Bhakthi Rasaayanamu        Chapters   Last Page

ద్వితీయోల్లాసము

ద్రుతేచిత్తే ప్రవిష్టాయా గోవిందాకారాతా స్థిరా

సాభక్తిరిత్యభిహితా; విశేష స్త్వధునోచ్యతే.

భక్తివిశేష నిరూపణము చేయగోరి మధుసూదనుడు. రెండవ యుల్లాసము నారంభించు చున్నాడు. స్వభావికముగా కఠినమైన చిత్తద్రవ్యము కామ క్రోధాదితాపకములచే ద్రవీభావము నందునని చెప్పితిమి. ఇట్లుద్రుతమైన చిత్తమున వస్తువుయొక్క ఆకారము వినిక్షిప్తమగునని యంటిమి. అనగా చిత్తము విషయాకారమును పొందునని భావము. ఈ రీతిగా భగవంతుడను విషయముపై దృష్టిని నిలుపగా ద్రుతచిత్తము భగవదాకారతను పొందును. ఈ యాకారత స్థిరముగా నుండగా, స్థాయిభావమని పిలువబడు చున్నది. ఈవిధమైన స్థాయి భావమును భక్తియని యందురు. సర్వేశ్వరుని ఉద్దేశించి వచ్చు మనోవృత్తిని భక్తియని పిలచితిమి. ఇక నీ యుల్లాసమున భక్తివిశేషమును నిరూపించ నున్నాము.

చిత్తద్రుతేః కారణానాం భేదా ద్భక్తిస్తుభిద్యతే

తాన్యుక్తాని తు సంక్షేపాద్‌ వ్యాఖ్యాయం తే7ధునా స్ఫటమ్‌. 2

చిత్తద్రవీభావమున కనేక కారణములు గలవు. ఈ యుత్పాదక కారణములు పరస్పరము భేదించుచున్నవి. ఇందుచే తజ్జనిత మగు భక్తిగూడ అనేక రూపములుగా కన్పించుచున్నది. ఈ భిన్న కారణములను సంక్షిప్తముగా మొదటి యల్లాసమున చెప్పితిమి. వీటినిచట వివరించబోవు చున్నాము.

కామః శరీరసంబంధవిశేషః స్పృహయాలుతా

సంనిధానా సంనిధాన భేదేన స భ##వే ద్ద్విదా.3

కామ క్రోధాదులు ద్రవీభావ కారణము లని మొదటియుల్లాసమున చెప్పితమి. ఇందు మొదటిది కామము. కామ మనగా స్పృహయాలుత, కోరికయని అర్థము. దేహాత్మసంబంధ వశమున ఇచ్ఛ బయలుదేరును. ఇచ్ఛ యనునది యొక పురో7వస్థిత మగు విషయము నుద్దేశించి వచ్చునది. విషయమెదురుగా నుండగా బయలుదేరు కామము వేరు. ఎదుట లేనపుడు వచ్చు కామము వేరు. సాన్నిధ్యమున విషయముండగా కలుగు కామము సంభోగాత్మకము. సాన్నిధ్యమున విషయ మున్న విప్రలంభాత్మకమగు కామము కలుగును..

తజ్జన్యాయాం ద్రుతౌ చిత్తే యా స్యాచ్ఛ్రీకృష్టనిష్ఠతా

సంభోగ విప్రయోగాఖ్యా రతిః సాసాక్రమా ద్భవేత్‌.4

విషయసన్నిధానమున చిత్తము ద్రవీభూతము కాగా శ్రీకృష్ణాకారతాక మగు, అనగా భగవదాకారతాక మగు చిత్తవృత్తి కలుగును. భగవదాకారత చిత్తము నావేశించును. ఇట్లుత్పన్న మగు రతిని సంభోగాత్మక మందురు. విషయము సన్నిధానమున లేనపుడు చిత్తద్రుతి కలుగగా చిత్తము నావేశించు భగవదాకారతాకమగు రతిని విప్రలంభాత్మక మని యందురు. సామ్యాతిశయ వినిర్ముక్త సచ్చిదానంద ఘనాత్మకముగా బ్రహ్మపదార్థము రసరూపమున ఆవిర్భవించును చిత్తముయొక్క సహజస్వభావమే భగవదాకారతను పొందుట యని వెనుక చెప్పితిమి. ఈ భగవదాకారత ప్రతీతము కాగా శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్యాది భావములు ప్రజ్వలితములై భక్తిరసమున పర్యవసితములు కాగలవు. భగవద్రూపమునేరీతిగా భజించుదుమో, అదేరీతిగా భగవానుడు ప్రతీయమాన మగును. ఇందుచే_

"యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్‌"

అని చెప్పబడినది. ఏవంవిధమగు భక్తిభావము రసత్వమున పర్యవసించును. సమస్తభావములు రసమున పరిపుష్టములై, రసాభినిర్వృతి హేతుకములుగునని భరతుడు సహితము నాట్యశాస్త్రమున చెప్పినాడు.

భాగవత శ్లోకములలో (10.29.46;10.30.27) భక్తిభావము ప్రమోడాత్మకమగు రతిగా పరణమించుట గాననగును. అనగా రతి భక్తియొక్క రూపాంతరముగా భాసించుచున్నదని భావము.

క్రోధ ఈర్ష్యానిమిత్తం తు చిత్తాభిజ్వలనం భ##వేద్‌

తజ్జన్యాయాం ద్రుతౌ సా తు ద్వేషశ##బ్దేన గృహ్యతే.5

ఇక క్రోధము నిర్వచింపబడు చున్నది. ఈర్ష్యవలన జన్మించు క్రోధమున చిత్తము జ్వలించును. పరుని అభ్యుదయాదికమును సహించజాలక పోయినపుడు కలుగు అసూయద్వారా మనస్సు దీప్తావస్థను జెందును. క్రోధమున బయలుదేరు చిత్తద్రుతియందు కలుగు భగవదాకారత ద్వేష పద వాచ్యమగును.

అత్ర చేతో వ్యాకులత్వం సోపద్రావకదర్శనాత్‌

ఉపద్రవాకనాశార్థం తీత్ప్రీత్యర్థం చ తద్ద్విధా.

ద్వేషము కలుగునపుడు చిత్తవిక్షేపము కన్పించును. ఉపద్రావక దర్శనమున కలుగు మనస్తపనాదికము నివృత్తించవలెననిన, తద్విషయము నివృత్తించవలెను ఒకవిషముపై ద్వేషము కల్గినచో నావిషయము నశించిననే ద్వేషము నశించగలదు. కల్గినచో నావిషయము నశించిననే ద్వేషము నశించగలదు. విషయనాశమున మనఃప్రీతి కల్గును. ఒక్కొక్కపుడు చిత్త ప్రీతికై చిత్త వ్యాకులత్వము బయలుదేరుట గూడ గలదు.

తత్రాద్యం ద్వేష ఏవ స్యాద్ద్వితీయం రతిశబ్దభాక్‌

ఉపరిష్టాత్తదుభయం మయా స్పష్టీకరిష్యతే.

ఉపద్రావక నాశము నభిలషించు క్రోధమును ద్వేషమని యందురు. ఉపద్రావక ప్రీత్యర్థకమగు క్రోధమును రతియందురు. ఈ రతిని విప్రలంభరూపముగా గ్రహించవలెను. కించి ద్విప్రియ దర్శన శ్రవణాదులద్వారా వచ్చు ఈర్ష్యాక షాయితత్వమును విప్రలంభ విశేషతా ప్రయోజకముగా స్వీకరించవలెను. ఈవిషయము నిరువది తొమ్మిదవ కారికయందు, ముప్పదియొకటవ కారికయందు, వివరింపబడ గలదు. భగవద్విషయక మగు నీర్ష్యచే ప్రదీప్త చేతస్కుడైన శిశు పాలుని ద్వేషము మనకు తెలిసినదే (10.74.30.) కాని -

"రాధామంజులమందిరా దుపగత శ్చంద్రావలీ మూచివా& రాధే! క్షేమ మి హేతి తస్య వచనం శ్రుత్వా77 హ చంద్రావలీ కంస! క్షేమ మయే విముగ్ధహృదయే! కంసఃక్వదృష్ట స్త్వయా రాధా క్వేతి విలజ్జితో నతముఖః స్మేరో హరిః పాతు వః"

అను శ్లోకమున ప్రీతిప్రయోజక మగు నీర్ష్య గలదు.

ద్వేషా హేతుః స్వమంతూత్థం వైక్లవ్యం చిత్తగంతు యత్‌

తజ్జన్యాయాం ద్రుతౌ యా77 స్తే రతిః సాభయముచ్యతే. 8

ఇక భయమును నిర్వచించుచున్నాడు. ద్వేషము, భయము అనునవి రతి యను స్థాయిభావము నాశ్రయించుకొని వన్చునవి. కాని ఈ రతి వీటితో మిశ్రితమై యుండుటచే నిది శుద్ధము కాజాలదు. చిత్తవ్యాకులత్వమునకు రతివిరోధినులగు భావాదులు ద్వేషమున గలవు. ప్రీత్యర్థకమైన ద్వేషముచే విప్రలాభయోగ్యమగు రతి స్థాయిభావముగాగలదు. ఉపద్రావక నిరాసార్థక మగు ద్వేషమున రతి యను భావమునకు స్థాయిత్వము లేదు. ఇట్లే భయమున సహితము సంకీర్ణమిశ్రితముగా గాని, కేవల మిశ్రితముగా గాని రతికి స్థాయిత్వము నంగీకరించవలెను. చిత్తగతము. నిజాపరాధజనితమునగు వైక్లప్యము విజాతీయ త్రాస విశేషమై, మృత్యుశరణాను సంహిత్యాది జనకమైన రతి యను భావము భయానకభక్తిరసముగా పరిణమించును. ద్వేషము తావకమై చిత్తద్రవశోషణముగా వర్తించుటచే ద్వేషజనకత్వమున నిట్లు రతిపరిణమించ జాలదు.

స్నేహః పుత్రాదివిషయః పాల్యపాలకలక్షణః

నేవ్యసేవకభావో7స్యః సో7వ్యుక్తస్త్రివిధో బుధైః.&

పుత్రాదివిషయకము, పాల్యపాలకభవమునై వ్యక్తమగునది స్నేహమను భావము, పుత్రాదుల నుద్దేశించి, వారిని రక్షించుటయందుకనబడునధీ భావము. సేవ్య సేవక భావమున కన్పడు స్నేహము దీనికన్న విలక్షణము. సేవ్య సేవక భావరూపము గూడా చెప్పబోవు మూడువిధములుగాగలదు.

భగవద్దాస్య సఖ్యాఖ్యాం మిశ్రితం చాపరం జగుః

యా కృష్ణాకారతా చిత్తే తజ్జన్యద్రుతిశాలిని.

పాల్య పాలక భావేన సా వత్సలరతి ర్భవేత్‌

సేవ్య సేవక భావేన ప్రయో రతి రితీర్యతే.೧೧

భగవంతుని దాస్యబుద్ధితోను, సఖ్యబుద్ధితోను గూడ భజించవచ్చును. దాస్యబుద్ధి, సఖ్యబుద్ధికలసిన నొకవిధ మగుసేవ్య సేవకభావము రాగలదు. ప్రీతిస్థాయిక మైనది దాస్యరసమని, విశ్రంభస్థాయిక మైనది సఖ్య మనబడు ప్రేయోరసమని రసజ్ఞులనినారు. ప్రభుతాజ్ఞాన, నిబంధన, సాదర, చాంచల్యాత్మక సంభ్రమ స్థాయిక మైనది దాస్యము. ముక్తసంభ్రమ, గాఢవిశ్వాస, ప్రాణవిశ్రంభ స్థాయిక మైనది సఖ్యము. ఈ సంభ్రమ విశ్రంభ ప్రయుక్తమైన ద్రవచిత్తమున క్రమముగా భగవదాకారత ప్రవేశించగా సంభ్రమరతి, విశ్రంభరతి బయలు దేర గలవు.

పాల్య పాలక రూపమగు స్నేహములో ద్రుతచిత్తము విషయాకారమును పొందగా వాత్సల్యరతి కన్పించును. సేవ్యసేవక భావములో ద్రుతచిత్తము విషయాకారము నందగా ప్రేయోరతి కన్పించును.

హర్ష శ్చిత్తసముల్లాసః కథ్యతే స చతుర్విధః

ఏకః పరానందమయః శ్రీశమహాత్మ్యకారణమ్‌.೧೨

ఇక హర్షము నిర్వచింపబడు చున్నది. ఇష్టవిషయప్రాప్తిలో కలుగు సుఖవిశేషమే హర్షము. చిత్తసముల్లాసాత్మకమగు హర్షము నాల్గువిధముల గలదు. ఇందు మొదటిది పరానందమయము. నిరతిశయానంద ప్రచురమైన ఈహర్షము శ్రీశమాహాత్మ్యకారణము. మహాత్మ్యరూపమగు విషయము యొక్క జ్ఞానము మానవునకు హర్షమున కలుగగలదు. ఈ హర్షము భగవ న్మహత్త్వానుభవ జనకత్వ యోగ్యము.

తజ్జన్యాయాం ద్రుతౌ శుద్ధా రిత ర్గోవిందగోచరా

ఏతదంతం హి శాస్త్రేషు సాధనామ్నా న మిష్యతే.3

హర్షమువలన కలుగు చిత్తద్రుతియందు భగవద్విషయక మగు రతి శుద్ధమై, సంకర మిశ్రణాది రహితమై భాసించును. పరమ పురుషార్థోప లబ్ధ్యుపాయ ప్రతిపాదకము లగు శాస్త్రములయందే నిశ్చయముగా పరమపురుషార్థప్రాపకములను గూర్చిన ఉపదేశము. కన్పించును. ఇట్టి ఉపదేశము పూర్వోక్తహర్షమున గలదు గనుక నీ హర్షరూపము ప్రధానమగును. కావుననే భాగవత (5.5.5-6) మీ హర్ష ప్రధాన్యమును ప్రస్తావించుచున్నది.

వ్రీడావికృత వాగ్వేష చేష్టా೭೭ది జనితో పరః

తజ్జన్యాయాం ద్రుతౌ చేతో వికాసో హాస ఉచ్యతే. ೧೪

హర్షముయొక్క ద్వితీయరూప మిచట చెప్పబడుచున్నది. సిగ్గుచే వికృతమైన వాగ్వేష చేష్టాదులద్వారా జన్మించు హర్షము రెండవది. ఈ హర్షమువలన కలుగు చిత్తద్రవీభావమున చిత్తవికాసరూప మగు హాసమున్నది.

లోకోత్తర చమత్కారి వస్తు దర్శనజః వరః

తజ్జన్యాయాం ద్రుతౌ చేతోవికాసో విస్మయో యతః೧೫

అస్వాభావికము, అలౌకికము, సుఖవిశేషజనకము నగు వస్తుజ్ఞానమువలన నుద్భవించు హర్షము మూడవది. ఈహర్షజనితమగు చిత్తద్రుతియందు చిత్తవాకాస రూప మగు విస్మయము గలదు.

యుద్ధాది తాప జనితో వీరాణాం జాయతే పరః

జితచిత్తస్య విస్తారో ద్రుత స్యోత్సాహ ఉచ్యతే.೧೯

యుద్దము మొదలగువాని ప్రజ్వలనముద్వారా శూరులకు జన్మించు హర్షము నాల్గవది. జితునిచిత్తము ద్రవీభూతమైనచో కన్పించు చిత్తవిస్తార రూపమగు ఉత్సాహమిచట గలదు.

ఇష్టవిచ్ఛేదజనితో యశ్చిత్తే క్లిష్టతోదయః

తజ్జన్యాయాం ద్రుతౌ విష్టారతతా శోక ఉచ్యతే.

శోకము నిక చెప్పచున్నాము. ఇష్ట విషయమునుండి వియోగము కలుగ సంభవించు చిత్తవ్యాకులత్వమును శోకమని యందురు. ఈ శోకజనితమగు ద్రుతచిత్తమున ప్రవేశించు రతిభావమే శోకము. రతి యను భావము నాధారముగా జేసి కొని శోకము వచ్చును.

దయా ఘృణాస్యాద్విషయతుచ్ఛత్వ జ్ఞాన దీర్ఘికా

తయా ద్రుతే తు మనసి జుగుప్సా జాయతే త్రిధా.8

చిత్తద్రావకము లని కొన్నింటిని నిర్దేశించితిమి. ఇచట సందర్భశుద్ధ్యర్థము దయ నిర్వచింపబడు చున్నది. విషయములు క్షుద్రములను జ్ఞానము కలుగగా గొప్ప దయ బయలుదేరును. విషయములను గూర్చిన తుచ్ఛత్వజ్ఞానము ఉద్వేజకత్వ, క్షోభకత్వ, వివేకానాస్పదత్వ రూపములతో మూడు విధముల కలుగుచున్నది. ద్రుతచిత్తమున జుగుప్స సహితము మూడు విధములుగా గలదని వ్యవహరించు చున్నారు. ఈ మూడు విధములు తర్వాతి రెండు కారికలలో నీయబడినవి.

పూతి వ్రణాది విషయే కథితో ద్వేగినీ బుధైః

శ్మశానోత్థపిశాచాది విషయా క్షోభిణీ భ##వేత్‌.೧೯

దేహేంద్రియాదిదుఃఖే త్వవిచారణపురఃసరా

ఘృణా శుద్ధేతి కవిభిః సా జుగుప్సా ప్రకీర్తితా.

దుర్గంధము, వ్రణములు మొదలగు విషయములపై కలుగు జుగుప్స లేక ఏవగింపు, ఉద్వేగిని యనబడును. శ్మశానము, పిశాచములు మొదలగు విషయములపై కలుగు ఏవగింపును క్షోభిణీ యందురు శరీరేంద్రియాది నిబంధనమైన దుఃఖమును విషయముగా గలిగిన జుగుప్స వివేకరాహిత్యమును పురస్కరించుకొని కలుగును. బాహ్యోపాధి సంపర్కము లేకపోవుటచే నీ యవివేకపురస్సర మగు జుగుప్సను శుద్ధ మగు దయ యని పిలుతురు.

యాతు శోచ్యస్య రక్షార్థం ప్రవృత్తి రనుకంపయా

తయాద్రుతే తు మనసి దయోత్సాహః స్మృతో బుధైః.

ప్రసంగవశమున ఉత్సాహరూపములను చెప్పదలచి మొదటి దయోత్పాహము నిట నిర్వచించు చున్నాము. దయనీయమగు విషమయును రక్షించుటకై కలుగు కృపాసహిత మగు ప్రవృత్తియందు చిత్తద్రుతి కలుగ దయోత్సాహము బయలుదేరును.

సర్వస్వ మపి దాస్యామి ప్రార్థయేతి చ యో మహా&

é ఉద్యమా ద్రుతచిత్తస్య దానోత్సాహః స ఉచ్యతే.೨೨

స్వాభీష్టవస్తువు నర్థించగా తదర్థము సమస్తమును దానము చేయవలెనను ప్రశంసనీయమగు ఉత్సాహ మెవనికి కల్గునో అట్టివానికి దానోత్సాహము గలదని యనవలెను.

తధా స్వధర్మరక్షార్థం యా ప్రవృత్తిః ప్రయత్నతః

తయా చిత్తస్య విస్తారో ధర్మోత్సాహోద్రుతౌ భ##వేత్‌.

స్వధర్మమును ప్రయత్న పూర్వకముగా చేతనైనంత వరకు రక్షించుకొన వలెనను ప్రవృత్తి గలవాని ద్రుతచిత్తమున చిత్తవిస్తార రూప మగు ధర్మోత్సాహము ప్రతీయమానమగును.

వశీకారాఖ్య వైరాగ్యం యత్‌ కామాస్పృహతాత్మకమ్‌

తేన ద్రుతస్య చిత్తస్య ప్రకాశః శమ ఉచ్యతే. ೨೪

శమమను భావమిక నిర్వచింపబడుచున్నది. కామనా విషయము లేకపోవుటచే హృదయము రాగశూన్య మగును. ఐహి కాముష్మిక విషయములపై వాంఛ లేని వీతరాగునకు వశీకారవైరాగ్యము గలదని వెనుక జెప్పితిమి. ఈ వైరాగ్యమూలకముగా ద్రవీభూతమైన చిత్తమున కన్పించు చిత్తప్రకాశమును శమమని వ్యవహరింతురు.

ఇతో న్యథా తు చిత్తస్యన ద్రుతి ర్విద్యతే క్వచిద్‌

తదభావా త్తు భావో న నిరుక్తాన్యో స్తి కశ్చన. ೨೫

కామ, క్రోధ, భయ, స్నేహ, హర్ష, శోక, దయా, శమములచే చిత్తము ద్రవీభావము నందుచున్నది. వీటికంటే భిన్నమగు ప్రకారములద్వారా చిత్తద్రుతి కలుగ నేరదు. ఈ ఎనిమిదింటికన్న విలక్షణమగు స్థాయిభావము లేదని భావము. స్థాయిభావము లేనిచో రసము నిష్పన్నము కాజాలదు భక్తిరసమునకు భగవద్విషయకమగు రతి యవసరమని చెప్పితిమి. స్థాయిభూతమగు రతియందు చిత్తము భగవదాకా రతాక మగును. ఇట్లగుటకు చిత్త ద్రుతి యవసరము. చిత్తము ద్రవించుటకు తాపకద్రవ్యములు కావలెను. కామాదులగు పైన జెప్పిన అష్టభావములే తాపకము లగుచున్నవి. వీటికంటె భిన్నమైన స్థాయిభావము లేదనవలెను.

యావత్యోద్రుత యశ్చిత్తే భావాస్తావంత ఏవహి

స్థాయినో, రసతాంయాంతి విభావాది సమాశ్రయాత్‌.೨೯

చిత్తద్రుతు లెన్ని తెరగుల గలవో, అన్ని భావములే కలవని యెంచవలెను. అనుగతములగు కామాద్యుపాధులచే నుపహితము లైనవి చిత్తవృత్తు లగుటచేత, చిత్తద్రుతు లసం ఖ్యాకములుగావని, భావముల సంఖ్యనేచిత్తద్రుతులసంఖ్యగా గూడ నెంచవలెనని నిశ్చయించుచుంటిమి. చిత్తద్రుతులకంటె నభిన్నములగు స్థాయిభావముల సంఖ్య సహిత మిట్లే నిశ్చితమగుచున్నది. ఈస్థాయిభావములకు విభావాది సంయోగము కలుగ రసత్వము సిద్ధించుచున్నది. ఏ భావము మాత్రమే రసముగా పరిణమించ గలదో, ఆ భావమునే స్థాయిభావమని వ్యవహరించ వలెను.

ఇక చిత్తద్రుతి సామాన్యము లగుస్థాయిభావములకు భగవద్విషయక మగు రసత్వ మెట్లు సిద్ధించునో చెప్పబోవు చున్నాడు.

ధర్మోత్సాహూ దయోత్సాహూ జుగుస్సా త్రివిధా శమః షడ ప్యేతే న విషయా భగవద్విషయా నహి.

ధర్మోత్సాహము, దయోత్సాహము, త్రివిధముగా నున్న జుగుప్స శమము అను నారు భావములు విభావాను భావ సంచారిభావములతో సమన్వితములై, పరిపుష్టమములు కాగా లౌకిక రసములుగా పరిణమించు చున్నవి. లౌకికరసాస్వాద యోగ్యములగు భావములకు భక్త్యంగత్వము కుదురదు. ఈ భావము తర్వాతిశ్లోకమున దృఢపరచు చున్నాడు.

ధర్మవీరో దయావీరో భీభత్సః శాంత ఇ త్యమీ,

అతో న భక్తిరసతాం యాంతి భిన్నస్పదత్వతః.8

ధర్మానుబంధి యగు వీరరసము, దయానుబంధి యగువీరరసము, జుగుప్సాత్రయాత్మక మగు త్రివిధ భీభత్సరసములు శాంతము అను వారు రసములు భక్తిరసముగా పరిణమించ జాలవు వీటియందు భజనీయ మగు నాలంబన విభావము లేక పోవుటయే ఇందులకు ప్రబల హేతువు.

"రాజ్యము, ధనము, దేహము, భార్య, సోదరులు పుత్రులు,ఈ లోకమున నేను చేకూర్చినది. మొదలగునవి యన్నియు సర్వదా ధర్మమునకై ఉద్యతములై యున్నవి." అని పలికినపుడు యుధిష్ఠిరునకు కల్గిన ఉత్సాహము ధర్మవిషయకమే గాని, భగద్విషయకము గాదు. "దినావసానమగుటచే దీనిలేగదూడ తల్లికై ఉత్సుకురాలగును గనుక నీ వసిష్ఠమహర్షియొక్క ధేనువును వదలి, నాశరీరమును భక్షించి నీ యాకలిని బాపికొనుము" అని సింహమును గూర్చి దిలీపుడు పల్కినపుడు కన్పించు ఉత్సాహ ధేనువిషయకమైన దయకు జెందినది. ఇట్లే ఉద్వేగిని యగు జుగుప్సనుండి, క్షోభిణియగు జుగుప్సనుండి, దుఃఖనిబంధనమగు శుద్ధజుగుప్సనుండి, జన్మించు భీభత్సరసమున కాలంబన విభావము బాహ్యజగములోని విషయరూపమున గలదు. శాంతమున శృంగారాది రసములవంటి రసముగా గ్రహించినచో శాంతమునగూడ నిట్టి స్థితియే కన్పించును.

శాంతము రసమాకాదా? యను చర్చనాలంకారికులు జరిపియున్నారు. శృంగారము, హాస్యము, కరుణ, రౌద్రము, వీరము, భయానకము, భీభత్సము, అద్భుతము నను ఎనిమిది రసములు గలవు, వీటిలో శృంగార, హాస్య. కరుణ. అద్భుతములు ప్రథానములు. మిగిలిన రసముల నన్నింటిని వీటియందతర్భూతములుగా గ్రహించ వచ్చును. కాని శాంతరస మిట్లు అంతర్భూతమగునని చెప్ప వీలులేదు. శాంతము రసమే కాదని కొందరు. తొమ్మిదవ రసమని కొందరు వాదించియున్నారు. సాహిత్యమున గల పరమపురషార్థమే శాంతమని శాంతరసోపక్షేపకమై నాట్యశాస్త్రము గలదని వాదించిన వాడు భట్టనాయకుడు. ఈ వాదము నంగీకరించిన అభినవగుప్తుడు శాంతమే రసమని, మహారసమని, ప్రస్తుతించెను. శృంగారా ద్యష్టరసములవంటిది శాంతము గాదని స్పష్టము. (*మూడవ అనుబంధము చూడుడు.)

ఏవంవిధ మగు శాంతము భక్తిరసమున సహితము ప్రతీయమానము కావలె ననిన భక్తి యనునది రసముగావలెను. భక్తిరసమునకు భగవద్విషయక మగు రతియే స్థాయిభావము. ఈరతిని శుద్ధసత్త్వవిశేషాత్మక మగు రతియని గ్రహించవలెను. ఇట్టి రతియందు పైన వివరింపబడిన శమమే భాసించును. శమాత్మక మగు రతియే భగవద్విషయకమై భక్తిరస మనబడు చున్నది. ఇదే సందర్భమున_

అక్షరం పరమం బ్రహ్మ సనాతన మజం విభుమ్‌

వేదాంతేషు వదం త్యేకం చైతన్యం జ్యోతి రీశ్వరమ్‌.

ఆనందః సహజ స్తస్య వ్యజ్యతే సకదాచన

వ్యక్తిః సాతస్య చైతన్య చమత్కార రసాహ్వాయా."

అను అగ్ని పురాణశ్లోకముల ననుసంధింపవలెను. ఈ భక్తిరసము దాస్య, సఖ్య, వాత్సల్య రూపములతో గూడ కన్పించుట గలదు.

ఈర్ష్యాజ భయజ ద్వేషా భగవద్విషయా వపి,

న భక్తిరసతాం యాతః సాక్షా ద్ద్రుతివిరోధతః೨೯

ఈర్ష్యాజనిత మగు ద్వేషమున, భయజనితమగు ద్వేషమునగూడ ద్వేషింపబడు విషమయు భగవంతుడైనను ఈ ద్వేషములు చిత్తద్రవీకరణకు సాక్షాద్విరోధు లగుటచే నివిభక్తిరసములోనికి పరిణమించ లేకున్నవి. జుగుప్సాదులలో చిత్తద్రుతి యున్నను భగవంతుడను నాలంబన విభావము లేకపోవుటచే జుగుప్సాదులు భక్తిరసముగా పరిణమించలేవు. పైనజెప్పిన రెండు విధములగు ద్వేషములు భగవద్విషకము లైనను, చిత్తద్రుతిరహితము లగుటచే భక్తిరసముగా మారుట లేదని తాత్పర్యము. చిత్తద్రుతి, భగవద్విషయకత్వము అను రెండును భక్తిరసమున కవసర మైనవి

శుద్ధో రౌద్రరస స్తత్ర తథా రౌద్రభయానకః,

నాస్వాద్యః సుధియా ప్రీతివిరోధేన మనా గపి. 30

శుద్ధ మగు ఈర్ష్యనుండి జన్మించిన క్రోధమును స్థాయిభావముగా గల్గిన రౌద్రరసము, ఈర్ష్యాజనితమగు ద్వేషముతో సంకీర్ణమైన భయమును స్థాయిగా గల్గిన రౌద్రభయానకము గూడ రసములు కాగలవే కాని భక్తిరసముగా పరిణమించజాలవు. ఈ రెండు రసములయందు విషయముపై ప్రీతి కన్పించకపోవుటయే ఇందులకు కారణము. కావుననే ప్రీతి నాదరించు భక్తు లీ రసముల నాస్వాదింప లేకున్నారు.

కామజే ద్వే రతీ శోకః ప్రీతి భీ విస్మయ స్తథా,

ఉత్సాహూయది దానే చ భగవద్విషయా అమీ. 3

సంభోగవిప్రలంభ రూపమగు రతిద్వయము, శోక, ప్రీతి, భయ, విస్మయ, దగాన , ఉత్సాహములు నను భావములు మాత్రమే భగవద్విషయకము లైనవి.

వ్యామిశ్రభావరూపత్వం యాం త్యే తే క్షీరనీరవత్‌,

విభావాదిసమాయోగే తథా భక్తిరసా అపి 3

పై శ్లోకమున చెప్పబడిన భావములకు విభావానుభావసంచారి భావములతో సంయోగము కలుగగా నివియన్నియు పాలు, నీరు కలసి పోవునట్లు వ్యామిశ్రితము లగుచున్నవి అప్పుడే ఇవి రసములు కాగలవు. ఇవి భగవద్విషయకము లైనచో భక్తిరసములని వ్యవహరించబడు చున్నవి.

శృంగారః కరుణో హాస్య స్తధా ప్రీతి ర్భయానకః,

అద్భుతో యుద్ధవీర శ్చ దానవీరశ్చ మిశ్రితాః 33

శృంగార, కరుణ, హాస్య, ప్రీతి, భయానక, అద్భుత, యుద్ధవీర, దానవీరములయందు ఆయాస్థాయిభావములు తత్త దుచిత విభావములతో వ్యామిశ్రితములై ఈ రసములుగా నిష్పన్నము లగుచున్నవి. వ్యామిశ్రితత్వమున నీటిని పాలనుండి ఎట్లు వేరుచేయజాలమో, అట్లే ఈ భావములను వేరుపరచలేమను నర్థము కలదు.

శుద్ధా చ వత్సల రతిః ప్రేయోరతి రితి త్రయీ,

భవాంతరామిశ్రితత్వా దమిశ్రా రతి రుచ్యతే. 3

శుద్ధరతి, వత్సలరతి, ప్రేయోరతి, యని మూడు విధములుగా రతి యను భావము మూడు రసములలోనికి పరిణమించుచున్నది. ఈభావము లన్యభావములతో వ్యమిశ్రితములు గాకపోవుటచే నిచటగల రతిని అమిశ్రరతి యనవలెను.

విశుద్ధో వత్సలః ప్రేయానితి భక్తిరసా స్త్రయః,

రసాంతరామిశ్రితా స్తే భవంతి పరిపుష్కలాః.3

శుద్ధరతినుండి విశుద్ధరసము, వత్సలరతి యను స్థాయి భావమునుండి వత్సలరసము, ప్రేయోరతి స్థాయిభావజన్యమై ప్రేయోరసము నిష్పన్నము లగుచున్నవి. వీటి స్థాయిభావము లన్యభావములతో మిశ్రితములు గానట్లే ఈ రసములు గూడ నన్యరసములతో మిశ్రితములు గాకపోవుటచే వీటిని నిసర్గపూర్ణ స్వభావకము లనవలెను.

శృంగారో మిశ్రితత్వే7పి సర్వేభ్వో బలవత్తరః,

తీవ్ర తీవ్రతరత్వం తురతే స్తత్త్రైవ వీక్షతే.39

కేవల సంకీర్ణ మిశ్రితము. స్వేతర కేవల మిశ్రితము, శుద్ధము నగురసము లన్నిటికంటె కామమిశ్రితమైన శృంగారము నిరతిశయ చమత్కారాత్మక మగుటచే బలవత్తరము. సంభోగశృంగారమున తీవ్రముగను, విప్రలంభ శృంగారమున తీవ్రతరముగను రతి యుండును. పూర్వ రాగమున రతి తీవ్రతమమై యుండును.

కేతి త్కే వలసంకీర్ణాః కేచి త్సంకీర్ణమిశ్రితాః

కేచి త్కేవలమిశ్రాశ్చ శుద్ధా శ్చస్యు శ్చతుర్విధాః3

రసములు నాలుగు విధములు గలవు. ఒకభావమునకు అన్యభావసంయోగము కలుగగా వచ్చు రసము కెవలసంకీర్ణము. ఒకభావ మన్యభావముతో సంకీర్ణమైన సంకీర్ణమిశ్రితమగు రసము రాగలదు. రతికి భావాంతర యోగము కల్గిన కేవలసంకీర్ణమగు రసము రాగలదు. భావాంతర సంకీర్ణ మీరతికి కలుగగా, అనగా భగవద్భిన్నమగు నాలంబనము రాగా సంకీర్ణమిశ్రిత రసము వచ్చును. భగద్విషయక మైనను రతికి భావాంతరసంయోగము కలుగ కేవలమిశ్రితరసము నిష్పన్నమగును. భావాంతర సంయోగము లేనిచో శుద్ధరసముత్పన్న మగును.

తత్ర కేవలసంకీర్ణా రౌద్రో రౌద్రభయానకః

ధర్మవీరో దానవీరో భీభత్సః శాంత ఇత్యపి.38

మిశ్రా ఏవాన్యవిషయాః ప్రోక్తాః సంకీర్ణమిశ్రితాః,

భగవద్విషయా స్తే తు ఖ్యాతాః కేవలమిశ్రితాః39

శుద్ధా స్త్రయః పురై వోక్తాః సంకీర్యంతే న కేనచిత్‌.

ఏవం నిరూపితా భక్తిః సంక్షేపా దుచ్యతే పునఃం4

క్రోధ, భయ, ఉత్సాహ, జుగుప్సా, నిర్వేదము లన్య భావములతో సంయోగమునందిన రౌద్రము, రౌద్రభయానకము, ధర్మ దాన వీరములు, భీభత్సము, శాంతము అను కేవల సంకీర్ణరనములు క్రమముగా నిష్పన్నము లగుచున్నవి. వీటికి ఆలంబనవిభావ మవసరము. భగవదాలంబనము లైనచో నివి కేవల మిశ్రితము లగునవి భగవద్భిన్నా లంబనకము లైనచో నివి సంకీర్ణ మిశ్రితములని తెలియవలెను. భావాంతరసంయోగము పొందక, భగవద్విషయములై యున్నచో నివి శుద్ధము లనబడు చున్నవి.

ఇట్లు సంక్షిప్తముగా చెప్పబడిన భక్తినిక ముందు వివరించ బోవుచున్నాడు.

రాజసీ తామసీ శుద్ధసాత్వికీ మిశ్రితా చ సా,

ఈర్ష్యాజ ద్వేషజా77ద్యా స్యా ద్భయజ ద్వేషజాపరా.

హర్షజా శుద్ధసత్త్వోత్థా కామశో కాదిజే తరా,

సత్త్వజత్వేతు సర్వాసాం గుణాంతరకృతాభిదా.24

రజోగుణ ప్రధానము, తమోగుణ ప్రధానము, శుద్ద సత్త్వగుణ ప్రధానము, ఏతద్గుణ మిశ్రితమునని భక్తి నాలుగు విధములగలదు. ఈర్ష్యాజనితమగు ద్వేషమునుండి వచ్చునది రాజసీభక్తి. భయజనితమగు ద్వేషమునుండి వచ్చునది తామసీభక్తి. హర్షజనితమైనది సాత్త్వికీభక్తి. కామశోకాది జనితమైనది మిశ్రితమైన భక్తి. ఈరీతిగా సాంఖ్యమతాను సారము నాలుగు విధముల భక్తి. కన్పించుచున్నది. ఈ భక్తి విధములన్నియు సత్త్వగుణజనితము లైనను, ఏభక్తిలో నేగుణ మధీకముగా కన్పించునో ఆగుణవిశిష్టమైనదా భక్తియని తెలియవలెను.

తత్రతే రతితాం నైవ యాతః సుఖవిరోధతః,

రతిశబ్దంతు భజతః సుఖమ¸°్య పరే ద్రుతీ.43

ఈనాలుగు విధములుగా నున్న భక్తియందు భిన్నములగు స్థాయిభావములు గలవు. రాజసీభక్తి, తామసీ భక్తి యనునని సుఖవిరోధింయగు దుఃఖముతో గూడిన ద్వేషాదులచే సంవలితము లగుటచే రతిస్వభావము నెన్నటికిని పొందజాలవు. మిగిలిన రెంటియందు సత్త్వము ప్రధానముగా గలదు గనుక నివి సుఖమయములు. వీటియందు మాత్రమే రతిస్వభావము కన్పించును. పతంజలి సహితము " సుఖానుశాయీ రాగః" "దుఃఖానుశాయీ ద్వేషః" అనినాడు.

భక్తి శ్చతుర్విధా ప్యేషా భగవద్విషయా స్థిరా,

దృష్టాదృష్టోభ##యై కైకఫలా భక్తి స్త్రిధా భ##వేత్‌.44

చతుర్విధ మగు భక్తిని ప్రకారాంతరమున త్రివిధముగా గ్రహించ వచ్చును. భగవద్విషయకమైస్థిరముగా నున్న భక్తి దృష్టాదృష్టోభయ ఫలా యని, దృష్టమాత్ర ఫలా యని, అదృష్టమాత్రఫలా యని మూడు విధములు.

రాజసీ తామసీ భక్తి రదృష్టఫలమాత్రభాక్‌,

దృష్టాదృష్టోభయ ఫలా మిశ్రితా భక్తి రిష్యతే. 45

రాజసీ భక్తికి, తామసీభక్తికి కేవల మదృష్టఫలమే గలదు. మిశ్రితమైన భక్తికి వృష్టాదృష్టోభయ ఫలమే గలదు.

శుద్ధ సత్త్వోద్భవా7ప్యేవం సాధకే ష్వస్మదాదిషు,

దృష్టమాత్రఫలా సాతు సిద్ధేషు సనకాదిషు.49

దృష్టాదృష్టోభయ ఫల రూపమగు భక్తి శుద్ధసత్త్వమగు భక్తిగాగూడ కన్పించ వీలున్నది. ఈ విధమైన భక్తి ద్వారా సుఖరూపమగు దృష్టఫలము, అభ్యుదయ నిఃశ్రేయ సాది రూపమగు నదృష్టఫలము సాధకులకు కలుగుచున్నది. నైసర్గికముగా నాప్తకాములైన సిద్ధులగు సనకాదులకు భక్తి ద్వారా దృష్టమాత్రఫలమే లభించుచున్నది. భజనీయమగు భగవత్స్వరూపమే లోకోత్తర శక్తియై ఆత్మారాములగు సిద్ధులను సహిత మాకర్షించు చున్నది.

దృష్టాదృష్టఫలా భక్తిః సుఖవ్యక్తే ర్విధే రపి,

నిదాఘదూనదేహస్య గంగాస్నానక్రియాయథా.4

భక్తిద్వారా సుఖాభివ్యక్తి ప్రత్యక్షముగా ననుభూత మైనచో నీ సుకమును దృష్టఫల మందుము. "ఆత్మేత్యేవోపాసీత" అను నుపనిషద్వాక్యమలు.

"తస్మాద్భారత! సర్వాత్మా భగవా9హరి రీశ్వరః,

శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ స్మర్తవ్య శ్చోచ్ఛతా7 భయమ్‌."

అను భాగవతాది వచనములు సుఖప్రాప్తిని ఫలముగా గలవిధులను విధించుచున్నవి. భక్తిఫల మభయప్రాప్తి. ఎండలో నలసిపోయిన వానికి గంగాస్నానమెట్లు సుఖకర మగుచుదృష్టఫలము నొసగుచున్నదో, అట్లే భక్తిగూడ దృష్టఫలము నీయగల్గుచున్నది. ఈ దృష్టఫలముతో బాటు అభయత్వాది రూపమగు నదృష్టఫలమును గూడ భక్తి తీసికొని రాగల్గుచున్నది.

రజస్తమో7భిభూతస్య దృష్టాంశః ప్రతిబధ్యతే,

శీతవాతాతురస్యేవ నాదృష్టాంశస్తు హీయతే.48

రజస్తమోగుణములచే నభిభూత మగు సత్త్వగుణము గలవానికి దృష్టఫలము విరుద్ధ మగుచున్నది. వర్తమాన దేహ సమాశ్రయమై కర్మ లాచరింప బడుచున్నవి. ఈ కర్మ ఫలోపభోగము ప్రారబ్ధకర్మవశ మగుటచే నీ ప్రారబ్ధకర్మ దృష్టఫలమునకు ప్రతిబంధక మగును. ఈరీతిగా నదృష్టఫలభాగము నిరోధింపబడజాలదు. కలుగబోవు జన్మలో నీ యదృష్టఫలము ననుభవించుటకు ప్రారబ్ధకర్మ ప్రతిబంధకముగా నుండక, సహకారి యగుచున్నది. శీతవాతాదులచే బాధింపబడువానికి గంగాస్నానమున సుఖము కలుగదు. ఇట్లే ఆముష్మికమగు అభ్యుదయాదికము నశించదని తాత్పర్యము.

తథైవ జీవన్ముక్తానా మదృంష్టాంశో న విద్యతే,

స్నాత్వా భుక్తవతాం భూయో గంగాయాం క్రీడతాంయథా.

రజస్తమో గుణములచే నభిభూతు లైనవారికి దృష్టఫలము లేనట్లు, జీవన్ముక్తుల కదృష్టఫలములేదు. జీన్ముక్తులకిది చరమదేహస్థితి యగుటచేతను, ప్రారబ్ధకర్మ ఇంకను వారిని బాధించలేదు గనుకను అదృష్టఫలము వీరికిలేదు. భోగార్హమైన దేహ మున్ననే ఫలాఫలవివేకము బయలు దేరును. గంగాస్నానము జేసినతర్వాత భుజించిన వారలకు మరల గంగాస్నానము చేసినను ఫలము లేనట్లే జీవన్ముక్తుల విషయమునగూడ చెప్పికొనవలెను.

వర్తమాన తనుప్రాప్యం ఫలం దృష్ట ముదాహృతమ్‌,

భావిదే హూపభోగ్యం యత్త దదృష్ట ముదీరితమ్‌. 4

వర్తమానమగు దేహముచే ననుభూత మగునది దృష్ట ఫలమని, కలుగబోవు జన్మలో వచ్చు దేహముతొ గలుగు నునుభూతి అదృష్టఫలమని తెలియవలెను.

రజస్తమఃప్రచండత్వే సుఖవ్యక్తి రసత్సమా,

తీవ్రవాయువినిక్షిప్త ద్వీపజ్వాలేవ భాసతే.41

తస్మాత్స్వయంప్రభా77 నందాకారా7 పి మతిసంతతిః.

ప్రతిబంధవశా న్న స్యా త్సుఖవ్యక్తిపదాస్పదమ్‌.42

రజస్తమో గుణాత్మకము లగు భక్తివిశేషములలో రతియనుభావముదయించదు. రజస్తమోగుణము లుద్రిక్తములైన అనుభూయమాన మగు సుఖము వాస్తవికముగాదు. ఈసుఖ్యము స్వకార్యకృతమై సంభవించినది గాదు. తీవ్రమైన వాయువు వీచగా దీపజ్వాల దేదీప్యమానముగా ప్రకాశించి, ఆరిపోవు చున్నది. ఈ ప్రకాశము వాయువువలన జన్మించిన స్వాభావిక ఫలము గాకపోవుటచే, తర్వాత ప్రకాశాభావము వచ్చుచున్నది. గదా! స్వతఃప్రకాశము, సుఖాత్మకము నగు చిత్సంతతి రజస్తమో గుణము లనబడు ప్రతిబంధకములచే నావృత మగుటచే సుఖాత్మకముగా భాసించుటలేదు.

రజఃప్రజలసత్త్వాంశా దీర్ష్యాజద్వేష మిశ్రితా,

మనోవృత్తిః పరానందే చైద్యన్య న సుఖాయతే.53

రజోగుణము ప్రబలముగా నుండ అందలి సత్త్వ గుణమునుండి బయలుదేరున దీర్ష్య. ఏవంవిధమగు నీర్ష్యనుండి వచ్చు ద్వేషముతో మిశ్రితమైన మనోవృత్తి సుఖావహము కాజాలదు. కావుననే శిశుపాలునకు సుఖప్రాప్తి లేక పోయినది.

తమః ప్రబలసత్త్వాంశా ద్భీతిజద్వేషమిశ్రితా.

మనోవృత్తిః పరానందే కంసస్య న సుఖాయతే.54

తమోగుణము ప్రబలముగా నుండ అందలి సత్త్వ గుణమునుండి జన్మించిన భయముద్వారా ద్వేష ముత్పన్నమగును. ఈద్వేషముతో మిశ్రితమైన మనోవృత్తి సుఖావహము కాజాలదు. గనుకనే కంసుడు సుఖింపజాలక పోయెను.

తయో ర్భావిశరీరేతు ప్రతిబంధక్షయె సతి

సైవ చిత్తద్రుతిర్భక్తి రసతాం ప్రతివద్యతే.55

శిశుపాల కంసులవంటి వారలకు తర్వాత జన్మలో శాష, కర్మాది భోగప్రతిబంధకములు నశించగా చిత్తద్రుతి కలుగును. ఈ చిత్తద్రుతియందు భగవదాకారత మనస్సు నావేశించగా భక్తియోగము, తత్సుఖము లబించగలవు.

అథునా7పి భజంతో యే ద్వేషాత్పాశుపతాదయః,

తేషా మ ప్యేవ మేవ స్యా దథవా7నేన తుల్యతా.59

వర్తమాన సమయమునగూడ నెవరు భగవంతునిపై ద్వేషభావమును వహించి, భగవత్ప్రాతికూల్యము నాచరింతురో. అట్టివారలకు గూడ భగవత్కృపద్వారా మాత్రమే భక్తిసుఖానుభూతి కలుగగలదు. భక్తులకు కలుగు సుఖాను భూతితో సమానమగు సుఖము వీరికి కలుగుగలదు.

ద్రుతౌ సత్యాం భ##వే ద్భక్తి రద్రుతౌ తు న కించన

చిత్తద్రుతే రభావేన వేనస్తు కతమో7పిన.5

చిత్తద్రుతి కలిగిననే భక్తి ఉదయించ గలదు. చిత్తద్రుతి లేనిచో భగవదాకారత మనస్సు నావేశించ లేకపోవుటచే భక్తికలుగనేరదు. పరమ భాగవత చక్రవర్తి యగు పృథుమహారాజు తండ్రియైన వేనుడు సాత్త్వికా, రాజస, తామస భక్తులలో నొకడును గాకపోవుటకు చిత్తద్రుతి కలుగక పోవుటయే కారణము.

రజస్తమోవిహీనాతు భగవద్విషయా మతిః,

సుఖాభివ్యంజకత్వేన రతి రి త్యభిధీయతే.58

రజస్తమో గుణరహితమై, భగవద్విషయకమైన చిత్తవృత్తి యున్నచో నీవిధమగు స్థితి సుఖాభివ్యంజక మని అందుచే భగవద్విషయక రతిభావ సంపన్నమని చెప్పవలెను.

స్నేహసై#్యవ వికారః ప్రియయో రత్యంతభావనా దనిశమ్‌,

విరహాసహిష్ణుతా77 త్మా ప్రీతివిశేషోరతిర్నామ.59

ఒండొరు లొకరి కొక రాలంబనవిభావమైన నట్టివారిని ప్రియు లందరు. ఒండొరుల కనన్యత్వసంబంధము (అవినాభావము) గలదని భావము. ధారావాహికముగా, అవిచ్ఛిన్నముగా నత్యంత ముత్కంఠతో చింతనము చేయుటచే నీప్రియులకు కలుగు సంస్కారతాత్మక మగు స్నిగ్ధభావమును స్నేహమందురు. అన్యభావములతో సంసృష్టము గాని కేవలము స్నేహముయొక్క పరిణామమే రతియను భావము. అభీష్టవిషయము ప్రత్యక్షమున లేకపోయినచో కలుగు విరహమును వీరు సహింపజాలరు. అభీష్టవిషయ ప్రత్యక్షాభావజ్ఞానమును విరహమందురు. ఇట్టి విరహమును సహింపజాలక పోవుటచే కలుగు ప్రవృత్తినిమిత్తికమైన ప్రీతివిశేషమే రతి.

రజస్తమః సముచ్ఛేద తారతమ్యేన గమ్యతే,

తుల్యే7పి సాధనాభ్యాసే తారతమ్యం రతే రపి.9

సాధనాభ్యాసము సమాన మైనను రజస్తమోగుణములతో సంవలితమై, సముచ్ఛిన్నమై రతియందు సుఖావహత్వము స్వల్పముగా నుండును. రజస్తమము లంత ప్రధానముగా లేని రతియందుసుఖావహత్వ మధికముగా నుండును.

విరహే యాదృశం దుఃఖం తాదృశీ దృశ్యతే రతిః

మృదుమధ్యాధిమాత్రత్వ ద్విశేషో7 త్రాపి వీక్షతే.91

విరహావస్థలో ఏపరిమాణాదికము గలదుఃఖ మనుభూతమగునో, అంత పరిమాణాదికము గల రతి గలదని చెప్పవలెను. ఈ న్యూనాధికత్వము చిత్తద్రుతిభేదము నాశ్రయించుకొని వచ్చునది. విరహతాపము ననుసరించి యుండునది చిత్తద్రుతి. చిత్తద్రవీభావము ననుసరించి రతి ఉద్భూతమగును. విరహదుఃఖము ననుసరించి రతియను భావమున తారతమ్యములు కన్పించుచున్నను, మృదువుగను, మధ్యమముగను, తీవ్రముగను, రతివిశేష తారతమ్యము లను భూతము లగుచున్నవి.

వైకుంఠే ద్వారకాయాం చ శ్రీమద్‌బృందావనే తథా,

మృదుతీవ్ర మధ్యతీవ్రాతీవ్రతీవ్రా చసాక్రమాత్‌.92

వైకుంఠమున రతి మృదుత్వముగా ననుభూత మగును. ద్వారకలో మధ్యమమగు తీవ్రత్వముతో రతి ప్రతీయమాన మగును. బృందావనమున రతితీవ్రతమైన అవగత మగును.

ఇయం నిసర్గ సంస ర్గౌపమ్యాధ్యాత్మాభియోగజా,

సంప్రయోగాభిమానాభ్యాం సమారోపేస్థితా తథా.93

పైన రతిని త్రివిధమని వివరించితిమి. ఇక అష్టవిధముగా చెప్పుచున్నాము. మృదు తీవ్రత్వాది భేదవిశిష్టమైన రతి, ఎనిమిది విధముల గలదు. సంస్కారవిశేష మగు ఆత్మనుండి నిసర్గముగా వచ్చునది. యొకవిధము. సంసర్గజనిత మైనది రెండవది. కులరూపాది సామగ్రీ గౌరవముతో కలుగు సంబంధమును సంసర్గమందురు. భగవత్సాదృశ్యవిషయ భావననుండి వచ్చునది మూడవది. స్వరూపజనితము లేక అధ్యాత్మజనిత మైనది నాల్గవది. భావవ్యక్తి రూప మగు అభియోగము నుండి యుత్పన్న మగునది ఐదవది. సంప్రయోగజనిత మైనది యారవది. అభిమానజనితముగా నేడవది గలదు. సమారోపజనితమైన వైషయికరతి ఎనిమిదవది.

స్పర్శేశ##బ్దేతథా రూపేరసే గంధే చ కేవలే,

సముచ్చితే చ సా తత్రేత్యే కా షడ్విధా భ##వేత్‌.94

సమారోపజనిత మగు వైషయికరతియందలి విశేష మిచట చెప్పబడుచున్నది. శబ్ద, స్పర్శ, రూప, రస గంధములను విషయములకు జెందుటచే నిది వైషయిక మనబడు చున్నది. కేవల స్పర్శాదులనుండి సముదితమై సమారోపిత మగుచున్న రతి విభేదములు విషయభేదము నాశ్రయించుకొని పంచవిధములుగా గలవు. కాని మృదు, తీవ్ర, తీవ్ర తమ భేదములుగల రతి వీటితో కలియగా నారవవిధ మగు రతి గూడ సంప్రాప్తమగును. స్పర్శజన్యము, శబ్దజన్యము రూపజన్యము, రసజన్యము, గంధజన్యము, సముచ్చితవిషయ జన్యమునను ఆరు భేదములతో రతి యున్నది.

శుద్ధా వ్యామిశ్రితా చేతి పున రేషా ద్విధా భ##వేత్‌.

తత్రానుపాధిః శుద్ధా స్యా త్సోపాధి ర్మిశ్రితోదితా.95

పైన జెప్పబడిన భక్తి శుద్ధమని, వ్యామిశ్రితమని, రెండురకముల గలదు. ఉపాధిసహితమైన భక్తి, మిశ్రితమని, ఉపాధిరహితమైనది శుద్ధమని తెలియవలెను. ఇతర విషయములతో కలుగు నభిసంధిని ఉపాధియందురు.

అనుపాధిః పరానంద మహిమైక నిబంధనా,

భజనీయగుణానంత్యా దేకరూపైవ సోచ్యతే.99

అనుపాధిక మగు భక్తి నిచట చెప్పుచున్నాను. సామ్యాతిశయ శూన్యమగు లోకోత్తరానంద మేకము, అద్వితీయము, ఇట్టి పరానందమును ప్రయోజకముగా గలిగిన భక్తి ఉపాధిరహితమైనది. భగవంతుని గుణము లనంతము లగుటచే వాటిని లెక్కింప వశము గాకపోవుటవలన పరానందమహిమ నేకమని అద్వితీయమని చెప్పవలసి వచ్చినది.

కామసంబంధ భయతః సోపాధిస్త్రివిధా భ##వేత్‌.

విభావాదిసమాయోగే శుద్ధభక్తిరసో భ##వేత్‌.9

ఉపాధిసహితమైన భక్తి కామసంబంధ భయములను ఉపాధులతో మూడు విధముల గలదు. భక్తిరసస్థాయియగు రతి భావాంతరమున సంకీర్ణముగాక, విభావాది సంయోగము నందిన, శుద్ధమగుభక్తిరసము నిష్పన్నమగును.

శృంగారమిశ్రితా భక్తిః కామజా భక్తిరిష్యతే,

సంబంధజారతి ర్యాతి పూర్వోక్తాంరసతాం ద్వయోః.98

ఏకో వత్సలభక్త్యాఖ్యః ప్రేయోభక్తిస్తథా7పరా

భయజా రతి రధ్యాస్తే రసం ప్రీతిభయానకమ్‌.9&

ఉపాధిరహితమగు భక్తి వివరించబడు చున్నది.శృంగారముతో మిశ్రితమైన భక్తి కామమునుండి జన్మించు చున్నది. సంబంధజనితమైన భక్తి వాత్సల్య సఖ్య రసము లుగా పరిణమించుచున్నది. సఖ్యరసము ప్రేయోభక్తిరసమని, వాత్సల్యరసము, వాత్సల్యభక్తిరసమని యెంచవలెను. భయకారణజనితమైన చేతో ద్రుత్యాత్మకమగు రతి ప్రీతి భయానకమనబడు మిశ్రితరసముయొక్క స్థాయిభావ మగుచున్నది.

ఏకదా యద్యపి వ్యక్త మిదం రతి చతుష్టయమ్‌,

తదా తు పానకరసన్యాయేన పరమో రసః

కామము, సంబంధద్వయము, భయము అనువాని నుండి జన్మించు రతి యను నాల్గురతి భావములు గలవు. ఈ రతిభావము లేకాశ్రయములై ఉదయించుచున్నను, ఇవి పానకరసమువలె అనుభూతమగు చున్నవి. పానకమున ననేక ద్రవ్యములు కలియుచున్నను ఈ ద్రవ్యములరుచిని గాక తద్విలక్షణమగు రుచిని పానకమున గ్రహించుచున్నాము. ఇట్లే వివిధ భావ మిశ్రణమునగూడ విశిష్టమగు ననుభూతిగలదు. ఇదియొక చిత్రరసమువంటి యనుభూతియగును. కాని ఇట్టి యనుభూతి సర్వజనులకు కలుగునా? యను ప్రశ్నకు తర్వాతి శ్లోకమున సమాధాన మీయబడుచున్నది.

ఏక ద్వ్యాది రస వ్యక్తి భేదా ద్రసభిదా భ##వేత్‌,

తస్మాత్క్వచి త్తదభ్యాసం కుర్యా ద్రతిచతుష్టయో.

అభివ్యక్తములగు మార్గముల ననుసరించి రసములు పరస్పరము భిన్నములగుచున్నవి. హృదయసంవాద వశమున చిత్తమే రసమున కున్ముఖమగునో, ఆ రసమే ప్రతీతిమోగ్యమై ఆస్వాదింపబడు చున్నది. సాధనేచ్ఛగల వ్యక్తి ఇట్టి రసప్రతీతికే యత్నించవలెను. శుద్ధము, కామజము, సంబంధజనితము, భయజనితము నని నాల్గు విధముల రతిభావములు గలవని యుంటిమి. భయజనితమగు రతియందు గౌరవ, మర్యాదా, రక్షణ, సంభ్రమాదులతో గూడ వినయ విధేయతలు కన్పించుచున్నవి. శుద్ధరతినుండి శాంతము, భయజనితమగు రతినుండి దాన్యము, సంబంధజన్యమగు రతినుండి సఖ్య వాత్సల్యములు, కామజనితమగు రతినుండి శృంగారము వచ్చుచున్నవి. వీటిలో దేనియం దున్ముఖత గలదో దానిని అనుభవించుటకే మానవుడు యత్నించవలెను.

ప్రజదేవీషు చస్పష్టం దృష్టం రతిచతుష్టయమ్‌,

తచ్చిత్తాలంబనత్వేన స్వచిత్తం తాదృశం భ##వేత్‌.2

శాస్త్రప్రసిద్ధమగు రతిచతుష్టయము వ్రజసుందరులయందు ప్రతీతమైనదని స్పష్టముగా మన కవగతమే,వీరల చిత్తము నాలంబనము గావించుకొని సాధన చేయగా తాదృశచిత్తత్త్వ మితరులకు సహితము సంప్రాప్తము కాగలదు. భగవద్విషయకు మగు రతిచే రంజితమైన చిత్తమాలంబనమైన తాదృశచిత్తత్వము మనకుగూడ రాగలదు.

రసాంతర విభావాది సంకీర్ణా భగవద్రతిః,

చిత్రరూపవ దన్యాదృ గ్రసతాం ప్రతిపద్యతే. 3

హాస్యాది విభావాదులతో భగవద్విషయక రతిసంకీర్ణమై, చిత్రరసత్వము నందును. చిత్రరూపములోని వివిధాంగములకు విశిష్టమగు నూత్నరూపము సంభవించునట్లుగా నిట్టి భక్తిగూడ చిత్రత్వము నందును.

రసాంతర విభావాది రాహిత్యేతు స్వరూపభాక్‌,

దశమీ మేతి రసతాం సనకాదేరివాధికామ్‌.4

రసాంతర విభావములతో సంబంధములేని భగవద్రతి భగవత్స్వరూపభాజియై, సనకాది యోగులచే నాస్వాదింపబడు రతివలె విశిష్టమైన పదియవ రసము కాగలదు. శృంగారాది రసములకంటె విలక్షణమై రసముగా భక్తిప్రతీయమానమగు నని తాత్పర్యము.

రతి ర్దేవాదివిషయా వ్యభిచారీ తథోర్జితః,

భావః ప్రోక్తో రసో నేతి యదుక్తం రసకోవిధైః 5

దేవాంతరేషు జీవత్వాత్‌ పరానందాప్రకాశనాత్‌,

తద్యోజ్యం; పరమానందరూపే న పరమాత్మని.9

కాంతాదివిషయా వాయే రసాద్యాస్తత్ర నేదృశమ్‌,

రసత్వం పుష్యతే పూర్ణసుఖాస్పర్శిత్వకారణాత్‌.`ò`ò

పరిపూర్ణరసాక్షుద్ర రసేభ్యో భగవద్రతిః,

ఖద్యోతేభ్య ఇవాదిత్యప్రభేవ బలవత్తరా.8

భగవద్విషయకరతి రసముగా పరిణమించునా? లేదా? యను ప్రశ్న కిచట సమాధాన మీయబడుచున్నది. దేవాధి విషయకమై వ్యంజనద్వారా ప్రత్యాయితమైన వ్యభిచారిభావముగా నున్న రతి యను భావము రసము గాదని రసకోవిదులనినారు. దేవతలు కానివారలయం దీరతి క్షుద్రానందాత్మకమై, లోకోత్తరానందావగతి నీయజాలక పోవుటచే నీవాదము యుక్తియుతమే. కాంతాదివిషయకములైన భావములు శృంగారాది రసములుగా పరిణమించునట్లు, పరమానందరూపమగు పరమాత్మను విషయముగాగల భావముగూడ పరిణమించుననరాదు. కాంతాదివిషయకమగు రసమున పూర్ణనంద స్వభావములేదు. పూర్ణము, దుఃఖాసంభిన్న మునగు సుఖము లేనపుడే భావము పుష్టమై రసముకాగలదు. మిణుగురు పురుగు ప్రకాశముకంటె సూర్యతేజము ప్రజలతేజోయుత మైనట్లు, లౌకిక క్షుద్ర రసములకంటె పరిపూర్ణ రసీభవనార్హమగు భగవద్రతి విశిష్టమైనది, ముఖ్యమైనది, గొప్పదియుగూడ నని తెలియవలెను.

క్రోధ శోక భయాదీనాం సాక్షాత్సుఖవిరోధినామ్‌,

రసత్వ మభ్యుపగతం తథా7 నుభవమాత్రతః.9

ఇహానుభవసిద్ధే పి సహస్రగుణితో రసః,

జడేనేవ త్వయా కస్మా దకస్మాదపలప్యతే. 8

ఇతి శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మధు

సూదన సరస్వతీ విరచితే భగవద్భక్తిరసాయనే

భక్తివిశేష ప్రతిపాదకో నామ

ద్విదీయోల్లాసః

క్రోధము, శోకము, భయము మొదలగు భావములు సాక్షాత్తుగా సుఖప్రతికూలములు, దుఃఖాంశగల ఈ భావములు సహితము విభావాది సంయోగము కలుగగా రసరూపము నందుచున్నవని ఆలంకారికు లనినారు. ఈ భావముల నుండి రౌద్ర, కరుణ, భయానకాది రసములు నిష్పన్నములగునని మన అనుభవమే చెప్పుచున్నది. భగవద్విషయకమగు రతినుండిగూడ వీటికన్న వేయిరెట్లు గొప్పది, లోకోత్తరాహ్లాద హేతువునగు మహత్తర రసము నిష్పన్న మగుచున్నదని శ్రుతి, స్మృతి, అనుభవములు వేనోళ్ళ చాటుచున్నవి. ఇది రసముగాదని అయుక్తికముగా, అసంబద్ధముగా ప్రలపించుటకు బుద్ధిహీనుడే త్వరపడ గలడు. రస మనగా భక్తి రసమే. ఇంతకు మించిన రసములేదు. భక్తిరసమును రసరాట్‌ అనవలెను. )మొదటి అనుబంధములో చివరి భాగములను చూడుడు)

గద్య

శ్రీపరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మధుసూదన

సరస్వతీ విరచిత మగు భగవద్భక్తి రసాయనమున,

ఆంధ్రవివృతియందు, భక్తివిశేష ప్రతిపాదక

మను రెండవ యుల్లాసము

సమాప్తము.

Bhakthi Rasaayanamu        Chapters   Last Page