SARA SUDHA CHINDRIK    Chapters   

ఓం తత్‌సత్‌

శ్రీగణశాయనమః శ్రీరాచంద్రపరబ్రహ్మణనమః

బ్రహ్మ సూత్రములు

ప్రధమ అధ్యాయము - సమన్వయము

ప్రధమ పాదము

1-1-(1-1) ఓం అధాతోబ్రహ్మజిజ్ఞాసా - అను సూత్రముతో శ్రీవేదవ్యాసమమర్షి ఉపనిషత్సార బ్రహ్మ సూత్రములను ప్రారంభించుచు బ్రహ్మము యననేమి? బ్రహ్మయొక్క స్వరూపమేమి? వేదాంతమున దీని వర్ణ ఎట్లు జరిగెను? ఇత్యాది బ్రహ్మవిషయిక వివేచన ఈ గ్రంధమున చేయబడినది.

సర్వసాధారణులకు చూచుట, వినుట, అనుభవమునకు వచ్చు ఈ జడ చేతనాత్మక జగత్తుయొక్క అద్భుత రచనావిశేషముపై విచారించిన గొప్ప గొప్పవైజ్ఞానికులను కూడ ఆశ్చర్య చకితులనుచేయు ఈ విచిత్ర విశ్వము యొక్క ఉత్పత్తి, స్థితి, లయ కారుడగు, సర్వశక్తివంతుడగు, పరమేశ్వర పరబ్రహ్మ యొక్క అలౌకిక శక్తియేయని స్పష్టమగుచున్నది. దేవతలు, దైత్యులు, మనుష్యులు, పశుపక్ష్యాది అనేక జీవ సముదాయమేగాక సూర్యచంద్ర నక్షత్రా దులగూడిన, నానా లోకాంతరముల గూడిన బ్రహ్మాండమునకు, కర్త, ధర్త, హర్తయగు పురుషుడే బ్రహ్మ. అతనినే పరమాత్మ, పరమేశ్వరుడు, భగవానుడందుము. ఆయన ఉపనిషద్యచనానుసారము అకర్త, అభోక్త, అసంగ, అవ్యక్త, అగోచర, అచింత్య, నిర్గుణ నిరంజన నిర్విశేషుడయ్యును గీత 4/13 లోచెప్పిన విధముగా ఆయన అ సర్వము నకు ఆది, సర్వాధార, సర్వజ్ఞి, సర్వేశ్వర, సర్వవ్యాపి, సర్వరూప, పరమాత్మ, ఈ దృశ్యమాన జగత్తంతయు ఆయన అపార శక్తి యొక్క ఒక అంశమాత్రమే.

వేదములలో (తై.ఉ.ఖ.) పరబ్రహ్మ, సత్య, జ్ఞాన, అనంతరూపుడని తెలుపబడెను. అటులనే ఆయన సర్వజగత్తుకు సృష్టి, స్థితి లయ కారుడనుట ఉచితము. కర్తృత్వ భోక్తృత్వరహితుడైన నిత్యశుద్ధ, బుద్ధ ముక్త పరబ్రహ్మయే. ఈ జగదుత్పత్తికారణము వేదశాస్త్రములు బ్రహ్మయే జగత్కారణమని వచించెను.

శాస్త్రప్రమాణము, అనుమానుసారము పరబ్రహ్మపర మాత్మయే. ఈ విచిత్ర జగత్తుకు నిమిత్త కారణము మరియు ఉపాదాన కారణము ఏలనన ఈ జగత్తంతయు పూర్తిగా పరమేశ్వరునిచే వ్యాప్తము చరాచర జడచేతన భూత సముదాయ మంతయు పరమాత్మ దచే వ్యాప్తమైనదే. పరమాత్మ లేని ప్రదేశ##మేలేదు. ఆపరబ్రహ్మ పరమేశ్వరుని చే సమస్త జగత్తు వ్యాపించి యున్నదని గీత 10/31, 9/4 లలోను ఈ శావాస్యోపనిషత్తు లోను కలదు.

కాని సాంఖ్యులు వ్యాప్తి రూప హేతువుచే పరమాత్మనే ఉపాదాన కారణముగా ఏల భావించవలెను. త్రిగుణాత్మక ప్రకృతి కూడా సమస్త జగత్తునందు వ్యాపించి యున్నకారణమున ప్రకృతి ఉపాదాన కారణము ఏలకారాదు? అనుప్రశ్నకు జవాబుగా ఉపనిషదాదుల యందు ''ఈక్ష'' అను ధాతువు యొక్క ప్రయోగము ప్రమాణ శూన్య జడ ప్రకృతికి కాదు. ఈక్షణ, సంకల్పించుట యను క్రియ. చేతన ధర్మమేగాని, జడవస్తు ధరమముకాదు. ఉపనిషత్తుల యందు జగత్‌సృష్టి ప్రసంగమున (ఛాం 6/2/3) తదైక్షత, బహుశ్యాం ప్రజాయేయ, సీక్షత లోకాంతు సృజై, ......... యందు సత్‌యగు పరమాత్మ నేను లోకములను సృజింతునని సంకల్పము చేసెను. త్రిగుణాత్మక ప్రకృతి డమగుటచే సంకల్పము చేయ సమర్ధముకాదు. కావున జగత్తునకు ఉపాదాన కారణము కాదు.

గౌణరూపమున త్రిగుణాత్మక జడప్రకృతికారణమనుటలో ఆపత్తిఏమి? అను ప్రశ్నకు సమాధానముగా శృతులయందు 'ఈక్షణ' సంకల్పము చేయుకర్త ఆత్మ (పరమాత్మ) గానే చెప్పబడినదికాని గౌణవృత్తిచే జడప్రకృతిని జగత్కారణమనుట వేదసమ్మతముకాదు.

ఆత్మ శబ్దము మనస్సు, ఇంద్రియములు శరీరముకొరకు కూడ ప్రయోగింపబడుటచే ఆత్మను గౌణప్రకృతి రూపమున భావించిన కలుగు ఆపత్తిఏమి? సమాధానముగా తైత్తరీయోపనిషత్తులో ఆ పరబ్రహ్మ స్వయముగా తననుతాను ఈ డచేతనాత్మకగ ద్రూపమున ప్రకటి తమైనట్లు చెప్పబడినది. మరియు ఈ ఈవాత్మ అగోచర, అహంకారరహిత, స్ధానరహిత, ఆనందమయ పరబ్రహ్మ యందు నిర్భయనిష్ఠతో అవిచల భావమున స్థితుడగుటచే అభయపదమగు మోక్షపదమొందునని చెప్పబడెను. ఛాందోగ్యోపనిషత్తులోకూడ శ్వేత కేతున కాతని తండ్రి పరమకారణమగు పరమాత్మయందు స్థితుడగుటకు ఫలము మోక్షమని తెలిపెను. పై శృతియందు ఆత్మ శబ్దము ప్రకృతి వాచకముకాదు. కావున ప్రకృతి జగత్కారణముకాదు.

ఆత్మ శబ్దమును గౌణవృత్తి చే ప్రకృతి వాచకముగా చెపుదమన్న దానిని విడచి ముఖ్య ఆత్మలో నిష్ఠకలిగి యుండుట చెప్పబడిన దనుట కానరాదు జగత్కారణమునందే నిష్ఠకలిగి యుండుటకు చెప్పబడుటచే ఆత్మ శబ్దము పరమాత్మవాచ్యము. పరమాత్మయే జగత్తునకు నిమిత్త ఉపాదానకారణము.

ఆత్మ శబ్దమునకు 'సత్‌' శబ్దము కూడ ప్రకృతి వాచకము కాదు. జీవాత్మ నిద్రించునపుడు తన సత్‌ (కారణ) మునందు సంయుక్తుడగును. 'స్వపితి' తన లోతానువిలీనమగును. సమస్త జగత్కారణమగు సత్‌యందే జవాత్మ విలీనమగును. కాని జడ ప్రకృతి యందుకాదు. కావున సత్‌ శబ్దము ప్రకృతి వాచ్యముకాదు.

నిశ్చయముగా సర్వ ప్రసిద్ధ పరమాత్మనుండియే ఆకాశ ముత్పన్నమాయెను. పరమాత్మ నుండియే సర్వము ఉత్పన్న మాయెను (ఛాం. 6/26/1). పరమాత్మ నుండి ఈ ప్రాణము ఉత్పన్నమాయెను (ప్ర.ఉ. 3/3). ఈ పరమాత్మ నుడియే ప్రాణము, మనస్సు, ఇంద్రియములు, ఆకాశాది పంచ భూతములు ఉత్పన్నమాయెను. (ఉమ. ఉ. 2/1/3) ఇట్లు సర్వోపనిషత్తులలో సమానరూపమున చేతన పరమాత్మయే. జగత్కారణముగా వర్ణించబడెనేకాని జడప్రకృతి కాదు.

ఇట్లు పరమాత్మ సర్వమునకు పరమకారణము సమస్త కారణాధిష్టాత, అధిపతి, సమస్త విశ్వస్రష్ట, సర్వశక్తి వంతుడు, సర్వజ్ఞపరమేశ్వరుడే సంపూర్ణ జగత్తునకు నిమిత్త ఉపాదానకారణము. 1-1-(12-19) 'స్వ' అను శబ్దము పరమాత్మకేకాక జీవాత్మకు కూడ ప్రసిద్ధమగుటచే ప్రతీక చేతన జీవాత్మ జగత్కారణముకాదు. పంచకోశములయందు అన్నమయము నకు ప్రాణమయము, ప్రాణమయమును మనోమయము, మనో మయమునకు విజ్ఞాన మయము, విజ్ఞాన మయమునకు ఆనంద మయము అంతరాత్మగా చెప్పబడెను. కాని ఆనందమయము నకు అంతరాత్మగా ఏదియు చెప్పబడలేదు. ఆనందమయ నామము పరమేశ్వరునికా, జీవాత్మకాలేక అన్యులుకాయను ప్రశ్నకు సమాధానముగా తైత్తరీయాది ఉపనిషత్తులయందు పరమాత్మయే ఆనందదుయ సర స్వరూపుడని చెప్పబడెను. సర్వ శక్తివంతుడు, సమస్త జగత్కారణుడు, సర్వనియంత, సర్వవ్యాపి, సర్వాంతరాత్మ పరమేశ్వరుడే ఆనందమయుడు. కాని ఆనందమయ యనుశబ్దమున 'మయట్‌' ప్రత్యయము వికాకార్ధబోధక మగుటచే పరబ్రహ్మవాచకముగా జాలదు అనుశంకకు సమాధాన ముగా పాణిని సూత్రానుసారము 'మయట్‌' ప్రత్యయము ప్రచురతార్ధకము. కావున ఆనందమయ శబ్దమునందు 'మయట్‌' ప్రత్యయము ప్రచురతార్ధబోధకముగా బ్రహ్మవాచకమే. పరబ్రహ్మయే ఆనంద ఘన స్వరూపుడు. ఆనందమయుడగనా ఆనందము నిచ్చువాడు అని అర్ధము. అఖండానంద భండారమగు పరమాత్మయే ఆనంద ప్రదాత. కావున ఇచ్చట 'మయట్‌' ప్రత్యయము ప్రచురతాబోధక మేగాని వికార బోధకముకాదు. తైత్తరీయోపనిషత్తునందు బ్రహ్మానంద వల్లి యొక్క ఆరంభమంత్రము ''సత్యమ్‌జ్ఞానమనంతం బ్రహ్మ'' యను మంత్రమందు విశుద్ధ ఆకాశస్వరూప పరమధామ మందుండు పరమాత్మ హృదయ రూప గుహయందుదాగియున్నాడు. అట్టి పరబ్రహ్మను తెలిసినవారు బ్రహ్మతోగూడి సమస్త భోగములు అనుభవింతురు. ఇచ్చట పరబ్రహ్మ, సర్వాంతరాత్మగావర్ణింపబడుట చే ఆనందమయ శబ్దము బ్రహ్మ వాచకమే. అన్యముకాదు.

తైత్తరీయోపనిషత్తు నందలి బ్రహ్మానందవల్లి లోవర్ణించబడిన బ్రహ్మ జగద్రచనాసంకల్పము చేసెను. జీవాత్మ అల్పము, పరిమిత శక్తియుతమునగుటచే జగద్రచనాకార్యసామర్ధ్యములేని వాడు. కావున ఆనందమయ శబ్దము ఈవాత్మ వాచకము కాదు. జీవత్మ రస స్వరూప పరమాత్మను పొంది ఆనందయుక్తుడగును. కావున పరమాత్మ ఆనంద ప్రదాయకుడు, జీవాత్మ ఆనందముపొందువాడు. ఇద్దరు ఒకటికాదు.

ఆనందమయమునకు హేతువగు సత్వగుణము త్రిగుణాత్మక ప్రకృతియందండుటచే ఆనంద మయ శబ్దము ప్రకృతివాచకమనుకొనుటకు వీలులేదు. ఏలననగా సృష్టి విషయ సంకల్పము జడ ప్రకృతికి అసంభవము. కావున ఆనందమయ శబ్దముజడ ప్రకృతిపరముకాదు. ఇట్లు శృతు లన్నిట ఈవాత్మ పరమాత్మతో సంయుక్తమగుట యనగా ''బ్రహ్మవసత్‌ బ్రహ్మాప్యేతి'', కామనారహిత ఆప్తకామపురుషుడు (జీవాత్మ) బ్రహ్మరూపమును పొంది బ్రహ్మలో లీనమగునని చెప్పబడెను. చేతన ఈవత్మ జడ ప్రకృతి యందుగాని తనవలె పరతంత్ర జీవి యందు గాని లయడుగుట జరుగదు. కావున ఏకమాత్ర పరబ్రహ్మ పరమేశ్వరుడే ఆనందమయ శబ్ద వాచకుడు సర్వ జగత్కారణుడు. అన్యులుకారు.

1-1-(20-21) తైత్తరీయశృతిలో విజ్ఞానమయ శబ్దము జీవాత్మ పరముగను బృహదారణ్యమందు విజ్ఞాన మయ శబ్దము హృదయాకాశమునందు శయనించు అంతరాత్మగా చెప్పబడెను. కావున విజ్ఞానమయ శబ్దము జీవాత్మ వాచకమా? బ్రహ్మవాచకమా? అటులనే ఛాందగ్యమందు సూర్యమండ లాంతర్వర్తి హిరణ్యమయ పురుషుడు సూర్యుడా, లేక బ్రహ్మయా? అను సందేహమునకు సమాధానముగా - బృహదారణ్యకమందు వర్ణిత పురుషునికి విశేషణములుగా సర్వస్యవశీ, సర్వశ్యేశానః, సర్వస్యాధిపతి, సర్వేశ్వర, భూతపాల, వ్యవహరింపబడెను. అటులనే ఛాందోగ్య మందు సూర్యమండలాంతర్వర్తి పురుషుని 'సర్వేభ్యః, పాపేభ్యః ఉదితః'' సర్వపాపములపై నున్నవాడు అను విశేషణ ప్రయోగము పరబ్రహ్మ పరమేశ్వరునికేగాని దేవమనుష్యాది యోనుల యందుండు జీవాత్మ ధర్మములుకావు. కావున పరబ్రహ్మయే విజ్ఞానమయుడు సూర్య మండలాంతర్వర్తి హిరణ్మయ పురుషుడే కాని అన్యులెఆరు. అటులనే సూర్యుడే శరీరముగా కలిగి సూర్యమండతాంతర్విర్తి యై సూర్యుని నియమించువాడు సూర్యాధిష్ఠాతదైవముకంటె భిన్నుడగు పరబ్రహ్మ పరమాత్మయే.

1-1(22-27) ఛాందోగ్యశృతి యందు (1/9/1) జగదుత్పత్తి స్థితి, ప్రళయకారణము ఆకాశమనిచెప్పబడెను. ఈ సరవభూతములు పంచతత్వ సమస్త ప్రాణులు నిస్సందేహముగా ఆకాశము నుండియే ఉత్పన్నమై ఆకాశ మందే విలీనమగును. ఆకాశ##మే సర్వ శ్రేష్ఠము, సర్వాధారము, ఇట్లు ఆకాశ శబ్ద విశేషణములు పంచ భూతములలో ప్రధమమగు ఆకాశ వాచ్యముకాక పరబ్రహ్మపర మాత్మకే యుక్తి సంగతములు. ఆయనే సర్వశ్రేష్ట, సర్వాధారుడు కాని అన్యులుకారు. కావున ఆకాశశబ్దము పర బ్రహ్మవాచకమే.

అటులనే ప్రాణమును జగత్కరాణముగా చెప్పుదురు. (చ. ఉ-1-11-5) ఇట కూడ సర్వభూతములు ప్రాణమందే ఉత్పన్నమై ప్రాణమందే విలీనమగుట చెప్పబడినను ఈలక్షణములు ప్రాణవాయు పరముగాకావు. ఇచట కూడ ప్రాణశబ్దము పరబ్రహ్మ పరమాత్మవాచకమే.

ఛాందోగ్యోపనిషత్తు (3-13-7) నందు జ్యోతి (తేజస్సు) సమస్త విశ్వమునకుపైన సర్వశ్రేష్ఠ పరమ ధామమున ప్రకాశించు నదిగా మరియు శరీరాంతర్వర్తి పురుషస్ధిత జ్యోతితోఏకత్వము చెప్పబడెను. ఇచట వచ్చిన జ్యోతి శబ్దము జడప్రకాశవాచకము కాదు. అయిననది జ్ఞాన, జీవాత్మ, బ్రహ్మవాచకమనునది నిర్ణయింపబడక పోవుటచే సూత్రకారుడు దీనిని బ్రహ్మవాచకము గానిశ్చయించెను. ఏలననగా పూర్వము జ్యోతిర్మయ పరబ్రహ్మయొక్క నాలుగు పాదముల సమస్త భూతసముదాయము ఒక పాదమని, మిగిలినమూడు పాదములు అమృత స్వరూప పరమ ధామస్థితమని చెప్పబడెను. మరియు మాండూక్యాపనిషత్తులో (4-10) ఆత్మ యొక్క నాలుగు పాదములలో రెండవపాదము ''తైజస'' యని చెప్పబడుటచే ఇది జ్యోతి పర్యాయ పదముగా బ్రహ్మవాచకమేగాని జీవాత్మ లేదా అన్యప్రకాశముకాదు.

అటులనే ఛాందోగ్యోపనిషత్తు (3-12-5) యందు వర్ణిత గాయత్రీశబ్దము. ఛంద విశేషముగాక బ్రహ్మపరము గనే (వర్ణింప బడెను) వ్యవహరింపబడెను. ఇటులనే ఉద్గీధ, ప్రణవ శబ్దములు కూడ బ్రహ్మ వాచకములే. సూక్ష్మ తత్వములు బుద్ధిగ్రాహ్యము లగుటకు సమానత్వముగల స్థూలవస్తు నామముల వర్ణన ఉచితము. మరియు ఇదే ప్రకరణమున గాయత్రిని, భూత, పృధ్వి, శరీర, హృదయ రూప నాలుగు పదార్ధములతో గూడినట్లు వర్ణించుచు మహిమా వర్ణనమందు పురుషనామ ప్రతిపాదిత పరబ్రహ్మ పరమాత్మయొక్క ఏకాపదముగా సమస్త ప్రాణిసముదాయము, మిగిలిన మూడు పాదములు పరమధామ స్థితముగా తెలుపబడెను. కాని పూర్వమంత్రమందు (3-12-6) మిగిలినమూడు పాదములు దివ్యలోకమునకు ఆధారమనియు తర్వాత మంత్రము (3-13-7) నందు జ్యోతి నామముచే వర్ణిత పరబ్రహ్మ దివ్యలోకాతీతుడని చెప్పబడినను వర్ణన శైలిలో కొంచెము భేదమున్నను విరోధమేమియులేదు. రెండు చోట్ల గాయత్రీ, జ్యోతిశబ్ద వాచ్యుడు పరమాత్మయే.

1-1-(28-31) కౌషేతకీ ఉపనిషత్తులో (3-2) నేను జ్ఞాన స్వరూపప్రాణము నీవు ఆయు, అమృతరూపముల నన్నుపాసింపుమని ఇంద్రుడు ప్రతర్దనునితో పలికెను. అయిన ప్రాణశబ్దము ఇంద్ర, ప్రాణవాయు, జీవాత్మ, బ్రహ్మలనెవరిని సూచించును.

ప్రాణమే బ్రహ్మ, బ్రహ్మ జ్ఞానమును మించిన హితపూర్ణ ఉపదేశము లేదు. ప్రాణము ప్రజ్ఞాన స్వరూపము. బ్రహ్మకు అను రూపము, ఆనందస్వరూప, అజరామరము, సర్వలోకపాలక, సర్వాధిపతి, సర్వేవ్వరుడే ప్రాణ రూపపరబ్రహ్మ. ఇచట అధిదైవిక వర్ణగాక, ఉపాస్యరూపతత్వము ఇంద్రుడుకాదు. ఆతత్వము ప్రాణ రూప బ్రహ్మయే. బ్రహ్మను తెలిసిన దేవతా, ఋషి మునులు తద్రూపము పొంది బ్రహ్మలగుదురు. ఇట్లు వామదేవ ఋషిపలికెను. ఇట ఇంద్రుడుకూడా బ్రహ్మభావము నుపొందెనేగాని తాను స్వయముగా బ్రహ్మకాదు (కా.ఉ. 3-8) లో ప్రసంగలక్షణము ననుసరించి ప్రాణశబ్దము బ్రహ్మవాకము కాదనిన జీవత్మ, ప్రాణ, బ్రహ్మ త్రివిధ ఉపాసనాప్రసంగము అనుచితము. జీవప్రాణ ధర్మములు కాశ్రయము లోకాధిపతి, లోకపాల పరబ్రహ్మయే ప్రాణవాచకస్వరూపుడు. జీవాత్మ ప్రాణవాయువులు కాజాలవు.

ప్రధమ అధ్యాయము - ద్వితీయ పాదము

ప్రధమ పాదమందు 'ఆనందమయ', 'ఆకాశ', 'జ్యోతి' 'ప్రాణ' మొదలగు శబ్దములు ఉపనిషత్తుల లోవర్ణింపబడిన జగత్కారణ, ఉపాస్యదేవుడగు పరబ్రహ్మ పరమాత్మవాచకములే అటులనే 'ప్రాణ' 'మనోమయ', 'ప్రాణశరీర' మొదలగు శబ్దములు ఛాందోగ్యోపనిషత్తు నందు (3-14-1, 2) మంత్రములను గురించి రెండవ పాదమున వివరింపబడుచున్నది. మరియు సత్యసంకల్ప, ఆకాశాత్మ, సర్వకర్మ మొదలగు విశేషణములు బ్రహ్మపరమే. అణీయాన్‌(మిక్కలి సూక్ష్మము). జ్యాయాన్‌ (మిక్కిలిపెద్ద) అను శబ్దములు హృదయస్థ ఆత్మ, బ్రహ్మయని చెప్పబడెను. ఇచట ఉపాస్యదేవుడు జీవాత్మా, పరమాత్మా లేక అన్యులాయను సందేహ నివృత్తి జరుగుచున్నది.

ఛాందోగ్యోపనిషత్తునందు (3-14-1) సంపూర్ణ జగత్తును బ్రహ్మరూపమున భావించి ఉపాసింప తెలుపబడెను. పిమ్మట, సత్య సంకల్ప, ఆకాశాత్మ సర్వకార్మాది విశేషణములు బ్రహ్మ ప్రతీకములు పిమ్మట అణీయాన్‌, జ్యాయతాన్‌ అనగా బ్రహ్మ సూక్ష్మాతిసూక్ష్మము, మరియు మిక్కిలి పెద్దదిగా వర్ణింపబడిన బ్రహ్మ హృదయాంతర్గత బ్రహ్మగా చెప్పబడెను. ఇట్లు బ్రహ్మ జీవాత్మా, పరమాత్మాలేక వేరెవరేనా? అనుదానికి జవాబుగా :-

1-2-(1-7) :- ఛాందోగ్యోపనిషత్తు (3-14) ప్రధమమంత్రము ''సర్వం ఖల్విదం బ్రహ్మ'' ఈ చరాచర జగత్తు నిశ్చయముగా బ్రహ్మ ఏలనన ఈ జగత్తు బ్రహ్మ నుండియే ఉత్పన్నమై, చేష్టా స్థితినిపొంది, అంతమున బ్రహ్మయందే లయమగును. కావున సాధకుడు రాగద్వేషరహితుడై పరమాత్మను ఆవిధముగా ఉపాసించవలెను. మనుష్యుడు ఈ లోకమున ఎట్టి సంకల్పములు కలిగి యుండునో మరణానంతరము పరలోకమున అటులనే అగును. సమస్త వేదాంత వాక్యములలోను బ్రహ్మయే జగత్‌ మహాకారణ రూపుడుగా ప్రసిద్ధి చెందెను.

చాం.ఉ. 3-14-2 లో ఉపాస్యదేవతను మనోమయ ప్రాణమయ శరీరము కలవానిగా చెప్పబడెను. ఆవిశేషణము జీవాత్మవి. కాని బ్రహ్మ పరముగా ఎట్లు సంగతము అనుశంకకు సమాధానముగా ఇట్లు ఉపాస్యదేవతను మనోమయ, ప్రాణరూప, శరీరగత, ప్రకాశ స్వరూప, సత్యసంకల్ప, ఆకాశసదృశ, వ్యాపక, జగత్కర్త, పూర్ణకామ, సర్వగంధ, సర్వరసాది విశేషణములు బ్రహ్మ పరముగనే సంగతము ఏలనన పరమాత్మసర్వుల అంతరాత్మ, కేనోపనిషత్తులో బ్రహ్మను మనస్సు యొక్కమనస్సు, ప్రాణము యొక్క ప్రాణము అని చెప్పబడెను. కావున ఉపాస్యదేవత పరబ్రహ్మ పరమేశ్వరుడే, పైతెలిపిన గుణములు జీవాత్మ యండుకనబడవు. కావున ఉపాస్యదేవత జీవాత్మకాదు. సర్వకర్మాది విశేషణములు ద్వారా యుక్త బ్రహ్మ నా హృదయమందుండు ఆత్మ. మరణానంతరము పరలోకమున ఆయననే పొందెదను. కావున ఉపాస్యదేవతయగు బ్రహ్మ పొంద బడతగినవాడు. జీవాత్మ పొందగోరువాడు. కావున జీవాత్మ ఉపాసకుడేగాని ఉపాస్య దేవతకాదు. చ.ఉ. 3-14-3-4 మంత్రములయందు నాహృదయమందు వశించు అంతర్యామి ఆత్మ బ్రహ్మయేయని చెప్పబడుటచే శబ్ద ప్రయోగ భేదము చేగూడ ఉపాస్యదేవత ఈవాత్మకంటె భిన్నుడు.

భగవద్గీత (12-8) యందు నాయందే మనస్సులగ్నముచేసి బుద్ధిని నియమించిన నీవు నాయందే వశించి నన్నే పొందెదవు. (గీ. 8-5) ఏపురుషుడు అంతకాలమున నన్నేస్మరించుచు శరీర త్యాగము చేయునో అతడు నా స్వరూపమునే పొందును. ఇందు సందేహములేదు. ఇచట ఉపాస్యదేవుడు పరబ్రహ్మపరమాత్మయే కాని అన్యులుకారు. బ్రహ్మ హృదయస్ధుడగుటచే ఏకదేశీయుడు. ఆవగింకంటె సూక్ష్మమైనవాడు అను ఛాందోగ్యోపనిషత్తువాక్యము. బ్రహ్మపరముగా ఎట్లు ఉచితము. అనుశంకకు సమాదానముగా పరబ్రహ్మపరమాత్మ ఆకాశమువలె సూక్ష్మము, వ్యాపకము. పరమాత్మ సర్వత్ర ప్రత్యేక ప్రాణి హృదయమందు, బయటవ్యాప్తుడు. ఏకదేశీయత, సూక్ష్మత్వము ఇంద్రియముల ద్వారా అగ్రాహ్యడు అని తెలుపుటయే. పరమాత్మ, పృధ్వి, అంతరిక్ష దు%్‌యలోక సమస్త లోకముల సర్వత్ర వ్యాపించినాడు. కావున ఉపాస్యదేవుడు పరబ్రహ్మ పరమాత్మయే.

1-2-8 :- పరమాత్మ ప్రాణుల హృదయమందుండుటచే జీవుంసుఖదుఃఖముల ననుభవించును. ఏలనన బ్రహ్మ, ఆకాశమువలె జడము కాక చేతన యుతుడగుటచే సుఖదుఃఖానుభూతిస్వాభావికము. కాని ఇది సరికాదు. పరమాత్మ ప్రాణుల హృదయమందు న్నను వాని గుణ దోషములచే సర్వధా అసంగుడు. జీవాత్మ అజ్ఞాన కారణమున కర్త, భోక్త, కాని పరమాత్మ సర్వధానిర్వికారుడు. కేవల సాక్షీమాత్రడు భోక్తకాదు. కావున ఈవుల కర్మఫల సుఖదుఃఖాదులతో పరమాత్మకు సంబంధములేదు.

1-2-10:- కాని కఠోపనిషత్తు 1-2-25 యందు పరమాత్మ భోక్తాగా చెప్పబడెను. ఆని ఇట కర్మ ఫలరూప సుఖదుఃఖాది భోక్తకాదు. కాని ప్రళయకాలమున మృత్యుసహిత సమస్త చరాచర జగత్తును తనలో విలీనము చేసుకొనుటచే భోక్తయని చెప్పబడెను. ఇట పూర్వాపర ప్రకరణముల బ్రహ్మ స్వరూప వర్ణనచేయుచు. ఆయనను తెలిసికొనుట యందలి మహత్వము ఆయన కృపచేతనే ఆయనను తెలిసికొను ఉపాయము చెప్పబడెను. ప్రసంగాను రూపముగా పరబ్రహ్మ పరమేశ్వరుడు 'అత్త' భోక్తయనునది విదితము.

1-2-11, 12 :- కఠోపనిషత్తు 1-3-1 యందుశుభకర్మఫల స్వరూప మనుష్యశరీరమందు పరబ్రహ్మ యొక్క ఉత్తమనివాస స్థానమునగు బుద్ధి రూప గుహయందు సత్యపానము చేయువారు ఇరువురు. ఎండ, నీడల వలె పరస్పర విరుద్ధ స్వభావముకలవారు. పరమాత్మ సర్వజ్ఞ, పూర్ణజ్ఞాన స్వరూప, స్వయంప్రకాశకుడగుటచే ఎండగను, పరమాత్మ యొక్క అంశరూపుడగు జీవాత్మ అల్పజ్ఞుడగుటచే నీడగను వర్ణింపబడెను. ఛాయయందుకల స్వల్ప ప్రకాశముఎండదే. ఛాందోగ్యోపనిషత్తు 6-3-2 ప్రకారము పరమాత్మ జీవాత్మ సహితముగా తేజాదిముగ్గురు దేవతలలోను అనగా వారి కార్యరూపశరీరమందు ప్రతిష్టమై నామ రూపాత్మకముగా ప్రకటితమగుట సంకల్పించెను. జీవాత్మ, పరమాత్మలు భోక్తలైనను, పరమాత్మ సమస్త దేవతారూపమున సమస్త యజ్ఞతపోరూప శుభ కర్మలభోక్త, ఆయన భోక్తయైనను. అభోక్త (గీ 5-29, 9-23, 13-14) మరియు పరమాత్మ సంపార సాగరము దాటు ఇచ్ఛ గలవారికి అభయప్రదుడు. మరియు జీవాత్మ రధికుడు, పరమాత్మ ప్రాప్తవ్య పరమధామము. కావున వేర్వేరు విశేషణ ప్రయోగముచే బుద్ధి గుహ యందుండువారు జీవాత్మ, పరమాత్మలే.

1-2-(13-17):- ఛాందోగ్యోపనిషత్తు 4-(15-1) యందు ఉప నేత్రమునందు కనబడు పురుషుడే ఆత్మ, అమృత అభయ బ్రహ్మ యని చెప్పబడెను. ఛాందోగ్యోపనిషత్తు 4-(10-15) యందు ఉపకోశలుడను బ్రహ్మచారి సత్యకామఋషి ఆశ్రమమున బ్రహ్మచర్యపాలన చేయుచు, గురువు, అగ్నుల సేవచేయు చుండెను. అందరి శిష్యులకు ఉపదేశమొనరించి స్నాతకులేసి పంపెను. కాని ఉపకోశలుని విషయమున పట్టించుకోలేదు. భార్య చెప్పినను వినిపించుకోక వెడలి పోయెను. ఉపకోశలుడు నిరాహార దీక్ష బూనుటకు సిద్ధపడగా అగ్నులు అతనిని ఉపదేశించెను. అతనిలో బ్రహ్మతేజము చూచి సత్యకాముడాతనికి ఉపదేశము చేసెను. నేత్రము నందు కనబడు పురుషుడు పరబ్రహ్మయే. జీవాత్మ లేక ప్రతి బింబమునకు గాని వర్తించదు. బ్రహ్మ విద్యా ప్రసంగమున ఆత్మ అమృత అభయ బ్రహ్మపదాది విశేషణములు బ్రహ్మపరముగనేగాని అన్యుల పరముగా కాఉద. ఇట్లు బ్రహ్మను నేత్రాంతర్వర్తి యని చెప్పుట శృతుల యందు బ్రహ్మను గూర్చి తెలుపుటకే అట్లు వర్ణింపబడెను. పరమాత్మ నిర్లిప్తుడైనట్లే నేత్రాంతర్వర్తి పురుషుడుకూడ నేత్ర దోషములచే సర్వధానిర్లిప్తుడు. కండ్లలో వేయు ఘృతాదులు కంటి రెప్పలలోనే ఉండును. గాని ద్రష్టయగు పురుషుని స్పర్శించవు. ఉపకోశలునకు అగ్నులు మొదలు 'క' అనగా సుఖము, 'ఖ' అనగా ఆకాశము అని ఉపదేశించెను. ఇట బ్రహ్మ ఆకాశమువలె అత్యంత సూక్ష్మ, సర్వవ్యాపి, ఆనంద స్వరూపుడగు బ్రహ్మయే.

ఈ ప్రకారముగా నేత్రాంతర్వర్తి పురుషుని తెలసికొనినవారు బ్రహ్మవేత్తలవలె పునారవృత్తిరహిత బ్రహ్మలోకము పొంది బ్రహ్మను పొంది మరల సంసారము లోనికి తిరిగి రారు. ఛాయా పురుషుడు లేక ప్రతి బింబము కండ్లలో ఎపుడు ఉండదు. ఎవరైనా ఎదురుగావచ్చిన ఆతని ప్రతి బింబము కండ్లలో కనబడును, తాలగుట తోడనే ప్రతి బింబము అదృశ్యమగును. నేత్రేంద్రియాను గ్రాహక దేవతకూడా చూచుట యనక్రియకు సహాయ రూపమునుండును. జీవాత్మమనస్సుద్వారా ఒకసమయ మున ఒకే ఇంద్రియ విషయమును గ్రహించును. సుషుప్తి యందు ఏ విషయము గ్రహించదు. కావున నేత్రాంతర్వర్తి పురుషుడు అమృతత్వాది గుణవిశేషము లచే పరబ్రహ్మ పరమాత్మయేకాని అన్యులెవరుకారు.

1-2-18 :- బృహదారణ్యకోపనిషత్తు 3-7 నందు ఉద్దాలక ఋషి యాజ్ఞవల్క్యమునిని సూత్రాత్మవిషయమున ప్రశ్నింప అంతర్యామి స్వరూప ఆత్మ తానుచూడ బడక స్వయముగా అన్నిటిని చూచును. వినుటకు వీలుగాక స్వయముగా అన్నివినును, మననము చేయ వీలుగాక స్వయముగా అంతయుమననముచేయును. ఇట్టి విశేషణ రూపముల ఆత్మయే అంతర్యామి అమృతరూపుడు. జీవాత్మయొక్క అంతర్యామి ఆత్మ పరబ్రహ్మకాక మరెవరుకాదు. కావున అధిదైవిక, ఆధ్యాత్మకాది సమస్తవస్తువుల అంతర్యామి ఆపరమాత్మయే.

1-2-(19-20):- సాంఖ్యుల ద్వారా ప్రతిపాదిత ప్రధాన (జడప్రకృతి) అంతర్యామికాదు. చేతన పరబ్రహ్మయే. అంతర్యామి పరమాత్మ కాని జీవాత్మ చేతన యుక్తముకాదా? శరీరమందుండి ఇంద్రియముల నియమించువాడు ప్రత్యక్షముగా నుండ జీవాత్మను అంతర్యామి యని ఏల అనరాదు? అను శంకకు సమాధానముగా - మాంధ్యందినచ కాణ్వ శాఖలు వారు కూడా అంతర్యామి పృధివ్యాడులవలె ఈవాత్మ లోపల నుండి అతనిని నియమించు వాడని చెప్పిరి. జీవాత్మను నియమింపబడువాడు, పరమాత్మను నియమంతయని వేర్వేరుగా వర్ణించుటచే అంతర్యామిపదము పరబ్రహ్మవాచకమేగాని జీవాత్మదికాదు.

1-2-(21, 22):- ముండకోపనిషత్తు నందు అదృశ్యత, అగ్రాహ్యతాది ధర్మములు చెప్పుడు సర్వ భూతకారణముగా చెప్పబడుటచే ఆధర్మములు ప్రకృతి యందుండుటచే ప్రకృతి అంతర్యామి ఏలకారాదు? సమాధానము ముండకోపనిషత్తు నందు శౌనకుడు అంగిర ఋషి శరణుజొచ్చి దేనిని తెలిసిన అంతయుతెలియబడునో అది ఏది అని ప్రశ్నించెను. అంగిర ఋషి తెలియదగినవి రెండు విద్యలు అపరా,పరా, అపరా విద్యలు చతుర్వేదములు, శిక్ష, కల్ప, వ్యాకరణ, ఛంద, జ్యోతిష, నిరుక్త షీట్‌ శాస్త్రములు అనియు, అక్షర పరబ్రహ్మను గూర్చి తెలిసికొనువిద్య పరావిద్యయని తెలుపుచు, అక్షర పరబ్రహ్మ ఇంద్రియములకగోచరుడు, పట్టుటకు శక్యముకానివాడు, గోత్ర, వర్ణ, అవయవ రహితుడు, నిత్య వ్యాపక, అత్యంత సూక్ష్మ అవినాశిపురుషుని, సమస్త భూత పరమకారణ మగువానిని ధీరపురుషులు చూడగలరు. మరియు సర్వజ్ఞుడు, జ్ఞానమేతపముగా గల పరమాత్మ నుండి యే విరాట్‌ రూప జగత్తు, నామ, రూప, అన్‌ఆనదులు ఉత్పన్నమగుచున్నవి. అదృశ్య అగోచరాది గుణములు పరమాత్మవే. పైధర్మములు పరమాత్మవే గాని ప్రకృతివికాదు. పైన తెలిపిన గుణముల ప్రధాన (జడప్రకృతి) అల్పజ్ఞ జీవాత్మలకు ఉపయుక్తముకాదు. చూచువాడగు (జీవాత్మ) శరీరమందు హృదయ గుహలో పరమాత్మదాగియున్నాడు. శరీరమను వృక్షముపై జీవాత్మ పరమాత్మలున్నను జీవాత్మ దేహాభిమానము చే శోక సంతప్తుడగుచున్నాడు. ద్రష్టయగుపరమాత్మను సేవించిన శోకరహితుడగును. పరమాత్మయే అదృశ్యుడు గాని జీవాత్మ, ప్రకృతికాదు .

1-2-23 :- ముండకోపనిషత్తు 2-1-4 నందు పరమేశ్వరుని విరాట్‌ స్వరూప వర్ణనయందు అగ్ని పరమాత్మ మస్తకము, సూర్య చంద్రులు నేత్రములు, దిశలు కర్ణములు, ప్రకటిత వేదములు వాణి, వాయువు ప్రాణము, దిశలు కర్ణములు, ప్రకటితవేదములు వాణి, వాయువు ప్రాణము, సంపూర్ణ విశ్వము హృదయము పాదముల నుండి పృధ్వి ఉత్పన్నమాయెను. సర్వాంతర్యామి పరమాత్మ. సర్వభూతకారణుడు.

1-2-(24-28):- ఛాందోగ్యోపనిషత్తు 5-18-2 నందు వైశ్వానర స్వరూప వర్ణన చేయుచు ద్యులోకము ఆయనమస్తకమని చెప్పబడెను. వైశ్వానర శబ్దము. జడరాగ్ని వాచకమా లేక ఇతరమా? అనుశంకకు సమాధానముగా - ప్రాచీనశాల, సత్యయజ్ఞ, ఇంద్రద్యుమ్న, జన, బుడిల ఋసులు, ఆత్మ, బ్రహ్మవిచారము చేయుచు వైశ్వానర ఆత్మను తెలిసిన ఉద్దాలకుని వద్దకు వెళ్లిరి. ఆయనకూడా వారితో కలసి అశ్వపతి మహారాజు వద్దకు వెళ్లిరి. ఆయనవారిని ఆదరించి వారి వారి అభిప్రాయములు తెలిసికొని ఇట్లు చెప్పెను. ఈ విశ్వాత్మ వైశ్వానరునకు ద్యులోకమస్తకము సూర్యుడు నేత్రము వాయువ్యప్రాణము, ఆకాశము శరీర మధ్యభాగము, జలము బస్తి స్థానతము, పృథ్విరెండు పాదములు, వేదిదక్ష, స్థలము, దర్భలు లోమము, గార్హపత్యాగ్ని హృదయము. అష్టాహార్యపచన అగ్ని మనసు, ఆహవనీయాగ్నిముఖము. పై వర్ణనానుసారము విశ్వాత్మ రూపుడగు విరాట్‌ పురుషుడే వైశ్వానరుడుకాని ఠరాగ్నిది వాచకములు కావు. మరియు మహాభారత శాంతి పర్వము (47/70) నందు కూడ పైన వర్ణించిన మాండూక్యోపనిషత్తు నందు బ్రహ్మయొక్క నాలుగు పాదములలో మొదటి పాదము వైశ్వానరమని తెలుపబడెను.

శతపధ బ్రాహ్మణము (16-6-1-11) నందు వైశ్వానరాగ్నిని పురుషాకారముగా పురుషుని యందు ప్రతిష్ఠితమని చెప్పబడెను. కాని ఇట కూడా వైశ్వానర శబ్దము అగ్నియొక్క విశేషణ రూపమ మునగాక జఠరాగ్ని యందు బ్రహ్మ దృష్టి కలిగించుటకే అట్లు చెప్పబడెను. భగవద్గీత (15-14) నందు కూడా వైశ్వానర రూపమున ప్రాణుల శరీరమందు జఠరాగ్ని గా నుండి చతుర్విధాన్నముల పచనము చేయుదునని చెప్పిన చోట గూడ వైశ్వానర శబ్దము జఠరాగ్ని విశేషముగాక పరమాత్మ దృష్టితో చెప్పబడెను. ద్యులోక, సూరయలోకములు, ఆకాశవాయువు మొదలగు భూత సముదాయము ఆత్మరూపమున ఉపాసింప గోరు ప్రసంగమున పైలోకములు, దిశలు, భూత సముదాయముయొక్క అభిమాన దేవతలు గాక విశ్వరూప పరమాత్మయే వైశ్వానరుడు. జైమిని ముని కూడ వైశ్వానర శబ్దము సాక్షాత్‌ విశ్వరూప పరమాత్మ వాచకమే గాని అగ్ని విశేషముకాదని తెలిపెను.

1-2(29-32):- నిర్గుణనిరాకారుని, సగుణసాకారుడుగా వర్ణించుట యందు విరోధము కలదను దానికి అశ్వరధ్యయను ఆచార్యుడు ఇట్లు తెలిపెను. పరమాత్మ భక్త జనులపై అనుగ్రహముతో సమయాసమయముల వారి శ్రద్ధానుపారము నానారూపముల ప్రకటితమై భక్తులకు దర్శన, స్పర్శన, వార్తా, ప్రేమాలాపముల ద్వారా సుఖముకలిగించి వారిని ఉద్ధరించి జగత్తున తనకీర్తి వ్యాపింపజేసి కధన మననల ద్వారా సాధకుల లాభార్ధము మనుష్య రూపముల వ్యక్తమగును. బాదరాయణుల వారు కూడ పరమాత్మ దేశకాలాతీతుడైనను భజన, ధ్యాన, స్మరణాదుల భక్తుడు ఏఏ రూపమున చింతించునో ఆయా రూపముల దర్శన మిచ్చికరుణించును. జైమిని ఋషికూడా సర్వైశ్వర్య సంపన్న పరమాత్మ నిరాకార నిర్గుణుడైనను సాకార సగుణుడగుటలో విరోధము లేదనెను. వైదిక సిద్ధాంత శాస్త్ర ప్రమాణానుసారము పరమాత్మ దేశకాలాతీతుడైనను సగుణ, నిర్గుణ, సాకార నిరాకార, సవిశేష నిర్విశేష సర్వము ఆయనయే అట్లు విశ్వసించి సాధకుడు స్మరణ చింతనముల ............. కావలెను.

ప్రథమ అధ్యాయము - తృతీయ పాదము.

మొదటి రెండు పాదములలోను, సర్వాంతర్యామి పరబ్రహ్మ పరమాత్మ వ్యాపక రూపము యొక్క ప్రతి పాదన బాగుగా చేయబడెను ఈ పాదమునందు సర్వాంతర్యామి పరబ్రహ్మపరమాత్మ సర్వవ్యాపకుడేగాక సర్వాధారుడుకూడా యని తెలుపబడుచున్నది.

1-3-(1-7):- ముండకోపనిషత్తు 2-2-5 యందు ఎవరి యందు స్వర్గము, పృధ్వి, ఆకాశము, సమస్త ప్రాణులు గూడి మనస్సు గ్రుచ్చుబడియున్నదో ఆ సర్వాంతరాత్మరూప పరమేశ్వరుని తెలిసి కొనుటయే అమృతమునకు సేతువు. ఇచట వర్ణింపబడిన ఆత్మ జగదాధార పరమాత్మయేకాని జీవాత్మ, ప్రకృతి కాదు. ము.ఉ. 3-28 నందు ప్రవహించునదులు నామ రూపముల విడచి సముద్రములో లీనమగునట్లు జ్ఞానులు నామరూప రహితులై ఉత్తమోత్తమ పరమ పురుష పరమాత్మను పొందెదరు. ముడకోపనిషత్తు 2-25 నందు ముక్తపురుషుడగు జ్ఞానికి పొందదగినవారు ద్యులోక, పృధ్వీలోకాదుల ఆధారభూతుడగు ఆత్మయని చెప్పుటచే ఇట జీవాత్మ పరముగాగాక సాక్షాత్‌ పరమాత్మయే ప్రాప్తవ్యుడు. మరియు ప్రణవదునుధనస్సుపై ఈవాత్మయను బాణమునకు పరమాత్మయే లక్ష్యము. లక్ష్యము సాధించి బంధముక్తుడై సాధకుడు చింతనా తత్పరుడై తన్మయత పొందును. కావున సర్వలోకాధారుడు. సర్వభూతాధారుడు పరమాత్మయే.

పృధ్వివ్యాది సర్వ భూతప్రపంచము జడప్రకృతి యొక్క కార్యముగాన కార్యమున కాధార మగు కారణము ప్రకృతి (ప్రధాన) సర్వాధారముగా ఏలవ్యవహరించరాదు? సమాధానము - అనుమానకల్పిత ప్రధానము ప్రకృతి పృధివ్యాది లోకముల కాధారము కాదు. ఏలనన ఇట అట్టి ప్రతిపాదకశబ్ద ప్రయోగములేదు. మరియు ప్రకృతి జగత్కారణముకాదని మందుగనునే ఋజువు చేయబడినది. ప్రకృతి వాచక శబ్దము లేనట్లే జీవాత్మ వాచక శబ్దములేని కారణమున ఆత్మ శబ్దము అన్యత్ర ఈవాత్మ పరముగా ప్రయోగింపబడినను ఇట ఆనందరూప, అమృతాది విశేషణ ప్రయోగముచే ఇది పరబ్రహ్మ పరమాత్మవాచకము. ప్రాణాధార జీవాత్మకాదు మరియు ఈ ఆత్మను తెలిసికొనుము అనుటచే తెలిసికొనబడు ఆత్మ తెలిసికొను ఆత్మవేర్వేరు. అన్నిమంత్రము లయందు పరమాత్మయే సర్వాధార, సర్వకారణ, సర్వజ్ఞ, సర్వశక్తివంతుడనుటచేతను అట్టి పరమాత్మయే. జీవాత్మకు ప్రాప్తవ్యుడగుట చేతను ఆత్మ, సర్వాధార పదములు జీవాత్మ ప్రకృతిపరము గాకాదు.

ఒకే వృక్షముపై సఖ్య భాదమున నుండు జీవాత్మ పరమాత్మ యను పక్షుల యందు జీవాత్మ ఆవృక్షముయొక్క కర్మఫలస్వరూప సుఖ దుఃఖములభోక్త, పరమాత్మ కేవల ద్రష్ట, సాక్షీభూతుడు పరమాత్మయే జగదాధారుడు.

1-3-(8, 9):- ఛాందోగ్యోపనిషత్తు (7-15-1) యందు రధచక్ర నాభియందు ఆకులు ఆశ్రయించియుండునటుల సమస్త జగత్తు ప్రాణము నాశ్రయించి యున్నది. ప్రాణమే ప్రాణముకొరకు గమనము చెందును. ప్రాణమే ప్రాణమునిచ్చును, ప్రాణము కొరకే ఇచ్చును. ప్రాణమే తల్లి, తండ్రి, సోదరీసోదరులు, ఆచార్య బ్రామ్మణాదులు, ప్రాణమునకు మరియొకపేరు ''సంప్రసాద్‌''. ఇది జీవాత్మదే. ఇట్లు ప్రాణశబ్ద వాక్య జీవాత్మను అన్నిటి కంటె పెద్దదిగా చెప్పిన సనత్కుమారుడు నారదుడు అడుగకయే సత్యశబ్దముతో బ్రహ్మ ప్రకరణము ప్రారంభించి మనన, శ్రద్ధా, నిష్టలద్వారా సుఖరూప 'భూమి' అందరికంటె గొప్పవాడు. పరమాత్మయని చెప్పెను. భూమాశబ్దము సచ్చిదానంద పరబ్రహ్మవాచకమేగాని ప్రాణ, జీవాత్మ, ప్రకృతి పరముకాదు. మరియు ఎచట చేరిన, ఎవరిని చూడక, ఏదియువినక, అన్యము తెలియకుండునో అదియే భూమి. భూమి ధనాది సంపదలయందుగాక తనమహిమయందే ప్రతిష్ఠితము. ఆ భూమియనబడు ఆత్మయే. సర్వదిశలవ్యాపించి ఆత్మరమణ, ఆత్మానందము, ఈ ధర్మములు భూమానామవాచక పరబ్రహ్మ పరమాత్మవాచకములు. అన్యముకాదు.

1-3-(1-12):- బృహదారణ్యక ఉపనిషత్తు 3-8-(6-8) నందు గార్గి యాజ్ఞవల్క్యుల సంవాదమునందు ద్యులోక, పృధ్వీలోకాదుల ఆకాశాదుల వ్యాపించిన తత్వమును బ్రహ్మవేత్తలు అక్షరమందురు. అక్షరము స్ధూల సూక్ష్మ వర్ణవిశేషరహితము. ఆకాశపర్యంతము సమస్తమును ధరించునది అక్షరపరబ్రహ్మయే. అన్యులుకారు.

ఈ అక్షర పరబ్రహ్మశాసనాను సారమే. సూర్యచంద్రాదులు, సర్వోలకములు. నిమిషాదికాలవిశేషము. సర్వము ధరించి శాసించును. ఈకార్యము జడ ప్రకృతిదికాదు. ఈ అక్షరము కంటికికానరాదు. కాని స్వయముగా అన్నిటిని చూచును. వినుటకు అందదుకాని స్వయముగా అన్నివినును, ఇత్యాది గుణములు జడప్రకృతి పరముగాగాక పరబ్రహ్మపరముగా ప్రతిపాదింపబడెను.

1-3-13:- ప్రశ్నోపనిషత్తు 5-2-7 నందు ఓంకారము అక్షరపర బ్రహ్మకు, అపర బ్రహ్మకు ప్రత్యేకముగా చెప్పబడెను. ఇట ఓంకార నిరంతర ధ్యానముచే తేజోమయ సూర్యలోకము ద్వారా వెడలు జీవాత్మ సర్వపాప విముక్తమై సామవేద శృతుల ద్వారా బ్రహ్మలోకమును పొది అంతర్యామి పరమ పురుష పరమాత్మను సాక్షాత్కరించుకొనును. ఇట ఓంకారము పర బ్రహ్మవాచకమేగాని ఈవ సముదాయ నామములచే వర్ణిత హిరణ్య గర్భ అపర బ్రహ్మ కాదు. ఇట ఈక్షత్‌శబ్ద ప్రయోగము పరబ్రహ్మ పరముగా జరిగినది.

1-3-(14-23):- ఛాందోగ్యోపనిషత్తు 8-1-1 నందు బ్రహ్మపురాంతర్గత దహర (సూక్ష్మ) ఆకాశవర్ణనమున అందుండు వస్తువును తెలిసికొన వలెనని చెప్పబడెను. మనుష్య శరీరమున హృదయకమల రూప పుండరీక (బ్రహ్మ) పురము నందు దహర(సూక్ష్మ) ఆకాశము క్రింద గలపురుషుని గూర్చి తెలిసి కొనవలెను. ఇట దహర శబ్దము బ్రహ్మవాచకముగనే ప్రయోగింపబడినది. దీనిలోనే సమస్త బ్రహ్మాండము నిహితమైయున్నది. ఈ ఆత్మరామరణరహిత, శోకశూన్య, సత్యకామ, సత్యసంకల్పాది విశేషణములు పరబ్రహ్మపరమే.

(1-3-(14-23):- ఛాందోగ్యోపనిషత్తు 8-3-12 నందు జీవసముదాయము ప్రతిదినము సుషుప్తి కాలమందందు బ్రహ్మలోకమునకు వెళ్లును. కాని అసత్యావృతమగుటచే తెలియజాలదు. మరియు 6-8-1 నందు కూడ హేసేమ్యా! సుషుప్తి అవస్ధయందు జీవి సత్‌నామక పరబ్హ్మ పరమాత్మను కూడి యుండును. ఈ ప్రకరణములందు కూడా వచ్చు దహరశబ్దము బ్రహ్మలోకవాచకమగుటచే పరబ్రహ్మ బోధకమే.

మరియు ఛాందోగ్యము 6-8-1నందు ఈ ఆత్మ సర్వలోకములను ధారణచేయును. బృహదారణ్యకము 3-8-9 నందు అక్షర పరమాత్మ యొక్క శాసనమున సూర్యచంద్రాదులు స్ధితులైయున్నారు. బృహదారణ్యకము 4-4-22 నందు సర్వమునకు ఈశ్వరుడు, సమస్త ప్రాణులకు స్వామి. సర్వభూతపాలకుడు, సమస్తలోకాధారుడు. అను చోట్ల కూడా వచ్చు దహరశబ్దము పరబ్రహ్మ పరమేశ్వర వర్ణనమే. తైత్తరీయ సంహిత 2-7-1 ఈ ఆనంద స్వరూప ఆకాశము లేనిచో ఎవరు జీవించగలరు? ఛాందోగ్యము 1-9-1 నిశ్చయముగా ఈ సర్వప్రాణులు ఆకాశమునుండియే ఉత్పన్న మాయెను. ఛాందోగ్యము 8-1-5 నందు ఇది (దేహము) యొక్క జీర్ణావస్ధచే జీర్ణముకాదు. వధించుటచే నాశనముకాదు అనుకధనము జీవాత్మ పరముగాకనిపించుచున్నను సత్యసంకల్ప, సత్యకామాది లక్షణములచే ఇది జీవాత్మకాదు. దమర శబ్దవాచకపరబ్రహ్మయే యనుట ఉచితము. ఛాందోగ్యము 8-3-4. నందు ఈ సంప్రసానము శరీరము ఉండి వెలువడి పరమ జ్యోతి రూపము పొంది తనశుద్ధ స్వరూపమున సంపన్నడుగును. ఇట శుద్ధ స్వరూప ప్రయోగముచే దహరయన జీవాత్మ కాదు పరమాత్మయే. ఇట జరిగిన శబ్ధప్రయోగమున దహర శబ్దము జీవాత్మను గురించికాక అన్యప్రయోజనమున అనగా పరమాత్మ యధార్ధ స్వరూప జ్ఞానముకలిగిన జీవాత్మ కూడ అట్టి గుణములు పొందునని సూచించుచటకే యని తెలియవలెను. తైత్తరీయ ఉపనిషత్తు నందు పరమాత్మ డచేతనాత్మక సంపూర్ణ జగద్రచనచేసి స్వయముగా జీవాత్మతోగూడి అందు ప్రవేశించెను. ఛాందోగ్యము 6-3-3 నందు ఆ పరమాత్మ కార్యరూప మనుష్యశరీరమందు జీవాత్మతో గూడి ప్రతిష్ఠుడై నామ రూపముల విస్తరించెను. కఠోపనిషత్తు 1-3-1 నందు శుభకర్మఫలరూప మనుష్యశరీరమందు పరబ్రహ్మ నివాసస్ధాన హృదయాకాశాంతర్గత బుద్ధిరూప గుహయందు సత్య పానము చేయువారు జీవాత్మ పరమాత్మ ఇద్దరే. కావున వేదములలో పరమాత్మ ''అణోరణీయాన్‌ మహతోమహేయాన్‌'' అని వర్ణింపబడెఉ. భగవద్గీత 15-15 సర్వస్వబాహుహృది సన్నివిష్ట, 18-61 ఈశ్వర సర్వబూతానాం హృద్ధేశేర్జునతిష్ఠతి, 13-16లో అవిభక్తంచ భూతేషు విబక్త మివచస్థితమ్‌, 8-9లో అణోరణీయామ్‌ ఇత్యాది వర్ణనలు దహర శబ్దవాచ్య పరమాత్మయే.

1-3-(24-25) :- కఠోపనిషత్తు 261-12, 13 నందు అంగుష్ఠ మాత్ర పురుషుడు హృదయ కుహరముననుండి ధూమరహితజ్యోతివలె ఏక రసమున భూత, భవిష్యత్‌, వర్తమానముల శాసించును. ఉపనిషత్తులలో బ్రహ్మ విద్య ద్వారా బ్రహ్మను తెలిసికొను అధికారము మనుష్యనకేగాని నీచయోనుల జన్మించు పశుపక్ష్యాదులకులేదు. మానవ హృదయ కుహర పరిమాణము అంగుష్ఠమాత్రమని సూచించుటచే అందువశించుపరబ్రహ్మ కూడ అంగుష్ఠమాత్రపురుషుడే నని చెప్పబడెను.

1-3-(26-30):- మనుష్యులేగాక మనుష్యలుకంటె ఉన్నతమగు దేవతలుకూడా బ్రహ్మజ్ఞానప్రాప్తికి అధికారముకలదు. దేవతలుకూడ మనుష్యాకృతి కలిగి శరీరధారులైన ఏకదేశీయ కారణమున యజ్ఞయాగాదులందు వేర్వేరు చోట్ల హవిర్భాగములు గైకొనుట ఎట్లు సమభవము అను శంకకు సమాధానము - దేవతలు కూడా యోగుల వలె ఏకకాలమున అనేక శరీరములధరించి అనేకస్ధానముల తమకు సమర్పిత మవిర్గ్రహణము చేయుదురు. బృహదారణ్యకము 3-9-1, 2 నందు శాకల్యముని ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు దేవతలు మూడు, ముప్పది మూడ, మూడు వేలు అని చెప్పెను. వాస్తవమున దేవతలు ముప్ది మువ్వురు. శృతులయందు దేవతలు అనేక రూపధారణశక్తి కలవారుగా చెప్పబడినది. దేవతలు శరీరధారులైన వినాశశీలురుగా భావించవలెను. అట్టిచో వేదములందు వచ్చు దేవతావర్ణన నిత్యము ప్రమాణభూతముగా నంగీకరింపలేము. అను శంకకు సమాధానముగా కల్పాదినదేవతలు ఏరూపముల ఐశ్వర్యయుక్తులై పేరు పొందిరో వారే మరల మరియొక కల్పమున గూడ ఉందురు. ఇది ప్రత్యక్ష అనుమాన (శృతి శ్మృతి) లద్వారా గూడ నిరధారింపబడెను. తైత్తరీయోపనిషత్తు 2-2-4 నందు ప్రజాపతి భూ, శబ్దోచ్చారణ చేసి భూమిని సృష్టించెను, భువ, శబ్దోచ్చారణ చేసి భువర్లోకము సృష్టించెను. అటులనే సృష్టికర్త (మను 1-21) నందు సృష్టి ప్రారంభమున వేర్వేరుకర్మలు వానివానివ్యవస్ధలు వేదోక్త శబ్దానుసారము చేసెను. కావున వేదముల నిత్యత్వము ఋఉవగుచున్నది ప్రతికల్పమున పరమాత్మ కొత్తగా వేదరచన చేయుననుట ఎచట చెప్పబడలేదు. పరమేశ్వరుడు సృష్టికాలమున తొలుత బ్రహ్మను సృఇంచి వేదములనుపదేశించెను. మరియు ప్రతికల్పమందు దేవతలునామ రూపాత్ములై వేదవచనానుసారము రచింపబడిరి. ఇందు ప్రామాణికతావిరోధములేదు.

1-3-(31-33):- జైమిని మతాను సారము బ్రహ్మ విద్యకు దేవతలకు అధికారములేదు. ఛాందోగ్యమునందు వర్ణిత మధు విద్యమనుష్యులకు సాధన ద్వారా ప్రాప్తించును. కాని దేవతలకు స్వత, ప్రాప్త మగును. అట్లే స్వర్గాది దేవలోక భోగములు యజ్ఞ యాగాదులు చేసిన మనుష్యులకు ప్రాప్తించును. కాని దేవతలకు స్వతః ప్రాప్తము కాని వేదవర్ణిత విద్యలవలె బ్రహ్మవిద్యయందు కూడ దేవతలకు అధికారములేదు. మరియు స్వభావసిద్ధముగా జ్యోతిర్మయ దేవలోకములవశించు దేవతలకు సకల ఐశ్వర్యములు ప్రాప్తించును. నూతన కర్మల ద్వారా నూతన ఐశ్వర్యములు పొదనవసరములేదు. కావున వేద విహితవిద్యలవలె బ్రహ్మ విద్యయందుకూడ దేవతలకు అధికారములేదు. అనుజైమిని పూర్వపక్షమును. సూత్రకారుడు ఖండించుచు తన నిశ్చితమతముతెలిపెను. తైత్తరీయబ్రహ్మలు ము 2-1-2-8 తై.సంహిత. 2-83 నందు ప్రజాపతి నేను ఉత్పన్నమై మంచి జన్మపొందుగాక, మరియు అగ్ని హోత్రరూపమిధునము పై దృష్టి పడగా సూర్యోదయమైన పిదప దానిని హవనముచేసెను. కావున నిశ్చయముగా దేవతలు ¸్ఞూనుష్ఠానము గావించిరి. మరియు బృహదారణ్యకము 1-4-10 నందు దేవతలలో ఎవరు ఆ బ్రహ్మను తెలిపిరో వారు బ్రహ్మవైరి. ఛాందోగ్యము 8-7-2-12, 6 నందు ఇంద్రుడు వైరోచనుడు బ్రహ్మను సేవించి చాలావత్సరములు బ్రహ్మ చర్యమాచరించి బ్రహ్మ విద్యనుపొదిరి. కావున దేవతలకు అధికారము కలదు.

1-3-(34-38):- ఛాందోగ్యోపనిషత్తులో రైక్వుడు జనశృతియను రాజును శూద్రుడని పలుకుచు బ్రహ్మ విద్యనుపదేశించెను. కావున శూద్రులకు అధికారము కలదా అను శంకకు సమాదానముగా పై ప్రసంగమున రాజు శోకాకులుడై పరుగెత్తి వచ్చుటచే శూద్రుడని పలికెను. కాని శూద్రునకు వేద విద్య యందు అధికారములేదు. పై ప్రకరణమున జనశృతి క్షత్రియుడనియే తెలుపబడెను. మరికు బ్రహ్మ విద్యోపాసనకు ఉపనయన సంస్కారము ముందుగా జరిగియుండ వలెను. శూద్రులకు ఉపనయన సంస్కార విధానములేదు. మరియు సత్యకామ జాబాలప్రసంగమున సత్యకాముడు తాను జాబాలపుత్రుడు సత్యకామునిగా నెరింగించెనే గాని తన గోత్రము చెప్పలేకపోయెను. ఇట్టి సత్యభాషణ చేయువాడు బ్రాహ్మణుడేకాని మరెవ్వరుకాజాలరని గౌతముడు నిశ్చయించి అతనికి ఉపనయన సంస్కారము గావించి బ్రహ్మవిద్యనుపుదేశించెను. మరియు శృతిస్మృతుల యందు శూద్రునికి వేద శ్రవణ, అధ్యయన, అర్ధజ్ఞాన నిషేధము కావింపబడెను. ఇతి హాస పురాణముల ద్వారా మాత్రమే వారు పరమాత్మ తత్వ జ్ఞానము పొంది భక్తి జ్ఞానఫలము పొందెదరు.

1-3-39 :- కఠోపనిషత్తు 2-1-12-13, 2-3-2, 3, 17 ప్రకారము హృదయస్ధ అంగుష్ట మాత్రపురుషుడు బ్రహ్మయే. ఆతని ఆజ్ఞచే సమస్త జగత్తు, దేవతలు, సమస్త భూతములు తమతమ కర్మల ప్రవృత్తమగును. ఆయనే సర్వనియమత, శాసకుడు.

1-3-(40-43):- ఛాందోగ్యోపనిషత్తు 8-3-4 నందు ఈ సంప్రసాద జీవాత్మ శరీరము నుండి బయల్వెడలి పరమ జ్యోతిని పొంది తన స్వరూపమున సంపన్నమగును. కావున పరమాత్మనే పరమజ్యోతిగా భావింతురు. మరియు ముందు ప్రసంగములలో వచ్చిన దహరోకాశము అను ప్రయోగమున ఆకాశ శబ్దము కూడ పరబ్రహ్మవాచకమే. ఛా.ఉ. 8-414-1 లో ఆకాశము నామ రూపాత్మక భిన్నమైనను నామరూపాత్మక జగత్తును ధారణ చేయును. కావున ఇట ఆకాశ శబ్దము పరమాత్మయేగాని భూతాకాశ, జీవాత్మ కాదు. మరియు సుషుప్తి, ఉత్ర్కమణ కాలమున జీవాత్మ, పరమాత్మల భేదపూర్ణ వర్ణనచే ఆకాశ శబ్ద వాచకము బ్రహ్మ సదృశగుణములున్నను ముక్తాత్మ జగద్ధారణ శక్తిలేని దగుటచే ఇట ముక్తాత్మకాక పరమాత్మయే శ్వే ఉ. 6-7 లో పరమాత్మ స్వరూపవర్ణనమున పరమ మహేశ్వర, పరమదేవతాది ప్రయోగముల పరమశబ్దము ఆకాశశబ్దము పరమాత్మవాచకములే అన్యులవికావు.

ప్రధమ అధ్యాయము - చతుర్ధపాదము

1-4-(1, 2):- కఠోపనిషత్తు నందు 1-3-11 వచ్చు అవ్యక్త పదము అనుమానకల్పిత లేక సాంఖ్యప్రతిపాది తప్రకృతివాచకము కాదు. ఈ ప్రకరణమున ఆత్మ రధికుడు, శరీరము రధము, బుద్ధి సారధి, మనస్సు కళ్లెము. ఇంద్రియములు గుర్రములు, వాసనలు వాని ఆహారమగు గడ్డి. ఈ రూప కల్పన యందు ఒకదాని కంటె మరియొకటి బలవత్తరము. ఇంద్రియములకంటె విషయములు బలవత్తరము. గుర్రములు గడ్డిని చూడగనే దానివైపు ఆకర్షింపబడినట్లు విషయములు చూడగనే ఇంద్రియములు ఆకర్షితమగును. అట్టి బల వత్తర గుర్రములను మనస్సు అను కళ్లముచే బిగించి బుద్ధియను సారధి వరీర రధమందు ప్రయాణించు జీవాత్మయను రధికుని గమ్యము చేర్చును. సారధి బలహీనుడైన గుర్రములు రధమును రధికుని తమ ఇచ్చవచ్చినట్లు ఈడ్చుకుపోవును. ఈ రధికుడగు జీవాత్మ కారణశరీరమను రధమున అధివసించి యున్నాడు. ఈకారణ శరీరము భగవానుని ప్రకృతి యొక్క అంశయగుటచే అవ్యక్త మని చెప్పబడెను. పరమాత్మ శక్తిరూప ప్రకృతి సూక్ష్మము. చూచుటకు వర్ణించుటకు వీలుకానిది. దాని అంశయగుకారణ శరీరము (సూక్ష్మ) పరమధామ యాత్రయందు రధముగా వర్ణింప బడెను. స్ధూలశరీరము ఇచటనే ఉండిపోవును.

1-4-(3-5):- సాంఖ్యామతాను సారము భూతములకు కారణరూప సూక్ష్మ తత్వము ప్రధాన (ప్రకృతి) కావున దీనిని అవ్యక్తమనుటలో ఆపత్తిఏమి? అను సందేహమునకు సమాదానముగా - సాంఖ్యల కధనానుసారము ప్రకృతి స్వతంత్రమనుట తగదు. ఆ మరియు శక్తి శక్తివంతునకంటె భిన్నముకాజాలదు. పరమాత్మ శక్తివంతుడుగాన జగత్‌ సృష్టికావించెను. (వేదముల యందు ప్రకృతిని పరబ్రహ్మ పరమేశ్వరుని అధీనమందుండు ఆయనశక్తి విశేషముగా చెప్పబడినది.) శక్తి హీనుడేమియు చేయలేడుకదా. మరియు శ్వేతాశ్యతరోపనిషత్తు నందు (1-3) మహర్షులుధ్యాన యోగమున పరమాత్మ స్వరూప భూత అచింత్యశక్తి సాక్షాత్కారము పొందిరి. అది దాని గుణములచే ఆవృతము. పరమేశ్వరుని స్వాభావిక జ్ఞాన, బల, క్రియా రూపశక్తులు అనేకప్రకారములు.

సాంఖ్యుల మతానుసారము గుణమయి ప్రకృతి - పురుషుల పారధక్యము తెలిసికొనుటచే కైవల్య ప్రాప్తి కలుగును. వాని మతాను సారము ప్రకృతి జ్ఞేయము. కాని వేదము లందు పరమేశ్వరుడే జ్ఞేయము, ఉపాస్యము. ప్రకృతి లేక ప్రధానముకాదు. మరియు సూత్రకారుడే స్వయముగా శంకకలిగించి సమాధానము చెప్పుచు క.ఉ. 1-3-15 నందు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధరహిత, అవినాశి, నిత్య, అనాది, అనంత మహత్‌ కంటె పరమ, అయిన, తత్వమును తెలిసికొని మనుష్యుడు మృత్యుముఖము నుండి విడివడును. పై లక్షణములు పరబ్రహ్మపరమాత్మవే కాని ప్రధానప్రకృతివికాదు. ఫల ప్రదాతకూడ పరమాత్మయే.

1-4-(6, 7):- కఠోపనిషత్తు 1-1-13 నందు నచికేతుడు యమ ధర్మరాజును అగ్ని, జీవాత్మ, పరమాత్మ విషయమున వివరింప ప్రార్ధించెను. యమధర్మరాజు వానికి సమాదానముచెప్పెను ఇట ప్రధాన ప్రకృతి గూర్చిన ప్రశ్నగాని, జవాబు గాన లేని కారణమున దీని ప్రస్తావనేలేదు. మరియు వేదముల యందు వచ్చుమహత్‌ శబ్ద ప్రయోగము సాంఖ్యమతానుసారము మహత్తత్వముగాక జీవాత్మ పరముగా బుద్ధి కంటె ఆత్మ మహత్తుకలదని చెప్పబడెను. అటులనే అవ్యక్త శబ్ద ప్రయోగము కూడ ప్రకృతి పరముకాదు.

1-4-(8-10):- శ్వే.ఉ. 1-9-4, 5 నందు అజాశబ్దము వాస్తవమున బ్రహ్మ యొక్క అచింత్య (గుణ) శక్తియేగాని సాంఖ్యమతానుసారము త్రిగుణాత్మక, త్రివర్ణయుత ప్రకృతికాదు. ప్రకృతి పరమేశ్వరాధీనమే గాని స్వతంత్రము కాదు. జగత్కారణవిషయక ప్రసంగమున పరమేశ్వర స్వరూప భూత, స్వగుణావృత అచింత్యశక్తియేకారణ భూతమనియు, పరమాత్మయే ఆత్మాదిసమస్త తత్వము అధిష్ఠాత, ఆయన ఆశ్రయము చేతనే అవి తమ తమ స్ధానములకారణమనియు, పరమాత్మయే జగత్కారణమని చెప్పబడెను. ఛా.ఉ. 6-2-3-4 ప్రకారము పరమేశ్వరుడు తాను అనేకముకావలెనని సంకల్పించి మొదట తేజము రచించెను. తేజము నుండి జలము అన్నము ఉత్పన్న మాయెను. అవియే క్రమముగా ఎరుపు, తెలుపు, నలుపు వర్ణములు కలిగెను. వ్వే. ఉ. 1-10 నందు వచ్చుప్రధాన శబ్దము, క్షరప్రధానభగవానుని శక్తిరూప అపరాప్రకృతి, అక్షర జీవాత్మయగు పరమాత్మ పరాప్రకృతి వని రెండింటిని ప్రేరుడు, శాసించు పరమాత్మయే. అక్షరతత్వభోక్త క్షరతత్వ భోగ్యమని రెంటి ప్రేరకుడు మూడు రూపముల బ్రహ్మయే గాని సాంఖ్యలప్రధానప్రకృతికాదు. మరియు మధుశబ్దము సూర్యపరము గను, నేనుశబ్దము వాణి పరముగను ద్యులోకాదుల యందు అగ్నియనుట యందు రూపకల్పనలో భగవానుని శక్తిరూప ప్రకృతిని ''అజా'' అనియు త్రివర్ణగా వర్ణించిరి.

1-4-(11-13):- బృ.ఉ. 4-4-17 నందు పంచ, పంచన, మరియు ఆకాశము ఎవరి యందు ప్రతిష్ఠితమో అట్టి ఆత్మకు మృత్యురహిత అమృత స్వరూప బ్రహ్మగా తలచెదను. ఇట పంచ పంచశబ్దము సాంఖ్యపరముగా 25 తత్వములకు సంబంధించినదికాదు. ఆకాశము మొదట ఆత్మవరకు 27 తత్వములుకలవు. ఇట పంచ పంచనా అను ప్రయోగము పరమేశ్వరుని విభిన్న కార్యశక్తుల వర్ణనయే గాని సాంఖ్యల ప్రధాన ప్రకృతికాదు. మరియు 4-4-18 నందు ప్రాణము యొక్క ప్రాణము, చక్షువుయొక్క చక్షువు, శ్రోత్రము యొక్క శ్రోత్రము మనస్సు యొక్క మనస్సు గా పురాణపురుషపరమేశ్వరుని విద్వాంసులు తెలిసికొందురు. ఇట ప్రాణము, జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు మనస్సు, బుద్ధి పరమేశ్వరుని కార్యశక్తియొక్క వర్ణన, పరమేశ్వర సంబంధముచేతనే ప్రాణాదుల తమ కార్యములు చేయ సమర్ధములు. ఈ రూపమున ఆయన శక్తి విశేషవిస్తారత తెలుపబడెను.

మాధ్యందిన శాకీయుల ప్రకారము ప్రాణమునకు ప్రాణము ఆదిగా అన్నమునకు అన్నము అని చెప్పబడుటచే పంచ సంఖ్య పూర్తియగును. కాని కాణ్వశాఖీయులు అన్నస్య అన్నమ్‌ అని చెప్పి నందున ఒక సంఖ్యతగ్గినను %్‌యోతి యొక్క జ్యోతి యను ప్రయోగముచే సంఖ్యాపూర్తియగును. మరియు సంఖ్యాపూర్తి అవసరములేదు. ఇది సంకేత మాత్రమే.

1-4-(14, 15):- వేదముల యందు గదుత్పత్తి క్రముమన వైవిధ్యము కనబడుచున్నది. తై.ఉ. 2-1 నందు ఆకాశము ఛా.ఉ. 62-3 నందు తేజస్సు, ప్ర.ఉ. 6-4 నందు ప్రాణము ఐ.ఉ. 1-1-2 నందు నీరు ప్రధమముగా సృజింపబడినట్లు తెలుపుటచే సృష్టిక్రమమున వైవిధ్య దోషముకాదు. కల్ప భేదములచే అట్లగుట సంభవము.

తై. ఉ. 2-7 నందు మొదట అసత్తుయే కలదు. అని తెలుపుటచే ఇది బ్రహ్మ పరమెట్లగును అనుశంకకు సమాధానముగా సత్య జ్ఞాన అనంత ''బ్రహ్మనుండియ జగదుత్పత్తి తెలిపి పిదప అసత్‌ శబ్ద ప్రయోగము చేయుట మిధ్యలేక అభావవాచకముగాగాక అసత్‌ శబ్దముచే అప్రకటిత బ్రహ్మ ప్రకట బ్రహ్మాయెనని తెలియ వలెను. ఇటులనే ఛాందోగ్య, బృహదారణ్య కాదుల యందువచ్చు అసత్‌శబ్ద ప్రయోగము అప్రకట బ్రహ్మవరముగా గావింపబడెను. అవ్యాకృత శబ్ద ప్రయోగముకూడ అటులనే జరిగినది. ప్రకృతిలేక ప్రధానము స్వతంత్రముగాక పరమాత్మయొక్క అచింత్యశక్తిగా తెలియవలెను.

1-4-(16-22):- కౌషీతకీ బ్రాహ్మణోపనిషత్తులో అజాతశతృ బాలాకి సంవాదమున 4-2 నుండి 4-17 వరకు సూర్యునియందుగల పురుషుని ఉపాసింతును. మొదట ఎడమ కంటియందు గలపురుషుని ఉపాసింతును అని క్రమముగా 16 పురుషుల ఉపాసన తెలుపబడెను. పిమ్మట అజాతశతృవు బలాకునితోనీవు చెప్పిన 16 గురు పురుషులకు కర్త ఎవరికి(ఇవి) వీరు కర్మలో ఆయనే తెలియదగినవాడు. ఇట్ల పురుషవాచ్య ఈవాత్మ అతని అధిష్ఠాన భూత జడశరీరము. పరమేశ్వరుని యొక్క కర్మలే, కర్మకార్య శబ్దములు జడచేతనాత్మక సంపూర్ణ జగద్వాచకము. కావున జడప్రకృతి కారణముకాదు. పరమేశ్వరుడేకారణము మరియు బ్రహ్మ సమస్త ధర్మములకు ఆశ్రయము జావాదులను జ్ఞేయ తత్వముగా భావించిన త్రివిధ ఉపాసనా ప్రసంగము వచ్చుట అనుచితము.

జైమిని ఋషికూడ జీవాత్మ సుషుప్తి అవస్ధలో బ్రహ్మయందు లీనమైనట్లే ప్రళయకాలమున సర్వము బ్రహ్మయందు విలీనమై మరల సృష్టి ఆరంభమున ప్రకటితమగుటచే బ్రహ్మయే జగత్కారణము. కాణ్వకాఖీయులు కూడ సుషుప్తి యందు ప్రాణాని వృత్తులను తీసుకొని జీవాత్మ హృదయమందుకల ఆకాశమున నిద్రించుటచే 'స్వపితి' యని పేరు కలిగినది. మరియు పూర్వాపర వాక్యముల ద్వారా కా.ఉ. 4-18 బ్రహ్మయే తెలియదగిన వాడనియు, వానిని తెలిసికొనినవారి మహిమ వర్ణించుటచే పై సిద్ధాంతమును జైమిని మరల ధృవపరచెను. మరియు అశ్వరధ్య ఆచార్యుడు కూడ బ్రహ్మనే జగత్కారణముగా వచించెను. మరియు జౌడలోమి ఆచార్యుడు కూడ నదులు తమ నామరూపముల విడచి సముద్రములో విలీనమగునట్లు విజ్ఞానమయ జీవాత్మ (బ్రహ్మజ్ఞాని పురుషుల) యొక్క 15 కళలు కారణ భూతదేవతలయందు స్ధిత మగును. అపుడు జీవాత్మ అవినాశపరబ్రహ్మతో విలీనమగును. కాశీకృత్స్న ఆచార్యుడు కూడ (ప.ఉ. 4-1) ప్రకారము జీవాత్మ పరమాత్మలో విలీనమగుటచే పరబ్రహ్మ జగత్కారణమనెను.

1-4-(23-29):- ఛా.ఉ. 6-1-2, 3, ము.ఉ. 1-1-2, 7, బృ.ఉ. 4-5-6, 8 యందు మట్టీ నుండి బంగారము మొదలగు లోహముల నుండి వస్తువుల ఉదాహరణమున ప్రతిజ్ఞా దృష్టాంత పూర్వక ఉపదేశములచే పరమాత్మ నిమిత్తకారణ అధిష్టాత, నియామక, సంచాలక, రచయితయేగాక ఉపాదాన కారణ ప్రకృతి ఆయన తత్వమేగాని ప్రధాన ప్రకృతికాదు. శ్వే.ఉ. నందలి అఆ, మాయ, శక్తి ప్రధాన నామములు భగవదధీన అచింత్యశక్తి యేగాని స్వతంత్ర ప్రధాన ప్రకృతికాదు. పరమేశ్వరుని శక్తి ఆయన కంటె భిన్నముకాదు. గీ. 9-10, 7-(4-5) 67 యందు పరమాత్మ సమస్త జడచేతన జగత్తునకు నిమిత్త ఉపాదాన కారణమని చెప్పబడెను. మరియు తై.ఉ. 2-6 ఛా.ఉ. 6-2-3 నందు కూడ పరమాత్మ సంకల్ప మాత్రముచే సృష్టి ప్రారంభమాయెను సర్వం ఖల్విదం బ్రహ్మయను వాక్యము నందు కూడ బ్రహ్మనుండే జగత్తు పుట్టి, స్ధితినిపొంది ఆయనలోనే లీనమగును. మరియు శ్వే.ఉ. నందు మహర్షులు జగత్కారణ విచారణ చేయుచు విబిన్న ప్రతిపాదనలు చేసి చివరకు యోగ సాధనలో పరమేశ్వరుని స్వరూప భూత శక్తిని దర్శించి పరమాత్మయే జగత్కారణమనిరి. తై.ఉ. 2-7. అవ్యక్త రూపమున జగత్తు పరమాత్మ నుండియే ప్రకటితమాయెను. తై.ఉ. 2-6 ప్రకారము పరమాత్మ గద్రచనానంతరము. స్వయముగా ఈవునితో గూడి ప్రవిష్ఠ మాయెను. ఆయనే మూర్త, అమూర్త రూపములు పొందెను. కావున ఆయనే కర్త, కర్మ, ఉపాదాన నిమిత్తకారణము. ఉపనిషత్తులలో చాలాచోట్ల పరమాత్మను 'యోని' అని చెప్పుట చేతను ఆయనే జగదుత్పత్తి నిమిత్త ఉపాదానకారణము. సాంఖ్యులవలెనే పరమాణుకారణవాది, వైయాయికుల మతములను నిరాకరించుచు సూత్రకారుడు జగదుత్పత్తి నిమిత్త ఉపాదానకారణము పరమాత్మ యేగాని ఇతరముకాదని వక్కాణించెను.

ప్రధమ అధ్యాయము సమాప్తము.

***

SARA SUDHA CHINDRIK    Chapters