Nadichedevudu   Chapters  

 

66. స్వామి ఆశ్రిత కల్పవృక్షం

- శ్రీ పురాణం రామకృష్ణశాస్త్రి

నాకు పుత్రసంతానం కలుగునట్లు అనుగ్రహించవలసినదిగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీచరణులను ఆశ్రయించాను. శ్రీవారు ఆశీర్వదిస్తూ సేతుస్నానం, నాగప్రతిష్ఠ మొదలైన కార్యక్రమాలను చేయవలసిందని ఆదేశించారు. 1963 ఫిబ్రవరి నెలలో కుటుంబసమేతంగా రామేశ్వరం బయలుదేరుతూ దారిలో పుదుక్కోట సమీపాన ఒక చిన్నగ్రామంలో మకాం చేస్తున్న స్వామివారి దర్శనం చేసుకుని, రామేశ్వరం నుంచి తిరిగి వచ్చేటప్పుడు మరల తమ దర్శనం అనుగ్రహించవలసిందని ప్రార్థించాను. శ్రీవారు 'తదైవ' అన్నారు.

15 రోజులపాటు రామేశ్వరం వగైరా దక్షిణ దేశంలోని క్షేత్రాలను సందర్శించి, ఆపాటికి శ్రీ స్వామివారు తంజావూరు సమీపంలో ఉండవచ్చు నని భావించి, తంజావూరువైపు ప్రయాణం సాగించాము. తంజావూరుకు 7 మైళ్ల దూరంలో రోడ్డు రెండుగా చీలింది. ఏ దారిని వెడితె శ్రీవారున్న తావుకు వెళ్లగలమో రూఢిగా తెలియలేదు. ప్రదేశమంతా నిర్మానుష్యంగా వుండడంచేత, ఎవ్వరినీ అడగడానికైనా వీలుకాలేదు. కారు నిలుపుకుని, ఏమిచేయడానికి తోచక, శ్రీవారిని స్మరించసాగాను.

ఇంతలో ప్రక్కరోడ్డునుంచి పుదుక్కోటవైపు ఒక చిన్నకారు అతివేగంగా వెళ్లింది. ఆ కారు ఆపి, అందులో ఉన్నవారిని అడిగిన బాగుండేదికదా, అలాచేయకపోతినే అని చింతిస్తూ, స్వామిని స్మరిస్తూఉండగా, ఆశ్చర్యంగా ఆ చిన్నకారు వెనక్కు తిరిగి మా వద్దకు వచ్చింది. కారులోవున్నవ్యక్తి తన పేరు పి.కె.యస్‌. మణి అయ్యర్‌ అంటూ మాతో పరిచయం చేసుకొని ''మీరు కంచిస్వామి వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకోడానికై ఇక్కడ ఆగారా?'' అని మమ్ము అడిగారు. అవునని మేము చెప్పగానే ఆరాత్రి స్వామివారు పుదుక్కోటలో తమ ఇంటికి దయచేస్తున్నారనిచెప్పి, తమ యింటికి మమ్మలనందరినీ ఆహ్వానించారు. వారితో కలిసి వెళ్లి శ్రీవారిదర్శనం చేసి ధన్యులమైనాము.

ఇది అద్భుతమైన సన్నివేశం! ఇది నా జన్మలో ఏనాటికీ మరవలేని దివ్యానుభూతి.

1965 లో నాకు స్వామివారి అనుగ్రహంవల్ల పుత్రసంతానం కలిగింది. స్వామివారు ఆశ్రిత కల్పవృక్షం!



సత్యప్రకటనమే పాత్రికేయుల కర్తవ్యం

'హిందూ' పత్రిక భూతపూర్వసంపాదకులు, సుప్రసిద్ధ రాజ్యాంగవేత్తలు అయిన శ్రీ ఎ. రంగస్వామి అయ్యంగారితో శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామి మాట్లాడుతూ పత్రికారచయితల కర్తవ్యాన్ని గురించి ఇలా అన్నారు.

''పత్రికారచయితలు, సంపాదకులు తమతమ వ్యాపార, వృత్తులను కాపాడుకుంటూ, భగవద్భక్తి కలవారై, తమ మనస్సాక్షి ప్రబోధాన్ని అనుసరించి ధర్మమార్గాన తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. సత్యాన్ని ప్రకటించడానికి వెనుకముందులు చూడకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ సత్యాన్ని ప్రజలనుండి దాచకూడదు.

Nadichedevudu   Chapters