఒకటే, లీలాత్మక పరబ్రహ్మ నానా రూపముల ప్రకాశించుటే ఆయనలో నానాత్వ కల్పన చేయుట జన్మమరణ చక్రమున తగ్గుల్కొనుటయే. పరమాత్మ తన అచింత్య శక్తి సహితుడై నానారూపముల ప్రకవతమై జగత్తు లోపల బయట వ్యాపించి యున్నాడు.

11) ఈ జగత్తునందు పూర్ణబ్రహ్మ పరమాత్మ పూర్ణరూపుడై వ్యాపించియున్నాడని శుద్ధమనస్సుతో తెలిసికొనవలెను. సర్వము బ్రహ్మస్వరూపమే. బ్రహ్మకంటె భిన్నమైన దేదియులేదు.

12) పరమాత్మ స్థూల, సూక్ష్మ, ఆకార విశేషము కలవాడగుటచే ప్రతి జీవిహృదయమందు, వాని హృదయ పరిమాణము ననుసరించి యుండును. మానవశరీరమందు పరమాత్మ అంగుష్టమాత్ర పరిమాణుడై హృదయకుహరమందు వశించును. ఇట్లు పరమాత్మను సర్వ హృదయస్థుడని తెలిసికొని ద్వేష నిందలు చేయరాదు.

13) మనుష్య హృదయ కుహరమందుండు అంగుష్టమాత్ర, పరుషోత్తముడు భూత, భవిష్యత్‌ వర్తమానముల నియంత్రించు స్వతంత్రశాసకుడు. జ్యోతిర్మయుడు, సూర్య అగ్ని వలెకాక దోషరహితసర్వధా విశుద్ధ దివ్య నిర్మల ప్రకాశ స్వరూపుడు క్షీణ వృద్ధి నాశములేని ఏకరస నిత్య, అక్షణ్ణ అవినాశి బ్రహ్మ

14) పర్వతములయందు వర్షించు వర్షము, విభిన్న వర్ణ ఆకార గంధాదులతో కూడి నలుప్రక్కల ప్రవహించును. అటులనే ఒకే పరమాత్మనుండి ప్రవృత్త విభిన్న దేవాసుర మనుష్యులలో పరమాత్మను వేరు వేరుగా చూచి సేవించు వారు నలుప్రక్కల ప్రవహించు నీటివలె విభిన్న దేవాసుర యోనులయందు పరిభ్రమించుచు పరబ్రహ్మను పొందలేరు.

15) కాని నిర్మల జలమందు వర్షించు జలమునందు ఏవికారము లేక నలుదిసల ప్రవహింపకుండునటుల అంతయు పరబ్రహ్మ పురుషోత్తముడే అనిమనన శీలుడై, సంసారిక బాహ్య స్వరూపముల నుండి ఉపరతుడై పురుషుడు. ఆత్మను పరమాత్మయందు విలీనము చేసి తాదాత్మ్య భావమును పొందును. జీవాత్మను పరమాత్మలో లీనము చేయుటే పరబ్రహ్మ ప్రాప్తి. పరమపదప్రాప్తి.

ద్వితీయవల్లి

1) నవద్వార (బ్రహ్మరంధ్రము నాభితో11) పురమగుదేహము నందు హృదయసౌధమునందు సర్వవ్యాపి, నిత్య, నిర్వికార, విశుద్ధ జ్ఞానస్వరూప పరమేశ్వరుడు నివశించును. పరమాత్మ సర్వవ్యాపకుడైనను రాజధానియగు మనుష్య శరీర హృదయ ప్రాసాదమున రాజువలె విరాజిల్లు చుండును. కావున మానవుడు , తన జీవిత కాలములోనే భజన , స్మరణ, కీర్తనాది సాధనల ద్వారా ధ్యానించి జీవన్ముక్తుడై పరమాత్మ సాక్షాత్కారము పొందును.

2) ప్రకృతి గుమములకతీతుడైన పరబ్రహ్మ అంతరిక్షమున విహరించు వసురూపమున, గృహస్థునింట అతిధి రూపమున యజ్ఞవేదియందు జ్యోతిర్మయ అగ్నిరూపమున, సమస్త మనుష్యరూపమున, శ్రేష్ఠ దేవత, పితృరూపమున, ఆకాశమున సత్యరూపమున, జలమున మత్య, శంకశక్త్యాది రూపమున, భూమియందు వృక్షము, అంకురము, అన్నము, ఓషదాది రూపమున, యజ్ఞాది సత్కర్మల యజ్ఞఫలాదికరూపమున, పర్వతములు, నదీనదీరూపమున, సర్వజగత్తున సర్వరూపముల విరాజిల్లు శ్రేష్ట మహాపరమ సత్యతత్వ స్వయం ప్రకాశ, పురుషోత్తమపరమహంస విలసిల్లుచుండును.

3) పరమాత్మ శరీరమందు నియమిత రూపమున ప్రాణాపానాది కర్మలనొనరించు శక్తి ప్రేరణ నొసగుచున్నాడు. శరీరమందలి ప్రాణ, మనస్సు, బుద్ధి, ఇంద్రియము అధిష్టానదేవతలు, ఆ హృదయస్థ పరమేశ్వరుని ప్రసన్నతకొరకు ఆయన యొక్క ప్రేరణానుసారము సమస్త కార్యములను యధావిధి నొనరించు చున్నారు.

4) ఒక శరీరమును విడచి వేరొకటి పొందు జీవాత్మ ఈశరీరమునుండి వెడలు నపుడు ఇంద్రియ ప్రాణాదుల వెంట తీసుకొని పోయిన ఈ మృత దేహములో ఏమి మిగులును? కాని పరమాత్మ సమభావమున సర్వత్ర పరిపూర్ణుడు, చేతన జీవులయందు, జడ ప్రకృతి యందు సదా వ్యాపించి యుండును. అతడే నీవడిగిన పరబ్రహ్మ.

5,6) మనుష్యునియందు ప్రాణశక్తి , జీవింపజేయు చేతన తత్వము జీవాత్మయే. జీవాత్మ లేనిదే ప్రాణంద్రియాదులు ఒక క్షణమైనను శరీరమున నుండవు. వానివెంటనే మరియొక శరీరమున ప్రవేశించును. మనుష్యుడు మరణించిన పిదప జీవాత్మ ఏమగును? ఎచటికి వెళ్లును? ఏ ప్రకారముగా నుండును. పరమేశ్వర స్వరూపము చెప్పును.

7) శుభాశుభకర్మాను సారము శాస్త్ర, గురు, శిష్య, వ్యవసాయాదుల ద్వారా నిర్మితవాసనాను సారము. జీవాత్మ మరియొక శరీరమును పొందుటకు శుక్ర రూపమున తల్లియోనిలో ప్రవేశించి మరల జన్మనొందును. పుణ్యపాపములు సమానముగాగలవారు మనుష్యరూపమున, పాపమధికముగా గలవారు పశుపక్షి రూపమున, పాపము అధికముగా గల జీవి వృక్షాలతో రూపమున జన్మింతురు.

8) జీవాత్మయొక్క కర్మానుసారము వివిధ భోగములనిర్మించి ఉచిత వ్యవస్థ చేయు పరమాత్మ సమస్త జీవులు సుషుప్తియుందున్నను, ప్రళయ కాలమందును నిత్య జ్ఞాన స్వరూపుడగు పరమాత్మ సదా ఏకరసమున నుండును.

9) ఆధార భూత వస్తువునకనురూపముగ అగ్ని కనబడునట్లు ప్రాణుల హృదయస్థ పరమాత్మ కూడా నానారూపముల ప్రకాశించినను, వాస్తవమునకు పరమేశ్వరుని మహత్వము అత్యంత అధికము, అనంతము.

10) ఒకేవాయువు అవ్యక్తరూపమున సంపూర్ణ బ్రహ్మాండమున వ్యాపించినను, భిన్న భిన్న వస్తుసంయోగముచే వస్తువుకనురూపమగు గతి, శక్తి కలదిగా కనబడునట్లు అంతర్యామి పరమాత్మ కూడా విలక్షణరూపమున కనబడును.

11) సమస్త బ్రహ్మాండమును ప్రకాశింపజేయు సూర్యుని ప్రకాశముచే జీవులు అనేక గుణదోష మయ కర్మలు చేసినను, సూర్యుని ఆకర్మదోషములు లిప్తుడు కానట్లే అంతర్యామి పరమాత్మకూడా జీవులు చేయు శుభాశుభికర్మ ఫలములచే విప్తుడు కాడు. ఆకర్మఫల సుఖ దుఃఖముల జీవుడే అనుభవింపవలెను.

12) సర్వాంతర్యామియగు పరమాత్మ సంపూర్ణ జగత్తునందలి దేవ మనుష్యాదుల తన వశమందుంచుకొనును. ఆయన తన లీలచే బహురూపత్వము పొందును. ఆయనను నిరంతరము తమలో చూచు మహాత్ములు పరమానందమును పొందురు.

13) సమస్య నిత్య చేతన ఆత్మలకు నిత్య చేతన ఆత్మయగు పరమాత్మ ఒకడే అయినను అనంత జీవువ భోగముల వానికర్మాను సారము నియమించు పరమాత్మను సదా తమలో చూచు మహాపురుషులు పరమ శాంతిని పొందెదరు.

14) సనాతన పరమానందము పొందిన జ్ఞానులు, పరమాత్మను అలౌకిక పరమానంద స్వరూపుడుగా చూచెదరు. అతడు మనోవాక్కులచే నిర్దేశింప వీలుకానివాడు. ఆయనను అపరోక్షరూపమున చూచుటఎట్లు? ప్రత్యక్షముగా కనపడువాని అనుభవము నీకువచ్చునా? ఆజ్ఞానమెట్లు కలుగును?

15) సూర్య చంద్రాగ్ని ప్రకాశపుండములు కూడ పరమాత్మ ప్రకాశము ముందు మిణుగురు పురుగుల వంటివి. సంపూర్ణ జగత్తు ఆ జగదాత్మ పురుషోత్తముని ప్రకాశముయొక్క క్షంద్ర అంశ##చే ప్రకాశించు చున్నవి.

-----

తృతీయ వల్లి

1) మూలభూత పరబ్రహ్మమైనను, దేవ, పితర, మనుష్య పశుపక్ష్యాదులు శాఖలుగా ఈ బ్రహ్మాండరూప అశ్వద్ధవృక్షము అనాదికాలము నుండి యున్నది. పరబ్రహ్మయందు %ీ జగత్తు ప్రకటిత, అప్రకటిత రూపమున నిత్య స్థిత మగుటచే ఇది సనాతనము. జగదుత్పత్తి, స్థితి, విలీన మూలకారణ భూత దివ్య తత్వమే పరబ్రహ్మ, సర్వలోకములు ఆయనను ఆశ్రయించియున్నవి.

2) ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ద్వారా తెలిసికోబడు సంపూర్ణ చరాచర జగత్తు కారణ రూప పరబ్రహ్మనుండి ప్రకటితమై పరమేశ్వరుని ఆజ్ఞానుసారమువర్తించును. పరమాత్మ దయాళువైనను వజ్రపాణియగు ప్రభువువలె భయంకరుడు. సమస్త జగత్తు ఆయన ఆజ్ఞాను సారము వర్తించును.

3) సూర్యాగ్నులు తపించుట, ఇంద్రాది దేవతలు తమ తమ కార్యములు నిర్వర్తించుట పరబ్రహ్మయొక్క ఆజ్ఞానుసారమే జరుగును. పరమేశ్వరుడు సర్వశక్తి సంపన్నశాసకుడు, నియంత,

4) శరీరములో ప్రాణముండగనే భజన స్మరణాది సాధనల ద్వారా పరమాత్మ తత్వ జ్ఞానము పొందిన మానవుని జీవితము సఫలమగును. అతడే జీవన్ముక్తుడు, అట్లు కానియెడల అనేక జన్మలనెత్తవలెను.

5) మహాపురుషులు జ్ఞాననేత్రము ద్వారా నిర్మల దర్పణము నందలి ప్రతి బింబమువలె పరమాత్మను చూచెదరు. వాసనాయుత జీవులు స్వప్నమున వాసనానుగుణరూపమున పితృలోకమున, పూర్వవాసనాను సారము అస్పష్టముగా గందర్వలోకమున, నిర్మల జలమునందలి ప్రతిబింబమువలె కొంచెము స్పష్టముగా , బ్రహ్మ లోకమున కాంతి నీడల రూపమున స్పష్టముగా పరమాత్మజ్ఞానము ప్రత్యక్షముగా స్పష్టముగా కనబడును.

6) శబ్ద స్పర్శాది విషయగ్రాహక ఇంద్రియములు జాగ్రదావస్థ లో భిన్న భిన్న కార్యములు చేయుచున్నను సుషుప్తి అవస్థయందు అన్నియు విలీనమగును. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి యొక్క కార్యశక్తి ఈ శరీరములో లేదు. ఇవన్నియు విలక్షణ చేతన తత్వము చే కార్యానిత్యతమగును. అట్టి నిత్యశుద్ధ చేతన శక్తి నేనే.

7) ఇంద్రియములకంటె మనస్సు, దానికంటె బుద్ధి, బుద్ధికంటె వీటన్నిటి స్వామి జీవాత్మ ఉన్నతుడు. ఇవన్నియు జీవాత్మ యొక్క ఆజ్ఞాపాలనము చేయును. జీవాత్మ శాసకుడు, విలక్షణుడు, కాని జీవాత్మకంటె పరమాత్మ యొక్క అవ్యక్త ప్రకృతి ప్రబలమైనది. ఇది జీవాత్మను బంధమున కట్టియుంచినది.

8) ప్రకృతి కంటెను, ప్రభువగు పరమాత్మశ్రేష్ఠుడు. పరమాత్మ నిరాకారరూపమున సర్వవ్యాపకుడు, పరమాత్మ దయతో మాయ యను తెరను తొలగించిన తోడనే పరమాత్మ ప్రాప్తి కలుగును. భాగ్యహీనుడు తన చేంతనే యుండు పరమాత్మను మాయా బంధమున పడి యుండుట చే కనుగొనలేడు. పరమాత్మే ముక్తి ప్రదాత.

9) పరమేశ్వరుని దివ్య స్వరూపము ప్రత్యక్షముగా చర్మ చక్షువులతో చూడలేము. నిరంతర సాధనా తత్పరుడు హృదయ మందు పరమాత్మ దివ్య స్వరూపమును నిశ్చల ధ్యానముచే విశుద్ధ జ్ఞాననేత్రములచే చూడగలడు.

10) యోగాభ్యాసముచేయుచు పంచ జ్ఞానేంద్రియములు స్థిరపరచి బుద్ధిని పరమాత్మ స్వరూపమునందు స్థిరపరచిన పరమాత్మ తక్క మిగిలిన ఏ జ్ఞానము, చేష్టమిగిలియుండదో అట్టి యోగి పరమ గతిని, సర్వోత్తమ స్థితినిపొందను.

11) ఇంద్రియములు, మనస్సు, బుద్ధియొక్క స్థిర ధారణనే యోగమందురు. ఆ సమయమున సాధకుడు సర్వప్రమాద రహితుడగును. యోగము ఉదయస్థ స్వభావము కలది గాన సాధకుడు నిరంతరము యోగ యుక్తుడగుటకు అభ్యాసముచేయవలెను.

12) పరమాత్మ, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనస్సు, బుద్ధి అహంకారములచే పొందశక్యము కాదు. ఏలనను ఆయన వీటి శక్తికంటె మిన్న, పరమాత్మను అవశ్యము పొందవలెనను తీవ్ర ఇచ్ఛకలసాధకులు ఇంద్రియాదుల వశపరచుకొని యోగాభ్యాసము ద్వారా హృదయకుహరమందు జ్ఞాననేత్రములచే చూడనగును.

13) సాధకుడు మొట్టమొదట పరమేశ్వరుడుకలడు. తప్పక లభించును. అనుదృఢవిశ్వాసముతో తాత్విక వివేచనాపూర్వకము గాధ్యానించి పొందవలెను. పరమాత్మ తాత్విక దివ్యరూపము అతని విశుద్ధ హృదీయమున తనంతతానే ప్రకటితమై ప్రత్యక్షమగును.

14) మనుష్యుని హృదయమునందు నిరంతరము విభిన్న ప్రకారములైన ఇహలోక, పరలోక సుఖాపేక్షకారణముగా పరమాత్మను పొందవలెనను ఆసక్తి అభిలాషకలుగును. సమస్త కోరికలు నష్టమైన మనుష్య శరీరమందే పరబ్రహ్మ పరమేశ్వరుని సాక్షాత్తు అనుభవము కలుగను.

15) సాధకుని హృదయమందలి అహంకార మమ కారాది సమస్త అజ్ఞానగ్రంధులు పూర్తిగా నశించిన సర్వసంశయ నివృత్తుడై పైతెలిపిన ఉపదేశానుసారము దృఢ నిశ్చయముతో పరమాత్మను ఈ శరీరముండగనే సాక్షాత్కరించుకొని అమరుడగును. ఇదియే వేదాంత సనాతన ఉపదేశము.

16) హృదయమందు 101 ప్రధాననాడులుకలవు. అవి అన్ని వైపుల వ్యాపించెను. అందుముఖ్యమగు సుషుమ్నానాడి హృదయమునుండి మస్తకముచేరును. భగవానుని పరమ ధామము పొందు అధికారము కలవారు ఆనాడి ద్వారా శరీరము నుండి బయల్వెడలి ఊర్ధ్వలోకమున అనగా భగవానుని పరమ ధామమున అమృత స్వరూప పరమానందీమయ పరమాత్మను పొందెదరు. అన్యులు ఇతరనాడులు ద్వారా శరీరత్యాగముచేసి కర్మాను సారము నానాయోనుల చరింతురు.

17) అంతర్యామి పరమాత్మ హృదయాను రూపమున అంగుష్టమాత్రుడై ఎల్లపుడు మానవ హృదయమందు వశించినను, మనుష్యుడాతనిని చూడలేడు. ప్రమాద రహితుడై పరమాత్మ ప్రాప్తికి సాధన చేయు సాధకుడు ముంజిగడ్డి నుండి కాడను వేరు చేయు విధమున హృదయస్ధ పరమేశ్వరుని సత్యసిద్ధముగా వేరు చేయవలెను. శరీరము ఆత్మల నడుమ నుండు పరమేశ్వరుడు ఈరెంటి కంటె విలక్షణుడు, ఇదియేవిశుద్ధ అమృతతత్వము.

18) ఈవిధముగా యమరాజుచే ఉపదేశము పొందిన నచికేతుడు సంపూర్ణ విద్యాయోగప్రాప్తిచే జన్మమరణ బంధన విముక్తుడై వికార రహిత విశుద్ధ పరబ్రహ్మ పరమేశ్వరుని పొందెను. ఈవిధముగా నచికేతుని వలె ఆధ్యాత్మ విద్యను తెలిసికొని శ్రద్ధా పూర్వకముగా ధారణ చేయువారు. జన్మమృత్యువిముక్తులై పరబ్రహ్మపరమాత్మను పొందెదరు.

------

కదోపనిషత్తు సమాప్తము.

ఓం. శాంతి; శాంతి; శాంతి:

SARA SUDHA CHINDRIK    Chapters