Nadichedevudu   Chapters  

9. ''గ్రంథగ్రంధులు''

కవిగా, రచయితగా శ్రీగుంటూరు శేషేంద్రశర్మగారు సుప్రసిద్ధులు. ప్రాచీన, నవీన కవితారీతులలో సిద్ధహస్తులు.

1959 నుంచి పదిసంవత్సరాలు విజయవాడలో 'ఆంధ్రప్రభ'కు నేను ఎడిటరుగా ఉన్నప్పుడు శ్రీ శేషేంద్రశర్మగారు సాహిత్యపరమైన అనేక రచనలు గద్యపద్య రూపంలో వ్రాశారు. వాటిని నేను ప్రచురించాను. పాఠకులు ఆసక్తితో చదివారు.

సంస్కృతంలో శ్రీహర్షుడు రచించిన నైషధకావ్యాన్ని 'నైషధమ్‌ విద్వదౌషధమ్‌' అని ప్రసిద్ధిగా చెప్పుకుంటారు. విద్వాంసులకు అది ఔషధం వంటిది. ఆ కావ్యంలో 'గ్రంథ గ్రంధులు'గా పేర్కొనబడిన కొన్ని భాగాలున్నవని పండితులకు తెలుసు.

నైషధాన్ని తెనిగించిన శ్రీనాధ మహాకవి వాటి జోలికి పోలేదు.

సంస్కృత నైషధానికి వ్యాఖ్య వ్రాసిన మల్లినాధసూరి సైతం ఏ కారణం చేతనో వాటిని స్పృశించకుండా వదిలిపెట్టాడు. పిమ్మటనైనా, విద్వాంసులెవ్వరూ ఆ ముడులు విప్పడానికి ప్రయత్నించలేదు. అంతంతమాత్రాన అవి కొరుకుడుపడేవి కావట!

'అట' ఏమిటి? శ్రీహర్షుడే తన కావ్యంలో వాటిని గురించి ప్రతిజ్ఞా పూర్వకంగా ఇలా చెప్పుకున్నాడు:

గ్రంథగ్రంధి రిహ క్వచిత్‌ క్వచిదపిన్యాసి ప్రయత్నా న్మయా

ప్రాజ్ఞమ్మన్యమనా హఠేన పఠనాత్‌ మాస్మిన్‌ ఖిలః ఖేలతు

శ్రద్ధారాద్థగురుః శ్లథీకృత దృఢగ్రంథిః సమాసాదయ

త్యేతత్‌ కావ్యరసోర్మిమజ్జన సుఖవ్యాసజ్జనం సజ్జనః||

''ఈ గ్రంథంలో నేను అక్కడక్కడ కొన్ని క్లిష్టమైన ముడులను ప్రయత్న పూర్వకంగా కావాలని ప్రయోగించాను. తానే పండితుడ నని భావించుకునే మూఢుడు. ఈ కావ్యంలో ప్రవేశించి ఆటలాడడానికి యత్నించవద్దు. శ్రద్ధతో గురువును పూజించి. గురువు అనుగ్రహంతో నేను ప్రయోగించిన ఆ ముళ్లను విప్పుకోగల సజ్జనుడు మాత్రమే ఈ కావ్యామృతంలో తానమాడి సుఖించుగాక!''

ఆత్మస్తుతి అయితే కావచ్చునేమోగాని, ఏ మహాకవి అనగలడు ఆ మాట!

* * *

ఒకనాడు శ్రీ శేషేంద్రశర్మగారు మా కార్యాలయానికి వచ్చారు. నాతో ఇలా ముచ్చటించారు.

శ్రీహర్షుడు నైషధం వ్రాసి ఎన్నో శతాబ్దాలు గడిచాయి. బహుశా 11వ శతాబ్ది. మల్లినాధసూరి ప్రభృతులు దానికి వ్యాఖ్యలు వెలయించికూడా దీర్ఘకాల మయింది. శ్రీనాధుడు శృంగారనైషధం రచించే శతాబ్దాలు దాటాయి.

నైషధానికి వ్యాఖ్యానాలు వ్రాసిన మల్లినాధ, నారాయణ, శేషరామచంద్ర, విశ్వేశ్వర భట్టాదులలో ఏ ఒక్కరుగానీ అందులోని గ్రంథగ్రంధుల జోలికి పోలేదు.

శ్రీహర్షుడు 'చింతామణి' మహామంత్రోపాసకుడు కావడంచేత, ఆ ఉపాసనాబలంతో అన్యులెవ్వరూ అర్థం చేసుకోడానికి అలవిగాని గ్రంథులను తన కావ్యంలో నిబంధించాడు.

ఆశ్చర్యంతో నే నిలా అన్నాను; ''అయితే, ఆ ముళ్లను విడతీయగల పండితులు ఇంతకు ముందు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోరు అంటారా, శర్మగారూ?''

శ్రీ శర్మగారు: ఆ మాట నే ననను. కాని, ఇంతవరకు ఇతరులెవ్వరూ సాహసించని ఆ పని, నేను సాధించాను. మీరు ప్రచురిస్తానంటే వాటిని గురించిన నా వ్యాసాలు 'ప్రభ' కు ఇస్తాను.

నేను: అంతకన్నానా! ఇంతవరకు కొమ్ములు తిరిగిన ఏ పండితుడూ చేయిచేసికోని ఆ కార్యం మీరు సాధించినప్పుడు, దాన్ని వెలుగులోకి తేవడంకంటె మించిన దేముంటుంది? తప్పక మీరు రాయండి. నేను ప్రచురిస్తాను.

శ్రీశేషేంద్రశర్మగారి వ్యాసాలు వరసగా 'ఆంధ్రప్రభ'లో వెలువడ్డవి. సాధారణ పత్రికా పాఠకులేగాక, పండితులు కూడా చదివారు. వాటిని గురించి కొందరు పండితుల అభిప్రాయాలు అడిగాను. అంతకుపూర్వం ఎవ్వరూ ఆ గ్రంథుల చిక్కు విప్పడానికి యత్నించినట్టు తాము చూడలేదని వారంతా అంగీకరించారు.

* * *

1968 లో శ్రీ కామకోటి శంకరాచార్యస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి హైదరాబాద్‌ విచ్చేసి, అక్కడే చాతుర్మాస్యం జరిపారు.

ఆ సందర్భంలో ఒక మిత్రుని వెంటబెట్టుకొని శ్రీశేషేంద్ర శర్మగారు స్వామిదర్శనం చేశారు.

స్వామివారికి తనను పరిచయం చేసికొని, శ్రీహర్షుని నైషధంలోని గ్రంథ గ్రంధులపై ఓంప్రథమంగా తాను వ్యాఖ్యానం వ్రాశానని శ్రీ శర్మగారు స్వామికి విన్నవించారు. అటు తరువాత తన అనుష్ఠానానికి సంబంధించిన కొన్ని సందేహాలను స్వామికి చెప్పి, వాటిని నివారణ చేసుకున్నారు.

సెలవు పుచ్చుకుని శ్రీ శర్మగారు బయటికి వచ్చే లోపల, స్వామి తాము కూర్చున్న చోటి నుంచి లేవకుండానే, ఒక పుస్తకం శ్రీ శర్మగారి చేతి కిచ్చి, ఆ పుస్తకంలో ''ఫలానా పేజీ తిప్పండి, అందులో ఏ మున్నదో చదవండి'' అన్నారు.

స్వామి చెప్పినట్టు చేశారు శర్మగారు.

నైషధంలోని గ్రంథ గ్రంధులను గురించిన వివరణ ఆ పుస్తకంలో, ఆ పుటలలో ఉన్నది!!!

విశేష మేమంటే, స్వామివారితో తాను జరిపిన ఈ సంభాషణ అంతా, మొట్టమొదటిసారిగా నాకు వినిపించినది శ్రీ శేషేంద్రశర్మగారే!

కొన్ని క్షణాలు నేనూ, శర్మగారూ మాట లుడిగి మౌనంలో, ఆశ్చర్యంలో మునిగిపోయాము!

''మౌనం ఎడతెగని సంభాషణ'' అంటారు రమణమహర్షి.

* * *

గ్రంథగ్రంధులను గురించి పూర్వం ఎవరూ వ్యాఖ్యానించ లేదని శ్రీశేషేంద్రులు మొదట నాతో చెప్పినా, స్వామివారు తన కా పుస్తకం చూపించిన పిమ్మట, తనకు తానే స్వయంగా నా వద్దకు వచ్చి విషయ మంతా సవిస్తరంగా నాకు తెలియజేశారు.

ఇది శ్రీ శర్మగారి సౌజన్యానికీ, నిరహంభావనకూ నిదర్శనం.

పోతే, అంతవరకు పండితలోకానికి అజ్ఞాతంగా ఉన్న ఈ కఠిన సమస్యను స్వామి ఉన్నపళంగా ఎలా పరిష్కరించగలిగారు?

ఆనాడు శేషేంద్ర శర్మగారు తమ దర్శనానికి రా నున్నారని స్వామికి ముందుగా తెలియదు. శ్రీహర్షుని గ్రంథ గ్రంధులను గురించి ఆయన తమతో ప్రస్తావించబోతున్నారని అంతకంటే తెలియదు. ఆ పరిస్థితిలో గ్రంథ గ్రంధుల వివరణ ఉన్న పుస్తకం స్వామివద్ద సిద్ధంగా ఉండడం ఎలా సంభవించింది?

ఎవరా గ్రంధుల ముడివిప్పిన మహా పండితుడు?

ఈ ప్రశ్నలకు సమాధానాలు స్వామికే తెలియాలి!

స్వామి సర్వజ్ఞతకూ, అలౌకిక ప్రజ్ఞకూ ఇంతకంటె ప్రబల సాక్ష్యం ఏ ముంటుంది?

* * *

పోతన పద్యానికి మూలం?

ఇలాంటిదే, పోతన భాగవతంలోని ఒక పద్యానికి సంస్కృతమూలశ్లోకాన్ని ఒకానొక ఆభాణకంనుంచి త్రవ్వితీసి, మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులుగారికీ, పోతన భాగవతాన్ని హిందీలోకి అనువదిస్తున్న శ్రీ వారణాశి రామమూర్తి (రేణు) గారికీ స్వామి వినిపించారు.

గజేంద్ర మోక్షణం ఘట్టంలోని -

''తన వెంటన్‌ సిరి లచ్చివెంట నవరోధ వ్రాతము న్దాని వె

న్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖచ

క్రవికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు దావొచ్చిరొ

య్యన వైకుంఠ పురంబునం గలుగు వారాబాల గోపాలమున్‌''

అనే పద్యాన్ని రామమూర్తిగారు చదవగానే, దానిని విని స్వామి, ఇదే మోస్తరుగా సంస్కృతంలో ఒక ఆభాణకం ఉన్నదనీ అది పోతన కాలానికి పూర్వపుదే అయితే, బహుశా పోతన దానిని చూచి ఉండవచ్చు నని అన్నారు.

ఆ ఆభాణకం గురించి తాము విననే లేదనీ, దానిని శ్రుతపరచండనీ పుట్టపర్తివారు అభ్యర్థించారు స్వామిని.

ఒకటిరెండునిముషాలు ఆగి, స్వామి ఇలా చదివారు:

''లీలాలోలతమాం రమా మగణయన్‌ నీలా మనాలోకయన్‌

ముంచన్‌ కించ మహీం, అహీశ్వర మయం ముంచన్‌ హఠాద్వంచయన్‌

ఆకర్షన్‌ ద్విజరాజమప్యతిజవాత్‌ గ్రాహాచ్చ సంరక్షితుం

శ్రీగోవింద ఉది త్వరత్వర ఉదైత్‌ గ్రాహగ్రహార్తం గజమ్‌''

ఈ శ్లోక మొకటి ఉన్నట్టు పుట్టపర్తివారికీ, 'రేణు'గారికీ తెలియదు. తెలియని వా రింకెందరో!

* * *





బౌద్ధులు పాషండులా?

బౌద్ధులు మనం అనుకొనే టంత పాషండులు కారు. శ్రీహర్షుడనే రాజు రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక అనుమూడు నాటకాలు రచించారు. ఒక గ్రంథారంభంలో శివుని, మరొక దానిలో విష్ణుని, ఇంకొకదానిలో బుద్ధుని స్తోత్రం చేసినాడు. బుద్ధుడు కేవలం పాషండుడే అయినట్లయితే, ఆ రాజు శివకేశవులతోపాటు బుద్ధుని ఏల స్తుతిస్తాడు?

బౌద్ధమతస్థులందరూ కేవలం మన మతధర్మాలకు విరుద్ధులని చెప్పరాదు.



జగద్గురు ప్రశస్తి

అద్వైతివో ద్వైతిన ఏవమన్యే వై దేశికా అన్యమతానుగాశ్చ,

దీప్తిం లభ##స్తేయముపేత్య భక్త్యా జగద్గురుస్సో2త్ర కుతోస్తి శంకా.

ద్వైతులూ, అద్వైతులూ, ఇతర మతస్థులు కూడా స్వామిచే ఉద్దీపితులవుతున్నారు. జగద్గురుత్వం వీరి యందు పూర్తిగా సార్థకం.

గ్రామే గ్రామే భక్తవర్యా స్తదీయా గేహేగేహే రూపచిత్రం తదీయం,

కాంచీపీఠం మండ్యతే కేవలం వో ఏతేనాహో లోకహృత్పీఠికా2పి.

ప్రతి గ్రామాన స్వామి భక్తులు. ఇంటింటా స్వామి చిత్రపటం. కాంచీపీఠాన్నే కాదు, మన హృదయ పీఠాన్ని కూడా స్వామి అలంకరిస్తున్నారు.

మయ్యేవ పూర్ణా2స్తి గురోర్దయేతి సర్వస్య శిష్యస్య నిరూఢభావః,

తథా విభక్తా2పి దయా2వ్యయా2స్య సర్వేశ్వరో2మేయదయోహి నా2న్య.

'నాయందే స్వామికి పూర్ణమైన దయ' అని ప్రతి శిష్యునికీ అనిపిస్తుంది! తరుగని దయ స్వామిది. అది సాక్షాత్తు పరమేశ్వరుని లక్షణమే కదా!

భక్తాళి వాంఛా పరిపూర్తిదక్షాః సన్త్యేవ లోకే బహవో మహాన్తః,

భక్తాంస్తు పుణ్య పథియోజయన్త ఏతాదృశాః పూజ్యతరాః కతీహ?

తమ మహిమచే శిష్యుల కోరికలు తీర్చగల గురువులు ఎందరో ఉన్నారు. కాని, ఈ స్వామి వలె శిష్యులను పుణ్యమార్గంలో ప్రవేశ##పెట్టగలవారు అరుదు.

Nadichedevudu   Chapters