Sri Bhagavatha kamudi    Chapters   

దశమ కిరణము

(దశమస్కంధము - పూర్వభాగము)

శ్రీకృష్ణావతార చరితము

నవమకిరణము చివరిభాగములో కృష్ణునిచరిత్ర అతిక్లుప్తముగా చెప్పబడినది. అందుచే పరీక్షిత్తు కృష్ణ చరిత్రను సంపూర్ణముగ వినిపింపుమని కోరుచూ ఇట్లనెను : ''ఓమహర్షీ భగవంతుని గుణవర్ణనములను వినువాడు ఎవరైననూ - నాకు అక్కరలేదని అనునా ? ముక్తులకుగూడ ఆనందము చేకూర్చునుగాన వారు విందురు. ముముక్షవులకు మోక్షమిచ్చునుకాన వారును సంతోషముతో విందురు. ఈ రెండు విధముల మానవులుగాక మిగిలిన కేవల పామరులకు గూడ వినసొంపుగ నుండునుగావున వారును విందురు. కాన భగవద్గుణములను గురించి విరక్తిచెందువాడెవడునూ ఉండడు. ఒకవేళ ఉన్నచో పశుఘ్నుడైవడైన ఉండవలెను.''

[ఇచ్చట పశుఘ్నుడనగా పశువులను వధించెడు కసాయివాడనుట కంటె, కసాయివానికి గూడ పామరునివలె భగవద్గుణములు వినసొంపుగా ఉండవచ్చునగదా! పశువులను చంపు కత్తి అనిన బాగుండునేమో! సర్వమానవులకు భగవద్గుణాను కీర్తనము శ్రవణ రమనీయమేనని తాత్పర్యము.]

అంత శుకుడు ''రాజా ఇన్నిదినములనుండి ఆహార పానీయములు విసర్జించి ఉండిననూ నీకు భగవత్కథలు వినవలెనని కుతూహలము ఉన్నదే! ఇదేమి ఆశ్చర్యము!'' అని అనగా, పరీక్షిత్తు ''స్వామీ తమ వదనారవిందము నుండి వచ్చుకున్న హరిక థామృతమును నేను త్రాగుచుండుటచేత నాకు ఆకలిదప్పికలు లేకుండపోయినవి.'' అనెను అందుకు శుకుడు ''రాజేంద్రా! నీ ఆసక్తి నాకెంతయూ ఆనందము చేకూర్చింది. భగవత్కథలను విపులముగా చెప్పెదను. గంగాజలము చూచినవానిని, త్రాగినవానిని, స్నానమాడిన వానిని, ముగ్గురనూ పవిత్రము చేయును. అటులనే భగవత్కథ అడిగినవానిని, చెప్పినవానిని, వినినవానిని, ముగ్గురనూ పవిత్రము చేయును.''

రాక్షసుల దౌర్జన్యములను భూదేవి భరింపలేక బ్రహ్మ వద్దకు వెళ్ళగా అతడు శంకరునివద్దకు, చివరకు దేవతలతో సహా అందరూ కలిసి విష్ణువువద్దకు వెళ్లి పురుషస్తూక్తముతో స్తుతించగా ఆతడు సంతోషించి తాను భూభారమును తొలగింప యదువంశములో అవతరించెదననియూ, దేవతలందరునూ వారివారి అంశములతో యదుకులములో పుట్టుడనియు, అనతిచ్చెను.

ఇట్లుండ, కంసుని సోదరియగు దేవకీదేవిని వసుదేవున కిచ్చి వివాహముచేసి ఆ నూతన దంపతులను స్వయముగా రథము త్రోలుచూ కంసుడు సాగనంపుచుండగా ఆకాశవాణి 'ఈ దేవకియొక్క అష్టమగర్భము నిన్ను చంపును' అని పలికెను. అదివిని కంసుడు తన మరణమునకు తన సోదరియే కారణమగునని భయపడి ఆమెను చంపబోగా వసుదేవుడు అడ్డుపడి, పెండ్లికుమార్తెయగు నీ సోదరిని చంపకూడదని బ్రతిమాలి ఆమెను పుట్టిన బిడ్డల వల్ల కదా నీకు మరణము, ఆ బిడ్డలను పుట్టగనే నీకు అప్పగించెదను, వానిని నీవు చంపినను, చంపవచ్చును, ఈ నా భార్యను మాత్రము బతికించుము' అనిన కుంసుడు అందులకు అంగీకరించి ఆమెను విడిచిపెట్టెను. వసుదేవుడు భార్యతో తనమందిరమునకు జని ఆమెతో కాపురము చేయుచుండగా వరుసగాఎనిమిదిమంది కుమారులును ఒక కుమార్తెయును కలిగిరి. మొదటి కుమారుడు పుట్టగనే తన వాగ్దానమును చెల్లింపవలెనని తలంపుతో వసుదేవుడు ఆ పిల్ల వానిని కంసుకి ఆర్పించెను. కంసుడు ఆ పిల్లవానిని తీసుకొని, వసుదేవుని సత్యనిష్ఠకు సంతసించి, నీ ఎనిమిదవ కుమారునివలన నాకు మరణము గనుక ఈ పిల్ల వానిని నీవే తీసికొనమని ఇచ్చి వేసెను. ఇట్లు ఆరుగురు పిల్లలను చంపకుండ ఇచ్చివేసెను.

ఇట్లుండగా నారదుడు కంసుని యొద్దకు వచ్చినపుడు తాను వసుదేవుని ఆరుగురు పిల్లలను చంపకుండా ఇచ్చివేసిన సంగతి తెలుపగా నారదుడు ''ఓ కంసా నీవు చాల తెలివి తక్కువ పని చేసితివి. ఎనిమిదవ పిల్ల వాడనగా, వరసుగా ఎనిమిదవ వాడనుకొనుట పొరబాటు, ఎటునించి అయిననూ ఎనిమిది అని లెక్క తేల్చవచ్చును. వసుదేవాదులందరూ దేవాంశసంభూతులు. మీకునూ వారికీని ఎప్పుడను విరోధము తప్పదు. మిమ్ములను చంపుటకు విష్ణుమూర్తి వారికులములో పుట్టబోవుచున్నాడు. నీవు వెనకటి జన్మలో కాలనేమివి. కనుక వారియెడ జాగ్రత్తగా ప్రవర్తించుము.'' అని హెచ్చరించి వెడలిపోయెను. అంతట కంసుడు ఆ ఆరుగురు పిల్లలను తెప్పించి వారినందరనూ చంపివేసి, దేవకీవసుదేవులను కారాగారమున బంధించెను. తనతండ్రియైన ఉగ్రసేనుని గూడ రాజపదవి నుంచి తొలగించి తానే రాజై జరాసంధుని మున్నగు రాక్షసులతో స్నేహము చేసికొని విశృంకలముగా ప్రవర్తిచుచుండెను.

వసుదేవుని కుమారులు ఆరుగురు చనిపోయిన తరువాత అనంతుడు (బలరాముడు) ఏడవవాడుగా దేవకీ గర్భమున ప్రవేశించగా భగవంతుడు తన యోగమాయను పిలిచి ''దేవకీ గర్భములోనున్న తేజస్సును గొనిపోయి నందగోకులములో నున్న వసుదేవుని భార్యయైన రోహిణి గర్భములో ప్రవేశ##పెట్టుము. నేను దేవకి గర్భమున అవతరించి నప్పుడు నీవు యశోద గర్భమున పుట్టుము'' అని ఆజ్ఞాపించెను. అంతట యోగమాయ దేవకి గర్భములో నుండి తేజస్సును రోహిణి గర్భములో ప్రవేశ##పెట్టగా దేవకికి గర్భస్రవావమైనదని అందరూ చెప్పుకొనిరి.

తరువాత భగవంతుడు నిజాంశమున వసుదేవుని మనస్సులో ప్రవేశించగా వసుదేవుడు సూర్యుని వలె ప్రకాశించుచుండెను. తరువాత ఆ తేజస్సు దేవకీదేవి మనస్సులోనికి ప్రవేశించగా అద్భుతముగా ప్రకాశించుచున్న ఆమెను కంసుడు చూచి తనను సంహరించుటకు పుట్టబోవువాడు ఈమెగర్భమున నున్నాడని నిశ్చయించి, 'అట్టి స్త్రీని చంపిన యడల నాకు ఘోరమైన ఆపకీర్తి వచ్చుటయేగాక నా ఆయుర్దాయము, యశస్సు నశించును. నేను బ్రతికియున్న శవమునగుదును. ఆ తరువాత ఘోరనరకము ననుభవింతును' అని ఆలోచించి ఆమెను వధింపబూనక, తాను కూర్చున్ననూ పరుండిననూ భుజించుచున్ననూ, ఏపనిచేయున్ననూ భగవంతుని తలచుచూ వైరభావమును పెంచుకొనుచుండెను.

ఇట్లుండగా దేవకీగర్భములోని తేజస్సును బ్రహ్మది దేవతలువచ్చి స్తుతించి వెడలిపోయిరి. తరువాత ఒక ఉత్తమమైన సమయమున దిక్కులు ప్రసన్నములుకాగా, దేవదుందుభులుమ్రోగ, అప్సరసలు అడ, నిశీధి సమయమున రోహిణీ నక్షత్రమున శ్రావణ బహుళ అష్టమినాడు తూర్పు దిక్కునందు పూర్ణచంద్రుడుదయించినట్లు దేవకీదేవియందు భగవంతుడు చుతర్భుజములతోను, పీతాంబరముతోనూ, కిరీట కుండలములతో ఆవిర్భవించగా, వసుదేవుడు ఆశ్యర్యానందములతో అనేక దానములను మానసికముగ జేసెను. దేవకీవసుదేవులు కృష్ణుని స్తుతించిరి. అంతట కృష్ణుడు తల్లితో ఇట్లనెను'దేవీ, పూర్వజన్మలో నీవునూ నీభర్తయునూ పృస్ని, సుతపులను పేర్ల బరగి పెక్కు సంవత్సరాలు నా కొరకు తపస్సు చేసిరి. అంతట నేను ప్రత్యక్షమై పరముకోరు కొమ్మనగా నావంటి కుమారుడు కావలెనని ముమ్మారు కోరితిరి. నావంటివాడు మరోకడు లేనందున నేనే అప్పుడు సృస్నిగర్భుడను పేరుతో అవతరించితిని. తరువాత మీ ఉభయుల రెండవజన్మములో, అదితి కశ్యపలుగా జన్మించినప్పుడు నేను మీకు ఉపేంద్రుడమపేర కుమారునిగా అవతరించితిని. మీ ఈమూడవజన్మమున నేను మీకు ఈ రూపముగా అవతరించితిని. నేను మీకు పూర్వజన్మలో చేసిన వాగ్దానమును చెల్లించితినని తెలుపుటకై నే నీ భగవద్రూపమున ప్రత్యక్షమైతిని మూడుసార్లు కోరినందుకు మూడుసార్లు అవతరించితిని. మీరిరువురునూ నన్ను పుత్రభావముతోడను, బ్రహ్మభావము, తోడనూ చింతించుచూ ఉత్తమగతిని పొందుడు. మీకు కంసునివలన భయమేని. నన్ను గోకులమునకు తీసుకొనిపోయి, యశోద ప్రక్కన చేర్చి ఆమె ప్రక్కన కూతురై పుట్టియున్న నామాయను ఇచ్చటకు తీసుకొని రండు మీకునిరాటంకముగ ద్వారములు తెరువబడును. అని ఆ భగవద్రూపమును ఉపసంహరించుకొని తల్లిదండ్రులు చూచుచుండగా చిన్న పిల్లవాని రూపము దాల్చెను.

అపుడు ద్వారపాలకులందరూ గాఢ సుషుప్తిలో నుండగా, సంకెలలు వదులగా తలుపులు తెరుచుకొనెను. వసుదేవుడు కృష్ణుని ఎత్తుకొనిపోవుచుండ ఆదిశేషుడు వర్షము పడకుండ తనపడగ పట్టెను. యమునానది త్రోవయివ్వగా వసుదేవుడు నదిని దాటి నందవ్రజమును ప్రవేశించి అందరునూ నిద్రించుచుండ, తన కుమారుని యశోద ప్రక్కన చేర్చి, ఆమె ప్రక్కనవున్న ఆడపిల్లను తీసుకొనివచ్చి దేవకీ ప్రక్కన పరుండబెట్టెను. అంతట తలుపులు పూర్వమువలే మూసుకొని పోయెను. సంకెళ్ళు హస్త పాదాదులకు లగ్నములయ్యెను. యశోధ భగవన్మాయచేత తనకు జన్మించినది స్త్రీ శిశువా పురుషశిశువా అని చూచుకొనకుండగనే నిదురవోయి, లేచి చూడ, కుమారుడే కలిగెనని సంతసించెను.

దేవకి ప్రసవించినదని కంసునకు తెలియగనే వచ్చి పిల్లవానిని ఇమ్మని ఆజ్ఞాపించగా, దేవకి-''అన్నా! ఈ బిడ్డ, నీ కోడలుగాని అల్లుడు కాదు, దీనిని చంపవలదు, ఈపిల్లనైనను నాకు దక్కించి రక్షించు''మని పిల్లను వడిలో పెట్టుకొని ప్రార్థింపగా, కౄరుడైన కంసుడు ఎంతమాత్రము జాలిపడక ఆమె చేతిలోనుండి పిల్లను బలాత్కారముగా లాగుకొని ఆ పశికూన కాళ్ళు పుచ్చుకొని అచ్చటనున్న రాతిబండ మీదకు విసిరివేసెను. ఆ పశిది వెంటనే అతని చేతిలోనుండి తప్పించుకొని, పైకి ఎగిరి, ఎనిమిది భుజమలతోను, ఆయుధములతోను, ఒక శక్తిరూపు దాల్చి 'మూఢుఢా! నిన్నుచంపువాడు వేరేపుట్టియున్నాడు, నన్ను చంపుట నీవశము కాదు' అని చెప్పి అదృశ్యమయ్యెను. అంతట కంసుడు కొంత తడవు ఆలోచించి మొగపిల్లవాడని చెప్పిన ఆకాశవాణి పలుకులే అబద్ధమయ్యెనేఅని, విచారించి పశ్చాత్తాపడి, దేవకీ వసుదేవులను విడుదల చేసి వారిని క్షమార్పణకోరెను.

అంతట ఆరాత్రియంతయూ కంసునికి నిద్రపట్టక, మంత్రులను పిలిపించి, నన్ను చంపువాడు పసిపిల్లవాడుగా ఎచ్చటనో పెరుగుచున్నాడని, ఇందుకు ఏమి చేసిన బాగుండునని ఆలోచించగా, మంత్రులు దేశములోనున్న పసిపిల్లలనందరనూ, పురుడు గడచీగడవని వారినందరనూ చంపునట్లు ఆజ్ఞాపించి కంసునికి ఆభయమిచ్చిరి.

గోకులములో ప్రభువైన నందుడు తనకు పుత్రుడు కలిగినాడని పరమాహ్లాదమొంది గొప్ప ఉత్సవములు గావించి అనేక దానములు చేసెను. కృష్ణచంద్రు డుదయించిననాటి నుండి నంద వ్రజము సర్వసంపద్విభవోపేతమై ఇందిరావిహార మందిరముగ విరాజిల్లుచుండెను.

ఇట్లుండ ఒకనాడు నందుడు, మధురకరణి, కంసునకు కప్పముకట్టి ఒకచోట విశ్రమించగా, వసుదేవునకు తెలిసి తనపుత్రుడు వారి మందిరమున ఉన్నందున, అతని యోగ క్షేమములు కనుగొనదలచి, నందునికలిసి అతనికి వార్థక్యమున పుత్రరత్నము కలిగినందులకు అభినందించి, క్షేమ సమాచారాము లైనతరువాత నందునితో, నీవు వెంటనే గోకులము వెళ్ళుము. అచ్చటేవో అరిష్టములు కలుగునని నాకుతోచుచున్నదనచెప్పి పంపివేసెను.

పూతనసింహారము

కంసుడు పంపిన పూతనయను రాక్షసి ఆయాగ్రామములోని పసిపిల్లలను చంపుచూ గోకులమునకు చక్కని స్త్రీ రూపములో వచ్చి నందుని యింట యశోదకు కుమారుడు కల్గినందుకు సంతోషమువ్యక్తపరచగా, యశోదాఆనందముతో పిల్లవానిని పూతనకు అందించెను. కనులు మూసుకొనివున్న బాలుని లాలించుచున్నట్లు పూతన స్తన్యము నివ్వదొడగెను. నిజముగా ప్రేమతో నట్లుచేయుచున్నదని యశోదయూ రోహిణియూ భ్రమపడిరి. పసిబాలునిరూపములోనున్న కృష్ణుడు సర్వజ్ఞుడైన భగవానుడుగనుక, ఆమె తన చన్నులకు విషముపూసుకొని తనను చంపుటకు వచ్చినదని గ్రహించి ఆమె చన్ను నోటిలోపెట్టుకొని దానద్వారా దాని రక్తమును, ప్రాణమునూ కూడ పీల్చివేసెను. ఆ భాదకు ఓర్వలేక పూతన విడువు విడువు మనుచూ గోలపెట్టి కాళ్ళుచేతులు తన్నుకొనుచూ ప్రాణములు విడిచెను. అంతట దాని నిజరాక్షస రూపము వ్యక్తముకాగా ఆరుక్రోసులమేర ఆక్రమించెను దాని శరీరముపై కృష్ణచంద్రుడు నిర్భయముగా ఆడుకొనుచుండెను. ఈసంఘటన చూచిన యశోధ, రోహిణి మున్నగు వారు ఆశ్చర్యపడి, యదార్థస్థితిని తెలుసుకొనలేక ఆ శవము మీద నున్న బాలుడు భయపడియుండునని తలచి అనేక విధములైన రక్షలు పెట్టిరి.

మధురనుండి తిరిగి వచ్చుచున్న నందుడు గోకుళము పొలిమేరలో ఆరు క్రోసులమేర పడివున్న పూతనకళేబరమును చూచి, ఆశ్చర్యపడి, వసుదేవుడన్నట్లు ఉపద్రవము తన గ్రామమునకు రానేవచ్చినదని, తలచి, ఇతర గోపకులతో కలిసి ఆ పూతన దేహమును గొడ్డళ్ళతో నరకి, ప్రోగుచేసి తగులపెట్టగా అందరకూ ఆశ్యర్యమగునట్లు గొప్పసువాసన బయల్వెడలెను. తమ గ్రామములోని పసిపిల్లలందరనూ చంపిన ఈ ఘోరరాక్షసికి ఇట్టిసద్గతికలిగి సువాసనవచ్చుట, కృష్ణునికి స్తవ్యమిచ్చుటవలనగదా యని ఆశ్యర్యపడిరి.

శకటాసుర సంహారము

నెలలోపు బాలుడుగా ఉండగనే కృష్ణచంద్రుడు పూతన సంహారము గావించెనని ఆనందాశ్చర్యములతో వేడుకలు చేయుచుండిరి. ఒకనాడు కృష్ణుని జన్మనక్షత్రము రోజున పిల్లవాడు బోర్లపడు వయసురాగా, గ్రామములోని ముత్తైదువుల నందరను పిలిచి యశోద వైభవోపేతముగా ఉత్సవము జరిపేను. అంతలో పిల్లవాడు కనులు మూయుచుండగా, నిద్రవచ్చుచున్నదేమోయని తలచి తొట్టెలో పరుండబెట్టి. ఇంటికి వచ్చిన వారందరకూ సత్కారములు చేయుచుండెను. ఇంతలో కంసుడు పంపిన ఒక రాక్షసుడు శకటరూపములో వచ్చి ఆతొట్టెపైకి ఎక్కి కృష్ణుని అణచి వేయుటకు సమీపించు చుండెను. కృష్ణుడు వీని మాయను గ్రహించి, తన చిన్న పాదములతో తనపైకి వచ్చుచున్న ఆ శకటాకారమును గట్టిగా తన్నెను. ఆ శకటాసురుడు ఆ తన్నుకు తునాతునకలై ఆ తొట్టె ప్రకన్న పడి ప్రాణములు కోల్పోయెను. ఆ విచిత్ర సంఘటన చూచిన అందరు ఆశ్యర్యపడి ఏమి జరిగినదని అడుగగా, ఆ ప్రక్కనున్నవారు ఆ పసిబాలుడు కాలితో తన్నినాడని చెప్పిరి. పసివాని లేతపాదముల తాడనకు వీడు చనిపోవుటయా అని ఆశ్యర్యపడిరి. కృష్ణుడు ఏడ్చుచుండగా, ఏదైన గ్రహము సోకినదేమోయని రక్షలు పెట్టిపరుండజేసిరి.

తృణావర్తుని సంహారము

ఒకనాడు యశోద కృష్ణుని తనతొడపై కూర్చుండబెట్టుకొని ముద్దులాడుచుండగా బాలుడు చాలా బరువుగా తోచెను. ఆ బరువును ఆమె భరించలేక పిల్ల వానిని క్రిందకు దించి, తాను గృహృకత్యములకు వెళ్ళెను. ఇంతలో ఒక పెద్ద సుడిగాలి వచ్చి గోకులమంతయూ ధూళితో కప్పబడెను. గోకుల వాసులు కండ్లు తెరచి చూడలేకపోయినారు. ఆగాలి తగ్గిన తరువాత యశోద వచ్చిచూడగా బాలుడు కనపడలేదు. అంతట యశోద తన బిడ్డడు కనుపించలేదని దుఃఖించుచుండగా గ్రామవాసులు వెదకుటకై బయలుదేరిరి. ఆ సుడిగాలి రూపమున వచ్చిన ఆ తృణావర్తుడను రాక్షసుడు కృష్ణచంద్రుని పైకి తీసుకొనిపోయి, ఆచటి నుండి క్రిందనున్న రాతి బండ మీదికి విసిరిన అతడు చనిపోవునను తలంపుతో నుండగా ఆబాలుడు తృణావర్తుని కంఠమును గట్టిగా నొక్కగా ఆరాక్షసుడు బిగ్గరగా ఆరచుచూ గ్రుడ్లుపైకిరాగా క్రిందనున్న రాతిబండపైబడి చనిపోయెను. ఆ రాక్షసుని శరీరంపై వున్న కృష్ణుని గోపికలు చూచి ఆ పిల్ల వానిని యశోదకు యివ్వగా ఇదంతయూ తృణావర్తుడు చేసిన మోసమని గ్రహించి భగవదనుగ్రహమున తన బాలుడు మృత్యుముఖము నుండి రక్షింపబడెనని సంతోషించెను. కృష్ణుడు సర్వజ్ఞుడు కావున తృణావర్తుని రాకను గ్రహించి తాను తల్లిఒడిలో నున్న యెడల ఆమెనుగూడా ఆసుడిగాలి పైకిలాగుకొని పోయినచో ప్రమాదము జరుగునని ఎంచి తాను మోయలేని బరువుగామారి తల్లి దింపి విడిపోవునట్లు చేసెను. కృష్ణుని రూపములోనున్న భగవానుని మాహాత్మ్యము ఎంత అద్భుతముగా వ్యక్తమైనది!

యశోద ఒకనాడు పుత్రుని ఒడిలో నుంచుకొని స్తన్యమిచ్చుచుండగా, నిద్రవచ్చుచున్న కృష్ణుడు ఆవులించెను. అంతట బాలుని నోటిలో భూమి, ఆకాశము, అంతరిక్షమండలము, సూర్యచంద్రాదులు, సముద్రద్వీపనదీనదాలు, పర్వతాలు మున్నగు చరాచర విశ్వమంతయు కనిపించెను. నమ్మశక్యము గాని ఈ వింతను చూసి ఆశ్యర్యభరితయైన యశోద కన్నులు మూతపడెను.

నామకరణము

వసుదేవుడు తన పిల్లలిద్దరికినీ నామకరణము చేయవలసినదిగా కోరి తమపురోహితుడైన గర్గాచార్యుని నంద వ్రజమునకు పంపెను. నందుడు ఆయనకు స్వాగతమిచ్చి అతిథిపూజ గావించి, తన ఇంటనున్న బాలురకు నామకరణము చేయ ప్రార్థించెను. అంత గర్గుడు తాను యాదవ పురోహితుడు కనుక, తాను బహిరంగముగ నామకరణము చేసిన, దేవకీ వసుదేవులకు అష్టమగర్భ సంజాతుడు తనను చంపునని ఆకాశవాణి చెప్పిననాటి నుండి కంసుడు దేశమంతయూ గాలించుచున్నాడనియూ మీయింట్లోనున్న ఈ పిల్లలే తనను చంపువారని కంసుడు అనుమానించి కౄరచర్యలకు దిగునని చెప్పి, నందుని ప్రార్థననుసరించి ఆ బాలురకు రహస్యముగ గోశాలలో నామకరణ సంస్కారము గావించెను. రోహిణీ సుతునకు బలరాముడనియు, యశోదాతమయునకు కృష్ణుడనియు నామకరణములుచేసి, వీరిద్దరివలన మీరందరూ అన్నికష్టములనూ దాటుదురని వారికిచెప్పి, నందునితో "" నీ కుమారుడు సర్వగుణములలోనూ సాక్షాత్‌ నారాయణడే "" యని చెప్పివెడలి పోయెను.

శ్రీకృష్ణలీలలు

బలరామకృష్ణులు క్రమముగా మోకాళ్ళమీద ప్రాకుచూ ఇటునటు తిరుగుచు తల్లులకు ఎంతో ఆనందమును కలిగింప, వారు కౌగిటచేర్చుకొని ముద్దాడుచుండిరి. ఇంక కొంతకాలమునకు ఇరుగుపొరుగు యిళ్ళకు పోయి ఆయిండ్లలోని గోపికలకందరకూ ఎంతో ఆనందమును చేకూర్చుచుండిరి. మరికొంతయీడురాగా శ్రీకృష్ణుడు గోపకాంతల ఇండ్లలోని పాలు, పెరుగు, వెన్న ఎత్తుకొనివచ్చి తాను కొంత తిని మిగిలినది కోతులకు పెట్టుచుండెను. వారి గోవులను అకాలమున విడుచుచుండెను. ఆ గోపకాంతలు వెన్న, పాలు ఈ బాలునికి అందకుండ ఉట్లలో ఎత్తుగా పెట్టి దాచుకొనగా రోలు, పీటలు మున్నగువాటిని చేర్చి పై కెక్కి ఆకుండలకు చిల్లి పొడిచి, కారుచున్న పాలు, పెరుగు, వెన్న త్రాగుచు తన స్నేహితులకు గూడ పంచిపెట్టుచుండెను. ఆ బానలను చీకటి యిండ్లలో వారు దాచుకొనగ తన దేహ కాంతిచేతను, ఆభరణముల కాంతిచేతను వాటిని కనుగొని ఆ బానలలోని వెన్నను, పాలను, ఎత్తుకొనిపోవుచుండెను. గోపకాంతలు ఈ బాలుడు చేయు అల్లరి భరించలేక యశోదవద్దకు వచ్చి ఆమెతో తమ కష్టములను చెప్పుకొనిరి. యశోద తన బాలుడు తన ఇంటనేవుండుట చూచి వారుచెప్పినమాటలు నమ్మక అట్లు ఎత్తుకొనిపోవు సమయమున వానిని పట్టుకొనిరమ్మని చెప్పి పంపివేసెను. అంతట ఒకనాడు కృష్ణుడు అనేకరూపములతో గోపకాంతల యిండ్లలో ఏకకాలమున కనుబడి వెన్ననెత్తుకొనిపోవుచుండ ఆ గోపకాంతలందరూ తమతమ యిండ్లలోనున్న కృష్ణునిపట్టి. 'నేటికి పట్టుకొనగలిగితిమి' మని గర్వముతో యశోద వద్దకు రాగా ప్రతిగోపికయూ ఒక్కొక్క కృష్ణుని పట్టుకొనివచ్చుటను అప్పుడు తెలుసుకొని ఇంతమందికృష్ణులు ఎచ్చటనుండి వచ్చినారాయుని ఆశ్చర్యపడుచూ యశోదకు చూపింప కృష్ణుడు యశోదవడిలో కూర్చుని వున్నట్లు చూచినవారై వారిచేతులలోనున్న కృష్ణులు అదృశ్యముకాగా సిగ్గుపడి వెడలిపోయిరి.

ఒకనాడు కృష్ణుడు గోపబాలకులతో ఆడుకొనుచూ మన్ను తినగా, తోటిబాలురును బలరాముడును వచ్చి యశోదతో కృష్ణుడు మన్ను తినినాడయు. శిక్షింపుమనియు చెప్పిరి అంతట యశోద కృష్ణుని బుగ్గ పట్టుకొని, కఱ్ఱ చేత బట్టుకొని, మనఇంటిలో నీవుతినుటకు ఎన్నో పిండివంటలుండగా, మన్ను ఏల తింటివి అని బెదిరించి, కఱ్ఱ ఎత్తగా, కృష్ణుడు నేను మన్ను తినలేదు, వీరందరూ అసత్యమాడుచున్నారని చెప్పెను. అంతట బలరాముని అడుగగా, తాను గూడ కృష్ణుడు మన్నుతినుట చూచినానని చెప్పెను. బలరాముడు గూడ అసత్యమే చెప్పినాడన కృష్ణుడు బదులు చెప్పెను. యశోద కోపముతో నోరుతెరచి చూపుమనగా, కృష్ణుడు బిక్కమొగముతో భయపడుతున్నట్లు నటిస్తూ నోరు తెరచెను. ఆ నోటిలో భూమి, సముద్రములు, పుర్వతములు, సకల చరాచర దృశ్యమంతయూ, తన గోకులము, తానును ఉండుట గాంచి యశోద సంభ్రమాశ్చర్యములతో ఇది కలయా, దేవమాయయా, నా బుద్ధిమోహమా అని విచారించుకొని త్రోవ కానక ఇది అంతయూ ఈ బాలుని సహజమైన ఆత్మయోగమనియు, ఇతడు సాక్షాత్‌ భగవంతుడే యనియు భావించి నమస్కరింపబోవుచుండగా, కృష్ణుడు దాని నంతయూ అంతర్ధానము చేసి, యోశోద ఒడిలో కూర్చుండి పాలు త్రాగుచున్నడట్లు కనుపించెను. కృష్ణుడు అవతరించినపుడే విష్ణురూపముగా ఆమెకు కనబడి ఆమె కోరికపై బాలుని రూపముదాల్చి 'నీకు పుత్రరూపముననూ, బ్రహ్మరూపముననూ కూడ దర్శనమిచ్చుచూ అనుగ్రహించెదను' అని చెప్పియున్నాడు గాన అట్లే ఇపుడు రెండు రూపములనూ తల్లికి చూపెను.

ఈ మన్ను తినిన సంఘటనను శ్రీకరపాత్రస్వామి వారు ఏవిధముగా చమత్కరించిరనగా - కృష్ణుడు నోరుతెరచినచో మన్ను కనబడినచో యశోద కఱ్ఱతో ఆయనను కొట్టునుగాన కృష్ణుని భార్యయగు భూదేవి తనభర్తకు అట్టి అవమానము కలుగకుండ, నోరుతెరువగానే తానే ఆనోటిలో ప్రత్యక్షమై భర్త గౌరవమును కాపాడినది. అందువలననే భూలోక మంతయూ కనపడినది - అని వారి అభిప్రాయము వాస్తవములో దృశ్యమంతయూ మిథ్యకనుక కృష్ణుడొక్కడే నిత్యసత్యనైన బ్రహ్మ వస్తువు కనుక దృశ్యముయొక్క మిథ్యాత్వమును కృష్ణుడు ఈ విధముగా నిరూపించినాడని అనుకొనవచ్చును. యశోదకు ఇట్టి మహద్భాగ్యము కలుగుటకు కారణ మేమనగా, పూర్వ జన్మలో నందుడు ద్రోణుడుగా, యశోద అతని భార్యయగు 'ధర' ఉండి తపస్సుచేయగా బ్రహ్మ సాక్షాత్కరించిన ' మాకు హరిభక్తి స్థిరముగా ఉండునట్లు వరమివ్వ' మని కోరిరి. ఆ ద్రోణుడే యిపుడు నందుడుగానూ, ధర యశోదగానూ జన్మించగా బ్రహ్మవర ప్రభావమున కృష్ణుడు వారియింట వెలయుడయూ కృష్ణునియందు యశోదానందులు అత్యంత ప్రేమతో ప్రవర్తించుటయూ సంభవించినది.

ఒకనాడు వేకువజామున యశోదకృష్ణుని బాల్యలీలలు పాడుచు పెరుగు చిలుకుచుండెను. కృష్ణుడు లేచి పాలకై మారాముచేసి కవ్వము తిరుగకుండ పట్టుకొనెను. అంత ఆమె పెరుగు చిలుకుట ఆపి కుమారుని ఒడిలోనిడుకొని పాలుఇచ్చుచుండ, పొయ్యిమీద పెట్టిన పాలు పొంగిపోవుట గమనించి కృష్ణుని వదలి వెళ్ళెను. అందుకాతడుకోపగించి ఒక రాయితో పెరుగు కడవను పగలగొట్టి అందుండి కారిపోవుచున్న పెరుగు, వెన్న తీసుకొని పెరటిలోనికి పోయి తినుచుండెను. తిరిగి వచ్చిన యశోద ఈ దృశ్యమునుచూచి, కఱ్ఱతీసుకొని కృష్ణుని కొట్టబోయెను. బిక్కమొహము వేసిన కృష్ణుని కొట్టుటకు చేయిరాక అచ్చటనున్న రోటికి త్రాడుతో కట్టప్రయత్నించగా ఆత్రాడు రెండంగుళములు తక్కువయ్యెను. ఇంటిలో నున్న త్రాళ్ళన్నియూ తెచ్చికట్టిననూ రెండు అంగుళములు తక్కువ అగుచుండెను. ఆమె విసుగుతో కట్టలేక అలసిపోగా, చెమటకారుచున్న ఆమె ముఖముచూచి కృష్ణుడు ప్రేమతో ఆ త్రాడునకు కట్టుబడిపోయెను. అంతట కృష్ణుడు తల్లి ఇంట్లోనికి పోగానే, ఆ రోటినిలాగుకొని పెరటిలోనున్న రెండు పెద్దమద్దిచెట్లనడుమకు తీసుకొనిపోయి గట్టిగాలాగగా ఆ రెండు చెట్లునూ కూలి వాటిలో నుండి కుబేరుని కుమారులైన నలకూబర మణిగ్రీవులు ప్రత్యక్షమైరి.

పూర్వమొకప్పుడు కుబేరుని కుమారులైన నలకూబర మణిగ్రీవులు ధనమదముతో మదిరాపానముచేసి మత్తిల్లి, స్త్రీ తోజలక్రీడలు సల్పుచుండగా, నారదుడు అచ్చోటికి వచ్చుటచూచి, స్త్రీలు సిగ్గుపడి బయటికివచ్చి చీరెలు కట్టుకొనిరి. కాని వీరిద్దరూ మత్తులో ఒడలు తెలియకవుండగా నారదుడు వారిని మద్దిచెట్లు కమ్మని శపించెను. ఆ కారణమున వారిద్దరూ ఈ మద్దిచెట్లుగా పుట్టి కృష్ణునిస్పర్శచే తిరిగి శాపవిముక్తులైరి.

యశోదకృష్ణుని రోటికి బంధించవలెనని ఎన్ని త్రాళ్ళు తెచ్చిననూ రెండంగుళములు మాత్రమే చాలకపోవుటలో ఆధ్యాత్మికభావమేమన - భక్తుడు ఏకాగ్రమనస్సుతో భగవంతుని ధ్యానించుటకు పరిశ్రమించుచూ, అహాంకరమును వీడుట, అంతట భగవంతుడు అనుగ్రహించుట - అనగా భజజ్జన పరిశ్రమ, భగవదనుకంప అను ఈ రెంటినీ రెండంగుళమలుగా సూచించుచున్నదని శ్రీ కరపత్రస్వామివారు చమత్కరించిరి.

తరువాత యశోదానందులు కృష్ణునిచూచి త్రాడును విప్పి వేసి పిల్లవానికి రక్ష కట్టిరి.

ఒకనాడు 'పండ్లోయమ్మ పండ్లు' అని అమ్ముకొనుచున్న అమ్మిని చిన్నికృష్ణుడు పిలిచి తన చిన్నదోసిలితో వడ్లు ఇచ్చి పండ్లు యిమ్మని కోరెను. సౌందర్యరాశియైన ఆ కృష్ణుడు వయ్యారపు నడకలతో, దోసిలిలో సగము కారిపోవుచున్న ధాన్యముతో వచ్చుట చూచి తన్మయురాలై అతని రెండు చేతులలోనూ పండ్లు పెట్టెను. కృష్ణుడు తన అనుగ్రహ వీక్షణముతో ఆ పండ్లబుట్టను చూడగా ఆ బుట్టలోని పండ్లన్నియూ రత్నము లయ్యెను. కృష్ణచంద్రుని దర్శనము చేసిన ఆమెభాగ్యమేమని చెప్పవచ్చును! తన దోసిటలో ఆమె పెట్టిన పండ్లు స్వల్పమే అయిననూ, కృష్ణుడు తన మహిమచే వాటిని అచ్చటనున్న తోటిబాలుర కందరకునూ పంచిపెట్టి తానునూ కొన్ని ఆరగించెను.

నందప్రభృతులైన గోపాలురు తమకు గోకులములో అనేక ఉత్పాతములు కలుగుచున్నందున గోకులము వీడి ఎచటికైన పోవలయునని సంకల్పించిరి. పూతన, తృణా వర్తుడు, శకటాసురుడు వచ్చుట; మద్దిచెట్లు కూలుట మున్నగు క్లిష్టపరిస్థితుల నన్నింటిని భగవదనుగ్రహమువలన ఎట్లో దాటితి మనియు, గోకులములోనే యుండిన ఇంకెన్ని కష్టములు వచ్చునో అని భయభ్రాంతులై అందరూ సపరివారముగా బృందావనమునకు తరలివెళ్లిరి.

వత్పాసుర, బకాసురుల వధ

బృందావనములో ఒకనాడు యమూనాతీరమున కృష్ణుడు తోటిబాలురతో ఆవుదూడలను మేపుచుండగా ఒకరాక్షసుడు గోవత్సరూపమునవచ్చి ఆవుదూడలతో కలిసి యుండగా, కృష్ణుడు తనను చంపుటకు వచ్చిన రాక్షసుడని గ్రహించి బలరామునికి సంజ్ఞచేయగా. బలరాముడు ఆ వత్సాసురుని వెనకకాళ్ళను తోకను పుచ్చుకొని గిరగిరా త్రిప్పి ప్రక్కనున్న వెలగచెట్టుకు వేసికొట్టగా ఆ రాక్షాసుడు చనిపోయెను. తరువాత ఇంకొకనాడు కృష్ణుడు తన స్నేహితులతో గోవులకు నీళ్ళు పెట్టుటకు కాళిందీ నదికి వెళ్లగా అచ్చట పెద్దకొండవలె బకాసురుడు కనపడెను. ఆ బకాసురుడు కృష్ణుడు సమీపించగానే తటాలునా మ్రింగివేసేను. లోనికిపోయిన కృష్ణుడు దానిగొంతులో నిలచి మండుచున్న నిప్పు వలె కాల్చగా, భరించలేక ఆ బకాసురుని కృష్ణుని బయటకు క్రక్కెను. అంత కృష్ణుడు బకాసురుని ముక్కును పూచిక పుల్లలను చీల్చినట్లు రెండుగా చీల్చి చంపివేసెను. అప్పుడు పుష్పవర్షము కురిసెను.

అఘాసుర వధ

ఒకనాడు కృష్ణుడు తోటిబాలురతో వనభోజనము చేయుటకుగాను ఆహారపదార్థములను ఉట్లలోపెట్టుకొని తినుటకు కూర్చుండగా, తన అన్నను చంపిన కోపముతో బకాసురునితమ్ముడు అఘాసురుడు కృష్ణుని చంపుటకు పెద్ద కొండచిలువ రూపమునవచ్చి గుహవలె నోరు తెరచియుండెను. ఈ అద్భుతదృశ్యమును చూచి గోపబాలురు గుహవలె కనపడుచున్న దాని నోటిలోనికి పోయిరి. కృష్ణుడు ఇంకనూ ప్రవేశించనందున నోరు అట్లేతెరచి యుంచెను. లోనికి పోయిన గోపబాలకులు విషజ్వాలలకు నిష్కారణముగా చనిపోవుదురని తలంపుతో కృష్ణుడుగూడ దానినోటిలోనికిపోయి, దాని గొంతుకకు అడ్డముగానిలచి శరీరమును అద్భుతముగా పెంచినంత, దానికి ఊపిరి ఆడక చచ్చుటకు సిధ్ధముకాగా, కృష్ణుడు తన కృపావీక్షిణమున లోన నిర్జీవులుగా పడియున్న గోపబాలకులను బ్రతికించి అందరితోనూ బయటకువచ్చెను. అంత అఘాసురుని ప్రాణములు పోయి అతనిలోనితేజస్సు కృష్ణునిలో ప్రవేసించెను. అంత పుష్పవర్షము కురిసెను. కృష్ణుని ఐదవసంత్సరమున జరిగిన ఈ అఘాసుర వృత్తాంతము గోపాలు రందరునూ తమ గోకులములోనివారికి ఆరవ సంవత్సరమున చెప్పిరి. ఈ సంవత్సరకాలములో ఏమి జరిగెనన : కృష్ణుడు తోటిగోపబాలకులతో ఒక తటాకము వద్ద కూర్చుండి చల్దిభోజనములు ఆరగించుచుండ ఆవుదూడలు అదృశ్యమాయెను. కృష్ణుడు వాటిని వెదకుటకు పోయి ఎచ్చటను కానరాక తిరిగివచ్చి చూడ గోపబాలురుగూడ అదృశ్యమైరి. అంత కృష్ణుడు దివ్యదృష్టితో ఇది బ్రహ్మదేవుడు చేసిన మోసమని గ్రహించి తానే గోపబాలురుగాను, గోవత్సములుగానూ రూపొందెను. అసలు విషయ మేమన : బ్రహ్మదేవుడు కృష్ణునియొక్క అఘాసురసంహారాది అద్భుత సాహసకార్యములనుచూచి, కృష్ణుని మహిమను ఇంకనూ పరీక్షింపదలచి గోపబాలురను, గోవత్సములనూ ఒక కొండ గుహలో దాచెను. ఇది గ్రహించిన కృష్ణుడు, తన బాధ్యతను గుర్తించి వారివారి రూపములను తానేదాల్చి వ్రజమునకు వెడలెను. ఇండ్లకు తిరిగి వచ్చిన గోపబాలురను తమ తల్లి తండ్రులు, గోవత్సములను గోవులు తమ స్వకీయసంతానముగానే గ్రహించిరి. కాని ఇదంతయూ కృష్ణుని మాయారూపములని ఎంతమాత్రము అనుమానముకలుగలేదు. కృష్ణుని మాయ తెలసుకొనుట సాధ్యముకాదుగదా! ఇట్లు ఒక సంవత్సరము ప్రతిదినము కృష్ణుడు గోపాలురతోడను గోవత్సములతోడను వనమునకు వచ్చిపోవుటను జరిగెను. ఈ సంవత్సరములో గోవులకు లేగదూడలుకలిగిననూ, వీటియందుకంటె ఆ తరిపిదూడలయందే గోవులకు వాత్సల్యము అధికముగా కనిపించుచుండెను ఆ తరిపిదూడలన్నియూ కృష్ణుభగవానుని స్వరూపములేగదా! కృష్ణుడనగా అందరకూ ఆత్మస్వరూపమే గదా! ప్రతిఒక్కరికి తన ఆత్మయందే యాదార్థమైన ప్రేమ వుండును గనుక, ఈ తరిపిదూడలయందు తల్లులకు అట్టి ప్రేమ వ్యక్తమయ్యెను. మామూలుపరిస్థితికి విరుద్ధమగు ఈ విచిత్రమును చూచిన బలరాముడు తన జ్ఞాన దృష్టితో ఈ తరిపిదూడలన్నియూ కృష్ణునిరూపముగా తెలిసికొని, కృష్ణుని అడిగి యదార్థము తెలిసికొనెను.

ఇంట్లుడ బ్రహ్మదేవుడు తాను దాచిన బాలురు, దూడలు, గుహలోనే ఉండగా, వేరేబాలురు, దూడలు ఈ సంవత్సరకాలము ఎట్లు యథాపూర్వముగా గడిపిరి అని అశ్చర్యపడి ఇదంతయూ కృష్ణుని మాయగా గ్రహించి, తనకు గర్వభంగముకాగా, ఆరుసంవత్సరముల వయస్సుగల కృష్ణచంద్రునికి తన నాలుగు శిరస్సులతో సాష్టాంగదండప్రణామములాచరించి, తానుగావించిన అపచారమునకు క్షమార్పణ కోరెను. తల్లి గర్భములోనున్న పిండము అటూ ఇటూ తిరుగుచూ తన్నిననూ తల్లి ఎట్లుసహించునో, కృష్ణుని గర్భమునుండి ఆవిర్భవించిన తననుగూడ అదేవిధముగ క్షమించమని వేడుకొని, కృష్ణుని సాక్షాత్తు అద్వైతపర బ్రహ్మయేయని స్తుతించి అట్టికృష్ణునితో చెలిమిచేయు భాగ్యము కలిగిన గోకులవాసుల యొక్కయూ గోవుల యొక్కయూ భాగ్యమే భాగ్యమనియూ, ఈ గోపాలుర పాద రేణువులు తలదాల్చగాల జన్మ ప్రసాదించమని కృష్ణుని కోరుచూ స్తుతించెను.

అంత బ్రహ్మ తానుదాచిన గోపబాలురనూ గోవత్సములను విడిచిపెట్టగా, కృష్ణరూపమున వున్నవన్నియూ అదృశ్యమై, నిజరూపమున ఉన్న ఆగోపబాలురును, వత్సములును ఈ సంవత్సరకాలములో ఏమిజరిగినదీ తెలియనిస్థితిలో, ఆసైకత ప్రదేశమునకు చేరి వారు తెచ్చుకొనిన చల్దులు ఆరగించి నిజగృహములకు జేరి ఆఘాసురుని కృష్ణుడు చంపిన అలనాటి వృత్తాంతమును చెప్పుకొనిరి.

ధేనుకాసుర వధ

బృందావనమునకు కొలదిదూరములో ఒక పెద్దతాటి తోవును ధేనుకాసురుడను గాడిదరూపము గల రాక్షసుడు కాపలా కాయుచండెను. మంచిసువాసనగల ఆతాటిఫలములను తినుటకు ఉవ్విళ్లూరి గోపబాలురతో సహా కృష్ణ బలరాములు ఆతోటకు వెళ్ళిరి. బలరాముడు తనబలముతో ఆ చెట్లను ఊపగా, పండ్లురాలినవి. ఈ సంగతితెలిసి బలరాముని పైకి ధేనుకాసురుడు యుధ్ధమునకు రాగా, వాని వెనుక కాళ్ళు పట్టుకొని గిరగిర త్రిప్పి తాటిచెట్లకు వేసి కొట్టెను. ఆదెబ్బకు ధేనుకాసురుడు చచ్చుటయు, తోపులోని తాటి పండ్లన్నియురాలుటయు జరిగెను. గోపాలురందరూ పండ్లను స్వేచ్ఛగాతినిరి. అప్పటినుండియూ ఆతోట జనసామాన్యమునకు అందుబాటులోనికి వచ్చెను.

కాళియ మర్దనము

ఒకనాడు గోవులును గోపాలకులును గ్రీష్మకాలపు ఎండకు సహించలేక కాళిందీ దిలోని జలమును త్రాగి మరణించగా, కృష్ణుడు తన అమృత కాటాక్షముచే వారిని బ్రతికించి ఇందుకు కారణము ఆ దీమడుగులోనున్న కాళీయుడను సర్పముయొక్క విషమని గ్రహించెను. ఆ కాళీయుని చంపుటకుగాను ఆ నది ప్రక్కనున్న వృక్షమునెక్కి నదిలోకి దూకెను. ఆశబ్దమునకు కాళీయుడు పైకివచ్చి కృష్ణుని మర్మస్థానములలో కరచి శరీరమునంతనూ చుట్టుకొనెను. ఈ దృశ్యము చూచిన గోకులవాసు లందరూ కృష్ణుడు చనిపోవునేమో యని విలపించుచుండిరి. అంత కృష్ణుడు ఆ కాళీయుని బంధము తప్పించుకొని కాటు వేయుటకు సిధ్ధముగానున్న దానిపడగమీదికి దూకి విచిత్రతాండవము చేయ అపడగలన్నియూ శిధిలమై నెత్తురుకక్కుకొని కాళీయుడు కృష్ణునిశరుణుజొచ్చెను. అతని భార్యలు గూడ తమకు పతిభిక్ష పెట్టమని కృష్ణుని వేడుకొనిరి కృష్ణుడు వారియందు దయచూపి కాళీయుని ఆనదిలోనుండి లేచి సముద్రమధ్యమున ఉన్న ఒక ద్వీపమునకు పొమ్మని ఆజ్ఞాపించెను. అప్పటినుండే ఆ కాళిందీమడుగు విషరహితమై అమృత మధురజలముతో నొప్పారెను.

కాళియమర్దనమైనతరువాత ఆరాత్రి కృష్ణుడును బలరాముడును, గోపాలురతోడను గోవులతోడను కాళిందీతీరమున విశ్రమించి నిద్రించిరి. ఆసమయమున కార్చిచ్చు ఆ వనమునంతయూ తగులబెట్టగా గోపాలురు భయపడి కృష్ణుని శరణువేడిరి. అంత కృష్ణుడు భగవత్స్వరూపుడుగాన ఆకార్చిచ్చును మ్రింగివేసి వారిని రక్షించెను. తెల్లవారిన తరువాత వారందరునూ గోకులములకు తిరిగి వెళ్ళిపోయిరి.

ప్రలంబాసురవధ

ఒకనాడు ప్రలంబుడను రాక్షసుడు గోపబాలుని రూపమున వచ్చి గోపాలురతో ఆటలలో పాల్గొనుచుండెను. ఆ ట ఆనియమము ప్రకారము ఓడిపోయినవారు గెలిచిన వారిని వీపు మీద ఎక్కించుకొని మోయవలెను. ఆ యాటలో బలరాముని చేతిలో ఓడిపోయిన ప్రలంబుడు బలరాముని వీపుమీద దూరముగా తీసుకోనిపోయి తన నిజరూపమును దాల్చి బలరాముని చంపబోయెను. బలరాముడు వానిని ఎదుర్కొని శిరస్సుమీద గ్రుద్దు వేయగా ఆ రాక్షసుడు తల పగిలి చనిపోయెను.

మరొకనాడు కృష్ణుడు గోపాలురతోను గోవులతోను అడవులలో తిరుగుచూ దాహపీడితులై ఖాండవవనం నుండి ఇషీకవనంలోకి ప్రవేశించగా, ఘోరమైన దావానలము ఆ యడవినంతనూ చుట్టుకొనెను. భయభ్రాంతులైన గోపాలురు కృష్ణుని ఆశ్రయించగా, వారినందరునూ తనయొద్దకు జేర్చుకొని, వారందరను కండ్లు మూసుకొనమని చెప్పి తృటికాలములో ఖాండవ వనమునకు జేర్చి కండ్లు తెరువమనెను. ఇషీకవనముగాని, దావానలముగాని కానక ఇదంతయూ కృష్ణుని మహిమయని గుర్తించి సాక్షాత్‌ భగవానునిగా స్తుతించిరి.

గోఫికా వస్త్రపహరణము

ఇట్లు కొంత కాలము గడువ హేమంతఋతువు మార్గ శీర్షమాసముతో ప్రకాశించెను. గోపికలు కాత్యాయనీ వ్రతము ఒకమాసము జరుపుటకుగాను కాళిందీనదిలో స్నానము చేసి తీరము సైకత ప్రతిమను ప్రతిష్ఠించి దానియందు ఆ దేవిని ఆవాహనము చేసి, పూజించి, కృష్ణుని తమకు భర్తగా చేయుమని ప్రార్థించిరి. ఈ మాసవ్రతములో కృష్ణునియందు లగ్నమనస్కలై ఆ దేవిని పూజించుచు కృష్ణలీలలు పాడుకొనుచుండిరి.

ఒకనాడు వారు వస్త్రములు ఒడ్డున విడిచి నదిలో వివస్త్రలుగా స్నానముచేయుచుండిరి. ఇట్లు వివస్త్రలుగ స్నానము చేయుట వ్రతమునకు భంగమగుటచే దానిని సఫలీకృతము చేయు ఉద్దేశముతో కృష్ణుడు ఆ వస్త్రములనన్నింటిని తీసుకొని ఒక చెట్టుపైకెక్కి కూర్చొనెను. ఆ గోపికలు స్నానానంతరము నదిఒడ్డున తమ వస్త్రములు కానక, చెట్టుమీదనున్న కృష్ణుడు తమ చీరెలను అపహరించినాడని గ్రహించి, కృష్ణుని తమచీరెలు ఇమ్మని ప్రార్థించిరి. కృష్ణుడు వారిని బయటకు వచ్చి తీసుకొనమని చెప్పెను. దిగంబరులగుటచే సిగ్గుచేత వారుబయటకు రాజాలక ' మేము మీ దాసులము అనుగ్రహించి మావస్త్రములు మాకిమ్మ' ని కోరిరి. ఇవ్వనిచో రాజునకు చెప్పెదమని బెదిరించిరి. ' మీరు దాసిలైనచో నేను చెప్పినట్లు నడుచుకొనుడు. మీరు బయటకు నచ్చియే వస్త్రములను తీసుకొనవలెను. రాజుకు చెప్పిన నాకేమియూ భయములేదు' అని కృష్ణుడు అనెను. అంత గత్యంతరము లేనివారై గోపికలు తమ మర్మావయనములు చేతితో కప్పుకొని బయటకు వచ్చి ప్రార్థించిరి. " దిగంబరులై స్నానము చేయుటచేత మీరు దేవతాపరాధము చేసిరి గాన, అందుకు పరిహారముగా రెండుచేతులు జోడించి శిరస్సువంచి నమస్కరించండి. ఒక్కచేయితో నమస్కారము పాపము కనుక రెండునూ పరిహరమగును" అని కృష్ణుడు చెప్పగా, వారు తమ సర్వాపరాధ క్షమార్పణకు గాను రెండు చేతులు ఎత్తి నమస్కరించి తమతమ వస్త్రములను తీసుకొనిరి. ' ఇప్పుడు మీరు దోషరహితులుగాన నేను సంతసించితిని. మీ సంగల్పము నెరవేర్చెద' నని వాగ్దానము చేసెను.

మునిపత్నులు భోజనము పెట్టుట

కృష్ణ బలరాములు గోపాలురతో కూడి వనములో పశువులను మేపుచుండగా, గోపాలురకు క్షుద్బాధ ఎక్కుయ్యెను. కృష్ణుని అడుగగా అచటకు కొంత దూరములో ఆంగీరస సత్రయాగము చేయుచున్న బ్రహ్మణులవద్దకు తాముపంపినామని చెప్పి అన్నము తీసుకొనిరండని చెప్పిపంపెను. గోపబాలురు ఆ బ్రహ్మణులను రామకృష్ణులు పంపగా వచ్చినామని చెప్పి అన్నము అడుగగా, ఆ బ్రహ్మ ణులు క్షుద్ర ఫలమునాసించి కర్మచేయుచున్నవారై కృష్ణుని సామాన్య మానవునిగా తలచి, వారికి అన్నమిడక తరిమివేసిరి. వారి తిరిగిరాగా కృష్ణుడు వారిని తిరిగి ఆ బ్రహ్మణుల భార్యలవద్దకు పంపెను. అంతకు ముందు ఆ మునిపత్నులు కృష్ణుని అద్భుత లీలలు వినుటయేగాని దర్శనము చేయని కారణముచే, అప్పుడు దర్శనము కలుగునని కుతూహాలముతో భక్ష్యభోజ్యాది రూపమైన అన్నమును పాత్రలలో పెట్టుకొని వారి భర్తలు వారించిననూ ఆగక కృష్ణునివద్దకు పరుగిడిరి. కృష్ణుడు వారు తెచ్చిన భోజనమును గోపాలురతో తృప్తిగా ఆరగించెను. వారి భర్తలు వారించిననూ వినక వచ్చినందున, తిరిగి వెళ్ళిన భర్తలు స్వీకరింపరేమోయని భయపడుచున్న ముని పత్నులకు అభయమిచ్చి, మీ భర్తలు మిమ్ము ఇతోధిక ప్రేమతో స్వీకరించెదరని చెప్పిపంపెను. ఆ బ్రహ్మణులును పత్నులు రాగానే వారిని ఎంతో ప్రేమతో స్వీకరించి తాము చేయుచున్న యజ్ఞమునకు ఫలమునిచ్చు భగవంతుడే కృష్ణుని రూపమున వచ్చి అన్నము అడిగిన పెట్టలేక పోతిమేయని తమ అపరాధమును తెలుసికొని పశ్చాత్తాపము పొంది స్త్రీలకు భగవంతునియందున్న భక్తి పురుషులై పండితులైన తమకు లేకపోయెనే యని వగచి భగవంతుని యందు భక్తిని ప్రేరేపింపలేని తమ కర్మానుష్ఠానమును నిందుంచుకొనిరి.

ఆ బ్రహ్మణపత్నులు కృష్ణునివద్దకు వెళ్ళేసమయంలో ఒక బ్రహ్మణుడు తన భార్యను గట్టిగా నిరోధించటంవల్ల ఆమె వెళ్ళలేకపోయినది. తానువిన్న కృష్ణలీలలను, రూపగుణాదులము ధ్యానంచేస్తూ ఈ భౌతికశరీరాన్ని వదలి శుద్ధసత్వమయదేహం ధరించి కృష్ణసాన్నిధ్యం పొందినది.

గోవర్ధనోద్ధరణము

నందుడును గోపవృద్ధులును ప్రతిసంవత్సరము చేయు ఇంద్రయాగమునకు ప్రయత్నములు సల్పుచుండ కృష్ణుడు వారయొద్దకుపోయి ఈయాగ పరమార్థమేమి యని అడిగెను. అందుకు నందుడు "కృష్ణా, ఈ యాగమువలన ఇంద్రుడు తృప్తుడై వర్షమును కురియించును. మన భూములు సస్యశ్యామలములై మనకు ధాన్యము, పశువులకు గ్రాసము లభించును. మనకు ఆనందము చేకూరును" అని సమాధానము చెప్పెను. కృష్ణుడు ' ఇంద్రుడు గూడ కర్మ పరతంత్రుడే గనుక అతడేమి చేయగలడు ? ఆయన తృప్తి కొరకు ఈ యాగము అనవసరము. మనలను నిత్యమూ కాపాడుచున్నది ఈ గోవర్ధనపర్వతము, గోవులు, బ్రహ్మణులు. ఈ మువ్వురనూ ఇంద్రయాగమునకై తెచ్చిన వస్తుసంబారముతో పూజించి వండిన పదార్థములు గోవర్థనగిరికి నివేదన చేసి పర్వతమునకు ప్రదక్షిణ చేయండి. ఈ యాగము గోబ్రాహ్మణపర్వత యాగము. మీ యభీష్టములన్నీయూ ఈ మువ్వురివల్లనూ నెరవేరును.' అని చెప్పి ఆ విధముగా వారిచే పూజచేయించి నివేదించిన పదార్థమును గోవర్ధనపర్వతరూపమును తానావహించి ఆరగించి తన నిజరూపమున కనపడి ' మీరందరూ ప్రతిసంవత్సరము చేయు యాగములో మీరు నివేదించిన పదార్థములను ఇంద్రు డెప్పుడైన స్వీకరించినాడా? ఈ రోజున మీ నివేదనలు ఈ పర్వతము స్వీకరించినది! మీ గోవులకు గడ్డిని పుష్కలముగా యిచ్చి గోవులను మనలను రక్షించుచున్నది. బ్రహ్మణులు వేదమంత్రములతో మనలను రక్షించుచున్నారు. ఈ యాగము యొక్క ఫలము మనకు ప్రత్యక్షముగా కనుపడినది.' అని వారందరికూ విశ్వాసము కలుగచేసి, వారందరితో గోవర్ధన గిరికి ప్రదక్షిణగావించి తాను ముందు మ్రొక్క గోపాలురునూ దండప్రణామము లాచరించిరి. ఈ విషయము తెలిసిన ఇంద్రుడు కృద్ధుడై వీరందరనూ శిక్షింప నిశ్చయించి ప్రళయకాలమున లోకములను ముంచివేయుసామర్థ్యముగల సంవర్తక మేఘమును గోకులము మీదికి పంపెను. ఆ మేఘము అవిచ్చిన్నధారాపాతముతో గోకులమునంతనూ జలమయముచేయగా, గోకులవాసులు కృష్ణుని శరణుజొచ్చిరి. గోవులును కృష్ణుని సన్నిధికి చేరినవి. ఇంద్రుని ఈయాగడమునుచూచి ఆతని గర్వ మడంపదలచి, గోవర్ధనగిరిని ఒక చేతితో ఎత్తి గొడుగువలె ఏర్పరచి గోకులవాసులను గోవులను ఈ పర్వతముక్రిందతలదాచుకొమ్మని అభయమిచ్చెను. వారందరూ ఆపర్వతచ్ఛాయలో సుఖముగ ఏడురోజులు ఉండిరి. ఈ అద్భుత చర్యను చూచిన ఇంద్రుడు గర్వము ఉడుగగా, మేఘములను ఉపసంహరించెను. గోకులవాసులు సూర్యరశ్మిరాగా తమ యిండ్లకుపోయిరి. గోవర్ధనగిరి యధాస్థానమున ఉంచబడెను. యశోద, రోహిణి మున్నగు గోకులవాసులు కృష్ణుని కౌగలించుకొని ఆశీర్వదించిరి. అంత ఆకాశమునుండి పుష్పవర్షము కురిసెను. గంధర్వులు గానము చేసిరి.

ఇంద్రుడు తన అపరాధమునకు సిగ్గుపడి తన కిరీటముతో సహా కృష్ణునికి మ్రొక్కి క్షమార్పణవేడి, తనకు గూడ కృష్ణుని ప్రభువుగా పట్టాభిషేకము చేయుటకుగాని కామధేనువును రప్పించి, దాని క్షీరముతోనూ గంగాజలముతోనూ అభిషేకించి కృష్ణునకు " గోవింద'' అను బిరుదునిచ్చెను. ఇట్టి అద్భుత పట్టాభిషేకసమయమున నారదతుంబురులు గానము చేయ, గంధర్వులు నాట్యమాడిరి. ఇట్టి అభిషేకఫలితముగా సస్యములు చక్కగా ఫలించి ప్రజలు సుఖించిరి. అనంతరము ఇంద్రుడు స్వర్గమునకు వెడలెను.

కృష్ణుడు నందుని వరుణలోకమునుండి తెచ్చుట

ఒక ఏకాదశినాడు నందుడు ఉపవాసము చేసి మరునాడు ద్వాదశిఘడియలు కొద్దిగా ఉండుటచే అరుణోదయమునకు పూర్వమే యమునానదికి పోయి స్నానము చేయుచుండగా ఒక అసురుడు నందునిపట్టుకొని వరుణలోకములోనికి గొంపోయి వరుణునివద్దనిల్పెను. నందుని కాననివారై గోకులవాసులు దుఃఖించుచూ కృష్ణుని ప్రార్థించగా కృష్ణుడు వారికి అభయమిచ్చి వరుణలోకమునకు పోయెను. వరుణలోకవాసులందరూ సాక్షాత్‌ భగవత్‌ స్వరూపుడైన కృష్ణుడు తమలోకమునకు వచ్చినందులకు గౌరవించి, నందుని తెచ్చిన అపరాధమునకు క్షమించమని ప్రార్థించి ఈ విధముగా కృష్ణుని దర్శనమైనందుల కెంతయో ముదమునందరి. కృష్ణుడు నందునితో తిరిగివచ్చి వరుణలోక విశేషములను గోకులవాసులకు చెప్పి ఆనందపరచెను.

రాసక్రీడ

కృష్ణుడు పూర్వము గోపికలకు తానుచేసిన వాగ్దానము ననుసరించి శరత్కాలపువెన్నెలలో వారితో క్రీడింపదలచి వేణుగానము చేసెను. ఆగానమాధుర్యమునకు తన్మయులైన గోపికలు వారుచేయుచున్న పనులను అంతటితో వదలి పరుగున వచ్చి కృష్ణుని కౌగలించుకొని క్రీడించిరి. కృష్ణుడు వారందరి యోగక్షేమములు అడిగి ఇంత అర్థరాత్రివేళ అడవికి వచ్చుట ధర్మము కాదని వారిని తిరిగి వెళ్ళిపొమ్మని చెప్పెను. అందుకు ఆ గోపికలు కంట నీరిడి, " కృష్ణా! యిట్లు కఠినోక్తులు పలుకతగదు. మాచిత్తములు నీవు హరించితివి. మాపాదములు కదులుట లేదు. మేము నీకు దాసులమైతిమి. నిన్ను వదలి ఎచ్చటకునూ వెళ్ళలేము. మమ్ములను గ్రహించి నీచేతులతో మా స్తనములను శిరమును స్పృసించి మా మదన తాపమును పోగోట్టుము" అని దీనవదనలై విన్నవించిరి. కృష్ణుడు చిరునగవుతో వారినందరనూ సంతోషపేట్టి అనేకవిధముల వారిని రమింపజేసెను. కృష్ణుని అనుగ్రహము పొందిన గోపకాంతలు తమకే యిట్టి మహాద్భాగ్యము కలిగినందుకు గర్వించి సౌభాగ్యమదమానములను వ్యక్తము చేయగా కృష్ణుడు వారిమధ్యనుండి అంతర్థానమయ్యెను. అంతట గోపికలు విరహతాపము భరింలేక కృష్ణలీలలు పాడుకొనుచూ కృష్ణుని చర్యలు అనుకరించుచూ, కృష్ణుని వెదకుచు గీతములు పాడిరి. ఆ గీతలు గోపికాగీతలని చాల అద్భుతమైనభావములతో చాల ప్రఖ్యాతిగాంచినవి. ఇట్లువిలపించుచున్న గోపికలమధ్య జగన్మోహనరూపముతో కృష్ణుడు ప్రత్యక్షమవగా, గోపికలు పోయిన ప్రాణములు తిరిగి వచ్చినట్లు ఆనందించికృష్ణుని అనేక విధముల సేవించిరి. కృష్ణుడు తాను అంతర్థానమగుట, గోపికల ప్రేమ భావమును ద్విగగుణీకృతముచేయుట కేయని నచ్చచెప్పి వారిని సంతృప్తిపరచి విరహతాపమును పోగొట్టెను.

తరువాత కృష్ణచంద్రుడు గోపకామినులతో రాసక్రీడను సలిపెను. గోపికలందరూ వలయాకారముగా నుండగా కృష్ణుడు ప్రతిగోపికప్రక్కను ఇద్దరిద్దరి నడుమ నిలచి వారి మీదబాహువులు చాపి రాసక్రీడ అద్భుతముగా సాగించెను.

ఈ ఉత్సవమునుచూ ఆకసమున దేవతలందరూ తమతమ విమానములమీద విచ్చేసిరి . దేవదుందుభులుమ్రోగెను. పుష్పవర్షము కురిసెను. కృష్ణుడు ఆ గోపికలతో అనేకవిధముల శృంగార లీలలు జరిపి వారిని సంతోషపరచి, వారితో జలక్రీడలాడుటకు యమునానదిలోనికి జని ఒకరిపై నొకరు జలములు చల్లుకొనుచూ అత్యంత ఆనందముతో జలక్రీడలు సల్పిరి.

రాసక్రీడవిమర్శ

రాస క్రీడ అనునది ధర్మవిద్ధముకాదా యనిసంశయము కలుగవచ్చును. ఈరాసక్రీడ జరుగు కాలమున కృష్ణునికి ఏడు సంవత్సరముల వయస్సు వుండెను. అట్టి వయస్సులో స్త్రీలతో రమించుట యనునది లౌకిక దృష్టిలో అసంభవముగదా! ఇంకను కృష్ణుడు మానవుడుగాక ఈశ్వరుడను దృష్టిలో విమర్శించినను, అద్భుతతేజో మహిమ గల ఈశ్వరావతారులకు ఇట్టిది దోషకారణముకాదు. అగ్ని హోత్రుడు సర్వమును భక్షించినను ఆయన కేమియూ దోషము అంటనట్లుగా రాసక్రీడ దోషము కానేరదు. ఇంకను దేవకీ వసుదేవులకు జన్మించిన కృష్ణుడు ఒక్కడేయుండగా వేలాది గోపికలతో ప్రతిగోపిక ప్రక్కను ఇంకొక కృష్ణుడుగా జత గూడి రాసక్రీడ చేసినను, ఇందరు కృష్ణులు ఎచ్చటి నుండి వచ్చిరి! ఇదంతయూ మానవమేధస్సునకు అందునది కాదు. సర్వశక్తిసంపన్నులు, సర్వజ్ఞులు అగు భగవదవతారపురుషుల చర్యలు అల్పశక్తిగల మానవులు విమర్శించరాదు. సామాన్య మానవధర్మములు వారికి వర్తించవు. ఇట్లు లౌకిక దృష్టిచేతను, ఈశ్వరదృష్టిచేతను రాసక్రీడ అధర్మముకాదని తేలినది. ఇంక ఆధ్యాత్మికదృష్టితో చూచిన, కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు. ఆయన సర్వవ్యాపకుడుగాన సృష్టియంతయూ ఆయన స్వరుపమే! ఆయనకంటే భిన్నమైన వస్తువే లేదు గోపికలురూపములోనున్న జీవులందరునూ ఆయన ప్రతిబింబములే. కృష్ణుడు గోపికలతో రాసక్రీడజరిపినాడనిన, బింబభూతుడైన కృష్ణుడు తన ప్రతిబింబములైన గోపికలతో క్రీడసల్పినాడని అర్థము. పరస్త్రీతో సంచరించిన వ్యభిచారమగునుగాని ప్రతిబింబములతో సంచరించుటను ఒక కర్మగా చెప్పుటకు వీలుగా లేదు గదా! కనుక ఈ మూడు విధములు చూచిన రాస క్రీడ ఆక్షేపమణీయు కాదు. మరియు గోపికలు కృష్ణునితో వ్యభిచరించినారనిన గోపికల భర్తలు ఈవిషయమై అసూయాక్రోధములతో కృష్ణుని నిందించవలెనుగదా! అట్లుగాక వారు తమభార్యలు అదేసమయమున తమప్రక్కనే వున్నారని సంతోషముతో నుండిరి! ఇక ఎవరి మీద ఎవరు నేరము మోపవలెను? కృష్ణునితో గోపికలు క్రీడించినది నిజమే! అదే సమయమున వారి భర్తలప్రక్కన వున్నదీ నిజమే! ఈ రెండు విషయములు ఎట్లు సమన్వయమగును?

ఈ గోపికలనగా రామావతార సమయమున మహర్షులు రాముని సౌందర్యమునకు మోహపడి రాముని కౌగిలించుకొనబోగా, రాముడు అందుల కంగీకరించక తాను కృష్ణావతార మెత్తినపుడు ఈ మహార్షులనందరనూ గోపికలుగా జన్మించి, తనను కౌగలించకొని తమ యభిష్టమును నెరవేర్చుకొనమనచెప్పి వారిని తృప్తిపరచెను. ఆ మహర్షులే గోపికలుగా జన్మించి కృష్ణునితో రాసక్రీడ సలిపిరి. స్త్రీలు వివాహము లేకుండా ఉండకూడదు గనుక ఈ గోపికలు వివాహితలుగా జూపిరి. కాని వీరికి భర్తిలతో నిజమైన సంసారబంధములేదు. కనుపించిన దంతయూ ఆభాససంబంధమే అసలుగోపికలు కృష్ణునితో విహరించుచుండగా ఆభాసగోపికలు భర్తలయొద్దవున్నట్లుగా సంచరించిరి. ఇట్టి కృష్ణునిచర్యలు సామాన్యమానవులబుద్ధికి గోచరించునవిగావు. కనుక విమర్శలకు అతీతములు.

భాగవత దశమస్కంధములో ఐదు అధ్యాయములు గల ఈ రాసక్రీడ ఘట్టము ముఖ్యమైనదే గాక. దీనిని చదివి మననము చేసిన అంతఃకరణమున కామవాసనలు నశించునని ఫలితము చెప్పబడినది అట్టిచో రాస క్రీడలు ధర్మవ్యతి క్రమణమని ఎట్లు చెప్పనగును? మరియు ఈ రాసక్రీడా ఘట్టమును చెప్పిన శుకయోగీంద్రుడు, స్త్రీపుంభేదమెరుగని సర్వాత్మభావముగల జీవన్ముక్త మహాపురుషుడు. అట్టి శుకుని నోటివెంట వచ్చినదంతయూ ధర్మమేగాని ధర్మవ్యతిక్రమణమెన్నటికీ కాజాలదు. ఇంకనూ ఈ ఘట్టమును వినిన పరీక్షిన్నరేంద్రుడు పరమ వైరాగ్యముతో, మోక్షము నందగోరిశ్రవణము చేయుచున్నవాడు, ధర్మవ్యతిక్రమణ ఘట్టమే అయిన విని హర్షించునా? ఈ బోధనయొక్క మాహాత్మ్యమువలన పరీక్షిత్తు మోక్షము పొందినట్లు చెప్పబడినది. ధర్మవ్యతిరిక్త బోధయైన మోక్షము అసంభవముగదా! కృష్ణుని అలౌకిక చర్యలన్నియు అద్వైత సిధ్ధాంతపరముగానే అర్ధము చేసుకొనవలెను. కేవల లౌకికశృంగారభావముతోనే గోపికలు కృష్ణుని చేరలేదు. వారు కృష్ణుని, అందరిదేహములలో నున్న అంతర్యామిగా గ్రహించినట్లుగా వారు గానముచేసిన గోపికాగీతలు వ్యక్తముచేసినవి. ఇంకనూ ఏభావముచేతనైననూ కృష్ణునియందు సంపూర్తిగా చేరినయేడల వారందరకూ మోక్షమువచ్చును. భక్తిద్వారా చేరినయెడల ముక్తినిపొందెదరనుట నిస్సంశయమే! కేవల భక్తిభావముతోనేకాక ఇతర భావములతో గూడ కృష్ణునియందు మనస్సు లగ్నము చేసినవారు గూడ తరింతురు. వైరభావముతో శిశుపాలుడు, భయభావముతో కంసుడు తరించినట్లుగనే కామభావముతో గోపికలు తరించిరి. కనుక ఏభావముతో నైననూ మనస్సు భగవంతుని జేరుట ముఖ్యము.

ఒకసారి సుదర్శనుడను గంధర్వుడు శాపవశమున మహాసర్పమై నందుని కాటువేయగా కృష్ణుడు అది తెలసి దానిని తనకాలితో తన్ని విడిపించెను. కృష్ణుని పాదస్పర్శతో పాపవిమోచనుడైన ఆగంధర్వుడు శాపవిముక్తుడై కృష్ణుని స్తుతించి వెడలిపోయెను.

మరియొక తూరి కుభేరుని అనుచరుడైన శంఖచూడుడు గోపస్త్రీ బృందములో ప్రవేశించి వారిని భయపెట్టుచుండగా తెలిసి, కృష్ణుడు అతనిని సంహరించి అతని శిరస్సుననున్న రత్నమును తీసుకొనెను.

ఇంకొకసారి ఘోరమైన వృషభరూపముతో వృషభాసురడను రాక్షసుడు గోకులమును భయపెట్టగా, కృష్ణుడు వానిని గూడ చంపి వారిభయమును పోగొట్టెను. తరువాత కంసుడు కేసియను రాక్షసుని రామకృష్ణులను సంహరించుటకు గాను గోకులమునకు పంపగా వాడు ఘోరమైన ఆకారముదాల్చి కృష్ణుని మ్రింగుటకు రాగా, కృష్ణుడుతన ఎడమ చేయిన దానినోటలో పెట్టి మండుచున్న ఇనుమువలె చేయగా ఆ రాక్షసుని నోరుకాలి శ్వాసఆడక గిలగిలతన్నుకొని చనిపోయెను.

మహామాయావియగు మయుని కుమారుడు వ్యోమాసురుడు గోపాలరూపమున గోకులములో ప్రవేశించి గోపాలురు ఆడుచున్న దొంగాటలలో కృష్ణుని చంపుటకు పయత్నించగా కృష్ణుడు వానినిగూడ సంహిరించెను.

కంసవధ

ఇంట్లుండగా ఒకనాడు నారదుడు వచ్చి కృష్ణజననరహస్యమును కంసునికి విశదపరచెను. అంతవరకు, కృష్ణుడు యశోదానందుల కుమారుడని యనుకొనుచుండిరే కానీ, దేవకీవసుదేవులకుపుట్టి యశోదానందులవద్ద పెరుగుచున్నాడని ఎవ్వరికిని తెలియదు. తనను చంపుటకు రామకృష్ణులు నందవ్రజములో పెరుగుచు చున్నారని నారదునిచే కంసుడు, కోపోద్రిక్తుడై చంపబోగా నారదుడు వారించెను. అంతట కంసుడు దేవకీవసుదేవులను లోహపాశములతో బంధించి, కారాగారములో పెట్టెను తరువాత మంత్రులతో ఆలోచించి, కంసుడు ధనుర్యాగమను పేరు నొక ఉత్సవమును చేయదలచినట్లును, దానికి రామకృష్ణులను ఆహ్వానించి వారిని, కువలయాపీడమను మదపుటేనుగుతో త్రొక్కించుటకు, చాణూరముష్టికులను మల్లులచే మల్లయుద్ధమున హతమొర్చుటకు పెద్ద పన్నాగము పన్ని అందుకు రామకృష్ణులను తోడితెచ్చుటకుగాను అకౄరునిపిలచి, తన పన్నాగమును ఆతనికి విశదపరచి, ఈ విషయమును రహస్య ముగనుంచి, రామకృష్ణులను ధనుర్యాగమును చూచుటకు పిలుచుకొని రమ్మని చెప్పెను. భగవంతుడైన కృష్ణునియడ ఈ పన్నాగము పారదని అకౄరునకు తెలిసిననూ, ఈ ప్రమేయముగా నైననూ కృష్ణదర్శనము అగునుగదాయని స తసించి, కంసునకు ఇట్టి భావముకల్గుట తన జన్మాంతరపుణ్యవిశేషమని ఆనందించెను. ఇంకనూ, తాను వ్రజమునకు చేరగానే కృష్ణ దర్శనమగునని. ఆతని పాదములపైబడి నమస్కారము చేయుదునని, తనశిరస్సును కృష్ణుడు హస్తస్పర్శచే అనుగ్రహించుననియు అనేక భావపరంపరలలో మునిగిపోయెను. ఆఉదయము రథములో బయల్దేరి సాయం కాలమునకు నందవ్రజము చేరెను. కృష్ణభావనాప్రపంచంలో మునిగిన అకౄరుడు రథమును తోలుట మరచిపోయిననూ, రథము తానంతట అదియే నందవ్రజము చేరెను. ఆ గ్రామ పొలిమేరలో, అంకుశాది రేఖాలాంఛితములైన కృష్ణపాద చిహ్నములను గాంచి, రథముదిగి ఆ యడుగుజాడలలో పడి పొర్లాడెను. అంత రామకృష్ణులు గోశాలలో నున్నారని తెలిసికొని వారి వద్ద కేగి, ఆనందబాష్పములతో, వారి పాదములను కడిగెను. కృష్ణుడు వానిభక్తికి మెచ్చి కౌగిలించుకొని గృహమునకు తోడ్కొనిపోయిరి.

నందాదులు అకౄరుని యోగక్షేమముల నడిగి అర్ఘ్యపాద్యాదుల నిచ్చి సత్కరించిరి. భోజనానంతరము విశ్రమించిన తరువాత, కృష్ణుడు, అకౄరునితో, ''కౄరుడైన కంసుని కొలువులోవున్న మీకు కుశలమా అని అడుగుట ఎట్లు! అయిననూ, మీరు వచ్చినపని ఏమని'' అడిగెను. ''కంసుడు ధనుర్యాగమును చూచుటకు మీ ఇద్దరనూ తోడి తెమ్మని నన్ను పంపె''నని అకౄరుడు బదులు చెప్పెను. అంతట నందుడు ధనుర్యాగమును చూచుటకు గోపాలుర తోనూ రామకృష్ణుతోనూ కానుకలను తీసికొని రథములపై బైలుదేరగా, గోపికలు తమకు కృష్ణునితో వియోగము కల్పించిన అకౄరుని అనేక విధముల నిందించి విలపించిరి కృష్ణుడు గోపికలను 'త్వరలో తిరిగి వచ్చెద'దని ఊరడించి, ప్రయాణమై. యమునాది వద్దదిగి అందరూ స్నానములు చేసిరి. అకౄరుడుగూడ స్నానముచేసి నీటిలో మునుగగా ఆ నీటిలో రామకృష్ణుల దర్శనమయ్యెను. రథముమీద నున్న రామకృష్ణులు నీటిలోకి ఎట్టు వచ్చిరాయని తిరిగి చూడ, రథముపై రామకృష్ణులు కనపడిరి. మరల నీటిలోనూ కనపడిరి. ఇందతయూ సర్వేశ్వరుడు, భగవంతుడూ అయిన కృష్ణుని మాయావిలాసమని గ్రహించి పలు విధములు స్తుతించెను. అంతట మధురకు చేరగానే, కృష్ణుడు అకౄరుని ముందుగా వెళ్ళమనియు, తాను వెనుక వచ్చెదననియూ చెప్పిన, అకౄరుడు ముందుగా తనఇంట ఆతిథ్యమును స్వీకరింప ప్రార్థించెను. అందుకు కృష్ణుడు, కంసుని వధించనిదే మీ యింటికి రానని చెప్పిపంపెను. అకౄరుడు కంసుని కలిసి జరిగిన వృత్తాంతమంతయూ చెప్పెను. మరునాడు సాయంకాలము పురవీధులలో గోపాలురతో కూడి రామకృష్ణులు ప్రవేశించగా ఆ మన్మధమూర్తులను చూచి మేడలమీదనుంచి పురజనులు పుష్పవర్షము గురిపించిరి. పౌర సభ్యులు పూర్ణకుంభములో వారికి స్వాగతమిచ్చిరి. దారిలో కంసుని పరిచారకుడైన చాకలివానిని వస్త్రముల నిమ్మనగా, ఆతడు వారిని నిందించి వస్త్రములనిచ్చుటకు నిరాకరించెను. కృష్ణుడు వానిని సంహరించి, ఆ వస్త్రములను రామకృష్ణులు ధరించి ముందుకు సాగగా, తంతువాయువను నతడు విచిత్ర వస్త్రములను ఇవ్వగా, ధరించి వానిని ఆశీర్వదించి, సుదాముడను మాలకారుని ఆతిథ్యము స్వీకరించి ఆతనిని వరము కోరుకొమ్మనగా, ఆతడు భక్తినిమ్మని కోరెను. ఆతనికి ఆ వరము ప్రసాదించి, కంసుని కొరకై గంధమును తీసుకొని పోవుచున్న కుబ్జయను త్రివక్రయగు స్త్రీని చూచిరి. ఆమె రామకృష్ణుల జగన్మోహనాకారములను మోహించినదై ఆ గంధమును వారలకు అలదెను. కృష్ణుడు ఆమె భక్తికి సంతసించి మూడు వంకరులుగా నున్న ఆమె శరీరమును తన పాదములతో ఆమె పాదములను నొక్కి పైకి లాగగా ఆమె కృష్ణస్పర్శకు అపురూప సౌందర్యవతిగా మారెను. ఆమె కృష్ణుని తన యింటికి ఆహ్వానించి తన మనోభీష్టమును నెరవేర్చమని ప్రార్థింపగా, తాను మధురకు వచ్చిన పనిని పూర్తి చేసిన పిమ్మట అట్లే వచ్చెదనని అభయమిచ్చి ఆమెను పంపివేసెను.

అంతట కృష్ణుడు ధనుర్యాగము చేయుచున్న ప్రదేశమునకు జని, కావలివున్నవారు వారించిననూ లెక్కజేయక, ఆ యాగ ధనస్సును అవలీలగా విరచివైచెను. ఆ విరిగిన ధ్వనికి భూమి కంపించెను. కంసుడు అదరిపడెను. కంసుని పరివారము కృష్ణునిపైకి యుద్ధమునకు రాగా కృష్ణుడు వారి నందరనూ హతమార్చెను.

కంసుడు, కృష్ణుడు చేసిన ధనుర్భంగమునుగురించియు, కావలి వారిని సంహరించిన సంగతియు, తలచుకొని ప్రతినిమిషమునూ కృష్ణుని తలచుకొనుచూ, భయముతో నిద్రపట్టక తన మరణమును సూచించు ఉత్పాతములు కనెను. స్వప్నమున తన శిరస్సు తనకు కనుపించలేదు. చంద్రబింబము రెండుగా కానిపించెను. తన ప్రతిబింబములో రంధ్రములు కనపడెను. తన అడుగులు కనబడకుండెను. శవమును కౌగలించు కొన్నట్లును, గాడిదనెక్కినట్లు, తైలాభ్యంగనము చేయుచున్నట్లు, వస్త్రహీనుడుగ నున్నట్లును, దుస్వప్నములు కలుగగా మరణభీతుడై సంచరించెను.

మరునాడు ఏర్పాటు చేయబడిన మల్ల క్రీడామహోత్సవమునకు ఆహ్వానితులైన వీరులందరూ వచ్చిరి. కంసుడు పరివారముతో కొలువుతీర్చి కూర్చొనియుండెను. గోపాలురు తాము తెచ్చిన కానుకలను కంసునకు అర్పించిరి. చాణూర ముష్టికులను మల్లులు రంగస్థలమునకు వచ్చిరి. రామకృష్ణులు వారిని కలియ రాబోవుచుండగా ద్వారమున కువలయాపీడమను ఏనుగును దారికి అడ్డముగా నిలిపెను. కృష్ణుడు అడ్డము తొలగించమనిన, ఆ ఏనుగును కృష్ణునిపైకి తోలెను. అది కృష్ణుని తొండముతో పట్టుకొనగా, లాఘవముగా తప్పించుకొని, దానిదంతము నూడపెరికి దానితో ఆ ఏనుగును సంహరించెను. ఆ సమయమున కృష్ణుడు మల్లవీరులకు పిడుగుగాను, పురుషులకు పురుషోత్తముడుగానూ, స్త్రీలకు మన్మధుడుగానూ, దుష్టులకు శాసకుడుగానూ, గోపాలురకు బంధువు గానూ, తల్లిదండ్రులకు బిడ్డగానూ, అవిద్వాంసులకు విరాట్టు గానూ, యోగులకు పరతత్వముగానూ, యాదవులకు పరదేవతగానూ, కంసునకు మృత్యువుగానూ కానిపించెను. సభలోని వారందరూ కృష్ణుని వీరగాధలు స్మరించుకొనుచూ, సాక్షాత్తు భగవంతుడేయని స్తుతించుచుండిరి.

ఆ తరువాత చాణూరముష్టికులతో మల్లయుద్ధము ప్రారంభమయ్యెను. సభలోని వారందరును రామకృష్ణులవంటి బాలురతో పర్వతాకారులైన మల్లులు యద్ధముచేయుట అధర్మమని అనుకొనుచుండిరి.

రామకృష్ణుల గాఢ ముష్టిప్రహారములకు చాణూర ముష్టికులు నెత్తురు కక్కుకొని ప్రాణములు విడిచిరి. రామకృష్ణుల ఈవిజయమునకు సభలోని వారందరూ బ్రహ్మనందమందగా కంసుడు భయపడి రామకృష్ణులపైకి భటులను తోలెను. అంతలో కృష్ణుడు కంసుని సింహాసనము మీదికి ఉరికి గరుత్మంతుడు పామును పట్టినట్లు పట్టి రంగస్థలము మీదికి లాగి వానిపై బడి సంహరించెను. కంసుడు ఎల్లవేళలా తినుచూ, త్రాగుచూ, ఏపని చేయుచున్నను కృష్ణుని మనస్సులో తలచుకొని భయముతో ప్రవర్తించుచు ప్రాణము వదలినందున కంసుని తేజస్సు కృష్ణునిలో ప్రవేశించి సారూప్యమునొందెను. ఆతరువాత మీదికి వచ్చిన కంసపరివారమును వరిమార్చెను. పుష్పవర్షము కురిసెను. దేవదుందుభులు మ్రోగెను. అప్సరసలు నాట్యమాడిరి.

కంసుని మరణ వార్తవిన్న అతనిభార్యలు అచ్చటకువచ్చి శోకించుచు సృష్టిస్థితిలయములకు కారుకుడైన భగవంతునితో విరోధము పెట్టుకొనుటవల్లనే తమభర్తకిట్టి దుర్మరణముకలిగెనని విలపించిరి. కృష్ణుడు వారిని ఓదార్చి కంసునికి ఉత్తరక్రియలు జరిపించెను.

అంతట రామకృష్ణులు తల్లిదండ్రులైన దేవకీవసుదేవులను కారాగార విముక్తులగావించి కుమారులుగా పుట్టియు కష్టములపాల్పడిన తల్లిదండ్రులకు సేవచేయలేని అపరాధమునకు క్షమాభిక్ష ప్రార్థించిరి. దేవకీవసుదేవులు వారిని లేవనెత్తి కౌగలించుకొని ఆనందబాష్పములను రాల్చిరి.

అనంతరము మాతామహుడైన ఉగ్రసేనమహారాజును రాజ్యాధిపతిగావించి, కంసునకి భయపడి చెల్లాచెదరైన రాజవంశీయులందరనూ రావించెను.

తరువాత రామకృష్ణులు నందయశోదలవద్దకు వచ్చి, వారి వాత్సల్యమును కొనియాడి, త్వరలోనే తిరిగి వ్రేపల్లెకు వచ్చెదమని ఊరడించి వారిని పంపివేసెను.

వసుదేవుడు గర్గాచార్యులను పిలిపించి రామకృష్ణులకు యధాశాస్త్రీయముగా ఉపనయన సంస్కారము గావించి ఆశుభసమయమున విప్రులనుపూజించి అనేకగోవులనుదానము చేసెను. ఇట్లు ఉపనీతులైన రామకృష్ణులు తాము సర్వజ్ఞులయ్యూ, మానుషవేషధారులగుటచే లోకవిడంబనార్థము గురుకులవాసమొనర్ప కాశీపురికి జని సాందీపుని యొద్ద పరమ భక్తితో సకల వేదములను, వేదాంగములను, వేదాంతమును, చతుష్షష్టికళలను అరువదినాలుగు అహోరాత్రములలో అభ్యసించిరి. విద్యాభ్యాసము పూర్తిచేసి గురుదక్షిణకోర మనగా సాందీపుడు భార్యతో సంప్రదించి మున్నెన్నడో ప్రభాసక్షేత్రమున సముద్రములో పడిచనిపోయిన తనకుమారుని దక్షిణగా యిమ్మని కోరెను. కృష్ణుడు వెంటనే ప్రభాస క్షేత్రమునకు జని, సముద్రునివలన, గురుపుత్రుడు శంఖరూపుడగు పంచజనుడను రాక్షసునిచే హరింపబడెనని తెలిసికొని, సముద్రగర్భమున ఆదానవునితో పోరాడి, సంహరించి, ఆతని ఉదరమున గురుపుత్రుని కానక, ఆరాక్షసుని శంఖమును తీసుకొని యమపురికి పోయి శంఖము ఊదిరి. యముడు ఎదురువచ్చి వారువచ్చిన సంగతి తెలిసికొని గురుపుత్రుని వారికి వప్పగించెను. రామకృష్ణులు ఆకుర్రవానిని సాందీపునికి సమర్పించి గురువు అనుజ్ఞతీసుకొని మధురాపురమునకు తిరిగి వచ్చిరి. మధరాపురవాసులందరూ రామకృష్ణులు తిరిగి రాగానే పోయినసొమ్ములు తిరిగిదొరికినంత ఆనందముపొందిరి.

కృష్ణుడు త్రివక్రయగు కుబ్జకు ఇచ్చిన వాగ్దానమును చెల్లించుకొనుటకుగాను ఉద్ధవునితో ఆమె గృహమునకు వెడలెను. కుబ్జ అమితానందముతో కృష్ణుని సుఖాసనాసీనుని చేసెను. కృష్ణునితోసమానముగ ఆసనము సంగీకరింపక క్రింద కూర్చొన్న ఉద్ధవునిగూడ తగినవిధముగ సత్కరించెను. అంత ఆసుందరి చక్కని అలంకారములతో కృష్ణునిగూడి రమించెను. ఆమె మనోభీష్టము నెరవేరిన పిదప ఉద్ధవునితో తిరిగి వెడలిపోయెను. అంత అకౄరునికి ఇచ్చిన వాగ్దానమును గూడ చెల్లించుటకు బలరామునితోనూ ఉద్ధవునితోనూ అతనిగృహమున కేగిరి. ఉద్ధపుడు వారికెదురేగి అర్ఘ్యపాద్యాదులొసంగి, వారిపాదోదకములు శిరస్సున జల్లుకొని పూజించి ఉపచారములు సల్పెను. రామకృష్ణుల రాకవలన తనగృహము పావనమైనదనియూ, భార్యాపుత్రాదిరూపమున భాదించుచున్న మాయకు తొలగించి కృతార్థుని చేయమనిప్రార్థించెను.

కృష్ణుడు ఉద్ధవుని గోపికలవద్దకు పంపుట

భ్రమరగీతలు

కృష్ణుడు గోకులమును వీడి మధుర కేగినపుడు గోపికలు కృష్ణవియోగమును సహించలేక అడ్డుపడిరి. కృష్ణుడు మధురలో కార్యములను నెరవేర్చి తిరిగి వత్తుననివారి ననునయించి మధురకు వెళ్ళెను. ఇపుడు గోకులమునకు పోగోరిన వాడై ఉద్ధవుని పిలిచి 'నీవు గోకులమునకు జని, మా తల్లి తండ్రులైన యశోదా నందులకు, నన్ను ప్రాణములకన్న ఎక్కువగా ప్రేమించిన గోపికలకు నా క్షేమమును తెలిపి నా రాకను ఎరిగింప'మని చెప్పి పంపెను.

గోకులము చేరిన ఉద్ధవుని నందుడు కౌగలించుకొని సకలోపచారములు గావించి కృష్ణుని యోగక్షేమములు నరిసి నంతసించెను. మరునాడు ఉదయమున గోపికలను కలుసుకొనుటకుగాను బంగారు రథముపై బయలుదేరెను. గోపికలు తెల్లవారుజామున లేచి కృష్ణలీలలను పరమానందముతో పాడుకొనుచూ రథముపైనున్న ఉద్ధవుని చూచి అలనాడు కృష్ణుని మధురకు గొంపోయి తమకు ఎడబాటు కలిగించిన కౄరుడైన అకౄరుడితడేయని గ్రహించి వానిని సమీపించి యిట్లనిరి ''కృష్ణుడు పంపగా మీరు వచ్చినట్లున్నది. ఈ గోకులములో ఆతని తల్లి దండ్రులున్నారు గాన వారి యోగక్షేమములు తెలిసికొనుటకు నిన్ను పంపినాడు కాబోలు! మాతో పని పూర్తి అయినది గనుక మేము ఆయనకు గుర్తుండము కాబోలు! ఋత్విక్కులు దక్షిణ పుచ్చుకొన్నపిదప యజమానిని మరచినట్లు, పండ్లు ఉడిగిన చెట్టును పక్షులు విస్మరించినట్లు, స్త్రీని అనుభవించిన తదుపరి ఆమెను మరచిపోవు జారపురుషుని వలెనే కృష్ణుడు మమ్ములను మరచినాడు. అయిననూ మేము అతనికి జ్ఞాపకము ఉండతగిన వారమా!'' ఈ విధముగా కృష్ణవియోగమును సహించలేక ఉద్ధవుని ఒక భ్రమరముగా భావించి అనేకములైన నిష్ఠురోక్తులతో పాడిరి. వానినే భ్రమరగీత లందురు. ఇది పదునొకండు గీతము లతో వెలసిన అద్భుత శృంగార ప్రేమ భావములుగల ఘట్టము. దీనికి అనేక వ్యాఖ్యానములు గలవు. ఇట్లు గోపికలు కృష్ణదర్శన లాలసలై పాడిన గీతములు విని, వారికి కృష్ణుని యందున్న అద్భుత ప్రేమభక్తికి ఆశ్చర్యము పొంది కృష్ణ సందేశమును ఉద్ధవుడు ఇట్లు చెప్పెను. ''గోపికలారా! సాక్షాత్‌ భగవత్స్వరూపుడైన కృష్ణునియందు మీ మనస్సులను లగ్నము చేసినారు గాన మీరు కృతార్థులు. మీరు లోకమందరిచే పూజింప దగినవారు. మనులకు గూడ దుర్లభ##మైన భక్తిని మీరు భార్యవశమున బడసితిరి. మీరు పతి పుత్ర-దేహ-గేహాదులను విస్మరించి కృష్ణుని పరమపరుషునిగా వరించి ఏకాంత భక్తిచేసితిరి. మీ భక్తిని చూడ, కృష్ణ భక్తుడననుకొన్న నాకే సిగ్గు వచ్చునట్లు చేసినది. ఇది నాకు అనుగ్రహముగా భావించుచున్నాడను. కృష్ణుని సందేశ##మేమగా, ''ఈ సకల చరాచర ప్రపంచము సందంతనూ సర్వాత్ముడనై వర్తించు నా వియోగము మీకు ఎప్పుడునూ కలుగదు. మీకు సన్నిహితముగా నున్నప్పుడు కన్నదూరముగా నున్నయెడల మీకు నాయందు ప్రేమ ద్విగుణీ కృతమగును. అందులకే నేనట్లు వర్తించితిని. నాపై లగ్న మనస్కలైన మీరు త్వరలో నన్ను పొందెదరు.'' అని తెల్పెను. అయిననూ సంతృప్తినందని గోపికలు కృష్ణుని నిందాస్తుతి చేయుచూ మధురవంటి రాజధాని నగరములోని నాగరిక లలనామణుల విలాసములతో తన్మయుడై యుండు కృష్ణుడు గ్రామ్యవనితలమైన మమ్ము ఎట్లు స్మరించును? వాని లీలలను మరచెదమన్న మరిపురాకున్నది, అని కృష్ణలీలలను పాడుకొనుచూ వ్యసనార్ణవమున మునిగిన తమను ఉద్ధరింపమని మా ప్రార్థనగా కృష్ణుని కెరింగింపుమని ఉద్ధవుని కోరిరి. గోపికల మధురభక్తికి తన్మయుడై వారి సన్నిధిలో కొన్ని మాసములు గడిపి, కృష్ణుడు తనను ఇచ్చటకు పంపుటమహోపకారముగా భావించి, గోపికల పాదరేణువులు తన శిరముపై బడునట్లు ఇచట తరులతా గుల్మ ఓషధులలో నొక దానిగ తాను జన్మించిన ధన్యమగుదునని, ముల్లోకములను పవిత్రముచేయు ఆ గోపికల పాదరజస్సునకు మ్రొక్కెదనని తనలో ధ్యానించి వారివద్ద శలవు గైకొని యశోదానందులు, గోపికలు కృష్ణునికి ఇచ్చిన కానుకలను తీసుకొని భారహృదయముతో వారివద్ద వీడ్కోలు తీసుకొని మధురకేగి కృష్ణునికి గోపికలభక్తి ఉద్రేకములను సవివరముగా తెల్పెను.

తరువాత కృష్ణుడు పాండవుల యోగక్షేమములు తెలుసుకొనుటకు గాను ఉద్ధవుని హస్తినాపురమునకు పంపెను. అచ్చట విదురుని, కుంతీదేవిని కలిసి ఆమె చెప్పుకొన్న కష్టములను విని కృష్ణునికి తన ప్రార్థనగా ఆమె తెలిపిన వచనములు విని, ధృతరాష్ట్రుని కలసి, పాండవులయెడ ప్రేమతో ప్రవర్తించ మని ధర్మప్రబోధము చేసెను. పుత్రానురాగ పశుడైన ధృతరాష్ట్రునికి ఆమాటలు చెవికెక్క లేదు. అయిననూ భూభారహరణార్థము యదుకులమున అవతరించిన ఆ పరమ పురుషుడైన కృష్ణునికి తన నమస్కారముల నందజేయమని దెల్పగా, అకౄరుడు తిరిగివచ్చి హస్తినాపుర విశేషములను కృష్ణునకు ఎరుక పరచెను.

ముచుకుందునిచే కాలవయమని సంహారము చేయించుట-

ముచుకుందుని అనుగ్రహించుట - జరాసంధుని ముట్టడి-

ద్వారకను నిర్మించుట

కంస సంహారము కాగానే ఆతని భార్యలు అస్తి, ప్రాస్తి తమ పుట్టినింటికిజని తండ్రియగు జరాసంధునితో కృష్ణుడు తమభర్తను చంపిన వృత్తాంతమును తెలుపగా, జరాసంధుడు అమితక్రోధముతో ఇరువదిమూడు అక్షౌహిణుల సైన్యముతో వచ్చి మధురను ముట్టిడించెను. కృష్ణుడు, జరాసంధునితో సహా సైన్యమును పరిమార్చగలిగిననూ అట్లుచేయక జరాసంధుని వదలి, సైన్యమును హతమార్చెను. ఇట్లు చేయుటవలన జరాసంధుని మిగిలిన సేవలను తీసుకొని తిరిగి దండెత్తెను. ఇట్లు భూభారహరణముకై పదునేడుసారులు ఆతని విడచిపెట్టి సైన్యమును సమూలముగా నాశనము చేసెను. ఇకమిగిలిన జరాసంధుడు పదునెనిమిదవపర్యాయము మిగిలిన సైన్యముతో ముట్టడించుటకు వచ్చెను. ఇట్లుండ యవనుడను దుష్టవ్లుెచ్ఛ ప్రభువున్నూ తనసైన్యముతో లోకమునకు పీడగలుగ చేయుచుండుటచే వారుగూడ నిహతులైనగాని భూభారము తొలగదను తలంపుతో నారదుడు యవనుని గూడ పురిగొల్పెను. అతడు తన మూడుకోట్ల వ్లుెచ్ఛ సేనలతో మధురను ముట్టడించెను. ఇట్లు ఒకప్రక్కన యవనుడు, మరయొరిక ప్రక్కన జరాసంధుడు మధురను ముట్టడించగా, యాదవులను నిహతులు కాకుండా రక్షించుటకై విశ్వకర్మను రావించి సముద్రములో ద్వాదశయోజన విస్తీర్ణముగల పెద్దపట్టణమును జలదుర్గముగా నిర్మింపజేసెను. అట్టి లోకోత్తర విభవముతో నొప్పారు ద్వారకకు కృష్ణుడుతన మాయాప్రభావమున మధురలోని వారినందరనూ చేర్చి. బలరాముని వారికి రక్షణగా నియోగించి, తాను నిరాయుధుడై మధురనుండి పరుగెత్తుచుండెను.

నారదుడు తెల్పిన ఆనవాలును బట్టి అది కృష్ణుడేయని గ్రహించి యవనుడు కృష్ణుని వెంబడించెను. కృష్ణుడు వానికి చిక్కిచిక్కకుండా బహుదూరము తీసుకొనిపోయి ఒక గుహలోనికి గొంపోయెను. ఆగుహలో నిద్రించుచున్న ఒక సాధుపుంగవుని కృష్ణుడే దొంగని నిద్రపోవుచున్నాడని తలచి కాలితో తన్నెను. ఆపరుండిన మహాపురుషుడు ఇక్ష్వాకు చక్రవర్తి మాంధాత కుమారుడైన మునికుందుడు అతడు పరిపాలనపై వేసారి వైరాగ్యముతో మోక్షార్థియై వాసుదేవుని దర్శనము కొరకు ఆ గుహయందు శయనించి యుండెను ఆ మహాపురుషుని కోపోద్రిక్త దృష్టి ప్రసారముతో యవనుడు భస్మమయ్యెను. అంత కృష్ణుడు ముచుకుందునకు దర్శనమిచ్చెను. ఆతడు తాను వాసుదేవునికై నిరీక్షించుచున్నాననియు, ఈ కృష్ణుడే వాసుదేవుడనియు గ్రహించి స్తుతించగా కృష్ణుడు భూభారహరణార్థమై తానే వాసుదేవునిగా జన్మించినానని తెల్పి ముచుకుందుని వరము కోరుకొమ్మని అడుగగా ఆతడు మోక్షము వినా మరేమియు అక్కరలేదని తెల్పెను. అందుకు కృష్ణుడు ''నీవు క్షత్రియుడవైజన్మించి క్షాత్రధర్మమున కొంత పాపము ఆచరించియుందువు. అది పరిహారమగుటకు తపమాచరించి పరిశుద్ధుడవై రాబోవు జన్మలో బ్రాహ్మణుడవై తపమొనరించి బ్రహ్మర్షివై తరించెదవని అనుగ్రహించెను. అంత ముచుకుందుడు బదరికాశ్రమమునకు జని శాంతుడై తపంబున హరిని ఆరాధించెను.

కృష్ణుడు తిరిగి మధురకు వచ్చి అచట నిలిచియున్న వ్లుెచ్ఛసైన్యమును సంహరించి ద్వారకకుపోవు సముయమున జరాసంధుడు పదునెమిదవసారి యుద్ధమునకు వచ్చెను. రామకృష్ణులు అతనికి భయపడుతున్నట్లు నటించి పరుగిడి ప్రవర్షణ పర్వతము నధిరోహించి, దానిపైన్ను అరణ్యమున దాగుకొన్నట్లు భ్రమింపజేసి, ద్వారకకు జేరిరి. జరాసంధుడు వారిని హతమార్చ తలంపుతో ఆ యడవికి నిప్పుపెట్టి రామకృష్ణులు అందులో దగ్ధమైనారను భావముతో తననగరమునకు వెడిలిపోయెను జరాసంధుడు మున్ముందు భీమునిచే చంపబడ వలసియుండుటచే, ఆతనిని రామకృష్ణులు చంపకవిడచిపుచ్చిరి. రామకృష్ణులు ద్వారకలో సుఖముగా నుండిరి.

ధశమకిరణము

(దశమస్కంధము - ఉత్తరభాగమ)

రుక్మిణీ కల్యాణము

విదర్భదేశపు రాజు భీష్మకునకు రుక్మి మున్నగు ఐదుగురు కుమారులున్నూ రుక్మిణియను కుమార్తెయును కలరు. రుక్మిణి కృష్ణుని రూప వీర్య వైభములను గురించి విని కృష్ణునే వివాహము చేసుకొనుటకు నిశ్చయించుకొనెను. కృష్ణుడునూ రుక్మిణి రూప గుణములను విని ఆమెనే వివాహమాడ నిశ్చయించుకొనెను. రుక్మిణి తండ్రియు, బంధవులనూ ఈ వివాహమునకు అనుకూలురేగాని అన్నయగు రుక్మి ఆమెను శివుపాలునకు ఇవ్వ నిశ్చయించుకొని తగు ప్రయత్నములు చేయుచుండెను. ఈ సంగతి తెలిసిన రుక్మిణి తాను కృష్ణునే వివాహమాడదలచినట్లు తన భావములను కృష్ణున కెరుక పరచుటకు పరమ ఆప్తుడైన బ్రాహ్మణుని ఒకనిని ద్వారకకు పంపెను. ఆ బ్రాహ్మణుడు కృష్ణుని సందర్శించి రుక్మిణి సందేశమును -ఆమె కృష్ణుని తప్ప ఇంకెవరినీ పెండ్లాడ దలచలేదనియూ, మరెవరితో నైన జరిగినచో ప్రాణాత్యాగము చేయుననియూ-తెల్పెను. అంతట కృష్ణుడు తన కన్నియు తెలుసు ననియు, రుక్మిణిని తప్పక వివాహము చేసుకొనెద ననియూ రథమునెక్కి ఆ బ్రాహ్మణునితో గూడ విదర్భదేశమునకు బయలుదేరెను.

ఇచ్చట భీష్మకుని గృహమున రుక్మిణిని, రుక్మి అభిప్రాయము ప్రకారము, శిశుపాలుని కిచ్చి వివాహము చేయుటకు ప్రయత్నములు జరుగుచుండెను. కృష్ణుడు వచ్చిన సంగతి తెలిసి భీష్మకుడు ఎదురేగి సత్కరించెను. ఈ వివాహవిషయమున పోరాటము వచ్చునేమో యను తలంపుతో బలరాముడు సేనాసమేతముగా వచ్చెను. తాను పంపిన బ్రాహ్మణుడు ఇంకనూ రానందుకు చింతించుచున్న రుక్మిణివద్దకు ఆ బ్రాహ్మణుడు వచ్చి కృష్ణుని రాకను తెల్పెను. ఆమె బ్రహ్మనందమొంది ఇంత మహోపకార మొనర్చినందుకు తగిన ప్రత్యుపకృతి ఏమియు తోచక, ఆదరమున నమస్కరించెను. మహాలక్ష్మి అవతారమగు రుక్మిణి అనుగ్రహము కల్గిన ఆ బ్రాహ్మణునికి లోపమేమి యుండును ! ఆమె ప్రకృతి రూపిణిగూడ యగుటచే ప్రకృతి సంబంధమైన సంసార అనర్థములు పోయి మోక్షము ప్రాప్తించునని తలంచవచ్చును. కృష్ణునిరాక తెలిసిన ప్రజలు రుక్మిణీకృష్ణులు ఒకరి కొకరు తగినవారనియు, వారి వివాహము జరుగుటకుగాను తమతమ పుణ్యములనుగూడ ధారపోయుచుండిరి.

మరునాడు ఉదయము రుక్మిణి మౌనవ్రతయై, పాదచారిణిగ ఊరిబయటనున్న గౌరీఆలయమునకు రాజ భటులు వెంటరాక, శంఖభేరీమృదంగవాద్యములతో సపరివారముగ బయలుదేరెను. ఆలయమున పరమేశ్వరిని పూజించి కృష్ణునే తనకు భర్తగా చేయమని ప్రార్థించి, తిరిగి వచ్చుచుండ అచ్చటకు విచ్చేసిన రాజకుమారులందరూ ఆమె సౌందర్యమునకు మోహపరవశులై మూర్ఛపోయిరి ఆమె వచ్చివచ్చి కృష్ణుని రథము సమీపించగనే, కృష్ణుడు ఆమెను రథముపై నెక్కించుకొని బలరామునితో గూడ ప్రయాణమయ్యెను. ఈ దృశ్యమును చూచిన జరాసంధుడు మున్నగు శిశుపాలుని పక్షమువారు, రుక్మిని ముందుంచుకొని కృష్ణునిపై యుద్ధమునకు బయలుదేరిరి. కానిన బలరామ యాదవసేవల చేత ఓడింపబడి తిరిగిపోయిరి. రుక్మిమాత్రము కృష్ణుని చంపి రుక్మిణిని తిరిగి తీసుకురానిదే పట్టణము ప్రవేశింపనని ప్రతిజ్ఞ చేయుటచే, ఆతడు కృష్ణుని వెంబడించెను. కృష్ణుడు అతనిని ఓడించి చంపబోగా రుక్మిణి కృష్ణుని పాదములు పట్టుకొని అన్నను చంపవలదని ప్రార్థించెను. ఆమె ప్రార్థననంగీకరించి రుక్మిని చంపక అతని మీసములను కేశములను క్షౌరము చేసి విరూపిగా చేయగా, విరూపత్వముగూడ చావుతో సమానమగుట రుక్మిణి బాధపడెను. బలరాముడు ఆమెను ఓదార్చెను. రుక్మి ఇట్టి పరాభవమును పొంది, ప్రతిజ్ఞ వమ్ము అయినందున, తన నగరమునకు పోక భోజకటమను పురము నిర్మించుకొని అచట నివసించెను. కృష్ణుడు రుక్మిణితో ద్వారకకు జేరి శాస్త్రోక్తవిధానమున అత్యంత వైభవముతో వివాహమాడెను. ద్వారకావాసులందరు రుక్మిణీకృష్ణుజూచి పరమానంద మందిరి.

సత్యభామా జాంబవతుల వివాహము

సత్రాజిత్తు సూర్యుని తపస్సు చేయగా సూర్యుడు అతనికి శమంతకమణిని అనుగ్రహించెను. దానిని ధరించి సత్రాజిత్తు ద్వారకకు వచ్చుచుండ ఆమణికాంతికి అందరూ, సూర్యుడే కృష్ణుని చూచుటకు వచ్చుచున్నాడనుకొని కృష్ణునితో చెప్పిరి. కృష్ణుడు ఆ కాంతి సూర్యుడుకాదనియు శమంతకమణి అనియు చెప్పెను. సత్రాజిత్తునకు ఆమణి ప్రతిదినము ఎనిమిదిబారువుల బంగారము ఈను చుండెను. ఇంకనూ ఆమణి వున్నచోట అరిష్టములు దుర్భిక్షములు వుండనేరవు ఆట్టి మహత్తర శక్తిగల మణి సామాన్యుల వద్ద కంటే మహారాజు వద్ద యుండుట శ్రేయస్కరమని కృష్ణుడు సత్రాజిత్తుతో, దానిని రాజైన ఉగ్రసేనునివద్ద వుంచమని చెప్పెను. అందుకు సత్రాజిత్తు నిరాకరించెను.

ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు అమణిని కంఠమున ధరించి వేటకు వెళ్ళగా ఒక సింహాము అతనినిచంపి మణిని తీసుకుపారిపోవుచుండ, ఆసింహమును జాంబవంతుడు చంపి మణిని తనగుహలోనికి తీసుకొనిపోయి తన కుమార్తె తొట్టెకు క్రీడాకందుకముగా గట్టెను. తన తమ్ముడు అడవి నుండి తిరిగిరాని కారణములు విచారించి, సత్రాజిత్తు, కృష్ణుడే ఆతని చంపి మణిని అపహరించుయుండునను నింద కృష్ణునిపై మోపెను. దేశ##క్షేమము కొరకు కృష్ణుడు మణిని రాజువద్ద వుంచమని చెప్పుటలోని ధర్మసూక్ష్మమును గ్రహించక సత్రాజిత్తు యిట్టి నీలాపనింద కృష్ణునిపై వేసెను.

కృష్ణుడు తనపై వేసిన నీలాపనిందను బాపుకొనుటకై కొందరు నగరవాసులతో గూడ అడవికేగి అచ్చట ప్రసేనుని కళేబరము చూచి అచ్చటి జాడలను బట్టి జాంబవంతుని గుహలోనికి జనెను. కూడావచ్చిన పౌరులు బయటనే ఉండిరి. కృష్ణుడు గహలోనికిజొచ్చి తొట్టెకు కట్టబడియన్న శమంతక మణిని తీసుకొనబోవ జాంబవంతుడు యుద్ధమునకు దిగెను. ఆయుద్ధము ఇరువది నెనిమిది దినములు జరిగెను జాంబవంతుడు తనతో ఇన్ని రోజులుపోరాడువారు, తన ప్రభువైన శ్రీరాముడే ఈ కృష్ణుని రూపమున వచ్చినట్లు తెలిసికొని క్షమార్పణ కోరగా కృష్ణుడు తనపై మోపబడిన అపవాదును పోగొట్టు కొనుటకై ఆమణిని తీసుకొనిపోవుటకు వచ్చినానని చెప్పెను. అంత జాంబవంతుడు సంతోషముతో ఆమణినిచ్చి తన కుమార్తెయగు జాంబవతిని కృష్ణునకు భార్యగా నొసంగెను. కృష్ణుడు జాంబవంతునకు ముక్తినొసంగెను

ఆ గుహద్వారమున పండ్రెండు దినములు వేచియున్న నగరవాసులు, కృష్ణునికి అపాయము సంభవించి యుండవచ్చునని తలంచి, దేవకీవసుదేవులతోనూ రుక్మిణితోనూ చెప్పగా వారు కృష్ణుడు క్షేమముగా వచ్చుటకుగాను దుర్గాదేవిని కొలిచిరి. దుర్గాదేవి పత్యక్షమై, కృష్ణుడు సురక్షితముగా మణితో తిరిగి వచ్చుచున్నాడని అభయమిచ్చెను. కృష్ణుడు వెంటనే మణితోనూ జాంబవతితోనూ తల్లిదండ్రులకు కనపడగా వారందరూ చనిపోయినవారు తిరిగి బ్రతికి వచ్చినంత పరమానందము పొందిరి.

కృష్ణుడు ఒక సభ చేసి సత్రాజిత్తుని పిలిపించి జరిగిన వృత్తాంతమంతయూ జెప్పి, సత్రాజిత్తు తనమీద వేసిననింద నిజము కాదని నిరూపించి ఆమణిని సత్రాజిత్తున కిచ్చివేసెను. ఆతడు సిగ్గుపడి కృష్ణునికి చేసిన అపచారమునకు పరిహారముగ తనకుమార్తెయగు సత్యభామను, మణిని కృష్ణునకి సమర్పించెను. కృష్ణుడు సత్యభామను భార్యగా స్వీకరించి మణినిమాత్రము సత్రాజిత్తునకే తిరిగి యిచ్చివేసెను. తరువాత కృష్ణుడు జాంబవతిని, సత్యభామను యధావిధిగా వివాహము చేసికొనెను.

ఆ మణికొరకై శతధన్వుడు సత్రాజిత్తుని చంపగా, కృష్ణుడు అది తెలిసికొని శతధన్వుని చంపి మణికానుపించకపోగా, అది శతధన్వుడు అకౄరుని వద్ద దాచినట్లు తెలిసికొని, దానిని తానుతీసుకొనక అకౄరుని వద్దనే వుంచెను.

ఇట్టి గొప్ప మహిమగల మణులు సామాన్యువలవద్ద వుండిన అనర్థములకు హేతువనియు, అది రాజులవద్ద ఉండవలెను గనుక దానిని ఉగ్రసేనుని వద్ద వుంచమని ఆనాడు కృష్ణుడు చెప్పిన మాటలు సత్రాజిత్తు నిరాకరించినందువలననే ఆతడు మరణమును పొందెను. ఈ చరిత్రను చదివిననూ విన్ననూ నీలాపనిందలు పోవునని కృష్ణుడు అనుగ్రహించెను.

ఒకనాడు కృష్ణుడు అర్జునుతో గూడ యమునానదికి దాహము తీర్చుకొనుటకై వెళ్ళి, అచ్చట తపస్సు చేయుచున్న కాళిందియను సుందరాంగిని చూచి నీవు ఎందులకు తపస్సు చేయుచున్నావని అడిగెను. అందుకు ఆమె 'నేను సవిత్రుని కుమార్తెను, కృష్ణుని భర్తగా కోరి తపస్సు చేయుచున్నాను, తామే ఇచ్చటకు వచ్చినారుగాన నన్ను అనుగ్రహింపప్రార్థన' అనెను కృష్ణుడు ఆమెను అనుగ్రహించి ద్వారకకు తీసుకొని పోయి వివాహము చేసుకొనెను.

మిత్రవింద యను కన్య కృష్ణునియందు గాఢమైన అనురాగము కలిగియుండ ఆమె సోదరులు మున్నగువారు వ్యతిరేకించిననూ లెక్కచేయక ఆమెను రథముపై నెక్కించుకొని ద్వారక తీసుకొని వచ్చి వివాహము చేసుకొనెను.

కోసల ప్రభువైనన నగ్నజిత్తు గొప్ప బలముగల తన ఏడు వృషభములను నిర్జించువానికి తనకుమార్తె నాగ్నజితిని యిచ్చి వివాహము చేతునని ప్రకటించెను. కృష్ణుడు ఆవృషభములు, అడ్డుపడిన ఇతర రాజులను గూడ నిర్జించి ఆమెను ద్వారకు కొనిపోయి వివాహమాడెను. అటుపిమ్మట, తన మేనత్తయగు శృతకీర్తికుమార్తె భద్రను, ముద్రపతి కుమార్తె యగు లక్ష్మణను వివాహము చేసుకొనెను. ఈ విధమున కృష్ణునకు ఎనిమిది మంది భార్యలు ఏర్పడిరి.

నరకాసురవధ

కృష్ణుడు సత్యభామతోగూడి గురుత్మంతునిపై వెళ్ళుచుండగా నరకాసురుడు సేనాసమేతుడై వచ్చి యుద్ధము చేసెను. కృష్ణుడు తన చక్రాయుధముతో వాని శిరము ఖండించెను. అప్పుడు పుష్పవర్షము కురిసెను. భూదేవి తన కుమారుడైన నరకుడు చనిపోగా దుఃఖించక అతడు అపహరించిన అదితి కుండలములను, వరుణుని గొడుగును, వైజయంతి వనమాలికను మహామణిని తెచ్చియిచ్చి నరకుని పుత్రుడైన భగదత్తుని రక్షించమని ప్రార్థించెను. కృష్ణుడు అతనికి అభయమిచ్చెను. నరకాసురుడు అపహరించుకు వచ్చిన పదహారువేలమంది రాజకన్యలను చూడగా వారందరూ కృష్ణునే భర్తగా వరించి దైవప్రార్థనచేయ, వారి భావము గ్రహించి వారినందరనూ పల్లకీలపై ద్వారకకు పంపెను. ఇంకను నరకాసురుని వద్ద వున్న ఉత్తమ అశ్వములను గజములను కూడా ద్వారకకు కొనిపోయెను.

కృష్ణుడు దేవలోకమునకు జని నరకాసురు నుండి తెచ్చిన కుండములను అదితికివ్వగా, ఆమెయు, ఇంద్రుడునూ ఇంద్రాణియను బ్రహ్మానందమంది కృష్ణుని సత్కరించిరి, ఆ ఇంద్రలోకములోని నందనవనమునందున్న పారిజాతమును కోరగా ఆ వృక్షమును పెళ్ళగించి, అడ్డుపడిన వారిని నిర్జించి భూలోకమునకు తీసుకొనివచ్చి ద్వారకలో సత్యభామ ఉద్యానవనమున నాటెను. నరకాసుర భవనమునుండి తెచ్చిన 16 వేల మంది కన్యలకు వేరువేరు గృహములు నిర్మించి వారందరకూ తాను అన్ని రూపములతో ఏకకాలము వివాహము జేసి కొనెను. వారు ఎవరికి వారు కృష్ణుడు తమతోనే వున్నాడని, తమయందే అత్యంతానురాగము చూపుచన్నాడని అనుకొనునట్లు అచింతనీయవిలాసమును జూపుచూ, తాను ఆత్మానంద పరిపూర్ణుడయ్యూ సాధారణ గృహస్థుని రీతి గృహస్థాశ్రమ ధర్మములు నాచరించుచూ క్రీడించుచుండెను. ఒక్కొక భార్యకు నూరుగురు పరిచారికల చొప్పున ఏర్పాటు చేసి వారు చేయు సపర్యలతో పరమానందముగ నుండిరి.

రుక్మిణీ కృష్ణుల ప్రణయకలహము

కృష్ణుడు రుక్మిణితో అనేక విధములైన సరససల్లాపములతో క్రీడించుచూ-ఆమె సంతోషపూరితమైన ముఖమునే చూచుచుండి, మనస్సుకు కష్టము కలిగిన ఆమె ముఖము ఎట్లుండునో చూడవలెనను కుతూహలముతో ఒకనాడు ''రుక్మిణి, శిశుపాలుడు మున్నగు ఐశ్వర్యవంతులు, రూపగుణ సంపన్నులు అగు రాజులు నిన్ను వరించదలచి వచ్చిరిగదా, మీ అన్నయు, తండ్రియుగూడ అట్టివారియందే సుముఖులుగా వుండిరి గదా, మరినీవు, వారందరనూ వదలి, రాజ్యము లేనట్టియు, ఇతర రాజులకు భయపడి సముద్రమధ్యమున ఇల్లు కట్టుకున్నవాడను, అకించనుడను అగు నన్నకోరి ఎందుకు వివాహము చేసుకొన్నావు? కులము ఐశ్వర్యము మున్నగునవి సమానముగా నున్నవారి మధ్యనే రాణించునుగాని అసమానుల మధ్య శోభించదుగదా! గుణహీనుడు, రాజ్యహీనుడు అయిన నన్ను నీవు దూరాలోచన లేకుండా వివాహము చేసికొంటివి. ఇప్పుడైననూ, నన్ను విడచి, తగిన ఉత్తమ పురుషుని వివాహమాడి సర్వకామములను పొందుము. ఉదాసీనుడనైన నాకు అదేమియు కష్టము కాదు'' అని అప్రియ వచనములు పలికెను.

ఇట్టి కఠినభాషణము ఎన్నడూ వినని రుక్మిణి దుఃఖాతి రేకమున తెలివితప్పి భూమిపై బడెను. అంత కృష్ణుడు, తన పానువు దిగి జాలిపడి తన నాల్గుచేతులతో లేవనెత్తి (కృష్ణుడు తన ఆంతరంగిక భక్తులైన రుక్మిణి, అర్జునుడు మున్నగువారికి మాత్రమే నాలుగు చేతులతో దర్శనమిచ్చును) కన్నీరు తుడిచి, కౌగలించుకొని ఆమెను ఓదార్చుచూ ఇట్లనెను ''ఓ ప్రేయసీ, నీకు నాయందున్న ప్రేమ ఎంతగాఢమైనదో నాకు తెలుసును. ఎప్పుడును నీ సంతోష వికసితమైన ముఖమునే చూచు నాకు, నీ మనస్సుకు కష్టము కలిగినప్పుడు నీ ముఖమెట్లుండునో చూడదలచి ఈ ప్రణయ కలహము సాగించితిని. గృహాసక్తులై అన్యోన్య ప్రేమగల దంపతుల మధ్య ఇట్టి పరిహాసములు జరుగుచుండును. అట్టి సంగతినీ వెరుగక, దుఃఖముతో మూర్ఛపోయితివి. నీయందు ప్రేమలేక కాదు ఇట్లు మాట్లాడుట'' అనవిని, రుక్మిణి ఇట్లనెను ''సరిగాని, స్వామీ! మిమ్ములను నేను వరించినది నిజమే. త్రిమూర్తులకు ఈశ్వరుడైన నీ మహిమ ఎక్కడ? సామాన్య స్త్రీయైన నా స్థితి ఎక్కడ? నిజమునకు నీకంటె వేరుగా ఏమియు లేదుగనుక నీవు అకించడనువే! నీవు సమస్త పురుషార్థముల నొసగు పరమాత్మ స్వరూపడవు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ నిన్ను పూజించుచుందురు. సర్వము విసర్జించి మహర్షులు, యోగీశ్వరులు నిన్ను సేవించు చుందురు. ఆట్టివారితోడ నాకు సంబంధము కుదురునుగాని, సంసార బంధములో పడియున్న మాకు మీతో ఎట్లు కుదురును? అని కృష్ణుని కఠినోక్తులన్నింటికి ఆధ్యాత్మికముగ చక్కని వ్యాఖ్యానము చేసి సమాధానము చెప్పగా కృష్ణుడు సంతసించి కౌగలించుకొని ఆమెకు తృప్తి పొందించెను.

రుక్మిణికి, కృష్ణుడు తననే ఎక్కువగా ప్రేమించుచూ ఇతర భార్యలకన్న తనవద్దనే ఎక్కువకాలము గడుపు చున్నాడను గర్వము పొడసూపినందున దానిని పరిహరించుటకై కృష్ణుడు ఈ ప్రణయకలహమును సాగించెను. ఇదంతయూ కృష్ణుని నరలొక విడంబనము ఈ విధముగ తక్కిన భార్యలతో గూడ గృహస్థధర్మముల నడపుచు వారందరకూ ఆనందము కలుగుజేయుచుండెను.

కృష్ణుడు అందురిభార్యలతోను గృహస్థ ధర్మమును నడపుచుండ ఒక్కొక్క భార్యకు పదిమంది కుమారులు, వారికి తిరిగి పదేసి చొప్పున సంతానములు కలుగుచుండ, ఆయన పుత్రపౌత్రులు కొన్ని లక్షలకుపైగా పెరిగిరి. రుక్మిణి అన్నయగు రుక్మి పూర్వవైరమును మరచి, రుక్మిణి కుమారుడగు ప్రద్యుమ్నునకు తనకుమార్తెయగు రుక్మవతిని యిచ్చి వివాహము చేసెను.

నృగోపాఖ్యానము

ఒకనాడు పద్యుమ్నాది యదుకుమారులు, పిపాసా పీడితులై జలము కొరకు ఒక కూపము వద్దకు రాగా అందు పడి వున్న ఒక ఊసరవిల్లిని చూచి దానిని లేవనెత్తుటకు ప్రయత్నించిరి గాని వారివలనుపడలేదు. ఆ విషయము కృష్ణునకు తెలియజేయగా, అతడు అవలీలగా ఎడమచేతితో దానిని పైకి ఎత్తెను. కృష్ణుని హస్తస్పర్శమాత్రమున ఆ ఊసరవెల్లి సర్వాలంకార శోభితుడై అమరుడుగా మారెను. అంత కృష్ణుడు అడుగగా, ఆదేవత కృష్ణునికి నమస్కరించి ఇట్లు చెప్పెను ''స్వామీ నేను ఇక్ష్వాకు తనయడనగు నృగుడను రాజును. నేను అసంఖ్యాకములగు కపిలధేనువులను కనక శృంగములతోను వెండి గిట్టలతోను అలంకరించిదూడలతో సహా నిరుపేదలు, యోగ్యులు నగు బ్రాహ్మణోత్తములకు దానమిచ్చితివి. ఇంకనూ గో, భూ, హిరణ్య, అశ్వ, గజ, రథములను, దాసులతోడ కన్యలను ఉత్తమ బ్రాహ్మణులకు దానముగా సమర్పించితిని. వాపీకూపతటాకాది కాది ప్రతిష్ఠల గావించితిని. అనేక యజ్ఞముల నాచరించితిని. కాని దురదృష్టవశమున ఒక బ్రాహ్మణునకు నేను దానముచేసిన గోవు తప్పించుకొని నావద్దనున్న యితర గోవులతో కలియగా, దానినిగుర్తించలేక మరియొక బ్రాహ్మణునకు దానమిచ్చితిని. ఆ బ్రాహ్మణుడు ఆగోవును తీసుకొని పోవుచుండగా అంతకుపూర్వము తీసుకొన్న బ్రాహ్మణుడు దానిని గుర్తుపట్టి, ఆగోవు తనదని వివాదమునకు దిగెను. వారిద్దరు పోట్లాడుకొనుచూ నావద్దకు వచ్చిరి. నేను దానము చేసిన గోవునే తిరిగి దానము చేసిన పాపమునకు గురియైనందున ఈపాపపరిహారార్థము వారితో నిట్లంటిని 'ఓ బ్రాహ్మణోత్తము లారా, నేను తెలియక చేసిన ఈతప్పిదనమునకు నరకమున పడకుండా నన్ను అనుగ్రహింపుడు, మీ ఇద్దరిలో ఎవరు ఈ గోవును విడిచెదరో వారికి లక్ష గోవుల నిచ్చెదను ఎవరో ఒకరు గ్రహించి నన్ను అనుగ్రహించమని ప్రార్థించిననూ వారు వినలేదు. ఇంతలో నాకు కాలము ఆసన్నమై యమభటులు వచ్చి నన్ను యమధర్మరాజు నొద్దుకు తీసుకొనిపోయిరి. అప్పుడు యమధర్మరాజు ''నీవు చేసిన పుణ్యములు ఫలము చాలా కాలము అనుభవించ వచ్చును, దానమిచ్చిన గోవును తిరిగి దానమిచ్చిన పాపమునకు అల్పకాల భోగ్యమైన పాపఫలమును ముందు అనుభవించు'' అని నన్ను ఊరవిల్లి రూపమున మార్చెను. కృష్ణా! నీ కరస్పర్శచే నా ఊసరవిల్లి రూపము పోయి నాకు పూర్వస్మృతిగూడ వచ్చినది. నన్ను నా పూర్వపురూపములో నా లోకమునకు పోవునట్లు అనుగ్రహించుము. నాకు నీయందు అచంచల భక్తికలుగునట్లు అనుగ్రహించుము.'' అని నృగమహారాజు కృష్ణునకు ప్రణమిల్లి తనకై వచ్చిన విమానములో పుణ్యఫలము అనువించుటకు స్వర్గలోకమునకు వెడలిపోయెను.

అంతట కృష్ణుడు అచ్చటనున్న రాజులకు ఇట్లు నీతిని బోధించెను ''బ్రాహ్మణుని ధనమును అపహరించి తినినవాడు అగ్నిసదృశుడైన తేజస్వియైననూ దానిని అరగించుకొనలేడు. ఇతరుల గతి ఏమి? కాలకూట విషముకైననూ విరుగుడు దొరకవచ్చునుగాని, బ్రాహ్మణధనము అపహరించిన పాపమునకు ప్రతీకారము లేదు. విషము తిన్నవానినే చంపును. కాని బ్రాహ్మణధనము నపహరించినవారు తానేగాక తన కులము నశించుటకు గూడ కారకుడగును. అంతేకాదు అతని పూర్వులైన పదితరములవారిని, తరువాత పదితరములవారిని కూడ నశింపజేయును. బ్రహ్మస్వము, గోరినవారు కేవలము నరకమునే గోరినవారగుదురు. రాజ్యాధికార మదమున ఇట్టి పాపకృత్యములను కొందరు చేయుచుందురు. ఉత్తములైన దరిద్రబ్రాహ్మణులు తమ సొమ్ములు ఇతరులు హరింపగా, వారు దుఃఖించు నప్పుడు వారి కన్నీటిబిందువులతో భూమిపై ఎన్ని అణువులు తడియునో అన్ని సంవత్సరములు, అపహరించిన రాజులునూ వారి వంశీయులునూ కుంభీపాక నరకమున బడుదురు. బ్రాహ్మణ వృత్తిని అపహరించినవాడు, అరువది వేల సంవత్సరములు అశుద్ధములో పురుగై తిరుగును. బ్రాహ్మణ ధనమును ఎవరును అపహరించ గూడదు. బ్రాహ్మణుడు తప్పజేసిననూ, కొట్టిననూ, తిట్టిననూ, సహించవలెనేగాని తిరిగి కీడు చేయరాదు. నేను బ్రాహ్మణులకు ఎట్లు మ్రొక్కుచున్నానో మీరు చూచుచున్నారు. గదా ! మీరును నన్ను అనుసరింపుడు. బ్రాహ్మణ ద్రవ్యమును తెలియక హరించిననూ వానికి నరకము తప్పదు. వింటిరిగదా ఈ నృగమహారాజు చరిత్ర !'' ఇట్లు ద్వారకా పురవాసులందరకూ నీతిబోధ చేసి నిజమందిరమునకు వెడిలిపోయెను.

పౌండ్రకవాసుదేవుని కథ

కరూశపతియగు పౌండ్రకుని వాసుదేవునిగా కొందరు స్తుతించుటచేత ఆ యిచ్చకపు మాటలకు ఉబ్బిపోయి తాను నిజముగా వాసుదేవుడైనట్లు భ్రమించి, అసలు వాసుదేవుడు తానే అనియూ, శంఖచక్రాదుల వదలి తనను శరణు వేడమనియూ, అట్లు కానియడల యుద్ధమునకు సిద్ధము కమ్మని, కృష్ణుని వద్దకు రాయబారమంపెను. ఆసభలోని వారందరూ ఆ దూత వ్యాక్యములు విని నవ్వగా కృష్ణుడు యుద్ధమునకు సిద్ధమేయని కబురంపెను.

అంతట నాటక వేషధారివలె శంఖచక్రవనమాలికలను ధరించి పీతాంబర ధారియై కృత్రిమ వేషధారివలె వచ్చన పౌండ్రక వాసుదేవుని కృష్ణుడు తన చక్రాయుధముతో వాని శిరస్సును ఖండించెను. పౌండ్రకుడు నిత్యము కృష్ణుని రూపమును ధరించవలెనని ధ్యానించుటచేత, మనస్సులోని మాలిన్యము నశించగా, కృష్ణతన్మయుడై ఉత్తమ గతిని పొందెను.

నారదుడు కృష్ణలీలు చూడ ద్వారకకు వచ్చుట

నరకాసుర వధానంతరం పదియారువేల కన్నియలను కృష్ణుడు వివాహము చేసికొని వారందరతో, విడివిడిగా గృహముల నిర్మించి, ఆనందించు చున్నాడను అద్భుతవిషయమును విని, కనులార చూచుటకు ద్వారకకు బైల్దేరెను. అచ్చట రాజకన్యల గృహములలో ప్రతి ఇంటనూ కృష్ణుడు ఆయా భార్యలతో విడివిడిగా జరుపుచున్న లీలలను చూచి తన్మయుడై కృష్ణునితో యిట్లనను ''యోగేశ్వరేశ్వరా! యోగులకుగూడా తెలియరాని మీ యోగమాయా విలాసమును ప్రత్యక్షముగా చూచు భాగ్యము నేడు కలిగినది. పరమ పావనమైన నీ లీలలు కీర్తించుచూ లోకములలో తిరుగుటకు అనుజ్ఞనిమ్మని ప్రార్థించెను, కృష్ణుడు 'బ్రహ్మర్షీ' అట్లే నా లీలలను కీర్తింపు కాని వానికి మోహపడవలదు' అని చెప్పిపంపెను.

ధర్మరాజు రాజనూయము - జరాసంధ వధ

జరాసంధునిచే బంధింపబడి చెరసాలలో మ్రగ్గుచున్న ఇరువది ఐదుగురు రాజులు భాధలకోర్వలేక రక్షింపుమని కృష్ణుని వద్దకు దూతను పంపిరి. కృష్ణడాదూతకు అభయమిచ్చి పంపివేసెను.

ఒకనాడు నారదుడు కృష్ణసన్నిధికి వచ్చి 'సామ్రాజ్య పదవి పొందుటకు ధర్మరాజు రాజసూయ యాగము తలపెట్టి నిన్ను ఆహ్మానింపమని నన్ను పంపినా'డని చెప్పెను. అంత కృష్ణుడు ఉద్ధవునితో ఉద్ధవా నేను జరాసంధుని సంహరించుచుటకుగాను వెళ్ళు ప్రయత్నంలో నుండగా ధర్మరాజు ఆహ్వానము వచ్చినది. ఈ రెంటిలో దేనికి ముందు వెళ్ళవలెనో నీవు చెప్పుము' అని సర్వజ్ఞుండయ్యూ తెలియని వానివలె అడిగెను. అంద ఉద్ధవుడు 'కృష్ణా' రాజసూయ యాగమునకు అరుగుటయే సముచితమని నాకు తోచుచున్నది. ఏలనన, రాజసూయ యాగమున ఇతర రాజులను జయించవలసి యుండును. ఆ సందర్భమున జరాసంధ వధ కూడా కావింపవచ్చును. ఇట్లు రెండు పనులు ఏకకాలమున నెరవేరును' అనివిన్నవించగా, కృష్ణుడు, ద్వారకా వాసులు నందరనూ ఇంద్ర ప్రస్ధమునకు తరలించుటకు వెళ్ళెను.

ధర్మరాజు ఉపాధ్యాయ సుహృత్‌ పరివృతుడై కృష్ణుని కెదురేగి, గాఢాలింగనము చేసుకొని ఆనంద బాష్పములు రాల్చెను. కృష్ణుడు తనకంటె వయసున పెద్దలైన ధర్మరాజు, భీములకు నమస్కరించి, సమానవయస్కుడైన అర్జునుని కౌగలించుకొని, తనకంటె పిన్నలైన నకుల సహదేవులను దీవించి, తదితరుల నందరనూ తగురీతిని ఆదరించెను.

కృష్ణచంద్రుడు వచ్చినాడని విని పౌర సుందరులందరు తాము చేయుచున్న పనులను విడిచి వచ్చి కృష్ణుని దర్శించి తమతమ మనస్సులలో ఆలింగనము చేసుకొన్నట్లు తన్మయ భావన చెందిరి. కృష్ణుడు కుంతికి పాదాభివందనము చేసి, ద్రౌపదీ సుభద్రలను దీవించెను. ద్రౌపది కృష్ణుని వెంటవచ్చిన రుక్మీణీ, సత్యభామా మున్నగు ఎనిమిది మంది భార్యలను ఉచితరీతిన పూజించి వారితో వచ్చిన ముత్తైదువులను సత్కరించిరి.

ధర్మరాజు తానుచేయు రాజసూయ యాగమును గురించి కృష్ణునకు విన్నవించి అది జయప్రదమగునట్లు అనుగ్రహింప ప్రార్థించెను. అంతట కృష్ణుడు ''నీ సంకల్పము ఉత్తమమగుటయే గాక సర్వభూతములకు, ఋషులకు సమ్మతమైనది. రాజులనెల్ల జయించి జగతీమండలమునెల్ల వశపరుచుకొని, సర్వ సంభారములు సమకట్టి ఈ మహాక్రతువు నాచరింపుము. లోకపాలాంశ సంభూతులైన తమ్ములు అండగానుండగా నీకు దిగ్విజయము కలుగక పోవునా!'' అని ప్రోత్సహించెను. అంత ధర్మరాజు తమ్ములను పిలిచి సహదేవుని దక్షిణమునకును, నకులుని పశ్చిమమునకును, అర్జునుని ఉత్తరమునకు, భీముని తూర్పునకును సేనాసమేతముగ విజయార్థము పంపెను. వారు ఆయాదేశముల రాజుల జయించి రాజసూయమునకు బహుళ ధనమును తెచ్చి సమర్పించిరి. రాజులందరూ జయింపబడిరిగాని జరాసంధుడు జయింపబడలేదు. ధర్మరాజు అనుమతితో కృష్ణుడు భీమార్జునులను తీసుకొని బ్రాహ్మణవేషముతో జరాసంధుని యొద్దకు జనిరి. జరాసంధుడు అతిధిపూజ చేసిన తదుపరి వారు మేము కోరినది యివ్వమని అడిగిరి. వారిని చూడ బ్రహ్మణ వేషములోనున్న క్షత్రియులని తోచిననూ పూర్వము వామనావతారములో వచ్చిన విష్ణువు కోరికను బలి పూర్తి చేసినట్లు, వీరెవరైననూ, కోరినది ఇచ్చుటే ధర్మమని భావించి అందుకు అంగీకరించెను. కృష్ణుడు మాకు ద్వంద్వ యుద్ధము కావలెనని కోరి మారువేషములు త్యజించి, మేము కృష్ణార్జున భీములము, అని స్వస్వరూపములను వ్యక్తము చేసిరి. తనతో సమాన బలము కలవాడు భీముడే గనుక అతనితో ద్వంద్వ యుద్ధము చేయుటకు జరాసంధుడు అంగీకరించి భీమునికి ఒక గదను యిచ్చి గదాయుద్ధమును ప్రారంభించెను. కొంతవడి ఘోరయుద్ధము సాగగా గదలు రెండును భిన్నములయ్యెను. అంతట ఇద్దరునూ ముష్టిప్రహారములకు పూనుకొని యుద్ధము చేసిరి. ఎంతటికీ జరాసంధుడు యిసుమంతయూ అలియక యుద్ధము చేయుట చూచి కృష్ణుడు అతనిని సంహరించు ఉపాయమును భీమునికి సూచించుచూ ఒక పుల్లను తీసుకొని రెండుగా చీల్చి ఇటుదిఅటు, అటుదిఇటు పడవేసి చూపెను భీముడు వెంటనే జరాసధుని క్రిందపడవేసి ఒక కాలును తన కాలితో త్రోక్కి రెండవకాలును పట్టి శరీరమును రెండుగా చీల్చి ఇటుదిఅటు, అటుదిఇటు పడవైచెను. అంతటితో జరాసంధుడు నిర్జీవుడయ్యెను. కృష్ణార్జునులు భీముని కౌగలించికొని ప్రశంశించిరి. జనులందరూ సంతోషించిరి.

కృష్ణార్జున భీములు తరువాత జరాసంధునిచే బంధింపబడిన రాజులనందరునూ విడిపించగా వారు కృష్ణునుకి నమస్కరించి స్తోత్రముచేసి, తాము తరించు ఉపాయము తెల్పమని ప్రార్థించిరి. అంతట కృష్ణుడు ''మీకందరకునూ సర్వేశ్వరుడను, సర్వాత్ముడను అగు నామీద ధృడమైన భక్తి కలిగిన తరింతురు. ఐశ్వర్యమదము ఉన్మాదకరము గాన, దానిని వెంటనే త్యజింపవలెను. పూర్వము సహుషుడు, రావణుడు, నరకాసురుడు మున్నగు వారందరూ ఐశ్వర్యమదముచే భ్రష్టులైరి. పుట్టునదెల్ల గిట్టునని తెలిసికొని మీరు నన్ను శాస్త్రోక్త విధానమున అరాధించుచూ, ప్రజలను ధర్మమార్గమున పాలించుచూ, కాలప్రాప్తమైన సుఖదుఃఖాదులను అనుభవించుచూ, దేహాదులయడ ఉదాసీనులై చిత్తముల నాపై నిలిపి దృఢ వ్రతులైన యడ మీరు ఆత్మారాములై తరించెదరు.'' అని వారికి భోదించి, ఆ రాజులకు అభ్యంగన ములు చేయించి, వస్త్ర మాల్యానులేపన భూషణాదుల ధరింపజేసి, మృష్టాన్నము భుజింపజేయగా వారు అత్యంతానందముతో స్వీకరించి కృష్ణునివద్ద శలవు గైకొని తమతమ రాజ్యములకేగి, కృష్ణుడాదేశించిన ప్రకారము ఆచరించుచూ రాజ్యపాలన జేసిరి.

ఇట్లు జరాసంధ వధానంతరము భీమార్జునులతో కృష్ణుడు తిరిగి ఇంద్రప్రస్థమునకు వచ్చి ధర్మరాజునకు జరిగిన వృత్తాంతము చెప్పగా జరాసంధుడు గూడ హతుడైనాడు గనుక ఇక రాజసూయయాగము ప్రారంభించెదమని ధర్మరాజు కృష్ణుని అనుజ్ఞ కోరెను.

రాజసూయయాగమునకు ద్వైపాయనుడు. భరద్వాజుడు, గౌతముడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, పరాశరుడు, కశ్యపడు ధౌమ్యుడు మున్నగు బ్రహ్మవాదులైన బ్రాహ్మణులను ఋత్విక్కులుగా నియమించెను. ఈ యాగమును చూడ సకలదేశ రాజన్యులును, చాతుర్వర్ణ ములవారును విచ్చేసిరి. యజ్ఞవేదికను బంగారు నాగళ్ళతో దున్ని, వేదికాది సంస్కార మొనర్చి ధర్మరాజునకు యజ్ఞదీక్ష నిచ్చిరి. యాగము జయప్రదముగ నిర్వహింపబడి, సోమాభిషవ దినమున యాజకులను సదస్యులను పూజించు సమయము రాగా, ప్రప్రథమ పూజార్హుడెవరను ప్రశ్న ఉదయించగా సహదేవుడు, భగవంతుడగు కృష్ణుడే ప్రప్రథమ పూజార్హుడని గట్టిగా చెప్పి కృష్ణుని యొక్క యోగ్యతలను మాహాత్మ్యమును విశదీకరించెను. అందుకు సభాసదులందరూనూ అంగీకరించిరి. అంతట ధర్మరాజు ప్రథమపూజ చేయుటకై కృష్ణుని పాదారవిందములు కడిగి ఆ పావనోదకమును తాను, భార్య, తమ్ములు, పరివారము శిరస్సున జల్లుకొనిరి. తరువాత పీత కౌశేయ వస్త్రములను ఉత్తమ భూషణములను సమర్పించి బ్రహ్మానంద మందెను. అచట సమకూడిన రాజులు జయజయ నినాదములు చేయ పుష్పవృష్టి కురిసెను.

ఇందతయూ చూచి సహించలేని శిశుపాలుడు కృష్ణుడు పూజార్హుడు కాడని అనేక విధముల, నిందించెను. ఆ నిందను సహించలేక కొందరు ఆతని పైకి యుద్ధమునకు రాగా కోలాహాలమయ్యెను. కృష్ణుడు వెంటనే తన చక్రాయుధమును ప్రయోగించి శిశుపాలుని శిరము ఖండించెను. శిశుపాలుని శరీరములోని తేజస్సు కృష్ణునిలో ప్రవేశించెను. వైరముచే నిత్యము స్మరించుచు శిశుపాలుడు కృష్ణునిలో ఐక్యము నొందెను, ధర్మరాజు మిగిలిన వారిని దక్షిణలతో సత్కరించి యాగమును జయావహముగా ముగించెను. ఈ యాగమున, భీముడు పాకశాలాధ్యక్షుడుగను, దుర్యోధనుడు ధన్యాధ్యక్షుడుగను, సహదేవుడు వచ్చినవారికి స్వాగతము పలుకుటకు, నకులుడు వస్తుసంపాదనకు నియుక్తులైరి. దానమునకు కర్ణుడు, వచ్చిన పెద్దలకు పాదప్రక్షాళనచేయుటకు కృష్ణుడు, సాధుజనపరిచర్యకు అర్జునుడు పూనుకొనిరి.

అవబృధస్నానమునకు, ధర్మరాజు కృష్ణుడు, సోదరులు, రాజులు వెంటరా, గంగానదికి జని వేదఘోష మార్మ్రోగ, అవబృధస్నానము లాచరించిరి. ఇట్టి స్నానము వలన సర్వపాపములు హరించును. ధర్మరాజు అనుజ్ఞతో రాజులందరూ వెడలిపోయిరి. కృష్ణుడు మాత్రము ధర్మరాజు కోరినందున ఇంద్ర ప్రస్థమున నిలచి, మిగిలిన వారిని ద్వారకకు పంపెను.

ఇట్లు రాజసూయయాగమున ధర్మరాజునకు జరిగిన వైభవమును చూచి దుర్యోధనుడు సహించలేక, మయనిర్మిత సభలోకి వచ్చి, జలస్థల భేదములను తెలిసికొనలేక, జలమున స్థలభ్రాంతి, స్థలమున జలభ్రాంతి పొంది. క్రిందపడుచు లేచుచు చిక్కులు పడుచుండగా, భీముడు ద్రౌపది మున్నగు వారు నవ్విరి. ఆ నవ్వు భూభారహరణమునకు నాందిగా కృష్ణుడు భావించెను. దుర్యోధనుడు అసూయతో పాటు క్రోధమును, ద్వేషమును పెంచుకొనెను.

ఇట్లుండ, శిశుపాలుని మిత్రుడగు సాళ్వుడు, రుక్మిణీ కల్యాణమునాటి నుండి కృష్ణుని, యాదవులను నిర్మూలించ ప్రతిజ్ఞ చేసి శివునిగురించి తపస్సు చేసి కామగమనముగల సౌభమను విమానమును వరముగా పొంది ససైన్యముగా పోయి ద్వారకను ముట్టడించెను. ప్రద్యుమ్నుడు, సాత్యకీ మున్నగువారు ఆతనిని ఎదర్కొనగా ఆ విమానముతో ఒకప్పుడు కనపడుచూ, మాయమగుచూ; ఒకసారి భూమిమీద మరోకసారి ఆకాశములోనూ కనపడుచూ అద్భుత ప్రభావముతో యుద్ధము చేయుచుండ, కృష్ణుడు తన గదతో ఆ విమానమును పగులగొట్టి, సాళ్వుని శిరస్సు తన చక్రాయధముతో ఖండించెను. మిగిలిన సేనగూడ హతమయ్యెను. ఈ సంగతి విని దంతవక్తృడు కృష్ణునిపైకి దండెత్తి అనేక విధముల నిందించి కృష్ణుని శిరముపై తన గదతో కొట్టెను కృష్ణుడు వెంటనే తన కౌమోదకితో వాని రొమ్ము పగుల గొట్టగా, వాడు నెత్తురు కక్కుకొని వెంటనే చనిపోయెను. శిశుపాలునిలో వలెనే దంతవక్తృనిలోని జ్యోతిగూడా కృష్ణునిలో ఐక్యముమొందెను. తరువాత దంతవక్తృని సోదరుడైన విధూరధునిగూడ చక్రాయుధముచే సంహరించెను. ఈ విధముగా శిశుపాల దంతవక్త్రసాళ్వాదులను కృష్ణుడు అంతమొందించెను.

బలరాముడు, కౌరవ పాండవ యుద్ధమున ఏపక్షమును చేరక మధ్యస్థుడై తీర్థయాత్రకుజని ఒక సమయమున నైమిశారణ్యమునకు అరిగెను. అచట దీర్ఘసత్రయాగము జరుపుచున్న మునులందరూ బలరామునికి లేచి నమస్కరించగా వ్యాసశిష్యుడైన రోమహర్షుడు, ప్రవక్తగా నుండుటచే బలరామునికి లేచి నమస్కరించలేదు. బలరామునికి కోపము వచ్చి అతని శిరస్సు ఖండించెను అదిచూచి మునులు ''బలరామా! పురాణ ప్రవచనముకై మేమితనికి బ్రహ్మసన మిచ్చి కూర్చుండ బెట్టి దీర్ఘసత్రయాగము జరపుచుంటిమి. అట్టివానిని నీవు వధించితివి గాన నీకు బ్రహ్మహత్యాపాతకం వచ్చనది'' అని చెప్పిరి. బలరాముడు పశ్చాత్తాపమునొంది. యాగము విఘ్నము కాకుండా రోమహర్షుని కుమారుని ప్రవచనమునకు ఏర్పాటు చేసి, తన పాపమునకు ప్రాయశ్చిత్తం చెప్పమని మునులను కోరగామునులు 'ఇల్వలుని కుమారుడైన పల్వలుడను రాక్షసుడు ప్రతి పర్వమున మాసత్రయాగమును రక్త మాంసాదులతో భంగము చేయుచున్నాడు. కాన వానిని చంపి, పన్నెండు నెలలు కామక్రోధాదు లుడిగి భరతవర్షమంతయూ తిరిగి తీర్థముల స్నానమాడి కృచ్ఛము లాచరించినయడల నీ పాపవిముక్తి యగు''నని తెల్పిరి.

అంతట బలరాముడు ఆ రాక్షసుని తన హలాయుధముతో పట్టి ముసలముతో తల బ్రద్దలుకొట్టి చంపెను. మునులు బలరాముని ప్రశంశించిరి. తరువాత తీర్థయాత్రలు ప్రారంభించి, ప్రయాగలో స్నానమాచరించి, పులహాశ్రమము వద్ద గోమతీ, గండకీ, శోణ, భద్ర నదులలో స్నానమాడి గయలో పిత్రుపూజ గావించి, గంగా సాగరసంగమమును సేవించి ; సప్తగోదావరి ప్రవాహములు, వేణీ-పంపా-భీమ నదులను సేవించి ; శ్రీశైలము, వేంకటాచలము అను తిరుపక్షేత్రమును, కాంచీపురము, కావేరీ నదిని. శ్రీరంగక్షేత్రమును, వృషభాద్రిని, దక్షిణమధురను సేవించి ; మహాపాతకనాశకమైన సముద్రసేతువున కరిగి, అచట విప్రులకు పదివేల గోవులను దానమిచ్చి ; తామ్రపర్ణిలో తీర్థమాడి, కన్యాకుమారిలో దుర్గాదర్శన మొనరించి, గోకర్ణము సేవించి, మాహిష్మతీనగరమువద్ద నర్మదను సేవించి, ప్రభాసక్షేత్రము చేరెను. అచ్చట కురుపాండవ యుద్ధము విశేషములు తెలిసికొని సర్వరాజన్యులు ససైన్యముగా నితుహలైనారనియు, ఇక భీమ దుర్యోధనుల యుద్ధము మాత్రము జరుగవలెననియు తెలిసికొనెను. వెంటనే బలరాముడు కురుక్షేత్రమునకు జని, భీమదుర్మోధనులు సమాన బలశాలురైననూ ఒకరికి బలిమి మరోకరికి విద్యాకౌశలము ఎక్కువ గనుక జయాపజయములు తేలుట కష్టముగాన యుద్ధము మానమని చెప్పెను. కాని వారు అంగీకరింపనందున, బలరాముడు తిరిగి ద్వారకకు వెళ్ళెను. ఇట్లు బ్రహ్మరధ ప్రాయశ్చిత్తము నాచరించి పాపమును పోగొట్టుకొనెనును.

కుచేలోపాఖ్యానము

శ్రీకృష్ణుని చరితమును విని పరీక్షిన్నరేంద్రుడు శుకయోగితో ఇట్లనెను: 'మునీంద్రా అనంతవీర్యుడైన ముకుందుని మహిమాన్వితములైన చరిత్రలు వినినకొలది ఇంకనూ వినవలెనని కుతూహలము కలుగుచున్నది. ఆ ఉత్తమ శ్లోకుని సత్కథలు ఒకసారి వినినతరువాత చాలునని ఎవరైన విరమించుదురా? భగవంతుని వచించునదే వాక్కు, తత్పరి చర్యలు ఒనర్చునవే చేతులు, ఆయనకు తలమనదే మనస్సు. వాని పుణ్యచరితములు వినునవియే వీనులు. స్థావర జంగము లెల్ల తల్లింగములుగా మ్రొక్కునదేశిరము, తన్మూర్తులను జూచునవే కన్నులు, భాగవతుల పాదోదకము సేవించినదే అంగము. కనుక ఆ భగవంతుని మహిమాన్విత చరితము ఇంకనూ విన కుతూహల మగుచున్నది కాన చెప్పకోరెదను.'

అంత శుకయోగీంద్రుడు ఇట్లనెను: ''పూర్వము కుచేలుడను బ్రహ్మవిదుడైన బ్రాహ్మణుడు, కృష్ణునకు పిన్ననాట స్నేహితుడు, దరిద్రము నునుభవించుచుండెను. పరమ ప్రతివ్రతయైన కుచేలుని భార్య పతినుద్దేశించి, 'స్వామీ, మీరు సాక్షత్తు లక్ష్మీపతికి సఖులుగదా, ఆయన శరణాగతరక్షకుడు, బ్రాహ్మణవత్సలుడు, అని ఖ్యాతిగన్నవాడు. బహుకుటుంబీకులై దారిద్య్రస్థితిలో నున్న మీరు ఆయనను ఆశ్రయించిన మన కష్టములు తొలగి ఐశ్వర్యవంతుల మగుదుము' అని చెప్పెను. ఈ విధముగానైన భగవంతుడగు కృష్ణదర్శనము కలుగునని, భార్య చెప్పిన ప్రకారము బయలుదేరి, కృష్ణునకు కానుకగా ఏదైన యిమ్మని భార్యను అడిగెను. ఇంటిలో ఏమియు లేనందున ఇరుగుపోరుగు వారివద్ద నాలుగు పిడికెడుల అటుకులు ప్రోగుచేసి కుచేలునిపై వస్త్రమునకు కట్టెను. అంత కుచేలుడు కృష్ణదర్శనము ఎట్లు చేతునా అని ఆలోచించుతూ, కృష్ణునియందే మనసునిల్పి ద్వారకకు జేరెను. తన భార్యతో పాన్పుపైనుండిన కృష్ణుడు కుచేలుని చూడగనే తటాలునలేచి కౌగలించుకొని, లోనికి తోడితెచ్చి తన పర్యంకమున కూర్చుండబెట్టి ఆతని పాదములు కడిగి శిరస్సున జల్లుకొని, కుచేలునికి మంచిగంధము శరీరమునకు అలది పూలమాలతో అలంకరించి పండ్లు క్షీరములతో ఆదరించి సేవించెను.

కృష్ణుని భవమెరిగిన రుక్మిణి, కుచేలుడు జీర్ణవస్త్రములతో నున్ననూ ఏవగించుకొనక చామరముతో విసిరెను. ఈ బీదబ్రహ్మణునకు కృష్ణుడు చేయు సపర్యలకు అందరూ ఆశ్చర్యపడిరి.

తరువాత కృష్ణుడు కుచేలునితో గురుకుల వాసము చేసిన పిన్ననాటి కథలు జ్ఞాపకము చేసికొనుచూ ఆనందించి, కుచేలుని సంసారమును గూర్చి అడుగుచూ ' కుచేలా నీమనస్సు ఎప్పుడూ కామవ్యాకులము గాక ధనమునకు లోబడక పవిత్రముగానే యున్నదని నాభావము మానవునకు మొదటి గురువు తండ్రి, ఉపనయనము చేసి వేదవిద్య గరపినవారు రెండవ గురువు. బ్రహ్మజ్ఞానము ఉపదేశించినవారు మూడవ గురువు. ఈ ముగ్గురును ఉత్తరోత్తరోత్తములు. మూడవ గురువు. నారూపుడే' అని, ' గురుకులములో నుండగా ఒకనాడు గురుపత్ని మనలను సమిధలు తెచ్చుటకు ఆరణ్యమునకు పంపెను. ఇంతలో ఉరుములు మెరుపులతో గాలివాన వచ్చెను. మెరకపల్లములు తెలియక మనము ఒండోరుల బట్టుకొని దిక్కు తెలియక తిరుగుచుండగా, మనము సకాలమునకు గృహమునకు రానందున గురువుగారు ఆతురతతో మనలను వెతుకుకొనుచూ వచ్చి మనలను వాత్సల్యముతో దగ్గరకు తీసుకొని మన భక్తికి, గురుసేవకు మెచ్చి మన మనోరధములు ఈడేరు ననియు, మనము అభ్యసించిన విద్యలు సఫలమగుననియు ఆశీర్వదించిన సంగతి నీకు జ్ఞాపకమున్నదా?' యని ప్రశ్నించి, 'నీవు యింటి నుండి నాకేదో ఉపాహారము తెచ్చినట్లున్నదే! నీవు ఏది తెచ్చిననూ నాకు పరమానందమే' అనుచుండ కుచేలుడు ఆ అటుకులమూటను విప్పుటకు సిగ్గుపడుచుండ, తానే అ చిరుగు గుడ్డ మూటను విప్పి, చూచి, ' నాకిష్టమైన అటుకులు తెచ్చినావే!' అని ఒక పిడికెడు అటుకులు తినెను. ఇంకొక పిడికెడు తీసుకొనబోవుచుండగా ప్రక్కనున్న రుక్మిణి చెయ్యిపట్టుకొని వారించి ' నాథా, నీవు భుజించిన ఒక పిడికెడుకే సర్వసంపత్‌ సమృద్ధి కలుగును, ఇక చాలును' అని నివారించెను. ఆ రాత్రి కుచేలుడు కృష్ణుని మందిరములో స్నానపానాది సౌకర్యములన్నీ స్వర్గములో వలె అనుభవించి, మర్నాడు కృష్ణుని వీడ్కోలు గైకొని ఇంటికి బైల్దేరి పోవుచూ దారిలో ' శ్రీ వాసుదేవుని బ్రహ్మణ వాత్సల్యము నేడు ప్రత్యక్షముగా చూచితిని. వక్షమున లక్ష్మి గల కృష్ణుడెక్కడ? ధరించటకు సరియైన వస్త్రములు లేక చిరిగినగుడ్డలతో వెళ్ళిన నిరుపేదను నేనెక్కడ? ననూ నన్ను కౌగలించుకొని, సోదరునివలె ఆదరించి, ప్రియురాలి పాన్పుపై కూర్చుండబెట్టి. తాను పాదములపట్టి, రుక్మిణిచేత వింజామర వేయించి, నన్ను దేవార్చనా విధానముగ పూజించినాడే! నేను ధనార్థినె వచ్చి మౌనము వహించియున్న నాకు అటుకులు ఒకగుప్పెడు తినియు ధనము నివ్వక త్రిప్పి పంపుట వలన కృష్ణునికి నాయందు గల నిజమైన ప్రేమ సూచితమైనది, నేను ధన మదాంధుడనై, భగవంతుడైన తనను మరిచిపోవుదునను తలంపుతో, ఎల్లప్పుడు ఆతని ధ్యానము చేయుటకుగాను నాకు ఐశ్వర్యమొసగలేదు!' అని ఇట్టి అద్భుత ప్రేమ కనపరచిన కృష్ణుని స్తుతించుచూ తన గృహోన్ముఖుడయ్యెను.

కుచేలుడు పూర్వము తన గృహమున్న స్థలమునకు పోగా దాన బదులు. అనేక వైభవోపేత ఉపవనములతోనూ సరోవరములతోనూ కూడిన ఒక దివ్యమందిరము కనపడెను. అమితాశ్చర్యము - ఆతడు ఆభవనమును తిలకించుచుండ, దేవతారూపులైన స్త్రీలు పురుషులు గీతవాద్యములతో ఎదుర్కొని ఆ దివ్యభవనములోనికి తీసుకొనిపోయిరి. కుచేలుని భార్య అపర లక్ష్మీదేవి వలె ఆభరణము తోనూ పట్టువస్త్రములతో అలంకరింపబడినదియై ఆనంద బాష్పములురాలగా భర్తపాదములపై బడి నమస్కరించెను. అనేక పరిచాలకుల నడుమ లక్ష్మీవంటి భార్యను చూచి, ఈ ఐశ్వర్యము ఈ దివ్యభవనము కృష్ణుని అనుగ్రహమేనని గ్రహించి ఆయన యందు తనకు యిట్టి భక్తి నిత్యము నిలుచుగాక యని కృష్ణుని ప్రార్థించుచు, విషయాసక్తి విడచి నిజపత్నితో ధర్మమార్గమున గృహస్థాశ్రమ సుఖముల ననుభవించెను."

ఒక సూర్యగ్రహణము రోజున వసుదేవుడు, అకౄరుడు మున్నగు యాదవులు రామకృష్ణులతో కురుక్షేత్రమునకు జని అచట స్నానము లాచరించి బ్రహ్మణోత్తములకు అనేక దానములుచేసిరి. అచ్చటకు నందాది గోపాలకులును, గోపికలునూ గూడ వచ్చిరి. ఒకరినొకరు ప్రేమతో ఆలింగనకుశలప్రశ్నాదులతో ఆదరించుకొనుచూ కృష్ణుని కథలు చెప్పుకొనుచూ ఆనందించిరి. గోపికలు కృష్ణునిచూచి చాలాకాల మగుటచేత ఆయనను సందర్శించి మనస్సులో కౌగలించుకొని ఆనందబాష్పములు రాల్చుచుండ, కృష్ణుడు ఆగోపికలను ఏకాంతస్థలములకు గొనిపోయి కౌగలించుకొని ఆనందమును కలుగజేయగా, వారందరూ ఈ సంసార సాగరమునుండి తరింప జేయమని ప్రార్థింప కృష్ణుడు వారికి ఆత్మజ్ఞానమును ఉపదేశించెను. అచట ద్రౌపది కృష్ణుని భార్యలను చూచి వారివారి వివాహములు ఎట్లైనవని అడుగగా, వారందరూ సవిస్తరముగ ద్రౌపదికి వివరించి చెప్పిరి.

ఒకనాడు మునులందరూ కృష్ణదర్శనమునకు రాగా వారిని ఉచిత రీతిని ఆదరించి, వసుదేవుడు తనకు ఆత్మజ్ఞానము భోదించమని వారల కోరెను. సర్వయజ్ఞేశ్వరుడైన విష్ణువును నిష్కామముగా యజ్ఞములచే నారాధించ వలెననియు, అందువలన చిత్తశాంతి కలిగి మోక్షసాధన మగుననియు మునులు చెప్పగా వారినే ఋత్విక్కులుగా పెట్టి వసుదేవునితో, సాక్షాత్తు భగవంతుడగు కృష్ణుడు నీ కుమారునిగా అవతరించగా వానినుండి ఆత్మశ్రేయంబు తెలిసికొనలేక, మమ్ములను బోధింపమని అడుగుట విచిత్రముగా నున్నది. గంగా తీర్థవాసులు ఇతర తీర్థములకు జనినట్లు కృష్ణుడు ఇంటిలోనేయున్న కారణమున అనాదరణ కారణమయ్యెను. ఆతని గొప్పతనమును గ్రహించలేక వసుదేవుడు మనలను ఆత్మజ్ఞాన ముపదేశించమని అడుగుచున్నాడు ఈ యజ్ఞము వలన ఆత్మజ్ఞానమునకు సాధనమైన చిత్తశుద్ధికలిగినది. ఇక కృష్ణునివద్ద ఆత్మజ్ఞానము తెలసికొనుట ధర్మము అనివారు వసుదేవునికి చెప్పి వెడలిపోయిరి. అంతవసుదేవుడు కృష్ణుని గొప్పతనమును స్మరించుచూ కృష్ణుడు తనవద్దకు నమస్కరించుటకు రాగా ' కృష్ణా ఈ జగము ఎవ్వని యందు ఎవ్వనిచే ఏవిధముగా ఎవనికొరకు ఏర్పడినది ? దీని తత్వమును బోధింపు మనియు ఇంకనూ దేహముపై ఆత్మబుద్ధియు, నీపై పుత్రబుధ్ధియు చేసి ఈ సంసార సాగరములో పడియున్న మాకు ఆత్మజ్ఞానము బోధింప'మని కోరగా కృష్ణుడు ' ఈ చరాచరాత్మక జగమంతయూ బ్రహ్మమేకాని అన్యము కాదనియు, ఈ నానాత్వమునందు కల్పిత' మనియు కృష్ణుడు బోధించగా, వసుదేవుడు ఈ నానాత్వమునందు భేదబుధ్ధి పోగొట్టుకొని సర్వత్మ భావముతో ఆనందానుభవము పొందెను.

ఇట్లు కొంతకాలము గడచిన తరువాత కృష్ణుడు మృతుడైన గురుపుత్రుని తెచ్చిన సంగతి విని, దేవకి, కంసుడు చంపిన తన ఆరుగురు పుత్రులను చూపించమనికోరెను తల్లిని సంతోషపెట్టుటకు గాను కృష్ణుడు తనయోగమాయచే సుతల లోకమునకు జని , ఆలోకవాసుల ఆతిథ్యము స్వీకరించి వారినడిగి తన ఆర్గురు అన్నలను తీసికొని ద్వారకకు వచ్చి తల్లికి చూపగా, దేవకి ఆ కుమారులను కౌగిలించుకొని ప్రేమాతిరేకమున స్తన్యమిచ్చి ఆనందించగా, వారు కృష్ణునికి దేవకీ వసుదేవులకు నమస్కరించి అందరూ చూచుచుండగా అంతరిక్షములోనికి వెడలిపోయిరి.

సుభద్రపరిణయము

అర్జునుడు తీర్థయాత్రలు సల్పుచూ ప్రభాసక్షేత్రమునకు జని తన మేనమామకూతురగు సుభద్రను దుర్యోధనునకు యిచ్చి వివాహము చేయ బలరాముడు నిశ్చయించినాడనియు, మిగిలిన వారికి ఇది యిష్టములేదనియు తెలిసి, ఆమెను తాను పెండ్లిచేసుకొనదలచి, త్రిదండి యతి వేషముతో ద్వారకకు వెడలెను. ద్వారకావాసులును, బలరాముడునూ నిజమైన యతీశ్వరుడేయని నమ్మి అతనిని సత్కరించుచుండిరి. ఒకనాడు ఆ కపటయతిని బలరాముడు తన యింటికి తెచ్చి శ్రధ్ధతో బిక్షయిడి తన యింట నుంచుకొని సపర్యలకు సుభద్రము నియోగించెను. అర్జునుడు సుభద్రను చూడగనే ఆమె సౌందర్యమునకు మోహపడి ఆమెను ఎట్లు వివాహమాడుదునా యని ఆలోచించుచుండెను. సుభద్రగూడ అర్జునుని చూడగానే అట్లే అనుకొనెను ఒకనాడు యాదవులందరూ దేవయాత్రకై మరియొక పట్టణమునకు పోవుచుండగా, సుభద్ర ఎక్కిన రథమును అర్జనుడు సారథియై, అడ్డము వచ్చిన వారిని తరిమివేసి సుభద్రము తీసుకొనిపోయెను. ఆ సంగతి తెలిసిన బలరాముడు అతనిని శిక్షించి సుభద్రము తీసుకొని వచ్చుటకు బయలుదేరగా కృష్ణుడు బలరాముని శాంతపరిచి, ఆ యతీశ్వరుడు అర్జనుడేయని చెప్పి సుభద్రార్జునులు పరస్పరానురాగ భరితులై వివాహమాడ నిశ్చయించుకొన్నారని బలరామునికి తెలియజేయగా, ఆతడు శాంతించి సుభద్రార్జునుల పిలపించి వైభవోపేతముగా వివాహము జరిపెను.

మైథిల శృతదేవులకు కృష్ణుడు అతిథిగాజనుట

కృష్ణచంద్రుని చిత్రవిచిత్రములైన చరిత్రలు వినగోరుచున్న పరీక్షిత్తునకు శుకయోగీంద్రుడు ఈ కథను చెప్పెను.

పూర్వము శృతదేవుడను బ్రహ్మణుడు మిథిలాపురమున దైవప్రాప్తమునకు తృప్తిపొంది శాంతుడు, విద్వాంసుడునై గృహకృత్యములు నిర్వహించుచూ, కృష్ణుని యందు భక్తి కలిగి యుండెను. ఆ మిధిలారాజ్యమునుపాలించు బహుళాశ్వుడను రాజుయును నిరహంకారయై శాంతుడై కృష్ణభక్తి చేయుచుండెను. ఇట్లుండ నొకనాడు ఆ బ్రహ్మణుడును, ఈ రాజుయును కృష్ణుని తమతమ గృహములకు ఆతధ్యమునకు రమ్మని ఆహ్వానించిరి. భక్తుల నిద్దరనూ అనుగ్రహింపదలచి రథము నధిష్టించి బయలుదేరెను. ఈ వార్తవిని నారదుడు, వ్యాసుడు, మైత్రేయుడు, చ్యవనుడు మున్నగు మహర్షులతో నేనుగూడ కృష్ణుని అనుసరించితిమి. అందరమూ విదేహమునకు చేరగా, పౌరులందరూ స్వాగతము చెప్పి పూజించిరి. మైధిలుడును, శృతదేవుడును పూజించి, సాష్టాంగప్రణామము లాచరించి ఎవరికివారు తమతమ ఆతిథ్యముల నంగీకరింప ప్రార్థించిరి. కృష్ణుడు వారిద్దరకూ ప్రియము చేయదలచినవాడై ఒకరి కొకరికి తెలియకుండ తనతోవచ్చిన మునులతో గూడ ఇద్దరి గృహములకూ ఏకకాలమున జనెను. ఎవరికి వారు కృష్ణుడు మునులతో సహా తమ యింటికే వచ్చివారని సంతసించిరి. బహుళాశ్వుడు అందరకూ పాదప్రక్షాళన మొనరించి ఆ జలములను సకుటుంబముగా శిరస్సున జల్లుకొని గంధమాల్యాదులతో పూజించి, మృష్టాన్నభోజన మిడి సేవచేసెను. అట్లే శృతదేవుడునూ కృష్ణునికి సకలసపర్యల జేసి సాత్వికాహారమును భుజింపజేసి తనకుకలిగిన మహాభాగ్యమునకు ఆనందిచుచుండెను. అంతట కృష్ణుడు ఆ బ్రహ్మణోత్తమునితో ' శృతదేవా, నాకు భక్తితో సేవలు చేసినందుకు సంతోషమే! కాని నాతో వచ్చిన ఈ మునులు నిన్ను అనుగ్రహింప వచ్చిరని తెలుసుకోలేకపోతివి. వీరిపాదరేణువులు లోకములను పవిత్రముచేయును. జన్మమాత్రములనే బ్రహ్మణుడు జీవులలోనెల్ల ఉత్తముడు ; అతడే విద్వాంసుడై తపస్సు ఉపాసన చేయగలిగిన చెప్పవలసిన దేమి? బ్రహ్మణమూర్తికంటె ఈ చతుర్భుజరూపము నాకు ప్రియము కాదు. విప్రుడు సర్వవేదమయుడు. నేను సర్వవేదమయుడను. కావున ఈ బ్రహర్షులను శ్రద్ధతో పూజింపుము. అట్లొనర్చిన నేను పూజితుడ నగుదునుగాని, వారల పూజింపక నన్ను ఎంత గొప్పగా పూజించిననూ నాకు సంతోషకరముకాదు.' అని చెప్పగా శృతుదేవుడు ఆ మునులనుగూడ కృష్ణునితో పాటు ఆరాధించి సద్గతి గాంచెను.

శృతిగీతలు

పరీక్షిన్మహారాజు తనకు కలిగిన సందేహమును శుకయోగీంద్రునితో ఇట్లు విన్నవించెను " మునీంద్రా కార్యకారణాతీతమై నిర్గుణమై నుర్దేశింప నలవిగాని బ్రహ్మమును గూర్చి గుణవృత్తులైన శృతులు ఎట్లు ప్రవర్తిల్లును?" అందుకు శుకయోగి "రాజేంద్ర జీవులకు విషయ భోగము, కర్మానుష్ఠానము, తత్తల్లోక భోగము, కైవల్యము అను పురషార్థ చతుష్టయమును సిధ్ధింప ఈశ్వరుడు బుద్ధీంద్రియ మనఃప్రాణము లను ఉపాధులను సృజించెను. జీవులకు స్వరూపోపపాదనము లేకున్న మోక్షము సిధ్ధింపదు. శృతులు సాక్షాద్వృత్తిని బ్రహ్మబోధకములు కాకున్నను, పరమేశ్వరోద్దిష్టమైన మోక్షవిషయమై గౌణవృత్తి చే బోధించును. ఉపనిషన్మహా వాక్యములకు జహదజహర్ల క్షణావృత్తి గైకొని విరుద్ధాంశముల త్యజించి అనుగతమైన చిదర్థ మాత్రముగ్రహించి సమన్వయమును చేసినట్లుగనే శృతులు నిర్గుణ బ్రహ్మమును బోధించును. ఉపనిషత్తులు ఇట్లు బ్రహ్మపరంబులని పెద్దలు సిద్ధాంతీకరించిరి. కావున కుతర్కములకు లోనుగాక ఈ సిద్ధాంతము నవలంబించు నతడు దేహాద్యుపాధిరహితుడై పరమపదము పొందును.

పూర్వము నారాయణ మునీంద్రుడు నారదునకు ఈ విషయము బోధించెను. నారదుడు లోకసంచారము చేయుచు ఒకరోజున నారాయణ మహర్షిని గాంచి నమస్కరించి, ఈ విషయమునే అడుగగా ఆతడు ' తొల్లి జనలోకమున బ్రహ్మసత్రమను యాగము జరిగిన సందర్భమున ఈ ప్రశ్న ఉదయించగా దాని జవాబు యిట్లుండెను. నిద్రపోవు సార్వభౌముని వేకువజామున స్తుతిపాటకులు మేలుకొలుపులు పాడి లేపుదురు. అటులనే నిజ శక్తులతో ఈ జగత్తునంతను ఉపసంహరించి యోగనిద్రపరుడైన పరమాత్ముని ప్రళయాంతమున తత్ర్పధమ నిశ్వాస నిర్గతములైన శృతులు ఈ విధముగా బోధించినవి. అజితా సర్వోత్కర్ష మావిష్కరింపుము; ఆ విద్యను బొలియింపుము సర్వశక్తులను ఉద్భోధము గావించు నీవు ఆత్మ స్వరూపముననే మాయను వశీకరించుకొని, సమస్త ఐశ్వర్యములను బడసిన వాడవు సృష్టి మున్నగు కార్యములలో నీవు మాయా యోగమున క్రీడింతువుగాని దానికి వశుడవు గావు. ఘటాది పదార్థములకు ప్రకృతి ద్రవ్య మగు మృత్తునందు ఉత్పత్తిలయములు కలుగునట్లు, అవికారమైన బ్రహ్మము వలన ఈ జగమునకు ఉత్పత్తిలయములు కలుగును. కావున సర్వమూ బ్రహ్మవశిష్టమైన కారణముచేత జగదీశ్వరులని నిరూపింపబడు ఇంద్రాదులెల్ల బ్రహ్మమేగాని వేరుగాదు. నీచే సృష్టింపబడి దేనిని బోధించిననూ నిన్నే బోధించినట్లగును. నరులు నీకు భక్తులగుదురేని, జీవనసాఫల్యము గాంతురు. అట్లు కానిచో తోలుత్తిత్తుల రీతి వృధాశ్వాసమాత్రులు. స్థూలసూక్ష్మములగు అన్నమయాదుల కతిరిక్తంబై తత్సాక్షియై శేషించు అబాధ్యసత్య బహ్మము నీవు. మిధ్యాభూతములైన దేహములందు. సత్యమై నిర్విశేషమై సన్మాతమై వెలయు నీరూపమును కర్మఫలాభిసంధిరహితులైన నిర్మల చిత్తులు ఎరుగుదురు దుర్బోధమగు ఆత్మతత్వము బోధింప, మూర్తి నంగీకరించిన నీ కధలు అను మహాసుధాసాగరమున మునిగి, బడలికలు బాసి, కొందరు రాజహంసల వలె భక్తుల సంగమున గృహముల త్యజించి, భగవద్బక్తిచే మోక్షమునేకోరరు. సృష్టికి పుర్వమేయున్న నిన్ను ఉత్పత్తి వినాశముల పొందు నెవ్వరెరుగుదురు ? అసత్తైన జగత్తుకు ఉత్పత్తి జరిగెననియు, సత్తైన బ్రహ్మమే ఉత్పత్తి గాంచెననియు, ఏకవింశతి ప్రకార దుఃఖముల ధ్వంసమే మోక్షమ యు కర్మఫలవ్యవహారము సత్యమనియు, పలువురు భ్రాంతులై ఉపదేశింతురు. మనోమాత్రవిసితమైన త్రిగుణాత్మక ప్రపంచము అసత్తైననూ నీయందు అధిష్ఠానసత్తచే సత్తువలె తోచును. కాంచనమును కోరువారు తద్వికారమగుకుండలాదులను కాంచనముకాదని త్యజింతురా ? కనుక ఆత్మకృతమై అనుప్రవిష్టమైన విశ్వము ఆత్మరుపము. సర్వభూతవాసుడవని నిన్ను ఉపాసించువారు మృత్యువును గణింపరు. భవదిధిముఖునైన అభక్తులను ఎంతవిద్వాంసులైననూ పశువులకు వోలె, వేదవాక్కున బంధింతురు. నిన్నాశ్రయింపని వారికే జన్మమరణాది భయము కలుగును కాని , నిన్ను అనువర్తించు వారికి సంసారభయ మెట్లుకలుగును? సత్తువలన పుట్టిన కారణమున ఈ విశ్వమును సత్తు అందుమేని, తర్కమున కార్య కారణములకు భేదము ఏర్పడుట వలన ఆ యుక్తి కుదరదు. కావున సదాత్మత్వము సాధింపనశక్యము. సృష్టికి పూర్వమును ప్రళయమునకు పిమ్మటనూ లేని విశ్వము ఈ నడుమను మిధ్యాభూతమే అయిననూ, కేవలుడైన నీయందు ప్రతీతి మాత్రమున తోచుచున్నది. కావున మృదాది కార్యములగు ఘటాదులవలె బ్రహ్మకార్యములైన ఆకాశాదులును నామమాత్రాదులే. మృదాదులరీతి బ్రహ్మమే సత్యము. ప్రపంచము సత్యమని తలచువాడు అవిద్వాంసుడగును. మాయచే దేహేంద్రియాదుల యందు ఆత్మాధ్యానము చేసి జీవుడు సంసారమున పడును. నీవన్ననో ఆ మాయను నిరసింతువు. యతులును హృదయము లోని కామ వాసనలను ఉన్మీలింపరేని హృదయస్థుడవయ్యూ, నీవు దుర్లభుడవు. సగుణ పక్షమున గుణానంతత్వము, నిర్గుణతత్వమున అగోచరత్వము కారణములు కాగా శృతులు తద్భిన్ననిరాసమున అవధిభూతూడైన నీయందు పర్యవసన్నంబులై తాత్పర్య వృత్తిని బోధించె' నని చెప్పెను.

ఇట్లు చెప్పగా నారదుడు శ్రధ్ధతో గ్రహించి తన గురువగు నారాయణ మునీంద్రునకు నమస్కరించి, శలవు గైకొని, తండ్రివద్ద కేగి తాను విన్నదంతయూ తండ్రికివివరించి చెప్పెను"

పరీక్షిన్నరేంద్రా! నీవడిగిన దానికి జవాబు చెప్పితిని గదా!

కృష్ణార్జునులు మృతబ్రహ్మణపుత్రులను తెచ్చుట

పరీక్షిన్నరంద్రా! కృష్ణుడు ద్వారకలో నుండగా ఒకనాడు ఒక విప్రుడు పుట్టగానేచనిపోయిన తన శిశువును తెచ్చి రాజద్వారమున వుంచి విలపించుచు ' బ్రహ్మద్వేషి, శఠుడు, విషయాసక్తుడు అగు రాజయొక్కదోషమునకు నాకుమారుడు చనిపోయెను. దుశ్శీలుడు అజితేంద్రియుడునగు రాజుపాలమున ప్రజలు పేదలై నిత్యము దుఃఖమున కుందురు" అని చెప్పి ఆ శిశువునచటనే వదలిపోయెను. ఈ విధముగా చనిపోయిన ఎనిమిది పుత్రులను తెచ్చి రాజద్వారమున పడవేసెను. చివరుకు అతని తొమ్మిదవ కుమారుడుగూడ చనిపోగా, రాజద్వారమునన్ను ఆ బ్రహ్మణుని దుఃఖమును చూచి జాలిగొని అచ్చటనున్న అర్జునుడు ఆ బ్రహ్మణునితో ' విప్రోత్తమా! ఈ దేశమున విల్లుబట్టిన రాజన్యుడు కాన్పడడు ఏ దేశమున బ్రాహ్మణులు ధనదార సుతాది వియోగమున విలపింతురో ఆ దేశపాలుకుల నింద్యులు. నేను నీపిల్లలను రక్షించెదను. నేను మృత్యువును గెలిచి నీబిడ్డను తెచ్చియిత్తును. అట్లు కాని యడల అగ్నిలో పడి నశించెదను. అని చెప్పగా ఆ బ్రహ్మణుడు సంతసించి వెడలిపోయెను. తిరిగి ఆ బ్రహ్మణుని భార్యగర్భవతియై ప్రసవసమయమురాగా అర్జునుని తనయింటికి తీసుకొనివచ్చెను. అర్జునుడు శుచియై మహేశ్వరునకు ప్రణమిల్లి దివ్యాస్త్రముల స్మరించి, పురిటిగదికి నలువైపుల దివ్యాస్త్రశరములతో పంజరము కట్టి కాచియుండెను. ఆ విప్రపత్ని ప్రసవించగా పుట్టిన కుమారుడు దేహముతో గూడ అదృశ్యుడయ్యెను. అంతట ఆ బ్రాహ్మణుడు కృష్ణసన్నిధిలోనున్న అర్జునుని దుఃఖముతో నిందించెను అర్జునుడు తన ఆత్మవిద్యాయోగముతో గాండీవము ధరించి యమపురికి జనెను. అచ్చటకానక, స్వర్గపాతాళాది లోకములలో గూడ వెదకి కానక, తన ప్రతిజ్ఞ వమ్ము అయినదని అగ్ని ప్రవేశము చేయ నిశ్చయించగా, కృష్ణుడు వారించి, ఆతనిని తన రథముపై కూర్చుండబెట్టుకొని, ప్రయాణమై సప్తదీపములను, సప్తసముద్రములను, సప్తగిరులను దాటి, లోకాలోకము నతిక్రమించి గాఢాంధకారము ప్రవేశింపగా, తనచక్రముచే ఆ యంధకారమును పోగొట్టి అచ్చట మణిస్తంభసహస్రశోభితమై దేదీప్యమానమై వెలుగుచున్న వనమును ప్రవేశించెను. అచ్చట అనంతుని భోగతల్పమున సుఖాసీనుడై, లలిత పీతాంబరాదులతో విరాజిల్లుచు, నీలమేఘచ్ఛాయతో నొప్పారు నారాయణుని జూచి కృష్ణార్జునులు మ్రొక్కిరి. అంతట నారాయణుడు కృష్ణార్జునులజూచి " మదంశసంభూతులారా, మిమ్ముజూడగోరి నేను విప్రపుత్రులను ఇచ్చటకురావించితిని ఇరుగో ఆవిప్రబాలురు" అని వారిని వప్పగించెను. అంతట కృష్ణార్జునులు ఆ విప్రబాలకులను తీసుకొని ద్వారకకు వచ్చి ఆ విప్రునికి సమర్పించిరి.

అంతట అర్జనుడు అద్భుతమైన కృష్ణతేజస్సును చూచిలోకములో పౌరుషమనునది కృష్ణుని కరుణవలననే కలుగవలెనుగాని మరియోగవిధముగా కలుగదని, తనగర్వమును వీడి కృష్ణుని అధిక భక్తితో సేవించెను.

Sri Bhagavatha kamudi    Chapters