Nadichedevudu   Chapters  

 

5. ''వశిష్ఠాది మహర్షుల వంటివారు''

''బాబూ! అది నడయాడుతున్న బ్రహ్మపదార్థం. దానిని గూర్చి ఎలా పలకడం? అంటారు తపస్వాధ్యాయనిరతులూ, పండితకవులూ శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారు శ్రీ కామకోటిపరమాచార్యులను గురించి. అయినా, నాలుగు మాటలు చెప్పండి అని వెంటబడితే అమూల్యమైన ఈ క్రింది అనుభవవిశేషాలు వినిపించారు.

ఒకసారి నేను శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతిస్వామివారిని సందర్శించినప్పుడు, మా తండ్రిగారు వ్రాసిన పుస్తకాల సెట్టు ఒకటి తన కివ్వమని అడిగారు.

''తమకు నాగర లిపివచ్చు. అరవ లిపి వచ్చు. మరి తెలుగు లిపి పరిచయమేనా?'' అని నేను అడిగాను.

-''నాకు అక్షరాలు వస్తే నేమి, రాకపోతేనేమి? పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను. ఒక సెట్టు ఇవ్వు'' అన్నారు శ్రీవారు.

తరువాత కొంత కాలానికి నేను హైదరాబాద్‌ వచ్చాను. అప్పుడు స్వామివారు హైదరాబాద్‌లో కౌతా లలితామనోహర్‌ ఇంట్లో ఉన్నారు. నేను శ్రీవారి దర్శనానికి వెళ్లాను. అక్కడి పరిచారకుడు నేను వచ్చినట్టు స్వామికి తెలిపాడు. దొడ్లో ఒక పాడుబడ్డ కొంపలో కూర్చొని నాకు కబురు పెట్టారు శ్రీవారు.

అదే సమయానికి రాష్ట్ర కేంద్రప్రభుత్వాల్లో మంత్రిపదవులు నిర్వహించిన శ్రీ పి.వి. నరసింహారావుగారు కూడా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆయన శ్రీవారిపై కొన్ని సంస్కృతశ్లోకాలు వ్రాసుకొచ్చారు. శ్రీవారి ఎదట కూర్చొని ఆయన తన శ్లోకాలు వినిపించారు.

శ్రీవారు ఆ శ్లోకాలలో తప్పులు దిద్దే కొన్ని సూచనలు చేశారు.

అప్పుడు, నేను ఆశువుగా శ్రీవారిని గురించి నాలుగు శ్లోకాలు చదివాను. నా శ్లోకాలలో తప్పు లేవీ శ్రీవారు ఎత్తిచూపలేదు.

కాని, నా కవిత్వంలో రెండుచోట్ల తప్పులు దొర్లినవని శ్రీ నరసింహారావుగారు అన్నారు.

''కవిత్వంలో, జన్మలో, నడవడిలో ఆయనకు తప్పు అనేది ఉండదు'' అని శ్రీవారన్నారు.

ఆ పిమ్మట శ్రీవారిపై నేను ఆశువుగా చెప్పిన శ్లోకాలు మళ్లా చదవమని చెప్పి, ఒకగంటసేపు పురాణం చేశారు శ్రీవారు. తరువాత స్వామివారు ఈ క్రింది పద్యం చదివారు.

మ|| కనుమీ నీ నగుమోము మేల్సిరికి లక్ష్యం బౌటకున్‌ల

జ్జనెట్టగ మున్మున్న మునింగి కొండచరిబాటం జారె రేరేడటం

చనుమోదించుట బద్మినీపతి నిజాస్య స్మేరదృష్టి ప్రసా

ర నవోల్లాసిత హ్రీణయై తెలిపెడిన్‌, రామా! జగన్మోహనా!!

ఇది మా తండ్రిగారు వ్రాసిన 'రామ కథామృతము' లో బాలకాండ, నవమాశ్వానములోనిది. విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం.

శ్రీవారు పై పద్యం చదివి, ''మీ నాన్నగారు దోవనపోతూ ఎప్పుడూ ఈ పద్యం చదువుతూ ఉండే వారు కదా?'' అని నన్ను అడిగారు.

ఏనాడో గతించిన మా తండ్రిగారు తన పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివేవారో అలాగే స్వామి వారు ఎట్లా తిరిగి చదవగలిగారు!

శ్రీవారు ఇప్పటి వారు కారు. వెనక ఆర్షయుగంలో వశిష్ఠాదుల కోవకు చెందినవారు.

అనాచారం - ఆత్మహత్య

నేడు లోకంలో చూస్తున్న అనాచారాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే, కృష్ణలోనో, గోదావరిలోనో దూకి చచ్చిపోదామనే తలపు ఇటీవల అనేకపర్యాయాలు కలిగింది నాకు.

ఒకసారి అరుగు మీద కూర్చొని ఇదే ఆలోచిస్తూ ఉంటే తలుపు కెదురుగా శ్రీవారి రూపం నవ్వుతూ నాకు కనిపించింది. అయితే, శ్రీవారు నేల మీద పాదాలు మోపకుండా కాస్తంత పైన ఉన్నట్టున్నది ఆ రూపం.

చచ్చిపోదామనే ఆలోచన వచ్చినప్పుడల్లా వరసగా రెండు రోజులు శ్రీవారి దర్శనం ఇలా జరిగేది - అప్పుడు నాకు విసుగు పుట్టింది.

నేను చచ్చిపోవడం బహుశ శ్రీవారికి ఇష్టంలేదు కాబోలు అనుకుని, నా ఆత్మహత్య ఆలోచనకు స్వస్తి చెప్పుకున్నాను. ఆ పిమ్మట శ్రీవారి రూపం కనబడడం మానేసింది.

ఐదారునెలల తరవాత, ఒకసారి మళ్లా హైదరాబాదు వచ్చాను. తీర్థ యాత్రలకు వెళ్లాలంటేనే ఇక్కడకు వస్తాను. లేకపోతే రాను. శ్రీ వేంకటేశ్వరస్వామి దగ్గరకు వెళ్లినా శ్రీవారి వద్దకు వెళ్లినా తీర్థయాత్రే నాకు.

ఒకరోజు శ్రీ పి. వెంకటేశ్వర్లుతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లాను. 'చందోలు శాస్త్రిగారు వచ్చా'రని ఆయన శ్రీవారితో చెప్పారు.

న న్నుద్దేశించి శ్రీవారు ''నీ సమస్య ఏమయింది?'' అన్నారు.

నేను: ఏం సమస్య?

శ్రీవారు: అనాచారం కోసం చావడం.

నేను: 'వద్దు' అని మీరన్నారు కదా, అందుకని చాలించుకున్నాను.

* * *

అటుతరువాత ప్రాయశ్చిత్తాన్ని గురించి ముచ్చటించుకున్నాము శ్రీవారూ, నేనూ. ప్రాయశ్చిత్తగ్రంథం ఎందుకు పుట్టింది అనేది ఒక ప్రశ్న. తప్పు చేస్తే దిద్దుకునేందుకుగాను ప్రాయశ్చిత్తం ఉద్దేశించారు, తప్పు ఒకసారి చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు.

స్వామివారు: 'అహంబ్రహ్మాస్మి' అనుకోరాదా, అనాచార భావం బాధించకుండా ఉండేందుకుగాను.

నేను: అ స్థితి ఇంకా రాలేదు కదా నాకు!

స్వామివారు: క్షణికసమాధి సంగతో?

నేను: మీ అనుగ్రహం ఉంటే వస్తుంది.

ఆ తరువాత పక్కన ఒకాయన శ్రీవారికి వింజామర వీస్తుంటే దాన్ని నేను తీసుకుని కొద్దిసేపు వీచాను. ఒక పరిచారకుని ద్వారా శ్రీవారు ఒక శాల్వ తెప్పించి, స్వయంగా వారే నాకు దాన్ని కప్పారు.

నేను: మీరు ఎవరినీ తాకరు. మీరే ఒక కొత్త ఆవరణ నాకు కప్పుతున్నారు!

స్వామివారు: నీకు గాదు కప్పేది. నీ మీదకు వచ్చే అనాచారానికి కప్పుతున్నాను.

శ్రీవారికి నాతో పనిలేదు. నాకు శ్రీవారితో పనిలేదు. కాని కాస్సేపు వారితో ఉంటే సంగంలో నిస్సంగత్వం అలవాటు చేస్తారు శ్రీవారు. ఆయన మహానుభావులు!

* * *

''ఆయన ఋషి''

ప్రసంగవశాత్తు శ్రీ రాఘవనారాయణశాస్త్రిగారు తన తండ్రి కీర్తిశేషులు తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రులుగారిని గురించి ఒక చిన్న ఉదంతం ఇలా చెప్పారు.

మా నాన్నగారు ''త్రిశంకుస్వర్గం'' అని పేరుగల ఏ డంకాల నాటకం రాశారు. దానిని నూజివీడు జమీందారుగారికి చదివి వినిపించారు. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు తాను రాసిన 'విశ్వామిత్ర - మేనక' అనే మూడంకాల నాటకం చదవారు. కవిత్వంగురించి చర్చ జరిగింది.

''ప్రపంచంలో మొదటితరగతి కవిత్వం ఎవరిది?'' అని అడిగారు జమీందారు గారు.

''నా గొంతులో ప్రాణం ఉండగా మరొకరి కవిత్వం గొప్పదని నేను ఎలా ఒప్పుకోను? అన్నారు చెళ్ళపిళ్ల వేంకటశాస్త్రిగారు.

''మరి చందవోలు శాస్త్రిగారో?'' అని అడిగారు జమీందారు గారు.

'ఆయన ఋషి' అన్నారు చెళ్ళపిళ్ళవారు.



జగద్గురు ప్రశస్తి

ఆర్షవిద్యాభూషణ

- శ్రీ జటావల్లభుల పురుషోత్తం

శ్రీ చంద్రశేఖ రాఖ్యేంద్ర సరస్వ త్యాగ మాద్భువి,

దృశ్యతే శుభ్ర తేజశ్చ శ్రూయతే శ్రుతినిక్వణః.

శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి రాకచే భూలోకంలో శుభ్రతేజస్సు గోచరిస్తున్నది; శ్రుతి ధ్వని వినబడుతున్నది.

శ్రీ శంకరో జ్ఞాన పథ ప్రచారే కుమారిలో ధర్మవిధి ప్రబోధే,

శ్రీ మాధవో వేద సురక్షణచ సాక్షాచ్ఛుకో భక్త్యుపదేశ ఏషః.

స్వామి జ్ఞాన ప్రచారమున శంకరులు. కర్మోపదేశంలో కుమారిలభట్టు. వేద రక్షణకు విద్యారణ్యులు. భక్తి ప్రబోధంలో శ్రీశుకులు.

వాల్మీకినా2వర్ణ్యత రామచంద్రో లోకజ్ఞ ఇత్యత్ర విశిష్టతా2ద్య,

బ్రహ్మాజ్ఞ లోకజ్ఞ మిమం మహాన్తం సంపశ్యతా జ్ఞాయత ఏవమానం.

బ్రహ్మజ్ఞానానికి లోకజ్ఞానం తోడైతే ఎట్లా శోభిస్తుందో ఈ స్వామి యందే చూడగలం.



Nadichedevudu   Chapters