Nadichedevudu   Chapters  

 

8. స్వామి వినోద ప్రియులు

స్వామి వినోదప్రియులు. వారి హాస్యం సులలితం. వాక్కు చమత్కారమహితం.

స్వామి మాట ఎదుటి వారిని నవ్విస్తుందే కాని, ఏ ప్రాణినీ నొప్పించదు. అదీ స్వామి హాస్యంలో ఉన్న విశిష్టత.

పరేంగిత జ్ఞానంతోపాటు, స్వామి వినోదప్రియత్వానికి చక్కని ఉదాహరణ ఇది:

* * *

దక్షిణాదిని కుంభకోణంలో పన్నెండు సంవత్సరాల కొకసారి 'మహామాఖం' మహోత్సవం జరుగుతుంది. 1956లో ఆ ఉత్సవం ఫిబ్రవరి 25 తేదీన తటస్థించింది. ఆనాడు కుంభకోణంలోని మహామాఖ తటాకంలో స్నానాలు చెయ్యడం పాపాపనోదకమనీ, మహాపుణ్యప్రదమనీ హిందువులంతా విశ్వసిస్తారు.

కంచి నుండి కాలినడకను కుంభకోణం వెళ్లి, ఆనా డా పవిత్రోదకంలో మునిగి, కంచికి తిరిగి రావాలని స్వామి అభిలషించారు. కాని, అప్పటికి కొన్ని నెలల కిందటి నుంచి స్వామి ఆరోగ్యం అంత బాగుండటం లేదు. ఆ స్థితిలో కంచినుండి కుంభకోణానికి 165 మైళ్లు కాలినడకను ప్రయాణం చెయ్యడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని శిష్యులు ఆందోళన చెందారు.

ఏమి చేదామా అని యోచించి యోచించి, తుదకొక పథకం నిర్ణయించారు. మద్రాసు నుంచి ఒక ఘన వైద్యుణ్ణి కంచికి పిలిపించాలనీ, ఆయనచేత స్వామి దేహస్థితి పరీక్ష చేయించాలనీ నిశ్చయించారు.

1956 జనవరి నెలలో ఒక ఆదివారంనాడు ఆ భిషగ్వరుడు ఆధునిక పరికరాలన్నిటితో కంచికి బయలుదేరి వచ్చాడు. మద్రాసునుంచి మరికొందరు స్వామి శిష్యులు కూడా ఆయన వెంటవచ్చారు. అత్యంత అధునాతన పరికరాల సహాయంతో దాదాపు అరగంటసేపు స్వామి దేహస్థితిని ఆమూలాగ్రంగా డాక్టరు పరీక్ష చేశాడు.

పరీక్ష ఫలితంగా తాను కనుగొన్న విషయాలను గురించీ, ఆరోగ్యం బాగయ్యేందుకుగాను ఇకమీదట స్వామి అనుసరించవలసిన అనుదిన కార్యక్రమం గురించీ వివరించడానికి డాక్టరు సంసిద్ధుడైనాడు.

ఇంతలో, డాక్టరు చెప్పబోయే మాటలకు స్వామి అడ్డువచ్చి, నిదానంగా మంద స్వరంతో ఇలా అన్నారు;

''నా దేహస్థితిని గురించి ఇప్పుడు మీరు ఏమి చెప్పబోతున్నారో, దానిని మీకు నేను వినిపిస్తాను, వింటారా?''

స్వామి మాటలు విని చుట్టూ మూగిన వారంతా ఆశ్చర్యంతో స్వామి ఏమి చెప్పబోతున్నారో అని చెవులు నిక్కపొడుచుకున్నారు.

స్వామి చెప్పడం మొదలు పెట్టారు: ''స్వామికి పయోరియా అనే పండ్ల జబ్బు ఉన్నది. అందుకుగాను కొన్నిదంతాలను పీకించవలసి ఉంటుంది.'' ఇదీ మీ రివ్వదలచిన మొదటి సలహా. ఒకవేళ, అది నిజమే కావచ్చు. కాని, అలా ఆ దంతాలను లాగివేస్తే ఇక నేను మంత్రాలను సక్రమంగా ఉచ్చరించలేను.

పోతే, ఇక నాఊపిరితిత్తులు రెంటిలో ఒకటి సరిగా పని చెయ్యడం లేదని మీరు చెప్ప దలచుకున్నారు. ఇప్పుడు కాదు, 1930 నుండే అది ఆ స్థితిలో ఉన్నది.

దానికో కథ ఉంది. ఒక రోజున నేను చాలా వేగంగా నడిచాను. ఆనాడు నేనొక నదీ తీరాన నడుస్తూ ఉండగా వానా, సుడిగాలీ వచ్చాయి. వాటిని తప్పించుకోవాలనే ఉద్దేశంతో వడిగా నడవడమే గాక, కాస్తదూరంగా పరుగెత్తాను కూడా. ఇది 1930 సంవత్సరం మాట.

తరవాత నా పొత్తికడుపు పేగు విషయం మీరిలా చెప్పదలచుకున్నారు: తరచుగా నేను చేసే ఉపవాసాలవల్లా, వేళాపాళా లేకుండా అకాల భోజనాలు చెయ్యడం చేతా, నా పొత్తికడుపులో ఒక పేగు సరిగా పనిచెయ్యడంలేదని మీరు కనిపెట్టారు.

ఇంతేగాక, నా ఎదురు రొమ్ములో రక్తం గడ్డకట్టుకు పోయింది.

మీరు చెప్పదలచిన దంతా మీకు నేను సరిగ్గా వినిపించానా? ఏమైనా పొరబడినానా?'' అడిగారు స్వామి.

మద్రాసు నుంచి ప్రత్యేకంగా రప్పించబడిన ఆ వైద్య ప్రవీణుడుగా, ఆయనను వెంటబెట్టుకు వచ్చిన పెద్దలూ, అక్కడే ఉండి స్వామి మాటలు విన్న తదితరులూ, అంతా దిగ్బ్రమ చెందారు. ఒక్కరికీ నోటమాట రాలేదు. ఏమి చెప్పాలో ఎవ్వరికీ తెలియలేదు.

డాక్టరు మహాశయుడు మాత్రం మఠం ఉద్యోగుల నుద్దేశించి ''స్వామికి మంచి ఆహారం, వేళకు భోజనం, పూర్తి విశ్రాంతి ఈ మూడూ చాలా అవసరం'' అంటూ సలహా ఇచ్చి, స్వామికి నమస్కరించి, తన సామానంతా సర్దుకుని, తిరిగి మద్రాసుకు బయలుదేరాడు.

ఏమైతేనేం, ఆ సంవత్సరం మాత్రం స్వామి కుంభకోణం ప్రయాణం చెయ్యడానికి వీలులేదని శిష్యులంతా పట్టుబట్టారు. వారి మాటను కాదనలేక, ఆ యేడు స్వామి కుంభకోణం ప్రయాణం రద్దుచేసుకుని కంచిలోనే ఉండిపోయారు.

మహామాఖంనాడు కుంభకోణం నుంచి కారులో పవిత్రోదకాలు తెప్పించి స్వామిని ఆ నీటితో స్నానం చేయించారు.

కొన్ని వారాలు గడిచిన పిమ్మట, ఏ వైద్య సహాయమూ లేకుండా, స్వామికి ఎప్పటి వలె మామూలు ఆరోగ్యం చేకూరింది.





ప్రాచీనమైనదంతా పరిగ్రాహ్యం కాదు

ప్రాచీన, పాశ్చాత్య సంస్కృతుల సమన్వయం నేడు మన ముందున్న ప్రశ్న. ఆధునిక జగత్తులోని మంచికి ప్రాచీన సంస్కృతి ఏనాటికీ వ్యతిరేకి కాదు. 'పురాణమిత్యేవన సాధు సర్వం', ప్రాచీనమైనంత మాత్రాన దానినే సంపూర్ణంగా గ్రహించ నక్కరలేదు. ప్రాచీనతతోబాటు, ఉత్తమమైన నవీనత్వాన్ని కూడా స్వీకరించాలి. ప్రతి యువకుడూ ఈ రెంటి సమన్వయాన్ని సాధించడం కళ్యాణప్రదం.

Nadichedevudu   Chapters