Nadichedevudu   Chapters  

 

75. స్వామివార్లతో నా అనుభూతులు

- శ్రీ కంభంపాటి నాగేశ్వరరావు

శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని ప్రప్రధమంగా దర్శించే భాగ్యం నంద్యాలలో మహా నందీశ్వర ఆలయంలో 1968 వ సంవత్సరంలో నాకు కలిగింది.

అపుడు నేను వ్యాపార రీత్యా నంద్యాలలో ఉండేవాణ్ణి. పీఠాలన్నా, వాటి ప్రాముఖ్యతలన్నా, పీఠాధిపతులన్నా వారి విశిష్టతలన్నా, నాకు ఆ రోజుల్లో ఏమీ తెలియదు. కాని నేను సహజమైన ఆస్తికుణ్ణి. దైవం పైన, పెద్దల పైన అతీతమైన దివ్యశక్తి పైన విశ్వాసం పరిపూర్ణంగా కలవాణ్ణి. ఈ సంస్కారం నాకు మా తల్లిదండ్రులిచ్చిన వరం. కంచి పెద్దవారి దర్శనం నాలో లేశమాత్రమైన భక్తి భావనను ఉత్తేజపరిచింది. నేను ఆలయంలోకి అడుగు పెట్టినప్పుడు శ్రీవారు పల్లకీలో కూర్చొని ఉన్నారు. చిన్న ఆకారం, అదీ ఒక మూల ముడుచుకొని కూర్చున్నారు. పాదాలు బయటకు కన్పిస్తున్నాయి. వస్తూనే పాదాలను దర్శించాను. అవ్యక్తమైన అనుభూతి.. ఒక్కసారి ఆపాదమస్తకం క్రింది నుంచి పైకి, పైనుంచి క్రిందకు ముకుళిత హస్తాలతో తనివి తీరా దర్శించుకొన్నాను. వారు నా వంకే చూస్తున్నారు. వారి చూపుల్లో అమృత వృష్టి కురిసినట్లు చెప్పలేని శక్తి ఏదో విద్యుత్తులా నన్నావరించినట్లు అనిపించింది. సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాను. మొత్తం దర్శనం కొద్ది నిముషాల్లో జరిగిపోయింది. కానీ వారి దయా దృష్టి నన్ను వరించింది. వారి దర్శన ప్రభావం నన్నావహించింది. వారి కటాక్ష వీక్షణం నన్నావరించింది. శ్రీ వారి సన్నిధిలో ఏదో పెన్నిధి దొరికినట్లు భావించాను.

గంగను స్వీకరించిన స్వామి:

ప్రధమ దర్శనానంతరం 1972 వరకు శ్రీవారిని చూడలేక పోయాను. తిరిగి 7-4-1972లో కాంచీ పురంలో శివా స్థానంలో పరమాచార్యుల దర్శన భాగ్యం కలిగింది. నేనూ, నా భార్య, కారివేటినగరం శ్రీ సత్యనారాయణ గారితో, మరికొందరు మిత్రులతో కాంచీపురం వెళ్లాను. నేను అంత క్రితమే కాశీ యాత్ర చేసి గంగ కలశాలను తీసుకొచ్చాను. కాశీ నుండి తెచ్చిన గంగను రామేశ్వరంలో కలపాలని ఎవరో అనగా విన్నాను. ఐనా ఆ సంప్రదాయమేమిటో పరిపూర్ణంగా నాకు తెలియదు. అందుకే ఆ చెంబులను రామేశ్వరంలో ఏంచేయాలో శ్రీవారినే అడుగుదామని సంకల్పించుకొన్నాను. కానీ దైవ సంకల్పం వేరుగా ఉంది. నేను, నా భార్య ఆనాడు శ్రీవారికి ఆ కలశాలను చూపించినాము. రామేశ్వర యాత్ర గురించి అడుగబోయే లోపలే పరమాచార్యులు ఆ కలశాలను రెండుచేతులతో తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. నడయాడే దైవం జల జలా గల గలా పరువులెత్తే గంగమ్మను స్వీకరించింది. చేరవలసిన చోటకే గంగమ్మ చేరింది. ఆదివిష్ణువు పాదాలవద్ద పుట్టిన గంగ పరమ శివుని తలపై మెట్టిన గంగ కనుపించే రామలింగేశ్వరుని చేరిందని అమితానందాన్ని పొందాము.

ఆ మరునాడు శ్రీవారు మాకు కాంచీపురంలో 9 దేవాలయాల్ని దర్శించమని చెప్పారు. అవి కామాక్షి దేవి గుడి, ఏకామ్రేశ్వరాలయం, వరదరాజ స్వామి కోవెల, కచ్చపేశ్వరాలయం, కైలాసనాధ దేవళం, వీరాటనం, మహాలింగేశ్వరాలయం, ఉత్కళంద పెరుమాళ్‌ (వామన మూర్తి) కోవెల, పాండవ దూతర్‌ దేవళాలు. సాయంత్రం వరకు తిరిగి అన్ని దేవాలయములను దర్శించుకొన్నాం. ఒక్క మహాలింగేశ్వర స్వామి దేవాలయం తప్ప. కంచిలో ఎన్నచోట్ల ఎంతమందిని విచారించినా ఆ ఆలయం ఎక్కడ ఉందో ఎవరూ చెప్పలేకపోయారు. శ్రీవారు చెప్పిన వాటిల్లో ఎనిమిదింటిని చూచామనే తృప్తి. ఆ ఒక్క ఆలయాన్ని చూడలేకపోయామనే అసంతృప్తితో మఠం చేరుకొన్నాం. మమ్మల్ని చూస్తునే శ్రీ పెద్దలు నవ్వుతూ ''మహాలింగేశ్వరాలయం మీకు దొరకలేదా'' అని అన్నారు. ఆశ్చర్యమేసింది. సంభ్రమం కల్గింది. 'మీకే కాదు మా శిష్యులలో చాలా మందికి, అంతే కాదు ఈ ఊళ్లోనే ఎంతో మందికి ఆ ఆలయం గురించి తెలియదు' అని అంటూ ఒక శిష్యుణ్యి పిలిచి '' ఆ స్వామి దర్శనం వీరికి చేయించు'' అన్నారు. స్వామి వారి అపార కరుణకు, శ్రీవారి అవ్యాజానురాగానికి తన్మయుణ్ణి అయ్యాను. ఎక్కడ అల్పమతిని. ఎక్కడ పీఠాధిపతి! శ్రీవారి కృపా సమేతంగా మహాలింగేశ్వరుణ్ణి దర్శించుకున్నాం. తిరిగి వచ్చిన మాకు పరమాచార్యులు ఆ ఆలయాల ప్రాముఖ్యాన్ని, విశేషాలనూ, సవిస్తరంగా చెప్పారు. ఆశీర్వదించారు. అమితానందంతో, నేను నాభార్య మిత్ర బృందం శలవు పుచ్చుకున్నాం.

ఆనాటి నుండి కామకోటి పీఠంతో, నాశతకోటి పూర్వ జన్మల పుణ్య సంపదా అన్నట్లు అవినాభావ సంబంధం ఏర్పడింది. 1972 వ సంవత్సరంలో శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారి దర్శనం నంద్యాల రామాలయంలో ప్రాప్తించింది. అదే కరుణ, అదే దయ, అదే అప్యాయత. కరుణాంతరంగుని అంతరంగంలో స్థానం లభించిందన్న తృప్తి.

ఆనాటి నుండి అవకాశం దొరికినప్పుడల్లా కాంచీపురం వెళ్లడం, శ్రీ వార్ల ఆశీస్సులందుకోవడం నా జీవన విధానంగా మారిపోయింది. కంచి కామకోటిపీఠం సేవకుల్లో ఒకనిగా, పీఠాధిపతుల శతసహస్రానేక శిష్యసమూహంలో ఒకనిగా మారిపోయినాను. తదనంతరం నేను చిలుకలూరిపేట జేరటం జరిగింది. మా అమ్మగారి ఊరైన గణపవరంలో పరమేశ్వర కాటన్‌ మిల్లును నిర్మించాము. 1975లో శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారు పీఠంతో మా మిల్లులో విడిది చేయటం, శ్రీ మహాత్రిపుర సుందరీ సమేత శ్రీ చంద్రశేమౌళీశ్వర స్వామి పూజలు జరిగాయి. మా మిల్లు, మా ఇల్లు మా జన్మలూ మా అన్నదమ్ముల కుటుంబాలు యావత్తూ పీఠాధిపతులతో తాదాత్మ్యాన్ని భావించాయి. తర్వాత కూడా శ్రీవార్ల పాద ధూళి స్పర్శ మా మిల్లుకు ఎన్నోమార్లు కలిగింది.

ఆడబోయిన తీర్థం:

ఆది శంకరుల జన్మస్థానమైన కాలడీలో 12-5-'78న శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారిచే శంకర భగవత్పాదుల కీర్తి స్తూపానికి కుంభాభిషేకం జరగబోతుందని ఆనాటి రాష్ట్రపతి శ్రీ నీలం సంజీవరెడ్డి స్తూపాన్ని ప్రారంభిస్తారని వార్తా పత్రికల ద్వారా చదివాను. మా నాన్నగారితో, నా భార్యా పిల్లలతో కాలడీకి ప్రయాణమయ్యాను. కాలడీలో కార్యక్రమాన్ని నేత్ర పర్వంగా దర్శించాము. స్తూప కుంభాభిషేకం జరుగగానే పూల జల్లుల్లా వర్షం పడింది. భక్తుల హర్షాతిరేకానికి అవధులు లేవు. ఆది శంకరుల కీర్తి స్తూపాన్ని దర్శించాం. శ్రీ శంకర జయేంద్రుల వారిని దర్శించాం. ఇంక నిత్య శివంకరుడు, సత్య శుభంకరుడైన శంకరుణ్ణి దర్శించాలి. కింకరుని సంకల్పం సాధ్యమా! ఎందుకు సాధ్యం కాదు. విచారిస్తే అప్పుడు పరమాచార్యుల వారు ఆంధ్రలో వాయల్పాడు వద్ద సంచారంలో ఉన్నారని తెలిసింది. అందరము వాయల్పాడు చేరాము. ఇక్కడ లేరు మదనపల్లిలో వున్నారన్నారు. మదనపల్లి జేరాం. అక్కడ శ్రీవారి దర్శనం కాలేదు. శ్రీవారి సంచారం కాలి నడకనే. మొత్తంమీద పరమాచార్యులు ఆ చుట్టుప్రక్కలే వున్నారని రూఢిఅయింది. మదనపల్లి చుట్టుప్రక్కల రోజంతా తిరిగాము. దర్శనం కాలేదు. రాత్రికి మదనపల్లిలో విశ్రమించాము. ఏమైనా దర్శనం చేసికొని తీరాల్సిందే, నిశ్చయించుకొన్నాం. మరునాడు ఉదయం అంటే 19-5-'78 న చిత్తూరు పోయే మార్గంలో ఒక గంట ప్రయాణం చేశాము. మార్గ మధ్యంలోనే శిష్య సమేతంగా శ్రీవారు ఎదురొచ్చారు. శంకరుడు సాక్షాత్కరించాడు. ఆడబోయిన తీర్థమెదురయింది. మా హృదయాలలో ఆనందాల విరిజల్లు. ఆనాడు మూలా నక్షత్రం. శ్రీవారు కాష్ఠమౌనాన్ని పాటిస్తున్నారు. రోడ్డు ప్రక్కన ఉన్న చిన్న దేవాలయ ప్రాంగణంలో ఒక గంట సాన్నిధ్యాన్ని వారు మాకనుగ్రహించారు. సంజ్ఞల ద్వారానే సంభాషణ. 'ఎక్కడి నుండి ఎక్కడకు ప్రయాణం' అని అడిగారు చెప్పాం. 'మీకు ఆహ్వానం వచ్చిందా' అన్నారు. కాదు పేపర్లో చూచి వెళ్ళామని చెప్పాం. అక్కడి విశేషాలను అడిగారు. వివరంగా విశేషాలన్నింటినీ వివరించాం. మాలో ప్రతి ఒక్కరిని పరామర్శించారు. మాతండ్రిగారి సంతోషానికి అవధులు లేవు. అందరినీ ఆశీర్వదించారు. కేరళలో ఆద్యంత రహితమైన ఆదిశంకరుల కీర్తినీ, ఆంధ్రలో ఆద్యంత రహితుడైన శంకరుల స్ఫూర్తిని దర్శించుకున్నాం. అనంతమైన తృప్తితో ఇల్లు చేరాము. నా జీవితంలో ఇదో మరపురాని అనుభూతి.

భారతీయ మార్గం:

16-6-1983న శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారు ''భారతీయ మార్గం'' అన్న పేరుతో ఒక ఆధ్యాత్మిక మాస పత్రికను ప్రారంభించాలన్న సంకల్పాన్ని ప్రకటించారు. శ్రీ శంకర సేవా సమితి రిజిష్టరయింది. శ్రీవారు తదనంతరం ఒక సీల్డు కవరు ద్వారా నన్ను కార్యదర్శిగా కోశాధికారిగా వ్యవహరింపమని ఆజ్ఞాపించారు. నేనేమిటి ఒక ఆధ్యాత్మిక మాస పత్రికకు కార్యదర్శినేమిటి? అమితాశ్చర్యం కల్గింది. కార్యదర్శిని కదా జరిగే కార్యాన్ని దర్శించగలను. కార్యం శ్రీవారే నిర్వహిస్తారు. ఎంతో మనోబలం చేకూరింది. మాసపత్రిక ప్రారంభించాము. అప్పుడు శ్రీవారలు మువ్వురు కర్నూలులో చాతుర్మాస్య దీక్షలో యున్నారు. తొలి పత్రికని కర్నూలులోనే శ్రీ పరమాచార్యుల పాద పద్మాల వద్ద విజయదశమినాడు అంకితం చేశాము. శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారు ఆవిష్కరించారు. ఆనాడే బాల పెద్దలు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం లభించింది. కామకోటి త్రివేణిలో జలకమాడాను. ''భారతీయ మార్గం'' ప్రచురణ నిరాటంకంగా జరిగిపోతూనే వున్నది. అంతా శ్రీవార్ల సంకల్ప బలం, అమ్మ కృపాఫలం.

గుంటూరులో కామకోటి క్షేత్రాలు:

1990 జనవరి 26, 27, 28 తేదీలలో జనకళ్యాణ్‌ శ్రీవారి నేతృత్వంలో శిబిర నిర్వహణ, తదనంతరం జనకళ్యాణ్‌ కార్యక్రమం విస్తరణ, తరువాత 5-6-'90న గుంటూరు రవీంద్ర నగర్‌లోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి దేవస్థానాన్ని శ్రీ పీఠానికి సమర్పించటం, ఆ ఆలయం శ్రీ కంచి కామకోటి పీఠ హరి హర దత్తక్షేత్రంగా మారటం, 4-3-'91 న ఈ క్షేత్రంలో శ్రీ శంకర భగవత్పాదులు ఆలయానికి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారిచే శంకుస్థాపన, 22-10-'91న గుంటూరు మారుతీ నగరులోని మారుతీ ఆలయ యాజమాన్యాన్ని శ్రీ పీఠానికి అప్పగించడం, ఆదేవళం శ్రీ కంచి కామకోటి పీఠ మారుతీ క్షేత్రంగా అవతరించడం, ఆరోజే శ్రీవారు 'నడిచే దేవుడు' పుస్తకాన్ని గుంటూరులో శ్రీ శంకర సేవా సమితి ఆధ్వర్యంలో మరో 5000 కాపీలు ముద్రించమని ఆజ్ఞాపించడం, ప్రచురణ పూర్తవడం, అన్నీ శ్రీవారి దయతో భక్తుల అండదండలతో సాగుతున్న మహత్తర కార్యక్రమాలే. వీటన్నింటి నిర్వహణలో నేను కూడా అంతర్భాగం కావటం, ఉద్దండుల సాహచర్యం, ఒకరా, ఇద్దరా, ముగ్గురా ఎందరో మిత్రుల సహకారం, కార్యక్రమాలన్నీ సవ్యంగా దివ్యంగా సాగిపోతున్నాయి. అంతా నంద్యాలలో పెద్ద శ్రీవారి తొలి దర్శన భాగ్యఫలంగా భావిస్తాను. ఈ మూర్తి త్రయం శ్రీ చరణాలు మా జీవన ప్రాంగణాన నిలిచిన మంగళ తోరణాలు, జన కళ్యాణ పథంలో ఉత్ప్రేరణాలు.



'నమశ్శివాయ'

శ్రీ పరమాత్ముని శ్రీ దత్తప్రసాద్‌.

ఈశ్వరుడై సురార్చిత మహేశ్వరుడై తపియించు యోగి యో

గీశ్వరుడై ధరిత్రి జనియించె సమర్చిత కామకోటి పీ

ఠేశ్వరుడై జయేంద్ర విజయేంద్ర సుయోగ గురూత్తముండు, నా

శాశ్వత భాగ్యమై పలుక సాగెను పద్యము పద్యమందునన్‌.



'కదిలే దేవుడు' కంచిలోన వెలుగై కన్పించె నేనాడొ, నా

మదిలో భక్తి తరంగ డోలికలు నిర్మాలిన్య శాక్తేయ సం

పదలై స్పందనలైస్రవించె, గురు చిత్పాదమ్ము పాథేయమై

సదసన్మార్గ విభక్తమంత్రములు సత్సౌభాగ్యమై రంజిలన్‌.



'నడిచే దేవుడు' నా మదిన్‌ విమల సన్న్యాసోన్ముఖిన్‌ చేసె, సం

దడిలేనట్టి సదాశివాలయము చెంతన్‌ బిల్వవృక్షమ్మునై

పడియుంటిన్‌, దళముల్‌ కృపా కలితమౌ పద్యమ్ములై నిల్వ, నే

వడిగా కావ్యములల్లెదన్‌ సహజ సంభావ్యమ్ము సద్బక్తియై.



నాలోచల్లని భావనన్‌ విమల విన్యాసంబుతో తూగి స

త్కాలోత్పన్న ప్రచండ వేగమున ఉత్కంపించి పద్యమ్ములై

ఆలాపమ్ముల సాగి సాగి స్థిర దివ్యానంద రాగమ్ములై

లీలన్‌ సద్గురు చంద్రశేఖరుని కీర్తింపంగ నుప్పొంగెలే.



కలువల్‌ పూయును కామకోటి యతియే కాస్తంత నవ్వంగ, స్నే

హలతాకుంజములే వరించు నటుపై అంతంత పల్కంగ, బా

రులుతీరున్‌ వరమాలతీలతలు సంప్రోక్షించి భావింపగా,

వెలుగుల్‌ జిమ్ము యతీంద్ర చంద్రుడిలపై వీక్షించి దీవింపగా.



నేత్రంబుల్‌ దరిసించువారలకు నిర్ణిద్రార్ద్ర విశ్వంభరా

చిత్రంబుల్‌, పరమార్థ చింతనల నిస్సీమాప్త సత్సాధనా

సూత్రంబుల్‌, దరిచేరు భక్తులకు అస్తోకోజ్జ్వలాత్మీయతా

ఛత్రంబుల్‌, భువి చంద్రశేఖరుడు సచ్చాత్రాళికిన్‌ దైవమే.



కన్నుల్‌ విప్పిన గోచరించు మమతా గంగార్భటీ వీచికల్‌

వన్నెల్‌ చింద, గళమ్ము విప్ప సమతా వాక్సూచికల్‌ స్ఫూర్తిసం

పన్నంబైస్థిర విశ్వతత్వముల నిష్పాదింప నూగించులే

నన్నున్‌ నిన్ను విశాల విశ్వముల జ్ఞాన క్షీర వారాశిలో.



సరిలేరెవ్వరు చంద్రశేఖరునితో సత్సాధనా మూర్తియై

కరముల్‌ చాపెడు భక్త కోటికిలపై కారుణ్య సందీప్తియై

స్థిరమై యొప్పెడు దేవ దేవుడనగా దిగ్జాత సంస్పూర్తియై

గురుడై నిల్చెను కామకోటి పనిలో గూఢార్థ మంత్రమ్మునై.



భిక్షావందన మాచరింతును జగత్ప్రేమైక సాఫల్య సం

రక్షా దక్షునకున్‌ ముముక్షుజన సత్ప్రారబ్ద హృద్వేది కా

ధ్యక్షుండౌ గురు చంద్రశేఖరునకున్‌ హర్షంబుతో కంచి కా

మాక్షీ సాక్షిగ భిక్షయై నిలువ మన్మానంబు ప్రాణంబులున్‌.





'సిద్ధం నమః'

డాక్టర్‌ శ్రీ ప్రసాదరాయకులపతి

కాంచీ కాంచన ఘంటికా చయ నదత్‌ కారుణ్య పాథోధి¸°

కాంచీ పట్టణ నాయికామణికి శ్రీ కామాక్షికిం గూర్చు మా

కంచి స్వాముల గాంచి హైందవమతగ్లానిన్‌ నివారించు తత్‌

ప్రాంచద్భాషణ దివ్యశక్తికిని సాష్టాంగంబుగా మ్రొక్కెదన్‌

కంచి కామాక్షి పాద పంకజములందు

మనసు పెట్టిన మౌనికి మానమస్సు

భరత ధర్మంబు నుద్ధరింపంగ తననె

ఇచ్చుకొనుచున్న ఋషికిత్తు నీవచస్సు



శంకరుని వంటి మేధావి జగతిలోన

లేడనెడి మాట పుట్టెను నాడు - నేడొ

జనములన్‌ చంద్ర శేఖర స్వామి వంటి

నడచు దేవుడు లేడను నుడి జనించె



అరసి చూడ అద్వైత సిద్ధాంత మందు

ప్రతి నరుండు శివుండును బ్రహ్మమునగు

బ్రహ్మభావనలో చిన్ని బ్రహ్మమనుచు

పెద్ద బ్రహ్మ మ్మటంచును వేరు లేదు.



అయిన సామాన్యజన మందు ఆత్మబోధ

కలుగు వానిని జ్ఞానము వెలుగు వాని

మహిమలు చెలంగువానిని మంచి వాని

దేవు డందురు - లోకపు తీరు - అదియె



ఆపథమ్మున తద్భక్తు లైనవారు

ఇష్టపడి పల్కుమన్నార లీవిధాన

ఎంతటి పదానికైన ఆశాంతయోగి

అర్హు డనిపించు నావంటి అల్పమతికి



కవుల మేమప్పు డపుడు లోకప్రవృత్తి

తప్ప కల్పుల గూడ నుదాత్తు లనుచు

పొగడుమందు మా పాపము పోవుగాక

చంద్రశేఖర స్వామి సంస్తవముచేత



కలువ లడిగెనె? శశి-వెన్నెలలను కురియు

ఇల స్తుతించెనె? రవి - చీకటులను దోలు

పరుల కుపకృతి చేయ కొందరు జనింతు

రట్టి మన స్వామి అడుగుల కంజలింతు



ఎవ డిల పుట్టె శంకర యతీంద్రునిగా? మరి చంద్రశేఖరుం

డెవరు? జయేంద్రు డయ్యె నెవ? రీపగిదిన్‌ విజయేంద్రమూర్తిగా

అవతరణంబు చెందె నెవ డార్త జనావనదీక్ష తోడ నా

ర్జవమున నొప్పు - ఈ గురుపరం పరకున్‌ సత మంజలించెదన్‌



శ్రుతి స్మృతి పురాణానామ్‌

ఆలయం కరుణాలయమ్‌!

నమామి భగవత్పాద

శంకరం లోకశంకరమ్‌!!



అపార కరుణాసింధుమ్‌

జ్ఞానదం శాన్తరూపిణమ్‌

శ్రీ చంద్రశేఖర గురుమ్‌

ప్రణమామి ముదావహమ్‌!!

శ్రీ శంకర సేవాసమితి

గుంటూరు

 

Nadichedevudu   Chapters