Nadichedevudu   Chapters  

 

59. కరుణావరుణాలయులు

డా|| వారణాసి రామమూర్తి 'రేణు'

శ్రీ కంచికామకోటి గురుచరణులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీస్వామి పాదులు జంగమతీర్థ చక్రవర్తి. శ్రీవారి చరణస్పర్శ భూమిలోని అణువణువును పవిత్ర తీర్థం కావిస్తుంది. వారు సర్వజ్ఞులు, సర్వసములు, సర్వసులభులు. ఈ మాటలు అతిశయోక్తులు గావు. స్వామివారి చరణాలవద్ద నేను పొందిన ఎన్నో మధురానుభూతుల ఆధారంతో ఈ మాట లంటున్నాను. వానిలో ఒకటిరెండు అనుభవాలు నివేదిస్తాను.

శ్రీచరణులు మఠంతో హైదరాబాదు దయచేసిన సందర్భంలో దాదాపు నాలుగైదు నెలలు వారి దర్శన సేవాభాగ్యాలు అనుభవించిన వారిలో నే నొకడను. ఆ సమయాన శ్రీవారు అందరినివలె నన్నుకూడా అనుగ్రహించారు. పర్యటనానంతరం కంచి తిరిగివెళ్ళిన తర్వాత నే నప్పుడప్పుడు వారి దర్శనానికి కంచి వెళ్తుండేవాడిని. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వ్యాసం, ఎవరో ఒక భక్తుని గురించిగాని క్షేత్రాన్ని గురించిగానీ వ్రాసి తీసుకెళ్ళేవాడిని. దానిని శ్రీవారికి వినిపించి వారి ఆమోదముద్ర వేయించుకుని పత్రికలకు పంపేవాడిని. అలాగే ఓ పర్యాయం శ్రీ సదాశివబ్రహ్మేంద్ర సరస్వతీస్వాముల జీవితవిశేషాలతో ఒక వ్యాసం వ్రాసి వారికి నివేదించడానికి బయలుదేరాను. మద్రాసు నుండి బస్సులో కాంచీపురానికి వెళ్తున్నాను. దారిలో నా మనస్సులో ఒక అతృప్తి, ఆలోచన ప్రారంభమయ్యాయి.

ఈ రోజుల్లో శ్రీవారు శివస్థానమనే చోట కంచిలో ఉండేవారు. ఆలయం ప్రక్కనే ఒక కుటీరంలో ఏకాంతంగా మౌనవ్రతం పాటిస్తున్నారు. కుటీరానికి చుట్టూ తడకలు ఉన్నాయి. దర్శనార్థులకు కిటికీచువ్వల గుండా కాని, కుటీరానికి వెనుక భాగానగల బావి వద్ద లోతట్టుగా నిలబడి కాని స్వామి దర్శనం ఇచ్చేవారు. అందుచేత శ్రీవారి ఊర్థ్వకాయదర్శనమే తప్ప పాదదర్శనం లభించేది కాదు. బస్సులో పోతూ నాలో నేనిలా అనుకుంటూ ప్రయాణం చేశారు. 'శ్రీరచణుల పాద దర్శనం చేసి చాలా రోజులైంది. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా బావి వెనుక నిలబడినందున శ్రీవారి చరణదర్శనం కాలేదు. ఈ పర్యాయం కూడా అక్కడ నిలబడే దర్శన మిస్తారో లేక బయటికి వచ్చి నఖశిఖ పర్యంతం దర్శించే భాగ్యం కలగజేస్తారో! ఏమో నా అదృష్టం ఎలా ఉందో! వారి చరణసౌభాగ్యం దర్శించే అనుగ్రహం చేయకూడదా? ఏమో వారి దయ! నా భాగ్యం!'

ఇలా మనసులో బాధపడుతూ కంచి చేరుకున్నాను. శ్రీ వరదరాజస్వామి కోవెలవద్ద బస్సుదిగి శివస్థానానికి వెళ్ళాను. సాయంత్రం అయిదున్నర గంటలయింది. శ్రీవారు తమ కుటీరం చుట్టూ ఉన్న ప్రహరీగోడ పైనుంచి బయటచేరిన భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వారి ముఖారవిందం మాత్రమే కనబడుతోంది. నేను ఊరు, పేరు చెప్పుకుని నేలమీద సాష్టాంగపడ్డాను. 'రేణు' 'హైదరాబాదు' అని విన్నంతనే ఆ దయామయుని ముఖం వికసించి మందహాసంతో అభయహస్తం అనుగ్రహించారు. శ్రీ సదాశివబ్రహ్మేంద్రులపై ఒక వ్యాసం వ్రాసి తెచ్చాననీ, ఆ సందర్భంగా విషయసేకరణకై పుదుక్కోట తంజావూరు ప్రాంతాల్లో పర్యటించాననీ, దానిని చిత్తగించి శ్రీవారు ఆశీర్వదించాలనీ అర్థించాను. నా కోర్కెకు ఆమోదం తెలిపి ఒక అరగంట కాలంలో వచ్చిన భక్తు లందరను ఆశీర్వదించి పంపి, 6 గంటలకు బావివద్ద లోతట్టున బల్లపై కూర్చొని నాకు కబురు పంపారు. నేను బావికి ఇవతల సాష్టాంగప్రణామం చేసి నిలిచాను. బావిపైన ఒక ఇనుప వల వేసి ఉంది. అప్పటికి సందె చీకటి ప్రారంభ##మైంది. శ్రీచరణులు నన్ను చదవమని మౌనంతోనే సంజ్ఞ చేస్తూ ప్రక్కనే ఉన్న బ్రహ్మచారిని టార్చిలైటు వేయమని సంకేతం చేశారు. నేను చదవడం ప్రారంభించాను. ఎత్తుగడలో భారతదేశం మహిమాన్వితులయిన సాధుపుంగవులకూ, భక్త గాయకులకూ ఎందరకో పుట్టినిల్లని చెబుతూ, అలాంటి సాధు మహాత్ములు కొందరి పేర్లు చదివాను. ఆ వాక్యం పూర్తికాగానే శ్రీవారు హస్త సంజ్ఞతో నన్ను ఆగమని 'ఎవరో ఫలానా భక్తుని వదిలేశావే!' అన్నట్టుగా నా వంకచూచారు. మందబుద్ధినైన నేను వారి సంకేతం గ్రహించలేక, ఆ భక్తు డెవరో సెలవివ్వమని అర్థించాను. మౌనవ్రతానికి భంగం లేకుండా సంజ్ఞలతోనే నాకు భక్తుని పేరు తెలియబరచడానికి శ్రీవారెంతో ప్రయత్నించారు. అయితే వారి సంకేతాలేవీ నా బుర్రలోని కెక్కలేదు. అంతటితో విసుగు కలిగినట్టుగా నటిస్తూ, తమ రెండు చేతుల బొటన వ్రేళ్ళూ మడిచి ఎనిమిదివ్రేళ్ళూ చూపారు. ''చిత్తం స్వామీ! ఎనిమిది!'' అన్నాను. వెంటనే కూర్చున్న పళంగా తమ ఎడమ పాదము పైకెత్తి నాకు చూపారు. అప్పటికి నాకు వారి ఆంతర్యం బోధపడి - ''ఆ! స్వామి! ఎనిమిది, పాదం, ఎనిమిది పాదాలు, అష్టపాదాలు, అష్టపదులు! ఆ జయదేవులా?'' అని పెద్దగా అన్నాను. శ్రీవారు మందహాసంతో అవునన్నారు. నిజమే! నేనిచ్చిన పేర్లలో గీతగోవిందకర్త జయదేవుని పేరులేదు. అంతేకాదు ఇంకెందరి పేర్లో కూడా లేవు. ఇత్యాదులు అంటూ అందరినీ కలిపాను. అయితే ఇందులో శ్రీవారు ఒక్క జయదేవులను నాకు గుర్తుచేయడంలోనే వారి అపారమైన కరుణ వాత్సల్యాలు పెనవేసికొన్నాయి. మద్రాసు నుంచి బస్సులో వస్తూ శ్రీవారి చరణసందర్శనం ప్రాప్తించదేమో నని నేను పడిన మానసిక సంతాపాన్ని ఆ సర్వజ్ఞమూర్తి గుర్తించి, జయదేవకవి వ్యాజాన, అష్టపదుల నెపంతో తమ సంపూర్ణమైన, సర్వశుభలక్షణ లక్షితమైన శ్రీచరణతల దర్శనం అనుగ్రహించి న న్నానందపరిచారు! శ్రీ చరణుల సర్వజ్ఞతకూ, సర్వాంతర్యామిత్వానికీ, భక్తవాత్సల్యానికీ ఈ ఘట్టం చక్కని తార్కాణం.

* * *

Nadichedevudu   Chapters