Nadichedevudu   Chapters  

 

50. శ్రీ జయేంద్ర సరస్వతి

కామకోటిపీఠం ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ జయేంద్రసరస్వతీ శ్రీ చరణుల పూర్వాశ్రమనామం శ్రీ సుబ్రహ్మణ్యయ్యర్‌. వీరి తండ్రి శ్రీ మహదేవయ్యర్‌. తల్లి శ్రీమతి సరస్వతీదేవి. జననం తంజావూరు జిల్లా 'తిరుళ్లిణికి' గ్రామం. వీరిది ఔచథ్యగోత్రం ఋగ్వేదీయులు. వడమశాఖ. 1935లో యువసంవత్సరం, ఆడిమానంలో జననం. జన్మ నక్షత్రం ధనిష్ఠ.

శ్రీ మహాదేవయ్యర్‌, సరస్వతి పుణ్యదంపతుల ముగ్గురిపుత్రులలో వీరు జ్యేష్ఠులు.

శ్రీ సుబ్రహ్మణ్యయ్యర్‌ మూడు సంవత్సరాల వయస్సు వరకు తల్లిదండ్రులవద్దనే ఉండి, అనంతరం మాతామహికి తండ్రిగారైన శ్రీ వీరాస్వామి ఘనాపాఠిగారి వద్ద ఆరవసంవత్సరం వరకు ఉన్నారు. తదుపరి తల్లిదండ్రులవద్ద ఉండి నాలుగైదు తరగతులు ప్రాథమిక విద్య నభ్యసించారు. గర్భాష్టమున ఉపనీతులైనారు.

రైల్వేలో ఉద్యోగిగా ఉన్న తండ్రి శ్రీ మహదేవయ్యర్‌ తన కుమారునిచే వేదాధ్యయనం చేయించదలచి, సమీప గ్రామంలో యజుర్వేద పాఠశాలలో బాలుని చేర్పించారు.

ఇదే సందర్భంలో కామకోటిపీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ శ్రీ చరణులు విల్లుపురానికి విజయం చేశారు. శ్రీ మహదేవయ్యర్‌ తన కుమారుని శ్రీవారి దర్శనానికి తీసుకువెళ్లి కుమారునిచే వేదాధ్యయనం చేయించే ఉద్ధేశంతో ఉన్నామంటూ, స్వామివారి ఆశీర్వాదం కోరారు. ఉత్తమసంస్కారం కోసం రెండు మూడు సంవత్సరాలు మాత్రం బాలునిచే వేదాధ్యయనం చేయించి, అటు పిమ్మట, వృత్తి కొరకు లౌకికవిద్య నేర్పించదలచినట్లు శ్రీ మహదేవయ్యర్‌ స్వామివారికి నివేదించారు. కాని, స్వామి మాత్రం ఈ బాలునిచే పూర్తిగా వేదాధ్యయనం చేయించవలసినదిగా తండ్రికి ఉపదేశించారు.

ఆ మరునాడు కంచిలో శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయానికి కుంభాభిషేకం చెయ్యడం కోసం శ్రీ స్వామి వారు అక్కడికి బయలు దేరుతూ, విల్లుపురంలోని యజుర్వేదపాఠశాల అధ్యాపకులను, శిష్యులను కంచికి రావలసిందిగా ఆదేశించారు. తమ కుమారుని కూడా వెంటబెట్టుకుని శ్రీ మహాదేవయ్యర్‌ కంచికి వెళ్లారు.

అది 1944 సంవత్సరం. శ్రీ కామాక్షి ఆలయానికి కుంభాభిషేకం జరిగిన రోజునే అమ్మవారి సన్నిధిలోనే శ్రీ సుబ్రహ్మణ్యయ్యర్‌ ఋగ్వేదాధ్యయనం ఆరంభం అయింది. మధ్యార్జునంలోని ఋగ్వేదపాఠశాలాధ్యాపకులైన బ్రహ్మశ్రీ కృష్ణమూర్తిశాస్త్రి గారే అధ్యాపకులు. కాని, గృహస్థులు పీఠం సొత్తుతింటూ ఉండటం ఉచితం కాదని శ్రీ మహదేవయ్యర్‌ అభిప్రాయం వెలిబుచ్చటంచేత, చివరకు మధ్యార్జునంలో స్మార్తబ్రాహ్మణపోషణలో ఉండి, కామకోటిపీఠ పర్యవేక్షణలో నడుస్తున్న వేదపాఠశాలలో ఈ బాలుడు ఋగ్వేదాధ్యయనం ప్రారంభించారు. ఆ విధంగా 13 సంవత్సరాలవయస్సు వరకు అక్కడనే ఋగ్వేదాధ్యయనం జరిగింది.

ఆ సమయంలో శ్రీ స్వామివారు తమ విజయయాత్ర సందర్భంలో మధ్యార్జునం వచ్చారు. ఋగ్వేదం అభ్యసిస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యయ్యర్‌ను 69వ పీఠాధిపతిగా స్వీకరించదలచినట్లు, బాలుని తల్లితండ్రులకు కబురంపారు. తల్లితండ్రులు స్వామి ఆదేశాన్ని శిరసావహించారు.

పీఠ సంప్రదాయాది పలువిషయాల్లో ఈ బాలునికి మూడు సంవత్సరాలు శిక్షణ ఇచ్చారు. రెండు సంవత్సరాలు శ్రీ సుబ్రహ్మణ్యయ్యరు తల్లితండ్రుల వద్దనే ఉండి ఆంగ్లం మొదలైన భాషలను అభ్యసించారు.

అటు తరువాత 1955 మార్చి 19 నుండి 22 తేదీ వరకు కంచిలో ఈ బాలునికి ఆశ్రమస్వీకారోత్సవం మహావైభవంగా జరిగింది.

విశ్వేశ్వర సన్నిధిలో శ్రీ స్వామివారు శిష్యులకు మహావాక్యోపదేశం చేసి, 'జయేంద్ర సరస్వతి' అనే యోగపట్టాన్ని ఒక రుద్రాక్షమాలను పీతాంబరాన్ని ప్రసాదించారు, అదిమొదలు శ్రీ జయేంద్ర సరస్వతి శ్రీ చరణులు, శ్రీ చంద్రశేఖర సరస్వతులకు ప్రథమ శిష్యులైన పీఠ కార్యక్రమాలన్నిటిలో పాల్గొంటూవచ్చారు.

జనజాగరణ, జన కళ్యాణం

పీఠపరిపాలనాదక్షులు, పూజాకార్యక్రమదురంధరులు, ప్రస్తుతం దేశమంతటా ప్రబలుతున్న అధార్మికవర్తనం, అలజడి, హింసాకాండను చూసి ఖిన్నులై జనసముదాయంలో ధార్మికప్రవృత్తిని పెంపొందించడానికి, ప్రతివ్యక్తి స్వయంకృషితో ద్రవ్యార్జన చేసికొంటూ సంసారాన్ని చక్కదిద్దుకొంటూ, దేశ##క్షేమానికి పురోగమనానికి ఎంతో దోహదం చేస్తాడచే భావంతో కుల, మత విచక్షణ లేకుండా, సమస్త ప్రజలు క్షేమంగా ఉండాలనే సంకల్పంతో ''జన జాగరణ'', ''జన కళ్యాణం'' అను రెండు మహోన్నత కార్యక్రమాలను చేపట్టిన మహనీయులు జయేంద్ర సరస్వతి. ప్రజలలో మన సంస్కృతి, సంప్రదాయాలను పునరుజ్జీవింపచేయడానికి కార్యక్రమాలను రూపొందిస్తూ అర్హులకు ఆర్థిక సహాయం కల్పిస్తున్నారు. మత ప్రచారంతోబాటు సంఘసంస్కరణకు పూనుకున్న పీఠాధిపతి శ్రీ స్వామివారు.

Nadichedevudu   Chapters