Dharmakruthi  Chapters   Last Page

 

26. పీఠాధిపతులకు పూర్ణకుంభము

తిండివనంలో మిషనరీస్కూలు ప్రక్కన జంతికలు, పాలకాయలు అమ్ముకొనే బ్రాహ్మణ వితంతు వృద్దురాలొకామె ఉండేవారు. ఆ జంతికలు ఎంతో రుచిగా ఉండేవి. గిని ఆ స్కూల్లో చదువుకొనే రోజులలో తన దగ్గర డబ్బులున్నప్పుడల్లా కొనుక్కొని తింటూ ఉండేవారు. అంతేకాదు తన మిత్రులందరి వద్ద ఈ జంతికల రుచి ప్రచారం చేసి ఆ మామ్మగారి వ్యాపారం వృద్ధి అయ్యేట్లు చేశారు. అయితే గినికి రోజూ డబ్బు ఎక్కడ్నుంచి వస్తుంది? అందుకని మామ్మ వద్దకు తనకు రావలసిన న్యాయమైన కమీషన్‌ అడగడానికి వెళ్ళారు. మమ్మా! నా మూలంగానే కదా నీకింత వ్యాపారం వచ్చింది. నాకో జంతిక ఉచితంగా ఈయరాదా అంటూ బేరం పెట్టారు. మామ్మ ఈ ప్రస్తావనకు ససేమిరా ఒప్పుకోలేదు. మన గినికి కోపం వచ్చింది. అయితే నీ దగ్గర ఇంకెప్పుడూ కొనుక్కోను అన్నాడు. ఆహా! నీవు లేకపోతే నా వ్యాపారం ఆగిపోతుంది కాబోలు. పోతే ఫో! పోతానంటే నిన్ను పూర్ణకుంభంతో ఆహ్వానిస్తాననుకొన్నావా? అన్నది మామ్మ. ఆ! పిలిచి చూడు. పూర్ణకుంభంతో ఆహ్వానించినా నీ ముఖం చూడనంటూ సాగిపోయారు గిని.

ఈ సంఘటన జరిగి ఆరుమాసాలైనా కాలేదు. ఆ బాలుడు మహోన్నతమైన కాంచీ సర్వజ్ఞపీఠ మధిరోహించాడట. కామకోటి శంకరుడయినాడట. పీఠాధిపతిగా తిండివనమే విజయం చేస్తున్నాడట. ఊరిలో యావన్మందికీ కాళ్లు చేతులాడటం లేదు. గిని - కాదు కాదు - స్వామివారు మనతో ఎలా ప్రవర్తిస్తారు? వారి కృపావీక్షణములు మనపై పడతాయా? అని సంశయిస్తున్నారు. అనుకొన్న రోజు రానే వచ్చింది. వీధులన్నీ ఊడ్చి రంగవల్లులతో అలంకరించారు. తోరణాలు కట్టారు. మంగళ వాయిద్యాలు వినవస్తున్నాయి. వెండి తాషామర్ఫాలు, గౌరీ వాయిద్యం మోత మోగిపోతోంది. ఛత్రాలు పట్టుకొనేవారు, చామరాలు వీచేవారు, కాగడాలు పట్టుకొనేవారు, ఉపనిషన్మంత్రాలు చదువుతున్న పండితులు, అదుగో! ఆ వెనుక స్వామివారి పల్లకి కన్పిస్తోంది. గిని తోటి విద్యార్ధులు, అధ్యాపకులు, భక్తజనసందోహం, తమ ఊరి బాలుని పీఠాధీశ్వరునిగా దర్శించడానికి ఊరు ఊరూ కదలివచ్చింది. గుమ్మం గుమ్మం ముందు స్వామిని ఆహ్వానించడానికి పూర్ణకుంభాలతో గృహ యజమానులు, కర్పూరహారతులతో సువాసినులు, ఫలపుష్పాదులతో యావన్మంది కుటుంబసభ్యులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. పల్లకి దిగిన స్వామి మంద గమనంతో చిరునవ్వుతో వారి వారి పూర్ణకుంభాలను, మంగళహారతులను, కానుకలను స్వీకరిస్తూ, పేరుపేరున పలకరిస్తూ నడచి వస్తున్నారు.

దూరంగా ఓ పూరి పాకముందు పూర్ణకుంభం సిద్ధం చేసుకొని బితుకు బితుకుమంటూ జంతికల మామ్మగారు నిల్చుని ఉంది. నా దగ్గర భిక్షనడిగి నిరాకరించబడిన గిని మహాభిక్షువయ్యాడే. అయ్యో! ఎంత అపచారం జరిగిపోయింది. ఇప్పుడు స్వామి నా పూర్ణకుంభాన్ని స్వీకరిస్తారా? ముఖం త్రిప్పుకొని వెళ్ళిపోతారా? అంటూ చింతిస్తోంది. అదిగో! స్వామివారు గుమ్మం ముందుకు రానే వచ్చారు. మఠసిబ్బంది స్వామివారికి అందించడానికి మామ్మగారి వద్ద పూర్ణకుంభం పుచ్చుకొన్నారు. స్వామి సూటిగా మామ్మ కన్నుల్లోనికి చూస్తున్నారు. ఆ కళ్ళు కొంటె నవ్వుతో మెరిసిపోతున్నాయి. ''మామ్మా! నీకు పూర్ణకుంభం ఇచ్చి ఆహ్వానిస్తావనుకొన్నావా? అన్న నీవు పూర్ణకుంభంతోనే ఆహ్వానిస్తున్నావు. పిలిచి చూడు అంటూ పోయిన నేను ఇదిగో నీ పూర్ణకుంభాన్ని స్వీకరిస్తున్నాను'' అంటూ నవ్వుతూ పూర్ణకుంభం స్పృశించారు. ''అయ్యో! స్వామీ! నీ కరుణతో నేను తరించాను'' అంటూ పెద్దగా ఏడుస్తూ స్వామి పాదాల ముందు మోకరిల్లింది మామ్మ. స్వామి ''నారాయణ నారాయణ'' అంటూ ఆశీర్వదిస్తూనే ఉన్నారు.

అవతారాల ముఖ్యోద్ధేశం అటు ఉంచండి. ఒక్కక్క అవతారకాలంలో క్రిష్ణావతారంలో కుబ్జ మాదిరి, రామావతారంలో శబరి మాదిరి ఎంతమంది తరిస్తారో! తిండివనం ఇతఃపూర్వము ప్రజ్ఞశాలియైన విద్యార్థిగా, చురుకైన పిల్లవానిగానే శ్రీస్వామినాధుని ఎఱిగి ఉన్నది. అతి తక్కువ రోజులలో మహాతేజశ్శాలిగా, ఆధ్యాత్మిక చక్రవర్తిగా పరిణతి చెందిన స్వామిని తమ మధ్యలో చూసి ఆబాలగోపాలం ఆనందోత్సాహకోలాహల సంభరితమయింది. స్వామినాధునితో కలసి చదువుకున్న విద్యార్ధులు, అదృష్ఠవంతులయిన అధ్యాపకులు స్వామివారిని ఏకాంతముగా దర్శనం చేశారు. వారి ఆదరానికి, అణుకువకు, సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వారి అనుగ్రహపాత్రులయ్యారు.

 

Dharmakruthi  Chapters   Last Page