Nadichedevudu   Chapters  

 

47. సంస్కృతం జాతీయ భాష

(ఎ.ఎస్‌. రామన్‌ ఇంటర్వ్యూ)

ప్రశ్న: భాషా సమస్యపై స్వామివారి అభిప్రాయాన్ని తెలుసుకో గోరుతున్నాను.

స్వామి: ఆ విషయాన్ని గురించి నా అభిప్రాయం మీకు ఇదివరకే తెలుసుననుకుంటాను. సంస్కృతం, ఆంగ్లం - ఈ రెండే మనదేశానికి ప్రధాన భాషలుగా ఉండాలి. ఆధునిక భారతీయ భాషలు చాలా వరకు నే నెరుగుదును. వాటిలో అట్టి స్థానం ఆక్రమించేవి మరేవీ లేవు.

ప్రశ్న: తమకు తమ మాతృభాషవలె అంత సిసలుగా ఆధునిక భారతీయభాషలు తెలుసు గదా?

స్వామి: అంతగా అని నేను చెప్పలేను. కాని, ఇప్పటి భారతీయ భాష లేవీ సంస్కృతాంగ్ల భాషలకు సరిరావు. సంస్కృతం. మనకు సహజమైన దేశభాష. థాయిలాండ్‌, బర్మా, ఇండోనేషియా, సింహళం మరికొన్ని దేశాలలో కూడా సంస్కృతం సజీవ భాషగా ప్రచారంలో ఉన్నది. సంస్కృతాన్ని మనం జాతీయభాషగా రూపొందించుకునే పక్షంలో ఆగ్నేయాసియా దేశాల సంస్కృతికి భాగస్వాములం కాగల పరిస్థితి ఏర్పడుతుంది. ఆ దేశాల ప్రజలు మనలను తమవారుగా భావిస్తారు. రష్యన్‌ భాషలో కూడా సంస్కృతజన్యమైన పదాలు ఎన్నో ఉన్నవి. గ్రాంథికమైన సంస్కృత భాషను ఆధునిక వ్యవహారయోగ్యమైన భాషగా మలుచుకుని, దానికి ఆ ప్రతిపత్తిని ఇంతకు ముందే కట్టబెట్టి ఉండవలసింది. ఆ సంస్కరణ జరిగే లోపల ఆంగ్లభాషను మన దేశం నుంచి వెలివేయకూడదు. ఆంగ్లభాష ఉత్తమశ్రేణికి చెందినది. విస్తృతమైన ఈ ప్రపంచంతో సంబంధం కలిగి ఉండడానికి ఆంగ్ల మొక్కటే మనకు ఆధారం. అంతర్జాతీయ ప్రయోజనాలకు ఆంగ్లభాష కున్నంత యోగ్యత ఇతర భాషలకు లేదు.

ప్రశ్న: ఆర్ధర్‌ కోయిస్లర్‌ రాసిన "the lotus and the robot" అనే పుస్తకం స్వామివారు చదివారా?

స్వామి: అవును. అది నిషేధించబడక పూర్వం దానిని చదివాను.

ప్రశ్న: ఆ పుస్తకం గురించి తమ అభిప్రాయం? చదవడానికి ఆ పుస్తకం ఆసక్తిదాయకంగా ఉన్నది. కోయస్లర్‌ మిమ్ము సందర్శించిన సందర్భమూ, దాని వర్ణనా రమ్యంగా ఉన్నవి.

స్వామి: ఏసుక్రీస్తు ముఖంపై ఉండే మందహాసం గురించి కోయస్లర్‌ రాస్తాడు. యూరోపియనుల శిల్ప, చిత్రకళలలో అట్టి చిరునవ్వు చూడలేమనీ, హిందూ సన్యాసుల ముఖాలపైనే చూడగలమనీ అతను అంటాడు.

రామన్‌: ఆ మందహాసం విశేషించి తమ వదనం మీద చిందులాడుతుందని ఆయన వ్రాశాడు!

స్వామి: భారతదేశంలోని సత్యాన్వేషకు లంటే ఆయనకు అంత గౌరవం లేదని నాకు తోచింది.

రామన్‌: తమ విషయంలో ఆయన అభిప్రాయం అదికాదు. తమపట్ల సంపూర్ణ గౌరవభావం కనబరిచాడు. అయినా, భారతదేశమన్నా, భారతీయులన్నా, ఈ యూరోపియన్‌ 'ప్రబుద్ధుల' అభిప్రాయాలు అంతగా పరిగణించదగినవి కావు - వాటికి ఒక ప్రమాణం లేదు.

చివరకు, నే నొక ప్రశ్న అడగవచ్చునా? భగవంతుని పైగల భావన విషయమై పాశ్చాత్యులకు, భారతీయులకు గల ముఖ్యమైన భేదమేమిటి?

స్వామి: భగవంతుని పట్లగల భావన విషయంలో అభిప్రాయభేదం ఉండటానికి అవకాశం ఏమున్నది? భగవంతుని చేరుకోడానికి అవలంబించే మార్గాలలో భేదం ఉండవచ్చు.

పాశ్చాత్యులు మతం ద్వారా ఈశ్వరుని చేరడానికి ప్రయత్నిస్తారు. భారతదేశంలో మనవారు తత్త్వశాస్త్రం (వేదాంతం) ద్వారా భగవంతుని పొందడానికి చూస్తారు. మన కర్మకలాపాలు, మన అనుష్ఠానాలు, మన జపతపాలు - ఇవన్నీ, కఠినమైన ఈ మార్గానికి సోపానాలు. సత్యాన్వేషణపై తన మనస్సు లగ్నమైందని సాధకుడు, లేదా భక్తుడు భావించినంతవరకే వాటి ప్రయోజనం.

అంతటితో శ్రీ ఎ.యస్‌. రామన్‌ తన ఇంటర్‌వ్యూ ముగించి, స్వామి ఆశీస్సులను పొంది, చివరకు ఇలా అన్నారు.

''నాలుగు గంటలు నిర్విరామంగా జరిగిన ఈ సంభాషణ మూలాన తమకు కలిగిన ప్రయాసను నేను గుర్తించకపోలేదు.''

స్వామి: మీ ప్రశ్న లన్నిటికి సమాధానాలు వచ్చినవా? నేను మాట్లాడిన తెలుగు పరవాలేదు కదా! అంటూ మౌనం వహించారు.

మృదువైన స్వామి పెదవులపై అనుగ్రహపూర్వకమైన మందహాసం మరొకమారు చిగురించింది. కాంతివంతమైన ఆ విశాలనేత్రాలలో మెరుపు మెరిసింది. కృపారసం వెదజల్లే స్వామిరూపంలో నటరాజును, బుద్ధభగవానుని దర్శించాను.

ప్రధాన పీఠాధిపతులలో ఒకరైన స్వామివారికి ఏ కొరతా లేదు....వజ్రకిరీటాలు, సింహాసనాలు, ఏనుగులు, ఒంటెలు, గుఱ్ఱాలు, పరిచారకులు, సేవకు ఈ సమస్తం సర్వసిద్ధంగా ఉంటవి. అయినా ఆయనకు వాటితో పనిలేదు. భక్తులు తెచ్చియిచ్చిన పూలదండలే స్వామి కిరీటం. వాహనంతో పనిలేని పాదచారమే స్వామి ప్రయాణసాధనం. భక్తుల హృదయమే స్వామి సింహాసనం.

భస్మంతో బంగారం చెయ్యరు ఈ స్వామి. దరిద్రులను క్షణంలో ధనవంతులను చెయ్యరు. మామూలు గుమస్తా మరుసటి దినంలో కార్యదర్శి కాడు. న్యూయార్కు కాటన్‌ మార్కెటు నెంబర్లను స్వామి ప్రసాదించాడు. ఇలాంటి అద్భుతాలను వేటినీ స్వామి ప్రదర్శించరు.

కాని, ఏ మాంత్రికుడూ, ఏ ఇంద్రజాలికుడూ చెయ్యలేని ఒక్క అద్భుతాన్ని స్వామి చేస్తారు. అదేమంటే, స్వామి సమక్షంలో ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుని సాన్నిధ్యంలో ఉన్నామనే భావం మనకు కలగజేస్తారు!



హిందూ వివాహం

అవివాహిత అయిన కన్య ఈశ్వరుణ్ణి భర్తగానూ, వివాహిత అయిన పిమ్మట భర్తనే ఈశ్వరుడుగానూ ఎంచుకోవాలి అన్నారు.

మనమతంలో వివాహం కేవలం ఒడంబడిక (Contract) కాదు. ఆత్మోన్నతికి ఏర్పడిన సంస్కారం.



Nadichedevudu   Chapters