Sri Matrukachakra viveka    Chapters   

అథ జాగ్రద్వివేకః చతుర్థః

ఇత్యంత రీషవిహ సంకుచితే విమర్శే

సంకోచ మాశ్రయతి బాహ్యపదే ప్రగాఢం |

ప్రత్యేక మేవ కలయ త్యధ పంచభావం

భూతాని పంచ జగతో నియతః కలాపః || 1

స్కంధాంతరమును ప్రారంభించువారై, పూర్వోత్తర స్కంధముల సంబంధమును చూపించుట పూర్వస్కంధ ప్రమేయముయొక్క అనువాదపురస్సరముగ ఉత్తరస్కంధ ప్రమేయమును ప్రస్తావించుచున్నారు. ఉక్త ప్రకారముగా అంతఃకరణకక్ష్యయైన ఈ స్వప్నదశయందు కొద్దిగా సంకోచమును పొందిన విమర్శ, బాహ్యేంద్రియ కక్ష్యయగు జాగ్రత యందు అతిమాత్రము సంకోచభావమును ఆశ్రయించు చున్నది. జగత్తుయొక్క నియతమైన కలాపమగు పంచభూతములకు (జగత్తు భూతపరిణామరూపమగుట వలన) నియమముగా జగత్కలాపత్వమని తలంచవలెను. ప్రతి భూతముపంచ భావమును పొందుచున్నవి. విమర్శయొక్క అతిసంకోచపదమైన జాగ్రత్‌లో భూతములకు అతిసంకోచ పరిగ్రహమువలన పృథివ్యాదులకు ప్రతిభూతమునకు పంచ రూపతచే అతిసంకోచము. పశుప్రమాతృపదమైన సలిలమునకు పురుష ప్రకృత్యాదిరూపముచేత పంచభూతాత్మకముగా అతిసంకోచము. పశుప్రమాతృజ్ఞానేంద్రియపదమగు పృథివికి శ్రోత్రుత్వగాది రూపేణ పంచభూతాత్మకముగ అతిసంకోచము పశుప్రమాతృకర్మేంద్రియపదమగు అగ్నికి వాక్పాదాది రూపేణ పంచభూతాత్మకముగా అతిసంకోచము. పశుప్రమాతృ జ్ఞేయ వేద్య పదమగు వాయువునకు శబ్దస్పర్శాదిరూపేణ పంచభూతాత్మకముగ అతిసంకోచము. పశుప్రమాతృ కార్యవేద్య రూపమగు ఆకాశమునకు ఆకాశవాయ్వాదిరూపేణ అతిసంకోచము. ప్రతిభూతమునకు పంచభూతాత్మకముగా విలసనము స్వభావము కలదు. ఆస్వభావము సుషుప్తి స్వప్నములయందు గల ఈషత్సంకోచమును బట్టి వికసించదు. అతిసంకోచపదమైన జాగ్రత్‌ లో వికసించును. ఇందుచే అన్ని భూతములకు పరస్పరము అవినాభాలసంబంధమని తెలియదగినది.

యద్వర్ణ పంచక మపూర్వకమాదివర్గ్య

మంతస్థతాం భజతి సంకుచితం తదీషత్‌|

తత్కాదివర్గ తనుసంకుచితం నితాంత

మూషాత్మకం చ తద థాంకురితాభిపూర్తి||

జాగ్రత్ప్రస్తావమందు కాదిమాంత స్పర్శవర్ణముల సంకోచాథిక్యము చూపించుటకై సర్వవర్ణములకు కారణభూతమైన అకారాది వర్ణపంచకముయొక్క స్ఫురణపరిపాటి ప్రక్రియను ఉపసాదించుచున్నాను. స్వరవర్గ యందలి అకారము పూర్వముగాగలవి అకార, ఇకార, ఋకార, లుకార, ఉకారరూపములగు వర్ణపంచకము. అది ఈషత్సంకుచితమై ఈషత్స్ఫృష్టతాప్రయత్న విషయమగుటచే ఈ షత్సంకుచితమైనది యకారాదిరూపతను పొందును. ఇకారము యొక్క ఈషత్సంకోచము యకారము. ఋకారమునకు రేఫ లుకారమునకు లకారము. ఉకారమునకు వకారము. లకార స్థానమైన మనస్సే విసర్గ పర్యాయ దేహరూపమగుటవలన అకారసంకోచములేదు. ఈ ప్రకారము అకారాదివర్ణపంచకమునకే రూపాంతరము. ఆ వర్ణపంచకమే స్పృష్టతావిషయముచే మిక్కిలి సంకుచితమగుచు. కకారాదివర్గపంచకమ స్వరూపమగును. అకారముయొక్క అతిసంకోచము. కవర్గ. ఇకారమునకు చవర్గ. ఋకారమునకు టవర్గ. లుకారము తవర్గ. ఉకారమునకు పరవ్గ. అనంతరము ఆవర్ణపంచకమే. ఈ షద్వివృతప్రయత్న విషయమగుటచే అంకురిత పూర్ణత్వమగుచు, ఊష్మాత్మకముగా అనగా వర్గపంచకముగా, సంకుచితమైనది అకారాదివర్ణపంచకమునకు ఈషత్‌ పూర్ణత్వరూపము ఊష్మలని యర్థము. చవర్గకు ఈషత్‌ పూర్ణత్వము, శకారము,టవర్గకు షకారము తవర్గకు సకారము. కవర్గకు ఈషత్పూర్ణత్వము హకారము. ఈప్రకారము కారణరూపమగు అకారాదివర్ణపంచకమునకే దశావిశేషము వలన తత్కార్య రూపములు సర్వవర్ణములు అని తాత్పర్యము.

స్థానేనసాథిత ధరా ప్రభృతి స్వభావే

వర్ణోత్కరే భవతి మాతృపదం పవర్గః|

ఆత్మా మనస్తదను బుద్ధి రహంక్రియాచ

ప్రాక్చేతనః ప్రకృతి రప్యవరోహభంగ్యా||

స్పర్శకదంబమునకు స్థానవశమువలన పృథివ్యాదిరూపత్వ వివేకమును ప్రాగుక్త ప్రక్రియచే సూచించుచు పరిమిత ప్రమాతృపదమైన పవర్గయొక్క వర్ణపంచకమందు తత్ప్రతి పాద్యమగు తత్వపంచకమును ఉపపాదించుచున్నాము. కంఠ తాల్వాదులవలన ప్రాగుప్త ప్రక్రియను బట్టి నీచోచ్ఛస్థాన పర్యాలోచన చేత నిశ్చితమైన పృథివ్యాదిస్వభావముగల స్పర్శ వర్ణకదంబకమందు పవర్గ స్పర్శమాతృస్థానము అగుచున్నది. విచారింపగా కవర్గకే ప్రమాతృస్థానముండుటచేత ప్రసూతృ పదత్వమైనను చైత్యమునకు ప్రమాతృత్వము వైకారికము, చిత్తుకు ప్రమేయత్వము కూడ వైకారికమే. ఇపుడు చిత్పదమైన వపర్గకు ప్రమాతృపదవ్యవహారము విసర్గయైన పూర్వ వాసనచేతనని అనుకొనుట నిరవద్యము. విలోమక్రమముచేత (మకారమారభ్యపకారపర్యంతమని అర్థము) ఆత్మ, మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రకృతి అనువాటికి చెందిన తత్త్వపంచక రూపత, మకారము ఆత్మ, పురుషతత్వము అని అర్థము, భకారము మనస్తత్త్వము, బకారము బుద్ధితత్వము. ఫకారము అహంకారతత్వము. పకారము ప్రకృతితత్వము అని తెలియవలెను. పకారాది వర్ణపంచకమునకు పృథివ్యాది ఆకాశాంతభావముండగా ప్రకృత్యాది వ్యవహారమున్నది. పృథివీ అంశ ప్రకృతిజలాంశ అహంకారము. అగ్న్యంశబుద్ధి. వాయ్వంశముమనస్సు. ఆకాశాంశ పురుషుడు. ఈ ప్రకారముగా ఇతర వర్గచతుష్టయమునకు ప్రథమవర్ణము మొదలుకోని పృథివ్యాద్యంశత్వము కలదు. ఇది చెప్పబోవు తత్త్వత్స్వరూపమని తెలియవలెను. పురుషతత్వానంతరము ప్రకృతితత్త్వమని ప్రవాదముండగా ఇచట క్రమ విరోధమెట్లనిన చెప్పచున్నారు. మనస్సుకంటె ముందు ప్రకృతి యైనను, అనగా తత్వోదయ క్రమమందు ప్రకృతిమనస్సుకంటె ప్రథమమైనను ఆకాశపృథివీరూపులగు పురుషప్రకృతులను ధర్మిద్వయానంతరము ధర్మభూత మనోబుద్ధ్యహంకారముల యొక్క ఉదయమునకు ఉపపత్తి కలదు. ఐనప్పటికిని ఆధర్మములకు ధర్మిద్వయ మధ్యయందే ఉదయమగుటచే మధ్యగా పరిగణన. ఉదయాపేక్ష చేతనైనచో ధర్మములకు ధర్మిద్వయానంతరమే స్థిత్యపేక్షచేత ధర్మిద్వయ మధ్యయందని భావము. ఆ మధ్యలో కూడ మనస్సు పురుషధర్మము కనుక పురుష సమీపమందే దానికి అవస్థానము. అహంకారము ప్రకృతి థర్మము గనుక ప్రకృత సమీపమందే దానికి అవస్థానము, మనోహంకారముల మధ్య ఉభయధర్మమైన బుద్ధియొక్కస్థితి అని తెలియవలెను. విసర్గ వ్యాప్తియందు ప్రకృత్యహంకార బుద్ధి మనఃపురుషులు అని, బిందువ్యాప్తియందు పురుషమనో బుద్ధ్యహంకార ప్రకృతులుఅని క్రమము, ఇపుడు విసర్గవ్యాప్తికే ప్రాధమ్యముగా ప్రకృత్యాదిక్రమమును అంగీకరించవలెను.

శ్రోత్రాదికంఖలు తవర్గమయం విలోమా

ద్వాగాది పంచకమిదం చ టవర్గ రూపం

శబ్దాగిఖాద్యపి చవర్గక వర్గరూప

మేతాని వాయుదహనాంబుమహీ విలాసాః||

పవర్గ ప్రతిపాద్యములైన తత్వములను చెప్పి తవర్గాది వర్ణ ప్రతిపాద్యములైన తత్వములను, ఉపపాదించుచున్నారు. శ్రోత్రత్వక్చక్షుర్జిహ్వాఘ్రాణరూపమైన తత్త్వపంచకము విలోమమువలన తవర్గ రూపమైనది. చకారాది, తకారాంతవర్ణ పంచకరూపమని యర్థము. ఇచట నకార ప్రతిపాద్య శ్రోత్ర తత్త్వము ఆకాశాంశ. ధకారప్రతిపాద్యమగు త్వక్కు వాయ్వంశ. దకార ప్రతిపాద్యమగు చక్షుస్సు అగ్న్యంశ. థకార ప్రతిపాద్యమగు జిహ్వ జలాంశ. తకార ప్రతిపాద్యమగు ఘ్రాణముపృధ్వ్యింశ అని తెలియవలెను. ప్రత్యక్షనిర్దేశ్యమైన వాక్పాదపాణ్యువపస్థావాయురూపమైన తత్త్వపంచకము విలోమమువలన టవర్గ రూపమైనది. ణకారము. ఆకాశాంక, వాక్‌ ఢకారము వాయ్వంశ పాదము. డకారము తేజోంశ, పాణి. రకారము జలాంశ, ఉపస్థ, టకారము పృథ్వివ్యంశ, వాయువు. శబ్దస్పర్శరూపరసగంధరూపమైన తత్త్వపంచకము. ఆకాశ వాయ్వగ్ని జలపృథ్వివీరూపతత్త్వపంచకము కూడ చవర్గ, కవర్గ రూపము. ఞకారము యొక్క ఆకాశాంశ. శబ్దము, ఝకారము వాయ్వంశ, స్పర్శము, జకారము తేజోంశ, రూపము, ఛకారము సలిలాంశ, రసము. చకారము పృథ్వింశ, గంథము. జకారము ఆకాశము. ఘకారము వాయువు. గకారము తేజస్సు. ఖకారము జలము. కకారము పృథివి. తవర్గాదివర్గ చతష్టయతత్త్వములు వాయుదహనాంబు మహీవిలాసములు, వాయువు తవర్గాదిష్ఠాతగాన తవర్గ ప్రతిపాద్యతత్త్వములు వాయువిలాసములు. అగ్ని టవర్గాదిష్ఠాత గనుక టవర్గ ప్రతిపాద్యతత్త్వములు అగ్ని విలాసములు. జలము చవర్గాథిష్ఠాతగాన చవర్గ ప్రతిపాద్యతత్త్వములు జలముయొక్క విలాసములు. పృథివి కవర్గాదిష్ఠాత కనుక వర్గప్రతిపాద్యతత్త్వములు పృథ్వివీ విలాసములని తాత్పర్యము.

దేహాత్మికా ప్రకృతి రాంతరరూప ముర్వ్యాః

సూక్ష్యం ఖలు జలస్య రూప మహంక్రియాస్యా|

దగ్నేస్తు బుద్ధి రనిలస్య మనోంతరాత్మా

సర్గఃఖలు ప్రకృతిజః క్షీతి సర్గబీజం||

క,చ,ట, త వర్గాత్మకమైన స్థూలమగు పృథివ్యండమునకు పవర్గరూపమైన ప్రకృత్యండము. సూక్ష్మరూపమగుటచే కారణమని ప్రతిపాదించుచున్నారు. దేహరూపమైనది ప్రకృతి దేహాభిమానమే ప్రకృతి యని వ్యవహరింపబడును. కవర్గ రూపమైనది పృథివి .అంతఃకక్ష్యయందున్న సూక్ష్మరూపమైన కారణరూపమైనది. దీని స్వరూపము చవర్గరూపజలమునకు సూక్ష్మమైన రూపము అహంకారమగును. టవర్గ రూపమైన అగ్నికి అంతరరూపముబుద్ధి. తవర్గ రూపమైన వాయువునకు ఆంతరరూపము మనస్సు. ఈ ప్రకారము ప్రకృతి వలన సంసారమువచ్చెను. వవర్గ వర్ణ చతుష్టయరూపప్రకృతి సంసార మని అర్థము. క్షితిసర్గ కవర్గాది చతుష్టయాత్మమగు పృథివి సంసారమునకు కారణము. సూక్ష్మమైన ప్రకృతి సంసారము నకే స్థూలభావము. పృథివీసంసారమని పిండాండరూపమైన ప్రకృతిసంసారమునకు కారణత్వమని, బ్రహ్మాండపర్యాయమైన పృథివి సంసారమునకు కార్యత్వమని స్వాభావికము. ప్రకృత్యండమునకు పృథివ్యండమూలకత్వ ప్రతీతి అయితే మాయా విలాసమని తాత్పర్యము. అందువలననే చతురశ్రరూపమైన ప్రకృత్యండమునకు రవిబింబత్వము, దశారయుగ్మరూప పృథివ్యండమునకు రశ్మిచక్రత్వము మహాయంత్రమందు భావన చేయుచున్నారు.

దేహాత్మనోః ప్రకృతిపూరుషయోః ప్రమాతా

దేహోత్ర తస్య నిలయోపి తరంగ మాత్మా|

ఆత్మా యదా భజతి మాతృపదం వపుశ్చ

తల్లీన మస్త్యవిరహ శ్శివయో స్స్వభావః||

ప్రకృత్యండ విచారము ప్రారంభింపబడుచున్నది. దేహాత్మపర్యాయములైన ప్రకృతిపురుషులకు మధ్య ఈ విసర్గ ప్రకరణమందు దేహము ప్రమాత. ఆ దేహామునకు ఆశ్రయమైనను (అపిశబ్దముచేత అంగిత్వసంభావన కలదు.) విమర్శ పరిణామరూప దేహాత్మకు ప్రకాశాంశ లేకుండా ఎచటను స్థితికలుగదు. ధర్మమునకు ధర్మియందే ఆశ్రయణము అను నియమమువలన అని తాత్పర్యము. ఆత్మ ఆ దేహమునకు అంగము. దేహాంతర్గతమగుట చేత దేహమునకు అంగత్వము విసర్గప్రమాతృపదమందు ప్రకృతిపర్యాయమైన దేహమునకు వ్యాప్తి కలుగుచుండగా, ఆత్మ దేహాంతర్గతమై తదంగత్వమును పొందును. ఎపుడు ఆత్మ ప్రమాతృస్థానమును పొందునో, అపుడు బంధవ్యాప్తిపదమందు ఆయాత్మయందులీనమై ఏకరసీభూతమై శరీరమున్నది. కాని పరమోచ్ఛేదమును పొందదు. అట్లు చెప్పిన విమర్శపదమునకు తిరిగి ఉదయ ప్రసంగము లేకుండును. పునః పునః విమర్శ ఉదయించుటవలన ప్రకాశవ్యాప్తి యందు విమర్శకు అత్యంతోచ్ఛేదము సంభవింపదని ఊహింపవలెను. ప్రకాశవిమర్శలకు పరస్పరవ్యాప్తి యందు ఉభయులకు అనుచ్ఛేదమును ప్రతిపాదించుచున్నారు. శివశక్తులకు అన్యోన్యము అవినాభావము నైసర్గికము. ప్రకాశ##లేక విమర్శయుండదు. విమర్శలేక ప్రకాశ ఉండదు. ప్రకాశవ్యాప్తియందు విమర్శ ప్రకాశైకరస్యముగా నుండును. విమర్శవ్యాప్తియందు ప్రకాశ భిన్నరసముగా నుండును.

జాడ్యా దహంకృతిరితి ప్రథతే విమర్శో

బుద్ధిర్జడాజడత యాధమనస్త్వజాడ్యాత్‌|

త్పైగుణ్య మేత దబహిఃకరణ త్రయం స్యాత్‌

సౌషుప్త జాగ్రదవ శేష దశా నిదానమ్‌||

దర్శిరూపులగు దేహాత్మల స్వరూపమును విచారించి, అహంకార మనోబుద్ధి రూపమును త్రివిధమగు విమర్శాభిన్న మైన ధర్మము యొక్క స్వరూపమును విచారించుచున్నారు. విమర్శ జడత్వభూమికా పరిగ్రహమువలన అహంకారమని ప్రసిద్ధమగును. జడత్వభూమికా పరిగ్రహమందు విమర్శయే అహంకారశబ్దముచేత వ్యవహరింపబడును. దేహమందు అహమనే ఏవిమర్శకలదో అదియే జడవిమర్శ. అహంకారము జడీభూతమైన దేహమును ఆశ్రయించి దానికి ధర్మమగుట వలన అని ఎరుంగవలెను. అజడవిమర్శయే అంతఃకక్ష్యయందు అహంకారమగుచు దేహధర్మముగా బహిఃకక్ష్యయందు శబ్దాదిపంచకరూపకమగును. భూత చతుష్టయము అంగముగా గల అంగిరూపపృథివికి ధర్మము. విమర్శయే జడాజడత్వ భూమికా పరిగ్రహమందు బుద్ధియని వ్యవహరింబడును. జడాజడత్వభూమికా పరిగ్రహముతేత బుద్ధిఅని ప్రసిద్ధినొందును. క్రియాసాధనమైన ఇంద్రియము స్వయముగా స్థౌల్యముచేత క్రియారూపమగుటవలన అజడము. స్వతఃస్పందమానమై నందున జడము. అందువలన క్రియా సాధనరూపముచే జడాజడమగు విమర్శ అంతఃకక్ష్యయందు బుద్ధియని, బహిఃకక్ష్యయందు వాగాది పంచకమని చెప్పబడును. విమర్శయే అజడత్వభూమికా పరిగ్రహము వలన మనస్సని ప్రసిద్ధి నొందును. విమర్శకు అజడత్వము జ్ఞానసాధనరూపముచేతనని తెలియనగును. జ్ఞానసాధనమైన మనస్సు చక్షురాదికముగా అంతర్భహిఃకక్ష్యలయందు విభక్తమై సూక్ష్మరూపమగుటచే బుద్ధివాగాదులకంటె విలక్షణమగుచు అజడమైనది. ఇట్లు విమర్శరూపమగు అహంకారాది అంతఃకరణత్రయమే గుణత్రయమని చెప్పుచున్నారు. అంతఃకరణత్రయము సత్త్వాది గుణత్రయసమాహారము అగును. అహంకారము రజోగుణము ఉత్పత్తిరూపమైనది, బుద్ధిసత్త్వము, స్థితిరూపమైనది. మనస్సు తమోగుణము, సంహారరూపమైనది. సంహార మనగా చిదేకా కారము. అట్టి ప్రకాశ విశ్రాంతి రూపము అలౌకికులచే మనస్సని చెప్పబడును. ఆ సందర్భమును బట్టి ఈ మనస్సునకు అలౌకికాపేక్షచేత తమస్త్వము. అనంతరము క్రియ యొక్క సంహారపక్షమందు క్రియారూపమైన అహంకారము తమస్సు. జ్ఞానరూపమైన మనస్సురజోగుణము. అజడత్వము జగదుత్పత్తి దశ. జడత్వము తత్సంహారము. ఈ విధమున లౌకికపక్షమున్నది. జడత్వము జగదుత్పత్తిదశ. అజడత్వము సంహార దశ అని యోగసిద్ధాంతము. అందువలన జడాజడములగు అహంకార మనస్సులకు యధా వివక్షీతముగా, తమో రజోగుణయోగము చేయదగినది. ఈ అంతఃకరణత్రయమే సుప్త్యాది దశాత్రయబీజమని చెప్పుచున్నారు. సుషుప్తి జాగ్రత్స్వప్న దశలకు కారణమైన అహంకారము జడమైనది గాన సుషుప్తికి నిదానము. బుద్ధి జడాజడము గనుక జాగ్రన్ని దానము మనస్సు అజడము గాన స్వప్ననిదానమని వివేకము.

దేహీ గుణత్రయమయ ప్రకృతిర్దశాసు

సుప్త్యాదికాసు నియమా త్పరిబంభ్రమీతి|

తాస్వప్యహాంకృతి పురస్సరణా త్త్రిపుట్యాం

మేయోన్నతిం కలయ ప్రముఖ క్రియాంశం||

దేహీకి గుణత్రయమయ ప్రకృతిసంబంధముచే సుప్త్యాది దశాత్రయ పరిభ్రమణమని చెప్పుచున్నాము. దేహాభిమానియగు ప్రమాత గుణత్రయసంసృష్టిరూపమైన స్వభావము కలవాడు. దేహము కలవాడని అర్థము. ఇందుచే గుణత్రయ సంసృష్టియే ప్రకృతి అని ప్రకృతిలక్షణము చెప్పబడినది. ఇటువంటి ప్రకృతి గల జీవుడు సుషుప్తి మొదలుగాగల దశల యందు నియమముగా పునః పునః తిరుగుచుండును. ఆదశలయందు కూడ దేహధర్మమైన అహంకారము యొక్క ప్రాధాన్యమువలన ప్రమాతృ ప్రమాణప్రమేయరూప సంసారకలాపసం పుటిక యందు ప్రమేయవ్యాప్తిని క్రియాంశ##యే ప్రధానమగునట్లు విమర్శించును. దేహమునకు ప్రమాతృ త్వము వచ్చినపుడు తద్ధర్మమైన విమర్శజడమైనందున జడపక్షమైన ప్రమేయయొక్క వ్యాప్త్యను సంధానము కలుగునని తాత్పర్యము.

మేయాదికా సతతయుక్తి పుటీ మనస్తాం

మేయాది భాసయతి మూఢ మహంక్రియాత్మ|

మాత్రాది భాసయతి చాఠ నిజస్వభావా

డ్బుద్ధిశ్చ మధ్యమపదే మనఏవ చోధ్యమ్‌||

సర్వాంతఃకరణకు మనస్సే ప్రధానము. అహంకారాదులు మనస్సుయొక్క భూమికలు. మనస్సు విమర్శ యొక్క ప్రథమారూపమైనందున విమర్శ వైభవము మనోవైభవమని ప్రతిపాదించుచున్నారు. మేయమాతృరూపమైన త్రిపుటి సతతము అన్యోన్య వినాభావ స్వభాలము కలది. ఆ త్రిపుటిని విమర్శరూపమైన మనస్సు జాడ్యభూమికా పరిగ్రహముచేత మూఢమై అహంకారస్వరూపమగుచు, ప్రమేయాదిక మగునట్టు భాసింపజేయును. మేయముయొక్క వ్యాప్తిని చూపించును. మనస్సే అహంకారమందు అనుసంధానముచేయును. అనంతరము మనస్సే స్వకీయస్వభావములన అనగా అజడరూపమైన నిజస్వభావమును పరిగ్రహించి ఆ త్రిపుటిని ప్రమాత్త్రాదికమగునట్లు భాసింపజేయును. చిత్ప్రమాతృ వ్యాప్తిని చూపించును. మనస్సే జడాజడసమానపదమందు, జడాజడపదగ్రహణముచేత ప్రమేయ ప్రమాతలయొక్క సమవ్యాప్తిని చూపించు బుద్ధిని మనస్సేయని తెలియనగును.

తస్మాత్ప్రకారవపుషః ప్రకృతేః ప్రమాతుః

ఆత్మా మకారవపు రంతరఏవ లీనః|

తన్నధ్యత స్థ్సితి రహంకృతిధీహృదాం స్యాత్‌

ఏత త్ప్రమాతృపద మింద్రియలగ్న విశ్వమ్‌||10

పైన చెప్పిన ప్రమేయమును కారణముగా చేసికొని, విసర్గయందు ప్రకృత్యాది సన్నివేశమును దృఢముగా చూపించుచున్నారు. పూర్వోక్తప్రమేయరూపకారణమున, పకారస్వరూపమైన దేహపర్యాయ ప్రకృతిరూపమగు ప్రమాతయొక్క వ్యాప్యపదమందే మకారస్వరూపుడైన పురుషుడు. లీనుడగును. ఆ ప్రకృతిపురుషులమధ్య భాగమందు అహంకారబుద్ధి మనస్సుల యొక్క సన్నివేశము కలదు. విచారింపగా. మకారస్వరూపుడగు ఆత్మకు ప్రమాతృపదమైన వ్యాపకవర్గయందు సన్నివేశము ఉన్నను పవర్గవ్యాపక వర్గల మధ్యగల సన్నివేశమువలన ఉభయపక్షప్రక్రియా సంబంధమును తెనిసికొనవలెను. స్పర్శకదంబము ప్రమాణపదము గనుక మకారరూపుడగు ప్రమాతకు ఆ కళలయందు పరిగణన చేయబడలేదు. చేయకపోయినను తాటస్థ్యమువలన ప్రమాణపద క్రియాసంబంధము మాత్రము అంగీకరింపవలసినదే. అందుచే ప్రకృతి వ్యాప్తి పురుషపర్యంతము ప్రహించుననునది నిరవద్యము. చతుర శ్రచక్ర సన్నివేశమందైతే, పురుష రూపమును గ్రహించిన మనోబుద్ధులను అహంకార ప్రకృతులువ్యాపించును. తిరిగి ఆ అహంకార ప్రకృతులను మనోబుద్ధులను వ్యాపించునని వివేకము. ఈ ప్రకృత్యండమందు స్వప్న పదమందు వలెనే మనోబుద్ధులయందు బ్రహ్మాండోన్మీలన చమత్కారమును చూపించుచున్నారు. ఈ ప్రమాతృపదము అనగా, ప్రకృత్యండరూపము, మనోబుద్ధిరూపములైన జ్ఞాన క్రియేంద్రియములందు సంబంధమైన విశ్వము కలది అగును.

ఏతచ్ఛ మాతృపద మింద్రియ సంశ్రితం చ

తత్సంశ్రయశ్చ మనఏవ తదింద్రియం స్యాత్‌|

తద్గ్రామణీంద్రియకులస్య విమర్శశక్తిః

చిచ్చైత్యమిశ్ర మఖిలం ఖలు తద్విలాసః|| 11

ఈ అంతర్బాహ్య జగద్విలసనమంతయి మనోమూలమని ప్రతిపాదించుచున్నారు. ఈ ప్రకృత్యండరూపమైన ప్రమాతృపదము ఇంద్రియముల నాశ్రయించినది. మనోబుద్ధి రూపమగు ఇంద్రియవిలాసమే ప్రమాతృపదము. మనోబుద్ధు లను ఆశ్రయించినదని అర్థము. ఆమనోబుద్ధులకు ఆశ్రయము ద్విరూపమగు ఇంద్రియము ఆలోచింపగా మనస్సేయగును. మనస్సుయొక్క దశావిశేషమే బుద్దియని చెప్పబడినది. అంతర్బహిఃకరణజాలమునరు ప్రవర్తకమైన ఆ మనస్సే విమర్శ శక్తి. విచిత్రమైన విశ్వముయొక్క ఉద్యమనానుక చర్వణ క్రియయందు సమర్థమైనదని, ఉన్నేషనిమేష సంభ్రమముకల దని చెప్పబడు ఆవిమర్శశక్తియే మనస్సు. ప్రమాతృప్రమేయ ప్రమాణ రూపమైన సమస్తము ఆ మనస్సుయొక్క విలాసమే గదా. ఆ మనస్సుచేతనే జాగ్రతయందు కూడ ఇంద్రియ జాల వైభవమంతయు నడిపింపబడుచున్నది.

స్వప్నే చ జాగరణ మాతృపదే చ వేద్య

మిచ్ఛాత్మనో మనస ఏవ విభాతి కుక్షౌ|

పూర్వత్ర మాతృమవ ఏవ శరీరతాభాక్‌

ప్రత్యక్షముత్తరపదే తు శరీరమేవ||

ఈ ప్రకారము స్వప్న ప్రకృతిసంసారముల యందు విశ్వము ఇచ్ఛాత్మకమైన మనస్సుయొక్క గర్భమందేవిలసిల్లు చున్నది. స్వప్నమందు జాగ్రదవస్థయందైన ప్రమాతృపదమందును, అనగా జాగ్రదవస్థయందు అవైకారికమగు పవర్గప్రతిపాద్య్పరకృతి సంసారమందు, అంతర్హహిఃప్రపంచరూపము ఇచ్ఛాస్వరూపరమైన మనస్సు యొక్క గర్భమందే ప్రకాశించును, స్వప్న ప్రకృతిసంసారములు ఇచ్ఛాసంసారములని అర్థము. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ సంసారములు జ్ఞాన క్రియాసంసారములను భావము. స్వప్నమునకు జ్ఞానసంసారమని జాగ్రతకు క్రియాసంసారమని, విశ్రాంతిరూపమైనను సుషుప్తి ఇచ్ఛాసంసారమని ఇదివరలో ఉపదిష్టమైనది. ఇపుడు అన్యథా ఉపదేశ##మెట్లని తలంచరాదు. అబహిర్ముఖ మగుటచే విశ్రాంతియే ఇచ్ఛాసంసారము. స్వప్నమే జ్ఞాన సంసారము. జాగ్రతే క్రియా సంసారము, జడవిశ్రాంతి అని అజడ విశ్రాంతి అని సుషుప్తి స్వప్నములకు జడాజడ విశ్రాంత్యభి మానమందు జాగ్రతకే జ్ఞానక్రియేంద్రియ వ్యాపారవ్య వస్థచేత జ్ఞానక్రిమాసంసారత్వము, అధవా ప్రకృతిసంసారము జ్ఞానసంసారమని భావము. పార్ధివసంసారము క్రియా సంసారమని తెలియనగును. జడాజడసుషుప్తికే జడాజడేచ్ఛా సంసారత్వమును అభిమానించినపుడు, స్వప్నము జ్ఞానసంసారము జాగ్రత్‌ క్రియాసంసారమని వివేకము. అందువలన ఇచట స్వప్నవిశ్రాంతికి అజడేచ్ఛా సంసారతాభిమానము చేత ప్రకృతి సంసారమునకు ఇచ్ఛాసంసారత్వము చెప్ప బడినది. స్వప్న ప్రకృతి సంసారములు ఇచ్ఛాసంసారమగుటచే ఏకేరూపమగుచుండగా, ఇదివరకు చెప్పిన భేదమునే ఉద్ఘాటన చేయుచున్నారు. పూర్వత్ర స్వప్నమందు శరీరమును పొందిన మనస్సే ప్రమాత. ప్రకృతిసంసారమందైతే, అమానసికమైన శరీరమేప్రమాత. ఈ రెండు సంసారములందు ఇదే భేదమని తెలియవలెను.

చేత శ్చమత్కృతిపదం వమతి స్వలీనం

విశ్వం బహిః శ్రుతిముఖేంద్రియవర్గ భావాత్‌|

తత్రాపి ధీంద్రియగణః పవనోపి పృథ్వి

జ్ఞేయైర్జలైరపి మదుద్భిరురీరితో 7ంతః||

పార్థివ సంసారప్రక్రియను ఉపక్రమించున్నారు. చమత్కారములకు స్థానమై విమర్శలకు మూలరూపమైన మనస్సు స్వాంతర్గతమైన ప్రపంచము, (అనగా స్వప్నసంసారమందు వలెనే ప్రకృతి సంసారమందు కూడ ప్రపంచమును) లౌకికులచే గూడ మనోవిలాసమాత్రముగానే అనుభవమునందు గలదు. వెలుపలకు బహిర్వమనము మనస్సు యొక్క చమత్కార విశేషమే. శ్రోతాది, వాగాది జ్ఞానక్రియేందియవర్గ స్వరూపమును అంగీకరించుటగలదు. శ్రోత్రాది భూమికా పరిగ్రహముచేత అని యర్థము. ఈ స్వరూపమును వదలి పెట్టును. శ్రోత్రాదులవల్ల జ్ఞేయరూపమైన విశ్వముయొక్క విసర్గమనము. రాగాదులవలన కార్యరూపమైన విశ్వము యొక్క నిర్గమనము కలుగును. నియమముచేత కలుగు ఇంద్రియ ప్రకాశాంతర్భాసనమువలన విశ్వమునకు ఇంద్రియ కారణత్వమున్నది. విశ్వము ఇంద్రియ రూపాంతరమే. ఇంద్రియప్రకాశతో అబేదము పర్యవసానమగుచున్నది. ఇంద్రియ ప్రకాశోన్మేషయందే స్ఫురణము. అనున్మేషము అస్ఫురణము ఇట్లు అన్వయవ్యతిరేకములచే విశ్వమునకు ఇంద్రియప్రకాశ##మే కారణము. పరమార్థముగా ఇంద్రియ ప్రకాశ్యమైన విశ్వమునకు పశువిషయమైన విపరీతప్రతీతి ప్రక్రియను చెప్పుచున్నారు. తత్రాపి బహిఃకక్ష్యయందు కూడ ఏప్రకారము అంతఃకక్ష్యయందు ప్రకృతిపంసారమందు పశువునకు విపరీత ప్రతీతియో, ఆ ప్రకారముగా, బహిఃకక్ష్య యగు పార్థివాండసంసారమందు కూడ విపరీతప్రతీతిలో జ్ఞానేంద్రియవర్గము పరమార్థమైన చిద్వ్యాప్తి సంసారమందు వాయుస్థానమైనప్పటికినీ, సంకోచభావమువలన స్థానమును పొందినది చిద్వ్యాప్తి యందు జలస్థానమైనప్పటికిన్ని విపరీతవద మందు వ్యాప్తి చేత వాయుస్థానమును పొందిన జ్ఞేయరూపము లైన వేద్యములచేత స్వాభ్యంతరమందు ఉంచబడెను. తవర్గ రూపములైన జ్ఞానేంద్రియములకు చవర్గరూపములైన శబ్దాదుల చేత వ్యాప్తి అని యర్థము.

కర్మేంద్రియాణి కఠినత్వ పరాంతభాంజి

వహ్న్యాకృతీని ఖపదస్థ ధరాశ్రితాని |

పృధ్వమయ ప్రకృతి సంగ్రహణోన్ముఖానా

బోధ్యాని భూతవితతే రిహ వైపరీత్యే || 14

కర్మేంద్రియములకు కార్యరూపవేద్యములకు వైపరీత్యమును చెప్పుచున్నారు. టవర్గ ప్రతిపాద్యములైన వాగాదులు కఠినత్వముయొక్క పరమావధిని పొందినది. క్రియయొక్క సంకోచనిర్వహణపదముకారణము. కర్మేంద్రియములకు కార్యరూపవేద్యములకును అతిసంకోచభావము వలన అతి కాఠిన్యముకలవు. చిత్తును వ్యాపించుచటయందు జడాంశ ప్రధానవహ్నిమయము. చిద్య్వాప్తి యందైతే కర్మేద్రియములకు అజడాంశ ప్రధానవహ్నికమయత్వము. వహ్ని కజడాజడ మయత్వము వెనుక చెపన్పబడినదే. వ్యాప్తిపదమైన ఆకాశ పదమును ఆక్రమించినట్టి పృథివిని ఆశ్రయించినవి. విచారింపగా వాగాదులకు పశుపదమందు దేహపర్యాయమైన ప్రకృతియే ఆశ్రయమైనను కార్యవేద్యములలో ప్రధానభూతమైనపృథివీ వ్యాప్త్యను సంధానమువలన, పృథివ్యాశ్రితత్వమున్నది. పృథ్వీమయమైన ప్రకృతియొక్క గ్రహణమందు ఉన్ముఖమైన వాటినిగా చిద్వ్యాప్తి పదమందు పూర్ణరూపముచేత ఉపచరితమైన ఆకాశరూపమగు మహాప్రకృతియే పశుత్వమందు (పృథివీమయమైన ప్రకృతి) ప్రకృతి గ్రహణమందు ఉన్ముఖము లైన వనియర్థము. ఇచట భూతసముదాయమునకు వైపరీత్యమును తెలిసికొనదగినది. పశువుయొక్క జ్ఞానేంద్రియములు జ్ఞేయములైన శబ్దాదులయందు కొలదిగనే తెనిసికొనుటకు సమర్థములగును. సర్వమును తెలిసికొనుటకు చాలవు. అందుచే జ్ఞానేంద్రియములు జ్ఞేయములచేత వ్యాప్తములైనవి. వాగాదులు కార్యావస్థయందు వచనాదిభావముచేత స్థూలత్వమునుపొంది, ఆకాశాదులగునని, కర్మేంద్రియములు వచనాదిమాత్రమైన ఆకాశాదికమును చేయజాలవు. అందుచే ఆ కర్మేంద్రియములు మహాభూతములైన కార్యములచేత వ్యాప్తములైనవి. ఈ ప్రకారము ద్వివిధమైన ఇంద్రియవర్గము ద్వివిధమైన వేద్యవర్గముచేత వ్యాప్తమగుచు, ఆత్మదేహరూపమగు ప్రమాతృద్వయమునకు జ్ఞేయ కార్యవర్గములచేత వ్యాప్తిని సమర్పించును. చిద్వ్యాప్తియందైతే ఆత్మసాధనములైన జ్ఞానేంద్రియములచేత జ్ఞేయవేద్యమును వ్యాపించుచు, స్వాత్మీ కరించును. అశేష జ్ఞేయమును స్వాత్మీకరించుట వలన సర్వజ్ఞుడగును. దేహము కూడ (ఆకాశము) స్వసాధనము లైన కర్మేంద్రియములచేత కార్యవేద్యమును వ్యాపించుచు, ఆ కార్యవేద్యమును స్వాత్మీకరించును. అశేష కార్యస్వాత్మీ కరణమువలన సర్వకర్త అగుచున్నాడు. ఇట్లు జ్ఞానక్రియేంద్రి యముల ప్రకృతి వికృతిభావ ప్రక్రియను తెలిసికొనవలెను.

మానాత్మకస్య తరణర్థ్వయతో హి సిద్ధి

ర్మాయాబలా త్ప్రధమతాత్ర చ మేయకోట్యాః |

గ్రాహ్యగ్రహీతృ పదవర్గ సమన్వయేన

యోజ్యాః కళా బహి రధాంతరపి క్రమజ్ఞైః || 15

ప్రమేయ ప్రమాతృమిశ్రరూపుడగు ప్రమాణసూర్యుని కళల సంస్థాపనప్రక్రియను చెప్పుచున్నారు. ప్రమాణరూపుడైన సూర్యునకు ప్రమేయప్రమాతలవలన స్వరూపసిద్ధిగదా. ఇచటకూడ మాయాబలమువలన ప్రమేయకోటికేప్రాధాన్యము ప్రమాతృకోటికి ద్వితీయపదత్వము. విసర్గవ్యాప్తి యే ప్రథమ మని యర్థము. అందువలన ప్మాణసూర్యునకు ద్విద్వివర్గ ములచేత ప్రతిపాద్యములైనవి కళలు. గ్రాహ్యస్థాన కవర్గము లకు అనంతరము గ్రహీతృస్థానక వర్ణములకు యధాయోగముగా సమన్వయము కలదని యర్థము. కవర్గాది తవర్గాంత రూప పృథివ్యండమందు గ్రాహ్యగ్రాహక వర్ణక్రమవేత్తల చేత కళలను సంఘటితము చేయవలెను. కవర్గ, టవర్గ వర్ణములకు యధాక్రమముగా యోగము, చవర్గ తవర్గములకు యోగము, పకార బకారములకు యోగము, ఫకార భకార ములకు యోగము. ఇట్లు దశారయుగ్మము, రవియొక్క రశ్మిచక్రము. చతుశ్రము, బింబచక్రము. మతాంతరమందు - కకారాది ఠకారాంతము, అనులోమపఠిత ద్వాదశవర్ణముల తోటి భకారాది డకారాంతము విలోమపఠిత ద్వాదశవర్ణముల యొక్క యోగము. ద్వాదశ సూర్యకళల యొక్క ప్రకల్పనాపారంపర్యమున ప్రమేయ ప్రమాత్మకుడగు సూర్యునకు స్వరూపభూతములైన చతుర్వింశతి స్పర్శాక్షరము లందు కలదు. సగము ప్రమేయకోటి, సగము ప్రమాతృకోటి. ఉభయిపక్ష సమన్వయము వలన ద్వాదశకళా నిర్వర్తియని ఉపపత్తి ఉపపన్నమైనను, చక్రసంస్థానలక్షణము కుదర లేదని మాతృకాచక్ర మర్మవేత్తలగు మహానుభావులచేత ఉపేక్షింపబడినది.

మాతా దశేంద్రియమయో దశధా చ మేయం

ఉన్మేళనా ద్దశకళాత్మ దశారయుగ్మం |

అంతః కళాద్వయ మిహ ప్రకృతౌవిలీన

సై#్త్రగుణ్యమాతరి పుమాం శ్చతురస్రబింబే || 16

వెలుపల లోపల గ్రాహ్యగ్రహేతృపదవర్గ సమన్వయముచేత, కళలను యోజనచేయవలెనని, పూర్వసూత్రమున సూచించిరి. కళాయోజనప్రకారమును చక్రసంస్థానము చేత సంపాదించుచు మతాంతరమును ఆక్షేపాభిప్రాయము చేత స్ఫుటముగానుపదేశించుచున్నారు. బాహ్యమందు తవర్గ, టవర్గ ప్రతిపాద్య దశేంద్రియమయుడు, ప్రమేయము పదివిధములు. ఆ ప్రకారమే చవర్గ. కవర్గ ప్రతిపాద్యమైన శబ్దాది ఆకాశాది దశకరూపములు. వాటిమేళనచేత, యధా క్రమముగా కార్యవేద్య ప్రతిపాదకమైన కవర్గాక్షర పంచకముతో పాయ్వాది కర్మేంద్రియప్రతిపాదక టవర్గాక్షరపంచకము యొక్క మేళనము. ఇట్లే గంధాదిప్రతిపాదక చవర్గాద్యక్షర పంచకముతో ఘ్రాణాది ప్రతిపాదక తవర్గాక్షరపంచకముయొక్క మేళనము. రెండైదులు కలసి, దశకళాత్మకమైన దశార యుగ్మమగును. లోపల పవర్గరూపమైన ప్రమాతృపదమందు కళాద్వయము, కార్యవేద్యబీజభూత ప్రకృతి ప్రకృతిప్రతిపాదకమైన పకారముతోటి కర్మేంద్రియ బీజభూతబుద్ధి ప్రతిపాదకబవర్ణము యొక్క మేళనము. ఇది ఒకకళా. జ్ఞేయ వేద్యములకు బీజభూతమైన అహంకార ప్రతిపాదక ఫకారముతోటి జ్ఞానేంద్రియ బీజభూతమైన మనఃప్రతిపాదక ఛకారముయొక్క మేళనము. ఇది మరియొక కళా. కలసి రెండు కళలు. చతురక్షరములచే నిష్పన్నమైన కళాద్వయాత్మకమగు చతురస్రబింబమందు త్రిగుణములకు జనకమైన ప్రకృతియందు మకారరూపుడగు ఆత్మ లీనుడాయెను. అనగా, అహంకార సహితమైన ప్రకృతి యందు బుద్ధిమనస్సులయొక్క యే నిలయము కలదో ఆ నిలయనమే పురుషునియొక్క నిలయనమని పర్యవసానము. స్పర్శ వర్ణచక్రము ప్రమాణచక్రము గనుక, మనోబుద్ధిరూపము. ఈ చక్రమునందు పురుషునియొక్క సంస్థానముగాని స్వరూప మైన మకారరూపముగాని లేదు. ఐనను మనోబుద్ధులు పురుషునియొక్క రూపాంతరమగుటచే మకారరూపపురుషునకు ప్రమాణప్రమాతృ చక్రములయొక్క మధ్యవర్తిత్వము వలన ఉభయచక్రసంబంధమని, ప్రకృతి యందు పురుషుడు లీనమైనట్లు చెప్పబడినది.

మానాత్మమైన చిదచిత్థ్సితి రత్ర చక్రే

భేదాత్మకే నభవతీహ విసర్గబిందోః |

స్యానుషక్తి రపి ముఖ్య సమన్వయస్య

బింద్వేకభోగ పద మాతృపురోచితస్య || 1

పూర్వసూత్రముచే సూచింపబడిన మకారప్రతిపాద్య మగు పురుషతత్త్వమునకు ప్రమాణ ప్రమాతృరూపమగు ఉభయచక్ర సంబంధమును స్ఫుటము చేయుచున్నారు. భేదస్వరూపమైనది ప్రమాణచక్రము. ప్రమాణచక్రము గ్రాహ్యగ్రహీతృ భేదావిర్భావభూమి. కనుక దశారయుగ్మ రూపము. చతుర్దశారమువలె, అష్టారమువలె, ఏకచక్రము కాదు. అందువలన ప్రస్ఫుట భేద్యస్వరూపమైన ప్రమాణచక్ర మందు ప్రమాతృప్రమేయములయొక్క స్థితి ఇంద్రియరూపముచేతనే, ప్రమాణపర్యాయములైన ఇంద్రియములు గ్రాహ్య గ్రాహకరూపముచేతనే ప్రమేయప్రమాతృస్థితియనియర్థము. అదువలన ప్రమాణచక్రమందు స్వతః బిందుత్వముండగనే, విసర్గబిందులైన (భేదమయుడు కనుక నని తెలియవలెను) మకారప్రతిపాద్యపురుషునకు అనుషంగములేదు. చతుర్వింశ త్యక్షరాత్మకమైన ద్వాదశకళారూప ప్రమాణచక్రమందు ఇరువదియైదవదియగు పురుషస్థానక మకారమునకు సన్నివేశములేదు. ఆ మకారపురుషునకు ఈచక్రమందు సన్ని వేశ సంబంధము లేదా యనిన చెప్పుచున్నారు. ప్రమాణచక్రమందు ప్రాధాన్యముచేత సంబంధము కలవాడైనను ప్రకృతి వ్యాప్తినిబట్టి సంబంధమున్నను. ఇచట సన్నివేశము లేదని సమన్వయము. బిందువునకు ముఖ్యముగా భోగస్థానమైన అష్టారరూప ప్రమాతృపురమునకు ఉచితుడు. ప్రమాతలు ఇద్దరు గదా. అభేదానుసంధాత, భేదానుసంధాత. అందు మకారప్రతిపాద్యుడు భేదానుసంధాత గాన, మకారప్రతి పాద్యుడగు ప్రసిద్ధుడైన ప్రమాతృ ప్రమాతృపురసన్ని వేశము నకే తగును, గాని ప్రమాణపురసన్ని వేశముకు తగడు. ప్రమాణపురమందు ఆయన రూపాంతరములైన మనోబుద్ధులకే సన్నివేశము. మకారప్రతిపాద్యునకు ప్రమాణచక్ర మందు సంబంధము ఉన్నదనియే నిష్కర్ష.

స్వప్నేస్మృతం తదను జాగ్రతి సత్యకల్పం

బంధం ప్రవద్య వపుషా స్వవిమర్శశక్త్యా |

క్షిత్యా చ తత్పరవశో హృతమాతృభావో

మధ్యందిన ద్యుమణిరేష మకారబిందుః || 18

విసర్గవ్యాప్తి ప్రకరణమును ఉపసంహరించుచు, మొదటి నుండి, చిన్ని గరణరూపమైన ప్రకరణప్రమేయమును క్రోడీకరించుచున్నారు. స్వప్నమందు మనస్సుచే సంకల్పింపబడినది పిమ్మట జాగ్రతయందు దృఢమైన అనుభవము యొక్క ఆరూఢిచే పరమార్థమువలె భాసమానమగును. (పరమార్థమున గాదు.) అంతఃకక్ష్యయందు విమర్శింపగా నిర్వికల్ప చిదాత్మకుడైన శివుడు నిత్యనిరావరణముగా భాసించుటయే కారణము. వెలుపల భాసమానమగు ప్రవృత్తి రూప విమర్శ స్పందవిప్లవమంతయు చమత్కారమాత్రము, లోపల తన విమర్శశక్తి స్వరూపమైన ప్రకృతిపర్యాయముచేత వెలుపల పృథివికి స్వాధీనుడై బంధమును పొంది, ఆ రెంటికి పదవశుడై ఆ రెంటిచే హరింపబడిన ప్రమాతృభావము కలవాడై (ప్రమేయత్వమును పొందెనని భావము) మకారప్రతిపాద్యుడగు బిందువు (చిత్తత్వము పురుషుడని యర్థము) మధ్యాహ్న కాల సూర్యుడాయెను. ఏ ప్రకారముగా మధ్యాహ్న సూర్యుడు తన కిరణజాలముచేత ఆచ్ఛాదితుడై ప్రకాశింపడో ఆ రీతిగనే ఈ చిదాత్మ కూడ, విమర్శశక్తి యొక్క విజృంభణ రూపమైన అంతర్బహిప్రపంచముచేత, ఆచ్ఛాదితుడై తన మూలరూపమునకు విచారింపని వాడాయెను.

యత్పాదివర్గ వముఖార్గ చతుష్టయస్య

సంకోచవర్జన మిదం ఖలు తంత్రరీత్యా |

తుర్యస్థితం హముఖశాంత చతుష్టయాత్మ

యోజ్యం క్రమేణ బహిరంతర భేదసృష్ట్యాః || 18

ప్రకరణాంతమందు చిద్వ్యాప్తిరూపమైన ఉత్తర ప్రకరణప్రమేయమును సూచించుచు, ఈ జాగ్రచ్చక్రమందు స్వప్న చక్రమందు కూడ విసర్గ ప్రమాతకు ప్రతిసింహాసనమైన తుర్యజాగ్రత్స్వప్న రూపపదద్వయమును తంత్ర న్యాయముతో ఏకమాతృకచే భాసిల్లునట్లు ఉపపాదించుచున్నారు. విలోమముగా పవర్గాదిచతుష్టయమునకు యవర్గయందు, వకారదాది వర్ణచతుష్టయమునకు అనగా పవర్గ, తవర్గ, టవర్గ చవర్గ. రూప వర్గచతుష్టయమునకు ఏకక్రియచేత ప్రయోజనద్వయసిద్ధి రూపమైన తంత్రన్యాయముచేత ఈ శవర్గ. స్పృష్ట ఈష త్సృష్టతా ప్రయత్నకృతమైన సంకోచముయొక్క త్యాగము గదా. తుర్యమందు విలోమముగా హ మొదలుకొని శ, వర్గకు చతుష్టయాత్మక వర్గకదంబరూపము కలదు. అనగా పవర్గకు వకారమునకు, సంకోచత్యాగరూపము హకారము. తవర్గకు, లకారమునకు, సంకోచత్యాగరూపము నకారము. టవర్గకు, రేఫకు, అట్లు షకారము. అట్లే చవర్గకు, యకారము నకు, శ కారము. కవర్గ దేహప్రతిపాదక లకారము. విసర్గ ప్రమాతృరూపమగుట వలన చిద్వ్యాప్తి పదమందు దానికి చిత్స్వరూపమునందే అంతర్ధానము. పదద్వయమందు హకార మందే నిలనయము. అందుచే వాటికి సంకోచత్యాగరూప హకారాది శకారాంత వర్ణచతుష్టయము పదద్వయరూప మగుచు, క్రమముగా వెలుపల లోపల గలదు. అభేదసృష్టి ద్వయమందు భేదసృష్టియందు, అభేదసృష్టియందును (అనగా భేదజాగ్రతకు ప్రతియోగి అభేదస్వప్న పదమందు అని అర్థము.) దశారయుగ్మార్ధ పదమందు, అష్టారార్భపదమందును అని యర్థము. ఈరీతిగా యోజనచేయదగినది.

విమర్శానందనాధేన విరజానంద పుత్రేణ శ్రీమాతృకా

చక్ర వివేకే జాగ్రత్స్కంధస్య వాఖ్యేయ చతుర్థః

ఇతి శ్రీమాతృకాచక్ర వివేకమున జాగద్వివేకమను

చతుర్థ స్కంధము.

***

Sri Matrukachakra viveka    Chapters