SARA SUDHA CHINDRIK    Chapters   

ఓం తత్‌ సత్‌.

శ్రీ గణశాయనమః శ్రీరామచంద్ర పరబ్రహ్మణనమః

ఉపనిషత్సారము.

1. ఈశావాస్యోపనిషత్తు.

ఈశావాస్యోపనిషత్తు శుక్లయజుర్వేద సంహిత యొక్క నలబదియవ అధ్యాయము. ఇందు భగవత్తత్వ నిరూపిత జ్ఞానకాండము నిరూపింపబడెను. ఈశావ్యాస అనువాక్యముతో ప్రారంభమగుటచే దీనికి ఈశావాస్యోపనిషత్తు అనిపేరు వచ్చినది.

శాంతి పాఠము:-

ఓం పూర్ణమద, పూర్ణమిదం పూర్ణాతీ పూర్ణముదుచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే||

ఓం శాంతి, శాంతి, శాంతి,

సచ్చిదానంద పరబ్రహ్మపురుషోత్తముడు అన్ని విధముల సదా సర్వదాపరిపూర్ణుడు. జగత్తుకూడ పరబ్రహ్మచే పూర్ణమైనదే. అది పూర్ణపురుషోత్తమునుండి ఉత్పన్నమైనది. ఈ విధముగా పరబ్రహ్మ యొక్క పూర్ణత్వము నుండి జగత్తుయొక్క పూర్ణమైనను పరబ్రహ్మ పరిపూర్ణుడే.

పూర్ణమునుండి పూర్ణము తీసివేసిను పూర్ణమే మిగులును.

1) ఈశావాస్యమిదం:- అణిలవిశ్వ బ్రహ్మాండములోనున్న చరాచరాత్మక జగత్తును సర్వాధారుడు, సర్వనియంతా, సర్వాధిపతి, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, సర్వగుణ స్వరూప పరమాత్మచే వ్యాపించబడియున్నది. కావున ఈశ్వరుని సదా సర్వదా స్మరించుచు ఈ జగత్తునందు కేవలము కర్తవ్యపాలన కొరకు విషయోప భోగములు మొదలగుకర్మలు ఈశ్వర పూజార్థము ఆదరించవలెను. విషయములయందు మనస్సును తగుల్కొననీయక ఈ సర్వము పరమేశ్వరునిదే అని పరమాత్మకొరకే వినియోగించుము.

2) ఈ సమస్త జగత్తునకు ఏకమాత్ర కర్త, ధర్త, హర్త, సర్వశక్తివంతుడు, సర్వమయ పరమేశ్వరుని సతతము స్మరించుకొనుచు ఈ సర్వము ఆయనిదిగాభావించి ఆయనను పూజించుట కొరకే శాస్త్ర విహిత కర్తవ్య కర్మల నాచరించుచు వంద సంవత్సరములు జీవించుము. కర్మలను ఈశ్వరార్పణ బుద్ధిచే నాచరించిన కర్మబంధములనుండి విముక్తుడగును.

3) మానవశరీరము అన్నిటి కంటె శ్రేష్ఠము, దుర్లభము. ఇది భగవంతుని విశేష కృపచే జనన మరణ సంసార సముద్రము దాటుటకు అనగా మోక్ష సిద్ధికై లభించినది. కామోపభోగ కర్మల నాచరించుచు విషయసక్తుడగుట ఆత్మహత్య సదృశముస ఎట్టి వారైనను కామ్యకర్మల ఫల స్వరూపముగా కూకేర సూక రాది అనేక జన్మల నెత్తుచు నరకాదుల తిరుగాడును. కావున మానవుడు గీతాచార్యుడు చెప్పినట్లు తనను తానే ఉద్ధరించు కొనవలెను. లేనిచో పతనమే.

4) సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడగు పరమాత్మ అచలుడు, ఏకైక శక్తి వంతుడు, మనస్సు, బుద్ధి ఇంద్రియములకంటె వేగవంతుడు, ఆయన అన్నిటికి ఆది, జ్ఞానస్వరూపుడు. దేవతలు మునులు కూడ పరిపూర్ణముగా తెలుసుకొనలేరు.

5) పరమాత్మ అచలుడైనా , అచింత్యశక్తి, వ్యాపకతకలవాడు. భక్తులను అనుగ్రహించుటకు నిర్వికారుడైనను సాకారరూపమున భక్తులమొర నాలకించుచు ఎల్లపుడు వారికి దగ్గరగానుండును. భగవంతుడు ఎక్కడో దూరముగా లేడు. మన హృదయమందే ఉన్నాడు. సర్వాంతర్యామి యగు పరమాత్మలేని చోటే లేదు. పరమాత్మ పరిపూర్ణుడు.

6) పరమాత్మలో సర్వప్రాణులును, సర్వప్రాణులలో పరమాత్మను చూచువారు సర్వత్ర భగవంతునే దర్శించును. ప్రణమిల్లును, సేవించును.

7) ఇట్లు పరమాత్మకు సర్వత్ర దర్శించు భక్తునియందు భగవదృష్టి కలిగి ఆనంద మగ్నుడై, శోకమోహాది వాకార రహితుడై కర్మల నాచరించు చున్నను ఏమియు చేయని వానివలె ఈశ్వరార్పణ బుద్ధి కలిగి పరమాత్ముని లీలా విశేషములందు క్రీడించును.

8) ఇట్లు పరమేశ్వరుని సర్వత్రదర్శించు వాడు పరబ్రహ్మ పురుషోత్తముని పొంది శుభా శుభ కర్మ జనిత స్వర్గాదులు పొందక స్థూల సూక్ష్మ దేహరహితుడై మోక్షము పొందును.

9) భోగాసక్తయుతమగు అవిద్యా జనిత వివిద కామ్య కర్మల నొనరించి కర్మ ఫల స్వరూపముగా వివిధయోనులయందు పుట్టుచు గిట్టుచు సంసార చక్రమున భ్రమించును. మానవ జన్మయొక్క చరమ లక్ష్యమగు పరమాత్మ పదము పొందడు. కొందరు శాస్త్రములు చదివి తాము జ్ఞానులమనుకొని కర్తవ్యకర్మలను విస్మరించి శాస్త్ర విపరీత కర్మల నాచరించువారు అజ్ఞానులకంటే నికృష్ణులు.

10) నిత్యానిత్య వస్తువివేక జ్ఞానముకలిగి సమస్త భోగ సామగ్రి యందు విరక్తి కలిగి సచ్చిదానంద పరమాత్మ చింతనలో సంలగ్నుడైన వానికి పరమపదప్రాప్తి కలుగును. అదియే యధార్థ జ్ఞానము. అట్టి కర్మ కర్తుత్వ, భోకృత్వాది అభిమానము లేక ఈశ్వరార్పణ బుద్ధి తో విహిత కర్మల నాచరించునను కర్మ బద్ధుడుకాడు. అట్టి కర్మ హర్షశోకాది వికారరహితమై సంసార సాగరము నుండి తరింపజేయును. ఇదియే సర్వోత్తమము.

11) కర్మ అకర్మల వాస్తవికరహస్యము తెలియని వారు కర్తవ్య కర్మలను త్యజింతురు లేదా అకర్మణ్యులగుదురు, లేదా మిధ్యా జ్ఞానాభిమానులు స్నేచ్ఛాచారులగుదురు. కర్మ జ్ఞానముల రహస్యముతెలిసిన వారు శాస్త్ర విహిత కర్మల కర్తుత్యాభిమానము లేక ఫలాపేక్ష రహితముగా ఈశ్వరార్పణ బుద్ధితో చేయుటచే వివేక వైరాగ్య సంపన్నుడై పరమాత్మ యొక్కయధార్థ జ్ఞానము పొంది పరబ్రహ్మ పదము పొందును.

12) కొందరు వినాశశీలములగు స్త్రీ, పుత్ర, ధనాదులప్రాప్తి కొరకు, ఇహలోక పరలోక సుఖప్రాప్తికి విభిన్న దేవతల, పితరుల , మనుష్యాదుల ఉపాసించి వివిద దేవతాది లోకములు పొందినను క్షీణ పుణ్యులై మర్త్యలోకమున మరల జన్మింతురు. కొందరు కొలది పాటి జ్ఞానము పొంది సర్వజ్ఞులవలె సంచరించుచు దాంభికులై తామే భగవదవతారముల మని ప్రజలను మోసపుచ్చి శాస్త్ర విహిత కర్మలనొదలి, దుష్టర్మలు చేయుచు, చేయించుచు, నరకాదుల ననుభవించి నీచజన్మల పొందెదరు.

13) పరబ్రహ్మ పురుషోత్తముడు సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, సర్వాధార సర్వమయుడు, సమస్త ప్రపంచమునకు కర్త, ధర్త, హర్త యని భక్తి శ్రద్ధలతో నిత్యము, నిరంతరము భగవానుని నామ రూపలీలా విశేషాదుల శ్రవణ, కీర్తన, మననములచే ఉపాసించి శ్రీఘ్రముగా పరమాత్మ పదము పొందెదరు. భగవదాజ్ఞాను సారము ఇతర దేవీ దేవతలు, పిరతరులు , బ్రాహ్మణులు, మాతాపితలు, ఆచార్యులు, మహాపురుషులను కర్తవ్యముగా నెంచి నిష్కామ భావమున సేవా పూజిల నానరించిన అంతఃకరణ శుద్ధిపొంది పిదప మృత్యుమయ సంసారసాగరమునుండి తరింతురు. సకామోపాశనకర్మ బంధహేతువు.

14) సర్వాత్మ సర్వశ్రేష్ఠ పరమాత్మ నిత్యనిర్గుణుడైనను, నిత్యసగుణుడు, దేవతా, పితర, మనుష్యాదుల భగవంతుని ప్రీతికొరకు యధాయోగ్యముగా సేవించవలెనని శాస్త్రములు ఆజ్ఞాపించెను. అదియే భగవంతుని వాణి, అట్టి సంసేవనచే అంతఃకరమ శుద్ధి కలిగి భగవత్కృపచే మోక్షము పొందును.

15) హే భగవాన్‌! నీవు అఖిల బ్రహ్మాండ పోషకుడవు, పుష్టిప్రదాతవు. నీభక్తియే సత్యమైన ధర్మము. సూర్య మండల ప్రభా సచ్చిదానందరూపమును ప్రత్యక్షముగా చూచుటకు అడ్డుపడు చున్నయవనికలను తొలగించి నీ ప్రత్యక్ష దర్శన భాగ్యము నొసంగము.

16) హేభగవాన్‌! నీయొక్క భక్తి సాధనచే భక్తునియందు పుష్టి ప్రదానము చేసి పోషింపుము. నీవు సమస్త జ్ఞానులలో అగ్రగణ్యుడవు, జ్ఞాన స్వరూపుడవు. భక్తులకు నీ స్వరూప యధార్ధ జ్ఞానము నొసగువాడవు. నీవు సర్వనియామకుడవు. భక్తుల లక్ష్యము, భక్త వత్సల స్వరూపుడవైన నీవు సూర్యమండల స్థ పురుష రూపమున దర్శన మిమ్ము. ఆ పురుషుడను నేనే. జీవాత్మ పరమాత్మలు ఒక్కటే , భేదములేదు.

17) పరమధామము పొందగోరు సాధకుడు ఇట్లు ప్రార్థించును. హే భగవాన్‌! ఈ స్థూలసూక్ష్మ శరీరము నశించినను నీవు నీభక్తుడగు నన్ను జ్ఞప్తియందుంచుకొనుము. నేను నాభక్తుని సదాస్మరింతును, పరమగతి నిత్తును, సేవల స్వీకరింతును అను నీవచనానుసారము, నాకు అంత్యకాలమున నిన్నే స్మరించుచు, సేవించుచు, పరమ గతి పొందు భాగ్యము నొసంగుము.

18) హే అగ్నిదేహా! నేను ఇప్పుడు భగవంతుని సేవలో నుండ గోరుచున్నాను. మీరు, సుందర మంగళమయ ఉత్తరాయణ మార్గమున నన్ను పరమధామమున చేర్చుము. నేను భగవంతుని కృపచే భగవంతుని భజించి, ద్యానించి, నామ స్మరణ చేయుచు భగవానుని దివ్య స్వరూప సందర్శన భాగ్యము కోరుచున్నాను. నాలో ఏమైన కర్మశేషమున్నను దానిని దయతో నష్టపరచి నా మార్గము సుగమము చేయవలెనని వినయ పూర్వకముగా నమస్కరించి విన్నవించుకొను చున్నాను.

ఈశానాస్యోపనిషత్తు సమాప్తము

ఓం. శాంతిః, శాంతిః, శాంతిః.

SARA SUDHA CHINDRIK    Chapters