Jagadguru divyacharithra   Chapters   Last Page

 

15. శ్రీవారు

అంబా సాంబాయితం తేజః వాణీ వీణాయితాంగిరం |
పద్మా పద్మాయితం పాదం శ్రీగురో శ్శరణం భ##జే ||

- గురుకృపాలహరీ.

అవతరణం :

స్వస్తిశ్రీ జయవత్సర వైశాఖ బహుళ పాడ్యమి ఆదివారం. అనూరాధా నక్షత్రం, 20-5-1894, దక్షిణార్కాటు జిల్లా విల్లుపురం శ్రీవారి జన్మస్థలం. (తమిళనాడు) పూర్వాశ్రమనామం శ్రీస్వామినాథన్‌.

శ్రీవారి పూర్వాశ్రమ కుటుంబం మైసూరు మండలంలో కన్నడం మాతృభాష గాగల్గి ఋగ్వేదశాఖకు చెందిన హొసైల్‌ కర్ణాటక స్మార్త బ్రాహ్మణ శాఖకు చెందినది. వీరు హరితసగోత్రులు.

జననీజనకులు :

శ్రీమహాలక్ష్మీదేవి, శ్రీసుబ్రహ్మణ్యశాస్త్రి, అనుపుణ్యదంపతులకు వీరు రెండవ సంతానం. ఈ కుటుంబం కర్ణాట ప్రాంతంనుండవచ్చి తమిళ ప్రాంతంలోని చోళమండలంలో స్థిరనివాసం ఏర్పరచుకొన్నది. శ్రీసుబ్రహ్మణ్యశాస్త్రిగారు మెట్రిక్యులేషన్‌ పరీక్షయం దుత్తీర్ణులై ఉపాధ్యాయుడుగా కొంతకాలం పనిచేశారు. తరువాత వీరు విద్యాశాఖోద్యోగిగా చేరారు. వీరి ఉద్యోగరీత్యా విల్లుపురంలో ఉన్నప్పుడే శ్రీస్వామి నాథన్‌ జన్మించారు.

వీరి మాతామహస్థలం తిరువయ్యారుకు సమీపంలోగల 'ఇచ్చంగుడి' అనే గ్రామం. ఈ వంశంలో రాజగోవింద దీక్షితులు మిక్కిలి సుప్రసిద్ధులు. వీరు పండితులు, యజ్ఞదీక్షితులు, రాజకార్యాదురంధరులు, తంజావూరు నాయక రాజస్థానంలో మంత్రిగా ఉండేవారు. గోవింద మంత్రిగా చిరప్రసిద్ధి నందారు. వీరిని అయ్యన్‌ అనికూడ పిలచేవారు. చోళప్రాంతంలో వీరు చాల నిర్మాణములను చేయించారు. అయ్యన్‌ కోనేరు, అయ్యన్‌ కాలువ అనే పేర్లతో ఇప్పటికి వీరి ప్రజాపిత కార్యక్రమములు ప్రజల స్మృతిపథాన్ని విడువలేదు.

శ్రీవారి మాతామహులు శ్రీ నాగేశ్వరశాస్త్రిగారు. వీరు సలక్షణ ఋగ్వేదాధ్యేత.

శ్రీవారి పూర్వాశ్రమపితామహులు శ్రీగణపతిశాస్త్రిగారు సాంగోపాంగంగా ఋగ్వేదాధ్యయనం చేశారు. షడ్దర్శన పారంగతులు.

శ్రీవారి పూర్వాశ్రమ కుటుంబమునకు ఇలవేల్పు స్వామిమలైలోని శ్రీ స్వామినాథుడనే దైవం. అందువల్ల వీరికి నామకరణం చేశారు.

బాల్యానుభవం :

శ్రీవారు తమ బాల్యానుభవాన్ని గూర్చి 'జీవితం నేర్పిన పాఠం' అంటూ ఒక ఉపన్యాసంలో ఇలా పేర్కొన్నారు.

''నాకు నాలుగు మూడేళ్ల వయస్సులో ఒకరోజున రాత్రివేళ జంగుపిల్లి ఒకటి ఇంటిలోనికి దూరింది. అచట ఉట్టిలో బెల్లం ఉన్న రాగిపాత్రలో తలదూర్చింది. తల తీయబోతే రాలేదు. అందులోనే ఇరుక్కుపోయింది. అది ఆ తలను బయటకు తీసికోవడం కోసం అటు ఇటు పరుగులు పెడుతూ ఆ గదిలో తీవ్రంగా సందడి చేస్తున్నది. ఇంట్లో వారు చుట్టుప్రక్కల వారుకూడ దాని సందడికి మేల్కొన్నారు. ఎవడో దొంగ ఆ గదిలో జొరబడి వాడి సవరింపువాడు చూచుకొంటున్నాడని అభిప్రాయపడ్డారు. తెల్లవారేదాకా ఆ ధ్వని అలాగే ఉన్నది. అప్పటికి కొందరు కర్రలు తీసికొని ధైర్యంతో గదితలుపులు తెరచిచూచారు. గందరగోళం పడుతున్న జంగు పిల్లిని చూచారు. దాన్ని ఒక తాడుతో రాతికి గట్టిగాకట్టి నేర్పుతో దాని తలను బయటకు తీశారు. ఆ పిల్లి ప్రాణాపాయ స్థితిలో ఆరాటపడి తుదకు బయటపడింది. అది దూరంగా విడిచిపెట్టబడింది.

ఇది నా జీవితంలో మొట్టమొదటి అనుభవం. నేను మా చుట్టు ప్రక్కల వాళ్ళతో కలిసి నిద్రలేకుండా ఆందోళనతో గడిపాను. ఆశ అనేది ప్రాణికి ఎంతటి ఆపదను తెచ్చిపెడుతుందో ప్రత్యక్షంగా చూశాను.

రెండవ అనుభవం ఇది : ఆ చిన్నవయస్సులోనే ఒక రోజున ఒంటరిగా ఉన్నాను. ఆ సమయంలో నాచేతులకు బంగారు మురుగు లుండేవి. అపుడొకడు నన్ను చూచాడు. ఒంటరిగా ఉన్నాడుగదా అని చొరవగా నా చేతిని పట్టుకున్నాడు. ''ఇవి నాకు చాలవదులుగా ఉన్నాయి. వీనిని తీసికొనివెళ్ళి కొంచెం బిగువుగా చేసి వెంటనే తీసుకురమ్మ''ని చెప్పాను. నేను చెప్పటంలో మాత్రం చాల హుందాగానే చెప్పాను. ఆ వచ్చినవాడు నా మాటను ఔదలదాల్చి వినయంగా ఆ బంగారు ఆభరణాలను భద్రపఱచుకొని చక్కాపోయాడు. నేనా బజారులో ఆ అబ్బాయికి ఇంత తొందరలో ఈ ఆభరణాలను ఇచ్చి వాటిని మరమ్మతు చేయించే కార్యక్రమం చురుకుగా జరిపినందుకు తొందరగా వెళ్ళి ఇంట్లో చెప్పాను. నేను అంతకుపూర్వమే అతని పేరునుకూడ అడిగి తెలిసికొన్నాను. అతనిపేరు 'పొన్నుస్వామి' (సార్థకమైనపేరే - పొన్ను అంటే బంగారం - బంగారానికి అధిపతి) ఇంట్లోవారంతా ఆందోళనపడి వీధిలోకి వెళ్ళి ఆ పొన్నుస్వామి కోసం గాలించారు. కాని అతడు ఆ ఆభరణాలను గ్రహించి వాటిని సొంతం చేసికొని పొన్నుస్వామి అనే అతనిపేరును సార్థకం చేసికొన్నాడు.

కాగా ఈ అనుభవంవల్ల స్వార్థరహితమైన మానవ జీవితం ఉండదేమో అనిపించింది. కాని సంవత్సరాలు గడచినకొలది లోకాన్ని చూస్తూంటే లోకంలో నైతికంగాను, ధార్మికంగాను పటిష్ఠమైన భావోన్నతిగలవారుకూడ ఉన్నారనిపిస్తోంది. కొందరు తమ అధ్యాత్మిక సాధనానుభూతులనుకూడ లెక్క చెయ్యకుండా స్వచ్ఛందంగానే తమ జీవిత సర్వస్వాన్ని పరార్ధపరాయణతతో లోక కల్యాణానికై అంకితం చేస్తున్నారనికూడ అనిపించుతోంది''.

1899 లో ఒక విశేషం జరిగింది. శ్రీవారి తండ్రి ఉపాధ్యాయులుగా ఒక గ్రామంలో ఉద్యోగించుతున్నారు. వారీబాలున్ని (శ్రీవారిని) ఇలైమయాక్కినార్‌ దేవాలయం కుంభాభిషేకోత్సవ దర్శనార్థం చిదంబరానికి తీసికొనివెళ్ళారు. అచట ఆ సాయంకాల శ్రీవెంకటపతిఅయ్యర్‌గారి ఇంట్లో తండ్రి కొడుకు లిరువురు విడిదిచేశారు. ఆ తండ్రి బాలుని నిద్రపోవలసిందిగా చెప్పారు. నిద్రలేపి, దేవాలయానికి తీసికొని వెళ్ళి దైవదర్శనం చేయిస్తామని కూడ చెప్పారు. కాని బాలుడు నిద్రలేచి చూచేటప్పటికి తెల్లవారి పోయింది. అందువల్ల తన తండ్రి తనను నిద్రలేపి ఆలయానికి తీసికొని వెళ్ళలేదని నిరుత్సాహం కలిగింది. కాని ఆ తండ్రి తానుకూడ ఆలయానికి వెళ్ళలేదని, అదృష్టంవల్ల అసలాయింట్లో వారెవ్వరు ఆ రాత్రి దేవాలయానికి వెళ్ళలేదని బాలునికి చెప్పి ఓదార్చారు. ఆ దేవాలయంలో ఆ రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఆలయంలోపల ఉన్నవారికి ప్రమాదం కూడ జరిగింది.

ఆ రాత్రే యీ బాలుని తల్లికి ఆమె ఉన్న గ్రామంలోనే, చిదంబర దేవాలయంలో అగ్నిప్రమాదం జరిగినట్టు స్వప్నం వచ్చింది. ఆమె ఎంతో ఆతురతతో అగ్ని ప్రమాదం తన భర్తకు తన పసిబాలునికి ఏమైనా బాధ కలిగించిందోమోనని వెంటనే రైలు స్టేషనుకు బయలుదేరారు. చిదంబరంనుండి తిరిగివచ్చే ప్రయాణికుల్ని అడిగి తన భర్తయొక్క, పసిబాలునియొక్క క్షేమం తెలిసికోవాలని ఆమె అభిప్రాయం. కాని అప్పుడే రైలుదిగి వస్తున్న తండ్రి, కొడుకులను చూచేటప్పటికి ఆమె అవధిలేని ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోయారు. ఆమెకు ఆ స్వప్నం రావటం ఆందోళన చెందటం - తుదకు వారికా ప్రమాదం జరగకపోవటం ఈ అంశాలకు అనుహ్యమైన పరస్పరసంబంధం ఉన్నట్టు కన్పించుతుంది.

1900 లో శ్రీ స్వామినాథన్‌ చిదంబరలో ఒకటవ తరగతి చదువుతున్న బాలుడు. శ్రీ యమ్‌. సింగరవేలు ముదలియార్‌ అనే అసిస్టెంటు స్కూళ్ళ ఇనస్పెక్టరు స్కూలు తనిఖీకోసం వచ్చి ఈ బాలునిలోగల అపూర్వ ప్రతిభా సంపత్తిని పసిగట్టాడు. లాజ్మన్స్‌ కంపెనీవారు ప్రచురించిన ఇంగ్లీషు వాచకాన్ని చదవవలసిందిగా బాలుని కోరాడు. ఆ పుస్తకం పై తరగతి విద్యార్థుల పాఠ్యగ్రంథం. శ్రీస్వామినాథన్‌ ఆ పుస్తకాన్ని ఎంతో చక్కగా చదవటం జరిగింది. ఈ సమయంలోనే ఈ బాలుని వెంటనే మూడవ తరగతిలోకి పంపటం జరిగింది.

ఇంతలో శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారికి 'తిండివనం' బదిలీ ఐంది.

1905 లో అచటనే ఈ బాలునికి ఉపనయనం జరిగింది. ఆ సమయంలో కామకోటిపీఠం 66వ ఆచార్యులైన శ్రీచంద్రశేఖరేంద్రసరస్వతీ శ్రీచరణులు దక్షిణ ఆర్కాటుజిల్లాలో పర్యటించుతున్నారు. ఈ ఉపనయనోత్సవానికి వారి ఆశీస్సులు లభించినవి. వారే వీరిని కామకోటిపీఠాధిపతులుగా చెయ్యాలని తరువాత సంకల్పించుకోవటం. ఆ తరువాత ఈ స్వామినాథన్‌ ఆశ్రమ స్వీకారంచేసి ఆ స్వామివారి పేరు 'శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ'అనే సన్న్యాస నామంకూడ ధరించటం విస్మరింపరాని విశేషం.

శ్రీ స్వామినాథన్‌ను పదిసంవత్సరాల వయస్సులో తిండివనంలోని అమెరికన్‌ ఆర్కాటు మిషన్‌ స్కూలులో రెండవఫారంలో ప్రవేశ##పెట్టటం జరిగింది. పాఠశాలలో ఈ బాలుని ప్రతిభా వైదుష్యాలు విశేషంగాను, ఆకర్షకంగాను ఉండేవి. ఈ బాలుడు పాఠశాలలోని పలు పోటిపరీక్షలలో నెగ్గుతూ ఆయా బహుమతులకు 'విజేత' కావటం పరిపాటిగా ఉండేది. ఉపాధ్యాయులందరి దృష్టిలో ఈ బాలునిపై ఆదరం సహజంగా అభివృద్ధి పొందింది. వారీ బాలుని ఇతర విద్యార్థులకు 'ఆదర్శ విద్యార్థి'గా చూపుతూ ఉండేవారు. ఈ విద్యార్థి ఉనికి వారికి గర్వకారణంగా ఉండేది.

1906 లో శ్రీ స్వామినాథన్‌ 4వ ఫారం చదువుతున్న రోజులవి. ఆ సమయంలోనే ఆ పాఠశాలలో ఆంగ్లంలో మహాకవియైన షేక్స్పియర్‌ వ్రాసిన 'కింగ్‌జాన్‌' లోని కొంతభాగం ప్రదర్శించటంకోసం ప్రయత్నం జరిగింది. ఆయా పాత్రధారులను ఉపాధ్యాయులే నిశ్చయించాలి. అందులో ప్రధానపాత్ర ఫ్రిన్స్‌ ఆర్ధర్‌. ఈ పాత్రను ధరించటానికి వారు తలపెట్టిన వయస్సులోని విద్యార్థు లెవ్వరు అర్హులుగా కన్పించలేదు. అప్పటికీ స్వామినాథన్‌ వయస్సు పండ్రెండు సంవత్సరాలు మాత్రమే. ఐనా అచటి ప్రధానోపాధ్యాయునికి ఈ బాలుని అసాధారణ ప్రతిభ బాగా తెలుసు. అందువల్ల ఈ బాధ్యతను ఆయన ఈ స్వామినాథన్‌కు అప్పగించటం జరిగింది. వెంటనే బాలుడు తల్లిదండ్రుల అనుమతి తీసికొని రెండు రోజుల్లో ఆభాగం అంతా క్షుణ్ణంగా అభ్యసించి ప్రేక్షకులందరి మన్ననలను పొందేటట్టు ఫ్రిన్స్‌ ఆర్థర్‌ పాత్రను సమర్థవంతంగా ప్రదర్శించటం జరిగింది. ఆ షేక్స్సియర్‌ ఇంగ్లీషుభాషను సైతం పాత్రోచితమై సుందరసులభోచ్చారణంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించటం జరిగింది. ఆనాడే స్వామినాథన్‌లోని అసాధారణ రాజఠీవి స్పష్టమైనది. మరునాడు ఉదయం చాలామంది ఉపాధ్యాయులు శ్రీసుబ్రహ్మణ్యశాస్త్రిగారి ఇంటికి వెళ్ళి శ్రీ స్వామినాథన్‌ అసాధారణ పాత్ర నిర్వహణానికి తామెట్లు ముగ్థులైనది వారితో చెప్పి తమ సంతోషాన్ని వెలిబుచ్చారు.

కామకోటి పీఠాధిరోహణం :

కామకోటి పీఠాధిష్టితులైన 66వ ఆచార్యులు శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ శ్రీచరణులని ఇంతకు పూర్వమే వివరింపబడినది 1906 లో వారు తిండివనానికి సమీపంలో ఉండే పెరుముక్కాల్‌ అనే గ్రామానికి విజయంచేసి అచట చాతుర్మాస్యవ్రతాన్ని నిర్వర్తించుతున్నారు. శ్రీసుబ్రహ్మణ్యశాస్త్రిగారుకూడ సకుటుంబంగా అచట శ్రీస్వామివారి దర్శనార్థం వెళ్లారు. వారి ఆశీస్సులను పొందారు. శ్రీస్వామినాథన్‌ ఆస్వామివారిని దూరప్రదేశంలో ఉండి ఒక దేవాలయంలో విశ్వరూప యాత్రా సందర్భంలో దర్శించుకొన్నారు.

ఆ స్వామివారే నవరాత్రి పూజోత్సవమును 'మరక్కనం'అనే గ్రామంలో నిర్వర్తించారు. అటుపిమ్మట వారు తిండివనం - మదురాంతకం రైలుమార్గంలోని సారం గ్రామానికి విజయం చేశారు. శ్రీస్వామినాథన్‌ ఒక స్నేహితునితో కలిసి అచటకు వెళ్ళారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు. అచట స్వామివారి దివ్య శ్రీచరణదర్శన భాగ్యాన్ని పొంది, ప్రస్థానమంగళాన్ని అనుగ్రహించ వలసిందిగా ప్రార్థించారు. కాని శ్రీస్వామివారు స్వామినాథ9తో అచటనే ఉండవలసినదిగా చెప్పారు. శ్రీమఠంలోని ఇరువురు పండితులు కూడ స్వామినాథన్‌ను అచటనే ఉండవలసిందిగా నొక్కి చెప్పారు. కాని స్వామినాథన్‌ తాను ఇచటకు వచ్చే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పలేదని, పైగా తాను పాఠశాలకు కూడ వెళ్ళవలసి ఉన్నదని చెప్పుకోవటం జరిగింది. అంతట అచటి స్వామివారు ఈ బాలుడు ఇంటికి వెళ్ళటానికి అనుజ్ఞనిచ్చారు. స్వామినాథన్‌ శ్రీమఠం బండిమీదనే ఇంటికి వెళ్ళటం కూడ జరిగింది. స్వామినాథన్‌ అచటనుండి వెళ్ళిన తరువాత శ్రీ స్వామివారు అచటి పండితులతో తమ అనంతరం ఆచార్యస్వామిగా పరమ పవిత్రమైన కంచికామకోటి పీఠాధిపత్యాన్ని ఈ బాలుని కివ్వవలెనని తమ తీవ్రవాంఛ అనికూడ చెప్పారు.

ఆ 66వ ఆచార్యస్వామివారు శ్రీ స్వామినాథన్‌ యొక్క పెదతల్లి కుమారుని 67 వ ఆచార్యులుగా నియమించి కలవైలో సిద్ధిపొందారు. స్వామినాథన్‌ పెదతల్లిగారికి ఆ ఒక్కడే కుమారుడు. ఆ బాలునికి చాలా చిన్నతనంలోనే పితృవియోగం జరిగింది. ఆ బాలుడు 1900-1901 సంవత్సరాలలో స్వామినాథన్‌ కుటుంబంతో పాటే ఉండి చిదంబరంలో వేదాధ్యయనం చేశాడు. తరువాత ఆ బాలుడు మఠంలో ఉండటం జరిగింది. ఇంతలో ఆ బాలుని పీఠాధిపతిగా నియమించిన సంగతి స్వామినాథన్‌ తల్లిదండ్రులకు తెలిసింది. స్వామినాథన్‌ తల్లి- తన సోదరి యొక్క ఒక్కగా నొక్క కుమారుడు సన్న్యాసం స్వీకరించినట్లు తెలిసి ఆమె నోదార్చటంకోసం బయలుదేరాలని అభిప్రాయపడటంచేత మొత్తం కుటుంబం అందరు కలవాయికి బయలుదేరారు. ఆసమయంలో స్వామినాథన్‌ పెదతల్లిగారు కలవైలోనే ఉన్నారుకాని చివరిక్షణంలో తిరుచినుండి స్వామినాథన్‌ తండ్రికి ఒక టెలిగ్రాం వచ్చింది. దాని ప్రకారం ఆయన తిరుచిలో జరిగే విద్యావిషయకమైన సభకు వెళ్ళవలసి వచ్చింది. అందువల్ల వారు తిరుచికి ప్రయాణమై వెళ్ళబోతూ ఈ ప్రయాణంలో ఒక మార్పు చేశారు. వీరిని కలవాయికి సరాసరి బండిమీద ప్రయాణం చెయ్యవద్దని, సుమారు 50 మైళ్ళదూరం సరియైన రక్షణ లేకుండా బండిమీద ప్రయాణం చెయ్యదగినది కాదని, కనుక కంచివరకు రైలుమీద ప్రయాణంచేసి అచటినుండి బండి ప్రయాణంచేసి కలవాయికి వెళ్ళవలసిందిగా చెప్పారు.

కంచినుండి కలవాయికి జరిగిన ఈ ప్రయాణం మిక్కిలి చరిత్రాత్మకమైనది మిక్కిలి చిన్నవయస్సులో శ్రీ స్వామినాథన్‌ను తలవని తలంపుగా కంచికామకోటి పీఠాధిపతులను జేసినదీ ప్రయాణం.

ఇంతకుపూర్వం ఉల్లేఖింపబడిన 'జీవితం నేర్పిన పాఠం' అనే శ్రీవారి ఉపన్యాసంలోనే ఈ విషయం ఇలా వివరింపబడినది.

''1907 వ సంవత్సరం ఆరంభసమయమది. నేను దక్షిణ ఆర్కాటు జిల్లాలోని తిండివనంలోని మిషన్‌ స్కూలులో చదువుకొంటున్నాను. క్రిందటి సంవత్సర మా వూరిలో విజయంచేసి ఉన్న కంచి కామకోటి పీఠాధీశ్వరులు కలవైలో సిద్ధిపొందారనే వార్తవిన్నాను. కలవై అనే గ్రామం ఆర్కాటు పట్టణానికి పదిమైళ్ళదూరంలో ఉంటుంది. కాంచీ నగరానికి కలవై ఇరువై ఐదుమైళ్ళ దూరంలో ఉంటుంది.

మా పెదతల్లి కుమారుడు కొంత ఋగ్వేదాధ్యయనం చేసి శ్రీమఠంతో ఉండి శ్రీ స్వామివారి సేవలో ఉంటూండగా వారిని కామకోటి పీఠాధిష్టితుల్ని చేసి అచటి స్వామివారు సిద్ధిపొందారని కూడ విన్నాను.

మా పెదతల్లికి ఒక్కడే కుమారుడు. ఆమె వితంతువు. ఆ ఒక్కకుమారుడు ఆకస్మికంగా సన్న్యసించటంవల్ల ఆమెకు కొన్ని శాంతివచనాలు చెప్పేవారెవ్వరు అచటలేరు. ఇలాంటి పరిస్థితుల్లో తిండివనం తాలూకాలో స్కూళ్ళ సూపర్వైజరుగా ఉన్న మా తండ్రిగారు సకుటుంబంగా, కలవైకి వెళ్లాలని నిశ్చయించారు. మా తండ్రి గారు ఎద్దులబండిమీద 60 మైళ్లు ప్రయాణం చెయ్యాలనుకొన్నారు. అది వారి సొంత టూరింగుబండి. కాని తిరుచునాపల్లిలోని విద్యా విషయిక మహాసభా సందర్భంగా వారు మాత్రం ఈ ప్రయాణం చెయ్యటానికి వీలుపడలేదు.

మా అమ్మగారు నన్ను తక్కిన పిల్లలను తీసికొని ప్రయాణం ఆరంభించారు. ఒక్కగానొక్క కుమారుడు సన్న్యసించినందులకు అక్కగారికి శాంతివచనాలు చెప్పాలని ఆమె ఆశయం. మేము కంచివరకు రైలులో ప్రయాణం చేశాము. అక్కడ శంకరాచార్య మఠంలో ఆగేము. నా ప్రాతః కాలకృత్యాలను అచటి 'కుమారకోష్ఠం'లో నెరవేర్చుకొన్నాను. మఠంబండి ఒకటి కలవైనుండి వచ్చింది. అందులో కొందరు వ్యక్తులు కూడ ఉన్నారు. వారందరు పరమగురువులు సిద్ధిపొందిన పదవరోజున జరిపే 'మహాపూజా'కార్యక్రమానికి కావలసిన సామగ్రిని కొనటంకోసం అచటికి వచ్చారు. వారిలో వంశపారంపర్యంగా మఠంలో 'మేస్త్రి' పని చేస్తున్న వ్యక్తి తనతో రావలసిందిగా నాతో చెప్పాడు. తక్కిన మా కుటుంబ సభ్యులందరకు ప్రత్యేకం మరొక బండి ఏర్పాటు చేయబడినది.

ఈ ప్రయాణంలోనే నేను మరల ఇంటికి వెళ్లటం ఉండక పోవచ్చునని ఇంక జీవితమంతా మఠంలోనే గడపవలసి రావచ్చునని కూడ ఆ మేస్త్రీ నాకు సూచనప్రాయంగా తెలియజేశాడు. అప్పటికి నాకు పదమూడేళ్ళ వయస్సేగదా! ఐతే మా పెదతల్లిగారి కుమారుడచట పీఠాధిపతిగా ఉన్నాడు. నేను వారితోపాటు నా జీవితాంతం వారి సమక్షంలోనే ఉండిపోవలసి వస్తుందేమో అనుకొన్నాను. ఇదేమిటా అని ఆశ్చర్యపడి నావల్ల అచట ఏమి ఉపయోగం ఉంటుందా అని నాకేమీ అర్థం కాలేదు.

ప్రయాణం ముందుకు సాగినకొద్దీ ఇందులోని రహస్యం కొంచెం కొంచెం బయటపడటం ఆరంభ##మైంది. పూర్వాశ్రమంలో నాకు పెదతల్లికుమారులై అప్పటికి పీఠాధిపతులుగా ఉన్నవారికి ఆరోగ్యం సరిగా లేదని, అందువల్ల వేరే బండిలో నన్ను ప్రయాణం చేయిస్తున్నారని తెలిసికొన్నాను. ఆమె స్త్రీని తిండివనం వెళ్ళి నన్ను తీసికొని రావలసిందిగా పంపినారట. కాని అతడు నన్ను కంచిలోనే కలిసికొన్నాడు. అందుకే నన్నచటకు తొందరగా తీసికొని వెళ్ళటం కోసం ఇలా విడిగా తొందరగా ప్రయాణం చేయించుతున్నారని అర్థమైంది. ఈ ఆకస్మిక పరిణామానికి నేను ఉన్నట్టుండి చకితుణ్ణయ్యాను. అప్పటి కప్పుడే నా మనస్సు జలదరించింది. ఆ బండిలోనే మోకరిల్లి నాకు తోచిన 'రామ'నామం జపిస్తూ తక్కిన ప్రయాణ ఘట్టాన్ని పూర్తిచేశాను.

మా అమ్మగారు, తక్కినపిల్లలు కొంతసేపటికి అక్కడకు చేరుకొన్నారు. మా అమ్మగారు ఆమె సోదరిని ఓదార్చటంకోసంగదా వచ్చారక్కడికి. కాని ఆమె అక్కడికి చేరుకొనేటప్పటికి ఆమెనే ఇతరులెవరైనా శాంతివచనాలతో ఓదార్చవలసిన అవసరం ఏర్పడినది''.

స్వామినాథన్‌ను కంచికామకోటి మహాపీఠాధిపతిగా ఏర్పాటు చెయ్యటానికి వారి తండ్రిగారివద్దనుండి టెలిగ్రాంద్వారా అనుమతి తెప్పింపబడినది. తక్కిన కార్యక్రమానికి తగిన ఏర్పాట్లన్నీ అతివేగంతో సిద్ధంచేయబడి ఉన్నవి.

అది 13-12-1907 వ తేదీ. శ్రీ స్వామినాథన్‌కు సన్న్యాసదీక్ష ఇవ్వబడినది. ''చంద్రశేఖరేంద్ర సరస్వతి'' అనే ఆశ్రమనామంతో కంచికామకోటిపీఠమునందు ఆదిశంకరులనుండి 68 వ ఆచార్యులుగా వీరు అధిష్ఠితులైనారు. అదే శ్రీ చరణానుగ్రహం భువిపై ప్రసరించటానికి ఆరంభ##మైన మహామంగళ ముహూర్తం.

శ్రీవారు తమ పరమగురువులైన 66 వ ఆచార్యులు సిద్ధిపొందిన పవిత్రస్థలానికి తమ అడుగుజాడల్లో వస్తున్న జనసందోహంతో కలిసి వెళ్లారు. అచట తమ పరమగురు 'మహాపూజా' కార్యక్రమాన్ని నిర్వర్తించారు.

తరువాత శ్రీవారు కలవాయినుండి కుంభకోణానికి విజయం చేశారు. అపుడు కుంభకోణం, మఠం ప్రధానస్థానంగా ఉన్నది.

కామకోటి పీఠాధిష్టితులైన 62 వ ఆచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ (IV) శ్రీచరణుల సమయంలో 18వ శతాబ్దిలో తొండైమండలంలోని రాజకీయ కారణాలవల్ల కామకోటిపీఠం ప్రధానస్థానం కంచినుండి కుంభకోణానికి తరలింపబడినది. కాలక్రమంలో మఠం కార్యక్రమాలు, బాధ్యతలు వృద్ధిపొందినవి. ఇది సామన్యమైన చిన్నమఠంకాదు. మఠానికి సంబంధించి మతసంబంధమైన దానధర్మాలకు సంబంధించి ఆస్తుల పరిపాలనా బాధ్యత ఉన్నది. అటువంటి పీఠ కార్యక్రమాలను నిర్వహించటం అంటే విశేషించి కష్టసాధ్యమైన అంశం. పీఠాధిపతిగా ఈ కార్యక్రమాలను చూడాలంటే అధ్యాత్మిక శక్తితోపాటు విశేషమైన లోకజ్ఞతకూడ అవసరం. 'జగద్గురువు'గా బాధ్యత స్వీకరించటం అంటే సామాన్యమైన విషయంకాదు. లోకులు - లోకవ్యవహారాలు, మనుష్యులు-వారి మనస్సులు వీటిని గూర్చిన అతిసూక్ష్మమైన పరిశీలనాదక్షత అవసరం.

ఇక్కడే మరొక ముఖ్యాంశం కూడ పేర్కొనవలసి ఉన్నది. శ్రీ స్వామినాథన్‌ పితామహులు శ్రీ గణపతిశాస్త్రిగారు 1835 నుండి సుమారు 50 సంవత్సరాలు కామకోటిపీఠం సర్వాధికారి (మానేజరు)గా ఉన్నారు. వీరి హయంలోనే మఠం ఖర్చులకు తగిన స్థిరమైన వనరులు కూడ ఏర్పడినవి. అప్పటినుండి మఠం బాధ్యతలుకూడ విశేషంగా వృద్ధిపొందినవి. కాని శ్రీవారు క్రొత్తగా పీఠాధిపత్యం వహించడంవల్ల వీటి అన్నింటి అవగాహనకు తగిన అవకాశం లేకపోయింది. ఇందువల్ల వీరు ప్రప్రధమంగా మఠం ప్రధానస్థలమైన కుంభకోణానికి వెళ్ళవలసివచ్చింది.

1907 లోనే ముందుగా కలవైనుండి బయలుదేరి తిండివనంలో కొంచెం విరామం తీసుకొని కుంభకోణానికి వెళ్లారు.

అంతవరకు తమలో ఒకరైన శ్రీ స్వామినాథన్‌ను శ్రీ కంచికామకోటి పీఠాధిపతులుగా తమ గ్రామానికి విజయం చేసినపుడు తిండివనంలోని ప్రజలకది ఎంత ఉత్సాహభరితమైన సమయమైనదో ఎవరైనా స్వయంగా ఊహించి తెలిసికోవచ్చును. పట్టణం అంతా ఆనందోత్సాహ కోలాహల సంభరితమైంది. అచటి పాఠశాలలోని ఉపాధ్యాయులు, శ్రీ స్వామినాథన్‌తో కలిసి చదువుకొన్న విద్యార్థులు శ్రీవారి దర్శనార్థం వచ్చారు. వారితో సంభాషించారు. ప్రతి వ్యక్తితో మధురమైన ఒక మాట పలికారు. ప్రతి ఉపాధ్యాయునితోను హార్థికంగా సంభాషించారు. తిండివనంలో మూడు రోజులున్న తరువాత శ్రీవారి ప్రయాణం ఆరంభ##మైంది. ప్లవంగ చైత్రమాసంలో శ్రీవారు కుంభకోణానికి విజయం చేశారు.

ఆచార్య పీఠాధిష్ఠితులైన జగద్గురువులను వారిశిష్యులు అధ్యాత్మిక పరిపాలకులుగా భావించి వారికి మోకరిల్లుతారు. రాజలాంఛనాల తోను, మహారాజ మర్యాదలతోను సంభాషించుతారు. అందువల్ల మఠం శిష్యులందరు క్రొత్తగా పీఠాధిష్టితులైన శ్రీవారికి తగిన మర్యాదలతో ఉత్సవం జరపాలని భావించారు. 9-5-1907 గురువారమున కుంభకోణంలోనే ఆవిధమైన అతిలోక వైభవంతో మహోత్సవం జరుపబడినది. తంజావూరు రాజకుటుంబంలోని వారలైన మహారాణి జిజాంబాబాయి సాహెబా, మహారాణి రామకుమారాంబాబాయి సాహెబా అనే శివాజీ రాణులు పట్టాభిషేకోత్సవ సంభారాలను వివిధ వస్తుజాలాన్ని పంపించారు. మనోహరములైన మల్లికా కుసుమాలతో అభిషేకోత్సవం జరిగింది. మొదట, బంగారుకామాక్షీ, కామాక్షీదేవీ, అఖిలాండేశ్వరీ ఆలయాలపక్షాన విచ్చేసిన ప్రతినిధులీ అభిషేకాన్ని నిర్వర్తించారు. తరువాత తంజావూరు రాజకుటుంబం, అనేకమంది జమీందారులు, సంపన్నగృహస్థులు, వీరికి సంబంధించిన ప్రతినిధులు ఈ విధంగానే అభిషేకాన్ని నిర్వర్తించారు.

ఈ అభిషేకోత్సవంలో సుప్రసిద్ధులైన మహావిద్వాంసులు ప్రధానపాత్ర వహించారు. శ్రీవారు శ్రీ మఠపీఠాధిష్ఠితులై అచట సమావిష్ణులైన వారినెల్లరను ఆశీస్సులతో అనుగ్రహించారు. తంజావూరు రాజకుటుంబంవారు పంపిన భద్రగజంమీద బంగారు అంబారీలో శ్రీవారిని అధిష్ఠితులనుజేసి ఆరాత్రి అతిలోక వైభవంతో కుంభకోణంలోని ప్రధాన వీధులలో ఊరేగింపు టుత్సవం జరిగింది.

శ్రీవారు జగద్గురువులై ధర్మపరిపాలనాధిపత్యం వహించి నాటి నుండి లోకానుగ్రహం. ధర్మోద్ధరణం నైరంతర్యంగా నిర్వహించుతున్నారు.

ప్రథమ విజయ యాత్ర :

ఈ సందర్భంలో 'విజయయాత్ర' అనే పదానికి అర్థం కూడ తెలిసికొనవలసి ఉన్నది శ్రీవారు దేశంలో పలు ప్రాంతాలకు ప్రయాణం చేసి బయలుదేరుతారు. అచటి ప్రజలకు స్వయంగానే దర్శనభాగ్యాన్ని అనుగ్రహించుతారు. అంతేకాదు. శ్రీమఠంలో ప్రధాన దైవమైన శ్రీ చంద్రమౌళీశ్వర త్రిపురసుందరీ దేవతల పూజలను శ్రీవారు నిర్వహించుతూ అందులో పాల్గొనే అవకాశం ఎల్లరకు కలిగించుతూ ఉంటారు. ప్రజల్లో ఆధ్యాత్మికోత్తేజానికి దోహదంచేసే ఉద్బోధచేస్తారు. ధార్మిక వర్తనానికి అభిముఖుల్ని గావించుతారు. శ్రీవారు ఎచటకు విజయం చేసినప్పటికిని ప్రజలు పూర్తిగా దాన్ని సద్వినియోగం చేసికొంటారు. ఆరో జొక మహాపర్వంగా భావించుతారు. మనస్సులను ద్రవింపజేసి శ్రీవారి బోధనలను శ్రద్ధాశువులై వింటారు. ఆ పవిత్ర సన్నివేశంలోని ఔన్నత్యాన్ని గుర్తించుతారు. ఇలా పరమ శోభాయమానమైన పవిత్ర వాతావరణంతో శ్రీవారు చేసే ప్రయాణానికే 'విజయయాత్ర' అని పేరు.

శ్రీవారు మొట్టమొదట 1908లో జంబుకేశ్వరానికి విజయం చేశారు. (తిరువనైక్కా). ఇచట అఖిలాండేశ్వరీ అమ్మవారి విగ్రహానికి ఆది శంకరులు కర్ణాభరణాలను అలంకరించారు. 1908 లో ఇచట ఆలయపునరుద్దరణ గావించి 'కుంభాభిషేకా'నికి తగిన ఏర్పాట్లు అన్నీ సిద్ధం చేశారు. అచటి స్థానికులు, ఆలయాధికారులు శ్రీవారి నచటకు విచ్చేసి, ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించి అనుగ్రహించవలసిందిగా ఆహ్వానించారు. మహావైభవంతో శ్రీవా రాకుంభాభిషేక కార్యక్రమాన్ని వైదికాచార పద్ధతిలో నిర్వర్తించారు.

శృంగేరీ మఠాధిపతులైన శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ శంకరాచార్య స్వామివారు పై కుంభాభిషేకం జరిగిన మరునాడు దేవ్యాలయంలో అమ్మవారి దర్శనం చేసికొన్నారు. శివగంగ మఠాధిపతులైన శ్రీ సుబ్రహ్మణ్యభారతీ శంకరాచార్య స్వామివారుపై కుంభాభిషేకం జరిగిన కొన్ని మాసాలు దాటిన తరువాత ఈ ఆలయానికి విచ్చేసారు.

ఇచట నుండి శ్రీవారు రామనాథపురంలోని ఇలయాత్తంగుడికి విచ్చేశారు. ఇది కామకోటి పీఠాధిష్ఠితులైన 65 వ ఆచార్యులు శ్రీ మహాదేవేంద్ర సరస్వతీ శ్రీచరణులు సిద్ధిపొందిన స్థలం. మార్గంలో పుదుక్కోటైలో కొలదిరోజులు మాత్రం ఉన్నారు. ఇలయాత్తంగుడిలోని పరమేష్ఠి గురుసమాధిని దర్శించుకొని పూజించారు.

అచట నుండి చాతుర్మాస్య వ్రతాన్ని నిర్వర్తించటానికై జంబుకేశ్వరానికి మరలి వెనుకకు వచ్చారు. ఆ వ్రతాన్ని అచట పూర్తిచేసికొని బయలుదేరి తంజావూరులో మాత్రం కొంచెంకాలం ఆగి కుంభకోణానికి విజయం చేశారు. పండ్రెండు సంవత్సరాలకొకపర్యాయం (మహానదీ పుష్కరాలవలె) జరిగే 'మహామాఖం' 1909 లో జరిగింది. తైర్థికుల ఆతిధేయ మర్యాదలకు శ్రీమఠంవారుకూడ తగిన ఏర్పాట్లు చేశారు. మహామఖం పర్వం రోజున మహామఖ సరస్సులోని పావనజలంలో శ్రీవారు పవిత్ర స్నానం చెయ్యటం చూచినవారి కది నేత్రపర్వంగా ఉంది. భద్రగజంపై అంబారీలో ఆసీనులై శ్రీవారు మహా వైభవంగా వెళ్లారు.

అధ్యయనం

1909 నాటికి శ్రీవారి వయస్సు 15 సంవత్సరాలు మాత్రమే. కుంభకోణం మఠంలోనే సమర్థులైన మఠం విద్వాంసులే శ్రీవారికి శాస్త్రపాఠాలను చెప్పారు. మఠం యాజమాన్యం వహించేవారు కుంభకోణంలో ఉండటంచేత మఠంలోని జనసందోహం ఒత్తిడిని గమనించి ఇంతకంటే ప్రశాంత ప్రదేశం కోసం ఆలోచించారు. అపుడుగాని శ్రీవారికి అధ్యయానికి ఎక్కువ అవకాశం లభించినదని తలపోశారు. అందుకోసం అఖండ కావేరీనదికి ఉత్తరతీరాన ఉన్న మహేంద్ర మంగళం గ్రామాన్ని ఎన్నుకొన్నారు. కావేరీనదీతీరానికి సన్నిహితంగా ఉండే ప్రదేశంలోనే 'పర్ణశాల'ను నిర్మించారు. 1911 నుండి 1914 వరకు శ్రీవారు అచటనే ఉండి మఠపండితుల సాక్షిమాత్ర సాహాయ్యంతో వేదశాస్త్రముల విశేషధ్యయనం చేశారు. తగిన అనుభవాన్ని సంతరించుకొన్నారు. ఇచట గురుశిష్యుల సంబంధం కొంగ్రొత్తగా ఉంది అధ్యాపకుల మఠం శిష్యులు. ఐతే శ్రీవారు తమ అధ్యయనానికి నియమితులైన అధ్యాపకులను యథోచితంగా గౌరవించుతూ ఉండేవారు. ఐతే వారుకూడా ఆ పొందే గౌరవాదరాలు అపూర్వములైనవని సహృదయతతో భావించు కొంటూ ఉండేవారు.

సంగీతశాస్త్రజ్ఞులు, గాయకులు శ్రీవారి దర్శనార్థం వచ్చినపుడు శ్రీవారు వారితో సంగీతశాస్త్ర వైదుష్యం, కళాభిజ్ఞతలను గూర్చి సంభాషిస్తూ అనేకాంశాలను గ్రహించుతూ ఉండేవారు. శ్రీవారు పవిత్ర కావేరీ పులిన ప్రాంతాలలో సంచరించుతూ ప్రకృతి సౌందర్యాన్ని పరిశీలిస్తూ ఉండేవారు. అపుడపుడు ఫోటోగ్రాఫర్లు ఆ పరిసర ప్రదేశాల ఫోటోలు తీస్తూ ఉండేవారు. శ్రీవారుసైతం ఆ కళలో విశేష శ్రద్ధను కన్పరుస్తూ ఉండేవారు. తరువాత శ్రీవారు గణితశాస్త్రం, జ్యోతిశ్శాస్త్రాలతోకూడ సన్నిహిత పరిచయం ఏర్పరచుకొన్నారు.

శ్రీవారు 1914 లో కుంభకోణంలోని మఠానికి తిరిగి వచ్చారు. అప్పటికి వారి వయస్సు ఇరవై సంవత్సరాలు. అప్పటికి వారు సర్వశాస్త్ర విజ్ఞానాన్ని సంపాదించారు. అప్పుడప్పుడు మహావిద్వాంసులు శ్రీవారి దర్శనార్థం వెళ్ళినపుడు వారికి శ్రీవారు ఆయా శాస్త్రాలలో పరిశీలనాత్మకములైన ప్రశ్నలను వేస్తూఉండేవారు. ఆ విధమైన పండిత గోష్ఠులలోకూడ శ్రీవారు అనేక విశేషాలను తెలిసికొంటూ ఉండేవారు. శ్రీవారు కుంభకోణంలో ఉండగానే 'గంగైకొండ చోలపురం' వెళ్ళి అచటి శాసనాలను, దేవాలయ శిల్పసౌందర్యాన్ని పరిశీలిస్తూ ఉండేవారు. శ్రీవారు కామకోటి పీఠాధిపత్యం వహించటానికి, ధర్మపరిపాలనా బాధ్యతను నిర్వహించటానికి అవసరమైన సమస్త విజ్ఞానాన్ని, అనేక మార్గాలలో సంపాదించి దక్షులైనారు.

శ్రీవారు లౌకికవ్యవహార నిర్వహణకు ఇంకా 'మేజరు' కాలేరు. 1911 నుండి 1915 వరకు 'కోర్టు ఆఫ్‌ వార్ట్స్‌' పరిశీలనక్రింద మఠం కార్యక్రమాలు నిర్వహింపబడుతూఉండేవి. 1915 మే నెలకు శ్రీవారికి 21 సంవత్సరాల వయస్సునిండినది. అప్పటి నుండి వారే తమ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహణం ఆరంభించారు. కాని మఠం లౌకిక వ్యవహారాలన్నీ అందుకై నియోగింపబడిన మఠం అధికారులు, ఏజంటు నిర్వర్తించుతారు. శ్రీమఠం సంప్రదాయానుసారం ఏజంటు సర్వాధికారాలను దత్తంచేసే ప్రధాన పత్రాల (Power of attorney) పై సైతం శ్రీవారు సంతకంచెయ్యరు. శ్రీమఠం అధికారిక ముద్రమాత్రమే దానిమీద వేస్తారు.

ఆ సంవత్సరం శంకరజయంతిమహోత్సవాలు విశేషవైభవంతో నిర్వహింపబడినవి. మఠం ఆధ్వర్యంలోనే 'ఆర్యధర్మ' అనే పత్రికను ప్రచురించటం ఆరంభించారు. 1916 అక్టోబరులో మఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కొంగ్రొత్తశోభతో జరుపబడినవి. మఠంలో జరిగిన ఈ ఉత్సవవిశేషాలను 'శ్రీ సుబ్రహ్మణ్య భారతి' అనే సుప్రసిద్ధ తమిళకవి నిసర్గంగా వర్ణిస్తూ వ్రాశాడు. దుర్గా, లక్ష్మీ, సరస్వతీ, అనే ముగురమ్మల మూలపుటమ్మయైన ఆ జగన్మాతకు ప్రతిసంవత్సరం జరిపే పూజా విశేషము లివి.

ఆ సదస్సులో పాల్గొనేందుకు యావద్భారతమునుండి మహా విద్వాంసులు విచ్చేశారు. సుప్రసిద్ధులైన సంగీతవిద్వాంసులు శ్రీవారి సమక్షములో సంగీత కచేరీలు జరిపారు. విజయదశమినాడు రాత్రి శోభాయమానమైన ఊరేగింపు పురవీథుల్లో జరిగింది. అందు శ్రీవారు ప్రధానులై ఉన్నారు.

శ్రీవారు సంప్రదాయసిద్ధమైన అధ్యయనాన్ని ప్రొత్సహించటానికి, ధర్మోద్ధరణానికి మొట్టమొదట వారు చేపట్టిన కార్యక్రమాలు చాలామందిని ఆకర్షించి మంచి ఫలితాలనిచ్చినవి. ఎక్కువమంది అందులో పాల్గొన్నారు. ఉచ్ఛకోటికి చెందిన మహావిద్వాంసులు 'శాస్త్రరత్నాకర' బిరుదతో సమ్మానింపబడ్డారు. కళాశాల విద్యార్థులకై మన ధర్మ విషయములపై వ్యాసరచనలో పోటీలు ఏర్పరుపబడినవి. పాఠశాలలోను, కళాశాలలోను విద్యాభ్యాసంచేసే యోగ్యులైన విద్యార్థుల సౌకర్యార్థం ఉపకార వేతనము లీయబడినవి. మఠంలోనే ఉచితచికిత్సకోసం, ఆయుర్వేద వైద్యశాల ఏర్పాటు చేయబడినది. 1914 నుండి 1918 వరకు శ్రీవారు కుంభకోణంలో విజయంచేసిఉన్న సమయంలో ఇంచుమించుగా ప్రతినిత్యం విద్వత్సభగాని, సంగీత కచేరిగాని తప్పక జరుగుతూ ఉండేది. శాస్త్రార్థాలు నిర్వహింపబడుతూ ఉండేవి. అనేక మంది పండితులు, సంగీత విద్వాంసులు శ్రీచరణానుగ్రహపాత్రులైనారు. ప్రోఫెసర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు, పరిపాలకులు శ్రీవారివల్ల అనేక ఉపదేశాలను, తగిన ప్రోత్సాహాన్ని పొందుతూ ఉండేవారు. అద్వైతేతర సంప్రదాయవర్తనులైన ఆస్తికు లనేకులు శ్రీవారిని దర్శించి ఆయామార్గాలలో శ్రీవారికి గల లోతైన విషయపరిశీలనం, మార్గమే దైనా ఆస్తిక్యమునందు అధ్యాత్మిక పద్ధతులయందు శ్రీవారికి గల ఆదరాభిమానాలను శ్రీవారి దర్శన భాషణాదులవల్ల తెలిసికొంటూ ఉండేవారు. శ్రీవారి సంబంధంగలవారెవరైనా శ్రీవారి జగద్గురుత్వాన్ని ప్రతక్షంగా అవగతం చేసికొనేవారు.

సంపూర్ణ అఖిలభారత యాత్ర (1919 -1939)

పవిత్ర భారత వర్షంలో శ్రీవారి దివ్యయాత్ర 1919 మార్చిలో ఆరంభ##మైనది. ఇది చాల కష్టసహమైనదే కాక దీర్ఘకాలికమైనదికూడ. కాని యావద్భారతంలోని వారికి శ్రీవారి దర్శన భాగ్యం, వారి ఆశీస్సులు పొందటం అదే మహత్తరమైన సదవకాశం దీనివల్ల లభించింది. శ్రీవారు ఆధునికములైన ప్రయాణపద్ధతులను వేటినీ అవలంబించలేదు. విశేషంగా వారు పాదచారులై పర్యటించారు. మరీ అవసరమైతే మాత్రమే పల్లకీని అధిష్ఠించడానికి అంగీకరించారు శ్రీవారివెంట ఈ యాత్రలో సైతం పరివారం ఉండేది. మఠం అధికారులు, పండితులు, వైదికులు, పరిచారకులు కాక గోవు, గజం మున్నగు పశుసంతతి కూడ వెంట ఉండేది. శ్రీవారు ఎక్కడకు విజయంచేస్తే అచటకు విశేషమైన భక్తజనసందోహం రావటం చేతనైనంతకాలం శ్రీవారి దివ్యదర్శన లాభాన్ని మహాభాగ్యంగా తనివితీర అనుభవించటం జరుగుతూ ఉండేది. నిత్యం శ్రీవారు అనుష్ఠానం పూజాకార్యక్రమం తప్ప తక్కిన సమయం అంతా ఆయా భక్తులతో సంభాషించుతూ ఉండేవారు వచ్చినవారి నందరిని అనుగ్రహించేవారు. శ్రీమఠం ధర్మ కార్యక్రమాలు, ధర్మోద్ధరణాన్ని గూర్చిన విశేషాలు. ధర్మసంస్థల పరిపాలనా విశేషాలను గూర్చి ఆయా వ్యక్తుల నుద్దేశించి ఉద్బోధించుతూ ఉండేవారు. మొత్తం ఇరవై నాలుగు గంటలలోను వారు పూర్తిగా విశ్రాంతి తీసుకొనేందుకు రెండు మూడు గంటలు మాత్రమే అవకాశం ఉండేది. కొన్ని ఉపవాసదినముల మధ్య మాత్రం అత్యల్పమై ఆహారాన్ని స్వీకరించుతూ రోజురోజుకూ ఇంతటి నిర్విరామ కార్యక్రమాన్ని నిర్వహించుతూ శ్రీవారు కడుసావధానులై సంపూర్ణమైన స్థిరచిత్తతతో త్రాసులో ముల్లును నిలబెట్టినట్లు ఎంతటి స్థిరదీక్షతో గడిపేవారో ఊహిస్తే అది మిక్కిలి ఆశ్చర్యజనకమైన అంశం కాక తప్పదు. స్థితప్రజ్ఞ లక్షణములు శ్రీవారిలో ఆత్మోన్నతి స్వరూపాన్ని ఎలా పొందినవో ప్రతివ్యక్తి తప్పక గ్రహింపగలుగుతాడు.

1910 మార్చిలో తల పెట్టిన దీర్ఘకాలికమగు పూర్ణయాత్ర ఆరంభ##మైనది. కుంభకోణం తంజావూరు జిల్లాలో ఉన్నది. మొదటి మూడుసంవత్సరాలు ఆ జిల్లాలోనే దూరప్రాంతాలలో మారుమూల గ్రామాలలో ఉండే పుణ్యస్థలాలను సైతం దర్శించారు. కుంభకోణానికి తూర్పున ఐదుమైళ్ల దూరంలో ఉన్న వేపత్తూరులో 1919లో చాతుర్మాస్యవ్రతాన్ని నిర్వర్తించారు. ఆషాడపూర్ణిమనాడు ఆరంభమౌతుందీ వ్రతం. ఆ పూర్ణిమనాడు 'బ్రహ్మసూత్ర' కర్తయైన వ్యాసమహర్షికి పూజజరుగుతుంది. ఆనాడే భక్తులు శ్రీవారిని వారి యాత్రాస్థలంలో దర్శిచుకొనివారికి ప్రణమిల్లుతారు.

1920లో వేదారణ్యంలో శ్రీవారు 'మహోదయ' పుణ్యకాలంలో సముద్రస్నానం చేశారు. ఆ సంవత్సర వ్యాసపూజ, చాతుర్మాస్యం మాయవరంలో జరిపారు.

శ్రీవారు ఇచట విజయంచేసి ఉండగానే అంధుడైన మహమ్మదీయ వృద్ధునకు శ్రీవారివద్దకు రావాలని అభిప్రాయం కలిగింది. శ్రీవారందులకు కనుగ్రహించారు. అతని ఆనందోత్సాహములకింక మేరలేదు. శ్రీవారి ఆదేశానుసారం అచట సమావిష్ఠమైన సభలో 'ఇస్లాము' మతముయొక్క ప్రధాన సిద్ధాంతాల నాతడు వివరించాడు. తరువాత అతడచటినుండి వెళ్ళబోతూ శ్రీవారి సన్నిధి తనకు దైవ సన్నిధిగానే అనుభూతి కలిగినట్లు పలికాడు.

1921లో కుంభకోణంలో 'మహామఖ' మహోత్సవం జరిగింది. శ్రీవా రాపరిసర ప్రాంతంలో పర్యటించుతూ ఉండటంవల్ల ఆ ఉత్సవానికి కుంభకోణానికి వెళ్ళారు. మఠానికి మాత్రం వెళ్ళలేదు. తాము తలపెట్టిన 'విజయయాత్ర'ను పూర్తిగావించుకొని మాత్రమే శ్రీమఠానికి విజయం చేయాలనే నియమాన్ని వారు పాటించారు. కాంగ్రెసు స్వచ్ఛందదళంవారు ఆ ఉత్సవాన్ని చక్కటి క్రమపద్ధతిలో నడిపించటానికి తోడ్పడ్డారు. వారిలో ఖలాఫత్‌ స్వచ్ఛంద సేవకులు కూడ ఉన్నారు. వారందరు పటీశ్వరంవెళ్ళి అచట శ్రీవారిని దర్శించుకొన్నారు. శ్రీవారు వారు నిర్వహించిన కార్యక్రమాన్ని అభినందించి వారిని ఆశీర్వదించారు. ఆనాడు సుప్రసిద్ధ జాతీయ వాదులలో ఒకరైన శ్రీ సుబ్రహ్మణ్యశివం అనేవారు కూడ పట్టీశ్వరంలోనే శ్రీవారిని దర్శించుకొన్నారు.

పరిపాలననుండి మాతృభూమి విముక్తికి, ప్రజలలో దైవభక్తి వ్యాపించటానికి కూడ శ్రీవారి ఆశీస్సుల నాయన కోరారు. బృహత్తరములైన ఆ రెండంశాలకు శ్రీవారు వెంటనే ఆశీస్సులను గ్రహించారు.

ఈ జిల్లాలోనే శ్రీవారు ఒకరోజున ఒక గ్రామంనుండి మరొక గ్రామానికి ప్రయాణం చేస్తున్నారు. మార్గమధ్యంలో సుమారొక వందమంది హరిజనులు స్నానంచేసి శుభ్రవస్త్రధారులై నుదట విభూతి ధరించి శ్రీవారి దర్శనార్థం వేచిఉన్నారు. శ్రీవారు కొంతసేపచట ఉండి వారి యోగక్షేమాలను విచారించి వారికి నూతన వస్త్రలను బహుకరించారు. అటువంటి సంఘటనలు శ్రీవారి యాత్రలో తరచుగా జరిగినవి. శ్రీవారు బీదవారి విషయం విశేషదృష్టితో పరిశీలిస్తూ ఉంటారు. సమాజంలోని సంపన్న గృహస్థులను బీదవారి ఉపకారానికై ప్రోత్సహించుతూ ఉంటారు. మఠంలోని వారిని కూడ ఆ ఆదర్శంతోనే ఉండవలసినదిగా ఆదేశిస్తూ ఉంటారు.

శ్రీవారు రామేశ్వర క్షేత్రానికి విజయం చేశారు. కొద్దిపరిమాణంలో అచటి పవిత్ర సైకతాన్ని (ఇసుక) స్వీకరించారు. తరువాత పవిత్ర గంగాజలంలో కలిపివేయాటానికిది ఉద్దేశింపబడినది. భారత దేశం యొక్క అధ్యాత్మిక సమైక్యతకిది పవిత్ర చిహ్నం.

శ్రీవారు రామనాథపురం జిల్లాలోను, మధురై తిరునల్వేలిలోను పర్యటించి జంబుకేశ్వర క్షేత్రానికి విజయం చేశారు. ఇపుడు ఇచటి అఖిలాండేశ్వరీదేవికి తాటంక జీర్ణోద్ధార ప్రతిష్ఠ చెయ్యటానికి విజయం చేశారు. 1908లో ఈపవిత్ర క్షేత్రానికి శ్రీవారు విజయం చేసిన విషయం ఇంతకుముందే పేర్కొనబడినది.

ఈ గ్రంథంలోనే 'అఖిలాండేశ్వరి - తాటంక ప్రతిష్ఠ' అనే అధ్యాయంలో ఇంతకు పూర్వమే ఈ విషయం వివరింపబడి ఉన్నది. ఈ సమయంలోనే ఇచట కామకోటి పీఠంవారి మఠం పునరుద్ధరింప బడినది. ఇందులో వేదపాఠశాల ఏర్పాటు చెయ్యబడినది. ఇందులో శ్రుతిచోదితమగు నియమపూర్వకమైన వేదాధ్యయనం జరుగుతోంది. మరొక కుతూహల జనకమైన అంశం ఉన్నది. కీర్తిశేషులైన 'భారతరత్న' శ్రీ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య (మైసూరు) 1923లో 'తిరుచ్చి'కి వచ్చినపుడు ఒకసభలో - 'జంబుకేశ్వరంలోని కామకోటిమఠం'లోనే తన ఉపనయనం జరిగిందని చెప్పుకొన్నారు.

ఇచట 'తాటంక ప్రతిష్ట' జరిగిన తరువాత మరల 'యాత్ర'ను ఆరంభించారు. వారు వెంటనే శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతీ స్వామివారి 'అధిష్ఠానం' ఉన్న నెరూరు'కు విచ్చేశారు. ఈ స్వామివారు కుంభకోణం వద్ద 'తిరువిశై నల్లూరు'లో జన్మించారు. వీరు జీవన్ముక్తులు. కావేరీ నదీతీరాన 'అవధూత'గా తిరుగుతూ ఉండేవారు. వీరి విద్యాగురువులు శ్రీ పరమశివేంద్ర సరస్వతీ స్వామివారు (కామకోటి పీఠాధిష్ఠితులైన 57వ గురువులు. ఈ గ్రంథంలోనే చూ. 122వ పుట) శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులు అనేకమంది భక్తులపై తమ అనుగ్రహ సుధాసృష్టిని కురిపించారు. వీరు అనేకములగు అద్వైత గ్రంథాలను వ్రాశారు. భక్తిరస భరితములైన కీర్తనలను (సంస్కృతంలో) వ్రాశారు. కామకోటి పీఠ గురుపరంపరను తెలిపే 'గురురత్నమాలిక' అనే గ్రంథం కూడ వీరిచేతనే వ్రాయబడినది.

శ్రీవారు నెరూరులో ఉన్నంతకాలం ఈ సదాశివ బ్రహ్మేంద్రులవారి అధిష్ఠానంవద్ద నిత్యం చాల గంటలసేపు గడుపుతూ ఉండేవారు. వారి పవిత్రజీవితం అమూల్యమైన బోధనలలోని విశేషానుభూతిని భావిస్తూ ఉండేవారు.

తరువాత శ్రీవారు తిరుచి సమీపంలోని కులుమనై గ్రామానికి వెళ్లారు. ఒకరోజున తిరుచిలో ప్రసిద్ధులైన పెద్దమనిషి శ్రీ యఫ్‌.జి. నటేశయ్యర్‌ శ్రీవారివద్దకొక కేరళ యువకుని తీసికొని వచ్చారు. ఈ నటేశయ్యర్‌గారు పూర్వజీవితంలో ఇరవై సంవత్సరాలు కిరస్తానీ మతంలోకి మారి జీవితం గడిపారు. ఇపుడు వీరు తమ వెంటబెట్టుకొని వచ్చిన యువకుడు కూడ కిరస్తానీ మతంలోకి మారాలనే అభిప్రాయంతో తిరుచికి వెళ్లినవాడు. శ్రీవారా యువకునితో ఆ రోజున, తరువాత కొన్ని రోజులు సంభాషించుతూ గడిపారు. హిందూ ధర్మంలోని ప్రధాన ధర్మాల నా యువకునికి శ్రీవారుద్భోధించారు. ఇతరమత విశ్వాసాలలోఉండే విశేషాలన్నీ హింధూధర్మంలో సారభూతంగా ఉన్నవి. అంతమాత్రమేగాక ఇందులో ఇంకా విశేషావకాశాలున్నవి. ఇలాంటి హిందూ ధర్మాన్ని విడనాడుకొని ఇతర మతాల నాశ్రయించటానికి కారణమేమీ కన్పించదు. ఆ కేరళ యువకునికి తాను జన్మించిన మతం-స్వధర్మం వీటి ఉన్నతి తెలిసినవి-దీనిని వీడిపోవనక్కరలేదని అర్థమైంది. అతడు వెనుకటి నిర్ణయాన్ని మార్చుకొని వెనుకకు వెళ్ళాడు.

శ్రీవారు చెట్టినాడు, పుదుక్కోట సంస్థాన ప్రాంతాలలోని వివిధ ప్రదేశాలలో సుమారొక సంవత్సరంపాటు పర్యటించారు. ఈ సమయంలోనే అనేకమంది పండితులు, రాజకీయవాదులు. జాతీయ నాయకులు శ్రీవారిని దర్శించుకొని వారి ఆశీస్సులను పొందారు. 1925లో తమిళంలో జగత్ర్పసిద్ధులైన పండితులు శ్రీ డా|| యు.వి. స్వామినాథయ్యర్‌ గారికి 'దాక్షిణ్యాత కళానిధి' బిరుదివ్వబడినది. శ్రీవారి యాత్రలో వారు సన్నిహితులైన ప్రతి ప్రదేశంలోను ఆ పండితులువచ్చి శ్రీవారి పూజాకార్యక్రమాన్ని దర్శించేవారు. ఆ వృద్ధ పండితులు తమ స్మృతిపథంలోని పూర్వానుభూతిని ఇలా వివరించారు.

''నేను ఎనిమిది సంవత్సరాల వయస్సులో అప్పటి కామకోటి పీఠాధిపతులైన శ్రీ మహాదేవేంద్రసరస్వతీ (65 వ ఆచార్యులు) స్వామి వారి పూజా కార్యక్రమాన్ని దర్శించే భాగ్యం కలిగింది. ఆ దివ్యానుభూతిని ఈవేళ మరల ప్రత్యక్షంగా అనుభవించుతున్నాను.''

చెట్టినాడులో శ్రీవారు పర్యటించుతున్నపుడే శివభక్తాగ్రేసరుడైన వైనాగరం రామనాథచెట్టియార్‌ సైతం అలాంటి అభిప్రాయాన్నే వెల్లడించారు. చెట్టినాడులో మహా వైభవంతో ప్రజలు ఊరేగింపుటుత్సవాన్ని ఏర్పాటుచేశారు. అందులో శ్రీవారు రామనాథ చెట్టియార్‌ కోసం చూచారు. అతడెక్కడ కనుపించలేదు. ఉత్సవం పూర్తియైనపిదప చెట్టియార్‌ ఎక్కడున్నాడని శ్రీవారు ప్రశ్నించారు. దూరంనుండి చెట్టియారు పలికాడు. ఊరేగింపులో నువ్వుకనుపించలేదేమని ప్రశ్నించారు. అతడు బ్రహ్మానంద భరితుడై 'ఈరాత్రి శ్రీవారి పల్లకిపట్టి తీసికొనివెళ్ళే అదృష్టం నాకు లభించింది'అన్నాడు.

ఈ ప్రయాణ సమయంలో సంస్కృత తమిళ భాషల్లో సుప్రసిద్ధ పండితులు శ్రీ 'పండితమణి' కె. కదిరేశన్‌ చెట్టియార్‌కి కూడ శ్రీవారి సమ్మాన గౌరవం లభించింది. తమిళ, సాహిత్యంలోని ప్రాచీన గ్రంథపఠనం సంస్కృత-తమిళభాషల అధ్యయనానికి అభివృద్ధికి తగిన దోహద విశేషములనుగూర్చి పరస్పరం అభిప్రాయాలను అవగాహనకు తెచ్చుకొన్నారు.

ఈసమయంలో రాజకీయాభిజ్ఞులు, జాతీయనాయకులు శ్రీవారిని కలిసికొన్నారు.

శ్రీ సత్యమూర్తి, శ్రీ ఏ. రంగస్వామి అయ్యంగార్లతో కలిసి, శ్రీ సి.ఆర్‌. దాసుగారు; శ్రీ సి. రాజగోపాలచారి, తదితరులతో కలిసి శ్రీజమునాలాల్‌ బజాజ్‌గారు వచ్చారు. ఇందులో శ్రీ జమునాలాల్‌ బజాజ్‌గారు తదితరులు 1926లో జంబుకేశ్వరంలో శ్రీవారిని కలిసి కొన్నారు. శ్రీ జమునాలాల్‌ బజాజ్‌గారిని లోపలికంపి రాజగోపాలాచారిగారు వెలుపలనే ఉండిపోయారు. అపుడు శ్రీవారు రాజగోపాలాచారిగారికోసం బయటకు కబురంపి లోపలికిరానికారణ మేమిటని ప్రశ్నించారు. అందుకు ఆయన తానారోజున ఇంకా అప్పటికి స్నానం చెయ్యలేదని అందువల్ల లోపలికి రాలేదని చెప్పారు. అందుకు శ్రీవారు జాతీయ కార్యక్రమాల్లో నిమగ్నులైనవారికి నిత్యస్నానకార్యక్రమానికి సమయం చిక్కకపోవచ్చును అన్నారు. జీవితాన్ని జాతీయకార్యక్రమానికై అంకితంచేసిన రాజగోపాలాచారి తమను ఎప్పుడైనా, ఏపరిస్థితిలో నైనా కలిసికొనవచ్చుననికూడ అన్నారు. శ్రీవారు తామొక సన్న్యాసియని తామే రాజకీయ పక్షానికి చెందలేదని, ఆ రాజకీయ నాయకులకు స్పష్టం చేశారు. కాని మనస్సుల్లోగాని చేతల్లోగాని మానవక్షేమానికి, మానవాభ్యుదయానికి కృషిచేయాలని దైవవిశ్వాసాన్ని పెంపొందించాలని వారికి స్పష్టంగా తెలియజేశారు.

1926లో శ్రీవారు కారంబక్కుడినుండి పుదుక్కోటైకి వెళ్ళుతున్న సమయంలో అనేకమంది ప్రజలతోపాటు శ్రీవారిని దర్శించినవారిలో కొందరు మహమ్మదీయులుకూడ ఉన్నారు. అందులో ఒకాయన తనకు శ్రీవారియెడ గల గౌరవ సూచకంగా పల్లకినికూడ తన చేతిలో పట్టుకొన్నారు. 3 మైళ్లు దాటినతరువాత శ్రీవారు ఆగి ఆ మహమ్మదీయవ్యక్తిని పిలిపించి యోగక్షేమాలను తెలిసికొన్నారు. ఆ మహమ్మదీయుడు తన సొంత విషయాలను శ్రీవారికి నివేదించి వారి సలహానర్థించాడు. తాను శ్రీవారిని స్తుతిస్తూ వ్రాసిన సంస్కృత పద్యాలను ఫలపుష్ఫాదులతో సమర్పించాడు. శ్రీవారి ఆదేశానుసారం ఆ మహమ్మదీయుడు ఆ పద్యాలను చదివి నాటి అర్థాన్ని వివరించాడు. అతడచటి నుండి సెలవు తీసికొని వెళ్లుతూ తనసంతోషాన్ని మాటల్లో వెల్లడించాడు.

''నా కన్నులకు 'అల్లా'యే స్వయంగా శ్రీవారి రూపంలో కనుపించాడు. భవబంధాలను తెంచుకొని ముక్తినొంద గోరువారికి శ్రీవారి దర్శనం మాత్రమే అందుకు సరిపోతుంది.''

1926జూలైలో శ్రీవారు కామకోటి పీఠంతో సన్నిహిత సంబంధం గల జమీందారీ ప్రదేశ##మైన 'ఉడయార్పాలెం' వెళ్లారు. కామకోటి పీఠం ప్రధాన కేంద్రమును 18 శతాబ్ధిలో 62వ ఆచార్యుల సమయంలో కంచి నుండి కుంభకోణానికి తరలించినపుడు ఈ జమీందారులు సర్వవిధముల తమ సహాయసంపదలనందజేశారు అప్పటినుండి ఈ రాజకుటుంబం కామకోటి పీఠంతో సన్నిహిత సంబంధంగలిగి ఉన్నది. కనుక 1926లో శ్రీవారు 'ఉడయార్పాలె'మునకు విజయం చేయటం వారికొక అపూర్వావకాశ##మైనది. అచటి జమీందారు, రాజకుటుంబసభ్యులు. స్థానికులైన ప్రజలు శ్రీవారికి విశేషమైన స్వాగత సత్కారాలను సమర్పించారు. ఆ పవిత్ర సన్నివేశానికి చిహ్నంగా బహూకృతుల నందచేశారు.

శ్రీవారు తిరుప్పాడిరిప్పులియారులో మకాంచేసి ఉన్నపుడు జాతీయకార్యకర్త్రి, తమిళభాషా పండితురాలునైన వృద్ధవనిత ఒకామె శ్రీవారి దర్శనం చేసికొన్నది. ఆమె మహాత్మాగాంధి జీవితచరిత్రను పద్యాలలో వ్రాసింది. శ్రీవారి పూర్వాశ్రమంలో బాల్యస్థితిలో శ్రీవారినామె ఎరుగును. అంతేకాక ఆమె శ్రీవారి తండ్రిగారివద్ద చదువుకొన్నది. తన గురుపుత్రులను 'జగద్గురువు'లుగా ఆమె దర్శించుకొన్నపు డామె కన్నులనుండి ఆనంధాశ్రువు లప్రయత్నంగా వెలువడినవి.

దక్షిణ పెన్నారునదికి ఉత్తరతీరానగల 'వడవాంబలం' కామకోటిపీఠ పూర్వాచార్యులు సిద్ధిపొందిన స్థలం కనుమూసి ఉన్న ఆ పవిత్రస్థలాన్ని పునరుద్ధరించాలని శ్రీవారు తలపోశారు. దాన్ని పునర్నిర్మించి నిత్యపూజా కార్యక్రమం అచట జరిగే ఏర్పాటు చేయబడినది.

పాండిచేరిలో ఫ్రెంచి ప్రభుత్వాధికారులు, స్థానికులైన ప్రజలు శ్రీవారికి రాజలాంఛనాలతో స్వాగతసత్కారాల నందజేశారు. శ్రీవారిచట విజయంచేసి ఉన్నపుడే తిరువారూరులో దేవాలయరథం అగ్ని ప్రమాదానికి అహుతియైనట్లు మనస్సును కలతపెట్టే వార్తవచ్చింది. తంజావూరు జిల్లాలోని ఆస్తికులంతా ఏకమై కొత్తరథాన్ని నిర్మించాలని నిశ్చయించారు. శ్రీవారు వారి కార్యదీక్షను ప్రోత్సహించారు. శ్రీవారి ఆశీస్సులతో పూర్వరథంతో అన్నివిధాలా తులతూగే రథం రెండు సంవత్సరాలలో తయారుచేయబడినది. ఏలూరు సుబ్బారాయ వాధ్యర్‌ పై కార్యక్రమాన్ని దీక్షతోచే పట్టారు. తరువాత వారు 'శ్రీ నారాయణబ్రహ్మానందు'లనే ఆశ్రమనామంతో సన్న్యసించారు. సన్న్యాసిగా సైతంవారు అనేక దేవాలయాలను పునరుద్ధరించి వాటి కుంభాభిషేకాలను నిర్వర్తించారు.

1927 మార్చిలో సేలం వెళ్ళారు. ఆ జిల్లాలో పర్యటించారు. ఈరోడ్‌లో ఒక మహమ్మదీయుడు శ్రీవారిని స్తుతిస్తూ సంస్కృతంలో శ్లోకాలనువ్రాసి వారికి సమర్పించాడు. ఆశ్లోకాలలోని అక్షరాలన్నీ చతురస్రంగా వ్రాసి తుద కవి ఒక శివలింగాకృతిలో తీర్చిదిద్దబడినవి. శ్రీవారి సమక్షంలోనే అత డాశ్లోకాలను చదివి వాటి అర్థాన్ని కూడ వివరించాడు. సంస్కృతంలో శ్లోకరచన చేయగల సమర్థత నీకెలా వచ్చింది? ఈ భాష నెలా అభ్యసించావని శ్రీవారాతని నడిగారు. అందు కాతడు తన పూర్వు లీ భాషలో పండితుని తన తండ్రివద్ద ఈ భాషను చదువుకొన్నట్లును అతడు తెలియజేసికొన్నాడు. శ్రీవారాభాషలో అతనికిగల పాండిత్యాన్ని ప్రశంసించారు. దాని నలాగే రక్షించుకోవలసిందిగా సూచించారు.

1927 ఏప్రిల్‌లో కోయంబత్తూరువెళ్ళి అచటినుండి మే మొదటి వారానికి పాలఘాటుకువచ్చారు. కేరళ ఆదిశంకరులకు జన్మస్థలం. ఆదిశంకర సంప్రదాయంలో వారు ఆదేశించిన ధర్మపరిపాలనం నెరపుతున్న శ్రీవారిలో అచటివారికి ఆదిశంకరుల తేజస్సే మరల ప్రత్యక్షమైనది. శ్రీవా రచటి శిష్యులతో మళయాళ భాషలోనే సంభాషించారు. అది విని శ్రీవారు మళయాళీయులే అని అచటివారు భ్రమ చెందారు. శ్రీవారు పాలఘాటులో ఉండగానే మదరాసులో సుప్రసిద్ధ న్యాయవాదియైన శ్రీ టి.యం. కృష్ణస్వామిఅయ్యర్‌గారు తన బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకొన్నారు. తిరుప్పుగల్‌ భజనకూడ చేసారు. ఈ న్యాయవాదియే తరువాత తిరువాన్కూరు ప్రధాన న్యాయమూర్తిగాకూడ పనిచేశారు. శ్రీవారు వారి గానాన్ని భక్తిభావాన్ని మెచ్చుకొని ఆశీర్వదించారు. 'తిరుప్పుగల్‌ - మణి' అనే బిరుదాన్ని కూడ ఆయనకు ప్రసాదించారు.

1927వ సంవత్సర ఉత్తరార్థంలో గాంధీమహాత్ముడు దక్షిణ భారతదేశంలో పర్యటించుతున్నారు. ఆయన కామకోటిపీఠ స్వామిని గూర్చి విన్నారు. వారిని తప్పక కలిసికోవాలనుకున్నారు. వీరి సమావేశం పాలఘాటులోని 'నల్లిచేరి'లో జరిగింది. శ్రీవారి మకాంలోని 'పశుకోష్టం'లో ఈ సమావేశం జరిగింది. గాంధీమహాత్మునకిది ఒక అపూర్వమైన అనుభూతి. ఇక్కడ ఆదిశంకర పరంపరలోని గురువులు ఖద్దరు కాషాయవస్త్రాన్ని ధరించి నేలమీద ఆసీనులై ఉన్నారు. శ్రీవారికికూడ ఈ సన్నివేశం ప్రశంసాపాత్రంగానే ఉన్నది. జాతినాయకుడు నిరాడంబరంగా భూమిదున్నే రైతువలె ఉన్నాడు. శ్రీవారి ప్రసంగం సంస్కృతంలో జరిగింది. గాంధీమహాత్ముడు హిందీభాషలో సంభాషించారు. ఉభయుల సంభాషణం చక్కని హార్దికమైన వాతావరణంలో జరిగింది. శ్రీవారి వద్దనుండి వెళ్ళుతూ గాంధీ మహాత్ముడు అపూర్వమైన ఈ సమావేశం విశేషమైన లాభదాయకంగా ఉన్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ ఉభయుల సమావేశం జరిగే సమయంలో ఏర్పడిన సంఘటననుబట్టి ఆయన శ్రీవారితో ఎంత స్థిరభావంతో సంభాషణ జరిపినది తెలిసికొనవచ్చును. అప్పటికి సాయంకాలం గం. 5.30 ని. ఐనది. శ్రీ రాజగోపాలచారి వీరి సంభాషణ మధ్య సమయంలోనే ఆ 'పశుకోష్టం'లోకి వెళ్ళి గాంధీమహాత్మునికి సాయంకాలం భోజనాన్ని గూర్చి జ్ఞాపకం చేశారు. మహాత్ముడు సాయంకాలం గం || 6లు దాటితే ఏ విధమైన ఆహారం తీసికొనరు. కాని గాంధీమహాత్ముడు శ్రీ రాజగోపాలచారితో ప్రధానంగా ఇలా చెప్పారు.

''నేడు శ్రీ ఆచార్యుల వారితో నేనిపుడు జరిపే ఈ సంభాషణమే నాకు ఈ నాటి సాయంకాల భోజనం''

గురువాయూరు, తిరుచూరు, ఎర్నాకులం, క్విలన్‌, త్రివేండ్రం పట్టణాలతో సహా కేరళలోని చాల ప్రదేశాలలో శ్రీవారు పర్యటించారు. తిరువాన్కూరు, కొచ్చిన్‌ సంస్థానాలు శ్రీవారికి మహత్తరమైన స్వాగత సత్కారముల నంద జేసినవి. అలెప్పీలోని చంద్రశేఖరేంద్ర పాఠశాలకు వెళ్లి శ్రీవారచటి విద్యార్థుల నాశీర్వదించారు. శ్రీవారు కేప్‌ కామరిన్‌లో రెండు సముద్రముల సంగమ ప్రదేశంలో స్నానంచేసి కన్యాకుమారి దేవాలయంలో అర్చనలు చేశారు. కేరళయాత్రను పూర్తి చేసికొని మరల ఉత్తరయాత్ర నారంభించారు.

మధురైలో అలహాబాదు వాస్తవ్యులైన శ్రీ తేజ్‌ బహుదూర్‌ సప్రూగారు శ్రీవారిని దర్శించారు. ఆ సమయంలో వారొక అఖలిపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయదలచారు. ఆనాటి ఆంగ్ల ప్రభుత్వం జాతీయాభ్యుదయ శక్తులను నిర్లక్ష్యం చెయ్యకూడదని ఆ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పటం ఆ సమావేశము యొక్క లక్ష్యం. ఆ సమావేశానికి శ్రీవారి ఆశీస్సుల నాయన అర్థించాడు. భారతదేశంలోని ప్రజలకు క్షేమాన్ని కలిగించే కార్యం ఏదైనా శాంతియుతంగా జరిగితే దానికి తమ ఆశీస్సులు తప్పక లభిస్తాయని శ్రీవారు శ్రీ సప్రూగారికి తెలియజేశారు.

1929 ఫిబ్రవరిలో శ్రీవారు దక్షిణ ఆర్కాటు జిల్లాలో పర్యటనను ఆరంభించారు. ఆ సంవత్సరం చాతుర్మాస్యాన్ని 'మనలూరిపేట'లో నిర్వర్తించారు. సుమారొకమాసం రోజులు విడువకుండగ శ్రీవారికి జ్వరబాధ కలిగినది. శ్రీవారు తమ శరీరస్థితిని పూర్తిగా నిర్లక్ష్యంచేసి తమ నిత్యస్నానానుష్ఠానాలను, పూజాకార్యక్రమాలను నిర్వర్తించారు. క్రమంగా ఆ జ్వరం శ్రీవారిని విడిచి వెళ్లింది. శ్రీవారి భక్తుల ఆందోళన శమించింది.

ఈ ప్రయాణంలోనే శ్రీవారు తండాలం గ్రామంగుండా పయనిస్తున్నారు. ఆ ప్రదేశంలో ఉన్న ఒక గోపాలకుడు తనకున్న కొద్దిపాటి ఆస్తిని తెగనమ్మి శ్రీవారికి తన భక్తిపరస్పరమైన కానుకగా సమర్పించాలని నిర్ణయించుకొన్నాడు. కాని శ్రీవా రతనిని అలా చెయ్యవద్దని ఆతని బుద్ధిని మరల్చటానికి ప్రయత్నం చేశారు. కాని అతడతని నిర్ణయాన్ని మార్చుకొనలేదు. వెంటనే అతడు తనకుఉన్న ఆ భూఖండాన్ని ఒక ధనవంతునికి అమ్మివేశాడు. ఆ ధనాన్ని తెచ్చి మనః పూర్వకంగా శ్రీచరణారవిందసమర్పణం గావించుకొన్నాడు. కాని శ్రీవారి కాతడు నిరాశ్రయుడు కావటం ఎంతమాత్రం ఇష్టంలేకపోయింది. వెంటనే వా రచటి తహసీల్ధారుద్వారా అచటి 'పోరంబోకు' భూమిని తగు పరిమాణంలో అతని కిప్పించే ఏర్పాటు గావించారు.

1929 డిసెంబరులో శ్రీవారు తిరుమన్నామలైకి దీపోత్సవానికై వెళ్ళారు. అరుణాచలం తైర్థికులకు మిక్కిలి ప్రథానతమమైన పుణ్యస్థలం. అరుణాచలం అనే ఆ పర్వతమే శివలింగముగా ఆరాధింపబడుతుంది. పరమశివు డిచట మహా జ్యోతిరూపంలో వెలిశాడు. బ్రహ్మవిష్ణువుకూడ ఆ జ్యోతియొక్క ఆద్యంతాలను గుర్తింపలేకపోయారు. అంతేకాక ఇచటనే పార్వతి పరమశివుని అర్థశరీరాన్ని పొందినదని, అందువల్లనే ఈశ్వరుడు అర్థనారీశ్వరుడైనాడని కూడ ప్రసిద్ధి ఉన్నది. ఇదీ ఇచటి పురాణగాధ. యోగియైన అరుణగిరినాథర్‌ శ్రీ సుబ్రహ్మణ్యసాక్షాత్కారాన్ని చట పొంది, కవితా సిద్ధుడై 'తిరుప్పుగల్‌'ను గానంచేసిన సిద్ధక్షేత్ర మిది. ఈ అరుణాచలేశ్వరాలయ ప్రాంగణంలోనే 'ఇడయాక్కట్టు సిద్ధు'ని సమాధిస్థలం ఉన్నదనికూడ చెప్పబడుతోంది. మనతరంలో ఈ తిరువన్నామలై శ్రీ రమణమహర్షియొక్క పరమపవిత్ర నివాస స్థలమైనది. కృత్తికమాసంలో పూర్ణిమనాడు ప్రతిసంవత్సరం సూర్యాస్తమయానంతరం సాయంసమయంలో ఈ అరుణాచల శిఖరాన ఒక పెద్దజ్యోతి వెలిగింపబడుతుంది. తిరువన్నామలైలో ఈశ్వరుడు ఆగ్నేయతేజస్సుగా ఆరాధింప బడినందుల కిది ఒక చిహ్నం. దీనినే దీపోత్సవం అంటారు. 1929లో జరిగిన ఈ ఉత్సవంలో శ్రీవారు పాల్గొన్నారు. ఇచట నెలరోజులున్నారు. అనేక పర్యాయలీ 'అరుణగిరి'కి ప్రదక్షిణాన్ని ఆచరించారు. ఆలయంలో అర్చనలు చేశారు.

తరువాత అరణికి 'సమీపంలో ఉన్న అడయాప్పాలెం అనే గ్రామం దర్శింపవలసిన ప్రదేశం. ఇప్పటికి నాలుగు దశాబ్దాలకు పూర్వం సుప్రసిద్ధపండితులైన శ్రీ అప్పయదీక్షితులవారిచట నివసించారు. దీక్షితులవారు శివభక్తాగ్రేసరులు అద్వైతసిద్ధులును. వీరనేక శాస్త్రగ్రంథాలను రచించారు. శ్రీవా రచటివారికి, శ్రీ దీక్షితులవారు అద్వైతమునకు శైవమునకు చేసిన దోహదమును తెలియజెప్పారు. దీక్షితులవారి జయంత్యుత్సవాన్ని జరపాలని, వారి గ్రంథాలను విశేషంగా ప్రచారం చెయ్యవలసిందని కూడ వారికి చెప్పారు.

1930 డిసెంబరులో పక్షితీర్థంలో (తిరుక్కలుక్కునం) అఖిల భారత సాధు మహాసంఘంవారు శ్రీవారికి స్వాగతపత్రాన్ని సమర్పించారు. అందులో శ్రీవారు ఆదిశంకర భగవత్పాదుల పవిత్రమార్గాన్ని అనుసరిస్తూ హిందుధర్మానికి బోధ, ఆచరణముల ద్వారా చేస్తున్న ఉద్ధరణ కార్యక్రమం మిక్కిలి అమూల్యమైనదని పేర్కొన్నారు.1931 జనవరిలో చెంగల్పట్టువాసులకు శ్రీవారికి స్వాగతం సమర్పించే మహదవకాశం లభించింది. ఈ అపూర్వావకాశం కోసం అచటిప్రజలెప్పటినుండియో ఎదురుచూస్తున్నారు.

చెంగల్పట్టులో శ్రీవారున్న కొద్దికాలంలో పేర్కొనదగిన సంఘటన ఒకటి జరిగింది. గ్రంథకర్తగాను, పత్రికారచయితగాను, అధ్యాత్మికాన్వేషకుడుగాను ప్రసిద్ధుడై ఆంగ్లేయుడైన పాల్‌బ్రంటన్‌ శ్రీవారిని దర్శించటం జరిగింది. ఆయన యావద్భారతంలో ఉన్న అంతర్ముఖులై, ఏకాంతవాసులైన సిద్ధులను, యోగులను పీఠాధిపతులను అన్వేషించుకొంటూ వారితో సంబంధాన్ని కోరి పయనించుతున్నాడు. నిగూఢమైన భారతదేశంలో పరిశోధన చెయ్యాలని ఆయన కోరిక. ('ఏ సర్చ్‌ ఇన్‌ సీక్రెట్‌ ఇండియా' అనే పేరుతో చివరకు ఆయన ఒక గ్రంథాన్ని కూడ రచించాడు) ఈ కోరికయే ఆయనను ఇంగ్లాండునుండి ఈదేశానికి రప్పించింది. బ్రంటన్‌ మదరాసులో ఉన్నపుడు ఆంగ్లంలో గ్రామజీవితాన్ని చిత్రించే నవలలను, వ్యాసాలను వ్రాసి ప్రతిభాశాలియైన రచయితగా ప్రసిద్ధుడైన శ్రీ కె.యస్‌. వెంకటరమణిని కలిసికొన్నాడు. ఈ వేంకటరమణియే పాల్‌ బ్రంటన్‌ను మదరాసునుండి చెంగల్పట్టుకు శ్రీవారి దర్శనార్థం తీసికొనివెళ్ళాడు. శ్రీ వేంకటరమణి శ్రీవారిని స్వయంగా ప్రార్థించి ఈ ఆంగ్లవ్యక్తితో శ్రీవారు తమ సమక్షంలోనే సంభాషించే అవకాశాన్ని కలిగించాడు. ఆతురుడై దర్శనార్థంవచ్చిన ఆ వ్యక్తికి బ్రహ్మానందస్ఫూర్తిగల ఆ వదనం, దివ్యతేజస్సు ఉట్టిపడే ఆ కన్నులు దివ్యానుభూతిని గలిగించినవి. బ్రంటన్‌ శ్రీవారిని ప్రశాంతంగా దర్శించి చకితుడైనాడు. ఈ సన్నివేశాన్ని గూర్చి వివరిస్తూ తరువాత అతడు తన గ్రంథంలో ఇలా వ్రాసికొన్నాడు.

''వారి దివ్యమైన ఆ వదనబింబం నా స్మృతిపథంలో గౌరవనీయమైన స్థానాన్ని అలంకరించి ఉన్నది. అధ్యాత్మభావం వారి ముఖ తేజస్సులో, అక్షరాలా ప్రత్యక్షంగా ప్రకాశించుతోంది. వారి వాగ్వైఖరి నమ్రంగాను, శాంతంగాను ఉంటుంది. విశాలములైన వారి కన్నులు అసాధారణ తేజస్సుతో విరాజిల్లుతూ ఉండును, సమవిభక్తమైన నాసిక. కొంచెంగా ఎదిగిన గడ్డము. గంభీరమైన ఆ ముఖకవళిక విశేషంగా గుర్తింపదగి ఉన్నది. మధ్యయుగంలో క్రిస్టియన్‌ చర్చిలో ఎవరైనా ఒక సాధువునకు ఇలాంటి ముఖవైఖరి ఉండవచ్చునుగాని అసాధారణ ప్రతిభాసంపద ఇచ్చట విశేషంగా కన్పించుతోంది. ప్రత్యక్షవాదులమైన మన పాశ్చాత్యులం వారి కన్నులను స్వాప్నికములుగా భావింపవచ్చును. వారి కనురెప్పల చాటుననున్నవి కేవలం కలలుకాదు. వాటిని మించిన విశేషములున్నవి. వానిని వాక్కుతో వివరింపలేము. ఇది నా భావన.''

ఆ పాల్‌ బ్రంటన్‌ ప్రాపంచిక విషయములైన రాజకీయ ఆర్థికాభివృద్ధి, నిరాయుధీకరణాదులను గూర్చి శ్రీవారిని ప్రశ్నించాడు. ప్రపంచపరిస్థితి మెరుగుపడవలెనంటే దానికి ముందు మానవుని మానసిక పరిణతి అవసరమని, శ్రీవారు తమ స్వోపజ్ఞకమైన పద్ధతిలో అతనికి విశదీకరించారు.

''మీ యుద్ధ నౌకలను మీరు ముక్కచెక్కలు చేసి మూల పారవెయ్యండి- మరఫిరంగులను దుమ్ము దులపకుండ దాచి పెట్టండి-అంత మాత్రంచే యుద్ధప్రమాదం ఆగదు. అపుడు కఱ్ఱలనే ఉపయోగించుతారు.''

''జాతులలోగాని, బీదవారు, ధనవంతులలోగాని పరస్పరం అధ్యాత్మికమైన అవగాహన జరగాలి. అది మాత్రమే ప్రజల్లో మంచి భావసంపదను, దానివల్ల శాంత్యభ్యుదయాలను సాధించుతుంది.''

ప్రపంచం, జీవితం - ఈ విషయాల్లో భారతీయులు నైరాశ్యంతో ఉంటారని కొందరు విమర్శకు లనుకొంటారు. కాని శ్రీవారు బ్రంటన్‌కు చెప్పిన ఒక సమాధానంతో ఈ విషయం పూర్తిగా తప్పు అని వెల్లడియైనది.

బ్రంటన్‌ : ''మానవాజాతి క్రమంగా పతనావస్థను పొందుతోందని తమ అభిప్రాయమా ?''

శ్రీవారు : ''నేను అలా భావించటంలేదు. మానవునిలో అంతర్నిహితమైన ఆత్మచైతన్యం ఉన్నది. అది మానవుని తుదకు ఈశ్వరాభిముఖుని చేస్తుంది. ప్రజలకు ముఖ్యంగా నిందించవలసిన పనిలేదు. వారు జన్మించిన పరిసర ప్రభావమే ఇందులో ప్రధానమైనది. వారి పరిసర పరిస్థితులు వారు జన్మించిన స్థితినుండి పతనం కావటానికి తీవ్రంగా పనిచేస్తాయి. ఇది ప్రాచ్య, పాశ్చాత్యులకు, ఉభయసామాన్య లక్షణం. సంఘం భావోన్నతికై యత్నం చెయ్యాలి. జీవనరాగాన్ని తారస్థాయిలో ఆలపింప జేసే యత్నం కావాలి.

శ్రీవారిలోని జగద్వ్యాప్తమైన సువిశాల భావోన్నతిని అతడు విస్మరింపకుండగ ఇలా పేర్కొన్నాడు.

''నేను వెంటనే గ్రహింపగలిగిన విషయమిది. భారతదేశంలో సాధారణంగా ఇతరులవలె శ్రీ శంకరాచార్యస్వామి ప్రాచ్య దేశాలవారి ఉన్నతిని వివరించటంకోసం పాశ్చాత్యులను న్యూనతపఱచలేదు. మొత్తం ప్రపంచంలోని సగంభాగంలోను ఇరుపక్షాల వారికి గుణదోషాలు వారికి ఉన్నవని వారు అంగీకరించారు. ఈ పద్ధతిలో సామాన్యంగా ఉభయులు సమానులేనని వారు అన్నారు. రాబోయేతరంలోని బుద్ధిమంతులు ఆసియా, పాశ్చాత్యప్రాంతాలలోని నాగరిక లక్షణాలలోని అత్యుత్తమ గుణాలతో స్థిరమైన ఉన్నత సాంఘిక ప్రణాళికను సిద్ధం చెయ్యగలరని కూడ వారు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

తుదకు బ్రంటన్‌ తాను వచ్చిన ప్రధానకారణాన్ని శ్రీవారికి నివేదించుకున్నాడు. శ్రీవారు స్వయంగాగాని లేదా మరియొకరిని సూచించిగాని తన అధ్యాత్మిక సాధనకు బోధకులుగా దారిచూపాలని ఆయన వాంఛ.

అందుకు శ్రీవారిలా అన్నారు :

''నేనొక సంస్థకు అధిపతిగా ఉన్నాను. నాకు నేనై విశేష సమయాన్ని వ్యయం చేసికొనేందుకు వీలుపడని వ్యవస్థ ఇది. నా కార్యక్రమాల ఒత్తిడితోనే నా సమయం మొత్తం సరిపోతుంది. కొన్ని సంవత్సరాలుగా రాత్రి నిద్రకు మూడు గంటల అవకాశం ఉంటోంది నాకు. వ్యక్తిగతంగా శిష్య స్వీకారంచేసే అవకాశ##మేది? శిష్యహితం కోసం సమయాన్ని వెచ్చించే గురువుకోసం అన్వేషణ చేయవలసిఉన్నది.''

శ్రీవారి ఆదేశానుసారం బ్రంటన్‌ తిరువన్నామలైలోని శ్రీ రమణ మహర్షిని అన్వేషించుకొంటూ వెళ్లాడు. ఇంతకు పూర్వమే శ్రీమహర్షి శిష్యులొకరు మదరాసులో మహర్షిని గూర్చి బ్రంటన్‌కు తెలియజేశారు. అపుడు బ్రంటన్‌ ఇంత సూక్ష్మంగా భావించలేదు. వారు కూడ తా నింతకు పూర్వం దర్శించిన యోగులవలెనే ఉంటారనే అభిప్రాయం ఆయనకు ఉన్నది. శ్రీవారు రమణమహర్షిని దర్శింపకుండగ దక్షిణ భారతదేశాన్ని విడిచివెళ్లవద్దని బ్రంటన్‌కు చెప్పారు.

చెంగల్పట్టులో శ్రీవారిని కలుసుకొని బ్రంటన్‌ మరల మదరాసులోని తన మకాంలోకి వచ్చాడు. ఆ రాత్రి అతనికి శ్రీవారు సాక్షాత్కరించారు. ఆకస్మికమై జాగృతి కలిగింది. ఆ గదిఅంతా అంధకార బంధురంగా ఉన్నది. అతనికొక దివ్యతేజస్సు గోచరించింది. అతడు వెంటనేలేచి కూర్చుండి సూటిగా చూచాడు. దాన్ని గూర్చి అతడిలా వ్రాసికొన్నాడు.

''ఆశ్చర్యకరమైన నా నిర్నిమేష దృష్టికి శ్రీ శంకరాచార్యరూపం గోచరమైనది. ఇది స్పష్టంగా గోచరించిన ఆకృతి. ఇందు భ్రాంతి ఎంతమాత్రములేదు. ఏదో దివ్యాకృతిలో వారు సాక్షాత్కరించలేదు. స్పష్టమైన మానవకృతిలోనే నా కన్నుల కగుపడినారు. దివ్యతేజోమయమైన పరిధి ఒకటి చుట్టు వ్యాపించిఉండి ఆ చీకటినుండి వారి ఆకృతిని నేర్పరుస్తోంది.

అది సాధ్యపడని సందర్శనం కాదా ! శ్రీవారిని నేను చెంగల్పట్టులో విడిచిరాలేదా? పరీక్షకోసం నా కన్నులను ప్రయత్న పూర్వకంగా మూసివేశాను. ఏమీ భేదంలేదు. వారినే నేను సుస్పష్టంగా దర్శించారు.

దయాపూర్ణమై హార్థికసాక్షాత్కారానికి తార్కాణంగా దీన్ని నేను స్వీకరించాను. కన్నులను తెరిచాను. బంగారు వర్ణాన్ని పుణికి పుచ్చుకొన్న దయామూర్తిని దర్శించాను.

ముఖం కొంచెం చలించింది. పెదవులలోని మందహాసరేఖ ఏదో చెప్పబోతున్నట్టు అనిపించింది.

'వినయంగా ఉండు. తప్పక నీకు నీ కార్యసిద్ధి కలుగుతుంది.'

ఆ ఆకృతి ఎలా ఆవిర్భవించిందో అలాగే అంతర్థాన మైనది. ఇది ఒక భావోన్నతిని ప్రసాదించింది. అది అసాధారణమై అచంచల ఆనందానుభూతి. దీనినొక స్వప్నంగా త్రోసిపుచ్చాలా నేను ? ఏమిటి దీని కథ?'

శ్రీవారు చెంగల్పట్టునుండి కామకోటి పీఠస్థానమైనప కాంచీ క్షేత్రానికి విజయం చేశారు. శ్రీవారు పీఠాధిపత్యం వహించిన తరువాత ఇచటకు విచ్చేయటం ఇదే మొదలు. 1931 జనవరి 25వ తేదీ ఆదివారంనాడు సర్వలాంఛన పూర్వకంగా శ్రీవారు పురప్రవేశం చేశారు. పట్టణం అంతా ఆనందోత్సవంలో నిమగ్నమైంది. పౌరులందరు విశేషవైభవంతో శ్రీవారికి స్వాగత సత్కారాల నందజేశారు. అతిమనోహర దేవాలయములకీ క్షేత్రం నిలయం. శ్రీ కామాక్షీదేవ్యాలయం పట్టణ మధ్యభాగంలో ఉంటుంది. ఈ ఆలయంలో ఆదిశంకరులు శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. లోపలి ప్రాకారంలో ఆదిశంకరుల పురుషాకృతి సమమైన విగ్రహం ఉన్నది. సంప్రదాయ సిద్ధమైన చరిత్ర ప్రకారం ఆదిశంకరు లిచట సర్వజ్ఞ పీఠాధిరోహణంచేసి ఇచటనే సిద్ధిపొందారనే స్పష్టమైన అంశం. ఆదిశంకరుల శిల్పాకృతులు ఈ పట్టణంలో విశేషంగా ఉన్నవి. ఏకామ్రేశ్వర, వరదరాజస్వామి ఆలయాల్లో సైతం వీనిని చూడవచ్చు. కామకోటిపీఠ సాధారణపర్యవేక్షణలోనే కామాక్షీ దేవ్యాలయ ధర్మపరిపాలన ఎన్నో శతాబ్దాలనుండి కొనసాగుతూ వస్తోంది. 1840లో కామకోటిపీఠాధిష్ఠితులైన 64వ గురువులు శ్రీచంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామివారు ఈ ఆలయ కుంభాభిషేకాన్ని నిర్వర్తించారు. ఆ తరువాత మరుసటి సంవత్సరమే అపుడు భారతదేశంలోఉన్న ఆంగ్ల ప్రభుత్వాధికారులు ఈ ఆలయముయొక్క ప్రత్యక్ష పరిపాలనా బాధ్యతను కామకోటిపీఠం వారే స్వయంగా చూచుకొనే ఏర్పాట్లు చేశారు. 1931లో శ్రీవా రిచట విజయంచేసి ఉన్నపుడి ఆలయ ఉద్ధరణ కార్యక్రమం జరిగింది. ఆలయంలోని నిత్యపూజా పద్ధతులు కూడ శ్రీవారిచే దివ్యోత్తేజ నాత్మకములుగా చేయబడినవి.

1931 ఏప్రిల్‌ చివరలో కంచినుండి ఉత్తిరమెరూరుకు వెళ్ళారు. అచట ప్రాచీన ప్రజాస్వామిక వ్యవస్థకు అనుబంధితములైన శాసనాదులున్నవి. ఈ విధమైన ఐతిహాసిక ప్రశస్తిగల ప్రదేశమిది. చెంగల్పట్టు జిల్లాలో శ్రీవారు వెళ్లిన మరొక ప్రసిద్ధ ప్రదేశం శ్రీపెరుంబుదూరు. ఇది శ్రీ రామానుజాచార్యులవారి జన్మస్థలం. శ్రీవా రిచటి ఆదికేశవస్వామి ఆలయంలోని ఉపన్యాసంలో పుష్పదంతుడు రచించిన 'శివ మహిమ్నస్తోత్రం'లోని శ్లోకభావాన్ని వివరించారు. అందులో భిన్న భిన్న మతమార్గాలన్నీ మహాసముద్రంలో ఏకమయ్యే మహానదులుగా పోల్చబడినవి. ఈశ్వరారాధనంలోని భేదములన్ని వారివారి అభిరుచిని బట్టి ఏర్పడినవని వివరించారు.

1931లో చిత్తూరులో చాతుర్మాస్య వ్రతం జరిపారు. మరల యాత్ర ఆరంభ##మైనది. శ్రీవారు 'ఆరణి'లో విజయంచేసి ఉన్నారు. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెసులో స్వచ్ఛంద సేవకులుగా పనిచేస్తున్న రెండువందల మందికి శ్రీవారిని దర్శించాలని అభిప్రాయం కలిగింది. స్వాతంత్ర్య పోరాటం పతాకస్థాయిలో ఉన్నరోజులవి. ఆ స్వచ్ఛంద సేవకుల కేవిధమైన అతిథేయాదరం చూపినావారిపైకి బ్రిటిషు గవర్నమెంటు ఒక్కుమ్మడిగా దుముకే స్థితిలో ఉన్నది. అందువల్ల మఠం అధికారు వలాంటీర్లను ఆహ్వానించటానికి అభిముఖులుగా లేరు. వలాంటీర్ల అభిప్రాయం శ్రీవారికి నివేదింపబడినది. వెంటనే వారిని రప్పించారు. వారి అతిథేయాదరమునకుకూడ వెంటనే ఏర్పాటు గావించారు. ఆ వచ్చినవారినందరను ఒక్కొక్కరినే పలుకరించి విశేషాలు తెలిసికొన్నారు. ప్రతివ్యక్తికి 'విభూతి' - ప్రసాదాన్ని అనుగ్రహించారు.

1932 మార్చిలో మహాశివరాత్రి పర్వసమయానికి శ్రీకాళహస్తి క్షేత్రానికి విజయం చేశారు. ఈ సమయంలోనే మిక్కిలి కంటకావృతమైన దుర్గమారణ్య మార్గంలో కైలాసగిరి ప్రదక్షిణం చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆరంభించి అర్థరాత్రివేళకు పూర్తిచేశారు. ఇరువదిమంది మాత్రం శ్రీవారి ననుగమింపగలిగారు. ఇది మొత్తం ముపై#్ఫ మైళ్ళదూరం ఉంటుంది. కాళహస్తినుండి తిరుపతికి. తరువాత తిరుమల క్షేత్రానికి విజయం చేశారు. స్పష్టమైన తెలుగులో శ్రీవారి అమృతోపదేశోపన్యాసాలను వేలాది జనం విని పూజలను దర్శించుకొన్నారు. చిత్తూరుజిల్లాలోని ఇతర ప్రాంతాలతోపాటు శ్రీవారు వెంకటగిరి, నగరి పట్టణాలకుకూడ వెళ్లారు. ఈ నగరిలో శ్రీవారొకరోజున పండితులతో వేదాంతశాస్త్ర గోష్ఠి జరుపుతున్నారు. శ్రీవారి మాతృమూర్తి నిర్మాణ వార్తను ఇచ్చటనే శ్రీవారు గ్రహించారు. (ఈ విషయం ఈ గ్రంథంలోనే 144, 145 పుటల్లో వివరింపబడినది.) శ్రీవారి మాతృమూర్తి 14-6-1932 న పరమపదించారు.

ఇలాగే 24-7-1929 న శ్రీవారి తండ్రి శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారు కుంభకోణంలో పరమపదించారు. ఈ వార్తను విన్నపుడు కూడ శ్రీవారు కొంతసేపు ప్రశాంతంగా ఉన్నారు. ఏమియు మాటాడలేదు.

నగరికి సమీపంలోనే ప్రకృతి రామణీయకతగల ప్రదేశం ఉన్నది. దానినే 'బుగ్గ' అంటారు. ఇక్కడ ఒకే ఆలయంలో కాశీవిశ్వనాథస్వామి, ప్రయాగ మాధవస్వామి ఉన్నారు. ఆలయం ప్రక్కగా జీవనది ప్రవహించుతూ ఉంటుంది. ఐదు ఉపనదు లిందులో కలుస్తవి. 17-7-1932 నుండి ఆరంభ##మైన చాతుర్మాస్యవ్రతాన్ని చటనే జరిపారు. వీరిచట ఉన్న సమయంలోనే ఇచటి దేవాలయ పునరుద్ధరణం, మహావైభవంతో కుంభాభిషేకము జరిగినవి. మదరాసునుండి విశేష సంఖ్యలో భక్తులు వెళ్ళి రాజధాని నగరానికి శ్రీవారి నాహ్వానించారు. మదరాసుకు వెళ్ళుతూ మార్గంలో తిరుత్తనిలో సుప్రసిద్ధమైన సుబ్రహ్మణ్యశ్వరస్వామి ఆలయాన్ని శ్రీవారు దర్శించారు.

28-9-1952 న తేదీన శ్రీవారికి స్వాగతం పలికే మహాభాగ్యం మదరాసు పౌరులకు లభించింది. ఇచట శ్రీవారు నాలుగు మాసాలున్నారు. ఇచటి ప్రజలు తమ జీవితంలో శ్రీవారి సన్నిధి ప్రత్యక్షమైన పరిణామం కలిగించినట్లు భావించారు. మదరాసు సంస్కృత కళాశాలలోను ఇంకా నగరంలోని వివిధ ప్రదేశాలలో శ్రీవారిని తండోపతండాలుగా దర్శించుకొనేవారు. మనస్సులను స్పందింపజేసే శ్రీవారి ఉపదేశామృతాన్ని తనివితీర గ్రోలారు. శ్రీవారు విచ్చేసిన మొదటిరోజు రాత్రి మైలాపూరు సంస్కృత కళాశాలవరకు అతిలోక వైభవంగల ఊరేగింపు టుత్సవం జరిగింది. శ్రీవారు పల్యంకికయం దధిష్టితులై ఎల్లరను అనుగ్రహించారు. సంస్కృత కళాశాలలో శ్రీవారు విడిది చెయ్యటానికి తగిన వసతులన్నీ శ్రీ కె. బాలసుబ్రహ్మణ్యయ్యర్‌ తదితర భక్తులు ఏర్పాటుచేశారు. శ్రీ బాలసుబ్రహ్మణ్‌య్యర్‌గారి తండ్రి న్యాయమూర్తి శ్రీ వి. కృష్ణస్వామిఅయ్యర్‌గారీ కళాశాలను స్థాపించారు. ఉపన్యాసమందిరాన్ని ఇచట నిర్మించారు. శ్రీవారీమంటపంలో విజయదశమినాడు శాంకరభాష్య ప్రవచనంచేసి ఆ మంటపానికి 'భాష్యవిజయ మంటపం' అని నామకరణంచేశారు.

మదరాసు కార్పోరేషన్‌వారు శ్రీవారికి స్వాగతపత్రాన్ని సమర్పించాలని విశేష ప్రయత్నం చేశారు. అపుడు శ్రీ టి. యస్‌. రామస్వామి అయ్యర్‌గారు మేయరుగా ఉన్నారు. శ్రీ ఏ. రామస్వామి మొదలియార్‌గారు ఈవిషయమై తీర్మానాన్ని ప్రవేశ##పెడుతూ ఇలా అన్నారు. ''ఒక మతాచార్యునికి స్వాగతపత్రాన్ని సమర్పించటం కార్పొరేషన్‌ చరిత్రలో ఇదే మొదలు. శ్రీ శంకరాచార్యులవారిని కేవలం హిందువులేకాక తక్కిన మతస్థులు సైతం విశేషగౌరవంతో ఆరాధిస్తున్నారు. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించుతారని ఆశిస్తున్నాను.'' సభలో ఆనందకోలాహలం మధ్య తీర్మానం ఆమోదింపడినది. ఈ సంగతిని శ్రీవారికి నివేదించారు. కాని శ్రీవారు మర్యాదగా ఇలా చెప్పారు. ''మతసంబంధంలేని కార్పొరేషన్‌ హాలులో జరిగే సభలో నేను పాల్గొనటం ఉచితంకాదు. కనుక నేను ఇందుకు అంగీకరింపలేను.''

1932లో ఆ సంస్కృత కళాశాలలో శరన్నవరాత్రి ఉత్సవాలను జరిపారు. ఈ పూజాసమయంలో శ్రీవారు ఉపవాస, మౌనవ్రతాలను పాటిస్తారు. జగన్మాతృస్వరూపిణులుగా భావింపబడి సువాసినులు పూజింపబడేవారు. పవిత్రమైన కుమారీ పూజలు జరుపుతారు. రెండు సంవత్సరాల వయస్సుగల బాలికలతో మొదటిరోజున ఆరంభించి, పదిసంవత్సరాల వయస్సుగల కన్యలతో తొమ్మిదవ రోజున పూర్తిచేస్తారు. అలాగే సంఖ్యకూడ ఏకోత్తరవృద్ధిగా ఉంటుంది. వేదపారాయణులు, దేవీభాగవత పారాయణులు, రామాయణం, గీత, చండిపారాయణాదులు, శ్రీవిద్యాహోమాదులు ఈ ఉత్సవసమయంలో జరుపుతారు. ఈ సంస్కృత కళాశాలలో జరిగిన నవరాత్రి ఉత్సవాల్లో వేలాది జనులు పాల్గొన్నారు. శ్రీవారి అనుగ్రహానికి పాత్రులైనారు.

నవరాత్రి ఉత్సవాల అనంతరం ప్రతిదినం సాయంకాల పూజానంతరం శ్రీవారి ఉపన్యాసం జరిగేది. నిశ్శబ్దంగా ఉండి వేలాది ప్రజలీ ఉపన్యాసాలను వినేవారు. శ్రీవారు ముందు సింహాసనాధిష్టితులై కొంతసేపు ప్రశాంతగంభీరమైన మౌనముద్రాలంకారులై ఉండేవారు. తరువాత మెల్లగా ఉపన్యాసాన్ని ఆరంభించేవారు. ఇది కేవలం ఉపన్యాసంకాదు. ప్రతిదినం హార్థికంగా ఉపదేశించేవారు. దృష్టాంతాలన్నీ నిత్యజీవితంలోవి. కాలక్షేపంగా ఉంటూండే త్యాగం, నిరాడంబరత, పవిత్రత, దివ్యజీవనం మొదలైనవి ప్రజలకు శిరోధార్య భావాలుగా ఉపదేశింపబడేవి. హిందూధర్మ ప్రధాన సూత్రాలు - ఆచరణమార్గాలు. ఈశ్వరభక్తి, అనుష్ఠానం, అద్వైతసిద్ధాంతం గొప్పదనం మొదలైన అంశాలీ ఉపన్యాసాలలో ప్రధానాంశాలుగా వుండేవి. ఈ ఉపన్యాసాలను వినే అవకాశం లేనివారికి 'ది హిందు' 'ది స్వదేశమిత్రన్‌' పత్రికలలో ప్రతిదినం ప్రచురింపబడిన ఈ ఉపన్యాసాలను చదివే అవకాశం లభించింది. వీటివల్ల పాఠకులకు శ్రోతలకు అంతరమైన ఉజ్జీవనం గలిగింది. ఈ ఉపన్యాసాలు మూడు సంపుటాలుగా ప్రచురింపబడినవి. మదరాసులోని శ్రీ కామకోటి కోశస్థానంలో ఇవి లభించును.

మదరాసులో ఉన్నప్పుడే శ్రీవారు రామకృష్ణమిషన్‌ స్టూడెంట్స్‌ హోమ్‌ మొదలైన విద్యాసంస్థలకు కూడ వెళ్ళి చూచారు. ఉపాధ్యాయులు పవిత్రంగా 'విద్యాబోధన చెయ్యా'లని విద్యార్థులు శ్రద్ధాళువులై విద్యాభ్యాసం చెయ్యాలని ఉద్భోధించారు. మదరాసునుండి బయలుదేరుతూ మహా మహోపాధ్యాయ శ్రీ యస్‌. కుప్పుస్వామి శాస్త్రిగారికి 'దర్శనకళానిధి' బిరుదాన్ని, శ్రీ కె. బాలసుబ్రహ్మణ్యయర్‌ గారికి 'ధర్మరక్షామణి' బిరుదాన్ని, శ్రీ. ఏ. కృష్ణస్వామిఅయ్యర్‌ గారికి 'పరోపకార చింతామణి' బిరుదాన్ని ప్రసాదించారు.

మదరాసు సమీపంలో ఉన్న 'తిరువర్రియూరు' మిక్కిలి పుణ్యస్థలం. ఎన్నో శతాబ్దాల నుండి మహాత్ములు విశేషంగా అభిమానించిన పుణ్యభూమి. ఇచట అతిప్రాచీనమైన శ్రీ త్రిపురసుందరీ త్యాగేశుల ఆలయం ఉన్నది. ఆదిశంకరులీ ఆలయంలో శ్రీచక్రప్రతిష్ఠ చేశారు. ఈ రోజుకు కూడా అచటి త్రిపురసుందరీదేవికి పూజాకార్యక్రమాన్ని జరిపేందుకు నంబూద్రి బ్రాహ్మణులే నియమింపబడుతున్నారు. ఈ ఆలయంలోని లోపలి ప్రాకారంలో ఆదిశంకరుల విగ్రహం ఉన్నది. కామకోటి పీఠాధిష్టితులైన పలువురు సిద్ధులీ పుణ్యస్థలంలో కనీసం కొంతకాలమైనా గడిపారు. ఇచటి శంకరమఠంలో కామకోటి పీఠాధిష్ఠితులైన ఇరువురి సమాధులను మనం చూడవచ్చును. ఇటువంటి పుణ్యస్థలానికి శ్రీవారు విజయంచేసి ఈ ప్రదేశాన్ని మరింత పుణ్యపూతంగా చేశారు.

1933 మార్చిలో మదరాసునుండి బయలుదేరి కుంభకోణంలో జరిగే 'మహామాఖం' ఉత్సవంలో పాల్గొనేందుకు మరల దక్షిణానికి ప్రయాణం చేశారు. ఇప్పటికిని శ్రీవారి విజయయాత్ర సాగుతూనే ఉండటంచేత వారు మొదటి నియమం ప్రకారం కుంభకోణంలోని శ్రీమఠానికి వెళ్ళలేదు. తిరువిడై మరుదూరులోనే మకాం చేశారు. ఆ రోజుకు కుంభకోణంవెళ్ళి అచట పవిత్ర స్నానం చేశారు. పండ్రెండు సంవత్సరాలకొక పర్యాయం జరిగే ఈ వుత్సవంలో ఆరులక్షల ప్రజలు పాల్గొన్నారు. 'మహామాఖం' తరువాత, కొన్ని మాసాలుపాటు 'తిరువిడై మరుదూరు'లోని శంకరమఠంలో ఉన్నారు. దీనినే మధ్యార్జునం అంటారు. సంప్రదాయసిద్ధమైన 'జనశ్రుతి' ననుసరించి ఆదిశంకరులిచటకు విచ్చేశారు. ఇచట దేవాలయంలోని మహాలింగస్వామిని దర్శించారు. ఇచటి శివలింగమునుండి పరమేశ్వరు డావిర్భవించి కుడిచేతినెత్తి 'సత్యం అద్వైతం, సత్యం అద్వైతం, సత్యం అద్వైతం' అని మూడుమారులు వెల్లడించటం జరిగింది. 1933లో శ్రీవారిచట శంకరజయంతి మహోత్సవాలను జరిపారు.

చాలాకాలంనుండి శ్రీవారికి చిదంబర క్షేత్రాన్ని దర్శించాలనే అభిప్రాయం ఉన్నది. ఇంతకు పూర్వం కంచికామకోటి పీఠాధిపతులెవ్వరు 200 సంవత్సరాలనుండి ఈ చిదంబర క్షేత్రానికి వెళ్ళలేదు. ఇచట నటరాజస్వామి ఆలయంలోఉండే దీక్షితారులు శంకరమఠాధిపతులకు సైతం, ఇతర ఆలయాలలోవలె వారియెడ చూపదగిన మర్యాదను వీరు పాటింపరు. అచటి పవిత్రభస్మాన్ని పీఠాధిపతులే స్వయంగా తీసికోవటానికి వా రనుమతింపరు. చాలమంది భక్తులు శ్రీవారు చిదంబరక్షేత్రాన్ని తప్పక దర్శించాలని భావించారు. శ్రీవారు కూడ శ్రీనటరాజస్వామిని దర్శించాలని తలపోశారు. భక్తుల ఆహ్వానాన్ని మన్నించి శ్రీవారు 18-5-1933న చిదంబరానికి విజయం చేశారు. చిదంబరంలోని పౌరులు అచటి దీక్షితార్లతో కలిసి శ్రీవారికి స్వాగత మర్యాదలను నెరపారు. కాని శ్రీవారు నటరాజస్వామిని దర్శించటానికై వెళ్ళినపుడు అచట 'విభూతి' స్వీకార సమయంలో ఏమిజరుగుతుందో అని కొందరు భయపడ్డారుశ్రీవారీ విషయాన్నేమీ పట్టించుకోలేదు. మొత్తంమీద నటరాజ స్వామిని సాధ్యమైనంత త్వరలో దర్శించుకోవాలని అనుకొన్నారు. ఉదయాన్నే దేవాలయానికి వెళ్లాలని నిశ్చయించుకొన్నారు. తమకోసం నిరీక్షిస్తూ ఉండవలసిందిగా తమ పరిచారకున కొకనికి ముందుగానే చెప్పారు ఉషఃకాలంలో ఒంటరిగానే 4 గంటలకు అచటకు వెళ్లారు. స్నానంచేసి అనుష్టానాన్ని నిర్వర్తించుకొన్నారు. దేవాలయద్వారం తెరచిన వెంటనే ఆలయంలోన వెళ్లారు. నటరాజస్వామి కెదురుగా ధ్యాన నిమగ్నులై నిలబడ్డారు. ఆలయంలో ప్రాతఃకాల పూజనుచేసే దీక్షితారు వచ్చి ఈ దృశ్యాన్ని చూచి వెంటనే తదితర దీక్షితార్ల కోసం కబురు పంపటం జరిగింది. అందరు ఒక్కమారే వచ్చారు.

శ్రీవారికి తాము విశేషస్వాగత మర్యాదలను జరుపదలచామని విన్నవించుకొన్నారు. శ్రీవారచటకు విచ్చేసిన సమయానికి తామొక్కరు కూడ శ్రీవారినాహ్వానించటానికి ఆలయంలో లేనందులకు బాధపడ్డారు. శ్రీవారు వారికి శాంతవచనాలు చెప్పారు. ఉదయాన్నే నటరాజస్వామి విశ్వరూప దర్శనార్థం తాను పెందలకడనే అచటకు వచ్చినట్లు తెలియజెప్పారు. శ్రీవారచట మకాంచేసిన సమయంలో చాల పర్యాయములు ఆలయానికి వెళ్లి స్వామిదర్శనచేసి కొన్నారు. ఇతర ఆలయాలలో వలెనే శ్రీవారిని ఈ ఆలయంలో కూడ అచటి దీక్షితారులు గౌరవించారు. దీక్షితార్లు మనఃపూర్వకంగా చేసిన ప్రార్థన ననుసరించి శ్రీవారు నటరాజస్వామి ఆలయంలోనే కొలదిరోజులున్నారు. అచటి సహస్రస్తంభమంటపంలో శ్రీ చంద్రమౌళీశ్వర పూజలు చేశారు. సంప్రదాయ చరిత్ర ననుసరించి ఆదిశంకరులు కైలాసంనుండి తెచ్చిన రెండు స్ఫటికలింగములు - ఒకటి కంచి కామకోటి పీఠమునందు పూజింపబడుచున్న యోగలింగమును, చిదంబరంలోఉన్న మోక్షలింగాన్ని ఏకకాలంలోనే దర్శించుకొనే మహాభాగ్యం అచట శ్రీవారి పూజా కార్యక్రమాన్ని దర్శించిన భక్తబృందానికి అపూర్వాను భూతిగా లభించింది.

1933లో నవరాత్రిపూజలను తంజావూరులో జరిపారు. అచట శంకరమఠాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రధానంగా తంజావూరు యువరాజా ప్రతాపసింహరాజా, మరియు, శ్రీ టి.ఆర్‌. జోషీల ఔదార్యంతో నిర్మింపబడినది. శ్రీవారి ఉత్తరభారత యాత్రకు తగిన ఏర్పాట్లుపూర్తియైనవి. ఇంతకు కొన్ని సంవత్సరాలకు పూర్వమే శ్రీ అనంతకృష్ణశర్మ అనే యువకుని కాశీకి పంపించారు. (ఈ యాత్ర విషయం ఈ గ్రంథంలోనే 143, 144 పుటలలో వివరింపబడినది) ఆయన శ్రీవారి ఆదేశానుసారంగా హిందీభాషను క్షుణ్ణంగా అభ్యసించి తిరుగుప్రయాణం రైలుమీద చేసి వచ్చారు. మార్గంలోని విశేషాల నన్నింటిని గుర్తించి మఠానికి తెలిపారు. శ్రీవారి ఆజ్ఞను ఔదలదాల్చి తు,చ తప్పకుండా అక్షరశః పాటించి ఆరుమాసాలకు కాశీపట్టణానికి చేరుకొన్నారు. శ్రీ బ్రహ్మానంద సరస్వతీస్వామి మున్నగు వృద్ధులగు యతీశ్వరులు, మహాపండితులైన 'మహామహోపాధ్యాయ' ఆనందశరణ్‌, కాశీలోని శృంగేరి మఠం ఏజెంటు శ్రీ ప్రతాపం సీతారామశాస్త్రి మున్నగువారు కాశీపౌరుల పక్షాన కామకోటి పీఠాధిపతులను కాశీకి ఆహ్వానించుతూ ఆహ్వాన పత్రాన్ని పంపారు. శ్రీవారు చిదంబరలో విజయంచేసి వున్నపుడే బనారస్‌ హిందూయూనివర్సిటీలో 'మీమాంసా ప్రొఫెసర్‌'గా ఉన్న 'మహామహోపాధ్యాయ' శ్రీ చిన్నస్వామిశాస్త్రిగారు శ్రీవారి సమక్షంలో చదివారు.

 

ఆ ఆహ్వానపత్రములం దిట్లున్నది

శ్రీః

శ్రీశ్రీ 1008 శ్రీమద్భిః శ్రీ కంచికామకోటిపీఠ మలం కుర్వాణౖః శ్రీజగద్గురు శ్రీమత్పరమహంసపరివ్రాజక శ్రీమచ్ఛంకర భగవత్పాదాచార్యైః శ్రీమచ్ఛంద్రశేఖరేంద్ర సరస్వతీ సంయమీంద్ర శ్రీచరణౖ రచిరేణ మద్ర(మద్రాస్‌) న్వేషాం పద్భ్యామేవ శ్రీవారాణాసీక్షేత్ర మాజగమిషద్భిః నగరాత్‌ మార్గసౌకర్యాదికమవలోక్య ప్రతినివర్తితుమాజ్ఞప్తాః శ్రీమన్త స్స్వామినాధార్యాః తేషాం ఆజ్ఞాం శిరసి కృత్వాకాశీం ప్రాప్య శ్రీచంద్రమౌళీశ్వరప్రసాద దానేనా7త్రత్యానస్మా నన్వగృహ్ణన్‌. శ్రీ చంద్రమౌళీశ్వర ప్రసాదలాభేన శ్రీ మదాచార్య చరణానుగ్రహప్రాస్త్యా చాతీవకృతార్థావయ మమన్దా మానంద మనుభవామః | పరితుష్టమానసాశ్చ శ్రీమదాచార్య చరణాన్‌ ప్రార్థయామహే - శ్రీ చరణదర్శనతృషితా నత్రనస్మా కాశ్యా మచిరాదేవ దర్శనదానే నానుగ్రహీతుమ్‌||

ఏతేషా మాచార్యకైంకర్య ప్రయోజనానాం, శ్రీ స్వామినాథార్యాణాం, మార్గం సర్వ మనలోక్య పద్భ్యామేవ మద్రనగరం యావజ్జగమిషతాం, మధ్యేమార్గం, తత్తద్గ్రామనగరాదిషు, యధావత్‌, సౌకర్య లాభో7రోగతాపూర్వం గంతవ్యదేశ ప్రాప్తిశ్చ భూయా దితి భగవంతం విశ్వనియంతార మభ్యర్థయామహే ||

శ్రీ స్వామి స్వరూపానంద

మండలేశ్వర్‌, మృత్యుంజయాశ్రమ - కాశీ.

పం|| శ్రీ చిన్న స్వామిశాస్త్రీ - మీమాంసాకేసరీ

పూర్వమీమాంసా ప్రధానాధ్యాపకః, విశ్వవిద్యాలయం - కాశీ.

పం|| బాలబోధమిశ్రః వ్యా, న్యా, ఆచార్యః

గ| సా| మహావిద్యాలయాధ్యాపకః ||

పం|| పద్మప్రసాదభట్టరాయీ, న్యాయచార్యః

మార్వాడీ సంస్కృత కాలేజీ - కాశీ.

పం|| మార్తండశర్మ, వైదికంః

గో|| సం|| పా||

పం|| శ్రీ విద్యాధరమిశ్రః, వేదాచార్యః

ప్రిన్సిపాల్‌ - ధర్మవిజ్ఞాన కాలేజీ, హిందూ యూనివర్సిటీ-కాశీ.

పం|| బాలకృష్ణ మిశ్రః

కాశీహిందూ విశ్వవిద్యాలయ వేదాంత ప్రధానాధ్యాపకః

పం|| ప్రతాపం సీతారామశాస్త్రి

న్యాయాచార్యః - శృంగగిరి మఠః

పం|| లక్ష్మీనాథ ఝూ - వేదాంతాధ్యాపకః

విశ్వవిద్యాలయః కాశీ.

పం|| శ్రీమదన్న దాచరణశర్మా మహామహోపాధ్యాయః

మహామహోధ్యాపకః, సాంఖ్యయోగ ప్రధానాధ్యాపకః,

విశ్వవిద్యాలయం, కాశీ.

పం|| శ్రీశంకర తర్కరత్నః

ప్రధాన న్యాయశాస్త్రాభ్యాపకః మహామహోధ్యాపకః,

పండితరాజః. న్యాయకేసరీ, విశ్వవిద్యాలయః - కాశీ.

పం|| సీతారామజోషీ, ఎం.ఏ.

సాహిత్యశాస్త్రాచార్య, సంస్కృతసాహిత్య శాస్త్రేతిహాసాధ్యాపకః

పం|| చండీప్రసాద శుక్లః

ప్రధానాధ్యాపకః శ్రీగోయెంకా సం| మహావిద్యాలయ, కాశీ.

పం|| రామయశాస్త్రిపాఠీ

గోయంకా మహావిద్యాలయ వ్యాకరణాచార్యః కాశీ.

పం|| శుకదేవ .....

పం|| శ్రీతారావవరణ భట్టాచార్యః

సాహిత్యాధ్యాపకః, టీకమణీ సం|| కాలేజి.

పం|| గణపతిశాస్త్రి మొకాటే

వ్యాకరణాచార్యః, రాజకీయ సంస్కృత కాలేజి.

పం|| శ్రీనివాసశాస్త్రి - ఆయుర్వేదాచార్యః.

పం|| ద్రవిడ కాశీనాథశాస్త్రి - భజన మఠం.

పం|| రామప్రియ పాఠకం, సాహిత్యాచార్యః.

పం|| కల్యాణదత్త - జ్యోతిషాచార్యః.

రాజమందిరం - కాశీ - హాల్‌ మకాం - గయా.

పం|| సాక్షిలాల వాజపేయీ.

సహర్‌ బనారస్‌ - కటోరా.

పం|| మార్కండేయ ప్రసాదపాణ

కాశీజీ మహలారాజ మహాసంఘ.

పం|| స్వామిశాస్త్రి, హనుమాన్‌ఘాట్‌ - కాశీ,

పం|| కాశీవాసీ సుందరరాజశాస్త్రి,

హనుమాన్‌ఘాట్‌ - శ్రీకాశీ,

పం|| శ్రీకంఠశాస్త్రి, #9; నంజన్‌గూడు, మాజీ పాఠశాలాధ్యక్షః

పం|| ఋత్విక్‌ ..... సూర్యనారాయణశాస్త్రీ.

పం|| సభాపతి శర్వోపాధ్యాయః,

పం|| మదనమోహనశాస్త్రీ. మారవాడీ కాలేజీ, ప్రిన్సిపాల్‌.

పం|| శ్రీ సుబోధచంద్రదేవశర్మా, వకీల్‌, మ్యునిసిపల్‌ కమీషనర్‌.

పం|| రామ మదనోపాధ్యాయః,

వ్యాకరణాధ్యాపకః గం|| సం|| కాలేజీ.

పం|| సూర్యనారాయణ, న్యాయ వ్యాకరణాచార్యః,

న్యాయాధ్యాపకః, రాజకీయ సం|| కాలేజీ.

పం|| దేవకీనందనశాస్త్రీ, ప్రిన్సిపాల్‌, టీకమణి కాలేజీ.

----

శ్రీ కాశీ, దుర్గాఘాట్‌ శ్రీతారకమఠ

శ్రీ శంకరో జగద్గురు ర్విజయతేతరామ్‌||

విదిత మస్మాభిః -స్వస్తిశ్రీ మదఖిల భూమండలా లంకార - త్రయస్త్రింశత్కోటిదేవతా సేవిత శ్రీ కామాక్షీ దేవీసనాథ శ్రీమదేకామ్రనాథ శ్రీమహాదేవీసనాథ - శ్రీ హస్తి గిరినాథ సాక్షాత్కార పరమాధిష్ఠాన సత్యవ్రతనామాంకిత శ్రీ కాంచీదివ్యక్షేత్రే శ్రీ శారదామఠసుస్థితానాం, శ్రీ మత్పరమ హంసపరివ్రాజాకాచార్య వర్యాణాం యమనియమాసనాది యోగనిష్ఠానాం, వైదికమార్గప్రతిష్ఠాపకానాం, స్మృతివిహిత కలియుగీయ జగద్గురూణాం, శ్రీ శంకరభగవత్పాదాచార్య పరంపరాగత ప్రకృతికామకోటిపీఠాధిప శ్రీ 1008 శంకరాచార్యాణాం, శ్రీ చంద్రమౌళీశ్వరాది పీఠ దేవతాసహితవిజయ యాత్రాంశృత్వా వయమత్యంతంమోదామహే అచిరాదేవతద్ధర్శనాదిసౌభాగ్యం ప్రతీక్ష్యతే చ||

'శ్రీ మత్పరమహంస పరివ్రాట్‌'

శ్రీ బ్రహ్మానంద సరస్వతీస్వామి, పంచగంగేశ్వరమఠం -

కాశీ

'' పురుషోత్తమాశ్రమస్వామీ మహంత్‌,

శ్రీ రామతారకమఠం - కాశీ

'' సుప్రసిద్ధ శ్రీ తారకమఠ నిష్ఠకర్మందివరాణాం నమ్మతి

నహితం హస్తాక్షరమ్‌.

'' శ్రీ పూర్ణానందేంద్ర సరస్వతీ-శ్రీమఠం-కాశీ.

పం|| మహావీర ప్రసారమిశ్రః

తీర్థపురోహితః, కాశీతీర్థేశసభా.

స్వామి భగవతానంద మండలీశ్వరః,

శాస్త్రీ, కావ్య-సాంఖ్య-యోగ-న్యాయ-వేదాంత తీర్థః, వేదాంత

వాగీశః, కాశీదేవీ మఠః సప్తసాగరః కాశీ.

పం|| పార్థగౌరీ శంకరవేదపాఠీ.

లాహొరీటోలా, మారవాడీ భవనం, శ్రీమహంత్‌,

గో|| శివనాథపురీ అన్నపూర్ణా, కాశీ

పం|| మహావీర ప్రసాద త్రిపాఠీ

ప్రధానాధ్యక్షః, మందిర శ్రీవిశ్వనాధజీ, కాశీ.

పం|| పన్నాలాలజీ ఉపాధ్యాయ

కాశీతీర్థ పురోహిత, సకరకంద గలీ.

పం|| రామకుమారమిశ్ర, రామభవనం.

రామఘాట్‌.

(పై రెండు మూలపత్రముల ప్రతికృతులు - ప్రెసెఫ్టర్స్‌త ఆఫ్‌ అద్వైత 498-499 పుటల మధ్య ముద్రింపబడివున్నవి.)

వారణాసిలో సర్వప్రాతినిధ్యంగల సన్నాహక సంఘం ఒకటి ఏర్పడినది దానికి కాశీమహారాజు అధిపతిగా ఉన్నారు. పండిత మదన మోహనమాలవ్యా, మహామహోపాధ్యాయులు, సుప్రసిద్ధులునైన పండితులు ఇందు సభ్యులుగా ఉన్నారు. ఇంతకుపూర్వమే కాశీయాత్రకు నిర్ణయించుకున్న శ్రీవారి శుభాగమనంకోసం భారతదేశానికే అధ్యాత్మిక కేంద్రమైన కాశీ పౌరులు ఎదురుచూస్తున్నారు.

వెనుకటి ప్రభుత్వ మర్యాదను పాటించుతూ మదరాసు రాష్ట్ర ప్రభుత్వం, తన రాష్ట్రంలోను, ఇతర రాష్ట్రలలోను శ్రీవారి కాశీ యాత్రను వెల్లడించుతూ వారికి నెరపవలసిన గౌరవమర్యాదలను గూర్చి ఏర్పాట్లను ఉద్దేశించి నోటిఫికేషనును జారీచేసింది.

1933 సెప్టెంబరు రెండవవారంలో ప్రయాణం ఆరంభ##మైనది. రోజుకు ఇరవై మైళ్ల దూరం చొప్పున శ్రీవారు ఉత్తరయాత్రను ఆరంభించారు. కర్నూలులో విజయం చేసి ఉన్నపుడు శ్రీవారు దక్షిణ కైలాసంగా ప్రసిద్ధినందిన శ్రీశైల క్షేత్రాన్ని దర్శించాలని భావించారు. ఇచట శంకరుడు మల్లికార్జున లింగముగాను, పార్వతి భ్రమరాంబికగాను ఉంటారు. భారతదేశంలో సుప్రసిద్ధ ద్వాదశ జ్యోతిర్లింగములలో ఇది ఒకటి. ఇది భారతదేశంలోని పదునెనిమిది శక్తిపీఠాలలో ఒకటిగా కూడ మన్నింపబడుతోంది. అర్జున వృక్షం స్థలవృక్షంగా ఉంటోంది. (ఈ అర్జునవృక్షం స్థలవృక్షంగా గల క్షేత్రములు మరి రెండున్నవి. 1. తంజావూరు జిల్లాలోని తిరువిడైమరుదూరు. దీనినే మధ్యార్జునం అంటారు. 2. తిరునల్వేలి జిల్లాలోని 'తిరుప్పుడైమరుదూరు' దీనినే పూతార్జునం అంటారు.) శ్రీశైలంలోని తీర్థం పాతాళగంగ. (తిరుపతి కొండ పైన ఆకాశ గంగకు ఇది ప్రతిరూపము) ఆదిశంకరు లీమల్లికార్జునస్వామిని 'శివానందలహరి' అనే స్తోత్రరాజంలో స్తుతించారు.

మన శ్రీవారు ఈ స్తోత్రాన్ని పఠిస్తూ, ఇందులో ముఖ్యంగా 59వ శ్లోకాన్ని విశేషంగా భావిస్తూ బ్రహ్మానందపరవశులౌతూ ఉంటారు. ఈ శ్లోకమునకు అర్జునవృక్షపరంగాను, శివలింగపరంగాను రెండర్థములున్నవి.

సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిరస్థ్సానాంతరాధిష్ఠితం,

సప్రేమ భ్రమరాభిరామ మసకృత్సద్వాసనాశోభితమ్‌|

భోగీంద్రాభరణంసమస్తసుమనః పూజ్యం గుణావిష్కృతం,

సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితమ్‌ ||

దీని తాత్పర్యమిది : నేను శ్రీశైలంలోని మల్లికార్జున మహాలింగమును సేవింతును. (సుందరమైన పర్వతముమీది అర్జున వృక్షమును మల్లెతీగలు అల్లుకొని ఉండును) పార్వతీదేవిచే ఆలింగితమైన దీమహాలింగము. సంధ్యాసమయంలో ఈశ్వరుడు తాండవం చేస్తాడు. (ఆ సమయమునందే ఈవృక్షం పుష్పించుతుంది) ఈశ్వరతత్త్వము వేదముల శిరస్థానములైన ఉపనిషత్తులలో ప్రతిపాదితము. (దీని పుష్పములు శిరస్సులకు చెవులకు అలంకారములుగా ఉంటవి) ప్రేమతో కూడిన భ్రమరాంబిక తన ప్రక్కన ఉండుటచే ఈశ్వరుడు శోభిల్లుచుండును. (సమధికోత్సాహంతో తుమ్మెదలు చుట్టుచేరి ఉండటంచేత ఈ వృక్షం శోభిస్తూ ఉంటుంది) నిరంతరం సత్పురుషులు చేసే ధ్యానంవల్ల ఈశ్వరుడు ప్రకాశించుతూ ఉంటాడు. (వృక్షం ఎల్లప్పుడు సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటుంది) ఈశ్వరుడు భోగీంద్రుని ఆభరణంగా ధరించుతాడు. (భోగు లీవృక్ష పుష్పాలను అలంకరించుకొంటారు) దేవతలెల్లరు ఈశ్వరుని సేవిస్తూ ఉంటారు (అన్ని పూలచెట్లలోకెల్ల ఇది శ్రేష్టమైనది) ఈశ్వరుడు సద్గుణములను వెల్లడించుతూ ఉంటాడు. (ఉత్తమమైనదిగా ఈ వృక్షము ప్రసిద్ధినందినది)

శ్రీవారు కొద్దిపరివారాన్ని మాత్రం వెంటబెట్టుకొని పెద్దచెరువువరకు పడవమీద వెళ్ళారు. అక్కడనుండి పదకొండు మైళ్ళు కొండ మీదికి పాదచారులై వెళ్లారు. శివానందలహరిసౌందర్యలహరి స్తోత్ర రాజములను పఠిస్తూ దైవసన్నిధిలో ధ్యానమగ్నులై చాలాసేపు ఉన్నారు. కొలదిరోజులు శ్రీశైలంలో ఉండి మరల కర్నూలుకు వచ్చారు. దుర్గమారణ్య ప్రదేశ##మైన శ్రీశైల ప్రయాణంలో అచటి చెంచులు, కోయవారు, తదితర అటవికులు శ్రీవారికి సహాయ సహకారాలనందజేస్తూ రక్షకబృందంగా వారి వెంట ఉన్నారు. శ్రీవారు తమ మధ్యలో ఉండటం ఒక మహాప్రసాదంగా భావించారు.

తుంగభద్రానదిని దాటి శ్రీవారు హైదరాబాదు రాష్ట్రంలో ప్రవేశించారు. 12-2-1934న రాష్ట్ర రాజధానికి చేరికొన్నారు. రాష్ట్రప్రజలు, ముఖ్యమంత్రితో సహారాష్ట్రాధికారులు ఒకరివెంట ఒకరు జగద్గురువుల దర్శనభాగ్యాన్ని పొంది తమ పూజ్యాభావాన్ని వెల్లడించుకొన్నారు. నిజాం ఆదేశానుసారం రాష్ట్రప్రభుత్వం మఠముయొక్క ఒకరోజు వ్యయభారాన్ని భరించింది.

శ్రీవారు హైదరాబాదులో ఉన్న సమయంలో వారి నిత్య పూజా కార్యక్రమాదులకు తగిన ఏర్పాట్లన్నీ అచటి సనాతనధర్మ సభవారు నిర్వహించారు. నిత్యం ప్రసిద్ధ పండితులు విచ్చేస్తూ ఉండేవారు. ఈ సభా ప్రారంభోపన్యాసంలో శ్రీవారు ధర్మరక్షణావశ్యకతను గూర్చి, హిందువులు తాము నిర్వర్తింపవలసిన విధులను గూర్చి నొక్కి వక్కాణించారు. పండితులను విశేషంగా సమాదరించవలసిందిగా ప్రజలకుపదేశించారు.

హైదరాబాదు నుండి ఉత్తరయాత్ర మిక్కిలి కష్టసాధ్యమైనది. దుర్గమారణ్య ప్రాంతము లవి. శ్రీవారి యాత్రలో ఉన్న బండ్లు, గోవులు, పరిచారకులు వీటిల్లో ఎక్కువగా ఇచ్చటనే విడిచి పెట్టారు. వీరందరు నాలుగు సంవత్సరాలకు ఆంధ్ర ప్రాంతంలో శ్రీవారి పరివారాన్ని మరల కలసికొన్నారు. 24-4-1934 న సికిందరాబాదు నుండి బయలుదేరారు. మే 5 వ తేదీకి గోదావరీనదీ తీరానగల 'సొన్న'కు చేరారు. ఆ పుణ్యనదీ స్నానం చేశారు.

భారతదేశంలో భాగమై మధ్యపరగాణలని పిలువబడే ప్రాంతంలోకి ఇంక వెళ్ళవలసి ఉన్నది. ఆ మే నెల్లో గోదావరీ తీరాన బెండల్వాడలో శంకరజయంతి మహోత్సవాన్ని జరిపారు. జూన్‌నెలలో నాగపూరులో కొలదిరోజులు గడిపారు. వింధ్యపర్వతావళి గుండా ప్రయాణం చేశారు. మండువేసవిలో నిర్జల ప్రదేశాల్లో ఈ ప్రయాణం దుస్సాధ్యమైనది. ప్రయాణంలో వుండే పరివారం అందరు ధైర్యంతో కష్టసహమైన కార్యాన్ని ఎదుర్కొంటూ వుల్లాసంతో ముందుకుసాగారు. శ్రీవారి కాశీయాత్రా ధ్యేయాన్ని సఫలం చెయ్యటమే వారి ప్రధానలక్ష్యం. 3-7-34 నాటికి శ్రీవారు వింధ్యనుదాటి జబల్‌పూరు చేరుకొన్నారు. నర్మదా నదీ పావనజలాల్లో పవిత్రస్నానం చేశారు. అచటినుండి ప్రయాణాన్ని వేగంగా కొనసాగించుకొంటూ 23-7-1934 న శ్రీవారు ప్రయాగ (అలహాబాద) క్షేత్రానికి విజయం చేశారు. ఈ పట్టణసీమ ప్రాంతంలోనే 'మహామహోపాధ్యాయ' గంగాధర ఝా ఆధిపత్యాన శ్రీవారికి మంగళవాద్య పూర్ణ కుంభాది మర్యాదలతో స్వాగతమీయ బడినది. వేలాది ప్రజలు బారులుతీరి 'గురుమహారాజ్‌కి జై' అంటూ విజయనినాదములను చేశారు.

శ్రీవారు రామేశ్వరమునుండి తెచ్చిన పవిత్రసైకతమును 25-7-1934 న పావన త్రివేణీసంగమంలో సమర్పించారు. గంగా యమునా నదులు - అంతర్వాహినిగా సరస్వతీ నదుల కిది సంగమ ప్రదేశం. ఇందలి పవిత్ర జలాలను కుంభములలోకి నింపింపజేశారు. దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలకు పంపారు. భారతదేశము యొక్క అధ్యాత్మిక, భౌగోళిక సమైక్యతకు ఈ పుణ్యకార్యము లే విధంగా చిహ్నములో సంప్రదాయాన్ని, ఆచారాన్ని ప్రజలకు తెలియటం కోసం శ్రీవారిలా ఆచరించారు. ఆచార్య పదసార్థకతకు అనుగుణంగా స్వయంగా ఆచరించి శిష్యశిక్షచేసిన జగద్గురువులు శ్రీవారు. జూలై 26వ తేదీన శ్రీవారు చాతుర్మాస్యవ్రతాన్ని ప్రయాగలో ఆరంభించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని భక్తులు వ్యాసపూజోత్సవానికి విచ్చేశారు. ఈ చాతుర్మాస్మ సమయంలోనే శ్రీవారి సమక్షంలో పండిత సదస్సు జరిగింది. ఉత్తర భారతంలోని మహాపండితు లనేకులు ఈ సదస్సులో పాల్గొని శ్రీవారి ఆశీస్సుల నందుకొన్నారు.

ప్రయాగ (అలహాబాద) నుండి కాశీకి ఎనభైమైళ్లదూరం వుంటుంది. శ్రీవారు పాదచారులై పయనించారు. పరమపవిత్రమైన కాశీక్షేత్రానికి 6-10-1934 న శ్రీవారు విజయంచేశారు. కాశీమహారాజు పండిత మదనమోహన మాలవ్యా మున్నగువారి అధిపత్యాన వేలాది ప్రజలు శ్రీవారికి సత్కారములను సమర్పించటానికి వచ్చారు. ఆనాడు జరిగిన నగర ప్రవేశోత్సవంలో సుమారొక లక్షమంది ప్రజలు పాల్గొన్నారు. ఉచ్చైస్వరంతో 'గురుమహారాజ్‌కి జై' అంటూ విజయధ్వానాలు చేశారు. శ్రీవారి విజయాత్రోల్లసితమైన ఆ ప్రజావాహిని కాశీక్షేత్ర చరిత్రలో ప్రధానమైనది. 8-10-34 నాటి 'పండిత' అనే హిందీవార్తా పత్రికలో ఈ వుత్సవ విశేషాలన్నీ చక్కగా వివరించబడినది. అందు ఆ వుత్సవంలో పాల్గొన్న ప్రజల ఆనందోత్సాహాలకు మేరలేదని ఆ పుణ్యక్షేత్రంలో అసంఖ్యాక ప్రజాసందోహంలో సర్వసంగపరిత్యాగులైన శ్రీవారి దేదీప్యమాన దివ్యజోవిరాజిత ముఖవర్చస్సుతో కూడిన కాశీక్షేత్రచరిత్ర ఆనాటి ప్రజల స్మృతిపథంలో హత్తుకుపోయిందని వివరించుతూ అనేకాంశాలను పేర్కొనటం జరిగింది.

కాశీక్షేత్రం సప్త మోక్షపురులలో ఒకటి. విశాలాక్షి విశ్వేశ్వరులిచట ప్రధాన దైవములు. పావనగంగానది ఇచట ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ఇచట అర్థచంద్రాకృతిలో వుంటుంది. మహాపండితులకు, సిద్ధులకు నివాసస్థానమిది ఈ క్షేత్రానికి వారణాసి అనే పేరుకూడ వున్నది. వారణ-అసి అనే రెండు ఉపనదులు మధ్యలో ఉండటమే అందుకు కారణం. ఈ క్షేత్రంలో మణికర్ణికా ఘట్టానికి సమీపంలో శ్రీ ఆదిశంకరులు తమ భాష్య గ్రంథ రచన చేశారు. ఈ కాశీక్షేత్రమే వారిని జగద్గురువులని లోకానికి వెల్లడించింది. ఇచట నుండియే వారు దిగ్విజయ యాత్రను ఆరంభించారు. అలాగే మన శ్రీవారి కాశీయాత్రకుకూడ విశేష ప్రాముఖ్యం ఉన్నది. శ్రీవా రచటకు విజయం చేసిన రోజుననే అచటి అన్నపూర్ణా విశ్వేశ్వరులను దర్శించుకొన్నారు. అక్టోబరు 7వ తేదీన శ్రీవారు గంగా స్నానంచేసి మణికర్ణి కా ఘట్టంలోని ఈశ్వరాలయంలోనే శ్రీచంద్రమౌళీశ్వర పూజను నిర్వర్తించారు. అక్టోబరు 9 నుండి నవరాత్ర్యుత్సవములను నిర్వహించారు, విజయదశమి రోజున గంగానదికి ఆవలిఒడ్డున ఉన్న దక్షిణామూర్తి మఠాన్ని దర్శించారు. 9-2-1935న పండిత మదనమోహన మాలవ్యా ప్రార్థన నంగీకరించి హిందూ విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. శ్రీ మాలవ్యా సంస్కృతంలో ఐదు శ్లోకాలను రచించి స్వాగత పురస్సరంగా సమర్పించారు. వాటిల్లో ఇదొక శ్లోకం :

యద్వాచాంబసితైస్త్రీలోక, జనతామోహాంధకార క్షయః,

పాదబ్జ్మరణన యస్య, కలుష్యధ్వంసాత్‌ ప్రసాదఃస్థిరః|

తస్యాద్వైతగిరాం గురో, ర్భగవతః శ్రీ శంకరస్యోన్నతం,

కాంచీపీఠపదం యతీశ్వర, మహన్‌స్థానే త్వయాధిష్ఠితమ్‌||

కాంచీ క్షేత్రమునందు ఆది శంకరు లధిష్ఠించిన పీఠాధిపతులైన శ్రీవారిని- సమావిష్ణులైన సభాసదుల నాశీస్సులతో అనుగ్రహింపవలసినదిగా ప్రార్థించారు. అచటి విద్యార్థులను ఉపాధ్యాయులను ఉద్దేశించి శ్రీవారు సంస్కృతంలో మృదుమధురంగా ఉపన్యసించారు. అందులో శ్రీవా రిలా వివరించారు. ''విద్యమనశ్శాంతికి కారణం కావాలి. జ్ఞానార్జనం చేసికొంటూ మర్త్యభావాన్ని అధిగమించగలగాలి. శ్రీమాలవ్యా విశేషసాధనతో ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఇచటి విద్యా ప్రణాళిక ప్రధానంగా ఆస్తిక్యంగల విద్యాభ్యాసాన్ని బుద్ధియం దిడుకొని రచింపబడాలి. ఆలోచనలలోను, ఆచరణలోను ఆదర్శప్రాయమైన జీవనం చెయ్యగలిగి పామరులుకూడా తమననుకరించేటట్టు చేసికోగల నాయకులుగా విద్యార్థులను తీర్చిదిద్దవలెనని నా ఆశయం.'' పండిత మదనమోహన మాలవ్యా తుదిలో ఇలా అన్నారు. ''ఆదిశంకరులు కాశీక్షేత్రానికి విచ్చేశారని విశ్వశ్రేయః ప్రదములయిన మహాకార్యాలను నిర్వహించారని మనకు తెలుసు. ఈనాడు మనం కన్నులారా కాశీలో శ్రీ ఆదిశంకరావతారులయిన శ్రీవారిని దర్శించు కొంటున్నాము. ఇది మనకొక అసాధారణమయిన అనుభవం.''

కాశీపౌరులు 9-31935న కాశీటౌన్‌ హాలులో శ్రీవారియెడ తమ పూజ్యభావాన్ని వ్యక్తం చేసికోవటంకోసం మహాసభను ఏర్పాటుచేశారు. శ్రీవారి కాశీయాత్రను వేనోళ్ళ స్తుతిస్తూ వివిధభాషల్లో స్వాగత పత్రాలను పలువురు పండితులు సమర్పించారు. శ్రీవా రుపన్యసించుచూ ఆదిశంకరుల అడుగుజాడల్లోనే తామీయాత్రను తలపెట్టామని, కాశీపౌరుల నిరవధికోత్సాహానికి తాముసంతోషించామని - కాశీవిశాలాక్షి అన్నపూర్ణా విశ్వేశ్వరుల అనుగ్రహం వలన ప్రపంచంఅంతా సన్మార్గంలో పురోగమించాలని చెప్పారు.

9-3-1935 కాశీలోని మహా పండితుల, దండి సన్న్యాసుల మహాసభ జరిగింది. కలకత్తాలోకూడ అలాంటి మహాసభ అతివృద్ధులయిన 'మహామహోపాధ్యాయ' శ్రీ కమలనాయ తర్కరత్నగారి ఆధిపత్యాన జరుపబడినది. ఇచట 130 మంది మహాపండితులిందు పాల్గొన్నారు. ఈ సభవారు తమ ప్రతినిధిగా శ్రీమహామహోపాధ్యాయ దుర్గాశరణ్‌గారిని, శ్రీవారిని కలకత్తా విజయయాత్రకై ఆహ్వానించటం కోసం కాశీకి పంపించారు. కంచికామకోటిపీఠ ఔన్నత్యం. పౌరాతన్యాన్ని తాము నిశ్చింతగా వెల్లడించిన అంశాన్ని కూడ శ్రీవారికి నివేదించవలసిందిగా వా రా పండితుని కోరారు.

శ్రీవారు 18-3-1935న కాశీనుండి బయలుదేరి ఏప్రిల్‌ 24 కి పాటలీపుత్రాని (పాట్నా)కి విజయంచేశారు. 27-4-1935న ఇచటి స్థానిక ఆంగ్ల దినపత్రికయైన ''ది సెర్చిలైట్‌'' లో ఇలా వ్రాయబడినది.

''జగద్గురువులయిన శ్రీకామకోటిపీఠ శంకరాచార్యుల వారికి బీహార్‌ ఘనమైన హార్థికమైన స్వాగతాన్ని సమర్పించింది ఉన్నతమైన గౌరవ సంప్రదాయపరంపరకు చెందిన శ్రీ స్వామివారు యావద్భారత దేశంలోని హిందువులకు పూజ్యస్థానంలో ఉన్నారు. వారు మన మధ్యలోకి విజయం చెయ్యటం మనకొక అపూర్వమయిన అవకాశం. శ్రీవారి స్థిరమైన తపఃఫలంగా వారుచేసే ఉపదేశం శ్రోతృహృదయాల్లో స్థిరమైనముద్రగా నిలచిపోతుంది'' శ్రీవారు పాట్నాలో శంకరజయంతి మహోత్సవాన్ని జరిపి అచటి ప్రజల నాశీర్వదించారు. శ్రీవారు జరిపిన పూజా కార్యక్రమాల్లోను. సభల్లోను ప్రజలు విశేష శ్రద్ధాభక్తులతో పాల్గొన్నారు.

తరువాత శ్రీవారు దర్శించిన స్థలాలలో ప్రధానమైనది గయం, 20-5-1935న అచటికి వెళ్ళి శ్రీవారు ఫల్గునీ నదిలో స్నానంచేసి శ్రీ విష్ణుపాద దర్శనం చేసుకొన్నారు. మే 25న బుద్ధగయకు వెళ్లారు. బోధి వృక్షాన్ని దర్శించారు. అచటి బుద్ధుని ఆలయాన్ని చూచారు. అచట పెద్ద బుద్ధ విగ్రహానికి ముందు క్రిందుగా పల్లంగావున్న భూప్రదేశంలో చిన్న శివలింగం ఉన్నది. ఇది శ్రీ ఆదిశంకర భగవత్పాదులచే ప్రతిష్ఠింపబడినట్లు చెప్పబడుతోంది. డియోగర్‌ (విద్యానాథ క్షేత్రం) బీహార్‌లోని గొప్ప పుణ్యస్థలం. శ్రీవా రచటకు వెళ్లారు. అచటి ఆలయంలో గిరిజాదేవీ-స్వయంభూ లింగమూర్తులకభిముఖులై ఎక్కువసేపు ధ్యాననిష్ఠతో నిలబడ్డారు.

13-7-1935న కలకత్తాకు విజయం చేశారు. ఇంత వరకు మార్గంలో కొద్ది మకాములు మాత్రమే చేశారు. ఈ మహానగరంలో శ్రీవారికి ఘనమైన స్వాగత మీయబడినది. జూలై 17 నుండి కాశీఘాట్‌లో శ్రీవారు చాతుర్మాస్యాన్ని నిర్వర్తించారు. కాళికాలయ సంఘ పక్షాన శ్రీ వారికి స్వాగత పత్రం సమర్పింపబడినది దాన్ని ''దర్శన సాగర'' శ్రీ గురుపాద శర్మ చదువుతూ ఇలా వివరించారు.

''ఆదిశంకరులు భారతదేశంలో వివిధ ప్రాంతాలలో మఠాలను స్థాపించి తుదకు కాంచీ క్షేత్రానికి విజయం చేసి అచట మఠాన్ని స్థాపించుకొన్నారు. వారి అడుగుజాడల్లోనే శ్రీవారు ప్రకృతం ఈ మహా విజయ యాత్రను నెరపుతున్నారు. తమ విజయ యాత్రను మహాకాళీ శ్రీ పరమేశ్వరుల దివ్యానుగ్రహం వల్ల పూర్తి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము''

శ్రీవారందుకు సమాధానంగా అచటివారు తమను ఆదిశంకరుల ప్రతినిధిగా వివరించుతూ చూపిన పుణ్య భావాన్ని అంగీకరించుతూ, సదస్సులోని వారినందరను ఆశీర్వదించారు. సెప్టెంబరు 23వ తేదీన బెంగాల్‌ బ్రాహ్మణ మహాసభా పక్షాన స్వాగత పత్రం శ్రీవారికి సమర్పింపబడినది. దానిని మహా విద్వాంసులైన పంచానస తర్కరత్న (మహా మహోపాధ్యాయ బిరుదాన్ని కూడ త్యజించిన ధర్మనిష్ఠులు) మహాశయులు శ్రీవారి సమక్షంలో చదివారు. అందులో శ్రీవారు కలకత్తాకు దయతో విజయంచేసి అనుగ్రహించారని ప్రజలను ధర్మ నిష్ఠులనుగా తీర్చుదిద్దుతున్నారని పేర్కొన్నారు. మరియు కామకోటి పీఠాధిపతుల యోగపట్టమైన 'ఇంద్ర సరస్వతీ' యొక్క విశేషమును వివరిస్తూ ఆదిశంకరుల అడుగుజాడలలో శ్రీవారు చేస్తున్న విజయ యాత్రను బహుథా ప్రస్తుతించారు.

నవరాత్రి లేక దసరా ఉత్సవాలను బెంగాల్‌లో పూజా ఉత్సవాలని అంటారు. వారికి పర్వం చాలా ప్రధానమైనది. శ్రీవారు కలకత్తాలో సెప్టెంబర్‌-అక్టోబర్‌ మాసాల్లో వచ్చిన నవరాత్రి ఉత్సవాలను నిర్వర్తించారు. ఆ ఉత్సవ విశేషాలను దర్శించిన వేలాది ప్రజల మనస్సులు దివ్యోత్తేజంతో పొంగి పొరలాయి. మరల అక్టోబర్‌ మూడవ వారంలో విజయ యాత్ర ఆరంభ##మైనది. ఆది గంగలో కలిసే దామోదర రూపనారాయణ నదులపై స్టీమరులో ప్రయాణం చేశారు. 27-10-13 నాటికి అచటి స్థానికులయిన పౌరుల ప్రార్థన నంగీకరించి మిడ్నపూర్‌కు విజయం చేశారు. అపుడు మిడ్నపూర్‌ జాతీయ విప్లవోద్యమానికి కేంద్రంగా ఉన్నది. అనేక మంది యువకులు ముఖ్యంగా కళాశాల విద్యార్థులు అచట 'డిటిన్యూలు'గా ఉన్నారు. పట్టణంలో 'కర్‌ఫ్యూ' అమలు జరుపబడి ఉన్నది. (ఈ అంశం ఈ గ్రంథంలోనే 142, 143 పుటల్లో వివరింపబడి ఉన్నది)

మిడ్నపూర్‌ నుండి, ప్రసిద్ధమయిన రైల్వేవర్కుషాపు ఉన్న ఖరగ్‌పూర్‌ . ఉక్కు-ఇనుము నగరంగా ప్రసిద్ధమైన 'తాతానగర్‌'కు వెళ్ళారు.

బీహార్‌లోని స్థానిక జమీందారీలు శ్రీవారి ననుగమించినవి. కెయోంజర్‌ ఘర్‌లోని ధరణీదేవి ఆలయాన్ని శ్రీవారు దర్శించారు. అచటి సంస్థానంలో రికార్డుల ప్రకారం ఈ ధరణీదేవి విగ్రహం గోవింద భంజదేవ్‌ అనేవారు కంచినుండి అచటకు తీసికొని వచ్చినట్లున్నది. మయూరభంజ్‌ సంస్థానంలో దాని ప్రధాన నగరమయిన 'చారిపాడా' లో 'వారణశ్వర' ఆలయంలో మహాలింగమూర్తిని దర్శించుకొన్నారు. రాజ్‌ నిల్‌గిరి సంస్థానంలోని 'సుజనాగడ్‌'లో శ్రీ చండీదేవి ఆలయం ఉంది. ఇచట అమ్మవారు సింహవాహనగా కాక వరాహవాహనగా ఉంటుంది. శ్రీవారు ఆ ఆలయానికి వెళ్ళి అచట నాలుగురోజులున్నారు.

4-4-1936 నాటికి ఒరిస్సా ప్రాంతంలోని కటక్‌ జిల్లాలో ఉన్న 'తాజ్‌ పూర్‌'కు విజయం చేశారు. జాజ్‌ పూర్‌ ప్రాచీనమైన పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. పదునెనిమిది శక్తి పీఠాలలో ఒకటియైనది 'విరాజా పీఠం' ఈ పవిత్ర క్షేత్రాన్ని గూర్చి మహాభారతంలో వివరింపబడి ఉన్నది. ఇచట 'వైతరణి' అనే నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రధానములైనవి పండ్రెండు దేవాలయములున్నవి. చిన్న చిన్నవి ఇంకా అనేక దేవళాలు కూడ ఉన్నవి. ప్రతి ఆలయం ప్రాచీన శిల్ప కళా నైపుణికి చక్కని ఉదాహరణముగా శోభిల్లుతూ ఆశ్చర్యజనకంగా ఉంటుంది. అప్పటికి రెండువందల సంవత్సరాలకు పూర్వం ఈ పట్టణంలో నూరుమంది సోమయాజులు ఉండేవారు. (యజ్ఞ దీక్షితులు) అందువల్ల దీనికి జాజిపురం (యాజి పురము) అనే పేరు కలిగింది. చారిత్రక ప్రసిద్ధిగల ఈ పట్టణంలో శ్రీవారు ఐదు రోజులున్నారు. తరువాత జిల్లాకు ప్రధాన కేంద్రమైన 'కటక్‌' చేరుకొన్నారు. అక్కడ ఆ సంవత్సరం శంకర జయంతిని జరిపారు. 3-5-1936 సాక్షిగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించుకొన్నారు. ఒరిస్సాలో ఇప్పటికి ఈ ఆలయాన్ని గూర్చి ఒక ఐతిహ్యం ఉన్నది. ఇరువురు బ్రాహ్మణులు తైర్థికులుగా కంచి నుండి కాశీ క్షేత్రానికి వెళ్ళారు. ఇందులో ఒకరు వృద్ధులు, మరియొకరు యువకులు. ఈ వృద్ధుడు కాశీ నుండి తిరిగి కంచికి వచ్చిన తరువాత తన కుమార్తెను ఈ యువకునకిచ్చి వివాహం చెయ్యటానికి వాగ్ధానం చేశాడు. ఈ వాగ్ధానం మధురలోని గోపాలస్వామి ఆలయంలో జరిగింది. కాని ఆ వృద్ధుడు ఏమైతేనేమి తన వాగ్ధానాన్ని చెల్లించుకోలేదు. ఈ యువకుడు రాజు వద్దకు ఈ అభియోగాన్ని తీసికొని వెళ్ళాడు. ఇందుకు సాక్ష్యం ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించారు. ఆ యువకుడు మధురలోని గోపాలస్వామి తన సాక్షి అని చెప్పాడు. వెంటనే అతడు మధురకు వెళ్ళి గోపాలస్వామిని తీసికొనివచ్చాడు. కాని గోపాలస్వామి అతని వెంట వస్తున్నపుడు ఆ యువకుడు వెనుకకు తిరిగి చూడకూడదని ఒడంబడిక జరిగింది. కాని ఆ యువకుడు కాంచీ నగరం సరిహద్దులలో పై నియమాన్ని ఉల్లంఘించాడు. గోపాలస్వామి అచటనే విగ్రహరూపాన్ని పొందటం జరిగింది. తరువాత పూరీ మహారాజు ఆ సాక్షి గోపాల విగ్రహాన్ని కంచినుండి ఇచటకు తీసికొనివచ్చారట.

ఈ సాక్షి గోపాలస్వామిని దర్శించుకొని శ్రీవారు పూరీ జగన్నాథ క్షేత్రానికి విజయం చేశారు. మహా వైభవంతో నగర ప్రవేశోత్సవం జరిగింది. 'గోవర్ధన మఠం'లో శ్రీవారికి స్వాగత సత్కారములు సమర్పింపబడినవి. పూరీ పట్టణంలోని ఇతర అద్వైత మఠములైన శంకరానంద మఠం, శివతీర్థమఠం, గోపాల తీర్థ మఠం వీనికి సంబంధించిన వారుకూడ పై కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీవారు శ్రీవారికి అచట తగిన ఏర్పాట్లు మున్నగు కార్యక్రమంలో వీరు విశేషంగా సహకరించారు. శ్రీవారు జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించారు. అచటి 'ముక్తి మంటప మహాసభా' సభ్యులైన మహాపండితుల ప్రార్థన నంగీకరించి శ్రీవాచట ముక్తిమంటపంలోని పీఠాన్నధిష్ఠించారు. సభాసమావిష్టుల నాశీస్సులతో అనుగ్రహించారు. శ్రీవారచట సంస్కృతంలో ఉపన్యసించారు. అందులో తమకు జరిగిన ఈ గౌరవం, ఆదిశంకరులకు చెందుతుందని వివరించారు. అంతేకాక ఆదిశంకరులు సమస్త దుర్మతాలను ఖండించి సర్వోత్కృష్టమైనసత్యాన్ని ప్రతిష్ఠించటంచేత, ఆమతాలు రూపుమాసి పోయినవి, వారి పవిత్రపాదుకల నీనాడు ఎల్లరు భక్తిశ్రద్ధలతో పూజించుతున్నారని విశదీకరించారు. 6-5-1936న పూరీలో మహాదధిలో (తూర్పు సముద్రం) పవిత్ర పూర్ణిమాపర్వాన స్నానంచేశారు. శ్రీవారు 9వ తేదీన పండితుల మహాసభను ప్రారంభించారు. అందులోని వృద్ధులైన మహాపండితు లనేకమంది తాముపూర్వం యాభైసంవత్సరాల క్రిందట కామకోటి పీఠాధిపతులైన 64వ ఆచార్యులు శ్రీమహాదేవేంద్ర సరస్వతీ స్వామివారు అచటకు విచ్చేసిన విశేషాలను వివరించారు. మరల ఆ పీఠాధిపతుల పరంపరలోని 68వ ఆచార్యులను తమమధ్యలో దర్శించుకొనే మహాభాగ్యం లభించినదని, ఇది అపూర్వమైన అంశమని వారు వివరించారు.

చిల్కసముద్రం (సరస్సు) గుండా ప్రయాణం చెయ్యటం మిక్కిలి దుస్సహమైన అంశం. ఉన్నతములగు పర్వతావళులు, సాంద్రారణ్యములు, ఇసుక ఎడారులు దాటుతూ పయనించాలి. శ్రీవారు పరివారంతోసహా రోజుకు 25 మైళ్ళ చొప్పున ప్రయాణించారు. 17-5-1936 నాటికి చత్రపూరుకు విజయం చేశారు. ఇది సముద్రతీరాన చిల్కసరస్సుకు దక్షిణతీరంలో ఉన్నది. ఇచట ఆదిశంకరుల ఆలయం ఉన్నది. జూలై 4న ప్రారంభ##మైన 'చాతుర్మాస్యం' బరహం పూరులో జరిపారు. బరహంపూరు నుండి 'శ్రీకూర్మం'వెళ్లి అచట శ్రీ కూర్మనాథుని సేవించుకొన్నారు. అక్టోబరులో నవరాత్ర్యుత్సవములను విజయనగరంలో నిర్వర్తించారు. అక్టోబరు 31న విశేష జనసందోహంగల మహాసభలో ఇచట శ్రీవారు అద్వైతాన్ని గూర్చి ప్రసంగించారు. అందులో హరిహరాభేదాన్ని స్పష్టం చేశారు. సమర్థ రామదాసువంటి యోగులు హరిహరాద్వైత మార్గాన్ని అనుసరించి ముక్తులైనట్లు స్పష్టం చేశారు. జ్ఞానమార్గాన్ని అనుష్ఠించువారు' జీవబ్రహ్మద్వైతసిద్ధి'ని పొందుతారని, జ్ఞానోపాసకుల గమ్యం ఒక్కటేనని వివరించారు.

శ్రీ విద్యానగర (విజయనగర) సంస్థానస్థితి వేదవిజ్ఞాన వర్థనీ సభా ప్రతినిధులైన 'మహామహోపాధ్యాయ' శ్రీతాతా సుబ్బరాయశాస్త్రి గారు 'న్యాయరత్న' శ్రీ పేరి లక్ష్మీ నారాయణశాస్త్రి ప్రభృతి మతత్రయ ప్రముఖులు అక్టోబరు 10న శ్రీవారికి స్వాగత పత్రికను సమర్పించారు. ఇచట శ్రీవారు వైదిక మతము'ను గూర్చి ఉపన్యసించారు. అక్టోబరు 30వ తేదీ మహారాజావారి ఆంగ్లకళాశాలలో ఉపన్యసించారు.

విజయనగరంలో శ్రీవారు నెరపిన నవరాత్ర్యుత్సవ సందర్భంలో విజయదశమినాడు పండితగోష్ఠిని జరిపించారు. అందు శ్రీతాతా సుబ్బారాయ శాస్త్రిగారికి 'శాస్త్రరత్నాకర' బిరుదాన్ని శాలువలను ప్రసాదించారు.

తరువాత గోస్తనీనదిలో స్నానంచేసి శ్రీ నృసింహస్వామిని దర్శించారు.

ఆంధ్రప్రాంతంలో సింహాచలం సుప్రసిద్ధమైన ప్రాచీన పుణ్యక్షేత్రం. ప్రకృతి రామణీయకతగల పర్వతంపైన శ్రీవరాహనృసింహస్వామి ఆలయం ఉన్నది. 4-11-1936న శ్రీవారీ క్షేత్రాన్ని దర్శించారు. ఇచట కొండపైన గంగాధారా జలపాతంవద్ద ధ్యానమగ్నులై కొంత సేపు ఉన్నారు. అచటనుండి మూడురోజులు తరువాత శ్రీవారు విశాఖపట్టణానికి విజయం చేశారు. కశింకోట, చోడవరం, అనకాపల్లి గ్రామాలకు వెళ్లారు. శ్రీవారు యలమంచలి గ్రామంలో విజయంచేసి ఉన్నపుడు సుప్రసిద్ధ కాశీపండితులు ద్రవిడ శ్రీ రాజేశ్వరశాస్త్రిగారు శ్రీవారిని దర్శించి వెళ్ళారు. తరువాత తుని నుండి పీఠాపురం వెళ్లి 'పాదగయ'లో స్నానంచేసి శ్రీ కుక్కుటేశ్వరుని దర్శించుకొన్నారు. సుప్రసిద్ధ పండితులు శ్రీవడలి లక్ష్మీనారాయణ శాస్త్రిగారు, శ్రీశ్రీపాద లక్ష్మీనృసింహశాస్త్రి ప్రభృతులు విద్వత్సభలను నిర్వహించారు. శ్రీవారు పండితులను ఆశీఃపూర్వకంగా బహూకరించారు. కాకినాడలో నెలరోజులున్నారు. దక్షారామం వెళ్ళి అచట భీమేశ్వర స్వామిని దర్శించుకొన్నారు. కోటిపల్లి, ముక్తీశ్వరంగుండా కోనసీమకు విజయం చేశారు. తరువాత పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో శ్రీవారు వ్యాసపూజను జరిపి చాతుర్మాస్యాన్ని నిర్వర్తించారు. శ్రీపుల్య ఉమా మహేశ్వరశాస్త్రిగారు స్థానికుల సహకారంతో శ్రీవారిచట చతుర్మాస్యాన్ని జరపటానికి కృషిచేశారు. శ్రీ శాస్త్రిగారు ఈ సందర్భంలోనే శ్రీవారి సన్నిధిలో బ్రహ్మసూత్ర శాంకరభాష్యశాంతి జరుపుకొన్నారు. శ్రీవారు వీరికి 'విద్వత్కవిరత్న' బిరుదాన్ని ప్రసాదించారు. ఇచట నుండి రాజమహేంద్రవరం వెళ్ళి నాలుగు మాసాలున్నారు. పాపికొండలకు వెళ్లి వచ్చారు. ఆ సమయంలోనే వచ్చిన మహోదయ పుణ్యకాలానికి మరల కాకినాడ వెళ్లి 31-1-1938న సముద్రస్నానం చేశారు. తరువాత 'భీమవరం'లో శంకరజయంతి మహోత్సవాన్ని జరిపారు.

తరువాత క్రమంగా విజయవాడకు విజయం చేశారు. ఇచట కృష్ణానదిలో స్నానంచేసి కనకదుర్గాదేవిని దర్శించుకొని వారంరోజులున్నారు.

1938లో చాతుర్మాస్యాన్ని గుంటూరులో జరిపారు. ఇచట నిత్యం విద్యత్సభ జరిగేది. ఈ సమయంలోనే సుప్రసిద్ధ వ్యాకరణ పండితులు శ్రీపుల్య ఉమామహేశ్వరశాస్త్రిగారు 117 శ్లోకాలుగల 'శ్రీ చంద్రశేఖర విజయ మహారత్నహారం' అనే స్తుతికావ్యాన్ని రచించి శ్రీవారికి సమర్పించారు. ఇటనుండి మార్కాపురంవెళ్లి అక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వర్తించారు. 1938 నవంబరు నుండి 1939 జనవరి వరకు మూడుమాసాలు శ్రీవారు నెల్లూరులో విజయం చేసి ఉన్నారు. వెంకటగిరి మీదుగా శ్రీకాళహస్తికి వెళ్లి మరల తిరుపతి క్షేత్రానికి విజయం చేశారు. 1939 ఏప్రిల్‌లో శంకర జయంతి మహోత్సవాలు 'బుగ్గ'లో నిర్వర్తించారు. తిరుత్తనిలో కొండపైన వేంచేసిఉన్న శ్రీసుబ్రహ్మణ్యశ్వర స్వామిని దర్శించుకొని 2-5-1939న కాంచీక్షేత్రానికి విజయం చేశారు.

కంచినుండి చిదంబరం మీదుగా రామేశ్వరక్షేత్రానికి వెళ్లారు. 1922 సెప్టెంబరులో శ్రీవా రిచట గ్రహించిన సైకతాన్ని 25-7-1934న అలహాబాదలోని పావన త్రివేణీ సంగమ ప్రవాహంలో కలిపారు. మరల ఆ త్రివేణీసంగమ ప్రవాహంలో స్వీకరించిన పవిత్రజలాలతో ఇచట శ్రీ రామనాథస్వామికి అభిషేకం చెయ్యాలి. 10-6-1939న శ్రీవారు 'అగ్నితీర్థం'లో స్నానంచేసి రామనాథస్వామి ఆలయానికివెళ్లి త్రివేణీ సంగమంనుండి తెచ్చిన పవిత్రతోయములతో అచటి స్వామికి అభిషేకం చేశారు. ఇంతలో శ్రీవారి గంగాయాత్ర పూర్తియైనది.

ఆ మరుసటి రోజునుండి ఆరుమాసాలు శ్రీవారు మౌనవ్రతాన్ని అవలంబించారు. ప్రయాణం మాత్రం యధాతథంగానే జరుగుతోంది. మఠంలోని కార్యకలాపాలుకూడ నిరభ్యంతరంగా సాగిపోతూనే ఉన్నవి. తరువాత మరల రామనాధ్‌, పుదుక్కోటై, తిరుచి, తంజావూరు అటునుండి క్రమంగా కుంభకోణానికి శ్రీవారు విజయం చేశారు.

ఇరవై ఒక్క సంవత్సరాల ''విజయయాత్ర''ను ముగించుకొని శ్రీవారు మరల 29-7-1939 న కుంభకోణానికి విజయం చేశారు. ఆనాడచటి ప్రజల ఆనందోత్సాహములకు మేరలేదు.

ధర్మోద్ధరణం :

శ్రీవారి 21 సంవత్సరాల 'విజయయాత్ర' ధర్మోద్ధరణమున కనేక మార్గాలను సుస్థిరం చేసింది. ఈ సమయంలో వేదాలు, వేదాంత గ్రంథాల అధ్యయనం, ధర్మానుష్ఠానం, ఆనాధరక్షణం మొదలైన విశ్వశ్రేయస్సునిచ్చే కార్యక్రమాలను విశేషంగా ప్రోత్సహించారు.

1939 లో ప్రజాసేవకై ముద్రాధికారి సంఘాన్ని ఏర్పాటుచేశారు. మఠంతరపుననీరు భిన్నస్థలాలలో ఉంటారు. ఆయా ప్రాంతాలలో వారు ప్రజాసహకారంతో దేవాలయాలను ఉద్ధరించాలి. ఏకాదశి మొదలైన పర్వదినాలలో పురాణ కాలక్షేపాలను ఏర్పాటు చెయ్యాలి. బావులు, చెరువులు త్రవ్వకానికి ప్రజలను ప్రోత్సహించాలి. రథోత్సవాదులు జరిపించుతూ ఉండాలి. తంజావూరుజిల్లాలో శ్రీవారీ కార్యక్రమాన్ని బాగా జరిపించటంకోసం చాలామారులు పర్యటించారు. ముద్రాధికారులను సమావేశపరచి శ్రీవారే స్వయంగా వారికి అనేక విషయాల నుద్భోధించారు.

శ్రీవారి పర్యవేక్షణలో అనేక దేవాలయముల పునరుద్ధరణ జరిగినది. వాటి కుంభాభిషేకములు జరుపబడినవి. 1941లో తంజావూరులోని బంగారు కామాక్షీదేవ్యాలయ పునరుద్ధరణం, కుంభాభిషేకం జరుపబడినవి. జంబుకేశ్వరంలోని ప్రాచీనమైన 'పంచముఖేశ్వర' ఆలయం జీర్ణస్థితిలో ఉన్నది. 1943 లో శ్రీవా రచటకు విజయం చేసినపుడు ఆ దేవాలయాన్ని దివ్యవైభవంతో పునరుద్ధరణ గావించి కుంభాభిషేకాన్ని గావించారు, శ్రీ కామాక్షీదేవికి వెండిరథాన్ని చేయించాలని శ్రీవారు సంకల్పించారు. 70 వేల రూపాయల ఖర్చుతో ఈ రథం సిద్ధం చేయబడినది. 19-2-1947 న వెండిరథంపైన అమ్మవారి విగ్రహాన్ని కూర్చుండబెట్టి రథోత్సవాన్ని జరిపించారు. ఆ ఉత్సవంలో జగద్గురువులైన శ్రీవారు ఆ జగన్మాతను సేవిస్తూ పాదచారులై నడుస్తూండగా వారి అడుగుజాడల్లో ఆనాడు నడచిన వారు ధన్యతములైనారు. అపుడే మధ్యార్జునంలోని శివాలయాన్నిగూడ అలాగే ఉద్ధరించారు.

అప్పటికి చాల సంవత్సరాల నుండి కంచిలోని కామాక్షీ దేవ్యాలయ పునరుద్ధరణ కార్యక్రమం సాగుతూనే ఉన్నది. 7-2-1944 న మహావైభవంతో ఈ ఆలయానికి కుంభాభిషేకాన్ని జరిపారు. ఆ ఆలయంలోనే ఆనాడా ఉత్సవాన్ని తిలకించి ధన్యత నొందటానికి యాభైవేల మంది నిరీక్షించి ధన్యులైనారు. ఈ సమయంలోనే ఇందుకు చిహ్నంగా 'మూకపంచశతి' గ్రంథాన్ని కామకోటికోశ స్థానం పక్షాన ప్రచురింపజేశారు.

రెండవ ప్రపంచయుద్ధ సమయంలో ప్రజలలో ఆందోళన తీవ్రంగా ఉండేది. అపుడు ప్రపంచశాంతికోసం దేవాలయాల్లో విశేషపూజలు జరిపింపజేశారు. 1942లో రుద్రాభిషేకాలు, విష్ణు సహస్రనామ పారాయణలు, అర్చనలు జరిపించారు. 1942 ఏప్రిల్‌లో మన్నారుగుడివద్ద పువనూరులో లోకకల్యాణార్థం శ్రీవారి సమక్షంలోనే 'అతిరుద్రయాగం' జరుపబడినది. శ్రీవారి 'నట్టం'లో జరిపిన చాతుర్మాస్య సమయంలో కూడ ఈ యాగం ఇలాగే జరుపబడినది. కాశ్మీరులోని శంకరాచార్యపర్వతంలాగానే తిరుచి పట్టణానికి పడమరగా 30 మైళ్ళ, దూరంలో 'శంకరమలై' ఉన్నది. అందుపైని మహాలింగం ప్రతిష్ఠింపబడి ఉన్నది. 2-3-43 న శ్రీవా రచటకు వెళ్ళి ఈ అంశాన్ని అచటి ప్రజలకు వెల్లడించారు. 1949 లో తిరువిడై మరుదూరులో 'ఆ తిరుద్రహోమం' జరిపించారు. నక్షరాత్ర్యుత్సవాలను కూడ అచటనే జరిపారు. తరువాత శ్రీవారు 1919 అక్టోబరు నవంబరు మాసాల్లో కుత్తాలంలో విజయంచేసి ఉన్నారు. తులాస్నానంకోసం నిత్యం మాయూరం-వెళ్ళివస్తూ ఉండేవారు.

హిందూధర్మ సంరక్షణానికి వేదసముద్ధరణం ముఖ్యం అందువల్ల శ్రీవారు వేదపాఠశాలల్ని స్థాపించి వేదాధ్యాయనాన్ని విశేషంగా ప్రోత్సహించారు. శ్రీవారు కంచిలో విజయంచేసి ఉండగా 1955 లో అచట వేదసమ్మేళనాన్ని జరిపించారు. యావద్భారతంలోని సుప్రసిద్ధులైన ఋగ్యజుస్సామవేదపండితులను పదిహేనుమందిని విశేషంగా సమ్మానించి బహూకృతుల నందజేశారు.

ఆది శంకరులు సుప్రతిష్ఠితం చేసిన అద్వైతవేదాంత ప్రచారానికై వారి గురుపరంపరలోని కామకోటిపీఠాధిపతులైన జగద్గురువులు పలువురు అధీతి బోధాచరణ గావించారు. శ్రీవారి పరమ గురువులు 1894లో కుంభకోణంలో 'అద్వైతసభ'ను స్థాపించారు. ఈ సభాపక్షాన 'బ్రహ్మవిద్య' అను పత్రికను నిర్వహించటం, అద్వైత గ్రంథాధ్యనాధ్యాపనాలు ప్రబోధము మున్నగునవి దీని కార్యక్రమాలు. దీని మొదటి సమావేశం 66వ గురువుల సమక్షంలో 1895 లో జరిగింది. 'మహామహోపాధ్యాయ' రాజశాస్త్రి మున్నగు మహాపండితు లపుడు అందులో పాల్గొన్నారు. శాస్త్రార్థాలు చేశారు. పరీక్షలు నిర్వహించారు. బహూకృతుల నందజేశారు.

1945 లో కుంభకోణంలో శ్రీవారి సమక్షంలో ఆ మహాసభ స్వర్ణోత్సవ సభలు నిర్వహింపబడినవి. ఈ సందర్భంలోనే ఒక చిహ్నంగా పలువురు మహాపండితులు సంస్కృతంలో అద్వైతాన్ని గూర్చి వ్రాసిన 51 వ్యాసాలుగల 'అద్వైత-అక్షర-మాలిక' అనే గ్రంథం ప్రచురింపబడినది. ఈ సందర్భంలోనే అద్వైతాన్ని గూర్చి అరవం. ఇంగ్లీషులో గూడ ఇలాటి గ్రంథాలే ప్రచురింపబడినవి. 1956 లో కంచికి సమీపానగల శివాస్థానంలో ఈ సభయొక్క వజ్రోత్సవాలు శ్రీవారి సమక్షంలోనే జరుపబడినవి.

శైవవైష్ణవాభేదమైన పరమేశ్వరారాధనం. ధర్మోద్ధరణం ముఖ్యమనే ఆశయంలో 1950లో 'తిరుప్పావై'-తిరువెంబావై - షడంగ మహాసభను జరిపించారు. తరువాత ఆలిండియా రేడియోవారు కూడ ఈ తిరుప్పావై - తిరువెంబావై గేయాలను ప్రసారంచేసి విశేషంగా సహకరించారు. శ్రీవారు తలపెట్టిన ఈ కార్యక్రమం ఆబాలవృద్ధం విశేషంగా వ్యాప్తి చెందింది.

హిందూ సంస్కృతికి మతమే మూలము. అధ్యాత్మికత దానికి వెన్నముక వంటిది. శిల్పం, నృత్యం మున్నగునవి ఇతర ప్రాంతాలలో వలె మనకు మతప్రమేయం లేనివి కావు. ఇవి మనకు పవిత్రతమములు. గతంలో హిందూ సంస్కృతి, దాని ఆశయాలు విశేష వ్యాప్తి పొందినవి. వీటి నన్నింటిని వృద్ధిపొందించి పునరుజ్జీవింప జెయ్యటంకోసం శ్రీవారు 1962లో ఇలయాత్తంగుడిలో 'అఖిల వ్యాస - భారత-ఆగమ- శిల్పసదస్సు'ను ఏర్పాటు చేయించారు. ఆగమం - శిల్పం మున్నగు వివిధాంశాలలో విశేషపాండిత్యంగల మహాపండితులిందులో పాల్గొన్నారు. నృత్యాది జానపద కళలు ప్రదర్శింపబడినవి. వార్షికంగా ఇది ప్రధానంగా జరుపబడుతోంది. 1963లో (మధురై) నారాయణవరంలోను, 61లో కంచిలోను, 65లో మదరాసులోను, 66లో కాళహస్తిలోను, 67లో రాజమహేంద్రవరంలోను, 68లో సికింద్రాబాదులోను ఈ సదస్సులు నిర్వహింపబడినవి.

ముఖ్యంగా దక్షిణభారతదేశంలో ఉన్న ధర్మపీఠాధిపతులుగా ఉన్న పెద్దల నందరిని సమావేశపఱచి ధర్మరక్షణ కార్యక్రమానికి సమైక్యమైన కార్యప్రణాళికను సిద్ధంచేశారు. ఇందులో ప్రధానాంశం ప్రజల్లో ఆస్తిక్యభావాన్ని పెంపొందించటం. ఈ సందర్భంలో 'హిందూరెలిజియస్‌ ఎండోమెంటుబోర్డు' వారు హృదయ పూర్వకంగా సహకరించారు. వివిధ సంప్రదాయాలకు చెందినవారందరు విశేష కృషి చేయటానికి సమావేశాలు ఉపయోగపడినవి.

'తండుల - ముష్టి' స్కీమును ఏర్పాటు చేయించి అనేక ప్రదేశాలలో ఇది నిర్వహింపబడేటట్టు చేయిస్తున్నారు.

'అనాధ ప్రేత సంస్కారాత్‌ అశ్వమేథ ఫలం లభేత్‌' అనే ఆర్షవాక్యానికి అనుగుణంగా ముఖ్యంగా పట్టణ ప్రదేశాలలో అనాథప్రేత సంస్కారాన్ని పవిత్రకార్యంగా భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేయగలందులకు సంఘాలను ఏర్పాటు చేయించారు. వారం వారం ఆసుపత్రులలో రోగార్తులైనవారికి విభూది, గంగాతీర్థం, తులసిదళాలు ఇవ్వటం దైవచింతనను వారిలో కలిగేటట్లు చూడటానికి తగిన ఏర్పాట్లు చేయించారు. వారానికొకమారు సంఘంగా చేరి భగవద్భజన చేసికొనే ''భజన సంఘాల'' నేర్పాటు గావింపజేశారు. ''ఆమరభారత పరీక్షా సమితి'' ద్వారా సంస్కృత భాషాప్రచారానికి తగిన ఏర్పాట్లను గావింపజేశారు. కంచిలోని ఉపనిషద్బ్రష్మే మఠంలోని యతీశ్వరులు కూర్చిన అద్వైతగ్రంథ ప్రచురణకు ఏర్పాట్లుగావించారు. దేశంలోని పుణ్యక్షేత్రాలలో ''శంకర మంటపము''లను ప్రతిష్ఠించటానికి ఏర్పాట్లుగావించారు.

శ్రీవా రొకపుడు 15 స్వాతంత్య్ర దినోత్సవంనాడు ఉపన్యసించుతూ భారతవర్షానికి స్వాతంత్ర్య వచ్చింది. ఇంక ఆత్మోవలబ్ధితో దీన్ని పరీక్షించుకొనే మహాశక్తికోసం ఈశ్వరుని అర్థించవలసిందిగా ఉద్భోదించారు.

దక్షిణప్రాంతంలోని వివిధ ప్రదేశాలలోను ముఖ్యంగా తంజావూరు జిల్లాలోని మారమూల ప్రదేశాలలోను పర్యటించి ప్రజల్లో ధార్మికప్రబోధం చేశారు. 22-6-1953 న కాంచీ క్షేత్రానికి విజయం చేశారు. ఇచట మూడు సంవత్సరాలున్నారు.

శ్రీవా రిచట విజయంచేసి ఉన్నపుడే ఆదిశంకరుల నుండి నేటి వరకు రెండువేల ఐదువందల సంవత్సరాలనుండి అవిచ్ఛిన్న పరంపరగా వస్తున్న జగద్గురు సంప్రదాయపరిరక్షణం కోసం మరల మనకు జగద్గురువులను ప్రసాదించారు.

శ్రీ జయేంద్రసరస్వతీ శ్రీచరణులు :

వీరి పూర్వాశ్రమనామం, శ్రీ సుబ్రహ్మణ్యయ్యర్‌, తండ్రి శ్రీ మహాదేవయ్యర్‌, తల్లి శ్రీమతి సరస్వతీదేవి. జననం తంజావూరు జిల్లా, మన్నారుగుడి తాలూకా 'ఇరుళ్ళిణికి' అనే గ్రామం. ఇది వీరి మాతామహస్థలం. ఈ ప్రాంతంలోనే 'ఆదిత్య ఉదిత్తపురం' అనేది వీరి తండ్రిగారి గ్రామం. వీరిది ఔచథ్యగోత్రం. ఋగ్మేదీయులు. పడమశాఖకు చెందినవారు. క్రీ.శ. 1935లో యువసంవత్సరంలో ఆడిమాసంలో జననం. జనన నక్షత్రం ధనిష్ఠ.

శ్రీ మహదేవయ్యరు, సరస్వతీ అనే ఈ పుణ్యదంపతులకు జన్మించిన మొదటి కుమార్తె తరువాత ముగ్గురి పుత్రులలో వీరు జ్యేష్ఠులు. శ్రీ మహదేవయ్యర్‌ రైల్వేలో ఉద్యోగనిమిత్తంగా 'విల్లుపురం'లో ఉండేవారు.

'ఇరుళ్ళిణికి' అంటే చీకటిపోవటం అని అర్థం. ఆదిత్యఉదిత్తం అంటే సూర్యు డుదయించటం అని అర్థం. ఈ రెండును సమీప గ్రామాలే. పూర్వం శ్రీరామచంద్రమూర్తి ఈ మార్గంగా పయనించారని చెప్పుతారు.

శ్రీ సుబ్రహ్మణ్యయ్యర్‌ మూడుసంవత్సరాలవయస్సు వరకు తల్లిదండ్రులవద్దనే ఉన్నారు. తరువాత వీరి మాతామహికి తండ్రి సుప్రసిద్ధ పండితులు, నైష్ఠికులునైన శ్రీ వీరాస్వామి ఘనపాఠిగారివద్ద ఆరవసంవత్సరం వయస్సువచ్చేదాక ఉన్నారు. తరువాత తల్లిదండ్రుల వద్దనే ఉండి ఏడెనిమిది సంవత్సరాల వయస్సువరకు నాలుగైదు తరగతుల ప్రాథమికవిద్య నభ్యసించారు.

గర్భాష్టమున ఉపనీతులైనారు. వీరి తండ్రిగారు లౌకిక వృత్తిలో ఉన్నప్పటికి వీరికి వైదికనిష్ఠయందాసక్తి మెండు. అందువల్లనే ఉపనయనానంతరం తమ కుమారునిచే వేదాధ్యయనం చేయించాలని తలపోశారు. ఋగ్వేదపాఠశాల సమీపంలో లేనందున తాము నివసిస్తున్న గ్రామంలోనే యజుర్వేద పాఠశాలలో ఈ బాలుని చేర్పించారు.

ఈ సందర్భంలోనే శ్రీకాంచీకామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శ్రీచరణులు ''విల్లుపురా''నికి విజయం చేశారు. శ్రీమహాదేవయ్యర్‌గారు ఈ బాలుని శ్రీవారి దర్శనార్థం తీసికొనివెళ్ళి బాలునిచే వేదాధ్యయనం చేయించవలెనని ఉన్నదని శ్రీవారికి నివేదించారు. ఆశీర్వదించవలసిందిగా కూడ శ్రీవారి నర్థించారు. ప్రారంభంలో శ్రీమహాదేవయ్యర్‌గారు ఉత్తమ సంస్కారంకోసం రెండు మూడు సంవత్సరాలు బాలునిచే వేదాధ్యయనం చేయించి తరువాత వృత్తికోసం లౌకిక విద్య చెప్పించాలని అభిప్రాయ పడ్డారు. ఆ సంగతినే శ్రీచరణసన్నిధిని నివేదించుకొన్నారు.

కాని శ్రీవా రీ బాలునిచే పూర్తిగా వేదాధ్యయనం చేయించవలసిందిగా ఉపదేశించారు. ఐతే జీవనం ఎలాగ ? అన్నారు శ్రీ మహాదేవయ్యరుగారు. అందుకు శ్రీవారు, నీ పెన్షన్‌ వగైరాలు ఈ బాలుని కోసం ప్రత్యేకించి తక్కిన ఇద్దరి పిల్లలచేత ఉద్యోగం వగైరా చేయించుకోవలసిందిగా చెప్పారు. మహాదేవయ్యర్‌గారు అలా ఆలోచిస్తున్నారు. మరునాడు కంచిలో శ్రీ కామాక్షీ దేవ్యాలయానికి కుంభాభిషేకం చెయ్యటంకోసం శ్రీ వారచటకు బయలుదేరుతున్నారు. శ్రీవారి ఆదేశానుసారం విల్లుపురంలోని యజుర్వేద పాఠశాలాధ్యాపకులను, వారి శిష్యులను, వారితో తన కుమారుని కూడ తీసికొని శ్రీ మహాదేవయ్యర్‌గారు కంచికి వెళ్ళారు.

అది 1944 సంవత్సరం. శ్రీ కామాక్షీ దేవ్యాలయ కుంభాభిషేకం జరిగినరోజునే శ్రీ కామాక్షీదేవి సన్నిధిలోనే ఈ సుబ్రహ్మణ్యయ్యర్‌ అనే బాలకునికి ఋగ్వేదాధ్యయనం ఆరంభం చేయబడింది. ''మధ్యార్జునం''లోని ఋగ్వేదపాఠశాలాధ్యాపకులైన బ్రహ్మశ్రీ కృష్ణమూర్తిశాస్త్రిగారే అధ్యాపకులుగా ఆరంభించారు.

శ్రీవా రీబాలుని పీఠపాఠశాలలోనే ఉంచి అధ్యయనం చేయించవలసిందిగా చెప్పారు. కాని శ్రీ మహాదేవయ్యర్‌గారు అందుకు సంకోచించారు. బాలుడు పీఠ ద్రవ్యం తింటూ చదువుకోటం వారిక సమ్మతిగలేదు. గృహస్థులు పీఠానికి చేతనైనది సమర్పించాలిగాని పీఠంసొత్తు తింటూ ఉండటం ఉచితం కాదేమో అనే సందేహాన్ని శ్రీవారికి విన్నవించుకొన్నారు. శ్రీవారు అంతా సావధానంగా ఆలకించారు.

తుదకు ''మధ్యార్జునం''లో స్మార్తబ్రాహ్మణపోషణలో ఉండి, కామకోటిపీఠ పర్యవేక్షలో నిర్వహింపబడుతున్న వేదపాఠశాలలో ఈ బాలునికి ఋగ్వేదాధ్యయనం ఆరంభం చేయించబడినది. అలా 13 సంవత్సరాల వయస్సు వరకు అచటనే ఋగ్వేదాధ్యయనం జరిగింది.

ఈ సమయంలోనే శ్రీవారు విజయయాత్ర సందర్భంగా ''మధ్యార్జునం'' గ్రామానికి విజయం చేశారు. ఆ ప్రాంతంలోనే చాతుర్మాస్యవ్రతం జరపటంకూడ సంభవించింది. శ్రీవారు అంతకు పూర్వంనుండి తమ పీఠసంప్రదాయ పరిపాలనకై నియుక్తుల్నిగా చేయదగిన శిష్యునికోసం అన్వేషించుతున్నారు. శ్రీవా రిచట విజయంచేసి ఉన్నపుడే ఈసుబ్రహ్మణ్యయ్యర్‌ అనే బాలుని 'మఠం' స్వామిగా తీసికొనదలచినట్లు వారి తల్లిదండ్రులకు కబురంపారు. ఆ బాలునితల్లిదండ్రు లీవార్తనువిని, శ్రీవారి ఆదేశాన్ని శిరసావహించారు.

తరువాత మూడు సంవత్సరాలు ఈ బాలునికి పీఠసంప్రదాయాది పలువిషయాల్లో శిక్షణకై ఏర్పాటు చేయబడినది. పీఠపండితులు ఋగ్వేదాధ్యాపకులు, మహోపాసకులైన శ్రీ మయూరం కృష్ణశాస్త్రిగారు వీరికి పీఠసంప్రదాయశిక్షణ నిచ్చారు. ఈ సమయంలోనే దశోపనిషత్తులు మున్నగునవి అధ్యయనం చెయ్యటం జరిగింది. ఇప్పటి బాలునికి పదహారు సంవత్సరాల వయస్సు వచ్చింది.

ఇంతలో ఈ బాలుని తండ్రిగారు ఉద్యోగరీత్యా 'తిరుచానపల్లి'లో ఉంటున్నారు. పీఠస్వామిగా సమర్పింపబోయే ముందు తమవద్ద ఈ బాలుడు కొంతకాలం ఉండాలని ఆతల్లి దండ్రులు కుతూహలపడ్డారు. రెండు సంవత్సరాలపాటు అలాగే ఉండి ఆంగ్లం మొదలైన భాషల నభ్యసించారు. తల్లిదండ్రు లీబాలుని వెంటబెట్టుకొని యావద్భారత దేశంలోను గల పుణ్యక్షేత్ర-తీర్థాటనం చేశారు. ఈ బాలుని కిపుడు వయస్సు పందొమ్మిది సంవత్సరాలు.

శిష్య స్వీకారం :

ఈబాలుని ఆశ్రమస్వీకారోత్సవం 1955వ సంవత్సరం మార్చి 19వ తేదీ నుండి 22వ తేదీవరకు కాంచీక్షేత్రంలోనే జరిగింది.

ఇందుకు పూర్వాంగంగా శ్రీవారు కలవాయిలోని తమ గురు, పరమగురు సమాధులను దర్శించుకొన్నారు. అంబిలోని పూర్వాచార్యుల సమాధులను దర్శించారు. మార్చి 22వ తేదీ ఉషః కాలంలోనే ఆనందసాగరం అనే తటాకంలో స్నానంచేసి అశ్వత్థవృక్షమూలంలోని మృత్తికను ప్రసాదంగా స్వీకరించారు. సురేశ్వరాచార్య బింబాన్ని పూజించారు. ఏకామ్రనాధాలయానికి వెళ్ళి అచటి ఆమ్రవృక్షాన్ని దర్శించారు. మఠాస్థానదైవమైన శ్రీచంద్రమౌళీశ్వర శ్రీమహాత్రిపురసుందరీ దైవములను దర్శించుకొన్నారు.

ఇంక శిష్యస్వాము లంతకు పూర్వమే దేవఋషీ పితృక్రియల నన్నింటిని నిర్వర్తించారు. తత్పూర్వరాత్రి అంతా జాగరూకులై మౌనంతో గాయత్రీ ధ్యాననిష్ఠులై ఉన్నారు. ఉదయాన్నే సర్వతీర్థం వద్ద నున్న ముక్తిమంటపం వద్దకు వెళ్ళారు. తత్పూర్వాంగంగా జరుపవలసిన వైదికక్రియాకలాపాన్ని నిర్వర్తించారు. సద్గురు సందర్శనల కోసం ఎదురు చూస్తున్నారు.

భక్తులందరు స్నానానుష్ఠానాలను పూర్తిచేసికొని మంగళ ముహూర్తంకోసం ఎదురుచూస్తున్నారు.

అంతలో శ్రీవారు మఠంనుండి ముక్తిమంటపానికి విజయం చేసారు. శిష్యస్వాములు కూడ సర్వతీర్థంలో పావనజలాలలో అవగాహనం చేసారు. తత్పూర్వ వస్త్రాదులను జలంలో విసర్జించారు. శ్రీవారనుగ్రహించిన కాషాయాంబరాలను ధరించారు. విశ్వేశ్వర సన్నిధిలో శ్రీవారు శిష్యస్వామికి మహావాక్యోపదేశంచేసి 'జయేంద్రసరస్వతి' అనే యోగపట్టాన్ని-ఒక రుద్రాక్షమాల, స్ఫటికాలమాలలతో పాటు, పూర్వం తిరుపతి దేవస్థానంవారు తమకు సమర్పించిన పట్టు పీతాంబరాన్ని శిష్యస్వాములకు ప్రసాదించారు.

మేళతాళాలతో కాంచీపుర వీధులలో పదివేలమంది మహాభక్తులు వెంటరాగా జగద్గురు శిష్యులిరువురును శ్రీమఠానికి విజయం చేశారు. ఆ వైభవసందర్శనోత్సుకమైన దేవతా బృందానికి సైతం వియత్పథంలోనివారి నిర్నిమేష దృష్టులు ఆనందాశ్రుపూర్ణాలైనవి.

ఆనాటి నిత్యపూజ మధ్యాహ్నం 3 గం. లకు పూర్తిఐనది. 4 గం. ల నుండి అచట నిరీక్షిస్తున్న భక్తకోటికి తీర్థప్రసాదాలను శ్రీవారే స్వయంగా అనుగ్రహించారు. చక్కటి భక్తి ప్రపత్తులతో బాలురు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు బద్ధకటులై తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆ కార్యక్రమం పూర్తిఅయ్యే సరికి ఆనాడు రాత్రి 3 గంటలైనది.

అది మొదలు శ్రీ జయేంద్ర సరస్వతీ శ్రీ చరణులు శ్రీవారికి ప్రథమశిష్యులై తగిన విశేషాలన్నీ శ్రీవారివల్ల గ్రహించుతూ పీఠకార్యక్రమాలన్నింటిలోను పాల్గొంటూ నిరంతరం శ్రీవారితో కలిసి-సుందర మందస్మిత వదనారవిందులై మనకు దర్శనమిస్తూ మనల ననుగ్రహించుతున్నారు.

శ్రీజయేంద్రసరస్వతీ శ్రీచరణులు ఆశ్రమస్వీకారానికి పూర్వమే కాక తరువాత కూడ అనేక శాస్త్రాలను అధ్యయనం చేశారు. ముఖ్యంగా వ్యాకరణం, మీమాంసా, న్యాయ వేదాంతాలను విశేషంగా అధ్యయనం చేశారు. వేపత్తూరు, పండితరాయ సుబ్రహ్మణ్యశాస్త్రిగారు, యస్‌.ఆర్‌. కృష్ణమూర్తిగారు, శ్రీ కె. ఆర్‌. రామమూర్తిశాస్త్రిగారు, ఆర్‌. రంగనాథ శాస్త్రిగారు, 'శాస్త్రరత్నాకర' శ్రీమండలీక వేంకట శాస్త్రిగారు వీరి శాస్త్రాధ్యయన కార్యక్రమంలో సహకరించారు.

ముఖ్యంగా ఉచ్ఛకోటికి చెందిన తర్కవేదాంత గ్రంధాలను అధ్యయనం చేశారు. తర్కంలో మాధురీ, జాగదీశి, గాధాధరి అనే మూడు వ్యాఖ్యా మార్గాలున్నవి. అందులో సామాన్యంగా 'పంచలక్షణి'కి మాత్రం మాధురి గ్రంథాన్ని చదువుతారు. పూర్వఉత్తరవాద గ్రంథాలకు అరవకర్ణాటక ప్రాంతాలలో గాదాధరిని మాత్రం చదువుతారు. కాని ఆంధ్రదేశంలో పూర్వోత్తరవాద గ్రంథాలపై కూడ జాగదీశి, గాదాధరి గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ విషయంలోనే శ్రీ మండలీక వారు వీరి అధ్యయనానికి సహకరించారు.

జగద్గురు చరిత్రకు అనుబంధం :

''గురుర్నామ్నా మహిమ్నాచ శంకరో యోవిరాజతే |

తదీయాంఘ్రింగళ ద్రేణుకణాయాస్తు నమోమమ||

శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి చరిత్ర

రచయిత :- దైవజ్ఞరత్న-భాషాప్రవీణ, శ్రీ తోయ్యేటి భానుమూర్తి

1) మహారాష్ట్రమునందు సతారా పట్టణంలో కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వాములవారు విడిది చేసిన రోజులవి. స్వాములవారి దర్శన - ప్రవచనాదులతో పట్టణవాసులు మహదానంద భరితులయ్యారు. శ్రీవారు ఎచ్చట నున్నను అచ్చట వేదశాస్త్రసభలు జరిపించుట పరిపాటి. ''వేదో7ఖిలం ధర్మమూలమ్‌'' అను సూక్తిని అనుసరించి వేదవిద్యకు మొదటిపీట వేయుటలో స్వాములవారు అగ్రేసరులు. అందులకనుగుణంగా ''వేదరక్షణనిధి ప్రణాళికను ఏర్పరచి దాని ద్వారా వచ్చిన ధనమును వేదవిద్యా''భ్యాసము చేయు విద్యార్థులకు వినియోగించుచున్నారు.

2) వేదవిద్య నభ్యసించే విద్యార్థు లెందరో సతారా పట్టణంలో నున్న స్వాములవారి సన్నిధికి వచ్చిఉన్నారు. ఆ విద్యార్థులను వేదార్థ విశారదులయిన పండితులు పరీక్షించి, వారిలో ఒక బాలుని సర్వోత్తమశ్రేణికి అర్హునిగా ప్రకటించిరి. మొదటి బహుమాన మందుకొన్న ఆ బాలునిపై శ్రీవారి దివ్యమయిన, ప్రసన్నమయిన చూపులు తొలిసారిగా ప్రసరించినవి. ఆ బాలునిలో అంతర్గతముగానున్న జ్ఞానాంకురము మొలకెత్తి పెరిగి పెద్దదయినచో, ఆ బాలునికేగాక తమపీఠమునకు తద్వారా లోకములో సనాతన ధర్మవ్యాప్తికి భవిష్యత్తులో కలుగు అభ్యుదయమును గూర్చి ఆలోచనలు స్వాముల వారిరేకెత్తినవి.

3) ఆ తరువాత కొంతకాలమునకు తమిళనాడులో తిరుచునాపల్లి సమీపంలోని అల్లూరు గ్రామంలో జగద్గురు శంకరాచార్య శ్రీచంద్ర శేఖరేంద్ర సరస్వతీ మహాస్వాముల తమ పీఠంతో మకాంచేసి అనుదినం అర్చనాది కార్యక్రమములు నిర్వర్తించుచు భక్తులకు అనుగ్రహించుచుండిరి. ఒకనాడు దైవారాధన జరుగుచున్నది. పండితులు దీపారాధనకు సంబంధించిన మంత్రమును పఠించుచున్నారు. తన ఎదుట వేదమంత్రం పఠించే బాలుని చూచి 'వేదంలో మంత్రం ఎక్కడ వున్నది? అని ప్రశ్నించిరి.

4) వెంటనే ఆ బాలుడు ''వేదంలోని బ్రాహ్మణంలో ఇన్నవ పేజిలో ఉన్నది.'' అని బదులు చెప్పెను.

5) శ్రీవారు ఆ బాలుని అవధాన శక్తికి ముగ్ధులయినారు. వారి నిశితమయిన దృక్‌తరంగములు మరొకమారు ఆ బాలునిపై ప్రసరించ సాగినవి. గతకాలపు స్మృతులు పునరావృతమయినవి. సతారాలో తన చేతులమీదుగా మొదటి బహుమానమునందు కొన్న వేద విద్యార్థిగా ఆ బాలుని గుర్తించిరి. భవిష్యత్తులో కంచి శంకరాచార్య మఠమునకు ఈ బాలుడు వారసుడు కాగల అర్హత కలిగినవాడని శ్రీచంద్రశేఖర యతీంద్రులు నిశ్చయించు కొనిరి.

6) శ్రీ పరమాచార్యుల వారిని సతారాలోను, అల్లూరులోను తన తేజస్సుతోను, మేధాసంపత్తితోను, వినయాది సద్గుణములతోను ఆకర్షించిన ఆ బాలుని పేరు శంకరనారాయణ''

7) భారతదేశపు దక్షిణభాగము ద్రావిడదేశముగా ప్రసిద్ధిపొందినది పూర్వాపు మద్రాసు రాష్ట్రములో ఆంధ్రులు-తమిళులు నివసించుచుండిరి. వేదశాస్త్ర పండితులయిన ఆంధ్రులు కొందరు ఆంధ్రప్రాంతము నుండి తమిళ ప్రాంతములకువెళ్ళి అచ్చటి విద్యార్థులకు విద్యాధానము చేసెడివారు. అట్టి కుటుంబములలో, ముక్కాల, వంశమువారు చెంగల్పట్టుజిల్లా పొన్నేరి దగ్గర ఆరణిలో నివసించుచుండిరి. ఆ వంశములో-బ్రహ్మ శ్రీకృష్ణమూర్తిశాస్త్రి మహోదయులు వేద విద్వాంసులుగా పెరెన్నిక గన్నవారు. ఆయన భార్యపేరు శ్రీమతి అంబాలక్ష్మి. ఆ పుణ్యదంపతులకు ఐదుగురు పుత్రులు, ముగ్గురు పుత్రికలు జన్మించిరి. వారిలో సప్తమ సంతానమే శ్రీవారి అనుగ్రహమునకు పాత్రుడయిన బాలమేధావి ''శంకర నారాయణ''.

8) శ్రీ శంకర నారాయణుల మాతృవంశము కూడ పండిత వంశ##మే. 'క్రాకవాక, గ్రామనివాసి సుప్రసిద్ధ సంస్కృత కవి బ్రహ్మశ్రీ ఉట్ర వడియం కృష్ణశాస్త్రి మహోదయులు తరచుగా ఆంధ్రదేశ సంచారము చేయుచు తమ రసవత్క వితామృత గానముచే పండిత పామరజనమును ఆనందింపచేసెడివారు.

9) తండలంలో శ్రీశంకరనారాయణ, 1969 మార్చి 13వ తేదీనాడు స్వస్తిశ్రీ చాంద్రమాన కీలక నామ సం||ర ఫాల్గుణ కృష్ణదశమి గురువారం ఉత్తరషాడ నక్షత్రయుక్త ధనుర్లగ్నరాశిలో బ్రహ్మశ్రీ కృష్ణమూర్తిశాస్త్రి శ్రీమతి అంబాలక్ష్ముల పుణ్యఫలముగా జన్మించిరి. శ్రీశంకర నారాయణ తండులంలోని ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదివి-తండ్రి కృష్ణమూర్తిశాస్త్రిగారు 'పోలూరు' వేదపాఠశాలకు అధ్యాపకులుగా నియమింపబడుటచేత అచ్చటి ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతిని చదివిరి.

10) శ్రీ శంకరనారాయణుల పితృపాదులు బ్రహ్మశ్రీ కృష్ణమూర్తి శాస్త్రిగారి వద్దనే వేదాద్యయనమునకు పూనుకొని నాలుగు సంవత్సరములలో ఋగ్వేద సంహితను పూర్తిచేసిరి. ఈ వేదభాగములో మొదటి బహుమానమును శ్రీవారి చేతులమీదుగా గ్రహించిన విషయమును ఇంతకు ముందే మనము తెలిసి కొన్నాము.

11) శ్రీ శంకరనారాయణులు తిరుచ్చి సమీపంలోని 'అల్లూరు'లో బ్రహ్మశ్రీయజ్ఞేశ్వర శాస్త్రిగళ్‌, అను ప్రముఖ విద్వాంసుల వద్ద కొంతకాలముండి 'లీలావతీగణితము'ను అభ్యసించిరి.

12) వేదభాగమున క్రమం కూడా అభ్యసించి అనతికాలమందే శ్రీశంకరనారాయణుల వేద విద్వాంసులయిరి.

13) జగద్గురు శంకాచార్య కంచికామకోటి మఠంలో పరమాచార్య పర్యవేక్షణలో నవరాత్రి మహోత్సవములు ఆనందాయకముగా జరుగుట ఆచారసిద్ధము. ఆ సమయలలో శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాముల ఎడభక్తి ప్రపత్తులుగలవారై శ్రీశంకరనారాయణులు మఠములోనే ఎక్కువ కాలమును గడుపుచు వైరాగ్యసంపదను వృద్ధిపొందించుకొనిరి. పీఠమునకు సంబంధించినని యమనిష్ఠలను గమనించుచు, క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనతో పరమాచార్యుల వారి ఆదరణకు పాత్రులయినారు.

14) ఆ బాల్యము నుండియు ధర్మరక్షణ కొరకు కంకణము కట్టుకొని సర్వసంగ పరిత్యాగులయిన, మహనీయులు ఒక్క భారతదేశమునందుతప్ప మరెచ్చటను కానరాదు. అందులకై శ్రీశంకర నారాయణులు తమ తల్లిదండ్రుల అనుమతిని పడసినారు. ప్రస్తుత పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములవారు మద్రాసు సమీపమందలి పెరంబూరులో విడిది చేసియున్న రోజులలో శ్రీ శంకర నారాయణులు, వారిని దర్శించిరి. తనకు శిష్యుడు కాదలచిన శ్రీశంకరనారాయణుల అభిప్రాయమును శ్రీ జయేంద్ర సరస్వతి మహోదయులు గ్రహించి, మునుముందుగా పరమాచార్యులవారి అనుమతిని పొందమని చెప్పిరి. ఆ రోజులలో శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాములవారు మహబూబ్‌నగరులో నుండగా అచ్చటకు తమ తల్లిదండ్రులతో వెళ్లి శ్రీ శంకరనారాయణులు, తమ కోరికను వెల్లడించి శ్రీవారి అనుమతిని-ఆశీస్సులను పొంది, తిరిగి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వాముల ఆదేశానుసారము దివ్యస్థలమయిన తిరుమలకుపోయి శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనముచేసి కాంచీపురము చేరుకొన్నారు.

15) 1983వ సంవత్సరం మే నెల 29వ తేదీనుండి శ్రీశంకరనారాయణుల సన్యాసాశ్రమ స్వీకార కార్యక్రమము ప్రారంభమయినది. 29వ తేదీ తెల్లవారుజామున శ్రీ కంచి కామాక్షీదేవి సన్నిధానంలో శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములవారిచే మంత్రోపదేశమును పొంది సన్యాసాశ్రమం స్వీకరించి శ్రీశంకరనారాయణుల 'శంకర విజయేంద్ర సరస్వతీ, నామంతో ప్రసిద్ధులయ్యారు.

ఆశ్రమ స్వీకారానంతరం శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వాములు ఆరుమాసములు శివస్థానంలోను మీనంబాకంలోను పరమాచార్యుల వారి సన్నిధానంలోవుండి ఉపనిషత్తులు మొదలగు గ్రంథములను చదివి ఆత్మజ్ఞాన మార్గగాములయినారు.

16) 1983 నుండి నేటివరకు అనేక ప్రాంతములలో తమ గురువుల వెంట శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వాములు పర్యటించిరి. చాతుర్మాస్య వ్రతములు ఆచరించిరి. వసంత శారదనవరాత్ర ఉత్సవములలో పాలు పంచుకొనిరి. నిత్యపూజాధికములు ఆచరించుచున్నారు. 1992 సెప్టెంబరు 11వ తేదీన ప్రారంభమయిన కృష్ణానదీ పుష్కర పుణ్యకాల సమయములలో విజయవాడ-అమరావతి మొదలగు క్షేత్రములను దర్శించిరి. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వాములు ఏయే ప్రాంతములకు వెళ్ళినను తమ పూర్వాచార్యుల వలెనే తపోనిష్ఠాగరిష్టులయి, దివ్యతేజస్సుతో వెలుగొందుచు, ఆధ్యాత్మిక ప్రసంగములు చేయుచు-ప్రజలందరు సాత్విక మార్గావలంబులగునట్లు విశేషమయిన కృషిచేయుచున్నారు. ద్వైతభ్రాంతి నివృత్తికానిదే అలౌకికానందము లభించదు.

17) 'పరమేశ్వరానుగ్రహం ఉన్నచో అద్వైత వాసనలు కలుగును. అద్వైత సిద్ధికొరకు జిజ్ఞాసువులయినవారు. ఆ పరమేశ్వరపాదకములనే ఆశ్రయించవలెను. ఆ పరమేశ్వరుడు ఎక్కడనో లేడు. జగద్గురువులు ఆదిశంకరులు, వారి పరంపరలో ఆశ్రమస్వీకారముచేసి మఠాధిపతులు, అద్వైతమత ప్రవర్తకులైన వారు పరమేశ్వర స్వరూరులే ! అద్వైతభావ సిద్ధికై నిరీక్షించు వారందరు ఆదిశంకరుల పరంపరలోని మహాస్వాములను ఆశ్రయించి తరించు అవకాశము మనకర్మ భూమియందే సాధ్యమగుచున్నది.

18) 4,32,00 ప్రమాణముగల కవిశకంలో (1992వ సంవత్సరమునకు 5093వ సంవత్సరము ఆరంభమయినది. కవి ప్రథమపాదములోనే వాతావరణ కాలుష్య ప్రభావముతోను చిత్ర విచిత్రమయిన రోగములతోను, వాహన ప్రమాదములతోను, అతివృష్టి-అనావృష్టి బాధలతోను, హింసావాద రాజకీయములతోను మన భూగోళము సతమతమగుచున్నది. అణుభూతము పొంచిఉన్నది. రానున్న కలిలో ఇంకను ఈ లోకమునకు ఎట్టి విపత్తులు సంభవించనున్నవో! వీటినన్నిటిని అధిగమించుటకు మానవులందరు శాంత చిత్తులు కావలసి ఉన్నది. చిత్తవృత్తి నిరోధమేయోగము. ఆదిశంకరుల పరంపరలో మహాయోగి పుంగవులయినవారు తమ తపశ్శక్తి ప్రభావముతో రానున్న కలికాల సంక్షోభములను నిగ్రహించి శాంతిని ప్రసాదించ గలరనుట ఎంతమాత్రము అతిశయోక్తి కానేరదు. అందులకు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారుకూడ తమ అనుగ్రహమును అవిచ్ఛిన్నముగ ప్రసాదించ గలరని మనమాశించవచ్చును.

లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు

జగద్గురు శిష్యులు :

ఇకమీదట అన్ని కార్యక్రమాలలోను శ్రీచరణులుభయులు పాల్గొంటూ ధర్మోద్ధరణం చేస్తున్నారు.

షష్టిపూర్తి :

శ్రీవారి షష్ట్యబ్ధపూర్త్యుత్సవం 18-5-1954 న యావద్భారతంలోను జరుపబడినది. భూములు మున్నగునవి దానంచేసి వేదరక్షణం చెయ్యవలసిందిగా శ్రీవారాసమయంలో ఉద్బోధించారు. ఆదిశంకరుల బ్రహ్మసూత్ర భాష్యగ్రంథాన్ని 'కామకోటి కోశస్థానం' వారు ప్రచురించారు.

శ్రీవారు పీఠాధిరోహణంచేసి 50 సంవత్సరాలు నిండిన సందర్భంలో 17-3-1957న కలవైలో ఉత్సవం జరుపబడినది. ఆ సమయంలో శ్రీవారొక సందేశంలో ఇంతకుపూర్వం 50 సంవత్సరాల నుండి చేసినదానికంటె ఇకముందు చేయవలసినదానిని గూర్చియే శ్రద్ధవహించాలంటూ అనేకామూల్యాంశాలను వెల్లడించారు.

మదరాసులో :

శ్రీవారు 23-9-1937 న మదరాసునగరానికి విజయంచేశారు. సుమారు రెండుసంవత్సరాలిచటనే ఉన్నారు. ఇచట నిత్యం పూజానంతరం ఉపన్యసించుతూ ఉండేవారు. 'ది హిందు' అనే ఆంగ్ల దినపత్రికకు డిప్యూటీచీఫ్‌రిపోర్టర్‌గా ఉన్న శ్రీ వి. రామకృష్ణయ్యర్‌గారు శ్రీవారి ఉపన్యాసాలను చక్కగా వ్రాసి పత్రికకు అందజేశారు. పత్రికల్లో ప్రచురింప బడినవి. గ్రంథాలుగా సైతం ఇవి రూపొంది వ్యాప్తి లోనికి వచ్చినవి. 'ది స్వదేశయత్రన్‌' అనే పత్రికలోకూడ ఇవి అపుడు ప్రచురింపబడేవి.

ఆదిశంకర మంటపములు :

ఆదిశంకరుల అవతార ప్రయోజనం వర్ణనాతీతమైనది. బాల్యంనుండి, యావద్భారతదేశంలోను పర్యటించారు. ఆ సేతుహిమాలయమున షణ్మత ప్రతిష్ఠాపన జరిపారు. వారి సిద్ధాంతము, వారి గ్రంథాలను గూర్చి తెలియనిదేశం ప్రపంచంలో లేదు. వారి ఘనతను గూర్చి ఇదమిత్థమని లెక్క కట్టి చెప్పుట సాధ్యంకాదు. శిలలుకూడ వారి కీర్తిని గానంచేస్తున్నవి. దూర ప్రాచ్యదేశాలలోని శాసనాలలోకూడ వీరి వర్ణన ఉన్నది. ఒక శిలాశాసనమునందు వీరిని గూర్చి ఇట్లున్నది.

''నిశ్శేషసూరి మూర్ధాలిమాలా లీఢాంఘ్రి పంకజాత్‌||''

శ్రీవారు ఆదిశంకరుల అడుగుజాడల్లో ధర్మోద్ధరణంచేస్తూ యావద్భారతంలోను ప్రధాన పుణ్యస్థలాలలో శంకరమంటప ప్రతిష్ఠలు చేయటానికి సంకల్పించారు.

మొదట రామేశ్వరంలో శంకరమంటపాన్ని నిర్మింపజేశారు' 7-4-1963న తంజావూరులో బంగారు కామాక్షీదేవి ఆలయ కుంభాభిషేకంచేసి అటనుండి రామేశ్వరానికి విజయం చేశారు. 28-4-1963న ఇచట ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. శ్రీ జయేంద్ర సరస్వతీ శ్రీచరణులు కుంభాభిషేకాన్ని చేశారు. శ్రీవారు హనుమంతుడు, ద్వాదశ జ్యోతిర్లింగములు, శ్రీ దక్షిణామూర్తి యంత్రం, శిష్యచతుష్టయసహిత ఆదిశంకర విగ్రహాలను ప్రతిష్ఠించారు. తరువాత సరస్వతీ మందిరంలో శ్రీ సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మొత్తం ఇచటి శంకరమంటపం అంతా భారత సంస్కృతిని ప్రతిబింబింపజేసే సిద్ధులు, యోగులు, మహర్షుల శిల్పాలతో సుందరంగా రూపొందింపబడినది. ఇచట అగ్నితీర్థంలో స్నానంచేసేవారీ మంటపాన్ని దర్శించుతూ ఉంటారు.

ఆ రోజున రాత్రి జరిగిన సదస్సులో శ్రీవారు ఛలోక్తిగా ఇలా అన్నారు. ''తరచుగా భారతదేశం అంతా పర్యటించిన ఆదిశంకరుల నీనాడిచట స్థిరంగా కూర్చుండబెట్టాము.'' ఇంకా ఇలా చెప్పారు. ''భారత వర్షంలోని అన్ని 'ధామాల'లో దక్షిణధామమైన 'దక్షిణామ్నాయ క్షేత్రమునం'దీ ప్రతిష్ఠ చేశాము.''

తరువాత ఆదిశంకరుల దిగ్విజయయాత్రలో మధ్యార్జునమునకు రావటం అచట ఈశ్వరుడు 'సత్యం అద్వైతం' అని వెల్లడించటం మున్నగు సంప్రదాయచరిత్రకు అనుగుణంగా ఇచటి మంటపాన్ని నిర్మింపజేసి ఇందులో ఆదిశంకర 'పాదుకల'ను ప్రతిష్ఠించారు. 5-12-63న కుంభాభిషేకాన్ని జరిపారు. ఇచట ప్రధానంగా 108 శాలువలతో ఆ పాదుకలను పూజించి వాటిని పండితులకు బహూకరించారు.

26-4-64న కాంచీక్షేత్రానికి విజయంచేశారు. కంచిలోని శ్రీమఠంలోనే షోడశస్తంభ మంటపం నిర్మింపబడినది. శిష్యచతుష్టయ సహిత ఆదిశంకరప్రతిష్ఠ, గురుపాదుకాప్రతిష్ఠ 27వ తేదీన నిర్వర్తించారు.

31-5-1964న కన్యాకుమారిలోనిర్మింపబడిన శంకర మంటపమునకు కుంభాభిషేకం జరుపబడినది.

ఆంధ్రప్రదేశంలో పవిత్రక్షేత్రమైన శ్రీశైలానికి శ్రీవారు 1934లో విచ్చేశారు. ఆదిశంకరులుకూడ ఈ క్షేత్రాన్ని దర్శించారు. ఇచట చక్కని 'శంకరమంటపా'న్ని శ్రీవారు నిర్మింపజేశారు.

1967 మార్చిలో ఇచటకు విజయంచేశారు. మార్చి 8వ తేదీన శ్రీ జయేంద్ర సరస్వతీ శ్రీచరణులతోసహా పాతాళగంగలో స్నానం చేశారు. మల్లికార్జునస్వామిని, భ్రమరాంబికను దర్శించుకొన్నారు. మార్చి 9వ తేదీన 'మహాశివరాత్రి' పర్వాన 'ఏకాదశరుద్రహోమం' జరుపబడినది. 22-3-1967న శంకరమంటప కుంభాభిషేకం జరిగింది.

హృషీకేశంలో పవిత్రగంగానది దివినుండి భువికి దిగిన పవిత్ర ప్రదేశం 'లక్ష్మణ్‌ఝాలా' అని పిలువబడుతోంది. అచట శంకర మంటపాన్ని నిర్మింపజేశారు. 14-5-1967 శంకరజయంతి మహాపర్వసమయంలో ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది.

అలాగే 27-11-1966న 'కురుక్షేత్రం'లో శిష్యచతుష్టయసహిత శంకరభగవత్పాదుల విగ్రహప్రతిష్ఠను జరిపింపజేశారు. అంతేకాక అచటనే పార్థసారధియైన శ్రీకృష్ణపరమాత్మ రథంలో అధిష్ఠితుడైన పార్థునకు భగవద్గీతోపదేశాన్ని చేస్తున్న సుందరవిగ్రహ ప్రతిష్ఠనుగూడ చేయించారు. ఈ ప్రదేశం హర్యానా రాష్ట్రంలో ఢిల్లీ-అంబాలా రైలు మార్గంలో ఉన్నది. ధర్మక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. వేదవ్యాసులు వేదవిభాగాన్ని, పురాణరచనను ఇచట చేశారని ప్రశస్తి ఉన్నది. వసిష్ఠ విశ్వామిత్రు లిచట ముక్తిపొందారు. ప్రతి సూర్యగ్రహణసమయంలోను నిచట 'జ్యోతిసరస్సు'లో స్నానంచేసి సమస్త పుణ్యతీర్థ స్నానఫలాన్ని పొందవచ్చునని స్కాందపురాణంలో ఉన్నది.

ప్రస్తుత గంగాయమునా సరస్వతీనదుల పవిత్ర సంగమస్థలమైన ప్రయాగ (అలహాబాద)లో శంకరమంటప నిర్మాణ కార్యక్రమం చురుకుగా సాగుతోంది.

గోదావరీనదీ జన్మస్థలమైన నాసికాత్య్రంబకంవద్ద శంకరమంటప నిర్మాణానికి ప్రయత్నములు జరుగుచున్నవి.

హిమాలయ ప్రాంతంలోని 'బదరీ' క్షేత్రంలో లోకహితంకోసం 'నరనారాయణులు' తపస్సుచేసిన ప్రదేశంలో కూడ శంకరమంటప నిర్మాణానికి కూడ యత్నం జరుగుతోంది.

1953-57-, 57-59

శ్రీవారు 53-57 మధ్యలో కాంచీక్షేత్రంలో విజయంచేసి ఉన్నప్పుడు, 57-59 మధ్యలో మదరాసులో విజయంచేసి ఉన్నప్పుడు అనేకులు-దేశవిదేశీయులు-శ్రీవారిని దర్శించుకొని వెళ్ళారు. వీరిలో పండితులు, యోగులు, అధ్యాత్మిక సాధకులు, మతాచార్యులు, కళానిపుణులు, రాజ్యతంత్రాభిజ్ఞులు ఉన్నారు.

1955లో చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మిల్టన్‌ శ్రీవారిని దర్శించుకొన్నారు. సుప్రసిద్ధ రచయిత ఆర్థర్‌ కోయిస్లర్‌ - 1959లో శ్రీవారిని దర్శించి, ఆ అనుభూతిని 'ది లోటస్‌ అండ్‌ ది రోబట్‌' అనే గ్రంథంలో వ్రాసి కొన్నారు. అమెరికా దేశీయుడైన ఆర్థర్‌ ఐసన్‌బర్గ్‌ కంచిలోనే శ్రీవారిని దర్శించుకొన్నారు. మదరాసులో ఉన్న యు.యస్‌ కాన్సల్‌ జనరల్‌ ఆల్బర్ట్‌ బి. ఫ్రాంక్లిన్‌ 1963లో మధురైలో మీనాక్షీ దేవ్యాలయ కుంభాభిషేక సమయంలో శ్రీవారిని దర్శించారు. ఇంకా ఈ విధంగానే సుప్రసిద్ధులైన ఆయావ్యక్తులు వెల్లడించుకొన్న తమ అనుభవాలను సేకరించి కొన్నింటిని, మదరాసు యూనివర్సిటీ సంస్కృతం ప్రొఫెసర్‌ డా|| శ్రీ వి. రాఘవన్‌గారు 'ది జయచంద్ర' అనే గ్రంథంగా ప్రచురించారు.

శ్రీవారు శ్రీకాళహస్తి క్షేత్రంలో విజయంచేసి ఉన్నప్పుడు 1966 డిసెంబరు 4, 5 తేదీలలో గ్రీసుదేశపురాణి ఫ్రెడరిక్‌, రాణిమాత, రాకుమారి ఇరనె సత్యాన్వేషకులుగా వచ్చి శ్రీవారిని దర్శించివారి ఉపదేశామృతాన్ని గ్రహించారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు శ్రీ టి.యం.పి. మహాదేవన్‌, ఎం.ఏ., పి.హెచ్‌.డి.గారు. ఆనాటి సంభాషణావిశేషాలనన్నింటిని వీరు 'పెసెప్టర్స్‌ ఆఫ్‌ అద్వైత' అనే ఆంగ్ల గ్రంథంలో 533వ పేజీనుండి సంగ్రహంగా వివరించారు.

అలాగే పాల్‌బ్రంటన్‌ ఇటీవల శ్రీవారి పీఠాధిరోహణ షష్ఠ్యబ్ధపూర్తి (వజ్రోత్సవం) ఉత్సవ సందర్భంలో వ్రాసిన అంశాలను ఆ గ్రంథంలోనే 537 వ పుటలో వ్రాశారు.

'మహామహోపాధ్యాయ' 'కవిసార్వభౌమ, ఆంధ్రవ్యాస, ఆంధ్రప్రభుత్వాస్థానకవి, యశఃకాయులు, బ్రహ్మ శ్రీ వేదమూర్తులైన శ్రీ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు తమ స్వీయచరిత్రలో 'నా కారాధ్యులు - మహాత్ములు'అనే అధ్యాయంలో వేదవ్యాసాదులను గూర్చి వ్రాస్తూ (159 వ పుట) ఇలా వ్రాసికొన్నారు:

''కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాములవారు.

వీరికి వేదశాస్త్ర శ్రౌతములేగాక పెక్కు భాషలలో పాండిత్యము గలదు. దివ్యజ్ఞానసంపన్నులు. భూత భవిష్యద్వర్తమానజ్ఞులు. విజ్ఞులు. వీరిచర్యలంబట్టి వీ రపరశంకరస్వాములని చెప్పవచ్చును. ఒకానొక కాలముందు నాయకాల మృత్యువును బోగొట్టినవారని మనవి చేయుచున్నాను. వారికి నేను ప్రత్యహము వ్యాసునకు(బలె మానసికారాధనము జేయుచుందును.... నేను వారి పాదతీర్థమును స్వీకరింతును. వారి పాదయుగ్మమును సర్వదా నాశీర్షమున ధరింతును. వారి చరిత్రము నా ఆంధ్రాభ్యుదయమున వ్రాసితిని.''

శ్రీవారి దివ్యచరిత్రనుగాని వారి అనుగ్రహానికి పాత్రులైన భక్తుల అనుభవ విశేషాలనుగాని మాటలతో వర్ణించి వాక్యాలలో వ్రాయటం సాధ్యంకాదు. ఇది ఆత్మైకవేద్యమగు అంశము.

విద్వాన్‌ బ్రహ్మశ్రీ కల్లూరి వేంకటసుబ్రహ్మణ్యదీక్షితులు గారు తమ 'గురుకృపాలహరి గ్రంథం'లో స్వరూప తరంగంలో శ్రీవారిని గూర్చి వ్రాసిన ఒక్క శ్లోకా న్నిచట వ్రాస్తున్నారు.

రక్తాంతస్పృహణీయ దీర్ఘనయనం స్వాకుంచిత భ్రూలతం,

హసస్మేరముదారపాలిఫలకం స్ఫూర్జత్క పోలారుణం |

శ్రీకర్ణం సునసం సుచారురదనం పూర్ణేందుబింబాననం,

వందే శ్రీగురుమూర్తి మిందుమకుటం శ్రీ కామపీఠాధిపమ్‌ ||

కో గురుః ? అధిగత తత్త్వః

శిష్యహితా యోద్యత స్సతతం ||

- ఆదిశంకరుల ప్రశ్నోత్తర రత్నమాలిక

మదరాసు యూనివర్సిటీలో సెంటర్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీ ఇన్‌ ఫిలాసఫీ డైరెక్టరుగారైన శ్రీ టి.యం. పి. మహాదేవన్‌, ఎం.ఏం; పిహెచ్‌.డి.గారి సంపాదకత్వాన ప్రచురింపబడిన 'ప్రెసెప్టర్స్‌ ఆఫ్‌ అద్వైత' అనే గ్రంథంలో 61వ వ్యాసంగా 'సేజ్‌ ఆఫ్‌ కంచి' అనే ఆంగ్లవ్యాసం ప్రధానాధారంగా పై శ్రీవారి చరిత్రను వ్రాశాను. శ్రీ మహాదేవన్‌గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతను వెల్లడించుచున్నాను.

- రచయిత

Jagadguru divyacharithra   Chapters   Last Page