Nadichedevudu   Chapters  

 

71. గాంధి - స్వామి రహస్య గోష్ఠి

నా విద్యార్థిదశలో నేను చదువుకు స్వస్తి చెప్పడానికి మహాత్మగాంధి బోధలు కారణం. గాంధీజీ ప్రబోధించిన విద్యాలయ, న్యాయస్థాన, శాసనసభా బహిష్కరణోద్యమ (Triple Boycott) ప్రభావం చేత చదువు మానివేసి, స్వాతంత్ర్య సంరంభంలో పాల్గొన్నాను. ఆమూలంగా, రాజకీయాల్లో మహాత్ముడు నాకు నాయకుడేగాక, గురువైనాడు.

యావద్భారతం మహాత్మగాంధిని ఏకైక నాయకునిగా, స్వాతంత్ర్యప్రదాతగా, ఎట్టకేలకు జాతిపితగా పరిగణించింది. గాంధీజీ కేవలం రాజ్యాంగవేత్త మాత్రమే కాదు. ఆధ్యాత్మిక దృక్పథంగల దేశనాయకుడు. రాజకీయరంగంలో నైతిక సూత్రాలనూ, ఆధ్యాత్మికసిద్ధాంతాలనూ ప్రవేశ##పెట్టిన నవీనప్రవక్త. ఆయన రామభక్తీ, రామరాజ్య ప్రసక్తీ, సత్యాహింసలూ, సాత్వికనిరోధాలూ నన్నెంతో ఆకర్షించాయి.

అందుచేత చాలాకాలం వరకు మహాత్మగాంధీనే నేను నా జీవితానికి మార్గదర్శకునిగా భావించాను. సాధ్యమైనంతవకు ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా జీవితం మలచుకోడానికి యత్నించాను.

కాని, యాభై సంవత్సరాలు పైబడిన తరువాత నా జీవితంలో మరొక మహనీయుడు చోటు చేసుకున్నాడు. ఆయన కంచికామకోటిపీఠాధిపతి, శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి. ఆదిశంకరుల పరంపరలో ఆ పీఠానికి అరవై ఎనిమిదవ ఆచార్య పురుషుడు. నేటి పరమాచార్యులు.

దాదాపు మూడు దశాబ్దాల కిందట మొదటిసారి నే నీ స్వామిని దర్శించినప్పుడు ''గాంధి అనుయాయుణ్ణి'' అంటూ నన్ను స్వామికి పరిచయం చేసుకున్నాను. గత ముప్పయి సంవత్సరాల్లో స్వామితో నాకేర్పడిన గురుశిష్యసంబంధం మరింత ప్రగాఢమైంది.

* * *

సుమారు 60 సంవత్సరాలకు పూర్వం 1927లో దక్షిణ భారతదేశంలో, పాలఘాట్‌ జిల్లాకు చెందిన నెల్లిచెరి అనే గ్రామంలో ఈ మహాపురుషులు ఇరువురి మధ్య ఒక రహస్యసమావేశం జరిగింది. పత్రికాప్రతినిధు లెవ్వరూ దానికి హాజరు కాలేదు. గాంధిగారి ననుసరించి వెళ్ళిన శ్రీ చక్రవర్తుల రాజగోపాలచారి (రాజాజీ) గానీ, స్వామివారి శిష్యులు గానీ, ఆ మహనీయుల సంభాషణను ఆలకించే అవకాశం కలగలేదు.*

అస్తమానం వరకు గోష్ఠి సాగింది. సూర్యాస్తమయం లోపల సాయంకాలపు భోజనం ముగించడం గాంధిగారికి అలవాటు. అందుచేత, అంతవరకు వెలుపల ఒంటరిగా

_____________________________________________________________________

*స్వామి, గాంధీజీల సంభాషణ ఏకాంతంగా జరిగిందని పత్రికలన్నీ ప్రకటించాయి. అది రహస్యసమావేశమని గాంధిగా రన్నారు. అన్నిటిని మించి ఆ సంభాషణ జరిగినప్పుడు 'గాంధిగారూ, నేనూ ఇద్దరమే తప్ప వేరెవ్వరూలేరని' శ్రీ స్వామి వారు నాతో విస్పష్టంగా, అసందిగ్థంగా చెప్పారు. 'కంచిరుషి' (The sage of Knachi) అనే పేరుతో కంచిస్వామివారి జీవిత చరిత్రను వ్రాసిన శ్రీ డా|| టి. యం. పి. మహదేవన్‌గారు కూడా కంచిస్వామి - గాంధీజీల రహస్య గోష్ఠిలో ఇతరులెవ్వరూ ఉన్నట్లు వ్రాయలేదు.

''శ్రీ రాజగోపాలచారి గారితోబాటు కొద్దిమంది మాత్రమే ఆ సమావేశానికి హాజరైనారు''' అన్న విషయం వాస్తవ మనడానికి తగిన ఆధారాలు లేవు.



కూర్చున్న శ్రీ రాజాజీ లోపలికి వచ్చి ''మీ సాయంత్రం భోజనం వేళ సమీపించింది'' అంటూ గాంధిగారికి జ్ఞాపకం చేశారు.

''ఇప్పుడు స్వామివారితో జరిగిన ఈ సంభాషణ నా సాయంకాలపు భోజనం'' అని సమాధానం చెప్పారు గాంధీజీ.

మహాత్మాగాంధి, కామకోటి శంకరాచార్యస్వామి, ఉభయులలో మొదటివారు దేశస్వాతంత్ర్య సముపార్జనకు మూలపురుషులు. రెండవవ్యక్తి సనాతన హిందూ సంప్రదాయానికి చెందిన జగద్గురువు. ఈ యిరువురి మధ్య జరిగిన సమావేశం యావద్భారతజాతికి సంబంధించిన విషయమే గాని, వ్యక్తిగతం కాదు. ఆ హేతువు చేత, అంతవరకు లోకానికి వెల్లడిగాని ఆ యిరువురు మహామహుల సంభాషణను సవివరంగా తెలుసుకుందామన్న కోరిక, పత్రికారచయితనైన నాకు కలగడంలో ఆశ్చర్యంలేదు.

అయితే, దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన స్వల్పకాలంలోనే దురదృష్టవశాత్తు, గాంధీజీ పరమపదించారు. ఇక ఈ విషయమై మాట్లాడగలవారూ, వివరాలను బహిర్గతం చేయజాలినవారూ, స్వామి ఒక్కరే.

1967లో కంచిస్వాములు ఆంధ్రదేశపర్యటన సందర్భంగా విజయవాడ విచ్చేశారు. అప్పుడు 'ఆంధ్ర ప్రభకు' ఎడిటరుగా ఉన్న నేను స్వామికి ఇలా విన్నవించాను. ''స్వామీ, 1927లో మహాత్మగాంధీకీ, తమకూ నెల్లిచెరి గ్రామంలో జరిగిన సంభాషణ వివరాలు ఇంతవరకు ఏ పత్రికలో, ఏ పుస్తకంలో ఎక్కడా వెల్లడి కాలేదు. ఏ నాయకుడూ వాటిని బయటపెట్టలేదు. ఇంతకాలం అతి గోప్యంగా ఉంచిన ఆ సంభాషణ వివరాలు తెలుసుకోవాలని నేనే కాదు, దేశమంతా ఎదురుచూస్తున్నది.''

స్వామి: ఆ గోష్ఠి మా ఇద్దరి మధ్య ఏకాంతంగా జరిగింది. గాంధిగారు దానిని బహిరంగపరచలేదు. ఆ సంభాషణనుగురించి పత్రికలలో గాని, పుస్తకాలలో గానీ ఇంతవరకు ఏమి వ్రాయబడిందో, అంతవరకు మాత్రమే లోకానికి తెలుసు.

అంతకు మించి మరేమీ చెప్పకుండా స్వామి మౌనం వహించారు. ఇక దానిని గురించి ప్రస్తావించడం వల్ల ప్రయోజనం లేదని నేనూ విరమించుకున్నాను.

* * *

రెండవ ప్రయత్నం

కర్ణాటక, మహారాష్ట్ర పర్యటన ముగించుకుని, 1983లో కామకోటి పీఠాధిపతులు కర్నూలులో చాతుర్మాస్యం జరుపుకున్నారు. డిసెంబరు నెలలో కర్నూలు నుంచి కంచికి బయలుదేరారు. మార్గమధ్యంలో కడపజిల్లా లక్కిరెడ్డిపల్లిలో మకాం చేశారు.

ఆ సంవత్సరం నా జన్మదినం సందర్భంగా డిసెంబరు 30 తేది నేనూ, నా ధర్మపత్నీ ఇద్దరం కడప మీదుగా లక్కిరెడ్డిపల్లె చేరుకున్నాము.

శ్రీ జయేంద్ర, శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాములు ఇద్దరూ అక్కడే ఉన్నారు. పెద్దలు మాత్రం అక్కడికి నాలుగుమైళ్ళ దూరంలో కొండుపేట అనేగ్రామంలో ఉన్నారు.

లక్కిరెడ్డిపల్లె పల్లేకాదు, కొండుపేట పేటాకాదు. ఆపేటలో పట్టుమని పదికొంపలు లేవు. మరి, అంత కుగ్రామంలో పెద్దస్వామి ఎందుకు విడిది దిగారు? అది ఆ వూరి భాగ్యం! అక్కడివారిని విచారించగా, అక్కడ స్నానానికి సౌకర్యం ఉన్నందున ఆ మధ్యహ్నం వరకు అక్కడే బస చెయ్యడానికి స్వామి నిర్ణయించారట.

స్వామికి నదీజలాలంటే ఎక్కువ ఇష్టం. చెరువూ, బావినీళ్ళుమధ్యమం. కొళాయినీరు నిషేధం.

స్వామి ఆ వూళ్లో మకాం చెయ్యడం ఆనాడు నా కెంతో అనుకూలించింది. సాధారణంగా స్వామి చుట్టూ సందులేకుండా మూగిఉండే వందలాది జనం నాడు అక్కడ కనిపించలేదు. దంపతులం ఇద్దరం స్వామిని దర్శించి సాష్టాంగం చేశాము. పుష్పం, ఫలం, వస్త్రం వగైరా సమర్పించుకున్నాము. ఎప్పటివలె ప్రసన్నవదనంతో, నిండుహృదయంతో స్వామి మమ్ము ఆశీర్వదించారు.

ఆ క్షణాన నా కొక ఆలోచన తట్టింది. ఒకరిద్దరు శిష్యులు తప్ప, స్వామి ఒంటరిగా వున్నారు కదా, గతంలో జరిగిన గాంధి-స్వామి గోష్ఠిని గురించి మరో మాటు అడిగి చూదాం, ఇప్పటికైనా స్వామి మనస్సు మారి ఉంటుందేమో అనే ఆశతో ఇలా అన్నాను:

''గాంధిగారికీ తమకూ లోగడ జరిగిన సంభాషణ వివరాలు తెలపవలసిందని తమను మళ్ళీ ప్రార్థిస్తున్నాను. ఇంతవరకూ నా కోరిక నెరవేరలేదు.''

స్వామి: అవును, నీవు అడుగుతూ ఉన్నావు. నిజమే. కాని, విను, ఒక్క విషయం. నాడు నాకూ, గాంధిగారికీ జరిగిన సంభాషణను గురించి తెలిసిన వాళ్లం నేనూ, గాంధీగారూ, మేమిద్దరమే. మూడో వారెవ్వరికీ తెలియదు. గాంధిగారి వెంటవచ్చిన రాజగోపాచారిగారు సైతం బయటనే కూచున్నారు.

''మరి, గాంధిగా రిప్పుడు లేరుకదా! ఉన్నవాణ్ణి నేనొక్కణ్ణ. ఆనాటి సంభాషణ వివరాలను నేను వెల్లడిచేస్తే, ''ఇది నిజమై ఉంటుందా?'' అని గాంధీ అనుయాయులు అనుమానించవచ్చు.

స్వామి గొప్ప ధర్మసూక్ష్మం వెలిబుచ్చారు. అలాంటి మహోదారులకే అట్టి సందేహాలు తట్టుతాయి. సామాన్యులు వాటిని ఊహించలేరు. ఊహించినా, వాటి నంతగా పాటించరు....కాని, ఈ విషయం ఇంతటితో రెండో ప్రాణికి తెలియకుండా కాలగర్భంలో కలిపిపోవలసిందేనా?.... అనుకుంటూ, మళ్ళా ఇలా అన్నారు:

''స్వామీ, క్షమించండి. గాంధిగారి అభిమానులూ, అనుయాయులూ ఏమి అనుమానిస్తారూ, ఏమి ఆరోపిస్తారూ అన్నది అంత ముఖ్యం కాదని నా మనవి. ఎందుచేత నంటే, ఒక వైపున జాతిపితగా పరిగణించబడే గాంధిగారికీ, మరొక వైపున మూర్తీభవించిన సనాతనధర్మంగా భావించబడే జగద్గరువులకూ జరిగిన సంభాషణ - ఎంత రహస్యంగా జరిగినా, అది వైయక్తికం కాజాలదు. లోక మంతకూ తెలియవలసినదే. ఈ విషయంలో ఎవరేమనుకున్నా, సత్యం బహిర్గతం కావడం లోకోపకారకమని సవినయంగా మనవి చేస్తున్నాను.

''అదీగాక, మరొక విషయం. గాంధీ అనుయాయులు తమ మాటలు నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. కాని, తమ మాట మీద పరమవిశ్వాసం గత మాబోంట్లు దేశంలో కొల్ల లున్నారు. అట్టివారి కొరకైనా, తాము ఈ తెర తొలగించి సత్యాన్ని ప్రకటించడం అవసరం.''

ఇంతగా నేను ప్రార్థించినా, తర్కించినా, స్వామి చలించలేదు. ఆయన మనస్సుమారలేదు. మందహాసం చేస్తూనే, అలా మౌనంగా ఉండిపోయారు.

ఎలాగైనా విషయం తెలుసుకుందామనే ఉత్కంఠతో నేను అట్లా మాట్లాడానే గాని, ఏ సందర్భంలో ఏది ఉచితమో, ఏది కాదో నిర్ణయించవలసింది ధర్మదేవతను బోలిన స్వామే గాని, నేనా?

ఇక, నేను నోరు విప్పలేదు. మరొక అవకాశం రాదా, స్వామి మనస్సు మెత్తబడదా, అన్న ఆశమాత్రం నన్ను వదలలేదు.

ఇది పూర్వ రంగం.

* * *

స్వామి ఆదేశంపై కంచికి ప్రయాణం

1985 జూన్‌నెలలో నేను బొంబాయిలో మా కుమార్తె ఇంటివద్ద ఉండగా, హైదరాబాద్‌నుంచి నాకో టెలిగ్రాం వచ్చింది: 'వెంటనే బయలుదేరి మిమ్ముకంచికి రమ్మంటున్నారు పరమాచార్యులు' అని. ఎందునిమిత్తమో కారణం మాత్రం తెలియదు.

వస్తున్నానని మఠానికి తెలియజేసి, వెంటనే రైలెక్కాను. హైదరాబాదు చేరగానే మఠం నుంచి మరొక టెలిఫోన్‌: ''స్వామి మౌనంలోకి వెళతారు కాబట్టి, ఆలస్యం కాకుండా విమానంలో బయలుదేరవలసింది'' అని.

చావలి సుబ్రహ్మణ్యశాస్త్రిగారి కుమారులు శ్రీకృష్ణ ప్లేనుకు టిక్కెట్లు సంపాదించారు. ఇద్దరం కలిసి మద్రాసు వెళ్ళాము. అడయారులో చావలి శాస్త్రిగారిని కలుసుకొని, వారి కారులోనే కంచికి బయలుదేరాను. శ్రీ చావలి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు స్వామి ముఖ్య శిష్యులలో ఒకరు.

నేరుగా మఠానికి వెళ్ళి స్వామి దర్శనం చేశాను. ఢిల్లీ 'స్టేట్స్‌మన్‌' పత్రికలో శ్రీ కె. స్వామినాధన్‌ పేరుతో ప్రచురించబడిన ఒక లేఖ ప్రతిని నాకిచ్చి దాన్ని చదవమన్నారు స్వామి.

ప్రొఫెసర్‌ స్వామినాధన్‌ చాలా అనుభవంగల విద్యావేత్త. ప్రసిద్ధ రచయిత. తత్వజ్ఞుడు. ప్రస్తుతం ఢిల్లీలో గాంధీమహాత్ముని సమగ్రరచనల సంపుటికి (Collected Works of Mahathma Gandhi) ప్రధాన సంపాదకులు. ఆయన వ్రాసిన లేఖను 1985 జూన్‌ 8 తేదీ 'స్టేట్స్‌మన్‌' పత్రిక ప్రకటించింది.

1927 అక్టోబరు 15 తేదీన దక్షిణదేశంలో నెల్లిచెరి గ్రామంలో మహాత్మాగాంధీ, కామకోటి శంకరాచార్యస్వాములమధ్య ఏకాంతంగా జరిగిన గోష్ఠి అనంతరం మహాత్ముడు తన ఆశ్రమవాసులైన శ్రీ కిశోరిలాల్‌ మశ్రువాలా, శ్రీమతి గంగా బెన్‌ వైద్యగార్లకు ఆ గోష్ఠిని గురించీ, శంకరాచార్యస్వామిని గురించీ లేఖలు రాశారు. ఆ లేఖల్లోని కొన్ని భాగాలను శ్రీ స్వామినాధన్‌ 'స్టేట్స్‌ మన్‌' పత్రికకు తాను వ్రాసిన లేఖలో ఉదహరించారు.

''స్వామినాధన్‌ లేఖ చదివావుకదా, అందులో ఏమున్నది?'' అని స్వామి నన్ను అడిగారు. నే నిలా సమాధానం చెప్పాను. గాంధీజీ తన ఆశ్రమవాసి మశ్రువాలాకు వ్రాసిన ఉత్తరంలో ''మా సంభాషణల అనంతరం పూర్తిగా భిన్నమైన మరో అనుభవంతో నేను బయటికి వచ్చాను. ప్రతి సమస్యకూ రెండు వాదాలున్నాయి. ఆ రెండవది కూడా రమ్యమైనదే. దానిని ఉపేక్షించడానికి వీలు లేదు.''

స్వామి: సరి. లోగడ గాంధిగారికీ నాకూ జరిగిన సంభాషణలను గురించి పదేపదే నీవు నన్ను అడుగుతూ వచ్చావు. నేను చెప్ప నన్నాను. ఆ గోష్ఠిని గురించి ఇప్పుడు గాంధిగారి అభిప్రాయాలు కొంతవరకు వెల్లడి అయినవి కాబట్టి, ఆ సంభాషణలసారాంశాన్ని నీకు వినిపిస్తాను.

''తెలుగు మాట్లాడే అభ్యాసం తప్పిపోవడం చేత భాషమరచి పోతున్నాను'' అంటూ స్వామి నెమ్మది, నెమ్మదిగా తెలుగులోనే మాట్లాడారు. రమారమి మూడు దశాబ్దాల కిందట మొట్టమొదటిసారి నేను స్వామి దర్శనం చేసి మాట్లాడినప్పుడు, నాలుగున్నర గంటలు వివిధ విషయాలను గురించి ఏకధాటిగా స్వామి తెలుగులో ప్రసంగించారు. ఆనాడు ఆ ప్రసంగం అనర్గళంగా, అతి మధురంగా, స్వామి మాతృభాష తెలుగే అన్న భ్రాంతిని కలిగించేట్టుగా కొనసాగింది. అలాంటిది 'అభ్యాసం లేక నేను తెలుగు మరిచి పోతున్నాను' అని స్వామి ముఖతా వెలువడిన మాట ఎందుకో నాకు ఇంచుక బాధ కలిగించింది.

* * *

Nadichedevudu   Chapters