Sri Bhagavatha kamudi    Chapters   

పదనొకండవ కిరణము

శ్రీ కృష్ణుడు భూభారము హరించటకై అవతరించియుంటచేత కురుపాండవ యుద్ధము ద్వారా దుష్టసంహారము చేసి, భూభారము చాలవరకు తగ్గించెను. కాని యాదవకులము అపరిమితముగా పెరిగినందును దానిని గూడ నశింపజేయుటకు ఒక ఉపాయము పన్నెను. ఒకనాడు మహర్షులు ద్వారకకు రాగా, దుష్టులైన కొందరుయాదువులు సాంబుడను వానికి గర్భిణీస్త్రీ వేషమువేసి వారిఎదుట నిలిపి, ఈమెకు ఏబిడ్డ పుట్టునని అడిగిరి. యాదవుల మోసము గ్రహించిన ఋషులు ఈమెకు యాదవకుల నాశకమగు ముసలము పుట్టునని చెప్పగా, ఆ శాపప్రకారము సాంబునకు ముసలము పుట్టెను. అంత యాదవులు పశ్చాత్తప్తులై రాజైన ఉగ్రసేనమహారాజునకు జరిగిన వృత్తాతంతమును విన్నవించిరి. హరిప్రభువు ఆదేశముననుసరించి ఆముసలమును అరగదీసి పొడిచేసి సముద్రములో కలిపిరి. ఆ చూర్ణము సముద్రతీరమున తుంగలై మొలిచెను.

యాదవులు మదోన్మతులై సురాపానముచే కై పెక్కిపరస్పర కలహములకు దిగి యుధ్ధముచేయగా ఆయుధములు అన్నియూ నశించగా, సముద్రతీరమున మొలిచిన తుంగలను పెరికి వాటితో కొట్టుకొనుచుండిరి అచ్చటికివచ్చిన బలరామ కృష్ణులు వారి కలహములను పరిష్కరింపబోగా వారు అవమానము పాలైరి అత బలరామకృష్ణులు ఆ తుంగలతో వారిని సంహరించిరి. ఇట్లు భూభారమంతయు హరించగా కృష్ణుడు సంతసించెను. యాదవులు ఆరగతీసిన ముసలము యొక్క చివరిములికి ఒకచేప మ్రింగగా దానిని పట్టుకొన్న జాలరి దాని కడుపులోనున్న ఆలోహపు శకలమును బాణాగ్రమునకు అమర్చుకొనెను. బలరాముడు తన అవతారప్రయోజనము పూర్తి అయినదని తలచి యోగశక్తి ద్వారా దేహమును విడచెను.

బ్రహ్మాదులు కృష్ణదర్శనమునకై ద్వారకకు వచ్చుట

ఒకనాడు బ్రహ్మాదిదేవతలును, మహర్షులునూ కృష్ణుని దర్శించుటకు ద్వారకకు వచ్చిరి. ఈశ్వరుడును భూతగణపరివృతుడై వచ్చెను. ఇంద్రుడు పరివారసమేతముగ వచ్చెను. వారందరూ సర్వసమృద్ధి సంపన్నమైన ద్వారకానగరమును చూచి, సర్వలోక మనోరంజకుడైన కృష్ణుని చూచి స్తుతించి ఆనందించిరి.

బ్రహ్మదేవుడు కృష్ణునితో ' సర్వేశ్వారా! మేము భూభారహారణార్థము ప్రార్థింపగా తమరవతరించి భూభారమునుహరించి ధర్మస్థాపన చేసితిరి మీ కీర్తి నలుదేసల వ్యాపించి సర్వలోక మలాపహాంబై విరాజిల్లుచున్నది. మీ అద్భుతపరాక్రమలీలలు రాబోవు కలియుగమందు మానవులందరకూ సంసారసాగరము దాటుటకు ఉత్తమ సాధనములు అగును. తాము అవతరించి యిప్పటికి నూటయిరువది ఏండ్లుగడచినవి. మీ అవతార ప్రయోజనము పూర్తి అయినది కనుక వైకుంఠమునకు విచ్చేసి మమ్ములను అని గ్రహింపప్రార్థన" అని కోరెను. కృష్ణుడు ' ఇ కనూ మిగిలిన కొన్ని కార్యములు నెరవేర్చి వైకుంఠమునకువచ్చెద' నని చెప్పి వారినిపంపివైచెను.

ద్వారకలో మహోత్పాతములు కలుగుటచూచి కృష్ణభక్తాగ్రేసరుడైన ఉద్ధపుడు, కృష్ణుని దర్శించి పూజించి ఇట్లు అడిగెను ' దేవదేవేశ్వరా! విప్రశాపమునకు ప్రతిక్రియచేయజాలియూ నీయాదవకులము నంతయూ ఉపసంహరించి, నీవీలోకమును త్యజింపబూనితివి. క్షణార్థమైననూ నీపాదపద్మములము విడిచి నేను మనజాలను. నన్నుగూడ నీ లోకమునకుగొనిపొమ్ము." అప్పుడు కృష్ణపరమాత్మ " ఉద్ధవా, బ్రహ్మదులందరూ నన్ను వైకుంఠమునకు రమ్మని ప్రార్థించిరి. నేను అవతరించిన కార్యము పూర్తియైనది. నేటికి ఏడవరోజున సముద్రమంతయూ ద్వారకను ముంచివేయును. ఆనాడే నేనీలోకముని వీడెదను. తదాది కలిప్రవేశమున ఈ లోకము నష్టమంగళమగును. నేను విడిచిన పిదప నీవు ఈ మహీతలమున నివసింపతగదు. కాన నీవు సర్వమునూ త్యజించి మనస్సును నాపై నిలిపి, ఇంద్రియములచేతను మనస్సుచేతనూ గ్రహింపబడు పదార్థమంతయూ మాయామయమనియూ, నశ్వరమనియూ ఎరిగి, జితేంద్రియుడవై, సమాహితచిత్తుడవై నాయందు ఈ జగత్తు నంతయూ చూడుము. అప్పుడు నీకు ఈ సంసారక్లేశము ఉండదు" అనగా ఉద్ధవుడు "తెలిసినది, కాని విషయాత్ములకు కామ త్యాగము, అహం మమాభిమానముల త్యాగము ఎట్లు సంభవించునో వివరింపుము." అని ప్రార్థింప కృష్ణుడు అవధూత - యదు సంవాదమును ఇట్లు చెప్పెను:

" పూర్వము ధర్మవిదుడయిన యదుడు ఒక అవధూతను గాంచి 'బ్రహ్మణోత్తమా నీవు ఒక్క కార్యమేని చేయక కేవలమూ జడోన్మత్తునిగా ప్రవర్తించు చున్నావు. కామ లోభముల వల్ల జనులందరూ సంసార సాగరమున కొట్టుకొనిపోవుచుండగా, నీవు అట్టి సంతాపమేమియు లేకుండ విషయ భోగ రహితుడవై ముక్తుడవై ఆత్మానందమున విరాజిల్లు చున్నావు. దీనికి మూలమేమి? చెప్పు మని ప్రార్థించెను. అంత నాఅవధూత' నాయీ ప్రవర్తనకు కారకులైన గురువులు పలువురుగలరు. వారు-పృథిని, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోతము, అజగరము, సముద్రము, పతంగము, మధుకరము, గజము, మధుహారి, హరిణము, మీనము, పింగళ, కురరము ఆర్భకుడు, కుమారి, శంకారుడు, సర్పము, ఊర్ణనాభము, పేశకారి, కీటము- అను ఇరువది నలుగురు. వీరి వృత్తులు పరికించి నేను ఆత్మ శిక్షణము చేసికొంటిని. 'పృథివి' వలన క్షమ నేర్చితిని. ఎన్ని భూతములు పృథివిని ఆక్రమించినను చలింపదు గదా. 'వాయువు' అనగా ప్రాణవాయువు. బాహ్యవాయువులను రెండు కలవు. ప్రాణవాయువు వలన మనోవైకల్యము లేకుండ దేహయాత్ర నడుపుచూ, విషయాసక్తిచే చిత్తవిక్షేపము పొందకుండ జ్ఞానము ఆర్జించవలెనని నేర్చుకొంటిని. బాహ్యవాయువు అనేక విషయముల కలిసియు వాని సంగము పొందకుంటచే నిస్సంగత్వము నిర్లేపత్వము అను విషయములు బోధపడినవి. 'ఆకాశము' అంతటను నిండియున్ననూ ఆయావస్తువుల వల్ల పరిచ్ఛిన్నము కాకుండటను బట్టి ఆత్మ, దేహాంతర్గతుడైననూ పరిచ్ఛిన్నుడు కాడని తెలిసికొంటిని. 'జలము' వలె ఇతరులకు పావనత్వము కలుగజేయ ననుకొంటిని 'అగ్ని' పర్వభక్షకుడయ్యూ తద్దోషములు గ్రహింపడు స్వతహా ఏ ఆకారము లేక, ఆయా ఉపాధుల వికారములు పొందినట్లుగా కనపడును గాని వాస్తవముగా ఏ ఆకారము లేదు నిరాకారమే అను విషయమును నేర్చుకొంటిని. 'చంద్రుని'కి వృద్ధిక్షయములు కలిగినట్లు కనపడిననూ అని చంద్రుని కళల కేగాని చంద్రునికి కాదు. అట్లే జన్మాది స్మశానాంత వాసనలు దేహమునకేగాని ఆత్మకు కాదని తెలిసినది. 'సూర్యుడు' తన కిరణములతో రసములు పర్జన్యరూపమున గ్రహించు విధముగా యోగి ఇంద్రీయముల ద్వారా విషయమును గ్రహించిననూ వాని వలమ ఎట్టి వికారమును పొందడనియు, సూర్య ప్రతిబింబము ఉపాధి వలన ఏర్పడునట్లు ఆత్మభేదము కూడ ఉపాధికృతమే గాని పార మార్థికము కాదు. ద్వంద్వారాముడు భార్యపుత్రులయందు అత్యాపక్తుడు 'కపోతము' వలె సపరివారముగా నశించునని నేర్చుకొంటిని, యదృచ్ఛాలాభ సంతుష్టమును 'అజగరము' వలన; ఎన్ని నదులు చేరిననూ హెచ్చులేక, చేరకపోయిన తగ్గుదల లేకుండినట్లు కామసమృద్ధి కలిగిననూ లేకుండిననూ హర్షభేదములు లేక సముడై యుండట సముద్రుని వలన తెలిసికొంటిని. స్త్రీ యొక్క స్వరూప వస్త్ర ఆభరణాదులచూచి ఇంద్రియ వశుడు కాకూడదని అగ్నిలో బడు 'మిడత'ను బట్టి అనాసక్తిని నేర్చితిని పువ్వులు నొవ్వకుండ ఇంచించుక మధురసమును గ్రోలు ' మధుకరము' వలె గృహస్థులకు ఎట్టి బాధ కలుగకుండ దేహయాత్రకై భిక్షఆచరించవలెనని నేర్చుకొంటిని, ఇంకనూ లభించిన దానిని అప్పుడే భుజింపవలెనుగాని రేపుమాపులకు కూడబెట్టరాదని 'మధుహారి'(తేనెటీగలు) కూడబేట్టిన తేనె వాటిని చంపియితరులు హరించుటను బట్టి తెలిసికొంటిని. ఆడఏనుగుపై వ్యామోహముతో మొగ ఏనుగు బంధమునకు లోనగుటను బట్టి ' ఏనుగు' వలన స్త్రీలుక లోబడ కూడదని; గానమునందు ఆసక్తివలన చెడిపోవునని ' లేడి' వలన; జిహ్వచాల్యము అనర్థదాయకమని 'మీనము' వలన; ఆశ అతి దుఃఖ హేతువని, నిరాశ అత్యంత సుఖప్రదమని ' పింగళి' యను వేశ్యా దృష్టాంతమున, ప్రియపదార్థ పరిగ్రహము శోక ప్రదమని దాని త్యాగము సుఖప్రదమని 'కురరము'ను బట్టి; మానావమానములను గృహాపత్యాది చింతను విసర్జించి 'బాలుని' వలె ఆత్మక్రీడియై ఆత్మరీతుడై మెలగవలెనని తెలిసికొంటిని. బాలుడును, పరమాత్మనెరిగిన మహాత్ముడును వీరిద్దరే నిశ్చింతులైన ఆనంద స్వరూపులు గదా!లోకములో పలువురితో కూడిన కలహము, ఇద్దిరితో కూడిన గోష్టి ప్రసంగము కలుగునని చేతికి ఒక్కగాజు మాత్రమే ఇంచుకొని మిగిలిన గాజులు తీసివేసిన ' కుమారి' దృష్టాంతమున తెలిసికొంటిని. బాణము వేయు నతడు దానిపై మనస్సు పెట్టి ప్రక్కన కోలాహలముగ రాజుగారు పోవుచున్ననూ ఎరుగని చందమున వైరాగ్య అభ్యాసాది యోగమున మనస్సును స్థిరీకరించి ఆత్మాను సంధానము చేయవలెనని శంకారుని' వలన; చీమలు పెట్టిన పుట్టలో పాము జేరిసుఖించునటుల నశ్వరదేహగృహములను నిర్మించుట విఫలమై ధుఃఖ హేతు వగునని 'సర్పము' ను బట్టి నేర్చుకొంటిని.

'ఊర్ణనాభము' (సాలీడు) తన నోట వెలువడిన తంతువులతో ఇల్లుకట్టి దానియందు విహరించి దానిని హరించు విధమున, మహేశ్వరుడు ఆత్మమాయాయోగమున జగమును సృజించి క్రీడించి లయించుకొనునను తెలిసికొంటిని. 'కీటభ్రమర' న్యాయమును బట్టి మనస్సు దేనియందు లగ్నము చేసిన తత్తత్‌ సారూప్యము పొందునని తెలిసికొంటిని. ఇట్లు ఈ ఇరువది నాలుగు గురువుల వలన గ్రహించితిని. జన్మ నాశము పొందునట్టియు. దుఃఖకారణమైనట్టి 'దేహము' యడ విరక్తి చెంది వివేకము నేర్చి దానియందు ఆసక్తి పరిహరించితిని.

అత్యంత దుర్లభ##మైన మనుష్యదేహమును పొంది అంత్యమైననూ మృత్యువువాత బడకముందు మోక్షయత్నము చేయవలెను' అని ఆ యదువునకు అవధూత బోధించెను."

ఈ విధముగ కృష్ణుడు ఉద్ధవునకు అవధూత-యదు సంవాదమును వినిపించి, " అహింసానియమములను శౌచాచారాది నియమములను యథాశక్తి సేవించి, జాయాపత్యగృహ-క్షేత్ర-బంధు-మిత్రాదులయడ ఉదాసీనుడవై గురువు నొద్ద శిష్యవృత్తిని మెలగి ఆత్మవిద్యను నేర్చుకొని దేహాదులయెడ వస్తుబుద్ధిని త్యజింపవలయును. స్వప్నము మిథ్యయగురీతి శోకమోహములను, సుఖదుఃఖములనూ మాయాకృతము లగుటచేత వాస్తవములు గావు. విద్య అవిద్య యను రెండు శక్తులు శరీరులకు బంధమోక్షముల గావించును. జీవునకు అవద్యాయోగమున అనాది బంధమును, విద్యవలన మోక్షము కలుగును. జీవేశ్వరు లిరువురును వృక్షముమీది పక్షులవలె దేహములోనున్ననూ దేహమునకు పృథక్‌ భూతులు. చిద్రూపత్వమున సదృశులు; యడబాయని ఏకమతులు అగుటచేసి సఖులు. వీరిలో జీవుడు వృక్షఫలతుల్యంబైన కర్మఫలమును అనుభవించక నిజానందతు%ృప్తుడై జ్ఞాపశక్తిచేత అధికుడైయుండును. ఆ ఈశ్వరుడు జీవుని ఎరుగును గాని జీవుడు ఈశ్వరుని ఎరుగనేరడు. అవిద్యాయుక్తుడైన జీవుడు నిత్యబద్ధుడు. విద్యామయుడైన ఈశ్వరుడు నిత్యముక్తుడు. జీవులలోను బంధముక్తి భేదము కలదు. ముక్తుడైన జివుడు దేహములో నుండిననూ దేహగత సుఖదుఃఖముల బడయడు . అవిద్వంసుడు దేహనిమిత్త సుఖదుఃఖభాగియై బద్ధుడగును. జీవుడుక ర్తృత్వాహంకారముకలిగినవాడగుటచే బద్ధుడైనాడు. కర్మ అన్యగతము కాని నాదికాదని విరక్తుడైన జీవుడు తత్‌ సాక్షియై ప్రవర్తించుటచేత బద్ధుడుగాక ముక్తుడైనాడు. ముక్తజీవుడు హింసాపూజలకు ఎట్టిమనోవికారము పొందక సమదర్శనుడై ఆత్మారాముడై జడునివలె నిస్సంగ నిర్లేపచర్యము తిరుగను. పాడిలేనిగోవు, దుష్టశీలయగుభార్య, దుష్టసంతానము, సత్పాత్రమున సమర్పించని ధనము. భగవత్‌ కథాప్రచారహినమైన వాక్కును దుఃఖపరంపరలకు కారణమగును. ఈవిధమున విచారముచేసి, ఆనాత్మభ్రాంతిని విసర్జించి నిర్మలమయిన మనస్సును సర్వగతుడైన నాపైనిలిపిన విరక్తుడు ముక్తుడునగును. మనమును నాఎడ నిశ్చలముగా నిలుపశక్తిలేనియడల, అఖిలకర్మలను నాయందు సమర్పించి ఫలాపేక్షలేకుండా కర్మలను ఆచరింపవలెను. లోకపావనములగు నాకథలు శ్రధ్ధగావినుచూ, పాడుచూ, చింతించుచుండునతడు నాపై స్థిరభక్తినిబడయును. అట్టిఉపాసకుడు నాసాయుజ్యమును పొందును.

అంతట ఉద్ధవుడు సాధులక్షణములను భక్తిలక్షణములను చెప్పమనగా కృష్ణుడిట్లు చెప్పెను: క్షమావంతుడుఅసూయాది దోషరహితుడు, సుఖదుఃఖసముడు, సర్వోపకారకుడు, అపరిగ్రహుడు, శాంతుడు దాంతుడు, షడూర్ములజయించినవాడు, జ్ఞానియగువాడు సాధువు అనబడును. మదాజ్ఞారూపమగు వేదమునందు శ్రధ్ధకలిగి, దృఢభక్తితోనన్నే భజించువాడును, సాధువనబడును.

భక్తి లక్షణములెట్టివనిన - మద్గుణానుకీర్తనమును, మదీయ జన్మాది వ్రతోత్సములను జరుపుట. తీర్థయాత్రలు, ఏకాదశ్యాది పర్వములయందు బలివిధానమును, నాకొరకై పూదోటలు పండ్లతోటలు పెంచుట, నాగృహములు దాసునివోలె ముగ్గులు పెట్టి అలంకరించుట, తనకు అత్యంతప్రియమైనదానిని మాకు నివేదించుటయు, భక్తి లక్షణములు. సూర్యుడు, అగ్ని, బ్రహ్మణుడు, గోవులు, విష్ణుభక్తుడు, ఆకాశము, వాయువు, జలము, భూమి, ఆత్మ అనునవి నాపూజాస్థానములు, సమాహితుడై నన్నే పూజించునతడు, నా భక్తినిబడసి, నాజ్ఞానమునుపొంది తరించును. సత్సంగముతో కూడిన భక్తియోగమే సంసారతరణముకు సాధనము. సత్సంగము నన్ను పళీకరించునట్లు ఏ యితర సాధనము పళీకరింపదు. ప్రహ్లాదుడు, బలి, విభీషుణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు జటాయువు, తులాధారుడు, ధర్మవ్యాధుడు, కుబ్జ, వ్రజగోపికలు వీరందరూ ఆ యా యుగములందు సత్సంగమముననే పొందగలిగిరి. సత్సంగసముపాత్తమైన కేవల ప్రేమచేతనే గోవులు, గోపికలు, పలువురు మూఢాత్ములు నన్ను పొందిరి. గోపికలు నాపై కామముతో నన్ను ఎరుగక పోయినను సత్సంగముననే ముక్తిగాంచిరి.

ఈ సంసార వృక్షమునకు పుణ్యపాపములు రెండూనూ బీజములు, అపరిమితమైన వాసనలు మూలము, సత్వాది గుణములు మూడును ప్రకాండములు, పంచభూతములు, స్కందములు, శబ్దస్పర్శరూపరసగంధములు తత్ప్రసరములు, ఏకాదశేంద్రీయములు దానశాఖలు. జీవపరమాత్మ స్థానము గూడు. సుఖదుఃఖములు రెండునూ ఫలములు. వాటిలో దుఃఖఫలమును కాముకులైన గృహస్థులు అనుభవించెదరు. సుఖాత్మఫలమును వివేకులైన సన్యాసులు అనుభవించుదురు. పరమాత్మ ఒక్కడయ్యు మాయచే బహురూపములతోచును. ఈ విధముగా గురుసేవార్జితమైన జ్ఞానభక్తిచేకలుగు జ్ఞానకుఠారముచే జీవోపాధియగు లింగ శరీరమును దునిమి పరమాత్మనుపొందును"

ఇంకనూ కృష్ణుడు ఉద్ధవునికి ఈ ప్రకారముగా కూడ బోధించెను. సత్వరజస్తమములు ప్రకృతి గుణములేకాని ఆత్మగుణములు కావు. సత్వమును పృద్ధిచేసుకొన్న యెడల, మద్భక్తిలక్షణమైన ధర్మముదయించును. సాత్విక పదార్థసేవనము వలమ సత్వగుణము వృద్ధిపోందును. అంతట రజస్తమములు తొలగి అధర్మము నశించును. పెద్దలుమెచ్చునది సాత్విక ప్రవృత్తి. వారు నిందించునది తమాసము. వారు ఉపేక్షించునది రాజసము సాత్వికములనే సేవించిన సత్వగుణవృద్ధి. ధర్మవృద్ధియై చిత్తశుద్ధి గలిగి ఆత్మజ్ఞానము కలుగును.

పూర్వము బ్రహ్మమానసుపుత్రలైన సనకాదులు ఆత్మతత్వమును ఎరుగకోరి హంసరూపముననున్న నన్ను కోరగా ఇట్లు చెప్పితని - ప్రపంచము నంతనూ స్వప్నపదార్థమువలె భావించవలెను. దేహాదిభావములు మిధ్యకావున తత్కృత వర్ణాశ్రమాది భేదములను స్వర్గాది ఫలములును, కర్మయును మిధ్య యగును. జాగరమునందు బాల్య¸°వనాది ధర్మములను ఆనుబవించు నతడు, స్వప్నములందు వాసనామయ విషయములను ఆనుభవించు వాడను, సుషుప్తయందు వానినెల్ల ఉపహరించు నతడును, విశ్వతైజసప్రాజ్ఞ నామముల జరుగుచు అవస్థాత్రయ సాక్షియైన ఒక్కడేయగునుగాని పలువురు గారు. గుణకృత్యములైన ఈ మూడు అవస్థలునున నాయందు అవిద్యాకృతములేకాని తాత్వికము కావని నిశ్చయించి సర్వపంశయమూలమైన అహంకారామును దునిమి, హృదయస్థడయిన నన్ను భజింపుడు. దృశ్యము నుండి దృష్టిని తొలగించి, నిర్వ్యాపారుడు, నిజసుఖానుభవమాత్రుడు కావలయును. మదిరామదాంధుడు తన దేహముపై వస్త్రము వున్ననూ లేకున్ననూ ఎరుగని విధమున, తన జ్ఞానసాధనమైన దేహమున్ననూ నశించిననూ తెలియదు. దేహము మాత్రము ప్రారబ్ధకర్మాంతమువరకూ నుండును. సమాధిపర్యంత యోగారూఢుడు ఈ దేహమును స్వప్న తుల్యముగా చూచును. ఇట్లు హంసరూపముతో నున్న నేను, సనకాదులకు రహస్యముల తెలియ జేసితిని.'' అని చెప్పెను.

తరువాత ఉద్ధవుడు భక్తియోగమును చెప్పమని కృష్ణుని అడుగగా ఇట్లు చెప్పెను :

సృష్ట్యాదియందు నేను వేదమును బ్రహ్మకు బోధించితిని బ్రహ్మ తన పుత్రుడైన మనువునకు, అతని వలన సప్తమహర్షులు గ్రహించిరి. వారి వలన మనుజులు గ్రహించిరి. వారివారి ప్రకృతులు నానా విధములుగ నుండుటచే, వారందరునూ వేదములను చిత్రవిచిత్రముగా సమన్వయించుకొనిరి అందుచే కొందరు పాషండులైరి. కొందరు కర్మఠులై నిత్యనైమిత్తిక కర్మమే శ్రేయోమార్గమని వచించిరి. కొందరు కీర్తి సంపాదనమును కీర్తించిరి. కొందరు కామాత్ములైరి. కొందరు సత్య, దమ, శమముల నవలంబించిరి. కొందరు ఐశ్వర్యము పురుషార్థమని గ్రహించిరి. కొందరు నాస్తికులై భోగముల నాశ్రయించిరి. ఈ మార్గము లన్నియూ శోకగ్రస్తములు, ఆద్యంతవంతములు అయివున్నవి. అట్లుగాక నాపై మనస్సు నిల్పిన నిష్కామునకు పరమానంద రూపుడనగు నావలన నిత్యసుఖానుభవము కలుగును. అట్టి సుఖము విషయాత్మున కెట్లు కలుగును ! నాపై మనస్సు నిల్పునతడు బ్రహ్మలోకమునుగాని యింద్రలోకమును గాని తుదకు మోక్షమును గాని కోరక నున్న మాత్రమే కోరును. నా భక్తుడు విషయభాదలకు అతీతుడు. నాయందు భక్తి పాపముల నిర్మూలించును. భక్తివలన నన్ను పొందినట్లు ధర్మము, సాంఖ్యము, యోగము, తపము, త్యాగము నన్ను పొందించలేవు. నేను ఒక్క భక్తికే గ్రాహ్యుడను. అంత్యజుడైననూ నాయందు భక్తి కలిగెనేని పవిత్రుడగును. సత్యదయోపేతమైన ధర్మముగాని, తపోయుక్తమైన విద్యగాని, మద్భక్తిరహితుని పావమని చేయనేరవు. దేహము గగుర్పాటు చెందుట, ఆర్ద్రచిత్తము, ఆనందబాష్పములు నా భక్తికి లక్షణములు. భక్తి లేకున్న చిత్తశుద్ధి ఎట్లు కలుగును ? వాక్కు తద్గదికముకాగా, చిత్తము కరుగగా, ఒకచో ఆడుచూ ఒకచో పాడుచూ నా భక్తిచే దేహము నెరుగనివారు లోకమును పవిత్రము చేయుదురు. అగ్నిపుట శోధితమైన బంగారము మలమును బాసి స్వస్వరూపమును పొందు చందమున, మద్భక్తిశోధితమైన చిత్తము కర్మ వాసనలుబాసి, నారూపమును పొందును నా పుణ్యకథాశ్రవణ కీర్తనముల వలన చిత్తము శుద్ధికాగా తత్వ సూక్ష్మము తెలియబడును.

విషయముల చింతిచు వాని చిత్తము సక్తమగును. నన్ను ధ్యానించువాని చిత్తము నాలో లీనమగును. కావున అసద్విషయ చింతనము మృషయని నిశ్చయించి చిత్తము నాపై నిలుపుము. కాంతాకనకముల సంగమును దూరముగా త్యజించి, ధీరుడై విజన ప్రదేశమున కూర్చుండి నన్ను ధ్యానింపవలెను.

కల్పాదియందు కృతయుగమున నరుల వర్ణము హంసాఖ్యమై జన్మమాత్రమున జనులు కృతకృత్యులైరి. కావున ఆయుగము కృతయుగమనబడెను. అపుడు ఋగ్వేద మొక్కటే. జనులు తపోనిష్ఠులై పాపరహితులై నన్ను ఉపాసించెదరు. పిదప త్రేతాయుగమున నా హృదయమునుండి వేదత్రయము ఆవిర్భంచగా నేను వేదపురుషడనైతిని. అపుడు విరాట్‌ పురుషుని ముఖమువలన బ్రాహ్మణులు, బాహువుల వలన క్షత్రియులు, ఊరువులవలన వైశ్యులు, పాదమువలన శూద్రులు జనించిరి. ఇంకనూ నా జఘనభాగము వలన గార్హస్థ్యము, హృదయము వలన బ్రహ్మచర్యము, పక్షస్థలము వలన వానవ్రస్థము, శీర్షమువలన సన్యాసాశ్రమము ఉదయించెను. ఇట్లు నరులకు వర్ణాశ్రమ ధర్మములేర్పడెను. శమము, దమము, తపము, శౌచము, సంతోషము, శాంతి, ఆర్జవము, మద్భక్తి, దయ, సత్యములు బ్రాహ్మణ ధర్మములు, తేజము, బలము, ధైర్యము, శౌర్యము, తితీక్ష, ఔదార్యము, స్థైర్యము అనునవి క్షత్రియ దర్మములు. ఆస్తిక్యము, ధన సంపాదన, దాననిష్ఠ, అదంభము, విప్రసేవయనునవి వైశ్య ధర్మములు. మాయారహితమైన దేవబ్రాహ్మణ, గోపరిచర్య లబ్ధసంతోషము అనునవి శూద్రధర్మములు. అశౌచము, అనృతము, నాస్తికత్వము. చౌర్యము, కామము, క్రోధము అనునవి అంత్యజ ధర్మములు. అహింస, సత్యము, అస్తేయము, అకామ క్రోధలోభత్వము, భూత ప్రియహితచింత అనునవి సర్వవర్ణ సాధారణ ధర్మములు

బ్రహ్మచారి ధర్మములు

ఉద్ధవుడు నాలుగు ఆశ్రమముల ధర్మములను చెప్పమనగా శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పెను: బ్రాహ్మణుడు ఉపనయనముతో ద్వితీయ జన్మను పొంది, గురుకులమున నివశించి, మౌంజి కృష్ణాజినము, దండము, ఉపవీతము, కమండలములను ధరించి, జటలుదాల్చి మితభాషియై వేదాధ్యయనము చేయవలెను. దంతధావనమును వస్త్రశోధనమును చేయరాదు. స్నాన భోజన హోమ జపముల చేయునపుడును, మూత్రపురీషోత్సర్గము చేయునపుడును భాసింపరాదు. కక్షోపస్థరోమ నఖచ్ఛేదము చేయరాదు. రేతోవిసర్గము చేయరాదు. రెండు సంధ్యలయందును మౌనియై శుచియై గాయత్రిని జపింపవలెను అగ్ని, అర్క, ఆచార్య, గో, విప్ర, గురు, వృద్ధ, సురులను ఉపాసింపవలెను. గురుడు సర్వదేవమయుడు కావున సాయం ప్రాతర్వేళల భిక్షాన్నము తెచ్చి గురువునకు నివేదించి, వారి అనుమతితో భుజింపవలెను. ఇంకేది లభించినను, గుర్వాజ్ఞపొంది ఉపయోగించుకొనవలెను. ఇట్లు ఆచార్య శిశ్రూష చేయుచు, భోగవర్జితుడై విద్య పూర్తి చేసుకొనవలయును. బ్రహ్మలోకము సాధింప కోరెనేని నైష్ఠికుడై యుండవలెను. సర్వభూతముల యందు పరమాత్ముడనగు నన్ను ఉపాసింపవలెను. స్త్రీల దర్శన, స్పర్శన, సల్లాపపరిహాసాదుల చేయరాదు.

ఇంకనూ సర్వాశ్రమ సాధారణ ధర్మము లెవ్వియన : శౌచము, ఆచమనము, స్నానము, సంధ్యోపాసనము, నన్ను పూజించుట, తీర్థయాత్రలు, జపము, అస్పృశ్య, అభిక్ష్య, అనుభాష్యవర్జనము, సర్వభూతములయడ మద్భావము. మనోవాక్కాయ సంయమ మను ఈవియమములు సర్వాశ్రమ సాధారణములు. ఇట్టి బ్రహ్మచార గృహస్థాశ్రమము గ్రహింపదలచునేని గురువునకు దక్షిణ సమర్పించి గుర్వాజ్ఞగొని, సమావర్తన మొసరింపవలెను తరువాత యిచ్ఛానుసారముగ నేయాశ్రమముగాని క్రమమున ఆశ్రమమునుండి ఆశ్రమాంతరమునుగాని స్వీకరింపవలయును ఉత్తరోత్తరాశ్రమ గ్రహణానంతరము, పూర్వ పూర్వాశ్రమములకు రాతగదు.

గృహస్థధర్మములు

పైన చెప్పిన విధమున బ్రహ్మచర్యాశమము పూర్తి చేసి, గృహస్థాశ్రమము స్వీకరించుటకు, తనకు తగిన సమవర్ణములో పుట్టినదియు, వయస్సున చిన్నదియు, యోగ్యలక్షణములు గలదియూ అగుకన్యను వవాహమడవలెను. ద్విజుల కందరకూ యజన, అధ్యయన, దానములు దర్మములు. యాజన, అధ్యాపన, ప్రతి గ్రహములు బ్రాహ్మణులకు మాత్రమే విహితములు. ఇవి బ్రాహ్మణులకు జీవనార్థము ఏర్పాటు చేయబడినవి. ప్రతి గ్రహము వలన తపస్సు, తేజస్సు క్షీణించును గనుక ప్రతి గ్రహము మాని, యాజన అధ్యాపనములచే జీవించ వచ్చును. వాటి వలన గూడ కొంత దోషము సంక్రమించునని తలచిన యడల పొలములలోనూ, మార్గములోనూ పండుగింజలను ఏరుకొని శిలోంచ్ఛవృత్తులచే జీవింప వచ్చును. బ్రాహ్మణ దేహము క్షుద్రకామార్థము కాదు. తపస్సు మున్నగు సాధనముల నవలంబించి పరలోకమున అనంత సుఖముల కొరకు ఏర్పడినది. సర్వప్రజలను రాజు తండ్రివలె పోషించి ఉద్ధరించి తనను తాను ఉద్ధరించుకొన వలెను. అట్లువర్తించురాజు సర్వపాపరహితుడై స్వర్గమునకేగి, ఇంద్రుని తోడ భోగము ననుభవించును. వైశ్యుడు విక్రయార్హ వస్తువులనే అమ్మి వ్యాపారము చేయవలెను. క్షత్రియుడును, వైశ్యుడును నీచసేన నెప్పుడును చేయరాదు అసత్సమయమున నవైశ్యులనకు శూద్రవృత్తియు శూద్రునికి నీచవృత్తియు చేయతగును కాని ఆపద తీరిన తరువాత ఆ వృత్తిని చేయతగదు

దేవ, ఋషి, పితృ, భూత, మనిష్యులు నా రూపులే గనుక వారిని గృహస్థుడు పంచయజ్ఞములచే తృప్తిపొదింపవలెను. కుటుంబ పోషణము చేయుచున్ననూ మమకారముతో నుండక తత్వమను విమర్శించి ప్రపంచము నందు వైరాగ్యము కలిగి, గృహమున అతిథిరీతి వసించుచు, మమతాహంతలు లేకుండ ప్రవర్తించునతడు బద్ధుడు కాక ముక్తుడగును. గృహస్థోచిత కర్మముల నన్ను భక్తితో పూజించి క్రమముగ వనప్రస్థుడై సన్యాసాశ్రమము స్వీకరింపవచ్చును. అంతియకాని గృహస్థుడై పుత్రవిత్తైషణాతురుడై స్త్రీలోలుడై యండతగదు.

వానప్రస్థధర్మములు

వానప్రస్థాశ్రమమునకు పోదలచిన యడల భార్యను పుతులయొద్ద నుంచిగాని లేక తనతోడ తీసుకొనగాని వనమునకు జని శాంతుడై భక్ష్యములైన వన్య కందమూల ఫలముల సేవించుచు, నారచీరలుగాని, తృణపర్ణాజినములు గాని ధరించి, కేశ, రోమ, సఖ, శ్మశృవపనము మాని కాలత్రయమున స్నానమాచరించుచు, భూమి మీదనే శయ నించుచు, శీతాతపముల సహించుచూ తపస్సు చేయవలెను. కాలాంతరమునకై కూడబెట్టరాదు. చరుపురోదాశముల నేర్పరచి, కాలచోదితములైన ఆగ్రయణాదులొనర్పవలెను. శ్రౌతపశుబంధము తగదు. అగ్నిహోత్ర, దర్శపౌర్ణమాశి, చాతుర్మాస్యలను వన్య ద్రవ్యములచే చేయవలెను. ఇట్టి తపస్సు చేసి కృశించిన శరీరముతో నన్నారాధించి ముక్తిని పొందును. ఇట్లు కష్టార్జితమైన తపస్సును మోక్షమునకు ఉపయోగించుకొనవలెను గాని అల్పకామములకు వినియోగించరాదు.

సన్యాసధర్మములు

కర్మఫల రూపమయిన లోకాంతరములెల్ల, దుఃఖోదర్కములు, అనిత్యములు అనిగాఢ వైరాగ్యము నొంది అష్టశ్రాద్ధములను, ప్రాజాపత్యేష్టిని గావించి ఆత్మయందు అగ్నులనారోపించి సన్యసింపవలెను. సన్యసించు విప్రునకు దేవత లనేకవిఘ్నము లాచరించిననూ లోబడ కూడదు. కౌపీన అచ్ఛాదనము మాత్రము కట్టవలెను. దండ కమండలములు మాత్రమే ఉంచుకొన వలెను. దృష్టిపూతముగా అడుగు పెట్టవలెను. వస్త్రపూత జలమును త్రాగవలెను. సత్యపూతవచములనే పలకవలెను. మనఃపూత కార్య మొనర్చవలెను. వేణుదండమునకు తోడు వాగ్దేహ చిత్తములకు మౌనమనీహ ప్రాణయామ దండములు స్వీకరింపవలెను. అభిశస్త ప్రతితులుకానివారి యిండ్లకు మధుకర భిక్షకరిగి, లభించిన దానిని సంతోషముతో స్వీకరించి ఊరివెలుపలనున్న జలాశయమును కరగి ఆ భిక్షాన్న మును కడిగి మౌనియై కొంత భూతములకు విభజించిపెట్టి మిగిలినది భుజింపవలెను. నిస్సంగుడై నియమితేందియుడై నాతో అభేదమున నుండును. సర్వకామవిరక్తుడై ఆత్మసుఖలాభం బెనసి మద్భావమున చరింపవలెను. దృశ్యమెల్ల నశ్వరము గావున ఈ జగమెల్ల మిధ్యని నిశ్చయించి, పరిత్యజించి, మరి తలపక, విరక్తుడై జ్ఞానిష్టుడైయుండవలెను. అట్టి పరమహంసయతి విద్యాంసుడయ్యూ బాలునివలె, జడునివలె, ఉన్మత్తునివలె సంచరింపవలెను.

పాషండాభినివేశము, కేవలతర్కనిష్ఠయు, శుష్క వాద వివాదమును, సన్యాసినికి తగవు. జనులకు తాను వెరుపరాదు. జనులకు తాను విరుపు కలిగింపరాదు. ఎవరినీ అవమానింపరాదు. ఎవరితోనూ వైరము కూడదు. తనయందఖిల భూతములనూ, సర్వభూతములయందు తననూ చూడవలెను. భిక్షాన్నము లభించెనేని హర్షింపరాదు. లభించకుండెనేని విషాదము నొందరాదు. లాభాలాభములు రెండునూ దైవయంత్రితములని శాంతితో నుండవలెను. ప్రాణధారణకు మాత్రమే ఆహారము కోరవలెను. యదృచ్ఛాలబ్ధమైన అన్నము శ్రేష్టమైనపూ కాకున్ననూ గ్రహింవలెను. అట్లే వస్త్రశయ్యాదులు లభించిన వానిని గొనవలెను. అట్టి వానిని భేదప్రతీతియెల్ల నా జ్ఞానమున నశించును. ఇది విద్యత్‌ సన్యాస లక్షణము. వివిదిషుడైన సన్యాసి గురువు నుసాసించి అసూయారహితుడై బ్రహ్మజ్ఞానము కలుగునంతవరకూ గురు సేవ చేయవలెను. శాంతి, అహింస భిక్షుధర్మములు తపస్సు వానప్రస్థుని ధర్మము. భూతరక్షణ, యజ్ఞములు గృహస్థుని ధర్మములు. గురుసేవ బ్రహ్మచారి ధర్మము. నన్ను ఉసాసించుట సర్వాశ్రమ ధర్మము ఈ విధముగా స్వధర్మమున అనన్యభక్తుడై నన్ను భజించువాడు సర్వభూతములయెడ మబ్భావము కలిగి జ్ఞానవిజ్ఞాన సంపన్నుడై నన్నుపొందును. జ్ఞాని నాకు ప్రియతముడు. కావున ఉద్ధవా జ్ఞానపర్యంతము ఆత్మ నెరిగి జ్ఞానవిజ్ఞాన సంపన్నుడవై భక్తిభావితుడవై నన్ను భజింపుము.

పూర్వము ధర్మరాజు యుద్ధానంతరము సర్వబంధు నాశము వలన కలిగిన దుఃఖమును పోగొట్టుకొనుటకు భీష్ముని ఆశ్రయించగా భీష్ముడు చెప్పిన ధర్మములు నీకు చెప్పెద వినుము. కార్యకారణాత్మకమైన జగమంతయు పరమకారణాత్మకముగాని తత్‌భిన్నముకాదని తెలిజేయునది మదీయ జ్ఞానము. బ్రహ్మలోకపర్యంత లోకములెల్ల నశ్వరములని, దుఃఖకారణములనియు విమర్శించి వైరాగ్యమును పొందవలెను. మదీయ కథామృతములై శ్రద్ధ, సంతతము నన్ను కీర్తించుట, నాపూజయందు నిష్ఠ, నన్నుస్తుతించుట, పరిచర్య చేయుట, సర్వాంగముల మ్రొక్కుట, నాభక్తుల పూజించుట, సర్వభూతములందు మద్భావన, మదర్థవ్యాపారము, నా గుణగానము, మనస్సు నాపై సర్పించుట, సర్వకామవిసర్జనము-ఇవి యన్నియు మద్భక్తి కారణములు. మద్భక్తిని కలిగించునది ధర్మము. ఏకాత్మదర్శనము జ్ఞానము. గుణాసంగమము వైరాగ్యము.

యమనియమాదుల చెప్పుట

అహింస, సత్యము, ఆస్తేయము, అసంగమము, లజ్జ, అసంచయము, ఆస్తికత్వము, బ్రహ్మచర్యము, మౌనము, స్థైర్యము, క్షమ, అభయము అనునవి పన్నెండు యమములు. బాహ్యాశౌచము, అభ్యంతరశౌచము, జపము, తపము, హోమము, శ్రద్ధ, అతిథ్యము, మదర్చనము, తీర్థాటనము, పదార్థప్రయత్నము, తుష్టి, ఆచార్యసేవ యను నీ పండ్రెండు నియమములు.

నాయందు నిష్ఠశమము ; ఇంద్రియసంయమము దమము; దుఃఖసహనము తితీక్ష; జిహ్వోపస్థాసురాత్యాగము ధృతి; భూతద్రాహవర్జనము దానము; కామత్యాగము తపస్సు; వాసనాజయము శౌర్యము, బ్రహ్మాలోచనము సత్యము; సూనృతవాక్కులు ఋతము; కర్మాసంగమము శౌచము; సన్యాసము, త్యాగము; మద్భక్తి యుత్తమ లాభము; ఆత్మయందు భేదనిరాసము విద్య; సుఖదుఃఖాను సంధానము సుఖము; గ్రామ్య సుఖాపేక్ష దుఃఖము; బంధమోక్షనిదుడు పండితుడు; దేహాది అహంభావవంతుడు మూర్ఖుడు; నన్ను దెలుపు నివృత్తి మార్గమే మార్గము. చిత్తవిక్షేపము ఉన్మార్గము; సత్వగుణోదయము స్వర్గము; తమోగుణోద్రేకము నరకము. మద్రూపుడైన గురువు బంధువు; మనుష్యశరీరము గృహము; గుణవంతు డాధ్యుడు; అసంతుష్టుడు దరిద్రుడు; అజితేంద్రియుడు కృపణుడు; గుణ దోషదర్శనము దోషము; ఉభయవర్జనము గుణము.

జ్ఞానయోగ, భక్తియోగ, కర్మయోగములు మోక్షమునకు సాధనము, కర్మములయెడ నిర్వేదము నొందిన సన్యాసులకు జ్ఞానయోగము. నిర్వేదము పొందని ఫలకాములకు కర్మయోగము. నిర్వేదము పొందక ఫలమునందు అత్యంతాసక్తి లేక నా కథలపై శ్రద్ధకలవారనికి భక్తియోగము. మనుష్యదేహము పురుషార్థ సాధకమైననూ మరణ ధర్మము కలది కనుక జీవించి యుండగనే పురుషుడు అప్రమత్తుడై మోక్షము కొరకు ప్రయత్నము చేయవలెను. సంసారసాగరమును దాటుటకు నావవంటి మనుష్యదేహమును పొందియూ సంసారసాగరమును దాటనివాడు ఆత్మఘాతకుడు. ఇంద్రియములను జయించి, సాత్విక బుద్ధిని వృద్ధి చేసుకొని మనస్సు ఆత్మవశము చేసుకొనవలెను. మనోనిగ్రహమే పరమ యోగము. నిర్విణ్ణుడు. విరక్తుడు అయిన జిజ్జాసువు యొక్క మనస్సు తత్సర్యాలోచన వలన దేహాద్యభిమానము త్యజించును. క్రమముగ కల్మనివృత్తియే వేదతాత్పర్యము. నా కథలయందు శ్రద్ధగలవాడై భక్తిశ్రద్ధలతో దృఢనిశ్చయముతో నన్ను భజింపవలెను. అట్టివారికి హృదయగత కామమెల్ల నశించును. ప్రాణతర్పణపరులు జగత్కారణము, జగదాత్మకుడునగు నేను తమహృదయములో నున్ననూ తెలిసికొనలేరు. యజ్ఞముల దేవతల నారాధించి స్వర్గమున సుఖించి, అంతమున ఉత్తమకులమున పుట్టి సుఖింతురని ప్రోరోచనార్థక వేదవచనముల పరమార్థము అరయని వారికి నా వార్తయే రుచింపదు. వేదము కర్మకాండమునందు యజ్ఞరూపమున నన్నే విధించును. దేవతాకాండమున ఆయా దేవతారూపమున నన్నే బోధించును. జ్ఞానకాండమున ఆకాశాది ప్రపంచమును వికల్పించి, పిదప తదపవాద పూర్వకముగ నిన్నే బోధించును. సర్వమూ నేనేకాని ఇతరములేదు. పరమార్థరూపుడగు నన్నాశ్రయించి భేదము మాయామాత్రమని నిషేధించి ప్రసన్నమగును. ఇదియే సర్వవేద పరమార్థము.

ఇట్లు బోధించిన తరువాత కృష్ణుడు ఉద్ధవునకు జ్ఞానయోగ ప్రకారమును, యోగసిద్ధులను ఆత్మవిభూతులను విశదీకరించి ప్రకృతిపురుష వివేకమును బోధించి భిక్షగీతను ఇట్లు చెప్పెను.

భిక్షుగీత

''పూర్వము అవంతిదేశమున ధనవంతుడైన భ్రాహ్మణుడొకడు, లుబ్ధడై కామియై, కోపిష్టియై, భగవంతుని స్మరింపక దుశ్శీలుడుకాగా, భార్యాపుత్రాదు లందరూ అప్రియులైరి క్రమముగా కష్జార్జిత ధనమంతయూనశించెను. అంతట చింతాక్రాంతుడై 'నేను అన్ని పురుషార్థములకు చెడితిని. రవ్వంతయును సుఖానుభవము లేదు. లోభము అన్ని మంచిగుణములను చెరచును. ధనుమార్జించుటలోనూ, వృద్ధిచేయుటలోనూ అనేక శ్రమలకు లోనైతిని. ఆ ధనమును వెచ్చించిన తరగిపోపునని భయపడితిని. స్తేయము, హింస, అనృతము, దంభము, కామము క్రోధము, స్మయము, మదము, భేదము, వైరము, అవిశ్వాసము, స్పర్ధ, స్త్రీ, ద్యూతము, మద్యము అను ఈ పదనేనును అనర్థములు. కావున యిట్టి అనర్థాద్యంబైన శ్రేయస్కాములు దూరమున త్వజింపవలెను. అన్నదమ్ములు, భార్య, స్నేహితులు, బంధవులు, అందరూ ధనము వలన శత్రువులగుదురు. బ్రాహ్మణజన్మ ఎత్తియూ, బ్రాహ్మణ ధర్మములను ఆదరింపక స్వార్థమున పోగొట్టుకొనువారు నరకమున పడుదురు. స్వర్గాపవర్గములకు ద్వారమైన బ్రాహ్మణజన్మను పొందియు, అనర్థ హేతువైన ధనమునకు దాసుడగుట బుద్ధిహీనత, ఇపుడు నేను ముదుసలి నైతిని. ఏమి సాధింప గలను ? భగవంతునికి నాయందుగల ఏ అనుగ్రహలేశము వలననో నాకిపుడు నిర్వేదము కలిగినదిగదా! మిగిలిన కాలము ఆత్మతుష్టుడనై పూర్తియైన వైరాగ్యముతో అహంకారాదులను పరిహరించి శాంతుడనై, మునినై, భిక్షపయ్యెదను' అని అతడు భిక్షార్థము నగర గ్రామముల సంచరించుచుండగా దుర్జనులు అతనిని అనేక విధముల పరాభవించిరి కొందరు అతని దండము నెత్తుకొనిపోయిరి. కొందరు కమండమును, ఆసనమును, జపమాలను ఎత్తుకొని పోయిరి. ఒక నదీతీరమున భిక్షాన్నము భుజింపుచుండ, తలమీద ఉమ్మి, మూత్రవిసర్జనచేసి పరాభవించిరి. అతడు మౌనముతో నుండగా పలకరింతురు. పలకకుండిన కొట్టుదురు. ఈతడు ధనమును కోల్పోయి, స్వజనులు నరిసిప బ్రతకజాలక సన్యాసాశ్రమును స్వీకరించెనని హేళనచేసి తిట్టు చుండిరి. అతని ధ్యానము ఒకధ్యానమని పరిహసించిరి. ఈవిధముగ సంభవించిన పరిభవాది దుఃఖమును, దేహకృతజ్వరాది బాధలను, శీతోష్ణాదిదుఃఖములను అతడు ఓర్చుకొని ధైరముతో యిట్లు భిక్షుగీతమును చెప్పెను. 'ఈ జనులును, ఈ కాలమును నాకు సుఖదుఃఖకారణములు కావు. సంసార చక్రమున పరివర్తనమొనర్చు మనస్సే దీనికి కారణము. జీవుడు తనయందు సంసారమును కల్పించు మనస్సును ఆత్మగా గ్రహించి తద్గుణసంగమున కామముల సేవించి బద్ధుడగుచున్నాడు. దానము, నిత్యనైమిత్తిక స్వధర్మము, నీయము, యమము, వేదాధ్యయనము, సర్వకర్మములు, వ్రతములు మున్నగువాని ఫలము మనోనిగ్రహము. అదియే ఉత్తమ యోగము. ఎవ్వని మనస్సు నిగ్రహము నొందదో అతనికి దానాదులవలన ఏమి ప్రయోజనము ? చంచలమైన మనస్సును వశీకరించుకొనువాడు దేవదేవు డనబడును. మనోమాత్రపరికల్పితమైన ఈ దేహముపై మమతాహంభా వములు పెట్టి మూఢబుద్ధులై సంసారమున పరిభ్రమింతురు. జనులు సుఖదుఃఖహేతు వందుమేని, ఆ దుఃఖము పార్థివములైన దేహములకేగాని ఆత్మకు ఎట్లు కలుగును ? ఆత్మభిన్నము, మిధ్య కావున సుఖదుఃఖనిమిత్తము నిజముగా లేనే లేదు. సుఖదుఃఖములకు కర్మము కారణమగునేని, దాని వలన ఆత్మకేమి ? దేహము జడము కావున, దానికి ప్రవృత్తి కలుగదు. ఆత్మ శుద్ధజ్ఞానస్వరూపము కావున దానికి సుఖదుఃఖములు అంటవు. ఈ ద్వంద్వములు బంధకములు కావు. ఇట్టిజ్ఞానముకలవాడు భూతములకు వెరువడు ముకుందచరణముల గొల్చి నేను ఈపరమాత్మనిష్ఠనాచరించి ఈ సంసారసాగరమును తరింతును.' అని యిట్లు ధననాశనమున విరక్తుడైన ఆభిక్షుడు తిరుగుచు, దుష్టులు పరిభవించిననూ చిత్తము గడంగక, ఈ గీతములు పలికెను. శత్రుమిత్ర ఉదాసీనాదయాత్మకమైన సంసారమెల్ల అజ్ఞానకృతముకావున నాపై బుద్ధిసలిపి మనస్సును నిగ్రహింపుము, ఇదియే యోగ సంగ్రామము.'' అని కృష్ణుడు ఉద్ధవునకు బోధించెను.

తరువాత కృష్ణుడు ఉద్ధవునకు సాంఖ్యమును బోధించి గుణవృత్తిభేదముల నిట్లువర్ణించెను. శమము, దమము, తితీక్ష, వివేకము, తపము, సత్యము. దయ, స్మృతి, తుష్టి, త్యాగము, అస్పృహ, శ్రద్ధా హీ దానము. ఆర్జవము, వినయము మున్నగునవి సత్యవృత్తులు కామము, వ్యాపారము, మదము, తృష్ణ, ధనాశతోదైవప్రార్థన, భేదబుద్ధి, విషయభోగము, స్తుతిప్రియత్వము, హాస్యము, మున్నగునవి రజోవృత్తులు. క్రోధము, లోభము, అనృతము హింస యాదన, దంభము, కలహము, శోకము, మోహము, విషాదము, ఆర్తి, నిద్ర, ఆశ, భయము, జడత్వము అనునవి తమోవృత్తులు. ఇంకనూ శమాదిమంతుని సాత్వికునిగను, కామాదిమంతుని రాజసునిగను, క్రోధాది మంతుని తామసునిగను ఊహింపదగును. ఫలాపేక్షలేక స్వకర్మముల నన్ను భక్తితో పూజించు పురుషుడుకాని, స్త్రీకాని సత్యవృత్తిమని ఎరుగవలెను. ఫలముగోరి స్వకర్మముల నన్ను ఆరాధించువానిని రాజసుడుగను, హింసగోరి పూజించు వానిని తామసుడుగను తెలియవలెను. సత్యము, రాజసతామనముల గెలిచెనేని - ప్రకాశ##మైన స్వచ్ఛమై శాంతమై పురుషునకు సుఖమును కూర్చును. రజస్సు, సత్వతమస్సుల గెలిచెనేని - సంగమునకు, భేదమునకు కారణమై, ప్రవృత్తి స్వభావమై, యశశ్శ్రీకర్మముల గల్గించును. తమము సత్వరజస్సుల గెలిచెనేని- వివేభ్రష్టమై జడమై, శోకమోహ నిద్రాదుల గావించును. సత్వము ఉద్రేకించెనేని - చిత్తప్రసాదము, ఇంద్రియోపరమము, అభయము కలిగించును. రజస్సు ఉద్రేకించెనేని-చిత్తవిక్షేపము, ఇందియానుపరతి, కర్మేంద్రియ వికారాధిక్యము కలుగును. తమము ఉద్రేకించెనేని-చిత్తము తిరోభూతమై, మనోలయగ్లాసులను గలిగించును. సత్వరజస్తమములు క్రమముగా హెచ్చయిన యడల, ఆధిదైవిక, ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, కామ్యములకు, ఉత్కర్ష కలుగును. తురీయావస్థ ఆత్మతత్వమే! సత్వమున వేదనిష్ఠులు ఊర్థ్వలోకమును పొందుదురు. రాజసులు మర్త్యలోకమును పొందుదురు. తామసులు అధోలోకమును పొందుదురు సత్వము అధికమై చనిపోవువారు. స్వర్లోకమును; రజస్సు గలవారు నరలోకమును ; తమస్సు గలవారు అధోలోకమును పొందుదురు. నిర్గుణులు నన్నేపొందుదురు. నన్నుపొందకోరియూ, ఏఫలమనూకోరక చేయు నిజకర్మము స్వాతికము. ఫలసంకల్పవృతము రాజసము. హింస, దంభమాత్సర్యాది కృతము తామసము.

దేహాదివ్యతిరిక్తాత్మవిషయక జ్ఞానము సాత్వికము. దేహాదివిషయకము రాజసము ప్రాకృజ్ఞానము తామసము. మన్నిష్ఠజ్ఞానము నిర్గుణము. వనము సాత్వికావాసము. గ్రామము రాజసావాసము. ద్యూతసదనము తామసవాసము. మన్ని కేతనము నిర్గుణవాసము అవాసక్తుడగుకర్త సాత్వికుడు. రాగాంధుడైనకర్త రాజసుడు. స్మృతిభ్రష్టుడైనకర్త తామసుడు. నిర్గుఉణుడైనకర్తమదుపాశ్రయుడు, ఆధ్యాత్మ శ్రద్ధ సాత్వికము. కర్మశ్రద్ధ రాజసము. అధర్మశద్ధ తామసము. మత్సేవశ్రద్ధ నిర్గుణము. హితము, శుద్ధము, అనాయాసలబ్ధము అగు ఆహారము సాత్వికము. ఇంద్రియ ప్రియమైన ఆహారము రాజసము. ఆశుచి, శమకరము అగు ఆహారము తామసము. ఆత్మోత్థితసుఖము సాత్వికము. విషయోత్థితసుఖము రాజసము. మోహదైన్యోత్థితము తామసము.

మదుపాశ్రయసుఖము నిర్గుణము. ద్రవ్యము, దేశము, ఫలము, కాలము, కర్మము, కర్త, శ్రద్ధ మున్నగునవి త్రిగుణాత్మకములు సంసారహేతువులైన చిత్తజన్య గుణములను జయించిన యడల భక్తియోగముచే ముక్తికర్హుడగును. కావున ఈ నర దేహమనుపొంది, విచక్షణుడు గుణసంగము వీడి నన్ను భజింపవలెను. నిస్సంగుడై జితేంద్రియుడైన విద్వాంసుడు సత్వగుణముచే రజస్తమములను జయించి చివరకు సత్వమునుగూడ జయించి గుణవినిర్ముక్తుడై లింగశరీరమును త్వజించి ముక్తుడగును. నా స్వరూపమును తెలిసికొనుటకు సాధనమైన నరజన్మమెత్తి భక్తిలక్షణములను ఆశ్రయించువాడు తనలోనున్న పరమానందరూపుడైన పరమాత్మను పొందును. శిశ్నో దరతృప్తిపరులైన అసాధువుల సంగమము ఒక్క నాడును చేయతగదు.

పూర్వము పురూరవుడను రాజు తనను విడిచి పోవుచున్న ఊర్వశివెంట నగ్నముగా ఉన్మత్తునిరీతి జనుచూ క్షుద్రకామముల దనియక ఊర్వశీసమాకృష్టచిత్తుడై చివరకు విరుక్తుడై ఇట్లు చింతించెను. ''నేను చక్రవర్తినయ్యూ ఆడదానికి క్రీడామృగమునైతిని. నా ఆత్మసమ్మోహమేమని చెప్పుదును ? పరివారముతో కూడిన చక్రవర్తినైన నన్ను తృణముగా భావించి నన్ను విడచి పరుగెత్తుచున్న ఆడుదాని వెంట దిశమొలతో నున్మత్తునిరీతి ఏడ్చుచు వెంబడించితిని. గాడిదవలె తన్నిననూ లెక్కచేయక ఆడుదానివెంటబడు వానికి ప్రభావము, తేజస్సు, ఐశ్వర్యము లెట్లునిలచును ? స్త్రీలకు లొంగినవానికి విద్యాతవస్త్యాగాదులవలన ఏమి ఫలము? ప్రభువునయ్యూ గార్ధభమువలె స్త్రీలకులొంగి మూర్ఖుడనైన నన్ను కాల్చనా? నేను స్వస్వరూపమెరుగక, ఇంద్రియ లోలుడనై చెడిపోతిని. అవిద్యచే అధ్యానము గలిగెను. ఈ కళేబరము జనకత్వమున తల్లిదండ్రులకో; భోగ ప్రదత్వమున భార్యకో ; వశత్వమున స్వామికో; చివరకు కాల్చునెడనగ్నికో ; భక్షణీయత్వమున గ్రద్దలకో, నక్కలకో, మరెవ్వరికో సొమ్మగును. కాని ఇది యిట్లని నిశ్చయింపదోపదు. అట్టి తుచ్ఛమైన ఈ అమేధ్య కళేబరముతో క్రీడించువానికిని పురుగలకును నేమిభేదము ? కావున వివేకికి స్త్రీ సంగమము పరిత్యాజ్యము. ఇంద్రియముల నియమించువాని మనస్సు నిశ్చలమై శాంతిని పొందును. కాన స్త్రీ సంగమము, తత్సంగి సంగమమునూ దూరపరిహర్తవ్యము?'' అని యిట్లు తనలో చింతించి పురూరవుడు ఊర్వశిని విడచి మోహమును పోగొట్టుకొని తనలోనున్న నన్నుగని శాంతుడయ్యెను.

కావున ఉద్ధవా బుద్ధిమంతుడు దుస్సంగమును పరిహరించి, సత్సంగమును చేయవలెను. సత్పురుషుడు మంచిమాటలచే ఆశ్రితుని మనోవ్యాసంగమును తొలగించును. అనపేక్షితులు, మచ్చిత్తులు, ప్రశాంతులు, సమదర్శనులు, నిర్మములు, నిరహంకారులు, నిర్ద్వందులు, నిష్పరిగ్రహులు అగువారు సాధువులు. అట్టివారిని సేవించువారి పాముములు నశించును. అనంతగుణుడు, ఆనందానుభవాత్ముడు, బ్రహ్మస్వరూపుడునగు నామీద భక్తి సాధించినవానికి ఏది అసాధ్యము ? నన్నాశ్రయించినవారికి సంసారభయము, అజ్ఞానము నశించును. ఘోరసంసారసాగరమున మునుగుచు తేలుచు నుండువారికి నావవలె బ్రహ్మవిదులైన శాంతులు పరాయణలు. ప్రాణులకు అన్నము జీవనము, ఆర్తులకు నేను శరణ్యము పరలోకకాములకు ధర్మము ధనము. సంసారభీతులకు సాధువులు శరణ్యము కావుననే పురూరవుడు ఊర్వశీలోక నిస్పృహుడై ముక్తసంగుడై ఆత్మారాముడై ఈ పుడమిలో సంచరించెను.

భగవదారాధన విధి

ఉద్ధవుడు యిదంతయూ విని సర్వవర్గముల వారికిని, స్త్రీ, శూద్రులకును, ఉత్తమ శ్రేయోమార్గమైన భగవదారాధన విధిని చెప్పుమని అడుగగా కృష్ణుడిట్లు చెప్పెను : ''నా పూజావిధి-వైదికము, తాంత్రికము, మిశ్రమము అని మూడు విధములు. ప్రతిమయందును, స్థండిలమందును, అగ్నియందును, సూర్యునియందును, జలమునందు మనస్సునందు. భక్తితో మాయవిడిచి నన్ను అర్చింపవలెను. తొలుదొలుత దంతధావనాది కాలకృత్యములు నెరవేర్చి శుద్ధికొరకు వైదిక తాంత్రిక స్నానమొనర్చి, సంధ్యోపానాది వైదికర్మల గావించి, నన్నుపూజింపవలెను. నా ప్రతిమ శిలా, దారు, లోహ, మృచ్ఛందన, చిత్ర, సికత, మణి, మనోమయములని ఎనిమిది విధములనున్నవి. స్థిరార్చనమున ఆవాహనో ద్యాసనములు లేవు. ఆస్థిర ప్రతిమార్చనమున వికల్పము, స్థండిలమున రెండునూ కలుగును. మృణ్మయ చిత్రప్రతిమలందు అభిషేకము నిషిద్ధము. మార్జనమాత్రము చాలును. శోభనద్రవ్యములతో నన్ను పూజింపవలెను. ప్రతిమయందు స్నానాలంకారము ఉత్తమము. స్థండిలమందు తత్వన్యాసము ప్రశస్తము. అగ్నియందు అజ్యప్లుత హోమము, సూర్యుని యందు ఉపస్తానార్ఘార్యాదులు, జలకాలనందు తర్పణములు యోగ్యము. శుచియై పూజోపకరణములనెల్ల సమకూర్చుకొని సాధకుడు దర్భాసనమున తూర్పుగాగాని, ఉత్తరముగా గాని ముఖము పెట్టి పూజనీయ ప్రతిమకు ఎదురుగా కూర్చుండి, అంగన్యాస కరన్యాములొనర్చి, ప్రతిమను స్పృశించి, నిర్మాల్యము తొలగించి, శోధించి, కలశమును, చందన పుష్పాదులతో సంస్కరించి, ప్రోక్షణీయజలముచే. దేవ పూజాస్థానమును, పుజాద్రవ్యములను, తనను ప్రోక్షించుకొని పాద్య, అర్ఘ్య, ఆచమనీయములకు పాత్రలుపెట్టి, కలశజలము నుంచి, పాద్యపాత్రమున దూర్వాకమల శ్యామకాదులను, అర్ఘ్యపాత్రమున గంధపుష్పాక్షతాదులను, ఆచమనీయ పాత్రమున లవంగాదికములుంచి, చందనాదుల పూజించి, పరిశుద్ధమైన స్వదేహమునందు స్వహృదయ కమలస్థితుడైన నారాయణమూర్తిని ధ్యానింపవలెను. తరువాత నన్ను ఆవాహితునిగావించి, పాద్య అర్ఘ్య ఆచమనీయాది ఉపచారములొనర్పవలెను. తరువాత అంగావరణపూజ చేసి, అష్టదిక్కులందు, కోణములందు ఆయాదేవతల నుంచి ప్రోక్షణాదుల ప్రోక్షించి, పరివార దేవతాపూజ చేయవలెను. స్వర్ణఘర్మానువాకమును, మహాపురుషవిద్యను, పురుష విద్యను, పురుషసూక్తమును, రాజనాది సామములను, పఠించుచూ అభిషేకము గావించి వస్త్ర, ఉపవీత, ఆభరణ, పత్ర, కుసుమ, మాల్య చందన లేపనముల నలంకరింపవలెను. పాద్యాచయనీయ గంధపుష్పాక్షత ధూపదీపములనర్పించి, గుడపాయస ఘృతములను, శష్కుల్యపూప మోదకములను, సంయావదధి సూపమును, రసవదన్నమును, నివేదమొనర్పవలెను. పర్వములందు దంతధావనాభ్యంజనాదులను, గీత నృత్తంబులను చేయవలెను. ఇంకనూ స్వగృహ్యోక్త విధానమున మేఖలావర్తవేదులేర్పరచిన కుండమునందు అగ్నిని ప్రతిష్ఠించి, అగ్నికి ఉత్తరమున హోమద్రవ్యమునుపెట్టి, ప్రోక్షణీయ పాత్రోదకముచేప్రోక్షించి, అగ్నిలో నన్నావాహనము గావించి, ధ్యానించి, పూజించి ఆజ్యసిక్తములైన శుష్కసమిధముల అగ్నిలోనుంచి, మూలమంత్రముచే, పురుషస్తూ క్త షోడశ ఋగవదానముతో ఆజ్యప్లుతహవిర్హోమ మొనర్చి, యథావిధి ధర్మాద్యాహుతులు వ్రేల్చి హోమ సాద్గుణ్యార్థము స్విష్టకృదాహుతి, గావించి వహ్నిగతుడైన నన్ను ఆర్చించి, నమస్కరించి పార్షదు కు బలిపెట్టి, హోమ స్థానమునకుజని నారాయణాత్మమైన బ్రహ్మను స్మరించుచూ మూలమంత్రము జపించి, దేవునకు ఆచమేయమిచ్చి, ఉచ్చిష్టమును విష్వక్సేమనకు కల్పించి, శేషము స్వీయాహారార్థము ఏర్పరచుకొనవలెను. తదుపరి దేవునకు, పరిమళమిళిత ముఖావాసమును తాంబూలాదులను సమర్పించి, పుష్పాంజలితో పూజింపవలెను తరువాత మత్కథాగాన కీర్తనములు గావించి, నృత్యముసల్పి, మత్కర్మల, నభినయించి, మచ్చరిత శ్రవణపఠములొనర్చి ముహూర్త మాత్రము నిర్వ్యాపారుడై ధ్వానిష్ఠపూని నానావిధస్తోత్రములతో ప్రస్తుతించి 'దేవదేహా ప్రసాదింపుము' అని శిరము నా పాదములసోక దక్షిణోత్తరహస్తముల మదీయ ఉత్తర దక్షిణపాదములను పట్టుకొని సాష్టాంగదండ ప్రణామము లొనర్చి, ''పురుషోత్తమా, కరుణానిధీ. నీశరణు జొచ్చితిని, నన్ను బ్రోవు'' మని ప్రార్థించి నిర్మాల్యము శిరముధరించి, ఉద్వాసనగావించి ప్రతిమావిన్యస్తమైన జోతిస్సును ఆత్మహృదకమలస్థిత జోతిస్సులో ప్రతిష్ఠింప ప్రార్థింపవలెను. ప్రతిమాదులలో నెవ్వనికి దేనిపై శ్రద్ధకలిగిన, దానిలో నన్ను పూజింపవలెను. సర్వాత్ముడగు నేను సర్వభూతముల యందును, తనయందును ఉండుదును. ఈవిధమున వైదిక తాంత్రికములతో నన్ను పూజించునాతడు, తనకు అభిమతములైన ఉభయస్థితులను నావలన సొందును. నిత్యపూజా మహోత్సవాదులకు జాలిన క్షే తాదులిచ్చి నాకు మందిరము నిర్మించి, నాప్రతిమను ప్రతిష్ఠించి, రమ్యమైన ఉద్యానవనములు ఏర్పరుపవలెను నిత్యపూజలకుగాని, మహోత్సవాదులకుగాని, క్షేత్ర ఆపణ పురగ్రామాదులనిచ్చు నాతడు, నా సాలోక్యమును పొందును. నా ప్రతిమను ప్రతిష్ఠిప సార్వభౌమత్వమును, మందిర నిర్మాణమున త్రిభువనాధిపత్యమును, పూజాది సంవిధానమున బ్రహ్మలోకమును, ఈ మూడును గావించిన మత్సామ్యమును పొందును. నిరపేక్ష భక్తి యోగమున నన్ను పూజించిన భక్తియోగము పొందును. కర్త, సహకారి, ప్రేరకుడు, అనుమోదకుడు, సమభాగులై తత్ఫలమును అనుభవింతురు."

కృష్ణుడు ఈ విధముగ బోధించిన అనంతరము బదరి కాశ్రమమునకు పొమ్మని ఉద్ధవునికి అజ్ఞఇచ్చెను. అంతట ఉద్ధవుడు కృష్ణుని ఎడబాటు సహించలేక కంటనీరిడి, కృష్ణుని పాదుకలను శిరస్సున బెట్టుకొని పలుమారు ప్రణమిల్లి కృష్ణుని అజ్ఞప్రకారము బదరికాశ్రమమునకు జని తపమాచరించి ముక్తుడయ్యెను.

కృష్ణనిర్యాణము

యాదవకుల నాశనముతో భూభారమంతయూ హరించినదని కృష్ణుడు నిశ్చయించి తానవతరించిన కార్యమంతయూ పూర్తిఆగుట వలన, బలరాముడు అవతారము చాలించినందున తానుగూడ చాలించవలెనని ఒక ఆశ్వథ్థమూలమున శ్రీవత్స లాంఛనముతో పీతాంబరధారియై, సర్వాభరణములతో, సకలలోకమంగళము నగు తన చతుర్భుజ రూపముజూచి దిక్కలెల్ల చీకట్లుపోవునట్టి కాంతితో తేజిల్లుచూ తన తొడపై వామపాదముపెట్టి కూర్చుండెను. ఆపాదమును గాంచిన జరుండను బోయవాడు అదిమృగముఖముగా భ్రమించి పూర్వము విప్రశాపమున పుట్టిన ముసలము యొక్కయులికిని తన బాణాగ్రముగా ఆమర్చియున్న బాణముతో కృష్ణుని పాదమును కొట్టెను. అంత అతడు దగ్గరకువెళ్ళి చూడగా అది కృష్ణుని పాదమని తెలిసి పశ్చాత్తాపమున దుఃఖించి కృష్ణుని పాదములపైబడి. తెలియకచేసిన తప్పును క్షమింపుమని ప్రార్థించి, ఇట్టి పరమపాపాత్ముడనగు నన్ను చంపివేయమని వేడుకొనెను. కృష్ణుడతనికి అభయమిచ్చి నేను శరీరమున చాలించదలచి నిన్నిట్లు ప్రేరేపించితిని. కనుక ఇదంతయూ నా ఆజ్ఞ ప్రకారమే జరిగినది. కనుక నీవు భయపడక స్వర్గమునకు పొమ్మని ఆదేశించగా అతడు కృష్ణునికి ముమ్మారు నమస్కరించి, అపుడు వచ్చిన విమానము నెక్కి స్వర్గమునకు పోయెను.

అంతట దారుకుడు కృష్ణుని జాడను వెదకికొనుచూ వచ్చి ఆ యశ్వథ్థమూలమున కూర్చుండియున్న కృష్ణుని గాంచి పాదములపై బడి, దేవా ! తమ దర్శనముకాక ఇంత వరకు నేనెంతయు విలపించుచుంటిని. శాంతి పొందనైతిని. అని విన్నవించుచుండగా కృష్ణుడు 'ఓ సారధీ నీవు ద్వారకకు పోయి యాదవులందరూ నశించినారనియు, బలరాముడు అవతారము చాలించెననియు, నేను అవతారము చాలించు చున్నాననియు అందరకూ తెల్పుము. మీరెవ్వరునూ ఇక ద్వారకలో నివసింపవలదు. సముద్రుడు ఆ పురమును ముంచివేయును. మా జననీకులునూ తక్కినవారునూ తమతమ వస్తువులతో ద్వారకవిడచి ఇంద్రప్రస్థమునకు జని అర్జునుని చాటు నిలుపుడు. నీవు ఉదాసీనుడవై ఇదంతయూ నా మాయావిరచితమని గ్రహించి శాంతిపోందుము' అని చెప్పగా దారుకుడు సాష్టాంగనమస్కార మాచరించి ద్వారకకు చనెనె.

అంతట, బ్రహ్మ, శివుడు, ఇంద్రాదిదేవతలు, మునులు, ప్రజాపతులు, గంధర్వ, విద్యాధర, యరక్షః, కిన్నర, కింపురుష, అస్సరాదులందరూ కృష్ణనిర్యాణమును చూచుటకై ఏతెంచి పుష్పవర్షములు కురిపించిరి. గరుడధ్వజ లాంచనమైన కృష్ణునిరథము ఆకాశమునందు ఎగిరిపోయెను. చక్రాది ఆయుధములన్నియూ దానివెంట చనెను. అంతట కృష్ణుడు, బ్రహ్మాదులందరూ చూచుచుండగా కన్నులు ముకుళించి లోకరమణీయమైన తన దివ్వమంగళవిగ్రహముతో వైకుంఠలోకమునకు జనెను. ఆ మూర్తివెంట సత్య, ధర్మ, ధృతి, శ్రీ, కీర్తులు జనెను. దేవదుందుభులు మ్రోగెను. పుష్పవర్షము కురిసెను. కృష్ణునియొక్క గతి బ్రహ్మాదులకు అగోచరము కాగా వారందరూ కృష్ణుని ప్రశంశించుచు తమతమ లోకములకు జనిరి.

శుకులవారు ఈ విషయములన్నియూ పరీక్షిత్తునకు బోధించి, ''రాజేంద్రా పరమపురుషుడైన భగవంతుడు యాదవకులమున అవతరించుట మున్నగు చర్యలన్నియూ నటునకు వేషధారణవలె మాయావిండబనమని ఎరుగుము. ఈ జగమెల్ల తానే సృష్టించి దానిలో అంతర్యామియై, చివరకు ఉపసంహరించి ఆత్మమహిమమున ఆ పరమాత్ముడు వెలయునుగదా! మానవదేహున యమలోకమునకు జని గురుపుత్రుని తెచ్చియూ, నిన్ను రక్షించుటకు నీతల్లి గర్భములో ప్రవేశించి అశ్వథ్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు అపకారము చేయకుండ రక్షించియూ, బాణాసుర యుద్ధమున త్రిపురాసురుని సంహరించియు విరాజిల్లిన విష్ణుదేవునకు వలయునన్న తన దేహమును గాచికొన శక్తిచాలకయుండునా ? అఖిలజగత్తుకు ఉత్పత్తి. స్థితి, లయములకు కారణమై సర్వశక్తిధరుడైన భగవంతుడు తనవారి కందరికీ ఆత్మగతినిచూపి తాను అవతరించినపని పూర్తియైనదని తలచి తన మావనదేహమును ఇచ్చట నిలుపడయ్యెను.'' అని విశదీకరించెను.

దారుకుడు కృష్ణవియోగమును భరింపలేక ద్వారకకు జని వసుదేవాదుల పాదములపైబడి, కన్నీరు కార్చుచూ కృష్ణుని నిర్యాణకథనంతయూ చెప్పెను. అంతట వారందరునూ శోకమున మూర్ఛిల్లి కొంత సేపటికి తెలిసి, కృష్ణనిర్వాణస్థానమునకు అరుదెంచిరి దేవకీవసుదేవుడును, రోహిణియును తన పుత్రులైన కృష్ణబాలరాముల నిర్యాణమునకు దుఃఖమును భరించలేక ప్రాణములు విడచిరి. యాదవుల భార్యలు సహగమనము చేసిరి. వసుదేవ పత్నులునూ, కృష్ణుని కోడండ్రును రుక్మిణీప్రభుతులగు కృష్ణపత్నులునూ కృష్ణాత్మికలై అగ్నిప్రవేశమొనర్చిరి. అర్జునుడు కృష్ణవిరహము భరించలేకయూ, భగవద్గీతార్థ స్మరణమున ధైర్యము తెచ్చుకొని హతులైన వారందరకూ పరలోకక్రియలు గావించెను. అంతట ద్వారకాపుమంతయూ సముద్రమున మునిగెను. కాని భగవదాలయము మాత్రము మునుగలేదు. అందు హరి నిత్యసన్నిహితుడు. ఆ మందిరము సర్వపాపముల పోగోట్టి అనంతమంగళములు చేకూర్చును. అర్జనుడు స్త్రీ, బాల, వృద్ధులనూ హతశేషులనూ ఇంద్రప్రస్థమునకు తోడ్కొనిపోయి వజ్రుని అభిషిక్తుని చేసిరి. ధర్మరాజాదులు అర్జనునిచే కృష్ణనిర్యాణమును విని దుఃఖించి చివరకు ఓ రాజా నిన్ను పట్టాభిషిక్తునిచేసి మహాప్రస్థానపథము పట్టిరి. భగవంతుని ఈ జన్మకర్మములను వినిన సకలపాపములు తొలగును. భగవంతుని అవతార కార్యములను, బాల కీడలను కీర్తించు మానవుడు శ్రీకృష్ణుని భక్తుడై తరించును.'' అని పరీక్షిత్తునకు శుకయోగీంద్రులు చెప్పగా ఆ రాజేంద్రుడు పరమానందము పొందెను.

ఏకాదశస్కంధము సమాప్తము.

Sri Bhagavatha kamudi    Chapters