Bhakthi Rasaayanamu        Chapters   Last Page

 

శ్రీ మాత్రేనమః

భక్తిరసాయనము

ప్రథమోల్లాసము

నవ రస మిలితం నా కేవలం వా పుమర్థం

పరమ మిహ ముకుందే భక్తియోగం వదంతి,

నిరుపమ సుఖ సంవిద్రూప మస్పృష్టదుఃఖం

త మహ మఖిలతుష్ట్యై శాస్త్రదృష్ట్యా వ్యనజ్మి.

పురుషార్థ సాధనకు కర్మ, భక్తి యోగములు శ్రీకృష్ణునిచే ప్రపంచింపబడినవి. వర్ణాశ్రమధర్మ రూపమైన కర్మయోగము ద్వారా అంతఃకరణ పరిశుద్ధమగును. అంతఃకరణ పరిశుద్ధ మగువరకు కర్మయోగమునుష్ఠేయము. తత్త్వజ్ఞాన జనిత మగు నిర్వేదము కలుగుదాకా కర్మల నాచరించి తీరవలెను. కాని, ద్రవీభూతమైన చిత్తము గల మానవునకు భగవత్కథా శ్రవణముద్వారా భాగవతధర్మములపై నొకవిధమైన శ్రద్ధ బయలుదేరును. ఈ శ్రద్ధయే భక్తి. కాగా. అంతఃకరణను పరిశుద్ధము గావించుకొని, భగవదేకాకారమును మనస్సులో నిలపి, ఏకాగ్రతతో నాధ్యాత్మిక తత్త్వమును ధ్యానించుటయే భక్తియని వ్యవహరింపవలెను. నిర్విణ్ణుడు, విరక్తుడు, సంయతేంద్రియుడు నై యోగాభ్యాసక వశమున మనస్సును స్వాధీనపరచుకొని, యే మానవుడు ప్రవర్తించునో, అట్టి వానికే జ్ఞాన, భక్తియోగములు సులభ సాధ్యములు కాగలవు. భక్తియోగ ప్రతీతిలేనిచో మనస్సునకు సమ్యక్ప్రసాదము కలుగనేరదు. అనగా జ్ఞాన యోగసంబంధము లేని భక్తియోగము ప్రయోజనవంతము కాజాలదు. జ్ఞానయోగాంతర్గతమగు సాధనముగా భక్తిని గ్రహింపవలెను. ఇట్టి భక్తితో సకలవిషయములపై వైముఖ్యము నవలించించి, భగవత్స్వరూప స్వభావముల నాకర్ణింపగా చిత్తద్రుతి కలుగును. అప్పుడు భగవదాకారమగు మనోవృత్తి బయలుదేర గలదు. ఈ మనోవృత్తి, విభావ అనుభావ, సంచారి భావములతో సంయోజితమై, భక్తిరసమును ప్రతీతియోగ్యముగా చేయగల్గుచున్నది.

ఆలంబనవిభావ మని, ఉద్దిపనవిభావమని విభావములు రెండు రకములు. భక్తిరసమున కాలంబనవిభావము భగవంతుడు. తులసీ చందనాదులు భక్తిని ఉద్దీపింప జేయునవి. ఇచ్చట నేత్రవిక్రియాదు లనుభావములు. నిర్వేదాదులు సంచారిభావములు, భగవదాకారతారూప మైన మనోవృత్తి యగుస్థాయిభావమును పోషించునవి. ఈ విభానుభావ సంచారిభావములు. అప్పుడు ప్రాదుర్భవించు పరమానంద సాక్షాత్కారాత్మకమగు భక్తియోగమును నిరతిశయమగు పురషార్థమని రసజ్ఞులు చెప్పుచున్నారు.

దుఃఖాసంభిన్న మగు సుఖిమే పరమ పురుషార్థ మని దర్శనములన్నియు చెప్పుచున్నవి. ధర్మార్థకామ మోక్షములను నాలుగు పురుషార్థములును సుఖమను పరమపురుషార్థమునకు సాధనములు. దుఃఖ స్పర్శ ఏమాత్రము లేని సుఖము నలౌకికమని, లోకోత్తర మని, ఆధ్యాత్మిక మని వ్యవహరించవలెను. కావుననే ధ్యానశ్లోకమున "నిరుపమ సుఖసంవిద్రూప మస్పృష్ట దుఃఖం" అని మధుసూదను డనినాడు. అలౌకికము, నిరుపమము నగు సుఖమే సంవిద్రూపము. సంవిత్‌ అనగా చైతన్యము. చైతన్య మాత్మతత్త్వము. ఇందు దుఃఖస్పర్శ లేదు. కాగా ధర్మార్థకామములు స్వతఃపురుషార్థములు కావని,. తజ్జన్యమగు సుఖమే పరమపురుషార్థమని, ఈ విధమగు సుఖమే భక్తిసుఖమున గలదని, భక్తిసుఖమే స్వతంత్రపురషార్థ మని తేలుచున్నది. భక్తిసుఖ ప్రతీతి గలవానికి సంసారమునుండి విముక్తి గలుగుటచే భక్తిసుఖమే మోక్షసుఖ మనవలెను.

శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతము లనబడునవి తొమ్మిది రసములు. ఈ నవరసములతో మిలితమైన భక్తియోగమున ప్పతియామాన మగు విషయము భగవంతుడనబడు ఆధ్యాత్మికతత్త్వము. ఏవంవిధమగు తత్త్వము దుఃఖాసంభిన్నమగు అలౌకిక సుఖసంవిద్రూపము. ఈ సంవిద్రూపమును శాస్త్రదృష్ట్యా మధుసూదనుడు వివరించునున్నాడు. ఈ సంవిద్రూపము శాస్త్రములచే ప్రతిపాదింపబడిన సిద్ధస్వరూపము. సర్వజనానంద హేతుకము. (మొదటి అనుబంధమును చూడుడు.)

"భజన మంతఃకరణస్య భగవదాకారతారూపం భక్తిః" అని భక్తిశబ్దమునకు భావవ్యుత్పత్తిని చెప్పినచో నిరుపమసుఖ సంవిద్రూప మనబడు ఫలము భక్తియోగమున ప్రధానముగా కన్పించగలదు. "భజ్యతే సేవ్యతే భగవదాకార మంతఃకరణం క్రియతే7 నయా" అని కరణవ్యుత్పత్తిని చెప్పినచో శ్రవణ కీర్తనాది సాధనములు భక్తిశబ్దార్థములు కాగలవు. సాధనరూపమైన భక్తివేరు, ఫలరూపమైన భక్తివేరు అని చెప్పరాదు. ఒకేఒక భక్తిసాధనముగాను, ఫలముగాను ఫలముగాను ప్రతీయమానమగు చున్నది. ద్రువీభూతమైన మనస్సున భగవదాకారతాకముగా కన్పించు సవికల్పక మనోవృత్తిని భక్తి యందురు. ఈ భగవద్భక్తినే బ్రహ్మవిద్యగా పరిగణించరాదు. భగవద్గుణాది శ్రవణమును సాధనగాగలిగి, భగవద్విషయక ప్రేమప్రకర్షయే ఫలముగా గలిగిన భక్తియోగమున కందరు ప్రాణులు నధికారులే యగుచున్నారు.

సంసారరాగేణ బలీయసా చిరం

నిపీడితై స్తత్ప్రశ##మే7తి శిక్షితమ్‌

ఇదం భవద్భి ర్బహూధా వ్యయాతిగం

నిపీయతాం భక్తిరసాయనం బుధాః.

పురాకృత కర్మవశమున రాగద్వేషాది వశంగతమగు సంసారచక్రము చిరకాలమునుండి మానవులను పీడించుచున్నది. ఈ సంసారచక్రము ప్రశమిత్తమైననే దుఃఖబాధతో లగిపోగలదు. ఈ ప్రయోజనమున గుర్తించిన వివేకు లీభక్తిరసాయనము నాస్వాదించి కర్మబంధమును దాటగలరని యెంచి మధుసూదనుడు భక్తిరసాయనమును వివరించబోవుచున్నాడు.

ద్రుతస్య భగవద్ధర్మా ద్ధారావహికతాంగతా

సర్వేశే మనసో వృత్తి ర్భక్తి రిత్యభిధీయతే. 3

భగవద్విషయకమగుభక్తి యొకరసమని శ్రేష్ఠతమమగు పురుషార్థమని చెప్పితిమి. భక్తియొక్క సమాన్యలక్షణమునిటచెప్పి, ఆపై దీనిని వివరింతుము.

భగవద్గుణ శ్రవణముద్వారా కామక్రోధాదు లుద్దీపితములు కాగా చిత్తము ద్రవీభూతమగును. అపుడు సర్వేశవిషయకమై, భగవదాకారతతోగల ధారావాహికమగు చిత్తవృత్తి బయలుదేరెను. ఈ చిత్తవృత్తిని భక్తియని శాస్త్రజ్ఞులు వివరించి యున్నారు. ధారావాహిక మనగా అవిచ్ఛిన్నమని అర్థము. అంతరాయములు లేక, అవిచ్ఛిన్నముగా, సర్వదా అనుభూయమగుచున్న చిత్తవృత్తి భగవదాకారతాక మైనచో భక్తియని పిలువబడును.

చిత్తద్రవ్యం హి జతువత్‌ స్వబావాత్‌ కఠినాత్మకమ్‌

తాపకై ర్విషయై ర్యోగే ద్రవత్వం ప్రతిపద్యతే.

చిత్తము ద్రవీభూతము కావలెనని యంటిమి. చిత్తము స్వాభావికముగా ద్రవావస్థలో ఉండదు. చిత్తము లక్కవంటిది. లక్క స్వభావసిద్ధముగా కఠినమైన ఘనపదార్థము. కాని నిప్పుసెగకు మాత్రమే లక్క కరగి పోగలదు. ఇట్లే కఠినమైన చిత్తమును నిప్పువంటి విషయములే కరుగచేయ గలవు. మున్ముందు చెప్పబోవు కామాది విషయములను తాపకవస్తువులతో సంయోగము చెందిననే చిత్తమునకు ద్రవీభవాము రాగలదు.

కామ క్రోధభయస్నేహహర్ష శోకాదయా77దయః

తాపకా శ్చిత్తజతున స్తచ్ఛాంతౌ కఠినం తు తత్‌. 5

చిత్తమను లక్కవంటి పదార్థమును కరిగింపజాలిన తాపకవస్తువులను కామము, క్రోధము, భయము, స్నేహము హర్షము, శోకము అని యందురు. కామక్రోధాదు లుద్దీపితములు కాగా చిత్త ద్రవీభావము బయలుదేరును. కామాది తిరోభావమున మరల చిత్తకాఠిన్యము చేకూరునని భావము.

ద్రుతేచిత్తే వినిక్షిప్తః స్వాకారో యస్తు వస్తునా

సంస్కార వాసనా భావ భావనా శబ్దభాగసౌ.

చిత్తము ద్రవీభావమునందు ననగా విషయముతో నత్యంత సన్నిహిత సంబంధము కలిగియుండునని, ఈ యనన్యత్వమున నిమగ్నాకారకమగు చిత్తవృత్తి బయలుదేరునని, వస్తువుయొక్క ఆకారమును చిత్తవృత్తి పొందునని భావము. ఒక్కొక్క అనుభూతి కొన్ని సంస్కారములను వాసనారూపమున మనచిత్తమున వదలును. ఈ సంస్కారములను వాసనారూపమున భావించవీలున్నది. పూర్వానుభూతులు తర్వాతి యనుభూతులలో వాసనారూపమున భాసించుచున్నవి. వస్తువు యొక్క ఆకారమును ద్రుతచిత్తమున వాసనావశ##మైన భావన ద్వారా గ్రహించుటచే వస్తువు ప్రతీతిగ్రాహ్య మగు చున్నది.

శిథిలీభావమాత్రం తు మనో గచ్ఛ త్యతాపకైః

న తత్ర వస్తు విశతి వాసనాత్వేన కిఞ్చన.

తాపకద్రవ్యములగు కామక్రోధాదులతో నీషన్మాత్రసంయోగము మనస్సునకు కలుగగా, మనస్సులో కించి దవయవ విశరణమే కలుగును. ఇట్లు శిథిలీభూతమైన మనస్సులోనికి వాసనారూపమున వస్తువు ప్రవేశించదు. కాని తద్విలక్షణముగా, తదాభాసపూరక్వకముగానే వస్తువు మనస్సులో ప్రవేశించగలదు. వస్తువును చూడగానే చిత్తమున నొక విధమైన విక్షేపము కలుగును. అప్పుడు పూర్వాను భూతులద్వారా కలిగిన వాసనలలో కలయిక కలుగును. ఈ సంచలనమున వస్తుస్వరూపావగాహియగు చిత్తవృత్తి బయలు దేరును. కాగా చిత్తద్రుతియందు వాసనారూప సంస్కారము బయలుదేరునని, చిత్తశిథిలీభావమున వాసనాభాస బయలు దేరునని చెప్పవలెదను.

ద్రవతాయాం ప్రవిష్టం స ద్య త్కాఠిన్యదశాం గతమ్‌

చేతః పునర్దృతౌ సత్యా మపి తన్నైవ ముఞ్ఛతి. 8

కరిగించగా కాఠిన్యమును గోల్పోయిన లక్కకుకాష్ఠాదిసంయోగము కలుగగా కాష్ఠాదులకు లక్కవంటి రంగు సంప్రాప్తించు చున్నది. ఇట్లు ద్రవీబూతముగాక, శైథిల్యావస్థలో నున్న లక్క ఈ రీతిగా ప్రవర్తించజాలదు. ఇదే విధముగా ద్రవీభూతమైన చిత్తమునకు విషయసంయోగము కలుగగా విషయమునకు చిత్తమునకు అనన్యత్వ సంబంధము కలుగుచున్నది. చిత్తమున వస్తుస్వరూపము కన్పించును. ఆ పై కాఠిన్యదశలోనికి చిత్తము పోయినను, విషయాంతర ప్రత్యక్షమున చిత్తము మరల ద్రవావస్థలోనికి వచ్చుచు ప్రకాశించుచున్నది. వెనుక ద్రవావస్థలో కలిగిన విషయాకారత ఇప్పటి ద్రవావస్థలో నశించుటలేదు. ఇట్లు నశించకపోవుటయే వాసన యని పిలువబడుచున్నది. చిత్తము శైథిల్యావస్థలో నున్నచో నీ విధమైన వాసన బయలుదేరక, తదాభాసయే కన్పించుచున్నది. ద్రుతచిత్తమునకే ప్రకాశమానత గలదు. ఆధ్యాత్మిక తత్త్వమునే విషయముగా గలిగిన ద్రుతచిత్తమున ఆధ్యాత్మికతత్త్వా కారముగల చిత్తవృత్తి యుండునని, ఇది సర్వదా ప్రకాశమానమగునని, అట్టి వ్యక్తియే కృతకృత్యు డగునని చెప్పవలెను. ఒకసారి రగుల్కొలుపబడిన వాసనయనబడుసంస్కారము నశింపజాలక పోవుటచే నీ సదా ప్రకాశమానత్వమువచ్చుచున్నదని భావము. ఈ సంస్కారమును మాటుపడకుండ జేసిన, అనగా చిత్తమును సదా ద్రవావస్థలో నుంచిన, సకల విషయములును ఈభగవదాకారతాకమగు చిత్తవృత్తిచే భాసింపబడగలవు. కావుననే సర్వభూతములయందు భగవద్భావమే యోగులకు ప్రతీత మగుచున్నది. ఏ తాదృశ చిత్తసంస్కారము నశించదు. ఇట్టి సంపూర్ణ చిత్తద్రవావస్థగల వ్యక్తి ఉత్తముడు. ఈషద్ద్రవావస్థ గలవానికి వాసనాభాసయే యుండుటచే నతడు మధ్యము కనబడును. ద్రవావస్థ యే మాత్రములేక తదర్థ మెవడు శ్రద్ధతో భాగవతధర్మముల ననుష్ఠించునో అతడుప్రాకృతుడని పిలువబడును.

ప్రణయము, అనురాగము, స్నేహము మొదలగు శబ్దములీ ద్రవావస్థను వివరించునవి. ఈ శబ్దములచే సూచింపబడు ద్రవావస్థ నందిన వ్యక్తికి ఇచటనుండి పునర్నిర్గమనము లేదు. ద్రవావస్థలో ముత్తెరగుల ప్రతీత కలదు. ప్రపంచ సత్యత్వభాన సహితముగా నాధ్యాత్మిక తత్త్వము ప్రతీయ మాన మగుట ప్రాకృత ద్రవావస్థా లక్షణము. ప్రపంచ మిథ్యాత్వభాన సహితముగా కలుగు తత్త్వానగతి మధ్యమ ద్రవావస్థా లక్షణము. ప్రపంచ సత్యత్వము గాని, ప్రపంచ మిథ్యాత్వము గాని భాసించకుండా కేవలము తత్త్వమే ప్రతీత మగుట ఉత్తమ ద్రవావస్థా లక్షణము.

స్థాయిభావగిరా7తో7సౌ వస్త్వాకారో7భిధీయతే

వ్యక్తశ్చ రసతా మేతి పరానందతయా పునః

ద్రవావస్థలో నున్న చిత్తమున ప్రవేశించిన విషయాకారము స్థిరముగా నుండునదగుటచేస్థాయి యనుబడుచున్నది. విభావములు,అనుభావములు, సంచారిభావములు అను వాటిచే పరిపుష్టమై రసముగా నభివ్యక్త మగునది స్థాయి భావము. పరమానంద సాక్షాత్కార రూపమున నీ స్థాయి భావము రసత్వము నందును.

భగవా& పరమానందస్వరూపః స్వయ మేవహి

మనోగతస్తదాకార రసతా మేతి పుష్కలమ్‌.

ముఖము నద్దములో చూచుకొను చున్నాము. అద్దమను ఉపాధిలో కన్పించు ముకబింబమును ప్రతిబింబ మందము. ఇట్లే మనస్సు అనబడు ఉపాధినిష్టమైన ప్రతిబింబిత మైనది పరమానంద స్వరూపమగు భగవంతుడు. ప్రతిబింబితమైన పరమానందస్వరూపము స్థాయి భావమై రసముగా పరిణమించును. ఇట్లు సిద్ధమగు భక్తిరసమునకు పరమానంద రూపత్వమునే చెప్పవలెను. కావున బింబమువలెనున్న భగవంతుడాలంబన విభావమని, ప్రతిబింబమువలె నున్న భగవంతుడు స్థాయిభావ మని నిశ్చిత మగుచున్నది.

కాంతా77దివిషయే7 ప్యస్తి కారణం సుఖచిద్ఘనమ్‌

కార్యాకారతయా భేదే7ప్యావృతం మాయయా స్వతః.

భక్తిరసమునకు పరమానంద రూప మను అలౌకిక చిత్తవృత్తిని స్థాయి భావముగా గ్రహించి, పరమానంద రూపత్వము నాపాదించితిమి. బింబ మాలంబన విభావమని, ప్రతిబింబము స్థాయియని ప్రతిపాదించితిమి. కాని శృంగారాది రసములలో నాలంబన విభావము వేరుగను, స్థాయిభావము వేరుగను కన్పించుట గలదు. శృంగార రసమున నాయికా నాయకు లొకరి కొకరు ఆలంబనవిభావ మగుచుండగా, స్థాయిభావము రతి యగుచున్నది. ఈ స్థాయిభావమాలంబన విభావము యొక్క ప్రతిబింబము కాదు. అట్టిచో భక్తిరసమున నీ వైచిత్య్రమేల కన్పించ గలదను నా శంకకిచట ప్రత్యుత్తరము చెప్పబడు చున్నది.

"ఆనందమునుండి భూతములన్నియు జన్మించుచున్నవి, ఆనందమువలన, జీవించు చున్నవి, మరల విని ఆనందములో లీనమగు చున్నవి" అని త్తెత్తిరీ యోపనిషదాది వాక్యముల ద్వారా పరమానందరూప మగు బ్రహ్మయే జగదుపాదాన కారణమని ప్రతిపాదింపబడినది. ఈ సిద్ధాంతమునే "జన్మాద్యస్య యతః" అను వేదాంతసూత్రమున బాదరాయణుడు గ్రహించెను. కార్యకారణము లభిన్నస్వభావములను కలిగియున్నవి. మట్టియొక్క స్వభావము మట్టినుండి వచ్చిన కుండలో సహితము గలదు. ఇట్లే కార్యభూతమైన జగత్తు కారణభూతమైన బ్రహ్మకంటె భిన్నస్వభావమును కలిగి యుండజాలదు. కార్యభూత ముపాదానకారణాభిన్న మగుటుచే "ఇది యంతయు బ్రహ్మయేగదా" "ఇది యంతయు ఆత్మయే" అనిమొదలుగా గల ఉపనిషద్వాక్యములు కన్పించుచున్నవి. వీటిని ఆధారము చేసికొని, ఛాందోగ్యములోని ఆరవ ప్రపాఠక మునుసూత్రించుచు బాదరాయణుడు " తదనన్యత్వ మారంబణ శబ్దాదిభ్యః" అని నిర్ణయించినాడు. జగత్స్రష్టృత్వము ఉపాదానభూత మగు సగుణబ్రహ్మనుండి బయలుదేరుచున్నది. కావుననే జగత్తు అఖండానందాద్వయాకారమున భాసించుట లేదు. తాత్త్వికముగా బ్రహ్మ ఇచట భాసించకపోవుటకు మాయయొక్క ఆవరణ విక్షేప శక్తులే కారణము. : కార్యభూతము కానిది కార్యముగా భాసించుటలో మాయ యొక్క విక్షేపశక్తి కన్పించుచున్నది. అఖండానందాకారమున బ్రహ్మ మనకు భాసించక పోవుటలో ఆవరణశక్తి కన్పించుచున్నది.

ఐతే బ్రహ్మపదార్థ మెట్లు భాసించగలదు? అను ఆశంక కిక సమాధానము నియవలెను.

స దజ్ఞాతఞ్చ త ద్బ్రహ్మ మేయెం కాంతా77దిమానతః

మాయావృతితిరోధానే వృత్త్యాసత్త్వస్థ యా క్షణమ్‌. ೧೨

ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా ఆజ్ఞాతవస్తువు జ్ఞప్తికి తేబడుచున్నది. ఆజ్ఞాతజ్ఞాపకత్వమున కుపకరించనివి ప్రమాణములు కాజాలవు. స్వయంప్రకాశ్యమై భాసించునిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త చైతన్యమును మనము విస్మరించుటచే నీచైతన్య మజ్ఞాతవిషయ మగుచున్నది. జడపదార్థము చైతన్యముచే ప్రకాశింపబడున దగుటుచే నావరణశక్తి చైతన్యమునే ఆవేశించినట్లు కన్పించును. ఈ యావరణశక్తియే జడపదార్థములవలెను, విషయములవలెను శుద్ధచైతన్యమును భాసింపజేయును. కాగా నాయికానాయకాది విషయములు చైతన్యము నుపహితములుగా జూపునవి. విషయాచ్ఛిన్న చైతన్యమును చైతన్యముగా గుర్తించక, విషయముగా గుర్తించుచున్నాము. మనస్సు సాత్త్విక మైనపుడు ప్రత్యక్షాది ప్రమాణ జనితమగు అపరోక్ష మనోవృత్తి ద్వారా ఆవరణశక్తి నశించగా తత్తద్విషయావచ్ఛిన్నముగా చైతన్యమే భాసించగలదు. కావున పరమానందరూపమే విషయోపాదానమని, విషయమనగా చైతన్యావచ్ఛిన్నమని, విషయప్రతీతిలో లౌకిక వ్యవహారమున చైతన్యస్వరూపము భాసించదని, మాయయొక్క ఆవరణశక్తి తిరోహితమైననే చైతన్యప్రతీతిగలదని చెప్పవలెను. అందుచే శృంగారాది రసములలో కన్పించు ఆలంబనవిభావము వస్తుతః చైతన్యవచ్ఛిన్నమని చెప్పవలెను. ఈ చైతన్యమునకు సాత్త్వికమైనమనోవృత్తికి భేదమేమియులేదు.

అతస్తదావిర్భా విత్వం మనసి ప్రతిపద్యతే

కిఞ్చిన్న్యూనాఞ్చ రసతాం యాతి జాడ్యవిమిశ్రణాత్‌. 3

ద్రవావస్థలోనున్న మనోవృత్తియందు విషయావచ్ఛిన్న చైతన్య మావిర్భవించి భక్తిరసత్వమును పొందుచున్నది. కావుననే లౌకికరసమున పరమానందరూపత్వము స్ఫుటముగా ప్రతీత మగుటలేదు. అనవచ్ఛిన్న చిదానంద ఘనమగు బ్రహ్మపదార్థము భక్తిరసమున ప్రతీయమాన మగుటచే నీరసమున నలౌకికానంద మధికముగా నవగత మగుచున్నది. లౌకికములగు శృంగారాదిరసములలో విషయావచ్ఛిన్న మగు చిదానం దాంశ##యే ప్రతీత మగుటచే నిచట నాలోకోత్త రానందమంత పూర్తిగా నవగత మగుటలేదు. కావున శృంగారాది రసముల కంటె భక్తిరసమే శ్రేష్ఠమని యెంచవలెను.

ఇతి వేదాంత సిద్ధాంత స్థాపినా రసతో దితా

సాజ్ఖ్యసిద్ధాంత మాశ్రిత్యా ప్యధునా ప్రతిపద్వతే.೧೪

స్థాయిభావము రసముగా నెట్లు పరిణమించుచున్నదో చెప్పితిమి. ఇక సాంఖ్యదర్శనము ననుసరించి రసత్వమెట్లుసిద్ధమగునో చెప్పనున్నాము.

తమోరజఃసత్త్వగుణా మోహ దుఃఖ సుఖాత్మకాః

తన్మయీప్రకృతి ర్హేతుః, సర్వం కార్యఞ్చ తన్మయమ్‌. ೧೫

సమస్తభావములు సుఖ దుఃఖ మోహాత్మకములుగా ప్రతీయమానము లగుటచేత నివి సుఖ దుఃఖ మోహత్మక మగుసామాన్య ప్రకృతి గలవి. మృదాత్మకముగా ప్రతీయమానమగు మట్టియొక్క సమాన్యప్రకృతి, మట్టినుండి జన్మించుఘటశరావాదుల ప్రకృతికంటె భిన్నము కాదుగదా! కారణము యొక్క స్వభావము కార్యమున సమనుగతమై భాసించును. ఇట్లే భావము లన్నియు సుఖదుఃఖ మోహజనితములగుటచే నీభావములయొక్క స్వభావమును సుఖదుఃఖ మోహత్మకమని చెప్పుచున్నాము. సుఖమును సత్త్వగుణ మని, దుఃఖమును రజోగుణ మని, మోహమును తమోగుణ మని యెంచవలెను. ఈ మూడు గుణములు కలసి యుండుటచే భావములకు త్రిగుణాత్మకత్వము నంగీకరించలెను.

కార్యకారణముల కత్యంత వైలక్షణ్యము గలదని చెప్పున్యాయ వైశేషిక దార్శనికులు కార్య కారణ సంబంధమును నిర్వచింపలేరైరి. కారణముయొక్క పరిణామమే కార్యమని కొంతవరకు చెప్పవలెను.

త్రిగుణాత్మక మేకైకం వస్తు త్య్రాకార మీక్ష్యతే

నిజ మానస సఙ్కల్ప భేదేన పురుషై స్త్రి భిః ೧೯

భావము లన్నియు త్రిగుణాత్మకములని చెప్పితిమి. కాని వస్తువులు త్రిగుణాత్మకములుగా, అనగా త్ర్యాకారములుగా, భాసించుచున్నవా! అనినచో నాంతరమగు చిత్తవృత్తికి బాహ్యమగు వస్తువునకు తాదాత్మ్యము నాపాదించలేమని గుర్తుంచుకొనవలెను. బాహ్యమగు వస్తువు మనస్సున ప్రతింబింబితమై ఆంతరముగా త్రిగుణాత్మకముగా ప్రతీయమాన మగుచున్నది. కాని ప్రతివస్తువు ఒకే ఒకరీతిగా భాసించజాలదు. సత్త్వరజ స్తమో గుణము లేయేనిష్పత్తులలో కలసినట్లవగత మగునో ఆనిష్పత్తిని అనుసరించి బయలుదేరు సంస్కారవశమున చిత్తవృత్తిభేదము, విషయభేదము వచ్చుచున్నవని భావము. ఇందుల కుదాహరణగా తర్వాతిశ్లోకము చెప్పబడుచున్నది.

కామిన్యాః సుఖతా భర్త్రా సపత్న్యా దుఃఖరూపతా

తదలాభాత్తథాన్యేన మోహత్వ మనుభూయతే.

కామసుఖమును గోరిన స్త్రీకి భర్తవిషయమున సత్త్వగుణము, సవతివషమయున రజోగుణము, తా నభిలషించుభర్త తనకు లభించకపోయిన తమోగుణము ఉద్రిక్తము లగుచున్నవి. ఈ మూడు విషయములయందు క్రమముగా సుఖము, దుఃఖము, విషాదము కలుగగలవు. చిత్తవృత్తియందలి సంస్కారభేదము ననుసరించి ఈ మూడవస్థలు వ్చచుచున్న వని భావము.

ఏవం సతి సుఖాకారః ప్రవిష్టో మానసే యదా

తదా స స్థాయిభావత్వం ప్రతిపద్య రసో భ##వేత్‌. 8

రజస్తమో గుణాంశలతో సంబంధము లేనపుడు క్రోధాదులు చిత్తము నుద్రిక్తము గావించినచో కలుగు చిత్తద్రుతి యందు సుఖమయత్వమే భాసించును. చిత్తద్రవీభావము సత్త్వగుణధర్మ మగుటచే నీ సత్త్వజనిత ద్రవీభావమే స్థాయి భావ మగుచున్నది. సత్త్వగుణము సుఖరూప మగుటచే సమస్తభావములు సుఖమయము లనవలెను. కాని ప్రతిగుణమున నితరగుణముల అంశలంగములుగా గలవు. కావున వివిధ భావములలో కలుగు సుఖప్రతీతి ఇతరగుణముల నిష్పత్తిచే నియంత్రితమై యుండును. ఇందుచే సర్వరసములయందు నొకేయొకవిధమైన సుఖానుభవము కలుగజాలదు.

పరమాణ్వకరూపం తు చిత్తం న విషయాకృతి

ఇత్యాది మత మన్యేషా మప్రామాణ్యా దుపేక్షితమ్‌.೧೯

న్యాయ దార్శనికుల కీసిద్ధాంతము సమ్మతము గాదు. నిత్యము, నిరవయవము, అణుపరిమాణమునని వీరు మనస్సును నిర్వచించుటచే చిత్తద్రవీకరణ నంగీకరింపజాలరు. ద్రవీభూతమైన చిత్తము విషయాకారముగా పరిణమించు ననినచో మనస్సును సావయవమని నిర్వచించవలెను. కాని మనస్సు నిరవయవ మగుటచే నీ ద్రవీకరణకుదురదని, తద్ద్వారా స్థాయి భావనిరూపణ చేకూరదని వీరివాదము.

కాని మనస్సు పరమాణువువంటి దని చెప్పుట కుపపత్తులు కన్పించవు. చక్షురాదీంద్రియముల పంటినిగూడ కాజాలకపోవుటచే మనస్సనకు మధ్యమ పరిమాణత్వము నాపాదించుచున్నాము.

ప్రాభాకర మీమాంసకులు మనస్సునకు విభుత్వమును చెప్పుదురు. నిత్యత్వ, విభుత్వము లెంతమాత్రము వీరికి కుదురజాలవు. శ్రోత్రేంద్రియమువలె నిత్యమైనది మనస్సు అని వాదించునపుడు శ్రోత్రేంద్రియమునకు కారణమగు నాకాశమనిత్యమని, అనిత్యకారణమునుండి నిత్యమగు కార్యము జన్మించలేదని మరువరాదు. జన్యమైనది, కార్యభూతమైనది, విభుత్వముచే లక్షింపబడజాలదు. పంచమహాభూత గ్రాహకమగు మనస్సు పాంచభౌతిక గుణముచే విశిష్టమై యుండుటచే నిరవయవముగాని, విభువుగాని కాలేదు. అపంచీ కృత పంచమహాభూతములనుండి వచ్చినది. సత్త్వప్రధానము, సంకోచవికాశశీలము, స్వచ్ఛద్రవ్యమగు చక్షువువలె మూర్తద్రవ్యము, దేహపరిమాణము గలిగినదియు నైనది మనస్సు. సుకదుఃఖేచ్ఛాజ్ఞానములకు ఆశ్రయమగు మనస్సునకు దేహపరిమాణమును చెప్పవవలెను. మనస్సు అణువైనచో ఒకే ఒక కాలమున సర్వేంద్రియ సంబంధము సంభవించలేదు.

గృహ్ణాతి విషయాకారం మనో విషయయోగతః

ఇతి వేదాంతిభిః సాంఖ్యై రపి సమ్య ఙ్ని రూపితమ్‌.

స్వచ్ఛస్వభావము, సావయవమునగు మనస్సు అద్దము వలె విషయాకారమును గ్రహించునని సాంఖ్యదర్శనము, అద్వైత వేదాంతదర్శనము చెప్పుచున్నవి . కాని సాంఖ్యులకు మనస్సు అహంకారలక్షితము. వేదాంతమున మనస్సును భౌతికముగనే గ్రహించుచున్నాము.

మూషాసిక్తం యథా తామ్రం తన్నిభం జాయతే తథా

ఘటాది వ్యాప్నువచ్చిత్తం తన్నిభం జాయతే ధ్రువమ్‌.೨೧

ద్రవీభావము చెందిన చిత్తమే విషయాకారమును భజించుననుట భాష్యకారసమ్మత మని ఇచట చెప్పబడు చున్నది. మూసలో రాగిని కరగకించినచో పుటపాక యంత్రమగు మూసయొక్క ఆకారమును రాగి పొందుచున్నది. ఇట్లే రాగద్వేషాదులచే ద్రవీభూతమైన చిత్తము చక్షురాదీంద్రియములద్వారా స్నిగ్ధమై తత్తద్విషయాకారమును పొందు చున్నది. ఈశ్లోకము పంచదశలోని ద్వైతవివేక ప్రకరణము లోనిది.

తైత్తిరీయోపనిష ద్భాష్యమున బ్రహ్మవల్లిలో ప్రాణమయకోశ వివరణమున పురుషవిధత్వమునకు దృష్టాంతముగా "మూషానిషిక్త ప్రతిమావత్‌" అను భాష్యకార వచనము గలదు.

వ్యఞ్జకో వాయథా77లోకో వ్యఙ్గ్య స్యాకారతామియాత్‌ సర్వార్థవ్యఞ్జకత్వాద్ధీరర్థాకారా ప్రదృశ్యతే.೨೨

మూసలోని రాగిని నిప్పుచే కరిగించగా రాగి మూసయొక్క ఆ కారమును పొందుచున్నదని పైన చెప్పితిమి. ఈ రాగి మూర్తమగు ద్రవ్యము, అనగా రూపము గల పదార్థము. కాని చిత్తమనునది తామ్రాది విలక్షణమగు అమూర్త ద్రవ్యమగుటడచే విషయకారము నెట్లు పొందగలదు? అను ఆశంకబయలుదేర గలదు. పై ఉదాహరణలోని ఈ అస్వరసతను గమనించి దృష్టాంతాంతరముగా పంచదశీకారు డీ శ్లోకము నిచ్చినాడు.

పరిదృశ్యమాన మగు వస్తువును విషయ మందురు. మనమొక విషయమును చూచుచున్నామనగా నిచట మనము గమనింపవలసినది కొంత గలదు. ప్రకాశము లేనిదే విషయము కన్పించదు. ప్రకాశము విషయమును వ్యంజింపజేయు చున్న దనగా ప్రకాశము విషయాకారమును పొందుచున్న దని భావము. ఇట్లే చిత్తము లేక బుద్ధి సర్వవస్తువులను వ్యంజింపజేయున దగుచున్న దనిన, చిత్తము సకల పదార్థప్రకాశమని, విషయాకారమును పొందుచు విషయములను భాసింపజేయున దని భావము.

భగవత్పూజ్యపాదానామియ ముక్తిః సయుక్తికా

తథా వార్తికకారై రప్యయ మర్థో నిరూపితః 3

మనస్సు పదార్థవ్యంజకమని పదార్థాకారముగా భాసించునదని: శ్రీశంకర భగవత్పాదులు, వార్తికకారులగు శ్రీసురే శ్వరాచార్యులు గూడ చెప్పిన వాదముయుక్తియుతము, సమంజసమునని నిశ్చితమగుచున్నది. "వ్యఞ్జకోవా" అను ఇరువది రెండవ శ్లోకమున వార్తికకారుల అభిప్రాయ మీయబడినది.

"మాతు ర్మాత్రాభి నిష్పత్తి ర్నిష్పన్నం మేయ మేతిచ

మేయాభిసజ్గతం తచ్చమేయాభత్వం ప్రపద్యతే"

అని వార్తికకారు లనినారు. అనుభవ మెవరికి కలుగుచున్నదో అతనిని ప్రమాత యందురు. అనుభవింపబడు విషయమును ప్రమేయ మందురు. ఏరీతిగా, ఏ సాధనముద్వారా అనుభూతి కలుగుచున్నదో, దానిని ప్రమాణమందురు. చైతన్య స్వరూపుడగు ప్రమాతయొక్క చైతన్యోపబృంహితమగునంతః కరణనుండి బయలుదేరు మనోవృత్తి జ్ఞానము నొసగుచున్నది. ఈ వృత్తిజ్ఞానము ద్రవీభావపూర్వకము. మనోవృత్తి నిష్పన్నమై చక్షురాదిద్వారా ఘటాది విషయపర్యంతము బయటకుపోయి విషయముతో సంయోగము నందును. ఘటాది విషయ సంబద్ధమైన ఈ వృత్తి విషయాకారతను, అనగా ప్రమేయాకారతను పొందును. అప్పుడు ఘటాది విషయోవలంభత్వము చైతన్యముద్వారా కలుగుచున్నది.

మధుసూదనుని సిద్ధాంతబిందులోను, విద్యారణ్యుల పంచదశియందు ఈ ప్రక్రియ పూర్తిగా వివరించబడినది. వేదాంతపరిభాషలో గుడ నీ విషయము చర్చించబడినది. కాని ఈ ప్రక్రియ నంగీకరించకుండా విషయ ప్రత్యక్షమును వివరించవీలున్నది.

అతో మాంసమయీయోషిత్‌కాచి దన్యామనోమయీ

మాంసమయ్యా అభేదే7పిభిద్యతే7 త్ర మనోమయీ.೨೪

ఒకే ఒక స్త్రీని భార్యయని, స్నుషమని, మాతయని, పరిపరివిధములుగా భావించుట గలదు. ఈ భావనలలో భేదములు కన్పించుచున్నవే గాని వీటికి విషయభూత మైన స్త్రీ యొక్కతెయే. ఇట్లు విషయభూతమైన స్త్రీ మాంసమయియై బాహ్యజగములో నున్న స్త్రీ. జ్ఞేయమైన ఈ స్త్రీలో భేదములు కన్పించవు. తజ్జన్యములగు జ్ఞానములు విలక్షణములుగా గలవు. కాని జ్ఞానవైలక్షణ్యము కలుగునప్పుడు జ్ఞేయవైలక్షణ్యము కలిగి తీరవలసి యుండుటచే జ్ఞేయాకారభేదము నంగీకరించకతప్పదని చెప్పుటకై పంచదశీకారు డీశ్లోకము నిచ్చినాడు.

మధుసూదనున కీ సందర్భమున నభీష్టతమగు భా వ మీక్రింది విధముగా నుండనోపు నని పైదాని కీషన్మాత్రభేద ముతో వ్యాఖ్య చేయుచున్నాము.

మాంసాదులతో భాసించు స్త్రీ వేరు. మానసికముగా భాసించు స్త్రీ వేరు. మానసికముగా నొకానొక ప్రతిమాకారమున భౌతికజగములోని స్త్రీ భాసించుట గలదు. భౌతికజగములోని స్త్రీకి ఇది ప్రతిబింబమగుటచే నీరెంటికిని భేదము లేదు. కాని భౌతిక జగములోని స్త్రీ దేశకాలా ద్యుపాధుల వశ##మై మార్పులను బొంది, నశించుట గలదు. మనోమయి యైన స్త్రీ దేశకాలాద్యుపాధులకు లొంగక, మార్పులను బొందక, నిర్వికారయై నిలిచిపోవుటచే నీ రెంటికిని భేద మేర్పడుచున్నది. యొక్క వ్యాపార మగుటచేతను, భావనావ్యాపారము ద్వారా బాహ్యజగ మర్థవంత మగుటచేతను, భావనాజగమే మాతృకయని, లౌకికజగము తదనుకరణ యని యెంచవలసివచ్చుచున్నది. మనోమయాకార భేదము ననుసరించి భోతికాకారభేదము ప్రతీమయమాన మగుచున్నది. భార్యా, న్నుషా, ననాందాచ, యాతా, మాతేత్యనేకధాజామాతా, శ్వశురః, పుత్రః పితేత్యాది పుమానపి.೨೫

ఒకేఒకస్త్రీ ఒకనికి భార్య, ఇంకొకనికి సోదరి, మరొకనికి కోడలు, వేరొకనిక తల్లి అని భిన్న భిన్న సంబంధముల ద్వారా ప్రతీయమాన మగుచున్నది. ఇట్లే ఒకేఒక పురుషుడు ఒకనికి అల్లుడు, మరొకనికి మామ, వేరొకనికి పుత్రుడు, ఇంకొకనికి తండ్రియని భిన్నభిన్న స్వరూపములతో భాసించుట గలదు. ఈ భేద ప్రతీతి మనోవృత్తిని ఆశ్రయించుకొని యున్నది.

బాహ్యపిండస్య నాశే7పి తిష్ఠత్యేవ మనోమయః

అతః స్థాయీతి విద్వద్భి రయ మేవ నిరూపితః.೧೯

ఒకేఒక విషయము భిన్నవిధములుగా భాసించుట గల దంటిమి. ఇదిగాక ఒకేఒక విషయమునకే వినాశిత్వా వినాశిత్వ ధర్మములుగూడ కన్పించుచున్నవి. భౌతికజగములోని విషయము నశించినను మనోమయమగు నీవిషయము నశించుటలేదు. బాహ్యవిషయము దేశకాలాద్యుపహితము. మనోమయమగు నీవిషయము దేశకాలాదుల కతీతము. కావుననే మనోమయమగు విషయమును స్థాయి యనుచున్నారు. స్థాయి యనగా కదలికగాని, మార్పుగాని లేనిదియని అర్థము. *(రెండవ అనుబంధము చూడుడు.)

ఏవం స్వభావతో భావస్వరూప ముపవర్ణితమ్‌

విశేషణతు సర్వేషాం లక్షణం వక్ష్యతే పృథక్‌.

మనోమయమగు విషయాకారము వినాశరహితమగుటచే స్థాయి యని పిలువబడుచున్నదని చెప్పితమి. ఈ స్థాయియనునది రతి, హాసము మొదలు భేదములతో కన్పించుచున్నది. ఈ భేదములను మున్ముందు వివరించగలము. ద్రుతచిత్తమును ప్రవేశించిన వినాశరహితమగు విషయాకారము స్థాయి యని మాత్రమే ఇచట గుర్తించు కొనవలెను.

భగవంతం విభుం నిత్యం పూర్ణం బోధసుఖాత్మఖమ్‌

య ద్గృహ్ణాతి ద్రుతం చిత్తం కి మన్య దవశిష్యతే.8

సర్వదేశవ్యాపి, సర్వకాలవ్యాపి యని భగవంతుని నిర్వచించినచో భగవంతుడు దేశకాలముల కతీతుడని భావము. భగవంతు డన ఆధ్యాత్మిక తత్త్వము. దీనినే ఆత్మయని, బ్రహ్మయని ఉపనిషత్తులు వ్యవహరించినవి. ఈ తత్త్వము దేశకాలములచే నుపహితముగానిది. ఇది అద్వితీయమగు బ్రహ్మపదార్థ మగుటుచే పూర్ణమని చెప్పబడుచున్నది. ఇది సర్వద్వైతప్రమాధిష్ఠానము. ఈ తత్త్వావగతియే నిరతిశయమగు పరమపురుషార్థము. ఇట్టి భగవదాకారము ద్రుత చిత్తముచే గ్రహింపబడినచో నిక గ్రహింపబడవలసిన విషయము వేరుగా నేమియులేదు. సర్వానుగ్రాహకమగు తత్త్వము గృహీతమైన సర్వము గృహీతమే యగుచున్నదని భావము. భక్తియోగమునకీ భగవదాకారమగు చిత్తవృత్తి ప్రధానము.

మానవుల శ్రేయస్సునకై జ్ఞాన, కర్మ, భక్తియోగములు చెప్పబడినవని శ్రీ మద్భాగవత మనుచున్నది. (11.20.6) నిర్వేదము కలుగనంతవరకు కర్మాచరణము తప్పదని, శ్రద్ధ కలుగనంతవరకు భగవత్కథాశ్రవణము చేయవలెనని చెప్పుచు భాగవతము (11.20.9) భక్తి, జ్ఞాన, యోగముల వైశిష్ట్యమును ప్రశంసించినది. కర్మాచరణవలన నంతఃకరణ పరిశుద్ధమగును. తద్ద్వారా గీతలలో చెప్పబడిన జ్ఞానయోగము (13.7.11) దేహీంద్రియాద్యనాసంగాత్మకమై సుప్రతిష్ఠితము కాగలదు. వైరాగ్యముతో నిర్విణ్ణుడైన వ్యక్తియొక్క మానసము దౌరాత్మ్యమును వదలి, శమదమాదిసాధన సంపదతో మనన నిదిధ్యాస నాత్మకము కాగలదు. ఇట్లుసిద్ధమగు మనఃప్రసీదనమున భక్తియోగమునకు జ్ఞానావధిత్వమును భాగవతము చెప్పుచున్నది. భక్తియోగములేనిచో మనస్సు నకు సమ్యక్ర్పసాదము కలుగనేరదు. కనుక భక్తియోగమును జ్ఞానయోగాంతర్గతముగా స్వీకరించవలెను. భక్తి యోగముతో భగవానుని భజించువాని హృదయమున కామము లన్నియు నశించ గలవని భాగవతము చెప్పుచు ఇహాముత్రార్థ ఫలభోగవిరాగమును ప్రశంసించుచున్నది.

"ఈశ్వరునియందు భక్తిగలిగి, భగవదాత్మకమగుమనస్సుగల యోగికి జ్ఞాన వైరాగ్యములు సాక్షాత్తుగా శ్రేయఃకారకములు కాజాలవు. కర్మలు, తపస్సు, జ్ఞానము, వైరాగ్యము, యోగము, దానధర్మములు, ఇతర శ్రేయోదాయకములగు కృత్యములు అనునవి ఫలించవలె ననినచో ఈశ్వరునిపై భక్తిచాల అవసరము. స్వర్గము, అపవర్గము, కైలాసము మొదలుగువానిని భగవద్భక్తులు మాత్రమే పొందగలరు. భక్తితో నీవాంఛలు గలవారికి పునరావృత్తి లేని భగవత్ప్రసాదము లభించగలదు. నిరపేక్షాత్మకమగు ఈ విధమైన నిఃశ్రేయస్సు శ్రేష్ఠతమము, " అని భాగవతము భక్తియోగమును ప్రశంసించుచున్నది. ( 11.20.31-36)

భక్తి యోగము పరమ పురుషార్థమని, పరమ పురుషార్థసాధకమని భాగవత మనేక స్థలములలో కొనియాడుచున్నది.

(2.2.33.34;1.2.8; 3.25,44; 10.47.24)

కైవల్యము ననుభవించుటకు భక్తియోగమును మించిన మార్గములేదు. ధర్మాచరణవలన, భగవత్కథాశ్రవణమువలన అంతఃకరణ పరిశుద్ధమై భగవంతునిపై ప్రేమను రగుల్కొలుపును. ఈ ప్రేమ కలుగనిచో కర్మాద్యాచరణము వ్యర్థమైన శ్రమయేయగును. దానము, వ్రతము, తపస్సు, హూమము, జపము, స్వాధ్యాయము, శమదమాది సంయమనము మొదలగు వానిద్వారా భగవద్భక్తి సాధ్యము కాగలదు. భక్తియోగమున మనస్సు భగవదర్పితమగును. ఆత్మ ప్రహ్వీభావ పూర్వకముగా భగవదైక్యము భావించి, అనుభవింపబడును. భగవంతునితో, అనగా పరబ్రహ్మతత్త్వముతో, ఐక్యమును భావన జేసి అనుభవించుటయే భక్తియొక్క పరమలక్ష్యము. నిశ్రేయసఫలము, జన్మనివృత్తిఫలముగల భక్తియోగము పరమపురుషార్థమని వేరుగా జెప్పనక్కరలేదు. కావుననే_

"యోగినా మపి సర్వేషాం మద్గతే నాంతరాత్మనా

శ్రద్ధావా& భజతేయోమాం స మేయుక్తతమోమతః.

అని గీతలలో గూడా గలదు.

భక్తియోగము పరమ పురుషార్థమునకు సాధనమని కొన్ని స్థలములయందు గాననగును. భక్తియోగమువలన వైరాగ్యము, జ్ఞానము కలుగు నని (1.2.7) భక్తియోగముతో పరమపురుషుని భజించవలెనని (2.3.10), సూర్యకిరణముల ప్రకాశముద్వారా మంచు కరగిపోవునట్లు భక్తియోగము ద్వారా పాపము నశించునని (6.1.15) భాగవతము చెప్పుట గలదు. భక్తియోగముద్వారా బ్రహ్మజ్ఞానము కలుగునని గీతలలో (18.55) గలదు, వీటిని బట్టి భక్తియోగము అన్యార్థములను సాధించుట కుపకరించు సాధనముగా కన్పించుచున్నది. అన్యవిషయమునకు సాధనమైనది సాక్షాత్తుగా పురుషార్థము కాజాలదు. కాని భక్తిశబ్దమునకు భావవ్యుత్పత్తి, కరణవ్యుత్పత్తి గలవని వెనుక చెప్పితిమి, భావవ్యుత్పత్తి ద్వారా భక్తికి భగవదాకారతా రూపమను మనోవృత్తిని ద్వారా భక్తికి భగవదాకారతా రూపమను మనోవృత్తిని భజించుట యను నర్థమురాగలదు. ఈ మనోవృత్తి నిరతిశయ పురుషార్థమని వేరుగా జెప్పనక్కరలేదు. కరణ వ్యుత్పత్తిద్వారా భక్తి సాధనమగును. సాధనముగను, సాధ్యముగను గూడ భక్తికలదు. ఇట్లే విజ్ఞానశబ్దమునకు బ్రహ్మయని, తదవగతికగు సాధనమని అర్థములను చెప్పుచున్నాము. కావున రెండవ భక్తిశబ్దము సాధ్యముగ ప్రయోగింపబడినది.

మరియొక శ్లోకమున (11.3.33) సాధనరూప మగు భక్తిని భాగవత ధర్మముగా వివరించి చెప్పుట గలదు. సాధ్యమగు భక్తి ఈ సాధనముల ద్వారా బయలుదేరునని చెప్పబడినది.

కాని సాధనరూపమైన భక్తియొకటి, ఫలరూపమైన భక్తియొకటి యని రెండు విధముల భక్తులుగలవని చెప్పరాదు. వేరొక శ్లోకమున కృతకృత్యత్వ పరామర్శగలదు. వేదాధ్యయనము నాచరింపవలె నన వేదములలోని అక్షర గ్రహణమే గాక, అర్థజ్ఞానమునుగూడ గ్రహించవలెనని అర్థమును చెప్పుచున్నాము. ఇట్లే భక్తియోగము నాచరించవలెనన సాధనరూప మగు భక్తి శ్రద్ధాదులు, ఫలమగు భగవదైక్యము రెండును చెప్పినట్లే యగును. కావున భాగవతాది గ్రంథములలో సాధనమగు భక్తిని చెప్పువాక్యములు, ఫలమగు భక్తిని వివరించు వాక్యములునని రెండు తెరగుల గలవని, ఇవి పరస్పర వ్యాఘాతకములుగావని, విషయ విభాగవశమున వచ్చిన ఈ రెంటికి విరోధము లేదని నిశ్చయించవలెను. పైగా సాధనభూతమగు భక్తి భగవత్కథాశ్రవణాది కముద్వారా ఫలభూతమగు భక్తియోగమున పర్యవసిత మగుచున్నది. మరికొన్ని స్థలముల శ్లోకములలో (1.5.22;10.1.4) చెప్పబడిన సాధన వచనములను ఫలపరముగా యోజించవలెను. ఇచటగల గుణానువర్ణన, గుణానువాదశబ్దములు తజ్ఞన్యప్రతీతపరముగా యోజింపబడవలెనని భావము.

భక్తికి, బ్రహ్మజ్ఞానమునకు వైలక్షణ్యము గలదు. కాని భక్తియోగమున సహితము నిరతిశయ పరమపురుషార్థ ప్రతీతి గల్గునని భాగవతము చెప్పుచున్నది (1,5,17,19,;6,1,19). అనేక ప్రదేశములలో భగవానుని చరణాబ్జసేవయే ఉత్కృష్టధర్మమని, నిఃశ్రేయ సఫలదాయకమని చెప్పబడుచున్నది. ఈ భక్తిరసము నొకసారి ఆస్వాదించువారు దీనిని వదల జాలరు. ఇట్టి నిర్మల హృదయుల నధర్మము గాని, నరకము గాని, బంధింప జాలవు. ఏ వంవిధమైన భక్తిలో మానవునకు, ఆధ్యాత్మిక తత్త్వమగు భగవంతునకు ఆనన్యత్వ సంబంధము కలదని తెలియబడు చున్నది.

ద్రుతచిత్తము భగవదాకారతను పొందినచో మనో వృత్తియం దవిచ్ఛిన్నముగా నీ యాకారత ప్రతీత మగును అని భాగవతమున (3,29,11,12) భగవత్కథా శ్రవణాది కమువలన భగవదాకారతాక మగు మనోవృత్తి కలుగు నని, సముద్రములోనికి సదా గంగానది ప్రవహించునట్లు ధరావాహికమగు నీవృత్తివర్తించునని, చిత్తద్రవావస్థ లేని దే ఈవృత్తికలుగ జాలదని చెప్పబడినది.

భక్తియోగ మింకొకచో వర్ణించబడినది (11,2,45). ద్రుతచిత్తమున భగవదాకారతాకమగు వృత్తి బయలు దేరగా సర్వభూతములయందు భగవద్భావము భాసించగలదు. ఈ భగవద్భావ మాత్మలో ప్రతీయమాన మగును. ఇది ఉత్తమ ద్రవావస్థా లక్షణము. ఈశ్వరునియందు ప్రేమ, తదధీనులతో మైత్రి, బాలిశులపైకృప, శత్రువులయం దుపేక్ష ఎవనికి కలుగునో అతని చిత్తము మధ్యమ ద్రవావస్థలో గలదని చెప్పవలెను (11,2,46). అప్పుడే ప్రారంభించిన భక్తిసాధనా నుష్ఠానము ప్రాకృతమగు ద్రవావస్థయని తెలియవలెను. (11,2,47)

కఠినా శిధిలా వాధీర్నగృహ్ణాతి న వాస్యతే

ఉపేక్షాజ్ఞాన మిత్యాహు స్తద్బుధాః ప్రసరాదిషు.೨೯

ద్రవీభావప్రయోజనము వెనుక చెప్పబడినది. దానినే మరల స్మరించుచున్నాడు. కఠిన మగు చిత్తము విషయమును గ్రహింపజాలదు. శిథిలీభావ మందిన చిత్తమున విషయము గ్రహింపబడినను చిరకాల మచట నిలువలేదు. ద్రవావస్థాజనిత మగు సాత్త్విక భావములు విషయగ్రహణ కవసరములు. సంచారిభావోద్దీపనమైన తదభివ్యక్తి సూచకము లగు సాత్త్విక భావములు బయలుదేరు చున్నవి. కావున సాత్త్విక భావము లనుభూతములైన చిత్తము ద్రవావస్థ నందినదని చెప్పవచ్చును. సాత్త్వికభావ రహితమైన ప్రతీతిలో చిత్త కాఠిన్య ముండును. ఈ కాఠిన్యమున విషయ మవగతము కాజాలదు. అందుచే భగవద్విషయమున చిత్తకాఠిన్యము నిందింపబడుచున్నది. (భా.2.3.24;11.14.23)

హరినామమును గ్రహించినను హృదయము ద్రవీభూతము గాకయున్నచో, హృదయమున నేవిధమైన వికారమును కలుగుక యున్నచో, అట్టి హృదయమును పాషాణమనవలెను. ద్రవీభావము నందని చిత్తములేనిచో రోమహర్షము కలుగజాలదు; భక్తిభావనయే కలుగదు. ఇట్టివారికి కలుగు జ్ఞానము నుపేక్షాజ్ఞాన మందురు. ఈ జ్ఞానము సుఖసాధనము గాని, దుఃఖసాధనముగాని కాలేదు. రాగ ద్వేష శూన్యమైన చిత్తమున సంస్కార మేమియు కన్పించదు.

కాఠిన్యం విషయే కుర్యాద్ద్రవత్వం భగవత్పదే

ఉపాయైః శాస్త్రనిర్దిష్టై రనుక్షణ మతో బుధః30

చిత్తమునకు భగవదాకారతా సంపాదనమే సకల శాస్త్రముల ప్రయోజన మని నిశ్చయించితిమి. శీతలత్వము నీటి స్వభావమని, ఉష్ణత్వము అగ్నిస్వభావ మని, సంచరిష్ణుత్వము వాయుస్వభావమని మనకు తెలిసియున్నది. వీటి కీస్వభావములను పోగొట్టులేము గదా! ఇట్లే ద్రవీభూత మగుచిత్తమున ఆయా ఇష్టానిష్ట విషయ సమూహాము ప్రవేశించి, చిత్తమును సంకీర్ణము చేయుచున్నది. ఈ సంకీర్ణత అనాదికాల ముననే ప్రవేశించి, చిత్తముయొక్క స్వభావముగా భాసించుటచగలదు. ఇది నివృత్తమైననే చిత్తమునకు భగవ దాకారత చేకూరగలదు. కాని స్వాభావికధర్మము నివృత్తము కాగలదా? అను ప్రశ్న కిచట సమాధాన మీయబడుచున్నది.

చిత్తము విషయాకారమును పొందుట యనునది చిత్తము యొక్క స్వాభావిక ధర్మము గాదు. ఆగంతుగ హేతు జన్యమైనదీధర్మము. ఇంద్రియసన్నికర్షాది ప్రత్యక్ష విషయమున స్థూలవిషయాకారత ప్రతీత మగుట గలదు. స్వప్నా వస్థలో మనోగతవాసనలద్వారా సూక్ష్మవిషయాకారత ప్రతీయమాన మగుచున్నది. కాని సుషుప్తియందు చిత్తము నిర్విషయక ముగా భాసించుచున్నది. సుషుప్తియందలి చిత్తలయ ఈనిర్విషయకత్వమునే తెలుపునది. "తదా పితేః సంసార వ్యపదేశాత్‌" (4.2.8) అని బాదరాయణుడు సూత్రించినాడు. చిత్తలయ కలుగకయున్న వేళ##నే సంసారవ్యపదేశము కలదని అర్థము. చిత్తలయలోనే చిత్తముయొక్క స్వాభావిక ధర్మము కనబడగలదు.

అనిర్వచనీయా ద్యనేక శక్తి సమన్నితమై, మాయాధిష్ఠానమై, సర్వాంతర్యామియై, సర్వత్రానుగతమై యున్నబ్రహ్మ స్వరూపమే సమస్త జగమునకు వివర్తోపాదనము. బ్రహ్మయే మాయాశక్తులవలన జగముగా మనకు కన్పించుట గలదు. ప్రతివిషయము యొక్క స్వాభావిక ధర్మము తత్తద్వస్తువున భాసించు అంతర్యామియే యని భావము. కావున చిత్తముయొక్క స్వాభావికధర్మముగూడ భగవదాకా రతయే యని చెప్పవలెను.

''వియ ద్వస్తు స్వభావానురోధా దేవ న కారకాత్‌

వియత్సంపూర్ణతోత్పత్తౌ కుంభ##స్యేవ దశా ధియామ్‌.

ఘట దుఃఖాది రూపత్వం ధియాం ధర్మాదిహేతుతః

స్వతఃసిద్ధా77త్మ సంబోధ వ్యాప్తిర్వస్త్వనురోధతః"

అని వార్తికకారు లనినారు. కుండలో శూన్య మగుప్రదేశము స్వాభావికముగా గలదు. కుండను నీటితో నింపిననిది కుండకు కలుగు అస్వాభావిక ధర్మము. ఈ ధర్మ మన్యకారణసాధ్యము. ఇట్లే దుఃఖాదిమత్వ మాత్మ కస్వాభావిక ముగా వచ్చు ధర్మము. ఆత్మయొక్క స్వాభావికధర్మము భగవదాకారత యనబడు బ్రహ్మస్వరూపము. అన్యాకారతావిరోధియగు భగవదాకారత నాత్మకు సంపాదించుటయే శాస్త్రప్రయోజనమని తేలగలదు. శ్రవణ మననాది సాధనములద్వారా చిత్తమున కన్యవిషయాకారత క్రమక్రమముగా తొలగిపోగలదు. భాగవతము సహిత మీ యర్థమునే చెప్పుచున్నది. భగవద్భక్తివలనగుణకర్మజనితమగు చిత్తమాలిన్యము. నశించి, సవితృప్రకాశమువలె నిర్మలము శుద్ధమునగు ఆత్మతత్త్వము ప్రతీయమానము కాగలదు. (భా. 11.3.40) అగ్నిలో నుంచిన బంగారమునకు మాలిన్య మంతయుపోయి వన్నె బాగుగా నచ్చునట్లు భగవత్కథాశ్రవణాదు లను అగ్నియందుంచిన ఆత్మ పరిష్కృతమై రాణించగలదు. కర్మలు మొదలగువానివలన వచ్చిన మాలిన్యము నశించగా చక్షురాదీంద్రియములు సహితము తత్త్వావగతికి సహకరించగలవు. విషయములను ధ్యానించు మానసము విషయాకారమును పొందివిషయములలో నిమగ్న మగునట్లు భగవచ్చింతన చేయు మానసము భగవంతునియందు లీనమగును (11.14.26-28). అనిగూడ భాగవతము చెప్పుచున్నది. మనస్సును విషయములనుండి మరల్చి భగవంతునిపై నిలుపవలెనని భావము (11.13.14). ఆత్మయొక్క స్వాభావిక ధర్మమగు భగవదాకారత అన్యకారణ జన్యమైనది గాకపోవుటచచే ననిమిత్త నిమిత్తమనబడుచున్నది. ఇట్టి నిర్మలమగు ఆత్మతో భక్తియోగము నవలంబించవలెను. ఈ భక్తియోగమున కలుగు జ్ఞానోదయమున తత్త్వదర్శన సంభవించును. వైరాగ్యబుధ్దితో, తపోయుక్తమగు యోగముతో, తీవ్రమగు ఆత్మసమాధి నవలంబించగా పురుషుని అస్వాభావిక ప్రకృతి పూర్తిగా దహించు కొనిపోవును. కట్టెలనుండిబయలుదేరిన అగ్ని కట్టెలనే దహించి వేయునట్లు గుణకర్మ సమున్మిషితమైన ఆత్మ, గుణకర్మలను నశింపజేయును (3.27.21.23) గుణములయందు చిత్తము, చిత్తమున గుణములు ప్రవేశించుచు అన్యోన్యసంబంధము కలిగి యుండుటచే, ముముక్షువుయొక్క చిత్తము గుణములనుండి యెట్లు వేరుచేయబడగలదు? అని సనకాదులు ప్రశ్నించగా (11.13.17), భాగవతమున శ్రీభగవాను డీరీతిగా సమాధానమునొసగినాడు_"మనస్సు, వాక్కు, ఇంద్రియములు అను వాటిచే తాత్త్వికముగా గ్రహింపబడు విషయమాధ్యాత్మికతత్త్వ మొక్కటియే. జీవునిగుణములు, చిత్తము అను రెండును భగవదాత్మకములని తెలియవలెను. జాగ్రత్స్వప్న సుషుప్త్యాద్యవస్థలకంటె విలక్షణుడై సాక్షిగా నున్న వాడు జీవుడు. అనగా జీవునిస్వాభావికావస్థవీటికంటె విలక్షణమైన తురీయావస్థ. సంసారబాధాదికము జీవుని గుణవృత్తి నుండివచ్చునది. భగవదాత్మకము, భగవదాకారమునగు తురీయావస్థలో గుణచిత్తములు త్యజింపబడుచున్నవి. అహంకార కృతమగు సంసారబంధము అర్థవిపర్యయకారకమని విద్వాంసుడు గురైరిగి, నిర్వేదము జెంది, తురీయావస్థలో సంసారచింతను వదలుచున్నాడు. నానావిషయప్రతీతి మెంతవరకు నిలిచియుండునోఅంతవరకు జాగ్రత్స్వప్నములే మానవుని ఆవేశించి యున్నవని భావించవలెను. అట్టి మానవుని జాగ్రద్దశ స్వప్నమువంటిదని భావము. స్వప్నదశలోని విషయము లెట్లు తాత్త్వికములుకావో, అట్లే జాగ్రద్దశలోనివి గూడనని తెలియవలెను. త్రిగుణాత్మకమగు నీ వ్యాపారము సుషుప్తియందుపసంహరింపబడుచున్నది. కాని సుషుప్తిలో సహితము త్రిగుణాత్మకమగు వృత్తి పూర్తిగా నశించదు. త్రిగుణములచే నావృతమైన ఈ మూడుదశలు మాయాశక్తిజనితములు. తత్త్వజ్ఞాన మొక్కటియే ఈ మాయాశక్తిని నశింపజేయు జాలినది. తద్ద్వారా త్రిగుణాత్మకమగు వృత్తి నశించును" (11.13.24-33). కావున తత్త్వజిజ్ఞాసద్వారా నానాత్వభ్రమను పోగొట్టుకొని, వైరాగ్యముతో, భగవదైక్యము నవగతము చేసికొనవలెను. (11.11.21) .

చిత్తమున కాయా ఆకారములను తెచ్చునని విషయములు. విషయములు భగవద్వ్యతిరిక్తములు కావు. భగవంతునిపై నధ్యస్తములై, భగవంతుని అంతర్యామిగా గలిగి, భగవదుపాధిభూతములైనని విషయములు. సద్రూపత్వము భగవల్లక్షణము. భగవదాకారస్ఫూర్తి గలుగగా విషయభాస నివృత్తిమగుచు సద్రూపావగతియే మిగులను. అనగా అధిష్ఠాన విషయమగు చైతన్య మవగతముకాగా తదారోపితవస్తువులు నివృత్తము. లగును. అప్పుడు విషయనిష్ఠమగు ప్రేమ భగవదర్పితము కాగలదు. ఈస్థితిని_

"యా ప్రీతి రవివేకానాం విషయే ష్యవనపాయినీ

త్వా మనుస్మరతః సా మే హృదయా న్మాపరస్పరతు" (విష్ణు, 1.20.19)

అని ప్రహ్లాదు డర్థించినట్లు విష్ణుపురాణము చెప్పుచున్నది. కావున సర్వాధిష్ఠానసన్మాత్రము, పరిపూర్ణ సచ్చిదానందఘనము, అద్వయమునగు బ్రహ్మగా ఆత్మస్వరూపమును గ్రహించవలెను. అప్పుడు స్వాప్నికవిషయముల నెట్లు స్వీకరింతుమో అట్లే జాగ్రద్విషయములనుగూడ నెంచినచో మహాత్తరమగు వైరాగ్యము జన్మించగలదు. "దృష్టానుశ్రవికవిషయ వితృష్ణస్య వశీకారసంజ్ఞా వైరాగ్యమ్‌" అని సూత్రించుచు యేగసూత్రకారు డీవైరాగ్యమును వశీకారమని పిలచినాడు.

వైరాగ్యము నాలుగు విధములుగా సాధ్య సాధన భావాపన్నముగా ఆగమములయందు ప్రసిద్ధి నందినది. ఎంత ప్రమాసకైనను సహించి చిత్తదోషములను తప్పక తొలగించుకొన వలెనను అధ్యవసాయాత్మక మగు బుద్ధి కలుగు వైరాగ్యము మొదటి విధము. దీనిని యతమానవైరాగ్య మందురు. నిరంతర ముపాయానుష్ఠానము గావించుచుండగా కొన్ని దోషములు నశించగలవు. మిగిలినవాటిని గూడ నశింపజేయవలె నను బుద్ధి కలుగగా సంభవించు వ్యతిరేక సంజ్ఞాకమైన వైరాగ్యము రెండవది. అప్పుడు బాహ్యేంద్రియములను విషయములపై వ్యాపృతములు గాకుండ చూచుచు, కేవలమంతఃకరణ వాసనలతో నుండగా నేకేంద్రియసంజ్ఞాక మగుమూడవవిధమగు వైరాగ్యము రాగలదు. ఈ మూడు విధముల వైరాగ్యముల నభ్యసించగా దృష్టానుశ్రవిక విషయములపై దోషదర్శన పరిపాక జన్యము, స్పృహాత్మికము నగుచిత్తవృత్తి బయలుదేరును. దీనిని వశీకారవైరాగ్య మందురు. నాల్గవది తెరగులుగా గలదు. ఇందు పరమను వశీకారవైరాగ్యమును "తత్పరం పురుషఖ్యాతేర్గుణవైతృష్ణ్యమ్‌" అని పతంజలి సూత్రించెను. పురుషఖ్యాతి యనగా ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానానంతరము తద్గుణము. లగు శబ్దాదులయందు వైరాగ్యము కలుగును. ఆత్మజ్ఞానమునకు శ్రేష్ఠఫలరూపత్వము సిద్ధ మగుటచే నీవైరాగ్యము వచ్చుచున్నది. అపరమను వశీకారవైరాగ్యము దీనికి సాధనరూపము. ఇతరఫల నిరపేక్షా పూర్వకమై, మోక్షమాత్ర స్పృహాయాలుత్వము నీ పరమను వశీకారమున గాననగును. "నీ పాదసేవకంటె మిన్నయైన దేమియు లేదు; నేకొరదగిన దేమియు లేదు. మోక్షదాత యగు నిన్ను భజించిన మానవుడెవడాత్మబంధనమును కోరుకొనును? కావున సత్త్వరజ స్తమోగుణాత్మకము లగు ఆశీర్వచనముల నేమియు నభిలషించక, నిరంజనము, నిర్గుణము, అద్వయము, స్వతఃసిద్ధము, స్వయంప్రకాశము నగు బ్రహ్మత్వము నందెదను. ఈ వ్యావహారిక జగమున చిరకాలము వసించినను శాంతి నేవిధముగా నైనను పొందజాలక పోతిని. కావున నభయప్రదాత వగు నీ శరణు జొచ్చితిని. ఆ పన్నుడనైన నాకు అభయమును, అమృతత్వమును ప్రసాదించుము" అని ముచుకుందుడు భగవంతుని ప్రార్థించినట్లు భాగవతమున (10.51.56-58) గలదు. ఇట్టి దశయందు భగవత్ప్రేమ ఆనందపరాకాష్ఠ నధిరోహించు నని భగవానుడు ముచుకుందునకు ప్రత్యుత్తరము నొసగెను (10.51.59-64).

అపరవైరాగ్యమును "దృష్టానుశ్రావిక విషయతృష్ణస్య నశీకారసంజ్ఞా వైరాగ్యమ్‌" అని పతంజలి సూత్రించినాడు. పరవైరాగ్యము లేనిచో భక్తిప్రకర్ష యుండదు. మోక్షపర్యం తము సకల ఫల నిరపేక్షతతో నుండు వైరాగ్యమును భాగవత మనేక పర్యాయములు ప్రస్తుతించినది. ఐహికఫలమును, అముష్మిక ఫలమును పూర్తిగా పరిత్యజించి, వీటిని అపేక్షించక, అనన్యభక్తితో భగవంతుని భజించుచు, భగవంతునిలో లీనము కావలెనని యత్నించువారలకే అమృతత్వలక్షిత మగు బ్రహ్మవస్థ చేకూరగలదు (3.25.39,40) భగవత్సేవ లేకుండా బ్రహ్మతో సాలోక్యమునుగాని, సామీప్యమును గాని, సారూప్యమును గాని ప్రసాదించినను భక్తులు గ్రహింపజాలరు (3.29.13) కొందరు భక్తులు భగవతునితో నేకాత్మతను వాఛించరు. వీరు భగవత్ప్రేమ గలిగినవారైన భగవత్పాదసేవాభిరతులు (3.25.34). పరమేష్ఠిత్వము, మహేంద్రత్వము, సార్వభౌమత్వము, రసాధిపత్యము, యోగసిద్ధి, పునర్జన్మరాహిత్యము, అను వానిలో దేనినైనను గోరక భక్తులు భగవంతునే అభిలషింతురు (6.11.25.11.14.14). ప్రహ్లాదుడు కామరహితుడై, భక్తుడై, స్వామియగు భగవంతుని దరి జేరినాడు (7.10.6). భగవచ్చరణాంబుజాసవ మున్నచో కోరిక యేమియు కలుగదని పృథు వనినాడు (4.20.24) భగవత్పాదపద్మధ్యానము, భగవత్కథాశ్రవణము ఉన్నచో కలుగు నిర్వృతి సుఖము బ్రహ్మయందుగూడ నుండదేమో యని ధ్రువుడనినాడు (4.9.10). భగవద్భక్తి యున్నచో నితర సుఖములను వేటిని అభిలషించ జాల మని శ్రీకృష్ణుని భార్య లనినారు (10.83.41,42) భగవద్భక్తిలో ప్రబుద్ధమగు హృదయకమలముద్వారా మాత్రమే మోక్షప్రాప్తియని ఇంద్రుడనినాడు (7.8.42) అమృత సాగరమును గ్రోలి అనుభవించినవానికి చిన్నగుంటలు, చెరువులు నిరర్థకము లగునట్లు నిఃశ్రేయసఫలదాయకుడగు భగవంతుని భజించినవానికి అన్యవిషయప్రసక్తి యుండదని ఇంద్రుడనినాడు (6.12.22) దురవగమ మగు నాత్మతత్వ వినిగమమునకై భగవచ్చరిత మను మహామృతసాగరమున తిరుగుచు శ్రమజెందువారు భగవద్వ్యతిరిక్త మగు నపవర్గమును వాంఛించరు. (10.87.21). ఈ రీతిగా మోక్షపర్యంతము సకల ఫల నిరపేక్షస్వరూప మైనది పరవైరాగ్యము. పరమానంద రూపమగు పరమాత్మావగతియందే ప్రేమ పరాకాష్ఠ నందచున్నదని ఈ పరవైరాగ్య ప్రతీతిద్వారా మనకు తెలియుచున్నది. రెక్కలు రాని పక్షులు తమ తల్లిని, ఆకలి గొన్న దూడలు తమ తల్లిని, భార్య భర్తను చూడవలెనని ఎఁత ఆతురత గలిగి యుండునో అట్లే భక్తునిమానసము భగవంతుని దర్శించవలెనని వేగిరపడుచుండును (6.11.26). అనగా జ్ఞానము లేనిదే పరవైరాగ్య మంకురించదు. పరవైరాగ్యభావమున భగవత్ప్రేమ పరాకాష్ఠనందదు. తదర్థము జ్ఞాన వైరాగ్యములను దృఢము గావింపవలెను గనుక "ప్రకృతిగుణములను వదలిపెట్టి వైరాగ్య విజృంభిత మైన జ్ఞానముతో, యోగముతో, భగవద్భక్తితో ప్రత్యగాత్మాను భూతిని పొందవలెను" అని భాగవతము చెప్పుచున్నది (3.25.27). జ్ఞాన వైరాగ్యయుత మగు భక్తియోగముతో యోగులు బ్రహ్మభావము నందుచున్నారు (3.25.43). భక్తి, వైరాగ్యము, భగవత్ర్పబోధము అనునవి శాంతిని చేకూర్చునవి (11.2.43). వీటికి అన్యోన్యసంబంధ మతిసన్నిహితముగా గలదు. పుణ్యగాథాశ్రవణము జేయు భగవద్ధర్మానుష్ఠాతకు మొదట భగవత్ప్రబోధము, తర్వాత వైరాగ్యము, ఆపై ప్రేమలక్షణాక మగు భక్తి కలుగగల వని తాత్పర్యము, జ్ఞానులకు భగవంతుడే అభిమతతమ మగు విషయము; భగవంతునితో కూడని స్వర్గావ వర్గములు వారికి ప్రియతమములు కావు. కావున జ్ఞాన విజ్ఞాన సంసిద్ధులు బ్రహ్మత్వమునే శ్రేష్ఠ మని తెలిసికొనుచున్నారు. అందుచే భగవంతునకు జ్ఞానిచే ప్రియతము డని, జ్ఞానముచేతనే బ్రహ్మావగతి కలుగుచున్నదని చెప్పబడినది (11.19.2,3). ఈ జ్ఞానమెట్టిది? యను ప్రశ్నకు చక్కని సమాధాన మీయబడినది. లౌకిక జగమున కాద్యంతములు లేవు. ఆద్యంతములు లేని వస్తువునకు మధ్యగూడ నుండ జాలదు. అనగా అట్టి వస్తువుశూన్యము. అతాత్త్వికము. జన్మ, స్థితి, లయము లీ అతాత్త్వికజగత్తునకు చెందినవి. అనగా నివి యన్నియు మాయాశక్తియొక్క అధీనములోనివి. ఈ మాయాశక్తిని తెలిసికొనిన, తదిధిష్ఠానమగు బ్రహ్మ అవగత మగును. ఇదే జ్ఞానము లేక విజ్ఞానము. ఈ విజ్ఞానావగతియే పురుషార్థము (11.19.7).

భగవద్వ్యతిరిక్త మైన దంతయు మాయామయము. స్వప్నజగత్తువలె మాయాకృత మగు జగము తుచ్ఛము దుఃఖరూపము, అనిత్యము, ప్రత్యగాత్మయగు పరమాత్మయే సత్యము. ఈసత్యపదార్థము స్వప్రకాశ పరమానంద రూపము, నిత్యము, విభువు, ఉపాదేయము. ఇది తెలిసికొనుటయే జ్ఞానమనబుడును. దీనినే భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించెను. (అ7) ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని అని భగవంతుని భజించువారు నాలుగు తెరగులుగా గలరు. వీరిలో శ్రేష్ఠుడు జ్ఞాని. జ్ఞానియొక్క ఆత్మ బ్రహ్మయందు లగ్నమై, బ్రహ్మావగతిని లేక బ్రహ్మత్వమును పొందుచున్నది. బ్రహ్మాతిరిక్తమైన దంతయు మాయాత్మక మగుటచే తుచ్ఛము, అనిత్యము, అతాత్త్వికము. వాసుదేవుడే బ్రహ్మ యగుటచే జ్ఞాను లగు భక్తులకు ప్రియతముడు, సత్యము, స్థాయిభావము నగుచున్నాడు. శ్రుతి, ప్రత్యక్షము, ఐతిహ్యము, అనుమానము అను నాలుగు ప్రమాణములును తత్త్వజ్ఞానమును పూర్తిగా నీయజాలక పోవుటచే జ్ఞానికి వైరాగ్యము కలుగును. వైరాగ్యబుద్ధితో నిత్యానిత్య వస్తువివేకము గలిగి బాహ్యేంద్రియముల కదృష్టమగు విషయమును గూడ దర్శింప గలుగు చున్నాడు (11.19.17-18). కర్మాచరణ వలన సుఖదుఃఖ ప్రతీతి కలుగుటయే గాక నస్థిరవిషయ సమ్మోహముగూడ కలుగును. ఇట్లు కర్మచే నిర్మింపబడిన జగము శాశ్వతము గాదు (11.3.18-20).

భగవద్ధర్మనుష్ఠాన మగ్నునకు జ్ఞాన వైరాగ్యపూర్వకమగు భగవద్భక్తి ఉదయించు నంటిమి. ఈ భక్తియొక్క స్వరూపము భాగవతమున నేకాదశస్కంధములో విపులముగా వర్ణించబడినది. నిశ్చలముగా మనస్సును బ్రహ్మయందు నిలుపజాలక పోయినచే, నిరపేక్షబుద్ధితో భగవత్పరముగా కర్మల నన్నిటిని ఆచరించుట శ్రేయస్కరము. శ్రద్ధతో భగవత్పుణ్య కథలను విని, పాడి, మననముజేసి భగవదర్థమే ధర్మ కామార్థములను నిర్వర్తించినచో నిశ్చల మగు భక్తి ఉదయించగలదు (11.11.22-24). భగవంతునిపై శ్రద్ధావినయముల నిలుపుట, ఎల్లపుడు భగవదనుకీర్తనము గావించుట, భగవత్పూజా స్తవములను జేయుట, భగవత్పరిచర్యలో నాదరమును జూపుట, భగవద్భక్తపూజ గావించుట, సర్వభూతముల యందు భగవద్భావము ననుభవించుట, మనో వాక్కాయ కర్మల భగవదర్పణము చేయుట, భగవదర్థమై అర్థ బోగసుఖ పరిత్యాగము, భగవద్బుద్ధితో జపతపముల నొనర్చుట, అనువాటిద్వారా భక్తి బయలుదేరును.; భక్తివ్యక్త మగును గూడ (11.19.20-24).

జిజ్ఞాసువు శ్రేయోదాయకుడగు ఉత్తమ గురువుదగ్గర జేరవలెను. ఆగమాది శాస్త్రములయం దారితేరినవాడు, బ్రహ్మత్వము నందినవాడు నగు గురువు ఆత్మదైవతమై భాగవతధర్మములను నేర్పవలెను. మాయారహితముగా నాత్మయెట్లు సంతృప్తినందగలదో, ఆత్మదాతయగు భగవంతు డేరీతిగా తుష్టి నందగలడో, అట్టి ప్రక్రియను నేర్పవలెను. మొట్ట మొదట మనస్సును కామక్రోధాదులనుండి వేరుజేసి, అనగా అసంగము గావించి, ఆపే సత్పురుషుల సాంగత్యమును పొందవలెను. దయ, మైత్రి, ప్రశ్రయము, భూతదయ, శౌచము, తపస్సు, తితిక్ష, మౌనము, స్వాధ్వాయప్రవచనము, బ్రహ్మచర్యము, అహింస, సుఖదుఃఖాది ద్వంద్వములపై సమత్వబుద్ధి అనువానిని ఆచరించవలెను. అంతట ఆత్మేశ్వరభావన, దర్శనలను సాధించవలెను. సదా సంతోషముతో మెలగుచు, భగవతునిపై శ్రద్ధకలగి, దేనిపైనను నిందాబుద్ధిని కలిగియుండక, మనోవాక్కర్మలను సంయమించి, శమదమాది సంపదతో ప్రవర్తింపవలెను. భగవద్గుణ క్రియాదులను వినుట, కీర్తించుట, ధ్యానించుట, చాల అవసరము స్వార్థరహితముగా, భగవద్బుద్ధితో, నుహృద్భావముతో మెలగవలెను. వినయ విధేయతలతో నీ రీతిగా ప్రవర్తించ తీవ్రతమమైనభక్తి ఫలవంతముకాగలదు. అనగా భగవదైక్యభావనతో భాగవతధర్మ జనితమగు భక్తితో మాయను దాటిపోయి, బ్రహ్మానుభూతిని పొందవీలున్నది (11.3.21-33). ఈ శాస్త్రీ యోపాయములతో మనస్సును శుద్ధము జేసికొనవలెను.

ఉపాయః ప్రథమస్కంధే నారదే నోపవర్ణితాః

సంక్షేపాత్తా నహం వక్ష్యే భూమిభేదవిభాగతః. 3

ప్రతిపన్నజన బుద్ధిసౌకర్యార్థము శాస్త్రీయోపాయములను మధుసూదనుడు చెప్పబోవు చున్నాడు. భాగవతమున మొదటిస్కంధములో నారదు డీ యుపాయములను వివరించి యున్నాడు. వాటినే భామికాభేదవశమున సంక్షిప్తముగా నిట చెప్పనున్నాము.

ప్రథమం మహతాం సేత తద్దయాపాత్రతా తతః

శ్రద్ధా7థ తేషాం ధర్మేషు తతో హరిగుణశ్రుతిః 32

తతో రత్యఙ్కురోత్పత్తిః స్వరూపాధిగత స్తతః

ప్రేమవృద్ధిః పరానందే తస్యాథ స్ఫురణం తతః. 33

భగవద్ధర్మనిష్ఠాతః స్వస్మింస్తద్గుణశాలితా

ప్రేవ్ణూె7థ పరమాకాష్ఠే త్యుదితా భక్తిభూమికా. 34

మహాపురుషులసేవ, వారిదయకు పాత్రుడగుట, వారాచరించు ధర్మములపై శ్రద్ధ, భగవద్గుణశ్రవణము, భగవంతుని ప్రేమ ఉదయించుట, భగవత్స్వరూపమును తెలిసికొనుట, భగవత్‌స్ఫూర్తి, భగవద్ధర్మనిష్ఠ, తనయం దా గుణములను పెంపొందించుట, భగవంతునిపై గల ప్రేమ పరాకాష్ఠనందుట అను క్రమక్రమముగా, ఒక దానితర్వాత ఒకటి అలవడవలెను. వీటిని శాస్త్రీయోపాయము లందురు. ఇవి యన్నియు భాగవతమున వ్యాస నారత సంవాదములో వివరింపబడినది.

పూర్వజన్మమున నారదుడు బాల్యదశయందే వేద వాదరతులసేవ జేయుచు, యోగులకు శుశ్రూషచేయ నారంభించెను. వారిదయకు పాత్రుడై క్రమక్రమముగా విశుద్ధచేతస్కుడైనాడట. అప్పుడు భగవత్కాథాశ్రవణ మననాదిక మును జేయుచు అస్ఖలితబుద్ధితో ప్రవర్తించసాగెను. అప్పుడు సదసద్వివేకము కలుగగా మనస్సును భగవంతునియందు లగ్నము గావించెను. అప్పుడు సమ్మునిషితమైన భక్తియోగమున వాసనారూపమున నున్న రజస్తమోగుణములు నశించినవి. శ్రద్ధాపూర్వకమగు భక్తియొగమున జ్ఞానోదయము కలిగినది. కర్మాద్యాచరణము సంసారబంధహేతువని, భక్తియోగసమన్వితమైన జ్ఞానము పునరావృత్తిని పోగొట్టునదని నారదుడు గ్రహించ గలిగినాడు. కర్మాదులను భగవద్బుద్ధితో భగవదర్పణము చేయుచు నాచరించుటయే శ్రేయస్కరమని తెలిసికొనినాడు. తద్ద్వారా లోకోత్తరమగు బ్రహ్మజ్ఞానమును. బ్రహ్మభావమును పొందగలిగినాడు (1.5.23-39).

భగవద్భక్తసేవ యని, సాక్షాద్భగత్సేవయని భగవత్సేవ రెండు విధముల గలదు. మోక్షమునకు మహాపురుషులను సేవించుట ద్వారమువంటిది. వీరిని సేవించుటచే తమోద్వారము నిరస్తము కాగలదు. సమచిత్త ములను గలిగినవారు, ప్రశాంతులు, కామక్రోధరహితులు, సుహృదయులు, సాధువులు, భగవంతునియందు ప్రేమ కలగి మానవుల నందరను భగవద్భావముతో గాంచువారు, లౌకికవిషయసంపద నశించినవారు నగువారు భగవద్భక్తులగు మహాపురుషులు (5.5.2-3). సాధువులగు భగవద్భక్తులను సేవించుటచే మోక్షద్వార మపావృతమగును. కారుణికులు ప్రాణులపై సుహృద్భావముగలవారు, అజాతశత్రువులు, శాంతము గలవారు, సాధువులు, సాధుభూషణులు అనన్యమనస్కులై భగవద్భక్తిని దృఢముగా గల్గియున్నవారు, భగవదర్థమే ఇతరకర్మలను బంధుజనులను వదలినవారు, భగవత్కథా శ్రవణము లలో నాసక్తులు, భగవంతునిపై చిత్తమునిలిపి తపస్సు చేయువారు, సర్వసంగవివర్జితులు, సంగదోషహరులునైన వారే సాధువులు (3.25.20-24) స్వర్గముగాని, పునర్జన్మరాహిత్యముగాని భగవద్భక్తుల సాంగత్యముకంటె శ్రేష్ఠముగాదని మరియొకచో భాగవత మనుచున్నది (1.18.13) క్షణభంగురమైనను మానవదేహము సంప్రాప్తమగుట దుర్లభము. ఇట్టి మానవులకు సహితము వైకుంఠ ప్రియదర్శనము మరియు దుర్లభమగుచున్నది. కావున క్షణికమగు నీ జీవితమున సత్పురుషసాంగత్యమే నిధివంటిది యగుచున్నది (11.2.29-30). సాంఖ్యయోగములు, స్వాధ్యాయము, తపస్సు, త్యాగము, ఇష్టాపూర్తము, దక్షిణ, వ్రతములు, యజ్ఞములు, తీర్థయాత్రలు, యమదమాది, నియమములు అనునవిగూడ సర్వసంగాపహమగు భగవద్భక్త సంగమువలె భగవానుని ప్రేమకు లోబడునట్లు జేయలేవు. దైత్యులు, యాతుధానులు, మృగములు, పక్షులు గంధర్వు%ు, అప్సరసలు, నాగములు, సిద్ధులు, గుహ్యకులు, విద్యాధరులు, సర్వవర్ణములకు జెందిన మానవులు మొదలగు వారందరు భగవద్భక్తసంగముద్వారా భగవత్పదము నందగలరనిగూడ చెప్పబడినది (11.12.1-5).

సాక్షాద్భగవత్సేవ గావించినవారనేకులు పురాణాదులయందు కొనియాడబడినారు. వృషపర్వుడు, బలి, బాణుడు, మయుడు, విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, గజేంద్రుడు, గరుత్మంతుడు, వ్యాధుడు, కుబ్జ, గోపికలు, యజ్ఞపత్నులు, వేదాధ్యయనమును గావించినారు. మహత్తములనుపాసించనివారు, వ్రతముల నాచరించనివారు, తపస్సులను చేయనివారు మొదలగు వారందరు భగవద్భక్త సాంగత్యము జేసి భగవత్పదము నందినారని వినుచున్నాము. గోపికలు గోవులు, మృగములు, నాగములు, సిద్ధులు, మూఢులు, సహితము భగవద్భావముతో వర్తించి భగవత్పదము నంది రనిచెప్పబడినది. ఎన్ని యత్నములు జేసినను లభించని భగవత్సదము భక్తులకు, భక్తులసాంగత్యము గలవారలకు సమకూరుచున్నది (11.12.5-9). కావున చోదనా ప్రతిచోదనలను ప్రవృత్తినివృత్తులను, శ్రుత శ్రోతవ్యములను పరిత్యజించి, భగవంతుని నివృత్తులను, సర్వాత్మభావముతో, భయరహితముగా భగవద్భావము నంద వలెననినారు (11.12.13-15).

కావున భగవత్సంగము గాని, భగవద్భక్తసంగముగాని లేకుండా భగవంతునిపై భక్తి ఉదయించ జాలదు. భవగద్భక్తులు కృతార్థులు, కృతకృత్యులు నగుటచే వీరికి అన్యసంగా పేక్ష యుండదు కాని భగవద్భక్త సంగులు భక్తుల సాంగత్యము నపేక్షించక తప్పదు.

మహత్సేవ యైన తర్వాత తద్దయాపాత్రత కలుగవలెను. సుశీలాది గుణోపేతులైన వారిని మహాపురుషులని యెంచవలెను. కృపాలువు, ద్రోహము చేయనివాడు, తితిక్షువు సత్యవంతుడు, ద్రోహరహితమైన ఆత్మగలవాడు, సమబుద్ధి గలవాడు, సర్వోపకారకుడు, అపౌమహతుడు, దాంతుడు, మార్దవము కలవాడు శుచి, యైనవాడు, ఉదారబుద్ధి గలవాడు, కోరికలు లేనివాడు, మితభోజి, శాంతముగలవాడు, స్థిరుడు, భదవద్భక్తి గలవాడు, అప్రమత్తుడు, గంభీరాత్మగలవాడు, ధృతిమంతుడు, షడ్గుణములను జయించినవాడు, మానవంతుడు, కారణికుడు, ప్రతిభావంతుడు నగు వాడు మహాత్ముడు (11.11.29-31). మాత్సర్యరహితుడు, దక్షుడు, మమకారరహితుడు, దృఢసుహృద్భావము గలవాడు, అసూయాదులు లేనివాడు, జిజ్ఞాసువు, అన్నిటియందు నుదాసీనబుద్ధి గలవాడు, భదవంతుని తెలిసికొనినవాడునై శాంతరూపుడగు గురువును భగవదాత్మకునిగా నుపాసించ వలెను (11.10.5-7) బ్రహ్మణ్యుడు, శీలసంపన్నుడు, సత్యసంధుడు, జితేంద్రియుడు, తనను తాను చూచుకొనున ట్లితర విషయములను గాంచువాడు, వినమ్రుడు, దీనవత్సలుడు, భ్రాతృత్వముతో స్నిగ్ధుడు, గురువుల నీశ్వరునిగా భావించువాడు, రాగద్వేషాది వివర్జితుడు, వ్యసనములపై నుద్విగ్నము కాని చిత్తము కలవాడు, కామరహితుడు, తత్త్వావగతికై యత్నించినవాడు, ప్రశాంతకాముడు, ఆజాతశత్రువు అని ప్రహ్లాదుడు ప్రస్తుతించ బడినాడు (7.4.30-33) ఇట్టి శిష్యత్వముగాని, భగవద్భక్తసేవ గాని, భగవద్భక్తిగాని, లేనిచో మహాత్ముల సాంగత్యము నిరర్థక మగును.

ఏతాదృశ మహాపురుషుల దయకు పాత్రుడు కావలెనని ద్వితీయభూమిక గలదు. ఈ దయాపాత్రత గూడ స్వప్రయత్నానపేక్ష యని, తత్సాపేక్ష యని రెండు విధముల గలదు. క్రమముక్తి, సర్వముక్తి యనునవి స్వప్రయత్నానపేక్షద్వారా లభించునవి. ఈముక్తిని పొందుటకు కావలసినది భక్తి మాత్రమే (4.24.25-31). స్వప్రయత్నాపేక్షతో ధ్రువుడు త్రిభువనోత్కృష్టమగు భగవత్పదమునకు మార్గము నుపదేశింప వలసిన దని నారుదుని ప్రశ్నించెను. (4.8.35-38). ప్రవణాయితమగు చిత్తముతో భగవంతుని భజించ నిఃశ్రేయః కరమగు స్థితి లభించ గలదని నారదుడనినాడు (4.8.40-42)

పైన చెప్పిన గుణములతో నలరారు, మహాత్ములను సేవించగా వారియొక్క ధర్మములపై, క్రియలపై శ్రద్ధ బయలుదేరును. ఆధర్మముల ననుష్ఠించిన కృతార్థుడను కాగలననుబుద్ధి జన్మించ, తదనుష్ఠానమునకై మానవుడు యత్నించ గలడు. శ్రద్ధాపూర్వకముగా మహాత్ములకు శుశ్రూషచేయుచు భగవత్కథలను వినుచు, పుణ్యతీర్థములను సేవించుచు నున్నచో కర్మబంధము భిన్నము కాగలదు (1.2.16-17) నిస్సంగత్వముతో కూడియున్న భక్తియోగమే కైవల్యసమ్మత మగు పథ మగుటచే భక్తియోగ మాదేశించు భగవత్కథాశ్రవణము నెవడు ప్రేమించడు? (2.3.12) అనగా భాగవతధర్మము లన్నిటిపైనను ప్రేమ, శ్రద్ధ కలుగకపోవు భగవద్భక్తులలో నొకడై, భగవత్పాద పల్లవమును బ్రహ్మ ఆరాధించగోరినట్లు భాగవత మనుచున్నది. (10.14.30) సాధనపరిపాక వశమున నేవంవిధమగు శ్రద్ధ వృద్ధిపొందుచు నైహి కాముష్మిక విషయముల నన్నిటికి వదలునట్లు జేయగలదు. అప్పుడాకలి గొన్నవానికి అన్నమువలె భక్తునకు భగవద్ధర్మాచరణమే జీవనోపాధి కాగలదు.

భగవ న్ముఖాంభోజమునుండి స్రవించు భగవత్కథా మృతమును గ్రోలు పరీక్షితున కాకలి దప్పులు లేవట! భగవద్గుణ శ్లోకాను కీర్తనము లేని జీవితము వ్యర్థమని శౌనకుడనినాడు. భగవద్గుణ క్రియాదులును వినక, సంకీర్తినము చేయక యున్నవాని జీహ్వాదీంద్రియములు నిరర్థకములు, కిరీటాదులతో విభూషితమైనను శిరస్సు భగవత్ప్రణామమునకు లొంగనిచో నా శిరస్సు కేవలము భారహార మగును ప్రకాశించు కాంచన కంకణములతో నున్నను ఎవని చేతులు భగవత్సపర్యయందు వ్యాపృతములు గావో అట్టి చేతులు చేతులు కాజాలవు. భగవన్నిరీక్షణ జేయని నేత్రములు నేత్రములు కావు. భగవపత్యేత్రములకు తీసికొని పోజాలని పాదములు చెట్ల మొండముల వంటివి. భగవత్పాదరేణువు నభిలషించినవాడు జీవచ్ఛవము. భగవన్నామ సంకీర్తనమును వినుచున్నను చిత్తము ద్రవీభూతము గానిచో నట్టి చిత్తమును పాషాణమని యెంచవలెను. (2,3 17-24)

భగంవంతునిపై శ్రద్ధాభక్తులు లేనివారు విషయభోగపరులు. కొందరు పాండిత్యాది గర్వముతో నున్నవారై భగవద్భక్త నిందాపర లగుచున్నారు. సర్వపాప వినాశకరమగు భగవన్నామ సంకీర్తనమును జేయక, మతిని పోగొట్టు అన్యవిషముల నాకర్ణించుచు, విషయమలోలు రైనవారలకు భగవంతుడు దూరమగును (3,15,23) వృక్షములు, పశు పక్ష్యాదులు భగవన్మూలకములై జీవించుచున్నవి. శ్వాసించుచున్నవి. అట్టిచో భగవ్కథా శ్రవణమునకు చెవియొగ్గని పురుషుని పశువు గాగూడ భావించ వీలు లేదేమో యని మరియొకచో గలదు. ఆత్మకారక మగు నీశ్వరుని సాక్షాత్తుగా భజించుట, తెలిసికొనుట యను వాటియందు వ్యాపృతులు గాని వా రధోగతిపా లగుదురు. స్త్రీ శ్రూద్రాదుల సహితము భగవద్గుణ శ్రవణాదికముచే పవిత్రు లగుచున్నారు. (11,5 2-4) రజోగుణమునకు లొంగి ఘోర కృత్యములను సంకల్పించువారు, కాముకులు, క్రోధాదిద్వేషపూరితులు, దాంభికులు, గర్విష్ఠులు, పాపులు మాత్రమే భగవద్భక్తులను నిందిచుచు, హేళన చేయుదురు. ఆధర్మాచరణమునుండి జీవహింస చేయుచు భక్తుల నెగతాళి చేయు నీ దుష్టులు మహైశ్వర్యాదికముచే మదించినవారు. విద్యా, త్యాగ, రూప, బలాదులచే బుద్ధిమాంద్యము నందినవారు వీరిని తెలియవలెను ఇష్టదైవతమను స్మరించక, వేదాదులచే ననుకీర్తింపబడిన దేవుని ఆరాధించక యుండు వీరు బుద్ధిహీను లనుబడుదురు (11.5.7-10) భగవత్పరాఙ్ముఖులకు వీరల కంధకారమేగతి కాగలదు (11.5.18). కావున భగవద్ధర్మ శ్రద్ధ యనునది మూడవ భూమిక యగుచున్నది.

భగవత్పదానువృత్తిని గోరి సత్యమగు మార్గము నవలంబించ దలచినవారు భగవద్గుణ క్రియలపై శ్రద్ధ వహించవలెను. ఏతచ్ఛ్రవణమువలన నితరులు కలభ్య మగు భగవదావాసము సంప్రాప్తము కాగలదు (10.90.49-50) అతి దుస్తరమగు సంసారసాగరమును దాటుటకు భగవంతుడను పడవ దప్ప వేరొకటిలేదు. వివిధ దుఃఖములను పోగొట్టు కొనుటకు భగవల్లీలా కథా రస నిషేవణమే తరుణోపాయము (12.4.40) భగవద్గుణశ్లోకమువలననే మానవుడు విరాగి కాగలడు (10.1.4) భగవద్గుణశ్రవణ మనునది సమస్త భాగవత ధర్మములకు నుపలక్షణము. కావు నీవిధములగు ప్రయోగములు కన్పడినపుడు భాగవత ధర్మములని వ్యాఖ్యచేయవలెను.

భగవచ్చరణాంబుజ సేవయే అమృతత్వ హేతువని వేరొకచో గలదు (11.2.2) భగవత్కథాశ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము నను నవలక్షణములతో గూడినది భక్తి. ఇట్టి భక్తి కలిగియుండుట ఉత్తమపురుషలక్షణము (7.5.23-24) కావున భగవానునిగురించి వినుట, భగవానుని కీర్తించుట, స్మరించుట అనునవి అభయప్రదాయకము లని చెప్పవచ్చును (2.15) భగవచ్ఛ్రవణ సంకీర్తనముల ద్వారా భగవదవతారము చిత్తము నావేశించి, చిత్త మందలి మాలిన్యము నంతయును నిర్మూలించును. భగవంతుని నభివ్యక్తముచేయని వాక్కులు, కథలు అసత్ప్రలాపములు గానప్పుడవగతములగును. భగవద్గుణోదయము లైన సత్త్వమంగళపుణ్యమే అన్వర్థము లగును. భగవంతుని ఉత్తమ శ్లోక యశోను7నుకీర్తనము గలిగిననే రమ్య, రుచిర, నవత్వాదులు సార్థకములు కాగలవు. అప్పుడు మానసము సదా మహోత్సవమగ్నము కాగలదు. అప్పుడే శోకార్ణవమును దాటగలము భగవద్భావముతో వర్తించు ఏతాదృశ మానవుల నిర్మల హృదయులగు సాధువులని పిలువబడుదురు. కావుననే భగవద్భావ వర్జిచితమైన నైష్కర్మ్యముగాని, జ్ఞానము గాని శోభించవు. భగవద్భక్తిని తెలుపు శ్రవణ, మనన, నిధిధ్యాసనలు శాంతిని, భద్రతను ప్రసాదించునవి; విజ్ఞాన విరాగయుక్తమగు జ్ఞానమును, పరమాత్మభక్తిని, సత్త్వశుద్ధిని తీసికొనివచ్చునవి (12.12.47-54). సంకారకూపమున బడినవారికి తన్మోక్షహేతువగు భగవచ్చరణావలంబనమున కలుగు ఆత్మార్పణమే శ్రేయస్కరము (10.69.17) రజో రాగ విషాదములు. క్రోధము,కామము, గర్వము, దైన్యము, భయము, ఆధి, సంసారబంధము అనున వీ విధమగు భక్తి వలననే నశింపగలవు (5.18.14) అనగా వీరికి భగవత్సేవ చేయవలెనను కోరిక యొక్కటే మిగిలయుండును (5.19.21) జగద్గురు వగు భగవానుని భర్తగాభావించి భజించుటయే శ్రేష్ఠమగు తపస్స అని విష్ణువురాణ మనుచున్నది. వైదికముగా యజించినను తాంత్రికముగా యజించినను, ఉభయసమ్మిశ్రితముగా యజించినను భగవానుడే యజ్ఞపురుషుడ (11.27.7) అందుచే యజనక్రియ భక్తిమార్గములోనిదే యగుచున్నది తద్ద్వారా ఈప్సితార్థసిద్ధి కలుగుచున్నది (11.27.49) భగవానుని అర్ఘ్యపాద్యాదులచే పూజించి, సపర్యచేయువానిని దుఃఖములు బాధించవు. ఆత్మకృతమగు విపాకము ననుభవించుచు భగవదనుకంపను గోరి మనోవాక్కాయకర్మలతో భగవన్నమస్కృతి గావించువానికి భగవత్పదమే లబించగలదు (10.14.8). ఈ నమస్కృతి సర్వకిల్బిషహరము (12.12.26). కావుననే_

"మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు

మా మేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో7సి మే"

అని గీతలో చెపప్బడినది. భగవన్నామ శ్రవణ మాత్రముననే మానవుడు నిర్మలు డగుచుండగా తద్భక్తులసంగతి వేరుగా జెప్పనక్కరలేదని భాగవత మనుచున్నది. (9.5.16) అశేష బంధువగు నీశ్వరుడు అనన్యశరణ్యము గలవారియం దాత్మ మభూతుడై యుండును (11.29.4) మనోవాక్కాయకర్మలను స్వార్థరహితముగా నుంచి భగవదర్పణము చేయువాని సుకృత మద్వితీయము (11.2.36) ఇట్టి పరమానంద స్వరూపుడు, పూర్ణపురుషుడు, సనాతనుడు, బ్రహ్మయగు భగవానుడు గోపాలకులతో కలసిమెలసి తిరుగట ఆ గోపాలకుల పుణ్య ఫలమే యుగుచున్నది. (10.14.32) కావుననే బ్రహ్మ సుఖాను భూతికై భగవద్దాశ్యము చేయువారు తమతమ స్వార్థములను లెక్కజేయక భక్తిమార్గవలంబు లగుచున్నారు. సమస్త కర్మలను వదలి, భగవానున కాత్మను నివేదనముచేసి అమృతత్వమును పొందు వ్యక్తి బ్రహ్మాత్మానుభూతిని పొందు చున్నాడు (11.29.34) ధర్మార్థకామములు, నయ దమాదులు మొదలుగువని శాస్త్రములలో చెప్పబడినను, భగవంతు నకు ఆత్మను నివేదించుటయే శ్రేష్ఠమని శాస్త్రములు చెప్పు పరమరహస్యము (7.6.26) సర్వాత్మనా భగవంతుని శరణుజొచ్చుటయే శ్రేయస్కరమని తాత్పర్యము (11.5.41) కావున శక్త్యనుసారము భాగవతధర్మముల ననుష్ఠించుటయే నాల్గవ భూమిక. ఈ నాలుగు భూమికలు పరమ భక్తిప్రతీతికి సాధనములు.

తర్వాత వచ్చునది రత్యం కురోత్సత్తి; భగవంతునిపై ప్రేమ యనునది మొలక యెత్తుట యని భావము. ద్రుత చిత్తమును ప్రేవేశించిన భగవదాకారతారూపమగు సంస్కార విశేష మగు భక్తి స్థాయిభావమై భక్తిరసమును నిష్పన్నము చేయును. ఈ స్థాయిభావము భగవద్ధర్మాను ష్ఠానాత్మకము. కావున సత్పురుషుల ప్రసంగములయందు భగవద్గుణాదులు చెవిన బడి హృదయము నా వేశించి, మానవుని శీఘ్రముగా మోక్షమార్గమున ప్రవేశ##బెట్టున వని, ఈ మార్గమాన నభీష్టము నెరవేరుటకు శ్రద్ధాపూర్వకమగు భగవత్ప్రేమ బయలు దేరునని చెప్పబడినది (3.25.25) భక్తిరసానుభవమున కలుగు శ్రద్ధద్వారా జన్మించు రతి యనబడు ప్రేమ స్థాయిభావమై పరిపుష్టమై భక్తిరసముగా పరిణతమగుచున్నది. ఈ స్థాయిభావ పరిపోషమును గూడ భాగవత మనేకసారులు వివరించినది. అవిద్యలో బడి యున్నవారి ఆత్మ ఉపహితము కాగా మనస్సు కర్మవశ మగును. తద్ద్వారా గాఢమగు దేహాత్మ సంయోగమున భగవంతునిపై ప్రేమ అంకురించదు. కాని అపవర్గప్రదుడగు భగవంతునితో నాత్మకు సమాగమము కలుగగా నలౌకిక మగు రతి యను భావము సమున్మిషిత మగును (10.51.54) గంగానది అన్యవిషయాభిలాష లేక అనన్యవిషయకమై భగవంతునితో లీనమగుటయే ఇచట గల రతి శబ్దమున కర్థము. కర్మాచరణమున నున్నను ఈశ్వరేఛ్ఛయున్నచో నీ రతి ఉదయించగలదు (10.47.67) ఈ రతీ యను నైదవ భూమిక భక్తియొక్క స్వరూపమును తెలుపు నది. ఫలభూతములైన మిగిలి ఆరు భూమికలును ఈ ఐదింటి యొక్క పరిపాకవిశేషములు.

రత్యంకురోత్పత్తి కలుగగా వచ్చునదిస్వరూపాధిగతి. స్థూల సూక్ష్మ దేహద్వాయాతిరిక్తముగా ప్రతక్యగాత్మస్వరూప సాక్షాత్కారము కల్గుట ఆరవ భూమిక. ఈ యారవభూమిక బయలదేరనిచో దేహేంద్రియాది విక్షేప జనితమైన రతి యనిర్వాహితమై దుఃఖావస్థను తేగలదు. హృదయగ్రంథ భేదన మగు నాత్మదర్శనరూపమగు జ్ఞానమే. నిఃశ్రేయసహేతువు, ప్రకృతికంటె భిన్నము. ప్రకృతి కతీతము, నిర్గుణము, అనాది స్వయంప్రకాశము, విశ్వమున నంతర్యామియు నగునది ప్రత్యగాత్మ యదృచ్ఛావశమున నీ యాత్మ గుణమయమై లీలాకారమున త్రిగుణాత్మకమగు జగమును సృష్టిలోనికి దెచ్చునది. తద్ద్వారా జ్ఞానము నిగూహితమై ప్రత్యగాత్మ స్వయంకృతమగునుపహితత్వము నందుచున్నదని విష్ణుపురాణమనుచున్నది. ఈ రీతిగా నుపహితస్వరూపమున నున్న ఆత్మ కర్మల నాచరించుచు, గుణములు నాత్మగుణములుగా భావించుగా సంసారబంధ మంకురించుచున్నది. అకర్త, సాక్షి, నిర్వృతాత్మయగు బ్రహ్మస్వరూపమున కతాత్త్వికమగు పారతంత్ర్యమపుడు భావింపబడు చున్నదని భాగవతము చెప్పుచున్నది (3.26.6-7) నిత్యము. అవ్యయము, శుద్ధము, ఏకము, సర్వాశ్రయము, అవిక్రియము, వ్యాపకము, అసంగము, అనావృతము, క్షేత్రజ్ఞుడు, స్వదృగ్హేతువు ఆత్మయను పండ్రెండు లక్షణములలో ఆత్మస్వరూపమును వివేకియగు విద్వాంసుడు తెలిసికొని అహం మమాభి మానములను మోహజనితమగు దేహేంద్రియాది సద్భావమును వదలుకొనవలెను (7.7.19.20). ఇట్టి శుద్ధత్వమగు ఆత్మవిషయమగుటచే తత్పద మగును. ఈ తత్పదము ప్రమాత యగుత్వంపదముకంటె భిన్నము గాదని తెలియగా "తత్త్వమసి" అను మహావాక్యములో గల "నీవే బ్రహ్మవు" అను అర్థ అనుభవింపబడ గలదు. ఆత్మస్వరూపము, సర్వాంతర్యామియ నగు భగవానుడు జగద్ధితము గోరి. మాయద్వారా దేహమును ధరించునని అవతారలక్షణము భాగవతమున చెప్పబడినది (10.14.55)

ఇట్టి జ్ఞానము భక్తివలన జన్మించునది. భక్తియోగము నవలంబించగా నిర్హేతుకమగు వైరాగ్య జ్ఞానములుదయించగలవు (1.2.7) శ్రేయస్కరమగు భక్తిని నిరసించి, జ్ఞానము నందవలెనను యత్నించువారలకు క్లేశ##మే మిగుల గలదు (10.14.4) ఏతాదృశతత్త్వజ్ఞానము కలుగగా వైరాగ్యము దృఢమగును. అప్పుడు భగవంతునిపై ఉందయించిన ప్రేమ వృద్ధి పొందును. ఈ ప్రేమవృద్ది యనున దేడవ భూమిక, భగవంతుడే తన యాత్మయని గ్రహించినవానికి జగము మనకు భాసించునట్లుభాసించదు. సర్వము భగవ త్పరిరంభిత మైనట్లు కన్పించును. భగవద్భావనాయుక్త డగుటచే నట్టి వ్యక్తికి సర్వము భగవన్మయముగా ప్రతీయమాన మగును. ఆస్పంద ప్రణయానంద సలిలామీలితేక్షణుడై భగవంతుని తన ప్రియునిగా అనుభవించును. తద్ద్వారా మనస్సును విషయములనుండి పరాఙ్ముఖము గావించి ఉత్కృష్టమగు నిర్వృతి నందగల్గును (7.4.37-42) భగవద్రతి పెంపొందుచున్న హృదయము గలవాడు షడ్వర్గములను జయించుచున్నాడు. భగవంతుని లీలాదేహము గాలించిన పణక్రియాదులను శ్రద్ధతో వినగా నతిహర్షోత్పుల కాశ్రుగద్గదమగు వాక్కుతో నట్టివ్యక్తి పాడుచు విలపించుచు, నర్తించును. గ్రహగ్రస్తునివలె నొకప్పుడు వర్తించుచు. ఒకవేళ నవ్వును. మరొకచో నాక్రందనము గావించును. వేరొకచో ధ్యానించును. ఇంకొకచోజనులకు నమస్కరించు చుండును. మాటిమాటికి భగన్నామమును నుచ్చరించు చుండును. అప్పుడు సమస్తబంధనముల నుండి విముక్తుడై, భగవద్భావ భావానుకృతమగు సాశయాకృతి గలవాడా, భక్తిప్రకర్షవశమున భగవానుని సమీపించును. ఇట్టి బ్రహ్మస్వరూపమే నిర్వాణసుఖమని విద్వాంసులనుచున్నారు (7.7.33-37) ఇంతవరకు చెప్పబడిన ఏడు భూమికలు సాధనాభ్యాసనమునకు జెందినవి. ఇక చెప్పబోవు నాలుగు భూమికలు నయత్న సాధ్యములు.

భగవత్‌ స్ఫురణ మెనిమిదవ భూమిక, ప్రేమాస్పదీ భూతమైన భగవంతుని సాక్షాత్కారము ప్రేమాతిశయము హేతుకము. భగవత్పాద సేవాభిరతులై, భగవంతుని మాత్రమే వాంఛించు కొందరు భగవదైకాత్మతను కోరుట లేదు; ఇట్టి వారు భగవద్గుణ క్రియాదుల ననుకీర్తన జేయు భాగవతధర్మపరులు. భగవత్స్వరూపాదులను వర్ణించు వీరంవాక్కాయ కర్మలతో భగవంతుని భావించు పుణ్యజీవులు. భగవత్స్వరూపావగతి గల్ని వీరు దర్శనీయావయవములలో ఉదార విలాస హాసేక్షిత వామసూక్తములతో తమ ప్రాణములను, ఆత్మను భగవదర్పణము చేయుచున్నారు (3. 25. 34 - 36). తద్ద్వారా తొమ్మిదవ భూమికయగు భగవద్ధర్మనిష్ఠకల్గును. భగవన్యస్త మాననుడగు మహాభాగు డహింసాద్యేశేష గుణములతో నావహిల్లును. అప్పుడు మనస్సును సంయమించి కేవలము భగవద్ధ్యానపరు డగును. ఈ జ్ఞానసమాధి కలుగుగా నిజమగు నిఃసంగత్వము కలుగ గలదు సప్తద్వీపవతియగు భూమండలము నంతయు జయించి, అవ్యయమగు శ్రియమును పొంది, అమలవిభవముతో తులదూగి, ఇదియంతయు స్వప్నసంస్తుతమను నిశ్చయమున కంబరీషుడు వచ్చినాడు. అప్పుడు భగవంతునియందు సాధువులగు భగవద్భక్తులయందు భగవద్భుద్ధి కలిగినవాడై ఐహికవిభజనమును తుచ్ఛముగా పరిగణింప గల్గినాడు. ఆపై మనోవాక్కాయ కర్మలను భగదవదర్పణము గావించి సర్వత్ర భగవద్భావము ననుభవించ సాగెను. (9.4.15-21) ఈశ్వరునియందు చిత్తమును స్థిరముగా నిలపి, భగవదనుకీర్తనము జేయుచు, భగవంతునిపై ప్రేమభావమును వహించి, తద్భక్తులతో ప్రసింగించుచు, సర్వత్ర మైత్రిని పెంపొందించగా దివ్యానుభూతి కలుగగలదు. (1.19.15-17) కర్మపథమున వర్తించుచున్న మానవులు మహాయోగుల నాదర్శముగా నిలపికొని, వారి అడుగు జాడలలో నడచిననే అజ్ఞానాంధకరామునుండి తరించగలరు (11.6.48) భగవద్ధర్మానుష్ఠానముతో జీవించుచు, భగవద్దాసులై జనులు విశ్వమాయను జయించగలరు (11.6.46). ఈ భగవద్ధర్మనిష్ఠ ప్రయత్నపూర్వకముగా సంభవించు సాధనము. స్వతఃసిద్ధమగు భగవద్ధర్మనిష్ఠ ఫలభూతముకాగా తొమ్మిదవ భూమికయగును.

భగవద్గుణ శాలిత్వమును తనయం దనుభవించుట పది యవ భూమికగా చెప్పబడినది. భగవచ్ఛ్రియమును మాత్రమభిలషించు భక్తులు భద్రము, శాశ్వతమునగు స్థితిని పొందగలరు. కాని ఈస్థితి సంభవించవలె ననిన భగవద్భావమే ఆత్మలో ప్రతీయమానము కావలెను. అనగా పరమభక్తులకు భగవానుడు ప్రియతమమగు ఆత్మగను, సుతుడుగను, సఖుడు గను, గురువుగను, స్నేహితుడుగను, ఇష్టదైవతముగను ప్రతీయమాను డగును (3.25.37-38) ఈ యనినశ్వర భగవత్తుల్య గుణావిర్భావమే పదియవ భూమిక.

ఇక మిగిలిన భూమిక చివరకు సంప్రాప్త మగునది. ఇందు భగవంతునిపై ఉదయించిన ప్రేమ పరాంకోటి నందే పరిపుష్టమగును. ఇదిప్రేమయొక్క పరాకాష్ఠ యనబడును. భగవంతునినుండి యెడబాటును భక్తుడు సహించజాలడు. విరహాసహిష్ణుతా రూపమగు నీ యవస్థ ప్రాణపరిత్యాగము కలుగువరకు నిలచియుండును భగద్దర్శనములేని గోపికలకు క్షణమొక యుగముగా పరిణమించినదట (10.19.16) భగవంతుని ఒక త్రుటికాలము చూడక పోయినను ఒక యగుకాలము చూడనట్లు కనిపించును (10.31.15). ఒక్క క్షణము కోటివర్షములవలె భాదించునట (1.11.9). కాగా భగవద్దర్శన మొకసారి లభించిన, తద్విరహమున కోర్వ జాలక పోవుదురు. అప్పుడు కలుగు విప్రలంభశృంగారముద్వారా భక్త్యాత్మకమగు ప్రేమ పరమోత్కృష్టమై రాణించును.

లక్షణం భగవద్భక్తేః సాధనం సోపపత్తి కమ్‌

సభూమికం స్వరూపఞ్చ యథాబుద్ధీ హ వర్ణితమ్‌ .35

ఇతి శ్రీ పరమాహంస పరివ్రాజకాచార్య శ్రీ మధు

సూదన సరస్వతీ విరచితే భగవద్భక్తి రసాయనే

స్వరూప భూమికా సాధన సహిత భక్తి సామాన్య నిరూపణం నామ ప్రథమ ఉల్లాసః సమాస్తః

భగవద్భక్తియొక్క లక్షణమును, సాధనమును ఉపపత్తి పూర్వకముగా చెప్పితిమి. తదనుగుణముగా భూమికలను, భక్తిస్వరూపమును స్వబుద్ధ్యనుసారము వర్ణించితిమి. అనంత రోల్లాసమున నీ విషయము నింక వివరించెము

గద్య

శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మధుసూదన

సరస్వతీ విరచిత మగు భదవద్భక్తి రసాయనమున,

ఆంధ్రవివృతియందు, స్వరూప భూమికాసాధన

సహిత మగు భక్తిసామాన్య నిరూపణ

మనబడు ప్రథమోల్లాసము

సమాప్తము.

Bhakthi Rasaayanamu        Chapters   Last Page