Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page

ధర్మ ప్రమాణాలు

విజ్ఞానం కలిగించే గ్రంథాలు ప్రపంచంలో వేలకొలది ఉన్నవి. పుస్తకాలెట్లా అసంఖ్యాకాలుగా వున్నవో అట్లే మతాలూ బహుళంగా వున్నవి. ఏమతస్థులకు ఆమత గ్రంథాలు అతిగొప్పగా కనపడటం సహజం. ఎవరిమతాలు వారికి పరమావధి యని తోచటం న్యాయమే. మతమతాన్ని కాపాడుకొంటూ, జాగ్రత్తగా తమతమ ధర్మాలను పాటిస్తూ, మనగ్రంథాలకు సిక్కులవలె ఆలయాలు సహితం నిర్మించి, మన ఆత్మక్షేమానికి ఇవే మూలమన్న విశ్వాసంతో ఉండే ప్రజానీకాన్ని మనం చూడకపోలేదు.

మరి, మన మతపు సంగతియేమి? మన మతగ్రంథమేమిటి? మనకేదైనా పుస్తకమున్నదా? క్రైస్తవుని మతగ్రంథమేది అని అడిగితే నిస్సందేహంగా 'బైబిలు' అనిబదులు చెపుతాడు. అదేవిధంగా మహమ్మదీయులకు మతగ్రంథం 'ఖురాను'. వేదాలుపాటించే హిందువులమగు మనకు చెప్పుకోడానికి ఒక్కపుస్తకమయినా ఉన్నట్టు కనుపించదు. శైవులకు 'తేవారం, తిరువాచికం' ఉన్నవి వైష్ణవులకు రామానుజుల శ్రీభాష్యం. వారిలో భక్తిమార్గానుయాయులకు రామాయణమే ప్రమాణం. వేదాలు వల్లించే ఘనపాఠికి వేదాలే ప్రమాణం. ఇంగ్లీషుచదివి ఏదోకొంత వైదికశ్రద్ధ ఉన్న వారికి గీతపైప్రీతి. వీరందరూ హిందువులే. కానివీరికి ఒక్క పుస్తకమనిలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మతగ్రంథం. ఇతర మతస్థులలో లౌకికజ్ఞానం కలగడానికి ముందే, బాల్యంలోనే అంతో ఇంతో మతప్రవేశం కల్గించడానికి పాటుపడతారు. అందుచే వారికి చిన్ననాడే మత సంస్కారాలుకల్గే అవకాశం ఏర్పడుతున్నది. కాని మనదారి వేరు. మనకు శైశవంలో లౌకికవిద్య ప్రధానం; పారమార్థికం అప్రధానం. ఈభావాలతో మన జీవితాలను చక్కదిద్దుకొన్నందువల్ల కలిగిన ప్రయోజనమేమి అని అడిగితే, 'ఇతర మతాలలో జనం తగ్గినపుడల్లా మనమతంలోనుంచి వారికి కావలసినంతమందిని సరఫరాచేయడం', ఇట్లాకాక బాల్యమాది మనమూ ఇతర మతస్థులవలె మతవిషయికమైన విజ్ఞానం మన బాలబాలికలకు అందుబాటులో ఉంచకల్గితే, ఇతర మతప్రసక్తికానీ, పరమత స్వీకరణకుకానీ ఎడముండదు. కానీ, వాస్తవవిషయంచూస్తే, మనలో సాధారణంగా ఆధ్యాత్మిక ప్రసక్తి అరవైఏళ్ళకుగాని కలగటంలేదు. మన పుస్తకాలను మనమే దూషిస్తున్నపుడు, ఇతరులు వానిని తిరస్కరిస్తున్నారే యని శోచించటం అనవసరం.

ఉపనయన విషయం కొంచెం గమనించండి-ఉపనయనం కోసం ధనమున్నవారు చేసేఖర్చు అంతాఇంతాకాదు. ఆ వ్యయంలో పదోవంతయినా ఉపనయన లక్ష్యార్థం వినియోగపరచితే, మతవిషయకమైన పై#్రవేటుట్యూష& కై వెచ్చించితే. వటువునకూ మతవిషయిక పరిజ్ఞానం కలుగుతుంది; ఆవృత్తే జీవనంగా ఉంచుకొన్నా వర్గానికీ జీవనోపాధి ఏర్పడుతుంది. అట్లా తయారయిన పిల్లలకు మతసందేహాలుండవు.

అట్లా కానందువల్ల, మనలో అభిప్రాయభేదాలు లెక్కలేనన్ని. ఒకడు నాస్తికుడు, మరొకడు ఆస్తికుడు, ఇంకొకడు భక్తిమార్గావలంబకుడు. ఒక్కొక్కనిది ఒక్కొక్కమార్గం; భిన్నభిన్నమార్గాలూ. భిన్న భిన్న లక్ష్యాలూ, ఇందులోకక్షలు కయ్యాలూ, తిట్లూ, తీర్పులూ, సందేహాలూ, సమాధానాలూ బాల్యమాది మతప్రవేశం మనకుదూరమయినందువల్ల ఐక్యం మృగ్యంగా ఉన్నది. ఇవన్నీ అటుంచి ఏ పుస్తకం మనం చదవడం? పుస్తకాలెన్నో ఉన్నవి; తలచినవాడల్లా గ్రంథాలు వ్రాస్తాడు. దానివల్ల మంచీ ఉన్నది; చెడ్డయూ లేకపోలేదు. దానిని నిశ్చయించటం మరొకశ్రమ. మతేతరులకు ఏదోఒకే గ్రంథం ప్రమాణం. మనం దేనిని స్థిరపరచడం?

మనమతంలో చూడబోతే పుస్తకాలనుకాని, అందు చర్చించిన విషయాలకుగాని ఏ విధమైన కొరతయూ లేదు. అనుష్ఠించి, అనుభూతినొంది, ఐకాంతిక ఆనందనిష్ఠలో, ఆత్మానందంలో తేలినవారు ఒక్కరుకాదు, పలువురు. తాము తరించడమేకాక, తమ్ము దర్శించినవారిని సైతం దయతో అనుగ్రహించిన జీవన్ముక్తులు ఎంతమందియో, వీరిని ప్రత్యక్షంగా చూస్తున్నాము. అసాధారణమైన ఇట్టి అనుభూతికలవా రవతరించిన మనమతంలో ప్రమాణగ్రంథాలు లేకపోతాయా?

ఐతే మనకు మతం దేనికోసంకావాలి? లేకపోతే వచ్చిన బాధ ఏమిటి? ఎవరోఒకరు చెప్పారని దానిని మనమేల వినాలి?

జీవితంలో మనం ఎన్నోకష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఎన్నో నష్టాలను అనుభవించవలసి ఉంటుంది. కోరికలూ కొరతలూ లెక్కించడానికి వీలులేకుండా ఉన్నవి. ఆపదలు వచ్చినప్పుడు ఆలయాలుగుర్తుకువచ్చి వెళ్ళి సేవిస్తున్నాము. కోరికలు నెరవేరనప్పుడు మహాత్ముల దర్శనంచేసి అనుగ్రహభిక్ష అర్థిస్తున్నాం. ఉపదేశాలకై ఉబలాటపడుతున్నాం. తీర్థాలలోమునిగి క్షేత్రాటనం చేస్తున్నాం. ఇంతచేసినా మనశ్శాంతి ఏదో కొంతకొంత లభ్యమౌతున్నదేకానీ పరిపక్వమైనశాంతిని అందుకోలేకున్నాం. పరిపూర్ణ శాంతిసముద్రాలవలె కనిపించే మహాత్ములు సైతం మనకు కనపడుతునే ఉన్నారు. కొట్టినా, తిట్టినా, దూషించినా, భూషించినా ఏ విధమైన అలజడిలేక, మనోవికారం తెలియక, ఆనందసామ్రాజ్యాధినేతలై 'ఏకచ్ఛత్రాధిపతులా' అనేటట్లుకనిపించే మహాత్ములు అన్ని జాతులలోనూ పుట్టుతున్నారు. మహాత్ముల అడుగుజాడలలోనడచి, గురుదర్శనం, పురాణపఠనంచేసి శాంతినందేవారూ ఉన్నారు. దేనినీ, ఈనడవడి, మనం మతం అని చెప్పటం? ధర్మమున్నా ఒక్కటే, మనమన్నా ఒకటే. ధర్మం శ్రేయస్సుకు కారణం. ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలకు సాధనభూతమైనది మతం.

అర్థమంటే ఒక్క ద్రవ్యమేకాదు. సుఖం ఆపాదించే సమస్త వస్తుజాలమూ అర్థమే. ధనమూ, ధాన్యమూ, వస్తువులూ, వాహనాలూ గృహారామాదులూ అన్నీ అర్థమే. పురుషుడు దేనిని అర్థిస్తున్నాడో అదే పురుషార్థం. నిజంచూస్తే కామమోక్షాలే పురుషార్థాలు. మనుష్యుడు సదా దేనినో ఒకదాన్ని అర్థిస్తూవున్నాడు. ఏదో ఒక కోరిక ఉంటూ ఉంటుంది. ఆ కోరిక తీరినపుడు సుఖం అనుభవించడం. అటుపై మరొక్క కోరికపై మనస్సు పోవడం. దానికి యత్నించడం, తీర్చుకోవడం-మళ్ళీ మరొక సంకల్పం-ఇట్లు పరంపరలుగా మన జీవితానికి ఈ కామవృక్షమనే కల్పవృక్షం అంటిపెట్టుకొని ఉన్నది. సంతోషం రెండురకాలు-ఒకటి అల్పకాలికమూ; రెండవది నిరవధికము. నిరవధికానందం కాలబాధితం కాదు. వృద్ధి క్షయాలతో కూడిన అల్పకాలిక సంతోషాన్నే కామమని, కాలబాధితం కాని పరమానందాన్నే మోక్షమనీ పెద్దలు చెబుతున్నారు.

ఈ జ్ఞానం లేకుండా మనం అనవరతం క్షణికమై, అంతవంతమై, అల్పకాలం ఆనందాన్నిచ్చే కామంకోసం ప్రాకులాడుతున్నాము. అర్థించదగిన మోక్షాన్ని మనం దాదాపు అనర్థంగా చూస్తున్నాము.

ధన, ధాన్య, గృహ, కనక వస్తు వాహన భూతమైనది అర్థం.

కామానికి అర్థం సాధనభూతం. లౌకిక సుఖాలద్వారా మనంపొందే ఈ కామఫలంక్షణికం. తద్వ్యతిరేకమైనది మోక్షం. మోక్షం అంటే విడుదుల. దేనినుండి విడుదల? బంధంనుండి. దేహికి ఈ దేహమొక బంధంగావున్నది. దేహమంటే ఇంద్రియగ్రామమే. ఇవికోరికలను పుట్టిస్తున్నాయి. మనలను బంధించే యీదేహాన్ని చూస్తే మనకు చాలామమత. ఇది అందంగాఉంటే, నేను అందగాడననిఅంటున్నాము. రోగంచే చివికిపోయిన ఒడలుచూపిస్తూ 'జబ్బుపడి ఎంతో చిక్కిపోయాను' - అని అంటాము. పోనీ, ఈదేహంసొంత ఇల్లా అని అంటే-అద్దేకున్న ఇల్లే. స్వగృహమైన మోక్షమో నిరవధికమై, దేశ కాలాదుల కతీతమైనది. అర్థం కామానికి ఎట్లా సాధనభూతమో అట్లే ధర్మం అర్థానికి సాధనం.

గతజన్మలో ఏదైనా దానంచేసిఉంటే ఈజన్మలో ఆ సుకృతం ఫలవంతమై వస్తులాభం కలిగిస్తున్నది. సుకృతాన్ని సాధించేది ధర్మం ఏ పనిచేస్తే మంచిదో అదే ధర్మం. సుఖంకోరి ఏదానంచేస్తామో అదే ధర్మం. ఇట్లా ధర్మం అర్థానికీ అర్థం కామానికీ సాధనమవుతున్నవి. అంటే ధర్మం అర్థమూలమున్నూ, కామసాధనమున్నూ.

''మనకు ఏ 'అర్థమూ' వద్దు. ఈశ్వరుడు ఇచ్చేదేదో, ఇవ్వనీ'' - అని నిష్కామంగా చేసేధర్మం మనోమాలిన్యం తొలగిస్తుంది. అట్టిధర్మం అర్థకారకమూ, కామకరణకమూ అవడమేకాక మోక్షసాధన మవుతున్నది. కామ్యధర్మం ఆ జన్మకు ఉపయోగపడి, నిష్కామ్య ధర్మం మోక్షాపాదక మవుతున్నది.

''కర్ణ గతం శుష్యతి కర్ణ ఏవ సంగీతకం సైకతవారిరిత్యా,

ఆనందయత్యంతరను ప్రవిశ్యసూక్తిః కలౌదేవ సదాసుగంధా''.

శివలీలార్ణవంలోని పైశ్లోకం సంగీత సాహిత్యాల మధ్యగల భేదం వివరిస్తూ, సాహిత్య శ్రేష్ఠతను తీర్మానిస్తున్నది. చేదుమందు తినపించడానికి తేనె అవసరం. అట్లే సాహిత్య సేవనకు సంగీతం అవసరం. మహాకవివాక్కులు అమృతబిందువులు. అమృతపానంచేసిన వానికి చావులేదు. కవిభావాలు హృదయస్థమైన వానికి వినాశంలేదు. స్మరించే కొద్దీ సాహిత్యంలో ఆనందం. శ్రవణం చేసినంతసేపూ సంగీతంలో ఆనందం. కానీ సాహిత్యభావాలు మనఃఫలకమ్మీద ముద్దరకొట్టినట్లు స్థిరంగా వుండిపోతై. సంగీతం అట్లాకాక, చెవినిపడగనే ఇసుకదిన్నె మీదినీటిలాగా శోషించి పోతున్నది.

భావిక్షేమార్థం అనుషించేది ధర్మం. ఏ విధమైన ఆశాలేనివాడు చేసేధర్మం మోక్షకారకం. అదేధర్మం. అదేమతం. ఆధర్మాచరణకు ప్రమాణం అవసరం. వానిని చెప్పేగ్రంథాలే ధర్మప్రమాణాలు. ప్రమాణమంటే ఏమిటి? ప్రమాణమంటే సత్యం. 'ఈధర్మమే సత్యం' అని నిర్థారించేవే ధర్మ ప్రమాణాలు. ఈ ధర్మానికి పరాకాష్ఠ మోక్షం. ఆ మోక్షం ఇతరమతస్థులు చెప్పేవిధంగా పురలౌకికంగా - ఇహలోకసాధ్యం. దానిని ఈ లోకమందే హస్తగతం చేసుకోవాలి.

''అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయవిస్తరః,

పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహేతా శ్చతుర్దశ.''

- మనుస్మృతి

''పురాణ న్యాయ మీమాంసా ధర్మశాస్త్రాంగ మిశ్రితాః,

వేదాః స్థానాని విద్యానాం ధర్మస్య చ చతుర్దశ.''

- యాజ్ఞవల్క్య స్మృతి.

మన ప్రమాణగ్రంథాలు పదునాలుగు. సమస్తజ్ఞానమూ ఈపదునాలుగు గ్రంథాల పరిధిలో పరిమితమై యున్నందున వీనికి విద్యాస్థానాలని పేరు. అవి నాలుగువేదాలు. ఆరు అంగాలు. మీమాంసా, న్యాయ, పురాణ, ధర్మశాస్త్రాలు.

''ఆధీతి బోధాచరణ ప్రచారణౖ

ర్దశా శ్చతస్రః ప్రణయ న్ను నాధిభిః,

చతుర్దశత్వం కృతవాన్‌ కుతః స్వయం

న వేద్మి విద్యాసు చతుర్డశస్వపి.''

- నైషధం 1 సర్గ.

నలుడు చతుర్దశ విద్యలకు (పదునాలుగు విద్యలకు) చతుర్దశల (నాలుగు దశలు) ఇచ్చాడట-చదవడం, చదివినది తెలిసికోవడం, చదివినరీతి ఆచరించడం. తాను ఆచరించడమే కాక ఇతరులకుసైతం బోధించడం - ఇవి చతుర్దశలు. చతుర్థశ విద్యలకూ, చతుర్దశలు చేసినవాడు నలుడు. చతుర్దశ విద్యలకు మరొకనాలుగు చేర్చిన అష్టాదశ విద్యలగును. ఆత్మావలోకనం కలుగజేసేవి ఈవిద్యలు. అన్నీ వీనియం దణగిఉన్నవి.

'ధర్మజ్ఞ సమయః ప్రమాణం వేదాశ్చ' - ఆపస్తంబ సూత్రము.

సూటియైన ధర్మప్రమాణం వేదం. షడంగాలుఅనేవి-శిక్ష. వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం.

వేదముయొక్క ప్రథమాంగము శిక్ష. ఇది మహరులచే వ్రాయబడ్డది. వానిలో పాణినీయానికి విశేష ప్రచారం. వ్యాకర్తవాణినే.

'అధ శీక్షాం వ్యాఖ్యాస్యామః

వర్ణః స్వరః మాత్రాబలం, సామసంతానః.'

- తైత్తరీయోపనిషత్‌.

ఇట్లా శిక్ష అంటే యేమిటో వేదమే చెప్పింది. వేదాలు పూర్తిగా మంత్రాలు. అందుచే వర్ణాలకూ, స్వరాలకూ ప్రాధాన్యం అత్యధికం. అర్థంకన్న వర్ణమే విశేషం. ఉదాహరణకు తేలుమత్రంఉన్నది. అర్ధం దానికి చెప్పరాదు. అది ప్రధానం కాదుకనుక. అందు అక్షరాలకే ప్రాధాన్యం. అద్థానికికాదు. శబ్దవర్గములలో కొన్నిటికి ప్రత్యేక శక్తిఉన్నది. శ్రాద్ధమంత్రాలు సంస్కృతంలోనే ఎందుకు చెప్పాలి? తెలుగులోనో, ఇంగ్లీషులోనో ఏల చెప్పరాదు? అలాచెపితే శబ్దశబ్దం భేదిస్తుంది. ఇందు శబ్దం ప్రధానం. అభిచార ప్రమోగాదులు చేసే మంత్రమాదులకు పళ్ళుఊడిపోతే ఉచ్చారణలో లోపమేర్పడి మంత్రాలు ఫలించవు. అందుచేత వేదపఠనానికి ఉచ్చారణ ముఖ్యం. దాని లక్షణం తెలిపేది శిక్ష.

ఉచ్చారణ, మాత్ర, బలము, సామ, సంతానము, అక్షరోత్పత్తి, తాలవ్యములు, దంత్యములు, ఓష్ఠములు, అక్షర విభజన వీనిని శిక్ష నిర్ణయిస్తుంది.

''మంత్రో హీనః స్వరతో వర్ణతో వా

మిథ్యా ప్రయుక్తో న త మర్ధ మాహ,

సవాగ్వజ్రో యజమానం హి నస్తి

యధేంద్ర శత్రుః స్వరతోపరాధాత్‌.''

స్వరంలో అపరాధమేర్పడితే విపరీతఫల మేర్పడుతుంది. త్వష్ట వృత్రునిఉత్పత్తికై హోమంచేశాడు. అందొక్కస్వరం తప్పిపోయింది. అందుచే అతనికి విపరీతఫలం ప్రాప్తించింది. సంధ్యావందనం స్వరయుక్తంగా చేయకపోవటంచేత దాని ఫలమూ మనకు తదనుగుణంగానే ఉన్నది.

సంస్కృతంలోని అక్షరాలు 51. వానికే మాతృకలని పేరు. వేదమాత అక్షరస్వరూపిణి. ఆత్మక్షేమాని కుపయోగించేవి ఈ అక్షరాలే. ఈ అక్షరసముదాయమే వేదం. శిక్ష వేద పురుషునికినాసిక-అనగా ప్రాణస్థానం. ఇట్లాషడంగాలూ వేదపురుషునికి అంగవ్రాతం.


Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page