Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page

ఉన్మత్త శేఖరుడు

ఏదోఒక కారణంచేత ఒకనికి పిచ్చి పట్టుతుంది. వానిని చూచి అందరముకలిసి జాలిపడతాం. వానిని తీసుకొనిపోయి వైద్యులకు చూపిస్తాం. పిచ్చాసుపత్రికి తీసుకొనివెళ్ళి 'వీనికి పిచ్చిపట్టింది కాస్తగమనించండి. త్వరగా నిమ్మలించే మార్గం చూడండి' అని అచ్చటి అధికారులను ప్రార్ధిస్తాం.

నావద్దకు జనము వస్తుంటారు. వీళ్ళలో చాలామందికి కుటుంబంలో ఎన్నోకష్టాలు. 'స్వామీ! ఈ బాధలు పడలేకుండా ఉన్నాము. ఇవి నివృత్తి అయ్యేవిధంగా మీరు అనుగ్రహించాలి.' అని అడుగుతుంటారు. అలాంటి సమయాలలో నాకు తోచిన విషయాలను మొహమాటంలేకుండా వారితో చెప్పితే వారికి ఊరట కల్గడానికి బదులు మరింత దుఃఖం కల్గుతుంది. అందుచే విషయగోపనం చేయవలసి వస్తుంటుంది. ఆ విషయమే, ఇపుడు చెప్పవచ్చినది.

పిచ్చివాడున్నాడు. వైద్యంలో వానిపిచ్చి నెమ్మళిస్తే మళ్ళా లోగడమనిషి అయిపోతాడు. మనవలె మనస్సుకు తోచినదంతా బయటికి చెప్పక దాచి పెట్టడానికి ప్రారంభిస్తాడు. అదేమనిషి పిచ్చితో ఉన్నప్పుడు నోటికివచ్చినట్లు వాగేవాడు. తోచినదంతా చెప్పేవాడు. దేనిని దాచిపెట్టేవాడుకాదు. ఇపుడు వానికి స్వస్థత ఏర్పడేసరికి రహస్యం గుర్తిస్తున్నాడు. ఒకనికి వరుసగా నాలుగేండ్లు పిచ్చి ఉన్నట్లయితే ఆకాలంలో వాడుచేసే పాపాలు పిచ్చి లేని కాలంకంటే ఎంతో తక్కువ.

ఐతే లోకంలో పాపాలను చేయనివారెవరు ? బాలుకు, ఉన్మత్తులు. జ్ఞానియొక్క స్థితి 'బాలోన్మత్త పిశాచవత్‌' లని వర్ణిస్తుంటారు. అనగా జ్ఞానులు పిల్లవాండ్లలాగా పిచ్చివాండ్లలాగా ఉంటారని అర్థం. పిచ్చి తలకు ఎక్కినవాడు ఉన్మత్తుడు. ఉమ్మెత్త పువ్వునుకూడా ఉన్మత్తమని అంటారు. దీనిని తింటే పిచ్చి పట్టుతుందని సాధారణంగా చెపుతుంటారు. ఈపూవంటే ఈశ్వరునికి చాలాఇష్టం. ఆయన ఉన్మత్త శేఖరుడు. అంటే ఉమ్మెత్త పూవులను శిరసులో దాల్చినవాడని ఒక అర్థం. పిచ్చివాళ్ళలో అగ్రేసరుడని మరొక అర్థం. పిచ్చివానివలే తిరగడమంటే పరమశివునికి పరమప్రీతి. తుమ్మి, ఉమ్మెత్త, జిల్లేడు ఇవంటే ఈశ్వరునికి ప్రియం. వీనికి ఈ కాలంలోకూడా వెలలేదు. ఎవరైనా వీనిని కోస్తుంటే 'ఎందుకు కోస్తున్నావు?' అని అడ్డుచెప్పరు. వీనిని సంపాదించడానికి ఏవిధమైనా శ్రమాలేదు. జిల్లేడులో తెల్ల జిల్లేడు విశేషం. ఇట్టి వెల లేని వస్తువులతో ఆయనను పూజిస్తే ఆ పిచ్చివానికి, ఆ ఉన్మత్త శేఖరునికి చాలాఇష్టం. ''అర్కద్రోణ ప్రభృతి కుసుమై రర్చనం తేవిధేయమ్‌'' అర్కమనగా జిల్లేడు. ద్రోణమనగా తుమ్మిపూవు. 'నీవు ఉన్మత్త శేఖరుడివి. కొమ్ములు తిరిగిన పిచ్చివాడివి. ఎవరికీ అక్కరలేని అర్కద్రోణాదులంటే నీకు అమిత ఇష్టం.'

ఈశ్వడొక మహారాజుగా ఉండిఉంటే వాని దర్శనం దుర్లభం. కాని అదృష్టవశాత్తు అతడొక భిక్షుకుడుగానూ, ఉన్మత్తుడుగానూ ఉన్నాడు కనుక వాని దర్శనం చాలా సులభం. కొంతకాలం పిచ్చి ఉన్నవానికి పాపాలు తక్కువ అనిఅన్నాము. ఈతనికి ఎప్పుడూ పిచ్చే అందుచే పాపాలకు అతీతుడు. మనమున్నూ పాపవిముక్తికోసం పాటుపడవలెనంటే, ఆవలిగట్టు చేరుకొన వలెనంటే సర్వపాపములకున్నూ అతీతుడైన ఆ సర్వేశ్వరుని ప్రాపకం పొందాలి. అడుసులో ఉన్నవానిని గట్టుపై ఉన్న వాడులాగి బయటకు వేయగలడు. కాని అడుసులోనే చిక్కుకొని పరితపించే మరొక అసహాయుడు ఎవరికయినా సహాయం చేయగలడా ?

సుందరమూర్తి శివభక్తులలో ఒకడు. ఆయన శివునికి 'తడుత్తు ఆడ్కొండా&' అన్న బిరుదు ఇచ్చాడు. ఈపదానికి తెలుగులో 'అడ్డువచ్చి రక్షించినవాడు' అని అర్థం. సుందరమూర్తికథ చాలా చిత్రంగానూ, సుందరంగానూ ఉంటుంది.

సుందరమూర్తి బ్రాహ్మణకులంలో పుట్టాడు. జన్మక్షేత్రం తిరువారూర్‌. యుక్తవయస్సు వచ్చేసరికి తండ్రి. ఒక సంబంధంకుదిర్చి ముహూర్తం నిర్ణయిస్తాడు. ఆ ముహూర్తంనాడు పెళ్ళిపీటలమీద పెళ్ళికొడుకు కూచునిఉంటాడు. వధువు వచ్చే సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కల్యాణమంటపం సమీపించి ''ఈసుందరమూర్తి నాదాసుడు. అందుచే నాకు దాస్యం చేయడానికి రావాలి'' - అని అంటాడు. 'నీకేమైన పిచ్చా, వెఱ్ఱా? పోపో, అని సుందరమూర్తి అతనిని కసురుకుంటాడు. ''నీవు కసురుకుంటే నేను వదలి పెడతానా? చూడు మా తాత వంశపారంపర్యంగా నాకు దాస్యం చేస్తామని వ్రాసియిచ్చిన పత్రం'' అని ఆవృద్ధుడు ఒక పత్రం చూపెటతాడు. అందులో తాతగారి వ్రాలు ఉంటుంది. అంతటితో సుందరమూర్తి నిర్వణ్ణుడై ఆవృద్ధ బ్రాహ్మణున్ని అనుగమిస్తాడు. ఆ వృద్ధుడు నడచి, నడచి ఒక శివాలయంలోదూరి ఆదృశ్యుడౌతాడు. సుందరమూర్తి ఆలయంలోనికి వెళ్ళిచూస్తే పార్వతీసమేతుడైన పరమశివు డాతనికి దర్శనమిచ్చి నీవుప్రమథగణానికి చెందినవాడవు. శాపవశాత్తు ఈలోకంలో పుట్టినావు. శాపకాలంలో ఎక్కడఉన్నా 'నీ దాసత్వం మాత్రం నాకు అనుగ్రహించు' అని నీవునన్ను వేడుకొన్నందువల్ల ఈవిధంగా నాటకమాడి నిన్ను నా దాసునిగా చేసుకొన్నాను, అని విశదపరుస్తాడు. తన పెళ్ళి అడ్డగించి తన్ను రక్షించిదాసునిగా స్వీకరించినాడు గనుగ - శివుని 'తడత్తు ఆడ్కొండాన్‌' అనివర్ణించి 'పిత్తాపిరై చూడి పెరుకూనే అరుళాళా' అన్న మకుటంతో ఒక పదికమును సుందరమూర్తి గానం చేశారు.

మహావిష్ణువు మహారాజు, లోకరక్షకుడు, త్రిభువన చక్రవర్తి. పరమశివుడు భిక్షకుడు, లోక భక్షకుడు, ఉన్మత్త చక్రవర్తి. ఈయన ఆభరణాలకు వెలలేదు. వేలంవేస్తే ఇద్దరి ఆభరణాలూ అమూల్యాలే. ఒకరికి ఒంటిమీద విభూతిపూత చేతిలో మనిషిపుఱ్ఱ, శిరస్సులో జిల్లేడుపూలు ఉమ్మెత్తపూలూ, మరొకరికి కౌస్తుభం, పీతాంబరం, శంఖచక్ర గదాదులు ఆభరణాలు. వీటి నన్నిటిని మించి మహావిశిష్టమైన ఆభరణాన్ని విష్ణువు హృదయంలోనే పదిలపరచుకొని ఉన్నాడు. ఆ ఆభరణం మహాలక్ష్మి. ఈశ్వరుడో, ఇతరులు కన్నెత్తి అయినా చూడని పుష్పాలతో అలంకరించుకొని పిచ్చి బ్రాహ్మడివలె భిక్షాటన మూర్తియై తిరుగుతున్నాడు.

అప్పయ్య దీక్షితులవారు గొప్ప శివభక్తులు. ఒకప్పుడు వారికొక సందేహం కల్గింది. ''నేను చాలాకాలంగా శివభక్తుడను. భక్తి ఉన్నదో, లేదో కాని ఉన్నదనే అనుకుంటూ ఉన్నాను. మనకున్నది నిజమైన భక్తియేనా లేక భక్త్యాభాసమా? ఇంతచేసినా నాకేదైనా విమోచన ఉన్నదా? లేదా? ఆపత్సమయాలలో నాకు ఈశ్వర స్మరణ ఉంటుందా లేక ఆ కష్టాల్లో క్రుంగిపోయి ఈశ్వరుణ్ణి విస్మరిస్తానా?'' అన్న సందేహం కలిగింది. తన భక్తిని తానే పరీక్షించ దలచుకొన్నాడాయన.

సాధారణంగా మనం మంచివారమనే అనుకొంటాం. సదాలోచననే చేస్తున్నామనీ అనుకొంటాం. కానీ ఒక్కొక్కప్పుడు మనకువచ్చే కలలను పరిశీలిస్తే అంతర్గతంగా ఎట్టి పాపాలోచనలు చేస్తున్నామో అవగతం అవుతుంది. జాగ్రదవస్థలో తలచడానికికూడా యోగ్యతలేని యోచనలన్నీ స్వప్నంలో విశదము అవుతూఉంటవి. నిజానికి జీవితంలో తీరని అభిలాషల స్వరూపమే స్వప్నం. అందుచే మనం చెడ్డకలలు కనకపోతే అంతవరకు జీవితాన్ని శుద్ధిచేసుకొన్నామని అర్ధం. అట్లుకాక పాపకార్యాలు చేస్తున్నట్లుగానీ, పాపాలోచనలు చేస్తున్నట్లుగానీ కలలుకంటే ఇంకా చిత్తశుద్ధి మనకు పూర్ణంగా అంటలేదని తెలుసుకోగలం. తమ్ముతాము పరీక్షించుకోడానికి ఈశ్వరుడు స్వప్నావస్థను కల్పిస్తాడు.

అప్పయ్య దీక్షితులవారికి ఈస్వప్నమర్మం తెలుసు. అయన శివపూజచేస్తున్నట్లూశివారాధన చేస్తున్నట్లూ ఎన్నో మార్లు కలగని ఉన్నారు. శివపరములైన గ్రంథాలనెన్నో వ్రాసినారు. ఇతర మనగ్రంథాలనూ నిష్పాక్షికంగా వ్రాశారు. కాని తానుమాత్రం అద్వైతి.

మహేశ్వరేవా జగతా మధీశ్వరే

జనార్దనేవా జగదంతరాత్మని,

నవస్తు భేద ప్రతిపత్తి రస్తిమే

తథాపి భక్తిస్తరుణందు శేఖరే.

'రెండువస్తువు లున్నవని నేను అనుకోలేదు. రెండూ ఒక్కటేఅన్న తీర్మానమె నాకు'. అని అప్పయ్యదీక్షితుల వారు తనకు అద్వైతమందున్న అపారభక్తిని ప్రకటించినారు.

దీక్షితులవారు తమ్ముతాము పరీక్షించుకోడానికి మార్గమేదని ఆలోచించి, మనంగా ఉన్మత్తావస్థను తెచ్చుకొంటే ఆసమయంలో మన మాటలు చేష్టలు, ఏలా ఉంటవో, అవే మన నైజగుణానికి చిహ్నాలుగా ఉంటవని తీర్మానించి శిష్యులను పిలిచి తాను మందుతిని పిచ్చిగా ఉన్నప్పుడు చెప్పే మాటలన్నిటినీ వ్రాసి ఉంచమనిచెప్పి, పిచ్చి నిమ్మళించడానికి ఇవ్వవలసిన ఔషధమున్నూ వారికిచెప్పి పిచ్చివాడై పోయాడు. అంతటితో ఆయనకు ఉన్మాద ప్రలాపములున్నూ ఆరంభ##మైనవి. శిష్యులు ఆయన చెప్పినట్లే వాగినదంతా వ్రాసుకొన్నారు. కొంతసేపటికి నివారణౌషధం ఇవ్వగా దీక్షితుల వారికి స్వస్థత కలిగింది. ఆ ఉన్మాదావస్థలో ఆయన ఏబది శ్లోకాలు ఆశువుగా చెప్పారట. వానికి ఆత్మార్పణస్తుతి ఆనీ, ఉన్మత్త పంచశతి అనీ పేర్లు. అందులోనిదే ఈ శ్లోకం.

అర్కద్రోణ ప్రభృతికుసుమై రర్చనంతే విధేయం

ప్రాప్యంతేన స్మరహరఫలం మోక్షసామ్రాజ్యలక్ష్మీః,

ఏతజ్జానన్నపి; శివశివ వ్యర్థయ& కాలమాత్మ&

ఆత్మద్రోహీకరణవివశో భూయసాధఃపతాని.

''శివ శివ! నీ అనుగ్రహమును ఏమని వర్ణించను? సులభంగా లభించే జిల్లేడుపూలను తుమ్మిపూలను భక్తుల నుండి సంగ్రహించి నీ సౌలభ్యమును ప్రకటిస్తూ వారికి మోక్ష సామ్రాజ్యలక్ష్మినే అనుగ్రహిస్తున్నావు. ఇది తెలియకుండా కాలాన్ని మేము వ్యర్థం చేస్తున్నాము.

దీక్షితులవారిని ఉన్మదావస్థలోనూ, శివస్మరణ వీడలేదు. తన్మయతతో బాష్ప నేత్రాలతో ఆయన శివునే తలుస్తూ ఉండినాడు. పిచ్చి ఎత్తినప్పటికీ బుద్ధిమారకుండా ఒకే ఆత్మ ఉన్నందున శివస్మరణ చేసినాడు. ఎటువంటి కష్టములు వచ్చినప్పటికీ, ఎటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ దైవస్మరణ మాత్రం మనం వదలరాదు. ఆంత్యకాలంలో ప్రాణావసాన సమయంలో ఏ స్మరణతో ఉంటామో దాని కనుగుణంగా మరుసటి జన్మలో శరీరం కలుగుతుందని గీత చెపుతుంది.

యం యం వాపి స్మరన్బావం త్యజత్యంతే కళేబరం,

తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః,

ఈశ్వర స్మరణతో దేహాన్ని వదిలినట్లయితే ఈశ్వర స్వరూపంలో ఐక్యమవుతాము. దుఃఖిస్తూ ప్రాణాలను వదిలితే దుఃఖ భాజనమైన మరొక శరీరం మనకు లభిస్తుంది.

అంతిమక్షణాలలో ఈశ్వరస్మరణ వుండవలెనని జీవితమంతా జపధ్యానాదులతో గడపవలసిన అవసరమేమి? అప్పుడు మాత్రం భగవంతుని తలిస్తే చాలదా? అని అడుగవచ్చును. నియమంగా అనుష్ఠానం జరిపే వారికే ఒకచిన్న కష్టంవస్తే దైవవిస్మరణ కలుగుతుంటే అంత్యకాలంలో చూచుకొందాములే అని సోమరిపోతులై కూర్చుంటే శరీరత్యాగ సమయంలో మనకు ఈశ్వరస్మరణ ఎట్లా కలుగుతుంది. అందుచేతనే కుటుంబంలో ఎలాంటి కష్టములు ఉన్నప్పటికిన్నీ దేహానికి ఎలాంటి రుగ్మత వచ్చినప్పటికిన్నీ, అన్ని శ్రమలనూ ఎప్పటికప్పుడే ప్రక్కకు నెట్టుతూ జన్మ నివృత్తికోసం పాటుపడుతూ ఈశ్వరస్మరణ అనవరతమూ చేసే అలవాటు కలిగిందా లేదా అని ఒక్కక్కనాడు స్నప్నావస్థనుబట్టి మనలను మనం పరీక్షించుకుంటూ వుండవలె, మనం క్షేమంగా ఉండాలంటే మంచి కార్యాలు చేస్తుండాలి. మంచికార్యం ఏదంటే భగవచ్చింతనయే! వాచికంగా చెప్పుతూ భగవచ్చింతన చేయడం ఒక విధం. మానసికంగా చేయడం మరీ విశేషం. దాన్నే అంతరంగిక భక్తి అని అంటారు. ఎప్పుడూ ఏదో కార్యంచేస్తూ అందులో మగ్నులమైపోయి దైవాన్ని తలవకపోవచ్చు. కాని పనిపూర్తికాగానే వెనువెంటనే ఈశ్వర చింతన కలుగవలె. ఇట్లు విరామమున్నప్పుడల్లా నామస్మరణ స్వరూప ధ్యానం చేసే అలవాటు మనం కలిగించుకోవాలి. అభ్యాసం ముదిరేకొద్ది చింతన సహజమై పోతుంది. దీనికి ఆదర్శం అప్పయ్య దీక్షితులే.

ఈశ్వరుడు పిచ్చిబాంబడు. బిచ్చగాడు. పూర్వకాలంలో బ్రాహ్మడొకడే బిచ్చ మెత్తేవాడు. ఇతర జాతులవారు అయాచితంగా వచ్చిన వానిని కూడా స్వీకరించేవారుకారు. కుంభకోణంలో 'బిచ్చమెత్తే బ్రాహ్మల వీథి' అనేఒక వీధి కూడా వుండేది. బ్రాహ్మణ సన్యాసులు అన్న భిక్షయాచించేవారు. ఇతరులు ధాన్య భిక్షను గ్రహించేవారు. ఉంఛవృత్తి చేసేవారు. ఇతర జాతులకు యాచించే గుణం లేదు. ఏదోపనిచేసి దానికిబదులు కూలితీసుకొనేవారు. ఆ వ్యవస్థలన్నీ ఇప్పుడు మారిపోయినవి.

ఈశ్వరుడు పిచ్చి బ్రాహ్మడు. మహరి. సదా అభిషిక్త జలంలో మునిగితేలుతూ ఉంటాడు కానీ, నారాయణుడు త్రిభువన చక్రవర్తి. సర్వకాలిభిషేచన ఆయనకు లేదు. అట్లు అయనకు అభిషేకము చేసినా, అదిన్నీ, సుగంధ తైలంతోనే. శివాలయంలో అట్లుకాక దినంలో ఆరువేళలా అభిషేకం ఉంటుంది. కొన్నిచోట్ల ఇరువది నాలుగు గంటలూ ధారాపాత్రనుండి సంతతమూ జలధార పడుతూంటే అందులో మునిగి తేలుతూ ఉంటాడు శివుడు. బ్రాహ్మడు శివుని మాదికిగా మాటిమాటికి స్నానాలు చేస్తుంటాడు. ఈశ్వరుడు భిక్షుకుడు. బ్రాహ్మడూ బిచ్చగాడే. ఇరువురిస్వభావమూ ఒక్కటే. రుద్రుని విశ్వాధికుడనిన్నీ మహరియనిన్నీ వేదం చెప్పుతూంది. అతని ఆరాధన అతి సులభం. ఒక్క తుమ్మిపూవు చాలు అతనికి. దానిని స్వీకరించి ఆనందించడానికి ఆ పిచ్చివాడు ఎదురు చూస్తుంటాడు.

ఒకప్పుడు రామానూజాచార్యులవారు విష్ణువు తప్ప దేవతాంతర ముండరాదని అందరూ విష్ణువునే ఐకాంతిక భక్తితో పూజించవలెనని, శివాలయాలకు వెళ్ళటంకాని శివభక్తి కానీ కూడదనీ బోధింప నారంభించారు. పూర్వం ప్రతిఊరిలోనూ శివాలయమూ విష్ణాలయమూ ఉండేది. ఉదయం విష్ణుగుడికి, సాయంత్రం శివాలయంలో నర్తన సమయానికి శివుని కొల్వుకు వచ్చేవారు. చోళరాజు శివభక్తుడు. ఎన్నో శివాలయాలు కట్టించాడు. అతనికి రామానుజుల ఉపదేశం వింతగా తోచింది. ఆచార్యులు చెప్పేది శాస్త్రీయమేనా అని సందేహం కల్గింది. ఒక సభ ఏర్పాటు చేద్దామని కుంభకోణానికి పదిమైళ్ళ దూరంలో ఉన్న గంగైకొండ చోళపురానికి రమ్మని రామానుజులను పిలువనంపాడు.

అప్పుడు రామానుజులు శ్రీరంగలో ఉన్నారు. ఆయన అనుచరులలో ఒకరు, కూరత్తాళ్వారు. ఆయన కూరం అనే గ్రామానికి చెందినవారు. వారు రామానుజులతో ''మిమ్ములను చోళరాజు రమ్మని పిలుస్తున్నాడు. మీరు శివాలయాలకు వెళ్ళరాదని బోధిస్తున్న విషయం ఆయనకు తెలిసే వుంటుంది. రాజు శైవుడు. అతని అనుష్ఠానాలకు మీరు అపచారం చేస్తున్నారు. మీకు ఏదోదండన విధించేటట్లే వుంది. అందుచే మీ కాషాయాలను నాకివ్వండి. నా ధవళ వస్త్రం మీరు గ్రహించి ఎక్కడికైనా పారిపొండి. మీ కాషాయాలను దాల్చి నేనే రామానుజుడనని రాజు దగ్గరకు వెళ్ళతాను. నాకేమి ఆపదవచ్చినా రానీండి. మీరు మాకు ఆచార్యులు. మీకు అపాయం రారాదు. అందుచేత ఈ ప్రకారం చేయండి''. అని అన్నారట.

రామానుజులు ఆరాత్రే శ్రీరంగానికి ఇరవైమైళ్ళ దూరంలో ఉన్న తిరునారాయణ పురానికి వెళ్ళిపోయారు. అంతటితో ఆగక అక్కడనుండి మైసూరునకు దాపునవున్న మరొక తిరునారాయణ పురం చేరుకున్నారు. చోళరాజ్యాన్నే ఆయన విడిచారు ఇప్పటికీ దీనికి చిహ్నంగా 'వెల్లై! సాత్తువడి అనే ఉత్సవం చేస్తుంటారు.

కూరత్తాళ్వారు కాషాయాలు ధరించి, చోళరాజు సభకు వచ్చారు. రామానుజులు వీరేనా? అని రాజు అడిగిన ప్రశ్నకు రాజుగారిమంత్రి 'రామానుజులతో సమాన ఆధిక్యంకలవారే' అని సూక్ష్మంగా తేల్చి వేశారట. శాస్త్రార్ధాలుఆరంభమయినవి. పండితులు రావడమూ, దానికేకదా! వచ్చిన విద్వాంసులు లెక్క లేనంతమంది. వారందరూ తీర్మానించి, శివుని కంటే అధికుడు వేరే లేడని వాక్యార్థం చెప్పి 'శివా త్పరతరం నాస్తి' అని తాళపత్రం మీద వ్రాసి కూరత్తాళ్వారులతో మీకు ఆక్షేపం ఉంటే చెప్పండి, లేకుంటే దీనిమీద చేవ్రాలు పెట్టండి. అని దానిని ఆయనముందు ఉంచారట. కూరత్తాళ్వార్లు సామాన్యులుకాదు. గొప్ప విద్వాంసులు. వెంటనే దానిని అందుకొని 'అస్తిద్రోణ మతః పరం' అని పూరించినారట. శివునికంటే పరతరం వేరే ఉన్నది. అది ద్రోణము. శివునికంటే అధికమైనది తుమ్మిపూవు అని ఆయన చమత్కరించిరట.

'అస్తి ద్రోణం అతః పరం' అన్న వాక్యాన్ని నేను అప్పుడప్పుడూ స్మరిస్తూ ఉంటాను. దీక్షితులవారి 'అర్క ద్రోణ ప్రభృతి కుసుమై రర్చనంతే విధేయం' అన్న శ్లోక పాదమూ జ్ఞాపకం వస్తుంటుంది. మఠమునకు వచ్చే భక్తులలో కొందరు తుమ్మిపూవును విశేషంగా తెస్తుంటారు. నేను వానిని గ్రహించి ఈశ్వరుడికి అర్పిస్తుంటాను. నాకంటే వీనిని తెచ్చియిచ్చే భక్తులకే అధికమైన పుణ్యం. స్వామికంటే స్వామికర్పించే పూజాద్రవ్యములే అధికమని వేదం చెపుతూంది. నమకంలో ఏకాదశానువాకం పూర్తికాగానే 'అయంమే హస్తో భగవా నయంమేభగవత్తరః' అన్న మంత్రం వస్తుంది, ''ఈనా చేయి అన్నదేఇదే నాకు మోక్షాన్ని సంపాదించి ఇస్తున్నది. భగవత్స్వరూపం కాదు మోక్షాన్నివ్వడం, ఈ చేయియే మోక్షాన్నిస్తున్నది. అందుచే ఈ చేయియే భగవంతుడు. కాదు ఇది భగవంతుని మించినది. ఇది భగవత్తరము. భగవత్పూజచే నాకు మోక్షసుఖాన్ని సంపాదిస్తున్నది. ఈహస్తమే కదా! అందుచే ఇది భగవత్తరము''. అందుచే తుమ్మిపూలను పూజార్థం, గ్రహించేటప్పుడంతా, 'శివాత్పరతరం నాస్తి, అస్తి ద్రోణం అతః పరం' అన్న ఆళ్వార్వమాట జ్ఞప్తికొస్తుంటుంది.

ఈశ్వరుడు పరమసులభుడు. పైగా బీదవాడు ఆళ్వార్లు అందరున్నూ అనుభూతిపరులు. విద్వాంసులు. పాశురాలు పాడినవారు. కాని ఈశ్వరానుగ్రహం పొందిన వారందరూ సాధారణ జనులు. ఏమియు తెలియని అమాయకులు. వారికి చదువనురాదు. వ్రాయనూరాదు, చెట్లుకొట్టేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు - చాకలివాళ్ళు - ఇలాంటి వృత్తులను పాటిస్తూ అమాయకంగా జీవితంగడిపిన వీళ్ళందరూ ఈశ్వరానుగ్రహం చేత మోక్షసామ్రాజ్యాధిష్ఠితులైనారు. అట్టి సర్వజన సులభుడు ఈశ్వరుడు. ఆయనను స్మరించినపుడల్లా మన మనస్సు కరిగిపోతేకాని మన జన్మ సఫలంకాదు.


Jagathguru Bhodalu Vol-3        Chapters        Last Page