Geetha Koumudi-1    Chapters   

వి జ్ఞ ప్తి

తా మంపిన 'గీతాకౌముది'ని సమగ్రముగ నాలో కించితిని. కువలయమున కానందకరమైన కౌముదినే రుచి చూచి యానందింపరు? సర్వానందకరమే! భగవద్గీతలకు లోకమున బహుళ వ్యాఖ్యానములు గలవు. విమర్శన లుత్పన్నములైనవి వేయేల? శ్రీమచ్ఛంకరభగవత్పాదుల భాష్యము మొదలు అనిబిసెంటు, తిలక్‌ మొదలగువారివఱకు వారివారి యుపజ్ఞానుసారము వ్యాఖ్యానముల వ్రాసిరి. ఈపై నాధునికులలో నెవరు వ్రాసినను శ్లోకార్థము, పదస్వారస్యములపై ప్రాకులాడిరేకానియధార్ధమునకు మొత్తము మీది యర్ధమునుగాని ప్రయోజన సంబంధము లాద్యను బంధములను చక్కగ తెలుఁగున నిరూపించినవారు తక్కువగ నున్నారు. తామీ భగవద్గీతాతత్త్వము నొక తేజోరూపముగ ధ్వనింపఁజేసి ఆ తేజస్సులోనికిరణములను లోకమునకు మీ వాక్కులను దర్పణముపైఁ బ్రసరింపఁ జేసి మూలమూలల దాగిన యజ్ఞానాంధకారమును పారద్రోలి పరతత్త్వవస్తు విజ్ఞానమును గలిగించితిరి. ఇట్టి విమర్శనాత్మక గ్రంథములే నేటి పాశ్చాత్య నాగరకతావ్యామోహితుల కవసరము. తాము న్యాయవృత్తినుండి విరమించి తత్త్వ జిజ్ఞాసయతీంద్రులైనందుల కిట్టి న్యాయబద్ధమైన విమర్శన లొనరించి లోకమునకు మేలు జేయుట మాబోటివారి పుణ్యపరిపాక మనవచ్చును. ఈగీతాకౌముది అజ్ఞానాంధకార నిమగ్నులగువారికి విజ్ఞాన ప్రదీపమై వెలుతురు నిచ్చుగాక యని నా మనవి.

ఇతోధికత త్త్వవిమర్శను వ్యాససూత్రముల పైనను భగవంతుడు మీచే చేయించి మాబోటి జిజ్ఞాసుజనము నుద్ధరింతురని బ్రార్థించుచు మీ చరణసన్నిధికి నా యభిప్రాయము విజ్ఞప్తి రూపమున సమర్పించుకొనుచున్నాను.

నరసరావుపేఁట, ఇట్లు భవచ్చరణ సేవాసక్తుడు,

9-2-67. లంక సీతారామశాస్త్రి.

Geetha Koumudi-1    Chapters