Nadichedevudu   Chapters  

 

52. 'నీకు లక్ష్మీకటాక్షం ఉంటుంది'

కామకోటిపీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతిస్వామివారిని ప్రప్రధమంగా దర్శించే భాగ్యం ఇలయత్తాన్‌ గుడిలో 1962 సంవత్సరంలో నాకు కలిగింది.

ఆ కాలంలో మా అల్లుడు చిరంజీవి వసుమర్తి సుబ్రహ్మణ్యశాస్త్రి మూర్ఛ వ్యాధివల్ల బాధపడినాడు. ఎంత చికిత్స చేసినా మందులవల్ల వ్యాధి నివారణ కాలేదు. పూజలు, పండితులు, స్వామి వారి భక్తులూ అయిన కీ.శే. మండలీక వెంకట శాస్త్రిగారి సలహాపై కంచి స్వామివారిని సందర్శించాము. మా అల్లుడి వ్యాధిని గురించి వారికి నివేదించాము. తొమ్మిది ఆదివారాలు వేదోక్తంగా పంచగవ్యములు ఇప్పించవలసిందని స్వామివారు ఆదేశించారు. తు.చ. తప్పకుండా స్వామి ఆజ్ఞను అనుసరించాము. 9 ఆదివారాలు గడువు దాటగానే మా అల్లుడికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది.

లక్ష్మీ కటాక్షం:

నేను అప్పుడు మోటారుకార్లు విక్రయించే వ్యాపారం చేస్తుండే వాణ్ణి. వ్యాపారంలో పోటీ అధికం కావడంచేత ఆ సమయంలో నా వ్యాపారం చాలా మందగించి, మా వద్ద ఉండే పనివా రంతా పని మానుకొనడం సంభవించింది.

అప్పుడు నేను నా కుటుంబంతో కంచికి వెళ్లి శ్రీవారిని దర్శించి, మఠంలో భిక్షచేశాను. భిక్ష కాగానే శ్రీవారు నాకు ప్రసాదం ఇస్తూ 'నీకు లక్ష్మీకటాక్షం ఉంటుంది' అని ఆశీర్వదించారు.

అప్పటివరకు నేను నా వ్యాపారం మీద ప్రభుత్వానికి నెలకు రు.3,000 లు అమ్మకం పన్ను చెల్లించే వాణ్ణి. స్వామివారి ఆశీర్వచనం లభించిన తరవాత నేను చెల్లించవలసిన అమ్మకంపన్ను మూడువేలల్లా, నెలకు లక్షరూపాయలకు పెరిగింది! ఆ సమయంలో నావద్ద ఒకే ఒక పనివాడుండేవాడు. బయటికి వెళ్లి ఆర్డర్లు తెచ్చేవారే లేరు. అలాంటి పరిస్థితుల్లో, స్వామి ఆశీర్వాదబలంతో నాలుగైదు జిల్లాలనుంచి టెలిగ్రాముల ద్వారా ఆర్డర్లు రాసాగినవి. కంపెనీ వారీ విషయం గమనించి ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఇదంతా స్వామివారి ప్రభావం తప్ప మరొకటి కానేకాదు.

శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతిమహాస్వాములు సాక్షాత్తు భగవంతుడే తప్ప. మానవమాత్రులు కారని నా విశ్వాసము. ఇటువంటి నిదర్శనాలు ఇంకా అనేకం వున్నవి.





నానాత్వంలో ఏకత్వం

నానాత్వంలో ఏకత్వం దర్శించడం ఒక్కటే మతానికీ, జీవితానికీ పరమార్థం. ఏక మతం కోసమని నేటి మతాలన్నిటినీ రూపుమాపడానికి యత్నించకూడదు. ఎవరి ఇష్టదేవతపై వారికి భక్తిని పెంపొందింపజేయడమే ఉత్తమం.

Nadichedevudu   Chapters