Dharmakruthi  Chapters   Last Page 

10. పూర్వాశ్రమ కుటుంబము

గణపతిశాస్త్రిగారికి ముగ్గురు పిల్లలు. పెద్ద కుమారుని పేరు శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రి. అది గణపతిశాస్త్రిగారి తండ్రిగారి పేరు. తమిళంలో మనుమణ్ణి పేరన్‌ అంటారు. అంటే తన పేరు గలవాడని అర్థం. ఆంధ్రదేశంలో కూడా గోదావరిజిల్లాలలో పిల్లలందరూ తమ పెద్ద కుమారునికి తండ్రి పేరు పెట్టే ఆచారముంది. అలా తాత పేరున్న వానిని ఆ జిల్లాల్లో పేరింటివాడంటారు. కృష్ణాజిల్లాలో తండ్రి జీవించి ఉండగా కుమారునికి ఆ పేరు పెట్టడం లేదు. సరి! సుబ్రహ్మణ్యశాస్త్రిగారు వేదవిద్యతో పాటు ఆంగ్లేయవిద్యకూడా అభ్యసించారు. మెట్రిక్యులేషన్‌ పరిక్షలో ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. కుంభకోణములో ప్రస్తుతము నేటివ్‌ స్కూలుగా పిలువబడుతున్న పాఠశాలలో అధ్యాపకులుగా పనిచేసి తరువాత విద్యాశాఖలో ''ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌గా'' పని చేశారు. శాస్త్రిగారికి సంగీతములో మంచి అభిజ్ఞత ఉంది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుల కచ్చేరీలకు విడువకుండా హాజరు అవుతూ ఉండేవారు. ఆ రోజుల్లోని అందరు సంగీత విద్వాంసులకు మల్లే వీరికి కూడా తెనుగులో మంచి ప్రవేశముంది.

సుబ్రహ్మణ్యశాస్త్రిగారి పద్దెనిమిదవ ఏట వివాహమయింది. వధువు ఎనిమిదేళ్ళ శ్రీమహాలక్ష్మమ్మ, నాగేశ్వరశాస్త్రిగారి కుమార్తె. నాగేశ్వరశాస్త్రిగారు ఇచ్చంగుడి వాస్తవ్యులు. శ్రీగోవింద దీక్షితుల పరంపరలోనివారు. ఋగ్వేదంలో సలక్షణ ఘనపాఠి. ధర్మశాస్త్రంలో మహాపండితులు. మంచి అనుష్ఠానవరులు. వీరికి ముగ్గురు కుమారులు. ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె శ్రీలక్ష్మమ్మగారి కుమారులు కామకోటిపీఠ 67వ ఆచార్యులయినారు. మహాలక్ష్మమ్మగారి అన్నగారొకరు శ్రీమఠ ఆస్థాన విద్వాంసులుగా బహుకాలము సేవ చేశారు.

సుబ్రహ్యణశాస్త్రి మహాలక్ష్మమ్మలకు అయిదుగురు కుమారులు. ఒక కుమార్తె. పెద్ద కుమారునికి సాంప్రదాయకంగా తాతగారి పేరుంచబడింది. రెండవ కుమారునికి తమ ఆరాధ్య దైవమైన స్వామిమలై స్వామినాథుని పేరుంచబడింది. మూడవకుమారులు సాంబమూర్తిశాస్త్రిగారు. బహుకాలము శ్రీమఠములో గౌరవ మేనేజరుగా ఎనలేని సేవ చేశారు. వీరి జ్ఞాపకశక్తి అసాధారణమైనది. తమిళభాషలో శ్రీవారి దివ్యచరిత్రను మొట్టమొదటి సారిగా వ్రాసినది వీరే. నాల్గవవారు శ్రీసదాశివశాస్త్రిగారు. శివన్‌సర్‌ గా లబ్థప్రతిష్టులు. వీరు భూగోళ ఖగోళశాస్త్రములపై అమిత కృషి సలిపి అనేక గ్రంధములు వ్రాశారు. ఐదవవారు శ్రీకృష్ణమూర్తిశాస్త్రిగారు ఋగ్వేద పండితులు. తిరువిడైమరుదూరు వేదపాఠశాలలో అనేక సంవత్సరాలు అధ్యాపకులుగా ఉండి అనేక మంది వేదపండితులను తయారుచేశారు. శ్రీమఠపు 69వ ఆచార్యులవారయిన శ్రీజయేంద్ర సరస్వతీ స్వామివారు వీరి వద్దనే ఋగ్వేదాధ్యయనం చేశారు. ఒకే ఒక కుమార్తె లలితాంబిక.

ఒక కుటుంబంలో ఒక జీవన్ముక్తుడు పుడితే పది పైతరాలవారు పది క్రింద తరాలవారు తరిస్తారని శాస్త్రంచెబుతోంది. తరించే మాటలో సందేహం లేదుకానీ జీవించి ఉన్నంతకాలం శ్రీవారి పూర్వాశ్రమ కుటుంబసభ్యులు భోగభాగ్యాలలో తులతూగి పోలేదు. అతి సామాన్యంగా జీవించారు.

లలితాంబగారి భర్తకు ఆవిడ అన్నగారు కంచిపీఠ అధిపతి కదా! ఏమైనా డబ్బిస్తే బాగుండునని ఉండేదట. స్వామిని అడిగే ధైర్యం లేదు. ఈవిడను మాత్రం సాధించేవారు. ఆవిడ చాలా కష్టపడింది. మఠానికి వస్తే శ్రీవారి పూర్వాశ్రమపు చెల్లెలని మర్యాద ఉంటుంది కానీ ఆర్థిక సహాయం దొరకదు. శ్రీవారి వద్ద కూడా ప్రత్యేకత చూపబడదు. మహా అయితే సువాసినీ పూజకు ముతైదువగా పిలిచేవారు. అదీ ఆ పిలిచే బాధ్యత పూజకట్టులోని పెద్దలది కాబట్టి. ఇదంతా చూసి స్వామివారి అంతరంగిక భక్తుడొకాయన ఆవిడ చాలా కష్టపడుతున్నారనీ, ఆర్ధికంగా చాలా హీన స్థితిలో ఉన్నారనీ, పీఠాధిపతులయిన స్వామివారు ఏదైనా ద్రవ్య సహాయం చేయాలనీ, లేకుంటే వారు అనుజ్ఞ ఇస్తే తాను పీఠ భక్తుల వద్ద డబ్బు పోగు చేసి ఆమె సుఖజీవనానికి తగు ఏర్పాటు చేస్తాననీ స్వామివారిని ప్రార్ధించారట. స్వామివారు ''లేదురా, కర్మ ఈ జన్మలోనే అనుభవిస్తే తీరిపోతుంది కదా!'' అని సమాధానం ఇచ్చారు.

సాంబమూర్తిశాస్త్రిగారు శ్రీమఠంలో గౌరవమేనేజరుగా ఎంతోకాలం సేవచేశారు. పీఠభక్తులు వారికి ఉంటానికి ఇల్లు కూడా లేదని తిరువిడైమరుదూరులో ఇల్లు కొనడానికి 42000 రూ.. లు వసూలు చేశారు. అప్పటికి ఆయనకు తిరువిడైమరుదూరులో ఉండే ఆలోచన మారిపోయింది. మనమరాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. మదరాసులో ఉంటే ఉపయోగంగా ఉంటుందనిపించింది. అందువలన ఆ మొత్తం డబ్బుగానే తనకు ముట్ట చెబితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీవారి అనుమతికై కోరారు పీఠభక్తులు. ''మీరు ఇల్లు కొనిపెడతామని చెప్పి ద్రవ్యసముపార్జన చేశారు. ఇల్లే కొని ఇవ్వండి. లేదా దాతలందరికీ డబ్బు తిరిగి ఇవ్వండి'' అన్నారట. చివరకు తిరువిడైమరుదూరులో ఇల్లే కొనిచ్చారు.

శ్రీవారి పూర్వాశ్రమపు చివరి తమ్ముడు శ్రీకృష్ణమూర్తిశాస్త్రిగారిని కుంజుశాస్త్రి అని కూడా అనేవారు. వీరి విషయంలో నే విన్న ఓ సంఘటన విన్నవిస్తాను. మాయవరం శివరామకృష్ణశాస్త్రిగారని ఒక మహాపండితులుండేవారు. వారికి సంస్కృత భాగవతం కంఠోపాఠం. ఒక్కొక్క శ్లోకం మీద గంటల తరబడి వ్యాఖ్యానం చేయగల పాండిత్యం వారిది. హఠాత్తుగా వారికి జ్ఞాపకశక్తి నశించింది. శ్రీవారు ఏడురోజులు వారికి భాగవతమంతా ఉపదేశించి జ్ఞాపకశక్తి పునరుద్ధరించారట. ఈ విషయం ఆయన కామకోటిప్రదీపం అనే పత్రికలో వ్రాసుకొన్నారు. వేదాంత శాస్త్రంలో యావధ్బారతానికే తలమానికమైన మహామహోపాధ్యాయ యస్‌. ఆర్‌. కృష్ణమూర్తిశాస్త్రిగారికి కూడా ఈ రకమైన మరుపే వచ్చింది. వారి జ్ఞాపకశక్తి కూడా శ్రీవారి వలెనే పునరుద్దవించబడింది. వారంటారు - వారు పూర్వం చేసే సమన్వయం కన్నా, శ్రీవారిచే అనుగ్రహింపబడిన తరువాత చేసే సమన్వయం పండిత ప్రకాండుల మన్నన ఎక్కువగా పొందుతోందట.

ప్రతివాది భయంకర అణ్ణంగణాచార్యులవారు విశిష్టాద్వైత సిద్ధాంతంలో పేరుమోసిన పండితులు. అయితే లోపాయకారిగా ఆయన అద్వైత ప్రేమియనీ, అద్వైతమే పరమసత్యమని చెబుతూ ఉండేవారనీ పండితులలో చెప్పుకొంటారు. అది అలా ఉంచండి. వీరికి కూడా శ్రీవారిపై అత్యంత భక్తిప్రపత్తులున్నాయి.

శ్రీవారు చిన్న కాంచీపురం మఠంలో చిన్నగదిలో కూర్చుని ఉన్నారు. శ్రీవారికి పరంపరగా శిష్యులైన ఒక మిరాశీదారు విసురుతూ నుంచొని ఉన్నారు. మాయవరం శాస్త్రిగారు, ఆచార్యులవారు అనుకోకుండా ఒకే సమయానికి దర్శనానికి వచ్చారు. స్వామివారికి వీరువురినీ చూస్తే ఎంతో ఆనందమయింది. ఒకరికొకరిని ఎంతో ఉన్నతంగా పరిచయం చేశారు. శాస్త్రిగారి ప్రతిభ ఆచార్యులవారు, ఆచార్యులవారి ప్రతిభ శాస్త్రులవారు అంతకుముందే విని యున్నారు. శాస్త్రులవారి భాగవత వ్యాఖ్య వినాలని ఆచార్యుల వారికి ఎంత కాలంగానో కోరిక. అదే స్వామివారి సన్నిధిలో విన్నవించారు. స్వామివారి ఆదేశంతో శాస్త్రివారి భాగవతవ్యాఖ్య ఆరంభమయింది. స్వామివారి మోము అద్వైతానందంలో వెలిగిపోతోంది. ఆచార్యులవారు దాసభావంతో అనందభాష్పాలు ధారగా కారుస్తున్నారు. శాస్త్రిగారు భాగవతంలో లీనమయిపోయారు. కాలం కరిగిపోతోంది. కుంజుశాస్త్రిగారికి క్షణమొక యుగంగా నడుస్తోంది. అతఃపూర్వమొక మూడుతరాలుగా కామకోటి పీఠాధిపతులు ఒకరికొకరు పూర్వాశ్రమ బంధువులుగా ఉన్నారు. కుంజాశాస్త్రిగారు కూడా పేరుమోసిన ఋగ్వేదపండితులు. తమ పుత్రునికి పీఠానికి తగిన హోదాలో ఉపనయనం చేయాలనుకొన్నారు. ఆరోజుల్లో ఇరవై వేల రూపాయల ఖర్చుతో ఒక ప్రణాళిక వేశారు. స్వామివారి అనుమతి తీసుకొని మఠానికి వచ్చే పెద్దమనుష్యుల వద్ద మేనేజరు ద్వారా వసూలు చేయించాలని ఆయన ఉద్దేశ్యం. శ్రీమఠం మేనేజర్‌ శ్రీవిశ్వనాధ అయ్యర్‌ కూడా దానికి సమ్మతించారు. ఇద్దరూ భాగవతపాఠం జరుగుతున్నచోటుకి వెళ్ళారు. స్వామివారితో చెప్పడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. కాలం ఒక గంట కరిగింది. సాయంత్రం 5.30 అయిపోయింది. ఇంకో అరగంలో స్వామి లేచి సంధ్యా దీపానికి వెళ్ళి అక్కణ్నుంచే స్నానానుష్ఠాలకు వెళ్ళిపోతారు. ధైర్యం చేసి విశ్వనాధ అయ్యర్‌ ''కుంజుశాస్త్రి'' అంటున్నారు. స్వామి అద్వైతానందంలో ఉన్నారు. జీవితంలో ఇంతటి మహోన్నతమైన వ్యాఖ్య వినలేదన్నారు ఆచార్యులవారు. స్వామివారి అనుగ్రహం అన్నారు శాస్త్రిగారు. స్వామి వెలిగిపోతున్నారు. పండితులిరువురికీ సన్మాన ప్రసాదాలననుగ్రహించి సంధ్యాదీప దర్శనానికి ధిగ్గున లేచారు. ఇక ఆలసిస్తే లాభం లేదనుకున్న కుంజుశాస్త్రిగారు విషయం విన్నవించారు. రెండు నిముషాలు మౌనం వహించిన స్వామివారు తమతో ఉన్న మిరాసీదారు వంక తిరిగి ''మఠంలో జరిగే ధర్మోపనయనాల్లో పిల్లవానికి ఉపనయనం చేసుకోమను'' అని చెబుతూ సాయంకాల దీప పూజకు సాగిపోయారు.

తరువాత కాలంతో మహాస్వామివారు జయేంద్ర సరస్వతీ స్వామివారి పూర్వాశ్రమంలో ఋగ్వేదాధ్యయనం కొరకు కుంజుశాస్త్రిగారి వద్దకే పంపారు. జయేంద్రుల వారు పీఠాధిపతులయిన తరువాత కుంజుశాస్త్రిగారు తమ ఇంటికి ఆహ్వానించారు. పెద్దస్వామివారు కూడా అంగీకరించారు. చివరి క్షణంలో మనస్సు మార్చుకొని తానే స్వయంగా బయలుదేరారు. నవ్యస్వామి శాస్త్రిగారి కుటుంబసభ్యుల దీనాలాపనలను విని ఏదైనా ఏర్పాటో, వాగ్దానమో చేస్తారని వారి భయం.

తిరువిడైమరుదూరులో స్వామికి బ్రహ్మరధం పట్టారు. పరిచారక వర్గాన్ని యావన్మందినీ బయటే వదిలి ఒకరిద్దరితో లోనికి వెళ్ళారు. అనుకున్నట్లుగానే కుంజుశాస్త్రి గారి సతీమణి తమ ఆర్థిక ఇబ్బందులు, పుత్రికల వివాహాలు గురించి ఏకరువు పెట్టారు. ఇరవై నిముషాలు స్వామివారు మౌనంగా విన్నారు. ప్రసాదమిచ్చి బయటకు వచ్చారు. ఊరి పెద్దలు జయేంద్రసరస్వతీ స్వామివారు పీఠాధిపతిగా వస్తారు కదా పూర్వాశ్రమ గురువుకు సన్మానం చేయిద్దామని కొంత ద్రవ్యం వసూలు చేసి ఉంచారు. అది స్వామివారి ముందుంచి ''కుంజుశాస్త్రిగారికి తమచే పూర్వాశ్రమంలో విద్యబడసిన శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి పీఠాధిపతులుగా తమ ఇంటికి రాలేదని కొరతగా ఉంది'' అంటూ ఆరంభించారు. ''స్వామి రాలేదనో! తగినంత ద్రవ్యం ముట్టలేదనో'' అని డబ్బు ఉంచిన బుట్టను తీసుకోవలసిందిగా సూచిస్తూ బయటకు నడిచారట.

పాఠకులు ఈ ఉదంతాలు చదివి శ్రీవారి పూర్వాశ్రమ కుటుంబమువారు మఠపు పలుకుబడిని అనుచితముగా ఉపయోగించుకో చూచారనుకొంటే అది పెద్ద పొరపాటు. ఈ ఉదంతాలు శ్రీవారి నిర్లిప్తతను తెలియచేయడానికే ఉద్దేశించబడినవి కాని కుటుంబసభ్యుల ఔన్నత్యమును తగ్గించడానికి కాదు. వారంతా పేదరికంలో గడిపినా తృప్తులుగా, నిర్లిప్తులుగా కాలం గడిపారు. కుంజుశాస్త్రిగారు మహాపండితులయి ఉండి తన కాలాన్నంతా అధ్యాపనకు ఉపయోగించారే కాని ఏ నాడూ ఎవరినీ ఆశ్రయించలేదు. యాచనకు పోలేదు.

మొత్తం మీద శ్రీమఠంలో పూర్వాశ్రమ కుటుంబం వారికి క్వచిత్తుగా మఠ పరివారంచే మర్యాద జరిగేదేమో కానీ, స్వామివారి వద్ద మాత్రం వారు సాధారణ భక్తులే. ఏ మాత్రపు ప్రత్యేకత చూపేవారు కాదు.

Dharmakruthi  Chapters   Last Page