Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page

'ఏష ధర్మ స్సనాతనః'

(ఇది సనాతనమైన ధర్మం)

ధర్మమనే పదానికి హైందవమతంలోనే ఒక విశేషం ఉన్నది. హిందువుని జీవన శీలములే ఆ ధర్మానికి ప్రతిమానములు. ఆ పదానికి అనేకమైన అర్థాలు వివిధమైనఛాయలు ఉన్నవి. ఒక విధంగాచూస్తే ఈవిశ్వమంతా దేన్ని అనుసరించి నడుస్తున్నదో అదే ధర్మం అని చెప్పాలి. మరొకదృష్టిలో వ్యక్తిగతంగా కానీ, సామాజికగతంగా కానీ, తమ జీవనవిధులనూ లేదా జీవితంలో కొన్ని కొన్ని సందర్భాలలో నడచుకొనే తెరగులనూ ధర్మం సూచిస్తుందని అనాలి.

ధర్మం అధ్యాత్మికానికీ చెందుతుంది, భౌతికానికీ చెందుతుంది. అంటే ధర్మపుపరిధిలో శాస్త్రమూ పరమార్థమూ రెండూ వస్తవన్నమాట. పరమార్థం సైన్సుకు విరుద్ధంకాదు. పైగా సైన్సుకు శాస్త్రమన్న పరిభాష ప్రాచీనకాలంనుంచీ మన దేశంలోనేవస్తున్నది. అన్నీ శాస్త్రాలే. ఒక్కసామాన్య ధర్మం భౌతికాన్ని ఆధ్యాత్మికంతో అంటగట్టుతుంది. ఆధర్మం మూలంగానే భౌతికాన్ని అధిగమించి ఆత్మానుభూతిని మనం అందుకొంటున్నాము. అందుచేత ధర్మం వేరు, భౌతికం వేరు అని మనం వేరు చేయదలచుకొంటే అది తప్పుకే దారితీస్తుంది. అట్లాచేస్తే జీవితమూ, జీవిత ప్రయోజనమూ రెండూ భగ్నమై పోతవి. ధర్మమే విశ్వంభరి. ఈ విశ్వానికొక స్థిరత్వమూ పవిత్రతా ఆ ధర్మం మూలంగానే కల్గుతున్నది.

దీనివల్ల తేలేదేమంటే ధర్మము సనాతనమని. అది పరిణామ బద్ధంకాదు. దాని కొక మార్పులేదు. అందులో ఏ కొంచెము మార్పువచ్చినా ఈవిశ్వానికే ఆపత్తువస్తుంది. అది సనాతనం కాబట్టి దాని గతికి నిరోధం లేదు. అది మానవ కల్పితం కాదు. అన్ని ధర్మాలకున్నూ వేదాలే మూలము. 'వేదోఖిలో ధర్మమూలమ్‌' వేదాలు అపౌరుషేయాలు. మనమెవరమూ వానికర్తలను ఎరుగం. అందుచే ఫలానాధర్మాన్ని ఫలానా మనిషి కల్పించాడని చెప్పడానికి వీలులేదు.

అందుచేత ఈ ధర్మశాస్త్రాలను వ్యక్తిగతంగా కాని పరిసర మూలకంగా కాని, సామాజిక వ్యవస్థల మూలకంగా కాని మార్పు చేయడానికి వీలులేదు. వీనిలో ఏ ఒక్క దానికైనా లొంగి మనం మార్పు చేయదలచుకుంటే ధర్మమే అస్థిరమై పోతుంది. ధర్మం ఎపుడు అస్థిరమవుతుందో ఇదమిత్థమని చెప్పలేని అవకాశాలు ఏర్పడుతవి. అన్ని కాలాలలోనూ, అన్ని దేశాలలోనూ మూలధర్మాలేమో ఒకటే. అందుచే మనం చేసే ఏ మార్పయినా ధర్మమూలవిచ్ఛిత్తికే కారణమవుతుంది. మన ఇష్టప్రకారం దానిని మార్చడానికి వీలులేదు. అందుచేతనే దానిని సనాతనమని అన్నారు.' ఆ కారణంచేతనే శ్రీరాములవారు మాటిమాటికి 'ఏష ధర్మ స్సనాతనః' అని చెప్పడం.

మానవ విజ్ఞానానికి ఒక నియతిఉన్నది. అది భేదబద్ధం. ఆ జ్ఞానంతో మనం ధర్మానికి తీర్పు చెప్పబోయినామంటే, ఆ తీర్పు విలువ అంతమాత్రమే. మానవకల్పిత న్యాయాలను, న్యాయస్థానాలలో వాదిస్తుంటారు. అంటే అది తర్కానికి లొంగిన దన్నమాట, 'తర్కోఅప్రతిష్ఠః' నియమబద్ధ జీవనానికొక మానము ధర్మం. ధర్మ విషయంలో ప్రశ్నలు ఉదయించరాదు. అందులో తర్కానికి తావులేదు. ధర్మము తార్కికం కాదు. అది కర్తవ్యం. దానిని మనం చేసితీరాలి. జీవితంలో ఆ ధర్మం పడుగు పేకలతో అల్లబడిపోవాలి.

ఈ ధర్మం సత్యమున్నదే అది చాలా గూఢం. అది గుహలో నిక్షిప్తమైనట్టు ఉంటుంది. 'ధర్మస్య తత్త్వంనిహితం గుహాయాం', దానిని అర్థం చేసుకోవటం మహాకష్టం. అది పరమదుర్‌జ్ఞేయం. ఈ ధర్మాచరణకు శ్రద్ధ ప్రతిపాదిక. ధర్మ విషయంలో ఎందులకు? అన్న ప్రశ్నకంటె 'ఏది?' అన్న ప్రశ్నయే ప్రధానం. ధర్మమేదో మనం తెలిసికొని ఉండాలి. అది 'ఎందుకు' అనే విషయం అనవసరం. ధర్మమేమో ఆత్మ సంబంధమైనది. మనస్సుకు పైది ఆత్మ. ఈక్రింది మనస్సుకు ఆపై ఆత్మకు సంబంధించిన విషయం బోధపడక అది తికమక లాడుతూ ఉంటుంది.

ధర్మం శాసనం. ఆ శాసనాలను శాస్త్రములు చెప్పుతవి. 'తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థతౌ' ఈ శాస్త్రములలో చేరినవే శ్రుతి స్మృతి పురాణాలు.

పురాణాలూ, స్మృతులూ, శ్రుతిని అనుగమించినందువల్ల వానిలో భేదంలేదు. శ్రుతులుగా సంక్షిప్తములుగా ఉంటే, పురాణాలూ, స్మృతులూ విస్తృతాలైఉంటవి. కాళిదాస మహాకవి 'శ్రుతే రివార్ధం స్మృతి రన్వగచ్ఛత్‌' అని వ్రాసినాడు. శ్రుతులనుఅనుసరించి ఎంతో కాలంగా ఆచరణలో ఉన్న ధర్మాలనే స్మృతులు క్రోడీకరించినవి. అందులో కొంత మార్పు ఆపద్ధర్మాలను అనుసరించి జరుగవచ్చు. కాని ఆ ఆపద్ధర్మాలేవో స్ఫుటంగా సూత్రీకరింపబడ్డవి. ఆపద్ధర్మాల ఆసరా చూచుకొని అసలు ధర్మాలకే స్వస్తి చెప్పరాదు.

ఆపద్ధర్మం, ఆపన్నిమిత్తంగా వచ్చినది. ఆ ఆపద తొలగినంతనే సాధారణ ధర్మాచరణకు మానవుడు తక్షణం రావలసినదే. ధర్మానికి విరుద్ధగతుల నన్నిటినీ ఆపద్ధర్మమని వాదిస్తే అదీ అధర్మమే అవుతుంది. కాని ఆపద్ధర్మం కాదు.

ఈ ధర్మ మెట్లు సనాతనమో, స్మృతియున్నూ సనాతనమే. ధర్మాన్ని యధాతధంగా వాక్రుచ్చినవి స్మృతులు, మనువు తానుగాన ధర్మపన్నాలు చెప్పలేదు. ఆయన కాలంలో ఉండిన ధర్మాలను ఆయన క్రోడీకరించినాడు. కాళిదాసు శ్లోకం వేరొకటి ఉదాహరిస్తాను.

రేఖామాత్రా మపి క్షుణ్ణా తామనో ర్వర్త్మనః పదం,

న వ్యతీయుః ప్రజా స్తస్య నియంతు ర్నే మివృత్తయః.

'ఆమనోర్వర్త్మా' మనుకాలంనుంచీ వస్తున్న మార్గం. ఇది మనువుమేసిన బాటకాదు. ఆయన కాలానికే ధర్మం ఉన్నది. సనాతనధర్మానికి మనువు ఒకానొక వక్త, అంతే.

ఈధర్మబోథకూ, శాస్త్రవ్యాసంగానికీ ఎంతోకాలం నుండీ అనూచానంగా వస్తున్న ఆచారం. ఎంతో సహకరించింది. అదే సరియయినదికూడా. శ్రుతిబద్ధంగా తరతరాలుగావస్తున్న ఈ ఆచారం ప్రాచీన సాముదాయిక విజ్ఞాన ఘనీభావమే. అందుచే మన శాస్త్రాలను అర్ధంచేసుకునే ప్రయత్నాలలో గ్రంథకర్తెవరు? అతని కాలమేది? అన్న ప్రశ్నలు అసలు అనవసరం. ఇంతకూ మనకు కావలసినది ఆగ్రంథంలోనుండి మన జీవనమార్గాని కొక వేగుచుక్క... నిజానికి ఈలాటి చర్చలు అసలువిషయాన్ని మన దృష్టినుండి తొలగించి వేస్తున్నవి. ఇట్లాటి ప్రశ్నలవల్ల ఆ గ్రంథముల విలువ మన దృష్టిలో తగ్గిపోవడమేకాక నిరాదరణ యేర్పడి వానిపై మనము ఉంచవలసిన భక్తినికూడా ఉంచలేకపోతాము. అది ఆలయాలలో పూజార్థం పెంచబడుతున్న నందనవనాలను, బాటనీ లాబొరేటరీలుగా మార్చినట్లు అవుతుంది. మన శాస్త్రాలను చదివేరీతిన అదికాదు.

మన శాస్త్రాలు చెప్పిన ధర్మాలకు అంతటి ఉన్నత స్థానమన్నమాట. అవి అపౌరుషేయాలు. కాబట్టి అవి మానవులందరికంటె హెచ్చన్నమాట. రాజుసైతం శాస్త్రానికి లోబడినవాడే. ప్రజలు ఎట్లు శాస్త్రానికి బద్ధులో రాజున్నూ శాస్త్రానికిబద్ధుడే. అందుచేత అతడుచేసే రాచరికం ధర్మబద్ధంగా ఉండాలి. దానికి తన ఇచ్చవచ్చినరీతి అతడు మార్చడానికి వీలులేదు. పైగా ధర్మబద్ధంగా తన జీవితాన్ని గడపడమే అతని పవిత్ర కర్తవ్యం. అట్లారాజు నియంతయై ధర్మపథంలో వెంట్రుకవాసియైనా తొలగకుండా నడవటమే అతని ధర్మం. అట్టి రాజులనుగూర్చియే కాళిదాసాదులు కీర్తించినారు.

మన రాజులు 'ఏష ధర్మ స్సనాతనః' అనిమనదేశాన్ని పూర్వం పాలించినారు. పాలకులకూ, పాలితులకూ ఉండిన ఈధర్మశ్రద్ధయే మనదేశానికి ధర్మక్షేత్రమన్న బిరుదు తెచ్చి పెట్టింది.


Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page